మౌన సంభాషణలెన్నో
మనసు పొరల్లో…
ప్రవహించే గీత నదులెన్నో
అంతరాంతరాళాల్లో…
ఊపిరాడని అవస్థల్లోనూ
మైదానమంత కవిత్వం పుడుతుంది
మూసిన కిటికీలపై
మనసు భాషను అది చిలకరిస్తుంది
చుక్కల జెండాలను పట్టుకుని
చిగురు చిరునామాగా ఊతమౌతుంది
బువ్వలోని మట్టి పరిమళమౌతుంది
జీవితాన్ని వడగట్టిన కన్నీరవుతుంది
అర్థం చెప్పి ఆచరణవుతుంది
గాలికి ఆయువు పోసి
ఆకుపచ్చని పాటవుతుంది
వాస్తవమై గుండెల్లో స్థాపితమౌతుంది
జరామరణాలు జయించి
అజరామరమవుతుంది
నదీ హృదయమవుతుంది
అనుభవాల అగాధలపై
ఆలోచనాలోచనమవుతుంది
జీవన చైతన్యదాయినిగా వికసిస్తుంది
కవితలు
ఎన్నో ఉదయాలు
ప్రాజెక్ట్ డెడ్‌లైన్స్
బ్రేక్‌ఫాస్ట్ బ్రెడ్ స్లైసుల్లో చేరిపోతాయి.
ఎన్నో మధ్యాహ్నాలు
పనిభారంతో కళ్లు
లంచ్ బాక్స్‌ని మరిచిపోతాయి.
ఎన్నో సాయంత్రాలు
నిబద్ధత, విధేయత
కండెన్స్డ్ పాలలా కాఫీ కప్పులో దూరిపోతాయి.
ఎన్నో రాత్రులు
స్క్రీన్ మీద ఎర్రర్స్
ఎర్రని కంటిజీరలా మారిపోతాయి.
మాటల ప్రవాహాన్ని,
చూపుల బేలతనాన్ని
వైఫై తరంగాలు
గిగాబైట్లలో మోసుకు పోతాయి.
అతను అక్కడ వేరే ప్రాజెక్ట్‌లో
ఆమె ఇక్కడ కోడ్ రివ్యూలో
నేరుగా ఇటుక ఇటుక పేర్చి కట్టుకోక పోయినా
వారు ఇన్స్టాల్మెంట్స్ కూర్చి కట్టుకున్న ఫ్లాట్
అందంగా, విశాలంగానే ఉంది
వర్క్ ఫ్రమ్ హోమ్‌కి వీలుగా
ఇద్దరికీ చెరో గది.
బాల్కనీ లోంచి రోజూ
వారిని గమనించే గువ్వల జంట
పుల్ల, పుడక తెచ్చి అల్లుకున్న
గుండె అంత గూటిలో
దగ్గరగా చేరుకుంటూ
ఇంటికి కొత్త అర్థాన్ని తెచ్చే పనిలో
లోకాన్ని మరచిపోతున్నాయి.
చీకటి తెరలుతొలగించుకొని చిరువెలుగులు పరచుకుంటున్నాయి/
వెలుగులు విరజిమ్ముకుంటూవేకువ వెల్లువౌతోంది
తూర్పుకనుమలపొత్తిళ్ళు తొలగించుకొని /
కందగడ్డలాంటిముఖంతో కళ్ళుతెరచి చూస్తున్నాడు భానుడు .
ఉర్వీకాంత ఉద్విఘ్నభరితమౌతుంటే /
కమలబాంధవుడు కనులు విప్పార్చి చూస్తున్నాడు .
సూర్యుని సొగసుచూసి సిగ్గుల మొగ్గైన కమలిని/
కమలముల చాటున దాకున్నదృశ్యం కమనీయంగా ఉంది .
