Uncategorized

ఆత్మకు రూపాన్ని అందించి
అనంత లోకాల నుండి అవని పైకి
దిగుమతి చేసే దేవత – అమ్మ!
నెల తప్పిన నాటి నుండి
నిలువెల్లా మురిసిపోతూ –
కడుపులో కదలికలు మెదలుతుంటే
కలలలో తేలిపోతూ –
కూర్చున్నా, లేస్తున్నా, నడుస్తున్నా,
ఆపసోపాలు పడుతూనే
ఆనందంలో మునుగాడుతూ –
జవ సత్త్వాలు ఉడుగుతున్నా
నవ మాసాలు మోసి,
నిండు గర్భిణిగా నొప్పులన్నీ భరించి,
ప్రసవించి, ప్రభవింపజేస్తుంది
సృష్టిలో ఒక సరిక్రొత్త జీవిని!
పడతి నుండి పరిణామం చెంది
ప్రపంచంలో నిలుస్తుంది
ఒక మాతృమూర్తిగా!
నిస్వార్థమైన ప్రేమకు
ఒక నిలువెత్తు ప్రతీకగా!!
కనుల ముందు నిజమైన
తన కలను చూచి
కష్టాన్నంత క్షణంలో మరిచిపోయే
కమనీయ హృదయ – అమ్మ!
చనుబాలే అమృతంగా పంచి,
తన ఒడినే ఊయలగా మలచి,
జోలపాటతో యోగ నిద్రలోకి
ప్రయాణింపజేసే ప్రథమ గురువు – అమ్మ!
అమ్మ అడుగులు వేయిస్తుంది
అమ్మ నుడుగులు నేర్పిస్తుంది
అమ్మ ఆకలి తీరుస్తుంది
అమ్మ లోకం చూపిస్తుంది
అమలినమైన అనురాగానికి
ఆకృతి దిద్దితే – అది అమ్మ!
ఆమెకు సరితూగడు తానైనా
ఆ సృష్టికర్త బ్రహ్మ!!#
(మాతృమూర్తులందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలతో …)
“ఆంధ్ర సాహిత్యంలో వచన కవితా శిల్పి,కవికుల తిలకుడు,రస గంగాధరుడు అయిన దేవరకొండ బాలగంగాధర తిలక్ తన రచనల ద్వారా ఒక విశిష్ట రచనా ప్రవృతిని,కవితా స్రవంతిని, నిర్దిష్టకులాలలో, నిరంతర రస ప్రవాహంగా ప్రవహింపచేశాడు. తన అమూల్య రచనల ద్వారా ఆంధ్ర సాహిత్య చరిత్రలో శాశ్వత కీర్తి చంద్రికల్ని ప్రసరింప చేశాడు. ఆయన రచనలు ఆంధ్ర సాహిత్య ధనాగారానికి ఒక అక్షయ రత్న సంపద వంటివి”.తిలక్ గొప్ప కవి.ఆధునిక తెలుగు సాహిత్యంలో ఇతనికొక విశిష్ట స్థానముంది.
నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయాపారావతాలునా అక్షరాలు ప్రజాశక్తుల వహించే విజయ ఐరావతాలు
నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు అని తన కవితా లక్ష్యాన్ని చెప్పుకున్న దేవరకొండ బాల గంగాధర తిలక్ పశ్చిమగోదావరి జిల్లా తణుకు తాలూకా మండపాక గ్రామంలో ఆగస్టు 1 వ తేదీ 1921 సంవత్సరంలో జన్మించాడు.
సమాజంలో దగాపడిన వారి జీవితాలను చూసి చలించిన తిలక్ సున్నిత హృదయుడు కాబట్టి వాటినే తన కవితావస్తువులుగా మలచుకున్న
తిలక్ భావకవిత్వంలోని భావ సౌకుమార్యం, భాషా మార్దవం, అభ్యుదయ కవిత్వలక్షణాలతో కలసి వెలసిన తిలక్ కవిత్వం, అభ్యుదయ, భావ కవిత్వాల కలనేతతో “అమృతం కురిసిన రాత్రి,ప్రభాతము సంధ్య,గోరువంక కవితాసంపుటిలు,సుందరీ సుబ్బారావు,ఊరి చివర ఇల్లు అనే కథా సంపుటాలు,సుశీల పెళ్లి,,సాలెపురుగు అనే నాటకాలు,సుచిత్ర ప్రయాణం,ఇరుగుపొరుగు,సప్తశిల అనే నాటికలు ఎన్నో ప్రక్రియల్లో రచనలు చేసిన తిలక్ కేవలం 45 ఏళ్ల అతి చిన్న వయసులో సెప్టెంబరు 1 వ తేదీ 1966వ సంవత్సరంలో అనారోగ్యంతో తనువు చాలించాడు.చనిపోయాక కుందుర్తి ఆంజనేయులు రాసిన పీఠికతో 1968 సంవత్సరంలో ముద్రింపబడిన అమృతం కురిసిన రాత్రి ఉత్తమ కవితా సంపుటిగా 1971 సంవత్సరంలో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందింది.
సమాజాన్ని చూసి కరిగిపోయిన తిలక్
మిత్రులకు రాసిన లేఖల ద్వారా మిత్రులతో తిలక్ కున్న సత్సంబంధాలు ,తిలక్ వ్యక్తిత్వం,మనస్తత్వం మొదలగు ఎన్నో విషయాలు తెలుసుకునే అవకాశం ఉంది.
‘ఆవంత్స సోమసుందర్’ తిలక్ కు ప్రాణమిత్రుడు.సోమసుందర్ కు రాసిన లేఖలో ” జీవితంలో ఎప్పుడు ఎవరు వచ్చి గుండెల్ని పెనవేసుకుపోతారో ఏం తెలుస్తుంది.అలాగ సామీప్యంలోని ఆత్మీయమైన ఆవరణలోకి విచిత్రంగా సురభీకృతం చేస్తూ నువ్వొచ్చావు. అన్నా అని పిలిచావు.ఆ పిలుపు గుండె లోతులంటి, తిరిగి తమ్ముడూ అని ప్రతిబింబించక మానుతుందా? అందుకే ఇంకా మీరు అనే సంబోధన కృత్రిమంగా ఏదో దూరాన్ని పలకరిస్తున్నట్లు తోచి మానివేశాను.” అని రాయడం వల్ల మిత్రులను ఆత్మీయుతతో దగ్గరకు తీసే ప్రేమతత్వం కన్పిస్తుంది. వరవరరావుకు రాసిన లేఖలో ” నా కింత దగ్గరైన నువ్వు అలా అలా దూరదూరంగా ఎందుకున్నావో అని నా మనసు చాలా బాధ పడుతుంది.డబ్బూ,వ్యాపారమూ, ప్రయోజనమూ ప్రధానంగా ఎంచబడే నేటి సంఘంలో అవ్యాజమైన మైత్రి,ఆర్టిస్టుల మధ్య మైత్రి ఒకటి గదా!
కన్సిడరేషన్! నువ్వు నా కన్నా చాలా పిన్నవాడివైతే మాత్రం కుల వయో దశ భేదాలు కవులలో,కళారాధకులలో అప్లై చేయవు.” అంటాడు.మైత్రీ బంధానికి తిలక్ ఇచ్చిన విలువ గొప్పది.డబ్బు,హోదాకు లొంగనిది.కులాతీత,వయోతీతమైంది.నిస్వార్థ,అవ్యాజమైనదే అసలు సిసలైన మిత్రత్వము.నిజమైన మైత్రికి ఇవేవీ అడ్డుకావని మైత్రికి చక్కని నిర్వచనం చెప్పాడు.ఇలా లేఖలలో తిలక్ స్నేహానికిచ్చిన ప్రాధాన్యం తెలుస్తుంది.
జీవితంలో ఏదో సాధించాలనే ఆశ,తపన ” వేళ్ళ సందుల్లోంచి పొడి ఇసుకలా జారిపోయే కాలాన్ని, వయస్సునీ,తల్చుకుంటే భయమౌతుంది.” అని ఒక ప్రచురణ సంస్థ నెలకొల్పాలన్న తన ఉద్దేశ్యాన్ని తెలుపుతూ నీ సహకారం ఉంటే తప్పక కృతకృత్యుణ్ణవుతానని రాస్తూ సమయం దాటాక బాధపడి ప్రయోజనం లేదు.” అందుకే ఈ లోపుగా చేసి వెయ్యడం మంచిది కదా.” అంటూ సోమసుందర్ కు రాసిన లేఖలో తెలిపాడు.
మిరియాల రామకృష్ణకు రాసిన లేఖలో జీవితంలో తృప్తి ఎట్లా లభిస్తుందో వివరించాడు.” నెల బారుగా,చప్పగా,బాధగా వెళ్లిపోయే జీవితంలో ఏవో కొన్ని గొప్ప క్షణాల్ని మనవిగా చేసుకున్నామనే ఆనందమూ,దాన్ని నలుగురితో పంచుకోవడమూ కన్నా తృప్తి ఏముంది.” అంటూనే ” ఇక్కడ దట్టంగా పరచుకున్న మనుష్యారణ్యం మధ్య రోడ్ల దుమ్మూ,దోమలూ,రాజకీయాలు జుమ్మని చెలరేగే ఈ వాతావరణంలో కన్నా అడవుల పచ్చదనమూ,ప్రకృతి సన్నిహితంగా ఉన్న మీ జీవితమే సుఖకరమేమో.” అనడం వల్ల కుళ్లు మనుష్యుల మధ్య నలిగి బ్రతికే కంటే స్వచ్ఛమైన గాలిని పీలుస్తూ అడవుల్లో ఉంటే మనసుకు తృప్తి అనే భావన కలిగినవాడు. అట్లాని మానసికమైన ఒంటరితనాన్ని భరించడం కూడా కష్టమే నంటాడు.
