డా. కూరెళ్ళ విఠలాచార్య
పద్మశ్రీ’ అవార్డు గ్రహీత, ప్రముఖ సాహితీవేత్త కూరెళ్ళ విఠలాచార్య గారితో మయూఖ ముఖాముఖి…
అభినవ పోతన, మధురకవి, ఎల్లంకి వేమన్న, నల్లగొండ కాళోజీ, అక్షర సామ్రాట్ బిరుదాంకితులు సుప్రసిద్ధ కవి, రచయిత, సామాజిక వేత్త , భారత ప్రధానమంత్రి మాన్యులు శ్రీ నరేంద్ర మోదీ గారి నోట “మన్ కీ బాత్” రేడియో ప్రోగ్రాంలో ప్రశంసించబడి, జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు పొందిన గ్రంథాలయ వ్యవస్థాపకులు డాక్టర్ కూరెళ్ళ విఠలాచార్య గారి జీవిత విశేషాలను వారి మాటల్లోనే తెలుసుకుందాం. – అరుణ ధూళిపాళ
నమస్కారం సార్. ఈ రోజు మిమ్మల్ని కలుసుకోవడం మా భాగ్యం. మా పాఠకులకు మిమ్మల్ని పరిచయం చేయడం మహదవకాశంగా భావిస్తున్నాను.
1. మీ జననం, పుట్టిన ఊరు, తల్లిదండ్రులు, బాల్యం గురించి చెప్పండి.
జ: అమ్మా! నమస్కారం. నేను జూలై 9, 1938 లో నీర్నేముల గ్రామంలో జన్మించాను. మా అమ్మగారి పేరు కూరెళ్ళ లక్ష్మమ్మ, నాన్నగారు కూరెళ్ళ వేంకటరాజయ్య. అప్పటి కాలంలో అన్నీ బాల్య వివాహాలు కావడం వల్ల మా అమ్మ గారికి 15 ఏళ్ళ వయస్సు వున్నప్పుడు నేను పుట్టాను. దురదృష్టవశాత్తు నేను అయిదు నెలల పసివానిగా ఉన్న సమయంలో మా నాన్నగారు మరణించారు. మా చిన్న పెద్దనాయన గారు నన్ను ఎత్తుకొని మా నాన్న చితిని ముట్టిస్తుంటే జనమంతా ఏడ్చారట. అప్పటినుండీ నాకు కష్టాలు ప్రారంభమయ్యాయి. వెల్లంకిలో మా పెదనాన్నలెవ్వరూ మమ్మల్ని చేరదీయలేదు. మా మాతామహులు మమ్మల్ని నీర్నేములకు తీసుకుపోయినారు. మా అమ్మమ్మకు నేనంటే అమితమైన ప్రాణం. ఒక్క క్షణం నేను కనబడకపోతే ఆమె ప్రాణం విలవిలలాడేది. దానికి ఒక ఉదాహరణ చెబుతాను. మా అమ్మగారితో పాటు నేను బంధువుల ఇంటికి ఎప్పుడైనా వెళ్లాల్సి వస్తే నా పాదాలను జాజులో ముంచి, గోడకు ముద్రించి వాటిని చూస్తూ నేను తిరిగి వచ్చేవరకు గడిపేది. అంతటి ప్రేమమూర్తి ఆమె. ఆ సందర్భాన్ని తలచుకుంటే ఇప్పటికీ కన్నీళ్లు వస్తాయి నాకు ( కన్నీటి పర్యంతమవుతూ). అందుకే వీళ్ళ ఋణం తీర్చుకోవడానికి మా అమ్మమ్మ పేర , తాతయ్య గారి పేర ఏటా బేతోజు లక్ష్మీనారాయణ, ఈశ్వరమ్మ పురస్కారాన్ని ఇస్తున్నాను. 7వ తరగతిలో తెలుగు భాషలో ప్రథమశ్రేణి వచ్చినవారికి మాత్రం వాళ్ళు ఫెయిల్ అయినాసరే ఈ పురస్కారాన్ని ఇస్తున్నాను.
2. బాల్యమంతా ఇంత కష్టాన్ని ఎదుర్కొన్న మీ విద్యాభ్యాసం ఎలా గడిచింది?
జ: నేను పుట్టింది 1938లో అయినా విద్యాభ్యాసం మటుకు 1945 లో జరిగింది. ఆ కాలంలో ఊళ్ళల్లో ముస్లింలు చదువు చెప్పేవారు. మసూల్ దార్ సాహెబ్ నీర్నేములలో, వెల్లంకిలో షేక్ అహ్మద్, సిరిపురంలో గాలిబ్ సాబ్, రామన్నపేటలో గులాం రసూల్ అని టీచర్లు ఉండేవాళ్ళు. వాళ్లకు భాష రాకపోయినా ఏదో నేర్చుకొని చెప్పేవారు. అప్పుడు పాఠశాలలు లేవు. విచిత్రం ఏమిటంటే మసూల్ దార్ సాహెబ్ నాకు పీర్ల కొట్టంలో అక్షరాభ్యాసం చేయించారు. మా అమ్మతో పాటు తిరగాల్సి రావడం వలన నాది వానాకాలం చదువయ్యింది. ఆ పరంపరలో నీర్నేముల, ముని పంపుల, వెలివర్తి, వెల్లంకి ఇలా రకరకాల ఊళ్ళల్లో నా చదువు సాగింది. ఆ తర్వాత 1950 నుండి రామన్నపేటలో నాల్గవ తరగతి నుండి ఒక క్రమపద్ధతిలో నా చదువు కొనసాగింది. అక్కడ ప్రాథమిక పాఠశాలలో కోటిచింతల పురుషోత్తమం గారని పాఠశాల హెడ్ మాస్టర్ వయసు ఎక్కువవుతుందని రికార్డులలో జననం 1940 గా రాయించారు. నీర్నేముల నుండి సద్దిగట్టుకొని రామన్నపేటకు పోయి చదువుకునేది. ఆ కాలంలో కుల వ్యవస్థ కూడా గట్టిగా ఉండేది. అంగీ తగిలినా, సద్దులున్న గోడ తగిలినా సద్దులు పారేసేవాళ్ళు. అట్లా ఏడవతరగతి వరకు అక్కడ చదివాను. ఆ తర్వాత నాకు చదువుకోవడానికి అవకాశాలు తక్కువ ఉండడంవల్ల భువనగిరిలో విశ్వకర్మ హాస్టల్ నిర్వాహకుల పిలుపు మేరకు మా మేనమామ నన్ను అక్కడ చేర్పించాడు. నిర్వాహకులు ఒక బజారు చూపించి అక్కడ విశ్వకర్మల ఇళ్లల్లో భిక్ష పైసలుగానీ, బియ్యం గానీ తెమ్మని ఆదేశించారు. అదే ప్రకారం వెళ్లి తెచ్చి రూములో వండుకొని తినేవాళ్ళం. చదువు కోసం వారేది చెబితే అది చేశాము. 1954 జూన్ నుండి 1957 వరకు 8,9,10 తరగతులు అక్కడే చదువుకున్నాను. ఆదిరాజు వీరభద్రరావు గారి అల్లుడు ఆంజనేయ శాస్త్రి గారు నాకు గురువు. ఆయన పాఠశాలకు రాని రోజు నన్ను పాఠం చెప్పుమనేవారు. అందువల్ల చిన్నతనం నుండే నాకు తెలుగు భాష పట్ల కొంత పట్టు ఏర్పడింది. ఆయన నేను బాగా చదువుతానని హైద్రాబాదుకు తీసుకువెళ్లి వారాల భోజనం పెట్టిస్తాను చదువుకోమన్నారు. కానీ ఇక ఇంటింటికి తిరిగి భోజనం సంపాదించడం నావల్ల కాదని పదవతరగతి పూర్తవగానే ఏదైనా ఉద్యోగం చేయాలనుకున్నాను.
