బరువులు దించుకున్న తట్ట
రాత్రంతా బోర్లపడో వెల్లకిలనో అడ్డదిడ్డంగానో నిద్రిస్తున్నట్లే పడి పోయి ఉంటుంది
తెల్లారితే చాలు
నిండా ఇటుకలు నింపుకుని
శ్రమపడుతునే ఉంటుంది
రికం లేదు
ఆకలి చల్లారని పొట్టకోసం
బరువులు నింపుకుని
తనను తల పైకి ఎత్తుకునే బాల కార్మీకుల చూసి బాధగా తట్టకు తట్టుకోలేని పది తట్టలంత దుఃఖం
మళ్లీ మళ్లీ కింద మీద పడుతూ
తట్టకు పొద్దు పోయే వరకు బరువులు మోసుడే !
అల్కగా ఉన్నా పనిలోకి దిగితే
బరువు బరువే!
జీవిత కాలమంతా శ్రమిస్తునే ఎత్తుల నుండి పడి ముక్కలు ముక్కలుగా కూలీకి పనికి రాకుండా తట్ట వైకల్యం వైకల్యం !
తల పై ఉంటే తట్ట చివరకు మక్కల కుప్ప
నిర్వాసితుల పొయ్యి కిందకో
చలి మంటల్లో పడో అడ్రసు లేకుండా పొగ పొగ.
కాలుస్తునే ప్లాస్టిక్ వాసన అంటూ ముక్కు మూసుకుంటారు మనుషులు !
“ప్లాస్టిక్ తట్టనైన నన్ను కాలుస్తూ
పర్యావరణ ప్రమాణాన్ని
పదిలం కాకుండా చేస్తారు!”
దుమ్ము దుమ్ము అనాథ ఒంటరి శ్రామికుడిలా తట్ట గుర్తింపు లేకుండా బూడిద బూడిద
తట్టంత బూడిద !
కవితలు
మా పంతులు
సిగరెట్టు త్రాగే బలహీనత ఉండేదేమో
త్రాగుచుండగ మా కంటపడలేదెన్నడు.
మాకు తెలియకూడదని చివరిదినం నాడు
రెండవ ఆటకు సినిమాకు పోయెవాడట.
మాలో ఒకరి వలె దైవ భక్తి ఉండెనో లేదో
నుదుటి పై విభూతి లేకుండ ఉండకుండె.
మధ్యాహ్నం ఓపిక ఉన్నా లేకున్న తప్పక
కాళ్ళు చేతులు ముఖం కడిగే తినేవాడు.
ఇంటిలో ఒక్క పనియైనా చేసేవాడో కాదో
బడిలో తిన్నాక బాక్స్ ను కడుక్కునేవాడు.
మద్యం సేవించే వాడో కాదో ఏ ఒక్కరును
మా పంతులు త్రాగునని అనగా వినలేదు.
మేము హోంవర్క్ సక్రమముగ చేయకుంటె
ఇళ్ళకు వచ్చి పెద్దలను చేయించమనేవాడు.
మా సోమరితనం వలన పై అధికారి నుండి
మాటపడిన మా ముందు అబద్దమాడలేదు.
మా అల్లరికి విసిగి ఒక్కోసారి ఆయన చేసిన
బడితెపూజ మేం మరచినను, బాధపడేవాడు.
బడిలో తనకొడుకు మాలాంటి విద్యార్థియే
ప్రత్యేకహోదా లేదు; అర్హత బట్టే మార్కులు.
మా పంతులు ముందు మేము విద్యార్థులమే
కాని విద్యార్థి మరియు విద్యార్థినిలము కాము.
మా యూనిఫామ్ స్టిచ్చింగ్ లో తేడా ఉండేదేమో
మా పంతులు చేయించే డ్రిల్ లో ఉండేదికాదు.
పద్యాల ఎక్కాల లో వారి కఠిన శిక్షణలో నేడు
మా ల్యాబ్ టాప్ తప్పినా మేం తప్పడములేదు.
వల్లెవేయించే వారి అసమాన ఓర్పుతో నేడు
స్పెల్లింగ్స్, అల్ప, మహాప్రాణాలలో దిట్టలం.
టైప్డ్ ‘ఒ’ మరియు ‘బ’లను గుర్తుపట్టలేరేమో
వారు దిద్దించినందున మేము వ్రాస్తె పొరబడరు.
