ఆ కలం జన గణాలకు జయకేతనమైంది
అతడు అడుగుపెట్టిన చోటు శాంతినికేతనమైంది
విశ్వాన్ని వెలిగించిన రవీంద్రుడు
కవిత్వాన్ని శ్వాసించిన
విశ్వకవీంద్రుడు .
అతడి కోసం నీలి మేఘాలు తేలి వచ్చాయి
వర్షంగా కురవడానికో
తూఫాన్ గా భయపెట్టడానికో కాదు
అతని జీవన సంధ్యా రేఖను వర్ణమయం చేయడానికి..
నిద్రించి కలగన్నాడు
జీవితమంటే సంతోషమేనని
మేలుకొని తెలుసుకున్నాడు
జీవితమంటే ” సేవేనని”..
ఎక్కడ మనసుకు భయం ఉండదో
ఎక్కడ శిరస్సు సమున్నతంగా నిలబెడతామో
ఎక్కడ జ్ఞానానికి స్వేచ్ఛ ఉందో
అక్కడ స్వాతంత్ర్యం పరిమళిస్తుందన్నాడు
కడలి అలలను చూస్తూ కలవరపడక
.కడదాకా ఈది
ఆవలి గట్టును చేరుకోవాలన్నాడు
చిగురాకులపై నర్తించే మం చు బిందువుగా
కాలమనే అంచులపై కదలి సాగమన్నాడు
అతడు ఆత్మవిశ్వాసాన్ని అనుశాసించాడు
అతడు ఆధ్యాత్మికతను ఆస్వాదించాడు
అందరి మనసులో అమరుడైనాడు
హృదయాన్ని గీతాంజలిగా అక్షరీకరించాడు
అందరి హృదయాంజలి అందుకొన్నాడు.
కవితలు
ఒక వేకువ ఉదా రంగు కిరణమై
హృదయంలో నాదం మోగిస్తుంది
ఒక నీలిమ అనంత ఆకాశమై
మనసులో ప్రశాంత భావాన్ని మీటుతుంది
ఒక గాఢ నీలం విశాల సంద్రమై
వేయి కెరటాలుగా సంచలిస్తుంది
ఆకుపచ్చదనం అవనిపై పరిచిన వృక్షజాలమై
ఆహ్లాదాన్ని పెంచుతుంది
ఒక పసిమివర్ణం తీయని ఆమ్రమై
మాధుర్యం పంచుతుంది
ఒక నారింజ రంగు సాయం సంధ్యా కిరణమై
వేయి రాగాలు దిద్దుతుంది.
ఒక రక్త వర్ణం అనురాగమై
అంత రంగాలను స్పృశిస్తుంది
ప్రపంచమంతా సప్త వర్ణమయం
ఇది హోలీ ఇది వసంతోత్సవం.
ఇది ఆమని పలకరింత.
ఒక్కో వర్ణం జీవితాన్ని రంగులమయం చేస్తుంది
విషాద ని శీధాలను వదలి వేస్తూ ఉల్లాస ఉదయాలకు ఊపిరి పోస్తూ
ప్రతి ఏటా ఉత్సాహం పంచుతుంది హోలీ బ్రతుకులు రాగరంజితం చేసుకోమంటుంది ఈ రంగుల కేళి.
నా జీవన మాధుర్యం నీవు
నీ మనుగడ లోని చేదు నేను
నా అశాంతి కుపశాంతివి నీవు
నీ హృదయాని కశాంతిని నేను
నా అలపున విశ్రాంతివి నీవు
నీకొక తీరని అలసట నేను
నను నిమిరే అతిమృదులత నీవు
నేను కసిరే మతికఠినత నేను
తల్లివి, చెల్లివి, మల్లివి నీవు
కల్లను, పొల్లును, డొల్లను నేను
నా స్వేచ్ఛకు చలనానివి నీవు
నిను కట్టే శృంఖలాన్ని నేను
దీనమైన ధీరురాలు నీవు
ధీమాగల దీనుణ్ణి నేను
నా కాలంబన బలిమివి నీవు
నీ కాలంబన భంగిమ నేను
నను నిలిపిన మహాకరుణ నీవు
నిను నలిపిన మృషాచరిత నేను
కాలం ప్రేమకు పాత్రవు నీవు
కాల క్రుద్ధనేత్రాన్ని నేను
మహావ్యక్తి! మహామూర్తి! మహిళా ఓ మహిళా!
