తెలుగులోకి అను సృజన : కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి).
గుల్జార్ షాయరీ కవిత పై విశ్లేషణా వ్యాసం.
ప్రఖ్యాత కవి,జ్ఞానపీఠ అవార్డు గ్రహీత,గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత ఇది.గుల్జార్ హిందీలో రాసిన షాయరీ కవితను కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి) తెలుగులోకి అను సృజన చేసింది.గుల్జార్ షాయరీ కవితలోని భావాలు
పాఠకుల హృదయాలను అలరిస్తాయి.
నన్ను ఇంతగా ఎడిపిస్తున్నావేంటి
జీవితమా …
ఒక్క సారి వెళ్ళి మా అమ్మని అడిగి రాపో …
ఎంత గారాల బిడ్డనో నేను ?
జీవితం అంటే ఉనికి యొక్క స్వాభావిక ప్రాముఖ్యత.మనం ఇక్కడ ఎందుకు ఉన్నాము?మన అస్తిత్వం యొక్క ఉద్దేశ్యం ఏమిటి?అనే ప్రశ్నలకు విభిన్న సాంస్కృతిక మరియు సైద్ధాంతిక నేపథ్యాల నుండి అనేక ప్రతిపాదిత సమాధానాలు ఉన్నాయి. జీవితాన్ని గూర్చిన అన్వేషణ చరిత్రలో తాత్విక,శాస్త్రీయ, వేదాంత మరియు మెటా ఫిజికల్ ఊహాగానాలను ఉత్పత్తి చేసింది.మనిషి యొక్క మితిమీరిన ఉనికి,సామాజిక సంబంధాలు,స్పృహ మరియు ఆనందాన్ని గూర్చిన తాత్విక, మతపరమైన ఆలోచనలు,శాస్త్రీయ విచారణల నుండి జీవితం యొక్క అర్థాన్ని పొందవచ్చు.జీవితం యొక్క అర్థం ఆనందాన్ని పెంచడం,సాధారణ జీవితాన్ని సులభతరం చేయడంగా భావించ వచ్చు. జీవితం అంటే ఒక అద్భుతమైన ప్రయాణం.మనిషి జీవితం శాశ్వతం కాదు.జీవితం క్షణికమైనది.మనిషి పుట్టినప్పటి నుంచి మరణించే వరకు జరిగే ఈ ప్రయాణంలో అనేక అనుభవాలను,భావోద్వేగాలను ఎదుర్కొంటాం.జీవితం అనగా ఒక మార్గం.ఈ మార్గంలో మనకు అనేక ఘట్టాలు ఉంటాయి. ఇవి మనకు అనుభవాన్ని అందించి మనసును బలపరుస్తాయి.జీవితం మనకు ప్రతి క్షణం కొత్త పాఠాలను నేర్పుతుంది.జీవితం అంటే కేవలం సుఖం,సంతోషాల సమాహారమే కాదు.జీవితం బాధలు,కష్టాలు,కన్నీళ్లు మరియు సవాళ్లతో కూడినదిగా ఉంటుంది.జీవితంలో చెలరేగే సంఘర్షణలు మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి.జీవితంలో విజయం పొందేందుకు మార్గం చూపిస్తాయి.కుటుంబం,ఇరుగు పొరుగు వారితో స్నేహితులతో ఉండే అనుబంధాలు, సమాజంలో మనకు ఉండే సంబంధాలు జీవితం యొక్క పరమార్ధాన్ని తెలియజేస్తాయి.జీవితం మనకు ఎన్నో అవకాశాలను అందిస్తుంది.జీవితం అందించిన సరి కొత్త అవకాశాలను గుర్తించి సద్వినియోగం చేసుకోవాలి.మనం రోజును కొత్తగా ఆరంభం చేయడానికి జీవితం అవకాశం కల్పిస్తుంది.జీవితం ఒక తెరిచిన పుస్తకం లాంటిది.ఆ పుస్తకంలోని ప్రతి పేజీ మనకు కొత్త కొత్త పాఠాలను నేర్పుతుంది.మనం ఆ పుస్తకంలోని చివరి పేజీకి చేరేలోపే వాటిని ఆస్వాదించాలి.ఈ షాయరీ కవితలోని భావాలు తీవ్రమైన వ్యధను,నిరాశను మరియు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నాయి.నన్ను ఇంతగా ఏడిపిస్తున్నావేంటి అనే వాక్యంలో జీవితం తనను ఎందుకు ఇలా మితిమీరిన కష్టాలకు,బాధలకు గురి చేస్తోంది?భరించలేని దుఃఖాన్ని,బాధలను తట్టుకోలేకపోతున్నాను అనే ఆవేదన వ్యక్తం అవుతుంది. జీవితంలో ప్రశ్నగా మిగిలిన తన స్థానం ఏమిటి?జీవితంలో తాను పొందిన తీవ్రమైన బాధలు,తాను ఎదుర్కొన్న కష్టాలు, భావోద్వేగాలు అతని కవితలో వ్యక్తమవుతున్నాయి.ఒక్కసారి వెళ్లి మా అమ్మని అడిగి రాపో…ఎంత గారాల బిడ్డనో నేను?
కాని మా అమ్మ నా గురించి ఎంతో ప్రేమగా ఆలోచించేది,నేను ఎంత విలువైన వానినో అని గుర్తు చేసుకొనేది,గారాల బిడ్డ అనే పదం తనకు తల్లికి గల ఆత్మీయతను,ప్రేమను,అనుబంధాన్ని తెలియజేస్తుంది.జీవితం మనకు కొన్ని సార్లు తీవ్రమైన కష్టాలను, సవాళ్లను ఎదుర్కొనేటట్లు చేస్తుంది.అలాంటి కష్ట సమయంలో మనకు అండగా నిలిచే ఏకైక వ్యక్తి అమ్మ.అమ్మ తన బిడ్డల మీద చూపిన ప్రేమ జీవితంలో వారు తనకు ఎంత ముఖ్యమైన వారో తెలియజేస్తుంది.తాను అపురూపంగా చూసుకునే తన తల్లి సహాయంతో శాంతిని పొందుతున్నాడు.వ్యక్తి తల్లి ప్రేమను, ఆదరణను కాంక్షిస్తున్నాడు.తల్లికి తన పట్ల అపారమైన ప్రేమ, తనను తల్లి ఇతరుల కంటే ఎంతో ప్రత్యేకంగా,ప్రేమగా, ఆదరణగా చూసేది.తల్లి తన పట్ల ఎంతో ప్రేమను కురిపించేది. తల్లి తనను ఎంతో విలువైన బిడ్డగా చూసేది.ఇప్పుడు తాను జీవితంలో ఎదుర్కొంటున్న కష్టాలు,బాధలు ఎంతో భిన్నముగా ఉన్నాయి.జీవితంలోని నిరాశ మరియు కష్టాలు తల్లి చూపించిన అపారమైన ప్రేమను గుర్తు చేస్తున్నాయి.జీవితంలో బాధలను అనుభవిస్తూ జీవన పోరాటాన్ని కొనసాగిస్తున్నాడు.ఒక్కసారి అనే పదం వ్యక్తి యొక్క ఆత్రుతను,ఆరాటాన్ని తెలియజేస్తున్నది.ఈ కవితలోని భావం చాలా తీవ్రమైన భావోద్వేగంతో కూడి సమాధానం కోసం వెతుకుతున్నట్లుగా ఉంది.మనిషి జీవితంలో ఎదుర్కొంటున్న తీవ్రమైన సంఘర్షణ ఈ కవితలో వ్యక్తం అవుతున్నది.వ్యక్తి ఆవేదనను, నిస్సహాయతను జీవితంలో ఉన్న అసమానతల పట్ల అసహనాన్ని ఈ కవిత ప్రతిబింబిస్తున్నది.కవి గుల్జార్ షాయరీ కవితలోని భావాలు పాఠకుల హృదయాలను ఆలోచింపజేస్తాయి.
వ్యాసాలు
ప్రపంచంలోని బాధలలో కన్నీళ్ళను చూసి కవిగా కాళోజీ హృదయం స్రవించి ఆ హృదయ ప్రకంపనలకు అక్షర రూపం కలిస్తూ నూతన పోకడలతో కవిత రూపంలో …
“అవనిపై జరిగేటి అవకతవకల చూసి
ఎందుకో నా హృదిన ఇన్ని ఆవేదనలు…?
పరుల కష్టము చూసి కరిగిపోను గుండెను
మాయ మోసం చూసి మండి పోను ఒళ్ళు
పతిత మానవుని జూసి చితికి పోవు మనస్సు
ఎందుకో ఇన్ని ఆవేశం నా హృదిని ఇన్ని ఆవేదనలు?….” అంటూ
ఆత్మశ్రయ ధోరణితో వ్యక్తపరిచాడు .

“ఉత్తమాటలు కట్టిపెట్టి
పెత్తనాలకు దేవులాడక
చిత్తశుద్ధిగా చేయబూనిన
చేతలెల్ల ఘటించినట్లె “
అంటూ మనసులోని ఆవేదనను వ్యక్తం చేస్తూ , ఐక్యతను కోరుకుంటూ కాళోజీ కవితలు రాయటం జరిగింది.
వరంగల్ పట్టణానికి చెందిన ప్రజాకవి కాళోజీ నారాయణ రావు గురించి తెలియని వ్యక్తి తెలుగు నేలపై ఉండకపోవచ్చు. సాహిత్యాభిమానులు, సాహితీవేత్తలకే కాదు, సామాన్య వ్యక్తికి కూడా ఆయన సుపరిచితుడు. తెలంగాణ ఉద్యమం పుట్టకముందు నుంచే ఆయన తెలంగాణ ప్రజల కోసం పోరాడిన వ్యక్తి. తెలంగాణ ప్రజల కష్టనష్టాలపై అనేక పోరాటాలు, ఉద్యమాలు సాగించిన కవి కాళోజీ నారాయణ గారు.
ఏనాడూ ఉద్యమ నాయకుడన్న ముద్రను ఆయన వేసుకోలేదు. కానీ,ఉద్యమ కార్యకర్తగానే తెలంగాణ చరిత్రలో , ప్రజల గుండెలలో నిలిచిపోయారు. ఒక సాహితీవేత్తగా కలం ఝళిపిస్తూనే, ఒక పోరాటవాదిగా కత్తి కూడా అంతే సమర్థవంతంగా ఝళిపించారు. 1914 సెప్టెంబర్ 9న జన్మించి 2002 నవంబర్ 13న కన్నుమూసిన కాళోజీ అసలు పేరు రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాస్ రాం రాజా కాళోజీ ‘నా గొడవ’ పేరుతో వెలువరించిన కవితా సంకలనం
తెలంగాణ ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసిందనడంలో సందేహం లేదు.
ఈ అపూర్వ, అద్వితీయ, అపురూప కవిత్వం తెలంగాణ ప్రజల ప్రతి ఉద్యమానికి ప్రతిధ్వని అని చెప్పవచ్చు. అది రాజకీయ, సామాజిక చైతన్యాల సమాహారమని పలువురు సాహితీవేత్తలు ‘నా గొడవ’ను సమీక్షించడం జరిగింది. ప్రజల హక్కుల కోసం జీవితాంతం తపన పడిన ఈ ప్రజాకవి మొదటి నుంచి వరంగల్ పట్టణంలో నిరాడంబరంగా, సామాన్య ప్రజానీకంలో ఒక వ్యక్తిగా జీవించి, తాను ప్రవచించిన ప్రతి సిద్ధాంతాన్ని ఆచరించి చూపారు. ఆయన ఏ ఉద్యమం నడిపినా, ఏ కవిత రాసినా, సాహితీ ప్రసంగం చేసినా తెలంగాణ ప్రజల హక్కులను ప్రతిబింబించడానికే అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. ఆయన తనను తాను ప్రజావాదిగా అభివర్ణించుకున్నారు. మొత్తంగా తెలంగాణ జీవిత చలనశీలి కాళోజీ.
మొదటిసారిగా ఆయన నిజాం దమననీతికి, అరాచకానికి, నిరంకుశత్వానికి వ్యతిరేకంగా కలం, గళం ఎత్తారు. స్వాతంత్య్ర పోరాటంలో కూడా పాల్గొన్న కాళోజీ తెలంగాణకు సంబంధించిన ఉద్యమాల్లో విరివిగా పాల్గొనడం జరిగింది. ఆయన 1992లో భారతదేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన ‘పద్మవిభూషణ్’ను
పొందడం జరిగింది. ఆయన జన్మదినాన్ని తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ భాషా దినోత్సవంగా ప్రకటించి గౌరవించింది. వరంగల్ పట్టణంలో ఉన్న ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఆయన పేరు పెట్టడం జరిగింది. హన్మకొండ పట్టణంలో ఆయన పేరు మీద కళాక్షేత్రాన్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది.
కాళోజీ నారాయణ రావును సాటి సాహితీవేత్తలు, ఉద్యమకారులు తెలంగాణ తొలి పొద్దుగా సంభావిస్తుంటారు. ఆయన రాసిన ‘నా గొడవ’కు ప్రజాదరణ పెరగడం చూసిన కాళోజీ తెలంగాణకు సంబంధించి తన మనసులో ఉన్న లక్ష్యాన్నిఆయన ప్రజలకు తేటతెల్లం చేశారు. ‘అన్యాయాన్ని ఎదిరిస్తే ‘నా గొడవ’కు సంతృప్తి. అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తి ప్రాప్తి.
అన్యాయంపై పోరాడినవాడే నాకు ఆరాధ్యుడు’ అని ఆయన చెప్పేవారు. తెలంగాణ ప్రజల తరఫున ఉద్యమం సాగించడమే ఊపిరిగా జీవించిన అసలైన ప్రజాకవి కాళోజీ నారాయణ రావు.
దాదాపు తొంభై ఏళ్ళు జీవించిన కాళోజీ ఇరవయ్యో శతాబ్దంలో తెలంగాణ ప్రాంతంలో జరిగిన అన్ని ప్రధాన ప్రజా ఉద్యమాల్లోనూ ముఖ్య పాత్ర పోషించారు. నిజాము పాలన మొదలుకుని 80ల దాకా రకరకాల ప్రజా ఉద్యమాల గురించి, కాలానుగుణమైన మార్పుల గురించి, నిజాం-బ్రిటీష్ ఇండియా ల మధ్య తేడాల గురించి – ఇలా అనేక సంగతులు పుస్తకంలో ఉన్నాయి. ఆయన వ్యక్తిగత జీవితం గురించి, అన్న రామేశ్వరరావు గురించి ప్రస్తావన చాలా తక్కువ మొదట్లో చిన్నతనం గురించి తప్పిస్తే….
కుటుంబ ప్రస్తావన దాదాపు అసల్లేదనే చెప్పాలి.
నన్ను అమితంగా ఆకట్టుకున్న విషయం – ఆయన రాత అలా మాట్లాడుతున్నట్లే ఉండటం. ఆయనెంత ఎమోషనల్ మనిషో, ఎంత తొందరగా ఉద్వేగాలకి లోనౌతారో ఆయనే రాసుకున్నాడు గాని, పుస్తకంలో వివిధ సంఘటనల వద్ద కూడా – అది రాసిన విధానంలో కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఆయనకి ఆవేశమో, ఆవేదనో ఏదో కలుగుతుందని సన్నివేశాన్ని బట్టి మనం ముందే చెప్పేయొచ్చు అనమాట కాళోజీ నగర బహిష్కారానికి కూడా గురయ్యారంటే అసలు అలాంటి శిక్షలు జానపద కథల్లోనే అనుకున్నా నేను పరమ ఆవేశపరుడు అనిపిస్తుంది. కానీ, మళ్ళీ నాకు “చిన్న విషయం”గా తోచిన అంశాలకి కళ్ళనీళ్ళు పెట్టుకున్నానని కూడా రాశారు. మొత్తానికి భలే మనిషి. అడ్వెంచరస్ కూడా. నిజాం కాలంలో వీళ్ళు చేసిన పనుల గురించి, జైలు వాసాలలో జీవితం గురించి చెబుతూంటే పరమ ఉత్కంఠతో చదివాను.
