ఊహా తెలియని
నాడు ప్రేమించిన నా తల్లి
ఊహా తెలియగానే
ద్వేషించడం మొదలెట్టింది. ఎందుకో..!
అయినా! నా జన్మ కారకురాలే
అనుకుని సర్దుకుపోయా..!
కఠినత్వానికి మరోరూపమని
నా తల్లి పేరు చరిత్రలో నిలిచిపోయింది.
కసాయి తల్లి అని నా మనసును సమాధానపరుచుకున్న
ఆ దేవుడికే నోరు ఉంటే
ఎంత బాగుండేదో!
జన్మనిచ్చిన పిల్లల్ని
ప్రేమించమని చెప్పేవాడేమో! బహుశా!
రాతి బండలాంటి
నా తల్లి మనసును కరిగించే వాడేమో..!
బహుశా!
నుదుటి రాతలు రాసిన
ఆ బ్రహ్మదేవుడు నా తల్లి
తలరాత ఇంత చక్కగా
రాశాడేoదుకో..!
కన్న పిల్లల పైన కసాయితనం చూపించమన్నాడేoదుకో!
కన్న పిల్లల మనసు
నా కసాయి తల్లికి తెలిస్తే
ఎంత బాగుండో!
నిజంగా! ఆ బ్రహ్మ దేవుడే వచ్చి నా తల్లి మనసు మారిస్తే ఎంత బాగుండో..!
కవితలు
బుద్దుని చిత్రం వేస్తే
బోధి వృక్షం చిత్రం వేయాల్సిందే
బుద్దుని గురించి ప్రసంగిస్తే
బోధి వృక్షం గురించి పది మాటలైనా మాట్లాడకుంటే
ఆ ఉపన్యాసం సంపూర్ణం కాదు

ఉపాధ్యాయుడు చెప్పిన
బుద్దుని బోధనల పాఠం విద్యార్థులు
అస్సలు మరువరు!
ఎందుకంటే పిల్లలు రోజూ ఆడుకునేది
బోధి వృక్షంగా ప్రసిద్ది గాంచిన
పెద్ద రావిచెట్టు కిందే!
ఆ ఊర్లో పంచాయతి అయేది
బోధి వృక్షం కిందే !
చెప్పే న్యాయం పొల్లు పోకుండా
సత్య ప్రమాణంగా హరిశ్చంద్ర ముద్ర !
చిత్రం ! బుద్దుని విగ్రహం ముందు
నిల్చుని దండం పెడుతూ స్వార్థంగా
ధన కనక వస్తు వాహనాలు అడుగరు !
నిస్వార్థ ప్రశాంతతను అడుగుతారు
నిద్రలేవడంలో
సూర్యునితో పోటీపడినప్పుడల్లా
ఎప్పుడూ ఆమెనే గెలుస్తుంది
వాకిలి ఊడ్చి,కల్లాపి చల్లి
రోజొక కొత్తముగ్గుతో
సూర్యోదయానికి
స్వాగత గీతం పాడుతుంది
తనకు ఆకలవుతున్నా
ఇంటిల్లిపాదికీ ఆకలితీరాకే
తాను ఆకలి తీర్చుకుంటుంది
నిరంతరం శ్రమిస్తూ
చిందరవందరగా ఉన్న ఇంటిని
ఇంద్రభవనంలా మార్చుతుంది
కుటుంబాన్ని చక్కదిద్దే పనిలో
ఆమె కళలు అటకెక్కుతున్నాయి
ఆమె కలలు
కన్నీటి సంద్రంలో కలుస్తున్నాయి
వంశాభివృద్ధికీ,దేశాభివృద్ధికీ
ఒక మంచి కుటుంబంకోసం
తన జీవితాన్ని త్యాగం చేస్తున్న
“ఆమె”ను ఇంకెప్పుడు గుర్తిద్దాం
“ఆమె”ను ఇంకెప్పుడు గౌరవిద్దాం
ఆత్మా ఇల్లూ ఒకటే
చూపునకు చిన్నగా వుంటాయి
లోన ఎంత విశాలమో
రెంటికీ చుట్టూ గోడలుంటాయి
గోడల్లో కిటికీలుంటాయి
బయటకు వెళ్ళడానికీ లోనికి రావడానికీ
దర్వాజాలుంటాయి
తలుపులు తలపులు
మూసుకుంటాయి తెరుచుకుంటాయి
గాలీ వేల్తురూ

కిటికీల గుండా ద్వారాల గుండా
వెంటిలేటర్ల ద్వారా