తిలక్ బాధాతప్త హృదయుడు.జీవితంలో జరిగిన సంఘటనలు, మనసులో మరపురాని ముద్రలే అతన్ని కవిగా చేశాయి మోగంటి మణిక్యాంబకు రాసిన లేఖలో చిన్నతనంలో ఒక వృద్ధుడు,జీర్ణాదేహుడు,ఆకలితో అలమటిస్తున్న వాణ్ణి చూసి ఎంతో ఏడ్చాడు.” జీవితం అంటే ఏమిటి? సృష్టి పరమార్థం ఏమిటి? అన్న చింతనలో పడ్డాడు.16,17 సంవత్సరాల వయసులో ఒకసారి పార్క్ టౌన్ స్టేషన్ లో దిగివస్తుంటే ఇద్దరు ముగ్గురు బాబూ! ఒక మాట అని పిలిచారు.ఏమిటో నని వారి దగ్గరకు వెళ్ళాడు.ఒక వస్తువు మీద గుడ్డను తీసి చూపించారు.భయంకరమైన, వికృతమైన శవం.దహనానికి చందా అడుగుతున్నారు.జేబులోంచి చేతికి వచ్చిన డబ్బు తీసి వాళ్ళకిచ్చి వెళ్ళాడు.గది కెళ్లగానే ఒళ్ళంతా ఏదో అయిపోతున్నట్లు భయపడ్డాడు.రాత్రంతా ఆలోచనలతో సతమతమయి అంతా మిథ్యగా అనిపించింది.బ్రతుకు మీద విరక్తి కలిగింది.
ఇంకోసారి మిత్రులతో సినిమాకి వెళ్తున్న సమయంలో ఒక ఎనిమిదేళ్ల పిల్ల ఆకలిగా ఉంది.డబ్బులిమ్మంది అందరూ ఆమెని విదిలించుకుని చీ అని తోసి వేస్తుంటే సభ్యత కోసం తిలక్ కూడా విదిలించుకున్నాడు.ఆ రోజు రాత్రంతా బాలికనే కళ్ళముందు నిలిచింది తెల్లవారి జేబులో పది రూపాయలు వేసుకుని ఆ అమ్మాయి కోసం అంతా గాలించాడు.కానీ ఆమె కనిపించలేదు.మూడు రోజులు వెతికాడు కానీ వృధా. ” ఆమె అందమూ ,సొగసైన కళ్ళు,ఆ బాల్య చాపల్యమైన మనస్సు ఏ ధూళిలో ఏ బాధలో ఏ మంటలో దినదినమూ కాలిపోతున్నాయి ” ఎవరు దీనికి కారణం?…విలవిలలాడి పోయాను.ఆమె నా చెల్లెలే అయితే అలా ఛీదరించుకునేవాణ్ణ ?” అనుకున్నాడు నెలరోజుల తర్వాత ఆమె కనిపిస్తే జేబులోంచి ఆరు రూపాయలు తీసి చేతిలో పెట్టి ఒక రోజు కడుపు నిండా తిను అని వెళ్ళిపోయాడు.అప్పటి సంఘటనలు మనసులో కలవరం రేపి ” ఈ జీవితానికి,సమాజానికి అర్థం తెలుసుకోవడానికి,ఒక అర్థం ఇవ్వడానికి ఒక ఆదర్శ జ్వాలలో నా బ్రతుకును చుట్ట బెట్టి తోడు లేని ఈ దారిని నాటి నుండి ప్రయాణం” సాగించి అనేక బాధలతో,అనారోగ్యంతో అలమటించి ” గొప్ప అనుభవాన్ని కవిత్వాన్ని పొందాడు మధురమైన
ఆ హృదయాన్ని,మనస్సుని లోకంచుట్టూ తిప్పి సౌందర్యాన్ని అవలోకించి ఆహ్వానించాడు.” అని చెప్పిన సున్నిత హృదయుడు,కోమల మనస్కుడు జీవితానికి,సృష్టికీ ఒక అర్థం వెదికి సమాజానికి సుఖ సంతోషాల్ని అన్వేషించాలనే తపన కలవాడు.” మనిషీ, సంఘమూ,దేశమూ, విశ్వమూ ఈ సర్వ జగత్తు జ్ఞాన సరస్సులో విరిసిన ప్రేమ పద్మం లాగా సత్యం,శివం, సుందర శీలమై ఉండాలి.” అంటాడు.”
వ్యుత్పత్తి,వివేకం,ఉద్రేకం ఇన్నింటిని సమ్యక్ స్వరంలా మేళవించి” ఏదో సాధించాలనే తహతహలాడేవాడు.నిజమైన వెలుగు కోసం ” ఏళ్ల తరబడి సృష్టించుకున్న మౌఢ్య భావాలు,సంకెళ్లని పగులగొట్టి” స్వార్థమూ, సంఘ గౌరవమూ, ధనమూ ప్రధానమైన ఈ లోకాన్ని ఖాతరు చేయక ఏ పరిస్థితినైనా ఒంటరిగా ఎదుర్కోగల ఆత్మీయశక్తి నాకుంది ఆనుకొని ” సంపూర్ణ నిర్మలానురాగం ముందు తప్ప తల వాల్చగూడదని ప్రతిజ్ఞ చేసుకున్నాడు.” అని మానసిక ఆవేదనను,ఆశయాన్ని తేటతెల్లం చేశాడు.” నిర్ధయా, నిశ్చితమైన నిధి కొండరాళ్ల మీద తలబాదుకొని ఏడ్చినవాణ్ణి కాబట్టి ఏ విశ్వాసాన్ని వృధా పోనివ్వను.” సున్నితమైన నా మనస్సు మీద కూడా ఎన్నో దెబ్బలు తగిలాయి.” అంటూ మానసిక బాధను వ్యక్తపరచి ” ఒక్కొక్క కన్నీటి చుక్కను తుడువగలిగితే జన్మ సార్థకమన్న శరత్ మాటలను స్వతహాగా ఆచరించాలన్న ఉబలాటం కలిగిన వాడు.ఆయన మాటల్లోనే ” ఒక సంఘము నుండి ఉబికే బాష్పాన్ని తుడువగలిగితే ఒక్క అధరం మీదికి హాస్యాన్ని రప్పింపగలిగితే జీవితం ధన్యమౌతుందని నా ఉద్దేశ్యం.కరుణ,సౌందర్యమూ, మానవత్వమూ ఈ మూడు ప్రాతిపదికలుగా నా ఆదర్శాన్ని,ఆలోచనల్ని నిర్మించుకున్నాను నా రచనలూ నా జీవితమూ ఈ భావనల్ని వ్యక్తీకరించకపోతే నేను జీవచ్చవాన్ని” అని తన కవితా లక్ష్యాన్ని, జీవితాదర్శాన్ని వివరించాడు.తిలక్ మనస్తత్వమేమిటో ఎంతో చక్కగా వివరించాడు లేఖల ద్వారా.” *దుఃఖానికీ, బాధకీ కరుగలేకపోతే ఈ బాలగంగాధరుడు తన కవిత్వాన్ని,తన ప్రాణాన్ని కూడా బంగాళాఖాతంలో విసిరిపోతాడు అతనిలో ఎంతో దృఢవిశ్వాసం కన్పిస్తుంది.మనిషికి మానవత్వముండాలి.కరుణ, జాలి,దయా ఉండాలి.అవి లేకపోతే జీవచ్చవమేనన్న అభిప్రాయం కలవాడు.తిలక్.జీవితానుభవాలకు,రచనలకు అవినాభావ సంబంధమున్న విషయం ప్రస్పుటమైందీ లేఖల్లో.
” ఆర్ద్రమైన ప్రతి హృదయమూ అశ్రుసిక్తమైన ప్రతి నయనమూ సుందరమైన ప్రతి దృశ్యమూ నన్ను కలలో కూడా వశం చేసుకుంటాయి.ఒక్క పాటకోసం ఒక్క మాటకోసం అవసరమైతే ఈ ధనాన్ని జగత్తునీ కాదనగల సాహసం వుంది నాకు”.అని ప్రపంచాన్నే ఎదిరించి పోరాడిన ధీశాలి, కవితా వీరుడు.కవికి ఉండవలసిన ఉత్తమగుణం తిలక్ లో కనిపిస్తుంది.కవి ఊహలో చరించకుండా జగత్తులో చేదు నిజాన్ని చవిచూసి అనుభవించి ఆవిష్కరించాడు. బాహ్య జగత్తులోని విశిష్ట సన్నివేశాల వలన, ప్రజ్ఞా విశేషం వలన తమలో కలిగిన ఆలోచనా వైవిధ్యం చేత,తమకు కలిగిన అనుభవాలను కావ్య చిత్రణం ద్వారా వ్యక్తీకరించి ఆనందం చేకూర్చడం తిలక్ లక్ష్యం.ఇంద్రియాలకు తృప్తి కలిగించేది అతని దృష్టిలో ఆనందం కాదు మానవత్వంలో పరిపూర్ణత నొందుటలోనే ఆనంద మున్నదని అతని సిద్ధాంతం. *సుందర స్వప్నాల మేడమెట్ల నుండి వాస్తవిక శిథిల రూపాలలోకి హఠాత్తుగా జారిపడిన నాకు తెలుసు అంటాడు.” పైకి నవ్వుతున్నా అలలో విరగబడుతూ ఆడుతున్న సముద్రం కడుపులో వున్న బడబాగ్ని జ్వాల నెవరు గుర్తిస్తారు”. అని వాపోతాడు,లోతుల్ని వెతుకుతాడు.
జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా గాయాలు తగిలినా ఎదుర్కోగలిగే శక్తి గలవాడు.కృంగిపోవడం నా స్వభావానికి వ్యతిరేకం అన్న ధీరమనస్కుడు.
అసలు కవి అంటే ఎవరు?కవి ధర్మాన్ని లేఖల్లో వివరించాడు.” సున్నితమైన ఊహ,ఉద్రేకము,” ఉంటేనే గొప్ప రచనలు వస్తాయన్న విశ్వాసము కలవాడు.సాధారణంగా మానవులందరూ దైనందిన సమస్యలతో ,బాధలతో సతమతమవుతూ వుంటారు.చిన్న చిన్న కోరికలూ,ద్వేషాలూ,అల్పమైన ఊహాలతో సతమతమవుతూ వుంటారు.” నేలబారుగా జడంగా స్తబ్దంగా గొంగళిపురుగుల్లా పాకుతారు.వాళ్ళకి సౌందర్యం డబ్బులోనూ ఉద్యోగం లోనూ భేషజంలోనూ కనబడుతుంది కానీ కళాశీలికి యివేమీ కనిపించవు.అతనికున్న విలువలు వేరు.అతని చూపు వినీల గగనాన్ని బురుసుకుంటూ నక్షత్రమండలంలోకి పోతుంది.అతడు మనిషి లోపల మనిషిని చూస్తాడు.అతని దృష్టి ఎక్కడ అందం వున్నా నిజం వున్నా అక్కడ వాలుతుంది. దేనికోసమో తపన,అన్వేషణ నిరంతరంగా సాగిస్తాడు.ఈ యాత్రలో అతడు లౌకిక జగత్తును లక్ష్య పెట్టడు. అందుకే అతని ఊహ శాశ్వతమైంది.అతని నీతి అతీతమైంది.అతని రచన అక్షరమైంది. నశించనిది.” కవి ఊహ లోకోత్తరమైంది. అందువల్లనే ఉత్తమ రచన సార్వజనీనము,సార్వకాలికమౌతుందన్న ప్రాచీన ఆలంకారికుల అభిప్రాయాలను తలపింపచేశాడు.
కవి సంప్రదాయబద్ధుడుగా కాక కాలానుగుణంగా నూతనత్వాన్ని సంతరించుకొని రచన సాగించాలంటాడు. కుళ్ళిన ముసలిదైపోయిన సంఘాన్ని,బూజు పట్టిన భావాల్ని రూపుమాపే బాధ్యత కూడా రచయితదే. అంటూ సంఘాన్ని మేల్కొల్పాలి,ప్రజలను చైతన్యవంతులను చేయాలి.ఆత్మవిశ్వాసం ఉండాలి.కవిత్వాన్ని సమగ్రంగా దర్శించడమూ,జీవిత విధానాన్ని గురించి స్పందించడమూ చాలా అవసరం అంటాడు తిలక్.
తిలక్ ప్రకృతిలోని అందాన్ని చూసి పరవశించిపోయేవాడు.ప్రకృతిని ఆరాధించేవాడు.లేఖల్లో ప్రకృతి వర్ణన కూడా కనిపిస్తుంది.సహజ చిత్రీకరణ,కవి దృష్టి ప్రత్యేకంగా లోతుల్ని చూస్తుంది.గుండెను హత్తుకుపోయే విధంగా ఉంది.ప్రకృతి వర్ణన సహజంగా వుంది. సోమసుందర్ కు రాసిన లేఖలో ” ఈ రెండు రోజుల నుంచీ వర్షం కురిసి కురిసి భూమి తడిసి తడిసి పచ్చి పచ్చి బాలింతరాలిగా అందంగా వుంది ” అంటాడు
వర్షాకాలంలో తడిగా ఉన్న భూమి ఎట్లా ఉందో ఉపమాలంకార ప్రయోగం చేశాడు. ఆలంకారిక రచన,ప్రకృతిసాన్నిహిత్యాన్ని కోరుకునేవాడు.దట్టంగా పరచుకున్న మనుషారణ్యం మధ్య రోడ్ల దుమ్మూ దోమలూ రాజకీయాలూ జుమ్మని చెలరేగే ఈ వాతావరణంలోకన్నా అడవుల పచ్చదనము,ప్రకృతి సన్నిహితంగా వున్న జీవితమే మంచిదని మిరియాల రామకృష్ణ గారికి రాసిన ఉత్తరంలో తెలియజేశాడు.వర్షాకాలం అంటే తిలక్ ఇష్టపడేవాడు.ఆకాశంలో నల్లని మబ్బులు,ఒక్కసారిగా వాన,భూమి చల్లబడి పచ్చబడి మనసుకు ఎంతో హాయిసిస్తుందని చెప్తూనే ” స్నానం చేసి వచ్చిన యవ్వనవతి శరీరంలాగా విచిత్రమైన అందం,ఆకర్షణ.” ఉందని వర్ణించాడు.
మోగంటి మాణిక్యాంబా దేవికి రాసిన లేఖలో మనసులోని వ్యధను ఎవరూ గుర్తించలేరని రాస్తున్న సందర్భంలో పైకి నవ్వుతున్నా అలలలో విరగబడుతూ ఆడుతున్న సముద్రం కడుపులో ఉన్న బడబాగ్ని జ్వాల నెవరు గుర్తిస్తారు అంటూనే జీవితం చాలా విచిత్రమైంది,అద్భుతమైందని చెప్తూనే ” రంగురంగుల అలలలో వంగి బ్రతుకు అంచుల్ని ముంచుతూ వుంటుంది. ఎన్ని స్వప్నాలూ,ఎంత లోతు తెలియని భయంకరాఘాతాలు.” అంటూనే సూర్యోదయాన్ని యీ విధంగా ” చీకటి లొత్త గిత్తి మెత్తని వెల్తురు తూర్పున ఆడదాని అనురాగంలాగ వ్యాపిస్తోంది.నక్షత్రాలు కాంతి విహీనమై గాజుపూసల్లాగా వున్నాయి. అక్కడక్కడ ఒక మబ్బు ఏ అప్సరస ఒంటిమీద నుండో జారిన చీరకొంగులాగ గాలిలో తేలిపోతుంది.మనోహరమూ,శాంతమూ అయిన ఆ ప్రకృతిలో లీనమౌతున్న నా మనసుకు మళ్లీ అశాంతి.” అంటూ తన అనుభూతిని వివరించాడు ఇంతలోనే నిరాశావాదం.” లోపల్లోపల ఏదో ఒంటరితనం ఒక్కణ్ణే నా బాధలతో ఏదో ఎడారి అంచులమీద నడచిపోతున్నాను– అనిపించింది.ఈ సంసారమూ ఈ స్నేహాలూ అన్నీ ఎండమావులేమో– అనిపిస్తుంది.మబ్బు పట్టి ఆకాశంలో ఈ రోజంతా తెలియని చక్కని కౌశలమూ ప్రజ్ఞా వుంది.నేను కొంత ఆశ్చర్య పడ్డాను.ఇంత బాగా రాయగలడా కథలు కూడా అని— కాని నీ కథల పుస్తకంలో ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించుటకుగాని,బలపరచుటకుగాని నీవు చేసిన ప్రయత్నం- ఆ కథాశిల్పంలో ముఖ్య దోషంగా కనబడింది.ఆ కథల రక్తిని అనుభవించకుండా చేసింది. పాలటబులో డిజైనులవల్ల కళ ఎప్పుడూ పరిమితమూ సంకుచితమూ అయిపోతుంది.అయితే ఆ రోజుల్లో నువ్వు ఆ ప్రభావపు ఇనుప కౌగిలిలో ఉండేవాడిని.కాని ‘కాలనేమి’ లో దోషం మచ్చుకైనా లేదు”.
వరవరరావు రచనలపై తన అభిప్రాయాన్ని తెలుపుతూ వరవరరావుకు రాసిన లేఖలో “అమృతవృష్టిలో అక్కడక్కడ బెట్టుగా ఉంది.యజ్ఞంకై కొత్త టానిక్,సోషలిస్టు సీత–ఇటువంటివి అనుచితంగా తోచాయి.
కుక్క నోట్లోంచి ఎంగిలాకు– ఆ ఇమేజరీ ఎందుకో? ఫోర్స్ డ్ గా వున్నట్లు అనిపించింది.రాకాశశికి మబ్బురంగు పైట అన్నాడు.మబ్బే పైటగా ఉంటుంది గదా.ఆషాఢ మాసంలో ఆ రంగుగల మరో పైట ఏముంటుంది? శశికి మరోసారి రివైజ్ చేస్తే మంచిదేమో అనుకున్నాను.నాకు నచ్చిన లైన్స్ గురించి చెప్పడం లేదు.మీరు మరోసారి చూడండి.మరి మీ కెలా తోస్తుందో? అన్నట్లు “వూసి” అని రెండు మూడు సార్లు ప్రయోగించారు.దాని అర్థం? నాకు కొత్తగా ఉంది.” – యూసేజ్. వరవరరావు తన రచనను సమర్థించినట్లు తెలిశాక నేను తప్పుగా అర్థం చేసుకున్నాను,పొరపాటయింది అని వేరే లేఖలో” పేజీలు సరిజేసి చదివితే రచన సందర్బశుద్ధిగా కనబడింది.” అని రాశాడు. వెనుకటి కవులకు తన కాలంలో కవులకు తారతమ్యాన్ని వివరిస్తూ ” నా వెనుక తరంలో కవులలో ముఖస్తుతీ వెనకాలే దూషణా ప్రత్యేకంగా ఉండేవి.సామాన్యుడి కన్నా ఊహలో,సంస్కారంలో మరికాస్త పెరుగుదల సూచించవలసిన ఆ కవులలో కనబడే ఈ కృత్రిమత్వం ,పిరికితనం దుర్భరమనిపించేవి.ఆఖరుకి కవిత్వంలో కవిత్వాన్ని గురించి నిజాయితీగా చూడలేని వీరి నుంచి ఏ మాశించగలమనుకొనే వాడివి.” అంటాడు.
