‘చిట్టి చిలకమ్మా! అమ్మ కొట్టిందా’ అనీ, ‘బుర్రుపిట్ట బుర్రుపిట్ట తుర్రుమన్నది’ అనీ, ‘కాకీ కాకీ కడవల కాకి’ అనీ మనం చిన్నతనంలో పాటలు పాడుకుంటూ పెరిగాం. నెమలీకలు పుస్తకాల్లో పెట్టుకొని మేతపెట్టడం, తూనీగ రెక్కలకు దారాలు కట్టి ఆడడం బాల్యపు తీపి గురుతులు. తన పిల్లలను తినేస్తున్న పాము పని బట్టడానికి రాణిగారి గొలుసుతెచ్చి పాము పుట్టలో పడేసిన కాకి కథ, గాలి వానకు పిచ్చుక కట్టుకున్న పిడకలిల్లు పడిపోయిందని చెప్పే కథ, వేటగాళ్ళ ఉచ్చులో ఎన్నో పక్షులకు సంబంధించిన కథలు చదువుకుంటూ పెరిగాం. ‘పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చినట్లు’, ‘ఎంగిలి చేత్తో కాకిని విసరడు’ వంటి సామెతలూ మన జీవితంలో భాగమే. ఇంటి ముందు వసారాలో పిచ్చుకల కోసం వరి కంకులు కట్టడం, ఇంటి చూరులో పిచ్చుకలు, పావురాలు పిల్లల కోసం గూళ్ళు కట్టుకుంటే వాటిని జాగ్రత్తగా చూడటం వంటివి మనకు పక్షులపై ఉన్న ప్రేమను తెలుపుతుంది. మన జీవితాలతో ఇంతగా మమేకమైన పక్షులు ఆధునిక ప్రపంచంలో అనేకానేక కారణాల వల్ల మనల్ని వీడి మాయమై పోతున్నాయి. పక్షుల గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం.
పక్షుల వర్గీకరణను మొదటగా ‘ఫ్రాన్సిస్ విల్లగ్టీ’ మరియు ‘జాన్ రే’ అనే శాస్త్రవేత్తలు చేపట్టారు. 1676వ సంవత్సరంలో ఈ శాస్త్రవేత్తలు ‘ఆర్వితోలాగే’ అనే పుస్తకంలో పక్షుల గురించి వివరించారు. ఈ తర్వాత వచ్చిన ‘కారల్ లిన్నేయస్’ అనే శాస్త్రవేత్త 1758వ సంవత్సరంలో పక్షుల వర్గీకరణను ఆధునీకరించాడు. ఈ పక్షులు సరీసృపాల వారసులు. సరీసృపాలకు పక్షులకు చాలా దగ్గరి పోలికలుంటాయి. శిలాజాల చరిత్రను గమనిస్తే అతిపెద్ద సరీసృపాలైన డైనోసార్లు ఆహారం దొరకక విలుప్తమైపోయాయి. పాకే జీవులైన సరీసృపాల నుంచి రెక్కలున్న పక్షులు ఏర్పడ్డాయని తెలుస్తోంది. క్రస్టేషియన్ యుగంలో మొట్టమొదటగా పక్షులు అవతరించాయని తెలుస్తున్నది. క్రస్టేషియస్ యుగమంటే దాదాపు వంద మిలియన్ల సంవత్సరాలకు పూర్వమన్న మాట.
పక్షులు ‘ఏవ్స్’ విభాగానికి చెందినవి. రెక్కలు ఉండడం, ఆకాశంలో ఎగరగలగడం ప్రధాన లక్షణాలు. ఇవి నాలుగు గదుల గుండెను కలిగి ఉంటాయి. పళ్ళులేని ముక్కులున్న దవడలు గలిగిన జంతువులు ఇంకా ఇవి ఎండోదెర్మిక్ వర్టిబ్రేట్స్. వీటికి చాలా తేలికైన శరీరం, బలమైన అస్థిపంజరం ఉంటాయి. ఇవి గట్టి పెంకు గలిగిన గుడ్లను పెడతాయి. జీర్ణవ్యవస్థ, శ్వాస వ్యవస్థ కూడా వీటిలో ఎగరడానికి అనుకూలంగా పరిణామం చెంది ఉన్నాయి. ముందున్న రెండు కాళ్ళూ రెక్కలుగా పరిణామం చెందటం వలన, రెక్కలకున్న ఈకల్లో గాలి గదులుండటం వలన ఇవి ఎగర గలుగుతున్నాయి. సరీసృపాల నుంచి పక్షులు ఏర్పడ్డాయని అనుకున్నాం కదా! ఇవి అంతా ఒక్క రోజులోనో ఒక్క సంవత్సరంలోనో జరగదు కదా! పరిసరాలు, పరిస్థితులను బట్టి కొన్ని అంగాలను కోల్పోవటం, కొత్తగా కొన్నింటిని ఏర్పాటు చేసుకోవటం జరుగుతుంది. సరీసృపాలకు, పక్షులకు మధ్య వారధిలా ‘ఆర్కియాప్టెరిక్స్’ అనే జంతువు ఉండేది. దీనికి సరీసృపాల లక్షణాలు, పక్షుల లక్షణాలు రెండూ ఉంటాయి. ఇది పూర్తిగా ఆకాశంలో ఎగరలేదు. పళ్ళున్న దవడలు, పొడవైన ఎముకలున్న తోకలు కలిగి ఉంటాయి. ఇది సరీసృపాల లక్షణం.
పక్షులు ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించి ఉన్నాయి. సుమారు ఎనిమిది వేల జాతులన్నాయని తెలుస్తున్నది. వీటిలో 5 సెం.మీ పొడవున్న అతి చిన్న హమ్మింగ్ బర్డ్ నుంచి 9 ఫీట్ల పొడుగున్న అతి పెద్ద ఆస్ట్రిచ్ వరకు అన్ని రకాల పక్షులున్నాయి. కొన్ని పక్షులు చాలా తెలివి కలవి. అందులో చిలకలు, కొర్విడ్లు మొదలైనవి తెలివైన వాటికి ఉదాహరణగా నిలుస్తాయి. చాలా జాతుల పక్షులు సంవత్సరానికొకసారి చాలా చాలా దూరాలు వలస పోతుంటాయి. పక్షులు సంఘజీవులు. ఇవి సైగల ద్వారా, అరుపుల ద్వారా, పాటల ద్వారా తోటి పక్షులకు కావలసిన విషయాన్ని చేరవేస్తాయి. పక్షులు ఎంతో శ్రమకోర్చి పుల్లా పుడకా ఏరుకొచ్చి రకరకాల గూళ్ళను అల్లుకుంటాయి. అలా అల్లుకున్న గూళ్ళలో తమ పిల్లలను పెట్టుకుంటాయి. గుడ్లు పొదిగి పిల్లలైన తర్వాత చాలా జాగ్రత్తగా చూసుకుంటాయి పిల్ల పక్షుల్ని తల్లి పక్షులు. పక్షులు మనుష్యులతో కలసి బతుకుతాయి. మానవులకు ఆహారంగా ఉప యోగపడతాయి. వాటిని వేటాడే పిల్లులు, కుక్కల కన్నా పక్షులు మానవుల వల్లే ఎక్కువగా చనిపోతున్నాయి. 17వ శతాబ్దం నుంచి దాదాపు 120 నుండి 130 జాతుల పక్షులు అంతరించిపోయాయి. అంటే మానవుడు అభివృద్ధి బాట పట్టి నాగరికత వైపు అడుగులు వేస్తున్న సమయం నుండీ పక్షులు అంతరించి పోవటం మొదలయిందన్నమాట.
కొన్ని పక్షులు ఆర్థిక ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నాయి. కోడి, బాతు వంటి వాటి గుడ్లు, మాంసం మానవులకు ఆహారంగా ఉపయోగపడుతున్నాయి. అంతేకాక పక్షుల ఈకలు కూడా టోపీలు, ఆభరణాల తయారీలో ఉపయోగపడతాయి. చిలకలు, పావురాలు వంటి పక్షులు పెంపుడు జంతువులుగా మానవుడితో సహజీవనం చేస్తాయి. పక్షుల పెంటను పొలాలకు ఎరువుగా ఉపయోగిస్తారు.
వ్యాసాలు
పూర్వ సామ్రాజ్యాలను కీర్తించడమో, రాజుల గాథలను చెప్పడమో అసలైన చరిత్రకాదు. సకల ప్రజల, సకల జాతి ప్రగతిని కోరుకున్న విషయాలు చెప్పేది చరిత్ర. ఈ ప్రజా చరిత్రలో అత్యంత మహత్తరమైన వ్యక్తి బీదవాడు. ఆ బీదల వైపు నిలబడిన వాడు అసలైన నాయకుడు. చారిత్రక పురుషుడు తన జీవితంలో ముఖ్యమైన కాలన్నంతా ప్రజాపక్షాన పోరాడిన నాయకుడు పెండ్యాల రాఘవరావు.ఆయనలో దేశభక్తి బీజాలు మొక్కౖెె మానై మహావృక్షమై ఫలాలందించే స్థాయికి ఎదిగాయి. ఆనాటి తెలంగాణా ప్రాంతమంతా చీకటిలో మ్రగ్గి ఉందన్నది రాఘవరావు తన చిన్న వయసులోనే గ్రహించి ప్రపంచ జ్ఞానాన్ని చారిత్రకాంశాలనీ, భారతదేశ ఆర్య సంస్కృతినీ అన్ని విషయాలను తెలుసుకున్నాడు. ఒక దేశం సునపంన్న దేశంగా ఎదగాలంటే అది సారవంతమైనదే కావాల్సిన అవసరం లేదనీ, స్వతంత్ర దేశం అయితే చాలుననీ గ్రహించాడు రాఘవరావు. మహాత్మాగాంధీ సత్యాగ్రహాలు చేయడం వీరిపై పెద్ద ప్రభావమే చూపింది. తాను కూడా వరంగల్లో నిరాహార దీక్ష చేసి, హరిజనోద్ధరణకు నడుకట్టాడు. మత మార్పిడి పై వచ్చిన తబ్లీగ్ ఉద్యమాన్ని అడ్డుకోవడం, వీటి వల్ల వచ్చిన ఆంక్షలను, ఎదుర్కోవడంతో రాఘవరావులో గట్టి నిర్ణాయకుడు ఉద్భవించాడు.
ఆనాటి సామాజిక వ్యవస్థలోని కుళ్ళు వ్యవస్థ అయిన అంటరానితనాన్ని ఎండగడ్తూ హరిజనులను ఇంట్లోకి తీసుకురావడం వారితో సహపంక్తి భోజనాలు చేయడం, దేవాలయ ప్రవేశంచేయడం, హరిజన స్త్రీలతో బతుకమ్మ ఆడించడం వంటివన్నీ రాఘవరావు ఎంతో దృఢ నిశ్చయంతో చేశారు. జాతీయోద్యమాలను అనుసరిస్తూ అత్యంత ప్రభావం చూపిన ఆర్య సమాజంలో, చేరడం సత్యాగ్రహోద్యమం, గ్రంథాలయోద్యమం, రైతు కూలీ పక్షాన నిలబడడం ఈ పోరాటాలలో అతని ప్రాణాలు తీయాలన్న ప్రయత్నాల నెదుర్కోవడం అన్నీ రాఘవరావు జీవితంలో ప్రముఖ ఘట్టాలే!కాంగ్రెస్ సత్యాగ్రాహిగా ఉండి జైలు జీవితాన్ని అనుభవించడం రాఘవరావులో అణగారి ఉన్న విప్లవవాదికి కొత్త భావాలు తోడైనవి. కమ్యూనిస్టు కార్యకర్తగా కాలక్రమంగా నాయకునిగా ఎదిగి ప్రజారాజ్యాన్ని చూడాలని సాయుధ వీరుడయ్యాడు.అజ్ఞాత జీవితంలో అనేక సంఘటనలు చవి చూశాడు. రజాకార్ల నెదుర్కొంటూ పోలీస్ ఆక్షన్ సమయంలో వీరోచిత పోరాటం చేశాడు. జాతీయ రాజకీయాలకు తోడు నిజాం గద్దె దిగడం, ఎన్నికలు రావడం, ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజాసేవ చేయాలనుకోవడం అన్ని పరిస్థితులననుసరించే జరిగినవి. పి.డి.ఎఫ్ ద్వారా ఎన్నికల్లో పాల్గొన్న విషయాలు ప్రజలు ఎంతో ఉత్సాహంగా చెప్పిన విషయాలెన్నో! ఆయన ఉపన్యాస ధోరణిని, వాక్కుపటిమనీ, కథలు కథలుగా చెప్పుకునేవారు ప్రజలు. ప్రత్యక్షంగా ఎన్నో తడవలు విన్న అనుభవాలు ఆ రోజుల్లో రికార్డు చేసుకోలేని పరిస్థితి. కాలం వేగంగా పరుగిస్తూ ఎన్నో సత్యాలను తనతో తీసుకెళ్ళింది.”అవి ఎమర్జన్సీ చీకటి రోజులు, రాజ్యమేలుతున్న కాలం. మహాసభానంతరం జనగామ జూనియర్ కళాశాల ప్రాంగణంలో జరిగిన బహిరంగ సభలో రావి నారాయణ రెడ్డి గారి ప్రసంగం తరువాత రాఘవరావుగారి ఉపన్యాసం వింటూ కాళోజీ ఏడుస్తూ చెట్టు క్రింద రాయిపై కూర్చున్నాడు. తర్వాత కాళోజీని ప్రసంగించమంటే ”రాఘవరావు ప్రసంగం తర్వాత నేను ఉపన్యసించడం అనవసరమని” కన్నీటితో జవాబు చెప్పి, వేదికపైకి రానే లేదు. స్వాతంత్రోద్యమ ఘట్టాలను ఆనాటి ప్రజల కడగండ్లను చెప్పుతుంటే సభికులు అచ్చెరువొందారు. రాఘవరావు గారి ప్రసంగం ఆ స్థాయిలో ఉండేదని చెప్పడానికే ఇది రాశాను. ఆ ఉపన్యాసం కొన్ని పత్రికలలో ప్రముఖంగానే వచ్చింది చాలా వాటితో పాటు అదికూడా మీకు లభ్యం కాలేదు.” అంటూ జనగామ నుండి కె. మాధవ రెడ్డిగారు వ్రాసిన ఉత్తరంలో ఉంది. 2007లో రాఘవరావుగారి 20వ వర్ధంతి సందర్భంగా ‘నా ప్రజాజీవితం’ పుస్తకావిష్కరణ చేసిన తర్వాత అందిన ఉత్తరం. రాఘవరావుగారు వ్రాసుకున్న అనుభవాలు కొన్ని, పెద్దల అభిప్రాయాలు కొన్ని ఉన్న ఆ పుస్తకాన్ని చదివి, ఆ పుస్తకం అసమగ్రంగా వుంది అంటూ ఎన్నో విషయాలను ఉటంకిస్తూ 18 పేజీల ఉత్తరం ఒకటి, 9 పేజీల ఉత్తరం మరొకటి వ్రాశారు. మాదవరెడ్డిగారు కొంతకాలం జిల్లా పార్టీ కమిటీ కార్యాలయ కార్యదర్శిగా పనిచేసి, రాఘవరావుగారిని దగ్గరినుండి చూసిన, పోరాటాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్న అనుభవాలు ఆ ఉత్తరాలలో ప్రతి అక్షరంలోనూ కనిపిస్తున్నవి.ఎంతో శ్రమకోర్చి పుస్తకాన్ని అచ్చువేయిస్తే, తర్వాత చాలా విషయాలు తెలిశాయి. అది సమగ్రమైందికాదని తెలిసీ, అసలు విషయాలెన్నో వెలుగులోకి రాలేదనీ ఇంకా ఏదైనా చేయాలనీ సంకల్పం ధృవపడింది. వీలున్నపడల్లా రాఘవరావుగారి గురించి సమాచారం సేకరించి సిద్ధం చేసుకున్న విషయలనూ, రాఘవరావుగారి మేనకోడలు దయామతిగారు చెప్పిన విషయాలనూ ఆధారం చేసుకొని కొంత వ్రాసి పెట్టుకోవడం జరిగింది. వీరిది రాయపర్తిగ్రామం, ఈమె పరమ పండితోత్తమురాలు. రామాయణ భారత, భాగవతాలను కక్షుణ్ణంగా చదివి, పద్యాలనూ, శ్లోకాలనూ అనర్గళంగా చవగలుగోవారిమె. ఇప్పటికీ చదువుతున్నారామె. 2007లోనే ఆమె దగ్గరికి వెళ్ళి ఇంటర్వూ తీసుకున్నాను. చిన్నపెండ్యాల ఊళ్ళన్నీ చుట్టు ప్రక్కల తిరిగి సమాచారం సేకరించి ‘నా ప్రజా జీవితం’ ప్రచురించినప్పుడు దయామతిగారి దగ్గర సేకరించలేదు. ఆ పుస్తకం చదవగానే ఆమె నన్ను దగ్గరకు పిలిపించుకుని ఎన్నో విషయాలు చెప్పారు. తర్వాత కొత్తపల్లి భగవానుగారు 30 పేజీల పోరాటాల చరిత్రను వ్రాసి పంపారు. అందులో ప్రతి, సాయుధ పోరాటంలోనూ రాఘవరావే వున్నాడు. ఆ ఉదంతాలన్నీ ఈ రచనకు ప్రేరణ.’వీర తెలంగాణా సాయుధ సమరం’ కందిమళ్ళ ప్రతారెడ్డిగారి పుస్తకం, వాసిరెడ్డి నవీన్ గారి ‘తెలంగాణ విముక్తి పోరాట కథలు’ పుస్తకం, తెలంగాణా విమోచనోద్యమం-తెలుగు నవల’ వరవరరావు గారి పుస్తకం, పోరాటాల బాటలో అనుభవాలు జ్ఞాపకాలు’ యస్.వి.కె.ప్రసాద్ గారి పుస్తకము, సంగ్రహాంధ్ర విజ్ఞానకోశము, విజ్ఞాన సర్వస్వం వంటి ఎన్నో పుస్తకాలు చదివి ఒక ప్రణాళికను ఏర్పరచుకున్నాను. 2008లో అఫ్జల్ గంజ్ లో వున్న లైబ్రరీకి చాలారోజులు పోయిసేకరించిన పాత పత్రికలూ నాకు రచనలకు తోడ్పడ్డవే. రాఘవరావు వ్రాసిన ”నా ప్రజాజీవితం” ఆధారంగా పై పుస్తకాల నుండి సేకరించిన సమాచారంతోనూ, మా జ్ఞాపకాల ఆధారంగాను ఈ పుస్తకాన్ని వ్రాశాను.”స్వాతంత్య్ర పోరాటంలో వరంగల్ తాలూకా’ అనే వ్యాసం కొయ్యడ రాజయ్య, పెండ్యాల రాఘవరావుగార్లు వరంగల్ జిల్లా స్వాతంత్య్ర యోధుల ద్వితీయ మహాసభ సందర్భంలో, సావనీర్ వెలువరించిన సందర్భంలో వచ్చిందై వుంటుంది. ఆ వ్యాసం చదివితే చాలు రాఘవరావుగారి వ్యక్తిత్వం అర్థమౌతుంది. అంత పెద్ద వ్యాసంలో తన విషయానికి ఏమాత్రం ప్రాధాన్యమివ్వలేదు. వరంగల్ జిల్లా అంతా, ఊళ్ళన్నీ తిరిగిన వీరు ఏ ఒక్క పంక్తిలోనూ ఈ వ్యాసంలో కనిపించరు. అదీ! అదివారి నిస్వార్థసేవాభావం, ప్రతిఫలం ఆశించని మనస్తత్వం.ఈ పుస్తక రచనకు పూనుకొన్నప్పుడు యస్.వి.కె. ప్రసాద్ గారి పుస్తకాన్ని చదివి, రాఘవరావు గారి సందర్భం వచ్చినప్పుడు వీరు వ్రాసిన విషయాల్ని చదివి నేను దిగ్భ్రాంతికి గురయ్యాను.” ‘పెండ్యాల రాఘవరావు, చింతల రామకృష్ణారెడ్డిగారలకు అప్పగించిన వరంగల్లు పడమటి ప్రాంతములో భూపంపక కార్యక్రమం కొంతవరకైనా అమలు జరుగలేదు. తూర్పు వరంగల్లు ప్రాంతంలో పెద్ద భూస్వాముల వద్దగల భూమి కూడా సకాలంలో పంచబడనందున, రాష్ట్ర కమిటీ నుండి తీవ్రమైన విమర్శలు వచ్చాయి.” అని వారి పుస్తకంలో పేజీ 53లో ఎస్.వి.కె గారు వ్రాశారు. 1948 రోజుల్లో జరిగినట్టు వ్రాశారు. అదే పుస్తకంలో 49వ పేజీలో ”గ్రామ రక్షణ దళాలతోపాటు, చైత్రయాత్రా దళాలు వెలిశాయి. ఇచ్చట వాలంటీర్లు చేతులు చాచి కొట్టడానికి అనువుగా తయారుచేసుకున్న పొడవాటి లావు కర్రలను ‘గుత్పలు’ అనేవారు. దీనివల్ల దీనికి ‘గుత్పల సంఘం’ గా పేరొచ్చింది”. అని వ్రాసుకున్నారు వారి పుస్తకంలో., ఇంత అసంబద్ధ అన్యాయమైన విషయాన్ని సభ్యసమాజం ఖండించాలి. ‘గుత్పలు ‘ అంటే ఏమిటో అర్థం చెప్పాల్సిన అవసరం తెలంగాణ ప్రజలకు అక్కర లేదు.”1947 సెప్టెంబర్ 11వ తేదీన కమ్యూనిస్టు పార్టీ సంపూర్ణ విముక్తి కోసం సాయుధపోరాటానికి పిలుపునిచ్చింది. నైజాం సైన్యాలకు, రజాకారు ముఠాలను ప్రజలు సాయుధంగా ప్రతిఘటించడం ప్రారంభించారు. భూస్వాముల నుంచి స్వాధీనం చేసుకున్న భూమిని, ప్రభుత్వ భూములను ప్రజలకు పంచే కార్యక్రమం, గ్రామరాజ్యాల ఏర్పాటు ప్రారంభమయినవి.” ఇట్లా పై మాటలతో పొంతన లేకుండా వ్రాశారు. వరంగల్ ప్రాంతానికి వీరు వచ్చిందే 1948లల్లో ఇట్లా వ్యక్తుల మీద తప్పుడు రిపోర్టులు పంపినారనడానికి ఇంతకన్నా సాక్ష్యమింకేం కావాలి? బహుశా ఆ రోజు, ఆ క్షణంలో వారు ఇచ్చిన ఆదేశాల అమలు జరపలేకపోయి వుంటారు. కానీ వారు ఇక్కడికి వచ్చేవరకే కొన్నిగ్రామాల్లో భూపంపిణీ ఉద్యమాన్ని రాఘవరావు జరిపారు. ప్రజా పోరాటాల భాగం లో తన యవ్వన కాలమంతా అడవులలో గడిపి, ఎన్నో ఉద్యమాలు చేసిన రాఘవరావు ఇట్లాంటి అభియోగాలను ఎదుర్కోవడం లో న్యాయం ఎక్కడున్నది? వాటి పర్యవసానాలను ఏమీ పట్టించుకోని రాఘవరావు నష్టపోయింది చాలానే అని పుస్తకాలు చదివాక తెలిసింది.అయినా సరే, ఇప్పటికి తెలిసిన విషయాలైనా వ్రాయాలని నిర్ణయించుకొని వ్రాసిందే ఈ పుస్తకం! దాదాపు 1932,33ల నుండే ప్రజాపోరాటాల్లో వుండి సాయుధుడై అద్భుత విజయాలు సాధించిన రాఘవరావు క్రిష్ణారెడ్డి గార్లు తాము ఇచ్చిన భూపంపకాల కార్యమాల డ్యూటీని సరిగ్గా నిర్వర్తించలేదని వ్రాయడం ఎంతవరకు సబబు? దాదాపు 15 ఏళ్ళు వీరికంటే ముందే పోరాటాల్లో పాల్గొంటున్నవారి గురించి ఈ విధంగా నిందలు వేశారంటే ఆశ్చర్యం, బాధ కలుగుతుంది.”మావి రికార్డులు ఏమీ లేవు. వున్న రికార్డులను తగులబెట్టడమే మా కార్యక్రమాలాయే ” అని నాతో, నేను తీసుకున్న ఇంటర్వ్యూ లో చెప్పిన బొమ్మగాని ధర్మభిక్షంగారి మాటలు గుర్తుకువచ్చాయి. ”అసలు మేము బ్రతుకుతామనుకున్నామా? రాఘవరావు గారి జీవితం, విశేషాలు అది ఒక మహాసముద్రం. దానికి న్యాయం జరగాలంటే ఒకరిద్దరు మాటలతో అయ్యేదిగాదు” అని చెప్తూ మద్దికాయల ఓంకార్ గారు కొన్ని సలహాలు ఇచ్చారు , నేను వారిని ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు. ఇవన్నీ చూస్తుంటే నేను రాఘవరావుగారి జీవిత విశేషాలను సమగ్రంగా తీసుకురావడం సాధ్యమయ్యే పనేనా అని ఆలోచించేలా చేశాయి. ఎవరు వ్యక్తులను ఎక్కడెక్కడ ఎలా దెబ్బకొట్టాలని ప్రయత్నాలు చేస్తారో కదా!మా బాల్యమంతా రాఘవరావుగారి క్రమశిక్షణలో, శ్రమతత్వపు ఆలోచనలతో పెరిగింది. అబద్ధాలడవద్దు, అన్యాయం చేయవద్దు. తెలివిగా విజ్ఞానదాయకంగా మంచినడవడితో జీవించాలని నేర్పించారు. కమ్యూనిస్టు భావాలతో వున్న పెండ్యాల రాఘవరావు గారి భార్య , మా అమ్మ కౌసల్యాదేవి తమ పిల్లలను రాఘవరావుగారి ఆదర్శాలకనుగుణంగా తీర్చిదిద్దింది. క్రియాశీలక రాజకీయాల్లో నిలువలేకపోవడం వారి అసమర్ధతవల్లగాడు చుట్టూ వున్న వాళ్ళ దుర్మార్గపు ఆలోచనలవల్ల, ఒక ప్రణాళికతో ఆక్రమించే ప్రయత్నాలవల్ల అని అర్థమైంది.నిరంతరం ప్రజాసేవాభిలాషలో జ్వలించిన వారి ఆలోచనలు ఆదర్శవంతమైన జీవితపు వెలుగులు నేటి యువతరానికి, భావిభారతపౌరులకు తెలియజేయాలన్న సంకల్పంతో వ్రాయడం జరిగింది. పెండ్యాల రాఘవరావుగారి కన్న బిడ్డగా గర్వంగా తలెత్తుకొనగలుగుతున్నానని సవినయంగా తెల్పుతూ – నేను ఇందులో వ్రాయనివి, మీకు తెల్సినవి, ఆనాటి పోరాటాల విషయాలైనా, రాఘవరావుగారి వ్యక్తిత్వ విషయాలైనా తెలిసినవి వుంటే మాకు అందించాల్సిందిగా కోరుతున్నాను. ఈ పుస్తకాన్ని హృదయపూర్వకంగా స్వీకరించాల్సిందిగా అభ్యర్థిస్తున్నాను. _*_(పెండ్యాల రాఘవరావు జీవిత ప్రస్థానం’ అనే జీవిత చరిత్రను నేను తెలుగు అకాడమీకి వ్రాసిచ్చాను. 2014లో అకాడమీ ప్రచురించింది. నేను రాసిన చాలా భాగాలను తొలగించారు. నేను రాసిన ఈ ముందుమాటను కూడా అందులో ప్రచురించలేదు. ఆ జీవిత చరిత్రను ఇంకా పూర్తి చేయాల్సిన బాధ్యత నాపై ఉన్నదేమో !)( 2017 మార్చ్ నెలలో పెండ్యాల రాఘవరావు గారి శతజయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాము మేము . రాఘవరావు గారి సంతానం కొడుకులు కోడళ్లు, కూతుళ్ళు, అల్లుళ్ళు అందరం కలిసి. )
( మార్చ్ 15 పెండ్యాల రాఘవరావు గారి జన్మదిన సందర్భంగా)
ఉద్య మాలకు పురుటి గడ్డ వరంగల్లు. చరిత్ర కందని కాలం నుంచి ప్రజాఉద్యమా లు ఈ ప్రాంతంలో ఊ పిరి పోసుకున్నాయి . ఒక రంగం అని కాదు . శిల్ప కళ ,కవిత్వం నాట్యం ,నీటి పారుదల ,భవన నిర్మాణం మొదలుకొని సామాజిక ఉద్యమాల వరకు ఎందరో కళా కారులను,ఉద్యమకారులను, నాయకులను అందించిన ఘనత ఈ ప్రాంతానిది.
