అన్నవరం దేవేందర్ అంతరంగం వర్తమాన జీవన చిత్రణ పుస్తకం పై సమగ్ర విశ్లేషణా వ్యాసం.
ప్రముఖ కవి,అన్నవరం దేవేందర్ కలం నుండి జాలువారిన అంతరంగం వర్తమాన జీవన చిత్రణ పుస్తకం పై సమగ్ర విశ్లేషణా వ్యాసం.కవి దేవేందర్ దిశ డిజిటల్ దినపత్రికలో మే 2021 నుండి సెప్టెంబర్ 2024 వరకు నిర్విఘ్నంగా కాలమ్ కొనసాగింది.అంతరంగం అనేది వ్యక్తి యొక్క అంతర్చేతన భావాలు,ఆలోచనలు మరియు అనుభవాల సమాహారం.ఇది మన లోపలి వ్యక్తిత్వాన్ని,మనోభావాలను మరియు జీవితానికి సంబంధించి మన దృష్టిని ప్రతిబింబిస్తుంది.వర్తమాన జీవన చిత్రణ అంటే ప్రస్తుత కాలంలో వ్యక్తులు మరియు సమాజంలో ఎలా జీవిస్తున్నారో వివరిస్తూ ఆ జీవన శైలిని అర్థం చేసుకోవడం.ఇది వ్యక్తి జీవన విధానం నుండి సామాజిక అంశాల వరకు విస్తరించవచ్చు.ఆధునిక జీవనశైలి అంటే టెక్నాలజీ ఆధారిత జీవనం,స్మార్ట్ ఫోన్లు,కంప్యూటర్లు, ఇంటర్నెట్ ప్రభావంతో కూడి ఉంటుంది.నిత్యం పనిలో బిజీగా ఉండే జీవితం,సమయం తక్కువ, పని ఎక్కువ.కుటుంబంపై శ్రద్ధ తక్కువ,వ్యక్తి స్వేచ్ఛ ఎక్కువగా కొనసాగుతున్నది. సాంప్రదాయాల పట్ల ఆసక్తి నశించి ఆధునికతకు మక్కువ పెరగడం చూస్తున్నాం.సామాజిక జీవనంలో స్నేహ సంబంధాలు తగ్గుతున్నాయి.జనం డిజిటల్ మీడియాలో పరిమితం అవుతున్నారు.నగరాల్లో పెరుగుతున్న జనసాంద్రత,గ్రామాలతో తగ్గుతున్న సంబంధాలు,మానవ అంతరంగం పై ప్రభావం చూపుతున్నాయి.ప్రస్తుత జీవన శైలి అంతరంగం ఒత్తిడి మరియు అశాంతి మధ్య చిక్కుకొని ఊగిసలాడుతున్నది.ఆధ్యాత్మిక,స్వీయ చింతనలు మరియు ధ్యానం వంటి పద్ధతులు వ్యక్తి అంతరంగాన్ని ప్రశాంతంగా ఉంచడంలో కీలకంగా పని చేస్తున్నాయి.ఆధునిక జీవనంలోని వ్యక్తుల అంతరంగాన్ని సమాజంలోని మార్పులను సమన్వయం చేస్తున్న జీవన శైలికి ప్రతిబింబమైన కవి దేవేందర్ అంతరంగం వర్తమాన జీవన చిత్రణ కాలమ్స్ ను మనస్ఫూర్తిగా ఆవిష్కరించుకునే ప్రయత్నం చేద్దాం.అంతరంగం మనస్సులోని జ్ఞాపకాలను తెలియజేసే శక్తి.అంతరంగం పుస్తకాన్ని కలం పట్టిన తొలినాళ్ళ నుంచి కలిసి వెంట నడుస్తున్న సోపతిగాడు,పాత్రికేయ వృత్తినే నమ్ముకొని జీవితాన్ని ఒక యుద్ధంగా ఎల్లదీస్తున్న సాహసికుడు ఆత్మీయ మిత్రుడు మహమ్మద్ ఫజుల్ రహమాన్ కు అంకితం ఇవ్వడం ముదావహం.డాక్టర్ సంగిశెట్టి శ్రీనివాస్ ముందు మాటలో కొన్ని విషయాల అంతరార్థం విడమర్చి చెప్పే వరకు దాని విస్మృత,విపక్ష,వివక్షిత కోణం పాఠకులకు స్ఫురించదు.దేవేందర్ పూర్వాశ్రమంలో జర్నలిస్ట్ కావడంతో నిరంతరం రాసే నైపుణ్యం అబ్బింది. తెలంగాణ మనుషుల జీవితపు ప్రతి మలుపును ఈ వ్యాసాలు సంక్షిప్తంగానే అయినా నిక్కచ్చిగా రికార్డు చేశాయి.ఈ అంతరంగంలో దాదాపు 30 పుస్తకాల పరిచయం ఉన్నది.అన్నవరం దేవేందర్ రచన అంటేనే అది తెలంగాణ తల్లి కమ్మనైన భాషకు అక్షర రూపం.నిరంతరాయంగా మూడేళ్లకు పైగా ఒక కాలమ్ తెలుగు పత్రికల్లో రాయడం అంటే కష్ట సాధ్యమైన పని.ఈ వ్యాసాల ద్వారా తన ఒక్కడి అంతరంగం మాత్రమే కాకుండా సమాజానికి బాకీ పడ్డాం అని భావించే బుద్ధిజీవులందరి భావనలను ఆవిష్కరించాడు.అందుకు ఈ పుస్తకాన్ని చదవడం, మిత్రులకు గిఫ్టుగా ఇవ్వడం కూడా ఒక మార్గమే సంగిశెట్టి శ్రీనివాస్ అంటున్నారు.డి.మార్కండేయ ముందు మాటలో సముద్ర గంభీర విషయమైనా, సాధారణ అంశమైనా ఎంతో అలవోకగా,నల్లేరు మీద బండి నడిచిన చందాన అచ్చ తెలంగాణ యాసలో రాయడం అన్నవరం దేవేందరన్న శైలి.ఒక ఆర్టికల్ కి మరొక ఆర్టికల్ కి పొంతన లేకుండా వైవిధ్యపూరితమైన అంశాలను ఎంచుకోవడమే కాకుండా వాటిని పండు ఒలిచి పెట్టినట్లుగా పాఠకులకు చెప్పడం అన్నకు కొట్టినపిండి.మూడేళ్ల పాటు అన్న తన కాలమ్ ని దిశ దినపత్రిక సాహిత్య పేజీలో కొనసాగించారు.అంతరంగం శీర్షిక పేరుతో కొనసాగిన ఆ కాలమ్..పాఠకుల్లో బాగా పాపులర్ అయింది.పేజీకి తెలంగాణ అస్తిత్వాన్ని తెచ్చిపెట్టింది అన్నారు.అట్ట వెనుక అర్థవంతమైన బ్లర్బ్ రాసిన నగునూరి శేఖర్ ఈ ‘అంతరంగం’ 2021 నుంచి దిశ దినపత్రికలో రాస్తున్న కాలమ్ వ్యాసాలు.ఇందులో సామాజిక,సాహిత్య అంశాలతో పాటు వ్యక్తిత్వ నిర్మాణ అంశాలను తనదైన వాస్తవిక దృక్పథంతో విశ్లేషించారు.అంతరంగం సమకాలీన సామాజిక అంశాలను చిత్రిక పట్టిన సంవేదనల సారం. నడుస్తున్న చరిత్రకు అక్షర రూపం అన్నారు.కవి దేవేందర్ తన అంతరంగ ఆలోచనల గురించి చెబుతూ సృజనాత్మక రచనా వ్యాసంగం కొనసాగుతున్నప్పుడు 2021 మే నెలలో మా హుస్నాబాద్ తొలితరం పాత్రికేయ సహచరుడు మహమ్మద్ ఫజుల్ రహమాన్ ఫోన్ చేసి ‘దిశ’ దినపత్రిక సాహిత్య పేజీలో ఒక కాలమ్ రాయాలని ఆదేశించే ధ్వనితోనే కోరిండు.తెలంగాణ ఉద్యమ సందర్భంలో ఉధృతంగా కవిత్వం రాస్తున్న నాకు 2018 తర్వాత వచనం రాతలకు విరామం మిగిలింది.వెంటనే ‘సరేపో’అని మొదలుపెట్టాను. అప్పుడే ‘రేషమున్న యువతరం ఎక్కడ’ అనే వ్యాసం రాసి పంపిస్తే దానికి ‘అంతరంగం’ అని శీర్షిక తనే పెట్టి ‘దిశ’లో ప్రచురించారు.ఈ అంతరంగం వెనుక ఇంత నేపథ్యం దాగి ఉంది అంటున్నారు.ఈ పుస్తకాన్ని సాహితీ సోపతి,కరీంనగర్ వారు ముద్రించారు.కవి దేవేందర్ అంతరంగంలో నుండి పురుడు పోసుకుని పుట్టిన నూట యాభై కాలమ్స్ సర్వాంగ సుందరంగా అలరారుతున్నాయి.

రేషమున్న యువతరం ఎక్కడ? కాలమ్ లో
తెలంగాణ సాయుధ పోరాటం,భూస్వామ్య వ్యతిరేక నక్సల్స్ పోరాటం,రెండు మార్లు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమాలు,రాజకీయ ఉద్యమాలు,ఇన్ని రాజకీయ ఉద్యమాల స్వభావం ఇక్కడి ప్రజల మీద ఉన్నా గానీ,ఇప్పటి మిలీనియర్స్ తరంలో ప్రశ్నించే స్వభావం కనిపిస్త లేదు.ఎంత అవినీతి జరిగినా నవతరం ఆ వార్తలను సైతం చూడని స్థితి నెలకొని ఉన్నది.ఇదొక పట్టింపులేని తరం వస్తున్నదా? ఆలోచించాలి.కవి దేవేందర్ సమాజం గురించి యువతరం పట్టించుకోవడం లేదని, యువతరంలోని రేషం,ఆవేశం ఏమైంది?అని ఆలోచనలు రేకెత్తించడం బాగుంది.
సచ్చిన పిల్లిని గోడవతల ఇసిరేసినట్టు …కాలమ్ లో
కోవిడ్ మహమ్మారి సోకి మనదేశంలో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు.రోజు రోజుకు మరణాల సంఖ్య పెరిగిపోయి దుఃఖం ప్రవహిస్తున్నది.మరణం మనిషికి వచ్చేదే కానీ,అకాల మరణం సాగనంప లేని దుస్థితి.మనిషి చస్తే నల్లని పాలిథిన్ కవర్లో చుట్టి మునిసిపాలిటీ వాళ్లకు అప్పగించడం,ఎండిన కనుగుడ్ల నుంచి నీళ్లను రాల్చడం.పిల్లి చచ్చిపోతే గోడ అవతలకు పెరట్ల ఇసిరేసినట్లు అయ్యింది.కరోనాతో చనిపోయిన వాళ్ళ స్థితి అలా తయారయింది.కవి దేవేందర్ చక్కటి జాతీయాన్ని ఉపయోగించి కరోనా వైరస్ వాస్తవాన్ని కళ్ళ ముందు ఉంచారు.
అధ్యయనంతోనే వికాసం కాలమ్ లో
మనిషి ఆకలి తీర్చేది పుస్తకమే.మస్తిష్కపు దాహం తీర్చేది పుస్తకమే.ప్రపంచం గురించి పరిచయం చేసేది పుస్తకమే.అసలు పుస్తకాలు లేనిదే మనిషి వికాసం లేదు.కవి దేవేందర్ మనిషికి అధ్యయనంతోనే వికాసం ఉంటది అని,ఇలాంటి కోవిడ్ పాండమిక్ సమయాలలో పుస్తక పఠనం ఉపయోగపడుతుందనడంలో సందేహం లేదు అని అంటున్నారు.పుస్తక పఠనం మనిషి ఉన్నతికి సోపానం అవుతుంది.
దుక్కం కమ్ముకొస్తున్న కాలం కాలమ్ లో
ఎవరిని కదిపిన ఆత్మీయుల కరోనా మరణ రోదనలే.ఎంత దుక్కం అంటే దగ్గర వాళ్లు చనిపోయినప్పుడు బిగ్గరగా పట్టుకొని ఏడ్వ లేని కాలం.మనిషి ఆఖరి యాత్రలో ఆయన జ్ఞాపకాలను తలచుకుంటూ నడవలేని,పోలేని దుస్థితి.ఒక వైపు లాక్ డౌన్ మరో వైపు కరోనా రెండో విడత.ఒక వైద్యులు తప్ప ఎవరు రక్షించలేని స్థితి.ఇంత దుక్క సందర్భంలోను గౌరవనీయమైన వృత్తి గల వైద్యం దారుణ దోపిడీ వ్యాపారంగా మారి పోయింది. లక్షలకు లక్షలు పోయినా మనిషి బతకని స్థితి. చచ్చినా పైసలు కట్టనిది శవాన్ని ఇయ్యని దుస్థితి. దేశంలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు.కవి దేవేందర్ ఇలా సమాజమంతా దుక్క మేఘాలు కమ్ముకున్నాయి అని అంటున్నారు.కరోనా వైరస్ కాలంలోని డాక్టర్ల దోపిడిని ఎండగట్టారు.
ఏలు వంకర పెట్టుడు ఎక్కువైంది కాలమ్ లో
అన్నింటి కన్న అల్కటి పని.దళారి వృత్తి.దళారికి పెద్ద పెట్టుబడి ఏం అక్కర్లేదు.మాటలే పెట్టుబడి. మత్పరిచ్చుడు,కొనిపిచ్చుడు.ఇద్దరి దగ్గర కమిషన్ తీసుకునుడు.జీవన వ్యయం ఇబ్బడి ముబ్బడిగా పెరగడం వల్ల సులువుగా సంపాదించే మార్గాలకు మనిషి పరుగులు తీస్తున్నాడు.ప్రభుత్వ ఉద్యోగులు, లంచాలు,అవినీతి,అన్యాయం,రాజకీయ నాయకుల కమిషన్లు,పనులు,పైరవీలు,ప్రజా ప్రతినిధులకు గూడ పైపైన సంపాదన లేనిది గడవని పరిస్థితి ఉన్నది.అన్ని రంగాల ఉద్యోగులు కూడా పైసలు సంపాదించే అవకాశం ఎక్కడ ఉంటే అక్కడ వేలు పెడతరు.ఒక సామెత ఉంది.‘ఏలు వంకర పెడితే వెన్న వస్తది’అని,ఆ వెన్న కోసమే వెన్న దొంగలు సమాజం అంతా నిండి పోయిండ్రు.కవి దేవేందర్ దేశం రాను రాను ఎటు పోతుందో ?అని ప్రశ్నించడం బాగుంది.
భూమి ఫక్కున నవ్వు కాలమ్ లో
భూమి మీద దయతలచి బతుకుడే గాకుండ, నేలంతా సత్తె నాశనం చేస్తుండ్రు.తెలంగాణ సాయుధ పోరాటంల లక్షల ఎకరాల భూమి పంచి ఇచ్చిండ్రు.ఈ భూమి మీదనే గుట్టలు,కొండలు ఉన్నయి.వాటిని కైమ కైమ చేసి పర్యావరణాన్ని సర్వనాశనం చేసుడు.భూమి మీద సముద్రాలను కలుషితం చేసుడు.వాతావరణాన్ని విష వలయం చేసుడు.ఈ మనిషి అనే జీవికే చెల్లింది.భూమి మీదనే అడవులల్ల మూగజీవాలను వేటాడుడు. నోట్లో నాలిక లేని ఆదివాసి సమాజాన్ని అడవి నుంచి వెళ్లగొట్టుడు.ఇదంతా భూమికి కన్నీరు తెప్పించుడే.కవి దేవేందర్ భూమి గూర్చి మనిషికి మనిషికి మధ్య కొట్లాటలు,కక్షలు,కార్పణ్యాలు కొనసాగుతున్నాయని,ఇవన్నీ చూసి భూమి పక్కున నవ్వుతది.మనిషి ఎక్కిళ్ళు పట్టి ఏడుస్తున్నాడు అని అంటున్నారు.మనిషి చేస్తున్న పనుల వల్ల సహనశీలి భూమాత రోదనలు మిన్నంటుతున్నాయి.వైరాగ్య భావనతో భూమి పక్కున నవ్వడం చూసి మనిషి కన్నీళ్లు కారుస్తున్నాడు అని చెప్పడం బాగుంది.
విద్య వేరు.. విజ్ఞానం వేరు కాలమ్ లో
విద్య వేరు విజ్ఞానం వేరు.అందులో పది మందికి ఉపయోగపడడం వేరు.చాలా మంది మస్తు చదువుకుంటరు.చదివిన శాస్త్రంలో తెలివి ఉంటది గని,బయటి తెలివి ఉండదు.అక్షరాలు నేర్వకున్న అందరి కంటే లోక రీతిగా పనులు చేసే వాళ్లు ఊర్లల్ల మస్తు కనిపిస్తరు.అక్షరాలు రావు.సమాజాన్ని చదువుతరు.బెక్కంటి బాలయ్య అనే పెద్ద మనిషికి చదువు రాదు.ఇతరుల కోసం పని చేసే తత్వం, చైతన్యం కనిపిస్తది.నిజంగా బాగా చదువుకున్న వాళ్ళు చదువు సంధ్యలు లేని వాళ్ల కోసం పని చేస్తారా?అనే ప్రశ్న వేసుకుంటే ఏమో చేయరనే జవాబు వస్తది.చదివిన చదువు,నేర్పిన శాస్త్రం చేస్తున్న ఉద్యోగం వెలగబెడుతున్న పదవి ప్రజలకు ఉపయోగపడాలి.పది మందికి అక్కరకు వస్తేనే జ్ఞానం.కవి దేవేందర్ విద్య వేరు విజ్ఞానం వేరు అని ఉదాహరణలతో చెప్పిన తీరు బాగుంది.
నవ్వే మనిషికి అందం … కాలమ్ లో
కొందరు వక్కడవక్కడ నవ్వుకుంటనే మాట్లాడుతరు.కొందరి మొగం మీద నవ్వు ఎల్ల కాలం ఉంటది.కొందరు ముసి ముసి నవ్వులు నవ్వుతరు.కొందరైతే అసలే నవ్వరు.అసలు మనిషికి మాత్రమే నవ్వు ఉంటది.పసిపిల్లలు పాలు తాగకుండా తల్లి దిక్కు నవ్వు కండ్లు పెడతరు. అంతరాల యంత్రాంగంలో నవ్వులు మాయమవుతయి.నవ్వు సహజంగనే రావాలంటే మనిషి స్వచ్ఛంగా ఉండాలె.తెల్ల కాగితం లెక్క మనసు ఉండాలె.స్వచ్ఛమైన శ్రమ జీవన మానవులకు నవ్వులే పూస్తయి.కవి దేవేందర్ మనిషి అహంకారాన్ని వదిలి వేస్తే నవ్వులు పూయించ వచ్చు అని అంటున్నారు.
అధికార మదంబున … కాలమ్ లో
పవర్ అనేది ప్రమాదకరమైనది.ఎన్నిక ద్వారా గెలిచిన ప్రజా ప్రతినిధులు ప్రజలకు సేవకులుగా ఉండాలి.యజమానులుగా ప్రవర్తిస్తుంటారు.ప్రజా ప్రతినిధుల ముందు అంగరంగ హంగూ ఆర్భాటం, ముందు వెనుక మందీ మార్బలం అట్లనే ఉంటది. అధికారం అంటేనే పెత్తనం.పెత్తనం అంటే నియంతృత్వం.నియంతృత్వంతో ప్రజాస్వామ్యం హతమవుతుంది.అధికారం తలకు ఎక్కిన తర్వాత అహంకారంతో అనుచితంగా ప్రవర్తిస్తుంటారు.ప్రజా సేవ అంటే ప్రజలకు సేవలు అందించడం.కవి దేవేందర్ ఇప్పుడు అట్ల కాదు అప్పటికీ ఇప్పటికీ నాయకుల వ్యవహార తీరు మారి పోయింది అని, ఆనాటి ప్రజాపాలకులు నిస్వార్ధంగా పని చేసే వారు అని అంటున్నారు.నిజంగా ఈనాటి ప్రజా ప్రతినిధులు అధికార మదంతో ప్రజా సంక్షేమం పట్ల శ్రద్ధ చూపడం లేదు.
మంది కోసమే మనమనుకోవాలె కాలమ్ లో
ప్రభుత్వ ఉద్యోగులు అంటే పబ్లిక్ సర్వెంట్లు.ప్రజల సేవకులు.ప్రభుత్వ ఉద్యోగులు,అధికారులు,ప్రజల పట్ల గౌరవంగానే మెలగాలి.అట్లా ఉండదు వ్యవహారం.అంతా చులకన,చిన్న చూపు.రేపు రాపో,మాపు రాపో,లేదు లేదు పో,ఇట్లా ఎట్ల పడితే అట్ల అనే పద్ధతి ఉంటది.కవి దేవేందర్ ప్రభుత్వ ఉద్యోగులు ప్రజల నుంచి వచ్చిన వ్యక్తిగా ప్రజల వేతనం పొందుతూ ప్రజలకు జవాబుదారీగా బాధ్యతగా మెలగాల్సి ఉంటది అని అంటున్నారు.

పౌరస్పృహ కోల్పోతున్న కాలం కాలమ్ లో
సమాజంలో మనిషి మనిషిగా వ్యవహరించాల్సిన రీతి లేకుండా పోతున్నది.ఎన్ని చట్టాలు ఉన్నా,ఎన్ని నిఘాలు ఉన్నాయనే దాని కంటే ఎవరికి వారే స్పృహతో ఒక పద్ధతిగా జీవించాలి అనుకుంటే బాగుంటది కదా.కవి దేవేందర్ నిత్య జీవితంలో పౌరస్పృహ కనిపించని దృశ్యాలు ఎన్నో ఉంటున్నాయి అని అంటున్నారు.సమాజంలో పౌరులు బాధ్యతగా మెలగాలి అనే గొప్ప సూచన ఉంది.
పేరు ఆమెది …అధికారం ఆయనది కాలమ్ లో
స్థానిక సంస్థలైన గ్రామ పంచాయతీలు,మండల ప్రజా పరిషత్,జిల్లా పరిషత్ లో మహిళలకు సగ భాగం రిజర్వేషన్ కల్పిస్తే కూడా,మళ్లీ మగ రాజ్యమే కొనసాగుతుంది.ఆయా సీట్లలో మహిళలు నిలుచుని గెలిచినా నిర్ణయాలు మగవారివే ఉంటున్నయి.ఊరి సర్పంచ్ మహిళ అయినా పంచాయతీ సమస్య ఆమె దగ్గరకు తీసుకెళ్లరు. అందరూ ఆమె భర్తకే తెలియజేస్తరు.ఇట్లా అయితే మహిళలకు హక్కులు,రిజర్వేషన్లు కల్పించడం ఎందుకు?అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది.పేరు ఆమెది అధికారం ఆమెది అయితేనే రాజకీయాల్లో మహిళలు రాణిస్తారు.కవి దేవేందర్ మహిళలు చైతన్యం పెంచుకొని తనదైన రీతిలో పాలించాలి అని భావిస్తున్నాడు.
పని పట్ల ప్రేమ ఉంటేనే మంచిది కాలమ్ లో
చేస్తున్న పని పట్ల ప్రేమ ఉంటే పని సులువు అవుతుంది.ఇది నా పని నేను ఈ రోజులో పూర్తి చేయాలి అనే టార్గెట్ తానే నిర్ణయించుకుని చేసుకుపోవడం సొగసైన పని.ఆధునిక కాలంలో మనిషి పని పట్ల శ్రద్ధ చూపించాలనే గొప్ప సందేశం వ్యక్తం అవుతుంది.
కరోనాతో కకావికలం కాలమ్ లో
కరోనా ప్రపంచాన్ని కకావికలం చేసింది.కరోనా వల్ల చనిపోయిన వాళ్ళ బిల్లులకు లక్షలకు లక్షలు అప్పుల చేసి దుఃఖపడుతున్న సందర్భాలు ఉన్నాయి.ఆసుపత్రుల యాజమాన్యాలు దారుణమైన దోపిడిని కొనసాగించాయి.ఆసుపత్రికి పోతే మరణించినట్లు అయ్యింది.కరోనా వల్ల బాగా లాభపడ్డది ఎవరంటే ఫార్మా కంపెనీలు,కార్పొరేట్ ఆసుపత్రులు.కరోనా వల్ల దాదాపు రెండు సంవత్సరాలుగా బడులు,కళాశాలలు నడువ లేదు. మైదానాల్లో చెట్లు మొలుస్తున్నయి.ఆటలు ఆడి చదువుకునే పిల్లల గుంపు లేదు.ఇండ్లల్లనే ఇన్ని రోజులుగా ఉండి పిచ్చెక్కిపోతున్న సందర్భం వచ్చింది.ఆన్ లైన్ క్లాసులు పేరుకు నడుస్తున్నాయి గని పిల్లలకు ఇది సరిపడడం లేదు.అందరి ఇండ్లలో అవకాశం లేకపోవడం చిన్న సెల్ ఫోన్ లో టెలివిజన్లో విద్య,విజ్ఞానం పొందలేక పోతున్నారు. కరోనా వల్ల సామాన్యులు,చదువుకునే పిల్లలు అందరి జీవితాలు వెతల పాలయ్యాయి.కవి దేవేందర్ ఆనాటి దుస్థితిని కళ్ళ ముందు ఉంచారు.
యాజమాన్యం,ఉద్యోగ వర్గం కలగలిసి పోయిన కాలం కాలమ్ లో
ప్రభుత్వాలు,ఉద్యోగ సంఘాలు,స్నేహపూరిత వాతావరణంలో ఉన్నట్లు కనిపిస్తున్నాయి. కార్మికులకైనా,కార్మిక నాయకులకైనా,ఉద్యోగ సంఘ నాయకులకైనా,పోరాట స్వభావం పూర్తిగా అంతరించి పోయినట్లు కనిపిస్తుంది.గ్లోబలైజేషన్ కాలం ఇరవై ఏళ్ల కింద ప్రపంచమంతా దాపురించింది.చాలా ఏళ్ల నుంచి ప్రభుత్వ,ప్రైవేటు రంగ కార్మిక సంఘాల పోరాట చైతన్యం కనిపించడం లేదు.సాఫ్ట్ వేర్ రంగంలో పని చేసే వాళ్లకు మంచి వేతనం ఉంటుంది.పని గంటలు ఎక్కువగానే ఉంటాయి.ఒత్తిడి కూడా ఉంటుంది.వాళ్లు ఎవరు ట్రేడ్ యూనియన్ లో కలవరు.సంఘం పెట్టుకునే అవకాశం కూడా లేదు.ఉద్యోగ సంఘాల్లో కూడా సమరశీలత కంటే సామరస్యశీలత ఎక్కువ కనిపిస్తది.యాజమాన్యం,ఉద్యోగ వర్గం కలిసి పోవడం తగదు.ఉద్యోగ వర్గంలో చైతన్యం కొరవడితే సమస్యలు ఎలా పరిష్కరించుకుంటారు అనే గొప్ప సందేశం కనబడుతుంది.