3. మరి అప్పుడే ఉద్యోగం సంపాదించగలిగారా? మీ ఉద్యోగ ప్రస్థానం ఎలా కొనసాగింది?
జ. 1950 ఆ ప్రాంతంలో పదవతరగతి హాల్ టికెట్ చూపిస్తే ఉద్యోగం ఇచ్చేవారు. అలా రామన్నపేట తహశీల్ ఆఫీసులో తహశీల్దార్ మధుసూదన్ రెడ్డి ఉండేవాడు. ఆయన “కాపీయిస్ట్ పోస్ట్ ఉంది.చేస్తావా?” అని అడిగారు. ఏదైనా చేస్తానన్నాను. ఇంగ్లీషు రాయొచ్చా అని అడిగారు. రాస్తానన్నాను. 20 రూపాయలకు రెవెన్యూలో కాపీయిస్ట్ ఉద్యోగంలో చేరాను. అదే సమయంలో కో ఆపరేటివ్ బ్యాంకులో సూపర్ వైజర్ గా వచ్చింది. దాంట్లో చేరాను. భువనగిరి కోర్టులో మేజిస్ట్రేట్ దగ్గర రైటర్ గా చేశాను. అప్పుడే సేల్స్ టాక్స్ లో ఉద్యోగం దొరికింది. ఒక దాని తర్వాత ఒకటి ఒక్క నిముషం కూడా ఖాళీ లేకుండా చేశాను. డబ్బులు వచ్చాయి. కానీ లంచాలు తీసుకోవడం, తినడం, తాగడం ఇవన్నీ నాకు నచ్చలేదు. అందుకే ఉద్యోగం విడిచిపెట్టి టీచరు ట్రైనింగ్ చేసి, 1959లో టీచరునయ్యాను. ఉపాధ్యాయ శిక్షణా కాలం నాలో కవితా వ్యాసంగానికి బలమైన పునాది వేసింది. నేను, మా అమ్మ ఎన్నో బాధలు పడి రెండుగదుల పెంకుటిల్లు వెల్లంకిలో కట్టుకున్నాం. ఆ ఒత్తిడిలో జిల్లా విద్యాధికారి కార్యాలయానికి ఆలస్యంగా వెళ్ళాను. అప్పటి నల్లగొండ జిల్లా విద్యాధికారి రామదాసుగారు దయార్ద్ర హృదయులు. “మహానుభావా! ఇప్పుడు వచ్చావా” అని ప్రేమతో మందలించి ఉద్యోగం ఇచ్చారు. ఆగస్టు 29 1959 నాడు రామన్నపేట తాలుకాలో మునిపంపుల గ్రామంలో సహాయోపాధ్యాయునిగా జాయినయ్యాను. అప్పటినుండి మొదలుకొని నాకు ‘గ్లకోమా’ వ్యాధి వల్ల కంటిచూపు చాలావరకు కోల్పోవడంతో నా ఉద్యోగ జీవితాన్ని 1993లో జూనియర్ లెక్చరర్ గా విరమించవలసి వచ్చింది. చేసినంతకాలం విద్యాలయాల, విద్యార్థుల అభివృద్ధికి శాయా శక్తులా కృషి చేశానన్న తృప్తి ఉంది.
4. ఇటువంటి పరిస్థితుల్లో ఎంఫిల్ , పి హెచ్ డిలు ఎలా పూర్తి చేయగలిగారు?
జ: నేను పదవతరగతి వరకే క్లాస్ రూములో కూర్చొని చదవడం తప్ప ఎక్కడా తరగతులు వినలేదు. నాకు స్ఫూర్తి బి. ఎన్. శాస్త్రి గారు. ఆయన ఎమ్. ఏ చదువుతుంటే ఎన్ని కష్టాలు పడ్డాడో చూసినవాణ్ణి. నేనూ రవ్వా శ్రీహరి బాల్య స్నేహితులం. నాకంటే చిన్నవాడు. ఆయనకు చిన్నతనంలో తల్లి చనిపోయింది. ఇద్దరమూ ‘మునిపంపు’ లో పెరిగిన వాళ్ళం. ఇద్దరమూ కలిసి ఆడుకున్నాం. ఉద్యోగం చేస్తూనే నేను ఎమ్ ఏ దాకా ప్రయివేటుగా చదువుకున్నాను. పి హెచ్ డి చేయాలనుకుంటున్నట్లు రవ్వా శ్రీహరితో అన్నాను. ఎమ్ ఏ లో కూడా సెకండ్ క్లాస్ లో పాసయ్యాను. పాటిబండ మాధవశర్మ గారు నన్ను బాగా అభిమానించేవారు. సీటు గురించి రామరాజు గారిని అడగాలంటే అందరికీ భయం. ఆయన చాలా సహృదయులు. కాకపోతే కొంచెం కఠినంగా ఉంటారు. అందుకే ఆయన దగ్గరికి వెళ్లాలంటే భయం. రవ్వా శ్రీహరి గారిని అడిగితే “అమ్మో! నేను వెళ్ళను” అన్నారు (నవ్వుతూ). నేనే అడుగుదామని వెళ్ళాను. అప్పటికి ఒక హైస్కూలు హెడ్ మాష్టరును నేను. పదిన్నరకు ఇంటర్వ్యూ ఉంటే ఎనిమిది గంటలకే వెళ్ళి నమస్కరించి నన్ను నేను పరిచయం చేసుకున్నాను. “ఎందుకొచ్చావ్? నీ నమస్కారాల సంగతి నాకు తెలుసు. ఇవాళ ఎంఫిల్ ఇంటర్వ్యూలు ఉన్నాయి కదా! అప్లై చేసి ఉంటావు. ఆ సీటు కొరకే వచ్చావు . అట్లా రావచ్చునా? పోనీ ఓ పని చెయ్యి. మొత్తం 12 సీట్లు ఉన్నాయి. నీకిస్తాను పంచిపెట్టుకో ” అని కోప్పడ్డారు. ఏమీ మాట్లాడకుండా తిరిగి వస్తుంటే “మాస్టారూ ఇలా రండి” అన్నారు. నా సంస్కారం ఆయన మీద గొప్ప ప్రభావాన్ని చూపించింది. “నువ్వు హైస్కూలు హెడ్ మాస్టర్ వి. వయసులో పెద్ద. రీసెర్చ్ చేసి ఏం సాధిస్తావు?” అన్నారు. చేద్దామనే కోరిక ఉంది సార్! మీరు అనుగ్రహిస్తే చేస్తాను అన్నాను. ‘ఏమైనా రాశావా?’ అప్పటికే దాదాపు రకరకాల ప్రక్రియల మీద నేను వ్యాసాలు రాశాను. సూట్ కేస్ నిండా తీసుకువెళ్ళాను కూడా. “వంద దాకా రాశాను సార్! చూస్తారా?” అన్నాను. వద్దన్నారు. ముందు ఎంత కోప్పడ్డారో అంత అనుగ్రహం చూపారు. ఆయన నాకు చాలా ఇష్టమైన గురువు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 1977లో మొట్టమొదటగా ఏర్పడ్డ ఎంఫిల్ పరిశోధకుల్లో నేను ఒకడిని కావడం గర్వకారణం. రవ్వా శ్రీహరి ప్రోత్సాహం, పూజ్య గురువర్యులు బిరుదురాజు రామరాజు గారి బలమైన ఆశీస్సులు నన్ను పరిశోధనారంగంలో ప్రవేశించేటట్టు చేశాయి.
