ఈ రాత్రి నాలుగు వైపులనుండీ అంటుకుంటున్నది
స్వప్నం కాలేకపోయిన యీ రాత్రి
పచ్చి పుండై సలుపు తున్నందుకు హాయిగానే ఉంది
నేనీ దిగులు రాత్రిని దు:ఖంలో ముంచకొని పానం చేస్తున్నాను
నేనీ కలత నిద్రల రాత్రిని మేఘ మల్హార రాగం లో గానం చేస్తున్నాను
తుఫానులను ఉచ్చ్వాసగా
అగ్ని జ్వాలలను నిశ్వాసగా
చేసుకున్న వాడికి
బతుకును చీకటి సముద్రపు
టలల్లోకి విసిరేయడం
గుండెల్ని పిండే విషాదం కాదు కదా
వలపు తీర విరహిణులతో ఐక్యం కాలేని
హృదయ నాదం
జీవం లేని శబ్దమై నీరసించి తుది శ్వాస విడిచింది
దారుల్ని పారేసు కున్న గాయం
ఎవరికోసమో ఉన్మత్తంగా అన్వేషిస్తున్నది
అయినా బొత్తిగా శూన్యం అలుముకోలేదు
జ్ఞాపకాల నుంచి ఒక్కొక్క నెత్తురు బొట్టూ
పచ్చిగా చిక్కగా రాలుతూనే ఉంది
నగరం నడిబొడ్డుకింద జారిన చీకటిలో
సామూహిక స్ఖలనాల్లో తడిసిన
బిచ్చగత్తే ఆర్తనాదం శూన్యం కాదు కదా
తుపాకి వనంలో విరిసిన బుల్లెట్ల పువ్వుల మధ్య
వీచిన మృత్యు పరిమళం శూన్య మెలా
అవుతుంది?
భళ్ళున మాతృత్వం పగిలి
చీకటి ముళ్ళ పొదల మధ్య
తెగిన పేగు బంధపు నెత్తురు గుడ్డును
శూన్యమని ఎవరంటారు?
గుండెల్ని చీలుస్తూ మొరుగుతున్న
కుక్క గొంతు శ్రుతిలోని జీర శూన్యానికి సంకేతాలేనా?
దేన్నీ పట్టించుకోకుండా కొండ చిలువలా కాలాన్ని ఆబగా మింగుతున్న గడియారం ముళ్ళు
చైతన్యానికి ప్రతీకలే కదా?
మెల్లగా ఏకాంతం; అలజడి ఉప్పెన అవుతూ నన్ను సుడివేస్తున్నది
అదే పనిగా మీటుతున్న గుండె ఏకతార లోంచి
రక్తం వెచ్చగా స్రవిస్తున్నది
ఇక యీ రాత్రి ఇంతే….
నా సుందర స్వప్నం,ఈ రాత్రి పిరమిడ్ కింద
క్లియోపాత్ర గా మారి మూల్గు తున్నది
కవితలు
స్త్రీ చైతన్యం తొలిమెట్టు
అదే ఆశయాలమలిమెట్టు
మహిళల చేతనం నవోదయం
ప్రతి ఇంటికి ఆమే ఉషోదయం
పాత్ర ఏదైనా అందు జీవించడం
సహనం కరుణా మమతలతో
ఎదుటివారిని మెప్పించడం
తనకంటూ ఓ ప్రత్యేకతను
నిలుపుకుంటూ ముందుకేగడం
బాధ్యతలెన్నోమోస్తూ తానూ
కొవ్వొత్తిలా కరిగి వెలుగివ్వటం
బాధనుగుండెల్లోదాచుకుని
బ్రతుకుదెరువుకైపోరాటం
మహిళలు జాతికి రత్నాలు
ఆదర్శం గానిలబడుతారు
స్ఫూర్తి ప్రదాతలు మరెందరో
నిత్య నూతన సృజనలతో
కళామతల్లుల గాథలుయెన్నో
ప్రతిభా సంపద పరిమళాలతో
వివిధ రంగాలలోరాణిస్తూ
కీర్తిప తాకము లెగురేస్తూ
తారాజువ్వలు గా దిగంతాలకు
చంద్రికలై కాంతులు విరజిమ్మే
వనితలందరికీ జోహార్ జోహార్
చంద్రయానమునశాస్త్రవేత్తలై
సాంకేతిక విప్లవసారథులై
వినూత్న రీతుల వేగంతో
జాబిలమ్మనే దరిజేర్చే
మార్గాన్వేషణ పరిశోధకులు
మగువలు మీకివె అంజళులు
ఎడ్లబండ్లు ఎనుకకు పట్టినయి
గా సందుల ఏడికెల్లో ఓ పెద్ద కోపు పట్టుకొని ఇమానం ల కెల్లి
ఓ యాబయి మంది దాక దిగిండ్రు. అందరు లైనుబడ నిల్సోని సప్పట్లు కొట్టుకుంట,
శిన్న పొల్లగాల్లను ముద్దు పెట్టుకున్నట్లు ఆ కోపుకు ముద్దు పెట్టుకొని
ఆల్లను కార్లల్ల ఎక్కిచ్చి ఇండ్లల్లకు సాగనంపిర్రు.