అక్కడక్కడా రాసిన ఆయన కవితలు నాకు చాలా నచ్చాయి. నాకు సాధారణంగా ఎక్కడో ఒక శ్రీశ్రీ, ఒక అజంతా, ఒక ఇస్మాయిల్ – ఇలా కొందరు ప్రముఖులు రాసిన నాలుగైదు కవితలు తప్పిస్తే కవిత్వమంటే భయం. అర్థం కూడా కాదు. దూరంగా జరుగుతాను. కానీ, ఈయన రాసినవి నాకు ఎందుకో చాలా నచ్చాయి. ఎక్కువ భావుకత, మార్మికత అనుకునే తరహా లేకుండా సూటిగా, తేలికైన భాషలో ఉండటం వల్ల కాబోలు. పైగా కొన్ని కవితలు ( “నా ఇజం” వంటివి) కాలాతీతంగా, ఇప్పటికీ సరిగ్గా సరిపోయేలా ఉండటం ఓ కారణం కావొచ్చు.
చాలామంది ప్రముఖుల గురించి ఆసక్తికరమైన స్కెచెస్ ఉన్నాయి – విశ్వనాథ, పీవి నరసింహారావు, రాయప్రోలు సుబ్బారావు, సర్దార్ జమలాపురం కేశవరావు – ఇలా అసార్టెడ్ వ్యక్తుల గురించి. విశ్వనాథ వారి గురించి నాలుగైదు చోట్ల ప్రస్తావన ఉంది. వీళ్ళిద్దరికీ స్నేహం ఉందన్న విషయం నాకసలు ఊహకైనా రాలేదు. పుస్తకం చదివే ముందు నా ఊహ వీళ్ళిద్దరూ భిన్న ధృవాలని. కానీ, ఇందులో ఆయన గురించి రాసిన విషయాలు పుస్తకాలు చదివి ఆయన గురించి అనుకున్నదానికి కొంచెం భిన్నంగానే ఉన్నాయి. అలాగే, భక్తుడు భజనచేసినట్లు కాక, ఒక సమకాలీకుడు, స్నేహితుడు, సాహిత్యకారుడు భక్తిభావంతో-గురుభావంతో కాకుండా, మామూలుగా ఇంకో తెలిసిన రచయిత గురించి రాసినట్లు ఉన్నాయి విశ్వనాథ మీద గుత్తాధిపత్యం తీసుకున్న దురభిమానులు ఇప్పుడు నన్ను ఏకేస్తారు కాబోలు. పీవీ గురించి ఈయన చాలా అభిమానంతో, చనువుతో రాసుకున్నారు. జమలాపురం కేశవరావు గురించి మాకు తెలుగు పాఠ్యపుస్తకంలో ఉండేది స్కూల్లో. పేరు తప్ప ఆట్టే గుర్తులేదు కానీ, కాళోజి రాసింది చదివాక ఆయన గురించి తెలుసుకోవాలన్న కుతూహలం కలిగింది.
పుస్తకం రచనా కాలం నాకు తెలియదు కానీ నన్ను బాగా ఇబ్బంది పెట్టిన విషయం మట్టుకు ఒక కాలం నుండి ఇంకో కాలంలోకి జంప్ అవుతూ ఆయన కథ చెబుతూ పోవడం. రికార్డు చేసిన దాన్ని ఫెయిర్ చేసినట్లే అనిపించింది నాకు – మొదట్లో వాళ్ళు రాసినట్లు. దీని వల్ల ఆయా సంఘటనలతో, కాళోజీ తో పరిచయం లేని వాళ్ళకి కొంచెం ఇబ్బందే కావొచ్చు. ఏ బయోగ్రఫీనో చదవనిదే పూర్తి పిక్చర్ రాదు. పేర్వారం జగన్నాథం గారు రాసిన జీవిత చరిత్ర ఒకటి కనబడ్డది తెలుగుథీసిస్ వెబ్సైటులో. త్వరలో వీలు చూసుకుని చదవాలి.
గురించి ఆయన రాసిన విషయం ఆలోచింపదగ్గది.
“బ్రిటీష్ ఇండియా సంగతి తెల్వదుగాని నైజాంలో చదువుకున్న ప్రతివాని ఇంట (హైద్రాబాదు, వరంగల్ లలో) భగత్ సింగ్, సుఖదేవ్, రాజగురుల ఫొటో వుండేటీది. బజార్లొ అమ్మెటోళ్ళు, వకీళ్ళ ఇళ్ళలో గాంధీ, మోతీలాల్, చిత్తరంజన్ దాసు, తిలక్, లాలా లజపతిరాయ్, సేన్ గుప్త ఫొటోలు కూడా వుండేటివి. ఇవేవీ నైజాం కాలంలో అభ్యంతరాలు కాదు. మరి ఇప్పుడు ’80-’85 లలో మావో సాహిత్యం, విప్లవ సాహిత్యం దొరికినయని దాడులు చేస్తరు, రాడికల్ సభలో ఆక్షేపిoచారు.
నిర్మొహమాటంగా, నిర్భయంగా ప్రజల హృదయాలలో స్థానం సుస్థిరం చేసుకున్నాడు మన కాళోజీ!
ఆనాడు నిజాం నిరంకుశ పాలనలో తెలుగు భాషకు ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడ్డాక తెలంగాణా భాషకు యాసకు జరిగిన అన్యాయాన్ని చూసి బాధపడి తెలుగు భాషకు ,తెలంగాణా భాషకు తగిన గౌరవం లభించాలని,మన భాషలో యాసలో రచనలు చేయాలని ఆశించి బాధపడ్డ తెలంగాణా ముద్దు బిడ్డ. ఒక ధిక్కారస్వరం,నిరహంకారం,ఆవేశం,ఆలోచన ,సమాజంలో జరిగే అన్యాయాలను రచనల ద్వారా ఎండగట్టే మహనీయుడు.అందరి గొడవలను తన బాధగా భావించి ‘ నా గొడవ ‘ లో వినిపించి సమాజంలో మార్పు రావాలని ఆశించి గొంతెత్తిన కలం యోధుడు శ్రీ కాళోజీ నారాయణ రావు గారు.
1914 సంవత్సరం సెప్టెంబర్ 9 వ తేదీన బీజాపూర్లోని రట్టిహళ్ళి అనే గ్రామంలో రంగారావు,రమాబాయి దంపతులకు జన్మించాడు.కాళోజీ చిన్నతనంలోనే తెలంగాణాకు వలస వచ్చారు తల్లిదండ్రులు. కాళోజీకి మరాఠీ,కన్నడ,తెలుగు,ఉర్దూ,ఆంగ్ల భాషల్లో నిష్ణాతుడు.
నిజాం ప్రభుత్వంలో ఉర్దూ రాజభాషగా ఉన్నందున ఉర్దూమాధ్యమంలో చదివినప్పటికి తెలుగు భాష పట్ల తెలంగాణ భాష పట్ల చాలా అభిమానం కలవాడు.
నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలలో చురుకుగా పాల్గొన్నాడు.ఆంధ్ర మహాసభలు,ఆర్యసమాజం,తెలంగాణా రైతాంగ పోరాటం,తెలంగాణ తొలిదశ,మలిదశ ఉద్యమాలలో చైతన్య వంతంగా తన వంతు పాత్రను పోషించాడు.తెలంగాణాలో ఉవ్వెత్తున ఎగిసిపడ్డ ఒక తెలంగాణా ఆత్మాభిమాన కెరటం.
తెలంగాణా భాషకు యాసకు జరుగుతున్న అన్యాయాన్ని సహించలేక తన గొంతును విప్పి కలం ఝళిపించిన భాషాభిమాని.
ఆంధ్ర సారస్వత పరిషత్ వ్యవస్థాపక సభ్యుల్లో,తెలంగాణా రచయితల సంఘ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకడు.
అనేక రచనలు చేసిన మహాకవి.కాకతీయ విశ్వవిద్యాలయం వారు గౌరవ డాక్టరేట్ ను,కేంద్ర ప్రభుత్వం వారు పద్మ విభూషణ్ పురస్కారంతో గౌరవించారు.అనేక అవార్డులు,రివార్డులు పొందిన మహాకవి.
” అన్య భాషలు నేర్చి
ఆంధ్రంబు రాదంచు
సకిలించు ఆంధ్రుడా
చావవెందుకురా “
అని నినదించి తెలుగు భాష గొప్పతనాన్ని, మాతృ భాష ప్రాముఖ్యతను చాటి చెప్పాడు.
ఇంత గొప్ప సేవ చేసిన మహనీయుని జన్మ దినాన్ని పురస్కరించుకొని తెలంగాణా రాష్ట్రం ఆవిర్భవించినాక తెలంగాణా భాషా దినోత్సవాన్ని,ఆయన పేరు మీదుగా తెలంగాణా సాహిత్య విశిష్ట వ్యక్తికి కాళోజీ పురస్కారమిచ్చి తన్ను తాను గౌరవించుకుంటుంది.కాళోజీ ధిక్కార స్వరం అందరికి ఆదర్శనీయం.బతుకమ్మ మురిసి విరిసి పోయింది.తెలంగాణా ప్రత్యేకతను చాటుకుంది…..
‘స్వేచ్ఛ ‘అన్న పదం ‘ స్వాతంత్య్రం ‘ కన్నా విశాలమైన అర్థం కలదని భావిస్తాను. స్వాతంత్య్రం భౌతికమైనది ,అది అధీనతను సూచిస్తే, స్వేచ్ఛ ఆంతరంగికమైనది వ్యక్తుల ఆలోచనలను సూచిస్తుంది . ‘స్వాతంత్య్రం ‘లేని స్వేచ్ఛ విప్లవానికి పునాది అవుతుంది. స్వేచ్ఛ లేని ‘ స్వాతంత్య్రం’లో జాతి ఉనికినే కోల్పోతుంది. ఆది నుంచి జాతుల మధ్య ఆధిపత్య పోరాటాలే చరిత్రను సృష్టించాయి.ప్రపంచ వ్యాప్తంగా మానవతా వాదం ముందుకు రావడం తో ఆధిపత్య ధోరణి తగ్గినా పూర్తిగా తొలిగిపోయిందని చెప్పలేము. అయితే ఈ మానవతా వాదం అంత సులువుగా అంగీకరించబడలేదు.ముందు దేశాల స్వాతంత్య్రం, స్వేచ్చ , సమానత్వం, ఆయా దేశాలు తమ సార్వభౌమాదికారాన్ని సాధించుకోవడం, విప్లవాలు మేల్కొలిపిన నైతిక భావనలు ఇవన్నీ దాని వెనుక ఉన్న నేపథ్యం.
సార్వ భౌమాధికరం నెలకొల్పుకొని స్వేచ్ఛాయుత జీవనం కొనసాగించడంలో ఒక్కో దేశం ఒక్కో పంథా పాటించినా భారతదేశం సాగించిన పోరాటం మాత్రం అద్వితీయమైంది. అహింసా, సత్యాగ్రహం అనే పదునైన నైతిక ఆయుధాలతో భారతదేశం సాగించిన పోరాటం ప్రపంచ స్వతంత్ర పోరాటలలోనే విలక్షణమైనది. అది 19 శతాబ్దపు నయా యుద్ద రీతిగా ప్రపంచ దేశాలకు చుక్కాని అయింది.
భారత స్వాతత్య్రోద్యమం పరిశీలించినట్లయితే గాంధీకి ముందు గాంధీ తర్వాత గా విభజించడం తెలుస్తుంది. గాంధీ అంతగా మన స్వాతంత్ర ఉద్యమాన్ని ప్రభావితం చేయడం వెనుక ఉన్న నేపధ్యం ఏమిటి ? దక్షిణాఫ్రికా లో గాంధీ సాధించిన విజయాలు ఏమిటి ?దక్షిణాఫ్రికాలో సాధారణ వకీలు నుంచి ఏ పరిస్థితులు అతని ఇంతటి మహోన్నత కార్యంలో పాలుపంచుకునేలా చేశాయి ? అసలు దక్షిణాఫ్రికా కి భారతదేశానికి ఉన్న సంబంధం ఏమిటి? గాంధీ అక్కడ అంటే దక్షిణాఫ్రికాలో మొదలుపెట్టిన ఉద్యమం ఎటువంటిది? అన్న విషయాలు నన్ను చరిత్ర చదువుకునే రోజుల్లో ఆలోచింపజేసిన ప్రశ్నలు .
వీటికి సమాధానంగా నాకు దొరికిన సిద్ధాంత గ్రంధానికి సరిసమానమైన పుస్తకం ఇంద్రధనస్సు ఏడో రంగు. నేనిప్పుడు పరిచయం చేయబోయే ఈ పుస్తకం నూటాయాభయ్యే ల్ల ఆఫ్రికన్ జాతులు ఇంకా అక్కడ బతక వచ్చిన వివిధ దేశీయుల సంఘర్షణను సంగ్రహంగా 200 పేజీలలో విశ్లేషణాత్మకంగా అందించిన ఈ పుస్తకం 2003లో వచ్చింది. నేను దాన్ని ఒక చిన్న వ్యాసంలో కుదించడం ఇప్పుడు నా ముందున్న సవాలు. పుస్తక రచయిత పెన్నేపల్లి గోపాలకృష్ణ.1937 లో జన్మించిన పెన్నేపల్లి గారు జామీన్ పత్రికలోనూ, ఉదయం, వార్త పత్రికలోనూ పనిచేసి 2001 నుంచి పూర్తిగా సాహిత్య వ్యాపకంలో ఉన్నారు.పెన్నేపల్లి వారి రచనల్లో ముఖ్యమైనవి ‘ఇంద్రధనస్సు ఏడో రంగు’ , ‘మధురవాణి ఊహాత్మక ఆత్మకథ’ , ‘గురజాడ డైరీస్ ‘, ‘గురజాడ కంప్లీట్ వర్క్స్ ‘ . ఇంద్ర ధనుస్సు ఏడో రంగు పుస్తకం రాయడానికి ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు కి చెందిన ఈ ఎస్ రెడ్డి ( ఏనుగు శ్రీనివాసులు రెడ్డి ) ఐక్యరాజ్య సమితి తరపున దక్షిణాఫ్రికాలో జాతి వివక్ష విమోచన ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొని సేకరించిన సమాచారంతో పాటు రచయిత మరి కొంత సమాచారాన్ని సేకరించి దీన్ని సమగ్రంగా తీర్చిదిద్దారు. ప్రతి వాక్యానికి విశ్లేషణకి ఆధారంగా ప్రతి అధ్యాయం చివర దాని తాలూకు ప్రతుల వివరాలు పొందుపరిచారు.రచయిత 2011లో వారి 73వ వయసులో మరణించారు .ఈ వ్యాసం ద్వారా ఇంతటి సమగ్ర సమాచారాన్ని అందించిన పెన్నేపల్లి గోపాలకృష్ణ గారికి సవినయంగా నివాళులు అర్పిస్తూ పుస్తకంలోకి వెళ్దాం.
దక్షిణాఫ్రికాని ఇంద్రధనస్సు దేశం అంటారు ఎందుకంటే అక్కడ స్వతహా గా ఉండే నల్లజాతి ప్రజలు , వలస రాజ్యాలు స్థాపించిన పోర్చుగీస్ వారు ,బ్రిటిష్ వారు , ఫ్రెంచి వారు ఇంకా బతకడానికి వచ్చిన భారతీయులు ,చైనీయులు వీరందరి సంతతి జాతులు ఇలా అనేక రకాల జాతుల సంగమంగా ఉంది గనుక దీనికా పేరు వచ్చింది. స్వతహాగా ఉన్న జాతులు ఎప్పుడూ గుర్తింపుకు నోచుకోలేదు .వారి స్థితిగతులు అత్యంత దయనీయంగా ఉండేవి. భారత దేశం లో వలనే పోర్చుగీసు వారు దక్షిణాఫ్రికాలో మొదట స్థావరం ఏర్పరచుకున్నారు . వారి స్థావరాలలో పని చేయడం కోసం భారతదేశం నుంచి మహిళలను బానిసలుగా రవాణా చేశారు భారతదేశంలోని డచ్ ఈస్టిండియా కంపెనీ ఈ వ్యవహారాన్ని చూసుకునేది .బెంగాల్, బీహార్ ,ఒరిస్సా,పులికాట్ ,మచిలీపట్నం ,గోవా , బాంబే, సూరత్ నుంచి ఎక్కువగా ఇలాంటి వలసలు జరిగాయి .కొంతమంది మహిళలు వివాహమాడి అక్కడే స్థిరపడ్డారు.ఇలా మహిళల, కూలీల రవాణా 1650 నుంచి బ్రిటిష్ సామ్రాజ్యంలో 1834లో బానిస వ్యవస్థ రద్దు చేసే వరకు అంటే దాదాపు రెండు వందల సంవత్సరాలు నిరాటంకంగా కొనసాగింది. అప్పటికీ దక్షిణాఫ్రికాలో డచ్ ఆధిపత్యం లో వలస పాలన ఉండేది.