జానకీ జానికి రాసిన ఉత్తరంలో ‘ మోడరన్ పోయిట్రీ పేరుతో పత్రికలలో ప్రకటితమయ్యే వాటిని చూచి విసుగు చెందాను.దాని మూలంగా చాలా విచారిస్తున్నాను.ప్రబంధయుగంలో చివరికాలంలో వచ్చిన సాహిత్యంలోని సమానమయిన క్షీణత, పదాల గారడి,నడకల శూన్యత,ప్రాస కొరకు ప్రయత్నించుట అందులో మనకు గోచరిస్తాయి.” అంటూ నవీన కాలాన్ని గూర్చి శ్రీపాద గోపాలకృష్ణ మూర్తి రాసిన వ్యాసమే బాగుందని చెప్తూ సమకాలీన చరిత్రను గూర్చి విశదంగా విమర్శిస్తారని అనుకుంటున్నాదన్నాడు.
ఈ విధంగా తిలక్ లేఖల్లో అతని అనుభూతులు,అనుభవాలు, కవితాలక్ష్యం,రచనోద్దేశ్యం,విమర్శ, ప్రకృతి వర్ణన,ఆరోగ్య విషయాలు,మిత్రత్వానికి యిచ్చిన విలువ మొదలైనవి అనేకాంశాలు విదితమౌతున్నాయి.స్నేహితులకు తన మనోగతాన్ని స్పష్టంగా,నిర్మొహమాటంగా, కవితాత్మకతలో విశదపర్చడం లేఖలవల్ల గమనించవచ్చు. మారుతున్న కాలాన్ని బట్టి సత్యాన్ని అన్వేషించి సమాజాన్ని జాగృతం చేసేదే నిజమైన కవిత్వమనే అభిప్రాయం వున్నవాడు మానవత్వంలో పరిపూర్ణత నొందజూచుటలోనే ఆనందమున్నదని అతని సిద్ధాంతం.
ఈ రకంగా లేఖల వలన కవిత్వంపట్ల తిలక్ కున్న ప్రత్యేకమైన,ఖచ్చితమైన అభిప్రాయం తెలుస్తుంది.
తెలుగు సాహిత్య కన్యకు తన రచనల ద్వారా తిలకం దిద్దిన ప్రముఖ కవి తిలక్ సాహిత్య పరంగా కూడా లేఖలకు ప్రముఖ స్థానముందని చెప్పడంలో అతిశయోక్తి ఏమాత్రం లేదు.
సంపాదకీయం
వసంత రుతువు వచ్చింది. చైత్రమాసం పాడ్యమి రోజున ఉగాది పండుగగా జరుపుకునే సంప్రదాయం గల తెలుగు వాళ్ళం మనం. చైత్రమాసం మొదటి నెల. పాడ్యమి మొదటి రోజు, మొదటి నక్షత్రం. నక్షత్ర గమనాలతో, ప్రకృతి కి అనుగుణంగా ఏర్పరచుకున్న పేర్లు ఇవన్నీ. ఉగస్య ఆది: ఉగాది. ఉగ అంటే నక్షత్రం నడక, గమనం కదా అర్థం. శుభకృత్ నామ సంవత్సరం వెళ్లి, కొత్త సంవత్సరం శోభకృత్ నామ సంవత్సరం లోకి అడుగుపెడుతున్నామంటే శోభను,ఆనందాన్ని కలిగించే సంవత్సరం అని భావిస్తున్నాం. చలికాలం పోయి, శరత్, శిశిర రుతువు లు పోయి వసంతగానం తో ప్రకృతి అంతా ఆహ్లాదకరంగా మారుతుంది. ఇది మనం భారతదేశం భౌగోళిక పరిస్థితి వలన కలిగిన వాతావరణం. ఇదంతా ఒకసారి గుర్తు చేసుకుంటూ గత వర్తమానాల మధ్య మనం ఏం సాధించాము అనేది ఒక సింహవలోకన చేసుకోవడం అవసరం.
రాజకీయాలు అవసరం లేదనుకున్నా, తెలియదు అనుకున్నా, వాటి వైపు కన్నెత్తి చూడని వాళ్ళకి కూడా రాజకీయాల ప్రభావం అనేది జీవితాలపై ఏదో రూపాన పడుతూనే ఉంటుంది. మహిళల మీద మరీ ఎక్కువగా ప్రభావం పడుతుంది. అదేంటి అని అనకుండా, అది ఏంటో గమనిద్దాం అనుకుందాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం గా మార్చి 8న ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి . ఈ సందర్భంలో భారతీయ మహిళ ఈ మార్చి 8 రోజున ఏమైనా ప్రత్యేకంగా తెలుసుకోగలిగిందా? ఏమైనా ప్రత్యేకంగా లబ్ధి పొందగలిగిందా? అనేది అవలోకించాల్సిన విషయం. తిండి, బట్ట, నీడ అనే మౌలిక అవసరాలు కాకుండా మహిళల అభివృద్ధి పరంగా చూసినప్పుడు, ఎన్నో వేల గ్రామాలు కలిగినటువంటి మన దేశంలో గ్రామ గ్రామాన బ్రతుకుతున్న స్త్రీలు అభివృద్ధి పథంలో ఉన్నారా ? పట్టణాలలో స్త్రీలు ఆధునిక సౌకర్యాలనుభవిస్తున్నారేమో కానీ
అస్తిత్వాన్ని కాపాడుకోగలుగుతున్నారా? పెట్రేగిపోయిన పారిశ్రామికీకరణ, ప్రపంచీకరణ మహిళల పట్ల నిలుచుని ఏమైనా గొంతు ఎత్తగలిగిందా? లేదు లేదు లేదు అనే సమాధానాలే వస్తాయి.
ఆడపిల్లనైనా మగపిల్లలైన సమానమని విద్యాబుద్ధులు నేర్పించిన తల్లిదండ్రులకి కూతురు విషయం వస్తే నిరాశ మిగులుతున్నది. చదవాలి ఉద్యోగం తెచ్చుకోవాలి, అంతే ! ఈ ధ్యేయంగా అడుగులు వేస్తున్న అమ్మాయిల పరిస్థితి ఏమంత బాగోలేదు. కళాశాలలోనైనా, కార్యశాలలోనైనా అంతులేని వివక్షను ఎదుర్కొంటున్నారు. ముఖం ముందు మంచిగా మాట్లాడుతారు పక్కకు జరగగానే అభాండాలు వేస్తారు, అఘాయిత్యాలూ చేస్తారు.
వెకిలి మాటలు మకిలి మనసులు అర్థం చేసుకోగలిగే వాళ్ళ అర్థం చేసుకుని ఆ మగవాళ్లను దూరం పెడతారు. అర్థం చేసుకోలేని అమ్మాయిల పరిస్థితి ఇక అంతే.ఇవి పనివేళల్లో ప్రత్యక్షంగా జరిగేవి. ఇక పరోక్షంగా తక్కువ నా?వేతనాలు, ఇంక్రిమెంట్లవి ఒక తీరైతే, ఆడవాళ్ళ సమస్యలు ఓ తీరు. శారీరక అనారోగ్య సమస్యల్ని పరిష్కరించడానికి ప్రభుత్వాలూ ముందుకురావు, ప్రైవేటు ఉద్యోగ సంస్థలు ముందుకురావు. దీనికి ప్రముఖ ఉదాహరణ ‘ నెలసరి సమయంలో సెలవులు ‘ అనే అంశం. బంగాళా ఖాతం లో వాయుగుండాలు వచ్చిపోతున్నట్టే, మహిళా దినోత్సవ సందర్భం వరకు అట్లా కొన్నేవో ఆటుపోట్లు వచ్చిపోతుంటాయి. తట్టుకునే హృదయాలు ఉండాలి. గుండె తడి అయ్యే వాళ్ళుంటే, దుఃఖ విముక్తి గొడుగు లు పట్టే ప్రయత్నాలు చేస్తారు. పశ్చిమ దేశమొకటీమధ్య కొత్త గా మెరుస్తున్నది. వాళ్లకు నూతన సంవత్సరమిప్పుడు రాదు. మార్చ్ 8 వాళ్ళకు కొత్తగాదు!
సమ దూరం పాటించే
కలువని పట్టాల మీది ప్రయాణం!!
ఒక దాని వెనుక ఒకటి
క్రమశిక్షణతో కదిలే బోగీలు!
కచేరీలు ఎక్కని సంగీతం
తాళం తప్పని చిరుతల శబ్ధం!
పావలా పల్లీలు
పదిరూపాయలకు అమ్మే
వ్యాపార నైపుణ్యం!
పసితనాన్ని పల్లెతనాన్ని గుర్తుచేసే
ఎప్పుడో తిన్న, ఎపుడూ తినాలనిపించే
నిమ్మపులుసు పిప్పరమెంటు!