తెల్లారి నాలుగు తొవ్వల్ల వున్న శాయ బండికాడికి పోయి పొద్దుగాల పిండిన
అద్దషేరు బర్రెపాలు పోసి పైసలడిగితె కాసేపు ఆగమని కసిరిచ్చుకున్నడు .
అయ్యో గట్ల గంజిలీగను తీసేసినట్లు తీసేత్తానవేందన్నా అని అంటే …..
రేపటి సంది పాలు బంజేయి పక్కన పెద్ద మార్కెటు పడ్డది
వాల్లు నెలకోసారి పైసలియ్యమంటాండ్రు నువ్వేమో ఆగవు ,
దినాం వచ్చి కూకుంటవు అనె!
ఇంతల ఆడ అందరు మబ్బుల మొకాన సూస్తాండ్రు
ఆయనడిగె ….
ఏమన్నా తప్పుడు ఆనలు గిన పడతానయా గింతంత జివాల్లకు
తోపులల్ల నీల్లన్న వస్తయి అని !
ఏ ఊకో ఆనలు లేవు పాడు లేవు పైన మబ్బులల్ల కెల్లి కిందికి ఎవరో వస్తాన్నరట
గందుకోసం చూస్తానం నువు కూడ చూడు అనిరి! .
ఇగ ఆయన రోజు గొడ్లు గాసుకుంట , శేనుకు నీల్లు పెట్టుకుంట
పైన సప్పుడు గాంగనె మబ్బులల్ల జూత్తె ఇమానాలు కనబడుతనే వుండె ,
ఇంట్ల TV డబ్బాలల్ల గవే ముచ్చట్లాయె …
ఇప్పుడు రిచ్చాలేడున్నయి ?అన్ని అంతరిచ్చాలేనాయె !
ఇగ కొత్తగ ఇనుడేంది సూసుడేంది.?
రైలుబండ్ల సప్పుడు ముంగట ఎడ్లబండ్ల సప్పుడు ఎట్లయినా ఇనిపియ్యదు
అది ఎరుకున్న ముచ్చటేనాయె అని శెద్దరు కోసం ఎనుకులాడిండు కూర్పాట్ల పడుదామని….
కాని ఎంతకు నిర్ద పట్టి సత్తలేదట , ఇగెట్లయినా ఇయాల గాకపోతె రేపు ఎవుసం బూములు ,
ఇంటి పక్కపంట పెరట్ల జాగలన్ని ఇమానాలు దిగేటానికి , రైలు టేషన్ లకు ఇచ్చి
ఇగ పరాగతుగ నడింట్ల మోకాల్లు మలుసుకుని కూసునుడేనాయె !
తలపులల్ల దుక్కం ఎవరు కనిపెడ్తరు
కండ్లు కాయలుగాసే మనుసులేడున్నయ్ !
ఎట్లయినా పొల్లగాల్లు అందరు ఏరే దేశాల పట్క పోతనే వున్నరు,
ఈడున్న పొల్లగాల్లేమొ ఏడ వింటర్నేషనల్ బడులున్నయాని…
ఎండ్ల వాల్ల పిల్లల్ని షరీకు చెయ్యాల్నని
ఇశారించేదానికే వున్న టయామ్ అంత అయిపోతాండె !
కాలం గుప్పిటవట్టిన కొండచిలువంటి కోరికలేనాయె!