కాకతీయ చక్రవర్తులయిన గణపతి దేవుడు ,రుద్రదేవ మహారాజు , ప్రతాపరుద్రుడు మొదలుకొని బమ్మెర పోతన వంటి కవులు ,జాయప సేనాని వంటి యుద్ధ వీరుల వరకూ -ఆధునిక కాలంలో మాజీ ప్రధాని నరసింహ రావు గారు,కాళోజీ నారాయణరావగారు,,దాశరధి సోదరులు నేరెళ్ళ వేణు మాధవ గారు ఇలా ఎందరో వరంగల్లు ప్రాంతా నికే వన్నె తెచ్చారు . ఇలా ఎందరో . తెలియని మరెందరో .
ఈ list ఇలా సాగిపోతూనే ఉంటుంది. ఆ గడ్డలో పుట్టిన ఓ మహానుభా వుని గురించి గుర్తు చేసుకుందాం. వారే శ్రీ పెండ్యాల రాఘవ రావు గారు . 15 మార్చి 1917 నాడు వరంగల్ జిల్లా లోని చిన్న పెండ్యాల గ్రామంలో జన్మించారు .హై స్కూల్ చదువంత వరంగల్ లో సాగింది . బాల్యం గురించిన వివరాలు ఎక్కువగా దొరకట్లేదు . కానీ నూనూగు మీసాలు వచ్చినప్పటి నుంచి ప్రజాసంక్షేమమే ఆయన మాట,బాట ,గమ్యం కూడా .1935-36 నుండే మతమార్పిడులను వ్యతిరేకించారు. అందులో భాగంగా హరిజన వా డలకు వెళ్ళి ,వాళ్ళతో స్నేహం చేసి , నచ్చచెప్పే వారు . వారిలో నమ్మకం , విశ్వాసం కలిగించడానికి సహ పంక్తి భోజనాలను ఏర్పాటు చేశారు . నిరక్షరాస్య తను పోగొడితే వారిలో మార్పు మరింత త్వరగా వస్తుందని , హరిజన పాఠశాలను ప్రారంభించారు .
అగ్ర వర్ణాల పురుషులకే అరకొరగా వసతు లున్న ఆ రోజులలో హరిజనుల విద్య కోసం పాటుపడడం ఓ సాహసం . ఇలా ఎన్నో సాహసాలకు లకు ఆయన జీవితమే ఓ చిరునామా .
కుల వ్యవ స్థను ఖండిస్తూ, పోరాడారు . ఆజంజాహీ మిల్లు కార్మికులకోసం ఎన్నో ఉద్యమాలు నడిపారు.
తెలంగాణా సాయుధ పోరాటానికి మూలం అ యిన విసునూరు పోరాటం లో ముఖ్య భూమిక వహించారు .
వెట్టి చాకిరీనీ నిరసించారు .
గుండాలను సంస్కరించారు .
రజాకార్ ఉద్యమానికి వ్యతిరేకంగా సుధీ ర్ఘ మైన పోరాటం జరిపారు .
1938 లో కాంగ్రెస్స్ సత్యాగ్రహంలో పాల్గొన్నారు . కోపంతో బ్రిటిష్ ప్రభుత్వం జైలు శిక్ష తో బాటు 300 రూ జరిమానా విధించింది. 90 సంవత్సరాల క్రితం 300 రు అంటే ఆలోచించండి . తర్వాతి కాలంలో ఆంధ్ర మహా సభలో చేరారు .1946 లో దాన్ని రద్దు చేసినప్పుడు ఆజ్యత వాసం చేశారు . ఆయిన జీవితమే ఓ సాహసాల పందిరి .
వితంతు వివాహాలతో నైజాం రాజ్యంలో చైతన్యాన్ని జ్వలింప చేశారు .
గ్రం ధాలయ ఉద్యమం లో పా లు పంచుకున్నారు .
ఎన్నికల్లో విజయం వారి జీవితంలో ఒక అధ్భుత ఘట్టం . ఈ రోజుల్లో ఎలక్షన్లలో గెలవడం కోసం అన్నీ పార్టీలు ,అందరు అభ్యర్థులు
అనుచరుల సాయంతో వీధి వీధి తిరిగి వోట్లను అడుగుతున్నారు . వారికి ప్రజలపై నమ్మకంలేదు . అందుకే దేశ ఆర్థిక ప్రగతిని తలకిందులు చేసేలా తాయిలా లను ప్రకటిస్తున్నారు . అలానే ఓటర్లకు నాయకులపై నమ్మకం లేదు . ఇచ్చినవన్నీ పుచ్చుకొంటున్నారు . కొసరు కోసం బేరసా రాలను సాగిస్తున్నారు . ఫలితాలను ప్రకటించే వరకూ నేతలను టెన్షన్ లో ముంచెత్తుతున్నారు . ఇ లాంటి వ్యవస్థలో ఉంటూ ఇదే నిత్యాసత్యమనే భ్రమలో బ్రతికేస్తున్నాం మనం . 1952 సాధారణ ఎ న్నికలలో కమ్యూనిస్ట్ నాయకునిగా ఒక అపురూప రికార్డ్ ను సాధించారు . రాఘవరావు గారు వరంగల్ లోకసభ స్థానం తో బాటు హన్మకొండ ,వర్ధన్నపేట శాసన సభా స్థానాలనుంచి పోటీ చేశారు . మూడింటి లోనూ గెలిచారు . వరంగల్ లోకసభస్థానానికి ప్రాతినిధ్యం వహించారు.
అవునా?
అంతేకాదు . ఈ ఎన్నికలలో నామినేషన్ ను జైలు నుంచి వేశారు .
ఎందుకలా?
ప్రభుత్వ వ్యతిరేక పోరాటాలు చేసినందుకు అప్పటి ప్రభుత్వం అరెస్ట్ చేసి జైలులో పెట్టింది . ఎలాంటి ప్రచార ఆర్భాటాలు లేకుండా జైలు నుంచి పోటీ చేసి గెలిచిన ప్రజనాయకునికి ప్రజల తీర్పు అది .
నిజంగానా ?
అంతేకాదు ఈ విజయం సాధిం చేనాటికి ఆయన వయస్సు 35 ఏళ్ళే . దేశ చరిత్రలోనే ఇది అరుదైన రికార్డు . నా టి నుంచి ఒకేసారి 3 స్థానాల్లో పోటీ చేసి 3 చోట్ల గెలిచిన నేతలు ఇద్దరే . ఒకరు పెండ్యాల రాఘవరావు గారు ,మరొకరు నందమూరి తారక రామారా వు గారు .
అంటే
మీ అనుమానం నిజమే . 1952 లో నెలకొల్పిన రికార్డ్ సమానం కావడానికి 33 సంవత్సరాలు పట్టింది.
రాఘవరావ్ గారిది ఆకర్షణీ యమైన విగ్రహం . ముఖంలో చెరగని చిరు మందహాసం . మాటల్లో చా తుర్యం ,చమత్కారం ఉట్టిపడేవి . సమాజం లోని దుర్మార్గాన్ని ,అన్యాయాలను ప్రతిఘటించడానికి తీ వ్రవాదిగా మరి తుపాకి పట్టినా , కంఠంలో కారుణ్యం ,మనసులో మానవతా తొణికిసలాడేవి.
,అత్యున్నత చట్టసభలో ఎన్నో కీలకమైన చర్చల్లో పా లుపంచుకున్నారు . ఆయన ప్రసంగాలు శక్తి నిండిన ప్రవా హాలు .
M P గా పని చేసినంత శ్రద్ధగా గ్రామ పంచాయితీ సర్పంచ్ గాను పని చేశారు. గ్రామ వికాసానికి తా గు నీరు ,సాగునీరు, విద్యుత్ సౌకర్యం అతి ముఖ్య మైనవి . వీటి ప్రాధాన్యతను ఆనాడే గుర్తించి , కృషి చేసిన ప్రజానాయకుడు.
ఒక ఉత్కృష్టమైన జీవితం తన కధనాన్ని తానే రాసుకుంటుంది అనడానికి గొప్ప ఉదాహరణ వారి ఆత్మ కథ . దాని పేరు నా ప్రజాజీవితం . ఆయనకు తన కన్నా ,తన కుటుంబం కన్నా ప్రజలంటేనే మక్కువఎక్కువ . అందుకే భగవంతుడు ఆయన ఆత్మకధను అసంపూర్తిగా ఆపేశాడు .
ఏ నాయకుని జీవితము అసంపూర్తిగా మిగిలిపోదు . మరెన్ని ఉద్యమాలకో ఊపిరి పోస్తుంది . మరేందరికో స్ఫూర్తినిస్తుంది.
అలాంటి త్యాగమూర్తుల కృషి అనే పునా దులపైనే మనమీ నాడు జీ విస్తున్నాము .
కొస మెరుపు
మన ప్రియతమ సోదరి శ్రీమతి కొండపల్లి నీహరిణి గారు వీరి సుపుత్రికే . అవే లక్షణాలు వీరిలో శా ఖో ప శాఖలై పుష్పించి, ఫలిస్తున్నవి ఈ నాడు.
హిమజ కోటు — ధోతీ కవిత్వం.
ప్రముఖ కవయిత్రి,హిమజ కలం నుండి జాలువారిన సంచీలో దీపం కవితా సంపుటిలోని కోటు — ధోతీ కవిత పై విశ్లేషణా వ్యాసం.కోటు – ధోతీ కవితను ఆసక్తితో చదివాను.నాకు నచ్చింది.నాలో ఆలోచనలు రేకెత్తించింది.మనుషులు ధరించే కోటు – ధోతీ గురించి కవిత ఏమిటి? అని మనకు ఆశ్చర్యం కలిగించవచ్చు.మనుషులు చొక్కా పై కోటును ధరించడం గురించి మనకు అవగాహన ఉంది.ధోతీ పంచె అని పిలువబడే ఒక రకమైన వస్త్రం.ధోతీ అనేది పురుషులు ధరించే వస్త్రం.ధోతీ ఒక దీర్ఘ చతురస్రాకార రూపంలో ఉండే వస్త్రం. సాధారణంగా ధోతి సుమారు 4.5 మీటర్లు (15 అడుగులు) పొడవు,నడుము మరియు కాళ్ళ చుట్టు చుట్టబడి,ముందు లేదా వెనుక భాగంలో ముడి వేయబడి ఉంటుంది.ధోతీని మత పరమైన మరియు లౌకిక వేడుకలలో పురుషులు ధరిస్తారు.పీతాంబరం అనేది పసుపు రంగు పట్టు ధోతి.కొందరు వ్యక్తులు ధోతీని ధరిస్తారు. కొందరు పాయింట్ వేసుకుంటారు. కొందరు నిక్కర్ వేసుకుంటారు.లోకంలో భిన్నమైన మనస్తత్వాలు కలవారు ఉంటారు.భిన్నమైన రీతిలో వస్త్ర ధారణ చేస్తారు.మనుషుల అభిరుచి ఒక్క రీతిగా ఉండదు.వారు ఎవరికి ఇష్టమైన వస్త్రం వారు ధరిస్తారు. కవయిత్రి హిమజ కోటు – ధోతీ కవితా చరణాల్లోకి వెళ్లి దృష్టిని సారించండి.అలౌకిక అనుభూతిని సొంతం చేసుకొండి.
“ ఆ కాలపు ఆహార్యమో
“ఉద్యోగ ధర్మంగా అనివార్యమో
“ఆదివారం మినహాయించి అన్ని రోజులు
“మామయ్య గారు – కోటుతోనే కన్పించే వారు మాకు.
ఆహార్యం అంటే మేకప్.మేకప్ అంటే ఈ రోజుల్లో అందరికీ అర్థమవుతుంది.వేషానికి ధరించే సామాగ్రి ఆహార్యం తెచ్చుకొనతగినది.నాటకాలలో నటుల హావభావాలకు పాత్రకు తగిన ఆహార్యానికి ప్రాధాన్యత ఉంటుంది.వస్త్ర ఆభరణాలు ఆయా పాత్రలకు సందర్భోచితంగా ఉన్నప్పుడే ప్రేక్షకులకు ఆనందానుభూతి ఏర్పడుతుంది.వీరుడికి కాలోచితంగా కత్తి,డాలు,పిస్టల్,కవచము వంటివి ఆహార్యంలో ఒక భాగం.విషాద సన్నివేశంలో అయితే దానికి తగిన వస్త్రాలు ధరిస్తారు. రసానుగుణంగా పాత్రలు ధరించే ఆభరణాలు, అనులేపనలు అన్ని ఆహార్యంలోనివే.మామగారు ధరించే దుస్తులు అప్పటి కాలానికి సరిపోయే విధంగా ఉండేవి అని తెలుస్తుంది.అతను నిర్వర్తించే ఉద్యోగ ధర్మంలో భాగంగా వస్త్రధారణకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చే వాడు అని తోస్తోంది.అతడు ప్రతి రోజు తన విద్యుక్త ధర్మమైన విధుల్లో భాగంగా చొక్కాపై కోటు వేసుకొనే వాడు.ఆదివారం నాడు సెలవు దినం కనుక అతను ఆ రోజు సాధారణంగా మామూలు దుస్తులు ధరించే వాడు.ఆ ఒక్కరోజు మాత్రమే అతను కోటు ధరించే వాడు కాదు.మిగతా రోజులలో చొక్కాపై కోటు వేసుకుని మామయ్య కనిపించే వారు అని కవయిత్రి హిమజ కవితలో చెప్పిన తీరు అద్భుతంగా ఉంది.
“జమా బందీలు జరిగినా
“శిస్తు వసూళ్లకు సాగినా
“రెవెన్యూ దౌరాలకు కదిలినా “ఒంటినంటుపెట్టుకొని కోటు ఉండి తీరాల్సిందే.
జమాబందీ భారతదేశంలో ఒక నిర్దిష్టమైన భూమికి సంబంధించిన హక్కుల రికార్డును సూచించడానికి ఉపయోగించే హిందీ పదం.జమాబందీలో యజమానుల పేర్లు,భూమి యొక్క విస్తీర్ణం,దాని ఉపయోగం మరియు భూమిపై ఏవైనా తణఖాలు, శిస్తులు వంటి వివరాలను కలిగి ఉంటుంది. పూర్వకాలం నుంచి ప్రభుత్వానికి ప్రధాన ఆర్థిక వనరు భూమి శిస్తు.భూమి శిస్తు వసూలు చేసి ఖజానాకు జమ చేయడం జరుగుతుంది.అతను రెవెన్యూ శాఖలో తహసిల్దారుగా పని చేసే వాడు అని తెలుస్తుంది.అతను తహాసిల్దార్ హోదాలో జమా బందీలకు,సాధారణంగా సంవత్సరానికి ఒక సారి శిస్తుల వసూలు కొరకు జరిగే సమావేశాలకు హాజరయ్యే వాడు. వ్యవసాయ భూముల శిస్తు వసూళ్లకు అధికారికంగా పర్యటించే వాడు.విధి నిర్వహణలో భాగంగా అతడు రెవెన్యూ దౌరాలకు వెళ్లే వాడు.జమా బందీలకు వెళ్లినా,శిస్తు వసూళ్లకు వెళ్లినా,రెవెన్యూ దౌరాలకు వెళ్లినా అతను కోటు ధరించి వెళ్ళే వాడు.అతను వెళ్లే అధికారిక కార్యక్రమాలకు ఒంటినట్టు పెట్టుకొని కోటు ఉండి తీరాల్సిందే అని కవయిత్రి హిమజ కవితలో చెప్పిన తీరు చక్కగా ఉంది.
“పాల తెలుపు అంగీ గ్లాస్కో ధోతీ మీద
“లేత రంగు కోటు ఎంత గంభీరమో అంతే హుందాతనం
“లోపలి మెత్తటి అస్తరుతో కోటు తిర్ల మర్ల తెలియకున్నా
“మామయ్య గారి జీవితమైతే తెరిచిన పుస్తకమే.
అతను పాల తెలుపు రంగు చొక్కా ధరించే వాడు. గ్లాస్కో కంపెనీ తయారుచేసిన ధోతీని కట్టుకునే వాడు.తెల్ల చొక్కాపై లేత రంగు కోటు ధరించిన అతను ఎంతో గంభీరంగా ఉండే వాడు.అతడు హుందాగా ప్రవర్తించే వాడు.అతని నడకలో ఒక రకమైన ఠీవి కనిపించేది.అతను హుందాతనంతో మనోహరమైన అందమైన వర్చస్సుతో ఇతరులను ఇట్టే ఆకర్షించే సుగుణంతో పాటు మర్యాద, మన్ననను పొందే వాడు.అతను వేసుకున్న కోటు లోపలి మెత్తటి అస్తరుతో కూడి ఉండటం వలన కోటు తిర్ల మర్ల తెలిసేది కాదు.మామయ్య గడిపిన జీవితం తెరిచిన పుస్తకం వలె రహస్యాలు, దాపరికాలు,ఏవీ ఉండేవి కావు.అతడు అందరితోనూ ప్రేమగా సౌహార్ధంగా వ్యవహరించే వాడు.అతడు గడిపిన జీవితం ఎలాంటి భేషజాలు లేకుండా ఉండేవి.తెరచిన పుస్తకం అనే మాట మనకు అక్కడక్కడ వినిపిస్తుంది.కనిపించే మనిషి లోపల అగుపించని మనసు ఉన్నంత కాలం అంతా దాపరికం,దాగుడు మూతలు,మాయగా ఉంటుంది. సృష్టిలో జన్మించాక అవసరాలు తీరడం కోసం మనిషి ఒక్కో చోట ఒక్కో తీరుగా వ్యవహరించాలి. తప్పదు.దాన్ని లోకజ్ఞానం అంటారు పెద్దలు.
“ఉద్యోగ బాధ్యతల్లో నిక్కచ్చితనం
“అవినీతికి ఆమడ దూరం – పైస పైస కష్టార్జితం
“తాటాకు మంట కోసం పసి పిల్లల బోళాతనం
“ఆఫీసు ఇల్లు రాముల వారి పూజ
“నుదుట వెలిగే తిరునామమెంత సరళమో
“అంతే సాదా సీదాయైన జీవన సరళి.
రెవెన్యూ శాఖలో ఉద్యోగం అయినప్పటికీ అతను ఎలాంటి ప్రలోభాలకు,అవినీతికి లొంగ లేదు.ఉద్యోగ బాధ్యతలను అతడు నీతిగా,నిజాయితీగా, నిక్కచ్చితనంతో నిర్వహించే వాడు.అతడు అవినీతికి ఆమడ దూరంలో ఉండే వాడు.అతను ఉద్యోగంతో వచ్చిన జీతంతోనే బతుకు బండిని సాగించే వాడు.అతను సంపాదించిన జీతం పైస పైస కష్టార్జితం అని చెప్పవచ్చు. తాటాకు మంట కోసం ఉండే పసిపిల్లల బోళాతనం అతనిలో కనిపించేది.అందరి పట్ల సమాన దృష్టితో పసిపిల్లల వలె అతను వ్యవహరించే వాడు అని తెలుస్తుంది. ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా అతను ఉదయం ఇంటి నుండి ఆఫీసుకు వెళ్లే వాడు.ఆఫీస్ పని పూర్తి అయిన తర్వాతనే అతను ఇంటికి చేరుకునే వాడు. అతను ఆఫీస్ బాధ్యతలను ఇంటి బాధ్యతలను సంయమనంతో నిర్వహించే వాడు.ప్రాతఃకాలంలో అతను లేచిన తర్వాత కాలకృత్యాలు తీర్చుకుని నుదుట తిరునామం ధరించి ఇంటిలోని రాముల వారిని పూజించే వాడు.అతడు నుదుట ధరించిన తిరు నామం ఎంతో సరళంగా ఉంటుంది. సాదా సీదాయైనా జీవన సరళితో అతను బతుకును సాగించాడు.సభ్యతా సంస్కారాలతో కూడిన అతని జీవన సరళి అందరికీ అనుసరణీయం అని తోస్తోంది.
“కోటు – ధోతీ ఆహార్యంలో
“ఎక్కడ ఎవరు కన్పించినా
“మామయ్య గారి రూపు – నా స్మృతిలో
“తడి మెరుపై మెరిసి మాయమవుతుంది.
ఆమె జీవిత ప్రయాణంలో ఎక్కడికి వెళ్లినా కోటు ధోతీ కట్టుకొని ఎవరు కనిపించినా మామయ్య గారి రూపం ఆమె జ్ఞాపకాల్లోకి వచ్చి కళ్ళముందు అతను ప్రత్యక్షమయ్యే వాడు.మామయ్య గారు అలా కనిపించగానే ఆమె కళ్ళలో కన్నీటి ధారలు ఒక్క సారిగా ఆకాశంలోని మెరుపులా మెరిసి మాయమయ్యేవి మామయ్యగారు చనిపోయి చాలా కాలం అయినప్పటికీ ఆమె జ్ఞాపకాలలో అతను సజీవంగా నిలిచి ఉన్నాడు.అతను ఆమె పట్ల చూపించిన అనురాగం అపారమైనది, అసాధారణమైనది.అందుకే ఆమె ఎల్లప్పుడూ అతనిని జ్ఞాపకాల ద్వారా గుర్తు చేసుకుంటున్నది అని కవయిత్రి హిమజ కవితలో వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.
“ఉద్యోగుల బలవంతపు పదవీ విరమణతో
“ఒక్కసారిగా ఆయన డీలా పడితే
“ఒంటిమీద కోటులన్ని శుభ్రపడి
“అలమరలో దాక్కున్నాయి.
పదవీ విరమణ అనేది ఒకరి స్థానం లేదా వృత్తి నుండి లేదా ఒక చురుకైన పని జీవితం నుండి వైదొలగడంగా చెప్పవచ్చు. ఉద్యోగంలో చేరిన వారు ఒక నిర్దిష్టమైన వయసు వచ్చిన తర్వాత ఉద్యోగం నుండి పదవీ విరమణ చేస్తారు.ఇన్నాళ్లు రెవెన్యూ శాఖలో ఒక బాధ్యత గల పదవిలో నుండి పదవీ విరమణ కాగానే అతనికి ఏమీ తోచేది కాదు.పదవీ విరమణ పొందిన అనంతరం ఒక్క సారిగా ఎందుకో తెలియదు అతను ఢీలా పడి పోయాడు.అతను రోజు కోటు వేసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది.అందు వల్ల అతను ధరించే కోటు దుస్తులు శుభ్రంగా ఉతికి ఆరిన తర్వాత అలమారలో దాచి పెట్టినారు.అతను ధరించిన ఒంటి మీద ఉన్న కోటులు అన్ని శుభ్రపడి అలమరలో దాక్కున్నాయి అని కవయిత్రి హిమజ చెప్పిన తీరు చక్కగా ఉంది.
“ఆస్తుల్ని నాకిచ్చి అకాలంగా వెళ్లిపోయిన
“ఆయన ఆస్తిగా భద్రంగా
“కోటు జేబులో దాచుకున్నది
“చిన్నారి శైలు ఛాయా చిత్రం ఒక్కటే.
మనిషి జీవితంలో అన్ని రోజులు ఒక్కలా ఉండవు. అకాలం అనగా మంచిగా జరగని కాలం.అతను జీవితంలో ఎంతో కష్టపడి సంపాదించిన ఆస్తుల్ని నాకు ఇచ్చి తిరిగిరాని లోకాలకు చేరినాడు.అతను అకాలంగా వెళ్లి పోయిన రోజు గుర్తుకు వస్తే మనసుకు బాధ కలుగుతుంది.ఈ లోకాన్ని వీడిపోయిన అతను తన చేతుల్లో పెరిగిన చిన్నారి శైలు ఫోటోను ఆస్తి వలె భద్రంగా తన కోటు జేబులో దాచుకున్నాడు అని కవయిత్రి హిమజ కవితలో చెప్పిన తీరు అద్భుతంగా ఉంది.
“యాభయేళ్ళ క్రితపు డైరీలో
“ఆయన రాసి పెట్టుకున్న ఒకే ఒక్క పేజీ
“శైలు తల్లి పుట్టిన తేది మాత్రమే !
డైరీ దినచర్య పుస్తకం.ఒక వ్యక్తి తను చూసిన లేదా విన్న దాని గురించి గాని వారు చేస్తున్న పని గురించి గాని ఏ రోజు జరిగిన సంఘటనలు ఆ రోజు నమోదు చేయు పుస్తకం డైరీ.ప్రజలు వివిధ కారణాల వల్ల డైరీలను వ్రాసేందుకు ఇష్టపడతారు. డైరీ రాసే వ్యక్తి తన జీవితంలో ఏమి చేశాడనే దాని గురించి తనకంటూ ఒక రికార్డు ఉండాలని అతను కోరుకుంటాడు.ఈ లోకాన్ని వీడిన అతని ఇంటి అలమరలో వెతకగా 50 ఏళ్ల క్రితం నాటి డైరీ ఒకటి దొరికింది.అతను డైరీలో రాసి పెట్టుకున్న ఒకే ఒక పేజీ కనబడింది.అతను డైరీలో రాసి పెట్టుకున్నది శైలు తల్లి పుట్టిన తేదీ మాత్రమే.50 సంవత్సరాల కిందటి డైరీలో మిగతా పేజీల్లో ఏమీ రాయలేదు.ఒక పేజీలో మాత్రం శైలు తల్లి పుట్టిన తేదీని నమోదు చేసి పెట్టుకున్నాడు.అతనికి శైలు తల్లి పుట్టిన రోజు అంత ముఖ్యమైనదిగా,అపురూపమైనదిగా తోస్తోంది.కవయిత్రి హిమజ తనను ప్రాణంగా సాదుకున్న మామయ్య గారి స్మృతిలో కోటు – ధోతీ కవితను రాసి పాఠక లోకానికి అందించింది. కవయిత్రి హిమజ రాసిన కోటు – ధోతీ కవిత ఎప్పటికీ నిలిచి ఉంటుంది.చక్కటి స్మృతి కవిత రాసినందుకు కవయిత్రి హిమజను అభినందిస్తున్నాను.కవయిత్రి హిమజ మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.
కున్వర్ నారాయణ్ హిందీలో రచించిన కవిత.
ఆంగ్లం అనువాదం : అపూర్వ నారాయణ్.
తెలుగు అనువాదం : వారాల ఆనంద్.
కున్వర్ నారాయణ్ వింతయిన రోజు కవిత పై విశ్లేషణా వ్యాసం.
ప్రఖ్యాత కవి,కున్వర్ నారాయణ్ హిందీలో రాసిన ఓ వింతయిన రోజు కవిత ఇది.కున్వర్ నారాయణ్ హిందీలో రాసిన కవితను అపూర్వ నారాయణ్ ఆంగ్లంలోకి అనువాదం చేశాడు.కున్వర్ నారాయణ్ హిందీలో రాసిన ఓ వింతయిన రోజు కవితను వారాల ఆనంద్ తెలుగులోకి అనువాదం చేశాడు. తెలుగులోకి వారాల ఆనంద్ అనువాదం చేసిన వింతయిన రోజు కవిత చదవగానే నాలో కలిగిన భావాలకు అక్షర రూపం దాల్చిన విశ్లేషణా వ్యాసం ఇది.ఏదైనా కొత్త విషయం తెలిస్తే మనకు వింతగా అనిపిస్తుంది.ఏదైనా కొత్త వస్తువు అపురూపమైనది చూస్తే మనకు వింతగా అనిపిస్తుంది.మనలను సంభ్రమాశ్చర్యాలకు ముంచెత్తే విషయం వింతగా చెప్పవచ్చు. ఏదైనా వింతను చూస్తే ఆశ్చర్యపోతాం. ఆశ్చర్యం కలిగించే మాటలు వినినప్పుడు మనకు వింతగా అనిపిస్తుంది. అసాధారణమైన మాటలు వినినప్పుడు లేదా చూసినప్పుడు మన మనసులో కలిగే భావనను వింతగా చెప్పవచ్చు. విస్మయము కలిగించే వస్తువును కూడా వింత గొల్పేది అని చెప్పవచ్చు.ప్రపంచంలోని ఏడు వింతల్లో తాజ్ మహల్ కూడా ఒకటి.రోజుకు 24 గంటల సమయం ఉంటుంది.కాలచక్రం ఎవరికి తెలియకుండానే గిర్రున తిరుగుతూ ఉంటుంది.మనం అనుభవించే ప్రస్తుత క్షణం కూడా రోజులోని భాగమే అని చెప్పవచ్చు. రోజును దినం అని కూడా అంటారు.రోజును వివిధ రకాలుగా పిలుస్తారు.ఏదో ఒక రోజు అని చెబుతాం. ప్రతిరోజు అని కూడా అంటాం.జీతాలు ఇచ్చే రోజును జీతాల రోజు అని అంటాం.కొందరు పుట్టిన రోజు సందర్భంగా వేడుకను జరుపుకుంటారు. కొందరు భార్యాభర్తలు పెళ్లి రోజు సందర్భంగా వేడుకను జరుపుకుంటారు.సమాజానికి గొప్ప సేవ చేసిన వారు లోకాన్ని వీడిన రోజును వర్ధంతి రోజుగా జరుపుకుంటారు. సమాజానికి గొప్ప సేవ చేసి చనిపోయిన వ్యక్తి జన్మించిన రోజును కూడా జయంతి రోజును వేడుకగా జరుపుకుంటారు. నడుస్తున్న ఈ రోజున మంచి జరిగితే మంచి రోజు అని చెబుతారు.నడుస్తున్న ఈ రోజున ఏదైనా దుర్ఘటన జరిగితే దానిని చెడ్డ రోజు అని చెబుతారు. ఓ వింతయిన రోజు కవిత ఏమిటి? అని ఆసక్తితో చదివాను.అసలు వింతయిన రోజు ఏదైనా ఉంటుందా? అనే సందేహాలు మనలో పొడచూపవచ్చు.వింతయిన రోజు అనగానే మనకు ఆశ్చర్యం కలుగుతుంది.ఓ వింతయిన రోజు ఏమిటి? అనే సందేహాలకు సమాధానాలు కున్వర్ నారాయణ్ హిందీలో రాసిన కవితను చదివితే తెలుస్తుంది.కవి కున్వర్ నారాయణ్ వింతయిన రోజు కవిత ద్వారా ఒక రోజులో జరిగిన వింతలు,విశేషాలను వ్యక్తం చేయడం అద్భుతంగా ఉంది.వింతయిన రోజు సందర్భంగా అతను ఏమేమి చేశాడు? ఆ రోజున అతనికి ఏమేమి జరిగింది అనే సంఘటనలను పూసగుచ్చినట్టు విడమర్చి చెప్పిన తీరు అబ్బురం కలిగిస్తుంది.వింతయిన రోజున జరిగిన దానిని అతను అదృష్టంగా భావిస్తున్నాడు.వింతయిన రోజు గురించి తెలుసుకోవాలి అనే ఆసక్తితో కవిత చరణాల్లోకి వెళ్లి దృష్టిని సారిద్దాం.వింతయిన రోజులో జరిగిన సంగతులు తెలుసుకొని అలౌకిక అనుభూతులను సొంతం చేసుకుందాం.