ఇంట్లోకి వస్తూ పోతూ వుంటాయి
సయ్యాటలాడతాయి సరసాలడతాయి
కొండకచో దాగుడుమూతలాడతాయి
నేనేమో ఇంట్లో కొంత బయట కొంత
కాలం గడిపేస్తూ వుంటాను
ఇల్లేమో స్థిరంగా నిలబడి
చోద్యం చూస్తుంది
ఆత్మే ఆలోచనల భారంతో
అనుభవాల వేదనలతో
నా అన్ని కదలికలకూ చేష్టలకూ
సాక్ష్యంగా బాసింపట్టు వేసుక్కూర్చుంటుంది
నేనేమో ఆత్మను దిక్సూచిగా
ప్రయాణం సాగిస్తూ వుంటాను
మా పల్లె
మాకు దేవుడు ఇచ్చిన గొప్ప వరం
పొద్దు పొద్దున్నే
సుప్రభాతాల చప్పుడుకు లేచే సూర్యుడు
పిల్లల దాగుడుమూతలాటకు
సహకరించే చంద్రుడు
ఎటు చూసినా
పచ్చని పంటపొలాలు
ఏ ఇంట్లో చూసినా
పసందైన పిండి వంటలు
కోడి కూత వినగానే
రేగుపండ్ల కోసం పిల్లలు పరుగులు తీస్తారు
రైతులు పంటపొలాలకెళతారు
కోయిలమ్మ కూతలు
పచ్చని ఆకుల మధ్య విరబూసే పువ్వులు
ఎంత బాధనైనా తీర్చేస్తాయి
అందరి ముఖాల్లో నవ్వులు చిందించడానికి
రైతు చెమట చుక్కలు చిందిస్తాడు
కల్మషం లేకుండా
అందరినీ పలకరించే ప్రజలు
సరదాగా సంతోషంగా గడిపే జీవితాలు
చిన్న కష్టం వచ్చినా
నేనున్నా అని చెప్పే పెద్ద వాళ్ళ మాటలు
అందాలు చూడడానికి పట్టణం వాళ్ళు
ఎక్కడికో వెళ్తారు కదా!
ఒకసారి మా పల్లెటూరికి వచ్చి చూడండి
కమ్మనైన మా పల్లె
అందమైన మా సిరిమల్లె
పెళపెళలాడుతూ…
కొత్తనోటు
కళకళలాడుతున్న
కొత్తపెళ్ళి కూతురిలా
విచ్చిన కలువల్లా
విప్పార్చి చూసాయి
అబ్బురంగా
రెండుకళ్ళు
ఎన్నడూ చూసెరగనట్లు
చేతివేళ్ళు
పులకించిపోయాయి
కొత్తనోటు స్పర్శ
కొత్త అనుభూతిని
వింతగా అందిస్తూంటే
రంగురంగల
కొత్తనోట్లు…
తడిమి తడిమి చూసుకుంటుంటే
హరివిల్లు
చేతికొచ్చినట్లుంది
కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లు
కొంటెగ
గెంతులేస్తుంది
మనస్సు
చొక్కా జేబు….
నోరెళ్ళబెట్టి చూస్తోంది
ఎప్పటికైనా…
కొత్తనోట్లన్నీ తన అరలో
హాయిగా నిద్దరోతాయని
దానికి
గర్వం
తనువంతా
వేయేనుగుల బలం
ఆవహించినట్లు
పుంజుకొని
నిటారుగా తలెత్తుతుంది
అంతలోనే…
అవసరాలు..ఆశలు
రంకెలు వేస్తూంటే
గుండెలయ తప్పుతోంది
గతుకుల రోడ్డులో
ఆగాగి వెళుతున్న మరబండిలా
కళ్ళు మసకబారుతున్నాయి
పున్నమి రాత్రి
గ్రహణం పట్టినట్లు
కాళ్ళు..చేతులు వణికిపోతున్నాయి
ఏదో భయంకర దృశ్యాన్ని
అతిదగ్గర నుండి చూసినట్లు
ఏదో పాపం చేసినట్లు
ఏదో వినకూడనిది
విన్నట్లు
తనువు పట్టుదప్పుతోంది
ఓడే జట్టులో విశ్వాసం
సన్నగిల్లుతున్నట్లు
నీరసంగా నిట్టూరుస్తోంది
క్షణాలు గడవకముందే…
సంబురమంతా
కంచికి చేరింది
కొత్తనోట్లు
దారం తెగిన పతంగాల్లా..