ఇగ పంటలు లేవు , పెంటలు లేవు
ఇండ్లల్ల గ్యాసు మంటలు , ఇంటి పక్కపంట గుళ్ళల్ల గంటలు…
అయినా ఇగ ఆల్ల ఇంటిపొంటనే ఇమానాలు దిగినాక మబ్బుల మొకాన జూసుడెందుకు ?
ఇగ ఎనుకట శిన్నప్పుడు జాతరలల్ల ఇమానం బొమ్మలు ,
ఎలికాప్టర్లు కొనుక్కొని ఆడుకున్నట్లేనాయె…
గుండె పండు పండిపోతాంటె
గల్మట్ల కూసోని మంచికోసం ఎదురుసూసుడేనాయె…
చల్లని గాలి చూడు -పచ్చని పైరు చూడు -2
వెన్నెల వెలుగు చూడు –
వెలుతురును ఇచ్చే రవిని చూడు -2-
నీడను ఇచ్చు చెట్టును చూడు
చెట్టు పైన పిట్టను చూడు-2
ఆకాశ వర్ణము చూడు -భూ లోక వర్గమును చూడు-2
అన్ని వర్గాల సరి సమానత్వం చూడు -2

సరి సమానత్వం కలిగిన – ప్రకృతి వైనాలను చూసి -2
హాయి గా జీవించు నేడు -2
చూడు చూడు చూడు చూడు
ఏమీ తెలియని జీవులు మూగ జీవులు-2

వాటి జోలికి వెళ్ళటం మంచిది కాదు -2
మంచి మనస్తత్వం ఉన్న మానవ జీవులకు -2
తల తల మెరిసే తారలు చూడు
మిల మీల మెరిసే మెరుపుని చూడు -2
జల జల పారే సెలయేరును చూడు
గల గల లాడే చెట్ల ఆకులు సవ్వడి చూడు -2
అన్నీ తెలిసిన ఓ మానవ జీవుడా -2
మధురాతి మధురమైన
మన మానవ జాతి విలువను కాపాడు -2
ఇతరులకు ఆదర్శ మూర్తిగా
నిలబడేలా జీవించు -2
చూడు చూడు చూడు చూడు
ప్రకృతి తల్లి ఆనంద పడేలా -2

సహాయం dr. N Lahari
తోడు నీడ DCM
మొబైల్ 9963095812
మహాభారతం..
దాయాదుల నడుమ పోరు చరితం
ధర్మ బద్ధుల జూద క్రీడలో
పాచికల ప్రహసనం
వ్యసన బలహీనతకు బలియైన
పరాక్రమ సింగాల పరిహాసం
‘అన్న’ మాటకు కట్టుబడి
అరణ్యవాసం.. అజ్ఞాతవాసం
అంతా శకుని తలపోసిన
భారతం!
శ్రీమద్రామాయణం..
కైకేయి వర చరితం కాదా!
ఒకవేళ..
రాముడు మందర గురించి
ముందే ఆలోచించి ఉంటే
రావణ వధ అయ్యేదా?
శూర్పణఖ ముక్కు చెవులు
కోసి ఉండక పోతే
ప్రాణమున్న బంగారు జింక
ఉండదని తెలిస్తే
సీతాపహరణం జరిగేదా?
హనుమ తోకకు నిప్పంటించకుంటే
లంకాదహనం జరిగేదా?
మాటకు కట్టుబడితే..
జరిగే పరిణామాలు
రామాయణ మహాభారతాలే!
పురాణాలైనా, ఇతిహాసాలైనా
గుర్తుండి పోయేలా ఘోషించినవి
యుద్ధాలేనా?
శత్రువును ఛేదించడానికి పన్నిన
వ్యూహ ప్రతివ్యూహాలేనా?
సబలలను అబలలుగా చిత్రించడమా?
అంతిమ ఫలితం..
దుష్ట శిక్షణ శిష్ట రక్షణా?
మరుభూమిగా మారిన పిదప
సత్యం జయిస్తే ఒరిగే లాభమేమీ?
పాలకుల కుటుంబాల నడుమ
చెలరేగిన కక్ష్యలు, కార్పణ్యాలు
పాలితులకు శాపంగా మారాలా?
దేనికి ఏది అవసరం
ఏది ముందు ఏది వెనక?
శాసనంతో అనుశాసనమా
అనుశాసనానికి శాసనమా?