5. ఎంఫిల్ అంశంగా తీసుకున్న “తెలుగులో గొలుసు కట్టు నవలలు” నవలా ప్రక్రియను, మీ అనుభవాలను తెలపండి.
జ : అప్పటి తెలుగు శాఖా అధ్యక్షులు ఆచార్య బిరుదురాజు రామరాజు గారు అప్పటివరకు విమర్శకులు ఎవరూ స్పృశించని వినూత్నమైన, విచిత్రమైన నా పరిశోధనాంశం “తెలుగులో గొలుసుకట్టు నవలలు” అనే దాన్ని పరిశీలించి ఇంటర్వ్యూకి పిలిచారు. ఇంటర్వ్యూలో రామరాజుగారు, నారాయణరెడ్డి గారు, నాయని కృష్ణకుమారి గారు, కులశేఖర్ రావు గారు, జి.వి. సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. “అందులో సాహిత్యమే లేదు. అదెలా చేస్తావన్నారు?” అన్నారు. అందుకే చేస్తానన్నాను ( నవ్వుతూ). వారి ప్రశ్నలకు తగినరీతిలో సమాధానాలు చెప్పి వారిని సంతృప్తి పరిచాను. మామూలుగా అయితే ఒక పుస్తకాన్ని ఒకరు రాస్తారు. గొలుసు కట్టు నవల అంటే ఇందులో అనేకమంది రాస్తారు. ఒక రచయిత కథ ప్రారంభం చేస్తాడు. మరొకరు దాన్ని కొనసాగిస్తారు. కథలోని కథా నాయకుడిని ఒకరు సృష్టిస్తే, మరొకరు మిగిలిన కథను రాస్తారు. కథను అనుకూలంగా మార్చడం, ప్రతికూలంగా మార్చడం ఎవరి వారి ఇష్టం. సృష్టించిన కథానాయకుని గొప్పగా చూపించొచ్చు. లేదా చంపవచ్చు. అట్లా ఆనాడు 24 మంది రచయితలు, రచయిత్రులు రాసిన “ముద్దు దిద్దిన కాపురం” నవలను వారికి విడమరిచి చెప్పాను. ‘హాస్యప్రభ’ పత్రికలో సీరియల్ గా వస్తుండేది. రాంబాబు అనే ఆయన వేసేవాడు. మొత్తానికి ఆ టాపిక్ లో చేయడానికి నాకు అనుమతి లభించింది. కానీ దాంట్లో ఏమీ లేదని గైడుగా ఉండడానికి ఎవరూ ముందుకు రాలేదు. మహానుభావుడు ఇరివెంటి కృష్ణమూర్తి గారు ఒప్పుకున్నారు. ” నేను గురువును కాదు నీవు శిష్యుడవు కావు ఇద్దరం మిత్రులం” అనేవారు. ఇద్దరం చేతులు పట్టుకొని ఫుట్ పాత్ మీద నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. పాతపుస్తకాల్లో ఏమైనా దొరుకుతుందేమోనని వెతికేవాళ్ళం. మద్రాసు, తిరుపతి, విజయవాడ, భీమవరం ఇలా ఎన్నో ప్రాంతాలు తిరిగాను. “గొలుసుకట్టు నవల” రచయితలలో పాలగుమ్మి పద్మరాజు, శ్రీ శ్రీ , ఆనందారామం, తురగా జానకీరాణి, నాయని కృష్ణకుమారి, రావూరి భరద్వాజ, కొడవటిగంటి, ఆరుద్ర , పురాణం సుబ్రహ్మణ్య శర్మ , మధురాంతకం రాజారాం, రంగనాయకమ్మ , మాదిరెడ్డి సులోచన లాంటి వాళ్ళను ఇంటర్వ్యూ చేశాను. రంగనాయకమ్మ గారు, ఆరుద్ర గారు లేఖాముఖంగా పంపించారు. వీళ్ళందరి సమాధానాలనే ప్రధానంగా దృష్టిలో పెట్టుకొని ఆ అనుభవాలతో విలక్షణమైన నా పరిశోధనలో నవలా వ్యాసంగాన్ని పూర్తిచేశాను. 250 పేజీల సాహిత్యాన్ని సృష్టించాను. ఇప్పుడు 40 మంది, 60 మంది రాసినవి కూడా వస్తున్నాయి. 1980 లో నాకు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి నాకు ఎంఫిల్ పట్టా లభించింది. తెలుగు పరిశోధనారంగంలో నా సిద్ధాంతగ్రంథం ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఇటీవలే రవీంద్ర భారతిలో జరిగిన ‘గొలుసు కట్టు నవల’ ఆవిష్కారానికి నన్ను పిలిచి సన్మానం చేశారు.
6. పి హెచ్ డి అంశంగా “తెలుగు నవలల్లో స్వాతంత్ర్యోద్యమ చిత్రణం” మీద తీసుకున్న నవలలేవి?