ఎందరో
మేధావులు…
సమతా వాదులు…
సంఘ సంస్కర్తలు…ఈ
పుణ్యభూమిలో జన్మించి
మెరుగైన సమాజం కోసం…
ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం…
ప్రజల్లో సామాజిక చైతన్యం కోసం…
ఎన్ని సందేశాలిచ్చినా…
ఎన్ని హెచ్చరికలు చేసినా…
తమ జీవితాలను ఫణంగా
పెట్టి ఎన్ని ఉద్యమాలు
ఎన్ని పోరాటాలు చేసినా…
ఎంతగా పరితపించినా…
ఎంతగా ఆశపడినా…
ఎంతగా ఆరాటపడినా…
ఈ సమాజంలో
“విప్లవాత్మకమైన
మార్పులు” రాకపోవడానికి…
ఈ దేశంలో “ఆశించి ప్రగతి”
కళ్ళకు కనిపించక పోవడానికి కారణం…
పేదవాళ్లలో…
ధైర్యం లేకపోవడం…
సాహసం చేయకపోవడం…
అంతులేని అమాయకత్వంలో…
అజ్ఞానాంధకారంలో మునిగిపోవడం…
మధ్యతరగతి వారికి…
సమయం లేకపోవడం…
సమిష్టిగా స్పందించక పోవడం…
ధనవంతులకు దాసోహం అనడం …
పేదవారిపై పెత్తనం చెలాయించడం…
చైతన్య రహితులై మౌనవ్రతం దాల్చడం…
ధనవంతులకు…
అవసరం లేకపోవడం….
చీకటి వ్యాపారాలు చేసి
దొరికినంత దోచుకోవడం…
స్విస్ బ్యాంకుల్లో దాచుకోవడం…
అట్టడుగు వర్గాల్ని అణగద్రొక్కడం…
మధ్యతరగతి వారిని మాయచేయడం…
ప్రభుత్వాలను తమ గుప్పిట్లో పెట్టుకోవడం.
మరి సమసమాజం నిర్మాణ స్థాపనెప్పుడు?
దేశంలో శాంతిసౌభాగ్యాలు వర్థిల్లేదెప్పుడు?
మనిషి మనిషిలో…
మానవత్వం వికసించినప్పుడు…
పేదలు…
ఆర్థిక అసమానతలనుండి బానిసత్వపు
భావనలనుండి విముక్తి పొందినప్పుడు…
మధ్యతరగతి ప్రజల్లో…
విజ్ఞాన జ్యోతులు వెలిగినప్పుడు…
విప్లవజ్వాలలు రగిలినప్పుడు…
ధనవంతుల చేతుల్లో…దాతృత్వం
గుండెల్లో…దైవత్వం పొంగి పొరలినప్పుడు.
ఎగిరే పతంగమా
ఎందాకా నీ పయనం
ఆకాశం అందుకోవాలన్న ఆశ
కానీ దారం తోడు లేక
గాలి సహాయం లేక
ఎత్తు ఎగరలేక
ఎగిరించే వాళ్ళు లేక
వ్యర్థమే కదా నీవు!!
పెద్దవి చిన్నవి
సప్తవర్ణ శోభితం
పూలు,జంతువులు,ఆకులు,చెట్లు
ఎన్నెన్ని బొమ్మలో నీ ఒంటిలో
హనుమంతుడిలా అందమైన తోక
ఆనందంగా ఎగిరిపోతావ్ గాలిలో
ఏదైనా తగిలినా
ఎవరైనా కోసినా
ఎక్కడ వచ్చి పడతావో
ఎన్ని ముక్కలవుతావో!!
సంక్రాంతి వేళలో
పిల్లా పెద్దా అందరూ నీ తోటే ఆట
తిండి తిప్పలు మరచి
డాబాల మీద గ్రౌండ్ లలో
పోటాపోటీగా పతంగులను
మాంజ కట్టి ఎగురేసి
మజా చేసుడే!!

వెనకముందు చూడక
ఆవేశంతో ఆహ్లాదంతో
ఎగురేసి కిందపడి పోవుడో
దెబ్బల రుచి చూసుడో!!
ఏది ఏమైనా ఎవరిమీద ఆశపడక
నీ కాళ్ళ మీద నీవు నిలబడు మనిషి
యుక్తి శక్తి తోడు
గాలి వాటంతో పోయే గాలిపటం ఎగిరితే పడిపోక తప్పదు
తోడులేని గాలిపటం
తోకతెగిన పక్షి!!!
ఎన్నో ఒడిదుడుకులతో ఎదిగే మనిషి
నేర్పుతుంది పాఠం గాలిపటం
కష్టం లేక పోలేవు ముందుకు
ముళ్ల చెట్టు మీద పడ్డ వచ్చును చేటు
జాగ్రత్తగా పైకి వెళితే గాలిలో ఆనంద సంచారం
పవనం లేకుంటే పతనమే
గాలిపటం లాంటి జీవితం
జాగ్రత్త జర భద్రం మనిషి!!