నడిచిన దారులు
కాలం విడిచిన కుబుసాలు
ఎవరో శాసించింది కాదు
దానికదే జరిగితే చరిత్ర.
అలాంటప్పుడు
కాలాన్ని వెనక్కి మళ్లించాలా?
చరిత్రను తిప్పి రాయాలా?
– ఆచార్య కడారు వీరారెడ్డి; 9392447007
నా ఇంట ఆమనిలా విమల
నా కంటిపాప లా విమల
ముత్యాల పలువరస
ముసిముసి నవ్వులు
కొంటెతనం కోమలి
జతగ మూడు పదుల
ముత్తైదువు తనం
నలబై ఐదేండ్ల ప్రాయం
కాలమా ఏల ఈ హేయం .?
విమలా మనూరి ముచ్చట్లు అచ్చట్లు
అది తొంభై ఐదు సంవత్సరం
తొలినాళ్ల బెజ్జికల్లు వరినాట్లు ..
కల్పు తీతలు పంట కోతలు
చాలీచాలని జీతం నేను సతమతం
చంపాపేట హైద్రబాద్ మకాం..
ఆరునెలల కాపురం
అత్తమామల అండతో
రామోజీ ఫిల్మ్ సిటిల అడ్డ
స్టూడియో నిర్మాణం లో పార్కులు
నీసెమట గంధాలకు సొబగులద్దుకునె గదా
నీ చేతుల చలువరాయి వన్నెలద్దుకునే గదా
1997 జనవరి మాసం
అగ్గది లెక్క కొలువు తీరిన
నేను పంతులు నౌకరి ల
నువ్వు పంతులమ్మ గా
నాంపల్లి ల మన టికాన
సరికొత్త కాపురం
ఎన్ని ఆశలు పెంచుకున్నాము
ఎన్ని వుసులు పంచుకున్నాము
వోనమాలు వంట పట్టించుకోని
వి మ ల .. అని నీవు పలకపై రాసి
పరవశించిన మురిపం ఎట్లా మరిచేది..
మన ఇంటికి ఎవరు వచ్చినా
ఉరుకురికులాడి వంట వార్చిన అమ్మతనం
ఉప్పిడో సప్పిడో కలిగిన దాంట్లో వండిన కూర
కమ్మదనం మన ఇంటికి అన్నపూర్ణ నీవే కదూ..
అరమరికలు లేని దాన
అమాయక నా విమల
సుఖాలకు పొంగలే
కష్టాలకు కుంగలే
నీవో నవనీతం
నవన్మోహిత పారిజాతం
సారంతో సాగుతున్న సంసారం
ఆశలు ఊసులకు శ్వాసతో
పురుడు పోసుకున్న పిల్లలు
ఒక రేనక ఒకరు చాలనుకున్న ఇద్దరు
నలుగురు పిల్లల తల్లి నా విమల
ముగ్గురు పిల్లల ఆటలు పాటలు
అల్లరితోనే చదువులు
చండూరు మరియానికేతన్ ఒక జ్ఞాపకం
మెరుగైన చదువులకంటూ
నల్లగొండ పిల్లలు పెద్దలై గ్రాడ్యుయేట్స్
రెక్కలొచ్చిన పిట్టలయ్యారు
కాలంతుర్రుమంటూ
తీతువుపిట్టల సాగుతూనే ఉంది
జీవితం బరువుగా భారంగా
నిట్టూర్పు నెగళ్లకు సెగలుగకుతూనే ఉంది
కాని కాలం కరోనా విలయం
తట్టుకున్న దేహాలు మనవి
పిల్లల ప్రేమలకు పట్టాభిషేకాలు
దగ్గరుండి ప్రేమను గెలిపించాం
ఇప్పుడేమిటి ఇలా
నన్ను ఒంటరి చేశావు
ఎందుకిలా నాకు వినియోగం
జీవిత వైరాగ్యం
అంతా నీవు చెప్పినట్టే చేశాను కదా
నీవు చెప్పినట్టే పిల్లల జీవితాలు సరిదిద్దాను కదా
నాకెలా ఈ ఎడబాటు నా విమల
మనం మధ్యలో కలిసిన
చివరి కంట జంట తోడంటూ
అర్ధాంతరంగా ఏమిటి
నీ పాత్రకు వీడ్కోలు
నాకేలా వీడుకోలు