జ: ఎంఫిల్ పూర్తయిన వెంటనే పిహెచ్ డి సీటు సులభంగానే దొరికింది. రామరాజు గారికి, నారాయణ రెడ్డి గారికి చేస్తాడన్న నమ్మకమూ కుదిరింది. నాకు ఎంఫిల్ పర్యవేక్షకులైన ఇరివెంటి కృష్ణమూర్తి గారు వెంటనే పి హెచ్ డి చేయమని సలహా ఇస్తూ “తెలుగు నవలల్లో స్వాతంత్ర్యోద్యమ చిత్రణం” అనే పరిశోధనాంశాన్ని సూచించారు. దాన్ని రామరాజు గారు 1947 వరకు అని సవరించారు. చారిత్రక నవలా చక్రవర్తి డా. ముదిగొండ శివప్రసాద్ పర్యవేక్షణలో నా పరిశోధన సాగింది. దీనికోసం క్షేత్ర పర్యటన చాలానే చేశాను. 1947కు పూర్వం వచ్చిన నవలలు, నవలలు కావు కావ్యాలు. ఉన్నవ లక్ష్మీనారాయణ గారి “మాలపల్లి” వేలూరి శివరామశాస్త్రి గారి ‘ఓబయ్య’, విశ్వనాథ వారి ‘వేయి పడగలు’, అడవి బాపిరాజుగారి ‘నారాయణరావు’, ‘కోనంగి’, వాశిష్ఠ గణపతి ముని గారి ‘పూర్ణ’, తల్లాప్రగడ సూర్యనారాయణ గారి ‘హేలావతి’, కేతవరపు వేంకటశాస్త్రి గారి ‘లక్ష్మీ ప్రసాదం’, వేంకట పార్వతీశ్వర కవుల ‘మాతృ మందిరం’, బుచ్చిబాబు గారి ‘చివరకు మిగిలేది’.. ఈ పది నవలలు తీసుకున్నాను. 1947 వరకు ఈ నవలలు ఎంతవరకు ఉపయోగపడ్డాయి? ఈ సాహిత్యం ఉద్యమానికి, ఉద్యమం సాహిత్యానికి ఎట్లా ఉపయోగపడింది ఇందులో వివరించాను. ఈ పరిశోధన కారణంగా జాతీయోద్యమంలో పాల్గొన్న మహనీయులను ఎంతోమందిని దర్శించుకునే భాగ్యం కలిగింది. దీనికి “Best Informative Thesis” అని పేరు వచ్చింది. చాలా కష్టపడి వడబోసి తయారుచేసిన సిద్ధాంతగ్రంథం. సరి చేయడానికి ఏమీ లేకుండె. శివప్రసాద్ నాకంటే చిన్నవాడు. అందుకే “మొత్తం పూర్తయ్యాక సంతకం కోసమే నా దగ్గరకు రండి” అన్నాడు. ఈ సందర్భంగా నీలం సంజీవరెడ్డి గారిని, రావి నారాయణరెడ్డి గారిని, ఎన్. జి రంగాగారిని, గడియారం రామకృష్ణ శర్మ లాంటి ఎందరినో ఇంటర్వ్యూ చేసి సమాచారం సేకరించాను. నిజానికి చెప్పాలంటే ఆ కాలంలో వచ్చిన నవలలు చాలా తక్కువే కానీ నవలా సాహిత్యానికి అది స్వర్ణయుగం. నవలాకారులందరూ మహనీయులు. స్వాతంత్ర్యోద్యమ నుండి ప్రభావితులైనవారు. వారి హృదయం నుండి జాలువారిన ఈ రచనలు జాతిని ఉత్తేజపరిచాయి. ముందుకు నడిపించాయి.
7. సంస్కృత భాష పట్ల మీకు ఆసక్తిని కలిగించినదెవరు?
జ: మొదటి నుండీ నాకు సంస్కృతం నేర్చుకోవాలని ఉండేది. అయినా సరియైన పరిస్థితులు, వాతావరణం లేక సంస్కృతంలో అనుకున్నంత ప్రావీణ్యం సంపాదించుకోలేకపోయాను. అప్పుడు ఎనిమిదవ తరగతిలో సంస్కృతం ఆప్షనల్ గా ఉండేది. భువనగిరి హైస్కూలులో, సూర్యాపేటలో మొట్టమొదటగా సంస్కృతాన్ని ప్రవేశపెట్టారు. దానికోసమే నేను భువనగిరి హైస్కూలులో చేరాను. కోవెల సంపత్కుమారాచార్య గారు ఫస్ట్ అపాయింట్మెంట్ అక్కడ. మొదటి స్టూడెంటును నేనే. అప్పలాచార్యులు గారు, సంపత్కుమారాచార్య గారు సంస్కృత గురువులు నాకు. నా విషయంలో సంస్కృతం వచ్చు అని చెప్పడం ఎంత అబద్ధమో, రాదని చెప్పడం కూడా అంతే అబద్ధం ( నవ్వుతూ ). ఆ గురువులిద్దరి మూలంగా సంస్కృతం మీద పట్టు ఏర్పడింది.
8. మీ పద్య పఠన పద్ధతికి ఉత్పల సత్యనారాయణాచారి గారి ప్రభావం ఉందంటారు. అది ఎలాగో వివరిస్తారా?
జ : 1958లో నేను మేడ్చల్ ట్రైనింగ్ లో ఉన్నప్పుడు ఉత్పల సత్యనారాయణాచార్యగారు అతిథిగా వచ్చారు. బహుభాషా కవిసమ్మేళనం జరిగింది. తెలుగు భాషకు సంబంధించి ఆయన వచ్చారు. నేను ఆ సభలో ఆయన మీద ఆశువుగా పద్యం ఆయానలాగే చదివాను. ఆయన ఆశ్చర్యపోయారు. అప్పటినుండీ “మరో ఉత్పల” అనే పేరు వచ్చింది. ఉత్పలగారు చనిపోయే చివరి దశలో మంచం మీద ఉన్నప్పుడు నేనొక పద్యం కార్డు మీద రాసి పంపించాను. ” కమ్మని తేట తెల్గు నుడికారము కల్గిన పద్యమొక్కటిన్, ఇమ్ముగ కోరుకున్న మనకిమ్మహనీయుడొసంగు గొప్ప భాగ్యమ్మున గల్గె ఉత్పల మహాకవి తెల్గునాడులో తమ్ములు రండి రండి కవితామూర్తిని కొలువగా వలెన్” అని పంపాను. ఆయన సంతోషపడి నా మీద మూడు పద్యాలు రాసి పంపించారు.
9. కూరెళ్ళ గ్రంథాలయ స్థాపనకు దోహదం చేసిన పరిస్థితులేవి?
