తెలుగు సాహిత్యంలో అమ్మ అంశంతో కథలు కవితలు నవలలు నాటకాలు చాలా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి అమ్మ త్యాగాన్ని అమ్మ గొప్పతనాన్ని అమ్మంటే దేవత అని రకరకాలుగా అమ్మను గురించిన రచనలను మనం గమనించాం ఆ తర్వాత స్నేహం దానికి సంబంధించినటువంటి కథలు , కవితలు , నవలలు వంటి రచనల్ని మనం చూసాం కానీ ప్రస్తుతం సమాజాన్ని పట్టిపీడిస్తున్న అంశం వృద్ధాప్యం. వృద్ధాప్యానికి సంబంధించినటువంటి రచనలు చాలా తక్కువగా వచ్చాయి వచ్చినా వాటిని ఎవరు ఇష్టపడరు పైగా అంత ప్రాధాన్యత కూడా ఇవ్వరు. వృద్ధులైన తల్లిదండ్రులు పడుతున్న మానసిక స్థితిని వ్యక్తీకరిస్తూ కవితలు కథలు వచ్చిన నాటకాలు మాత్రం చాలా తక్కువగా మనకు కనిపిస్తాయి

శ్రీ విశ్వనాథ గణపతి రావు రచించిన జీవనవేదం వృద్ధుల పట్ల నిరాదరణ కథా వస్తువుగా రచించిన నాటిక. శ్రీ అరిసెట్టి శివన్నారాయణ గారి పుణ్యఫలం నాటకం కూడా తల్లిదండ్రుల పట్ల బిడ్డలు చూపించే నిర్లక్ష్యం , ఎంతో ప్రేమగా పెంచుకున్న కొడుకు పెళ్లి అయ్యాక భార్యని వారి తల్లిదండ్రులను పట్టించుకుని కన్నతల్లి తండ్రులను పక్కన పెట్టడం ..వారి కడుపుకోతని కళ్ళకు కట్టినట్లుగా వివరించిన నాటిక. స్నిగ్ధ (గోపి సత్య ప్రకాష్) గారి నాటిక సద్గతి కూడా తల్లిని పట్టించుకోని కొడుకు కథ. శ్రీ వల్లూరు శివప్రసాద్ గారు రచించిన వానప్రస్థం నాటకంలో వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు సుఖం లేకపోవడం గురించిన నాటిక.
ఆధునికంగా అనేకమైన నాటికలు ఇదే వస్తువుపై వచ్చినా వేటికవే తమ తమ ప్రత్యేకతను చాటుకుంటున్నాయి నాటక ప్రదర్శనలలో కొత్త ఒరవడి సృష్టించిన విధానం కథానాటికల పోటీ. అజో- విభో -కందాళం ఫౌండేషన్ ( అప్పా జోస్యుల విష్ణుభొట్ల) వారు కథ ఆధారంగా రాసిన నాటికలను మాత్రమే ప్రదర్శింపజేసే ఏకైక పరిషత్ ! ఈ ఫౌండేషన్ నాటిక ప్రదర్శనలతో పాటు సాహితీ రంగాన్ని కూడా సమానంగా ఆదరిస్తుంది. వివిధ సాహిత్య విభాగాల్లో విశేషంగా కృషిచేసిన వారిని ఘనంగా సత్కరిస్తుంది. వారి సాహిత్యానికి సంబంధించిన వ్యాసాలతో అపురూపమైన జ్ఞాపికలను అందిస్తుంది . ఈ ఎంపికలో భాగంగా నిష్ణాతులతో ముందుగా ఎంపిక చేయిస్తుంది.
వర్తమాన సమాజంలో వివిధ అంశాలపై రైతుల దోపిడి, స్త్రీ స్వేచ్ఛ ,కుటుంబ సంబంధాలు ,మానసిక సమస్యలు మొదలైన అంశాలపై నాటికలు రచించిన కథా రచయితల నాటికలను ప్రదర్శించేందుకు అవకాశం కల్పిస్తుంది ఈ నేపథ్యంలో రూపుదిద్దుకున్న నాటిక దేవరాగం. మూలకథ రచయిత సయ్యద్ సలీం గారు.