చివరి రోజునాడు
ఓయ్ నన్ను గురించి రాయవా
ఎవలెవలి గురించో కథలు రాస్తావ్
నా గురించి ఒకసారి రాయి అన్నావు
రాయలేక సతమతం
ఏమిటో అంతు చిక్కని నీ అభిమతం
మేడిపండు లోకముకదా
రీతులెండు కాలము కదా
కలికాలం వెతలురేపేనా
కల్లోలం చితులు రేగేనా
ఇంటిదీపం ఆరింది
కంటివెలుగు జారింది
కష్టాలు తరుముతుండెనా
కన్నీళ్ల మునుగుతున్నది
మింట తార చేరింది
గగనవీధి వాలిందా
చితిపై పెనుమంటలెంతరేగిన
గాయపడినగుండెల చింతలుతీరునా
సతిని చుట్టుముట్టిన జ్వాలలకు
ఎదపొంగె నీకన్నీళ్ల తడి ఆరునా
ఏమిటి గోరం ఎవరిది నేరం
ఎవరికి శిక్ష కాలానికేల ఈ కక్ష
“రైతో రక్షతిరక్షితః”
రైతును మనం రక్షిస్తే
రైతు మనలను సంరక్షిస్తాడు…
ఇది వాస్తవం…
మరి…
నేల తల్లిని నమ్ముకున్న రైతు
నాగలి పట్టి నలుగురికి అన్నం పెట్టిన రైతును…
నేల విడిచి సాము చేయమంటే ఎలా….
రెక్కాడితే కానీ, డొక్కాడని వాళ్ళు…
రెక్కల కష్టం మీద బ్రతికే వాళ్ళు…
రెక్కల కష్టం ఆపితే ఎలా….
ఎండకు ఎండుతూ,వానకు తడుస్తూ…
ఏళ్ల కొలది భూమిని నమ్ముకుంటూ…
కాలం కన్నెర్రజేసినా, కడుపు కాలినా…
కండరాళ్ళను కరిగిస్తూ….
కన్నీళ్ళనే కాలువలుగా పారిస్తూ…
క్వింటాళ్ళ కొలది పంటను పండిస్తూ…
వేయిలమందికి అన్నం పెట్టిన అన్నదాత….
చెమట చుక్కనే నీటి చుక్కగా మార్చి...
నేల తల్లికి దాహం తీర్చే దాత..
రెక్కల సాము ఆపితే ఎలా….
ఇంటిని, పాడిపంటలను చూసుకుంటూ….
చెమట చుక్కను ధారపోసి…
బిడ్డలను కార్పోరేట్ చదువులకు పంపుతూ…
పల్లె బాటను పానంలా కాపాడుకునే రైతు…
రెక్కల కష్టం ఆపితే ఎలా…
భూస్వాముల చేతిలో రైతు
కీలు బొమ్మలుగా మారి
నమ్ముకున్న భూమిని చేజార్చుకున్న రైతు…
ఉరితాడుకు బలి అయితే ఎలా….
కాలిఫోర్నియాకు కర్మేది పట్టెనో
కాలిపోవుచుండె కళ్ళ ముందె
ప్రకృతెక్కడైన పగబట్టితే చాలు
ఫలిత మివ్వ లేదు ప్రజ్ఞ ఏది!!
గుండె లవిసి పోయె గూళ్లు చెదరిపోయె
మూగ జీవులెన్నొ ముద్ద లాయె
గాలి తోడు యవ్వ గంతేసి జ్వాలలే
అశన మోలె మ్రింగె అందినంత!!
అగ్ని మాపకులును అహరహం కృషిచేసి
ఎంత కష్ట పడిన నేమి ఫలము
కళ్లు కప్పు నట్టి కార్చిచ్చు మాపగన్
ప్రాణ త్యాగులౌచు పరుగు లిడిరి।!
కొన్ని గంట లందు కోట్లుమసిగమారె
అందమైన ఇండ్లు ఆహుతాయె
వేలకొలది జనులు విడనాడిరిండ్లను
దీనులైరి చిత్ర దిట్ట లెల్ల!!
కాలిఫోర్నియాను కరుణించరాస్వామి
నీకు తెలియనట్టి నిజముయేది
మూడు జగము లేలు ముక్కోటి వేల్పులు
ముందుzబడుడి మాకుముదముతెండి !!