జ: గ్రంథాలయం పెట్టాలనుకోవడంలో నా కష్టాలే నాకు స్ఫూర్తి. నేను చదువుకునేటప్పుడు పుస్తకాలు కొని చదువుకునేంత స్తోమత నాకు లేదు. పుస్తకాలు ఉన్నవాళ్ళ దగ్గర వారు రాత్రి చదువుకోవడం పూర్తయిన తర్వాత పుస్తకాలు అడిగి తీసుకొని రాత్రంతా చదువుకొని ఉదయం నాలుగు గంటలకే వాళ్లకు అప్పగించే ఒప్పందంతో తెచ్చుకునేవాడిని. ఇలాంటి నా కష్టాలు తరువాతి యువతరానికి రావొద్దని లైబ్రరీ పెట్టాను. అది చాలలేదు. 1954 లో వెల్లంకిలో శంభు లింగేశ్వర గ్రంథాలయం అని చిన్న లైబ్రరీ పెట్టాను. నాకు పెద్దలు ఎవరూ సహకరించలేదు. 1962 లో నేను మాఊరికి ప్రధానోపాధ్యాయునిగా వచ్చాను. మా తల్లిదండ్రుల పేరుతో లక్ష్మీ వెంకట రాజయ్య గ్రంథాలయం పెట్టాను. ప్రముఖ నాటక రచయిత ఆకెళ్ల నర్సింహమూర్తి గారు ప్రారంభించారు. 1993లో తెలుగు ఉపన్యాసకునిగా స్వచ్ఛంద పదవీ విరమణ చేశాను. గ్రంథాలయ స్థాపన నా మనసులోంచి పోలేదు. ఎలాగైనా ఈ మారు మూలలో మహా గ్రంథాలయం పెట్టాలని గట్టి నిర్ణయం చేసుకున్నాను. అందుకే నా ఇంటినే దీనికోసం ఇచ్చాను. పెద్దలు దీనికి “కూరెళ్ళ గ్రంథాలయం” అని నామకరణం చేశారు. నా సొంత ఐదువేల పుస్తకాలతో ఫిబ్రవరి 13, 2014 లో ప్రారంభమైంది. ఇప్పుడు సుమారు రెండు లక్షల గ్రంథాలతో పెద్ద లైబ్రరీ అయింది. మా పిల్లలు, లైబ్రేరియన్ సహకరిస్తున్నారు. శిష్యులు, స్నేహితులు చాలామంది ఉండడం వల్ల సాహితీప్రియులు ఎంతోమంది పుస్తకాలు తెచ్చి ఇచ్చారు. ద్వానా శాస్త్రి గారు తన లైబ్రరీలోని మొత్తం పుస్తకాలను ఇచ్చారు. కోడూరు పుల్లారెడ్డి గారు కూడా వేల పుస్తకాలు ఇచ్చారు. భగవంతుని అనుగ్రహం వల్ల ఎంతోమంది ముందుకు వచ్చారు. తెలియని వాళ్ళు కూడా ఈ అడ్రెస్ తెలుసుకొని మరీ వచ్చి వందలాది పుస్తకాలు ఇవ్వడం నా అదృష్టం. వారందరి సహకారం వల్లనే ఎంతో గొప్ప సాహిత్యాన్ని ఇందులో సమకూర్చగలిగాను. రామాయణ, భారత, భాగవతాలు, పురాణాలు, వేదాలు, పరిశోధన, చరిత్ర, పద్య గద్య ఇలా అన్ని విభాగాల్లో ప్రక్రియల్లో పుస్తకాలున్నాయి. ఎవరికి ఏది కావాలన్నా దొరుకుతుంది. తలచుకుంటే ఒక్కోసారి నాకే ఆశ్చర్యంగా ఉంటుంది ఇన్ని చేయగలిగానా అని.
10. మీ గ్రంథాలయం గురించి 2021 వ సంవత్సరంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చేత రేడియో కార్యక్రమం “మన్ కీ బాత్” లో ప్రశంసింపబడడం ఎలాంటి అనుభూతినిచ్చింది?
జ : అది నా జీవితానికి గొప్ప వరం. పల్లెటూళ్ళని వదిలి చాలామంది నగరానికి వెళ్లి పోతున్నారు. అందరూ మళ్లీ పల్లెబాట పట్టాలని గ్రంథాలయం నెలకొల్పాను. నా కోరిక తీరి ఎంతోమంది సద్దులు కట్టుకొని మరీ వచ్చి చూసి వెళ్తున్నారు. అసలు నా విషయం ప్రధానమంత్రి వరకు ఎలా వెళ్లిందో ఇప్పటికీ ఆశ్చర్యమే. ఆయన “మన్ కీ బాత్” లో నన్ను , నా లైబ్రరీని ప్రశంసించారు.
ఈ ప్రభావం వల్ల అస్సామ్ విశ్వవిద్యాలయం నుండి, కర్ణాటక రాష్ట్రం నుండి సందర్శకులు వచ్చారు. అమెరికా లోని ‘తానా’ వారు స్వరమీడియా వారు నాతో ఇంటర్వ్యూలు జరిపారు. అస్సాం యూనివర్శిటీ ప్రొఫెసర్ నారాయణ మూర్తి గారు ఎన్నో ఇంగ్లీషు పుస్తకాలు పంపించారు. నిన్న కూడా హయత్ నగర్ నుండి సర్వేపల్లి సుందరం అని ఒక వ్యక్తి వచ్చి ఆయన రాసిన పుస్తకాలు ఇచ్చి వెళ్లారు. అలా ఎంతోమంది సహకరిస్తున్నారు. నా శ్రమకు ప్రధానిగారు ఊపిరి పోశారు. మోదీ గారికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువే. ఆయన వల్ల నాకు జాతీయ అంతర్జాతీయ ఖ్యాతి లభించింది. రాష్ట్రపతి నుండి పోయిన ఏప్రిల్ 2023లో ఆహ్వానం వచ్చింది. నాలుగు రోజులు అక్కడే ఉన్నాను. అక్కడ వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్ కర్ గారి చేత సన్మానం అందుకున్నాను. మాకు మూడు రోజులు వసతి కల్పించి అక్కడి విశేషమైన ప్రాంతాలను చూపించారు. పెద్ద సభ కూడా జరిగింది. ఈ నెలలో కూడా గణతంత్ర దినోత్సవాలకు రమ్మని ఆహ్వానం వచ్చింది. ఆరోగ్యం బాగా లేకపోవడం, అధికమైన చలి కారణంగా రాలేనని చెప్పాను.
11. దేశ వ్యాప్తంగా దిగ్భ్రాంతికి గురి చేసిన జనగామ రైలు ప్రమాదం గురించి మీరు రాసిన “అధికవృష్టి” పద్యాలను గూర్చి తెలపండి
జ : ఇది 1954లో జరిగింది. అప్పుడు కురిసిన అధికమైన వర్షాలకు “వసంతవాగు” పొంగుతుండడం వల్ల రైలు పట్టాలు తప్పింది. అప్పుడు నేను ఎనిమిదవ తరగతిలో ఉన్నాను. ఆ దుర్ఘటనకు కదిలిపోయి నేను రాసుకున్న పద్యాలే మొట్టమొదటగా అచ్చులో చూసుకున్న పద్యాలు.
ఉరుములు మెరుపులు నొకసారె ఉద్భవించె
గాలి సుడిగాలి మేఘముల్ గప్పుకొనియె
సరవి ధారగ వర్షంబు కురియుచుండె
అల్ల తెలగాణ రఘునాథ పల్లియందు!