భారత్ లో బ్రిటిష్ ప్రభుత్వం 1860 నుంచి కొత్త చట్టం Indentured Labour Act ద్వారా వలస దేశాలకు కూలీలను రవాణా చేసింది .ఈ చట్టంలో, కూలీగా వెళ్లిన వ్యక్తి ఐదు సంవత్సరాలు కాంట్రాక్టు కూలిగా మరొక ఐదు సంవత్సరాలు స్వతంత్ర కూలీగా పని చేయవలసి ఉంటుంది . కూలీ యజమానికి ఎదురు తిరిగిన పక్షంలో కొరడా దెబ్బలు తినవలసి ఉంటుంది. అయినప్పటికీ 1860 లలో భారత దేశంలోని తీవ్ర క్షామ పరిస్థితులలో పేద ప్రజానీకం దేశం విడిచి వెళ్లారు. ఆచరణలో ఈ చట్టం ప్రకారం వలస కూలీల జీవనం దుర్భరం కావడంతో ఇది బ్రిటీష్ సామ్రాజ్యానికి చెడ్డపేరు తేవడంతో కూలీల రవాణా ప్రోత్సహించడం కోసం 1874లో కొరడా శిక్షను రద్దు చేేశారు. కూలీల కనీస సౌకర్యాలు లేకపోవడం ,మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, రాత్రి 9 గంటల తర్వాత భారతీయులు వీధులలో తిరగకుండా నిషేధం చిన్న చిన్న తప్పులకు జైలు శిక్షలు, యజమానులు పెట్టే బాధలు ,చాలీచాలని జీతాలు ,అనారోగ్యం భారతీయ కూలీలు తిరిగి వెళ్ళలేక అక్కడ ఉండలేక ఇబ్బందుల పాలయ్యారు.
ఇక వ్యాపార నిమిత్తం దక్షిణాఫ్రికా కి వలస వచ్చిన రెండో వర్గం” ఫ్రీ పాసెంజర్ “ల పేరుతో వ్యవహారించబడ్డ వీరు ఎక్కువగా గుజరాత్ నుంచి వచ్చారు . అయితే ఈ రకమైన వ్యాపార వర్గం ఉండడం ఇష్టం లేని ప్రభుత్వం భారతీయుల వల్లనే అనేక రకాల కష్టనష్టాలు వస్తున్నాయని ,అవినీతి అక్రమాలు పెరుగుతున్నాయని ,రకరకాల జబ్బులు వస్తున్నాయని ఆరోపించి ఈ వలసలు తగ్గించడానికి జస్టిస్ రాక్ విచారణ కమిషన్ 1857లో ఏర్పాటు చేసి నియంత్రణ విధించింది.అయినా వలసలు తగ్గక పోవడంతో 1895లో ఇమిగ్రేషన్ లా అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం భారతదేశం స్థిర నివాసం ఏర్పర్చుకునే భారతీయులు తలకు మూడు పౌన్లు చెల్లించాలి కాంట్రాక్టు కూలీలు ఉండవచ్చు కానీ స్వతంత్ర కూలీలు పన్ను చెల్లించి లైసెన్స్ పొందాలి.
పంతొమ్మిది వందల 1897లో మరింత కఠినంగా డీలర్స్ లైసెన్సింగ్ యాక్టర్ ప్రకారం అకౌంట్ లన్ని ఇంగ్లీష్ లోనే ఉండాలి లైసెన్స్ అధికారం ప్రభుత్వానిదే దానిమీద అప్పీల్ చేసుకునే అధికారం వ్యాపారికి ఉండదు.1885లో ఉన్న మరో చట్టం ప్రకారం 25 పౌండ్లు రిజిస్ట్రేషన్ ఫీ చెల్లించిన భారతీయులకు మాత్రమే ట్రాన్స్వాల్ లో నివసించే హక్కు ఉంటుంది. డచ్ ప్రభుత్వం మరింత ముందుకు వెళ్లి భారతీయుల కొరకు బజార్లు అనబడే వెలి వాడలు కేటాయించాలని అవి దాటి రాకూడదని వ్యాపారులు కూడా వ్యాపారాలు సాధించుకోవాలని బహిరంగ ప్రదేశాల్లో తిరగకూడదని చట్టం చేశారు .ఆ విధంగా భారతీయులు కూలీలు మాత్రమే అంతకుమించి అంటరానివారు కూడా. అలాంటి పరిస్థితిలో గుజరాత్ వ్యాపారుల తరఫున న్యాయవాదిగా దక్షిణాఫ్రికా చేరిన గాంధీ 1894లో తిరిగి భారత్ రావాలని అనుకున్నప్పటికీ అక్కడ ఉన్న ప్రజల కోరిక మేరకు అక్కడే ఉండి భారతీయుల సమస్యలని పరిష్కారం దిశగా నడిపించాలని తన ప్రయాణాన్ని వాయిదా వేసుకుంటారు .
మొదట మహర్జీల ( మహా ఆర్జీ) పోరాటం. భారతీయుల సమస్యలన్నీ ఆర్జీ రూపంలోప్రభుత్వానికి సమర్పించారుఅయితే వాటికి ప్రభుత్వం నుంచి ఏమాత్రం పరిష్కారం దొరకలేదు ఆ కాలంలోనే జరిగిన బోయర్ యుద్ధంతో (అంటే డచ్ తో ఆధిపత్యం కోసం బ్రిటిష్ వారు చేసిన యుద్ధాలలో ) బ్రిటిష్ వారి అధికారం 1904లో స్థిరపడింది.అప్పటికి గోపాల కృష్ణ గోఖలే గాంధీ మరికొంతమంది మితవాదులు భారతదేశంలోని దక్షిణాఫ్రికాలో ఓకే సామ్రాజ్యవాదం భారతీయుల సమస్యలు పరిష్కరించబడని అందుకు తగిన అహింసాయుత పోరాటం సరిపోతుందని భావించారు. భారత్ లోనూ దక్షిణాఫ్రికాలోనూ ఒకే వలస ప్రభుత్వం ఉన్నది కనుక సామరస్యంగా సమస్యలు పరిష్కరించాలని అనుకున్నారు. కానీ అలా జరగలేదు. బ్రిటిష్ వారు రూపొందించిన భారతీయుల తప్పని సరి రిజిస్ట్రేషన్ చట్టం( 1906) నల్ల చట్టం గా పేర్కొంటూ మొదటి సత్యాగ్రహ ఉద్యమం చేశారు.గాంధీకి సంకెళ్లు వేసారు. సత్యాగ్రహం ఒక పదునైన ప్రజా ఉద్యమంగా రూపు దిద్దుకున్న సంఘటన ఇదే.ఉద్యమం ఎంత తీవ్ర స్థాయిలో జరిగిన ప్రభుత్వ నిర్ణయంలో మార్పు రాలేదు.కాకపోతే 1911లో అప్పటి భారత ప్రభుత్వం వలస కూలీ చట్టం రద్దు చేసింది.
ఇక దక్షిణాఫ్రికా లో 1910 నుంచి నాలుగు వలస ప్రభుత్వాల స్థానంలో యూనియన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా ఏర్పడింది. ఇప్పుడు మరో మెలిక.. కేవలం క్రైస్తవ పద్దతిలో జరిగిన వివాహాలు మాత్రమే చెల్లుబాటు అవుతాయని. అలా 1913 లో మరింత విశాల భూమికగా మరో సారి సత్యాగ్రహం మొదలైంది.దీన్ని మహాయత్ర గా పేర్కొంటారు. ఉద్యమంలో శ్రామిక వర్గం ప్రవేశించడం ఒక మలుపు.దీని ఫలితంగా ఇండియన్ రిలీఫ్ ఆక్ట్ ఏర్పడింది. గాంధీ ఈ చట్టాన్ని భారతీయుల మాగ్నాకార్టా గా వర్ణించాడు ఆధునిక కాలంలో ఏ ఉద్యమమూ సాధించని ఫలితాలను సత్యాగ్రహం సాధించగలదని గుర్తించాడు.
ఆ తర్వాత 1914లో దాదాపు 24 ఏళ్ల ప్రవసాన్ని వదిలి గాంధీ భారత్ కి వచ్చేశారు. హెర్మన్ కాలాంబక్ అనే గాంధీ అనుచరుడు ఇచ్చిన 1100 ఎకరాల భూమిని గాంధీ ‘టాల్ స్టాయ్ ఫామ్ ‘ పేరుతో సత్యాగ్రహుల స్థావరం నెలకొల్పారు . ఏమిదేళ్ల పాటు ఇక్కడినుంచే గాంధీ కార్యకలాపాలు చేసేవారు.గాంధీ వచ్చేసాక భారతదేశంలో ఏం జరిగిందో మనకు తెలుసు. మరి దక్షిణాఫ్రికా భారతీయుల పోరాటం ఏమయ్యివుంటుంది ?
భారతీయులను వలస ప్రభుత్వం రూపొందించిన క్లాస్ ఏరియాస్ చట్టం, పెగ్గింగ్ చట్టం వంటి చట్టాలతో వేధించినా భారతీయ సంతతి నాయకులు యూసఫ్ దాదూ, తంబి నాయుడు , ఆఫ్రికన్ నాయకులు ముఖ్యంగా మండేలా ఈ పోరాటం ఒక సమూహం తోనూ జరిగేది కాదని అందరూ కలిసి వలస ప్రభుత్వాన్ని ఎదిరించాలని నిర్ణయించుకుంటారు .పోరాటం శాంతియుతమా సాయుధమా… ఇలా అనేక రకాల సంఘర్షణలు దాటి 1961లో అంటే భారతీయులు దక్షిణాఫ్రికా వచ్చి నూ రేళ్లు పూర్తి కావస్తున్న తరుణంలో గణతంత్ర దేశంగా మారింది. అదే సంవత్సరం మండేలా నాయకత్వంలో దక్షిణాఫ్రికా విమోచనోద్యమం లో సాయుధ పోరాట దశను ముగిస్తూ స్పియర్ ఆఫ్ ద నేషన్ అనే సంస్థ ఏర్పాటు చేయబడింది. అనేక పోరాటాల తర్వాత 1994 లో మొదటి సారి ఓటు హక్కు వినియోగించుకొని నిజమైన గణతంత్ర రాజ్యం గా నిలదొక్కుకుంది ఈ వివరాలన్నీ మండేలా జీవిత చరిత్ర లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ లో చదవ వచ్చు.
ఇక పుస్తకం రెండవ భాగంలో ఇచ్చిన దక్షిణాఫ్రికా విమోచనద్యమ భారతీయుల వివరాలు పొందుపరచడం వారి త్యాగానికి నివాళిగా భావించవచ్చు.వారిలో వల్లియమ్మ.17 ఏళ్ల వళ్ళీయమ్మ మాతృ భూమి కోసం ప్రాణత్యాగం చేసిన తొలి దక్షిణఆఫ్రికా భారతీయ మహిళగా గుర్తించబడుతుంది. ఈమె స్మారకంగానే తమిళనాడు ప్రభుత్వం 1982 లో మద్రాసులోని చేనేత కార్మిక సహకార సంఘానికి ‘తిల్లైయాడి వళ్ళియమ్మ మాలిగై ‘అన్న పేరు పెట్టిందిట. గాంధీ చేతి కర్ర అనబడే తంబి నాయుడు, నానా సీత , యూసఫ్ దాదూ, నారాన్ ముఖ్యులు.
తంబి నాయుడు తన నలుగురు పిల్లలు బాల, బాల భారతి, నారాయణ్ స్వామి, ఫక్రీ లను గాంధీ దంపతులకు శాస్త్రోక్తంగా దత్తత నిచ్చారట. వీరికి గాంధీ పట్ల ఉన్న అనుబంధంతో వీరిని గాంధీ ముత్యాలు( FOUR PEARLS OF GANDHI )అని పిలిచేవారట. వీరు గాంధీ ఇండియాకు వచ్చిన తర్వాత రవీంద్రుని శాంతినికేతన్ లో 1933 వరకు ఉండి తిరిగి దక్షిణాఫ్రికాకు వచ్చి దక్షిణాఫ్రికా విమోచనోద్యమంలో పాల్గొన్నారు. దక్షిణాఫ్రికా విమోచనోద్యమంలో మహిళలు కూడా పాల్గొన్నారు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన వారు శాంతి, ఇలా గాంధీ , ఫిల్లిస్ నాయుడు, అమీనా, ఫతిమా మీర్.ఫతిమా మీర్ రచయిత. ఇండియన్ వ్యూస్ అనే వార పత్రిక నడిపేవారు. ఆమె 40 పుస్తకాలు రాశారట . దక్షిణాఫ్రికాను కుదిపేసిన వందమంది మహిళల్లో ఒకరిగా ఈమెకు గుర్తింపు ఉన్నది. “Higher than hope : Rolihlahla We love you ” – నెల్సన్ మండేలా జీవిత చరిత్ర ఈమె రాసిందే. ఇండియా లో శ్యామ్ బెనెగల్ నిర్మించిన మహాత్మా ఇన్ మేకింగ్ అన్న సినిమాకి ఈమె రచనలే ప్రామాణికంగా తీసుకున్నారట.ఇలా నేను అనేక విషయాలను కొత్తగా ఈ పుస్తకం ద్వారా తెలుసుకున్నాను. చివరగా ఇంద్ర ధనుస్సు ఏడో రంగు అంటే ఎరుపు రంగు, ఎరుపు చైతన్యానికి చిహ్నం. దక్షిణాఫ్రికా ఉనికిని, విమోచనోద్య మాన్ని సంయుక్తంగా ధ్వనించే పేరుతో ఈ పుస్తకం.భారతీయుల సాధికార పోరాటానికి సంగ్రహ రూపం.
90% శాతం మంది భారతీయులకు ఆ పదం గాని, అసలు అవి ఏమిటో ఎన్నో కూడా తెలియదు..
మనం మరిచిపోయింది.. వేదాలనే కాదు.. ఒక మహా జాతి వైభావాన్ని..
వేదాలు సమస్తం జ్ఞానానికి మూలం.. విదేశీయులు చెప్తున్నారు.. జర్మనీ పార్లమెంట్ చెప్తుంది.. ఫ్రంక్పర్ట్ యూనివర్సిటీ చెప్తుంది.
శ్రీ బ్రహ్మ శ్రీ దండిభట్ల విశ్వనాధ శాస్త్రి !!
జర్మనీ వారికి ప్రియమైన తెలుగు పండితుడు” శ్రీ దండిభట్ల విశ్వనాధ శాస్త్రి”.
ఒక్క యజుర్వేదమే నాలుగు ముఖాలుగా, నాలుగు రూపాల్లో అవగతమవుతుంది. ఇన్ని విధాలుగా అర్థం చేసుకోవాలంటే ఆ వ్యక్తికి ఈ నాలుగు శాస్త్రాల్లో అభినివేశం ఉండాల్సిందే.
అంత అభినివేశం, ప్రతిభ ఉన్నవారుగా ఇరవయ్యో శతాబ్దంలో పేరు పొందిన వారు దండిభట్ల విశ్వనాథశాస్త్రి. అంత ప్రతిభావంతులు కాబట్టే హిట్లర్ ఆయన్ని జర్మనీకి ఆహ్వానించారు!