( అమెరికా నుండి)
దీపాలం దీపాలం
తిమిరాలకు శాపాలం
తమోహక ప్రతాహలం
అమవసపై కోపాల
అయినా మేం గర్వించం
అసలే ఆనందించం
బహిరంగపు చీకట్లను
ప్రహరిస్తున్నాం గానీ
అంతరంగపు చీకట్ల
నంతం చేస్తున్నామా?
అందుకే ఈషణ్మాత్రం
ఆనందించడం లేదు
అందుకే ఒక్కింతైనా
అహంకరించడం లేదు
యదార్థ కథనం చేస్తే
అసలు సిసలు దీపాలం
మేమని చెప్పుకోలేము
మా మనసులోని మాటది
మానవాళినంతటిని
ప్రాణికోటులన్నిటిని
ప్రేమించిన, సేవించిన
ధీమాన్యులు దీపాలు
జనకోటిని నడిపించిన
ఘననాయక శేఖరులు,
మన అందరికీ సుఖ జీ
వన వరమందించేందుకు
ఎన్నెన్నో కనిపెట్టిన
మిన్న లైన శాస్త్రజ్ఞులు
అసలు సిసలు దీపాలు
ఆరని దీపాలు , నూనె అవసరమొక్కింతలేని
అనశ్వర ప్రదీపాలు
కనులకు కనిపించే ఈ
ఘనతర దీపాలె కాక
ఆలోచించగలిగితే
మీలోంచే ఉదయించే
అపురూపమైన దీపా
లవి ఎన్నో ఉన్నాయి
బ్రతుకులోన తల ఎత్తే
ప్రతి అనుభవము ఒక దీపం
అది నేర్పే గుణపాఠం
ఆ దీపకాంతిపుంజం
వాటిలోనూ చేదు అనుభ
వాల వెలుగు తీక్ష తరం
ఆ అనుభవాలలోనూ
అవమానా లిడే వెలుగు
అనన్య సామాన్య వరం
మిన్నల ఘనరూపంలో
మీ అనుభవరూపంలో
వెలిగే దీపాల వెలుగు
విలువ తెలిసి వర్తిస్తే
మీ ప్రతి ఒక్కరి మనుగడ
దీపావళి కాగలదు
చరితలోన మీ పేరు
చిరస్థాయి కాగలదు
_**
అవును
నన్ను పట్టి చూపింది
ఆ పువ్వే.
నా ఆనవాళ్లు ఆ పువ్వే
నాది బతుకమ్మ జాతి.
ఖరీదైన పువ్వులు
ఎన్నైనా ఉండొచ్చు!
కొప్పులకు ఎక్కే పువ్వులు
కోకొల్లల్లుండొచ్చు!
ఆత్మగల్ల పువ్వు మాత్రం
అదొక్కటే.
ఈ మట్టి సంస్కృతిని
పట్టి చూపిన పువ్వు.
వానకు పసుపుపచ్చ
ముత్యమై మురిసింది.
ప్రకృతి చీరపై
పట్టు అంచుగా మెరిసింది.
ఆమే ఓ పార్వతి
ఆమే ఓ శక్తి స్వరూపిణి .
పెతరమాస నాడు
ఎంగిలి పువ్వై,
సద్దుల బతుకమ్మ నాడు
తాంబాల మంతై ,
వనం లోంచి వనం
ప్రకృతి లోంచి ప్రకృతి
ఆమెకే చెల్లింది.
అడవిని కాస్తున్న తల్లి ఆమె.
సబ్బండ వర్ణాల
మనసుల్లో నిలిచిన పువ్వు.
నా యాసకు
నా భాషకు
తానే నిలువెత్తు ప్రతీక.
రుద్రమ్మ పౌరుషం
సమ్మక్క సారక్క వీరత్వం
ఐలమ్మ ఆక్రోశం
వీరనారీల ఒక్కరూపు
మా బతుకమ్మ.
ఆడబిడ్డల
మనసుల్లో నిలిచింది.
వాళ్ళ గొంతుల్లో
పాటై పరుగులెత్తింది.
అస్తిత్వ పోరాట
ఆయుధ మైంది.
బతుకమ్మను
ఒక్కసారి తలకెత్తుకో
నువ్వెవరో నీకే తెలుస్తుంది.