పసుపుగడపలపై పడిపరావర్తనం చెదుతున్న ప్రభాతకిరణాలు /
ముత్యాల ముగ్గులపైపడి మెరసిపోతున్నాయి
కోదండరాముని శిఖరంపై కోవెలగంటలపైపడి
పవిత్రతపొందిన ప్రభాకర కిరణాలు/
శిరస్సులను స్పృశించి శిరోధార్యమౌతున్నాయి …
చరాచర జగత్తునంతాచైతన్యపరచే బాలభానుని బంగరుకిరణాలు భేదభావం లేకుండా/
ప్రసరిస్తూ ప్రమోదాన్ని కలిగిస్తున్నాయి
గుండెలనిండా ఊపిరిపీల్ఛుకొని గూళ్ళనుండి బయిటకొస్తూ
కలసికట్టుగా ఆహారాణ్వేషణకు బయిల్దేరిన పక్షులగుంపులు/
సమైక్యతాత్మక జీవనానికి సజీవసాక్ష్యాలుగా కనిపిస్తున్నాయి.
పచ్చనిపైరులనుండి విచ్చుకుంటున్నవిరులపైనుండి
వీస్తున్న గాలులు ప్రేమగా శరీరాన్ని నిమురుతూ /
ప్రకృతిని కాపాడుకోమని పరోక్షంగా చెప్తున్నాయి .
శ్రమైక జీవన సౌందర్యానికి ప్రతీకలుగా సాగిపోయే
కర్షకులతో కార్మిక శ్రామికులతో కలకలలాడుతూ
సౌందర్యానికి సాకామైన ఆ ఊరు /
ఉత్సాహంగా ఉగాది సంబరాలకు ముస్తాబౌతోంది .
నిండు గర్భిణిలా నూతనోత్సాహంతో ఉన్న ప్రకృతికాంతకు
సీమంతం చేయడానికి సిద్ధమైన వసంతం /
పచ్చనిచెట్ల పసుపు ఎర్రనిచిగుర్ల కుంకుమతో
ఎదను పులకింప జేస్తోంది .
గున్నమామిడి చెట్లగుబురులలో నుండి మావిచిగుర్లు తిని
మత్తెక్కి కూసున్న కోయిల /
కాల మహావిపంచిలోని ఈ శుభకృతు నామ సంవత్సర
తంత్రిని మీటుతూ కుహు కుహురావాలతో
ఈకొత్త సంవత్సరానికి స్వాగతం పల్కు తోంది
ఊర్లో ఉగాది ఉషోదయం ఉత్సాహాన్నినింపుతూ
కనులపండువ చేస్తోంది
ఇట్లాంటిగ్రామాలేకదా!గాంధీజీ కలలుగన్నగ్రామసౌభాగ్యమును
అభివృద్ధి చేస్తాయి అన్నట్లుంది ఊర్లో ఉషోదయం ..
ఆశయాల ముందు ఆకలి గెలిచేస్తోంది
భారమైన బతుకుల మధ్య
ఆనందం కన్నీరు కారుస్తోంది
ఎన్నో వెలుగులేని రాత్రులలో
సన్నని చిరు వెలుగుకై పడే తపన
నిస్సారమైన ఆ గాజుకన్నులకే తెలుస్తుంది.
ఆకాశంలో మెరిసే చుక్కల్ని చూస్తూ
ఓ చుక్కైనా రాలదా సంతోషాన్ని
పెదాల చివర మురిపించటానికని
ఎదురుచూసే మనసుకు తెలుసు
తీరని కోరికని
అయినా ఆశల దారాన్ని అందుకునే
ప్రయత్నాన్ని మాత్రం ఆపకూడదనే
గట్టి నమ్మకమే జీవితాన్ని నడిపిస్తుంది లోకంలో
అంట్లుతోమే చేతులకు అందించే
పలకా బలపం ఖరీదు పెద్దదే
ప్రభుత్వ పథకాల్లో అందే ఉచితాలు
మాత్రం కొందరికే
అదృష్టవశాత్తు అందినా
దురదృష్టం మాత్రం
కన్నవారి కష్టాలకు….అవసరాలకు
తోడుగా వెన్నంటి అణగదొక్కేస్తుంటే
ఆదరించే చేతులకోసం ఎదురు చూపుల్లో
ఎన్ని పసి ప్రాణాలు వడిలిపోతున్నాయో
చేయుతనిచ్చే మానవ దేవతలు
దిగివస్తారని కలలు కంటూ
Dr. సి. ఉదయశ్రీ
మగని మనసుకే గుర్తు
మగువ ముక్కుపుడక
ఆ సిరితో సప్తపదుల నడక
అద్దాల చెక్కిలిలో
అధరాల వంపులో
మెరిసింది నాసిక
ముత్యపు చినుకై మురిపిస్తూ
ముక్కుపుడక
అనాదిగా మన ఆచారమై
సంస్కృతుల విశేషమై
సాంప్రదాయ లావణ్యమై
సౌభాగ్య సంకేతమై
అందాన్ని ఇమిడ్చి
అలంకరణ భూషణంగా
అతివలకు ప్రియం
రూపానికి మెరుగై
ఆకర్షణ ఆభరణమై
ముక్కుకి ముచ్చటగా
ముత్యం కెంపు వజ్రం తో
కొనదేలిన ముక్కుపై ఎరుపై
వయ్యారాలు పోతుంది.
