కవితలు
కాపుకు వచ్చెనంచును పికమ్ములు కమ్మగ కూయుచుండగా
మాపున మల్లెపువ్వులకు మాటున మన్మథు డాడుచుండగా
తీపివసంతమై ప్రకృతి దిక్కుల చక్కిలి వెట్టె లక్ష్మణా!
ఆకాశంబను తండ్రి కోపమున యంగారంబు చిందించె, భూ
లోకంబంతయు గుండె వ్రయ్యలయికల్లోలమ్ముతోనుండ, చీ
కాకుంబొందెను జీవసంతతులకున్ కాయంబులున్ వాడగా
యీ కాలమ్మిది గ్రీష్మతాపమయి మండించెగా లక్ష్మణా!
ఆకసమందు మేఘముల యాత్ర, మయూరి విలాసగాత్ర, నీ
రాకర పాత్రయై వసుధ, ప్రాణవికాసమనోహరుల్ తరుల్
భేకములెల్ల వేదమంత్రముల ప్రీతిపఠించెడు విప్రవర్యులై
ఆకలి దీర్చువర్షమని హాలికు సీరము సాగె లక్ష్మణా!
వాహినులెల్ల తేటపడె వారిదముల్ మటుమాయమై చనెన్
కాహళమూదెగాలి, బతుకమ్మలు గౌరిసరస్వతీ సిరుల్
గేహినులాడిపాడి వెలిగించిన పున్నమి దీపమట్లు, స
మ్మోహనమై శరత్తు జగముల్లము పొంగగ వచ్చె లక్ష్మణా!
పగలా! తగ్గెను, ప్రేమదంపతులకున్ బంధమ్ము లౌరాత్రులా
మిగులున్ దీర్ఘములయ్యె, మంచుముసుగై మేల్దుప్పటుల్ గప్పగా
రగిలెన్ మంటలు వేడిగాచుకొనగా ప్రాభాతముల్ గ్రాలగా
యిగ మంచుంజనులెల్లరున్ వణకగా హేమంతమై లక్ష్మణా!
పచ్చని కోక పాతబడి పండిన యాకులవోలె జారగా
చచ్చినవారికై వడిని సాముదిగంబరలై విశీర్ణలై
పిచ్చుకలైన కానక తపించెను చెట్లు చేమలున్
వచ్చె విరాగమౌ శిశిర వాసరముల్ పరికించ లక్ష్మణా!
పచ్చ కిరీటమున్ పసిడి పచ్చ శరీరముదాల్చి యెప్పుడున్
స్వచ్ఛ పరీమళమ్ములతో శాంత విలాసమయూఖ మాలికా
గుచ్ఛపు వెల్గలన్ పరిచి కూడుట వీడుట జీవసారమన్
ముచ్చట దెల్పు నీ ప్రకృతి మోదము విప్లవమౌచు రావలెన్
*అమండా గోర్మన్*
స్వేచ్ఛానువాదం *డా౹౹ ఎన్. గోపి*
రానే వచ్చిందా రోజు
మనలోకి మనం
ప్రశ్నల్ని సంధించుకునే రోజు.
అంతులేని తిమిరావరణంలో
వెలుగురేఖలను అందిపుచ్చుకునే రోజు.
అవును
ఇప్పటి దాకా వాటిల్లిన
నష్టాన్ని మోసుకుంటూ
ఒక సముద్రాన్ని దాటడానికి
సంకల్పం చెప్పుకునే రోజు.
ఇప్పుడే మనం ధైర్యంగా
ఒక మృగం పొట్టను పగులగొట్టాం.
అన్ని వేళలా
నిశ్శబ్దాన్ని నిర్విరామ శాంతిగా
భ్రమించరాదని గ్రహించాం.
న్యాయంలోని సంప్రదాయం గురించీ
ధృక్పథంలోని బలాన్ని తెలుసుకున్నాం.
అవి కేవలం మంచులా
కరిగేవి కావని తెలుసుకున్నాం.
ఐనా తెలుసుకునే లోపల్నే
ఉదయం మన సొంతమయ్యింది.
చీకటిని అధిగమించి
కాంతి తీరాన్ని సాధించాం.