రాజమహేంద్రవరం లో వ్యాకరణశాస్త్ర పండితులుగా పేరుపొందిన దండిభట్ల విశ్వనాథశాస్త్రి గురించి అత్యంత ఆసక్తికరమైన సంఘటన – ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నరోజుల్లో పశ్చిమ జర్మనీకి పంపిన రాయబారికి అక్కడి అధికారులు తమ కార్యాలయాలు చూపుతూ ఓ చోట ఓ భారతీయుని ఫోటో చూపించి ఆయన పేరేమిటో చెప్పమని అడిగారట. తనకు తెలియదని ఆ రాయబారి అనడంతో వెంటనే జర్మనీ అధికారులు దండిభట్ల విశ్వనాథశాస్త్రి అని చెప్పి ఆయనకు జర్మనీలో గొప్పపేరు ప్రతిష్టలు రావడానికి కారణమేమిటో కూడా చెప్పారు.
తొలి ప్రపంచ యుద్ధం తాత్కాలికంగా చల్లారింది. జర్మనీలో కెయిజర్ ప్రభుత్వం పతనమైంది. ప్రపంచమంతా దాని ప్రభావంతో ఆర్థికమాంద్యం నెలకొంది. ఆ యుద్ధంలో బందీలయిన వేలాది మంది జర్మనీ సైనికుల్లో ఒకరు హిట్లర్. ఆయన ఆ అవమానాన్ని దిగమింగు కోలేకపోయారు. ప్రపంచ జాతుల్లో తనదే గొప్పజాతన్నది ఆయన విశ్వాసం. ఎలాగైనా తమ ఆధిపత్యం నిరూపించాలని ఆయన నాజీ పార్టీ స్థాపించారు. జర్మనులను దేశభక్తితో ఉత్తేజితం చేశారు.
వైజ్ఞానికంగా, పారిశ్రామికంగా జర్మనీది పైచేయిగా మార్చడానికి ఎన్నో సంస్కరణలు ప్రారంభించారు. అలాగే కొత్త మారణాయుధాల అన్వేషణ ప్రారంభించారు. అప్పటికే సంస్కృత భాషాధ్యాయనం పట్ల జర్మన్లు ఆసక్తి పెంచుకొన్నారు. భారతీయ వేద-శాస్త్ర వాఞ్మయంలో మారణాయుధాల రహస్యాలున్నాయని ఆయన గ్రహించారు.
ఒకవైపు సంస్కృత సాహిత్యాన్ని తమప్రజలకు అర్థమయ్యేలా అనువదింపచేశారు. ఆ విధంగా తొలిసారిగా ముద్రణకు నోచుకొన్న ఆ వాఞ్మయం నుంచి జర్మన్లు అబ్ధి పొందడానికి గట్టిచర్యలు హిట్లర్ తీసుకొన్నారు. అయితే యుద్ధ పరికరాలు, ఆయుధాల నిర్మాణానికి సంబంధించిన రహస్యాలను వేదశాస్త్ర వాఞ్మయం నుంచి విడమరిచి చెప్పేవారికోసం ఆయన అన్వేషణ సాగిస్తూనే వచ్చారు. అదే సమయంలో దండిభట్ల విశ్వనాథశాస్త్రి గురించి తెలుసుకున్న హిట్లర్ ప్రతినిధులు ఆయనకోసం అన్వేషణ ప్రారంభించారు.
దండిభట్ల విశ్వనాథశాస్త్రి నిత్యం శాస్త్ర విషయాలు ఆలోచిస్తూ, తమ ఇంటికి వచ్చేవారితో చర్చలు జరిపేవారు తప్ప లౌకిక విషయాలను పట్టించుకొనేవారు కాదు. ఓ రోజు ఆయన విశాఖపట్నం సమీపానున్న కొత్తవలస దగ్గర ఒక పల్లెటూరికి వెళ్లవలసి వచ్చింది. కాలినడకన వెళ్తోన్న సమయంలో హిట్లర్ ప్రతినిధులు ఆయన్ని సమీపించారు. వాదోపవాదాలకు తావులేకుండా ఆయన్ని అక్కడినుంచి ముందుగా విశాఖపట్నానికి, తర్వాత కలకత్తాకు తీసుకువెళ్లారు. కతకత్తాలో హిట్లర్ ప్రతినిధులు ఆయన మనసు మార్చడానికి అన్ని విధాలా ప్రయత్నించారు. చివరకు ఆయన్ని జర్మనీ తీసుకెళ్లారు. దండిభట్ల జర్మనీ చేరుకొన్న సమయం ఎటువంటిదంటే రెండో ప్రపంచ యుద్ధానికి రంగాన్ని సిద్ధం చేస్తున్న తరుణం!
బాంబులు తయారుచేసి రాశులు పోస్తున్నారు. అయితే నిల్వచేసే సమయంలో ఏమాత్రం వత్తిడి కలిగినా అవి పేలిపోతుండడంతో విపరీతమైన నష్టం సంభవించింది. అలా పేలకుండా నిల్వఉంచే మార్గం వారికి తోచలేదు. దండిభట్ల విశ్వనాథశాస్త్రి యజుర్వేదం నుంచి ఆ సమస్యకు పరిష్కారం సూచించారు. దాంతో దండిభట్ల పేరు మారు మోగింది. ఇక అప్పట్నించీ ఆయన పూజ్యపాదులయ్యారు.
తన శాస్త్ర పాండిత్యాన్ని ఆయన జర్మనులకు పంచి పెట్టారు. ప్రపంచ దేశాల్లో జర్మనీ అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి తనవంతు సహకారం అందించారు. జర్మనీకి వెళ్లిపోయిన తర్వాత దండిభట్ల తిరిగి భారతదేశానికి రాలేక పోయారు.
దండిభట్ల జర్మనీకి వెళ్లిన చాలాకాలం వరకు కూడా వారి సతీమణికి మూడువందల రూపాయల సొమ్ము ప్రతినెలా అందింది. అయితే చాలా కాలం తర్వాత నెలకు తొంభై రూపాయలు మాత్రమే వచ్చేవి. అంటే దండిభట్ల జీవించి ఉన్నంత కాలం ఆమెకు మూడు వందల రూపాయల వంతున అంది, ఆయన మరణం తర్వాత కుటుంబ పింఛనుగా తొంభై రూపాయల వంతున అందింది. మరి కొంత కాలానికి అది కూడా ఆగిపోయింది!
అంటే వారు అప్పటికే పరమపదించి ఉంటారని ఆయన మిత్రులు, శిష్యులు అభిప్రాయపడటం గమనార్హం.
దండిభట్ల దేశానికి దూరమైన తర్వాత దేశం, రాష్ట్రం అన్నీ ఆయన్ని మరచి పోయాయి! అయితే జర్మనులు మాత్రం ఆయన్ని తమ వాడుగా, మాననీయుడిగా, మహనీయుడిగా ఇప్పటికీ నిలుపుకోవడం విశేషం.
ఇప్పటికి జర్మనీలో విదేశాంగ శాఖ కార్యలయంలో, పార్లమెంట్ లో దండిభట్ల వారి చిత్రం ఉంటుంది.
అది మన జ్ఞానసంపద, అది మన జాతి వైభవం. అటువంటి వేదాలను, వేదా విజ్ఞానాన్ని నాశనం చెయ్యాలని ఎందరో ప్రయత్నిస్తూనే ఉన్నారు ఇప్పటికి.
గుర్తుపెట్టుకో భారతదేశం అంటే ప్రపంచానికి జ్ఞాన జ్యొతి.
ఇప్పుడు కూడా టాప్ అంతా విదేశంలొ, స్క్రాప్ అంతా మనదేశంలో.
పెరటిమొక్క వైద్యానికి పనికి రాదన్నట్టు మన సంస్కృతి, సాంప్రదాయ సిద్ధం గా ఉండే వేదాల విలువ పరాయి దేశం వాడు చెపితేగాని మనకు తెలియవు.. మన యోగా గురించి పాశ్చాత్యులు చెపితే గాని మనం నమ్మలేదు. మనకు వీపు ఉందనే విషయాన్ని మన వెనకవాడు చెపితేగాని మనం నమ్మే పరిస్థితి లో లేము. మన దేశ ఔన్నత్యం ప్రపంచానికి చాటిన ఈ మహానుభావుని గురించి చదువుతుంటే ప్రతి భారతీయునికి ఛాతీ గర్వంతో ఓ ఇంచు పెరుగుతుంది.
తెలుగు భాషకు అపారమైన పదసంపద ఉంది . మనలో చాలామందికి తెలుగులో మాట్లాడడం ,రాయడం నామోషీ . తాము వాడే కాసిన్ని మాటలు తా మనుకుంటున్న అర్థాన్ని ఇస్తున్నాయా అని తెలుసుకోవడం అవమానం. తెలిసిన పెద్దవారినీ ,నిఘంటువులనూ సంప్రదించడము అనవసరమనే విశ్వాసం . ఇవన్నిటికి తోడు మనం మాట్లాడేది కల్తీ లేని తెలుగనీ అభిప్రాయం.
ఇలా నడుస్తున్న రోజులలో వచ్చిన కరొన ప్రపంచాన్ని ఓ కుదుపు కుది పింది .
దాంతో వ్యక్తుల ఆలోచన ధో రణిలో కొంత మార్పు వచ్చింది . మన చా రిత్రక , సాంస్కృతిక మూలాలను గురించి తెలుసుకోవాలనే ఆలోచన మొదలైంది . మాతృ భాష చదవడం సరిగ్గా రాకున్న విని ఆనందించడం ,కొత్త విషయాలను తెలుసుకోవాలనే ఆరాటం అనేకవిధాలుగా విస్తరిస్తున్నది . ఇది శుభ పరిణామం .
ఈ నేపధ్యంలో తెలుగు భాషాభిమానిగా నాకు తోచిన రీతిలో తరచుగా వాడే పదాలలో కొన్నింటిని ఎంచుకొని ,వాటి వెనకున్న ఆసక్తికర అంశాలను క్లుప్తంగా తెలియచెప్పాలని ప్రయత్నించా .

ఒక ముఖ్య గమనిక . ఈ మాటల మూటలు నిత్య జీవితంలో మాటలను ప్రయోగించేటప్పుడు ,కాస్త తెలుసుకోవాలనే ఉత్సాహవంతులకోసమే గాని ,పండితులకు , కవులకు , రచయితలకోసం ఉద్దేశించినది కాదని మనవి .
ఇలాంటి విషయాలు తెలుసుకున్నప్పుడు భాష పట్ల ఆసక్తి పెరుగుతుందని ,పెరగాలని చిన్న ఆశ.
ఎక్కడినుంచి మొదలెట్టాలి అనేదే పెద్ద ప్రశ్న . మాటలమూట లు అనుకున్నాం గనుక అక్షరం నుండి మొదలెడతా .
అక్షరం అనే మాటను అక్కరం ,అచ్చరం అని కూడా అంటారు . ఇది సంస్కృత పదం . క్షరం కానిది –నశించనిది అని అర్థం . భాష అనేది ధ్వనులుగా మొదలై లిపి ఏర్పడి ,తాటాకులు ,భూర్జపత్రాలు ,రాగిరేకులు ,శిలలపై ప్రయాణం సాగించి ,కాగితాలు వరకూ సాగి, ఆ తర్వాత అనేక విధాలుగా విస్తరించింది. ఈ రకంగా భాష , సాహిత్యం కలకాలం నిలిచి ఉంటుందని ,నశించనవి అనే అర్థంలో అక్షరాలన్నారు . కొందరి అభిప్రాయంలో అ నుండి క్ష వరకున్న వర్ణమాలలోని ఆద్యంతా లను చేర్చి , అక్షరమైందని అన్నారు .
సంఖ్య లో వెల్లడించిన సమాచారం కన్నా ,అక్షరాలలో రాసిందే ప్రామా ణీకమనే మన న్యాయ వ్య వ హారాల్లో నూ , బ్యాంక్ లా వా దేవీల్లోనూ నమ్ముతారు . అందుకే దస్తావేజుల్లో , బ్యాంక్ పత్రాల్లోనూ అక్షరా లా ఇంత అనీ మళ్ళీ రాస్తారు .అంకెలను దిద్దినంత సులభంగా అక్షరాలను దిద్దలేము కదా . అదీ సంగతి.
అంతేకాదు . ఆయన మాట అక్షరాలా జరిగి తీ రాల్సిందే అన్నప్పుడు తప్పకుండా ,మార్పు లేకుండా అనే అర్థాలు అక్షరాలా కు వర్తిస్తాయి . ఇదండీ అక్షరాలా అక్షరాల కథ .

అత్తెసరు
నిఘంటువుల ప్రకారం చూస్తే ఇది అత్తు +ఎసరు అనే రెండు పదాలతో ఏర్పడ్డ సమాసం . వంటకు సంబంధించి ముఖ్యంగా బియ్యం అన్నంగా మారే ప్రక్రియ లో వాడే మాట . ఇప్పుడంటే కుక్కర్లు వచ్చాయిగానీ ,ఒకప్పడు విడిగా వండి ,గంజి వార్చడం ఒక పద్ధతి . మరో విధానంలో నీళ్ళను మరిగించి ,తగిన పాళ్ళలో కడిగిన బియ్యం వేసి ,ఉడికించడం . ఎన్ని నీళ్ళకు ఎంత బియ్యం అనేది అనుభవసారం . దీంట్లో అన్నం వార్చే పని ఉండదు . అయితే అన్నం బిరుసు గాను,పలుకుగాను ఉండకూడదు . అలా ఉంటే నీళ్ళు తగ్గినట్లు లేదా గిన్నె సరి పడిందిగా లేనట్లు . అన్నం మృదువుగా ఉండాలి . ఎక్కువగా ఉడికి ముద్దలా కారాదు . అత్తెసరు అంటే నీరు ,బియ్యం కలిసి అన్నం మాత్రమే మిగలడం అన్నమాట . దీ నికి సారూప్యంగా అత్తెసరు మార్కులు అని వాడతారు . అంటే బొటాబోటీగా సరిపోయేటట్లుగా ,పెద్ద విశేషంగా చెప్పనక్కర్లేని అని అర్థం.
ఆటవిడుపు
ఈ రోజుల్లో చదువుల్ని ఆటపాట ల రూపంలో నేర్పించాలనే పద్ధతికి ఆదరణ పె రిగింది . అదివారాలు , పండుగలు , వేడుకలప్పుడు పరీక్షల తరువాత సెలవులు ఉంటూనే ఉంటాయి . మరి వెనకటి రోజుల సంగతి ఏంటి ?అని ఆలోచిస్తే వారికీ మరో విధంగా సెలవులు ఉండేవి .అలా అడుకోవడానికి కేటాయించే సమయమే ఆటవిడుపులు . ఒకప్పుడు ఆశ్రమాలకు , గురుకులాలకు వెళ్ళి చదువుకునేవారు . అ చదువంతా చెట్ల కిందనే జరిగేది . అందువల్ల ముసురు పట్టినా ,ఆశ్రమానికి ప్రముఖులు ,గురువులు వచ్చినా సెలవులే .దాంతో బాటు పౌర్ణమి దానికి ముందు రోజు ,అమావాస్య ,దానికి ముందు రోజు ఇలా నాలుగు రోజులూ అనధ్యయనపు దినాలు .అయితే , ఆ రోజుల్లో దినమంత ఆటల్లో వృధా చేయకుండా ,కొంత చదువు , కొంత వినోదం కలిసొచ్చేలా కొన్ని కంట స్థ పద్యాలనిచ్చి నేర్చుకొమ్మనే వారు . ఇలా సాధారణంగా సుమతీ ,వేమన , కృష్ణ ,దాశరధి శతక పద్యాల నిచ్చి నేర్చుకునేలా చేసేవారు . క్రమంగా అసలర్ధం మరుగున పడిపోయింది . విశ్రాంతి ,పనిలేకపోవడం ,పని చేయకపోవడం అనే కొత్త అర్ధాలు స్తిరపడిపోయాయి .
ఇంగితం
ఇంగితం అంటే సంస్కృతంలో అభిప్రాయం అని అర్థం . ఒకప్పుడయితే నుదురు చిట్లించడం ,బొమముడి అనే అర్థంలో కూడా వాడేవారు . ఈ పదాన్ని విశేషణంగా తీ సుకుంటే చలించిన ,కదిలిన అనే అర్థాలు ఏర్పడుతాయి . నామవాచకంగా తీసుకుంటే కదలిక , చలనం ,మనోభావం ,అభిప్రాయం అనే అర్థాలు వస్తాయి .