సయ్యద్ సలీం గారు కథలు కవితలు నవలల రచయితగా సాహితీ రంగంలో తనదైన స్థానం ఏర్పరుచుకున్న ప్రముఖ రచయిత మనిషి కథతో సాహితీ ప్రపంచంలో అడుగుపెట్టి 300 కి పైగా కథలు 150 కవితలు 30 కి పైగా నవలలు రచించారు. వీరి కథలు కన్నడ హిందీ ఒరియా మరాఠీ భాషలలోకి అనువదించబడ్డాయి. సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత .మానవత్వం ప్రధాన అంశంగా వీరి రచనలు అందరి చేత చదివింప చేస్తాయి.
మూల కథ శీర్షిక అమ్మ . నాటకీకరణ చేసిన కె కె ఎస్ స్వామి గారు దీనికి దేవరాగం అని పేరు పెట్టారు. అజో విభో కందాళం , జాషువా సాంస్కృతిక వేదిక సంయుక్తంగా నిర్వహించిన కథ నాటికల పోటీలలో జనవరి 4 2025 ప్రదర్శింపబడిన ఈనాటిక ద్వితీయ ఉత్తమ ప్రదర్శన బహుమతిని గెలుచుకుంది బాధపడుతున్న తల్లిని కాపాడుకోవడం కోసం కూతురు ఎదుర్కొన్న ఇబ్బందులను సలీం గారు వివరిస్తూ ఈనాటికను రచించారు అనకాపల్లిలో కొణతాల వెంకట నారాయణమ్మ కళా ప్రాంగణంలో శ్రీ సౌజన్య కళాశాల వంటి ఉత్తరాంధ్ర వారి ప్రదర్శన దేవరాగం. పేక్షకుల విశేష ఆదరణ పొందిన నాటకం ఈ నాటకం.
జన్మనిచ్చిన తల్లిదండ్రులు పిల్లలకు ఉండే బంధం ఎంత బలమైనదో స్పష్టంగా చూపిన నాటిక . బంధాలు విడవకుండా తల్లిదండ్రులను చూసుకోవడం , వృద్ధాప్యంలో వారికి అండగా నిలబడడం వారికే ఎంతో మానసిక స్థైర్యాన్ని కలిగిస్తుందని చెప్పడం ఈ నాటిక కథాంశం.

ఈ నాటకంలో తండ్రి కొడుకు అల్లుడు స్నేహితుడు డాక్టర్ కూతురు పాత్రలు ఉంటాయి తండ్రి పాత్రను దమ్ములూరి సత్యనారాయణ గారు పోషించారు .విదేశాలలో ఉన్న కొడుకు తనకోసం వస్తాడని ఎంతో ఆశగా ఎదురు చూస్తాడు తండ్రి .కొడుకు పాత్రలో మెట్ట వెంకటరాజు గారు విదేశంలో ఉన్నా రంగస్థలం మీద పక్కన ఉండి మాట్లాడుతూ అక్కడ నుంచి వీడియో కాల్ లో మాట్లాడిన భావనను కలిగిస్తూ మాట్లాడుతాడు . ఇది నాటకం ప్రదర్శన లో గొప్పతనం!
మొదటి దృశ్యంలో తండ్రిని పుట్టినరోజు సందర్భంగా పలకరించిన కొడుకు వీరి మాటల ద్వారా తండ్రికి కొడుకును చూడాలన్న తపన.. కొడుకుకేమో ఉద్యోగ పరంగా రాలేని పరిస్థితి కనిపిస్తాయి. ఇంతలో కూతురుగా నటిస్తున్న సాలూరు జ్యోతి అల్లుడుగా నటించిన మెట్ట పోలి నాయుడు ప్రవేశిస్తారు ఇదే దృశ్యంలో తండ్రి స్నేహితుడైన బిడ్డ శివ పాత్రధారి కూడా తన స్నేహితుని పుట్టినరోజున శుభాకాంక్షలు తెలిపేందుకు వస్తారు మొదటి సన్నివేశంలోని కొడుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన తనను చూసేందుకు వచ్చే సంవత్సరం వరకు రాడన్న దిగులు కూతురు అల్లుడు పుట్టినరోజు శుభాకాంక్షలు స్వయంగా వచ్చి తెలిపిన వారు కూడా ఉద్యోగరీత్యా డిప్యూటేషన్ మీద విదేశానికి వెళ్ళబోతున్నారన్న వార్తను విని స్నేహితుడు ఎంత సంతోష పెట్టాలని చూసిన తండ్రి డీలా పడిపోతాడు. అది చూసి కూతురు తను చేస్తున్న ఈ తప్పును క్షమించమంటుంది .
