సూర్యుని మించిన చిత్రకారుడు
ఎవరైనా ఉన్నారా !
కనిపించిన ప్రతిదానికీ
రంగుల భంగులు దిద్దీ దిద్దీ
చివరికి తానే
రంగుల్లో మునిగి పోతాడు
రోజురోజూ !
కవితలు
భావాలు ఆవహిస్తే చాలు !
అక్షరాలు నీటి బిందువులై
అక్షరాలు పదబంధువులై
పదాలు వాక్యపథ రసాస్పదలై
వాక్యాలు వాంఛితార్థప్రదాలై
*_కవిత్వం_* రూపుగడుతుంది.
ధరించే సంఘటనల’దుస్తులను
మనఃకాసారంలో చక్కగా ఉతుక్కొని
తేట విమర్శనలో ఝాడించుకొని శ్రద్ధగా శుభ్రపరచుకొని పిండుకొని
గౌరవ’భద్రంగా నీరెండకు ఆరవేసుకొని
జాగ్రత్తగా తీసుకొని తొడుక్కుంటూ
పై కండువా సవరించుకుంటూ
అక్షర వీథుల్లో మందహాస వదనంతో
గంభీరంగా కవిగా’నడవటం ఎంత గొప్ప !!
( “కవి కావటమే గొప్పసంఘటన” ౼ సినారె__నా ‘అక్షర పతాక’ కవితా సంపుటిని అంకితంగా స్వీకరిస్తూ ఆవిష్కరణ సభ లో సినారె గారు పలికిన మాటలు గుర్తుకు వచ్చి ..)
మనిషి ఎదురుపడితే
పులి ఎదురుపడ్డట్టే
ఆత్మీయ ఆలింగనాలు
సోదర కరచాలనాలు కాదు
‘ఆత్మకు శాంతి కలుగుగాక ‘
సానుభూతుల వెల్లువ –
కడప దాటితే
అమావాస్య అడవిలో ఆగమయినట్టే
ఏ ముట్టడి నుండి
ఏ స్ట్రైన్ కమ్ముకుంటుందో (స్ట్రెయిన్)
భయపడినట్టే ఇల్లు ఇల్లంత వేడెక్కి
ఎవరికి వారు ఒంటరై
అంబులెన్సుల్లో ఆసుపత్రుల్లో
వింత వింత శబ్దాల మధ్య
నల్ల బజార్లో, ప్రార్థనా స్థలాల్లో
ప్రాధేయపు చూపుల ఆశల మిధ్య –
చివరికి శ్వాసకూ శ్వాసకూ మధ్య
ఊపిరాడని పెనుగులాట
చావుకీ బతుక్కీ మధ్య
సమయం దోబూచులాడుతుంది
అది విముక్తో
ఈ నేలను విడిచి పోతున్న విషాదమో –
జీవితమంతా ‘క్యూ’ ల్లో నిలబడీ నిలబడీ
చితి మంటల సాక్షిగా
చివరి యాత్ర ‘క్యూ’ల్లో చిక్కుకుంది
ఇప్పుడు ఏ ఓదార్పులు లేవు
ఓటికుండలు లేవు
ప్రభుత్వాలకు మనం ఒక అంకె మాత్రమే
ఇంతకూ మన ఊపిరితిత్తుల మీద
మృత్యు సంతకం చేస్తున్నది ఎవరు !?
అంతిమ సంస్కారాలకు అడ్డు పడుతున్నది ఎవరు !??
బరిగీసి యుద్ధం చెయ్యు ఇంకో సారి
చైతన్యం నీ ఇంటి పేరు కదా
చుట్టు పక్కల
పది ఊళ్లకు నీవే పెద్ద దిక్కు
గడప గడప లో
సరస్వతి కొలువు దీరిన నెలవు కదా
ఎర్రని నీ నుదుటి బొట్టు తో
నిత్య ప్రకాశినివి కదా
నీ వెలుగు పడమటి కొండలకు
వాలుతుంటే
ఈ కళ్ళు చూడలేవు తల్లీ
ధీమంతులకు
శ్రీమంతులకు నీవు ఇష్టసఖివి కదా
స్నిగ్ద ,స్వచ్ఛ కిరీటం తో
ధగ, ధగా మెరిసిపోతుంటే
అమ్మ వారిని చూసినట్టే ఉండేది
స్వర్గం లో దేవతలు నిన్ను చూసి
పూల వర్షం కురిపించారే
ఈరోజు వాడిన పువ్వులా
నీవు కనిపిస్తే హృదయం
విల ,విల లాడుతున్న కొమ్మలా ఉన్నది
అందరూ నిన్ను
వేలెత్తి చూపిస్తుంటే
ఆదిత్య హృదయం
అల్లాడుతుంది.