ఇంగితజ్ఞు డు అంటే ఇతరుల అభిప్రాయం తెలుసుకోగలిగినవాడని భావం . అయితే ఇంగిత జ్ఞానం అనే మాటకే వాడు కెక్కువ ఇంగితం లేదంటే ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియని వాడ న్నమాట . పాత అర్థాల స్థానంలో కొత్త అ ర్థా లొచ్చేశాయి .
ఈసడించు
ఇది క్రియా పదం . డి క్షనరీల్లో వెతికేతే ,రోతపడు , కోపించు ,నిరసించు ఇలా ఎన్నో అర్థాలు . నేటి కాలంలో తగ్గించి , తీసివేసి ,తక్కువ చేసి మాట్లాడు అనే అర్థాలు మిగిలా యి . ఈసడించారు ,ఈసడించి మాట్లాడారు . అనేవే నేటి ప్రయోగాలు .
ఉడుం పట్టు
ఉడుం అనేది బల్లి జాతికి చెందిన ప్రాణి . పాతకాలంలో అంటే రాజరికపు రోజుల్లో సైనికులు దీన్ని పెంచి , తర్ఫీదు నిచ్చి యుద్ధాలలో ,ముట్టడులలో ఉపయోగించేవారు ఉడుం నడుముకు మోకుకట్టి ,బలంగా కోట గోడలమీదికి విసిరేవారు . దాని నాలుకకు తేనె రాసేవారు . ఏ పాటి పట్టు దొరికినా అది గోడను కరిచి పట్టుకుంటుంది . ఎంత బలంగా అంటే వేలాడే మోకును పట్టుకుని సై నికులు పైకి పాకి కోట గోడ పైభాగానికి చేరి ,లోపల్నుంచి తలుపులు తెరిచేవారు . బయటి నుండి సైన్యం లోనికి చేరి, రాజనగరును ముట్టడించి స్వాధీనం చేసుకునేవారు .

ఇప్పుడు అలాంటి అవసరాలు లేకున్నా పట్టినపట్టు వీడని ,వదలని మొండి పట్టును సూ చించడానికి ఉడుం పట్టు అనే మాటను వాడు తున్నాం .
ఊదరపెట్టు
అదే పనిగా నస పెట్టు , పొగ బెట్టు అనే అర్థం లో వాడుతాము . ఎలుకల వంటి వాటిని బయటికి వెళ్ళ గొట్టడానికి పొగబెట్టడాన్ని ఉదరబెట్టడం అంటారు . చుట్టలను , సిగరెట్లను ఒకదానికొకటి ఆ నించి నిప్పు అంటించడాన్ని ఊదరబెట్టడమంటారు . అగ్గిపెట్టలు అందుబాటులోకి వచ్చాక దీ నీ అవసరం తీ రిపోయింది . మామిడి వంటి కాయలను త్వరగా పళ్ళుగా మార్చడానికి పెట్టే పొగను ఊదర అంటారు . ఒక విషయాన్ని పదే పదే చెప్తూ ఉండ డాన్ని ఈ రోజుల్లో ఊదరపెట్టుగా అంటున్నాం
ఋ జువు
ఋ కారాన్ని పలకడం , రాయడం ఎప్పుడో మానేసాము . అయితే వినిపించే కొద్ది మాటల్లో ఎక్కువగా వినిపించే మాట ఋ జువు . సంస్కృతం లో ఈ పదానికి సత్యం , సూటి అనే అర్థాలున్నాయి . నిదర్శనం అనే అర్థం లో తెలుగులో ఉపయోగిస్తున్నాం . ఈ అర్థంలో వాడే ఈ మాట పర్షియన్ నుంచి హిందీ ద్వారా తెలుగులోకి ప్రవేశించింది .
ఎద్దు
సరే దీని గురించి తెలియనిదేవరికి ? కాబట్టి దీనికి సంభందించిన కొన్ని విషయాలు చెప్పుకుందాం . ఎద్దు అనగానే నాకు స్పెయిన్ దేశం గుర్తొస్తుంది . అక్కడ ఎద్దుల్ని రెచ్చగొట్టి ,వాటితో పొడిపించుకుంటూ ,తొక్కించుకుంటూ ఆడే ,ఆడించే Bull Fighting ఆటను జనాలు వెర్రెత్తినట్లు ఆ డుతారు . ఎ ద్దులమీద కుక్కల్ని ఉసిగొల్పి ,బుల్ రింగ్ లో ఆడించే ఆట కూడా కొన్ని ప్రాంతాల్లో ఉంది .

పూర్వం వేటాడడానికి ఎద్దుల్ని ఎరగా చూపించి , సింహల్ని , పులులని వేటాడేవారు . దుక్కిటె ద్దుని హాలికం అని ,బండికి కట్టే ఎద్దుని అన ద్యాహమ్ అనీ అంటారు . సాధు ఎద్దుని గంగిరెద్దు అంటారు .
నంద్యాల , నందిగామ , మహానంది వంటి గ్రామాలు మనకు ఎద్దులకూ ఉన్న అనుభందాన్ని గుర్తు చేస్తాయి .
ఏ బ్రాసి
ఈ మాటను రోత మనిషి , అమాయకుడు , చేతగానివాడు మొదలైన అర్థాల్లో ఉపయోగిస్తారు . అసహ్యమైన వ్యక్తి అనే అర్థంలో సంస్కృతంలో ఏభ్య రాశి అనే పదం ఉంది . ఈ మాట నుంచి ఏర్పడ్డ తెలుగు పద్యం ఏబ్రాసి . ఏబ్రాసి వెధవ ,ఏబ్రాసిగాడు అనే వ్యవహారం
ఐ రావతం
ఐ రావతం అంటే భా రీ కాయంతో తెల్లటి మేని ఛాయ తో ,మెరి సి పోయే ఏనుగు . ఇది క్షీర సాగర మధనంలో పుట్టింది . ఇo ద్రు నికి వాహనం . దీ న్ని మేఘాల ఏనుగు ,సూర్యుని సోదరుడు అని కూడా పిలుస్తారు . మాతంగ లీల అనే గ్రంధం ప్రకారం బ్రహ్మ వరంతో 8 మగ 8 ఆడ ఏనుగులు పుట్టాయి . మగ ఏనుగులకు ప్రతినిధి ఐ రావతం .
జైన ,బౌద్ధ మతాలలో కూడా ఐ రావతం ప్రస్తావన ఉంది . థా య్ లాండ్ ,లావోస్ వంటి దేశాలలో దీన్ని ఆరాధిస్తారు . అక్కడి ప్రాచీన రాజ్యాల పతాకాలమీద మూడు తొండములతో ఉండే ఐ రావతం బొమ్మ చిత్రించబడి ఉంటుంది
ఒంటికంటి రామలింగం
ఓ అనగానే నాకు ఒంటికంటి రామలింగం గుర్తొస్తాడు . ఆయనెవరు ? అని ఆడక్కండి . నాకూ తెలీదు . ఇంకోలా చెప్పాలంటే ఎవరైనా కావచ్చు . ఎందుకంటే ఇక్కడ రామలింగం అనే మాట పేరులా కాక ఒక గుణా నికి ,స్వభావానికి ప్రతీకగా చెప్పుకుంటున్నాం . ఒంటి కన్ను అంటే ఒక కన్నున్న వాడని గాక ఇతరుల సుఖశాంతులను చూసి ఓర్వలేని వాడని అర్థం .అసూయపరుడిని ఒంటికంటి రామలింగం అని సంభో ధిస్తూంటారు

ఓంకారం
ఓ అనగానే ఓంకా రం మెదులుతుంది మదిలో . ఇది అకార ,ఉకార ,మకారాల సమ్మేళనం . సృష్టిలో మొదట వినబడ్డ శబ్దం ఓమ్ . దీన్ని పదేపదే జపించడం వల్ల శరీరంలో ప్రాణవాయువు శా తం పెరుగుతుంది .కంఠ నాళంలోని అడ్డంకులను తొలగిస్తుంది . స్పష్టమైన ఉచ్చారణకు తోడ్పడుతుంది . సనాతన హిందూ ధర్మంలో ఓంకారా నికి ఎంతో ప్రాముఖ్యత ఉంది . పరమశివుని నాద రూపమే ఓంకారం . వేద సారం ఓంకారం. ఓమ్ అనేది ఏకాక్షర మంత్రం . ఇది కేవలం ఒక మతానికి సంబంధించినది కాదు .
నిత్యం సాధన చేయడం వల్ల రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది .. మానసిక అలసట తగ్గి ప్రశాంతత కలుగుతుంది. దీన్ని జపించే సమయంలో వచ్చే ప్రకంపనలు మన నాడీ వ్యవస్థ పై పాజిటివ్ ప్రభావాన్ని చూపుతాయి . ఏకాగ్రత మెరుగుపడుతుంది .
ఔచిత్యం
నీవు చెప్పిన మాట ఔచిత్యం గా లేదు. పెద్ద మనుషులున్నప్పుడు ఔచిత్యంగా మాట్లా డా లని తెలీదూ అంటూ ఔచిత్యం ప్రదర్శిస్తూ ఉంటాం . కానీ నిఘంటువులలో ఉచితత్వం , యోగ్యత ,సత్యమనే అర్థాలే ఉన్నాయి . తగినవిధంగా ,యుక్తంగా ,యోగ్యతగా అనే అర్థాల్లోనే వాడుతున్నాం . సందర్భానికి తగినట్లు మాట్లాడుట ,ప్రవర్తించుట అనే సందర్భంగా ప్రస్తుతం వాడుతున్నాం .
అం –అః
0 ( అః వీటిని వ్యాకరణ పరిభాషలో ఉభయాక్షరాలు అంటారు . ప్రస్తుతం బండి ఱ ను , అరసున్న ను వాడుకలోంచీ పక్కకు జరిపేసాము . మిగిలిన రెంటికీ విడిగా ప్రయోగం లేదు .
అంబరం అంటే ఆకాశం సాధారణ అర్థం . అయితే దిగంబరుడు అంటే దిక్కులే అంబరంగా కలవాడు అని అర్థం చెప్పుకుంటాం . ఇక్కడ అంబరంఅంటే వస్త్రం . నిఘంటువుల్లో దీనికి దూది , అనుస్వారం అనే అర్థాలను ఇచ్చారు .
అంతఃపురం
విసర్గ కు సంస్కృతంలో బోలెడన్ని ఉదాహరణలు దొరుకుతాయి . తెలుగులో విసర్గ అనగానే టక్కున గుర్తొచ్చే పదము అంతఃపురం . రాజుగారికి సంభంధించిన స్త్రీలు ఉండే ప్రాంతం అని అర్థం . రాణివాసం అని కూడా అనవచ్చు గానీ మనకు అంతఃపురమే నచ్చుతుంది ..
ఇ దండీ అచ్చంగా అచ్చులే చిరు వ్యాసం. కేవలం వ్యాకరణ పరిభాషలో కాకుండా కాసింత ఉప్పు , పులుపు ,కారం కలిపి గుచ్చెత్తి , వండి వార్చిన వంటకం .

మన ఇళ్లల్లో వేడుక ,పండుగ ,పర్వం, శుభకార్యం ఏదైనా తోరణాలు కట్టడంతోనే మొదలవుతాయి . తోరణాలు పంది ళ్ళతో ఇంటికి కొత్త అందం వచ్చి చేరుతుంది . సంబరాలను వెంట తీసుకొని వచ్చేవే తోరణాలు. అంతెందుకు వీధిలో అలా నడిచి వెళ్తున్నప్పుడు ,ఏ గుమ్మానికో మామిడాకుల తోరణం కనిపిస్తే చాలు, వీరి ఇంట్లో ఏదో శుభకార్యం జరుగుతున్నట్టుంది అనుకుంటారు దారి ని పోయేవారు . అది తోరణ మహా త్యం. ఇందులో ఇంకొక విశేషం ఉంది .మన అలవాటులో తోరణం అంటే మామిడాకులదే.
అసలు తోరణాలు ఎందుకు ?వాటికి మామిడాకులే ఎందుకు? అని ఆలోచిస్తున్నారు కదూ ! నేను అలానే అనుకున్నా సుమండీ . అనుకోవడంతో ఊరుకోలేదు .జవాబు కోసం ప్రయత్నించా. ఆ వివరాలు క్లుప్తంగా మీకోసం .
ఒకప్పుడు తోరణాలు అంటే ముఖద్వారానికి మామిడాకులను ఓ పు రి కొ సతో బంధించడమే. ఇప్పుడు కాలం మారింది. వస్తువులో , విధానాల్లో ,వైవిధ్యం చోటు చేసుకున్నది. రంగురంగులతోరణాలు రాజ్యమేలుతున్నాయి .పండగల సీజన్ మొదలైంది గా యూట్యూబ్ లో వేలెట్టండి .ఇంకేముంది వందలాది ఉపాయాలు .వేలాది లైకులు . మూడు పువ్వులు ఆరు కాయలుగా విభిన్నతకు అర్థం చెప్పే కంటెంట్లు .
ప్రసిద్ధ ప్రాచీన దేవాలయాల గురించి ఓ మంచి మాట చెప్తుంటారు పెద్దలు .నిత్య కళ్యాణం పచ్చతోరణం అని అంటే ఆ .దేవాలయంలో సంవత్సరం పొడుగునా స్వామివారికి కళ్యాణం జరుగుతూనే ఉంటుందన్నమాట .ముహూర్తాలు సరైనవి దొరక్కపోయినా ,కుటుంబ పరమైన సమస్యలు ఎదురైనా ,చాలామంది పుణ్యక్షేత్రానికి వెళ్లి పెళ్లి చేస్తారు. స్వామివారి కల్యాణం జరిగినందువలన అక్కడ విడిగా వధూవరుల జాతకం ఆధారంగా ముహూర్తాలు పెట్టకున్న, పెట్టిన దానిలో ఏవైనా దోషాలు ఉన్నా, స్వామి అనుగ్రహంతో తొలగిపోతాయన్నమాట.
సరే ఇప్పుడు మనకు బాగా తెలిసిన మామిడి తోరణాల దగ్గరికి రండి .
జ్యోతిశ్శాస్త్రం లో మామిడి ఆకులను అంగారక గ్రహానికి కారకంగా చెప్తారు. అందుకే వేడుక ఏదైనా మావిడాకులని వాడుతారు . చెట్లు ,మొక్కలను పూజించడం మన సంస్కృతిలో ఒక భాగం .దీనికి గొప్ప ఉదాహరణ కార్తీకం లో ఉసిరి చెట్టును, క్షీరాబ్ది ద్వాదశి కి తులసి పూజను చేయడం ఇంకా మిగిలి ఉన్న సంప్రదాయం.
మామిడి చెట్టు, దాని భాగాలు అనేక విధాలుగా మన సంస్కృతిలో భాగం . ఒకప్పుడు తోట ఉంది అంటే చాలు మామిడి తోటనా అని మొదటి ప్రశ్న ,మామిడి చెట్లు ఎన్ని ఉన్నాయి ?అనేది రెండవ ప్రశ్నగా అడిగేవారు. మామిడి చెట్లు ఆర్థిక వనరులకు చిహ్నం ఒకప్పుడు . మామిడి చెట్టు ఆకులు, లేత చిగుళ్ళు ,పళ్ళు, కాయలు, బెరడు అన్ని ఆయుర్వేదంలో , గృహవైద్యంలో ఉపయోగకారులు .మామిడి ఆకులను తోరణాలుగా మాత్రమే కాక, కలశం లోను వాడుతా రు .అవి దొరక్కపోతేనే తమలపాకులను ఉపయోగిస్తారు .
మామిడాకుల తోరణాల వెనకున్న నమ్మకాలను గురించి కాస్త చెప్పుకుందాం.
మామిడాకులను తోరణాలుగా వేలాడదీయడం వల్ల, ఇంటికి చెడు దృష్టి నుండి రక్షణ, సానుకూల శక్తికి ఆహ్వానం అనేది ఓ ముఖ్యమైన నమ్మకం. ఈ తోరణాల వల్ల ఇంట్లోకి ధనలక్ష్మి తో పాటు సకల దేవతా పరివారం వస్తారని పండితులఉ వాచ .