మనసు తెలుసుకోవాలి కాలమ్ లో
అవతల వారిని అర్థం చేసుకోకపోతే మనసుల మధ్య దూరం పెరిగిపోతుంది.సమస్యనైనా, విషయాన్నైనా అవతలి వ్యక్తుల సైకాలజీతో పరిశీలించాలి.లేకుంటే మానవ సంబంధాలు దెబ్బ తింటాయి.రాజకీయ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉండాలి.అది ఇసుమంత అయినా సరే ఏ రాజకీయ పార్టీ అయినా అట్లనే ఉంటది. అధినేతకు నంగి నంగి,వంగి వంగి ప్రవర్తిస్తేనే మనుగడ ఉంటది.మనిషి ఎట్లా ఉన్నాడో ఆయన చుట్టూ ఉన్న వాళ్లతో సంబంధాల కొనసాగింపు వల్ల తెలుస్తది.కవి దేవేందర్ ఏది ఏమైనా ఒకరికొకరు అర్థం చేసుకోవడం,అవతలి వాళ్ళ స్థితిని, ఆలోచనలను గౌరవించడం అందరి మానసిక ఆరోగ్యానికి మంచిది అని చెప్పిన తీరు బాగుంది.ఇవ్వాళ సమాజంలో అదే కొరవడింది. మనిషి అవతలి వాళ్ళ మనసు తెలుసుకొని ప్రవర్తించాలి అనే ఆదర్శ భావం దాగుంది.
ఎవల పని వాళ్లే చేసుకునుడు కాలమ్ లో
ఇంటా,బయటా గమనిస్తుంటే కొంతమంది ఇంకొకరి మీద ఆధారపడి జీవించేవాళ్ళు కనిపిస్తరు.నిజానికి ఎవరి పని వాళ్ళు చేసుకోవడంలో ఉన్న తృప్తి, ఆనందం పొందడం ఆత్మగౌరవం.ఎవరి వ్యక్తిగత పనులు వాళ్ళు చేసుకోకపోవడం పూర్తిగా ఇంకొకరి మీద ఆధారపడి జీవించే స్థితి స్టేటస్ గా కొనసాగుతుంది.నిజానికి సమాజంలో పని సంస్కృతి పెంపొందాలి కానీ,చేయించుకునే కల్చర్ పెరుగుతుంది.ఇది పని పట్ల వ్యతిరేకత.పని చేసే మనుషుల పట్ల తక్కువ భావం.ఎవరి పనులు వాళ్లే చేసుకోవాల్సిన అవసరం ఉంది.కవి దేవేందర్ మనిషి ఇతరులపై ఆధారపడవద్దని,బద్ధకాన్ని వీడాలని,ఎవరి పనులు వాళ్లు చేసుకోవాలని. ఆరోగ్యానికి మంచిది అని చక్కగా వివరించారు.

మాట తీరుతోనే మనిషి విలువ కాలమ్ లో
మనిషికి మనిషి పట్ల గౌరవం ఉండాలి.ప్రేమ హృదయం కనపడాలి.ఈ తరం పిల్లలు మాత్రం ‘అంకుల్ ఆంటీ’అని ఇతరులను గౌరవ సూచకంగనే పిలుస్తున్నరు.కొందరు ఇంకొకరి గురించి మాట్లాడితే పేరు చివరకు అన్నా అంటరు.అందులో మనకు అభిమానం కనిపిస్తది.ఏది ఏమైనా మనిషి అన్న వాడు ప్రేమాస్పరుడు అయి ఉండాలి.హృదయం తెల్ల కాగితంలా తెల్లగా ఉండాలి.కవి దేవేందర్ మాట తీరుతోనే మనిషికి విలువ ఉంటుందని,మనిషి ఇచ్చిన మాటను కాపాడుకోవాలి ఆని చెప్పిన తీరు అద్భుతంగా ఉంది.
పట్టింపు లేని తరం తయారవుతున్నది కాలమ్ లో
ఇప్పుడు పెరుగుతున్న తరంలో ప్రశ్నించుడు.ఇట్లా ఎట్ల ఉంటుంది.ఇది పద్ధతి కాదు కదా?అని ఆలోచించుడు పూర్తిగా లేకుండా అయితంది.పక్క వారికి అన్యాయం జరిగినా పట్టించుకోక పోవడం, ఏదైనా సమస్య వస్తే దాని మూలాల్లోకి వెళ్ళక పోవడం,ముఖ్యంగా హేతుబద్ధంగా ఆలోచించక పోవడం ఎక్కువగా కనిపిస్తుంది.పూర్వకాలంలో శ్రీ శ్రీ మహా ప్రస్థానం చదివి అదో రకమైన ఉత్తేజం పొందారు.సామాజిక విషయాల పట్ల అవగాహన, చట్టాల అమలు,పౌర హక్కులు,పౌర స్పృహ, బాధ్యతలు,ప్రభుత్వ తీరు తెన్నులు లాంటి అంశాల అవగాహన లేకుండా పోయింది.కవి దేవేందర్ ఈనాటి యువతరం పట్టింపు లేకుండా వ్యవహరిస్తున్నారు అని అంటున్నారు.
మొక్కలు నాటుడు గుట్టలు మింగుడు కాలమ్ లో
మొక్కలు నాటాలె,చెట్లు పెంచాలనే స్పృహ ఈ కాలంలో అందరికీ వచ్చింది.ప్రతి పల్లెకు ఆనుకుని ఉండే గుట్టలకే ముప్పు వచ్చింది.ఊరెక్కడ అంటే ఆ గుట్ట కిందనే అని చెప్పుతరు. అగోరామసక్కదనమసొంటి గుట్టలను గ్రానైట్ అమ్ముకునేందుకు మాయం చేస్తున్నరు.ఊరంతా మొక్కలు నాటి పెంచుడెందుకు?వేలాది చెట్లు, మహావృక్షాలు ఎదిగిన గుట్టలను పగలగొట్టుడు ఎందుకు?గుట్ట అంటే రాళ్లు,బండలు మాత్రమే కాదు.అదొక వనం.గుట్టలను పైసల కోసం గ్రానైట్ క్వారీలకు ఇస్తే పర్యావరణం నాశనం అయితది. ఊర్లల్ల హరితహారం ఎందుకు?ఊరు పక్క ఉన్న గుట్టలు అమ్ముకునుడెందుకు?ఇందులో వృక్షాలను, గుట్టలను కాపాడుకోవాలి అనే సందేశం కనబడుతుంది.
సుప్త చేతనకు మాతృభాష చికిత్స కాలమ్ లో
తెలుగు నేలకు వేల కిలోమీటర్ల ఆవల సౌదీ అరేబియా దేశం.తెలుగు వినిపించని కనిపించని ప్రాంతంలో చావు అంచులకు తాకి వచ్చింది. ముప్పయి నాలుగు రోజులు కోమాలో ఉన్న స్థితి.
ఇరవై ఏడు రోజుల నుంచి వెంటిలేటర్ నుంచి ప్రాణ వాయువు అందుతున్నది.నాలుగు తెలుగు పదాల వల్లనే తన మెదడు పని చేస్తున్న అలికిడి వల్ల పునర్జన్మ పొందాడు.ఇర్ఫాన్ మహమ్మద్ జెడ్డా నగరంలో అంతర్జాతీయ స్థాయి సీనియర్ జర్నలిస్టుగా పని చేస్తున్నాడు.చిత్తూరు జిల్లా నుంచి వెళ్లి అక్కడ క్రిటికల్ కేర్ హెడ్ గా పనిచేస్తున్న మమతకు ఈ విషయం తెలిసింది.వెంటనే తన పేషెంట్ వద్దకు వెళ్లి తెలుగులో మాట్లాడింది.ఇర్ఫాన్ మెదడులో కదలిక కనిపించింది.ఈ వివరాలన్నీ ఇర్ఫాన్ స్వయంగా వివరించారు.తల్లి భాష పలుకులలోనే మెదడు మ్యాపింగ్ స్పందనలు.ఏ భాష అయినా నేర్చుకోవచ్చు.ఎవరి మాతృ భాష వారి సంస్కృతి.కవి దేవేందర్ పంచుకున్న ముచ్చట్లు ఎప్పటికీ గుర్తుంటాయి.సుప్త చేతనకు మాతృ భాష చికిత్సతో ఇర్ఫాన్ కోలుకోవడం అద్భుతం.
ప్రామాణికతే … అప్రజాస్వామికత కాలమ్ లో
ఎవరు మాట్లాడుకునేది వాళ్ల భాష.ఎవల అవ్వ నేర్పిన పలుకులే వాళ్ళ భాష.ఇది ప్రామాణికమైన భాష అంటూ మిగిలినదంతా మాండలికం అనడం మంచిగా లేదు.అందరు మనుషులే అందరిదీ భాషనే.ప్రామాణికత గిట్లనే రాయాలి అనేది అప్రజాస్వామికత.భాషలో కొత్త పదాలు కలుపుకుంట రాస్తూ పోవాలె.అది విస్తృతం అయితది.కవి దేవేందర్ ప్రామాణిక భాష గిట్లనే ఉండాలి.గిట్లనే రాయాలి అనుడు సక్కనైన మాట కాదు అంటూ భాషా పండితులకు సరైన సమాధానం ఇచ్చారు.
తెలంగాణ మట్టి పరిమళం పాట కాలమ్ లో
బతుకమ్మ పండుగ అంటే పువ్వులతో బతుకమ్మను పేర్సుడే కాదు.పదాలతో పాటలు అల్లుడు.బతుకమ్మ పర్వదినం.స్త్రీలు ఆడి పాడతారు.కాబట్టి స్త్రీల పండుగ.తెలంగాణ ప్రాంతానికే పరిమితమైన పర్వం.ఇది ఒక సాంస్కృతిక ఉత్సవం.పదాలు పాడుతూ కథనం చెప్పడం,దాన్ని కోరస్ గా ఉయ్యాలో అంటూ అందుకొని పాడడంలో ఒక సజీవ లక్షణం ఉన్నది.బతుకమ్మ అంటే తెలంగాణ ఆడబిడ్డలకు ఇష్టమైన పండుగ.బతుకమ్మ సంస్కృతి శ్రమ జీవితానికి సంబంధించినది. మహిళల కళాత్మక విలువలకు సంబంధించినది. బతుకమ్మ ఒక సాహిత్య సాంస్కృతికోత్సవం.కవి దేవేందర్ బతుకమ్మ విశిష్టతను తెలంగాణ మట్టి పరిమళం పాటలో ఉంది అని చెప్పిన తీరు చక్కగా ఉంది.
మనిషికి తార్కిక ఆలోచన ఉండాలి కాలమ్ లో
ఎంత విద్యావంతులైనా తార్కిక ఆలోచన లేకపోతే ఉత్త మనిషి కిందనే లెక్క.జీవితంలో కొంచెమైనా లాజికల్ గా ఉండాలి కదా! ఏమిటి?ఎట్లా? ఎందుకు?అనే శాస్త్రీయ విశ్లేషణ దాకా ఎందుకు? అనారోగ్యంగా ఉన్న మనిషిని ఆసుపత్రిలో చేర్పించేందుకు కూడా ‘మంగళవారం ఐ రాదు’ అనే ముచ్చట తెలిసి పరేషాన్ అనిపించింది. మంగళవారం నాడు ఆసుపత్రిలో చేరితే తమకు ఐ రాదు అంటే ఆ వ్యాధి ముదిరితే ఎట్లా?ఇంకో ప్రమాదం ముంచుకు రావచ్చు కదా?ఈనాటి విద్యార్థులకు చదువుతో పాటు లోక జ్ఞానం, శాస్త్రీయంగా ఆలోచించడం,తార్కికంగా చర్చించడం కూడా సిలబస్ లో ఉండాలి.కవి దేవేందర్ మూఢ నమ్మకాలను నమ్మ వద్దు.శాస్త్రీయంగా ఆలోచించాలి అంటూ కనువిప్పు కలిగించారు.
యువతరానికి సోయి ఉండాలి కాలమ్ లో
రాజకీయ పార్టీలు,రాజకీయ ప్రముఖులు వాళ్ల కార్యకలాపాలు,వాళ్ల చరిత్ర చూస్తే విద్యావంతులకు జర అసహనం అనిపిస్తుంది గాని,ఈ ప్రపంచంలో రాజకీయ నిర్ణయం లేకుండా ఏదీ నడవదు. విద్యావంతులైన ఉద్యోగులు,సంపన్న శ్రేణులు, నిరుద్యోగులు రాజకీయాలు మనం చేయలేమని, మనకు సరిపోవు అని దూరంగా ఉంటున్నరు. అసలు ఓటు కూడా వేయడానికి నిరాసక్తత వ్యక్తం చేస్తున్నరు.మరి ఎంత దూరం ఉండాలని అనుకున్నా రాజకీయాలను,ఆయా పార్టీల తాత్విక సిద్ధాంతాలను అర్థం చేసుకోకుంటే అవి మన ప్రతి అవసరాన్ని ప్రభావితం చేస్తయి.రాజకీయ పార్టీలే కదా పరిపాలనను నడిపేవి.అయితే,అందులో అందరు అవినీతిపరులు ఉంటారు.ఇందులో కూడా కులాలు,మతాలు,ఆధిపత్య గొడవలు ఉంటాయి. మనకెందుకులే అనుకుంటే ఇంతే సంగతులు. అందుకే రాజకీయ పార్టీలు విద్యావంతుల జోలికి వెళ్ళవు.కవి దేవేందర్ రాజకీయాల పట్ల అసహనం కన్న చైతన్యం పెంపొందించుకోవాలని,రాజకీయాలు నేటి తరానికి అవసరం అంటూ ఆలోచింప జేస్తున్నారు.
కొత్త సంస్కృతులు విస్తృతమవుతున్నయి కాలమ్ లో
సంస్కృతి,సంప్రదాయాలు,ఆచారాలు,వ్యవహారాలు పరంపరగా వస్తుంటయి.ఇప్పుడు మధ్యతరగతి జనాలు చిన్న చిన్న ఫంక్షన్లకు కూడా మద్యం బాటిళ్లు తెచ్చి దావత్ చేసుకుంటున్నరు.మద్యం తాగించడం కొత్త సంస్కృతిలో భాగమైంది.ఒక ఇంటిలో ఎవరైనా చనిపోతే ఇది వరకు ఆ కుటుంబాన్ని సాధారణంగా పరామర్శించేవాళ్ళు.కొత్త కల్చర్ వల్ల మందుతో పరామర్శించే అలవాటయింది.పుట్టిన రోజులకు మొదలు ప్రతి సందర్భంలోనూ మందు సంస్కృతి కుటుంబంలోనికి ప్రవేశించింది.ఈ సంస్కృతి కొనసాగింపుగా కింది మధ్యతరగతి శ్రమజీవనపరులు సైతం తాగడం, తూలడం లొల్లులు చేసుకోవడం ఎక్కువ అవుతున్నది.తాగడం ఎక్కువైతే కుటుంబంలో గొడవలు,రాష్ డ్రైవింగ్ ప్రమాదాలు,తద్వారా మరణాలు సంభవిస్తున్నాయి.ఎందుకంటే ప్రజలు తాగితేనే ప్రభుత్వ బొక్కసం నిండుతుంది.ప్రజలు తాగడానికి అలవాటై ఉంటేనే సీసా ఇచ్చి ఓట్లు వేయించుకోవచ్చు.కవి దేవేందర్ తాగడం వద్దని ఎవరూ అనరు.ఎవలకు వాళ్లే అదుపులో ఉండాలి అని అంటున్నారు.తాగుడు సంస్కృతికి స్వస్తి చెప్పాలి.అప్పుడే కుటుంబాలు,దేశం ప్రగతి పథంలో సాగిపోతాయనడంలో సందేహం లేదు.
చిన్నపిల్లగాండ్లకు కూడా తెలుస్తుంది కాలమ్ లో
చిన్న పిల్లలు కూడా మనం ఏం మాట్లాడుతున్నం? ఎందుకు మాట్లాడుతున్నం?మాటల వెనుక ఉన్న మర్మం కనిపెడుతున్న రోజులు ఇవి.ఈ రోజులలో యతి ప్రాసల మాటలకు ఓట్లు గలగల రాలవు కదా. గతంలో రాలవచ్చు.అవసరం కాబట్టి,ఇప్పటి మాటలను ఎట్లు నమ్ముదురు?అసలు ఈ లొల్లి ఎందువల్ల వచ్చింది.ఇలా తప్పు ఎవలది?ఒప్పు ఎవరిది?అనే సున్నితపు గీతను పసి కట్టే వాళ్ళు మేధావులే కానవసరం లేదు.ప్రజలు కనిపెడతరు. ఒక్కలు చెప్పిందే నమ్మే స్థితి కాదు.అందరి మనసులకు సీసీ కెమెరాలు ఉంటయి.అయితే నమ్మినట్టు మౌనంగనే ఉంటరు.ఎవలు చెప్పిన అదే గంపగుత్తగా నమ్మరు.కని లంగ ఎవలో?దొంగ ఎవలో?కనిపెడతరు.అవకాశం వచ్చినప్పుడు తెల్లగోలు చేస్తరు,చూస్తున్నం కదా?కవి దేవేందర్ చిన్న పిల్లలను ఉదాహరణగా తీసుకొని లోక రీతిని తెలియజేసిన తీరు అద్భుతంగా ఉంది.
అసలు ప్రజా ప్రాతినిధ్యం అదే కాలమ్ లో
ప్రజా ప్రతినిధులు అంటే ప్రభుత్వంలో ప్రజల సంక్షేమం కోసం పని చేసే వారు.చాలా మంది ప్రజా ప్రతినిధులు మంత్రులు అయిన తర్వాత అసలు మాట్లాడాలనుకున్న వారికి దొరకని స్థితి ఉంటది. మంత్రిగారి కారు నగరంలోకి వస్తుంటే ఆ హంగామానే వేరుగా ఉంటది.ఆయన వచ్చే రహదారులన్నీ ఆయన కోసం తెరిచి అందరికీ మూసి వేస్తరు.ఏ ఊర్లకు వచ్చినా రోడ్లన్నీ అన్యాయంగా నిలిచిపోవాల్సిందే.హంగూ, ఆర్భాటం,ఒక ప్రజాప్రతినిధి అస్తిత్వంగా చలామణి అవుతున్నది.ప్రజా ప్రతినిధులు ప్రజలకు యజమానులు అనే భావనలో ఉంటూ సేవా దృక్పథం ఉండాల్సి ఉంది.ప్రజాప్రతినిధులు ప్రజలను ముప్పు తిప్పలు పెట్టకపోతే సరిపోతది.ఏది ఏమైనా హంగామా,ఆర్బాటం,హడావుడి పటాటోపం తగ్గి పనులు సులువు అయితేనే అందరికీ తృప్తి.కవి దేవేందర్ ప్రజా ప్రతినిధులు ప్రజల పట్ల బాధ్యతగా మెలగాలి అని గుర్తు చేస్తున్నారు.
అంతరాత్మను శోధించుకోవాలి కాలమ్ లో
ఎవరి అంతరంగాన్ని వాళ్లే జల్లెడ పట్టుకుంటే మనుషులకు మనుషులకు మధ్య అగాధం ఏర్పడదు.కొంత మంది మనుషుల సంబంధాలు దూరం దూరంగనే ఉంటయి.అయితే ఆఖరుకు ఎవరు ఏం పట్టుకపోరు కని,ఉన్నన్ని రోజులు కలిసి మెలిసి ఆత్మీయంగానైనా జీవిస్తే అనంత కాలంలో నాలుగు మంచి జ్ఞాపకాలని మిగిల్చి పోవచ్చు.మంచి ప్రవర్తన,మంచి మనస్తత్వం సుగుణం నలుగురికి సహాయం చేసే గుణం,అవసరానికి తోడు నిలిచే వ్యక్తిత్వం సమాజంలో అవసరమైన విషయాలు. ఇవన్ని రోజు రోజుకు మానవుల మధ్య పెరిగిపోతుండాలి కానీ తగ్గి పోతున్నాయి. మనిషన్నప్పుడు పుట్టి పెరిగిన వాతావరణంతో మమేకమై ఆలోచిస్తాడు.మనిషి అధ్యయనంతోనే చైతన్యం పెంపొందించుకోవాలి.మానవ సంబంధాలు సుతారంగా నిలుపుకోవాలి.అప్పుడే మానవ పరిమళం ముందు తరాలకు వారసత్వంగా ఇస్తుంది.కవి దేవేందర్ అంతరాత్మ శోధనతోనే మనసు తేలిక అవుతుందనే ఆలోచనలు రేకెత్తిస్తున్నాడు.
మారుతున్న స్వరాలు కాలమ్ లో
ఎవరైనా ఎక్కెక్కి పడి ఏడిస్తే ‘అయ్యో ఎంత బాధనో గదా’అనే అనిపిస్తది.అందునా చంద్రబాబు నాయుడు అంతటి మనిషి వలవల కన్నీళ్లు రాలుస్తూ దుక్కపడితే అయ్యో అనిపిస్తది. ఎవరు ఏడిచినా ‘అయ్యో’ అంటాం.ఏది ఏమైనా రాజకీయ నాయకులు అత్యంత నీచమైన స్థితికి దిగజారి పోయారు.ఒక్క పార్టీ ఒక్క రాజకీయ నాయకుడు అని కాదు దాదాపు వ్యవస్థనే ఇట్ల తయారయింది.అసలు రాజకీయ పార్టీలకు ప్రాతినిధ్యం వహించే ప్రజాప్రతినిధులు రాజకీయ నాయకులు సమాజానికి ఆదర్శంగా కనిపించాలి. తిట్టుకొనుడు,జుగుప్సాకరమైన మాటలు అనుకునుడు.ఒకరిని మించి మరొకరు తయారవుతున్నారు.ఇతర నాయకులను చులకన చేసి మాట్లాడడం,ఎట్ల పడితే అట్లనే మాట్లాడడం కామన్ అయ్యింది.కవి దేవేందర్ రానున్న రోజులలో అలనాటి ఆదర్శ నాయకులు కనిపించకపోవచ్చు అని అంటున్నారు.
ఆస్వాదిస్తేనే ఆనంద జీవనం కాలమ్ లో
సూర్యోదయం,సూర్యాస్తమయ సందర్భాలను అప్పటి సూర్యుని రంగును పరవశంతో పరిశీలిస్తే కలిగే తృప్తి వేరుగా ఉంటది.ఇది ఎక్కువగా పల్లెటూర్లనే సాధ్యం.పట్టణాల్లో సూర్యుడే కనపడనన్ని ఎత్తైన భవనాలు,కాంతి కూడా రాకుండా గోడలు,పరదాలు,మల్లా లోపల కాంతి కోసం విద్యుత్ దీపాలు,చెరువు గట్టు మీది నుంచి లేదా పొలం గట్ల మీద మీంచి సూర్యోదయం కన్నా ముందే నడుస్తే ఆ వాతావరణ అనుభూతి ఎందులో రాదు.ప్రేమ,ఆనందం,స్నేహభావం,ఇవన్నీ మనిషి జీవితాన్ని సంపన్నున్ని చేస్తాయి.డబ్బు,ఆస్తి, అంతస్తు,హోదా,పార్టీలు ఇచ్చే సంపన్న సుఖలాలస కంటే,ప్రకృతిలో ప్రకృతిగా సాటి మనిషిని కరుణ రసాత్మకంగా చూడటం మంచిగుంటది.పట్నంలో ఉన్న వాళ్లు కూడా ఏం పని చేయాలన్నా కొంచెం బయటకు నడిచి వెళ్లాలి.చెట్లు చేమను చూస్తే మనిషికి ఒక రకమైన మానసిక ఉల్లాసమే కాదు పులకరింత కూడా.పసిపాపల నవ్వుల లోని వెలుగు చూడగలగాలి.మూగజీవాల పట్ల కరుణ ప్రకటించాలి.కవి దేవేందర్ మనం ఇతరులకు ఇవ్వడంలో ఉన్న మానసిక తృప్తి తీసుకోవడంలో ఉండదని అంటున్నారు.ఆస్వాదిస్తేనే ఆనంద జీవనం ఉంటుందనే విషయాన్ని అందరం స్వాగతిద్దాం.
అనివార్యతను ఆహ్వానించాల్సిందే కాలమ్ లో
తల్లిదండ్రులను ‘ఓల్డ్ ఏజ్ హోంలో వేయవద్దు లేదా వేస్తున్నారు’ అనే నిందార్థంలో పత్రికలు,టీవీలలో కార్టూన్లు,కథలు,వ్యాసాలు వస్తుంటాయి.వృద్ధులకు ఇల్లే మంచి సౌకర్యం,సౌలభ్యం.ఇంట్లో మనుషులందరు రెక్కలు వచ్చిన పిట్టల్లా ఎగిరిపోతే ఎలా?ఉన్న ఊర్లో ఉద్యోగాలు ఉండవు.చదివిన చదువులకు కొలువులు ఎక్కడో సుదూర నగరాల్లో లేదా దేశాల్లోనే.ఇది కాలం తెచ్చిన బలవంతపు పరిణామం.అక్కడికి వృద్ధులైన తల్లిదండ్రులను తీసుకుపోలేరు.తీసుకుపోయినా అక్కడ నెగుల లేరు.ఎవరో ఒకరు పెడితే తినాలి.వండితేనే ఉండాలి అనే స్థితికి వచ్చినంక ఈ ఓల్డ్ ఏజ్ హోంలు అవసరానికి అనుగుణంగానే వెలసినాయి.నిజానికి ఓల్డ్ ఏజ్ హోంలో అన్నీ ఉంటాయి.ఇక ఆఖరుకు వృద్ధులంతా కలిసి ఉండాల్సింది వృద్ధాశ్రమాలలోనే. ఆధునిక మార్పులకు అనుగుణంగా వృద్ధ తల్లిదండ్రులు పిల్లలు అందరు మైండ్ సెట్ మార్చు కోవాల్సి ఉంటుంది.ఆఖరు మజిలీలో అదొక ఆటవిడుపు అవుతుంది.సాంకేతిక విద్య విస్తృతమైన తర్వాత ప్రపంచీకరణ ప్రభావం వల్ల కుటుంబాలు కూడా గ్లోబల్ అయిపోయినవి. అనివార్యమైన అభివృద్ధి నమూనా ఇది.
కవి దేవేందర్ అనివార్యతను ఆహ్వానించాల్సిందే అని అంటున్నారు.