సూర్యుణ్ణి చుట్టూ భూమి
తిరుగు తున్నట్టు
పొద్దు పొడవక ముందే
నీ చుట్టు జన సందోహం తో
పక్షులు వాలే మహా వృక్షం లా
భాసిల్లే దానివి
నేడు బారెడు పొద్దెక్కినా
నిన్ను చూడాలంటేనే
లక్ష సందేహాలు
ఎన్నెన్ని పోరాటాలలో
పదును తేలావో
ఇప్పుడు కనిపించని
క్రిమి ముందు తేలి పోయావు
ఎత్తిన పోరు కొడవలి
పదునేమాయే
ధాన్యలక్ష్మీ రాకతో
పూర్ణకుంభంలా ఉండే దానివి
ఇంతటి ఖాళీ తనాన్ని చూసి
మనసు కకావికలం అవుతున్నది
రాశులు పోసిన కూరగాయలు
రత్నపు రాశులు
ఆకు పచ్చని
కూరలతో పచ్చని
పట్టు చీర కట్టినట్టు కనిపించే దానివి
నేడు కనిపించని క్రిమికి కంపించి పోతున్నవా
మాతా
బజార్లన్నీ జనం లేక
బోసి పోయిన మెడ లాగున్నది
నీళ్లు లేని బావిలాగున్నది
ఏ ఊరు మీదంటే
పది ఊళ్ళ వాళ్ళు కూడా
కాసింత పొగరుగా
మాది పేట అనేవారే
ఇపుడు ఏ పెదాలు కూడా
నీ పేరు పలకవు
మీసాలు మెలేసే రొయ్యల
వీధేక్కడ
బొమ్మడి మచ్చీ బుట్టలెక్కడ
బొడ్రాయి బజారు
బట్టల బజారు జాడెక్కడ
మిరపకాయల ఘాటు
కొత్త మామిడి పులుపు లెటు పోయే
భజన మందిరంలో పాట
బ్రోచేవారెవురా పాట గుండెను
పిండుతుంది
భానుపురి నీ బాధను చూసి
బావురుమంటుున్నది మనసు
నా ప్రేమ పురి
నీ వాడి కిరణాల
కరవాలంతో
క్రిమిని వేటాడు
ముప్పేట ముంచేస్తున్న
మహమ్మారిని మట్టు బెట్టు
సూర్యగ్రహణం
ఎంతోకాలం ఉండదు
కారుమబ్బుల్ని చీల్చుకుంటూ
ప్రకాశించవే పేట
బస్తీ మే సవాల్ అని
బరిగీసి యుద్ధం చెయ్యవా
ఇంకో సారి
పుట్టినపుడు పురుడు
పెరుగుతాడు ఈ చందురుడు
చిన్నతనాన నాన్నను చూస్తూ ఎదుగు
బాల్య యౌవనాల దరువు
తరగుదలలేని వెలుగుల సూరీడు
పెరిగి అవుతాడు పౌరుడు
పెరుగుతుంటే బెదరడు
చదువు తనకు అవదు బరువు
ఉద్యోగం తనదైన ఆదరువు
జోడు కోసం వెతుకు యువకుడు
పెళ్లికి సిద్ధమయ్యే వరుడు
పెళ్లికి ముందు పొగరు
పెళ్లి అయినాక తగ్గును వగరు
పెళ్లికి ముందు సోమరుడు
పెళ్ళయినాక పామరుడు.
సంసార యుద్ధానికి సిద్ధమయే వీరుడు
నిత్యపోరాటాల యోధుడు
అలసినా విడువని శ్రామికుడు
చివరకు గెలిచే విజయుడు…
మనసెందుకోఒక్కోసారి స్విచ్ ఆఫ్ అవుతుంది
ఎడదలో సంతోషానికి సడెన్ గా లాక్ పడుతుంది
మెదడులో ఎందుకో మెర్క్యూరీ మెరుపు బ్లాక్ అవుతుంది
మనిషికెందుకో ఓసారోసారి ఉషారుతనం ఎస్.ఎమ్.ఎస్ అందదు
దయాగుణం ఓటిపి రానేరాదు
మమతల అలకబూనినందుకా
కోరుకున్నది నెరవేరనందుకా
ఆశించింది అందనందుకా
చెలిమియో చెలియో చేరువకానందుకా
ఎందుకో ఏమో తెలియదు మనిషికి
ఎదురుగా కుదురుగా మూడుబార్ల సిగ్నలున్నా
ఎదుటి మనిషితో మాట్లాడ మూడు ఉండడెందుకో
మనిషి ఓన్లీ ఇన్ కమింగ్ సిమ్ గా బహశా అయ్యాడా
డబుల్ సిమ్మ్లున్నా కొమ్మమీది ఒంటరి గుబుల్ పిట్ట అయ్యాడా