ఈ ఆకుల్లోంచి విడుదలయ్యే ప్రాణవాయువు వాతావరణాన్ని స్వచ్ఛంగా ఉంచుతుంది . తోరణాలు ఎక్కువమంది గుమికుడినప్పుడు ,ఎదురయ్యే మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి .ప్రధాన ద్వారం పైన కట్టినప్పుడు ఆ ఇంట్లోని వాస్తు దోషం పోతుందని ఒక విశ్వాసం . వెనకటి రోజుల్లో గ్రామాల్లో బావిలోకి దిగి, శుభ్రం చేయవలసిన సమయంలో ,ఎక్కువ ఆకులు ఉన్న మామిడి కొమ్మను బావిలోకి చుట్టూ కొంత సేపు తిప్పమని చెప్పే వారు . దాంతో బావిలోని విషవాయువులు తొలగిపోతాయట .ఇది నిరూపించబడింది కూడా .
మామిడి ఆకులలో ఒక ఆహ్లాదకరమైన సువాసన ఉంటుంది అందువలన తోరణాల పరిసరాలు సువాసన , తాజాదనంతో నిండి ఉంటాయి.
మామిడి ,జువ్వి , రావి , మర్రి , ఉత్తరేణి ఈఐదు చెట్ల ఆకులను పంచ పల్లవాలంటారు .వీటిని శుభకార్యాల్లో వాడుతారు .అయితే తోరణం లో నిలిచేది మాత్రం మావిడే . యజ్ఞయాగాదుల లో మామిడి ఆకులను వాడి ధ్వజారోహణం చేయడం సంప్రదాయం .ధ్వజారోహణం అంటే దేవతలకు ఆహ్వానంపంపడమే. మావిడాకులు అంటే దేవతలకు ఇష్టమేనన్న మాట .
శివపార్వతుల కళ్యాణం మామిడి చెట్టు కిందనే జరిగిందని , అందుకే శుభకార్యాలలో మామిడి ఆకులను ఉపయోగిస్తారని పెద్దవారంటారు .
ఇంకో ముఖ్య విషయం ఇక్కడ తప్పక చెప్పుకోవాలి . మన వైపు పెద్ద పండుగలు ,ఉత్సవాలు ఎక్కువగా సంవత్సరంలోని రెండో భాగంలోనే వస్తాయి .దీనికి మామిడి తోరణానికి సంబంధం ఏంటా అని ఆలోచిస్తున్నారా ? మామిడి పూత సాధారణంగా శీతాకాలం చివరలో మొదలవుతుంది . వేసవిలో కాత మొదలవుతుంది. కత్తిరింపు మొక్క బలంగా పెరగడానికి సహాయపడుతుందని మీకందరికీ తెలుసు కదా! అయినా ఈ విషయం తెలుసుకోవడానికి వృక్షశాస్త్రజ్ఞుని వరకు వెళ్ళనక్కరలేదు . ఏ తోటమాలి అయినా చెప్తాడు .పండుగలప్పుడు మామిడి తోరణాలను కట్టడానికి ఇదొక మంచి కారణం .
ఈ కారణాలన్నింటినీ విస్తృతంగా అధ్యయనం చేయకున్నా సంప్రదాయ పద్ధతుల ఆధారంగా తరతరాలుగా జనం ఆచరిస్తున్నారు . విశ్వసిస్తున్నారు కూడా.
తోరణాల గురించి ఇన్ని మాటలు చెప్పుకుని ఆగిపోతే అది అసంపూర్తి అవుతుంది .తోరణం అనగానే మామిడి ఆకుల తర్వాత గుర్తొచ్చేవి కాకతీయ శిలా తోరణాలు . అందమైన ఈ తోరణాలు మన శిల్పుల నైపుణ్యానికి సజీవ సాక్ష్యాలు .వీటిని తోరణ ద్వారాలు ,తోరణాస్తంభాలు, కీర్తితో రణాలు ,హంస ద్వారాలు ఇలా రకరకాలుగా చరిత్రలో పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్వహించే అన్ని ప్రధాన కార్యక్రమాల్లో దాదాపుగా కనిపించే నమూనా స్వాగత దారాలు ఇక్కడివే .
వరంగల్ కోటలో ఈ కీర్తి తోరణాలు నాలుగు ఉన్నాయి . నాలుగూ వేర్వేరు రాజుల కాలంలో నిర్మించబడినా ఆ తేడాలను మన చూపులు పట్టుకోలేవు. వీటిపై అధోముఖ పద్మాలు, హంసలు అందంగా అమిరాయి . కోటలోని అపార సంపదను , శత్రువులు దోచినా ఈ అమూల్య సంపద మనకు దక్కింది .చూసేవారికి రాచహోదాను , ఆత్మవిశ్వాసాన్ని నేటికీ అందిస్తున్నాయి . ఇవి యుద్ధాల్లో సాధించిన గెలుపును తెలిపే విజయ చిహ్నాలు అని చరిత్రకారుల వివరణ .మన బోటి సామాన్యులకు తోరణం అంటే నెగిటివ్ ఎనర్జీతో , చెడు దృష్టితో , చెడుగాలితో రణమే . పోరాటమే .దాన్ని ఎదుర్కోవడానికి తోరణాలను కడదాము . ఆ సువాసనలను ,ప్రాణ శక్తిని మనసారా జీవితాల్లోకి ఆహ్వానిద్దాం .
మనిషికి ఇల్లే ప్రపంచం. ఎవరి ఇల్లు వారికి ఇష్టం. ఇల్లు ఇంద్రభవనం కాకపోవచ్చు. అది ఒక ప్రేమ సౌధం.. సేదతీర్చి ఊరట కలిగించే ఒయాసిస్సు. అందులోని ప్రతి నివాసికి ఇది అచ్చంమైన హృదయ లోగిలి. మనసు ఊసులకు కోవెల… మనిషికి భౌతిక చిరునామా. స్మృతుల భాండాగారం. ‘మన’ అనే ‘కణాలను’ పేర్చి కూర్చిన గూడు. చీమకు పుట్టలా, పిట్టకు గూడులా.. జీవి జీవికో తీరైన నివాసం. అలాగే పుట్టిన ప్రతి మనిషీ తనకంటూ సృష్టించుకున్న ఓ ‘సొంత నివాసం’. అదే మనిషి పేరుకు ముందు ‘ఇంటి పేరు’ లాగా ఒక ప్రత్యేక గుర్తింపును ఆపాదించేది. ఎంతటి కష్టాన్నైనా, దిగులునైనా, అలసటనైనా అవలీలగా మరిపించి అవసరమైన ప్రశాంతతనొనగూర్చే మందిరం. ఇల్లు ఇల్లే… దానికదే ప్రత్యేకం. ఇల్లుకు లేదు ప్రత్యామ్నాయం! ముందర వాకిలి ఇంటికి ముఖ వర్చస్సు. మమతలు పొదిగిన తోరణాలతో కళకళలాడుతూ పన్నీరు పరిమళించే పచ్చదనాల లోగిలి. సదా నూతనత్వంతో విరాజిల్లే వేవేల దృశ్యాదృశ్యాల ఆప్యాయతల నివాసం.
ఇల్లు ఒక సంస్కృతి!
పెళ్లైన పిదప ఆడపిల్లలు తమ పుట్టింట్లో అతిథిగా మారినా, సనాతన సంస్కృతి అనుసారం, క్రమేణ తమ అత్తవారి ఇంటినే సొంత ఇల్లుగా తీర్చి దిద్దుకుంటారు. అలా కాని పక్షంలో, వారికి ఏ ఇల్లు ఉన్నట్టు? ఎప్పటికీ పుట్టింటిపై మమకారం వదలుకోలేని స్త్రీకి, తనలా తను ఉండడానికి, తనకు నచ్చినట్లు నడుచుకోవడానికి, స్వేచ్ఛగా బ్రతకడానికి చేసే ప్రయత్నంలో కొన్ని తాత్కాలిక ఇబ్బందులు ఎదురు కావచ్చు. కాని అది జీవన్మరణ సమస్య కాకపోవచ్చు. వారు కోరుకునే చిన్న చిన్న ఆనందాలు దక్కడం లేదనో, ఇతరులు రెచ్చగొట్టడం వలననో, తమకంటూ ప్రత్యేకంగా ఒక ఇల్లు ఉండాలనే ఆశతో బయటకు వచ్చి వేరే కుంపటి ఆలోచన చేయవచ్చు. అలా విడిపోవాల్సి వచ్చిన ఆడ వారే ‘ఇల్లు’ అనే సంస్కృతికి ఊపిరి పోయగలరు. తమకంటూ ఒక ‘ఇంటిని’ తయారు చేసుకోగల సమర్థులు. గురజాడ వారు అన్నట్లు, ‘స్త్రీలు తమను తామే సంస్కరించుకోవాలి’ అన్నది పరమ సత్యం. ఆ సంస్కరణలో ప్రథమ భాగమే మరో ‘ఇల్లు’కు రూపకల్పన. ఎవరి జీవితం వారి చేతిలోనే ఉంటుంది తప్ప తక్కిన సమాజం అంతా ప్రేక్షకులే కదా!
మనిషి ఎక్కడెక్కడ వెళ్లినా..
ప్రపంచ నలుమూలల్లో మనిషి ఏ పని మీదైనా ఎక్కడెక్కడ వెళ్లినా, ఎంత కాలం వెళ్లినా, ఐదు నక్షత్రాల అధునాతన వసతి గృహంలో బస చేసినా.. తిరిగి మళ్లీ మళ్లీ చేరుకోవాలనుకునే ఏకైక ప్రియ నివాసం ఇల్లు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇంటికి చేరుకోవాలనే తపన దాదాపు ప్రతి మనిషికి ఉంటుంది. ‘హమ్మయ్య! ఎలాగైతేనేం.. చివరికి ఇల్లు చేరుకున్నాం!’… ఒక గొప్ప ‘స్వంత గూటి’ భావన. ‘ఈస్ట్ ఆర్ వెస్ట్, హోమ్ ఈజ్ బెస్ట్!’ అని అందుకే అంటారేమో. ఎంత చిన్నదైనా ప్రతి మనిషికి ఆ ఇల్లే తొలి స్మృతుల ప్రపంచం. అదొక జ్ఞాపకాల ఖజానా! సంస్కృతుల నమూనా! బాల్య బంధాల ఒడి. ఎవరి ఇల్లు వారికి అందమైన ప్రపంచం. ఇంటింటికో ప్రత్యేకత. ప్రతి ఇల్లు ఓ అనిర్వచనీయ అనుభూతుల ఆలయం. రాళ్లు, మట్టి, ఇటుకలు, కట్టెలతో కట్టినదే కాదు, ప్రేమ బంధాలతో నిర్మించినది.. అనురాగపు నగిషీలు చెక్కుకొని, మమతల మాలికలతో అల్లుకొని పెనవేసుకొన్న కుటుంబానికి కేంద్రం ఇల్లు. శరీరానికి ఆత్మలా, ప్రతి కుటుంబానికి ఓ ప్రత్యేక గుర్తింపుగా మనగలిగేది ఇల్లు. మనిషికి అదొక మానసిక సౌధం! మనకు ‘మనం’గా, ‘మనమే’గా ఉండగల్గే మహా ఆవాసం. మన ఇంట్లో మనం నటించం. కృత్రిమ మెరుపులను తోసిరాజని నిత్యం నిజ స్వరూప ప్రదర్శనమే! రెండవ వ్యక్తి ప్రవేశంతో ప్రారంభమైన నటన, మూడవ వ్యక్తి సమక్షంలో కాస్త విజృంభించి పాకాన పడుతుంది. ఇంటి గడప దాటితే చాలు మనసులో ఏమున్నా బహిర్గతం కానివ్వం. మనిషికి నటించడం ఒక కళ. బయట ప్రపంచంలో బ్రతకడానికి అవసరమేమో ఈ కళ! సాధారణంగా ఎదుటి వ్యక్తిని బట్టి, ప్రతి మనిషి గుణానికి కొలతలు మారుతూ ఉంటాయి. కొత్త రంగులు పులుముకుంటాయి. ఎక్కువ కాకున్నా, తనను తాను తక్కువ చేసుకోకుండా ఉండే ప్రయత్నంలో ఇలాంటి మార్పులు చోటుచేసుకుంటాయి. మెరిసేదంతా బంగారం కానట్లు, బయట ప్రపంచానికి మనం అగుపించే తీరు అంతా నిజానికి బహుదూరం!
జీవితంలో స్థిరపడాల్సిన ప్రతి మనిషికి ఇల్లు ఒక ప్రాథమిక అవసరం. అందుకే దీనికి హృదయంలో ఒక ప్రత్యేక స్థానం. ఎక్కడున్నా, ఇల్లు ప్రస్తావన రాగానే హృదయంలో ఒక వెచ్చదనంతో కూడిన ఆప్యాయత అలుముకుంటుంది. సానుకూల శక్తులను పులుముకుంటుంది. చైతన్యాన్ని ప్రేరేపిస్తుంది. ఇంటిలోని ప్రతి ఇంచుతో మనిషికి కొన్ని జ్ఞాపకాలు ముడిపడి ఉంటాయి. అవి హృదయ కవాటాలపై అంతర్లీనంగా చిత్రించబడిన చిత్రలేఖనాలై చెక్కు చెదరకుండా నిక్షిప్తమై ఉంటాయి. మనిషి మనసులో ఇంటికి ఎప్పుడూ ఉన్నత స్థానమే!
ఇల్లు అనేది…
ఇల్లంటే నాలుగు గోడలపై పరిచిన ‘కప్పు’ కాదు.. అది మనిషి జీవితం. ఒక ప్రదేశం కాదు.. ఒక భావన. కేవలం ఆకలి తీర్చే భోజన శాల కాదు. సుఖాల్ని మాత్రమే ఇచ్చే వసతి కాదు. అది జీవిత ధర్మాన్ని ఓనమాలతో నేర్పించే పాఠశాల. సంసార యజ్ఞాన్ని సజావుగా చేయించే యాగశాల. అంతఃశక్తినిచ్చే ధ్యాన మందిరం. జ్ఞానోదయాన్ని ప్రసాదించే బోధి వృక్షం. రక్షణలో అమ్మ ఒడికి సమాంతరం, మోక్షానికి ముఖద్వారం. గర్భగుడికి పర్యాయం. అందుకే అంటారు.. ఆదర్శ గృహస్థుడే మహా ఋషికి మారు పేరని!
వెల కట్టడానికి ఇల్లు అనేది ఒక ఆస్తి కాదు, మనిషి జీవితంలో నెరవేర్చుకోవాల్సిన విలువలతో కూడిన బాధ్యత. అది మనిషిని కదలకుండా ఒక చోట కట్టి పడేసే ‘గుంజ’ కాదు, స్థిరత్వాన్ని ఆపాదించే దివ్యమైన ‘లంగరు’. అభివృద్ధికి అడ్డంగా నిలిచే ‘గుదిబండ’ కాదు.. అంతిమ ఘడియ దాకా అండగా ఉండే చైతన్య దీపిక.
ఇల్లు ఎంత చిన్నది, పెద్దదని కాదు, ఇంట్లో ఎంత సంతోషంగా ఉన్నామన్నదే పరమ విషయం. సంతోషంగా జీవించడమే కాదు, తోటివారికి ఎంత సంతోషాన్ని పంచుతూ జీవిస్తున్నామనేది ప్రథమం. ప్రతి మనిషికి తన ఇల్లే దేవాలయం.. అందులో కొలువుండే దేవతలు అమ్మానాన్నలు. అప్పుడు గృహమే కదా స్వర్గసీమ!
ఇంటితో అనుబంధం.. అందమైన బలహీనత!