ఆరోగ్య రహస్యమై
అర్థ చంద్రబేసరి
సూర్య నాడీ చంద్ర నాడితో
జీవిత తత్వాన్ని తెలిపే
వేదాంతమై
నాడీ శాస్త్రమై
అతివల సౌందర్యము
మేనమామ ఇచ్చేబహుమతిగా
ముక్కుపుడక ఎంతో ప్రత్యేకం.
వర్చస్సులో తేజస్సు నింపి
ఆకర్షణ అయి ఆకట్టుకునేది.
మగువ ముక్కు పుడక
మగని ఆయుష్ కి ప్రతీక.
‘ప్రళయాక్షరాలు’:
ప్రపంచం నా మాట వినట్లేదని
తాళలేని గొంతుక
దారితప్పిన వలయకాలువలా
ఘీంకరిస్తూ బాష్పీభవిస్తుంది
ఆ ఆవిరి సెగలు
ఉరుముల్లా
కాగితంపై నర్తిస్తుంటే
ఎండుటాకు శబ్దాల క్రోధనినాదాలు
చిగురుటాకు లబ్దాల కరతాళాలు
యుద్ధం.. శత్రువు.. గెలుపు..
అనే అభిప్రాయ వేదికపై
సహనములు
సరిగమలు మూటగట్టి
నీకో రహస్యం దాచిపెట్టా!
నిండు కలల వంతెనపై
కదపలేని వేళ్లతో ఈ ఉదాంతాన్ని రాసింది నేనే
నిన్ను చుట్టు ముట్టి
కదిపే కళ్లతో ఈ వేదాంతాన్ని చదువుతున్నది నేనే..
‘కవిత్వ కరవాలం’:
అక్షరం తప్ప వేరే గత్యంతరం లేదు
భావం తప్ప మరో బాంధవ్యం తెలీదు
గుప్పెడు కవిత్వం రాసుకోడానికి
గుక్కెడు భావం అందులో పోసుకోడానికి
పుస్తకాలెన్నో తిరగడం
మస్తకాలెన్నో వెతకడం
అనువైన వాటిని అరువుతెచ్చుకోడానికి
అన్నీ కలిపి ఆకృతిని ఇచ్చి ప్రాణం పోస్తే
అది కవిత్వమని ప్రకృతి చెప్పింది
బహుశా అదే అనుకుంటా ప్రకృతితో మాట్లాడే తీరు
అంతే అనుకుంటా తనకి తాను పెట్టుకున్న పేరు
గాలిని తాగి తాగి
నీటిలో కాగి కాగి
నిప్పులో మాగి మాగి
మట్టిని తిన్నాక అర్థమైంది
మెరుగులద్దుకొని విధిగా నిలువరిస్తే అవగతమైంది
రగిలే ఆలోచనల్లో కాలితేనే ఆశయాల ఆకాశం అందుతుందని
అప్పుడు నేను మారాను మనిషి నుండి
మహత్తు నిండిన కవిత్వంలా
అప్పుడే నేను మారాను కరుణగుణం నుండి
క్రోదాగ్నితనం నిండిన సిరాపాతంలా
నేను రోజు బడభాగ్నితో మాట్లాడతాను
నేను రోజు శూన్యంతో స్నేహం చేస్తాను
నేను రోజు స్వప్నాలతో కలిసి నడుస్తాను
నేను రోజు మెలుకువతో నిద్రిస్తాను
ప్రశ్నలు లేని సమాధానాల్ని ఛేదిస్తూ
ఒంటి నిండా ఖడ్గగుచ్ఛాలతో రోజూ ఉదయిస్తాను..