అరవైనాలుగు కళల బ్యాటరీ రీచార్జ్ అలాగే వున్నా
దేవులపల్లి భావకవితగా 4Gసెల్ దేహమై వున్నా
ఆలోచనల ఆప్షన్ లు ఎరకవున్నా
అరిషడ్వర్గాల ఐకాన్ లు ఎదుటనున్నా
గూగుల్ లాంటి గురువు 24×7గంటలు వెంటవున్నా
మెలోడి కోకిలా ఫేవరేట్ సాంగ్ వినిపించవున్నా
ఇష్టమైనపాట రింగ్ టోన్ గా మోగనున్నా
అనంతమైన ధీర్ఘదృష్టిలాంటి కాంటాక్టులిస్ట్ సేవ్డై వున్నా
ఒక్కోసారి మనిషి కాల్ రాంగ్ నంబరవుతుంది…
టచ్ స్క్రీన్ కీ ప్యాడ్ పాడై డల్ మబ్బులుకమ్మిన అంబరమవుతున్నాడు
జీవితంలో ఆనందక్షణాలకు సైతం మిస్ అవుతున్నాడు
నెట్వర్క్ వున్నా నేనై నెర్వెసై మిస్ కాల్ అవుతున్నాడు
ఇన్ కమింగ్ అవుట్ గోయింగ్ లు వున్నా ఇదైపోతున్నాడు ఎందుకో మనిషి
అయినవాళ్ల అనురాగానికి లిఫ్ట్ అవటంలేదు
బంధాలను ఇన్ టైంలో రీఛార్జ్ చేయడంలేదు
ప్రేమల ప్లాన్ గడువు గుర్తుండటంలేదు
ఎందుకో ఏమో
మనిషి అదో మాదరైపోతున్నాడు
కలికికష్టాలు కన్ఫాం ఐ వున్నాడు
ఈ లోకంలో
అయితేనేం
నిలబడ్డ నగం
ఎగసిపడే తరంగం
ఎగిరిపోయే విహంగం
ఉదయించే సూర్యబింబం
తెరిచిన బతుకు పుస్తకం
అనుభావాల మస్తకం
కనిపించి కదలిస్తుంది
అలసిన మనిషిలో
ఆగిన మమతను
మట్టి తత్వాన్ని
మానవత్వాన్ని
మరలా ప్రవహింపజేస్తుంది.
జడలు విప్పెనుకదా జగతిపై విషక్రిమి
విస్ఫులింగం విసరి యూపిరి తీయ
శ్వాసకోశములపై పాశసర్పము చుట్టి
మహిషవాహనుడల్లె మహిని విజృంభించె
ముళ్ళ నాలిక జాపి మెల్లగా మనుజులను
కాలగర్భములోకి కలుపుతూపోతోంది
ప్రాణవాయువు నాపి ప్రాణముల హరియిస్తు
పసిడి తరువులలోటు పరిహసించుతు చెప్పె
ముక్కు మూతుల రెండు మూసి మాస్కుల తొడుగు
కరములను గడిగడికి కడిగి లేపనమద్దు
కళ్ళనూ, ముక్కునూ కలియతిప్పకు నెపుడు
కాచుకొని కూచుండె కరోనా వాటిలో
ఆరునడుగుల దూరమవలంబనము చేసి
విషవాయు వలయమును విరిగేట్లుజేయాలి
భద్రతలు పాటించ పారిపోవును క్రిమి
మన బతుకు కలదిపుడు మన చేతనే సుమి
సద్గురువే దైవసమానం
ఓంకారనాద బీజాక్షర రూపం
అతని వాక్కే
కాలగమన ప్రబోధం
చీకటిని చీల్చేటి జ్ఞానదీపం
బ్రతుకుబాటకు గీతోపదేశం
కలల సాకారపు కర్తవ్యగీతం.
//సద్గురువే//
వ్యాస సాందీప సప్తఋషి మునిజనులు
బుద్ధ రాఘవేంద్ర సాయిబాబాలు
నిదురించే పెదవులకు కీర్తనలయ్యారు
శంకరాచార్య వివేకానంద రవీంద్రనాథాదులు
సత్యశోధక భక్తియోగ ప్రాణమయ్యారు
సద్గురువులే
నవజీవన రాగపు ఆరాధనా గీతికలయ్యారు
కర్మఫలాన్ని ప్రక్షాళనచేయు సహజదేవుళ్లయినారు.
//సద్గురువే//
అక్షరాల నీడలలో కనిపించేదే గురు మంగళరూపం
కంటిపాప తానై చేర్చుకునే సహజ లక్ష్యం
అమావాస్య నిశిలోనూ
గురువే పౌర్ణమి తేజం
నడతలలోనూ నడకలలోనూ
సద్గురువే మనకు ఆదర్శం
తస్మై శ్రీ గురవే నమః