టికెట్ తనిఖీ అధికారిని చూసి
బాతురూముల్లో దాక్కునే
టికెట్ లేని ప్రయాణికులు!!
ఉప్పు కారం పెట్టిన
మామిడి కాయ ముక్కలు
ఉపకారం చేస్తున్నట్లు
పక్కవారితో పంచుకోవడాలు!
శీతల పానీయాలు అమ్మేవాడు
వాడెనుకే వేడి వేడి మిర్చీ అంటూ
పొట్లం చుట్టి చేతిలో పెట్టేవాడు!
కిటికీనుండి చూస్తే
వెనక్కి పరుగెత్తుతున్నట్లు
పంటపొలాలు, పచ్చని చెట్లు!
దూరమెంతయినా
భారమనిపించని ప్రయాణం!
అద్దములో చూసుకుంటున్న
మన జీవన ప్రయాణం!!
మీ శ్రేయోభిలాషి
జగ్గయ్య.జి
9849525802 
jagan.gunda @yahoo.com
తెగించి పిడికిలెత్తినప్పుడే
ఎవరైనా తేరిపార జూసుకోవాలి
వెనకా ముందు ఆలోచించు కోవాలి
అవహేళనలన్నీ అగ్గి రాజేసేవే!
తెగింపు కొట్లాటలన్నీ
వెరపు లేని త్యాగలనుంచి పుట్టుకొచ్చినవే
వాపెప్పుడు బలుపు కారాదు
చలి చీమలేకమవుతుంటే సర్పానికి వణకు పుట్టాలి!
చూసీ చూసీ ఎలుగెత్తి చాటీ చాటీ
ఎద ఉప్పొంగే దృశ్యంగా
దేశ భక్తి మొలకెత్తాలి
విద్వేషాలు నింపే ఎన్నికల పెట్టుబడి కారాదు!
ఆధునిక కాలంలో ఎవరికైనా
సుదీర్ఘ పోరాటాలక్కర లేదు
ప్రజలు తలచుకుంటే ఆకాశం చిల్లుబడ్డట్లు
అధికారం కొంపలు మునుగుతాయి!
విలువలు దిగజారినప్పుడు
నువ్వెదిగొచ్చిన సంగతి మరచి పోరాదు
సూత్రమొక్కటే ఎవరికైనా
అహంకారం పతనానికి దారులు వేస్తుంది!
ఫోటో కోసం జరిగిన రచ్చ
బాల్యంలో చినిగిన చొక్క కోసం చేసిన
హాస్యాస్పద పోరాటాన్ని గుర్తు చేసింది
ఎవరేం చేస్తున్నది ప్రజలకెరుకైతున్నది!
పాద యాత్రలు పస లేని ప్రగల్భాలు
ప్రజా జీవితాలను ప్రతిబింబించనంత కాలం
విద్వేషాలు కుతంత్రాలేవీ
రాజ్యాధికారాన్ని కట్టబెట్ట లేవు నిలబెట్ట లేవు!
చీలికలు తెచ్చే వారిదెన్నడు
దేశానికి ఏలిక కారాదు
ఏకం చేసే వారికే
భిన్న సంస్కృతుల రాజ్య పట్టం!!
:- కోట్ల వెంకటేశ్వర
మయూఖ ఆశ్వయుజ మాస, అక్టోబర్ 2022 సంపాదకీయం
ఎవరు ఏ ఉక్కు పాదాన్ని మోపినా నీదైన ధైర్యం నీదైన చైతన్యం అనే స్పృహ ఉండాలి . పరిస్థితులు ఎన్నో వస్తుంటాయి ,పోతుంటాయి . హోరుగాలికి , గాలి వానకు స్థిరంగా నిలబడిన పర్వతమంతటి మనోనిబ్బరం ఉంటే తొట్రుపాటులు ,తొందరపాటులూ ఉండవు . జీవితం నిలకడగా ఉంటుంది. దారుణ ప్రభావాలు చూపే అతి అనుకరణాల దుష్పరిణామాలు ఆలోచనల ను ఎండి పోయేలా చేసినా వాటికి లొంగిపోకుండా జీవనది ప్రవాహం లానూ సాగేలా జాగ్రత్త వహించాలి.
వ్యక్తులు ఉంటారు .వ్యవస్థలు ఉంటాయి .ఈ రెంటిలో ఏది ముఖ్యం అనేది తెలుసుకునే సమర్థత కావాలి .ఈ సమర్థత ఎలా వస్తుంది ?ఇది ఒక గొప్ప ప్రశ్న !ప్రశ్నించుకుంటేనే ఆత్మ ప్రబోధం అవుతుంది .అనంతమైన సారస్వతం మనకు ఉన్నది .అద్భుతమైన సాహిత్యం మనకున్నది .చేతిలో పుస్తకం పట్టుకొని ప్రశాంత చిత్తం తో చదివే రోజులు దరిదాపుల్లో లేనట్టు ఉన్నా , ఒక తెలివిడి తనం కోసం వర్తమానంలో గతాన్ని తోవ్వుకోవడమే ఇప్పుడు అవసరం. అంతర్జాలంలో మంచిని మాత్రమే కంటికి కట్టుకుంటే , మనస్సుకు చుట్టుకుంటే ప్రమాదాలకు తావుండదు. కాని , అలా చేయడం లేదు. సమయమున్నప్పుడు సమయాన్ని చేజిక్కించుకున్నప్పుడు పుస్తకం చేతబట్టి చదివాలి. అప్పుడే అలసట తగ్గుతుంది , ఆసక్తి పెరుగుతుంది. అవగాన వస్తుంది.
రంగులు ..రంగులు .. ఎక్కడ చూసినా రంగులే ! ఈస్ట్ మెన్ కలర్ చిత్రాల పరిజ్ఞానం బెస్ట్ అయి కూర్చున్నది . నలుపు తెలుపు భావాలు వీగిపోతున్న అతిపెద్ద లైఫ్ కాన్వాస్ పైన మనదైన తలకాయ ఎక్కడున్నదో వెతుక్కోవలసిన వర్తమానమిది.భావి జీవితం చిరునామాను ఏ కుంచె చెప్పగలదు? ప్రశ్న ! ప్రశ్నించకుంటే ఆత్మ జ్ఞానం ఎట్లా అందుతుంది ?
స్పీడ్ .. స్పీడ్ .. అంతా స్పీడ్ మయమే ! ఈ వేగం నిత్యజీవితంలో కలిసిపోయింది . ఎన్ని ఆంక్షలు ఎన్ని నియంత్రణలు పరిపాలనలో ఉన్నా , దాటిపోవాలి దూరిపోవాలి చేరుకోవాలి అనే ఆతృతతోనే హృదయం అనే సాటిలైట్ ఆర్బిట్ లో మనసనే గ్రావిటేషనల్ ఫోర్స్ తిరుగుతూ తిరుగుతూ ఆలోచన అనే ఇంధనాన్ని ఖర్చు చేస్తూనే కక్ష్యలను దాటుతున్న వైనం! రహదారులపై వేగ నియమాన్ని తీసుకుంటే, స్పీడ్ తో పరిమితులను దాటామనే పరమానందం వాహన చోదకునిలో కలిగిస్తూ పోతున్నప్పుడు సంభవించేది యాక్సిడెంట్సే! ఇంటికి జరిమానాలు వస్తే ఏంటి , జరగవలసిన నష్టాలు జరిగిపోతూనే ఉంటాయి. అతి వేగం ప్రమాదకరం అనేది రాతలకే పరిమితమైపోతున్నది.
ప్రాపంచిక విషయాలన్నీ అశాశ్వతమైనవని యోగిపుంగవులుగా ఎందరో చెప్తున్నా పరుగులకాలంతో పోటీపడుతున్నారు సామాజికులు.
ఆహార నియమాలు ఎన్ని పాటించినా , శని ఆదివారాలలో సరదాలకు వినియోగిస్తున్న సమాజం ఇది . ఒకరోజు పెట్టే ఖర్చు పేద కుటుంబానికి నెల గ్రాసమవుతుంది . ఇవన్నీ తెలియకనా ! తెలుసు ! తెలిసి చేసే వే! జాగ్రదావస్థనుండి స్వప్నావస్థలనుండి జనులు నేర్చుకోవలసినవి ఎన్నో ఉన్నాయి. జ్ఞాన , విజ్ఞాన శక్తులకు ఆకర్షితం కావాలంటే మనవైన మూలాలను మర్చిపోవద్దు.
ఓవైపున ప్రపంచంలో పేరు మోసిన దేశాలు సుస్థిరమైన మన భారతదేశం కౌటుంబిక జీవన విధానం వైపే ఆశ్చర్యం గా చూస్తున్నాయి. వేల వేల సంవత్సరాల క్రితం పుట్టిన మన సంస్కృతిని వాళ్లు అద్భుతంగా భావిస్తూ నేర్చుకుంటున్నారు ఇప్పుడు. పాశ్చాత్య దేశాలు మన దేశాన్ని ఎంతో గౌరవిస్తున్నాయి చాలా ఉదాహరణలు ఇందుకు చెప్పవచ్చును . స్విట్జర్లాండ్ లో ఎన్నో ఏళ్ళ క్రితమే వారే నిర్మించిన ఆరున్నర అడుగుల ఎత్తులో ఉన్న ‘నటరాజ విగ్రహం ‘ వాళ్లకు స్ఫూర్తిగా ఉన్నది.