కర్మాకర్మల కర్మాగారాల పొగ పీలుస్తూ
గాయపడిన కాయంలా జాలిగా హీనంగా నీరసిస్తాను..
ఎండ వానల సమాంతర స్థితిలో జనించిన ఇంద్రధనుస్సులా హాయిగా అద్భుతంగా నవ్వుతాను..
హృదయ ప్రాకారాల ఆవిర్లను ఒడిసిపట్టి
దాహాన్ని తడుముకుంటూ
నిషా నిండిన వాక్యాలతో జీర్ణ కుడ్యాల
ఆకలిని కరుచుకుంటూ
నాటి ప్రణవ శబ్ద మూలం బోధించే
నేటి ప్రయాణ ప్రారబ్దం తెలుసుకుంటూ
అష్టదిక్కుల్లో తిష్టవేసిన అస్థిత్వాన్ని
అర్ధాంతర విన్యాసాల అగోచరత్వాన్ని
అనువుగా సృష్టించుకున్న జ్ఞాన స్థిరత్వాన్ని
కాగితాలపై కారుస్తున్నా కాలాన్ని వల్లె వేస్తూ…
ఖగోళాన్ని ఓ కంట కనిపెడుతున్నా
ఒంటి చేత్తో కవనాలను పూయిస్తూ.
ఇలా అడుక్కు తిని బతకడానికి
సిగ్గుగా లేదూ?
నేనెందుకు సిగ్గు పడాలి తండ్రీ?
నన్ను అడుక్కు తినేలా చేసిన
ఈ దేశం సిగ్గు పడాలి!
బాగానే ఉన్నావుగా,
ఏదన్నా పని చేసుకు బతకరాదూ?
నా కష్టాన్ని దోచుకొని
నా నెత్తురు తాగుతున్న
ఈ వ్యవస్థను నువ్వు
బాగుచేస్తానంటే…
అలాగే సామీ,
పని చేసుకునే బతుకుతాను
ఏం, పిడికిలి బిగించి తిరగబడొచ్చుగా?
సర్కారోడు నన్ను సెల్‌లోకి తోసి
కుళ్ళబొడవకుండా
నువ్వు కాపాడతానంటే బాబయ్యా!
తప్పకుండా తిరగబడతాను
సమస్య అందరిదీ కదా,
నువ్వొక్కడివే యెందుకు,
అందరూ కలిసి సంఘటితంగా తిరగబడొచ్చుగా?
అయ్యో , యిది కూడా తెలీదా నాయినా!?
మేం కప్పలం ,
ఎటు పడితే అటు
ఎలా పడితే అలా గెంతుతాం!
మమ్మల్ని కలపాలని చూట్టం
కంఠశోష , వృధా ప్రయాస!
ఆ సంగతి ఆ యేలినోళ్ళకి కూడా తెలుసు
అందుకే ఐదేళ్ళకొక సారి
మాకింత ముష్టెయ్యడమే కాక,
ఏడాదికి పదేసి వేలు
మా ఖాతాలో ఏసేస్తారు.
అలా నోరెల్లబెట్టి సూస్తావేటి సారూ!?
ఒక ఐదో పదో ముష్టెయ్యు!