అధిక వర్షంబుచే నంత నయ్యె గాదె
మృత్యుదేవత ఆనాడు నృత్యమాడె
ఇట్టివెప్పుడు రాకుండ నెల్ల వేళ
మనల వేలుపు గాపాడి మనుచు గాత!
ఇలా రాశాను. ఆ పద్యాలు చూసి మా మాస్టార్లు ఆశ్చర్యపోయారు. కోవెల సంపత్కుమారాచార్య గారు “నీకు పద్యం మీద మంచి పట్టు ఉంది” అని ప్రశంసించారు. స్కూల్ వార్షిక సంచిక ‘ఉదయ’ లో కూడా వేశారు. ఆనాటి నుండి నా మిత్రులు తమాషాగా ‘పోతన’ అని పిలిచేవారు.
12. “వెల్లంకి వెలుగు” పేర రాసిన ఎల్లంకి గ్రామ వైభవం ఎటువంటిది?
జ: “వెల్లంకి వెలుగు” నా పల్లెతో నాకున్న అనుబంధాన్ని, గురించి రాసుకున్నది. చాలా చిన్న పుస్తకం. ఆ ఊరుకు ఆ పేరు ఎట్లా వచ్చింది మొదలుకొని నాకు తెలిసినంతవరకు ఆ గ్రామాన్ని గురించి ఆనోటా ఈ నోటా విన్న విషయాలు రాసుకున్నాను. నేను పుట్టింది పెరిగింది పల్లెటూరే. ఇప్పటికీ పల్లెటూళ్ళోనే ఉన్నాను. నా కార్యక్రమాలన్నిటికీ ప్రధాన భూమిక పల్లెటూరు. అందుకే “విఠ్ఠలేశ్వర శతకం” లో పల్లెను దేవతగా భావిస్తూ..
పల్లియలోనె పుట్టితిని పల్లియయే నను పెంచె
ఇల్లును వాకిలిన్ కలిమినిచ్చి బతుక్కు మెరుంగు పెట్టె
పల్లియె ‘అమ్మ’ ఆవనుచు’పల్కులు పల్కగ నేరిపించె నా
పల్లియె నాకు దైవతము ప్రాణము ఓ ప్రభు విఠ్ఠలేశ్వరా!
13. వేమన శతకంతో సమానమని పలువురి ప్రశంసలు అందుకున్న మీ “విఠ్ఠలేశ్వర శతకము” గూర్చి చెప్పండి.
జ : 1991 ఆగస్టు 1న మా ఇంటి గేదెకు వైద్యం చేస్తుండగా అది ఎగిరి నా మీద పడడం వల్ల జరిగిన ప్రమాదంలో నా ఎడమ కాలు విరిగింది. అంతకుముందే నాకు నాలుగు ఆపరేషన్లు జరిగాయి. నేత్ర వ్యాధి ‘గ్లకోమా’ వల్ల కంటి చూపు చాలావరకు తగ్గిపోయింది. ఈ దుర్భర పరిస్థితుల్లో బాధతో అలవోకగా నా గుండె లోంచి ఒక పద్యం వచ్చింది.
“పుట్టుకతోనె కొందరికి పుట్టెడు దుఃఖము వెంటవచ్చు, ఎ
ప్పట్టున నైన కొందరికి పట్టినదెల్ల పసిండియే యగున్
తిట్టు వరంబు కొందరికి దీవెన కొందరి పట్ల తిట్టగున్
ఎట్టెట్టు స్వామి నీ నటన ఎంత విచిత్రము విఠ్ఠలేశ్వరా!”
అలా వరుసగా పద్యాలు రాసుకుంటూ పోయాను. నన్ను పలకరించడానికి వచ్చిన పెద్దలకు, చిన్నలకు, రసజ్ఞులకు వినిపించేవాణ్ణి. అందరూ అభినందించారు. మకుటం బాగుందన్నారు. మా అమ్మగారు నాకు మా నాన్నగారు విఠలేశ్వరుని భక్తులని అందుకే ఆ స్వామి పేరు మీదనే నాకు పేరు పెట్టారని చెప్పారు. అందుకే మా నాన్నగారి ఆకాంక్ష వల్లే ఇది ఉద్భవించిందేమో. నా ఆత్మ వేదనే అయినా ఆ విఠలేశ్వరుని అనుగ్రహంతోనే మంచం మీద ఉన్న మూడు నెలల్లో శతకం పూర్తి చేయగలిగాను. వివిధ సేవా కార్యక్రమాల కారణంగా పుస్తకరూపం చేయాలన్న ఆలోచన రాలేదు. ప్రింట్ కాకపోయినా జనుల నోళ్ళల్లో నానుతుండేవి. నాకు అరవై ఏళ్లు నిండిన తర్వాత 2000 సంవత్సరంలో ఇది రామరాజు గారి చేతుల మీదుగా ఆవిష్కరించబడింది. శతక సాహిత్యంలో ఒక ప్రత్యేకతను సాధించుకుంది. తెలంగాణ సాహిత్య అకాడెమీ వారు దీనిలోని కొన్ని పద్యాలను హిందీ, ఇంగ్లీషు లోనికి అనువాదం చేయించారు. ఇందులో సమాజంలోని రకరకాల విషయాల పట్ల కలిగిన వేదనతో రాసిన పద్యాలున్నాయి. దీని రెండవ ముద్రణ గవర్నర్ గారిచే ఆవిష్కృతం కానుంది.
14. “శిల్పాచార్యులు” కావ్యం రాయడానికి ప్రేరణ ఎవరు?
జ : నా ఎనిమిదవ ఏట నుండి భువనగిరిలో నా చదువు కొనసాగింది. అక్కడే నా కవిత్వం మొగ్గ తొడిగింది. ఎంతోమంది సహృదయులు మిత్రులయ్యారు. ఇక్కడ నేనొక ఉత్తమ విద్యార్థిగా, ఉత్తమ కవిగా ప్రధానాచార్యుల, ఆచార్యుల పండితుల మన్ననలు పొందాను. అందుకే భువనగిరి కోటను నా హృదయంలో ముద్రించుకున్నాను. ఆ ఋణం కొంతైనా తీర్చుకుందామన్న ఆశయంతో ఈ పట్టణానికి, పట్టణ పరిసర ప్రాంతాలకు సంబంధించిన ప్రఖ్యాత త్యాగమూర్తులను కొందరిని, ప్రసిద్ధ స్థలాలను కొన్నింటిని తలచుకుంటూ ఆ స్మృతులతో ఈ కావ్యం ద్వారా వారిని మనసారా స్మరించుకుంటున్నాను.
ఆరుట్ల దంపతులను ఉద్దేశించి…
“నాడు నేడైన ఏనాడు నైన/ కొలనుపాకనంగ మదిలొ గుర్తుకొచ్చె….” బి. ఎన్.శాస్త్రి గారిని ఉద్దేశించి..