నీవెక్కడ నేనెక్కడ! భావిస్తే ఇలా ఇలా
ప్రథితోన్నత హిమశైలం నీవు
వట్టిరాళ్ల చిరుగుట్టను నేను
తలెత్తి చూసేందుకసలు తరం గాని ఎత్తు నీవు
చూడలేక నీ తల వేలాడించే జిత్తు నేను
మహావ్యక్తి! మహామూర్తి! మహిళా ఓ మహిళా!
నీవెక్కడ నేనెక్కడ! భావిస్తే ఇలా ఇలా
కష్టాల్ని కళ్ళారా చూసి
నష్టాల్ని నిలువెల్లా భరించాను!
ఆకల్ని తనివితీరా రుచిచూసి
కన్నీళ్ళను
గుండె నిండా దిగమింగాను !
మోసాలకు అడుగడుగునా గురై
నిట్టూర్పుల్ని
శ్వాస నిండా విడిచాను !
జీవితంలోపూర్తిగా విఫలమై
మనసు వికలమై నిలువెల్లా
ఆహుతైయ్యాను!
అణచివేతకు
అణువణువునా గురై
వివక్షతను అనుక్షణం
ఎదుర్కొన్నాను !
మిత్ర ద్రోహాలకు
నిష్కారణంగా బలై
శతృ కుట్రలకు కుప్పకూలాను !
స్నేహితులకన్నా
శత్రువులెక్కువయ్యారు
హితులకన్నా హింసించేవారెక్కువయ్యారు!
విజయాలకన్నా
అపజయాలెక్కువయ్యాయి
అభిమానాలకన్నా
అవమానాలెక్కువయ్యాయి!
ఆకర్షణ, వికర్షణ
ఘర్షణ, సంఘర్షణ
అనుభూతులు, అనుభవాలు
ఎదలో గూడు కట్టాయి
ప్రభవించిన అక్షరాలు
కలంలో సిరా అయ్యాయి!
ప్రాణమై కదిలింది కవిత్వం
ఊపిరై ఎగిసింది అనునిత్యం!
ఈ కవితే సత్యం
సజీవ సాక్ష్యం !
మేడారం జాతరకు
తరలి వస్తున్నారు సాగరం లా జనం.
ముడుపు లు చెల్లించేందుకు
సమ తూకం బంగారం బెల్లం దిమ్మెలు
తలకెత్తుకున్నారు,
భక్తి పాటల సంబురాలతో
సంతోషం పంచుకున్నారు.
గిరి ఝరుల అందాలకు
పరమార్థ జ్ఞానం కలిగినట్లు
చింతలన్ని మరచారు.
ఆదివాసులకు శ్రమ సేద్యం ,
వేట వృత్తి జీవనం.
కోయ దొరకు పుట్ట వద్ద కనిపించిదొక శిశువు.
పులులు, సింహాలు, కాపలా, చుట్టూ.
దైవాంశమున్న పాపను గూడానికి తెచ్చాడు.
సమ్మక్క అని పిలిచి ఒడిని చేర్చాడు.
అయోనిజ ఆ బిడ్డ చూపింది మహిమ.
గిరి జనుల రుజలన్నింటికి
ఆకు పసరు లిచ్చింది.
కష్టాలను తీర్చింది.
యుక్త వయసున పగిడిద్ద రాజును పెండ్లి యాడింది.
కన్న బిడ్డలకు తల్లిగా మన్ననలను పొందింది
సమ్మక్క సారలక్కలు,
తల్లీ కూతుళ్ళు వాళ్ళు
దివ్య కాంతలు, ధీర వనితలు
స్త్రీల ఆత్మ గౌరవానికి
సాక్షి ప్రమాణాలు.
మట్టి జనుల స్వేచ్ఛకు గాను
గట్టిగ పోరాడారు.