పుస్తకం ప్రియ భూషణం కాలమ్ లో
పుస్తకాలే ప్రపంచాన్ని పుట్టిస్తాయి.పుస్తకాలు అధ్యయనం చేయకుంటే బాయిలో కప్పలాగ జీవించడమే.ఆ కప్పకు కూడా చచ్చేంత వరకు ఆహారం దొరుకుతుంది.ఆనందంగానే ఉంటది కావచ్చు.కానీ,ఆ బాయి దాటి ప్రపంచాన్ని చూడ లేరు.ప్రపంచంలోని ఎన్నో విషయాలు పుస్తకాలలోనే నిక్షిప్తమై ఉన్నాయి.మానసిక వికాసం కొరకు,చరిత్ర పట్ల అవగాహన కోసం,పుస్తకాలు చదవడం అవసరం.పుస్తకాలు సమస్త ప్రజల ఆస్తులు కావాలి. ఇంటింటా పుస్తకాల అలమార ఉంచుకోవాలి. అందులో నచ్చిన మెచ్చిన అన్ని రంగాల పుస్తకాలు అమర్చుకోవాలి.కవి దేవేందర్ చెప్పినట్లుగా పుస్తకం ప్రియ భూషణం కావాలని కోరుకుందాం.
కాలానికి సజీవ సాక్ష్యం గాజోజు ప్రాణదీపం కాలమ్ లో
గాజోజు నాగభూషణం ఆయన తన యాభై ఏళ్ల తర్వాత ప్రాణ దీపం కవితా సంపుటిని ప్రామాణికంగా వెలువరించారు.అంతకు ముందు మట్టి సరిగమలు నానీల పుస్తకం వెలువరించారు. ప్రాణ దీపంలో ఉద్యమాల తాత్వికత,జీవన సంఘర్షణలు,పోరాట ఆరాటాలు,అసమానతలపై ఎక్కుపెట్టిన ఆలోచనలు,కరోనా కల్లోల నేపథ్యాలు ఉన్నాయి.ఈ ప్రాణదీపం కవితా సంపుటిని ఇటీవలనే పరమపదించిన తన మాతృమూర్తి స్మృతిలో రచయిత వెలువరించారు.కవి దేవేందర్ ఇందులో ఎన్నో సమకాలీన విషయాలు మనల్ని కలవరపెడతాయని అంటున్నారు.
సాన తేలిన వేట వాక్యం బూర్ల కవిత్వం కాలమ్ లో
బూర్ల వెంకటేశ్వర్లు ఇటీవల ప్రాణగంధం అనే కవితా సంపుటి వెలువరించారు.వృత్తిరీత్యా బూర్ల వెంకన్న డిగ్రీ విద్యార్థులకు తెలుగు సాహిత్యాన్ని బోధించే వాడు.ఇంకేముంది ఆయన కవిత్వ మెళుకువలు తెల్సిన నేర్పరి.ఇప్పటికే ఐదు పుస్తకాలు వెలువరించారు.ఇది ఆరవ సంపుటి.ఆయన కవిత్వం నిండా మనిషి జీవన తాత్వికత నిండి ఉన్నది.కవి దేవేందర్ సాధారణంగా అందరు చూస్తున్న అంశాలే కాని బూర్ల కంటి చూపులో కవిత్వం ఉందని అంటున్నారు.
కాలంతో కలిసి నడిచిన కాలువ మల్లయ్య కాలమ్ లో
నిరంతర శ్రమ సౌందర్యాన్ని సృష్టించిన రచయిత కాలువ మల్లయ్య.తెలుగు నేల మీద ఇంత విస్తృతంగా రాస్తున్న సృజన కారుడు మరెవ్వరు లేరేమో.ఇప్పటి వరకు 20వేల పేజీలకు పైగా రాసిన రచయిత.ఆయన సాహిత్యంపై 28 మంది విద్యార్థులు ఎం.ఫిల్. పిహెచ్,డి పరిశోధనలు చేశారు.శాతవాహన,కాకతీయ విశ్వవిద్యాలయాల్లో తన నవలలు పాఠ్యాంశాలుగా ఉన్నాయి.కాలువ మల్లయ్య భూస్వామ్య ప్యూడల్ వ్యవస్థ అవశేషాలను దానికి వ్యతిరేకంగా వచ్చిన పోరాటాలను చిత్రించారు.కాలువ మల్లయ్య బహుజన కుల జీవితాల్లోని కల్లోలాలను గొప్పగా విప్పి చెప్పారు.కవి దేవేందర్ ఆయన సాహిత్య జీవితం కూడా యాభై ఏళ్లు నిండుతున్న సందర్భంగా విస్తృతంగా ప్రజల భాషలో రాస్తున్న గొప్ప రచయిత కాలువ మల్లయ్యకు శుభాకాంక్షలు తెలియజేయడం బాగుంది.
ఒక విస్మృత వీరుని చరిత్ర కాలమ్ లో
ప్రజలే చరిత్ర నిర్మాతలు అనడంలో ఎలాంటి సందేహం లేదు.చరిత్రను అక్షరబద్ధం చేయడం చారిత్రక అవసరం.మల్ దాదా 1920 తరువాత సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రాంతంలోని తురకవానికుంట పోతారం (జె) లో అడవిని నరికి సమిష్టి వ్యవసాయ క్షేత్రం ఏర్పాటు చేసుకున్న వీరుడు.వెట్టిచాకిరికి వ్యతిరేకంగా పోరాటం చేసి కలిసి వ్యవసాయం చేసి ఎదురు నిలిచిన ధీరుడు అని గులాబీల మల్లారెడ్డి ఇటీవల రాసిన మల్ దాదా చారిత్రక నవల ద్వారా తెలుస్తున్నది.ఈ నవలా రచయిత మల్ దాదాకు మనుమడు అయితడు.మల్ దాదా కొడుకు లింగారెడ్డి.లింగారెడ్డి కుమారుడు గులాబీల మల్లారెడ్డి.మల్ దాదా నవల 2016 లో మల్లారెడ్డి వెలువరించారు.వీరు సీనియర్ న్యాయవాదిగా కరీంనగర్ లో ప్రాక్టీస్ చేస్తున్నారు. వీరు ప్రవృత్తి రీత్యా రచనా వ్యాసంగం చేస్తున్నారు. ఒక విస్మృత వీరుని చరిత్ర మల్ దాదా నవల అందరు చదవాలి.
ఇక్కడి నేల – అక్కడి వాన కాలమ్ లో
డాక్టర్ నలిమెల భాస్కర్ అనువాదంలో ఆరితేరిన చేయి.ఒకటా రెండా దేశంలోని పద్నాలుగు భాషలలో రాయడం,మాట్లాడడం ఆయనకు సులువు.తాను ఇటీవలనే ఇక్కడి నేల – అక్కడి వాన అనువాద కవితా సంకలనం వెలువరించారు.ఇందులో కన్నడ, హిందీ,గుజరాతీ,పంజాబీ,మరాఠీ,తమిళ,మలయాళీ,బెంగాలీ,ఇంగ్లీష్ భాషలకు చెందిన 43 కవితలు ఉన్నాయి.మనం పుట్టి పెరిగిన నేల వెలుగే కాకుండా,ఇతర రాష్ట్రాలలో కవులు ఏం రాస్తున్నారు?అక్కడ కవితా వస్తువు ఏం తీసుకుంటున్నారు? ఆయా ప్రాంతాల సంస్కృతి, చరిత్ర,సాహిత్యం తెలుసుకోవాలంటే తప్పనిసరిగా ఇతర భాషల కవిత్వం అధ్యయనం చేయాలి. తెలుగు సాహిత్యాన్ని ఇతర భాషల సాహిత్యం అధ్యయనం చేయడంలో భాస్కర్ సాహిత్య కృషి గొప్పది.నలిమెల అనువాదమే గాకుండా తెలంగాణ భాష గురించి పరిశోధనాత్మక రచనలు చేశారు. తెలంగాణ పదకోశం రూపొందించారు.దీనిని సాహితీ సోపతి ప్రచురించింది.కవి దేవేందర్ జయహో, నలిమెల సార్ అంటున్నారు.
ప్రజాస్వామిక ప్రణాళిక రూపొందాలి కాలమ్ లో
జ్ఞాన సృజన కలబోత సాహిత్య అకాడమీకి జూలూరు గౌరీ శంకర్ అధ్యక్షుడు కావడం సాహిత్య లోకానికి ఒక సందర్భాన్ని కలిగించింది.తాను తెలుగు సాహిత్యంలో మొట్టమొదటి బహుజన వృత్తుల కవిత్వ సంకలనం వెంటాడే కలాలు – వెనుకబడిన కులాలు వెలువరించారు.తెలంగాణ మలిదశ ఆరంభంలోనే పొక్కిలి కవితా సంకలనాన్ని వెలువరించారు.జూలూరు గౌరీశంకర్ తెలుగు సాహిత్యంలో ఎవరు వెలువరించని 30 దీర్ఘ కవితలను సంపుటిగా వెలువరించారు అని కవి దేవేందర్ అంటున్నారు.
కవనంలో సరసిజ అంకుశం కాలమ్ లో
పెనుగొండ సరసిజ తన ‘ఇక మారాల్సింది నువ్వే’ కవితా సంపుటిలో పాత మోనాటనీని ఛేదించారు. సరసిజ కవిత్వం ఇంత స్పష్టమైన వాస్తవిక దృక్పథంలో రాయడం వెనుక ఆమె సహచరుడు పెనుగొండ బసవేశ్వర్ తోడ్పాటు ఎంతో ఉంది. సరసిజ గొప్ప కవయిత్రిగా ఎదుగుతున్నది. వృత్తిరీత్యా సరసిజ టీవీ న్యూస్ రీడర్ గా ఉంటూ నిరంతరం కవిత్వంలో నడుస్తున్నది.కొత్త వస్తువును కవిత్వంగా రూపొందించడంలో ఎత్తుగడలో, ముగింపులో,నడకలో ఆసక్తి ఉంటుంది.తనదైన ముద్రతో ఇది కవిత్వంలోకి ఒదుగుతుందా లేదా అని మీమాంస లేకుండా రాస్తున్న కవయిత్రి సరసిజ. అందుకే సూటిగా అంటుంది ‘ఇక మారాల్సింది నువ్వేనని’అది ఎవలను తాకాలో వాళ్లకే తాకుతుంది.సరసిజ తొలి కవితా సంపుటి ‘కాగితాన్ని ముద్దాడిన కల’ వెలువరించింది.’ఇక మారాల్సింది నువ్వే’రెండవ కవితా సంపుటి.
కవిత్వం వరద పారుతోంది కాలమ్ లో
తెలుగు నాట కవిత్వం,కథలు రాసే వాళ్ళ సంఖ్య విపరీతంగా పెరుగుతున్నది.ఇది ఒక శుభ పరిణామంగా చెప్పవచ్చు.ఈ రకంగా కవిత్వంలోకి అన్ని రంగాల నుంచి వస్తున్నారు.ఇరవై,ముప్పై ఏండ్ల కింద ఇట్లా లేదు.కొందరు మాత్రమే రాసి పుస్తకాలు అచ్చు వేసే వాళ్ళు.ఇప్పుడు వాట్సాప్ గ్రూపులు,ఫేస్ బుక్ వాల్ మీద కవిత్వం ప్రవహిస్తున్నది.ఇందులో చాలా విషయాలు కూడా ఉంటున్నాయి.చదవదగ్గ సాహిత్యం వస్తున్నది.కవి దేవేందర్ ప్రతి మనిషి ఏదో రకంగా కళాకారుడేనని, పాట,ఆట,కవిత,నాట్యం,నాటకం,ఏదైనా సంబంధం లేకుండా ఎవరు ఉండరు అని,అయితే తమలో ఉన్న కళను తమకు తామే పాతాళ గరిగెతో వెతికి తీసుకొని సాన పెట్టుకోవాల్సిందే అని అంటున్నారు.
పుస్తకం గురించి ఒక పుస్తకం కాలమ్ లో
గత,వర్తమాన,భవిష్యత్ తరాలకు సకల రంగాల్లో కొనసాగింపునకు ఆధారం పుస్తకమే.పుస్తకం లేకుంటే ప్రపంచమే లేదు.సమస్త శాస్త్ర సాంకేతిక కళా జీవన రంగాల్లో పుస్తకం ఒక పరంపర.ఒక తరం నుండి మరో తరానికి పుస్తకాలు,అందులోని అక్షరాలు వారధుల్లాంటివి.దామెరకుంట శంకరయ్యకు పుస్తకం మీదనే కవిత్వం రాయాలనే తలంపు వచ్చింది.దామెరకుంట ప్రధానంగా కవి.వీరు వృత్తి రీత్యా జీవశాస్త్ర ఉపాధ్యాయుడు.పుస్తకం కదా మానవాళిని తీర్చిదిద్దింది.వయ్యి పేరుతో దీర్ఘ కవితను వెలువరించారు.వయ్యి అంటే పుస్తకమే.ఏ పుస్తకమైనా చైతన్యమే దాని మర్మం మనిషిని పట్టి మేల్కొల్పేది పుస్తకమే.పుస్తకాలు చదవాలంటే అక్షరాలు నేర్వాలి.వయ్యి కవితలో అక్షరాలు వల్లే వేస్తేనే కాళ్లు ఊర్లు దాటేవి/అంటారు.పుస్తకం కొత్త ఉదయంలా/కొత్త ప్రపంచానికై/కాలం తెచ్చిన మార్పుల్ని/ ఒంటినిండా నింపుకున్న/ పరిమళభరితం/అంటూ పుస్తకంపై,చదువుపై, అక్షరాలపై,జ్ఞానంపై అమితమైన ప్రేమను వ్యక్తం చేశాడు.50 పేజీల దీర్ఘ కవిత చదువుతుంటే మధ్యలో ఆగాలనిపించదని,వయ్యిఫై మరింత అభిమానులం అవుతాం అని కవి దేవేందర్ అంటున్నారు.
మీరు పుస్తకం కొంటున్నారా?! కాలమ్ లో
జీవితంలో స్థిరత్వం పొందేందుకు అవసరమైన అధ్యయనం పోటీలకు అవసరమైన పుస్తకాలు మినహా ఇతర పుస్తకాలు చదివే తీరిక తగ్గిపోతున్న కాలం.అయితే గతానికి ఇప్పటికీ రాసే వాళ్ళు పెరిగారు.పుస్తకాలు వస్తున్నాయి కానీ,అమ్మడం తక్కువగా ఉన్నది.జీవన వికాసం కొరకు మానసిక ప్రశాంతత కొరకు సాహిత్యం వైపు చూపు తగ్గి పోయింది.ఎవరైనా పుస్తకం ఇస్తే దానికి అయిన ఖర్చు కూడా పెద్దగా ఏమీ ఉండదు.వంద రూపాయలకు అటు ఇటు అంటే దాని వల్ల మిత్రుని పుస్తకం కొనుక్కొని చదివాననే అనుభూతి ఉంటది.రచయితకు కూడా గౌరవం కలుగుతుంది. పుస్తకాల షాపులలో పెడితే సాధారణ పాఠకులు కూడా కొనడం లేదు.రీసర్చ్ స్కాలర్లు కొందరు పాత తరం వాళ్లు కొందరివే కొని చదువుతున్నారు.కవి దేవేందర్ పుస్తకాలు కొని చదవాలని అంటున్నారు.
వెంటాడే బతుకు యానమిది కాలమ్ లో
సామాన్యుల చరిత్ర జీవన రేఖలు ఎట్లా ఉంటాయనే విషయం తెలుసుకోవాలంటే లేంబాల వాటిక కథలు చదవాల్సిందే.వేములవాడ కథలు,పిన్నంశెట్టి కిషన్ ది ప్రఖ్యాతి గాంచిన వేములవాడ పట్టణం.ఈ లేంబాల వాటిక కథలు చదువుతుంటే అమరావతి కథలు చదువుతున్నట్టే అన్పిస్తుంది.తాను చదివిన, పెరిగిన,తిరిగిన,ఆడిన సోపతిగాళ్ళ ముచ్చట్లు, సినిమాల షికార్లు,ఒకటేమిటి సమస్త కథనాలు 44 వరకు ఉన్నాయి.ఇందులో ఏది మొదలు పెట్టినా కొస దాకా చదువకుంట నిలుప లేరు.ఇందులో ఆయన స్నేహితులు,సహ విద్యార్థులు,చుట్టాలు, బంధువులు అందరూ కన్పిస్తారు.కవి దేవేందర్ ఈ పుస్తకం చదివిన వారు ఎవరి బాల్యంలోకి వాళ్ళు తొంగి చూసుకోవచ్చు అని అంటున్నారు.
అభిమానం నటనకా!నటులకా? కాలమ్ లో
నటన పట్ల కన్న నటునిపై అభిమానం మితిమీరిపోతున్నది.ముఖ్యంగా సినీ నటులపై అభిమానం పెరిగి పెద్దదై అభిమాన సంఘాలు ఆవిర్భవించడం,ఈ సంఘాలు ఆయన కళ పట్లనే కాకుండా,ఆయన పట్ల కూడా విపరీతంగా స్పందించడం పెరిగి పోతున్నది.కళను నమ్మడం, అభిమానించడం,ప్రేమించడం,అనుసరించడం వేరు. హీరోలను అభిమానించడం,హీరో అంటే పడి చచ్చి పోవడం,చైతన్య రాహిత్యమే.కవి దేవేందర్ నిజంగా యువతరం సామాజిక చైతన్యం ఎక్కడికి పోయింది? చదువుకున్న చదువులు ఎందుకు ఉపయోగపడుతున్నాయి? అర్థం కాదు అని అంటున్నారు.
స్నేహం అనంతానంత జీవన సౌందర్యం కాలమ్ లో
ఈ సహృదయ సౌందర్యంలో జీవించడం ఎలా ఉంటుందనేది,ఇటీవల జరిగిన ఒక వాట్సాప్ గ్రూప్ గెట్ టుగెదర్ సమావేశం లో వ్యక్తమయింది.ఆ వాట్సాప్ గ్రూప్ పేరు ఎస్పీ ఫ్రెండ్స్ దాని అడ్మిన్ జీవీ.శ్యాం ప్రసాద్ లాల్ కరీంనగర్ అడిషనల్ కలెక్టర్.దీనిని 2013లో ఏర్పాటు చేశారు.గ్రూప్ సభ్యునికి ఉండాల్సింది ముఖ్యంగా స్నేహపూరిత సహృదయత మాత్రమే.ఇంకా ఎందరో ఇట్లాంటి వారు ఉన్నారు.రోజు ఉదయం ఒక సుభాషితాన్ని గ్రూప్ లో పెడతారు.కొందరు పాత పాటలను షేర్ చేస్తారు.ఒక మిత్రుడు దినపత్రిక పెడతారు.చాలా మందికి తెలియదు కానీ అందరి పుట్టిన రోజులు, పెళ్లి రోజులు అడ్మిన్ దగ్గర ఉంటాయి.ఆయా రోజులలో వారికి శుభాకాంక్షల వెల్లువ కొనసాగుతుంది.ఇందులో ఉన్నత స్థాయి ఉద్యోగులతో పాటు కింది స్థాయి వాళ్ళు కూడా ఉంటారు.అంతా సమానం అనే దృక్పథంలో నడుస్తారు.కవి దేవేందర్ ముఖ్యంగా సాటి మనిషిని ప్రేమించడం,సహృదయ సంస్కారాన్ని ఇతరులకు పంచడం అవసరం అని అంటున్నారు.స్నేహం అనంతానంత జీవన సౌందర్యం వెల్లివిరియాలి.
ఉత్తరాలలో కళాత్మక సృజన కాలమ్ లో
పూర్వం ఉత్తర ప్రత్యుత్తరాలు పోస్టులో పంపే లేఖల ద్వారా ఉండేవని ఈ తరం వారికి చెప్పాల్సి వస్తున్నది.ఇప్పటి తరం ఈ – మెయిల్,వాట్సాప్, టెలిగ్రామ్,జూమ్ వీడియో కాలింగ్ లకు సంబంధించినది.ఉత్తరం రాయడంలోనే రచనా శక్తి అంకురిస్తుంది.అసలు లేఖ చదువుతుంటే తను చెప్పదలుచు కున్నది ఎట్లా వ్యక్తీకరించాడో తెలిసేది.అలా ఉత్తరాలు విరివిగా రాసే వారు తర్వాత కాలంలో రచయితలు అయ్యారు.నిజానికి సాహిత్యంలో లేఖ కూడా ఒక ప్రక్రియ.ఉత్తరం అంటే దూరాన్ని కలిపి దారం వంటిదని ఎన్నటి నుంచో చదువుకున్నం.ఎవరి వద్దనైనా పాత ఉత్తరాలు ఉంటే పరిశీలించవచ్చు.పాత లేఖలలో భావుకత కనిపిస్తుంది.ఒకరికొకరు రాసే పద్ధతిని బట్టి ఆయా మనః స్థితిని అర్థం చేసుకోవచ్చు.కవి దేవేందర్ ఉత్తరాలలోని కళాత్మక సృజన ప్రాధాన్యతను తెలియజేశారు.
డిజిటల్ పత్రికల యుగం మనది కాలమ్ లో
పత్రికలు,ప్రసార మాధ్యమాలు ఇప్పుడు ఎక్కువగా పెట్టుబడిదారుల చేతులకు చేరాయి.ఒక నాటి కాలంలో పత్రికలు అంటే ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా నిలిచేవి.రాను రానూ వాటి ప్రాధాన్యం తగ్గిపోతోంది.గత రెండేళ్లుగా కరోనా సంక్షోభం వచ్చి అన్ని వ్యవస్థలు కూలిపోయినట్లే పత్రికా రంగం కూడా కునారిల్లిపోయింది.ఒకరిని ఒకరు తాకని, చూడని సంక్షోభం సందర్భంలో పత్రికలను ఎవరు తెప్పించుకోలేదు.దీంతో ముద్రణ ముప్పావు తగ్గి పోయింది.అక్కడక్కడ కొన్ని ముద్రించినా చాలా మంది ఈ పేపర్ కు అలవాటు పడ్డారు.డిజిటల్ పత్రికలు చదవడం ఎక్కువైంది.సోషల్ మీడియాలో వార్తలు,సంఘటనలు,వీడియో క్లిప్పులు,లెక్కకు మిక్కిలి ప్రచారం అవుతున్నాయి.కవి దేవేందర్ అందరు డిజిటల్ ప్లాట్ ఫారానికి వచ్చేస్తున్న సందర్భం ఇది అనే వాస్తవాన్ని తెలియజేయడం బాగుంది.
స్నేహం అందమైన అనుబంధం కాలమ్ లో
విద్యార్థుల మూర్తిమత్వం వికసించేది తరగతి గదిలోనే.ఎంత ఎదిగినా బాల్యంలోని స్నేహితులు కలిస్తే చక్కిలిగింతే.తాము చదువుకున్న తరగతి గోడలను తాకి పరవశించవచ్చు.తాము ఆడుకున్న మైదానంలోను పెద్ద పెరిగిన గాంభీర్యతను వదిలేసి తిరిగితే అదొక ఆనందం.ప్రాథమిక స్థాయి,హై స్కూల్ స్థాయిలో ఆ అనురాగం కొనసాగుతుంది.ఇటీవల కాలంలో ఆయా పాఠశాలలలో చదివిన పూర్వ విద్యార్థుల సమ్మేళణాలు నిర్వహిస్తున్నారు.ఇది పాత మిత్రులతో పాత జ్ఞాపకాలను తిరిగి పంచుకోవడమే.కవి దేవేందర్ ఎప్పుడో ముప్పై, నలభై ఏండ్ల కింద చదువుకున్న వాళ్ళు ‘రారా పోరా’ అని మాట్లాడుకోవడమే ఒక పులకింత అని అంటున్నారు.కల్మషంలేనితనం వలన స్నేహం, అనుబంధం ఏర్పడతుందనేది వాస్తవం.
సృజనే జీవిత పరమానందం కాలమ్ లో
మనిషన్నాక ఏదో కళలో ప్రవేశమో,ఇష్టమో, ప్రావీణ్యమో ఉండి ఉంటది.కొందరికి డాన్స్,మరి కొందరికి క్రీడలు,మరి కొందరికి పాటలు పాడటం, ఎందరికో పెయింటింగ్,మిమిక్రీ,సంగీతము, సాహిత్యము,పద కవిత్వం రచన చిన్నప్పటి నుంచి ఉంటాయి.వాటికి మెరుగు పెట్టుకోవడంలో శ్రద్ధ చూపక పోవడంతో నైపుణ్యత సాధించకపోవచ్చు. లైఫ్ లో స్థిరపడుతున్న క్రమంలో మన సృజనకు పదును పెడితే ఇంటిలోని సభ్యులందరిపై ఆ ప్రభావం ఉంటుంది.తల్లిదండ్రులు చెప్పితేనే పిల్లలు ఆచరించరు.వాళ్ళ చర్యలను,ఇష్టాలను,కళలను తాము అవలంబించే ప్రయత్నం చేస్తుంటారు.ఇట్ల కుటుంబం,బంధువులు,స్నేహితులు సహ ఉద్యోగులు అందరూ తమ కళాత్మక సౌందర్య జీవనం కోసం వెతుక్కుంటారు.కవి దేవేందర్ సృజనను అలవర్చుకుంటే జీవితం పరమానందం అవుతుంది అని అంటున్నారు.
కొడుకులు కోడండ్లు – తల్లిదండ్రులు కాలమ్ లో
మొన్న వాకింగ్లో పరిచయమైన నడక మిత్రుడు ‘మనకు ఏం కాకుండా మన ఆరోగ్యం కాపాడుకోవాలె.మనకు ఏమన్న అయితే కొడుకులు రారు కోడండ్లు చేయరు అని ఖరాకండిగా చెప్పిండు.తండ్రులు,తల్లులు మార్పు దిశగా ఆలోచించాల్సిందే.చెంతన ఎవరు లేరు వాస్తవమే. ఎవరు పలకరించడం లేదు వాస్తవమే.ఇది ఒక అనివార్యత.కవి దేవేందర్ గతానికి ఇప్పటికీ కుటుంబ సంబంధాల్లో వచ్చిన మానసిక సంబంధమైన మార్పులన్నీ అవగాహన చేసుకుని ఆధునిక దృక్పథంతో ఆనందంగా జీవించాల్సిన విధానాన్ని గూర్చి ఆలోచించవలసిన అవసరం ఉన్నది అని అంటున్నారు.