చికాగోలో వివేకానందుని విగ్రహము , వివేకానందుని వీధి వాళ్లకు ప్రేరణగా ఉన్నది. అయితే ఇదే సమయంలో భారతీయ వ్యవస్థను దెబ్బ కొట్టే వ్యూహాలతో పనిచేస్తున్న కుట్రలు కొన్ని దేశాల్లో ఉన్నాయి. ప్రఖ్యాతిగాంచిన విశ్వవిద్యాలయాలలో సెమినార్లు నిర్వహిస్తూ కేవలం మత పరంగా చూసి, సర్వ మత సౌభ్రాతృత్వ దృక్పథంతో ఉన్న మనదేశంపై అబద్ధాల బురదచల్లుతున్న వైనమూ ఉన్నది. ఇది అందరూ తెలుసుకోవాలి . అంటే ఆనాడు ఎప్పుడో ఆయా దేశాల్లో మన సంస్కృతిని చాటే విగ్రహాలు , వీధులు స్థాపించినప్పటికీ ఇప్పుడు మన దేశంలో పెరిగిపోతున్న ఇంత అనైక్యతకి మధ్యన చాలా చాలా భేదం ఉన్నది. మారుతున్న కాలం ఏం నేర్పిస్తుంది అనేది ఆలోచించాల్సిన అవసరమున్నది.
దేశ సౌభాగ్యాన్ని రక్షించుకునే ఆశయంతో ఆనాడు మన సమాజం ఉండేది. మరి ఇప్పుడో?ఇదే ఆలోచించాలి.
ప్రపంచంలో ఎక్కడా లేని కుల వ్యవస్థ వృత్తులతో పాటు వచ్చినవాటి రాజకీయ కారణాల తో కొత్త రంగులు పులిమిన విచిత్ర చిత్రాలను గమనించవచ్చు. అతి ఎక్కడైనా అనర్థాలు తెస్తుంది. వేల ఏళ్ల చరిత్ర ను తిరగేస్తే ఉన్న పరిస్థితులు వందేళ్ల చరిత్రలో లేవు. ఉండవు. మార్పులు సంభవిస్తాయి. మార్పులు చోటు చేసుకుంటాయి. ఇదే చేటు తెచ్చింది , వీటికి బాధ్యులెవరో తెలుసుకోవాలి. ” తెల్లోడు తెచ్చిన తెగులేర యిది , నల్లోడు నేడు నడుపుతున్నాడు” ఈ వాక్యాలు అక్షర సత్యం.
అనైక్యత ..అనైక్యత ..అనైక్యత .. ఇది ప్రస్తుతం ఎక్కువైన వైనం! ఈ కాలుష్యం నుంచి తట్టుకోవాలి ఈ కాలుష్యాన్ని పోగొట్టాలి. అప్పుడే దేశ సమగ్రత ను కాపాడుకున్న వాళ్ళం అవుతాం .
పైన చెప్పుకున్న అన్ని కాలుష్యాలను దిగుమతి చేసుకున్నప్పటి నుండే ఇలా దిగజారి పోతున్న నేటి పరిస్థితులకు కారణం. లక్ష్యాన్ని గురి చేసుకోవడం అన్నదే లేదు ఇదంతా సామూహిక ఖననం అనవచ్చు . ఈ ఒంటెద్దు పోకడలలో దేశ ఔన్నత్యాన్ని కోల్పోతున్నామనే ధ్యాస లేకుండా పోతున్నది. ఆం .. ఏమైతే నాకేంటి అనో, ఆం .. నా ఒక్క అడుగుతో పోయేదేముందనో తెలివి తక్కువగా ఉంటున్నారు దేశీయులు. ఈ అనాసక్తత ఈ ఆడంబర హేల ఈ అనాలోచిత ఇవన్నీ దేశ సమగ్రతకు చేటు చేస్తాయి. ఇది చాలా చాలా ప్రమాదకరం. రేపటి తరానికి చెడును చేసే చర్యలు ఇవి! రంగుటద్దాలనుండి చూడక కళ్ళు తెరిచి చూడాలి.
స్వతంత్రత – నీవు
ఈ జీవన పోరాటంలో అనునిత్యం అనుక్షణం కొత్తదనాన్నే ఆస్వాదిస్తారెవరైనా! కాని ఒప్పుకోరు. బ్రతుకు బడి చాలా పెద్దది. కూర్చుని చదువుకోని పాఠాలన్నో ఉంటాయి. పాఠాలు నేర్పని గురువులా కాలం వెంటనే ఉంటుంది.
చాలా విషయాల్లో తేలికగా తీసుకునే మనిషి తన అస్తిత్వానికి దెబ్బ అనుకుంటే మాత్రం సహించని స్థితి ఉంటుంది
పరాయిపాలనలో నికృష్టంగా ఉండే కష్టాలేమీలేవు ప్రస్తుతం , కానీ .. . ఈ “కానీ” కి చాలా అర్థాలున్నాయి. ఆ నాటి పరిస్థితులేవీలేని పరమ స్వేచ్ఛగా వెళ్ళదీసుకునే వీలున్నదిప్పుడు. కానీ…
భూగోళం మీద దాదాపు తొంభై శాతం ఆక్రమించి పాలించిన ఒక చిన్న దేశం బ్రిటన్! సూర్యుడు అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యం అంటూ ఉంటాము . అంటే ఏంటి ? అంటే బ్రిటన్ దేశం లో సూర్యుడు అక్కడ అస్సలే అస్తమించడా?కాదు! బ్రిటన్ లో కూడా సూర్యాస్తమయం అవుతుంది.మరెందుకు ఈ మాట అంటారు? అంటే, ప్రపంచం లో ఎక్కడచూడూ అన్ని దేశాలు బ్రిటిష్ వారి పాలనలోనే అప్పుడు ఉండేవి . భూమి ఎటుతిరిగినాగానీ అటు సూర్యుడు కనిపిస్తాడు ,సూర్యరశ్మి ఉంటుంది. ఆ ప్రాంతాలన్నీ బ్రిటిష్ ఆక్రమిత ప్రాంతాలుగానే ఉండేవి. దీంతో “సూర్యుడు అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని “అని అనడం పరిపాటి అయ్యింది.
మన భారతదేశాన్ని కూడా బ్రిటషర్లు అలా యుక్తి , కుయుక్తులతో చేజిక్కించుకుని ఓ రెండు వందల సంవత్సరాలు పాలించారు. మనదేశ సంపద కొల్లగొట్టి, మనని మనుషులు గా చూడక అవమానపరుస్తూ హీనాతిహీనంగా చూసేవారు. అన్నదమ్ముల మధ్య , రాజ్యాలమధ్య , సంస్థానలమధ్య విభేదాలు సృష్టించి విభజించి , ఐదు ఆవులు ఒక పులి కథ లాగా మన పాలకులను అంతం చేసి తమ హస్తగతం చేసుకున్నారు. అన్నేళ్ళల్లో వాళ్ళు చేయని అరాచకం లేదు. మన విజ్ఞాన గ్రంథాలను, మన పండితులను ఎత్తు కెళ్ళి సంస్కృత భాషలో ఉన్న ఆయా శాస్త్రాలను ఇంగ్లీష్ లో కి అనువాదం చేయించి ప్రయోగాలు చేసుకున్నారు . ఆధునిక విజ్ఞాన సంపన్నులైనారు. మన దేవాలయాల లోని విగ్రహాలను ఎత్తుకెళ్లి వాళ్ళ మ్యూజియంలలో పెట్టుకున్నారు.అవి చూస్తున్నప్పుడు కడుపు తరుక్కుపోతుంది. అందమైన గాజు నిర్మాణాల్లో మన ఆధ్యాత్మిక అమృతవాహిని ని బంధించారు కదా అని మనసు అల్లకల్లోలమైపోతుంది.
ఇవన్నీ మేధావులకు తెలుసు . కానీ ఇవి తెలియని తరాలు వచ్చాయి . మారిన తరాలకు మన వీరులు , మన సైనికులు , మన నాయకులు పడిన కష్టాలు తెలియాలి. ఎన్ని ప్రాణాలు పోతే ఈ స్వాతంత్ర్య సాధించుకున్నామో తెలియాలి . లేకుంటే చాపక్రింద నీరులా వస్తున్న దేశ ద్రోహం మన పిల్లలకు ఈ కొత్త తరాలకు తెలియదు, అర్థం కాదు. ఆక్రమించే రూపం మారవచ్చు, అణగద్రొక్కే విధానం మారవచ్చు వాళ్ళ విషపు చూపులను పసిగట్టేందుకు కొత్త స్ఫూర్తి ఇప్పుడు అవసరం . వడ్డించిన విస్తరి అయింది మన దేశం . రేపటి రోజులలో “… చింపిన విస్తరి కావద్దు” ఇది ఈ అమృతోత్సవ శుభ సందర్బంగా మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి . ఇది ఒక ప్రత్యేక అవసరం. మనకాలంలోనూ ఇప్పటికీ యుద్ధాలు జరుగుతున్నాయి. మనం చూస్తున్నాం కూడా! పరోక్ష యుద్ధాలు ఏవో సభ్యసమాజానికి తెలుసు . ప్రత్యక్ష యుద్ధం కూడా జరుగుతున్నది . ఆక్రమణకు గురయ్యే దేశం ఎంత , ఎన్ని విధాలుగా నష్ట పోతున్నదో తెలుసు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని , గమనింపులోకి తెచ్చుకొని మనం మన దేశాన్ని ఎప్పటికప్పుడు కాపాడుకోవాలి. ఈ వజ్రోత్సవ సందర్భంగా మనమంతా , మన యువతరమంతా భారతదేశ సమగ్రతకోసం ఆలోచనలను పదునుపెట్టాలి. రేపటి తరానికి ఏ కష్టాలు ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు ఒక్క గొంతుకలం కావాలి . నా దేశ సర్వోన్నతి నేను ఏం చేస్తున్నాను అని నిన్ను నీవు ప్రశ్నించుకోవాలి, దేశ సుభిక్షత కోసం నేను ఏం చేయాలి అని నిన్ను ప్రశ్నికుని పూని ఏమైనా మేలు చేయాలి . అప్పుడే నీదే అనుకునే స్వతంత్ర భారత దేశం నీదవుతుంది.