ముక్కలు కాకుండా
దేశాన్ని కాపాడుకున్నాం.
కాని ఇది సంపూర్ణం కాదు.
దేశకాలాలకు
వారసులమైన మనం
ఓ నల్లపిల్ల
బానిసల నుంచి వచ్చిన
ఓ ఒంటరి తల్లి నోములపంట
అధ్యక్షురాలయ్యే కలలు కనొచ్చని గ్రహించాం.
మనం నాజూగ్గా లేకపోవచ్చు
శుభ్రంగా కనపడక పోవచ్చు
కాని మనం శ్రమించి దక్కించుకున్న
ఐక్యతకు ఓ లక్ష్యం వుంది,
విస్తృత ప్రయోజనం వుంది.
సకల వర్ణాల సమ్మేళనంతో
ఒకే జాతిని ఆవిష్కరిస్తున్నాం
అసమానతల కొలబద్దలను
కలిసి తొలగించుకుందాం.
అన్ని సంస్కృతులకూ
అందమైన వేదిక నిర్మిద్దాం.
విభజన బీటలను అతికిద్దాం,
విభేదాలు పక్కన పెడదాం
ఆయుధాలు త్యజించి
భుజం భుజం కలిపి పనిచేద్దాం.
ఇదే సత్యమని
జగం నిండా చాటుదాం
ఎన్నో దుఃఖాలు సహించి
ఇంత దూరం ఎదిగాం
గాయపడ్డా
ఆత్మస్థైర్యాన్ని ఎగరేస్తున్నాం.
అలిసినా సొలిసినా
సమిష్టి ప్రయత్నాన్ని ఆపలేదు
గెలిచాం కూడా.
ఇప్పుడిక మరోసారి
వేర్పాటును నాటొద్దు మనం.
మేడి చెట్టుకింద కూర్చొని
ఆనందించే క్షణాలుంటాయని
బైబిల్ ఎప్పుడో
భవిష్యద్దర్శనం చేసింది.
సమకాలంలో జీవించే వారికే విజయం
అది తృణప్రాయుల
పదఘట్టనల కింద అణిగిపోదు.
మనం కట్టే పలు వంతెనలు
కొత్త దారులకు వాగ్దానం చేస్తున్నాయి.
అవును! మనం మొక్కవోని సాహసంతో
శైలారోహణ చెయ్యక తప్పదు.
అమెరికన్ కావటమే మన ఆదర్శం
విఘాతమిప్పుడు గతం
మరమ్మత్తులకు నడుంబిగిద్దాం.
విచ్ఛిన్నశక్తులు తోకముడిచాయి
ప్రజాస్వామ్యం ఆలస్యమైనా
విషం కాకుండా చూశాం.
ఇది సత్యం
ఇది మన నమ్మకం
రేపటి పైనే మన చూపు
చరిత్ర కళ్లన్నీ మన వైపు
ఇదొక న్యాయ శకం.
మన శక్తి ఏమిటో తెలిసొచ్చింది.
కొత్త అధ్యాయాన్ని రచిద్దాం.
అనుకోని ప్రమాదం
ప్రమోదంగా ముగిసింది.
దేశం గాయపడినా
తిరోగమనం లేదు మనకు
ప్రేమా స్వేచ్ఛా తీవ్రతల నుంచి
పక్కకు వైదొలగం మనం.
భయపెడితే లొంగుతామా
ఉదాసీనత నిన్నటి కథ
కరుణా శక్తీ కలిసిన వెత మనది.
ప్రేమ మన ప్రస్తుత పథం
మార్పు మన పిల్లల జన్మహక్కు
దాని కోసం మంచి దేశాన్ని నిర్మిద్దాం.
ఉక్కులాంటి నా వక్షస్థలంలో
కదలాడే శ్వాసలోంచి
గాయపడిన దేశాన్ని పైకి లేపుదాం.
బంగారు కాంతుల
పశ్చిమ పర్వతాల్లోంచి లేద్దాం
మన పూర్వులు విప్లవాన్ని కలగన్న
సుడిగాడ్పుల వాయవ్య దిశ నుంచి లేద్దాం
మధ్య ప్రాచ్యంలోని సరస్సుల
అంచున మొలిచిన నగరాల్లోంచి లేద్దాం
దక్షిణప్రాంత సూర్యతాపంలోంచి లేద్దాం
శిథిలాలను మళ్ళీ కడదాం
కుదుట పడి ఎదుట పడదాం.