“ నేను రోజంతా గాయి గాయిగా తిరిగాను
“ ఎలాంటి ప్రమాదం సంభవించలేదు
“ అనేకమంది మనషుల్ని కలిసాను
“ ఎక్కడా అవమానం ఎదురు కాలేదు.
అతను అలా రోజంతా పని చేయకుండా వృధాగా నగరమంతా ఎందుకు తిరిగాడు? అతను ఆ రోజున చేయాల్సిన పని చేయకుండా ఎందుకు వృధాగా వీధులలో తిరుగుతాడు? అని మనకు ఆశ్చర్యం కలుగుతుంది.కారణాలు ఏమిటో అతడు చెబుతున్నది నిజమేనా? అని మనకు సందేహం కలుగుతుంది.అతను అంత పెద్ద నగరంలో అలసట ఎరుగక,విసుగు చెందకుండా వృధాగా తిరిగినప్పటికీ ఆ రోజు ఏ వాహనం వల్ల గాని మరే విధంగా గాని ప్రమాదం సంభవించలేదు అని అంటున్నాడు. నిజమేనా?ఆ రోజు ఎలాంటి పని చేయకుండా నగరంలోని వీధులన్నీ తిరుగుతూ వృధా సంచారం చేస్తూ ఖాళీగా ఉండక అనేకమంది మనుషులను కలిశాను,మాట్లాడాను అని అంటున్నాడు.ఆ రోజు కలిసిన వ్యక్తులు అందరు అతనితో సానుకూలంగా మాట్లాడారు.అతనితో ఎలాంటి వాదోపవాదాలు చర్చలు జరప లేదు.ఆ రోజు ఎందుకో ఏ మనిషి వల్ల అతనికి అవమానం ఎదురు కాలేదు.అతను చెప్పిన మాటలు వింటుంటే ఎందుకో మనకు నమ్మశక్యం అనిపించదు.ఆ రోజు జరిగిన సంగతుల గురించి అతని మాటలు వినగానే మనకు ఆశ్చర్యం కలుగుతుంది.ఆ రోజు అతను కలిసిన అనేకమంది మనుషులు సానుకూలంగా మాట్లాడటం ఏమిటి? ఎలాంటి గొడవలు లేకుండా మనుషులు అందరు సానుకూలంగా ఎలా ఉంటారు?.మనుషులు అందరు ఒక్కలా ఉండరు.మనుషులు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తారు.ఒకరినొకరు విమర్శించుకుంటూ,వ్యతిరేకిస్తూ అవమానించుకుంటారు.కాని ఆ రోజున ఇలాంటివి ఏమీ జరగలేదు అన్న అతని మాటలు వింటుంటే ఆశ్చర్యంతో పాటు ఆనందం కలుగుతుంది.
“ నేను రోజంతా సత్యమే మాట్లాడాను
“ ఎవరూ తప్పుగా స్వీకరించలేదు
“ నేనివాళ అందరిని విశ్వసించాను
“ ఎక్కడ మోసగింప బడలేదు.
అతను ఈ రోజు అందరితో సత్యమే మాట్లాడాడు.అతను మాట్లాడిన మాటలను ఎవరు తప్పుగా అర్థం చేసుకోలేదు. అతను మాట్లాడిన మాటలను ఎవరు ఎందుకు వ్యతిరేకించలేదు?ఆ రోజు సత్యాన్ని మాత్రమే మాట్లాడటానికి అతను సత్య హరిశ్చంద్రుడు కాదు.అతను సత్యం ఎలా మాట్లాడాడు? అతను సత్యం మాట్లాడుతుంటే అందరు అతన్ని సత్యవంతుడుగా ఎలా స్వీకరించారు? అనే సందేహాలు కలుగవచ్చు.అతను ఆ రోజు అందరు మనుషులను విశ్వసించాను అని చెబుతున్నాడు.ఎవరైనా అందరి మనుషులను విశ్వసిస్తారా? అప్పుడే పరిచయమైన వ్యక్తిని ఎలా విశ్వసిస్తారు? అతను ఎవరో? ఏం చేస్తుంటాడో? అతని గురించిన వివరాలు ఏమీ తెలవదు.అతను తెలవని వ్యక్తిని విశ్వసించాను అని చెబుతున్నాడు. అతని మాటలు వింటుంటే ఆశ్చర్యం గొలుపుతుంది. ఏ మనిషి చేత ఎక్కడ మోసగింపబడ లేదు అని చెబుతున్నాడు.మనకు తెలియని మనిషి ఎలా సాయం చేస్తాడు.తెలియని వ్యక్తి సాయం చేస్తాను అని అతనితో చెప్పి మోసం చేసే అవకాశం కూడా ఉంటుంది.సాయం చేస్తానని తెలిసిన మనిషి చెప్పిన మాటలను కూడా పూర్తిగా విశ్వసించలేము.తెలిసిన మనిషి కూడా నమ్మించి మోసం చేసే అవకాశాలు కూడా ఉంటాయి.తెలిసిన మనిషిని కూడా పూర్తిగా విశ్వసించలేము.తెలవని వ్యక్తులు కూడా అతనిని మోసగిస్తారు. తెలిసిన వ్యక్తులు కూడా అతనిని మోసగిస్తారు.ఆ రోజు అతను ఏం చేస్తున్నాడో? ఎక్కడికి పోతున్నాడో? ఏం పని మీద పోతున్నాడో? తెలియకుండా అయోమయంగా నగరం అంతా సంచరించడం ఆశ్చర్యం గొల్పుతుంది.ఆ రోజు అతను అందరిని ఎలా విశ్వసించగలడు?ఆ రోజు ఎందుకో అతనిపై అందరికి నమ్మకం కుదిరింది. అందుకే అతను అందరిని విశ్వసించాడు అని తోస్తుంది.ఆ రోజు మనుషులు అందరు సత్యవంతులు అని అతడు భావించాడు.సమాజం నిండా మోసగాళ్ళు నిండి ఉన్నప్పుడు ఆ రోజు అతన్ని మోసం చేయకుండా ఎలా ఉంటారు? అనే సందేహాలు మనలో తలెత్తుతాయి.సత్యమేవ జయతే అని సూక్తి ఉంది.సత్యమే జయిస్తుంది. హరిశ్చంద్రుడు సత్యం కొరకు ఎన్నో పరీక్షలు ఎదుర్కొన్నాడు.చివరికి విజయం సాధించాడు. హరిశ్చంద్రుడు సత్యమైన బాటలో నడిచి సత్యవంతుడుగా ఖ్యాతి గడించాడు.
“ అద్భుతమయిన విషయమేమిటంటే
“ నేను ఇంటికి చేరుకోగానే
“ తిరిగొచ్చింది ఇంకెవరో కాదు
“ నేనే అని కనుగొన్నాను.
ఆరోజు నగరంలో అతను ఎటు పోతున్నాడో? ఏమి చేస్తున్నాడో? తెలియకుండా అయోమయంగా వీధులన్నీ తనవిగా భావించి తిరిగాడు.ఎందుకో ఆ రోజంతా తిరిగిన తర్వాత అలసిపోయిన అతను ఒక ఇంటికి చేరాడు.ఆ ఇల్లు ఎవరిదో అని అనుకున్నాడు.అద్భుతంగా ఆ రోజు నగరం అంతా తిరిగిన తర్వాత మొహమంతా పీక్కుపోయి బాగా అలసిపోయినాడు.ఇది ఎవరి ఇల్లో? అని మనసులో అనుకున్నాడు.ఆ రోజంతా నగరంలో తిరిగిన తర్వాత అలసిపోయి చిత్రంగా తన ఇంటికే చేరుకున్నాడు.ఎందుకో ఆ రోజు అయోమయంగా ఎక్కడ తిరిగినప్పటికీ ఏం చేసినప్పటికీ అతని అడుగులు మాత్రం మర్చిపోకుండా ఇంటికి చేర్చాయి అని చెప్పిన తీరు చక్కగా ఉంది.ఇంకా అతను ఆ రోజు జరిగిన విషయాన్ని గొప్పగా అందరికీ తెలియజేస్తున్నాడు.ఆ రోజు జరిగిన అద్భుతమైన విషయం ఏమిటి? అంటే చివరికి నగరమంతా తిరిగిన తర్వాత ఎక్కడికి వెళ్లాలో తెలియలేదు. చివరికి తన ఇంటికి చేరుకున్నాడు.అతను తన ఇంటికి చేరిన తర్వాత తెలిసింది.అయోమయంగా నగరమంతా తిరిగి తన ఇంటికే వచ్చినాడు.నగరం అంతా తిరిగి తన ఇంటికి వచ్చినది ఇంకెవరో కాదు తానే అని తెలుసుకున్నాడు.అయోమయంగా నగరం అంతా తిరిగిన ఆ రోజు అతని జీవితంలో జరిగిన అద్భుతమైన సంఘటనగా వింతైన రోజుగా తోస్తోంది.అతను ఆ రోజు ఏం చేసింది? అన్ని విషయాలు అందరితో పంచుకున్న తీరు చక్కగా ఉంది.అతని జీవితంలోని ఆ రోజుకు సంబంధించిన వింత విషయాలను పాఠకులకు అర్థం అయ్యేలా కవి కున్వర్ నారాయణ్ వింతయిన రోజు కవితలో చెప్పిన తీరు అద్భుతం అని చెప్పవచ్చు.ఆ రోజు జరిగిన వ్యక్తి జీవితంలోని సంఘర్షణలను కవితగా మలిచిన తీరు స్ఫూర్తిదాయకంగా ఉంది.ఆ రోజు వ్యక్తిలో చెలరేగిన భావాలను వింతైన రోజు కవితలో వ్యక్తం చేసిన తీరు అద్భుతంగా ఉంది.కవి కున్వర్ నారాయణ్ హిందీలో రాసిన కవితను తెలుగులోకి అద్భుతంగా అనువాదం చేసిన కవి వారాల ఆనంద్ ను అభినందిస్తున్నాను.
పాఠక లోకానికి నమస్సులు!
ప్రముఖ కవయిత్రి , రచయిత్రి దేవనపల్లి వీణావాణి మయూఖ పత్రిక లో ‘ దర్శనం‘ పేరుతో కాలమ్ రాస్తున్నారని తెలియజేయడానికి సంతోషిస్తున్నాము. ఇది సమీక్ష నో , విమర్శనో కాదు. ఒక సమున్నత రచన వైపు చూడవలసిన అవసరాన్ని చూపే ఉద్దేశ్యం తో రాస్తున్న కాలమ్. విషయ విశేషతను అర్థం చేసుకోవాల్సిన అవసరాన్ని చెప్పడం. భారతీయ సంస్కృతి విశిష్టత ను, అంతరార్థాన్ని గౌరవంతో వివరించడం కోసం మయూఖ పాఠకుల కోసం రచయిత్రి ‘ దర్శనం‘ చేయించే ప్రయత్నం ఈ కాలమ్ ప్రత్యేకత. ఆదరిస్తారని ఆశిస్తూ…
-డాక్టర్ కొండపల్లి నీహారిణి
మయూఖ సంపాదకులు.
“యోగం” అంటే నేను అర్థం చేసుకున్నంత వరకు “ధారణ చేసుకోగల శక్తి”. ఈ శక్తి శరీరమూ, మనసు ఒకే సరళ రేఖ మీదకు తెచ్చుకోగలిగినప్పుడే సిద్ధిస్తుంది. మహర్షులు ఈ ధారణా శక్తిని సాధించడానికి అనేక మార్గాలు చూపించారు. వాటిని యోగ దర్శనాలు అన్నారు. భగద్గీతలో కృష్ణుడు చెప్పిన జ్ఞాన, భక్తి, కర్మ యోగాలు, పతంజలి అష్టాంగ యోగం, కపిలుని సాంఖ్య యోగం ఇవి మహర్షులు చెప్పినవి. మనముందు కాలపు యోగులు మహావతార్ బాబాజీ క్రియా యోగం, మాస్టర్ సీవివి గారి భక్తృ రహిత రాజ యోగం, అరవిందుల పూర్ణ యోగం, ప్రస్తుత కాలపు యోగులు మాత నిర్మలా దేవి సహజ యోగం, సద్గురు ఈశా యోగం, దాజీ సహజ మార్గ యోగం ఇలా అనేక యోగ మార్గాలు చూపుతున్నారు.
అనేక మంది ఆధ్యాత్మిక సత్ జీవన చరిత్రలు ఏదో యోగ సూత్రానికి అనుసంధానించి ఉన్నవే.నా మటుకు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి సాధనాపరులతో ఉన్నప్పటికీ అది నాకు అర్థం కాలేదు, సాధ్యమూ కాలేదు. మనః శరీరాల మధ్య సమన్వయం లేనిదే ఏ యోగ సాధనా సఫలం కాలేదని మాత్రం తెలుసుకోగలిగాను. గీత, కపిలుని సాంఖ్యం, క్రియా, భక్త్రు రహిత రాజయోగం మీద కొంత అవగాహన ఉన్నప్పటికీ అది కేవలం పత్రికలు చదివి వార్తలు గ్రహించినంత మాత్రమే.
అయితే నేను పోటీ పరీక్షలకు చదువుతున్నప్పుడు శ్రీ అరబిందో గురించి , అతను “సావిత్రి “ని రాశారని తెలుసుకున్నప్పుడు అదేమిటో తెలుసుకోవాలన్న ఆసక్తి కలిగింది. ఒక ICS అధికారి కాగదగినవాడు, విప్లవకారుడు, స్వతంత్ర పోరాటంలో ఉన్నవాడు, ఉన్న ఫలంగా ఎలా యోగ దర్శనం చేశాడు, ఎలా పూర్ణ యోగం సిద్ధాంతం చేశాడు, యోగిగా ఎలా మారాడు అన్నది తెలుసుకోవాలని జిజ్ఞాస కలిగింది. అయితే అన్నిటికీ మించి అతని ‘ సావిత్రి ‘ లో ఏముంది అని , అది తెలుసుకోవాలనీ అనిపించేది. అది స్వామి రామా రాసినట్టుగా ఆధ్యాత్మిక ప్రయాణపు అనుభవాల సమాహారం అయి ఉండవచ్చు అని చాలా రోజుల వరకు అనుకున్నాను. తెలుగులో చదవగలిగితే బాగుండుననీ అనుకున్నాను.కొన్నాళ్ళకు నాకు వరంగల్ సెంట్రల్ లైబ్రరీ లో ఒక కాపీ దొరికింది కూడా. కానీ ఎంత అడిగినా లైబ్రేరియన్ Xerox తీసుకోవడానికి గానీ ఇంటికి తీసుకు వెళ్లి చదవడానకి గానీ అనుమతించలేదు.ఒకే ఒక కాపీ ఉండడం దానికి కారణం.
మరి కొన్నాళ్ళకు నాకు సిరికోన సాహిత్య అవార్డుల కార్యక్రమం లో శ్రీ వాసిలి వసంత కుమార్ గారి పరిచయమైంది. వారు అరవిందుల సావిత్రిని ఆంధ్ర మహా సావిత్రి లా తెలుగు చేసిన మాస్టర్ శార్వరి గారి పుత్రులు. అయితే ఆ విషయం నాకు తెలియదు. మాటల్లో నేను సావిత్రిని చదవాలని ఉందని ,అయితే అది దొరకడం లేదనీ అన్నాను. వారు, మా తండ్రి గారు శార్వారి , వారే దానిని అనుసృజన చేశారని చెప్పడంతో ఆశ్చర్య పోయాను. అనేక పునర్ముద్రణ ల తర్వాత తిరిగి ముద్రించామనీ , తప్పక ఒక కాపీ పంపగలననీ హామీ ఇచ్చి మరో పది రోజుల్లో పంపారు.
ఇది మూడేళ్ల కిందటి సంగతి. రెండు మూడు సార్లు చదవడానికి ప్రయత్నం చేశాను. కానీ అందులోకి ప్రయాణం చేయలేకపోయాను.
ఈనాటికి మూడు సంపుటాలుగా వెలువడిన వెయ్యి పేజీల బృహద్ గ్రంథం పూర్తి చేయగలిగాను. సాధ్యం అయినంత వరకు అర్థం చేసుకోగలిగాను.
సానిత్రి అనుసృజనకు శ్రీ శార్వరి గారు దశాబ్దకాలం వెచ్చించారు. అరవిందులు కూడా మూల ప్రతిని పూర్తిగా సిద్ధం చేయడానికి పుష్కర కాలానికి పైననే తీసుకున్నారు.
యథా వారి యోగ దర్శనం , తథా కావ్య గతం చేశారు. అటువంటి ధ్యాన యోగ దర్శనానికి శ్రీ శార్వరి వారు అంతే యోగ సాధనా శక్తి ద్వారా అనుసృజన చేయగలిగారు. ఇది అంత సులభమైన విషయం కాదు. ఇద్దరూ యోగ సాధకులు కనుకనే సాధ్యం అయిందని నేను భావిస్తున్నాను.
శార్వరి వారి సావిత్రికి గుంటూరు శేషేంద్ర శర్మ ముందుమాట రాస్తూ వ్యాస వాల్మీకి సరసన నిలబడగల కావ్యం సావిత్రి అన్నారు. అలా అనడానికి కారణం సావిత్రి కావ్య రూప ఆధ్యాత్మిక వాఖ్యానం.
ఇంతకీ సావిత్రి ఏమిటి అంటే మహా భారతంలోని సావిత్రి కథనే. సతీ సావిత్రి తన భర్త అయిన సత్యవంతుని
మృత్యువునుంచి గెలిపిస్తుంది.అయితే ఆమె మృత్యువు(యమున్ని)జయించడానికి చేసిన సాధన, ఆమె చేసిన దర్శనాలు, తెలుసుకున్న సత్యాలు ఇవన్నీ పన్నెండు గ్రంథాలుగా రాశాడు అరవిందుడు. .సావిత్రిలోని పన్నెండు భాగాలు అనేక పర భౌతిక విషయాలను చర్చిస్తాయి. వాటిని మూడు భాగాలు సత్య దర్శనం, యోగ దర్శనం, విశ్వదర్శనం గా కూర్పు చేశారు శార్వరి వారు. ఎంతో కొంత ఆధ్యాత్మిక ప్రయాణం లేకుండా సావిత్రిని అర్థం చేసుకోవడం కష్టం.
ఇవి అరవిందులు తాను సావిత్రిగా మారి ప్రయాణం సిద్ధిస్తేగానీ రాయగలిగేవి కావు.
సావిత్రి దేనిని సాధించిందో దాని ద్వారానే మృత్యువుని జయించింది. ఆ సాధనే ఒక తేజస్సు, అదే గాయత్రి. అరవిందులు పూర్ణయోగం ద్వారా ఆ సావిత్రి సాధించిన అమరత్వ ఉషస్సును పొందమని సూచించారు.
ఇక అరవిందుల పూర్ణ యోగం అంటే భక్తి, జ్ఞాన, కర్మ యోగాలు మూడు కలిసి చేయగల యోగం. అది సావిత్రి చర్చించదు. కాకపోతే ఈ యోగ సాధనలో సావిత్రి ద్వారా చెప్పిన అమరత్వం సిద్ధిస్తుందని భావించాలి.
ఈ విలువైన కృషిని తెలుగులో అందించడానికి మరొక్క మారు ప్రయత్నం చేసిన శ్రీ వాసిలి వసంత కుమార్ గారు ఎంతగానో అభినందనీయులు.
అది నాకు అందించినందుకు కృతజ్ఞతలు
అరవిందుని సావిత్రి పరిచయం తర్వాత మిత్రులు కొంతమంది సావిత్రి గురించి మరి కాస్త వివరంగా రాస్తే బాగుంటుందని అడగడం జరిగింది.
సావిత్రిని చదవడం నా బలమైన కోరిక, అలా ఎందుకు కలిగిందో నాకు తెలియదు. ఒక శిక్షణా కార్యక్రమంలో గెస్ట్ స్పీకర్ గా వచ్చిన ఒకరు మాటల్లో అరవిందుడులాంటి ప్రజ్ఞాశాలి మన స్వతంత్ర పోరాటం నుంచి ఎందుకు బయటికి వచ్చాడు , అలా రాకుండా పోరాటంలో ఉంటే పరిస్థితి మరోలా ఉండేదేమో అనడం నాకు అరవిందుని మీద అంతకు ముందు ఉన్న భావనను మరింత పెంచింది. ఇక పండిత పరమేశ్వర శాస్త్రి రాసిన త్రిపురనేని గోపీచంద్ మనసులో మాట ఆ నవల్లో చెప్పకనే అరవిందుని పూర్ణ యోగాన్ని చెప్తుంది. పూర్ణయోగం సంభవమేనా అన్న సంశయం ప్రధాన పాత్ర వెలిబుచ్చడం ఆ నవల్లో కనిపిస్తుంది. అయితే దానిని ఆచరించిన వారు మాత్రమే చెప్పగల సాహసకార్యమది. అంతటి సాహసం చేయలేను కాకపోతే సావిత్రి గురించి మాత్రం చెప్పగలిగే సాహసం చేస్తాను. ఎందుకు అంటే అర్థం చేసుకోగల వివరణలు ఇంతకు ముందు పెద్దలు అనేకులు అందజేశారు కనుక.
అరవిందుని సావిత్రి అర్థం కావాలి అంటే అంతకుముందు మృత్యువును జయించడానికి ప్రయత్నం చేసిన వారి చరిత్రను కూడా అధ్యయనం చేయవలసి ఉంటుంది. అటువంటి ప్రయత్నం చేసి తెలుసుకొని శక్తి మేరకు అర్థం చేసుకున్న దానిని ఇక్కడ రాస్తున్నాను.
17, 18 శతాబ్దానికి చెందిన మహనీయులు, యోగ సిద్ధాంతాలని ఆచరణ యోగ్యమైనటువంటి విధానాన్ని రూపకల్పన చేసి ప్రజలు ఆధ్యాత్మిక మార్గాన్ని ఆచరిన్చడం కోసం సులభమైన విధివిధానాన్ని ఏర్పరచే ప్రయత్నం చేశారు. అయితే పాత కథని తిరిగి దర్శించడం, రాయడం జరగలేదు. అయితే అరవిందుని విషయంలో ఇది జరిగింది.
పురాణాలని అంటుంటాం కదా ఇటువంటి పురాణాలని అరవిందుడిలాంటివాడు సమకాలీనానికి ఏ విధంగా తీసుకువచ్చాడు, తన యోగదర్శనాల కొరకు అతను సావిత్రిని ఎందుకు ఎంచుకున్నాడు. ఆయన వేదాలు, ఉపనిషత్తులు, రామాయణ భారత ,భాగవతం లాంటి వాటి వ్యాఖ్యానం, కాకుండా అందులోని ఒక స్త్రీ కథని అది మృత్యుంజయ కథని ఎందుకు తీసుకున్నాడు? ఆ కథ ద్వారా ఆయన ఏం చెప్పదలుచుకున్నాడు ? ఎవరైనా అసలు మృత్యువుని ఎందుకు చేయించాలి? ప్రతి ఒక్కరూ మృత్యువుని జయించడానికి ప్రయత్నించినట్లయితే ఎలా ? ఎటువంటి సాధన చేసినట్లయితే అటువంటి వారి యొక్క భౌతిక ప్రయోజనము కలుగుతుంది ? అది ఎట్లా ఉండబోతోంది..? అమరత్వము, మృత్యువును జయించడం రెండు ఒకటేనా ? ఇవన్నీ నాకు కలిగిన సందేహాలు.
సందేహ నివృత్తి కోసం లోకంలో చిరంజీవులు గా ఉన్నవారు , మృత్యుంజయులు ఎవరు అని తెలుసుకునే ప్రయత్నం చేశాను. మృత్యువును జయించిన వారు ఆ ప్రత్యేక సందర్భంలో మృత్యువుని తప్పించుకున్నారు కానీ వారు శాశ్వతలు కారు అంటే చిరంజీవులు కారు. వారు ఏ ప్రయోజనం కోసం మృత్యువుని వాయిదా వేశారో అది సిద్ధించిన తర్వాత వారు మామూలు మానవుడిలాగే నిష్క్రమించారు. కానీ అమరులు, వారు మృత్యువు యొక్క మితిని దాటి పరివ్యాప్తం చెందారు కనుక వారిని
మృత్యువు అందుకోలేదు. ఇలా మృత్యువు యొక్క మితిని అతిక్రమించి లోకంలో పరివ్యాప్తమై ఉన్నటువంటి వారు చిరంజీవులు. శాస్త్రం ప్రకారం చిరంజీవులు ఏడుగురు అనీ, ఎనిమిది అనీ అంటారు. మనకు హనుమంతుడు, పరశురాముడు, అశ్వత్థామ, కృపాచార్యుడు, మార్కండేయుడు బాగా తెలిసిన పాత్రలు.
అయితే మృత్యుంజయులు మాత్రం ముగ్గురు. మార్కండేయుడు, సావిత్రి దేవి, నచకేతుడు. ఇందులో మార్కండేయుడు మృత్యుంజయుడు ఇంకా చిరంజీవి. మిగిలిన ఇద్దరు సావిత్రి, నచికేతులు మృత్యుంజయులైనప్పటికీ వారు చిరంజీవులు కారు. ఈ మూడు మృత్యుంజయ పురాణాలు లేదా పాత్రలు మృత్యువును జయించడానికి లేదా మరణాన్ని వాయిదా వేయడానికి తమ వంతు ప్రయత్నం చేస్తారు.
అయితే అన్ని జీవులకి సమవర్తిగా ఉండేటువంటి యముడు వీరి పట్ల ఏ కారణం చేత తన సమవర్తి నియమాన్ని పక్కకు పెట్టాడు ఎందుకు వారి యొక్క విన్నపాన్ని మన్నించి తన సమవర్తి నియమాన్ని దాటి వారికి ఆయువృద్దికి తోడ్పడ్డాడు ? ఇదే ముఖ్యమైనటువంటి విషయం .
ఇవి మనం మూడు కథలుగా అధ్యయనం చేయవల్సి ఉంటుంది. ఒకటి మార్కండేయుని కథ, రెండవది సావిత్రి కథ, మూడవది నచికేతుని కథ. మార్కండేయుని పాత్ర చూసినట్లయితే రామాయణంలోనూ భారతంలోనూ కనిపిస్తుంది. అయితే సావిత్రి యొక్క ఉపాఖ్యానం మహాభారతంలో మార్కండేయుడు ద్వారా ధర్మరాజుకు అరణ్యవాసంలో తెలియజేయబడుతుంది. ఇక నచికేతుని కథ కఠోపనిషత్ కథ.