ప్రాణాలకు తెగించారు.
వన దేవతలు వారు
ప్రకృతి రక్షణకు
మనుగడల రూపమెత్తారు.
గిరి జనుల సంస్కృతిలో
జాతర జాతి సమైక్యతకు మూలం
సమ్మక్క ధైర్యం చరిత్ర లో అతి ఘనం.
దేవతా తరుణి ఆమె
రక్తం పడకూడదు నేల మీద
వెన్ను పోటు బల్లెం దిగిన గాయానికి
కట్టు కట్టుకుని పోరాడింది.
శత్రువులను చెండాడింది.
తూరుపు చిలుకల గుట్ట వంకకు మరలి
కంటికి కనుపించక ఎవ్వరికి
నెమలి నారచెట్టు కింద
నిండు పసుపు” కుంకుమ బరిణ” గా మెరిసింది.
మాఘ శుద్ధ పున్నమి నాటికి
గద్దె మీద కొలువుకొచ్చిన
సమ్మక్క సారలక్కలు
హారతులందే వేళకు
డప్పుల చప్పుళ్ళు, , శివసత్తులు పూనకాలు
మేళాలు తాళాలు,
ఇప్పుడు మొదలయ్యాయి
గిర్రున దిగి వచ్చే హెలికాఫ్టర్ ఏర్పాట్లు,
సంప్రదాయాలకు
శాస్త్ర విజ్ఞానం తోడు,
భక్తుల కందరికి ఫలించాలికోరికలు.
వెన్ను భాగాన్ని పరచుకున్న జుట్టును
వేళ్ళతో సుతారంగా ముడివేసి
కంటిరెప్పల బరువును
అమాంతం దించుకొని
కాలి అందెల సవ్వడి ప్రణవంగా
మెత్తని అడుగులతో వడివడిగా
ప్రపంచంపై సూరీడు పాకక ముందే
మొదలయ్యే ఉదయం ఆమెతో
తెల్లటి ముగ్గు రేఖలు
వేలి సందుల నుండి జాలువారి
వయ్యారాలు పోతుంటాయి
చేతి రుచుల కమ్మదనాలు
బయటివారిని ఒకింత
నిలువరిస్తాయి ఇంటిముందు
అగరొత్తుల పరిమళాలు
దేవతా దీవెనలై వ్యాపిస్తాయి
ఇంటినిండా..
బద్ధకం కప్పుకున్న దేహాలు
మగతగా దొర్లుతుంటాయి
వారి అవసరాల కోసం ఆమె
శరీరంలో ఇంకిన తేజస్సును
అరువు తెచ్చుకుంటుంది
మళ్లీ మళ్లీ కొత్తగా
త్యాగాల కుంచె ధరించి
ప్రతి క్షణం వారి కోరికలకు
నునువెచ్చని మమకారాల
వన్నెలద్ది
జీవన కాంతిని ప్రసరిస్తూ ఆమె
అడుగడుగున ఆమె పదనర్తనం
వెన్నెల చల్లదనంలా
స్వచ్ఛతకు మారు పేరవుతుంది
తనకు తాను తప్ప
అందరికి మాత్రం ఆమే
ఆమే అలిగిన నాడు….?
ఏ భాషా భావం
విప్పలేదు ఆ శక్తిని
కూర్చలేదు ఆనందాకృతిని !
అరుణ ధూళిపాళ
8-3-2024
(అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా)
మనసుది బహు పెలుసు
ఇష్టం చిట్లి
విరిగి కుప్పకూలితే ?
నలిగే మనిషి కేక
వినబడని లోతులో పడి
కంటికి కనిపిస్తుందా?
జ్ఞాపకాల సుడిలో
తునకలైన మాట
ఖాళీ ముఖంలో తేలి
ఎండిన పరిచయానికి
చులకనతో చిరిగి
గాలికి కొట్టుకుపోతూ
పొట్లిన రోజులకి
మనిషి స్తంభంలా ఒరిగి
మనసు పగుళ్లు బారి
కల ఇంకిన కళ్ళలో
చీకటి సెగల మధ్య
కోరిక ఆరిపోతున్నా
వెన్నుముకకు
వ్రేలాడే శరీరంలోనూ
మనసు చెమ్మ రేగుతునే ఉంది.