అందరికీ డెభ్భై ఏళ్ల భారత దేశ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. జై భారత్ !!
తెలుగుజాతిని ఓ కుదుపు కుదిపి పేరుకున్న తరతరాల జడత్వాన్నుంచి వెన్నుతట్టి మేల్కొల్పిన అసాధారణ వ్యక్తి చలం.
20 శతాబ్దిలో తెలుగువారిలో ఒక వివాదాస్పదమైన వ్యక్తిగా ఉన్నత శిఖరాన్ని అధిరోహించిన చలం ఎవరితోనూ పోల్చడానికి వీల్లేని వ్యక్తి అంటే అతిశయోక్తి కాదు.రమణాశ్రమం వెళ్లకముందు చలం ఆలోచనలు,జీవితం ఒక విధంగా ఉన్నాయి.రమణాశ్రమం వెళ్ళాక ఆయన అభిప్రాయాల్లో ఎంతో మార్పు కనిస్తుంది.
వ్యక్తిగతాభిప్రాయాలు,జీవన విధానం,తత్కాలీన సాంఘిక సమస్యలు,ఉద్యమాలు, రచనా వివరాలు, అనుభవాలు,సాహిత్య విమర్శలు,ఆధ్యాత్మిక సాధనలు మొదలైనవెన్నో విషయాలు చలం ఉత్తరాల్లో దర్శనమిస్తాయి.చలం సాంఘిక,వైవాహిక వ్యవస్థలో చిచ్చు రగిల్చి సంప్రదాయగుండెల్లో జ్వాలలురేపిన కాలమది.ఆస్తిక నాస్తికుల విచికిత్సతతో దేవునికోసం దేవుళ్లాడిన కాలం కూడా అదే. చలం ఆలోచనలకు,ఆశయాలకు రూపకల్పనే చలం మిత్రులకు రాసిన ఉత్తరాలు.
” ఉత్తరాలు వ్రాయడం,వ్రాయించుకోవడం ఒక గొప్ప సృజనాత్మక కళ. ఈ కళ తెలుగు రచయితల్లో చలం గారికి తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదు అని సాహసం చేయలేము గానీ,ఈ కళ కళాత్మకంగా తెలిసిన వారిలో చలం గారు ప్రముఖులు అని మాత్రం అనొచ్చు.” అని సంజీవదేవ్ పేర్కొన్నాడు.

చలం జీవిత పరిణామక్రమం లేఖల్లో స్పష్టంగా గోచరిస్తుంది.దీక్షితులకు రాసిన లేఖలో చలం ఇలా చెప్పుకుంటాడు.” నేను చాలా Sensitive. ముఖ్యంగా స్నేహితుల విషయమై కొన్ని సమయాల్లో వాళ్ళని సరిగా అర్థం చేసుకోను.మిమ్మల్ని ఎప్పుడూ ఘనంగా ఎంచుకున్నాను— నా ఉపయోగం కోసం కాదు.నేను చూసిన వాళ్లలో Generally as one of the Thoroughly nice gurllness persons ( Few they are) కానీ యీ మధ్య మీకు తెలీకుండా నేనేమో,మీరు మీ ఉత్తరాల్లో నన్ను దెప్పుతున్నట్లు కనపడ్డది.నేనేమన్నా చేశానా?” చలంది సున్నితహృదయం.తన మనస్తత్వం తెలిసిన వారితోనే పరిచయాలు పెంచుకుని మనసులోని విషయాలు పంచుకున్నాడు అనే విషయం స్పష్టంగా తెలుస్తుంది.
చలం దీక్షితులు గారికి వ్రాసిన ఉత్తరాలు చాలా విలువగలవి. “ఈ ఉత్తరాలు చదివితే వేంకట చలం గారి హృదయానికి సమీపముగా పోవచ్చు.దానిలోతు, వైశాల్యము తెలుసుకోవచ్చు.వారి సారస్వత కృషిని,పురిగొల్పిన భావోద్వేగం ఇందు గమనింపవచ్చు.
అరమరిక లేకుండా నిర్భయంగా మనుష్యుల్ని గురించీ సంస్థల్ని గురించీ చర్చించుకునేందుకు ఉత్తరాల్లోనే సావకాశముంది అట్టి చర్చలూ– అభిప్రాయాలూ– ఈ ఉత్తరాల్లో ఉన్నవి.కొన్ని ఘాటుగా కూడా ఉన్నవి.” అన్నాడు దీక్షితులు.
” జీవితమంటే ప్రేమ నాకు,దేవుళ్ళో కానీ,బతుకు తరువాత బతుకులో గానీ,దేశంలో గానీ నాకు విశ్వాసం లేదు.” అని తన అభిప్రాయాన్ని ఖచ్చితంగా చెప్పాడు చలం.

అరుణాచలం వెళ్ళాక వీరేశలింగంకు రాసిన లేఖలో కూడా ఇలా తెల్పాడు.” ఇదివరకైనా నేనేదో అందరితో కలిసే వాణ్ణనుకున్నారా? ఏ నలుగురు మిత్రులో తప్ప( వాళ్ళు నా అభిప్రాయాలు ఒప్పుకునేవాళ్లే) ఎవరితోనూ నాకెప్పుడూ సంబంధం లేదు.బతికిపోయినాను.అట్లాంటి వాళ్ళు నా కిప్పుడూ వున్నారు.” ఆయనకు పరిమిత సంఖ్యలోనే మిత్రులుండేవారని,ఈయన అభిప్రాయాలనర్థం జేసికొనే వారితోనే సాన్నిహిత్యం పెంచుకునేవారని తెలుస్తుంది.
చలం దీక్షితులకు రాసిన ఉత్తరాల్లో మనసువిప్పి తన కుటుంబ విషయాలు,వైయక్తిక విషయాలను వెల్లడించాడు. ప్రజలు తన జోలికెప్పుడు రారని అంటూ ” లోకాన్ని తన్నేవాణ్ణి చూచి లోకం అవసరమైన దూరానికి తానే జరుగుతుంది”. అంటూ తను స్థాపించిన బడిలో పిల్లల్ని పంపించనందుకు ప్రజల మీద కోపంగా ఉందని తెలిపాడు. తనను హెడ్మాస్టరుగా బెజవాడలో వేశారని,మీతో ఎంతో చెప్పాలని ఉందని తన మనసులోని మాట దాపరికం లేకుండా దీక్షితులకు తెలియచేసే ఉద్దేశ్యం గల చలం ఆనాడు ప్రభుత్వ ఉద్యోగం చేసే చలం ఇలా రాశాడు.” మీ స్నేహితుడు మన ఆఫీసులో నా మీద చాలా విషం పోశాడు. నేను నడవడిలో, డ్రెస్ లో,మాటల్లో ,నడకలో చాలా కేర్ లెస్ గా వుంటానని వెళ్లి స్వయంగా పనిపట్టి చెప్పాడు.అతను నేనడిగినప్పుడు, ఈశ్వరుని ఎదుట తానేమీ యెరుగనన్నాడు.
పొద్దస్తమానం మానవ జంతుసేవ మాట్లాడతాడు మళ్లీ” అని మాలతీబాయికి తప్ప తన మంచితనం ఎవరికీ తెలియదని రాశాడు. ఇలా ఆనాటి సమాజ పరిస్థితి, చలంపై ప్రజల్లో ఉన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. చాటుగా చలం గురించి
నీచమైన అభిప్రాయాలు కలవారని,చలం ఎదుట కనిపిస్తే భయపడి అబద్ధాలాడేవారని,చలం గురించి ప్రజలు రకరకాల వ్యాఖ్యానాలు చేసికొనేవారని దాన్ని బట్టి అప్పట్లో సంఘంలో చలంకు గల విలువ తెలుస్తుంది.ఆనాటి విద్యా విధానానికి తిరగబడి,విద్యావిధానం నచ్చక తన పిల్లలు చదువు మానేసినట్లు చలం దీక్షితులకు రాసిన ఉత్తరంలో తెలిపాడు.తన జీవిత యత్నాన్ని,తన స్ట్రగుల్ ను అర్థం చేసుకో గలిగిన వాళ్ళు లేరని,కొత్తవాళ్ళు స్నేహం చేయడం లేదని,తన జీవన పోరాటంలో,జీవన యత్నంలో చివరికి తనొక్కడే మిగిలి పోతాడని తెలిపాడు.చలంలో తిరుగుబాటు ధోరణి కన్పిస్తుంది.సంఘాన్ని ఎదిరించైనా సరే పోరాటంలో ఒక్కడే మిగిలిపోయి తుదివరకు జీవిత లక్ష్యాన్ని సాధించేవరకు పోరాడుతూనే వుంటానని స్పష్టంగా తెలియచేశాడు. పట్టుదల కలిగిన వాడుగా,ఎవరికి భయపడని వాడుగా తన నిర్ణయం పట్ల శ్రద్ధ కలవాడుగా,ఈశ్వరుని పట్ల విశ్వాసం కలవాడుగా కనిపిస్తాడు.