మీకంటూ కొంత స్పేస్ కావాలి కాలమ్ లో
ఏ వృత్తిలో ఉన్న వారైనా జీవితంలో కొంచెం స్పేస్ ఉంచుకోవాలి.ఎన్ని ఒత్తిడులు ఉన్నా కొంత ఏకాంతం,కొంత ప్రశాంతత,కొంత సొంతదనపు ఆలోచనలకు సమయం అవసరం.ఈ రోజులలో అన్ని వృత్తుల వారు,విద్యార్థులు సమయం లేదు తొందరగా పూర్తి చేయాలి లేదంటే బాస్ అరుస్తాడు టార్గెట్ అచీవ్ కాలేము అనే మీమాంసలో పడి తమ కోసం తాము జీవించ లేక పోతున్నారు.కుటుంబ పోషణ కోసం పని చేయడంలోను,తమ వ్యక్తిగత స్వేచ్ఛ కోసం కొంత సమయం లేకుంటే మరీ మనిషి యంత్రం అయి జీవితం నిస్సారమైపోతుంది. సంపాదించే వారికే పైసలు కట్టలు కట్టలు కనపడతాయి.మనశ్శాంతి దొరకదు.కుటుంబంలో సభ్యులందరు ఎవరి స్పేస్ వారు కేటాయించు కోవాలి.చేతిలో ఉన్న సెల్ ఫోన్ కు కాస్త విరామం ఇవ్వాలి.రోజుకో గంట సేపైనా ఫోన్ స్విచ్చాఫ్ చేస్తే హాయిగా ఉంటుంది.కవి దేవేందర్ మనిషి సెల్ ను బానిసలాగా వాడుకోవాలె గానీ,సెల్ కు బానిస కాకూడదనే సత్యాన్ని విడమర్చి చెప్పడం బాగుంది.
పండు వెన్నెలలో కవిత్వ ప్రవాహం కాలమ్ లో
ప్రతి పౌర్ణమి రోజు నగరంలో ఒక కవి రచయిత లేదా సాహిత్య అభిమాని ఇంటి డాబా మీద కవులు సమావేశం అవుతారు.కవిత్వం చెప్పుకుంటారు. ఎన్నీల ముచ్చట్లు తెలుగు సాహిత్యంలో పండు వెన్నెల కవిత్వం ఒక మైలురాయి.21 ఆగస్ట్ 2013 రాఖీ పున్నమి రోజున మొదలైన ఎన్నీల ముచ్చట్ల ప్రస్థానం నగరంలోని దాదాపు అందరూ కవులు రచయితల ఇండ్ల మీద కవి సమ్మేళనాలు జరిగాయి.కవిత్వం అంటే కేరాఫ్ చిరునామా కరీంనగర్ అయింది.కవి దేవేందర్ కరీంనగర్ లో నిండు పున్నమి నాడు పండు వెన్నెలలో అక్షరాలు కవిత్వ వాక్యాలై పరవళ్ళు తొక్కుతున్నయి అంటున్నారు.
పిల్లలతో ఉన్న మజాయే వేరు కాలమ్ లో
పిల్లల నవ్వులు,పిల్లల చిన్నిచిన్ని మాటలు,పిల్లల చూపులు,పిల్లల ప్రతి చేష్టకు ఒక సంకేతం ఉంటది. పిల్లల కోరిక నెరవేర్చకపోతే అలగడం,నిరసన వ్యక్తం చేయడం ఉంటది.కోపం ఎక్కువైతే వస్తువులు విసిరి వేయడం ఉంటది.దీనిని కుటుంబ సభ్యులు వారి సైకాలజీ తో పట్టుకోవాలి.పిల్లలను పెంచడం అనేది గొప్ప ఓపిక.పిల్లలు ఉన్న ఇల్లు ఆనందాల హరివిల్లు. కవి దేవేందర్ ఏది ఏమైనా పిల్లలతో ఆడుకుంటే పిల్లలమై పోవచ్చు అంటున్నారు.
ఇది అనంత కాలగమనం కాలమ్ లో
హుజురాబాద్ చరిత్రను ప్రఖ్యాత జర్నలిస్ట్,రచయిత ఆవునూరి సమ్మయ్య తన గమనం పుస్తకంలో నమోదు చేశారు.కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ కు చెందిన చరిత్రనే గాకుండా ఆ ప్రాంత రాజకీయ, ఉద్యమకారుల పరిచయం ఇందులో ఉంది.1969 తొలి దశ తెలంగాణ ఉద్యమంలోను,1998 మలిదశ ఉద్యమంలోను,ప్రత్యక్షంగా పాల్గొన్న ఉద్యమకారుడు.తాను గవాయి పేరుతో హుజురాబాద్ ఉద్యమాల చరిత్రను అక్షరీకరించాడు.అందులోను పోరాటాల నేపథ్యం, స్వభావం,ఆయా ఊర్ల నుంచి అజ్ఞాతంలో ఉన్న వారి వివరాలు ఉన్నాయి.గమనం పుస్తకానికి హుజూరాబాద్ కు చెందిన ముక్కెర రాజు,పలకల ఈశ్వర్ రెడ్డి,రవిశంకర్ శుక్లా సంపాదకత్వం వహించారు.కవి దేవేందర్ జన సాహితి ప్రచురించిన ఈ పుస్తకం అన్ని ప్రాంతాల వారు చదవాలని.ఆయా ప్రాంతాల చరిత్ర ఎలా నమోదు చేయాలో తెలుస్తుందని అంటున్నారు.
నృత్య కళా వెలుగు ఆచార్య రజని శ్రీ కాలమ్ లో
ఆచార్య గాజుల రజని శ్రీ తెలంగాణలో ప్రసిద్ధి పొందిన నాట్యాచార్యులు.వీరు వృత్తిరీత్యా ఉపాధ్యాయులు.వీరు తోటపల్లి గ్రామం హుస్నాబాద్ మండలం సిద్దిపేట జిల్లాకు చెందిన వారు.వీరు తోటపల్లిలో 1964 లో ఉపాధ్యాయుడిగా నియమించబడ్డారు.వీరు 31 జనవరి 2002లో భీమదేవరపల్లి ప్రభుత్వ పాఠశాల నుండి రిటైర్ అయ్యారు.వీరు తెలంగాణలో గొప్ప కళాకారుడుగా నాట్యాచార్యులుగా పేరుగాంచారు.రజని శ్రీ మొత్తం జీవితాన్ని కళా,సాహిత్య,సాంస్కృతిక విద్యా రంగానికి అంకితం చేసిన గొప్ప మనిషి.ఆయనకు ముగ్గురు కుమారులు.జీ.వీ.శ్యాం ప్రసాద్ లాల్ కరీంనగర్ జిల్లా అడిషనల్ కలెక్టర్,హరీష్ కుమార్ హైకోర్టు న్యాయవాది,క్రాంతి కుమార్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా స్థిరపడ్డారు.రజనిశ్రీ పేరిట వారి కుమారులు సాహిత్య పురస్కారాన్ని కూడా ప్రకటించారు.రజని శ్రీ గారు మే 28 2007న పరమపదించారు.కవి దేవేందర్ రజని శ్రీ కళా జీవితం యావత్ సృజన కళాకారులకు స్ఫూర్తిదాయకం అంటున్నారు.
కాలం మారుతోంది బాసూ ! కాలమ్ లో
మారుతున్న కాలానుగుణంగా జీవించడం నేర్చుకుంటేనే జీవనోత్సవం.కొందరు ఎప్పుడు మా కాలంలో గిట్లుండే మా చిన్నతనంల అందరూ ఉమ్మడి కుటుంబంలా కలిసిమెలిసి ఉండేది. ఇప్పుడు కుటుంబం ఎక్కడెక్కడో ఉంటున్నారని మథనపడుతుంటారు.వర్తమానంలో జీవించడం అంటే మారుతున్న జీవనశైలిని అందుకోవాలి.దాని వెంబడి నడవాలి.ఇటీవల కాలంలో పుట్టినరోజు వేడుకలకు కేక్ కటింగ్ లు చాలామంది జరుపుకుంటున్నారు.కవి దేవేందర్ ఉత్సవాలు, పండుగలు,సంప్రదాయాలు కొనసాగించడం వలన మనసు ఉల్లాసం అవుతుందని,కాలంతో పాటు సాగిపోవాలనే స్ఫూర్తిని కలిగిస్తున్నారు.
కోరలు చాచిన మగహంకారం కాలమ్ లో
మగ అహంకారుల దుర్మార్గాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది.అత్యాచారాలు సులువుగా చేస్తున్నారు.బాలికల మీద మైనారిటీ తీరని మగ పోరగాండ్లు క్రూరత్వం ప్రదర్శిస్తున్నారు.ఇది తప్పు అనే కనీస స్పృహ వారికి లేకుండా పోయింది.నేరం చేస్తే శిక్ష పడుతుందనే భయం లేదు.ఏం కాదు నాకు అన్న అభయం ఉన్న తర్వాత నేరాలు సాగుతూనే ఉంటాయి.కవి దేవేందర్ రాజకీయ ప్రజా ప్రతినిధుల ప్రమేయం పోలీసుల మీద ఏమాత్రం ఉండకుండా ఉంటే నేరాల విచారణ సజావుగా సాగుతుందని, శిక్షలు సరిగ్గా పడతాయని,సమాజం నుంచి అత్యాచార సంస్కృతిని తరిమివేసి సర్వ సమానత్వం స్నేహపూరిత వాతావరణం కల్పించాల్సి ఉందని అంటున్నారు.
మాయమవుతున్న చదువరి కాలమ్ లో
అధ్యయనం రాను రానూ తక్కువ అయిపోతున్న కాలం.అవసరమైన పుస్తకాలు తప్పితే ఇతర పుస్తకాలు తెరువుకు ఈనాటి తరం పోవడం లేదు. ఒకప్పుడు విద్యాలయాల చదువులతో పాటు ఇతర కళ,సామాజిక శాస్త్రాలు విరివిగా చదివే వారు. అసలు ఇప్పుడు అట్లా చదివే వాళ్ళు ఎక్కడ ఎవరూ కనిపిస్తలేరు.అయితే కాలం మారుతున్నది.తమకు అవసరం లేనిది ఎందుకు చదవడం?సామాజిక విషయాలు మాకెందుకు?అనే తరం తయారయింది. ఇదంతా ప్రపంచీకరణ తర్వాత విద్యారంగంలో వచ్చిన మార్పులు.తరం మారింది.టెక్నాలజీ మారుతోంది అయినా కవి దేవేందర్ ఇంకా చదవాల్సిన సాహిత్యం,శాస్త్ర విజ్ఞాన గ్రంధాలు యువతరం చదవడం లేదని అంటున్నారు.
తోటి కవుల కవిత్వం పై కవి శతారం కాలమ్ లో
గోపగాని రవీందర్ కొత్తగా పరిచయం అక్కని లేని కవి.ఆయన మాత్రం ఇతర కవుల కవిత్వాన్ని విమర్శనాత్మకంగా పరామర్శిస్తారు.ఎవరి కవిత్వం వాళ్లు రాసుకుని అచ్చు వేసుకొని మురిసిపోయే కాలం ఇది.గోపగాని రవీందర్ మాత్రం తన తోటి కవుల కవిత్వాన్ని ఇష్టంగా చదివి ఒక వ్యాసం రాయడం గొప్ప విషయమే.శతారం అనే కవిత్వ విమర్శల వ్యాసాల సంకలనం వెలువరించారు.ఈ పుస్తకంలో 75 వ్యాసాలు ఉన్నాయి.అభ్యుదయ, విప్లవ అస్తిత్వ సాహిత్యం పట్ల విమర్శ ఉన్నది.ఇటు కవిత్వం,అటు విమర్శతో నిరంతరం అక్షరాలను ఆయుధం చేస్తున్న గోపగాని రవీందర్ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు.కవి దేవేందర్ శతారం పుస్తకాన్ని వర్ధమాన కవులు,రచయితలు కొనుక్కొని చదవాల్సిన అవసరం ఉన్నది అని అంటున్నారు.
నడక ముచ్చట్లు కాలమ్ లో
దినచర్యలో నడక అనివార్యంగా భాగమైన తర్వాత రోజు మైదానంలో తిరగడం ఒక ఆనందం.ఆ రోజంతా ఉత్సాహంగా గడపటానికి అదొక టానిక్ అయ్యింది.ప్రాతః కాలమున ఇంటి నుంచి మౌనంగా నడక మొదలవ్వగానే రోజూ కనపడే మనుషులే కన్పిస్తారు.మౌనంగా కళ్ళతోనే పలకరింపులు. కొందరైతే చూడగానే చిరునవ్వుల ముఖాలు. మైదానంలో కల్సి నడుస్తున్న కొద్ది కొంతమంది వయ్యారపు నడకలు,కొన్ని మహా వేగంగా ఉరుకులు,కొందరు మోకాళ్ల నొప్పులతో మెల్లమెల్లగా బండి లాగినట్టు,మరి కొందరైతే సెల్ ఫోన్ చూసుకుంటూనే నడుస్తుంటారు.ఇంక కొందరు ముచ్చట్లతోనే నడుస్తుంటారు.కవి దేవేందర్ నేను ధ్యానం నుంచి బయటకు వచ్చి ఇంటికి చేరుకున్న అంటున్నారు.నడక ముచ్చట్లు ఉంటాయి అంటే ఆశ్చర్యం కలుగుతుంది.
చిటపటా చినుకులతో కురిసిందీ వాన కాలమ్ లో
వాన తనివి తీరా కురిసింది.ఎక్కడా చూసినా నీళ్లే. నీట మునిగిన పొలాలు,ఊర్లు,ఇండ్లు,నదుల పక్కన నివసిస్తే నది కన్నెర్ర చేస్తది.చెరువులను ఆక్రమించుకున్న కాలనీలకు కాల పరీక్షనే.కాలంబు రాగానే కాటేసి తీరాలె అన్నట్టు నీళ్ళకు కాలం వచ్చింది.వాటి తావుల్లో కట్టుకున్న ఇండ్లకు ముప్పు వచ్చింది.ఇండ్లు కట్టుకున్నోళ్లు అమాయకులు.దాని అడుగు జాగను ప్లాట్లు ప్లాట్లుగా చేసి అమ్ముకున్న రియల్ ఎస్టేట్ మారాజులను అనాలె.వాళ్ల రాజకీయాలను అనాలె.సూసి చూడనట్టు నటించే యంత్రాంగంను అనాలె.కవి దేవేందర్ ఏది ఏక్కువైన నష్టమే.వాన చినుకులు పడితే ఏం జరుగుతుంది? చెరువులను ప్లాట్లు చేసి అమ్ముకునే కుటిల రాజకీయం కొనసాగుతుంది అని అంటున్నారు.ఏది ఏమైనా వాన అంటే అందరికీ సంబరమే.
నిషా బాబులు నయా వేషాలు కాలమ్ లో
ప్రతి ఊరిలో మద్యం షాపులు విచ్చలవిడిగా ఏర్పాటు చేశారు.పట్టణాలు,నగరాలలోనూ వాడ వాడకు మద్యం షాపులు ఉన్నాయి.వాటి దగ్గర జనాల రద్దీ ఉంటున్నది.మద్యం మనుషులకు హాని చేస్తుంది.నిరంతరం మద్యం సేవించిన వారి కాలేయం దెబ్బతింటుంది.ఆర్థికంగా నష్టపోతారు. ఇంటిలో కూడా లొల్లులు అవుతాయి.ఫంక్షన్ లలో మందును ఏర్పాటు చేస్తున్నారు.కవి దేవేందర్ గాంధీ పుట్టిన దేశంలో ఇలా మద్యం ఏరులై పారడాన్ని ఎవరు ఆపగలరు?ఎవరికి వారు నిషేధం విధించుకుంటే తప్ప అని అంటున్నారు.
తిండిని పారేసి రోగం ఎందుకో?! కాలమ్ లో
పిడికెడు అన్నం మెతుకులు తయారు కావాలంటే రైతు ఎంత శ్రమ చెయ్యాలి?మట్టి నుండి వరి పండించడానికి ఎన్ని వేల లీటర్ల నీరు కావాలి?తిరిగి ఆ బియ్యం అన్నంగా మారడానికి,అందులోకి కూరలు తయారు కావాలంటే ఎంత పని?ఎంత ఓపిక కావాలి?ఇవేవి అర్థం చేసుకోరు కొందరు మనుషులు.ఏదైనా ఫంక్షన్ లకు పోతే ఎన్నడూ తిననోళ్లు అన్నం తింటున్నట్లు ఎగబడతరు. అవసరమైన దానికంటే ఎక్కువ పెట్టించుకుంటారు. పూర్తిగా తినరు.అటూ ఇటూ కలుపుతరు. మిగతాదంతా పారేస్తరు.ఆహార వృధా కొనసాగుతున్నది.ఆహారం లేక దేశంలో ఎందరో ఆకలితో అలమటిస్తున్నారు.కవి దేవేందర్ తిండిని పారేసే రోగం ఎందుకు?అని ప్రశ్నించడం బాగుంది.
ఝండా ఊంచా రహే హమారా కాలమ్ లో
ఇది భారతదేశ అమృతోత్సవ సందర్భం.ఆనాడు పోరాటం చేసి అసువులు బాసిన త్యాగధనులను దేశ ప్రజలంతా మనస్ఫూర్తిగా స్మరించుకోవాల్సిన సందర్భం.భారతదేశం బహుళ సాంస్కృతిక జీవనం,భిన్న భావాల విభిన్న సంస్కృతులకు పుట్టినిల్లు.ఎప్పుడూ ఏక ధ్రువరూపం తీసుకోలేదు. ఒకే సంస్కృతి,ఒకే ఆలోచన ఎన్నడూ లేదు.అందరి అస్తిత్వాలు వేరు వేరు.అస్తిత్వాలు మళ్లీ కలిస్తే భారతదేశం. త్రివర్ణ పతాకం ఒక్కటే. భారతీయులందరూ ఈ తిరంగ జెండా కిందనే ఉన్నారు.కవి దేవేందర్ మాతృదేశ స్వాతంత్రం అందరి స్వాతంత్ర్యం.జయహో భారత్ అంటున్నారు.
కెమెరా కళ్ల కోసమే పెళ్లి కాలమ్ లో
జీవితంలో పెళ్లి అనేది అత్యంత మధురమైన మైలురాయి.ఆలుమగలు పులకించిపోయే జ్ఞాపకం.పెళ్లిళ్లకు దగ్గర బంధువులు,దూరపు బంధువులు,స్నేహితులు అందరు వస్తారు.ఈ సంఘటనలను చిత్రాలలో బంధించడం ఫోటోగ్రాఫర్ల పని.వీడియోగా రూపొందించడం డిజిటలైజ్ చేయడం ఒక కళ.ఒక నైపుణ్యత గల విద్య.ఈ రోజులలో పెళ్లిళ్లను తమ కెమెరాలలో రికార్డ్ చేయడం గాకుండా ఫోటోగ్రాఫర్లే వివాహాలను నడిపిస్తున్నారు.ఏది ఏమైనా కెమెరా ఆర్ట్ బలమైన కళ.అది చూపరులను ఇట్టే ఆకట్టుకుంటుంది. ప్రకృతిని ఉన్న దాని కన్నా మరింత అందంగా చిత్రిస్తుంది.కవి దేవేందర్ కెమెరా కళాకారులను అభినందించాల్సిందే అంటున్నారు.
కనువిందు చేసే కేరళ యాత్ర కాలమ్ లో
అక్కడి గాలిలోని సుగంధ ద్రవ్యాల మొక్కల పరిమళం మనసుకు హాయి చేస్తది.తేయాకు తోటల నుంచి నడిచి వెళుతుంటే పచ్చిపచ్చి చాయ వాసన వ్యాపిస్తుంది.మిరియాలు,యాలకులు,సాజీర, దాల్చిన చెక్క,లవంగాల చెట్ల గాలి సోకి ఛాతి ఉబ్బిపోతుంది.కవి దేవేందర్ మన్నార్ లో ఎక్కడ తిరిగినా మనసు తేలికగా మారి గాలిలో నడుస్తున్న అనుభూతి కలుగుతుంది అని అంటున్నారు.
అచ్చుకు అచ్చంగా గ్రహణం కాలమ్ లో
దిన,వార,మాస పత్రికల ముద్రణ ఇంకో దశాబ్దం దాటితే రూపం మార్చుకునేట్టు కనిపిస్తున్నది.అట్లాగే సాహిత్యం కూడా ఇది వరకు కవిత్వం,కథలు, నవలలు వేల కొలది అచ్చు అయి మార్కెట్లోకి వచ్చేవి.రానున్న కాలంలో కష్టంగా తోస్తున్నది.అన్ని పత్రికలు డిజిటల్ రూపంలోకి వచ్చినయి.పత్రికను స్టాల్ కు వెళ్లి కొనుక్కుని ఇంటికి తెచ్చుకొని చదవడం మాని అరచేతిలో సెల్ ఫోన్ లోనే అనుకున్న సమయంలో చూస్తున్నరు.దీంతో కండ్లకు ఇబ్బందే కావచ్చు.రానున్న దశాబ్దం తర్వాత ఈ ప్రింటింగ్ యంత్రాలు పంపిణీ వ్యవస్థ ఉంటదా? ఉండదా? అనేది అనుమానమే.అట్లనే పుస్తకాలు, పత్రికలు ఇంకా చెవులలో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఆ బుక్ ఓపెన్ చేసి,అదే చదివి పెట్టే టెక్నాలజీ కూడా వచ్చింది.ఇక చదవడం కూడా వద్దు.వట్టిగ కూర్చుంటే పుస్తకం వినిపిస్తుంది.కవి దేవేందర్ రానున్న రోజులలో తెలుగు పుస్తకాలు ముద్రణ తగ్గిపోయి ఇ – బుక్స్ రూపం మార్చుకోవచ్చునని, అర చేతిలో వైకుంఠం అన్నట్లు మన కళ్ళ ముందు చరిత్ర మారుతోంది అంటున్నారు.
అర్థం పర్థం వదిలిన నామం కాలమ్ లో
పిల్లల పేర్ల ట్రెండ్ ఐదు,పది సంవత్సరాలకో సారి మారిపోతోంది.మార్పులు అనివార్యమే.కొన్ని అర్థవంతంగా ఉంటాయి.మరి కొన్ని ఏ అర్థం లేకుండా ఉంటాయి.ఇటీవల ఒక పాపను ‘నీ పేరు ఏంటని’ అడిగితే సిమ్రిద్ధి అని చెప్పింది. ‘సమృద్ధి’గా ఉండాల్సింది ‘సిమృద్ధి’గా మారిందని అనిపించింది. అసలు ఈ పేర్లు పెట్టడం కొరకు ఇంటర్నెట్లో వెదికి, కొన్ని అక్షరాలు వాళ్ళనుకున్నవి కలుపుకొని అర్ధ వివరణ చూడకుండా పెట్టుకుంటున్నారు.ఇంగ్లీష్ ఉచ్ఛారణ వేరు.అక్షరాలు ఉంటే అవే తెలుగులో వాడుతున్నారు.సరే,ఏ పేరు అయితే ఏమిటి? పిలుస్తున్నం.పలుకుతున్నరు.ఆధార్ కార్డ్ లోను ఎక్కుతుంది అనే వాదన వేరు.కానీ,కొంచెమన్న అర్థం పర్థం ఉంటే బాగుంటుంది.కవి దేవేందర్ ఆ కాలంలో అర్థవంతమైన పేర్లు ఉండేవని,ఈ కాలంలో అక్షరాలు కలిపి కూర్చే తీరు కనబడుతున్నది అంటున్నారు.
సెల్ తో జర పదిలం మరి !! కాలమ్ లో
కాలగమనంలో కొన్ని అవసరాలు తప్పనిసరి అయితాయి.చెలామణిలో ఉన్న ప్రపంచంతో పాటు మనము నడవాలంటే కొన్నింటిని ఉపయోగిస్తుండాలి.ఏదైనా అతిగా వాడితే అంతే సంగతులు.అతిగా సెల్ ఫోన్ లో మునిగి పోతే నడుము నొప్పులు షురూ అయితయని ఆర్థోపెడిక్ వైద్యులు చెబుతున్నరు.అదే పనిగా సెల్ చూస్తుంటే కంటి రెటీనా పాడైపోతోందట.సెల్ నుంచి వచ్చే కాంతి కిరణాలు కండ్ల మీద తదేకంగా పడితే నష్టం కలుగుతుంది.సెల్ విపరీతంగా చూస్తున్న వాళ్లకు తలనొప్పి కూడా వస్తున్నదట.ఇన్ని నష్టాలు ఉన్న సెల్ ను విడిచి ఒక్క రోజు కూడా ఉండటం సాధ్యం కాకపోవచ్చు.అయితే అదే పనిగా సెల్ చూస్తే వ్యసనంగా మారిపోతే అనారోగ్యంతో పాటు రేడియేషన్ ప్రభావం కూడా పడుతుందట.అన్ని రంగాలలో ముందుకు పోయి ఆధునికంగా ఉండ వలసిందే.సెల్ కు సెలవు ఇవ్వకపోతే రోగాలతో మంచాన పడటం ఖాయం.కవి దేవేందర్ సెల్ చూడటానికి ఉదయం అర్ధ గంట,సాయంత్రం ఒక గంట లేదా కేటాయించుకుంటే మంచిదని అంటున్నారు.సెల్ ఫోన్ తో జర పదిలం అని దాని వల్ల కలిగే అనర్థాలను చక్కగా వివరించారు.
మనిషి తనానికి ప్రతిరూపం కాలమ్ లో
పరుల కోసం పాటుపడని నరుని బ్రతుకు దేనికని? ఒక గజల్లో సినారే వేసిన ప్రశ్న.ఈ లోకం నుంచి దూరమై పోయిన సాహితీవేత్త,సామాజిక కార్యకర్త నిజాం వెంకటేశం జీవితం పరిశీలిస్తే గుర్తుకు వస్తది. ఆయన వేల కొలది పుస్తకాలను కొని చదువరులచే చదివించారు.ఆయన పుస్తకాల వితరణశీలి. కొనడం,చదవడం ఇతరులచే చదివించడం, అందులోని సారాంశాన్ని గలగల చెప్పడం ఆయనకు ఇష్టం.కవులు రచయితల పుస్తకాలు కాంప్లిమెంటరీ కాపీలుగా ఉచితంగా ఎవరి దగ్గర తీసుకోరు.ఓ పది, ఇరవై నగదు పెట్టి కొని అదే సభలో పంచుతారు. ఆయన పుస్తకాలు కొని పంచడమే కాదు.పుస్తక ప్రచురణకు కూడా ఆర్థిక సాయం చేస్తారు.కవి దేవేందర్ ఇందరి స్నేహితుల సంపదను మధ్యలోనే వదిలి వెళ్లిన నిజాం సారుకు జోహార్లు అర్పించారు.