రెక్కలొచ్చి
గూడునొదిలిన
విహంగాల్లా…
సంతలనట్టడవిలో
ఎక్కడకో
ఎగిరిపోతున్నాయి
ఎక్కడా.. నిలువలేక
జేబు
బిక్కమొహంతో
బేలగా
అలా చూస్తుండిపోయింది
ఓ జననీ!
ఈ సృష్టికి మూలం నీవే,
ఈ పుట్టుక కి కారణం నీవే,
కర్తవు నీవే,
కర్మవు నీవే,
తొమిది నెలలు మోసి జన్మ ని ఇచ్చే అమ్మ వి నీవే,
చేయిపట్టుకుని నడిపించే తల్లివి
తప్పటడుగులు వేస్తే మంచి దారిలో నడిపించే మార్గం నీవే,
బడి చదువు ల పాఠాలు నేర్పితే
ప్రపంచాన్ని చూపించి జీవిత
పాఠాలను నేర్పించే గురువు వి నీవే,
ఓర్పులో అవని వీ నీవే,
విద్య లో వాణి వీ నీవే,
బాణివీ నీవే …
సహనం లో రుద్రునివి నీవే,
శక్తివీ నీవే
అక్కవీ నీవే ,చెల్లి వీ నీవే,తల్లి వీ నీవే,
బతుకుకో అర్థం చెప్పే చెలివీ నీవే నెచ్చెలి వీ నీవే…
అన్నీ నీవే!
నీవు లేకుంటే సాగుతుందా ఈ ప్రపంచం ,
నీవు లేకుంటే ఉండేదా ఈ సృష్టి
నీవే లేకుంటే ఉండేవా ఈ మనుషులు బంధాలు …
నీవే గా కష్టాల కడలి లో తోడు ఉండి నడిపించే చుక్కాని వి ,
నీవే గా కనులు తెరిచిన తరుణం నుండి కనులు మూసే వరకు
బంధాల కోసం,బాధ్యత ల కోసం, కుటుంబం కోసం,
శ్రమిస్తావు
అనుక్షణం ఆరాటమవుతావు
ప్రపంచం తో పోరాడే యోధురాలివీ అవుతావు!
నీవే గా శత్రువులకి కాళి మాత వి ,
నీవే గా ఆకలికి అన్నమయ్యే అన్నపూర్ణా దేవి వి
నీవే గా చదువు నీ నేర్పంచి చక్కగ చేసే సరస్వతి వి,
నీవే గా ప్రతి ఇంట్లో కొలువై ఉన్న లక్ష్మీ దేవి వి….
కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాతా, రూపేచ లక్ష్మీ
అన్నిటిలో నీవే నట – ఈ సమస్తం నీవేనట
నీవేనట …
నీవే ఈ జనం గుర్తించని స్త్రీ మూర్తి వి!
నీవేగా ఈ లోకం గుర్తించలేని జగజ్జనని వి !!