మనిషికుండే అన్ని బలహీనతలకు ప్రధాన కారణం ‘బంధం’. సాధారణంగా అది ఏర్పడేది మనిషితోనో, వస్తువుతోనో లేక వ్యవస్థతోనో కావచ్చు. అలాంటి బంధం తన ఇల్లుతో ఏర్పడితే, అది బలహీనతైనా అందమైనదే! ఇది జీవితాంతం వదులుకోలేని అందమైన బంధం. అప్పుడప్పుడు కొన్ని బలహీనతలు అందంగానూ, అద్భుతంగానూ ఉంటాయి. వాటిల్లో ఇది ఒకటి. ఇల్లును అంటిపెట్టుకుని ఉన్నవారు కన్నవారిని గౌరవించడంతో పాటు కట్టుకున్న ఇల్లాలిని గుండెల్లో పెట్టుకున్నట్లే! అందుకే ప్రతి ఇల్లు ఒక అనురాగ నిలయానికి ప్రతీక.. మనిషి జీవన వృత్తానికి కేంద్ర బిందువు. ఇల్లంటే.. భౌతికంగా ఒక నిర్మాణమే కాదు, ఆశలు, కలలు, జ్ఞాపకాలతో నిత్యం నినదిస్తూ ఉండే నిండైన స్థలం. అందుకే మనిషికి ఇంటితో పటిష్టమైన అనుబంధం. మనిషి ఎదుగుదలకు అదే పిల్ల వేరు, తల్లి వేరు!
పాతుకున్న చోటే చెట్టుకు మట్టితో అనుబంధం. అదే నాభి బంధం. వేళ్ళతో సహా కదిలించి మరో చోటికి తరలించి ఎంత మంచి మట్టిలో పాతినా ఆ చెట్టు అంతగా ఎదగడంలో రాణించదు. అమ్మను మార్చడం ప్రాకృతం కాదు వికృతం! అలాంటిదే ఇంటికీ మనిషికీ ఉన్న అనుబంధం. ఏ మనిషీ భావోద్వేగాలకు అతీతం కాదు. అవి సర్వసాధారణం. శారీరకంగా హార్మోన్లలో కొన్ని మార్పులు సంభవించినా మానసికంగా ప్రతిబింబించే అనుభవం ప్రస్ఫుటం. అదొక మానసిక వైఖరి, రుగ్మత కాదు. ఒకానొక పరిస్థితిపై ప్రతిబింబించే అంతర స్పందన.. అనుభూతి చెందే విధానం!
ఇంటితో అనుబంధం ఎవరైనా పెంచుకుంటారు. ఇంటితోనే గాక చుట్టూ పరిసరాల్లో ఉన్న ఇరుగు పొరుగుతో ముడి వేసుకున్న భావోద్వేగానుబంధాలు మన భావి జీవితంతోనూ లోతుగా పెనవేసుకొని ఉంటాయి. మన ఆలోచనలు ఎప్పుడూ ఆ ఇంటి గోడల లోపల ఏదో తెలియని భద్రత, వెచ్చదనం మరియు సుపరిచిత విషయాల చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాయనేది నగ్న సత్యం. స్వేచ్ఛ కోసం వెతుకుతున్నప్పుడు ఇల్లు తప్ప మనిషికి మరేదీ స్ఫురణకు రాదు. సర్టెన్లీ హోమ్ ఈజ్ ఏ ప్లేస్ ఆఫ్ యునీక్ అటాచ్మెంట్! అందులోనే మనిషికి సుఖం, సంతోషం మరియు సురక్షితం!
ఇంటికున్న విలువను బేరీజు వెయ్యలేం! ఇల్లుకు వీడ్కోలూ చెప్పలేం!! ఎందుకంటే అది భావోద్వేగాలకు పెట్టుబడి (ఎమోషనల్ ఇన్వెస్ట్మెంట్), హృదయాలాపనలకు అనువైన ఒడి, వ్యక్తిగత విలువలకు కవచ కుండలం. అక్కడి పరిస్థితులన్నీ చిర పరిచితాలు, సౌకర్యాలన్నీ ప్రియ నేస్తాలు. మనిషి ఇంటికి భౌతికంగా దూరం కావచ్చు, కాని ఇల్లు మనిషి నుండి మానసికంగా కాదు. ఇంటితో అనుబంధం.. జన్మతో బంధం. అది అంత సులభం కాదు తెంచు కోవడం. అది బలమో, బలహీనతో.. అంత ఇదమిత్థంగా చెప్పడం కష్టం.
మనిషి మనిషికి ఒక ఇల్లు!
ఇల్లంటే గోడలు, తలుపులు ఉన్న భౌతిక ఆవరణ కాదు. మన తలపుల్లో అనుక్షణం ఆవరించే ఓ భావన… ఒక మానసిక సౌధం. మనశ్శాంతికి మరో భౌతిక రూపం ఇల్లు. అమ్మ కడుపులో ఉన్నంత సౌకర్యాన్ని తలపించే ఏకైక నివాసం. పురిటిల్లుకు ప్రతిరూపం. మన గురించి సంపూర్ణంగా విప్పి చెప్పేది ఇల్లు. మేడల్ని, మిద్దెల్ని తలదన్నక పోయినా, మనిషిగా మన ఉనికికి అర్థాన్ని, పరమార్థాన్ని కల్పించేది ఇల్లు.
ఎక్కడ ప్రేమ ఉంటుందో, అక్కడే అసలైన ఇల్లు ఉంటుంది. ఎక్కడ హృదయం ఉంటుందో అక్కడే ప్రేమ ఉంటుంది. అందుకే అంటారు.. హృదయమే ఇల్లు, ఇల్లే హృదయమని! మనల్ని ప్రేమించే వారు మన ఇంటినీ ప్రేమిస్తారు. ప్రేమించే చోటనే ఇల్లు ఉంటే, మన పాదాలు విడిచి వెళ్లినా, ఆ ఇంటిని మన హృదయాలు విడిచి వెళ్లవు. ఎందుకంటే ఒక ఇల్లు లాంటిది మరొకటి ఉండదు కనుక. అది ఒక స్థలం కాదు.. ఒక అనుభూతి. మనిషి ప్రపంచం అంతా తిరిగి ఎక్కడ గాలించినా దొరకనిది ఇంట్లో మాత్రమే దొరుకుతుంది. జీవించినంత కాలం ప్రతి జీవికి ప్రకృతి నిర్దేశించిన అతి ప్రియమైన గమ్యం ఒక్కటే.. ‘ఇల్లు’.
మీ ఇల్లంటే మీకు ఇష్టమేనా?
ఎంతో ఇష్టంతో, శ్రమతో, శ్రద్ధతో కష్టార్జితాన్నంతా వెచ్చించి నిర్మించుకున్న ఇల్లు, పిల్లలు పురుడు బోసుకున్న నాటి నుండి వారితో పాటు కలిసి ఆటలు, చదువులు, పండుగలు, శుభకార్యాలు జరుపుకున్న ఇల్లు, ఎన్నో కష్టసుఖాలు, తీపి చేదులు పంచుకున్న ఇల్లు, ఏళ్ల తరబడి బంధువులకు, స్నేహితులకు ఆతిథ్యం ఇచ్చిన ఇల్లు. ఎన్నో సందర్భాల్లో పెద్దలు దర్శించి దీవెనలు అందించిన ఇల్లు, ఇంటిల్లిపాదికీ ఎంతో తృప్తినీ, ఆనందాన్నీ కలిగించి, ఎన్నో తీయని అనుభూతుల్ని ఇచ్చిన ఇల్లు… ‘అలాంటి మీ ఇల్లంటే మీకు ఇష్టమేనా?’ ఈ ప్రశ్నను జాతి, కుల, మత, భాష, దేశాల తేడా లేకుండా ప్రపంచం మొత్తం జనాభాలో ఎవరిని ఎప్పుడు అడిగినా ‘అవును, ఇష్టమే!’ అనే సమాధానమే నమ్మకంగా వస్తుంది.
‘రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఏ డే!’ రోమ్ పట్టణ నిర్మాణానికి శతాబ్దాల కాలం పట్టిందని చరిత్ర చెబుతోంది. అలాగే ఇల్లు అనేది ఒక్క రోజులో నిర్మించుకునేది కాదు. దాని నిర్మాణం ఒక మనిషి జీవిత కాలం! ప్రపంచంలోని మనుషులందరికి రోమ్ ఒక్కటే.. ఇల్లు మాత్రం మనిషికి ఒక్కటి! ప్రాణం పోయాక ఎక్కడికి వెళతాడో తెలియదు కానీ మరణం దాకా మాత్రం ఆ మనిషికి చిరునామా ఈ ఇల్లే.
“నేనొక దుర్గం! నాదొక స్వర్గం!
అనర్గళం, అనితరసాధ్యం నా మార్గం;”
“1930 దాకా తెలుగు సాహిత్యం నన్ను నడిపించింది. ఆ తర్వాత నుంచీ దాన్ని నేను నడిపిస్తున్నాను. తెలుగు సాహిత్యానికి సంబంధించినంత వరకు ఈ శతాబ్దం నాది” అంటూ తన అక్షర ప్రభావ ప్రస్థానపు ఆత్మవిశ్వాసాన్ని ప్రకటించారు శ్రీ శ్రీ. ప్రపంచం ఆర్థిక మాంద్యంతో తల్లడిల్లి ఆకలితో అలమటిస్తున్న 1930-1940 మధ్యకాలంలో సామాన్యుల వ్యథలను నవీనత్వంతో వ్యక్తపరుస్తూ, సామాజిక వాస్తవికతకు దర్పణం పట్టేలా రాసిన శ్రీ శ్రీ మహాప్రస్థానం గేయాలు పుస్తక రూపం దాల్చింది 1950లో. ఆ పుస్తక ప్రభ, అందులోని కవిత్వపు శోభ 75 వసంతాలైనా ఇంకా నేటి ఆధునిక ప్రపంచానికి రిలవెంట్గానే వుంది.
నేటికీ శ్రీ శ్రీ పేరు మీద ఎన్నో సామాజిక, సాహిత్య స్వచ్ఛంద సంస్థలు నవసమాజ నిర్మాణం కోసం అంతర్జాతీయ స్థాయిలో పనిచేస్తూనే వుండటమే అందుకు తార్కాణం. మహాప్రస్థానంలోని గేయాలు కృత్రిమ మేధతో కూడిన ఇంగ్లిష్ మీడియం బోధన యుగంలో కూడా నేటి యువతరం నాలుకలపై అద్భుతంగా పలుకుతున్నాయి. కవిత్వం రాస్తున్న ప్రారంభ దశలో ఏ కవినైనా.. ‘నువ్వేమన్నా శ్రీ శ్రీ అనుకుంటున్నావా’ అని ఎవరైనా అంటే ముసిముసి నవ్వులు చిందిస్తూ పొంగిపోని వారు ఎవరుంటారు చెప్పండి ఇప్పటికీ..!… ఎప్పటికీ..! అలాంటి మహా ప్రవాహం కోసం పదండి ముందుకు మహాప్రస్థానం గేయాలను ఓసారి స్మరించుకుందాం..!

“కళ్ళంటూ ఉంటే చూసి, / వాక్కుంటే వ్రాసీ! / ప్రపంచమొక పద్మవ్యూహం! / కవిత్వమొక తీరని దాహం!” ప్రపంచవ్యాప్తంగా వచన కవిత్వం ఎలా రాయాలనే దానికి విభిన్న అభిప్రాయాలు వున్నా …ఇలానే రాయాలనే నిబంధన ఏమీలేదు. గురజాడ అడుగుజాడలతో ఆరంభమైన సామాన్యుని భాషలోనే కవిత్వం శ్రీ శ్రీ తో విశ్వవ్యాప్తమైంది. పాండిత్యంతో సంబంధం లేకుండా సామాజిక సమస్యలపై స్పందించే ప్రతి సగటు మనిషికి కవిత్వం రాసే ప్రేరణ లభించింది. “ఇక్కడ నిలబడి నిన్ను / ఇవాళ ఆవాహనం చేస్తున్నాను! / అందుకో ఈ చాచిన హస్తం! / ఆవేశించు నాలో! ఇలా చూడు నీకోసం / ఇదే నా మహాప్రస్థానం!”అంటూ శ్రీశ్రీ తన మిత్రుడు కొంపెల్ల జనార్ధన్ రావుపై రాసిన “తలవంచుకు వెళ్లిపోయావా, నేస్తం!”అంకితం గేయంతో మనల్ని అడుగులు వేయిస్తుంది.. మహాప్రస్థానం!
నేటి స్వతంత్ర్య భారతావనిలో కూడా స్వతంత్ర్యం రాకముందే రాసిన మహాప్రస్థానం గేయాలు సమాజంలో సజీవమై ఇంకా అక్కడక్కడా అప్పుడప్పుడు కనిపిస్తూనే వున్నాయి. కన్నీటి సాక్షిగా కదిలిస్తూనే వున్నాయి. పేదరికం, నిరుద్యోగం, నిరక్షరాస్యత, వివక్షత, దౌర్జన్యం, అసమానతలు వంటి ప్రాపంచిక సమస్యలు మనకు నాగరిక ప్రజాస్వామ్య లౌకిక సమాజంలో కూడా తారస పడుతూనే వున్నాయి.
‘ఒక వ్యక్తిని మరొక్క వ్యక్తీ, / ఒక జాతిని వేరొక జాతీ, / పీడించే సాంఘిక ధర్మం / ఇంకానా?ఇకపై సాగదు ‘
“కూటి కోసం, కూలీ కోసం / పట్టణంలో బ్రతుకుదామని / తల్లిమాటలు చెవిని పెట్టక / బయలుదేరిన బాటసారికి ఎంత కష్టం..!”
” ఆ అవ్వే మరణిస్తే ఆ పాపం ఎవ్వరి”దని వెర్రిగాలి ప్రశ్నిస్తూ వెళ్ళిపోయింది!
విశ్వంతరాళంలో మనస్థాయి ఎంత? అంటూ అంతరిక్ష సరిహద్దులను దాటి ఆలోచిస్తున్న నేటి ఆధునిక మానవుని గురించి…
“ఆలోచనలు పోయేవాడా! / అనునిత్యం అన్వేషించే వాడా! / చెట్టూ, చెరువూ, గట్టూ, పుట్టా / ఆకసంలో,సముద్రంలో / అన్వేషించేవాడా! అని ఆనాడే మన భవిష్యత్తును రాశారు.)
“పొలాల నన్నీ, హలాల దున్నీ, / ఇలా తలంలో హేమం పిండగ – / జగానికంతా సౌఖ్యం నిండగ –
నాలో కదలే నవ్య కవిత్వం / కార్మికలోకపు కల్యాణానికి, / శ్రామికలోకపు సౌభాగ్యానికి / సమర్పణంగా, సమర్చనంగా -“
అంటూ సాగిన శ్రీ శ్రీ ప్రతిజ్ఞ నేటి శ్రామిక, కార్మిక,కర్షక లోకానికి నిలువెత్తు నిదర్శనం.
“మాకు గోడలు లేవు / గోడలను పగులగొట్టడమే మా పని. / అలజడి మా జీవితం / ఆందోళన మా ఊపిరి. /తిరుగుబాటు మా వేదాంతం.”
అంటూ తన ధిక్కార స్వరాన్ని శాస్త్రీయ సాహిత్యప్రపంచం వైపు విప్లవ కాంతులతో మళ్లించాడు.
గెలుపోటములను పట్టించుకోకుండా ప్రయత్నాలు ఆపకుండా జీవన గమనం వుండాలని సమాజం ఎప్పుడూ సాపేక్షమే అని
“నిప్పులు చిమ్ముకుంటూ / నింగికి నే నెగిరిపోతే / నిబిడాశ్చర్యంతో వీరు- / నెత్తురు క్రక్కుకుంటూ / నేలకు నే రాలిపోతే, / నిర్దాక్షిణ్యంగా వీరె..”అంటూ వివరించారు.
“నే నేదో విరచిస్తానని, / నా రచనలలో లోకం ప్రతిఫలించి / నా తపస్సు ఫలించి, / నా గీతం గుండెలలో ఘూర్ణిల్లగ / నా జాతి జనులు పాడుకునే మంత్రంగా మ్రోగించాలని,…”
నేటికీ ప్రపంచ భాషలలో ఎక్కడా కూడా ‘కవితా! ఓ కవితా!’ వంటి అద్భుతమైన కవిత్వం రాలేదని మహాకవులు సైతం శ్రీశ్రీని అభినందించారు. బహుశా నోబెల్ బహుమతి స్థాయి సాహిత్యం ఇది.