మార్కండేయుని కథ చూసినట్లయితే భృగు మహర్షి యొక్క కుమారుడు ధాత. ఇతను పగలుకి అధిపతి.మరొక పుత్రుడు విధాత రాత్రికి అధిపతి. ఒక పాటలో సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు విధాత తలపున ప్రభవించినది అనాది రాగమని రాస్తారు అంటే చీకటి అధిపతి అయినటువంటి విధాత తలపున ప్రభాతం అనేటువంటి ఒక అనాది రాగం వస్తుందని ఆయన అర్థం. మహాత్ములు పదాలను ఆయాచితంగా వాడరు. అయితే ఇక్కడ ధాత యొక్క కుమారుడు ఎవరైతే పగటి అధిపతి ఉన్నాడో అతని కుమారుడు మృకండుడు. సంతాన ప్రాప్తి కోసం శివునికీ విష్ణువుకీ చేసిన తపస్సు ఫలితంగా మార్కండేయుడు జన్మిస్తాడు. అతని ఆయుషు 16 సంవత్సరాలు.
తల్లిదండ్రుల ద్వారా తాను అల్పాయుష్కుడను అని తెలుసుకున్న మార్కండేయుడు ఏ ప్రయోజనం ఆశించి తన తండ్రి తపస్సు ఫలితంగా తనను పొందాడో ఆ ప్రయోజనం నెరవేరనప్పుడు తనకు వచ్చిన జన్మ యొక్క సార్ధకత్వం ఉండదని దానిని సాధించడం కోసం శివుడికి తపస్సు చేస్తాడు. అతని తపస్సు ఎంతగా ఫలిస్తుందంటే శివుడు మార్కండేయుడు రెండు రూపాలు సాయుజ్యం అయిపోతాయి. అంటే శివుడే మార్కండేయుడు మార్కండేయుడు శివుడు. మార్కండేయుని ఆయుర్థాయం పూర్తయిన తర్వాత
యముడు మార్కండేయుడుని తీసుకువెళ్లే సమయంలో అతనికి శివుడికి మార్కండేయుడికి భేదం తెలియదు. అయితే అప్పుడు శివుడు యమధర్మరాజు తో ఎవరైతే పరోపకార సిధ్యర్థం తన ఆయుష్షుని వృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తారో వారి ప్రయోజనము అంత నిష్కల్మషమైనదీ లోకోపకారి అయినట్లయితే వారికి శివుని అనుగ్రహం ఉంటుంది కనుక వారి ప్రాణాలను హరించవలదని యమునికి ఆజ్ఞ వేస్తాడు. అంటే ఎవరైనా ఒక వ్యక్తి యొక్క ఆయుష్షు ప్రపంచానికి ఉపకారం చేసేటువంటిది అయితే అతను ఏ ప్రయోజనం కోసం కృషి చేస్తున్నట్లయితే అటువంటి ప్రయోజనము నెరవేరేవరకు అతనికి మృత్యువునుంచి శివుని యొక్క రక్షణ ఉంటుంది ఇది మార్కండేయుడు చెప్పేటువంటి సత్యం. మార్కండేయుడు తన తండ్రి యొక్క కోరిక నెరవేరడం కోసం ఏ ప్రయోజనం కోసం తన తండ్రి తనను పొందాడు అది నెరవేరేంత వరకు సమయం ఇవ్వాలని కోరుకుంటాడు. అలా పుట్టిందే మృత్యుంజయ మహామంత్రం..
ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం
ఉర్వరుహ నివ బందనాత్ మృత్యోర్ముక్షీణ మామృతాత్
జీవుడు తను పుట్టి, పొందవలసినవి పొంది, పూర్తిగా మగ్గిన ఒక దోస కాయ తన తల్లి తీగ నుంచి విడిపోయినట్లుగా తాను శరీరం విడిచి పెట్టాలని అర్థం.అదే మార్కండేయుడు కోరిక , అలా శివానుగ్రహం పొంది అలాగే తల్లి తండ్రి సేవ చేసి ఆ పాత్రలకు న్యాయం చేస్తాడు మార్కండేయుడు. లోకహితునికి, పరోపకార ప్రయోజకునికి మరణభయం లేదు ఇది మార్కండేయుడు మృత్యువుని జయించిన వివరం.
మార్కండేయుడు తదుపరి ఎప్పటికప్పుడు నూతన లక్ష్యాలను నిర్ణయించుకుంటాడు, సమవర్తి నుంచి రక్షణ పొంది చిరంజీవి అయ్యాడు.
తదుపరి నచికేతుడు, సావిత్రి కథలు చూస్తే ముందు నచికేతుని గురించే చూడాలి.ఎందుకంటే నచికేతుడి ద్వారా లేదా కఠోపనిషద్ ద్వారా
ఏ విద్య అయితే లోకానికి అందించబడిందో అది సావిత్రి ఆచరించింది కాబట్టి.
నచికేతుడు, యముడి సంవాదమే కఠోపనిషత్ చెప్తుంది.
అయితే కఠోపనిషత్ అన్న పదం, దాని వివరణ మాస్టర్ పార్వతీ కుమార్ గారు వారి ప్రసంగపాఠం’ మరణ రహస్యం. -3 ‘ లో చక్కగా వివరించారు.
నచికేతుడు ఐదేళ్ల చిన్న పిల్లవాడు, తండ్రి పేరు ఉద్దాలకుడు
గౌతమ వంశస్తుడు, అరుణ కుమారుడు.ఇతను అన్న దానము తదితర దానాలు వంటివాటిని విని అచరించదలిచిన వాడై దానక్రతువు చేస్తాడు. ఇలా తనకు ఉన్నది అంతా ఇచ్చివేసే వ్రతాన్ని చేయడం వల్ల ఇతనికి వాజశ్రవనుడు అనే పేరు వచ్చింది. ఉత్తమ గతులు పొందడమే లక్ష్యంగా చేసినప్పటికీ మంచి గోవులను తాను ఉంచేసుకొని,తనకు అవసరంలేనివి దానం ఇవ్వడం చూసిన నచికేతుడు తండ్రి తప్పుచేస్తున్నాడని మదనపడతాడు.అన్నీ ఇచ్చివేస్తున్నాడు కదా..మరి నన్ను ఎవరికి ఇస్తావు నాన్నా అని తండ్రిని అడుగుతాడు.తండ్రి వెంటనే జవాబు ఇవ్వకపోతే నచికేతుడు ఈ ప్రశ్నని మళ్లీ మళ్లీ అడుగుతాడు, చిరాకు పడ్డ తండ్రి నిన్ను యముడికి ఇచ్చేస్తాను అంటాడు. నచికేతుడు యమలోకానికి వెళ్ళిపోయి యముడి కోసం చూస్తాడు. అక్కడ ఆ సమయంలో యముడు వుండడు. మూడు రోజులకు యముడు వస్తాడు. నచికేతుడి రాకకు కారణం అడుగుతాడు.
యమ లోకంలో మూడు రోజులు భూ లోకంలో మూడు సంవత్సరాలు. అంతకాలం ఎటువంటి ఆతిథ్య ఆదరణ లేక ఒక పిల్లవాడు, బ్రాహ్మణుడు తన లోకంలో ఉండడం వల్ల తనకు అతిధి నిరాదరణ దోషం కలుగుతుందని భావించిన యముడు నచికేతుడిని మూడు వరాలు ఇస్తాను, కొరుకోమంటాడు.
నచికేతుడు సంతోషించి మొదటి వరంగా తన తండ్రి గారు ఇలా యమలోకానికి వచ్చినందుకు తన మీద కోపం కలిగి ఉండకూడదని , రెండవ వరంగా ఏం చేయడం లేదా ఏ విద్యను ఆచరించడం వల్ల స్వర్గాన్ని చేరవచ్చునో తెలియజేయాలనీ, మూడవ వరంగా జీవుడు మరణించిన తర్వాత ఉంటాడా, ఉండడా తెలియజేయాలని కోరతాడు.
యముడు మొదటి వరాన్ని అనుగ్రహించి, నీ తండ్రి ఎప్పటిలాగా నిన్ను ఆదరిస్తాడని, రెండవ వరం స్వర్గం చేరుకునే విద్య అంటే అగ్ని విద్య గురించి చెప్పి ఇకనుంచి ఆ అగ్ని విద్య నచికేత అగ్ని అని పిలవబడుతుంది అనే నాలుగో వరాన్ని ఇస్తాడు. ఒక రంగుల మాల కూడా బహుమతిగా ఇస్తాడు. సృష్టిలో మొదట ఆవిర్భవించినది అగ్ని కనుక అగ్ని విద్యను ఆచరించాలి. అగ్ని విద్య లేదా యజ్ఞం. ఇది బహిర్యజ్ఞం, అంతర్యజ్ఞం. బహిరి యజ్ఞం 24 ఇటుకలతో చతురస్రంగా పేర్చినటువంటి హవనకుండంలో అగ్నిని ఆవాహన చేస్తూ భూత సూక్ష్మాన్ని అనగా బయట ఉన్న పంచభూతాలు మనలో ఉన్న పంచభూతాలు భూత సూక్ష్మంగా ఏర్పడి ఉన్న వాటిని సంచయనం చేయడం. అంతర్యజ్ఞం ద్వారా మనలో అగ్నిని సంచయనం చేయడం అలా అంతరయజ్ఞం ద్వారా సంచయనం చేయబడిన అగ్ని ద్వారా జీవుడిని ఊర్ధ్వ లోకాలకి తీసుకువెళ్లడం ఆ విధంగా స్వర్గ ప్రాప్తి పొందడం ఇదే నచికేతాగ్ని. దీనికి ఆది శంకరులు భాష్యం చెప్తూ మూడు సార్లు నచికేతాగ్ని సంచయనం చేసిన వారు, తల్లి, తండ్రి, ఆచార్యుల అనుశాసనాన్ని పొంది జన్మ రహితుడు అవుతాడని తెలియజేశాడు.
మూడవ వరంగా నచికేతుడు అడిగిన ప్రశ్న మరణాంతరం జీవుడి అస్తిత్వం ఏమిటో తెలియజేయడానికి యముడు నచికేతుడిని పరిపరి విధాల పరీక్షిస్తాడు. ఇది అత్యంత గహనమైన విషయమని దీనికి బదులుగా మరొక వరం కోరుకోమని అడుగుతాడు, కానీ నచికేతుడు పట్టుబడతాడు. మరణాంతరం
జీవుడు అస్తిత్వం తెలియజేయడానికి తమరి కన్నా ఉత్తమమైన గురువు నాకు దొరకడని మీరు మాత్రమే తెలియజేయడానికి సమర్ధులని నాకది తప్పనిసరిగా తెలియచేయాలని కోరుకుంటాడు నచికేతుని పట్టుదల చూసిన యముడు అతనికి జీవుడు మరణాంతరం ఉన్నాడా లేడా అన్న విషయాన్ని తెలియజేస్తాడు. ఈ ప్రశ్నకి జవాబును అర్థం చేసుకోవడం కొంత కష్టమైనా నచకేతుడి ద్వారా యముడు జీవుడు మరణాంతరం ఉంటాడని ఉండగలడని ప్రతి వ్యక్తి సాధన ద్వారా తన అస్తిత్వాన్ని తెలుసుకోగలరని తెలియజేస్తాడు.
ఇక్కడ కఠోపనిషత్ మీద ఆదిశంకర భాష్యం వివరంగా ఇచ్చినప్పటికీ నాకు మాస్టర్ పార్వతీ కుమార్ గారి ప్రసంగ పాఠం మరణ రహస్యం-3 గా వచ్చిన నచికిత విద్య పుస్తకం ఎంతగానో ఉపయోగపడింది మాస్టర్ పార్వతీ కుమార్ గారు తన ప్రసంగం ద్వారా చాలా సులభంగా నచికేతుని మూడో వరం వివరించారు. మాస్టర్ పార్వతి కుమార్ గారు కఠోపనిషత్ పదం ఉత్పత్తిని వివరిస్తూ ఇలా చెప్తారు.
కఠోపనిషత్ అంటే క నుంచి ఠ వరకు ఉన్న 12 అక్షరాలు కలది. ఈ 12 అక్షరాలు 12 రేకులు గల పద్మాన్ని ద్వాదశ దళ పద్మం అంటారు. ఇది అనాహిత చక్రాన్ని సూచిస్తుంది.
మన శరీరంలోని షడ్చక్రాలు మీరు వినే ఉంటారు మూలా ధార , స్వాధిష్ఠాన, మణిపూరక, అనాహిత, విశుద్ధ, ఆజ్ఞ చక్రాలు అత్యంత పైన ఉన్నది సహస్రార. అనాహితం హృదయ స్థానం హృదయం అంటే గుండె కాదు, గుండె పక్కన శరీర మధ్య భాగంలో ఉండేటువంటి ఈ చక్రము నాలుగు స్థరాలుగా మూడు మూడు దళాలతో మొత్తం 12 దళాలు మధ్యలో ఆత్మని కలిగి ఉంటుంది. మొదటి స్థరం అన్నమయ కోశం, రెండవ స్థరం ప్రాణమయ కోశం, మూడోస్తరం మనోమయ కోశం , నాలుగవ స్థలం విజ్ఞానమయ కోశం మధ్యలో ఉన్నవాడు వెలుగు అదే ఆత్మ.
ఒక దీపం మరొక దీపాన్ని వెలిగించినట్టు ప్రతిదీపానికి సమానమైన వెలుగు ఉన్నట్టు జీవులను ప్రకాశితమయ్యేటువంటి ఈ వెలుగు ఆత్మ రూపంలో మన శరీరంలోనూ ఉంది. జీవుడు సూక్ష్మ దేహంగా మన నాభి కింద రెండు వేళ్ళ అంత దూరంలో సూక్ష్మ శరీర ధారుడుగా ఉంటాడని అక్కడ ఉన్నటువంటి జీవుడిని అంతర్యజ్ఞం ద్వారా షట్ చక్రాల ద్వారా ప్రయాణింప చేసి అనాహిత ద్వారా ఆత్మను చేరుకొని ఉన్నవాడు తన సూక్ష్మ శరీరాన్ని చూసుకోగలరనీ పూర్వపు రచనల్ని బట్టి అర్థం చేసుకోగలము. అటువంటి సాధన చేసిన వారు
ఆజ్ఞా చక్రం అనగా రెండు కనుబొమ్ముల మధ్య ఉన్న స్థానం ద్వారా సూక్ష్మ శరీరం ధరించి కావలసినప్పుడు శరీరం లోపలికి, బయటకు ప్రయాణం చేయగలరు. పరమహంస యోగానంద తన ప్రసిద్ధ పుస్తకం యోగి ఆత్మకథ లో ఎంతో మంది భారతీయ యోగులను పరిచయం చేస్తూ తన పరమ గురువైనటువంటి శ్యామ చరణ్ లాహిరి మహాశయుల గురించి చెప్తూ లాహిరి మహాశయులు సూక్ష్మ శరీరాన్ని ధరించి ఎంతో మందికి కనిపించారని రాశారు. ఇలా అనేక చోట్ల కోరుకున్న చోట ప్రత్యక్షమైనటువంటి యోగుల్ని చూసిన సందర్భాలు అనేకులు తమ అనుభవాలలో రాశారు.
కఠోపనిషత్ చెప్పింది ఇలా అనాహిత చక్రాన్ని దాటి ప్రయాణం చేయమనే. అలా ఎవరైతే సాధన ద్వారా చేయగలుగుతారో, వారు తమ సూక్ష్మ శరీరాన్ని చూసుకోగలరు, వారు శరీరాన్ని వదిలివేసిన తర్వాత కూడా తమ యొక్క అస్తిత్వాన్ని తెలుసుకోగలరు. తమ భూత భవిష్యత్తు ప్రయాణాన్ని వారు నిర్దేశించుకోగలరు. ఆ విధంగా సాధన ద్వారా తెలుసుకున్న వారు తమ మరణాంతరం కూడా అస్తిత్వాన్ని కలిగి ఉంటారని యముడు నచికేతులకి తెలియజేసినట్టు మనం కఠోపనిషత్ ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కనుక నచికేతుని మూడో ప్రశ్నకు యముని సమాధానం నీ సాధనే నీ అస్తిత్వానికి సమాధానం. అయితే ఈ ప్రయాణం అంతా కూడా సుశిక్షుతుడైనటువంటి గురువు ద్వారానే సాధ్యపడుతుంది అనేది అన్ని పుస్తకాల్లో ఇచ్చినటువంటి వివరణ. అందుకే భారతీయతలో గురువుకి అంతటి పవిత్ర స్థానం.
ఇక ఆజ్ఞా చక్రం నుండి సహస్రార చక్రం చేరగలిగిన వాడు సాక్షాత్ భగవంతుడే అంటాడు సద్గురు.
ఇది సూక్ష్మంగా కఠోపనిషత్ సారము లేదా నచికేత యముని సంవాదము. యముని ద్వారా మూడువరాలనీ, అనుకోని నాలుగో వరాన్ని పొందిన నచికేతుడు తిరిగి తన తండ్రి వద్దకు చేరుకొని యముడు ఏవైతే సూచించాడో వాటిని పాటించి తన భౌతిక ప్రయాణాన్ని ముగిస్తాడు.
మార్కండేయుడు స్వీయ ప్రయత్నం ద్వారా, నచికేతుడు తండ్రి యథాలాపంగా అన్న మాటతో యముడి ద్వారా మరణానికి సంబంధించిన విషయాలు తెలుసుకున్నారు. వీరు ఇరువురికీ తమ పరిస్థితి అది ఎదుర్కునే వరకు తెలియదు. ఇందుకు భిన్నంగా సావిత్రికి తాను ఏం చేయాలనుకుంటూదో ముందే తెలుసు. యే సాధన ద్వారా తాను సూక్ష్మ శరీరధారి కాగలదో, దానితో ఏమి సాధించగలదో తెలుసు. ఆమెకు తెలుసు కనుకనే అల్పాయుష్కుడు అని తెలిసినా సత్యవంతుణ్ణి వివాహం చేసుకుంటుంది. తన సాధన మీద తనకంత నమ్మకం ఉంది గనుకనే తన అభీష్టాన్ని నెరవేర్చుకోగలిగింది కేవలం తన భర్త ప్రాణాలనే కాకుండా తన మామగారు, తండ్రి గారి అభిష్టాలను కూడా వరాలుగా పొందగలిగింది.
సావిత్రి, మద్ర దేశ అధిపతి అయిన అశ్వపతి కుమార్తె. అశ్వపతి సంతానం కొరకు 18 సంవత్సరాలు రోజుకి పదివేల గాయత్రీ మంత్రాలను అనుష్టానం చేస్తూ తపస్సు చేస్తాడు అతనికి సవిత్రమూర్తి ప్రత్యక్షమై సావిత్రి పేరుతో కుమార్తెగా జన్మించగలదని వరం ఇస్తుంది. అశ్వపతి తనకు పుత్రుడు కావాలని కోరుతాడు అందుకు సవిత్రమూర్తి ఈ కుమార్తె ద్వారా సకల అభీష్టాలు నెరవేరుతాయి అని చెప్తుంది.
అశ్వపతి సావిత్రిని అపురూపంగా పెంచుతాడు ఆమె యుక్త వయసుకి సత్యవంతుని గురించిన సమాచారం తెలుస్తుంది అప్పటికే ఆమెకు సత్యవంతుడు తన భర్త అయితే బాగుంటుందని అభిప్రాయం ఏర్పడుతుంది. సావిత్రి యొక్క ప్రతిభాపాటవాలకి ఆమెకు తగిన వరుణ్ణి తానే ఎన్నుకోవాల్సిందిగా తండ్రి అయిన అశ్వపతి సూచిస్తాడు. సావిత్రి తాను సాల్వ రాజ్యానికి చెందిన ద్యుమత్సేనుని కొడుకు సత్యవంతుణ్ణి వివాహం చేసుకోగలనని అంటుంది. నారదుడు సత్యవంతుడు అల్పాయుష్కుడని ఒక సంవత్సరం మాత్రమే అతనికి ఆయుష్యు ఉందని అతను ఫలానా రోజు మరణిస్తాడని ముందే తెలియజేస్తాడు. అయినప్పటికీ సావిత్రి తాను సత్యవంతున్నే వివాహం చేసుకోగలనని చెప్తుంది. తండ్రి అశ్వపతి కూడా కూతురు నిర్ణయాన్ని వ్యతిరేకించడు.
అతను సావిత్రిని, సత్యవంతునికి ఇచ్చి వివాహం చేస్తాడు. సావిత్రి వివాహం చేసుకునేటప్పటికీ సత్యవంతుడు రాజ్యం కోల్పోయి అంధత్వంతో ఉన్న తండ్రి, అరణ్యంలో మునివాసం చేస్తూ బ్రతుకుతున్న పరిస్థితి. అందునా అతను అల్పాయష్కుడు. అతను అల్పాయుష్కుడన్న విషయము అతనికి గాని అతని తల్లిదండ్రులకు కానీ తెలియదు కానీ సావిత్రికి తెలుసు. అన్నీ తెలిసి సావిత్రి సత్యవంతుని జీవితంలో ప్రవేశిస్తుంది. అదే సావిత్రి గొప్పతనం. ఆమె తన సాధన మీద ఆమెకున్న నమ్మకం.
సావిత్రి సత్యవంతులు సంవత్సరకాలం ఆనందంగా జీవిస్తారు. సత్యవంతునికి మరణ సమయం ఆసన్నమవుతుంది. యధావిధిగా అరణ్యంలో కట్టెలు సేకరించడానికి సత్యవంతుడు బయలుదేరుతాడు. తానూ వస్తానని సావిత్రి అంటుంది. అతనితో బయలుదేరుతుంది. అరణ్యంలో కట్టెలు సేకరిస్తూ ఉన్నఫలంగా సత్యవంతుడు పడిపోతాడు. సావిత్రికి దీని గురించి ముందే తెలుసు కనుక ఆమె అంతకుముందు మూడు రోజుల నుంచి త్రైరాత్ర వ్రతం చేస్తుంటుంది. త్రైరాత్ర వ్రతం అంటే మూడు రోజులు పగలు రాత్రి సాధనలో ఉండడం. సావిత్రి పరిస్థితిని అర్థం చేసుకొని అతని శరీరాన్ని ఒక భద్రమైన చోటుకు మార్చి తాను అక్కడే ఉండి, తన సూక్ష్మ శరీరం ద్వారా సత్యవంతుని ప్రాణాలను తీసుకున్న యమునితో ప్రయాణం చేస్తుంది. యముడు తనతో రావద్దని వారిస్తాడు. సావిత్రి యమునితో తన భర్త ప్రాణాలు తనకు ముఖ్యమని అందుకనే తను సూక్ష్మ శరీరధారియై తనతో ప్రయాణం చేస్తున్నానని చెప్తుంది. ఈ లోకాలవెంట రాకూడదని యముడు పదేపదే చెప్తాడు. అందుకు ప్రతిగా నాలుగు వరాలను కోరుకో, కానీ ఈ ప్రయాణం మానుకో అని చెప్తాడు. అప్పుడు ప్రతి వరానికి ముందు నీ భర్త ప్రాణాలు తప్ప ఏదైనా కోరుకో అంటాడు.
మొదటి వరంగా సావిత్రి తన మామగారి అంధత్వం పోవాలని, రెండవ వరంగా రాజ్యం రావాలని కోరుకుంటుంది. మూడవ వరంగా తన తండ్రికి నూరు పుత్రులు కలగాలని కోరుకుంటుంది నాలుగవ వర సమయంలో యముడు ‘నీ పతి ప్రాణాలు తప్ప’ అన్నమాట అనడు. అప్పుడు ఆమె తన భర్తని పునరుజ్జీవున్ని చేయాలని కోరుతుంది.
ప్రసన్నుడైన యముడు నాలుగు వందల సంవత్సరాల పాటు ఎందుకంటే అది కృతయుగం కనుక కృతయుగంలో మానవుని ఆయుషు నాలుగు వందల సంవత్సరాలు కనుక నాలుగు వందల సంవత్సరాలు నూరుగురు పుత్రుల్ని కలిగి సుభిక్షంగా బతకమని వరం ఇస్తాడు. ఆ విధంగా సావిత్రి తన మామగారి చూపుని, రాజ్యాన్ని, తన తండ్రికి పుత్రుల్ని, తన భర్త ఆయుష్షుని యముని ద్వారా పొందగలిగింది. ఆమె తిరిగి తన సూక్ష్మ శరీరంతో తనదేహానికి ప్రవేశిస్తుంది అలాగే సత్యవంతుడు యొక్క ప్రాణాలని యముడు తిరిగి ప్రసాదిస్తాడు. ఆ విధంగా యముడికి సావిత్రి కి మధ్య జరిగిన ప్రయాణం శుభప్రదంగా ముగిసి సత్యవంతుడు పూర్ణాష్కుడై చిరకాలం ఆనందంగా జీవిస్తారు. ఇది సావిత్రి కథ. ఇది మార్కండయుడు ధర్మరాజుకి చెప్పిన ఉపాఖ్యానం.
మాస్టర్ పార్వతీ కుమార్ గారు రాసిన తన ప్రసంగ పాఠం పుస్తకం మరణ రహస్యం -2 లో సావిత్రి సంబంధించిన అంశాలని ఇలా విశ్లేషిస్తారు. సవిత్రు మండలం అంటే 12 సూర్యులని కలిగినటువంటి ఒక మండలం. ఇలాంటి 12 సవిత్రు మండలాలు కలిసి ఒక భర్గో మండలం. సావిత్రి అన్న పదానికి అర్థం సాయం సంధ్య లో ఉన్న వెలుగు అది శక్తివంతమైనది. సావిత్రి వెలుగు యొక్క ప్రతిరూపం. అందుకే గాయత్రి మంత్రంలో ” భర్గో దేవస్య ధీమహి ” అని ఉంటుంది. వెలుగు ప్రతిరూపమే సావిత్రి అది అనుష్టానం చేయడమే గాయత్రి. అశ్వపతి అనే పదానికి అర్థం ప్రాణాలకు అధిపతి అయిన జీవుడు. ఈ అశ్వపతి తపస్సు చేయడం కోసం మిగిలిన కథలలో లాగా శివుడినో, విష్ణువునో ధ్యానం చేయలేదు. అవ్యక్త రూపమైన వెలుగు. సృష్టి లో ఏది వెలుగు ను ప్రకటిస్తుందో అది.
అతను సవిత్ర మండలంలోని వెలుగును, సావిత్రిని పొందడానికి 18 సంవత్సరాలు గాయత్రీ మంత్రోపాసన చేశాడు. ఆ సవిత్ర మండల వెలుగే సావిత్రిగా అశ్వపతికి జన్మించింది. ఆ వెలుగు సూక్ష్మ శరీరాన్ని ధరించగలిగే సాధన కూడా పొందగలిగిన ప్రజ్ఞ. తనకు భవిష్యత్తు తెలిసిన ఆమె వెరవలేదు తన వెలుగు దేహంతో ముందు లోకాలకు సైతం ప్రయాణం చేసి తాను సాధించాలనుకున్న వాటిని సాధించింది.
ఆమె సాధించిన వాటిలో మొదటిది మామ గారి అంధత్వం పోవడం. మామగారు ధ్యుమత్సేన రాజు జ్ఞానముతో మూడో కన్ను కూడా కలిగిన వాడు, కానీ తన అహంకార ప్రభావం చేత తన జ్ఞానాన్ని పోగొట్టుకున్నాడు. సావిత్రి అతని అధంత్వం పోవాలని అంటే తిరిగి జ్ఞానం రావాలని కోరుతుంది. సత్యవంతుడు అసలు పేరు చిత్రాశ్వుడు అంటే చిత్రంగా ప్రాణాలని నిలుపుకోగలిగినటువంటివాడు. వ్యవహార శైలి వలన అతనికి సత్యవంతుడు అనే పేరు వస్తుంది. అతని జన్మతః వచ్చినటువంటి పేరు చిత్రాశ్వుడు లాగానే చిత్రంగా సావిత్రి వల్ల తన ప్రాణాలను పునరుద్ధరించుకోగలుగుతాడు. సావిత్రి యమునితో చేసిన సూక్ష్మలోకాల ప్రయాణం షట్ చక్రాల ప్రయాణమే. చక్రాలు ఒక్కొక్క లోకానికి ప్రతీకగా చూపబడతాయి వాటి ప్రయాణము అనుభవము అరవిందుడు మరింత విపులంగా రాస్తాడు.
పరోక్షంగా సావిత్రి యొక్క ఉపాఖ్యానమంతాను సూక్ష్మదేహధారియై ప్రయాణించగలిగేటువంటి శక్తి సాధన దాని యొక్క ఫలితాలు, శక్తి వంటివి చెప్పడం.