మూల మూలల్లోంచి
విభిన్న సంస్కృతుల్లోంచి
అతి సుందర దేశం ఆవిర్భవిస్తుంది
దెబ్బతిన్నదే కావచ్చు, అబ్బో! అందమైంది
రానే వచ్చిందా రోజు
చీకట్లోంచి బయటపడదాం
జ్వలిద్దాం
నిర్భయంగా చలిద్దాం
రోచిస్సులకు ముగింపు వుండదు
సాహసం కావాలి మనకు
మనమే సాహసం కావాలిప్పుడు.
[జనవరి 20న అమెరికా అధ్యక్షుని ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ఓ నల్ల యువతి (22) ‘The Hill We Climb’ అంటూ రాసి, చదివిన కవిత] *
నేను చిగుళ్ళను ప్రేమించాను
అవి పూలవుతాయనుకోలేదు
నేను వెలుగులను ప్రేమించాను
అవి తిమిరాన్ని తరిమికొడుతాయనుకోలేదు
నేను విత్తనాన్ని ప్రేమించాను
అది మహావృక్షమవుతుందనుకోలేదు
నేటి నీటి బొట్టును ప్రేమించాను
అది నీరధి అవుతుందనుకోలేదు
నేను మట్టిని ప్రేమించాను
అది బంగారమవుతుందనుకోలేదు
నేను దారాన్ని ప్రేమించాను
అది వ్రస్తంగా అవతరిస్తుందనుకోలేదు
నేను అమ్మను ప్రేమించాను
ఆమె అమృతమవుతుందనుకోలేదు
నేను గురువును ప్రేమించాను
ఆయన ఆకాశమంత ఎత్తనుకోలేదు
నేను అక్షరాన్ని ప్రేమించాను
అది ఓంకారమవుతుందనుకోలేదు
నేను ఉపనిషత్తును ప్రేమించాను
అది నన్ను మనిషిని తయారుచేస్తుందనుకోలేదు.
పాలనాధిపతులకు నిప్పుల దుఃఖం తెలియదు
ఆకుపచ్చని పురుగులు మేపటానికే
ఈ వినాశకర శాసనాల్ని తెచ్చింది
కార్పోరేటు పుష్పగుచ్ఛాల వెనుక దాక్కున్న తర్వాత
సొల్లు దుఃఖం కురిపించటమెందుకు
కంటనీరెట్టు కోవడమెందుకు
సేద్యభక్తుల్లా ఆ భజనలెందుకు
మీ రాజకీయ ఖడ్గ విద్యంతా
కుబుసం విడిచిన వ్యాపార సర్పాలకే కట్టబెడుతున్నపుడు
ఆకుపచ్చ పురుగుల్ని హతమార్చలేరిక –
శాసన హాలాహలాన్ని నిమ్మరసంలో కలిపి
హాలిక శ్రమను హతమారుస్తారెందుకు
అయ్యా!
దేవుని మెడలోని పూలదండలు సైతం
మా రెక్కల కష్టంలోంచే పరిమళిస్తున్నవి
సేద్యభూమి మాదే
సేద్యం చేసే చేతులూ మావె
గీతమీద ప్రమాణం చేసే చెబుతున్నాం
కాలం కడుపులో శ్రమిస్తున్న నిష్కామ కర్షకులం మేమే!
ఖనిజ సంపద పేర
ఆదివాసులను అంగట్లోకి లాగింది చాలదా!
మా మీద పడి పీల్చి పిప్పి చేస్తారెందుకు
నమ్మూ నమ్మకపో
మేం సాయుధ రైతాంగ పోరాట వారసులమే!
ఇప్పుడు అనుభవిస్తున్న నరకం చాలు కొత్తనరకాల్లోకి తోయకండి.
పాలక పురుగుల్ని సైతం రైతు రణం మట్టి కరిపించగలదు
మద్దతు ధరకు మహాద్వారాలు తెరవగలదు
అందరిలా ఆమె ఇంజనీరైనా బాగుండేది !