“ఊళ్ళన్ని వడబోసి రాళ్ళ రాత చదివి/ వేల యేండ్ల చరిత వెలికి తీసె….”
ఇలా స్మరించుకుంటూ పద్యాలు రాశాను. ఈ ప్రాంతం శిల్ప కళకు ప్రసిద్ధి.
“శిలలపై గీత గీసె ఈ శిల్పి వాడు/ తెల్పినాడు నాటి చరిత్ర నిల్పి నేడు..” ఎక్కడో గాని చక్కని చెక్కడాల/ పనిని నేర్పితివి కద! ఓ పరమ శిల్పి!/ బుక్కెడన్నము దొరికెడి దిక్కు లేదు/ నాయనా తమ చక్కదనాల పనికి”
అంటూ శిల్పకారుల కళా నైపుణ్యాన్ని, వారి దీనావస్థను గురించి రాశాను.
“భువనగిరి తెలంగాణ సంపుటములోన / పసిడి వర్ణాలలో చెక్కబడును లెస్స” అని ఆ పట్టణాన్ని గురించి రాసి నమస్కృతులు తెలుపుకున్నాను.
15. మీరు రాసిన ఇతర రచనలేవి?
జ : 1953 లో నేను ఏడవతరగతిలో ఉన్నప్పుడు నన్ను ఎంతగానో ప్రేమించే మా మాతామహుడు బేతోజు లక్ష్మీ నారాయణ చనిపోయినప్పుడు ఛందస్సు ఏమీ తెలియకున్నా ఆ దుఃఖాన్ని స్మృతి కావ్యంగా రాశాను. అలా ఎంతోమంది స్మృతులతో “స్మృత్యంజలి” పద్యాలు రాశాను. అవి ముద్రణలోనికి రాలేదు. అదీకాక “చద్దిమూటలు” అనే పేరుతో 5516 కొటేషన్లు ఒక్కచోట చేర్చాను. ఒక్కసారి ఆ పుస్తకం తిరగేస్తే చాలు ఆ ప్రభావం మన మీద పడుతుంది. అది కూడా వెలుగులోకి రావాల్సి ఉంది. పుష్ప విలాపం ఖండికతో ప్రేరణ పొంది “గోవిలాపం” రాశాను. కుడ్య మాసపత్రికలో ప్రచురించబడింది.
” చిక్కగున్నంత కాలం చితుక గొట్టి
చేత చేయించుకొందురు, చేరదీసి
బక్క పడగానె మమ్ముల బాహ్యపరచి
కోత కమ్ముదురయ్య మీ కులము వారు”
ఇట్లా ఉంటాయి ఆ పద్యాలు.
ఛందో నియమాలు ఉన్న పద్య కవిత్వం రాయడానికి యువత ముందుకు రావడం లేదు. అందుకే వారికి సులువుగా ఉండడానికి “దొందూ దొందే” అనే త్రిపదుల కృతిని రాశాను. “దేవుడు లేని గుడి/ దేశికుడు లేని బడి/ దొందూ దొందే”…ఇలా అయితే ఎన్నో పద్యాలు రాశాను కానీ ఎప్పుడూ ఉద్యమాలు, సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలలో తిరగడం వలన అచ్చు వేసుకోవాలనే ఆలోచన ఉండేది కాదు.
16. తెలంగాణా ఉద్యమం వైపు మిమ్మల్ని ఉత్తేజితులను చేసిందెవరు? ఉద్యమంలో మీ భాగస్వామ్యం ఏమిటి?
జ: నేనెప్పుడూ విశ్రాంతి కోరుకోనమ్మా! ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి. చదువుకున్న రోజుల్లో చదువుకున్నాను. తర్వాత సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో పాల్గొన్నాను. వాస్తవానికి ఆంధ్ర వ్యతిరేకోద్యమం కె సి ఆర్ పుట్టక.మునుపే 1952 లో ప్రారంభమైంది. “నాన్ ముల్కీ గో బ్యాక్” అనే నినాదంతో ముల్కీ ఉద్యమం వచ్చింది. అప్పుడు నేను ఆరవ తరగతిలో ఉన్నాను. నాకేమీ తెలియదు. అయినా ఫ్లెక్సీ పట్టుకొని తిరిగిన వాణ్ణి. “ఇడ్లీ, సాంబార్ గో బ్యాక్”, “గోంగూర పచ్చడి గో బ్యాక్” అనే నినాదాలు అప్పుడు పుట్టినవే. తెలంగాణ తొలి ఉద్యమం, మలి ఉద్యమం రెండింటిలోనూ కవిగా, రచయితగా నా వంతు పాత్ర నిర్వహించాను. తెలంగాణా ఉద్యమంలో ‘ధూంధాం’ కార్యక్రమంలో పాటలతో ఎట్లా ఉర్రూతలూగించారో సభల్లో నేను పద్యాలతో ఉర్రూతలూగించిన వాడిని.
” ఆత్మార్పణము జేసి అమరులైనట్టి మా త్యాగమూర్తుల ప్రసాదంబు గాదె,
పుట్టుకంత తెలంగాణ పోరు కంకితమయ్యె జయశంకరులవారి జయము గాదె
మాట నిలుపుకున్న మహనీయురాలు మా సోనియా ఇచ్చిన వరము గాదె” ఇలా ఎన్నో పద్యాలు..
“నా తెలంగాణ కోటి రతనాల వీణ” అని దాశరథి అంటే నా తెలంగాణ కోట్ల రతనాల వీణ” అని పద్యం చెప్పాను. “తెలంగాణలో చదువుకున్న పెద్దవాళ్ళు లేర”ని అంటే “ఎవడ్రా అన్నది?” “మందార మకరంద మాధుర్య మూర్తి మా పోతన్న పుట్టిన పుణ్యభూమి” అంటూ వంద పాదాలతో “తెలుగు కాగడాలు” రాశాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు రాజమండ్రిలో విశ్వవిద్యాలయానికి నన్నయ్య పేరు పెట్టినట్లు, కడపలో విశ్వవిద్యాలయానికి యోగి వేమన పేరు పెట్టినట్లు 2007లో నల్లగొండలో మంజూరైన విశ్వవిద్యాలయానికి పోతన పేరు పెట్టాలని ఉద్యమం మొదలుపెట్టాను. చాలామంది పెద్దలు సహకరించారు. కానీ ఆనాటి ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి మా విన్నపాన్ని పట్టించుకోకపోగా మా నోళ్లు మూయించాలని మహాత్మాగాంధీ పేరు పెట్టారు. ఏమీ అనలేక పోయాం. తెలంగాణా మహాకవి పోతన అంటే నేను ఊరుకోను. తెలంగాణాలో పుట్టిన మహాకవి ఆయన. రాజశేఖరరెడ్డిగారు పోతన మీ వాడు కాదు అన్నాడు. అప్పుడు వరంగల్ లో సెమినార్లు జరిగాయి. “పోతన మా వాడు కాదంటే డొక్క చీలుస్తాం” అని వార్నింగ్ ఇచ్చాము. అప్పటినుండీ ఆంధ్రా ప్రాంతం వాళ్ళు రాసిన వ్యాసాలు రావడం ఆగిపోయాయి.