గడియారం కొట్టే గంట కోసం
సంబరంగా నిరీక్షణ
గుండెకు సవ్వడులను పులిమి
కొత్త కాంతి రేఖలకై తపన !
ఆ క్షణం మిగిలేదా? ముగిసేదా?
ఏమీ తెలియని అనిశ్చితి
అదొక భ్రాంతి మోహచక్రం
ఆశా సుగంధాలను చిమ్మి
వెంపర్లాడమంటుంది వాటికై
ఇగురులొత్తే మనసుతో
ఆ దారుల వెంట పరుగులెత్తి
అలసి పోతూనే ఉన్నావు
మనిషిగా చస్తూనే ఉన్నావు
అనుభవాల కొలిమిలో సాగి
పర్యవసానంగా మిగిలే జీవితాలకు
గతం గుర్తుకు రాదెందుకో
వేసే ప్రతీ అడుగుకీ
వెనకటి జ్ఞాపకం ఓ చరిత్ర
నిన్ను నిన్నుగా తీర్చుకునే
గుణపాఠాల ఉలి దెబ్బ
వత్సరాలు మారడం
గాయాలను మాన్పించడం
స్మృతులను మరపించడం
కాలానికి కొత్త కాదు
చెరిగిపోయే గీతకు ముందే
చెరగని సంకేతాన్ని ముద్రించడమే
మనిషికి అసలైన కాంతి !!
పాత, కొత్త సంవత్సరం ఏదయినా
చేదు, తీపి జ్ఞాపకాల సమ్మిళితం
కాలం చేసిన గాయలకు మధుర స్మృతుల
మలాము రాద్దాం.
దేశానికి వెన్నుముకైన రైతన్నలకు
వెన్ను దన్నుగా నిలుద్దాం.
దేశ సరిహద్దుల్లో పహారా కాసే సైనికులకు
ఉత్తేజాన్నిద్దాం.
క్షీణిస్తున్న కులవృత్తులను ప్రోత్సహించడానికి
నడుం బిగిద్దాం
ఆకలితో అలమటిస్తున్న అన్నార్థుల ఆకలి తీరుద్దాం
పసిమొగ్గలను సైతం నలిపేసే కీచకులనుండి
స్త్రీలను రక్షించడానికి కంచెగా మారుదాం
సాయంకోరే వారికి ఆపన్నహస్తం అందిద్దాం
మొత్తంగా మనిషిలో మానవత్వాన్ని నిద్రలేపుదాం
సౌభ్రాతృత్వాన్ని పెంపొద్దిద్దాం
దైవత్వాన్ని ప్రేరేపిద్దాం
వసుధైక కుటుంబంగా జీవిద్దాం.
నూతన సంవత్సర శుభాకాంక్షలతో
నాకెందుకో..!
భయమేస్తుంది?
కారుచీకట్లు లోకాన్ని
కప్పేసినందుకు….
ఒంటరినా అని!
మనసు లో
అలజడి
మొదలైనందుకు…!
లోకమంతా
కారు చీకట్లు
కమ్ముకున్నాయి
తస్మాత్ జాగ్రత్త….!
అని
మనసు
హెచ్చరిస్తున్నందుకు….!

ఒంటరితనం.
నన్ను
ఎక్కిరిస్తున్నందుకు..?
అందరూ?
ఉన్నా ఏకాకి
నువ్వు!
విధి నిర్వహణ
కోసం నీ పిల్లలు
నిన్ను
వదిలెళ్లక
తప్పలేదు….
సాయంత్రమే..!
లేకుంటే
ఎంత బాగుండో…
పగలంతా
మనుషుల
హడావుడితో
క్షణం తీరిక దొరకదు….
సాయంత్రం
సమయమే…
ఒంటరిదానివంటూ
వెక్కిరిస్తుంది…
అమావాస్య నే అసలైన గురువు
అంధకారం లోనే ఆలోచనలు వెలుగు చూస్తాయి
లోటు లోతుగా దారులు వెతుకు తుంది
చీకటి చెప్పే కథలు చిర కాలం
తడుముదామన్న తాకని బందాలు
తన వారు ఎవరో మొదటి సారి ఎరుక జెప్పుతది
లేనప్పుడు మాత్రమే లెక్కలు బోధ పడతాయి
జేబు లోపలికి చేతి వెతికి వెతికి
చిల్లి గవ్వ ను నుదుట ఆద్దు కుంటది
వెలుగు చుట్టూ వున్నప్పుడు
పొగిడే పురుగుల కోలాహలం కోకొల్లలు
మసక బారినదా నీడ కూడా కాన రాదు
వెలుగులో కనబడేది కనికట్టు మాత్రమే
చీకటి లోనే సత్యాలు చీటీ విప్పు తాయి
అర్థం అయితే చాలు అడుగు కొత్తగా వేయ వచ్చు
చీకటి వెలుగులు
జీవితానికి అసలైన పాఠoలు
సిలబస్ లో లేని గుణ పాఠoలు నేర్పుతాయి
ఓటేద్దాం ఓటేద్దాం ఓటేద్దాం!