లాబ్ టాబ్ పట్టుకొని ఇంట్లోనే కూర్చునేది
అందరిలా ఆమె టీచరైనా బాగుండేది !
ఇంట్లోనే ఆన్ లైన్ లో పాఠాలైనా చెబుతుండేది
తెల్లకోటేసుకొని ‘వెళ్ళొస్తా అమ్మా’ అంటూ
తల్లి దీవెనలు పొందుతూ
రోజూ మృత్యుకౌగిలిలోకి వెళ్లొస్తున్న డాక్టరైయ్యింది !
ఇంటినుండి ఆసుపత్రికి వెళ్తున్న సమయంలో
చుట్టు పక్కలవాళ్ళు
అనుమానంగా భయం భయంగా చూడటం
తల్లివదనం విచారమేఘం కమ్ముకునేది !
గుసగుసలు పెట్టుకున్నది చూసి అవమానపడేది !
మొన్నటిదాకా అందరూ మెచ్చుకున్నోళ్ళే
నిన్నటి నుండి ఈసడించుకోవటం చూసింది
డాక్టర్ మాత్రం
యుద్ధరంగంలోకి బయల్దేరినట్టు
విజయమో వీరస్వర్గమో
అది ఆమె యుద్ధనినాదమా అన్నట్టు
చావో గెలుపో ఇది కరోనా మీద డాక్టర్ ఆన –
ఎదురుగా కరోనా కత్తులు దూస్తున్న దృశ్యాల్నీ
కంఠాలను తెగ నరుకుతున్న కదనరంగాన్ని చూస్తూనే
శత్రువును ఎదుర్కోవటంలో వ్యూహ రచన చేస్తుంది
శత్రువు బలవంతుడైనప్పుడు
ఎదురుగా వెళ్లి చిక్కుకు పోవటమో
లొంగిపోవటమో కాదు
ఉపాయంతో చిట్కా టాబ్ లెట్లతో
శత్రువు చేతిలో చిక్కకుండా తప్పించుకుంటూ
పాజిటివ్ ను నెగటివ్ చేసే ప్రయత్నంలో డాక్టర్ –
రణరంగంలో దిగినాక వీరుడేంచేస్తాడు
ధైర్యమే సహనంగా ముందుకెళ్తాడు
వెనుదిరుగడు
వెన్నుచూపడు
శత్రువుల్ని ఛేదించుకుంటూ ముందుకెళ్తాడు
ప్రతిరోజూ పోరాడి పోరాడి
యుద్ధసమయం ముగిసాకా ఇంటికి బయలుదేరుతాడు
డాక్టర్ కూడా కరోనాతో యుద్ధం చేసీ చేసీ
ఇంటికి తిరిగి వస్తుంటే
సందులో అవే గుసగుసలు వినబడుతున్నాయి
డాక్టర్ అవేమీ పట్టించుకోకుండా
సరాసరి ఇంట్లోకి వస్తే
తల్లి పెట్టుకున్న దిగులుకు తల్లడిల్లి పోయింది.
తల్లికే ధైర్యం మాటలు నూరిపోసింది
పొద్దున్నే లేసి యధాతధంగా వెళ్తున్న సమయంలో
తెరిచిన డోర్ కు తగిలించిన బోర్డు చూసి
తల్లీ కూతుళ్లు నిశ్చేష్టులయ్యారు
“డాక్టర్ దేవునితో సమానం ” అని!
ఎంతైనా కరోనా కన్నా స్టెత స్కోప్ గొప్పది కదా !!