ఇట్లా తెలంగాణోద్యమం, మహాత్మాగాంధీ ఉద్యమం, గ్రంథాలయోద్యమం, ఉపాధ్యాయ ఉద్యమం, అక్షరాస్యత ఉద్యమం, పోతన నామ సాధక కమిటీ అధ్యక్షునిగా పోతన ఉద్యమం ఇలాంటివి చేశాను. అక్షరాస్యతా ఉద్యమం ప్రభుత్వం ప్రారంభించకముందే నేను ప్రారంభించాను. ఇంటింటికీ వెళ్లి చదువు చెప్పేవాణ్ణి. ఉడాయి గూడెం అనే చిన్న ఊళ్ళో పిల్లలు బడికి వచ్చేవారు కాదు. నేనే పలక, బలపం పట్టుకొని వెళ్లి నేర్పించేది. చచ్చేముందు సంతకం అయినా నేర్చుకోవాలని 80 ఏళ్ల పెద్దమనుషులకు కూడా సంతకం నేర్పాను.
17. మీ సంపాదకత్వంలో వెలువడిన పత్రికలేవి?
జ : పత్రికలు రచనా శక్తిని పెంపొందిస్తాయి. జ్ఞానాన్ని కలిగిస్తాయి. చైతన్య ప్రేరకాలు అవుతాయి. అందుకే నేను ఎక్కడ పని చేసినా స్కూల్లో కానీ, కాలేజీల్లో గానీ అక్కడ పత్రిక పెట్టేవాడిని. స్టాఫ్ ప్రోత్సహించేవారు కాదు. “ఈ పిల్లలకు ఏమొస్తది సార్? ఎందుకు ఈ పేపర్ ఇదంతా?” అని ఉత్సాహాన్ని నీరు కార్చేవారు. అయినా నేను వినేవాణ్ణి కాదు. మనం చేసే పని మనం చేయాలి. ఎవరో వద్దంటే ఊరుకుంటే పనులు ఎలా జరుగుతాయి?
నేను పని చేసిన విశ్వ విద్యాలయాల్లో కూడా కుడ్య పత్రికల ద్వారా విద్యార్థుల్లో రచనాసక్తి, సృజనశక్తి కలిగించడానికి ప్రయత్నం చేశాను. ఇక నడిపిన పత్రికలు…. బాపు భారతి, మన తెలుగుతల్లి, వలి వెలుగు, చిరంజీవి, ప్రియంవద, ముచుకుంద. నాకు చేతనయినంత వరకు చదువుపట్ల విద్యార్థులకు ఆసక్తి కలిగేలా చేశాను.
18. సాహితీ సేవకై మీరు స్థాపించిన వివిధ సంస్థలు ఇప్పటికీ కొనసాగుతున్నాయా?
జ : పల్లెటూళ్లను చైతన్య పరచడానికి సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాను. దానికోసం కొన్ని సంస్థలు స్థాపించాను. అక్షర భారతి, మిత్ర భారతి, సాహితీ స్నేహితులు, భువనభారతి, ప్రజా భారతి, మల్లెల భారతి ఇలాంటి సంస్థలే కాక సాంసృతిక సంస్థలను కూడా స్థాపించాను. అందులో ఇంకా ఇప్పటికీ కొన్ని నడుస్తున్నాయి. వీటన్నిటికీ మంచి స్పందన లభించింది. మా సేవలు గుర్తించి ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు, విశ్వవిద్యాలయాలు, విదేశాల్లో ఉన్న తెలుగువారు మా సేవలను గుర్తించి, బిరుదులతో, పురస్కారాలతో గౌరవించారు. పల్లెటూరులో పుట్టి పెరిగిన నా జీవితం ప్రస్తుతం సాహిత్య సేవలో గడిచిపోతోంది. ఆ తృప్తి చాలు. ” జననీ జన్మ భూమిశ్చ, స్వర్గాదపి గరీయసి” అన్న ఆర్యోక్తి నాకు ఆదర్శం.
19. గణతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రభుత్వం మీకు ‘పద్మశ్రీ’ బిరుదును ఇవ్వడం పట్ల ఎటువంటి అనుభూతి చెందుతున్నారు?
జ: అవార్డు ఇవ్వడం ఆనందమే. కానీ గర్వంగా భావించడం లేదు. ఎందుకంటే నాకు తోచినంతవరకు నలుగురికి ఉపయోగపడాలన్నదే నా ఉద్దేశ్యం. నేను కీర్తి కాంక్షల కోసం ఈ పనులు చేయడం లేదు. నావల్ల ఒక్కరు బాగుపడ్డా దాన్ని నాకొచ్చిన అవార్డుగా భావిస్తాను. అవార్డు వచ్చిందని తెలిసి ఎంతోమంది స్వయంగా నా దగ్గరకు వచ్చారు. ఎంతోమంది తమ అభినందనలు తెలిపారు. నా కృషిని గుర్తించి అవార్డు ఇచ్చినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రమ్మని ఆహ్వానం వచ్చినా ఆరోగ్య పరిస్థితుల వల్ల వెళ్లలేకపోయాను.
20. ఇంతటి ఖ్యాతిని ఆర్జించిన మీరు గ్రంథాలయ విషయంలో ఇంకా చేయాలనుకుంటున్న పనులు ఏమైనా ఉన్నాయా?
జ : ఇప్పుడున్న గ్రంథాలయానికి స్థలం సరిపోవడం లేదు. ఇంతకు ముందు చెప్పాను కదా రెండు లక్షల పుస్తకాలకు పైగా ఉన్నాయని. ఇంకా ఎంతోమంది తెచ్చి ఇస్తున్నారు. అందుకే దీని పైన ఇంకో పెద్ద హాలు కట్టించాను. సాహితీ కార్యక్రమాలు కూడా జరుపుకునే లాగా చిన్న వేదిక కూడా ఏర్పాటు చేసాను. వచ్చే నెల ఫిబ్రవరిలో గవర్నర్ తమిళిసై గారి చేతుల మీదుగా అది ప్రారంభం కానున్నది. మీరు కూడా తప్పకుండా రావాలి ఆహ్వానం పంపుతాను ( నవ్వుతూ).
ధన్యవాదాలు సార్! తప్పకుండా వస్తాను. మీలాంటి ఆదర్శమూర్తులను కలుసుకోవడం, మా పాఠకులకు పరిచయం చేయడం మాకు గర్వకారణం. ఆరోగ్యరీత్యా ఇబ్బందులను ఎదుర్కొంటూ కూడా మీ జీవిత విశేషాలను ఇంత ఓపికగా చెప్పిన మీకు మా తరఫున, మా పాఠకుల తరఫున కృతజ్ఞతలు, నమస్కారాలు.