మనది కాని సంస్కృతి మీద ప్రేమ కాలమ్ లో
సరే,తెలంగాణ తెచ్చుకున్నాం.మన సంస్కృతికి గౌరవం కూడా వచ్చింది.కొత్తగా ఉత్తర భారత దేశ సంస్కృతి విస్తృతమవుతోంది.గుజరాత్ వాల్ల వ్యాపారం మండలాల స్థాయికి చేరింది.రాజస్థాన్ హోటళ్ళు,స్వీట్ హౌజ్ లు కొంచెం పెద్ద ఊర్లల్ల కూడా ఉన్నాయి.ఇతర రాష్ట్రాల నుంచి వ్యవసాయ కూలీలు వస్తున్నారు.ఛత్తీస్ గఢ్ నుంచి బీహార్ నుంచి వస్తున్నారు.సంప్రదాయ బతుకమ్మ పాట మాయమైంది.దాని స్థానంలో ఉత్తరాది దాండియా చేరింది.పానీ పూరి,కట్లెట్ అట్లాంటివి ఎన్నో యూత్ ఆరగిస్తున్నారు.ఈ వ్యాపార సంస్కృతిలో మన ఆహార సంస్కృతి పూర్తిగా కనుమరుగైంది. ఒకప్పుడు హోటల్ అంటే పూరి,మిర్చి బజ్జీలు ఉండేది.ఇప్పుడు అవి కనిపిస్తలేవు.కొత్త వాటికి మన వాళ్లు సులువుగా ఆకర్షితులవుతున్నారు.కవి దేవేందర్ సరే,అవి నచ్చితే అవి ఆడుకొని,పాడుకొని బతుకమ్మ పాటలు పాడితే బాగుంటది కదా?స్థానిక సంస్కృతి,స్థానిక వ్యవహారాలను రక్షించుకోవాల్సిన అవసరం ఉంది అని అంటున్నారు.
శ్రమజీవులది వల్లిపోని సౌందర్యం కాలమ్ లో
నగరం నుంచి ఉద్యోగం కోసం ఉరుకులు పరుగులతో వెళ్లే మహిళలు ఫ్రెష్ గా ఉల్లాసంగా కళాత్మకంగానే కన్పిస్తారు.అందంగా తయారవడం అందుకు తగ్గట్టుగా వస్త్రధారణ ఇవన్నీ ఉంటాయి. ఇది ఉదయం ఆఫీసులకు వెళ్లే దృశ్యం.ఆఫీస్ నుండి వాళ్ళే తిరిగి వచ్చేటప్పుడు అంతా అలసిపోయినట్లు వల్లిపోయినట్లు కనిపిస్తారు.ఒక పల్లెటూరులో ఉదయం పూట నాట్లు వేసేందుకు కలుపు తీసేందుకు వెళ్లే వాళ్ళు హుషారుగా చకచకా నడుస్తూ నవ్వుతూ కనిపిస్తారు.గలగల మాట్లాడుతూ పనులకు పోతారు.తిరిగి వచ్చేటప్పుడు నాట్లేసి,కలుపు తీసి,కోత కోసి వచ్చే వాళ్ళు పోయినప్పుడు ఎట్లా ఉల్లాసంగా ఉన్నారో వచ్చేటప్పుడు అట్లాగే హుషారుగా కనిపిస్తారు. పట్టణాలలో పని చేసే వాళ్లు నాలుగు గోడల మధ్య ఫ్యాన్ కింద పని చేస్తారు.పల్లె వాళ్ళు ప్రకృతిలో పని చేస్తారు.కవి దేవేందర్ పల్లె వాళ్ళు తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు అలసిన ముఖాలు కన్పించవు అని, అందుకు భిన్నంగా నగర ఉద్యోగ వర్గ మహిళలను ఎందరిని చూసిన వల్లిపోయిన పూల వలనే కన్పిస్తారు అని అంటున్నారు.
ఈ నాయకులను సూత్తే ఒకారమొత్తంది! కాలమ్ లో
ఎన్నికల వార్తలు చూసినా,విన్నా నిజంగా ఒకార మొచ్చినంత పనైతంది.రాజకీయాలు ఎంత వ్యాపారం అయినవి.రాజకీయ పార్టీలు ఎంత బరి తెగించినవి.ప్రజాస్వామ్యం అనే మాటకు బొత్తిగా విలువ లేకుండా పోయింది.ఒక్క లీడర్లు మాత్రమేనా,ఓటర్లు కూడా అధ్వాన్నంగా తయారైండ్రు.పైసలు బహిరంగంగానే తీసుకునుడు. తాగుడు,తినుడు,ఓట్లేసుడు.పూర్తిగా ఓటరు తనకు తాను అమ్ముడుపోవుడు చూస్తే దేశం ఎటు పోతుందో?ప్రభుత్వ యంత్రాంగం ఏమన్నా తక్కువనా? నిబంధనలను పక్కన పెట్టి పై వారు ఆడించినట్టే ఆడుడు.గింత మాత్రానికి ఎలక్షన్ ఎందుకు?ఎన్ని వాహనాలు!ఎంతమంది ప్రచారం!ఎన్ని మందు సీసాలు!ఎన్ని నోట్ల కట్టలు! చెప్పనలవి కాదు.గాంధీ మహాత్ముడు బతికి ఉంటే ఎంత నెత్తి నోరు కొట్టుకొనునో?ఆ తరం రాజకీయ నాయకులు ఎవరైనా ఎంతో గొప్పగా నిజాయితీగా ఉండేవారు.ఇప్పటి రాజకీయ నాయకులకు బొత్తిగా నీతి నిజాయితీ,నిబద్ధత లేదు.కవి దేవేందర్ అయినా ఈ తరం ఇప్పుడు దినపత్రికలను చదవడం,వార్తా చానల్స్ చూడటం పూర్తిగా లేకుండా అయి పోయింది అని,ఎన్నికల వ్యవస్థను రాజకీయాలను చూస్తే జాలి కలుగుతుంది అని అంటున్నారు.
అహం అన్ని రోగాలకు మూలం కాలమ్ లో
అహాన్ని కిరీటం చేసుకుని జీవించాలనుకునే వారికి ప్రశాంతత కనిపించదు.అహం స్థానంలో ఆత్మ గౌరవం నిండి ఉండాలి.అహం నిండిన వారి కార్య క్షేత్రంలో నిరంతరం మెదిలే వారికి కొంచెం కష్టమే. వీళ్లకు ఆత్మగౌరవ సమస్య.అహంకారం ఆత్మ గౌరవాల మధ్య మమకారం నలిగిపోతది.ప్రేమ, కరుణ,అనురాగం నిండి ఉండాలి.ఒక రాజకీయ పార్టీ నాయకునికైనా,ఒక ఉన్నతాధికారికైనా,ఒక యజమానికైనా,తోటి వాళ్లతో అంతా నేనే అనే కంటే అంతా మనమే అనే భావన కొనసాగితే ఆ కార్య క్షేత్రం పరిఢవిల్లుతది.కవి దేవేందర్ అన్నింటికి మించి మనుషులందరికీ ప్రేమ,సహనం,క్షమించే గుణం, అందరి పట్ల ఉదారత్వం ఉండాల్సిన రోజులు రావాలి అని అంటున్నారు.
నడిచి వచ్చిన నిప్పుల వాగు కాలమ్ లో
తెలంగాణ ఉద్యమ పాట నిప్పుల వాగు పుస్తకం చూస్తేనే సంబురమైతది.ఇదొక మహత్తరమైన కృషి. తెలంగాణ మీద ఆలపించిన పాటలన్నీ నిప్పుల వలె ప్రవహించిన దృశ్యం.దీని సంపాదకుడు అందెశ్రీ అద్వితీయమైన కృషిని మనసారా అభినందించవలసిందే.ఇది తెలుగులో దాదాపు మొట్టమొదటి సంకలనం.ఇందులో 790 పాటలు/ కవితలు ఉన్నవి.అన్ని పాటలు తెలుగు నేల మీద హోరెత్తించినవే.ఊరూరులోను పాడినవే.తాను కొందరు స్నేహితులు,సన్నిహితుల సాయంతో ఈ నిప్పుల వాగును తెలుగు జాతికి అందించారు.కవి దేవేందర్ ఇది తెలుగు సాహిత్య చరిత్రలోనే నిలిచిపోయే మైలురాయిగా పేర్కొంటున్నారు.
వారు మేలు కథలు జానపదులు కాలమ్ లో
ఊరూరికి కథలు చెప్పే వాళ్ళు ఉంటారు.అంటే యక్షగానం,ఒగ్గు కథలు,బాగోతం ఆడేటోళ్లు,అందరికీ తెలుసు.వీళ్ళు వృత్తి కళాకారులు.ఇతర వృత్తులలో చేను – చెలక పనులలో ఉంటూ కూలీ నాలీ చేసుకుంటూ జీవనం సాగించే వాళ్ళలో కొందరు తాతల నుంచి వారసత్వంగా వచ్చిన కథలను చెబుతరు.వీటిని ‘శాత్రం’ చెప్పుడు అంటరు.ఈ విద్య అందరికీ రాదు.ఏదో ఒక కథనం అర్థం అయ్యే రీతిలో చెప్పే కళ.ఇట్లాంటి కథలను ఆచార్య పులికొండ సుబ్బాచారి గారు రెండు రాష్ట్రాల నుంచి సేకరించి ‘తెలుగింటి జానపద కథలు’ పేరిట ఒక పుస్తకంగా వెలువరించారు.ఇన్ని కథలను సేకరించడం మామూలు పని కాదు.ఆచార్య సుబ్బాచారి గారు పరిశోధకుడు,జానపద జ్ఞానం పట్ల అత్యంత ఆసక్తిగల రచయిత.సామెతలను కలుపుతూ ముచ్చట్లు పెట్టే చమత్కారులు ఉంటరు.వీళ్లందరినీ దొరకబట్టి రికార్డ్ చేసి తెలుగు సాహిత్యంలో చేర్చాల్సిన అవసరం ఉంది. కవి దేవేందర్ ఇట్లాంటి వాళ్ళు ఉన్నారని,ఉంటరని, గుర్తించి.. పట్టుకొని,పట్టుబట్టి వాళ్లతో కథ చెప్పించి ఇలా పుస్తకం వేయడం గొప్ప విషయం అని అంటున్నారు.
కంకి ధర ఐదు.. గింజ ధర వంద !? కాలమ్ లో
చూస్తే పెద్ద పొట్లం,పొట్లం నిండా తెల్లని పువ్వులు పువ్వులుగా కనిపిస్తున్న మక్క ప్యాలాలు.వాటిని పాప్ కార్న్ అంటరు. చూడంగానే తినాలనిపిస్తది. ధర చూస్తే వంద రూపాయలకు అమ్ముడు.అసలు ఎన్ని గింజలు ఉన్నయి.ఒక చిన్న మక్క కంకి ఒలిస్తే అలాంటివి రెండు పొట్లాలు చేయచ్చు.అంటే పది రూపాయల కంకి గింజలు వంద రూపాయలకు అమ్ముడు.ఇదెంత మాయ కదా?అనుకున్న.ఇదంతా ఇటీవల మల్టీప్లెక్స్ థియేటర్లో సినిమాకు వెళ్తే తెలిసింది.ఆ పాప్ కార్న్ పొట్లంలో 30,40 గింజలున్నయి.పంటలు పండించే రైతుల దగ్గర గింత అగ్గువకు కొని సూపర్ మార్కెట్ లో సినిమా హాల్ లో ఆధునిక పద్ధతులతో మార్పిడి చేసి ఇంత ఘోరంగా సంపాదిస్తున్నారు.వీటన్నిటి వెనుక మల్టీ నేషనల్ కంపెనీలే ఉంటాయి.సమాజంలో ఏ వస్తువైనా పెట్టుబడి తక్కువ.కింది స్థాయి నుంచి తక్కువ ధరకు కొనడం,బ్రాండ్ పేర్లు చేర్చి దానినే తిరిగి అయిదింతలకు అమ్మడం.ప్రపంచం అంతా ఇట్లనే ఉన్నది.కవి దేవేందర్ మార్కెట్ మాయాజాలం నిండిపోయి ఉన్నం అని,ఈ వల నుంచి బయటపడ లేమని అంటున్నారు.
పోలీసు సేవలన్నీ అందుకేనా !? కాలమ్ లో
పోలీసు ఉద్యోగాల ఎంపికకు యువతీ యువకులు ఎంత కష్టపడుతున్నారో వాళ్లు శిక్షణ పొందుతున్న మైదానాలు చూస్తే తెలుస్తుంది.పోలీస్ డ్రెస్ వేసుకోవడం కోసం ఈనాటి యువతరం కల కంటున్నారు.కవి దేవేందర్ ఈ కాలం పోలీసులకు పౌరులతో సంబంధాలు ఇది వరకు కన్నా స్నేహపూర్వకంగానే ఉన్నాయని,కానీ సేవలన్నీ బందోబస్తు ప్రదర్శనకే సరిపోతున్నాయి అని అంటున్నారు.ఇది విచారించదగిన విషయంగానే తోస్తుంది.
ప్రయాణం ఒక చలన శీలత కాలమ్ లో
ప్రయాణం మనసుకు ఒక వికాసం.కొత్త ప్రదేశాలు తిరగడం, నిజంగానే ఒక జీవనోత్సాహం.యాత్రకు వెళ్లడం అంటేనే కొత్త సంస్కృతి,కొత్త మనుషులు, పట్టణాలు,రాష్ట్రాలు చూడటం అంటే పరిశీలన ఆసక్తి ఉండాలే గానీ,అది కండ్ల పండుగే.పిల్లలతో ప్రయాణం చేస్తే కూడా ఎంతో విజ్ఞానదాయకం. పిల్లలు పెద్దగా అయినంక తమ జీవితంలో అనుభూతిని గుర్తు చేసుకుంటరు.ఇలాంటి యాత్రలోనే ప్రయాణం కొన్ని గంటలు కల్సి మాట్లాడుకోవడం ఒక అనుభూతి.కవి దేవేందర్ ప్రయాణం ఒక చలనశీలత అని,ఇది మనుషుల ఏకాంతాన్ని ప్రకృతిలో మమేకం చేస్తది అని అంటున్నారు.
తెలుగుకు మరో పేరు తెలంగాణ కాలమ్ లో
తెలుగు భాషకు మరొక పేరే తెలంగాణ అని బూర్ల వెంకటేశ్వర్లు ఢంకా బజాయించి చెబుతున్నారు. తెలుగు భాషకు ఆంధ్ర భాష అనే మరో పేరు ఉన్నట్టుగానే,తెలంగాణ భాష అని పిలుచుకోవచ్చు. ఎందుకంటే లిపి అంతా ఒక్కటే అని తెలుగు తెలంగాణం అన్నారు.తెలంగాణ భాష సొగసైనదని, నాద మాధుర్యం గలదని బూర్ల వెంకటేశ్వర్లు ఇటీవలనే విడుదల చేసిన ‘ఉపకారి’ తెలంగాణ భాషానుశీలక వ్యాసాల పుస్తకంలో చాలా వరకు వివరించారు.ఈ పుస్తకంలో 23 వ్యాసాలు ఉన్నాయి.కవి దేవేందర్ తెలుగు భాషా పండితులు చదవాల్సిన పుస్తకం ఇది అంటున్నారు.
మనసు మాట వినాలి కాలమ్ లో
కాలం కరిగిపోతూనే ఉంటుంది.జీవితం జరిగిపోతది.క్యాలెండర్ పుటలు పుటలుగా మారి పన్నెండో నెల తర్వాత కొత్తది గోడకు వేలాడుతది. మాసాలు మారినట్టే ఋతువులు తిరుగుతుంటాయి.మనుషులంతా మారిపోతారు. ఆలోచనలు మారిపోతాయి.జీవితంలో కొంగ్రొత్త మార్పులు వస్తాయి.వృత్తి ఉద్యోగంలోనూ నూతనత్వం వస్తుంది.మార్పు అనివార్యం.కాలం కదలడం.భూమి తన చుట్టు తాను తిరిగినట్టే జరిగిపోతుంది.ఒక సంవత్సరం మనిషికి ఒక మైలురాయి.మనిషి ఆహారం,విహారం,ఆరోగ్యం, ఐశ్వర్యం అన్నిట్లోనూ ఆధునికత వచ్చింది.కవి దేవేందర్ నిరంతరం మారుతున్న మార్పును ఆహ్వానించాలని,దాంతో కలిసి నడవడమే నవీన మానవుడు చేయాల్సిన చర్య అని.అప్పుడే మనసు తేలికయి గాలిలో ఊయలలు ఊగవచ్చు అని,కొత్త సంవత్సరంలో అందరి జీవితాలు నిరంతరం ఉత్సవ స్ఫూర్తితో కొనసాగాలని కోరుకుందాం అని అంటున్నారు.
సంఘ సంస్కరణల కథల శిల్పి రేగులపాటి కిషన్ రావు కాలమ్ లో
రేగులపాటి కిషన్ రావు కరీంనగర్ జిల్లాకు చెందిన సీనియర్ రచయిత,కథలు,నవలలు,కవిత్వం అభ్యుదయ దృక్పథంలో రాసిండు.దొరతనపు సామాజిక నేపథ్యంలో పుట్టినా సంఘ సంస్కరణ, దోపిడీ,పీడన,హేతువాద భావనలో కథలు రాశారు. నాలుగు నవలలు,ఆరు కథా సంపుటాలు,పద మూడు కవిత్వ సంపుటాలు,నాలుగు వ్యాసాల పుస్తకాలు వెలువరించారు.ఆయన 1946 డిసెంబర్ 1 న సిరిసిల్ల దగ్గర చింతల టానాలో పుట్టారు. ఇప్పుడు ఆ వూరు మిడ్ మానేరు ముంపుకు గురైంది.కరీంనగర్లో స్థిరపడ్డారు.1970 నుంచి 2004 వరకు 34 సంవత్సరాలు ఆదర్శ ఉపాధ్యాయునిగా పలు పాఠశాలల్లో పని చేశారు.కవి దేవేందర్ నిరంతరం సమాజంలో మార్పు కోసం ఆలోచన చేసే కిషన్ రావు 05 – 01 – 2023 రోజున కన్ను మూశారు.ఆయనకు భార్య,కూతురు,అల్లుడు, మనుమడు,మనుమరాలు ఉన్నారు అని తెలిపారు.
ఆధునికతను అందుకోకపోతే ఆగిపోవుడే కాలమ్ లో
మారుతున్న కాల పరిస్థితులకు అనుకూలంగా మనిషి ఆధునికతను అందిపుచ్చుకోకుంటే అక్కడే ఆగిపోవుడే అయితది.ఆధునిక ఆలోచన,ఆధునిక సాంకేతికత,ఆధునిక జీవనశైలి కానీయండి ఇప్పటి స్థితిలో ఉండటమే మేలు.లేకుంటే తరాల మధ్య తారతమ్యాలు వస్తాయి.కుటుంబంలో,సంస్థలో ఎక్కడైనా తరాల మధ్య అంతరాలు,మనుషుల మధ్య గ్యాప్ పెంచుతాయి.వయసు పెరిగే కొద్దీ నేను చిన్నప్పుడు ఇట్లా ఉండేది అంటూ పాత పురాణం చెపుతుంటారు.అవి ఎంత మాత్రం విన సంబరం ఇప్పటి తరంకు ఉండదు.ఎప్పటి ఆలోచనలు అప్పుడే.ప్రతిదీ నేర్చుకోవడమే జీవితం.కొత్తగా ఆలోచించడమే.కొత్తదనాన్ని ఆలోచించడమే నవ్య జీవన విధానం.కవి దేవేందర్ ఇప్పటి తరానికి అన్ని అల్కగా తెలుస్తున్నయి,వాళ్ల దగ్గర నుంచి నేర్చుకోవాలి,వాళ్లకు కూడా ఎవరు నేర్పరు,చూసి నేర్చుకుంటరు అని అంటున్నారు.
నిరంతర చలనంతోనే జీవన సాఫల్యత కాలమ్ లో
నిరంతరం చలనం లేకుంటే ఆగిపోయినట్టే.మనిషికి ఆక్టివిటీ ముఖ్యం.ఏ పనీ పాట లేకుంటే జీవ చైతన్యం కోల్పోవుడే.మరి పని లేనోళ్ళు ఎవలుంటారు అని కాదు గాని 60,70 ఏండ్లు దాటిన తర్వాత వృద్ధాప్యం వచ్చిందని తమకు తామే మెదడుకు సంకేతాలు ఇచ్చుకుంటరు.ఇటీవల పరిశోధనలో 80 ఏళ్లు దాటితేనే వృద్ధతరం వచ్చినట్టట.జపాన్ లాంటి దేశాల్లో నైతే 100 సంవత్సరాలు దాకా ఏదో పని చేస్తూనే ఉంటారు. రిటైర్ అయిపోయినం,పిల్లల పెండ్లిల్లు అయి పోయినయి,ఇగ ముసలితనం వచ్చిందని కొందరు ఒక భావనలో ఉంటారు.మెదడు ఎంత ఆలోచిస్తుంటే అంత చురుకుదనం వస్తుంది. ఎక్కువగా సృజనాత్మకత వైపు ఆలోచనలు ఉండాలి.చదవడం,రాయడం,మాట్లాడటం,ఇంటి పని,వంట పనిలో భాగస్వాములు కావడం, సామాజిక విషయాల్లో,చర్చల్లో,కొత్త తరంతో ఇంటరాక్ట్ అవ్వడం,ఇవన్నీ నిరంతరం మనుషులను చలనశీలత వైపు నడిపిస్తాయి.కవి దేవేందర్ మనిషి ఎప్పుడు నిరంతరం ఆలోచనలో,సృజనాత్మక చలనశీలత,సామాజిక జీవితంలో కల్సిపోతేనే అసలైన జిందగీ అని అంటున్నారు.
తినడం కాదు రుచిని ఆస్వాదిస్తున్నామా! కాలమ్ లో
ఈ మధ్య అన్నింటికీ తొందర ఎక్కువైంది.నిదానం తక్కువైంది.ఏ పని అయినా తృప్తిగా చేయడం లేదు.అందరికీ బిజీ షెడ్యూల్. ఆఫీసులకు, వ్యాపారాలకు,ఉద్యోగాలకు వెళ్లిపోవాలె అనే ధ్యాసనే కానీ,ఈ పనులన్నీ ఆనందంగా జీవించడానికే అని మరిచి పోతున్నారు.ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలంటే సరియైన వేళకు సరియైన సమతుల్యమైన భోజనం అవసరం. కానీ,ఆ భోజనాన్ని ఒక పద్ధతిగా తినడం తగ్గిపోతుంది.ఎవలను చూసినా నాలుగు బుక్కలు నోట్లో పెట్టుకొని మూతి కడుక్కొని ఉరుకుడే అవుతుంది.బిజీ లైఫ్ దాపురించి మంచి నీళ్లు తాగడం కూడా తక్కువైంది.సరియైన నీళ్లు తగిన మోతాదులో తాగడం లేదు.సరియైన వేళకు సరిగ్గా తినడం అన్ని వృత్తుల్లోని వారికి తగ్గిపోయింది. ఎందుకంటే ఒత్తిడి,పోటీ తత్వం,సంపాదన ఎక్కువైనయి.ఆఖరుకు వ్యవసాయం చేసే ఈ తరం వాళ్లు కూడా తినే దగ్గర తృప్తి లేదు.తినే అన్నం మీద మాత్రమే ధ్యాస పెడితే తిన్న తిండి పెయ్యికి పడుతది.జీవితాన్ని సరియైన మార్గంలో పెట్టాలంటే వ్యాయామం,యోగా వంటివి చేస్తుండాలి.కవి దేవేందర్ ఏ పని చేసినా ఆనందంతో ఆ పనిపై శ్రద్ధ, నైపుణ్యత,పనిని ప్రేమించడం,నిరంతరం ఆ రంగంలో మార్పులకు సాంకేతికను గమనిస్తూ చైతన్యంతో ముందుకు సాగడం ముఖ్యం అని అంటున్నారు.
చేసికోవాల్సిన సమయంలో పెళ్లి చేసికుంట లేరు కాలమ్ లో
చదువు,ఉద్యోగం,స్వతంత్ర ఆలోచనా దృక్పథం ఇటీవల యువతరంలో తరచూ కన్పిస్తున్నది. చదువుకున్న యువతరంలో ఎంత మందికి ఉద్యోగాలు వస్తున్నాయి అనే విషయం పక్కన పెట్టితే ఆ ఉద్యోగాలు పొందిన ఆడపిల్లలైనా,మగ పిల్లలైనా తమ పెళ్లి కోసం తొందరపడటం లేదు. చదువు అయిపోయింది.సాఫ్ట్ వేర్ ఉద్యోగం వచ్చింది.ఇగ పెళ్లి చేసుకోవాలె అనే ఆలోచన కూడా చేయడం లేదు.ఆడ వాళ్లు కూడా 30,35 దాటిన తర్వాత తల్లిదండ్రులు ఒత్తిడి తెచ్చిన నిర్లిప్తంగా ఉంటున్నారు.వారిలో స్వతంత్ర ఆలోచనల భావధార కొనసాగుతుంది.పైగా పెళ్లైన కుటుంబాల ఆడ పిల్లలు మగహంకార అధిపత్యాలు గమనించి ఉంటారు.సింగిల్ లైఫ్ బెటర్ అనే ధోరణిలో ఉంటున్నారు.కవి దేవేందర్ ఏది ఏమైనా ఇదివరకు అబ్బాయిలు దొరకకపోయేదని,ఇప్పుడు అమ్మాయిలు ఉన్నా పెళ్లిళ్లు తొందరగా అయిత లేవు అని అంటున్నారు.
ఎన్నీల ముచ్చట్లు కవిత్వాన్ని జల్లెడ పట్టిన కూకట్ల కాలమ్ లో
ఎన్నీల ముచ్చట్లు అంటే కరీంనగర్ కవుల ఇంటి డాబాల మీద ప్రతి పౌర్ణమి రోజు జరుపుకునే కవి సమ్మేళనం.ఈ కవిత్వ పున్నమి కలయిక,గత పది సంవత్సరాలుగా నిర్విరామంగా నడుస్తున్నది.ఒక పున్నమికి కవులందరు చదివిన కవిత్వం మరో పున్నమి వరకు పుస్తకంగా వస్తుంది.ఇట్లా నలభై నెలల వరకు కవిత్వ సంకలనాలు వచ్చాయి.ఇట్లా వెలువడ్డ ఒకటి నుంచి ఇరవై ఐదు ఎన్నీల ముచ్చట్ల కవితా సంకలనాలను కవి, విమర్శకుడు,తెలుగు భాషోపాధ్యాయుడు కూకట్ల తిరుపతి జల్లెడ పేర విమర్శనా వ్యాసాల పుస్తకం వెలువరించారు. ఇందులో 2013 నుంచి 2015 వరకు జరిగిన కవి సమ్మేళనాల కవిత్వంకు చాలా సూక్ష్మంగా పరిశీలన చేశారు.కవి దేవేందర్ కూకట్ల తిరుపతి తెలుగు సాహిత్యంలో మైలురాయి లాంటి ఎన్నీల ముచ్చట్లను జల్లెడ పట్టి ప్రపంచానికి అందించారు అని అంటున్నారు.