ఓ నా ప్రియమైన భారతీయులారా
ఆరగించండి అమృతఫలాలని
వేల వేల త్యాగాల వేలకొలది బలిదానాల
వందల ఏండ్ల పోరుఫలం
ఝాన్సీనో జలకరినో తలుచుకొని
చరిత్ర రాయని యోధులను నేను తక్కువ చేయను
ఎప్పటికైనా స్వాతంత్రం ఓ అమృతఫలం
విద్యా ఫలాలందుకున్నాం
వైద్య రంగాన్నేలుతున్నాం
అంతరిక్షాన్నే పరిశోధక క్షేత్రంగా ఎంచుకున్నాం
స్వతంత్ర గణతంత్రం గరిపినది మనకు రణతంత్రం
పోయినదీ తెల్లదొరల బానిసత్వం
చరిత్ర మరిచిపోగా మిగిలిందీ అలసత్వం
అతిపెద్ద రాజ్యాంగం మన సొంతం
ప్రతీది ప్రైవేటు పరం ఘనమైన చరితం
ఏడుపదులుదాటిన భరతమాత
సాధించెను నిర్భయ, దిశ చట్టాలు
అర్థరాత్రి మహిళ స్వేచ్ఛగా తిరగడం మాట కల
పట్టపగలే నిట్టనిలువునా కాటేస్తూన్నది కాలం
అధ్యయనమే నోచుకోని సమస్యలవలయాలు
ప్రజాసంక్షేమ వ్యతిరేక చట్టాల విలయాలు
ఎక్కడిదీ స్వార్థ శకలం అవినీతి మయం సకలం
స్త్రీనామంతో వెలిగే దేశమా వెలుగుతూనే ఉండు
నిత్యనూతన నేరమయ రాజకీయాలలో
ప్రతీది అమ్ముడయ్యే సంతలో
ఓ నా ప్రియమైన భారతీయులారా
మనదే రాజ్యం మనదే దేశం
జగడం తప్పు కాదు స్వేచ్ఛ కోసమైనా హక్కు కోసమైనా
ఓ నా ప్రియమైన భారతీయులారా
ఏడున్నర పదుల అమృతఫలం ఆరగించండి
శీర్షిక
రాబోయే విషయపు నిర్వచనాన్ని నేను
నన్ను భవిష్యద్దర్శనం అని కూడా పిలుచుకోవచ్చు మీరు
నా తర్వాత వచ్చేదాన్ని చదివితే
నా అర్థం మారిపోతూ వుంటుంది
గతం భవితతో చరితతో ఏర్పడుతుంది.
పేరాగ్రాఫ్
నన్ను నేను రాసుకుంటాను, కొట్టేసుకుంటాను
సవరించుకోవడం, సరిచూసుకోవడం
మళ్ళీ రాసుకోవడం – ఇవన్నీ చేస్తాను
నాకు ఎన్నో ప్రారంభాలు, ఎన్నో పఠనాలు
నన్ను మార్జిన్ల నుండి చదవండి
కింది నుండి పైకి, చివర నుండి మొదలుకు
కూడా చదవటం అవసరం
నేను పానీయమైతే మీరు పాత్ర
నిమ్నరేఖ
మీ నిమగ్నత మీద నమ్మకం లేదు నాకు
మీ సొంత నిమ్నరేఖలతో
నా మీద గెలుపు సాధించవచ్చు.
కామా
మీరు నన్నొదిలేసి ముందుకు సాగవచ్చు
కానీ సాగుతున్నట్టు మీ మీద మీకు
నమ్మకం కలగాలంటే నేను అవసరం
సెమికోలన్
కొసకూ, కొనసాగడానికీ మధ్య
నా పడకను వేసుకుంటాను
దగ్గరివాళ్ళకు కూడా
దూరంగా ఉండటం మంచిది
అది వాళ్ళకూ మీకూ
విమోచనాన్ని ప్రసాదిస్తుంది
కుండలీకరణం
ఆదుర్దా నిండిన ఆలోచనలు
అవతలికి చిందకుండా ఆపుతాను నేను
రెండు చేతుల్ని దగ్గరికి చేర్చినట్టు
వాటిని అదుపులో పెడతాను
అవి అసలు విషయాన్ని మింగేయకూడదు మరి!
‘ఇక చాలు’ అనేది నా సందేశం
కంచెకివతల ప్రేయసి
కంచెకవతల ప్రియుడు
నిల్చుని మాట్లాడుతుంటే
వచ్చి చేరుతాను వాళ్ళ మధ్యన.