పూరి గుడిసెల కనుకొలకుల్లో
ఉబికిన రక్తాశ్రువులు
అపార్ట్మెంట్లు,గృహాల గుండెల్లో
హోరెత్తిన మరణం మృదంగారావాలు;
ఇంతకాలం తమ రెపరెపల్లో కేవలం
వాత్సల్యం
తమ గలగలల్లో కేవలం అనురాగం
పలికించిన చిలికించిన
కొంగులు, గాజులు
ఒరుసుకుంటున్నాయ్
బిగుసుకుంటున్నాయ్
ఆవేశం తో ఆక్రోశం తో
వారి ఆవేశం ఆక్రోశాల అగ్ని పర్వతం పెఠిల్లున విస్ఫోటించి
మీ అస్తిత్వం తుడిచి పెట్టుకు ముందే
ఓ సారాసురా,! ఓ గుడంబ పిశాచమా! ఓ కల్తీ మద్యమా!
క్విట్ తెలంగాణా! క్విట్ ఆంధ్రా!
అలనాటి నెల్లూరు,దూబగుంటల
మద్యపానవ్యతిరేక మహిళోద్యమ క్రోధాగ్ని
అదిగో! ఇంకా రగుల్తూనే ఉంది
మరి..ఇక మీకు చరిత్ర పుటలే గతి!
నా ఎద జ్వలించి
బడబానలమైనపుడు..
నా మదిలో తుఫానులు
విజృంభించినపుడు….
నా కన్నీళ్ళు ఉప్పెనలై
ఉప్పొంగినపుడు..
నా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు వాయుగుండాలై
చుట్టుముట్టినపుడు..
నాలో దూసుకొని వచ్చే నదీ రుధిరాలు ఉప్పగా మారివెచ్చగా తాకినపుడు..
నా గుండె సుడిగుండమై
ధ్వనించినపుడు
నా నీలిమ నల్లని దుఃఖపు దుప్పట్లు
కప్పుకొన్నపుడు..
నా కెరటాల పాదాలు విరిగి పడుతు
నడవలేనప్పుడు.
నా ఆశలు నిండు పున్నమి చంద్రునికై ఎగసి
నిరాశ శకలాలై విరిగినపుడు..
నా లోని ముత్తెపు సిరులు నత్తగుల్లలై
నవ్వినపుడు
అనుభవాల హాలాహలాలు..
బాధల బడబానలాలు
కష్టాల తిమింగలాలు
నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నపుడు
నాలో నేను మదనపడుతు..
అలల అక్షరాలతో సృజించిన
కావ్యం..
నీకు అమృతం కావాలనే తపనతో
బతుకుతున్నాను..
*
పచ్చని వన్నెలో కోమలపు
మేని మెరుపులతో
అలరించే ముచ్చటైన పత్ర విశేషం
మంచిగంధపు వాసనలతోకూడి
అన్నానికి రుచిని పెంచే
అమృత పత్రం
తెలుగు లోగిళ్ళ విందుల్లో
విరాజమానపు హరిత దళం
అందంగా అమరిన వడ్డింపుల
సమాహారపు కళాత్మక నిండువిస్తరి

సనాతన భారతావనిలో లిపిసాధనమై మెరిసి
మాలికలు తోరణాలుగా
రూపం మారుస్తూ
పండుగలు పబ్బాలలో
అలంకారమై ఒప్పే అందమైన
శుభసూచక చిత్రపర్ణిక
పర్యావరణ పరిరక్షణా
నేస్తపు పత్రిగా
మెండైనఔషధ విలువలతో
స్వస్థత నిచ్చేఆరోగ్యప్రదాయిని
భగవంతుని ప్రసాద నివేదనకై
యోగ్యత పొందిన
పళ్ళెరమై భాసిస్తున్న
ప్రత్యామ్నాయమెరుగని
విశేషపు పత్రరాజం