మార్కండేయుడు, నచికేతుడు, సావిత్రి కథల వల్ల అర్థం చేసుకోగలిగింది ఏదైనా ఉంది అంటే అది పరోపకారం, లోక శ్రేయస్సు. మరణం సత్యం, దానిని వాయిదా వేయగల శక్తి వారి వారి సంకల్పాలకు ఉంది. అందుకు దైవం సహకరిస్తుంది.దాని కోసం సంకల్ప వృద్ది చేయాలి.దానికి కొరకు సాధన చేయాలి. అలాటి వారు మృత్యువును వాయిదా వేయగలరు. మరణించినా జనుల స్మృతిలో ఉన్నంత కాలం అమరులుగా ఉండగలరు. ఎందుకు మృత్యువును జయించాలి అంటే ప్రతీ జీవి ఎంతో కొంత నాణ్యమైన, భద్రమైన, ఆదర్శమైన జీవనాన్ని తన తదుపరి తరాలకు మిగిల్చి వెళ్ళాలి.అదీ లక్ష్యం.
అరవిందుడు ఇంకాస్త ముందుకు వెళ్తాడు. తన సాధన ద్వారా ఆయన ప్రయాణం చేసినటువంటి సుక్ష్మ లోకాలు సావిత్రి పాత్ర ద్వారా తన ” సావిత్రి” లో నిక్షిప్తం చేశాడు సావిత్రి ఒక కావ్యానురూప యోగానుభవ ప్రకటన. ఇరవై నాలుగు వేల వాక్యాలు కలిగిన బృహత్ కావ్యం.1872 లో పుట్టిన అరవిందుడు తన 54 వ యేట మౌని గా మారిపోయి తదుపరి 24 యేళ్లు మౌనంగానే ఉండిపోయారు. 1930లో సావిత్రి రచనను మొదలు పెట్టి చాలాకాలం తన యోగానుభవాలను చేరుస్తూ పోయారు. స్వాతంత్ర్య ఉద్యమంలో విప్లవకారునిగానున్న అరవిందుడు అలీపుర్ కుట్ర కేసులో జైలు శిక్ష అనుభవించే క్రమంలో ఆధ్యాత్మిక అనుభవాలను పొందినట్లు రాశారు. అప్పటినుంచి యోగిగానే జీవించారు.ఆయన రూపొందించిన భక్తి, కర్మ, రాజ యోగాల ఆచరణ , అది సూప్ర మైండ్ థియరీ లేదా పూర్ణ యోగంగా చెప్పబడింది. మానవ మేధస్సులో అనేక స్థరాలు వున్నాయని దానిని కనుగొనే అవకాశం ఉందని చూపారు. అయితే దీనిని విమర్శించిన వారూ ఉన్నారు. అరవిందుడు దీర్ఘకాలం మౌనంగా ఉండడమూ దీనికి ఒక కారణము.
అరవిందుడు మొదట విప్లవకారుడు, దేశాభిమాని.తన దేశ ప్రజలకు యే సందేశం ఇవ్వలేదా అని అనుకున్నప్పుడు ఒక భావన కలిగింది. “పెద్దపులి ఆత్మకథ ” లో ఆర్కె నారాయణ్ , భారత దేశాన్ని పెద్దపులితో పోల్చుతారు. నాకు అరవిందుడి సావిత్రిలో జ్ఞానంతో మూడు కన్ను కలిగి ఉన్నా అజ్ఞానంతో దానిని కోల్పోయి రాజ్య భ్రష్ఠుడైన రాజు ద్యుమత్సేనుడిగా భారత పాలకులూ, అతని విరోధులుగా పరదేశ పాలకులూ కనిపించారు. మరణించి మళ్లీ జీవించిన సత్యవంతుడు ఈ దేశ స్వాభిమానం , దానిని సాధించిన సావిత్రి అదే ఆ వెలుగు సామాన్యుని సాధన లేక పోరాటం.
మనం మన అస్తిత్వాన్ని మర్చిపోవడమే నిజమైన మృత్యువు, మన ఆస్తిత్వం మనం నిలబెట్టుకోవాలని అనుకుంటే నచికేతుడు వలె ప్రయత్నం చేయాలి, సావిత్రి వలే మన దేశమాతకి చూపునివ్వాలి. స్వాభిమానంతో జీవించాలి.సాధనా సమన్వయంతో ఇది సాధ్యం.ఇది నాకనిపించిన ఒక భావన.
ఇది స్థూలంగా అరవిందుడి సావిత్రిని అర్థం చేసుకునేందుకు ఉపకరించే సుదీర్ఘ వివరణ. తెలుగులో వచ్చిన సావిత్రిని చదివి సులువుగా వారి కావ్యంలోకి ప్రయాణించవచ్చు. అనుసృజన, అనువాదం రెండూ అందుబాటులో ఉన్నాయి. అందరికీ సావిత్రి అవగాహన సులభతరం అవుతుందని ఆశిస్తూ ముగిస్తున్నాను.
దేవనపల్లి వీణావాణి
17.03.2024
ఆధునిక నాగరికత, శాస్త్రవిజ్ఞానాభివృద్ధి చెందడం, ఉద్యోగరీత్యా సమయం లేకుండా ఉండడం, వృత్తులు, జీవనోపాధులలో మార్పులు రావడం, మతాలు మారడం, వలసలు వెళ్లడం, హేతువాదం మొదలైనవన్నీ ఆచారాలు మారడానికి కారణాలు.
వ్యక్తికి సంకేతం పేరు. అందువల్లనే ప్రపంచంలోని కోట్లాది మనుష్యులకు కోట్లాది పేర్లు ఏర్ప డ్డాయి. ఈ కోట్లాది మనుష్యుల్లో వ్యక్తులను పోలిన వ్యక్తులు ఉండడం అరుదేమోగానీ పేరును బోలిన పేర్లు అనేకంగా ఉంటాయి. అలాంటప్పుడు ఆ వ్యక్తులను వారి ఇంటిపేరుతోగానీ, తండ్రిపేరుతోగానీ, ప్రాంతం, రంగు, రూపు, ఆకారస్వరూపం, వయసు మొదలైన వాటిని జోడించిగానీ పిలవడం కద్దు. ఈ సువిశాల ప్రపంచంలోని ఇలాంటి పేర్లను, ఓ పట్టిక రాసి, పరిశీలించిచూస్తే అనేక విషయాలు వెలి కి వస్తాయి. కొన్నిపేర్లు చాలా వరకు మరుగున పడిపోయాయి. కొన్నిపేర్లు ఒకనాడు సర్వసాధారణంగా నూ, ఆ తర్వాత అసాధారణంగానూ, ఈనాడు వింతగానూ అనిపిస్తాయి. అంతేగాకుండా ఈ పేర్లను పరిశీలనాదృష్టితో చూసినపుడు సామాజిక రాజకీయ ఆర్థిక పరిస్థితుల ప్రభావం కూడా కనిపిస్తుంది. కొంతకాలం క్రితం వరకు ప్రతి ఒక్కరు ప్రకృతి మీదనే భారం వేసి, ‘నారు పోసినవాడు నీరు పొయ్య డా, కిస్కా కిస్మత్ ఉన్కే సాత్, పుట్టేవాడు రాముడౌతాడో, రావణుడౌతాడో (రాకాసుడౌతాడో’ అని కుటుంబనియంత్రణ పాటించకుండా పిల్లలను కంటూ ఉండేవారు. ఇప్పటికీ కొన్ని మతాలవారు, కొన్ని ప్రాంతాలవారు, మూఢవిశ్వాసాలు అధికంగా ఉన్నవారు, అదే పని చేస్తున్నారు. ఎవరైనా ఇద్దరు కొత్తవా రు కలిసినపుడు సర్వసాధారణంగా అడిగే ప్రశ్న ‘మీకు పిల్లలెంతమంది, ఏంచేస్తున్నార’ని అడుగుతారు. కాని ‘నీకెంత ధనముంది, ఎంత సంపద ఉంది’ అని అడగరు కదా’ అని వారి సంతానాపేక్షను సమర్థించుకుంటారు. వీరి సంతానాపేక్షకు తగినట్టుగానే ఆ కాలంలో అరడజనుకు తక్కువగా పుట్టకపోయే వారు. పిల్లలు కలగని వారికి అసలే కలగక పోయేవారు. కొందరు ఇద్దరు, ముగ్గురు భార్యలను చేసుకు న్నా సంతానం కలుగకపోయేది. మరి కొందరికి పుడుతూ గిడుతూ ఉండేవారు. సంతానం లేనివారు, సంతానం పుడుతూగిడుతూ ఉండేవారు.
సంతానం లేని వారు ఎదురైన దేవుళ్లకూ, రాళ్లకూ, రప్పలకూ, దయ్యాలకూ భూతాలకూ దండాలు ద స్కాలు పెడుతుండేవారు. మరికొందరు నాగుపాము, త్రాచుపాము శాపం తగిలిందనుకునేవారు. అందు వల్లనే గర్భస్రావం అవుతుందనుకునేవారు. సంతానం పొందడానికి, వారిని సంరక్షించుకోవడానికి నానా తిప్పలు పడుతుండేవారు. ఈ రోజుల్లోనూ సంతానం కోసం కుటుంబ వ్యక్తులు పడేపాట్లను వార్తాపత్రికల్లోనూ, టి.విల్లోనూ వార్తలుగా చూస్తూనే ఉన్నాం. ఈ తాపత్రయాలు పురాణకాలంనుండి ఈనాటి వరకూ – స్పష్టంగా వారు ఆచరించే ఆచారాల్లోనూ, సంతానానికి పెట్టుకునే పేర్లలోనూ కనిపి స్తున్నాయి. ముందుగా పుడుతూగిడుతూ ఉండే పిల్లలకోసం చేసే ఆచారాల గురించి తెలుసుకుందాం.
గ్రామాల్లో ఇంటివద్ద గర్భిణీస్త్రీ ప్రసవమైతే, శిశువు జన్మించగానే, వారిమీద కలినీళ్లు (కూరాడు కుండలోని నీళ్లు) చల్లి, మెత్తటి బట్టతో తుడిచి, చేటలో ధాన్యం పోసి, మెత్తటి బట్టవేసి, అందులో పడు కో బెడ్తారు. ఇది మనఆచారం.
పిల్లలు పుట్టి చనిపోతున్నపుడు పెద్దలు చెప్పిన ఆచారాల ప్రకారం అన్ని ‘సాగుబాట్లు’ చేస్తే పిల్లలు గిట్ట డం లేదనీ, చనిపోతున్నారని, అందుకు భిన్నంగా చేస్తేనైనా పిల్లలు బతుకుతారేమోనని భావించి, అలా కూడా చేసేవారు. ఆ శిశువును పెంట (చెత్తకుప్ప)మీదనో, బొందలలోనో, గొయ్యిలోనో, గాలిధూళికి కాసేపు పడుకోబెట్టి, తీసుకొని వచ్చేవారు. లేదా వయసుపండిన వ్యక్తి తిన్న ఎంగిలి విస్తరాకులోనో, పుల్లాకులపైననో పడుకోబెట్టేవారు. కొన్నిసార్లు కడుపునిండా కన్నతల్లికి (అధికసంతానం ఉన్న తల్లికి) దత్తత ఇచ్చేవారు. ఆ తర్వాత వారికి ‘తాలో తౌడో, బియ్యమో నూకలో రూకలో ‘ ఇచ్చి, వారి నుండి కొనుక్కునేవారు. లేదా వారి నుండి ఆ సంతానాన్ని భిక్షంగా అడుక్కునేవారు. మరికొందరు ‘చాకటింటి గుడ్డ చలవ’ అని చాకలింటి నుండి ఓ గుడ్డ తెచ్చి, అందులో పడుకోబెట్టేవారు. ఇవన్నీ కూడా సంతాన పరిరక్షణకోసం చేసే చర్యలే. ఈ విధంగా చేసే వారి పనులను బట్టే ఆ పిల్లలకు పేర్లు బెట్టేవారు.
ఉదా:
పెంటమ్మ మీద పడుకో బెట్టేవారిని పెంటయ్య, పెంటమ్మ అనీ, బొందపైన పడుకో బెట్టేవారిని బొందె(ద)య్య, బొందె(ద)మ్మ అనీ, విస్తరి మీద పడుకో బెట్టేవారిని ఇస్తారి, ఇస్తారమ్మ అనీ, పుల్లాకుల మీద పడుకోబెట్టే వారిని పుల్లయ్య, పుల్లమ్మ అనీ, గాలిలో ధూళిలో పడుకోట్టే వారిని గాలయ్య, ధూలయ్య అనీ ఇలా శిశువును దేని మీద పడుకోబెడే ఆ పేరు పెట్టేవారు.
—
శిశువును ఎవరికైనా దానం ఇచ్చేవారు. వారిని ప్రతిఫలం ఇచ్చి కొనుక్కునేవారు. ఆ మారకం (ప్రతిఫలం) వస్తువు తాలు, తౌడు, రొక్కం, రూక మొదలైనవి ఏవైనా కావచ్చు. అలా కొనుక్కున్న వారికి ఆయా వస్తువుల పేరు ‘తాలయ్య, తౌడయ్య, రొక్కమ్మ, రొక్కయ్య’ అని పేరు పెట్టే వారు. దానం ఇచ్చి తీసుకున్న వారిని దానయ్య, దానమ్మ అనీ, భిక్షం ఇచ్చి, మళ్లీ అడుక్కొని తెచ్చుకున్నవారిని భిక్షం, బిక్షమయ్య (బిచ్చం, బిచ్చమయ్య), బిచ్చపమ్మ అనీ పేరు పెట్టేవారు.
స్త్రీ ప్రసవించిన తర్వాత అలసటతో నిద్రించినపుడు, తల్లికి తెలియకుండా శిశువును బంధువు లు ‘దొంగలు’ ఎత్తుకొనిపోయినట్లు ఎత్తుకు పోయేవారు. మెలకువ వచ్చినతర్వాత శిశువుకోసం తల్లి రోదిస్తున్న సమయంలో ఆ శిశువును వెదకినట్లుగా చేసి, తల్లికి తెచ్చి ఇచ్చేవారు. దొంగలు ఎత్తుకు పోయిన ఆ శిశువుకు ‘దొంగయ్య’ అని పేరు పెట్టేవారు.
కొందరు ఏడు ఇండ్లల్లో భిక్షమడిగి తెచ్చిన సొమ్ముతో పంచలోహాలతీగను, ఒక ముత్యాన్ని, పగు(గ)డాన్ని కొంటారు. ఆ తీగకు పగడాన్ని, ముత్యాన్ని గుచ్చి విడిచెవుకు, విడిముక్కును కుట్టించి, పెట్టేవారు. కుడిచెవి, ఎడమ ముక్కుడానీ, ఎడమచెవి, కుడిముక్కును గానీ విడిముక్కు, విడిచెవి’ గానీ కుట్టిస్తుంటారు. భిక్షం అడిగి సంపాదించిన సొమ్ముతో విడిముక్కు విడిచెవి కుట్టించిన పిల్లలకు కూడా ‘భిక్షం, భిక్షమయ్య, బిచ్చపమ్మ’ అని పేరు పెట్టేవారు. ఇప్పటికీ ఇలాంటి పేర్లున్నవారు, ఆ తాలూకు చిహ్నాలు ఉన్నవారు మనకు కనిపిస్తుంటారు.
మొగులయ్య, మొగులమ్మ అని పేర్లు రావడానికి అనేక కారణాలున్నాయి. 1) కొంతమందికి ‘మొగుళ్లజబ్బు’ వస్తుంది. వాతావరణంలో తేమ ఎక్కువగా ఉండడంతో, కడుపు ఉబ్బి, శ్వాస తీసుకోవ డం చాల కష్టంగా ఉంటుంది. ఆ జబ్బువచ్చిన తర్వాత బతికిన వారికి కూడా ‘మొగులయ్య, మొగుల మ్మ’ అని పేరు పెట్టేవారు. 2) మరి కొందరు మొగుళ్లు (మబ్బులు) వచ్చిన సమయంలో పిల్లలను ఆరుబయట పండుకోబెట్టి వారికి మొగులయ్య, మొగులమ్మ అని పేరు పెట్టేవారు. 3) వానాకాలంలో బాగా మబ్బులు పట్టి, వాతావరణంలో తేమ శాతం పెరిగినప్పుడు, పసిపిల్లలకు శ్వాసపీల్చుకోవడం చా లా కష్టమవుతుంది. కడుపు ఉబ్బుతుంది. అలాంటి వారికి కడుపు పైన నూనె, పసుపు రుద్ది, జిల్లేడుపా లు గానీ, తమలపాకులు గానీ పెడుతుండేవారు. మంత్రాలు వేయించేవారు. ఈ జబ్బువచ్చి, బతికి బట్ట కట్టిన వారికి కూడా ‘మొగులయ్య, మొగులమ్మ’ అని పేరు పెట్టేవారు.
ఇలా అనేక బాలారిష్టాల నుండి శిశువు బయటపడి, ఎదిగే వరకు చేసే కొన్ని తతంగాలు కూ డా ఉన్నాయి. ఉదా: వెట్టికి పెంచడం.
పిల్లలను అపురూపంగా, ప్రేమగా పెంచడం వల్ల వారు అపురూపమై పోతున్నారని (మరణిస్తు నారని) భావించి, వారిని వెట్టికి పెంచుతారు. గారాబంతో చూడరు. వారి పట్ల తగిన శ్రద్ధ తీసుకోకుం డా, వెట్టికి పెంచినట్లు పెంచేవారు. అలాంటి వారికి చీమిడి కారుతున్నా, ఈగలు వాలుతున్నా, ఆకలై ఏడుస్తున్నా, అంతగా పట్టించుకోరు. సరైన బట్టలు గానీ, అందమైన బట్టలు గానీ వేయరు. కొత్తబట్టలు అసలే వేయరు. మంచిపేరు పెట్టరు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇంటిల్లిపాది తమ మనసును, మమ తానురాగాలను చంపుకొని, ఈసడించుకుంటూ పెంచుతారు. వారు వెట్టిగా పెంచిన విధానానికి తగిన ట్టుగానే వారికి ‘ఎ(వె)ట్టయ్య, ఎ(వె)ట్టమ్మ’ అని పేర్లు పెట్టేవారు.
నరదృష్టి (కొందరిది) మంచిది కాదని, వారి దృష్టి ఎక్కడ పడితే అక్కడ, వారి దృష్టిదోషం వల్ల నష్టం జరుగుతుందని జానపదులు నమ్ముతారు. వారి సంతానానికి దృష్టిదోషం తగలకుండా వారి పిల్ల లకు కనుబొమల మధ్యన (ముక్కు,నొసలు కలిసే చోటు) లేదా గదుమ(చుబుకం) మీద పచ్చబొట్టు పొడిపిస్తారు. శరీరం పైన ఎలాంటి మచ్చలు లేనివారిని, అంగవైకల్యం లేనివారిని, అందమైన వారిని పూర్వకాలం పెద్దపెద్ద కట్టడాలకు, నిధులకు, చెరువులకు, కుంటలకు తరచుగా బలిచ్చేవారు. అంగవైక ల్యం ఉన్నా, పచ్చలు, మచ్చలు, ఉన్నా బలులివ్వరు. (అంతా ఒకందుకు మంచిదే అని మనం చిన్నప్పు డు విన్న రాజు, మంత్రి కథ ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు). అంతేగాకుండా అందంగా ఉన్న వారిపై మంత్రాలు నేర్చుకున్నవారు మంత్రానికి ‘పాటి’ చూసుకునేవారు (కుంటారు). పాటి అంటే మంత్రం ఫలిస్తుందా? లేదా? అని ప్రాక్టికల్స్ చేసి, చూసుకోవడం. ‘పాటి చూసుకోవడానికి పనికి రాకుండా కూడా ముక్కుపైన అడ్డంగా పచ్చబొట్టు పొడిపించేవారు.
మరికొన్ని పేర్లు ఆయా వ్యక్తుల ఉనికిని, సంఘటనలను తెలియజేస్తాయి. రెక్కాడితేగాని డొక్కా డని జీవులు కూలికోనాలకో, కట్టెకో పిడకకో, చేనుకో, అడవికో వెళ్తారు. ఇలాంటి పని నిండుచూలాలికై పచ్చిబాలెంతకైనా తప్పదు. నిండుచూలాలు పనికివెళ్లి, తిరిగిరావడానికి వెళ్లే పరిస్థితుల్లో ఏ అడవి లోనో ప్రసవించాల్సి వస్తుంది. ఆ విధంగా ఆగంగా ఆగంగా జన్మించినవారికి ఆ సంఘటనకు గుర్తుగా ‘ఆగయ్య, అడవయ్య, ఆగమ్మ అడివమ్మ ‘ అని పేర్లు పెట్టుకుంటారు. పిల్లలు దక్కని వారుకూడా అడ విలో పడుకోబెట్టి, తిరిగి తెచ్చుకొని, అవే పేర్లు పెట్టుకుంటారు.
ఇవేగాకుండా పిచ్చమ్మ, పిచ్చయ్య, బుచ్చమ్మ, బుచ్చయ్య, డొడ్డమ్మ, డొడ్డయ్య, ఉచ్చమ్మ, రొక్క(ల)మ్మ అనే పేర్లు కూడా ఒకనాడు సాధారణం. ఈనాడు ఇవి వింత పేర్లే. కానీ, ఒకనాడు సర్వ సాధారణం.
ప్రభుత్వం కుటుంబనియంత్రణా కార్యక్రమం చేపట్టనపుడు కూడా ప్రజలు దానిని ఆచరించిన ట్లు తెలుస్తుంది. అందుకుగాను వారు ఆపరేషన్లు చేయించుకోలేదు. భావజాలాన్ని ఉపయోగించుకున్నా రు. భగవంతుని మీద భారం వేసి, పిల్లలు ఇక చాలు, పిల్లలు వద్దనుకొని, అందరికన్నా చిన్నవారికి ‘సాలయ్య, సాలమ్మ (చాలు అయ్య, చాలు అమ్మ)’ అనీ పెట్టుకునేవారు. ‘ముద్దుకు మొద్దోడు’ అని పిలి చినట్లు, వింతగా మనకు అనిపించినా అవి ఒకనాటి మానవుల మనస్తత్వాన్ని, వారి ఆలోచనాసరళిని, ప్రకృతితో మానవుడికున్న అనుబంధాన్ని, గతం తాలూకు వాసనలను, అనుభవాలను, వాటిని వదలలే ని మానవుడిని మనకు గోచరింపజేస్తాయి.
ఆ పేర్లను బట్టి ఆ వ్యక్తులు ఏ ప్రాంతం వారో, ఏ మతం వారో తెలుసుకోవడానికి కూడా ఉపయోగ పడ్తాయి. దంపతులకు ‘సంతానం ఇచ్చే దైవం ముఖ్యం గానీ మతం కాదు. ఆ దైవం తమ మతం వాడా, ఇతర మతం వాడా అని ఆలోచించరు. ఈ కారణంగా తెలుగువారి పేర్లలో ముస్లింమతా నికి చెందిన పేర్లు, క్రిస్టియన్ మతానికి చెందిన పేర్లు కనిపిస్తుంటాయి.
దంపతులు దర్గాల వద్దకు వెళ్లి వచ్చింతర్వాత వారికి జన్మించిన సంతానానికి ఆయా దేవుళ్ల పేర్లు పెట్టుకుంటారు. ఉదాహరణకు – జానయ్య, జంగయ్య, జంగమ్మ, సైదయ్య జానపాడ్ సయ్యద్ ను, జహంగీర్, కాశిం మొదలైన పేర్లు అలాంటివే. పిల్లలను గిట్టించుకోవడానికి వింతైన మరో ఆచా రం, మరో ప్రయత్నం – లింగ సహజం కాని పేర్లు పెట్టడం. పేరు చివర ‘అమ్మ’ను చేర్చి మగపిల్లలకు ‘అయ్య’ను చేర్చి ఆడపిల్లలకు పేరు పెడుతుండేవారు. ఉదా: కిష్టమ్మ (మగవాళ్లపేరు, వేములకొండ గ్రామం, నల్లగొండజిల్లా)
పేర్లను బట్టి కూడా కొన్నిసార్లు – వారు ఏ ప్రాంతం వారో తెలుసుకోవడానికి అవకాశం ఉం టుంది. యాదగిరి పేరు వినగానే ఇది తెలంగాణవారి పేరనీ, మునయ్య, మునమ్మ అనగానే రాయల సీమ వాళ్ల పేర్లనీ, పైడితల్లి, పైడయ్య, పైడమ్మ విజయనగరం వారి పేర్లనీ చెప్పవచ్చు. అప్పయ్య, అప్ప లమ్మ. సింహాచలం (శ్రీకాకుళం), మస్తానమ్మ, మస్తానయ్య పేరు వినగనే గుంటూరు ప్రాంతం వారనీ తెలుసుకోవచచ్చు. ఉస్మానియావిశ్వవిద్యాలయం తెలుగుశాఖలో సుదీర్ఘకాలం తన సేవలందించిన కీ.శే. ఆచార్య నాయనికృష్ణకుమారి గారిని ఆమె ఇంటివారు, బంధువులు ‘మస్తానమ్మ’ అనే పిలిచేవారు. మొట్టమొదటి మన హైకోర్టు న్యాయాధిపతి పేరు మస్తానయ్యనే.
తెలుగువారు సాధారణంగా శిశువు జన్మించిన పదకొండవరోజు ‘పురుడు’ చేస్తారు. ఆ రోజు పేరంటాళ్లను పిలిచి, మంతస్రానితో శిశువుకు ‘పేరు’ పెట్టిస్తారు. మగపిల్లలకైతే ఆ రోజు ‘మొలదారం, మొల్దారం’ కూడా కడ్తారు. అకాలమృత్యువు పొందే పిల్లలకు నిర్ణీతదినం(11 వరోజు) కాకుండా ‘దొంగ పురుడు’ లేదా ‘కుక్కపురుడు’ చేస్తారు. అంటే పురుడును ముందే పదకొండ(11)వ రోజు కాగుండా 3, 5, 9రోజుల్లో – ఏదో ఒక రోజు చేస్తారు. బంధువులకు ఎవరికి తెలియకుండా చేసేది దొంగపురుడు. బంధువులను పిలిచి, విందు మొదలైనవి చేయకుండా కుక్కకు అన్నం పెడితే అది ‘కుక్క పురుడు’. కాలక్రమేణ ప్రజలు విద్యావంతులు కావడంతోనూ, శాస్త్ర సాంకేతిక విజ్ఞానం పెరగడంతోనూ నమ్మకాలపైన చెప్పుకున్న ఆచారాలు తగ్గినాయి. ఇలాంటి (ఒకనాటి) ఆచారాలు, పేర్లు మరుగునపడిపోతున్నాయి.
ఇటివల కాలంలో 21వరోజు నామకరణ మహోత్సవమని చేస్తున్నారు. కాని నిజానికి అది డోలారోహణ మహోత్సవానికి ఆ రోజు 21వ రోజు శిశువు తల్లిని (బాలెంతను) బావికి తీస్తారు. ఆ రోజు నుండి బాలెంత ఇంటి పని చేసుకోవచ్చు. ఎవరినైనా పెద్దవారిని వరసవాయి, పెద్దా చిన్నా అనే గౌరవం లేకుండా, పేరు పెట్టి పిలిస్తే – ఏమిరా! ‘బొడ్డుగోసి పేరు పెట్టినావురా?’ అని తిడ్తారు. సంతానం కలుగుతున్న కొద్ది, కొందరి కుటుంబాల్లో ఒక్కొక్కరకి రెండు రోజులు చొప్పున తగ్గించుకుంటూ పురుడు, బారసాల చేస్తారు. ఉదా : ‘పాశం’ ఇంటి పేరు కలిగిన గౌండ్లవారు, ముకునూరు గ్రామం, ఇబ్రహీం పట్నం మండలం.
ఇలాంటి ఎన్నో ఆచారాలు, మూఢ విశ్వాసాలు తగ్గుముఖం పట్టినాయి.
ఒక ప్రబంధమైనా, ఒక పురాణమైనా, ఒక గేయమైనా, ఏ రచనలోనైనా, అందులో రవ్వంత హాస్యరసము మిళితమై ఉన్నాగాని పఠితులు ఆ కావ్యరసానందాన్ని పొందలేరు.
మనిషి జీవితంలోని విషాదాలను, కష్టాలను మరిచిపోవాలంటే మనసారా నవ్వుకుంటే గాని వాటిని కొద్దిసేపైనా మరచిపోయి తన జీవనయాత్రను కొనసాగించగలడు. ”సంతోషమే సగం బలం” అన్న సామెత ప్రతి ఒక్కరికీ వర్తిస్తుంది.
శృంగార హాస్య కరుణా రౌద్ర వీర భయానకారి
భీభత్సాద్భుత శాంతాశ్చ రసారి పూర్వైరుదాహృతః
అని మన లాక్షణికులు మొదలు శృంగారానికి ఆ తర్వాత హాస్యానికే ప్రాధాన్యతనిచ్చారు.
శృంగారము కేవలము యౌవనుల మనములను మాత్రమే రంజింపజేయును. కానీ హాస్యము సర్వవేళ సర్వావస్థలయందు ఆబాలగోపాలము నానందింపచేయును.
హాస్యము అనగా నవ్వు పుట్టించే సంఘటన, మాటలు, చేష్టలు, ఆకారాదులు.