పాఠకుడు మహాపాఠకుడై వివరించిన కవిత్వ సారం కాలమ్ లో
ఏ పుస్తకమైనా చదివి తీరాల్సిందేనని పట్టుదలతో ఉండే పాఠకులు ఉంటారు.ఆ పాఠకులే మహా పాఠకులైతరు.కాలం కల్సి వస్తే వాళ్లే చదివిన పుస్తకంపై వ్యాఖ్యానం చేస్తారు.అదిగో అటు వంటి గొప్ప సాహిత్య వ్యాఖ్యాత అన్నాడి గజేందర్ రెడ్డి. ఆయన తెలుగు సాహిత్యం చదువుకున్న స్నాతకోత్తర విద్యార్థి. అనంతర కాలం కళాశాలలో తెలుగు అధ్యాపకులుగా పని చేసి ప్రధానాచార్యులుగా ఉద్యోగ విరమణ పొందారు. అన్నాడి గజేందర్ రెడ్డి చదివిన ప్రతి పుస్తకాన్ని రాయడం మొదలు పెట్టాడు.అట్లా రాసిన వ్యాసాలు ‘వెలుగు’దినపత్రికలో దాదాపు వారం వారం వెలుగు చూసాయి.ఆ తర్వాత ‘వెలుగుల వెల్లువ’ అనే పుస్తకం బయటకు వచ్చింది.ఈ పుస్తకంలో తాను చదివి రాసిన పుస్తకాల్లోంచి ముప్ఫై మూడు కవిత్వ పుస్తకాల కవిత్వాన్ని పుస్తకంగా వెలువరించారు.కవి దేవేందర్ ఈ పుస్తకం చదివితే ఇందులోని వ్యాసాలు మూలాల పుస్తకం చదవాలనే ఆసక్తి పాఠకుల్లో కల్గుతుంది అని అంటున్నారు.
మానసిక ఒత్తిడితోనే ప్రశాంతత కరువు కాలమ్ లో
నిదానం నెమ్మదితనం ప్రశాంతత లేని తరం కనబడుతుంది.ఎక్కడ చూసినా ఉరుకులాట ఎక్కువైంది.వేగిరం ఎక్కువైంది.జీవితం పరుగు పందెం లెక్క తయారైంది.కొందరు తయారు చేసుకుంటున్నారు.కొన్ని వృత్తులు అట్లనే ఉంటున్నయి.ఒత్తిడి మీది కెల్లి టార్గెట్లు,తొందర పెట్టుడు,ఎక్కువ పని చేసుడు, తక్కువ పని చేసింది మీదికి రిపోర్ట్ చేసుడు ఎక్కువ.ఈ మానసిక ఒత్తిడితోనే ప్రశాంతత అందరిలో కరువైంది.కవి దేవేందర్ ఇప్పుడు అంతా స్పీడ్,మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడే మానవ సంబంధాలు పరిపక్వంగా ఉంటాయి,నిదానంగా ఆలోచనలు ఉండాలి.అందుకు దృఢ దృష్టి,దృఢ సంకల్పం ఉండి తీరాలి అని అంటున్నారు.
నగరాల్లో పుస్తక మహోత్సవాలు విరివిగా.. కాలమ్ లో
పుస్తకమే జ్ఞానకవాటం.పుస్తకమే మనిషి జీవితానికి భవిష్యత్ దర్శనం.చరిత్ర వర్తమాన సామాజిక ఆర్థిక సాంస్కృతిక విషయాల పట్ల వికాసం పెంపొందించేవి పుస్తకాలే.ఒకప్పుడు పుస్తకాలు ఇష్టంగా చదివే వాళ్ళు.ఇట్లా చదవడం వల్లనే జీవన సాఫల్యత ఉంటుంది.ప్రస్తుతం 2023 మార్చి 2 నుండి 8 వరకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని కరీంనగర్ జిల్లాలో పుస్తక మహోత్సవం నిర్వహిస్తున్నారు.కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్,అడిషనల్ కలెక్టర్ జి.వి.శ్యాం ప్రసాద్ లాల్ లకు పుస్తక వికాస ప్రేమ ఉండటం వల్ల ఇలాంటి ఉత్సవాలు నిర్వహించి ప్రజలకు అందుబాటులోకి పుస్తకాలను తెచ్చేందుకు తెలంగాణ బుక్ ట్రస్ట్ తోడ్పాటును అందిస్తున్నారు. పుస్తకాల సంస్కృతిని చదువు అలవాటును ఆధ్యయనం పట్ల ఆవశ్యకతను ప్రజల్లో కలిగించేందుకు ప్రతి రోజు ఒక కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు.కవి దేవేందర్ పుస్తక జ్ఞాన వికాసం అన్ని నగరాల్లో విస్తృతంగా జరగాల్సిన అవసరం ఉన్నది అని అంటున్నారు.
మా బడి వజ్రోత్సవం కాలమ్ లో
కరీంనగర్ జిల్లాలో 1945 ప్రాంతంలో వేళ్ల మీద లెక్కపెట్టబడే బడులే ఉండేవి.అందులో హుస్నాబాద్ లో 1947 లో స్థాపించిన ప్రాథమిక పాఠశాల ఒకటి.ఇప్పుడది ఉన్నత పాఠశాలగా మారి ఈనెల 20 మార్చి 2023 న 75 ఏళ్లు వజ్రోత్సవ పండుగ జరుపుకుంటుంది.1947 లోనే హుస్నాబాద్ లో ప్రాథమిక పాఠశాల బి లక్ష్మీ కాంతారావు పూనికతో ఏర్పడింది.అనంతరం అది ఉన్నత పాఠశాల గా మారింది.1958లో మొదటి హెచ్.ఎస్.సి.(11 వ తరగతి)బ్యాచ్ వెలువడింది.ఒక పాఠశాల 75 వసంతాలు పూర్తి చేసుకుని ఒక పండుగలా సెలబ్రేట్ చేసుకుంటున్న సందర్భం ఇది. ఈ బడి ఎందరినో తయారు చేసింది.అందరు కలుసుకుంటున్న సందర్భం ఇది.అందరు కలిసి అరేయ్,ఒరేయ్ అనుకున్న జ్ఞాపకాలు,కొట్టుకున్న, తిట్టుకున్న మధురిమలు,పాఠశాల మైదానంలో ఆడిన పాత అడుగుజాడలు మళ్లీ మళ్లీ వెతుకుతున్న రోజు ఇది.కవి దేవేందర్ విద్యా గంధానికి దూరమైన తెలంగాణలో ఒక బడి 75 ఏళ్ల పండుగ జరుపుకోవడం సంతోషంగా ఉంది అని అంటున్నారు.
సామాన్యుల చేతిలో యూట్యూబ్ ప్రయోజనం కాలమ్ లో
యూట్యూబ్ సామాన్యులకు సైతం అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లలు పెద్దలు అందరూ డ్యాన్స్ సులువుగా చేస్తున్నారు.ఒకప్పుడు పాఠశాల వార్షికోత్సవాల్లో డాన్స్ చేయాలంటే క్లాస్ కు ఇద్దరు విద్యార్థులు దొరికే వారు.ఇప్పుడు అట్లా కాదు క్లాస్ క్లాసంతా అందరు పిల్లల సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.ఇదంతా ఇంటర్నెట్,యూట్యూబ్ మహిమ.సినిమాలు,పాటలు,డాన్స్ షోలు ఎన్నో యూట్యూబ్ లో ఈ రోజుల్లో చూస్తున్నారు. చూడటమే కాదు, అనునయిస్తున్నారు. నేర్చుకుంటున్నారు.చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల దాకా డాన్స్ అన్నా,సంగీతం అన్నా,జానపద పాటలన్నా ఇష్టపడుతున్నారు.కవి దేవేందర్ సెల్ ఫోన్,ఇంటర్నెట్ అర చేతిలోకి వచ్చిన తర్వాత ప్రపంచమే మారి పోయింది.టెక్నాలజీ అందరి సొత్తు.అందరు వాడాలి.దానితో మరిన్ని కొత్త కొత్త ప్రయోగాలు చేసి సామాజిక ప్రయోజనం కోసం ఉపయోగించాల్సిన అవసరం ఉంది అని అంటున్నారు.
కుటుంబ బలగం … మృగ్యమవుతున్న కాలం కాలమ్ లో
కుటుంబ బంధాల్లో దూరమవుతున్న అనుబంధాలకు ఒక్కసారిగా ఇటీవల వచ్చిన బలగం సినిమా షాక్ ఇచ్చింది.సినిమా చూస్తున్నంత సేపు ఊరు,కుటుంబం,తల్లి,తండ్రి గుర్తుకు వచ్చి ప్రేక్షకులను పలు ఆలోచనలకు గురి చేస్తది. సినిమాలో చనిపోయిన తర్వాత పిట్టకు పెట్టుడు ఆ పద కొండు రోజుల వరకు ఉన్న సంఘటనలు ఉన్నది ఉన్నట్టు చూయించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు.తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ సంస్కృతికి,భాషకు గౌరవం పెరిగింది.బలగం సినిమాలో మాత్రం సహజత్వం ఉట్టి పడింది.కవి దేవేందర్ తెలంగాణ పల్లె సొగసు కనిపించే సినిమాలు మరిన్ని రావాలి అని కోరారు.
ఆపతికి సంపతికి సోపతి కాలమ్ లో
మనిషికి స్నేహితులు లేకపోతే మనసు విప్పి మాట్లాడుకునే ఖాళీ మనసు దొరకదు.నిజానికి అందరికీ స్నేహితులు తమ చదువుకున్న చోట్ల, తాను బాల్యంలో నివసించిన చోట్ల,తాను వృత్తి వ్యాపారం ఉద్యోగం కొనసాగిస్తున్న చోట్లల్ల ఉంటారు. స్నేహం కొందరితోనే కొనసాగుతది. స్నేహితుల్లో విశ్వసనీయత ఉండాలి.ఒకరి పట్ల ఒకరికి గౌరవం,ప్రేమ ఉండాలి.భిన్న అభిప్రాయాలు ఉన్నా సరే స్నేహం గొప్పది.స్నేహితుల మధ్య నిష్కల్మషమైన మనస్తత్వం ఉండాలి.ఏ రకమైన ఆధిపత్యం ఉండ రాదు.కవి దేవేందర్ ఒకరు చెబితే ఒకరు వినడం కాకున్నా ఒకరి పట్ల ఒకరికి గౌరవం ఉంటే అప్పుడే ఆ సోపతి జీవితానికి అసలు ఆపతి సంపతి అని అంటున్నారు.
జమిడిక జతుల ధ్వనుల కవిత్వం కాలమ్ లో
జమిడిక ఒక వాయిద్య పరికరం.బైండ్లోళ్ళు గ్రామ దేవతలను కొలిచేటప్పుడు దీన్ని వాయిస్తూ కథా గానం చేస్తారు.అదొక అద్భుతమైన కళ.జమిడిక చప్పుడు పోచమ్మల కాడ,ఎల్లమ్మ కాడ కన్పిస్తది. జమిడిక శీర్షికతో కందుకూరి అంజయ్య కవిత్వ పుస్తకం వెలువరించిండు.చెరబండరాజు కవిత్వం మీద పరిశోధన చేసిన ఆయన ఇది వరకు కట్టెపల్క అనే కవితా సంపుటి తెచ్చిండు.జమిడిక ఈ కాలానికి వెలువడిన గొప్ప పుస్తకం.ఇందులో సమకాలీన ఆరాటాలు,పోరాట స్వభావాలు, అస్తిత్వం,ఆలోచనా దృక్పథం కనిపిస్తాయి.ప్రాచీన సాహిత్యం అధ్యయనం చేసిన ఆధునిక దృక్పథం గల ఈ కవి అంజయ్య ఇంకా కవిత్వం విరివిగానే రాయాల్సి ఉంది అని కవి దేవేందర్ అంటున్నారు.
సమాజ కృతజ్ఞత తీర్చుకోవాలి! కాలమ్ లో
ఆస్తులు అంతస్తులు ఐశ్వర్యం విపరీతంగా పెరిగినంక మనిషిలో మమకారం తగ్గిపోతున్న కాలం చూస్తున్నాం.ఎదగాల్సిందే వృద్ధిలోకి రావాల్సిందే. సంపద సృష్టించాల్సిందే కావచ్చు గానీ మానవ సంబంధాలు బలహీన పడకూడదు కదా.సరిగ్గా ఇప్పుడు అదే జరుగుతుంది.పైగా అహంకారం పెరిగిన తర్వాత స్నేహ సంబంధాలు కూడా తగ్గిపోతున్నాయి.కవి దేవేందర్ ఏదైనా సమాజంలో అసమానతలు లేకుండా సర్వ సమానంగా ఉన్నప్పుడే ఈ ఘర్షణలు,మనుషుల మధ్య వైర వాతావరణం ఉండవు.సమానత్వం కోసం అందరు కృషి చేయాల్సిన అవసరం ఉన్నది అని అంటున్నారు.
యాత్ర జీవన వికాసానికొక ఆయుర్వేద మాత్ర కాలమ్ లో
ఇటీవల మేము మిత్రులతో కల్సి ఒక ట్రావెల్ ఏజెన్సీ ద్వారా జమ్మూ కాశ్మీర్ యాత్ర చేసినం.కాశ్మీర్ ఒక బహు సుందర దృశ్యం.మంచు పర్వతాల మీద నడుస్తుంటే మనసు దేహం గాలి లోనే తిరుగుతున్న ఆనందం కల్గుతుంది.మా ప్రయాణం 60 మందికి పైగా యాత్రికులతో ఉత్సాహంగా సాగింది.మా బృందం ఆనందంగా వైష్ణోదేవి శ్రీనగర్,గుల్ మార్గ్, పహెగాం ప్రాంతాలు పర్యటించి ఊపిరితిత్తులను ఉతికి ఆరేసుకున్నాము.కవి దేవేందర్ తాను కరీంనగర్ కు తిరిగి వచ్చినా మనసు మాత్రం హిమాలయ పర్వతాల్లోనే తిరుగుతోంది అని అంటున్నారు.
ఆకస్మికంగా ఆగిపోతున్న హృదయాలు కాలమ్ లో
ఇటీవలి కాలంలో ఆకస్మికంగా గుండెలు ఆగిపోయి మనుషులు విలవిలా కుప్పకూలిపోతున్నారు. ఎకాఎకిన ఆగిన హృదయ కవాటాలలో ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి.అంతకు ముందు గుండె సంబంధ వ్యాధి లేకున్నా,బీపీ,షుగర్ వ్యాధులు లేకున్నా ఒక్కసారే గాలిలో ప్రాణాలు తేలి పోతున్నాయి.కరోనా ప్రభావంతో చాలా మంది మృత్యువాత పడ్డారు.అసలు మనుషుల ఆరోగ్య జీవనశైలి వ్యాయామం ఆహార శైలి నియంత్రణల దృక్పథం పట్ల ప్రజలకు చైతన్యం లేకుండా పోయింది.కవి దేవేందర్ ఏది తినకూడదో అదే తింటున్నారు.ఏది చేయకూడదో అదే చేస్తున్నారు అని అంటున్నారు.ఆ పైన విపరీతమైన పని ఒత్తిడి తట్టుకోలేక మందు తాగడం చేత ఆఖరుకు హృదయం బరువెక్కి తనకు తానే స్విచ్ ఆఫ్ చేసుకుంటున్నది అని అంటున్నారు.
నిరంతర సాధన ద్వారానే ప్రావీణ్యత కాలమ్ లో
మనిషి తన కోరుకున్న ఏ రంగంలోనైనా ప్రావీణ్యత సాధించాలంటే నిరంతరం శ్రమించాల్సిందే.ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే సాధన ఎల్లవేళలా అవసరమే.క్రీడాకారుడైనా,కళాకారుడైనా,చిత్రకారుడైనా,శిల్పకారుడైనా,ఏ సృజనకారునికైనా తన పని మీద తనకు ప్రాక్టీస్ లేకపోతే ఆగిపోయినట్టే.అందుకే నిరంతరం ప్రాక్టీస్ ఉంటేనే మనిషి మెదడు అట్లనే పని చేస్తది.వృత్తినైనా ప్రవృత్తినైనా నిరంతరం అలవాటులో ఉంచుకోవాలి.కవి దేవేందర్ ఏదైనా సాధన చేయడం,సృజనాత్మకంగా ఆలోచించడం, శ్రమించడం,దాని కోసం సమయం కేటాయించడం చేస్తేనే ఆ రంగంలో శిఖర స్థాయిలో ఉండవచ్చు అని అంటున్నారు.
ఆ పోరాటం ఒక పులకరించే జ్ఞాపకం కాలమ్ లో
తెలంగాణ ఉద్యమ జ్ఞాపకాలే ఒక పులకరింపు.ఒక పలవరింతలా ఉంది.తెలంగాణ ఆవిర్భవించి తొమ్మిది ఏళ్లు దాటి పదవ సంవత్సరంలో అడుగిడుతున్న సందర్భం.తెలంగాణ రాష్ట్ర అస్తిత్వ భావజాల ప్రచారం ఎవరు ఊహించని దానికంటే ఎక్కువ జరిగింది.తెలంగాణ పాట పెద్ద స్ఫూర్తి. తెలంగాణ నేల మీద ఏ ఉద్యమానికైనా పాటనే ఆక్సిజన్.నక్సలైట్ ఉద్యమాల్లోనూ పాటలే అందరిని నిలిపేవి.అంతకు ముందు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలోను పాట ప్రభావం ఎక్కువ.కవి దేవేందర్ తెలంగాణ రాష్ట్రం పన్నెండు వందల మంది అమరవీరుల రక్త తర్పణంతో వచ్చింది అని,ఏది ఏమైనా ఈ నేల మీద విజయవంతంగా సాగిన గొప్ప శాంతియుత ప్రజా ఉద్యమం తెలంగాణ,జయహో తెలంగాణ అని అంటున్నారు.
ఆయన కవిత్వం రక్తచలన సంగీతం కాలమ్ లో
ఆయన కవిత్వం రక్తచలన సంగీతం రిక్కల సహదేవరెడ్డి నూనుగు మీసాల నూతన యవ్వనంలోనే కవిత్వం రాసి అమరుడైన కవి. ఇటీవల సహదేవరెడ్డి రాసిన కవితా సంపుటి రక్తచలన సంగీతం అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య వారు పునర్నిర్మించారు.మొదట1988లో సహదేవ్ రెడ్డి మరణానంతరం విరసం ప్రచురించింది.35 ఏళ్ల క్రితం తన 22వ ఏటనే నేలకొరిగిన సాహసి.మరణించిన 35 ఏళ్ల తర్వాత హుస్నాబాద్ కు చెందిన కవిని అతని కవిత్వం ద్వారా నవతరం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అని కవి దేవేందర్ అంటున్నారు.
మనిషిలో క్రూరత్వం మితిమీరిపోతుంది కాలమ్ లో
మనిషిని చూస్తే మాట్లాడుతూ,నవ్వుతూ,నడుస్తూ, ఏదో పనిలో లీనమై కన్పిస్తాడు.కానీ,మనిషిలో క్రూరత్వం కూడా భయంకరంగా కనిపిస్తుంది.ఇటీవల వార్తలొస్తున్న సంఘటనలు చూస్తుంటే ఎంత క్రూరత్వం అంటే సాటి మనిషిని కలిసి ప్రయాణం చేసిన మనుషులను కసకస నరికి చంపి ముక్కలు ముక్కలు చేయడం ఇలా రాస్తుంటేనే ఎంతో ఇదనిపిస్తుంది.ఇట్లాంటిది మనుషులను నరికి కుక్కర్లో పెట్టడం,ఫ్రిజ్ లో పెట్టడం,సంచిలో పెట్టడం, చివరకు నీళ్లలో కలపడం చాలా సులువుగా చేస్తున్నారు.దేశంలో జరుగుతున్న సకల అనర్థాలకు దౌర్జన్యాలకు ప్రధానంగా సినిమాలే కారణం.సినిమా ప్రభావం సమాజం మీద ఎక్కువ.మంచితో పాటు చెడును తెలుసుకునే అంతర్జాలం ఉండటం వల్ల కూడా ఈ దుర్మార్గాలు పెరిగి పోతున్నాయి.నేర నిరూపణతో జాప్యం వల్ల న్యాయస్థానాల్లో నూ అన్యాయం జరుగుతుంది.తప్పు చేస్తున్నం, అన్యాయం చేస్తున్నం,హంతకులం అవుతున్నం, చంపడం ఎంత జుగుప్సాకరమైన అమానవీయ సంఘటన అనే సోయి పూర్తిగా కోల్పోయిన ప్రపంచం తయారవుతుంది.కవి దేవేందర్ సమాజంలో మానవ సంబంధాలు మృగ్యమైపోతున్నాయి అని అంటున్నారు.
సంస్కృతి కోల్పోతున్న పల్లెలు! కాలమ్ లో
ఒకప్పటి పల్లెల సంస్కృతి ఇప్పుడు మారి పోతున్నది.ఊర్లల్ల ఎన్ని వైరుధ్యాలు ఉన్నా అందరం ఒక్కటేననే ప్రేమ భావన ఉండేది.కుల అంతరాలు ఉన్నా రాజకీయ పార్టీల భేదాలున్నా శత్రుత్వ వైఖరి చాలా గ్రామాల్లో లేకుండా ఉండేది.నక్సలైట్ రాజకీయాల ప్రభావం వల్ల ప్రశ్నించడం,అడగడం, మర్లపడటం తెలిసింది.రాజకీయ చైతన్యం చదువుకు దూరమైన కుటుంబాలకు సైతం వచ్చింది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత బహుజన కులాల్లో రాజకీయ ఆసక్తి పెరిగింది.నగరంలో దొరికే అన్ని వస్తువులు,సేవలు పల్లెలో దొరుకుతున్నయి. మద్యపానం ఒకప్పుడు పల్లెల్లో తక్కువగా ఉండేది, సారా ఉండేది.బెల్ట్ షాపుల పేర మందు మాత్రం ఊరురా చేరింది.సులువుగా డబ్బులు వస్తున్నాయి. చదువు మధ్యలో ఆపేసిన వారు డిగ్రీ,పీజీ పూర్తి కాకుండానే పల్లెలో ఉండే వాళ్లంతా ఆయా పార్టీలకు కార్యకర్తలుగా ఉంటూ ఇట్లా వ్యవహరిస్తున్నారు. భూముల పంచాయతీలు అయితే,అవి తెగేదాకా ఊరంతా పండుగే అవుతుంది అని,ఇలా పల్లెలు సంస్కృతిని పూర్తిగా కోల్పోతున్నాయి అని కవి దేవేందర్ అంటున్నారు.
జయహో .. నవ్య,షేజల్,తుల్జా,తులసీ కాలమ్ లో
స్త్రీలు తమ ఆత్మ గౌరవం కోసం న్యాయం కోసం దోషులకు శిక్ష పడటం కోసం బహిరంగంగా ముందుకు రావడం చూస్తుంటే వ్యక్తులుగా వీరు .. వ్యవస్థలను అధికారులను ఎదిరించడం అభినందించ దగ్గ అంశం.ఒక తులసీ చందుగా కాకుండా మిగతా నవ్య.షేజల్ ల పోరాటం లైంగిక వేధింపులకు వ్యతిరేకమైనది.అధికార పార్టీలోని మహిళా నాయకులు గానీ పార్టీ గానీ ఈ విషయంలో చర్య తీసుకుంటే బాగుంటుంది.ఇక తుల్జా భవానీ రెడ్డి విషయంలో అంతర్గతంగా ఆర్థిక విషయాలు ఎలా ఉన్నాయో గాని తండ్రి చర్యను నిరసిస్తూ తన పేర ఉన్న ఆస్తిని ప్రజాపరం చేయాలనుకోవడం మూల పరిణామం.తెలంగాణ ఆవిర్భావం తర్వాత కొన్ని పోరాట సంఘాలు మౌనంగా ఉన్నట్లు కనిపిస్తున్నా,వ్యక్తులుగా ఈ మహిళలు చేసిన పోరాటాలకు కవి దేవేందర్ జయహో.. అని అంటున్నారు.
తెలంగాణ అంటే తాగుడేనా! కాలమ్ లో
ఇటీవల వస్తున్న కొన్ని సినిమాల్లో మందు తాగడమే ప్రధానంగా కన్పిస్తుంది.పాటల్లో ఫైటింగ్లో ఎక్కడ పడితే అక్కడ తాగుడు సన్నివేశం పెట్టారు. తెలంగాణ నేటివిటీతో వచ్చే సినిమాల్లో ఎప్పుడు పడితే అప్పుడు,ఎక్కడ పడితే అక్కడ తాగడం, సందర్భం లేకున్నా మందులో మునిగిపోవడం చూస్తుంటే ఈ సినిమా వాళ్లు తెలంగాణ అంటేనే తాగుడు సంస్కృతితో పరిచయం చేస్తున్నారా? అనిపిస్తుంది.పేదరికం,మోసాలు, వలసలు, వ్యవసాయంలో నష్టపోవడం,పోరాటాలు,ప్రేమలు సమాజంలో ఎన్ని కథలు జీవితాలు ఉంటాయి? అందులో ఫ్యాక్షన్ ఒకటి కావచ్చు.తెలంగాణ సినిమాను కూడా ఒక కల్చర్ కట్టి చూపెట్టడం తగదు అని కవి దేవేందర్ అంటున్నారు.
ఆలోచనలు తారుమారు చేయడమే రాజకీయం! కాలమ్ లో
ఉన్నది ఉన్నట్టుగా కాకుండా లేనిది ఉన్నట్టుగా ఊహలను నిజమని నమ్మించడం,విషయాన్ని మ్యాన్ ప్లేషన్ చేయడంతో అధికార సోపానంలో మీది మెట్టుకు చేరుకోవచ్చు.ఎన్నడైనా ఎప్పుడైనా పాలకులు ప్రజలను నమ్మించి నిరంతరం తమ వైపుకు తిప్పుకోవడం,ఆశలకు గురి చేయడంతోనే లింక్ కొనసాగుతది.అప్పుడే ఓట్లు పడేట్టు రూప కల్పన జరుగుతుంది.అప్పుడే పీఠం ఎక్కుతరు. పవర్ లో ఉన్న పాలకులకు అన్ని హంగులు, ఆర్భాటాలు ఉంటాయి.గనుక ఆలోచనలను తారుమారు చేయడం సులువు అవుతుంది.ఆయా పార్టీలు ఆయా ప్రాంతాలు ప్రజల నాడిని బట్టి ఎన్నికల వ్యూహ పథకాలు వేస్తుంటారు.వాగ్దానాలు అమలు కాకుండా మరిచిపోయేట్టు చేయడం, వాగ్దానాల గురించి ఎలాంటి ఆలోచన రాకుండా దాటవేయడం విజయ సూత్రంగా పరిణమించింది అని కవి దేవేందర్ అంటున్నారు.