స్వార్ధము లేనటువంటి సమర్థులకు ఆచి తూచి !ఓ !
1.ప్రజలయొక్కబాగోగులపట్టింపేధ్యేయంగా
నిజాయితీ నిబద్ధతలు లక్ష్యమైనపక్షానికి
మసిపూసీ మారేడని మాయలు మోసం చేయని
మానవత్వ విలువలున్న మంచి మనసు
కలవారికి !!ఓటేద్దాం !!
2.ప్రజాస్వామ్యవిలువమరచిబమ్మినితిమ్మినిచేయని ,అవినీతీబంధుప్రీతికాసన మేయనివారికి.చెప్పేదీఒకటైతేచేసేదీవేరొకటై
తీరందాటినవెంటనెతెప్పనుకాల్చనివారికి !!ఓటేద్దాం !!
3.ఉద్యోగుల,ఉపాధ్యాయఉన్నతులనుగౌరవించి,ఉత్సాహాన్నందించిఉరకలేసిపనిచేయగ,ప్రోత్సాహాలందించి పోషణచేసే వారికి- రైతన్నల సంక్షేమమె రామరక్షయ న్నోరికి !!ఓటేద్దాం !!
4.సంప్రదాయసంస్కృతులకుసాదరసా కారమిచ్చి,చెప్పి నట్టి ప్రమాణాలు తూ చ తప్పక చేసి ,పట్టంగట్టించినోరిప్రాణాలకుప్రాణమిచ్చి
ప్రగతిపధంలోప్రభుతనుపరుగెత్తించే వారికి !!ఓటేద్దాం !
5.మద్యానికి ఆశపడి మానవతనువిడనాడీ -డబ్బుకు దాసోహమనిధర్మాన్నీమరవకుడీ ,ప్రతిఓటు పవిత్రమనీ
భవితకిదిపునాదియనీ- యోధులమై మనమంతాయోచించీఅడుగులేసి!!ఓటేద్దాం !!
ఆకలి అంతానికి
జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు
కరువును దూరం చేసి
కడుపులు నింపేందుకు కంకణబద్ధుడయ్యాడు
వంశానుగతంగా వచ్చిన స్టెతస్కోపుకు
ఆదిలోనే మంగళం పాడి
చేనుకే జై కొట్టిన హరిత మిత్రుడు
పోలీసు సర్వీసుకు ఎంపికైనా
వ్యవసాయ పరిశోధనకే పట్టం కట్టిన ధీశాలి

ఎక్కడో తూర్పు తీరాన్నుంచి వినబడ్డ
బెంగాల్ ఆకలి కేకలకు స్పందించిన
దక్షిణాది విద్యార్థి
భిన్నత్వంలో ఏకత్వానికి ‘మెచ్చు’తునక
వ్యక్తిగత సౌఖ్యాలకంటే
సామూహిక అవసరాలనే
ముఖ్యంగా భావించిన ప్రజాప్రేమికుడు
వచ్చినవాటి కంటే
వ్యక్తిగత స్థాయిలో పోగొట్టుకున్నవే ఎక్కువ
తెల్ల కోటు
ఖాకీ పోస్టు
డాలర్ లైఫు
అన్నీ తృణీకరించి
మాతృదేశాన్ని కరువు నుండి
విముక్తి చేసేందుకు అంకితమైన ప్రతిభామూర్తి
కదిలించిన కరువుకు
పరిష్కారం చూపిన వీరుడు
కృషీవలుడికి అండగా
విత్తై వెలిశాడు
స్వయం సమృద్ధికి
ఊతమై నిలిచాడు
బోర్లాగునే
ఆశ్చర్యపరిచాడు
మెక్సికో వంగడాల విలువను గుర్తెరిగి
భారతానికి తెచ్చిన
మాన్ కొంబు సాంబశివన్ స్వామినాథన్
హరిత విప్లవానికి పితామహుడయ్యాడు
ఆకలికి పరిష్కారం చూపి
దేశప్రజకు ఆరాధ్యుడయ్యాడు
(హరిత విప్లవ పితామహుడు ఎం. ఎస్. స్వామినాథన్ మృతి నేపథ్యంలో రాసిన కవిత)
(కవి దర్పణం సాహిత్య వేదిక, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదికల అధ్యక్షులు)