“మెరుపు మెరిస్తే, / వాన కురిస్తే, / ఆకసమున హరివిల్లు విరిస్తే / అవి మీకె అని ఆనందించే కూనల్లారా!” అంటూ రాసిన శైశవ గీతి పిల్లలకు ఇవ్వాల్సిన స్వేచ్ఛ ప్రపంచపు విలువను తెలియజేస్తుంది. ఒత్తిడి లేని విద్యను పిల్లలకు సూచిస్తుంది.
ఇక చివరగా ఈ లోకం మీదేనండి!ఈ రాజ్యం మీరేలండి! అంటూ జగన్నాథుని రథచక్రాలు మనల్ని ముందుకు తీసుకెళ్తాయి. మహాప్రస్థానం లాంటి కొన్ని పుస్తకాలు కొన్ని శతాబ్దాల పాటు కాలాన్ని నడిపిస్తూ భవిష్యత్తు తరాలకు మార్గదర్శనం చేస్తుంటాయి. మానవత్వపు రహదారిపై మనల్ని నడిపిస్తుంటాయి. ఏదేమైనా ఈ శతాబ్దపు సాహితీ ప్రయాణంలో శ్రీ శ్రీ మహాప్రస్థానం ఓ ధృవతార అనడంలో అతిశయోక్తి ఏమీలేదు.
“శ్రీ శ్రీ పుస్తకం కొని తీరికగా చదవండి, పద్యం పదిసార్లు చదవండి. ఏమీ అర్థం కాలేదా-ఏ యువకుడికో, భిక్షుకుడికో, death-bed present గా పంపండి. పారెయ్యకండి. అంతకన్నా దాచుకోకండి. తెలుగు కవిత్వాన్ని ఖండించి, దీవించి, ఊగించి, శాసించి, రక్షించే అపూర్వ శక్తి మీ చేతులో పుస్తకం, pass it on” అంటూ చెలం దాదాపు 85 సంవత్సరాల కిందటే చెప్పారు..!
అందమైన లోకమనీ రంగురంగు లుంటాయని అందరూ అంటుంటారు రామరామ అంత అందమైన కానే కాదు చెల్లెమ్మా….. చెల్లెమ్మ
ఈరోజు ఉదయం ఈ విషయం విన్నప్పటి నుండి ఈ పాట నా మదిలో మెదులుతూనే ఉంది. పాట చిత్రీకరణకు, నేను విన్న విషయానికి ఏ విధమైన సంబంధం లేకపోయినా అందులోని భావం ఈ సంఘటనకు చక్కగా సరిపోలడమే అందుకు కారణం.
నేను ఈ పాటపై విశ్లేషణ రాయడం లేదనీ, సంఘటనను విశ్లేషించడానికి ఈ పాటను ఒక ఉదాహరణగా స్వీకరించాననే విషయాన్ని పాఠకులు గమనించవలసిందిగా మనవి.
ఒక పాటను గేయ రచయిత ఒక సంఘటనకు ఆధారంగాగానీ, స్పందించి గానీ రచించి ఉండవచ్చు. దానిని ఒక దర్శకుడు తెరకెక్కించి ఉండవచ్చు కానీ ఆ చిత్రం విడుదలై జనంలోకి వెళ్లిన తర్వాత, శ్రోతలు దానిని విన్నప్పుడు కొన్నికొన్ని సార్లు అది తమను చూసే, తమ గురించే వ్రాసారా అన్నంతగా భావానికి లోనవుతారు. అందులోని సాహిత్యం వారి అనుభవాలకు , పరిస్థితులకు అద్దం పట్టడంతో ఆ విధమైన అనుభూతికి లోనవుతూ ఉంటారు. ఇంతకీ ఈ వ్యాసానికి కేంద్ర బిందువైన విషయం కొత్తదేమీ కాదు. పత్రికలు, బుల్లితెర, వెండి తెరలపై కెక్కడమే కాకుండా, జనాల నాలుకలపై నాట్యమాడిన సాధారణ విషయమే. కాకపోతే ఇది నిత్యనూతనం. పాత సీసాలోని కొత్త సారాయి.
జీవనోపాధిని వెతుక్కుంటూ పల్లె నుండి పట్నానికి వలస వచ్చిన ఓ కొత్తజంట,ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చి , జోడెడ్లై బతుకు బండిని లాగుతూ ఉంటారు. భార్యాభర్తలిద్దరూ నిరక్షరాస్యులు కావడంవల్ల వారు పొందిన అవమానాలు, చేదు అనుభవాలే పిల్లల్ని ప్రయోజకుల్ని చేయాలనే గట్టి సంకల్పానికి కారణమై రాజీలేని పోరు సలుపుతూ ఉంటారు.
అతను ఒక చక్కటి మేస్త్రి. భవన నిర్మాణంలో అతని అనుభవం, మెళకువలు చూసి కాంట్రాక్టర్లు ముచ్చట పడేవారు. పదిమంది పని వాళ్ళను బృందంగా సంఘటిత పరిచి , వారితో కలిసి పనులు కుదుర్చుకునేవాడు. చెప్పిన సమయానికి పని పూర్తి చేసి అప్పగించడంతో అందరి మెప్పును పొందగలిగేవాడు. అయినప్పటికీ కేవలం ఆ పని మీదే ఆధారపడకుండా, ఎంత చిన్న పనైనా చేయడానికి వెనుకాడేవాడు కాదు.
కాలచక్రం తన దారిన తాను వెళుతూ ఉండగానే , నిశ్చలంగా ఉన్న నీటిలో రాయి పడినట్లుగా ఒకరోజు ఒక బహుళ అంతస్తుల భవనాన్ని కట్టే సమయంలో అతను పైనుండి కింద పడటంతో తలకు, కాళ్లకు,చేతులకు బలమైన గాయాలయ్యాయి. అసలు పనులు చేయగలుగుతాడా? అనే అనుమానం అందరిలోనూ కలిగింది. కానీ అతను ధైర్యాన్ని కోల్పోకుండా కాస్త కోలుకోగానే, శక్తిని కూడదీసుకుని పనులకు వెళుతూ, జరిగిన ఆర్థిక నష్టాన్ని పూడ్చుకునే దిశగా తల్లిదండ్రుల ద్వారా సంక్ర మించిన కొద్దిపాటి ఆస్తిని అత్యంత నేర్పుతో విక్రయించి, పరిస్థితిని ఒక దారిలోకి తీసుకు రాగలిగాడు.
మరో సందర్భంలో ఆమె ఆరోగ్యం కూడా బాగా దెబ్బ తినడంతో, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న భర్త, దానికి తోడు క్షీణించిన తన ఆరోగ్యం ఎక్కడ పిల్లల చదువులకు ఆటంకంగా మారుతుందోననే బాధ బాగా కృంగదీయడంతో, అతను ఆమెకు అన్ని రకాలుగా భరోసానందించి కుటుంబాన్ని ముందుకు నడిపించాడు.
ఆమె నాలుగిళ్లలో పని చేసేది. గర్భం ధరించిన సమయంలో కానీ, చంటి పిల్లల్ని సాకే సమయంలో గానీ ఎన్ని ఇబ్బందులెదురైనప్పటికీ , అన్నిటినీ చక్కగా సమన్వయపరచుకునేది. ఇద్దరు పిల్లల్ని స్కూలుకు పంపించి, చిన్న వాణ్ణి సెల్లార్ లో పడుకోబెట్టి, ఒక సీసాలో పాలు, మరో సీసాలో నీళ్లు పెట్టి, అపార్ట్మెంట్ వాచ్మెన్ ని కొడుకు లేస్తే కాస్త తనను పిలవమనీ, అదే అపార్ట్మెంట్లో పనిచేస్తున్న మరో పని మనిషి చేతికి ఒక పాల సీసానిచ్చి పిల్లాడు లేచి ఏడిస్తే కాస్త పట్టించమనీ, ఫలానా ఇంట్లో పని చేస్తూ ఉంటాననీ, మరీ అవసరమైతే తనను పిలవమనీ, తొందరగానే తిరిగి వచ్చేస్తానని వారిని బతిమాలి, పనికి వెళ్లి మధ్య మధ్యలో వచ్చి పిల్లాడిని చూసుకుంటూ ఉండేది.
ఒకానొక సందర్భంలో ప్రభుత్వ కళాశాలల్లో చదవడానికి పిల్లలు వ్యతిరేకించడంతో, మరో నాలుగు చోట్ల పని వెతుక్కుని ఆమె, అప్పటికే నిర్మాణంలో ఉన్న మరో రెండు భవనాలను మాట్లాడుకుని, బ్యాంకుల్లో రుణాలు తీసుకుని, వాటిని చెల్లించడానికి నానా తిప్పలు పడుతూ అతను , మొత్తానికి భార్యాభర్తలిద్దరూ ఏమాత్రం వెనుకడుగు వేయకుండా పిల్లలను కార్పోరేట్ కళాశాలలో చదివించారు.
వారికి తెలిసిన విషయం ఒక్కటే. తమకు మల్లే తమ పిల్లలు కష్టపడ కూడదని. వాళ్ల ముందున్న లక్ష్యం ఒక్కటే. ఎన్ని ఇబ్బందులు పడైనా సరే తమ పిల్లల్ని ప్రయోజకుల్ని చేయాలని.
దానికి తగ్గట్టుగానే వారి శ్రమ,కల రెండూ కూడా అత్యద్భుతంగా ఫలించాయి. పిల్లలిద్దరికీ ఒకరికి ఇంజినీరింగ్ సీటు , మరొకరికి మెడికల్ సీటు దొరకడంతో వారి ఆనందానికి అవధులు లేవు.
“ఒక మెరుపు వెంట పిడుగూ… ఒక మంచి లోన చెడుగూ……..చెల్లెమ్మ అన్నట్టుగా వారి సంతోషం ఎక్కువసేపు నిలబడలేదు.
ఇంక విషయాన్ని ఎక్కువగా సాగదీయకుండా పాయింట్ లోకి వచ్చేస్తాను.
పెద్దవాడి స్నేహితులు ఓ 10 మంది దాకా షాపింగ్ మాల్ లో ఎంజాయ్ చేసి, పక్కనే ఉన్న వీళ్ళ ఇంటికి రావడంతో (వాళ్ల ఇల్లు ఎలా ఉంటుందన్న వివరణ నేను ఇవ్వడం అనవసరమనుకుంటాను) సదరు పుత్రరత్నం వాళ్లతో మాట్లాడటానికి బయటికి వెళుతూ, వాళ్ళమ్మను బయటకు రావద్దనీ, వాళ్ళు వెళ్ళేంత వరకూ లోపలే ఉండమని చెప్పాడు.
“గడ్డి మేసి ఆవు పాలిస్తుంది. పాలు తాగి మనిషి విషమవుతాడు. అది గడ్డి గొప్పతనమా ఇది పాల దోష గుణమా”
ఎంతో అపురూపంగా పెంచుకున్న ఆ తల్లి మనసు కకావికలమై పోయింది.
కాళ్ళ కింద నేల కదిలినట్లు, తానందులో కూరుకుపోతున్నట్లు అనిపించింది.
అలసిపోయి ఇంటికి వచ్చిన ఆమె భర్త ఈ విషయం తెలిసి నిశ్శబ్దంగా పడుకుని, తెల్లవారాక ఏమీ తినకుండానే పనికి వెళ్లాడు. అతని మౌనంలో ఇరవయ్యేళ్ళ శ్రమ ఉంది. అతని కంటి తడిలో దుర్భర దారిద్రంతో తాను చేసిన పోరాటం ఉంది. కష్టకాలంలో కుటుంబాన్ని ఒక కొలిక్కి తేవడానికి తన కెదురైన అనుభవాల సెగ ఉంది.
కార్పొరేట్ కాలేజీలో సీటు వచ్చేసరికి, ఆధునిక వస్త్ర ధారణ లో, అనర్గళంగా పలు భాషలు మాట్లాడుతూ, సెల్ఫ్ డ్రైవింగ్ లో అధునాతన కార్లు నడుపుతూ వచ్చే తల్లులను చూసేసరికి అంట్లు తోముకునే అమ్మను, తాపీ పట్టిన తండ్రిని తల్లిదండ్రులు అని చెప్పుకోవడానికి వాడికి నామోషి అనిపించింది.
ఇంతకంటే బాధాకరమైన విషయం మరొకటి ఉండదని నేనననుగానీ(ఎందుకంటే జరుగుతున్న పరిణామాలు ఒకదాని కంటే ఒకటి ఎంత దారుణంగా ఉంటున్నాయో మనం చూస్తూనే ఉన్నాం) . అత్యంత బాధాకరమైన పలు సంఘటనలలో ఇది ఒకటి.
“ముద్దు గులాబీకీ ముళ్లుంటాయి మొగిలి పువ్వు లోనా నాగుంటాది………చెల్లెమ్మ
గులాబి పువ్వును చూసుకున్నంత అపురూపంగా పెంచారు. కానీ ఇప్పుడు దాని రంగుల సోయగం గానీ, దాని సౌకుమార్యం గానీ వారిని మురిపించడం లేదు సరి కదా , దానికున్న కంటకాలే వారి గుండెను గుచ్చుతున్నాయి. ఇరవయ్యేళ్ళ తమ కల ఫలించినందుకు ఆనందించాలో, తమ ఉనికే ప్రశ్నార్థకమైనందుకు బాధపడాలో అర్థం కాని స్థితి.
ఇటువంటి పిల్లలకు తెలియాల్సిన కొన్ని విషయాలు: ఉన్నత స్థాయిలో ఉన్న తల్లిదండ్రులను చూసి,నీ తల్లిదండ్రులు అని చెప్పుకోవడానికి నువ్వు అవమానంగా భావించడం కాదు.
- పాతికేళ్లు వాళ్ళ కండలు కరిగితే గానీ నువ్వు ఈ స్థాయికి రాలేదన్న విషయాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు.
- నిన్ను ప్రయోజకుడిని చేయాలననే ఆలోచనే వారి శ్రమ శక్తికి అంకురమై, నీకు చక్కని జీవితాన్ని అందించాలనే ఆశయమే వారి సంకల్ప బలానికి ఊతమైందనే విషయాన్ని నువ్వెన్నడూ విస్మరించకూడదు.
- వారి పరిస్థితులు సాన అయితే వారిద్దరూ గంధపు చెక్కలై ఆ సాన మీద అరిగితేనే నువ్వు ఈ స్థాయికి రాగలిగావు.
- సానకు,చెక్కకు నడుమ లభించిన పరిమళ ద్రవ్యానివే నువ్వు.
- వీరు నా తల్లిదండ్రులు అని గర్వంగా వారిని ప్రపంచానికి పరిచయం చేసి చక్కని పుత్రునిగా, ఉత్తమ పౌరుడిగా నిన్ను నువ్వు నిలబెట్టుకుంటావో, సంకుచితత్వంతో నీ స్థాయిని దిగజార్చుకుంటావో నీ చేతుల్లోనే ఉంది.
- నీ ప్రజ్ఞాపాటవాలను అద్భుతంగా నిరూపించుకున్నావు. సంతోషమే. కానీ నీ వ్యక్తిత్వానికి మెరుగులు దిద్దుకోవాల్సిన అవసరం చాలా ఉంది.
- వ్యక్తిత్వ వికాస నిపుణులు, మానసికవేత్తలు ఎంతోమంది కేవలం సమాజ శ్రేయస్సు కోసమే చక్కని పుస్తకాలు రచించారు.
- ఆ పుస్తకాలు చదివి సమాజానికి ఒక చక్కని నమూనాగా నిన్ను నువ్వు మలుచుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.
మేడిపండు జీవితాలు. తెలివైన పిల్లలకు జన్మనిచ్చిన తల్లిదండ్రులుగా, కుటుంబాన్ని అత్యంత నేర్పుతో నడిపిన కార్యశూరులుగా ఈరోజు సమాజం ముందు వారు నిలబడి ఉండవచ్చు.
కానీ అంతరంగంలో మొదలైన కల్లోలం, రేపు ఇంకెంత తీవ్రరూపం దాలుస్తుందో అనే అభద్రతలో ఉన్న వారి పరిస్థితి ఎంత మందికి తెలుస్తుంది. బయటకు చెప్పుకోనూ లేక, లోపల దాచుకోనూ లేక సతమతమయ్యే మేడిపండు జీవితాలు మన చుట్టూ కోకొల్లలు.