”వికృతి దర్శనాది జన్యో మనోవికారః హాసః” స్వభావ విరుద్ధములగు వేషభూషాదుల వల్ల కూడా హాస్యము లేక నవ్వు గల్గును.
హాస్యరసమునకు స్థాయీభావము హాసము. ఇది 6 విధములుగా విభజింపబడింది.
1) స్మితము
2) హసితము
3) విహసితము
4) అవహసితము
5) అపహసితము
6) అతి హసితము
1. స్మితము : కొద్దిగా చెక్కిళ్ళు వికసింపజేసి, కనుబొమ్మలు కదిలించుచు, పండ్లు కనిపించకుండా మధురముగా నవ్వుట.
2. హసితము : ఎక్కువగా ముఖము, కన్నులు, చెక్కిళ్ళు వికసింపజేసి కొద్దిగా పండ్లు కనిపించునట్లు నవ్వుట.
3. విహసితము : లోలోపలనే మధురస్వరము కలుగగా, ముఖముపై రాగము జూపుచు, నోరగంట తిలకించుచు మంద్రముగా నవ్వుట.
4. అవహసితము : భుజాలు, తల అదులునట్లు ఓరచూపుతో ముక్కుపుటాలు లెస్సగా వికసింపజేసి నవ్వుట.
5. అపహసితము : తగిన కారణం లేకుండా కన్నీరు కారుస్తూ, భుజాలు, వెంట్రుకలు అదురునట్లు నవ్వుట.
6. అతిహసితము : కన్నులనుండి నీరు కారునట్లు చేతులు, కడుపు, పార్శ్వములదురునట్లు, కఠోరధ్వనితో కర్ణకటువుగా నవ్వుట.
ఇట్లు ఇన్ని రకాల నవ్వులు మన లాక్షణికులు నిర్వచించారు. మరియు ఇందులో
ఉత్తములు – స్మిత హసితులు గా,
మధ్యములు – అవహసిత, విహసితులుగా
అథములు – అపహసితాతి హసితులుగాను పేర్కొనబడ్డారు.
ఈ హాస్యము పుట్టుటకు నిర్ణీతమైన కాలముకాని, వస్తువుకాని, దేశముకాని, పదజాలముకాని లేదు. మానవుని చిత్తవృత్తిపై, అభిరుచిపై ఆధారపడి ఉంటుంది. కొందరు ఎంత నవ్వించినను నవ్వరు. నవ్వేవారిని చూసి సహించరు. అందరినీ నవ్వించి, తాను నవ్వుతూ బాధలను మరిపింప చేసేవారు చాలా తక్కువ. ఇది దైవదత్తమగు ప్రతిభ.
”నవ్వుతూ బ్రతకాలిరా తమ్ముడూ
నవ్వుతూ చావాలిరా” అన్న పాట ఇందుకు నిదర్శనం.
వెఱ్ఱి వెంగళాయిలు, బొజ్జ బాపలు, గుజ్జు మనుషులు, నత్తి చెవిటి కుంటి గుడ్డి మొదలగు అంకవైకల్యపు వారి చేతలు, ముదుసలి మొగడు పడుచు పెండ్లాము జంట, బావామరుదుల సంభాషణ, వదినె మరదళ్ళ విసుర్లు, ఛాందసుల ప్రవర్తన, బుడ్డరుఖాను, బఫూను, పిసినారి మొదలగువారి చేష్టా విశేషాలు నవ్వు కల్గించును.
కాని ప్రకృతి వల్ల వచ్చిన స్థితిని చూసి నవ్వరాదు.
సామాన్యముగా నవ్వు ఆకస్మిక సంభవాలకు, పరధ్యానంగా ఉండేవారికి, వంకరటింకర మాటలకు, తిట్లకు, కొత్తపాత ఫ్యాషన్లకి, అలంకారాలు విపరీతమైన, పిరికితనానికి, భయానికి, వ్యర్థ కోపానికి, మిశ్రమ భాషా చేష్టాదులకు కల్గుతుంది.
తప్పర్థాలు, విశేషార్థాలు, అపార్థాలు, వికృతార్థాల వల్ల నవ్వు కల్గును.
ఖ.జు. డిగ్రీని మేకప్ ఆర్టిస్టు అనీ, ఔ.ఐబీ. డిగ్రీని బాటా షూ కంపెనీ అనీ, షికారును ఐనీలి ష ్పుబిజీ అనీ, మనిషిని ఖళిదీలిగి ష ఐనీలి అనీ అంటే నవ్వనివారికి కూడా నవ్వు వస్తుంది.
మాటలు మాట్లాడుటలో కూడా కొందరికి నవ్వు కల్గించును. మాలతి అనే అమ్మాయి వద్దకు వెళ్ళి మీరు మాలా? అనుటకు బదులుగా మీరు…. (అని కొంచెం ఆగి).. మాలా? అంటే అపార్థము కల్గి నవ్వు వచ్చును.
అదీగాక ఒకడు కాలుజారి పడ్డాడని నవ్వితే ఎంతో బాధ కల్గుతుంది. అన్ని సందర్భాలలో నవ్వు అంత మంచిది కాదు.
‘నవ్వంగ రాదు పలుమరు
నవ్విన చిఱునవ్వెగాని నగరాదెపుడున్’ అన్నట్లు, ముఖ్యంగా స్త్రీలు ఎక్కువగా నవ్వితే అంత మంచిది కాదు. అనేకులు అనేక అర్థాలు తీసుకుంటారు.
నవ్వకు మీ సభలోపల
నవ్వకు మీ తల్లిదండ్రుల నాథుల తోడన్
నవ్వకు మీ పరసతితో
నవ్వకు మీ యొరుల మనసు నొవ్వగ సుమతీ !
అని సుమతీ శతకకారుడు బద్దెన కూడా అన్నాడు.
పెళ్ళిళ్లలో వియ్యాలవారి విందులు, వేళాకోళాలు నవ్వు పుట్టిస్తాయి.
బూతాడక నవ్వు పుట్టదన్నాడు గువ్వల చెన్నడు. కానీ బూతు ఉత్తమ హాస్యము కాదు.
నేటి మన సినిమాలల్లో వచ్చే హాస్యము వల్ల నవ్వుగాదు కానీ వెగటు కల్గిస్తుంది.
ఇద్దరాడవాళ్ళ సంభాషణలో ఒకావిడ ”మావారు కలెక్టరు” అంటే మరొకావిడ ”మావారూ బిల్ కలెక్టరు” అంటుంది .ఇది విన్నవారికెంతో నవ్వు వస్తుంది.
”నా భర్త డాక్టరు” అని ఒకావిడంటే, ”నా భర్త కండక్టరు” అని మరొక ఆవిడ అంటే నవ్వు రాక మానదు.
అసభ్యంగా వ్యక్తుల స్థాయిని గమనించక, దేశకాల పాత్రముల నెంచక, సంగతి సందర్భములు లెక్కించక, మోతాదు మించిక, శ్రుతి తప్పక, స్థాయి చెడక, మర్యాద విడవక, ఔచిత్యంగా, స్వారస్యంగా, సవ్యంగా, నవ్యంగా, భవ్యంగా జనింపచేసే నవ్వే నవ్వు. తేలికగా సమయస్ఫూర్తిగా నవ్వింపజేసేదే నవ్వు.
మన తెలుగు సాహిత్యంలో చిలకమర్తివారి ప్రహసనములు, గణపతి, మొక్కపాటి వారి బారిష్టరు పార్వతీశం, అడవి బాపిరాజు గారి కొంటె కోణంగి, గురజాడవారి కన్యాశుల్కం, పానుగంటి వారి సాక్షి, మునిమాణిక్యం వారి కాంతం కథలు, విశ్వనాథ వారి ‘హాహాహూహూ” శ్రీశ్రీ వారి వారం-వారం మొదలగునవి ఉత్తమ హాస్యరచనలుగా పేర్కొనబడ్డాయి.
అంతేగాక వైద్యపరంగా కూడా మానవునికి హాస్యము ఒక టానిక్ లాంటిది. నవ్వు శ్వాసకోశాన్ని క్షాళనం చేయటము, శిరస్సుకు రక్తాన్ని తోడటము, మానసికశ్రమకు ఆటవిడుపుగా ఉండటం మొదలైనవి కల్గిస్తుంది.
ప్రస్తుతం వచ్చే దిన, వార, పక్ష, మాస పత్రికల్లో నవ్వు పుట్టించే జోకులు, కార్టూనులు తప్పక ఉంటాయి. కొన్ని హాస్యపత్రికలు కూడా వెలువడుతున్నాయి.
ప్రాచీన కవులలో కూడా హాస్యరసం పండించినవారు ఉన్నారు.
ఆదికవి నన్నయ ఆంధ్రమహాభారతంలో అర్జునుడు ద్రుపదుని పట్టితేగా ”వీరెవ్వరయ్య ద్రుపద మహారాజులె ! అని ద్రోణాచార్యులచే మేలమాడించుట ఉత్తమ హాస్యానికి మచ్చుతునక.
అలాగే తిక్కన ఉత్తరుని ప్రగల్భములు, బృహన్నల హావభావ చేష్టలలో హాస్యరసమును గుప్పించాడు.
పోతన కూడా భక్తి శృంగారములతో పాటు యశోదమ్మతో, గొల్లపడుచులు ఫిర్యాదు చేయుట, చిలిపి చిన్ని కృష్ణుని అల్లరి చేష్టలలో హాస్యరసమును మేళవించాడు.
ఇక శృంగార కవియైన శ్రీనాథుడు తన చాటుపద్యాలలో ”జొన్నకలి జొన్న అంబలి” అంటూ, రాయలసీమలో నీటి కరువేర్పడినపుడు
‘సిరిగలవానికి చెల్లును
తరుణుల పదియారువేలదగ పెండ్లాడన్
తిరిపెమున కిద్దరాండ్రా
పరమేశా! గంగ విడువు పార్వతి చాలున్” అంటూ హాస్యపూరితములగు పద్యములను నుడివారు.
ఇక అష్టదిగ్గజముల వరకు పోతే తెనాలి రామకృష్ణుల వారి చేష్టలు, రాయల ఆస్థానమునకు విచ్చేసిన భట్రాజులను, పండితులను ఓడించుటలో హాస్యము కన్పించును. ఇతనికి ‘వికటకవి’ అని బిరుదుకూడా ఉన్నది. అతనికి హాస్యచమత్కృతికి మచ్చుతునకలు కొన్ని.
ఒకనాడు పింగళి సూరనగారు సభలో అష్టదిగ్గజములతో కొలువుతీరి ఉండగా ”తెనాలి రామలింగడు తిన్నాడు తట్టెడంత” అని అంటుండగానే వెంటనే సూరనగారిని పూర్తి చేయనివ్వకుండా రామకృష్ణుడు లేచి ”బెల్లం బెన్నగ మన పింగళి సూరన్నకు నోరంత పేడయై పోయెనుగా” అని చమత్కరించగా అందరూ నవ్వారు.
ఒకరోజు ఒక భట్రాజును ఓడించాలని
”మేకతోకకు మేకతోక మేకకుతోక
మేకతోకా మేక తోక మేక” అని మేకల మందను వర్ణింపగా అతడు అందులోని అర్థమును గ్రహించక ఓడిపోయి వెళ్ళాడు. ఇలా చెప్తూపోతే ఎన్నో సంఘటనలు ఉన్నాయి.
అలా తన హాస్య చమత్కృతితో వచ్చిన ఉద్ధండ పండితులనందర్నీ ఓడించి పరాభవం గావించాడు.
ఈ విధంగా హాస్యము మనస్సుకు హాయిని కల్పించేదిగా ఉండాలి గాని, అది అపహాస్యమును కల్పించునదిగా ఉండరాదు.
”అన్నమయితే నేమిరా? మరి సున్నమయితే నేమిరా?” అందుకే ఈ పాడు పొట్టకు అన్నమే వేతామురా! అంటే ఎంతో నవ్వురాక మానదు.
అట్లే సంభాషణలో చమత్కృతి కలిగినా నవ్వురాక మానదు. ఒకరిని అవమానపరుచబోయి, తానే నవ్వుల పాలవుట ఇందులోని అర్థం.
ఒక రెడ్డిగారు ఒక కవితో ”ఓహో! మీరు కపీశ్వరులా?” అని హేళన చేయగా, ఆతడు ”వే” పట్టినట్లు నీ నోట ”వీ” పట్టదేమి” అనగా ఆరెడ్డి అవనత వదనుడయ్యాడు. ఇట్లే ఒకరిని అనబోయి తానే తిరిగి అదే మాటను పొందుట వినేవారికి నవ్వు వచ్చును.
అలాగే మిశ్రమ భాషలో మాట్లాడినా, ఆంగ్లము-తెలుగు, సంస్కృతం-తెలుగు ఇలా మిళిత భాష విన్నా హాస్యం కలుగుతుంది.
‘ప్రథమం ఆవులించంత
ద్వితీయం కాళ్ళు చాపటం
తృతీయం త్రుళ్ళిపడటం
చతుర్థం లేచిపోవటం”
అన్న ఎవరికైనా నవ్వు వస్తుంది.
ది స్కై యీజ్ మబ్బీ
ది రోడ్ యీజ్ దుమ్మీ
ది మనీ యీజ్ కమ్మీ
ది ఫూల్ యీజ్ బ్యూటీ
అని వచ్చీరాని ఆంగ్లం తెలుగు మిళితం చేసి మాట్లాడినా హాస్యం కలుగక మానదు.
ఉచ్ఛారణా దోషం వల్లను, ఒక మాటకు రెండర్థాలున్నను నవ్వు వస్తుంది.
”కాఫీ తేరా” అంటే నోటుబుక్ (కాఫీ) తెచ్చిన నవ్వు వస్తుంది.
కావ్యానికి ప్రతిభ ఎంత అవసరమో, హాస్యసృష్టికి అంతే ప్రతిభ అవసరం.
నవ్వు జీవిత వికాసానికి ఊతకఱ్ఱ వంటిది. మనసారా నవ్వలేని వానికి ఆనందం కించిత్తైనా ఉండదు. జీవితం నిస్సారంగా ఉంటుంది. దుర్భరమవుతుంది. లేనిపోని అంతఃరోగములు వచ్చును. మంచిగా నవ్వు నేర్చినవారు, దుర్భరదురిత దుఃఖములను కూడా ఆనందమయములుగా చేసుకొంటారు. సంస్కృత తెలుగు మిళితమైన ఈ పద్యభావం
కక్షుధాతురాణాం న ఉడికిర్న ఉడకః
అర్ధాతురాణాం న చెల్లిర్న చెల్లః
నిద్రాతురాణాం న మెట్టర్న పల్లః
కామాతురాణాం న ముసలిర్న పిల్లః
అన్నచో నవ్వు పుట్టక మానదు.
మానవులెంత నవ్వగలిగితే అంత శరీరారోగ్యము కలుగుతుంది. నవరసాల్లో హాస్యరసము మాత్రమే మానవునికి ఆనందదాయకమును కల్గుజేయుననుటలో సందేహము లేదు. కడుపార తాను నవ్వి ఇతరులను నవ్వులలో ముంచెత్తేవాడే రసహృదయం కలవాడు.
విషాదంలోంచే హాస్యము జనించిందనే వింతవాదం కలదు. మానవునికెంత కష్టం వచ్చినా నవ్వుతూ బ్రతకడమనేది ఒక గొప్పవరం, కళ. అది సామాన్యంగా అందరికీ అలవడదు. అందరూ ఏడుస్తూ కూర్చుంటే, నవ్వించే వాడొకడుంటే, అందరూ తమ తమ బాధల్ని విస్మరించి, జీవితాన్ని ఆనందమయం చేసుకోగల్గుతారు.
అందువల్లే పూర్వం రాజుగారి కొలువుల్లో విదూషకులుండేవారు. శ్రీకృష్ణదేవరాయల వారి తెనాలి రామకృష్నుడు, అక్బర్ పాదుషా వద్ద బీర్బల్ అందుకు దాహృతులు. నాటి కాళిదాస, భాస, భారవి లాంటి మహాకవుల కావ్యాలలో విదూషకుని పాత్ర తప్పక ఉండేది.
”అతి సర్వత్ర వర్జయేత్” అన్నట్లు అతిగా నవ్వినా ప్రమాదమే.
ఎంత అందంగా ఉన్నా ముఖంలో రవ్వంత చిరునవ్వు కన్పించకపోతే వారితో ఎవ్వరూ స్నేహం చేయలేదు. మనుషులు ఒకరికొకరు పరిచయం కానపుడు, మొదట ‘నవ్వే’ వారిని పలుకరించి స్నేహాన్ని కలుపుతుంది. ఒక చిరునవ్వే వేయివరహాలంత విలువ చేస్తుంది.
మనస్సలను రాగరంజితము చేసే హాస్యరసము ప్రతి గ్రంథరచనలో ఉండటానికి ప్రోత్సహించాలి. హాస్యరచన పోటీలు పెట్టి ఉత్తమ హాస్యమును ప్రచారం చేయాలి.
విషాదాంతమైన కొందరి మానవ జీవితాల్లో వెలుగులు నింపే హాస్యరచనలు ఎక్కువగా రావాలి. అందరి హృదయాలు ఆనందమయం కావాలి.
అరాచకత్వం, అన్యాయం, అశ్లీలం, అధికారత్వం చెలరేగుతున్న ఈ రోజుల్లో ఆధునిక యువ కవులు ముందుకువచ్చి, ప్రజలలోని అవినీతి, కుళ్ళు, కుతంత్రం పారద్రోలి జాతీయ సమైక్యతను నెలకొల్పేటటువంటి సున్నితమైన హాస్యరచనలు చేసి మానవ ప్రజావళిలో మార్పులను, చైతన్యాన్ని తీసుకొని రావాలి.
శ్రీశ్రీ గారు వ్రాసిన ”మహాప్రస్థానం”లా హాస్యభరితమైన అందరికీ అర్థమై, అలరించే విధంగా హాస్యరచనలు పెక్కులు, మిక్కిలిగా రాసి, జనంలో చైతన్యాన్ని తీసుకొని రావాలి. ప్రాచీన కాలంలో మన పూర్వ కవులు వ్రాసిన ఉత్తమ హాస్యరచనలకై కృషిని చేయాలి.
అన్ని రసాల్లో కన్న
హాస్య రసమే మిన్న
అది లేని జీవితం ఓరన్నా !
నిస్సారమేరా ఓ కన్నా !
రెండు పదాల కలయిక. రెండు పదాలు కలిసేటప్పుడు అనేక మార్పులు కలుగుతుంటాయి. అంటే అక్షరాలు తగ్గడమో పెరగడమో జరుగుతూ ఉంటాయి. దీన్ని సంధి కార్యం అంటారు. వ్యాకర్తలంటే సూత్రాలు రాస్తారు. అలా చిన్నయసూరి సూరి సంధి గురించి ” పూర్వ పర స్వరంబులకు పరస్వరంబు ఏకాదేశం బగుట సంధి యనంబడు” అంటూ సంధి గురించి నిర్వచించారు.
అంటే పూర్వ పదంలోని చివరి అక్షరంలో ఉన్న అచ్చుకు పర పదంలో ఉన్న అచ్చుకు కలిసి సంధి జరిగినప్పుడు పర పదంలోని అచ్చు వచ్చి చేరడాన్ని సంధి అంటారని ఫలితార్థం.
ఆ రోజులలో గ్రాంథిక భాష వాడుకలో ఉంది కాబట్టి సూత్రీకరణ కూడా గ్రాంథిక భాషలోనే జరిగింది.
ఉదాహరణకు..
రాముడు+ అతడు
రాముడ్ + ఉ+ అతడు = ఇక్కడ ‘ఉ’మరియు ‘అ’ల మధ్య సంధి జరిగి, ఆ రెండింటి స్థానంలో ‘అ’ వచ్చి చేరి, రాముడ్ + అ+తడు = రాముడతడు అని అవుతుంది.
ఈ సంధులు అచ్చుల మధ్య జరిగితే అచ్చంధులని, హల్లుల మధ్య జరిగితే హల్సంధులని చెబుతారు. ఇవి తెలుగు సంధులు, సంస్కృత సంధులని బేధాలు ఉన్నాయి. ఈ సంధి కార్యాలు మూడు రకాలుగా జరుగుతాయి.
1. ఏకాదేశ సంధులు
2.ఆదేశ సంధులు
3. ఆగమ సంధులు.
1. ఏకాదేశ సంధులు:- ఈ సందులలో పూర్వ స్వరానికి, పరస్పరానికి సంధి జరిగినప్పుడు పరస్పరం వచ్చి చేరడం గానీ, లేదా వేరొక స్వరంగానే వచ్చి చేరుతాయి. తెలుగు సంధులలో అంతే పరస్వరమే వచ్చి చేరుతుంది.
ఉదా-:ఉత్వసంధి, ఇత్వసంధి, అత్వసంధి, ఆమ్రేడిత సంధి.
1. ఏకాదేశ సంధులు:- ఈ సందులలో పూర్వ స్వరానికి, పరస్పరానికి సంధి జరిగినప్పుడు పరస్పరం వచ్చి చేరడం గానీ, లేదా వేరొక స్వరంగానే వచ్చి చేరుతాయి. తెలుగు సంధులలో అంతే పరస్వరమే వచ్చి చేరుతుంది.
ఉదా-:ఉత్వసంధి, ఇత్వసంధి, అత్వసంధి, ఆమ్రేడిత సంధి.
సంస్కృత సంధులలో అయితే పూర్వ పర స్వరాలకు సంబంధం లేకుండా వేరొక స్వరం వచ్చి చేరుతుంది.
ఉదా:- సవర్ణదీర్ఘ సంధి ,గుణ సంధి, వృద్ధి సంధి.
2. ఆదేశ సంధులు:- ఆదేశం అనగా ఒక అక్షరాన్ని కొట్టివేసి, దాని స్థానంలో కొత్త అక్షరం వచ్చి చేరడం. అందేకే వ్యాకర్తలు “శత్రువదాదేశః” అని నిర్వచనం చెప్పారు. అంటే శత్రువులాగా రా నీ కొట్టివేసి దాని స్థానంలో మరొక అక్షరం వచ్చి చేరడం.
ఉదా:– వాడు + కొట్టెను = వాడుగొట్టెను.
ఇక్కడ ‘కొ’ స్థానంలో ‘గొ’ వచ్చి చేరింది.
ఉదా:– సరళవాదేశ సంధి ; గసడదవాదేశ సంధి; పుంప్వాదేశ సంధి; యణాదేశ సంధి.
3. ఆగమ సంధులు:– ఆగమం అనగా కొత్తగా ఒక అక్షరం రావడం.. అంటే ఉన్న అక్షరాలన్నీ ఉండగా, వాటి మధ్య కొత్తగా ఒక అక్షరం వచ్చి చేరుతుంది. అందుకే వ్యాకర్తలు ‘మిత్రవధాగమః’ అన్నారు. అంటే మిత్రుని వలే కొత్తగా ఒక అక్షరం చేరుతుంది అని ఫలితార్థం.
ఉదా:- మా + అమ్మ
మా +య్+అమ్మ = మాయమ్మ.
ఇక్కడ ‘య్’ మిత్రునిగా వచ్చి చేరింది.
ఉదా:– యడాగమ సంధి; రుగాగమ సంధి; టుగాగమసంధి, నుగాగమసంధి, దుగాగమ సంధి, అనునాసిక సంధి ; జస్త్వసంధి, శ్చుత్వసంధి;
మొదలగునవి.
తెలుగు సంధులు- సంస్కృత సంధులు ఏవో చూద్దాం!!
తెలుగు సంధులు:–
ఉత్వ సంధి;
ఇత్వసంధి;
అత్వ సంధి;
యడాగమసంధి;
ఆమ్రేడిత సంధి;
ద్విరుక్త టకారాదేశ సంధి; సరళాదేశ సంధి ;
గసడవాదేశ సంధి;
నుగాగమ సంధి; టుగాగమసంధి;
నుగాగమ సంధి;
టుగాగమ సంధి; పుంప్వాదేశసంధి;
పడ్వాదుల సంధి ; ప్రాతాదులసంధి;
దుగాగమ సంధి;
త్రికసంధి మొదలైనవి.
సంస్కృత సంధులు:– సవర్ణధీర్ఘ సంధి;
గుణసంధి;
యణాదేశ సంధి;
వృద్ధి సంధి;
అనునాసిక సంధి;
జస్త్వసంధి;
శ్చుత్వ సంధి మొదలైనవి.
చిన్నయ సూరి సంధి నిర్వచనం ఇలా సూత్రీకరించారు. “పూర్వ పరస్వరంబులకు పరస్వరంబేకాదేశంబగుట సంధి యనంబడు” ఈ సంధి సూత్రం కేవలం అచ్చు సంధులకు మాత్రమే వర్తిస్తుంది. హల్లులకు వర్తించదు. ఈ సంధి నిర్వచనం ఒకటవ సూత్రం నుండి 11వ సూత్రం వరకు వర్తిస్తుంది. మిగిలిన వాటికి ఆగమాలుగానో ఆదేశాలుగానో సంధులు జరుగుతాయి. పైన చెప్పిన 11 సూత్రాలకు మాత్రమే ఏకాదేశం జరుగుతుంది.
ఇక్కడ మనం ఆదేశం, ఏకాదేశం, ఆగమం గురించి కొద్దిగా తెలుసుకుందాం.
ఆదేశమనగా శత్రువు లాగా ఒక అక్షరమొచ్చి ముందు అక్షరాన్ని తొలగించి దాని స్థానంలో మరొక అక్షరం చేరడం.
కూర+కాయ::: కూరగాయలు
మా+ అమ్మ :::::మాయమ్మ
ఏకాదేశం అనగా పూర్వస్వరానికి పరస్వరానికి కలిపి ఒకే అక్షరం రావడం.
సీత+ అమ్మ…. సీతమ్మ
ఆగమం అనగా మిత్రునిలాగా కొత్తగా అక్షరం వచ్చి చేరడం..
పేద+ ఆలు:::: పేదరాలు
పేద+ర్+ఆలు..
ఇక్కడ రెండు పదాలు మధ్య ర్ కొత్తగా చేరింది.
చిన్నయసూరి చెప్పిన మొదటి సూత్రం చూద్దాం!
“ఉత్తునకచ్చు పరమగునపుడు సంధియగు”
చిన్నయసూరి సూత్రీకరణ అత్వసంధితో కాకుండా ఉత్వసంధితో ప్రారంభించారు. అత్వసంధి బహుళ సంధి , ఉత్వ సంధి నిత్య సంధి. విద్యార్థులకు మొదటే బహుళం గురించి చెప్పి , వారిని తికమక పెట్టడం కంటే నిత్య సంధిని పరిచయం చేయడం విద్యార్థులకు వ్యాకరణం సులభంగా నేర్పించవచ్చని చిన్నయ సూరి అభిప్రాయం. ఎంత మంచి ఆలోచన.
తన బాలవ్యాకరణంలో ఉత్త్, అత్త్ ,ఇత్త్ అని తపరకరణం(హ్రస్వ ఉకార, అకార ,ఇకార ఉకారములు) చేయడం వల్ల ఎంతో ఉపయోగంగా ఉంది. ఉత్తు అంటే హ్రస్వమైన ఉత్వం అని అర్థం. ఉకారం అంటే ఉ మరియు ఊ అని అర్థం.
హ్రస్వమైన ఉత్వమునకు అచ్చు పరమైతే సంధి నిత్యంగా జరుగుతుంది.
రాముడు+ అతడు… రాముడతడు
సోముడు+ ఇతడు… సోముడితడు
వారు+ ఎవరు ….. వారెవరు… మొదలైనవి.
వ్యాకరణ ప్రియులు ఈ సంధిని ఉకారసంధి అని గాక ఉత్వసంధి అని చెప్పాలని సూచించారు. ఎందుకంటే?
ఉకార సంధి అని చెప్పడం వలన ఉ, ఊ లు రెండు వస్తాయి. కానీ ఉత్వసంధి అని చెప్పడం వలన కేవలం హ్రస్వమైన ఉత్వం మాత్రమే ఉంటుంది. కనుక ఉత్వసంధి అని చెప్పడం సబబుగా ఉంది.
ఉత్వసంధి నిత్యసంధి అయినప్పటికీ కొన్నిచోట్ల వికల్పరూపం కూడా కనిపిస్తుంది. అందుకే రెండో సూత్రం ఇలా సూత్రీకరించారు.
“ప్రథమేతర విభక్తి, శత్రర్థక చువర్ణంబులందున్న యుకారమునకు సంధి వైకల్పికముగా నగు”
సూత్రమును ఒకసారి పరికిద్దాం!
విభక్తులు తెలుగులో ఏడున్నాయి. అవి ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థి, పంచమి, షష్టి, సప్తమీ. వీటిలో ప్రథమా విభక్తి గాక మిగిలిన విభక్తుల్లో ఉకారం చివరనున్న విభక్తులు
నన్నున్… ద్వితీయా విభక్తి
కొరకున్…. చతుర్థీ విభక్తి
నాకున్…. షష్టీ విభక్తి
అందున్…. సప్తమీ విభక్తి .