అమ్మానాన్నల
చెమట చుక్కల కష్టం
వారి రక్త మాంసాల
సారం నా రూపం
కన్న కలల ఫలితం
ఈ దేహం
కష్టములు ఎన్నో దాటి
కడుపు తీపి తోటి ఊహల వులితో తన బిడ్డ రూపం
ఊహించుకుని చక్కని శిల్పం చెక్కుకుంటూ
కనులు మూసుకుని
కొన్ని కలలు
కన్నులు తెరిచి మరికొన్ని కలలు అన్ని ఇన్ని
కావు కన్న కలలన్నీ
లెక్క తేలని
చుక్కల లెక్కల
ఊపిరి బిగబట్టి
పురిటి నొప్పులు ఎన్నో
భరించి
ప్రసవ వేదనను అనుభవించి నన్ను ప్రసవించి
దేహం లేని ఆత్మ ఉన్నట్టు రూపంలేని
పదార్థం ఉన్నట్టు
రూపానికి రాని ఆకారాన్ని ఆశతో ఆశయంతో
శంశయం వీడి సకల ప్రయత్నములు చేస్తూ పరాయిండ్ల మాటల బాణాలకు
గాయం కానీ చోటు లేదు దేహంలో
రాగం కానీ బాధల నాదం లేదు
ఇల్లు ఇల్లు తిరిగే
పిల్లి నై ఇహలోకమంతా
నా ఇల్లు అనుకుని
ఇండ్లు
ఎన్ని తిరిగిన
ఇల్లు ఒకటి కచ్చితంగా కావాలని
కాలాన్ని విశ్వసించి కదులుతున్న
కలిసి వచ్చినది
ఒక అవకాశం
ఏదో ఒక లోపం లేకపోతే మరేదో రూపం
రానే రాదు కదా
మాట ఒకటి దూసుకొచ్చి మస్తీస్కాన్ని తాకింది మనసున్న పడ్డ మాట
మదిని మదించి
పాలసంద్రం చిలికిన
సురలు దానవుల వలె చిలికినట్టు
ఒక రూపం కోసం
పలు దిక్కుల పైనుంచి క్షయణించ
సుఖనిద్ర సుకలలకై
సమతల గుండె లయలకై
మట్టి ఇటుకల
కలయిక
కంకర
ఇసుక సిమెంటుల
కలబోత పుట్టింగులై
బీములై పిల్లర్ లై స్లాబై ఇటుకలై మేస్త్రీ రెక్కలై కార్మికుల
చెమట చుక్కల
తడికి తడిసి
అల్లుకొని గోడలై
పలువురు చేతుల సహకారమై మనుషులు జీవించే నీడై
పద పద మంటూ
పసిడి కలలు నిజమై
సుదూర సుసప్నం నిజమై కవిత నిలయమై
నా దేహమే ఇప్పుడు
ఒక ఇల్లు.
సమ దూరం పాటించే
కలువని పట్టాల మీది ప్రయాణం!!
ఒక దాని వెనుక ఒకటి
క్రమశిక్షణతో కదిలే బోగీలు!
కచేరీలు ఎక్కని సంగీతం
తాళం తప్పని చిరుతల శబ్ధం!
పావలా పల్లీలు
పదిరూపాయలకు అమ్మే
వ్యాపార నైపుణ్యం!
పసితనాన్ని పల్లెతనాన్ని గుర్తుచేసే
ఎప్పుడో తిన్న, ఎపుడూ తినాలనిపించే
నిమ్మపులుసు పిప్పరమెంటు!
టికెట్ తనిఖీ అధికారిని చూసి
బాతురూముల్లో దాక్కునే
టికెట్ లేని ప్రయాణికులు!!
ఉప్పు కారం పెట్టిన
మామిడి కాయ ముక్కలు
ఉపకారం చేస్తున్నట్లు
పక్కవారితో పంచుకోవడాలు!
శీతల పానీయాలు అమ్మేవాడు
వాడెనుకే వేడి వేడి మిర్చీ అంటూ
పొట్లం చుట్టి చేతిలో పెట్టేవాడు!
కిటికీనుండి చూస్తే
వెనక్కి పరుగెత్తుతున్నట్లు
పంటపొలాలు, పచ్చని చెట్లు!
దూరమెంతయినా
భారమనిపించని ప్రయాణం!
అద్దములో చూసుకుంటున్న
మన జీవన ప్రయాణం!!
మీ శ్రేయోభిలాషి
జగ్గయ్య.జి
9849525802
jagan.gunda @yahoo.com
పౌల్ట్రీఫారంలోని ఆ కోళ్లను చూడు
ఎంత ఆనందంగా వున్నాయ్
ఎంత ఆనాలోచతంగా వున్నాయ్
కరిగే ప్రతీక్షణం కలుసుకుంటూ
జరిగే ప్రతీనిమిషం కబుర్లాడుకుంటూ
దేనికోసం వీక్షించక
దేనికోసం నిరీక్షించక
డబ్బాలోని గింజల్ని తింటూ
డ్రమ్ములోని నీళ్లు త్రాగుతూ
బతకడానికి రోజూ చస్తున్న మనిషి కన్న
చావడానికి బతుకుతున్న ఆ కోళ్లే మేలు