అప్పుడు తండ్రి అంటాడు “ఇక్కడ తప్పంతా మనుషుల మధ్య పెనవేసుకుపోయిన మమతాను రాగాల రక్త సంబంధాలదే! మనిషిని కట్టిపడేసే అన్ని బంధాల్లోనూ కణ సంబంధం చాలా బలమైంది. ఆ బంధం బ్రతికి ఉండగానే మానసికంగా దూరమైతే కలిగే బాధ మరణం కన్నా విషాదమైనది ఎందుకంటే దాన్ని జ్ఞాపకంగా మిగుల్చుకోలేము అనుభూతిగా అనుభవించలేము ” అంటాడు వృద్ధాప్యంలో ఉన్న కన్నతండ్రి వేదన ఈ మాటలలో చాలా స్పష్టంగా మనకు తెలుస్తుంది.

రెండవ దృశ్యంలో తండ్రి దగ్గరికి కూతురు అల్లుడు అమెరికా వెళ్ళిపోయే ముందు కొంతకాలం తండ్రి దగ్గర ఉండేందుకు వస్తుంది కూతురు భర్తతో సహా అవి చూసి తండ్రి శివ స్నేహితుడు మురిసిపోతాడు . అది అదృష్టం అని స్నేహితునితో అంటూ “అదృష్టం అంటే ఆస్తిపాస్తులు అంతస్తులు అధికారం హోదా లెక్కపెట్టలేనంత డబ్బు వెలకట్టలేనంత సిరిసంపదలు కావు !మనల్ని అర్థం చేసుకొని అభిమానించి అనుక్షణం మన కోసం ఆలోచించే ఆత్మీయులు మనకి దక్కడం నిజమైన అదృష్టం !” అంటాడు.
మూడవ దృశ్యంలో తండ్రి కూతురు అల్లుడు వెళ్లిపోతారన్న షాక్ లో తనకి పీడకలలు వచ్చినట్లు భయపడుతూ వణికిపోతుంటాడు ఏదేదో ఆలోచనలలో మునిగిపోతుంటాడు . అతనిలోని మానసిక అనారోగ్యం మొదలైంది . అది ఇంకా కూతురు అల్లుడు గమనించలేదు.
నాలుగవ దృశ్యంలో పాస్పోర్ట్ ఉన్న బ్యాగు మాయమవడం పై కూతురు తండ్రిని అనుమానిస్తుంది అనుకోకుండా ఆ బ్యాగు స్నేహితుడు తన కొడుకుకు ఎల్ఐసి ఆఫీసులో దొరికిందని తీసుకొస్తాడు. మానసికంగా షాక్ కి గురైన తండ్రికి తను ఆ బ్యాగు తీసుకెళ్లిన జ్ఞాపకం కూడా లేదు.. కావాలని మేము వెళ్ళిపోతున్నామని పాస్పోర్ట్ లు ఉన్న బ్యాగును మాయం చేసావని నింద వేస్తారు కూతురు అల్లుడు!
ఐదవ దృశ్యంలో మరింత షాక్ లో ఉన్న తండ్రి అల్లుడుని చూసి ఇంట్లో దొంగ వచ్చాడని భ్రమపడి పిచ్చిగా ఇల్లంతా తిరిగి అల్లుడిని దొంగ దొంగ అని అరిచి గొంతు నొక్క పోతాడు ! అర్థం చేసుకోని కూతురు తండ్రిని దూషిస్తుంది . స్నేహితుడు కూతురు అల్లుడు ఇద్దరినీ కూర్చోబెట్టి అతని ఆరోగ్య స్థితిని వివరిస్తాడు. స్పృహ కోల్పోయిన తండ్రిని ఆసుపత్రికి తీసుకెళ్లగా అతనికి అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్నాడని చెబుతాడు డాక్టర్ . తండ్రి ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ అయిదు సంవత్సరాలకు మించి బ్రతకరని మతిమరుపుతోపాటు లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్లు ఊహించుకుంటారని చిన్నపిల్లాడిలా ప్రవర్తిస్తారని చెబుతారు డాక్టర్.

ఆరవ దృశ్యంలో కూతురు అన్నతో మాట్లాడి తండ్రి పరిస్థితిని వివరిస్తుంది. తానిప్పుడు రాలేనని అవసరమైతే మరి కాస్త డబ్బు పంపిస్తానని అంటాడు అన్న. ఏడవదృశ్యంలో అన్న రాకపోవడం తండ్రి అనారోగ్యంతో ఆలోచనలో పడుతుంది కూతురు .