ఎంత విద్వేషం తలకెక్కితే.. అలా ఊరేగించారు కాలమ్ లో
ఆడ వాళ్లను అలా నగ్నంగా ఊరేగించారంటే .. ఎంత పొగరు నిండిన మనుషుల గుంపు అయితే అలా హింసానందం పొందుతుంది?వాళ్ళ తలలో ఎంత విద్వేషం నిండిపోయి ఉంది?ఆ దృశ్యాలను చూస్తే అయ్యో ఎంత అన్యాయం ఎంత అమానుషం అనిపిస్తుంది.అయినా క్రూర మృగాల కంటే దారుణంగా మనిషి ఎందుకు ప్రవర్తిస్తున్నాడు?ఈ ఒక్క నగ్న ఊరేగింపే కాదు.ఎక్కడ చూసినా మనుషుల పట్ల మనుషుల్లో క్రూర స్వభావం పెరిగిపోతుంది.భూతదయ,కరుణ,జాలి అనేది పూర్తిగా తగ్గిపోతుంది.ఇంత అన్యాయం చేస్తున్నా నాకేమైనా అయితుందా?అనే భయం కూడా లేదు. ఎందుకంటే ఇదంతా వ్యూహాత్మకంగా సాగిస్తున్న దారుణం,ప్రపంచం నివ్వెరపోయేతనం అని కవి దేవేందర్ అంటున్నారు.
ఆరోగ్యానికి .. హాని కలిగించేవే కొంటున్నం!కాలమ్ లో
ప్రకృతిని,పర్యావరణాన్ని ఏర్పడకుండా ధ్వంసం చేసే సంస్కృతి దాపురించింది.ప్రపంచం అంతా ప్లాస్టిక్ నిండిపోతంది.ఇది మంచిది కాదు అని అందరికీ ఎరికే.అయినా నడుస్తూనే ఉన్నది.ఒక్క నూనెలు నీళ్లు మాత్రమే కాకుండా మన ఆరోగ్యానికి హాని కలిగించే అన్నింటిని కొనుక్కొని వాడుతున్నం.మనం తినే కూరగాయల్లో,చికెన్ లో మనం తినే పండ్లలోను క్రిమిసంహారక అవశేషాలు ఉన్నయి.అయినా కొంటున్నాం వాడుతున్నం.కవి దేవేందర్ ప్రతి వస్తువును ప్లాస్టిక్ పేపర్ ప్యాకింగ్ తో వస్తుంది అని, ఇవన్నీ పర్యావరణానికి హాని కలిగించేవే,ఆరోగ్యానికి హాని కలిగించేవే,వీటిని ప్రభుత్వాలు చూసి చూడనట్లు ఉంటున్నాయి అని అంటున్నారు.
సాంస్కృతిక యుగకర్త గద్దర్ కాలమ్ లో
గద్దర్.. ఈ పేరు పీడిత ప్రజల పొలికేక.ప్రజల పాటకు ప్రతి రూపం.జీవితాంతం ప్రజా ఉద్యమాల గీతం. ఆయన దేహం పాటలమయం.మాట్లాడితే సంగీత ప్రవాహం.పాటలో ప్రపంచాన్ని జయించే శక్తిని ప్రపంచానికి పరిచయం చేశాడు.ఇంతటి ప్రతిభావంతమైన కవి తెలుగు నేల మీద తప్ప ఇంకెక్కడైనా ఉన్నాడా అన్పిస్తది.గద్దర్ ఇప్పుడు భౌతికంగా లేకపోవచ్చు కానీ.. ఆయన పాట శాశ్వతం.ఏది ఏమైనా ఉద్యమం కోసం,పాట కోసం, సమాజం కోసం,జీవితాన్ని ధార పోసిన గద్దర్ ఈ దేశ సాంస్కృతిక యుగకర్త అని,ప్రజల భాషలో ప్రజల జీవితాలను చిత్రించిన సృజనకారుడైన,ప్రజా యుద్ధ నౌక గద్దర్ కు కవి దేవేందర్ జోహార్లు అర్పించడం బాగుంది.
ఎన్నికల పండుగలో.. కనిపించే చిత్రాలు! కాలమ్ లో
ఎన్నికల కాలం దగ్గరికి వస్తుంది అంటే అన్నీ చిత్ర విచిత్రమైన సన్నివేశాలు చూస్తం.ఐదేళ్లకు ఓసారి ఓటర్లతోని అక్కెర.ఆ తర్వాత ఇష్టా రీతిగా వ్యవహారం నడిపించుకోవచ్చు.నిజానికి ఇదొక వ్యాపారం ముందు పెట్టుబడి పెట్టుడు.గెలిచిన తర్వాత రకరకాల మార్గాల ద్వారా సంపాదించుకునుడు.కవి దేవేందర్ రానున్న రోజుల్లో ఈ చిత్రాలన్నీ మనకు కనిపిస్తాయి అని అంటున్నారు.
బహుజనులను ఆలోచనల్లో పడేసే పుస్తకం!కాలమ్ లో
ప్రఖ్యాత చరిత్ర పరిశోధకుడు,రచయిత డాక్టర్ సంగిశెట్టి శ్రీనివాస్ ఎప్పుడు కొత్త కొత్త చరిత్రాత్మకమైన పుస్తకాలు వెలువరిస్తరు.మొన్ననే రెడ్లు,వెలమలేనా!బీసీలు సీఎం కావద్దా’ అనే పుస్తకం విడుదల చేసిండు.ఈ పుస్తకాన్ని చదివితే వెనుకబడేసిన కులాల వారు ఆలోచనల్లో పడుతరు. కవి దేవేందర్ ఈ పుస్తకం అన్ని రాజకీయ పార్టీల్లోని బహుజనులు కొనుక్కొని చదవాల్సిన అవసరం ఉన్నది అని అంటున్నారు.
భయం లేని ప్రవృత్తి పెరిగిపోతోంది ! కాలమ్ లో
ఇయ్యాల రేపు హత్యలు ఎంత సులువు అయిపోయినయి.కుటుంబ సభ్యులు మరీ చెల్లె, అక్కను ఊపిరి ఆడకుండా చేసి హతమార్చడం, ఎంత ఘోరమైన పని.కోరుట్లలో సొంత చెల్లి, అక్కను తన ప్రేమికునితో కలిసి చంపడాన్ని ఎట్లా చూడాలి?దొంగతనం చేయడం చూసిందని తోడ బుట్టిన అక్కను నిర్ధాక్షిణ్యంగా గొంతు నులిమే నేర ప్రవృత్తి ఎట్లా వచ్చింది?కవి దేవేందర్ ఎన్ని నేరాలు చేసినా రాజకీయవాదులను పట్టుకొని సులువుగా బయటకు రావచ్చుననే ఆలోచన కూడా ఉండటం వల్ల సమాజంలో భయం లేని ప్రవృత్తి పెరిగి పోతుంది అని,రానున్న రోజుల్లో మరింత భయంకరం కూడా కావచ్చు అని అంటున్నారు.
ఎంత నెత్తురు ప్రవహించిందీ నేల మీద ! కాలమ్ లో
తెలంగాణ నేల పోరాటాల కార్యశాల.వేల వేల మంది అమరుల త్యాగం వల్లనే మనం ఇంత మాత్రమైనా గొప్పగా జీవిస్తున్నది. తెలంగాణ నేల మీద ఎక్కడ చూసినా కన్నీళ్లు,ఏ రక్తం అంటని మట్టి కనపడదు.ఏ ఊరు చూసినా అమరవీరుల స్థూపాలు,స్మృతులే కనిపిస్తాయి.కవి దేవేందర్ తెలంగాణ నేలనే పోరాట స్వభావాల గాలి.ఇది నిరంతరం ప్రశ్నలు వేసే కాలం. ప్రశ్నలు,పోరాడే స్వభావం అన్యాయంను ధిక్కరించే చేతులు ఎప్పుడు ఉంటాయి అని అంటున్నారు.
ఆలోచనల్లో పరిపక్వత రాకుంటే ఆగిపోవుడే !కాలమ్ లో
నిజానికి నిరంతరం నేర్చుకోవడమే జీవితం.ఎప్పుడు ఒక కొత్త పని నేర్చుకోవడం ఉంటేనే సరదా.పాత ఆలోచనలను ప్రోది చేసి పదిలపరిచి అందులో నుంచి మంచిని ఎంచి మిగతాది కొనసాగిస్తుండాలి. కవి దేవేందర్ ఆధునికతను,కొత్త సాంకేతికతను మారుతున్న మనస్తత్వాలను పట్టుకోవాలని,పది మందికి మేలు చేసేట్లు,నాలుగు మొక్కలకు నీళ్లు పోసేట్లు,నాలుగు పక్షులకు గింజలు వేసేట్లు, నలుగురితో కల్సి నవ్వుతూ జీవించడం నేటి రేపటి అవసరం అని అంటున్నారు.
జీవితంలో లాఫర్వాతనం ఎక్కువైతంది ! కాలమ్ లో
ఇప్పుడు వస్తున్న తరంలో జీవితం పట్ల ఆశావాద దృక్పథంతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలనే ఆకాంక్షలు ఎక్కువగానే ఉన్నాయి.కానీ పని పట్ల జీవన గమనం పట్ల లాఫర్వాతనం కూడా ఎక్కువగా కన్పిస్తుంది.కారులో ప్రయాణం చేస్తరు.డ్రైవింగ్ చేస్తరు.కానీ సీటు బెల్టు పెట్టడంలో ‘ఎహె పోనియి’ ఏమైతదనే ధోరణి ఈ తరంలో ఎక్కువ మందిలో కన్పిస్తుంది.ప్రమాదాల్లో చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు.తీవ్ర గాయాల పాలు అవుతున్నారు.కవి దేవేందర్ జీవితం పట్ల కుటుంబం పట్ల బాధ్యతగా ఉండటం తగ్గిపోతున్నది అని, అందుకే వాస్తవికంగా, నిదానంగా,నెమ్మదిగా,తొందర లేకుండా తగు జాగ్రత్తలతో ప్రయాణాలు చేస్తే మంచిది అని అంటున్నారు.
మొదలైన ఎన్నికల రణరంగం…
ఉత్త మాటలు షురూ!కాలమ్ లో
ప్రజలకు సేవ చేయడానికి గింత పెట్టుబడి ఎట్ల పెడుతున్నవు. గిన్ని కోట్ల పైసలు ఎట్ల ఖర్చు చేస్తున్నావు.అంతకు ముందు నువ్వు ఎట్ల ఉంటివి. నీకున్న ఆదాయం ఎంత?ఇవన్నీ ఎట్ల సంపాదిస్తున్నవు?మల్ల ఇదంతా ప్రజాసేవ అంటవు. అన్ని జూటా మాటలే మాట్లాడుతవు.అన్ని అబద్ధాలు చెప్పుతవు.ఓట్ల కోసం పైసలు ఇచ్చుడు. తర్వాత పైసలు కమాయించుడు.అవినీతి,అధర్మం అనేవి ఉత్త మాటలు లెక్క అయిపోయినవి.కవి దేవేందర్ ఎన్నికల రణరంగం మోపైంది.ఎవలను చూడు గీ పార్టీ గెలుస్తదా,గా పార్టీ గెలుస్తదా అనే లెక్కలే! ప్రజాస్వామ్యం పరిఢవిల్లాల్చిన కాలం కోసం ఎదిరి చూడాలె అని అంటున్నారు.
ఓటరు ఆచితూచి ఓటు వేయాలి!కాలమ్ లో
ఎన్నికలు ప్రజాస్వామికంగా జరగాలి.ప్రజల స్వతంత్ర ఆలోచనలు సాగనివ్వాలి.ఆచితూచి ఓటరు ఆలోచించి ఓటు వెయ్యాలనే చైతన్యం పెంపొందాలి. అసలు మనుషులకున్న మతిమరుపు వీళ్ళ గెలుపుకు మూలమలుపు.కవి దేవేందర్ ఏ పార్టీ అయినా వాళ్ళ గత మేనిఫెస్టోలో పెట్టిన వాళ్ళు గత ఎన్నికల్లో మాట్లాడిన వాగ్దానాలు అమలు అయ్యాయా అంటే చాలా వరకు కావు,కొన్ని అయితయి.అవన్నీ పౌరులకు జ్ఞాపకం ఉండవు అని అంటున్నారు.
రాజకీయమే వ్యాపారం అయితే ఎట్లా!?కాలమ్ లో
ఎల్లెడలా అవినీతి నీతి లాగే చలామణి అవుతుంది. అన్యాయం న్యాయంలాగే ఊరేగుతుంది.అధర్మం ధర్మం అయి కూచున్నది.ఇప్పుడు సమాజం మొత్తంలోనూ విలువలు మారుతున్నవి. స్వాతంత్ర్యానంతరం అవినీతి .. నీతిగా చలామణిలోకి వస్తున్న సందర్భంలో ఎన్నికల క్షేత్రంలో ఉన్నాం.ఇదంతా చూసి నాకేం తక్కువా అని ఓటరు కూడా లంచం లేనిది ఓటు వేయని పరిస్థితి వచ్చింది.డబ్బులు మాకు రాలేదని పోయిన ఎన్నికల్లో ధర్నాలకు కూడా దిగారు.కవి దేవేందర్ న్యాయం అన్యాయం తేడాలేని దుస్థితి దాపురించింది అని అంటున్నారు.
మనిషికి రాజకీయ చైతన్యం అవసరం కాలమ్ లో
నీతికి అవినీతికి తేడా లేదు.లంచాలు పైసలు దళారితనం మాట తప్పడం అనేవి ఒకప్పుడు ఇజ్జత్ అనిపించేది.ఇప్పుడు వాటికే విలువ పెరిగింది.అదే సాలు కొనసాగుతుంది.అయితే రాజ్యాంగం ప్రకారం పౌర హక్కులు,చట్టాలు అమలు కావడం లేదు.అయినా పట్టింపు లేకుండా అయ్యింది.ప్రజాస్వామిక ఆలోచనలు కూడా రాకుండా పోయినయి.ఏది ఏమైనా రాజ్యమంటే కొంత ప్రజాస్వామిక వాతావరణము ఉండాలి.కొంత స్వేచ్ఛ సమానత్వం సమభావం పరిఢవిల్లాలి. అందరిని కోతిని చేసి ఆడిచ్చుడు కాదు.కొన్ని ప్రశ్నలు ఉదయించనివ్వాలె.కొంత చైతన్యం రావాలి. అందుకు అన్ని రాజకీయ పక్షాలు కృషి చేయాలి.కవి దేవేందర్ ఏది ఏమైనా మార్పు,చైతన్యం కొత్తదనం నూతన ఆలోచనలు అవసరమని అంటున్నారు.
ఆగిపోని ప్రశ్నలతరం బర్రెలక్క అభ్యర్థిత్వం కాలమ్ లో
ఈ రోజు బర్రెలక్క ఎలియాస్ శిరీష ఒక యువతరం ప్రతినిధిగా ధైర్యంగా నిలిచింది.తన పోరాటాన్ని నిరుద్యోగ యువతరం ప్రభుత్వాలకు వేస్తున్న ప్రశ్నగా నిలిపింది.నిజానికి ఆమె చదువుకున్నది హైదరాబాదులో,గ్రూప్స్ కి ప్రిపేర్ అయ్యింది.అవి రద్దు అయినవి.లాభం లేదని ఇంటికి వచ్చి బర్లు కాస్తోంది.తెలంగాణ సమాజంలో ప్రశ్నించడం, వ్యతిరేకించడం,అడగడం,మాట్లాడటం అనేది ఆది నుంచి ఉన్నవే.ఈ గుణాత్మకత వల్లనే తెలంగాణ ఉద్యమం వచ్చింది.తెలంగాణ సాధించుకున్నం.కానీ, అప్పటి కొన్ని గొంతులు మూగ పోవడం,కొన్ని సంఘాలు సైలెంట్ కావడం వల్ల అది ఆగదు.మరో తరం ఆ ప్రశ్నను ఒక బర్రెలక్క రూపంలో తీసుకున్నది.కవి దేవేందర్ జయహో బర్రెలక్క జయహో… అని అంటున్నారు.
స్వభావమే మనిషికి ముఖ్యం కాలమ్ లో
మనిషి యొక్క ప్రవర్తన స్వభావాలు,వ్యక్తిత్వాలు మనుషులను దగ్గర చేస్తాయి.మల్ల మార్పులు జరిగితే దూరం కొడతాయి.అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన ప్రజా జీవితంలో ఉండే నాయకుల ప్రతి చర్యను ప్రజలు గమనిస్తూ ఉంటారు.ముఖ్యంగా నాయకత్వంలో ఉన్న వారికి కన్ను మిన్ను కాననితనం ఆవహించవచ్చు.అహంకారపూరిత ప్రవర్తనలు వ్యక్తిగతంగాను ఉండవచ్చు,వ్యవస్థ పరంగాను ఉండవచ్చు, ఇవన్నీ పలు సందర్భాల్లో ప్రజల మనసుల్లో సీసీ కెమెరాల్లో రికార్డ్ అయినట్టే అవుతాయి.తర్వాత ఎక్కడ మీట నొక్కాలనో అక్కడ నొక్కుతరు.దీనికి ప్రొద్భలం కానీ అవతలి వాళ్ళ మంచితనం కానీ కొలమానం కాదు.నిన్ను దించడమే తరువాయి అయితది.ప్రజాస్వామిక స్వేచ్ఛ అవసరం,భావ ప్రకటన స్వేచ్ఛ అవసరం. ఆత్మ గౌరవం నినాదమే అసలైనది.ఇది మనుషులకు,నాయకులకు,వ్యవస్థలకు అందరికీ అవసరమైనది.ఎప్పుడు వినే చెవులను బందీ చేయరాదు అని,చూసే కనులను కలిసే కరచాలనాలను ఆహ్వానించాలె అని కవి దేవేందర్ అంటున్నారు.
ట్రెండ్ సెట్టర్ రైటర్ నరేందర్ కాలమ్ లో
కె.వి.నరేందర్ రాసిన బొడ్లే సంచి కవిత్వం.బొడ్లే సంచి ఈ పేరే అద్భుతమైన పురా జ్ఞాపకాన్ని తట్టి లేపుతుంది.శ్రమజీవులైన తల్లులు చీర నడుము కట్టు దగ్గర పదిలంగా చెక్కుకునే పైసల సంచే బొడ్లే సంచి.మూడు దశాబ్దాలకు పైగా కథలు,నవలలు మానవ సంబంధాలను సామాజిక అంతరాలను చిత్రిస్తున్న నరేందర్ ఇన్నేళ్ల తర్వాత కవిత్వంలోకి రావడం ఆనందంగా ఉంది.నరేందర్ కవిత్వంలో మార్మికత ఉండదు.ఉపమానాలు దృశ్యమానం చేస్తాయి.అందరికీ కనిపించే అల్ప వస్తువుల పైన అపురూపమైన కవిత్వం చెప్పడం ఈ సంపుటిలో కనపడుతుంది.కవి దేవేందర్ కె.వి. నరేందర్ రాసిన బొడ్లే సంచి కవిత్వానికి స్వాగతం పలుకుతూ.. ఉన్నారు.
ఇప్పుడైనా మనసు కడుక్కుందాం కాలమ్ లో
రండి జర ఈ కొత్త సంవత్సరం దర్వాజా దగ్గర నిలబడి మనసులోని మలినాన్ని సబ్బుతోని కడుక్కుందాం.పాత ఆలోచనలు పనికిరాని విశ్వాసాల నుంచి మస్తిష్కాన్ని శుభ్రపరచు కోవాలి.మనం మన కోసం చట్టాలను గౌరవించుకోవాల్సి ఉంది.ధర్మాన్ని న్యాయాన్ని విధి విధానాలను గౌరవించుకోవాలి.భారత రాజ్యాంగమే ముఖ్యం దాన్ని అనుసరించి మనుషులందరు సమానంగా కల్సి జీవించాల్సి ఉంది.అణిచివేత, దోపిడీ,పీడనలేని రోజులను ఆహ్వానించాలి.కవి దేవేందర్ అందుకు ఈ కొత్త సంవత్సరం వెలుగులో ప్రతిన బూనితే బాగుంటుంది కదా.అందుకే రండి ఈ రోజే మనల్ని మనం తేజాబుతో కడుక్కుందాం అని అంటున్నారు.
ఒక చరిత్ర నిర్మాణానికి పునాదిరాళ్లు కాలమ్ లో
ఒక చరిత్ర మరొక చరిత్రకు ఆనవాలు.మానని గాయాల నెత్తుటి చరిత్ర మన కళ్ళ ముందటి మూడు దశాబ్దాల చరిత్రను తెలియజేస్తుంది.ఈ చరిత్ర పేజీల్లోకి వెళితే నెత్తుటి ప్రవాహాల కన్నీళ్ల తడి తాకుతుంది.స్థానిక ఉద్యమాల చరిత్రను అక్షరాల్లోకి మలచాలనే ఆకాంక్ష మంగళారపు లక్ష్మణ్ కు పుష్కలంగా ఉంది.లక్ష్మణ్ కోహెడ కేంద్రంగా పాత్రికేయులుగా పని చేశారు.కవి దేవేందర్ తెలంగాణ ప్రాంతంలో ఆత్మకథలు,ప్రాంత చరిత్రలు రాసుకోవడం తక్కువ అనే లోటును తీర్చి హుస్నాబాద్ ప్రాంత చరిత్రను మంగళారపు లక్ష్మణ్ పుస్తకంగా వెలువరించడం అభినందనీయం అని అంటున్నారు.
ప్రయాణం ఒక ఆనందం కాలమ్ లో
ప్రయాణాన్ని ఆస్వాదించాలే గానీ ఇదొక ఆహ్లాదం.కొత్త ప్రాంతాలను,మనుషులను, సంస్కృతిని,ప్రకృతిని తిరిగి తిరిగి చూడటం అనేది ఏ మనిషికైనా వికాసం.ఏ పండుగ అయినా ఊరికి వెళ్లడం ఎంత ఆనందకరం.ఒక ప్రయాణమే ఒక మానసిక వికాసం.ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఒక స్వేచ్ఛా వికాసం మానసిక పరివర్తన కల్గుతది.కవి దేవేందర్ నిలువ నీరు కన్నా ప్రవహించే నది నీరు ఎంత మెరుగో..ఉన్న కాడ ఉండకుండా,మనిషి తిరిగిన్నాడే గొప్ప అనుభూతి చెందుతాడు అని అంటున్నారు.
ఈ పర్వత శ్రేణుల్లో.. సూర్యోదయం చూడాల్సిందే! కాలమ్ లో
మారేడుమిల్లి అడవుల్లోని ‘గుడిస’ ఎత్తైన కొండ గడ్డి మైదానం అంటారు.అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారేడుమిల్లి ఒక మండల కేంద్రం. ఇక్కడికి 50 కిలోమీటర్ల దూరంలో పుల్లంగి గ్రామ పరిధిలోనిది గుడిస.ఇక్కడికి ఉదయం 5 గంటలకు చేరితే అదొక ఆహ్లాదకరమైన వాతావరణంలో మనసు గాల్లో తేలిపోయి ఆనందం కల్గుతది.ఇక్కడ ఉదయం సూర్యోదయాన్ని చూడటం అనిర్వచనీయమైన ఆనందం.సూర్యోదయం కోసం ఎదురు చూస్తూ వందల మంది యాత్రికులు సెల్ ఫోన్ కెమెరాలతో నిలబడతారు.కవి దేవేందర్ పచ్చని అరణ్యంలో శీతల గాలులు..గడ్డి మైదానం నుంచి మన ముందు నుంచే తాకుతూ వెళుతున్న మేఘాలు.ఆ మబ్బుల నుంచి ఎర్రని సూర్యుణ్ణి చూడడం గొప్ప అనుభూతి అని అంటున్నారు.
వింటే విచ్ఛిన్నమయ్యేది కాదేమో!? కాలమ్ లో
కానీ వినేందుకు చెవుల కిటికీలు మూసుకుంటే ఏం తెలువది.అంతరంగ నిఘా యంత్రం కూడా తాను కోరుకుంటునట్లుగానే అల్లిన సమాచారం ఇస్తది. బయట అల్లకల్లోలం అయితది.ఈ లోపల వ్యవస్థ పురా కరాబు అయితది.చిన్న కురుపుగా పుట్టిన వ్యతిరేకత పెద్ద గడ్డ లెక్క తయారై ఓటరు మీట నొక్కితే చీము బయటకు వస్తది.ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా వినడం అనేది ప్రధానం.చెప్పింది విని ఆలోచించాలి.తర్జన భర్జన చేయాలి.కవి దేవేందర్ నాయకులకు ప్రజాప్రతినిధులకు ముందు చూపుతో పాటు చెవుల కిటికీలు తెరిచి ఉంచితే మంచిది అని అంటున్నారు.
మార్పులు మంచివా, చెడ్డవా? కాలమ్ లో
ఇటీవల కాలంలో నగరాల్లో కొత్త వ్యాపారాలు పుంజుకుంటున్నాయి.ఆహార సంస్కృతి ఆలోచనా సరళి త్వర త్వరగా మారుతున్నది.ఆహార పదార్థాలు ఇంట్లో వండుకొని తినాలనే పద్ధతికి భిన్నంగా బయట హోటల్ భోజనాలు,టిఫిన్లకు అలవాటైపోతున్నరు.టిఫిన్లు బిర్యాని తర్వాత సాయంత్రం అయ్యిందంటే చాట్ భండార్ వద్ద పానీ పూరి,చాట్ మసాల,పావుబాజీ,కచోరి,సమోసాలు విపరీతంగా లాగిస్తున్నారు.నగరాల్లో కేక్ ల సంస్కృతి పెరిగింది.బేకరీ షాపులు వాడవాడకు అయ్యాయి.కవి దేవేందర్ పది,ఇరవై ఏండ్లకు ఒక సారి తినే ఆహారపు అలవాట్లలో పెను మార్పులు వస్తున్నయని.ఇవి మంచివా చెడ్డవా?అని ఆలోచించడం కన్నా కొత్త దనాన్ని ఆహ్వానించాల్సిందే అని,అయితే మన మూల సంస్కృతిని దేశీయ ఆహారపు దృక్పధాన్ని వీడరాదు అని అంటున్నారు.