యేండ్ల పోట్లాటలు
ఎరకలేని ఉన్మాదం
రేకెత్తుతున్నాయి మతజాడలు
ఏది మతం ఏది అభిమతం
ఎంచుకోవాలి మనమే
అన్నిమతాల సారమొక్కటే
మానవత్వమే మనిషితత్త్వం
మతచిచ్చులు మరవనిమచ్చలు
ఆవేశం ఆగ్రహం
అంతానికి సూచికలు
మా ఆలోచన ఆయుధమే కానీ
కాదు వెనుకబాటు
జనం మాకు సామాన్యం కాదు
అదే మా పౌరుషం
మా దేశతలం తలమానికం
కోల్పో నీచూపు
నుదుటిని వెలుగు చెరిపే నీ పైశాచికం
ఉగ్రవాదాన్ని ఉప్పుపాతరేసి
నింగిని తలచేలా నీ ఆయుధాల నిర్వీర్యం
నీకు తెలుసు మా యుక్తి
నీ తెలివి ప్రపంచాన లోకువయ్యింది
ఏదో చెల్లుబాటుకై నీ ప్రయత్నం
మా ధైర్యం
ఆపరేషన్ సింధూర్ గా
నీ నట్టింట్లో అడుగుపెట్టి
నీ ఉగ్రమూక
ఆనవాళ్ళను తొలగించిన తీరును
చూసావు కదా
నారీశక్తి నారీగళం ప్రపంచంముందు
ప్రచండమైంది
ఆసరాకై అగ్రరాజ్యాల పొత్తుచేరి
ఒప్పందం కూర్చుకుంటావు
మళ్లీ నీదైన
కుతంత్రపు బుద్ధితో
దొంగచాటుదాడులకు సైతం దిగుతావు
నీ కుతంత్రాలకివి
చెంపపెట్టు
ఉఫ్ ఉఫ్ అని ఊదితే నీ ఊసే ఉండదు
భారత నారి వీరనారి
ఒక్కో అడుగు వేల ఉదాహరణలు
తస్మాత్త్ జాగ్రత్త!
మానవతకు పట్టిన
చీడ పురుగులను
ఏరవేసి
శాంతి వృక్షానికి నీరు పోసి
జ్వలన శిఖలై ఎగిసిన ధీరలారా!
ధీరులారా!
వందనం.
శిరసాభివందనం.
ప్రాణభీతిని
తరిమికొట్టి
ప్రాణప్రీతిని
వదిలిపెట్టి
మాతృభూమికి
ప్రాణమిచ్చెడి
శూర లారా!
శూరులారా!
వందనం
.శిరసాభివందనం.
రక్తబంధము కన్న ఎన్న
భరతమాత సేవ మిన్న
అన్న మాటనె
హృదిని నిలిపి
సమరమందున
ఎగసి దూకిన
విజయలారా!
విజయులారా!
వందనం.అభివందనం.
బంధు వర్గము
స్నేహ బంధము
మదిని మెదిలిన
మనసు దృఢము చేసి
దేశ సేవకు
కదం తొక్కిన
భారతావని ప్రియ బంధులారా!
భయమన్నదెరుగని
అభయులారా!
వందనం.శిరసాభివందనం.
ధైర్యమన్నది
మదిని నిండగ
పిడుగులాగా
హుంకరించిన
రణ యోధలారా!
సమర యోధులారా!
వందనం
.శిరసాభివందనం
వేదాలు గద్దించాయి
ఇతిహాసాలు ప్రశాంతంగా చెప్పాయి
పురాణాలు ప్రవచించాయి
గ్రంథాలు ఘోషించాయి
వనాలు
మన ప్రాణాలని
శాస్త్రం చెప్పింది
సామాన్యుడూ చెప్పాడు
ప్రకృతి ప్రకోపాలకు
విరుగుడు అడవులేనని
విద్యాభ్యాసంనుండి
వానప్రస్థం వరకు
పశుపాలననుండి
పరిపాలన వరకు
సంస్కృతి చెప్పింది
సాంప్రదాయం నిలబెట్టింది
ప్రజాస్వామ్యంలో
ప్రజాపాలనలో
మాటలు కోటలు దాటుతున్నాయి
చేతలు శాసనాలకే పరిమితమౌతున్నాయి
హరితహారమంటారు
హడావిడి చేసేస్తుంటారు
వేలకోట్ల వాయినాలిస్తారు
వనాలశాతం పెరగలేదంటారు
భూపందేరానికి
భూకామందులమంటారు భూకామాంధులైపోతుంటారు
పచ్చని అడవుల్లో
పశుపక్ష్యాదులు లేవంటారు
బుల్డోజర్లతో
భస్మీపటలం చేస్తుంటారు
అరణ్యాలు
ఆరోగ్య ప్రదాయిణులు
పెరగనివ్వండి
ప్రభుత్వస్థలాలంటూ
ప్రేలాపనలు మానండి
జీవవైవిధ్యాన్ని
అవనిపై మననీయండి
వన ప్రాశస్త్యాన్ని గుర్తించండి
ఘన వారసత్వాన్ని నిలబెట్టండి