అక్కడ లేనట్టు అనిపించినా
నిజానికి వుంటాను స్పష్టంగా
ప్రశ్నార్థకం
బడిలోని గదిలో లేచి నిలబడే బాల విద్యార్థిని నేను
మీ సమాధానాలను సమస్యలుగా
నిశ్చయాలను సందేహాలుగా మార్చుతాను
మీరు నన్ను చూడదల్చుకోకున్నా పురి విప్పిన నెమలి ఫింఛమై నిల్చుంటాను మీ ముందు
ఆశ్చర్యార్థకం
పదాలు ప్రతిఫలించలేని
ఉద్వేగ భావనలుంటాయి కొన్ని
వాక్యాలు వ్యక్తీకరించలేని
విస్మయాలుంటాయి కొన్ని
అక్కడ నేనుంటాను
ఎడం
నేనే లేకుంటే
పదాలు ఒక దానిలో వొకటి చిక్కుకుపోయి
అర్థాలు ఒక దానితో వొకటి అతుక్కుపోయి
భాష చొరరానిదయ్యేది
అవసరమైనచోట మనుషుల్ని ఆపుతాను నేను
వాక్యంలోకి వెల్తురును వెళ్ళనిస్తాను
పదాల మధ్య, వాక్యాల మధ్య
పేరాల మధ్య పఠిత కూర్చుని
విలోకించి వివరించేందుకు
అవసరమైన స్థానాన్ని నేను.
ఖాళీ స్థలాన్నే అయినా
కాసిన్ని సూచనలు చేస్తాను.
బిందువు
గాలి ఆడనప్పుడు మీకు ఊరటనిచ్చే
గుళికను నేను
నా సహాయంతో శ్వాస తీసుకుని
సాగండి మళ్ళీ
చివరి పంక్తి
మిత్రులారా! చివరకొచ్చాం
నేనే లేకపోతే మీరు ఆగరని తెలుసు నాకు
నేను మృత్యువును
మళయాళమూలం: కె. సచ్చిదానందన్
ఆంగ్లానువాదం: కె. సచ్చిదానందన్
తెలుగుసేత : ఎలనాగ
రహదారుల మీద వడ్లు, మక్కలు
ఎండబోసినట్టు ,
సరిహద్దుల్లో నా దేశరైతులు
తమ దేహాలను ఆరబోస్తున్నారు
తమ పంచలోని వరికంకులను
అలా వదిలేసి
దున్నిన పొలాలన్నీ దాటుకొని
పొలికేకలై పెకలించుకు వచ్చారు
సకాలపు చినుకు కోసం
కైమోడ్చి ఆకాశాన్ని ప్రార్థించేవాళ్ళు
వానచుక్కని ఒడిసిపట్టి
భూమిని సుతిమెత్తన చేసి
పుడమి కడుపున పసిడి పంటకు
ప్రాణం పోసేవాళ్ళు
మట్టిముద్దల్లోంచి జీవశోభిత ధాన్యరాశిని కుప్పలుగా పోసేవాళ్ళు
ఉత్తర భారతపు చలికి
గడ్డకట్టుకుపోతూ
తమ కడగండ్లను గంపలకెత్తి
పాలకుల కండ్లకు చూపెడుతున్నారు
లాఠీలేమో అన్నం కుండలను పగలగొడుతున్నాయి
విస్తరిలో అన్నం మెతుకులైన పాపానికి
రైతుల మీద భాష్పవాయుగోళాలు పగుల్తున్నాయి
బయట తెచ్చిన పెట్టుబడిపై
పేరుకుపోతున్న మిత్తీలు
కల్తీ ఎరువులు
కష్టానికి సరిరాని ధరలు
చట్టబద్దత లేని కనీస మద్దతు ధరలు
కూడబలుక్కుంటే
అసలు ఏ ధరకూ
కొనని కఠిన కార్పోరేట్లు
……………………….
అన్నదాత అల్లాడుతున్న
జీవన సంక్షోభ సమయమిది
మట్టి ముందు ,
అన్నం పెట్టే చేతుల ముందు
ఎవ్వరైనా సరే
రెండుచేతులు కట్టుకు
నిలబడాల్సిందే
స్వేదంతో సేద్యం చేసే కర్షకులకు
భూగోళం మొత్తానికి ఇంత ముద్ద పెడుతున్న వాళ్ళకు
అన్నం తింటున్న ప్రతి ఒక్కరూ
మద్దతు పలకాల్సిందే …!!