ఆర్ట్స్ కాలేజ్ ఆకాశం మీద..కవిత్వం వెన్నెల కురిసింది కాలమ్ లో
కవిత్వానికి ఇంత ఫాలోయింగ్ ఇది వరకు చూడ లేదు.ఉస్మానియా విశ్వవిద్యాలయ ఆర్ట్స్ కాలేజ్ ముందు బహిరంగ వేదిక మీద కవిత్వం గానం చేస్తుంటే వేలాదిమంది ఆ పంక్తులతో ఇన్ వాల్వ్ మెంట్ అయ్యారు.ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ నిర్వహించిన ఈ సదస్సులో దేశవ్యాప్తంగా ఉన్న 25 విశ్వవిద్యాలయాల తెలుగు ఆచార్యులతోపాటు తెలుగు రాష్ట్రాల్లో డిగ్రీ కళాశాల ఉపన్యాసకులు ఆసక్తి గల సాహిత్యకారులు పాల్గొన్నారు.ఆచార్య చింతకింది కాశీం కన్వీనర్.ఈ సదస్సులో అన్ని వాదాలతో పాటు ప్రకృతి వ్యవసాయం,పుర జ్ఞాపకాలు,సమకాలీన సమస్యలు,రాజ్యం, మతోన్మాదం,అణిచివేత,పోరాటాల కవిత్వం వినిపించారు.కవి దేవేందర్ ఇట్లాంటి సదస్సులు విశ్వవిద్యాలయాల్లో ఎప్పుడూ జరుగుతుంటాయి అని అంటున్నారు.
ఆడ ప్రయాణికుల్లో రాజసం కనిపించింది కాలమ్ లో
బస్సు ప్రయాణాల్లో మహిళా ప్రయాణికుల ముఖాలు రాజసంగా కన్పించినయి.మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాలు అనంతరం బస్సులో ప్రయాణిస్తే స్త్రీలు చిద్విలాసంగా కనిపిస్తున్నరు.ఈ బస్సు మాదే,మేము ఎక్కడికైనా వెళ్లి రావచ్చు ఒక్క పైసా కట్టకుండా అనే ఆనందం వారిలో కన్పించింది. కవి దేవేందర్ ఏదేమైనా బస్సుల్లో స్త్రీలు ఆనందంగా ప్రయాణిస్తున్నారు అని,ఇప్పుడు అవసరాల కోసం స్వేచ్ఛగా పావురాల్లా తిరుగుతున్నారు అని అంటున్నారు.
బొగ్గు రవ్వలు ఉద్యమాలకు దస్తావేజు కాలమ్ లో
ఇటీవల గురజాల రవీందర్ సింగరేణి ప్రాంతంలో పోరాటం నిర్వహించిన సికాసతో తన అనుబంధాన్ని తను ఎట్లా ఉద్యమంలోకి వెళ్ళింది అద్భుతంగా వెలువరించాడు.ఆ పుస్తకం పేరు బొగ్గు రవ్వలు. ఉద్యమాలను రికార్డు చేయడం అందులో పాల్గొన్న అందరికీ సాధ్యం కాకపోవచ్చు.కవి దేవేందర్ బొగ్గు రవ్వలు పుస్తకం సింగరేణి కార్మిక ఉద్యమాలకు ఒక దస్తావేజులాగా ఉన్నది అని అంటున్నారు.
అతి పెద్ద సాహిత్య ఉత్సవం కాలమ్ లో
ప్రపంచంలో అతి పెద్ద సాహిత్య ఉత్సవం 2024 మార్చి 11 నుంచి 16 మధ్య ఢిల్లీలో జరిగింది.ఈ ఉత్సవంలో పాల్గొంటే భారతదేశంలోని అన్ని భాషల అన్ని సంస్కృతుల సకల సాహిత్యాన్ని అర్థమైనా కాకున్నా వినవచ్చు.సాహిత్య అకాడమీ 70 సంవత్సరాల వార్షికోత్సవం సందర్భంగా ఈ బహుళ ఉత్సవం నిర్వహించింది.దీనిని ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్ 2024 అంటారు.సాహిత్యోత్సవం – 2024 నిజంగానే ప్రపంచ స్థాయిలో గొప్పదే.అన్ని భాషల పుస్తకాల ప్రదర్శన అమ్మకం ఏర్పాట్లు జరిగాయి.కవి దేవేందర్ ఢిల్లీలోని మండేహేజ్ వద్ద గల రవీంద్ర భవన్ లో సాహిత్య అకాడమీ ఉంది అని,దాని ఆవరణ అంతా జాతీయ స్థాయిలో కవిత్వ ఉత్సవమే జరిగింది అని అంటున్నారు.
చెప్పింది చేయడానికి మీరే కావాలా?కాలమ్ లో
చట్టాలు అమలు చేసే యంత్రాంగం తంత్రాలతోనే వ్యవస్థ అంతా సర్వనాశనం అయిపోతుంది. అధికారంలో ఉన్న రాజకీయ నాయకులు వాళ్లకు అనుకూలంగా పనులు చేయమంటే ఎట్లా చేస్తారు.ఏ ఆదేశం అమలు చేయాలన్నా దానికో నిబంధన, పద్ధతి,రాజ్యాంగం చట్టం ఉత్తర్వులు ఉండే ఉంటాయి.ఈ నిబంధనలు అనుసరిస్తూ ఫోన్ ట్యాపింగ్ చేయవచ్చు.ఫోన్ ట్యాపింగ్ చేయడం కుదరదు అని చెప్పవచ్చు.ముఖ్యంగా అఖిలభారత సర్వీస్ అధికారుల వద్దనే ఈ లొంగుబాటు ఉంటుంది.ఒకే చట్టం అమలు చేసే కాలం వేరు. అమలు చేసే యంత్రాంగంలో మార్పులు.ఒకసారి నిర్వీర్యం,మరోసారి చర్యలు.కాబట్టి అధికార మార్పిడి సమాజానికి ఎంతో మంచిది అనిపిస్తుంది అని కవి దేవేందర్ అంటున్నారు.
ఇప్పటికైనా కోపం గురించి ఆలోచించాలి కాలమ్ లో
కోపం ఉండాల్సిన తరానికి కోపం ఉండటం లేదు. అవసరం లేని వారికి అనవసర కోపాలు ఎక్కువ వస్తున్నవి.ఈ సంవత్సరం పేరే క్రోధి నామ సంవత్సరం.క్రోధి అంటే కోపం అని అర్థం.అంతా కోపంతోనే నడుస్తుందని పంచాంగంలో చెప్పుతారు. పంచాంగం చెప్పినట్టు ప్రపంచం నడవదు.ఎవరి రాజ్యాంగం వారికే ఉంటది.ఆదాయం వ్యయం కూడా అందులో చెప్పినట్లు కాకుండా పేద వాళ్లకు పేదరికంగాను,ఉన్న వాళ్లకు ఉన్న రకంగానూ మారుతుంటుంది.నిజానికి కోపం రక్తపోటు ఉన్న వాళ్లకు ఎక్కువగా ఉంటుంది.వాళ్లు కాస్త ఉప్పు తక్కువ వాడాలి. పొద్దున్నే లేచి ధ్యానం చేయాలి. ఎవరికైనా ఉండాల్సింది కోపం,ధిక్కారం,మర్లపడే తత్వం ఉండాల్సిందే గానీ అవసరమైనంత వరకు మాత్రమే ఉండాల్సి ఉంది అని కవి దేవేందర్ అంటున్నారు.
జ్ఞాపక శక్తికి ముప్పు తెస్తున్న స్థితి కాలమ్ లో
రీరంలో ఏ భాగమైనా నిరంతరం చలనం చైతన్యం ఉంటే సులువుగా దాని పని అది చేసుకుపోతది.ఏ పని లేకుండా ఉంటే అవయవాలు కూడా అంతే.ప్రతి రోజు నడక కోసమే నడవడం.కాళ్ళకు ఆ మాత్రం పని లేకపోతే ఇంట్లో నుంచి కొంచెం దూరం కూడా వెళ్లడం కష్టమే.రాను రాను పనులు సులువు అయినా శరీరం మనస్సుకు కష్టం లేకుంటా అయ్యింది.కవి దేవేందర్ పని లేకుండా ఉంటే జ్ఞాపక శక్తి కూడా తగ్గిపోతుంది అని అంటున్నారు.
నచ్చిన అభ్యర్థిని ఎన్నుకోండి ! కాలమ్ లో
ఓట్ల పటాటోపం ప్రచారం ముగిసింది.ఎన్నిక వస్తున్నది.అరిచిన మైకులు మూగబోయినయి. బొంగురు పోయిన నాయకుల గొంతుకలకు విశ్రాంతి దొరికింది.అన్ని పార్టీల అభ్యర్థులు నాయకులు కాలికి విరామం లేకుండా తిరిగి తిరిగి జనం చెవుల్లో జివిలి వదల కొట్టిండ్రు.ప్రతి పని డబ్బులతో ముడిపడి ఉండే సంస్కృతి వచ్చేసింది.ఆఖరుకు ఓటర్లను కూడా అవినీతిపరులుగా అన్ని రాజకీయ పక్షాలు చేస్తున్నవి.ఓటుకు పైసలు ఇస్తేనే వేస్తం అన్న రీతిలో ఆలోచన వస్తుంది.వాళ్లు తింట లేరా మనం ఎందుకు ఉత్తగా వేయాలె అనే రీతిలో డిమాండ్లు రావడం ప్రజాస్వామ్యానికి విఘాతమే.కవి దేవేందర్ ఏది ఏమైనా ఎన్నికల్లో అందరు పాల్గొని నచ్చిన మెచ్చిన అభ్యర్థిని ఎన్నుకోవాల్సిన అవసరం ఉన్నది అని అంటున్నారు.
వెలుగులోకి వస్తున్న పాత చరిత్ర కాలమ్ లో
మేర మల్లేశం (1924 – 1997) తెలంగాణ సాయుధ పోరాట యోధుడు.ఎన్నో పాటలు కట్టి పాడిన కవి, వాగ్గేయకారుడు.జీవితాంతం కష్టజీవుల పక్షాన నిలబడ్డ కమ్యూనిస్టు.ఆయన సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని అంతక పేట గ్రామానికి చెందిన వారు.1997 ‘మేర మల్లేశం పోరాట పాటలు’ పుస్తకం వచ్చింది.తిరిగి 27 సంవత్సరాల తర్వాత ఆ పాటలకు విపుల వ్యాఖ్యానాలతో పాటు తాను రాసుకున్న విశిష్టమైన పోరాట స్వీయ చరిత్ర కలిపి ఇప్పుడు పుస్తకం గా వెలువడింది.ఇందులో డాక్టర్ ముత్యం ‘మేర మల్లేశం జీవితం’ఒక చాప్టర్ గా వచ్చింది.ఈ పుస్తకం వెలువరించడానికి సూర్యాపేటకు చెందిన కొత్తకొండ కరుణాకర్ పూనుకున్నారు.కవి దేవేందర్ ఈ పుస్తకాన్ని తెలంగాణ రాజకీయ సమాజం అధ్యయనం చేయాల్సి ఉంది అని అంటున్నారు.
సెల్ ఫోన్ బడి పిల్లలను నాశనం చేస్తుంది కాలమ్ లో
పెద్దవాళ్లకు సెల్ ఫోన్ సరే.ఇప్పుడు బడి పిల్లలను సెల్ ఫోన్ వెంటాడుతుంది.పిల్లలు ఫోన్ చూడటం అలవాటై వదిలి ఉండటం లేదు.ఎండాకాలం సెలవుల్లో పిల్లలు సెల్ ఫోన్ తీసుకొని అందులో గేమ్స్ ఆడుతున్నారు.ఏడ చూసిన ఎవరి ఇల్లు చూసినా పిల్లలు సెల్ ఫోన్ లో తలపెట్టి పైకి తీస్త లేరు.ఇదంతా కరోనా కాలం తర్వాత ఆన్లైన్ క్లాస్ ల ద్వారా పిల్లలకు అబ్బిన జబ్బు.సెల్ ఫోన్ ఒక మత్తు లాగా అలవాటై విద్యార్థులు హోంవర్క్ ఇంట్లో ఏదైనా పని నేర్చుకోవడం కానీ చేయడం లేదు. ఎవరితోనూ మాట్లాడకుండా సెల్ ఫోన్ లోకంలోనే మునిగి పోతున్నారు.కవి దేవేందర్ పిల్లలను సెల్ ఫోన్ నుంచి రక్షించాల్సి ఉంది అని,ఈ విషయం ప్రభుత్వం కూడా పట్టించుకోవాల్సిన అవసరం ఉంది అని అంటున్నారు.
ఏ ఒక్కరు తెస్తే వచ్చింది కాదు తెలంగాణ కాలమ్ లో
ఎంత మంది ప్రాణాలు ధార పోస్తే తెలంగాణ సాకారం అయింది?ఎంత మంది మృత్యువును ముద్దాడితే తెలంగాణ ఆవిర్భవించింది?ఎన్నో వేల మంది గొంతెత్తి నిలదీస్తేనే కదా తెలంగాణ కల నెరవేరింది.ఎంత మంది తల్లుల నుదుటి కుంకుమ నేలరాలితే ఈ తెలంగాణ వచ్చిందనేది మననం చేసుకోవాల్సిన సందర్భం.అంతే గాని ఏ ఒక్కరి కృషి వల్ల మాత్రమే ఈ తెలంగాణ రాలేదు.కవి దేవేందర్ ఆ ఒక్కరి నాయకత్వం గొప్పదే కావచ్చు.కానీ చరిత్ర నిర్మాణంలో ప్రజల భాగస్వామ్యం ఉంటుంది అని భావిస్తున్నారు.
అసంకల్పిత ప్రతీకార జ్వాలలు కాలమ్ లో
ఎదుటి వ్యక్తి తన జాతిని అవమానపరిస్తే తన వాళ్లు పాల్గొన్న ఉద్యమాన్ని అవమానపరిస్తే తాత్కాలికంగా ఊరుకుంటారేమో గాని అదును కోసం చూసి ఏకాంతంగా కనిపిస్తే ఎంతటికైనా తెగిస్తారు.ఇటీవల చండీగర్ విమానాశ్రయంలో కంగనా రనౌత్ చెంప చెల్లుమనిపించిన సీ.ఐ.ఎస్.ఎఫ్.ఉద్యోగి కుల్విందర్ ప్రతీకార జ్వాలలను గమనించాం.కవి దేవేందర్ ఇప్పుడు కుల్విందర్ కౌర్ పై కేసు పెట్టవచ్చు,సస్పెండ్ చేయవచ్చు.ఎన్నైనా జరగనీ .. కానీ తన కోపం తాను చల్లార్చుకుంది అని అంటున్నారు.
ఇరాం లేని కలం కాలమ్ లో
ఆచార్య ఎన్.గోపిది తెలుగు నేల మీద వైవిధ్య జీవన వాస్తవిక కవిత్వ సంతకం.2024 జూన్ 25 కు ఆయనకు 75 ఏళ్లు.1950 జూన్ 25న భువనగిరిలో పుట్టిన ఆయన కొండంత వ్యక్తిత్వంతో ఎదిగారు. ఆయన రాసిన తొలి కవిత్వ సంపుటం తంగేడు పూలు నుంచి రేపు విడుదల అయ్యే రేపటి మైదానం దాకా 29 కవితా సంపుటాలు వెలువరించారు. తెలుగులో నానీల ప్రక్రియకు ఆచార్య ఎన్ గోపి సృష్టికర్త.కవి దేవేందర్ కాల గమనంలో ఆయన కవిత్వ ప్రయాణాన్ని కొలవడం,అధ్యయనం చేయడం,ఈ తరం కవుల కర్తవ్యం అని అంటున్నారు..
సాంస్కృతిక వారసత్వ సంపద కాలమ్ లో
తమ తండ్రుల కళలు,సాహిత్య అభిరుచులను తాము వారి స్మారకార్థం పుత్రులుగా ఇలా కొనసాగించడం ఒక విశేషంగా గౌరవంగా భావిస్తున్నామని కె ఎస్ అనంతాచార్య,జీవి శ్యాం ప్రసాద్ లాల్,మాడిశెట్టి గోపాల్,రావికంటి శ్రీనివాస్,డాక్టర్ రఘురామన్ లు సభలో ప్రకటించారు.గత నాలుగేళ్లుగా ఈ కార్యక్రమం సమైక్య సాహితి అనే వేదిక ద్వారా కొనసాగుతుంది. సంగీత నాట్య ఉపాధ్యాయ సాహిత్య పరిశోధన రంగాల్లో స్థాయిని గుర్తించి గౌరవిస్తున్నారు.కవి దేవేందర్ ఇది ఒక విశిష్ట కార్యక్రమంగా ఒక సాంస్కృతిక వారసత్వ పరంపరగా లోకమంతా తెలియాల్సి ఉంది అని అంటున్నారు.
ఏ ప్రయోజనాలకీ ప్రచార ప్రస్థానం కాలమ్ లో
వార్తా ప్రచార దృశ్య మాధ్యమాలు యూట్యూబ్ ఛానల్లు ఇటీవల కాలంలో విస్తృతంగా నడుస్తున్నాయి.ఇటీవల ఒక వివాహ సంబంధంలో ఉన్న స్త్రీ ఎవరితో పిల్లలు కన్నది.ఆ సందర్భ సమయాల్లో ‘భర్త’ఎక్కడున్నాడు అనే విషయాలతో విస్తృతంగాను,ప్రత్యక్షంగాను మాధ్యమాల్లో ప్రసారం కావడం పాడు కాలం దాపురించింది అనుకోవచ్చు.యూట్యూబ్ ఛానల్ల లో విపరీతమైన అర్ధనగ్న శృంగార సంభాషణ దృశ్యాలు విస్తృతంగా తిరుగుతున్నాయి.ఇప్పుడు ఎవరి అరచేతిలో చూసినా స్మార్ట్ ఫోన్ ఉంటుంది.అందులో సులువుగా ఇలాంటి దృశ్యాలు అన్ని వయసుల వాళ్ళు చూస్తున్నారు.వీటి ప్రభావం మనుషుల మీద పడకుండా ఉంటుందా..ఉండదు.కవి దేవేందర్ సామాజిక బాధ్యతగల వాళ్లంతా ఆలోచించాల్సిన అవసరం ఉంది అని అంటున్నారు.
ఐఏఎస్ లకు క్షేత్రస్థాయి కష్టాలు ఉంటాయా? కాలమ్ లో
ఐఏఎస్ ఎంపికలో ఫిజికల్లీ ఛాలెంజెడ్ పర్సన్స్ రిజర్వేషన్స్ ఎందుకు?అనే ప్రశ్న ఒక ఐఏఎస్ నుంచి ఉత్పన్నమైంది.పుట్టుకతో ఏదో ఒక లోపం మనుషులందరిలో ఉంటుంది.ఈ సందర్భంలో ఆ ఐఏఎస్ కు తన అభిప్రాయం చెప్పే హక్కు ఉంది. కానీ కించపరిచే హక్కు లేదు.ఇందులో ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఐఏఎస్ లు కష్టమైన క్షేత్రస్థాయి పర్యటన చేస్తారు.కాబట్టి దివ్యాంగులు అది చేయ లేరనే భావనలో ఆమె ఈ వ్యాఖ్యానం చేయడం అయితే ఐఏఎస్ లకు క్షేత్రస్థాయిలో కష్టాలు ఉంటాయా?అన్నది ప్రశ్న. ఐఏఎస్ లు కూర్చుని చేసే పనికి దివ్యాంగులు ఎందుకు పనికి రారు?.కవి దేవేందర్ మనదేశంలో నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ ఉన్నట్టే,ప్రభుత్వ యంత్రాంగంలో హైరార్కి వ్యవస్థ ఉంది అని అంటున్నారు.
కరీంనగర్ సాహిత్య పరంపర … కాలమ్ లో
ఇటీవల కరీంనగర్ జిల్లాకు చెందిన ఎంపిక చేసిన ప్రాచీన ఆధునిక కవుల కవిత్వ సంకలనాన్ని ‘కరీంనగర్ కవులు నాడు నేడు’ పేర ఆచార్య అనుమాండ్ల భూమయ్య సంపాదకత్వంలో వెలువరించారు.ఇది చాలా విశిష్టమైన కవిత్వ సంకలనం.ఇందులో పదవ శతాబ్దానికి చెందిన జినవల్లభుని నుంచి నిన్న మొన్న విద్యార్థిగా కవిత్వం రాస్తున్న ఈడెపు సౌమ్య దాకా 102 కవితలు ఉన్నాయి.నేలను మరవని భూమయ్య వెలువరించిన కవితా సంకలనం అన్ని రంగాల వారు ఇలా ఏదైనా ఒకటి చేసేందుకు స్ఫూర్తిగా నిలిచింది. .
చరిత్ర జ్ఞాపకాలు తెలుసుకోవాలి…కాలమ్ లో
మేర మల్లేశం తెలంగాణ సాయుధ పోరాట యోధుడు. జీవితాంతం కష్టజీవుల పక్షాన నిలబడ్డ విప్లవ కమ్యూనిస్టు.ఈ 2024వ సంవత్సరం ఆ స్వాతంత్ర సమరయోధుని శత జయంతి జరుపుకోవాల్సిన ఉత్సవ సందర్భం.1997 తర్వాత వచ్చిన పాటల పుస్తకానికి విపుల వ్యాఖ్యానాలతో మల్లేశం జీవిత కథనాత్మక చరిత్ర పుస్తకం వెలువడ్డది.బహుజన రాజకీయవాదులకు,ఇతర రాజకీయ పక్షాలకు చెందిన వారు స్వాతంత్ర్య ఉద్యమ కారుల చరిత్రను అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది అని కవి దేవేందర్ అంటున్నారు.
జీవ కళ కోల్పోతున్న జిందగీ కాలమ్ లో
ప్రకృతిలో ప్రకృతిగా జీవిస్తేనే మనసంతా ఆనందం తాండవిస్తది.ఇప్పుడు అంతా సహజానికి విరుద్ధంగా వికృతంగా జీవితాలు కొనసాగుతున్నాయి.ఏకీకృత వ్యాపార వ్యవస్థ విస్తృతమై గ్లోబలైజేషన్ గా వ్యాపించిన తర్వాత మనిషి ముఖం మీద నవ్వే కళ లేదు.చిరునవ్వుల పలకరింపులు మాయ మయ్యాయి.అంతా తరుముతున్న జీవితం.పని ఒత్తిడి,మీది వాడు కింది వాన్ని,వాని కింది వాడు మరి కింది వాన్ని,పని పని అర్జెంట్ అర్జెంట్ అని ప్రెషర్ నింపడం,ప్రభుత్వం ప్రైవేట్ అన్నిట్లో ఈ ఒత్తిడి,అణిచివేత ఉంటూనే ఉంటుంది.కవి దేవేందర్ ఒక ధ్యాన ప్రశాంతత,ఒక ఆత్మిక ఆనందం,మరొక మానవత్వ పరిమళం కనపడాల్సిన రోజులు రావాలి అని అంటున్నారు.
సముద్రం ముందు … కాలమ్ లో
సముద్రాన్ని ఎన్నిసార్లు చూసినా దాని ముందు పసిపిల్లలమై గాలిలో తేలిపోవుడే.విశాఖ బంగాళాఖాత ఆకాశం మీద తిరుగుతున్న మేఘాలను సులువుగా చేతితో నిమరవచ్చు. అప్పుడు మనసు దేహం దూదిపింజం లెక్క అల్కగా పరిగెత్తుకొస్తున్న అలల తడి స్పర్శ కాళ్లకు తగిలి దేహంలోకి సన్నని విద్యుత్ వ్యాపనం.నిలుచున్న అంచున అరి పాదాల కింద పరుచుకుంటున్న నీళ్లను కదిలి కరిగిపోతున్న ఇసుక ఒక గమ్మత్తు అనుభూతి.అలల వలలో చిక్కి తడిసిపోయి ఎగిరితేనే ఆనందం అంచుల దాకా చేరవచ్చు.అలల సవ్వడిలో కలిసి ఎగిసి కేరింతలు కొట్టినా కుతి తీరదు.సముద్రంలో సముద్రమై గంతులు వేసినా మతి నిండదు.రాత్రి పగలు వెలుగు నీడా అసలే లేదు.కడలి కడుపులో ఎల్లవేళలా కల్లోలమే.కవి దేవేందర్ అలల సవ్వడికి ఎదురెళ్లి సముద్ర స్నానం చేయడం ఒకానొక మహత్కార్యం అని అంటున్నారు.
ప్రకృతి ఎలుగెత్తిన కోపం కాలమ్ లో
ఈ నేల మీద ఎండలు,వానలు,చలి గాలులు,నీటి ప్రవాహాలు సహజాతి సహజం.ఇది స్వయంగా తనకు తాను ఏర్పరచుకున్న ప్రకృతి.దుర్మార్గంగా మనిషి మాత్రమే భూమిని,నదులను,చెరువులను, కుంటలను,మేఘాలను,ఆకాశాన్ని,గాలిని,నీటిని విధ్వంసం చేస్తాడు.సాటి మనుషులను చంపుతాడు. మోసం చేస్తాడు.అత్యాచారం చేస్తాడు.అన్ని దుర్మార్గాలకు మూలం మనిషి మాత్రమే.ప్రకృతిని చెరపట్టి సహజాతి సహజమైన ప్రవాహాలను మళ్లించి వికృతంగా చేస్తున్నాడు.కవి దేవేందర్ ప్రకృతిని,పర్యావరణాన్ని కాపాడాలంటే గుట్టలు,చెట్లు,అడవులు,నదులు,చెరువులు, కుంటలు వీటిని సహజ రీతిలోనే రక్షించాలని, లేకపోతే ప్రకృతి ప్రకోపించి విధ్వంసాన్ని సృష్టిస్తుంది అని అంటున్నారు.
కవి దేవేందర్ అంతరంగం వర్తమాన జీవన చిత్రణ కాలమ్స్ వ్యాసాలలో సమాజంలో జరుగుతున్న అన్ని విషయాలను తన అనుభవాన్ని క్రోడీకరించి అక్షర రూపం ఇచ్చారు.ఈ వ్యాసాలు వాస్తవికతతో కూడి ఉన్నాయి.ఏదో కాలక్షేపానికి చదువుతాను అంటే కుదరదు.శ్రద్ధతో ఆసక్తితో చదివితే అందులోని విషయాలు అవగాహనకు వస్తాయి.కవి దేవేందర్ కు అధ్యయనం చేసే అలవాటు మరియు సమాజం పట్ల సునిశిత పరిశీలనా శక్తి ఉంది కనుకనే కాలమ్స్ వ్యాసాలు చక్కగా రూపుదిద్దుకున్నాయి. అంతరంగం వర్తమాన జీవన చిత్రణ కాలమ్స్ వ్యాసాలను పిన్నలు,పెద్దలు అందరు చదివి ఎన్నో లోతైన విషయాలు నేర్చుకోవచ్చు.నడుస్తున్న చరిత్రకు అక్షర రూపం ఇచ్చిన కవి దేవేందర్ ను అభినందిస్తున్నాను.కవి దేవేందర్ సమాజాభివృద్ధికి దోహదం చేసే మరిన్ని రచనలు చేయాలని మనసారా కోరుకుంటున్నాను.
.
.
.