అందున్ సామ్యం చేత ఇందున్, ఎందున్ కూడా గ్రహించాలి.
ఇవేకాక శత్రర్థక చువర్ణం అంటే వర్తమాన కాలంలోని అసమాపక కాలమును సూచించు చువర్ణమని అర్థము.
వచ్చుచున్, చూచుచున్ ఇలాంటివి శత్రర్థక చువర్ణకాలు. పైన సూచించిన విభక్తి ప్రత్యయాలకు గానీ, శత్రర్థకాలుకు గానీ వైకల్పికముగా సంధి జరుగుతుంది.
నన్నున్+ అడిగె… సంధి జరిగితే మొదట నన్నున్ లో ఉన్న ద్రుతం లోపించి
నన్ను+ అడిగె… ఇక్కడ సంధి జరిగి నన్నడిగె అవుతుంది. సంధి జరగని పక్షంలో ద్రుతం వచ్చి
నన్నున్+ అడిగె...నన్నునడిగె అనే రూపం ఏర్పడుతుంది. ఇలా ఈ సూత్రం ద్వారా రెండు రూపాలు సిద్ధిస్తాయి. మిగిలిన ఉదాహరణలు చూద్దాం!
నాకొరకున్+ ఇచ్చె … నాకొరకిచ్చె.. నాకొరకునిచ్చె
నాకున్+ ఆదరువు… నాకాదరువు… నాకునాదరువు
నాయందున్+ ఆశ… నాయందాశ.. నాయందునాశ
ఇందున్+ ఉన్నాడు… ఇందున్నాడు… ఇందునున్నాడు…
ఎందున్+ ఉంటివి.. ఎందుంటివి.. ఎందునుంటివి
వచ్చుచున్+ ఉండెను… వచ్చుచుండెను.. వచ్చుచునుండెను
చూచుచున్+ ఏగెను… చూచుచేగెను… చూచుచునేగెను…
తరువాత యడాగమ సంధిని చూద్దాం!
తెలుగులో అచ్సంధులలో ఎక్కడైనా సంధి జరగకుంటే యడాగం వస్తుంది. దీర్ఘాచ్చులు మీద సంధి జరగదు. అత్వ, ఇత్వ సంధుల మీద కొన్ని చోట్ల సంధి జరగదు. అలాంటి సందర్భాల్లో యడాగమం వస్తుంది. అందుకే చిన్నయసూరి యడాగమం సంధిని ఈ విధంగా సూత్రీకరించారు.
“సంధి లేనిచోట స్వరంబు కంటె పరంబైన స్వరంబునకు యడాగమగు”
మా+ అమ్మ…. మాయమ్మ
మీ+ ఇల్లు.. మీ ఇల్లు
మా+ ఊరు…మాయూరు
ఈ ఉదాహరణలో పూరస్వరంలో దీర్ఘం ఉంది కాబట్టి సంధి జరగలేదు.
తర్వాత అత్వ సంధిని చూద్దాం చిన్నయసూరి ఆత్వసంధిని ఇలా సూత్రీకరించారు.
” అత్తునకు సంధి బహుళము”.
బహుళమనగా అనేక రకములని అర్థం. కానీ వ్యాకరణ పరిభాషలో బహుళము నాలుగు రకాలు. 1. ప్రవృత్తి (నిత్యము)
2. అప్రవృత్తి (అనిత్యము)
3. విభాష (వైకల్పికము)
4. అన్యత్వం
వీటి వివరణ చూద్దాం!
సంస్కృతంలో బహుళం గురించి ఇలా సూత్రీకరించారు.
క్వచిత్ ప్రవృత్తిః క్వచిదప్రవృత్తిః
క్వచిత్ విభాషా క్వచిదన్యదేవ
విధేర్విధానం బహుధా సమీక్ష
చతుర్విధం బహుళకం వదన్తి
1. ప్రవృత్తి :- విధించిన వ్యాకరణ కార్యం తప్పక జరగడాన్ని ప్రవత్తి లేదా నిత్యము అంటారు.
సీత+ అమ్మ…. సీతమ్మ
రామ +అయ్య రామయ్య
2) అప్రవృత్తి:- విధించిన వ్యాకరణ కార్యం జరగకుంటే అప్రవృత్తి లేదా అనిత్యం అంటారు.
అమ్మ+ ఇచ్చెను…. అమ్మయిచ్చెను
దూత+ ఇతడు…. దూతయితడు
3) విభాష :- విధించిన వ్యాకరణ కార్యం ఒకసారి జరిగి మరొకసారి జరగకుంటే దాన్ని వైకల్పికం లేదా విభాష అంటారు.
మేన+ అల్లుడు… మేనల్లుడు, మేనయల్లుడు
పుట్టిన+ ఇల్లు… పుట్టినిల్లు, పుట్టినయిల్లు
4) అన్యత్వం:- విధించిన వ్యాకరణకార్యం ఒక విధంగా జరగవలసి ఉండగా మరొక విధంగా జరగడానికి అన్యత్వం అంటారు.
ఒక+ఒక.. ఒకానొక
పై ఉదాహరణలో ఒక+ ఒక ఆమ్రేడిత సంధి జరిగి ఒకొక్క కావలసి ఉండగా అలా జరగక కకారమునకు దీర్ఘం వచ్చి దాని పైన ద్రుతము వచ్చి ఒకానొక అయినది. అలాగే
తామర+ ఆకు…. తామరపాకు
బొమ్మ+ ఇల్లు… బొమ్మరిల్లు.. మొదలైనవి.
బహుళగ్రహణము చేత స్త్రీవాచక, తత్సమ, సంబోధనాంతములకు సంధిలేదని చిన్నయసూరి సూత్రీకించారు. ఆ సూచన ప్రకారం
అమ్మ+ ఇచ్చెను… అమ్మయిచ్చెను
దూత+ ఇతడు… దూతయితడు
చెలువుడ+ ఇందము… చెలువుడయిందము
స్త్రీ వాచక శబ్దాలు అంటే స్త్రీలను గురించి తెలిపే అమ్మ, అక్క,అవ్వ, మొదలైనవి. తత్సమ శబ్దాలు అంటే సంస్కృత పదాలు మీద తెలుగు పదాలు చేరడం వలన ఏర్పడిన పదాలు. సంబోధనాంతం అంటే ఎవరిని సంభోధన చేస్తామో ఆ పదం. ఇలాంటి పదాల మీద సంధి జరగదని తెలుసుకోవాలి.
ఇత్వసంధిలోని భేదాలు తెలుసుకుందాం!
” ఏమ్యాదుల యిత్తునకు సంధి వైకల్పికముగా నగు”.
ఏమి మొదలైన పదాల్లో ఉన్న హ్రస్వమైన ఇకారమునకు అచ్చు పరమైతే సంధి జరగవచ్చు, లేదా జరగకపోవచ్చు.
ఉదా:- ఏమి+ అంటివి
ఈ పదాల మధ్య సంధి జరిగితే ఏమంటివి అవుతుంది. ఈ రెండు పదాల మధ్య సంధి జరగకపోతే వాటి మధ్య యడాగమం వచ్చి ఏమియంటివి అనే రూపం ఏర్పడుతుంది.
అలాగే
మరి +ఏమి::: మరేమి, మరియేమి
హరికిన్ + ఇచ్చె సంధి జరిగితే పూర్వ రూపంలో ఉన్న ద్రుతం లోపిస్తుంది .ఆ తర్వాత ఇత్వం మీద సంధి జరిగి హరికిచ్చె అవుతుంది . ఒకవేళ సంధి జరగపోతే ముందున్న ద్రుతంతో కలిసిపోయి హరికినిచ్చె అని ఏర్పడుతుంది. సూరి ఈ సూత్రం కింద “ఏమి, మఱి , కి- షష్టి, అది, అవి, ఇది,ఇవి, ఏది, ఏవి” అనేవి ఆకృతిక గణాలని ఇచ్చారు. పైన ఇచ్చిన పదాల్లో ఇత్వ సంధి వైకల్పికముగా జరుగుతుందని అర్థం.
తరువాత సంధిని చూద్దాం!
“క్రియాపదములందిత్తునకు సంధి వైకల్పికముగా నగు”.
ఇంతకు మునుపు సూత్రంలో ఎక్కువ భాగం సర్వనామాలు మీదే సంధి జరిగిన విధానం చెప్పబడింది. ఇప్పుడు క్రియా పదాలు మీద సంధి వైకల్పికముగా జరుగుతుందని సూచించారు.
ఉదా- వచ్చిరి+ అపుడు :::
సంధి జరిగితే వచ్చిరపుడవుతుంది. సంధి జరగకపోతే రెండు పదాల మధ్య యడాగమం వచ్చి వచ్చిరియప్పుడు అని అవుతుంది.
ఇలాగే
వచ్చితిమి+ ఇప్పుడు ::: వచ్చితిమిప్పుడు, వచ్చితిమియిప్పుడు అని అవుతుంది.
తర్వాత సూత్రం గురించి తెలుసుకుందాం. “మధ్యమ పురుషక్రియలందిత్తునకు సంధి యగును”.
తెలుగులో పురుషలు మూడు రకాలు. అవి ఉత్తమ పురుష, మధ్యమ పురుష, ప్రధమ పురుష .
తన గురించి తాను తెలిపేది ఉత్తమ పురుష, ఎదుటివారి గురించి తెలిపేది మధ్యమ పురుష, దూరంగా ఉన్న వారి గురించి తెలిపేది ప్రథమ పురుష.
మధ్యమ పురుష క్రియల మీదున్న ఇత్వానికి అచ్చు పరమైతే సంధి నిత్యంగా జరుగుతుందని సూత్రార్థము.
ఉదాహరణలు పరిశీలిద్దాం.
ఏలితివి+ అప్పుడు ఇక్కడ ఏలుతివి అనేది మధ్యమ పురుష క్రియ. దీని మీదున్న ఇత్తునకు అచ్చు పరమైతే సంధి నిత్యంగా జరిగి ఏలితివపుడు అవుతుంది. ఇలాగే ఏలితి+ ఇప్పుడు… ఏలితిప్పుడు, ఏలితిరి+ ఇప్పుడు ఏలితిరిప్పుడు అనే రూపాలు ఏర్పడుతాయి .
తర్వాత సూత్రం చూద్దాం.
“క్త్వార్థంబైన యిత్తునకు సంధి లేదు”.
క్త్వార్థమంటే భూతకాలిక అసమాపక క్రియ. భూత కాలిక అసమాపక క్రియలు మీద ‘ఇ’ అనే ప్రత్యయం చేరుతుంది.
వండు+ ఇ:::: వండి
చదువు + ఇ:::: చదివి
ఇలా వచ్చిన క్త్వార్థమునకు అచ్చుపరమైతే సంధి జరగనే జరగదని సూత్రార్థం.
వచ్చి+ ఇచ్చెను. ఇక్కడ వచ్చి అనేది క్త్వార్థక ఇకారం ఉంది కాబట్టి దాని మీద సంధి జరగదు అలాంటి సమయంలో యడాగం వచ్చి
వచ్చియిచ్చెను అని అవుతుంది. అలాగే
వండి+ ఇచ్చెను::: వండియిచ్చెను
దీనితో ఇత్వ సంధి సూత్రాలు పూర్తి అయ్యాయి.
తర్వాత ద్విరుక్త టకారాదేశ సంధి గురించి తెలుసుకుందాం!
“కుఱు, చిఱు, కడు, నడు, నిడు శబ్దముల ఱ, డలకచ్చు పరమైనపుడు ద్విరుక్తటకారాదేశంబగు”
వివరణ చూద్దాం!
కుఱు, చిఱు అనే పదంలోని “ఱ”కారమునకు కడు, నడు, నిడు అనే పదములోని “డ”కారమునకు అచ్చు పరమైతే ద్విరుక్తటకారం అంటే రెండు టకారాలు(ట్ట్) ఆదేశంగా వస్తుందని సూత్రార్థం.
కుఱు+ ఉసురు
కుఱ్+ ఉ+ ఉసురు
ఈ సూత్ర ప్రకారం ‘ఱ్’ స్థానంలో ట్ట్ వచ్చి చేరి కుట్ట్ +ఉసురు అవుతుంది. తర్వాత ట్ట్ మీద ఉ చేరి ట్టు అవుతుంది. తర్వాత ఉత్తునకచ్చు పరమగునపుడు సంధి యగు అనే సూత్రంతో కుట్టుసురు అవుతుంది.
ఇలాగే
చిఱు+ ఎలుక…. చిట్టెలుక
కడు+ ఎదురు…. కట్టెదురు
నడు+ ఇల్లు… నట్టిల్లు
నిడు+ ఊర్పు… నిట్టూర్పు
తరువాత సంధిని గురించి తెలుసుకుందా!
” అందు, అవగాగమంబులనం దప్ప అపదాది స్వరంబు పరంబగుగనప్పుడు అచ్చునకు సంధి యగు”
అందు,అవక్ అనేవి తప్ప మిగిలిన అపదము
అనగా పదము కానిది పరమైతే సంధి నిత్యంగా జరుగుతుందని సూత్రార్ధం. అందు, అవక్ పరమైనప్పుడు వికల్పంగా సంధి జరుగుతుంది.
వాడు+ ఏ అన్నప్పుడు “ఏ” అనేది అపదం. అనగా ఏ అనేది పదం కాదు. అలాంటప్పుడు ఆ రెండు పదాల మధ్య సంధి నిత్యంగా జరిగి వాడే అవుతుంది.
ఇది+ ఓ…ఇదో
అది+ ఓ …. అదో
ఇలా పదాల్లో సంధి నిత్యంగా జరుగుతుంది.
మూర+ ఎడు ఇక్కడ ఎడు అనే పదానికి అర్థం లేదు, అది అపదం కాబట్టి నిత్యంగా సంధి జరిగి మూరెడు అవుతుంది.
వీసె+ ఎడు.. వీసెడు
అర్ధ + ఇంచు ఇక్కడ ఇంచు అనేది అపదం కాబట్టి సంధి నిత్యంగా జరుగుతుంది. అర్థించు అవుతుంది. ఇలాగే
నిర్జి+ ఇంచు::: నిర్జించు
అందు, అవుక్ అనేవి పరమైతే ఎలాంటి రూపాలు వస్తాయో చూద్దాం!
రాముల+ అందు…. సంధి జరిగితే రాములందు అవుతుంది. సంధి రాని పక్షంలో రాములయందు అవుతుంది.
ఎనిమిది+ అవ.. ఎనిమిదవ, ఎనిమిదియవ ఇలా రెండు రూపాలు ఏర్పడుతాయి.
ఆమ్రేడితం గురించి చిన్నయసూరి “ద్విరుక్తం యొక్క పరరూపం ఆమ్రేడితము” అని నిర్వచనం చెప్పారు. ద్విరుక్తం అనగా ఒకే పదం రెండుసార్లు రావడమని అర్థం. పరరూపం అనగా సంధి పదంలోని రెండవ పదం. ఒకే పదం రెండుసార్లు వచ్చినప్పుడు రెండవసారి వచ్చిన పదాన్ని ఆమ్రేడితమంటారని సూత్రార్థం.
ఇప్పుడు ఆమ్రేడిత సంధిలోని వివిధ సూత్రాలను పరిశీలిద్దాం….
1) అచ్చునకు ఆమ్రేడితం పరమగునప్పుడు సంధి తరచుగానగు.
పూర్వ రూపంలో చివరనున్న అచ్చుకు ఆమ్రేడితం పరమైతే సంధి ఎక్కువ భాగం జరుగుతుంది. సూత్రంలో తరచుగా అని చెప్పడం చేత కొన్నిచోట్ల వైకల్పికముగా కూడా జరుగుతుందని భావం.
ఔర+ ఔర …ఔరౌర
ఆహా +ఆహా… ఆహాహా
ఊరు +ఊరు… ఊరూరు
అక్కడ+ అక్కడ …అక్కడక్కడ మొదలైనవి.
సూత్రంలో తరచుగా అనడం చేత
ఏమి+ ఏమి… అన్నప్పుడు సంధి జరిగితే ఏమేమి అవుతుంది. సంధి జరిగిన పక్షంలో యడాగమం వచ్చి … ఏమియేమి అవుతుంది.
ఏగి+ ఏగి అన్నప్పుడు ఏగి అనేది క్త్వార్థకం కాబట్టి క్త్వార్థక ఇకారం మీద సంధి రాదు కాబట్టి యడాగమం వచ్చి ఏగియేగి అనే రూపం ఏర్పడుతుంది.
రెండవ సూత్రం చూద్దాం.
2)ఆమ్రేడితం పరమగునప్పుడు కడాదుల తొలి అచ్చు మీది వర్ణంబులకెల్ల అదంత ద్విరుక్తటకారంబగు.
సూత్రార్థం చూద్దాం! కడ మొదలైన పదాలకు ఆమ్రేడితం పరమైతే పూర్వ పదంలోని తొలి అక్షరం తప్ప దాని మీద ఉన్న అక్షరాలన్నిటికి కలిపి అదంత ట కారం అంటే ” ట్ట” అనేది ఆదేశంగా వస్తుందని భావం.
కడ +కడ …కట్టకడ
చివర+ చివర …చిట్టచివర
పగలు+ పగలు… పట్టపగలు
బయలు+ బయలు బట్టబయలు మొదలైనవి.
కడాదులని క్రింది వాటిని పిలుస్తారు.
కడ, ఎదురు, కొన, చివర, తుద,తెన్ను, తెరువు పగలు, బయలు మొదలైనవి.
ఇంకా మూడవ సూత్రం చూద్దాం!
3)నిందయందు ఆమ్రేడితంలో ఆద్యక్షములకు హ్రస్వ దీర్ఘములకు గి గీ లగు.
నిందను చెప్పే సందర్భంలో ఆమ్రేడితం అనగా రెండో పదంలో మొదటి అక్షరం హ్రస్వం ఉంటే గి వస్తుంది, దీర్ఘం ఉంటే గీ వస్తుంది అని సూత్రార్థం.
రావణుడు +రావణుడు… రావణుడు గీవణుడు ఇక్కడ రెండవ పదంలోని రావణుడు పదంలోని రా కు బదులుగా గీ వస్తే రావణుడు గీవణుడు అని అవుతుంది.
అలాగే కుంభకర్ణుడు+ కుంభకర్ణుడు… కుంభకర్ణుడు గింభకర్ణుడు
పుస్తకం+ పుస్తకం … పుస్తకం గిస్తకం
పూలు+ పూలు… పూలు గీలు అవుతుంది.
ఇక నాలుగో సూత్రం చూద్దాం
4) ఆమ్రేడితం పరమగునప్పుడు విభక్తి లోపం బహుళముగానగు.
మొదటి పదం చివరనున్న విభక్తి ప్రత్యయానికి ఆమ్రేడితం పరమైతే ఆ విభక్తి ప్రత్యయానికి లోపం బహుళంగా వస్తుంది, అనగా అనేక రకాలుగా రాచ్చునని సూత్రార్థం.
అప్పటికిన్ + అప్పటికిన్
ఇక్కడ కిన్ అనే షష్టి విభక్తి మీద సంధి జరిగితే విభక్తి లోపించి అప్పటప్పటికిన్ అనే రూపం ఏర్పడుతుంది. ఒకవేళ సంధి జరగకపోతే రెండవ పదంలోని మొదటి అచ్చు విభక్తి ప్రత్యయముతో కలిసి అప్పటికనప్పటికిన్ అనే రూపం ఏర్పడుతుంది. అక్కడన్+అక్కడన్ …అక్కడక్కడన్ లేదా అక్కడనక్కడన్ అని అవుతుంది.
మరొక ఉదాహరణ చూద్దాం!
ఊరన్+ ఊరన్ …ఊరూరన్ లేదా ఊరనూరన్ అని వస్తాయి .
సూత్రములో బహుళమని చెప్పడం చేత ఇంచుక , నాడు మొదలైన పదాలు చివరి అక్షరం లోపించి సంధి జరుగుతుంది.
ఇంచుక + ఇంచుక… ఇక్కడ మొదటి పాదంలో చివరి అక్షరం క లోపిస్తే ఇంచించుక అవుతుంది. క లోపించకుంటే ఇంచుకించుక అవుతుంది. అలాగే
నాడు+ నాడు…. నానాడు లేదా నాడు నాడు అనే రూపాలు కూడా ఏర్పడతాయి.
ఇక ఐదవ సూత్రం చూద్దాం
5) ఆమ్రేడితం పరమగునప్పుడు మధ్యమ ము,డుజ్ లకు లోపం విభాషనగు.
డు, ము, వు,లు మొదలైన విభక్తి ప్రత్యయాలు కాగా డుజ్,రు,వు,రు,ను,ముజ్ అనేవి క్రియా ప్రత్యయాలు. ఈ క్రియా ప్రత్యయాలలో మధ్యమ పురుషను చెప్పేటప్పుడు బహువచనములో ము ప్రత్యయము ఏకవచనంలో డు ప్రత్యయము అనేవి విభాషగా లోపిస్తుందని సూత్రార్థము. ఉండుము+ ఉండుము… సంధి జరిగితే ము లోపించి ఉండుండుము అవుతుంది. సంధి జరగకపోతే ఉండుముండుము అనే రూపాలు వస్తాయి.
ఇలాగే కొట్టుడు+ కొట్టుడు… కొట్టుకొట్టుడు
కొట్టుడు కొట్టుడు అనే రూపాలు వస్తాయి.
ఇక ఆరవ సూత్రం చూద్దాం!
ఆమ్రేడితంలో అనేక రకాలుగా కార్యాలు రావడం వలన అన్ని ప్రయోగాలకు సూత్రాలు నిరూపించడం కష్టం కనుక ఒక నిపాత సూత్రంతో వాటికి సాధుత్వం కల్పించాలని చిన్నయ సూరి ఈ సూత్రాన్ని చెప్పాడు. దాన్ని చూద్దాం!
6) అందదుకు ప్రభృతులు యథాప్రయోగముగా గ్రాహ్యములు.
వివరణ చూద్దాం! అందదుకు మొదలైనవి కవి ప్రయోగాలను యథాతథంగా స్వీకరించాలని సూత్రార్ధము.
అదుకు+ అదుకు….అందదుకు
ఇంకులు+ ఇంకులు..ఇఱ్ఱింకులు
ఇగ్గులు+ ఇగ్గులు… ఇల్లిగ్గులు
చెదురు+ చెదరు …చల్లచెదురు, చెల్లాచెదురు
తురుము+తురుము …తుత్తుమురు
తునియలు+ తునియలు… తుత్తునియలు మిట్లు+ మిట్లు, మిరుమెట్లు మొదలైనవి .
పైన ఉన్న ఉదాహరణలు పరిశీలించండి. ఒక్కొక్క ఉదాహరణ ఒక్కొక్కరూపంలో ఉన్నాయి. వీటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క సూత్రం సృష్టించడం కష్టం కనుక ఇలా సూరి తెలివిగా నిపాతం చేశాడు.
అన్నవరం దేవేందర్ తెలంగాణ పల్లె సోయగం అరుగు కవిత్వం.
భరోసా కవిత.
ప్రముఖ కవి,రిటైర్డ్ సూపరింటెండెంట్,మండల ప్రజా పరిషత్ కార్యాలయం,ముస్తాబాద్,జిల్లా సిరిసిల్ల, అన్నవరం దేవేందర్ కలం నుండి జాలువారిన ఇంటి దీపం కవితా సంపుటిలోని అరుగు కవిత పై విశ్లేషణా వ్యాసం.తెలంగాణ మాండలికంలో రాసిన అరుగు కవితను ఆసక్తితో చదివాను.నాకు నచ్చింది. నాలో ఆలోచనలు రేకెత్తించింది.తెలంగాణ పల్లెల్లో ప్రతి ఇంటి ముందట అరుగు ఉంటుంది.కవి దేవేందర్ అరుగు పై వ్రాసిన కవిత ఆద్యంతం మనోహరం.అరుగు కవిత చరణాల్లోకి వెళ్ళి దృష్టిని సారించండి.అలౌకిక అనుభూతిని సొంతం చేసుకోండి. “ఇల్లు వాకిలి ఇంటి చుట్టూరా పడారి “గోడకు ఆనుకునే అటు ఇటూ అరుగులు “ఆడ కూకోని పెట్టుకున్న ముచ్చట్ల మురిపాలు “ఇప్పటికీ చెవుల్ల వినిపిస్తున్న జ్ఞాపకాలు” మొదటి నాలుగు కవితా చరణాలు ఎంతో హృద్యంగా ఉన్నాయి.తెలంగాణలో పాడిపంటలతో పొంగి పొర్లే పల్లెలు ఎక్కడ చూసినా చెట్టు చేమలతో ఎంతో అద్భుతంగా ఉండేవి.ఈనాడు ఆ పల్లెలు తన సహజ సౌందర్యాన్ని కోల్పోతున్నాయి.పల్లెలో వర్షాలు లేక పంటలు పండక కరువు విలయతాండవం చేస్తున్నది.