తనతో వస్తున్నావా లేదా అని ప్రశ్నించిన భర్తతో నేను ఇప్పుడు కూతురు, భార్య ,కోడలు ,పిల్లల తల్లి గాను, కాదు స్వార్థానికి అతీతంగా స్పందించే సహృదయం ఉన్న మనిషిగా నాకు జన్మనిచ్చిన నాకు జీవితాన్ని ప్రసాదించిన నాన్న అనే సాటి మనిషి కోసం ఆలోచిస్తున్నాను అంటుంది.
తండ్రి స్నేహితుడు కూతురిని అల్లుడిని ఆపమని చెప్పినప్పుడు కూతురు “నీటిలోపల చేపలు, గాలిలో పక్షులు ఎదురీది బ్రతుకుతున్నప్పుడు మనిషిని నేను పరిస్థితులకు ఎదురీది బ్రతకలేనా ? ” అంటుంది కూతురులో మార్పు స్పష్టంగా తెలుస్తుంది. ఆమెలోని మార్పును చూసి తండ్రి స్నేహితుడు “చిన్నతనం ఏ గుడికి దైవదర్శనానికి వెళ్లిన మీ నాన్న నిన్ను భుజాల మీద కూర్చోబెట్టుకొని దైవ స్వరూపాలని చూపించేవాడు కానీ ఈరోజు నువ్వు నీ జీవితాన్ని గర్భగుడిగా మార్చి అందులో నీకు జన్మనిచ్చిన కన్న తండ్రిని మూలవిరాట్టుగా ప్రతిష్టించి సేవిస్తున్నావు. నువ్వు మీ నాన్న కూతురువి కాదు దేవరాగానివి తల్లి! ఆ దేవరాగం పాదాలు కళ్ళకు వత్తుకొని నా జన్మ తరించి నీ తల్లీ ” అంటాడు.
తండ్రిని కాపాడుకోవడం తన జీవన లక్ష్యాన్ని పక్కనపెట్టి తండ్రిని చూసుకునేందుకు సిద్ధపడ్డ ఉదాత్తమైన కూతురు కథ దేవరాగం . ఈ నాటకాన్ని నాటకీకరణ చేసిన కేకేఎల్ స్వామి గారు డాక్టర్ పాత్ర పోషించిన శ్రీ గంగాధరయ్య గారికి ఈ నాటకం అంకితం చేశారు వృద్ధాప్యంలో తండ్రి పట్ల కొడుకు కూతురు తీసుకోవలసిన శ్రద్ధను చూపించవలసిన బాధ్యతను వేలెత్తి చూపిన నాటిక దేవరాగం.

ఈనాటికకు సంగీతం పి లీలా మోహన్ అందించగా కళాకారులకు ఆహార్యంతో అందంగా తీర్చిదిద్దింది ఎస్ రమణ గారు . నాటక ప్రదేశానికి రంగాలంకరణ చేసిన వారు సింగూరు రమణ గారు . అద్భుతమైన లైటింగ్ ను అందించిన వారు నిరంజన్ . నాటకం ఆధ్యాంతం దర్శకత్వం వహించిన వారు శ్రీ కేకేఎల్ స్వామి గారు.
నాటకం సలీం గారి కథను రక్తి కట్టించేలా మరి కాస్త నటనను ప్రదర్శించి ఉండొచ్చు. మూల కథ మాత్రం తల్లిదండ్రులను వృద్ధాప్యంలో నిరాకరించినప్పుడు ఆ తల్లిదండ్రుల మనోవేదనకు నిజ దర్పణం. ఇక వారు అనారోగ్యానికి గురైతే కలిగే పరిణామాలను కూడా ఈ నాటకంలో మనం గమనిస్తాం .కూతురు తండ్రి కోసం భర్తతో పోట్లాడిన సన్నివేశంలో డాక్టర్ గోవాడ దర్శకత్వంలో వచ్చిన మూల్యం నాటికలో భార్య తన తండ్రి కోసం తపించి భర్తతో వాదించిన దృశ్యం మనకు జ్ఞప్తికి వస్తుంది.

నాటకీకరణలో కే కే ఎల్ స్వామి గారు కృతకృత్యులయ్యారు మంచి నాటకాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించారు ఇటువంటి అంశాలతో మరెన్నో నాటకాలు మూల కథకులు సలీం గారి నుంచి నాటకీకరణ చేసిన కేకేఎల్ స్వామి గారి నుంచి వస్తాయని ఆశిద్దాం!
* * * * * * * * * *