ఈనాడు పల్లె జనం పల్లెను విడిచి పట్నాలకు వలస వెళుతున్నారు. ఆరుగాలం కష్టించే అన్నదాత ఇవ్వాళ ఆత్మహత్యలు చేసుకుంటున్నాడు.పల్లెల్లో ఎక్కడ చూసినా ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేది.ఆ పల్లెల్లో నివసించే జనాలు అందరూ ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకొని అరుగుల మీద కూర్చుండి వాళ్ళ కష్ట సుఖాలు కలబోసుకునే వారు. పల్లెలో జనాలు ఆపదలో ఉన్నవారిని ఆదుకునే వారు.పల్లెలో ఎంతో మంచి అనుకూలమైన వాతావరణం ఉండేది.ఇప్పుడు పల్లెల్లో కూడా పట్టణమునకు చెందిన ఘర్షణ వాతావరణం ఏర్పడింది.పల్లెలోని అరుగులు,ఇండ్లు ప్రేమాభిమానాలకు నెలవుగా ఉండేవి.పల్లెలో జనాలు ఆ పాత ఇండ్లను,ఇంటి గుమ్మం ముందు ఉన్న పాత అరుగులను కాపాడుకోడం లేదు.పల్లెలో అరుగులపై కూర్చుండి జనాలు ఆడినారు, పాడినారు,పడుకున్నారు.ఆనాటి పల్లె ప్రజలు ఇప్పుడు ఎవ్వరు లేరు.కాలం వారిని తన వెంట తీసుకుపోయింది.పల్లెలోని కొందరు ఉపాధి పేరిట పల్లెను విడిచి పట్టణాలకు వలస వెళ్ళినారు. ఇప్పటికీ పల్లెను నమ్ముకుని జీవిస్తున్న వాళ్ళు ఉన్నారు.పల్లె అరుగుల మీద కూర్చుండి ఇప్పటికీ కొందరు తమ కష్ట సుఖాలను ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నారు.పల్లెలో జనాలు అరుగుల మీద కూర్చుండి మాట్లాడుకోవడం,ఇప్పటికీ అదొక వేడుకగా కొనసాగుతుంది. “వాకిట్లోనే శాద బాయి దాని పొన్న జాలారి “పక్కన్నే పెరిగిన బంతి చెట్ల వరుస “పొద్దుగాల రోజూ కాల్రెక్కలు కడుక్కుంటాంటే “కంటికి ఇంపుగ కనిపించే బంతిపూల సొగసు”. తెలంగాణలో పల్లె ఎలా ఉంటుంది.పల్లె రూపు రేఖల గురించి మనకు పరిచయం చేస్తున్న వాక్యాలు ఇవి. తెలంగాణ మట్టిలో పూసిన మాణిక్యాల వలె మనకు అరుగులు కనిపిస్తున్నాయి.తెలంగాణలో పల్లెల్లో ప్రతి ఇంటి వాకిట్లో చేద బావి ఒకటి ఉంటుంది.చేద బావి పక్కనే జాలారి ఉంటుంది.చేద బావి లేని వాళ్లు పక్కింట్లో నీళ్లు తోడుకొని పోతుంటారు. తెలంగాణ పల్లె జనాల్లో నెలకొన్న ఆప్యాయతలు, అనుబంధాలు మనసును అబ్బురపరుస్తాయి.ఒక ఆనంద లోకంలోకి మనల్ని తీసుకువెళ్తాయి.పల్లె పల్లె ఆంతా ఒక వసుధైక కుటుంబంలా కలిసిమెలిసి ఉంటారు.తెలంగాణ పల్లె ఎక్కడ కని విని ఎరుగని చిత్రమైన దృశ్య కావ్యంలా అగుపిస్తుంది.అలనాటి రామ రాజ్యం రోజులను గుర్తుకు తెస్తుంది.జాలారిలో నీళ్లు నిలవకుండా చూస్తారు.జాలారిని ఆనుకొని ప్రతి ఇంట్లో బంతి చెట్ల వరుస ఉంటుంది.పొద్దుగాల రోజు కాల్రెక్కలు కడుక్కుంటుంటే కంటికి ఇంపుగా కనిపించే బంతిపూల సొగసు మధుర మనోహరంగా ఉంటుంది.చూడడానికి బంతిపూలు ఎంతో అందంగా ఉంటాయి.బంతిపూలు రెండు రకాలు. రిక్క బంతిపూలు మరియు ముద్దబంతి పూలు. మనకు ఘంటసాల పాడిన సినిమా పాట ముద్దబంతి పూలు మూగ కళ్ళ ఊసులు ఎనక జన్మ బాసలు ఎందరికి తెలుసులే ఈ పాట ఎన్నిసార్లు విన్నా మన హృదయం పరవశించి పోతుంది.మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది.అందుకే వాటిని అపాత మధురాలు అంటారు.ఆ బంతి పూలు స్త్రీలు తమ సిగలో అలంకరించుకుంటారు.మరియు కొందరు మాల అల్లి తమ కులదేవతకు సమర్పించుకుంటారు.పల్లెలో ప్రతి ఇంటిలోనూ తోటలో చేనులు చెలకల్లోనూ పొలాల గట్ల మీదనూ బంతి చెట్లు పెంచుతారు.బంతిపూల సొగసు పరిమళాలు కమనీయంగా రమణీయంగా ఉంటాయి.పల్లెలో ప్రతి ఇంటి ముందు పందిరి వేస్తారు.దానిమీద ఈత కమ్మలు,తాటి కమ్మలు మరియు వరిగడ్డితో కప్పుతారు.పల్లెలో పందిరి కింద మంచం వేసి ఉంటుంది.పల్లె జనాలు పందిట్లోనే కూర్చుండి ముచ్చట్లు పెడతారు.వారు అలసి పోయినప్పుడు మంచంలో సేద తీరి అక్కడే పందిరి కింద నిద్రపోతారు. “పెద్దర్వాజ ముందల పరుచుకున్న పందిరి. “గుంజల మీంచి పచ్చగా పారిన అన్వే తీగ. “చిన్నపిందె రోజింత రోజింత పెరిగిన అన్యే కాయ. “అమ్మ తెంపకపోయి పొయ్యి మీద గోలిస్తాంటే. “ఇల్లంతా కమ్మ కమ్మని వాసన నోర్లల్ల ఊరిల్లు”. పెద్దర్వాజల ముంగల తెలంగాణలో ప్రతి ఇంటి ముందు పరుచుకున్న పందిరి ఉంటుంది.పందిరికి వర్షాకాలం రాగానే అనియపు విత్తనాలు నాటుతారు.పల్లెలో అనియపు తీగే పెరిగి పెద్దయి పందిరి నిండా పరుచుకుంటుంది.అనియపు చెట్టు లెక్క లేనన్ని కాయలు కాస్తుంది.సొర కాయలను ఆ ఇంటి వారు తినడమే కాకుండా తమ ఇరుగు పొరుగు వారికి పంచుతారు.కవి దేవేందర్ తన కవితలో చిన్న పిందె పెరిగి పెద్దది కాగానే అమ్మ తెంపుకపోయి పొయ్యి మీద గోలిస్తాంటే ఇల్లంతా కమ్మ కమ్మని వాసన నోర్లల్ల ఊరిల్లు ఊరుతాయని అంటున్నాడు.అమ్మ చేతి వంట ఎంతో అద్భుతంగా ఉంటుందనేది జగమంతా ఎరిగిన సత్యం.ప్రతి పల్లెలో అమ్మ ఎప్పుడు ఇలానే కమ్మ కమ్మగా వండి పెడుతుంది.తెలంగాణలో ప్రతి అమ్మ కుటుంబం కొరకు ఆరుగాలం కష్టపడుతుంది.అమ్మ తన భర్తతో,పిల్లలతో, బంధువులతో మరియు ఇరుగు పొరుగు వారితో ఎంతో సఖ్యతగా మెలుగుతూ కుటుంబాన్ని గుట్టుచప్పుడు కాకుండా గుంభనంగా ఎంతో నేర్పుగా అలవోకగా కొనసాగిస్తుంది.పల్లెలో కోడి కూతతోనే ఆ తల్లి నిద్ర లేస్తుంది.అమ్మ ఇల్లును మరియు వాకిలిని శుభ్రంగా ఊడ్చుతుంది.అమ్మ వాకిలిని పెండ నీళ్లతో కల్లాపి (సాన్పు) చల్లుతుంది. అమ్మ వాకిట్లో సుద్ద మట్టితో ముగ్గులు వేస్తుంది. రంగవల్లులతో వాకిలిని తీర్చిదిద్దుతుంది.అమ్మ ఇల్లు మొత్తం ఎర్రమట్టి కల్పిన పిడుసతో అలుకుతుంది. అమ్మ పశువుల పేడ తీసి వేసి పశువుల కొట్టం శుభ్రం చేస్తుంది.అమ్మ పశువులకు కుడితి నీళ్లు పెడుతుంది.అమ్మ పాలిచ్చే బర్ల పాలు పిండుతుంది. తర్వాత మగ వాళ్ళు పశువులను తోలుకొని వ్యవసాయ పనులకు తరలిపోతారు.అమ్మ తర్వాత పొయ్యి గద్దెలు పుట్ట మట్టి పిడుసతో అలుకుతుంది. తర్వాత పొయ్యి ముట్టించి పాలు వేడి చేస్తుంది. “పదారి గోడకు పొడుగుతా “ఎర్రలుకు మీద సున్నం తీనెలు ,”కడపలకు పుధిచ్చిన పసుపు పండుగ శోభ “ఎర్ర కుంకుమ,పసుపు,తెల్లబొట్ల సింగారం “గల్మల్ల నిలబడంగనే కండ్లకు ఇంపైన మురిపం.” మన తెలంగాణలో ప్రతి పల్లెలోని ఇల్లు ఇలానే ఉంటుంది.పడారి గోడకు పొడుగుతా ఎర్ర మట్టితో అలుకుతారు మరియు సున్నంతో బొట్లు పెడతారు. పల్లెలో దర్వాజా మరియు కడపలకు పసుపుతో అలంకరించి ఎర్ర కుంకుమ పసుపు తెల్లబొట్లతో సింగారం చేస్తారు.ప్రతి ఇంట ఇలానే అలంకరణ చేసి శుభ్రంగా ఉంచుతారు. “పెరట్లో సన్న సన్నగా ఎగబాకుతున్న మల్లె తీగ”. ప్రతి ఇంటిలో మల్లె చెట్టు ఉంటుంది.మల్లె పూల పరిమళం ఎంతో కమ్మగా ఉంటుంది.మల్లె పూలను ఆడవాళ్లు తమ సిగలో అలంకరించుకుంటారు. “గోడ అవతల నుంచి చల్లగాలి విసురుతున్న యాపలు” వేప చెట్టు గాలి ఎంతో అద్భుతంగా ఉంటుంది.వేప చెట్టు గాలి గురించి చెప్ప తరం కాదు.వేప చెట్టును మహాలక్ష్మి స్వరూపంగా భావించి పూజిస్తారు.వేప ఆకులతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి.వేపాకును ఇళ్లల్లో టేకు దూలాలు అమర్చి టేకు పరోటా చెక్కలను కొట్టిన తర్వాత దానిమీద వేపాకు పరిచి తర్వాత గూన పెంకలు కప్పుతారు.పల్లెలో నివసించే జనాలు గూన పెంకలతో ఇల్లు కట్టుకునే వారు. పల్లెలో గూన పెంకల ఇల్లు కూడా చాలా చల్లగా ఉంటుంది.కాలం మారింది.ఇప్పుడు గూన పెంకల ఇండ్లు కట్టడం లేదు.పాత గూన ఇండ్లు సరైన మరమ్మతులు లేక కూలిపోతున్నాయి.పల్లెల్లో కుటుంబాలు పెరిగి పాత ఇండ్లను విడిచి రోడ్డుకు దగ్గరగా వెళ్లి స్లాబ్ బిల్డింగులు కట్టుతున్నారు.పాత పల్లెలు బీడు పడుతున్నాయి.పల్లెలో జనాలు రోడ్డు దిక్కు వచ్చి షాపులు సెట్టర్లతో ఇల్లు కట్టి ఉంటున్నారు.పల్లె వాతావరణం కనుమరుగు అవుతున్నాయి. కొన్నాళ్లకు గూన పెంకుల ఇండ్లు ఉండవు. “ఆ కళల వాకిట్లో గడెంచ పరుచుకొని ఒరుగుతే” “కాకులు కోయిలలు వూరవిష్కల పలకరింపులు” “దూరంగా గోడ సూరుకు ఉరుకుతున్న ఉడతల జోడి”. “ఊళ్లే మా ఇల్లు వాకిళ్ళ కమనీయ దృశ్య కావ్యం”. పల్లెలో జనాలు చెట్ల కింద ఒరిగితే కాకులు కోయిలల కుహు కుహు రావాలు,ఊరవిష్కల కితకితలు,ప్రతి ఇంట్లో జామ చెట్టు,ఆ జామ చెట్టు మీద ఉడతల జోడి కనబడుతుంది. ఉడతలు, రామచిలుకలు జామ పండ్లు తింటాయి. “ఊళ్లే మా ఇల్లు వాకిళ్ళ కమనీయ దృశ్య కావ్యం”. తెలంగాణలో ప్రతి పల్లెల్లో ఇల్లు ఎలా ఉంటుందో అరుగు అనే కవిత ద్వారా కవి దేవేందర్ చాలా చక్కగా గ్రామీణ వాతావరణాన్ని తెలియపరిచారు. పల్లెలో పుట్టి పెరిగిన దేవేందర్ పల్లెలోని మట్టి పరిమళాన్ని పల్లె సోయగాన్ని ఎంతో ఆకలింపు చేసుకొని ఇలాంటి వాస్తవిక కవితను రాశాడని తోస్తోంది.తెలంగాణ పల్లెల్లో పుట్టిన దేవేందర్ తెలంగాణ పల్లె సంస్కారాన్ని పుణికి పుచ్చుకొని తెలంగాణ పల్లె ఎలా ఉంటుందో అరుగు కవిత ద్వారా మనకు అందించారు.ఇప్పటికీ మన తెలంగాణ గ్రామాల్లో అరుగులు ఉన్నాయి.సబ్బండ వర్ణాల ప్రజలు తమ ముచ్చట్లు మురిపాలతో అరుగు మీద తేలిపోతుంటారు.అరుగు కవిత చదివితే మాభూమి సినిమా చూసినట్టుగా ఉంది. గ్రామీణ వాతావరణం మన కళ్ళకు కదలాడుతుంది. మా భూమి సినిమా తీసింది మన తెలంగాణకు చెందిన పల్లె బిడ్డ బి.నర్సింగరావు.తెలంగాణ పల్లె ముఖచిత్రంలో ఇప్పటికీ అరుగు నిలిచి ఉంది.పల్లె వర్తమానంలో కూడా అరుగు ఉంది.పల్లె భవిష్యత్తులో కూడా అరుగు ఉంటుంది.పల్లె వాకిట్ల చేద బావి దాని పొంటి జాలారి,పడారి గోడ పక్కనే పూల చెట్లు,పూబంతులు ముద్దబంతులతో కూడిన ఎన్నెన్నో పూల తోటలు కనిపిస్తాయి.పల్లెలో ఆ పూల వనాలు మన మనసుకు ఉల్లాసం కలిగిస్తాయి. పల్లెలో పండగలప్పుడు ప్రతి ఇంటి దర్వాజలకు బంతిపూల మాలలు కట్టి అలంకరిస్తారు.ప్రతి ఇంటికి మామిడి తోరణాలు కడతారు.దేవుని గదిలో బంతి పూల మాలలతో తమ ఇష్ట దైవాన్ని కొలుస్తారు. పల్లెల్లో ఎటు చూసినా పచ్చదనంతో చెట్టు చేమలతో ప్రకృతికి పర్యాయ పదంలా కళకళలాడుతుంటుంది. తెలంగాణలో పల్లెల్లో ప్రతి ఇంట అరుగు శోభించాలని మనమంతా కోరుకుందాం.పల్లె వాతావరణం తలపించేలా అరుగు కవితను రాసిన కవి దేవేందర్ ను అభినందిస్తున్నాను.కవి దేవేందర్ మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.
అన్నవరం దేవేందర్ భరోసా కవిత పై విశ్లేషణా వ్యాసం
ప్రముఖ కవి,రిటైర్డ్ సూపరింటెండెంట్,మండలం ప్రజా పరిషత్ కార్యాలయం,ముస్తాబాద్,జిల్లా సిరిసిల్ల,అన్నవరం దేవేందర్ కలం నుండి జాలువారిన ఇంటి దీపం కవితా సంపుటిలోని భరోసా కవిత పై విశ్లేషణా వ్యాసం.తెలంగాణ మాండలికంలో రాసిన భరోసా కవితను ఆసక్తితో చదివాను.నాకు నచ్చింది.నాలో ఆలోచనలు రేకెత్తించింది.భరోసా కవిత ఏమిటి? అని మనకు ఆశ్చర్యం కలిగించవచ్చు.ఇవ్వాళ సమాజంలో మనిషికి భరోసాను ఇచ్చేవారు అరుదుగా కనిపిస్తారు.హామీ ఇవ్వడం,స్థిరముగా చెప్పుట అనేవి భరోసాకు అర్థం.ఎవరి ఆందోళననైనా
తగ్గించడానికి ఉద్దేశించిన సలహా భరోసా.ఎవరైనా బాధలో ఉన్నప్పుడు అతనికి చెప్పు ఓదార్పు మాటలు భరోసా.నేను ఇది చేస్తానని ఖచ్చితంగా చెప్పడం భరోసా.కవి దేవేందర్ భరోసా కవిత చరణాల్లోకి వెళ్లి దృష్టిని సారిద్దాం.అలౌకిక అనుభూతిని సొంతం చేసుకుందాం.
“ఎవుసం ఎటమటమైతేంది
“ఎట్లనన్నా బతుక రాదా
“సచ్చుడు ముచ్చట ఎందుకు సాయిలు నాయినా !
ఒక నిర్దిష్టమైన పద్ధతిలో మొక్కలను,జంతువులను పోషించి తద్వారా ఆహారాన్ని,మేతను,జనప నార, ఇంధనాన్ని ఉత్పత్తి చేయటాన్ని వ్యవసాయము లేదా కృషి అంటారు.వ్యవసాయం చరిత్ర మానవ చరిత్రలో అతి పెద్ద అంశం. ప్రపంచవ్యాప్త సామాజిక ఆర్థిక ప్రగతిలో వ్యవసాయాభివృద్ధి ఒక కీలకాంశంగా చెప్పవచ్చు.వెనుకటి కాలంలోనే ఎవుసం బాగుండేది.గప్పటి ఎవుసం వేరు.ఇప్పటి ఎవుసం వేరు.అప్పుడు ఇంటిల్లిపాది అందరూ కలిసి ఎవుసం పని చేసే వాళ్లు.ఈనాడు అప్పటి తీరుగా ఇంటిల్లిపాది అందరూ కలిసి ఎవుసం చేయుట లేదు.అప్పుడు అడవి జంతువుల బెడద లేకుండేది. కాలం మారింది.ఇప్పుడు అడవి జంతువుల బెడద ఉంది.కాలం కలిసి రాక వ్యవసాయంలో పంట దిగుబడి రావడం లేదు.కరువు కాటకాల వల్ల పంట దెబ్బతింది.వ్యవసాయంలో పంట రాలేదని ఎందుకు బాధ పడుతున్నావు.కాలం కలిసి రాకనే కదా పంట రాక పాయె.పంట దెబ్బతిందని నువ్వు ఇంత దిగులు ఎందుకు పడుతున్నవు.పంట లేక పోయినా ఎట్లనన్నా బతుక రాదా? అని ప్రశ్నిస్తున్నాడు. చనిపోవడం ముచ్చట ఎందుకు చెపుతున్నావు సాయిలు నాయినా అని అతను ఓదార్చుతున్నాడు. సాయిలు నాయిన ఎవుసం చేసే రైతు అని తోస్తోంది.రెక్కలు ముక్కలు చేసుకుని ఎవుసం చేసినప్పటికి పంట దిగుబడి లేక పోవడం వలననే దిగులు పడిన సాయిలు నాయినను ధైర్యం కలిగిస్తూ ఓదార్చుతున్నాడు.
“కలీగం మీద మనుషులందరు
“ఎవుసమే చేస్తండ్రా
“ ఎన్నో తీర్లుగ బతుకుతుండ్రు.
వేదాల ననుసరించి యుగాలు నాలుగు.1) సత్య యుగం 2) త్రేతా యుగం 3) ద్వాపర యుగం 4) కలి యుగం.ప్రస్తుతం నడుస్తున్న యుగం కలియుగం.కలి యుగంలో అన్యాయం,అధర్మం చెలరేగుతుంది. మంచి వాళ్లకు చెడు ఎదురవుతూ ఉంటుంది. కలియుగంలో నివసిస్తున్న మనుషులందరూ వ్యవసాయం వృత్తిగా చేసుకొని బతుకుతున్నారా? అని ప్రశ్నిస్తున్నాడు.ఈ దేశంలో నివసిస్తున్న మనుషులందరు వివిధ రకాల వృత్తులు చేపట్టి పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు.నీ లాగా ఒక్కటే వ్యవసాయం చేసి మనుషులు బతకడం లేదు.కోటి విద్యలు కూటి కొరకే అన్నారు. మనుషులు తమ బతుకు గడపడానికి ఎన్నో పనులను ఎన్నో తీర్లుగా చేస్తున్నారు అని చెప్పిన తీరు చక్కగా ఉంది.
“వో ఫసల్ లుక్సనా అయితది
,”మల్లో పంటకన్నా పచ్చగుండదా
“కాలం కర్మగాలి
“ఎవుసం ఎల్లెల్కల పడచ్చు
“భూమిల నీళ్లు పాతాళం పట్టచ్చు
‘ మొగులుకు కనికరం లేక పోవచ్చు
“ ఆవుసు తీసుకుంటవా ! అన్యాలం చేస్తవా !
ఫసల్ ఉర్దూ పదం.ఫసల్ అనగా పంట.వ్యవసాయం చేస్తున్న రైతుకు వాతావరణం అనుకూలించకపోతే పంటలు పండవు. వర్షాలు లేక కరువు ఏర్పడి ఒక పంట చేతికి రాకపోతే నష్టం వస్తుంది.అంత మాత్రానికే బెంబేలు పడకూడదు.మరుసటి సంవత్సరం వర్షాలు కురిసి పచ్చని పంట చేలతో కళకళలాడుతుంది అనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు.
“కాలం కర్మగాలి
“ఎవుసం ఎల్లెల్కల పడచ్చు
గడియారం తెలిపేది కాలం.నిమిషాలు గంటల గురించి తెలిపేది కాలం.ఏదైనా పనిచేయుటకు ఇచ్చు సమయం కాలం.ఆగమన్న ఆగనిది కాలం. భూత వర్తమాన భవిష్యత్తులను కలిపి చెప్పబడేది కాలం.కర్మ అంటే సరియైన అర్థం పనిచేయడం. పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు చేసే ప్రతి పని కర్మయే.నిద్రించడం,శ్వాసించడం,ధ్యానించడం,తపస్సు,మౌనం, భుజించడం,ఉపవసించడం కర్మ. జీవించి ఉన్న ప్రాణి కర్మ చేయకుండా ఉండ లేడు. మనం నివసిస్తున్న వర్తమాన కాలంలో మనుషులు తాము చేస్తున్న కర్మల వల్ల ఫలితం అనుకూలంగా రాక నష్టపోవడం జరుగుతుంది.రైతు చేస్తున్న వ్యవసాయం ప్రకృతి మాత కరుణించకపోవడం వల్ల పంట రాకపోవడం జరుగుతుంది.ప్రకృతి మాత ప్రసాదించిన నీరు పాతాళానికి చేరి మనం చేస్తున్న వ్యవసాయ పంటకు నీరు అందకపోవడం వల్ల పంటలు ఎండి పోవచ్చు.వరుణ దేవుడు కరుణిస్తేనే ఆకాశం నుండి వర్షం కురుస్తుంది.ఆకాశం దయ చూపించకపోవడం వల్ల వర్షం పడక పోవచ్చు.అంత మాత్రాన ఏదో అయిందని ఎందుకు తొందర పడుతున్నావు అని ఓదారుస్తున్నాడు.పంట పండలేదని ప్రాణం తీసుకుంటవా? అన్యాయం చేస్తవా? అని ప్రశ్నిస్తున్నాడు.
“రాజస్థాన్ కరువు రైతులే
“మన తాన స్వీట్లు దుకాండ్లు నడుపుతుండ్రు.
రాజస్థాన్ ఎడారి ప్రాంతం.అక్కడ నివసించే కరువు రైతులు వ్యవసాయంలో రాబడి రాక మన తెలంగాణ రాష్ట్రంకు వచ్చి స్వీట్ల దుకాణాలు పెట్టి జీవనం కొనసాగిస్తున్నారు.రాజస్థాన్ వాళ్లు అక్కడ ఎల్లు మాను లేక ఇక్కడి ప్రాంతానికి వచ్చి పొట్ట పోసుకుంటున్నారు.రాజస్థాన్ వాళ్ళని చూడు అని చెబుతున్నాడు.
“నేపాల్ బక్క ఎవుసం చేసేటోల్లే
“సలి కాలం ఉన్ని దుస్తులు అమ్ముతుండ్రు.
నేపాల్ దేశం ప్రజలు అక్కడ వ్యవసాయం చేసి జీవనం సాగించేవారు.కానీ వాళ్ల దేశంలో బతుకు బండి సాగక మన దేశంకు వచ్చి చలి కాలంలో ఉన్ని దుస్తులు అమ్మి జీవనం కొనసాగిస్తున్నారు.పుట్టి పెరిగిన నేపాల్ దేశం విడిచి వచ్చి ఇక్కడ బతుకు గడుపుతుండ్రు అనేది వాస్తవమని చెప్ప వచ్చు.
“నాలుగు గీరెల బండి మీద
“కారీలు అమ్ముకుంట తిరిగేటాయన
“మన పక్కపొన్న మహారాష్ట్ర మనిషి.
పొద్దున లేవగానే మన గడప ముందుకు వచ్చి నాలుగు గీరెల బండి మీద కారీలు,తినే పదార్థాలు అమ్ముకుంటా తిరిగే ఆయన మన పక్క రాష్ట్రమైన మహారాష్ట్రకు చెందిన వాడు.అతను మహారాష్ట్ర ప్రాంతమును విడిచి పెట్టి బతుకు తెరువు కొరకు ఇక్కడికి వచ్చి భార్యా పిల్లలతో జీవనాన్ని కొనసాగిస్తున్నాడు.
“బతుకు తెరువు లేక
“సోలపురం భీవండి సూరత్ పోయినోల్లను
“ఎందరిని సూల్లేదు ఎన్కటి నుంచి.
మన ఊళ్లో బతుకు తెరువు లేక ఎంతో మంది అన్ని కులాల కుల వృత్తులు చేసుకునేటోళ్లకు ఇక్కడ మన ఊరిలో పని దొరకక సోలాపురం,భీవండి,సూరత్ వంటి ప్రాంతంకు వెళ్లి అక్కడనే పని చేసుకుంటూ భార్యా పిల్లలతో జీవనం కొనసాగిస్తున్నారు.మన ఊరుని విడిచి పెట్టి వేరే ప్రాంతంలో బతుకు గడుపుతున్నారు.
“అప్పులు కావచ్చు తిప్పల అవుతుండొచ్చు
“వూరు దాటి పోయన్న బతికి రావాలె
“ఉసూరుమంట పాణం తీసుకుంటె ఎట్లనే
“పోనీ సస్తే మాఫీ అయితయా నాయన.
మనిషన్న వాడికి ఎల్లు మాను లేక అప్పులు అయితయి.మనుషులకు కాకుంటే అప్పులు మానులకు అయితయా.అప్పులతోనే తిప్పలు అయితది.అప్పులు ఇచ్చిన అతడు అప్పు తీర్చమని వెంటపడి వేధిస్తాడు.అప్పులు ఉన్నయని ప్రాణం తీసుకుంటే ఎట్లా అని ప్రశ్నిస్తున్నాడు. అప్పులు తీర్చలేక నీవు చనిపోతే నీవు చేసిన అప్పులు మాఫీ అయితయా నాయనా అని ప్రశ్నిస్తున్నాడు.
“పుల్కు పుల్కున సూస్తున్న
“పొలగాండ్ల మొకమన్న సూడు
“ ఇంటామె నెత్తి నోరు కొట్టుక సస్తది
“ఇల్లంతా ఆగం పక్షి అయితది.
ప్రాణానికి ప్రాణంగా ఎంతో ప్రేమగా నీ వంక చూస్తున్న పిల్లల ముఖము ఒకసారి చూడు.ఒక్క సారి నీ పిల్లల మొఖం చూస్తే నీకు బాధగా అనిపించదా?నీతో పెన వేసుకున్న బంధమైన నీ భార్య,ఇంటామె నీవు లేకుంటే నెత్తి నోరు కొట్టుకుని గోడు గోడున ఏడ్చి చనిపోతది.నీవు లేకుండా నీ ఇల్లు,నీ కుటుంబం గూడు లేని పక్షిలా జీవితం అస్తవ్యస్తం అయితది.గూడు లేని పక్షిలా ఏడ్చి చావదా?అప్పులు చేసినోళ్లు అందరూ ప్రాణాలు తీసుకుంటున్నారా? అని ప్రశ్నిస్తున్నాడు.పెద్ద పెద్ద బడా బాబులు దేశాన్ని ముంచి కోట్లకు కోట్లు అప్పులు ఎగ్గొట్టి తిరుగుతున్నారు. కోట్లు అప్పులు చేసి అట్టి అప్పులు ఎగ్గొట్టి సుఖంగా బతుకుతున్నారు.అందులో నీవు చేసిన అప్పు ఏ పాటిది.చాలా చిన్నది.నీవు కష్టం చేసి మళ్లీ ఆ అప్పును తీర్చగలవు అని ఓదారుస్తున్నాడు.
“ఎవుసమే కాదు నాయినా
“ఎన్ని దందలైనా చెయ్యొచ్చు
“ఎద్దూ ఎవుసాన్ని కొన్ని రోజులన్నా
“బందుకు పెట్టు
“బతకనీకి బహు మార్గాలు
“వూరిడువు,ఇల్లిడువు,పల్లె ఇడువు
“కాల్రెక్కలున్నయ్ ఏన్నన్న చేస్క బతుకు
“లోకానికి ఇన్ని రోజులు అన్నం పెట్టినోనివి
“లోకం నీకు ఇప్పుడు అన్నం పెట్టదా !
వ్యవసాయం వృత్తిగా చేయడం కాదు.బతకడానికి ఎన్ని పనులైనా చేయవచ్చు.నీవు చేస్తున్న ఎద్దు ఎవుసాన్ని కొన్ని రోజులు చేయకుండా మాని వేయి అని సలహా ఇస్తున్నాడు.ఈ సమాజంలో బతకాలంటే లెక్కలేనన్ని మార్గాలు ఉన్నాయి.నీవు బతకడం కొరకు ఊరిని విడిచి వెళ్లి పోవచ్చు.నీవు బతకడం కొరకు ఇల్లును విడిచి పెట్టు.నీవు బతకడం కొరకు పల్లెను విడిచి పెట్టు.నీవు ఇప్పుడు పట్నంకు పోయి బతుకు.నీ కాళ్లు రెక్కలు చక్కగా పని చేస్తున్నాయి.ఎక్కడికన్నా పోయి ధైర్యంగా ఏదైనా పని చేసుకుని బతుకు.లోకానికి నీవు ఇన్ని రోజులు అన్నం పెట్టిన అన్నదాతవు.అట్లాంటి అన్నదాత అయిన నీకు లోకం ఇప్పుడు అన్నం పెట్టదా? అని ప్రశ్నిస్తున్నాడు.భరోసా కవిత ద్వారా సాయిలు నాయనకు జీవితం పట్ల ఆశ కలిగేటట్టు చేస్తున్నాడు.సమస్యలు ఉన్నాయని బాధపడ వద్దు. నీవు ఎక్కడైనా కష్టపడి పని చేస్తే నీ సమస్యలు ఇట్టే తొలగిపోతాయి.ఈ కవిత ఎన్నో ఉదాహరణలతో రైతు సాయిలుకు మనో ధైర్యాన్ని,భరోసాను కల్పించేదిగా తోస్తుంది.దేశంలోని రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు భరోసా కవిత ద్వారా పరిష్కారాన్ని చూపిస్తున్న కవి దేవేందర్ ను అభినందిస్తున్నాను.కవి దేవేందర్ మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.