చలం భవిష్యద్దర్శనం కలవాడుగా కనిపిస్తాడు.తను రచించిన సెక్స్ పుస్తకం పేరు ‘ స్త్రీ’ ని ఒక్క నిమిషం నాకు విశ్రాంతినివ్వక — అగాధ వియోగభారం కిందనో చీల్చి,నలిపి ఊపిరాడక నా జీవితాన్ని పాలించే స్త్రీ లోకానికి నివేదతము చేస్తున్నానని రాస్తూ ” ఇది స్త్రీ లోకానికి నా Farewell ఏమో ,చివరికి నేనూ మారబోతున్నానేమో! ఎవరికి తెలుసు? ” అని దీక్షితులకు రాశాడు.గొప్పవాళ్ళు,
మహాత్ముల మాటలు అనాలోచితంగా,ఆయాచితంగా వెలువడుతాయి. భవిష్యత్తులో ఆ మాటలకర్థం ఎంతో ఉంటుంది.నేను మారబోతున్నానేమో అని చెప్పిన చలం దార్శనికుడు,మహాత్ముడు,ఋషితుల్యుడు,మనీషి, భవిష్యత్తును దర్శించిన కాలజ్ఞానవేత్త అని ఘంటాపథంగా చెప్పవచ్చును.ఆయన మారిన విషయం ఆయన చెప్పినట్లుగానే అరుణాచలం జీవితంలో స్పష్టమవుతుంది.చలం ఆలోచనా వైఖరి,జీవన విధానం దీక్షితులకు రాసిన ఉత్తరాల్లో వ్యక్తమౌతుంది.
తన కాలం మధురంగా గడిపేందుకు ‘ ఒక యూరేషియన్ అమ్మాయి’ ఉన్నట్లు తెలుపుతూ ” జరగడానికి వీలు దివ్య సన్నివేశాలు నా జీవితంలో జరుగుతాయని ఇంకా కలలు కంటున్నాను.” అని చెప్పిన ఆశాజీవి.తన సూక్ష్మ శరీరంలో ఆధ్యాత్మిక జ్ఞానత్వం పొందుతుందేమోనన్న అనుమానం వ్యక్తం చేశాడు దీక్షితులకు రాసిన లేఖలో.చలం ఆలోచనల్లో మధ్యమధ్య మార్పును గమనించవచ్చు.దేవునిపట్ల విశ్వాసం లేదని గట్టిగా చెప్పాడు ఒకసారి.వెంటనే మరోసారి ఈశ్వరునిపట్ల విశ్వాసముంది అంటాడు.ఆస్తినాస్తిక విచికిత్స,ద్వైధీ భావన చలంలో కనిపిస్తుంది.చలంకు స్నేహితురాండ్రు వున్నట్లుగా లేఖల ద్వారా తెలుస్తుంది.

” యూరేషియన్ స్నేహితురాలు” ఒక మోటారు కారు తీసుకొని రమ్మంటుందని తెలిపాడు ఒక లేఖలో. లీల పరిచయం మొదలైనవి లేఖల్లో రాశాడు. దీక్షితులకు రాసిన ఇంకో లేఖలో కిటికీ కింద ఓ అమ్మాయి వెడుతుందని, ఆ అమ్మాయిని తనూ, తనను ఆ అమ్మాయి పరస్పరం ఇష్టపడుతున్నారని,కానీ వారి మధ్య పది గజాల దూరముండేదని తెలిపాడు.
ఆ మాత్రం దూరం కూడా సహించలేని మనస్తత్వం చలందని స్పష్టంగా వ్యక్తమవుతుంది.
తన ఉద్దేశ్యాన్ని ఒక లేఖలో ఇలా తెల్పాడు.” యవ్వనంలో ఉన్న భార్యలకు పిల్లలు లేకపోతే సంతానమివ్వడం,బాల వితంతువులకు కూడా” అనడం వల్ల స్త్రీలపై చలంకున్న వ్యామోహం తెలుస్తుంది.ఇదే సందర్భంలో ఇంకో మాట అంటాడు.అన్ని ఆశయాలను వదులుకొని ” గొప్ప యోగినౌతాను.నా అద్భుతమదిమల కీర్తి దిగంతంగా వ్యాప్తిస్తుంది.స్త్రీ పురుషులు నా పాదాలముందు నమస్కరిస్తారు”.అని గొప్ప యోగి అవుతున్నట్లుగా తను కొన్ని మహిమలు చూపించేవాడుగా తెలియజేశాడు.వ్యతిరేక భావ ధోరణి స్పష్టంగా గోచరిస్తున్నది. ఎన్నో చేయాలనుకుంటున్నట్లు కలలు కన్నాడు.
చలం తన జీవితంపై ఖచ్చితమైన అభిప్రాయాన్ని దీక్షితులకు రాసిన లేఖలో ఇలా తెల్పాడు.” నాకు జీవితమంటే ప్రేమ,కన్నీళ్లలో,నవ్వులతో,నీచత్వంతో,త్యాగాలతో, స్వార్థంతో,ఔదార్యంతో,విషాదంతో,ఆనందంతో ఈ జీవితమే మంచిది.మళ్లీ మళ్లీ అనంతంగా పుడుతో పెళ్లి చేసుకుని సంపాయించి,పిల్లల్ని కని, పాపాలు చేసి,ప్రేమించి,ద్వేషించి,నవ్వి,మూలిగి కాని ఏ మోక్షం అక్కర్లేదంటాను నిశ్చయంగా” అని సూటిగా చెప్పాడు.లోకంలో తనను గృహచ్చేదకుడంటారని తెల్పడం వల్ల సమాజంలో చలంపై ఎటువంటి నీచాభిప్రాయముండేదో తెలుస్తుంది.అందుకనే ఆ కాలంలో చలంకు ఇల్లు అద్దెకు ఇవ్వడానికి భయపడేవారు.

రామజోగారావుకు రాసిన ఉత్తరంలో ” మూడు నెలల నుంచి స్త్రీ స్నేహమయింది కానీ సంపర్కం కాదు.ముందు కూడా తటస్థించదు” అని వాస్తవాన్ని చెప్పాడు.దీక్షితులకు రాసిన ఉత్తరంలో చలం గారికి ఒక తమాషా అనుభవం జరిగిందని రాశాడు. కనిగిరిలో తనకపరిచితురాలైన ఒక హైస్కూల్ అమ్మాయి అర్ధరాత్రి చలం ఇంటికి వచ్చి చలాన్ని లేపి తనను మోహించమని,ప్రేమించమని అర్థించిందట.తాగుతున్నట్లు ( మద్యం)గా కూడా లేఖల్లో తెలియపరిచాడు.చలం ఆలోచనలు స్త్రీ చుట్టే తిరుగుతుండేవి అనడానికి చలం రాసిన ఉత్తరాలే ప్రత్యక్ష సాక్షులుగా నిలిచిపోతాయి.
” స్త్రీ తప్ప నన్ను గట్టిగా కదిలించగలది ఏదీ లేదు” అని కుండబద్ధలు కొట్టినట్లు పచ్చినిజాన్ని నిర్మొహమాటంగా వ్రాస్తూనే దీక్షితులకు రాసిన ఉత్తరంలో ” స్త్రీ కొరకు జీవితాన్ని ధ్వంసం చేసుకున్నవాళ్ళని,అంటే కీర్తి,డబ్బూ కాదు- అంతకన్నా శ్రేష్ఠమయినవి- జీవితం మీద ఆసక్తిని-శక్తిని- బతకడంలో ఆనందాన్ని పోగొట్టుకున్న వాళ్ళని చూస్తే- నేను చాలా వివేకవంతుణ్ణిగా తోస్తాను.” అని లోకంలో తనకంటే కూడా బలహీన మనస్తత్వాలు కలవారున్నారని వారికంటే కూడా తను తెలివిగలవాడుగా చెప్పుకొన్నాడు. ఇక్కడ మనం ఒక విషయం గమనించవచ్చు.స్త్రీ మూర్తి పట్ల ప్రేమను చూపించాడు కానీ దిగజారుడుతనం లేదని తెలుస్తోంది.స్త్రీలే తనను ఆప్యాయతతో చూశారని అనుకోవచ్చు.
తన ఉద్దేశ్యాన్ని ఇంకా ఇలా తెల్పాడు.” నా పిల్లల్ని చదివించాలని, వాళ్ళకి పెళ్లిళ్లు చెయ్యాలని ఏమీ వ్యామోహం లేదు.మా అబ్బాయి రౌడీ అయినా,అమ్మాయిలు వేశ్యలైనా నాకు సంతోషం,నమ్మకం- నేను స్వతంత్రుణ్ణి.నా ఆత్మ నాది.” అని అంటూ స్వేచ్ఛా ప్రియత్వాన్ని చాటాడు. సమాజాన్ని,సంసారాన్ని పట్టించుకోని స్వేచ్ఛాజీవిగా కనిపిస్తాడు చలం.మూఢాచారాన్ని నిరసిస్తూ, దీక్షితులకు రాసిన ఇంకో లేఖలో “ఏమి నమ్మినా నాకు వచ్చే నష్టాలేవీ లేవు.ఆ విధంగానే నాకే విశ్వాసం కుదిరితే అదే నిజమని తోస్తే రేపు సంపూర్ణమైన నిరీశ్వరవాదిని గానీ లేక మూఢాచారవంతుణ్ణి సనాతనుణ్ణి కానీ- కావడానికి నాకేమీ అభ్యంతరం లేదు.
ఏ పల్టీ కొట్టడానికో నేను సిగ్గుపడను.నాకు వాస్తవమని నిశ్చయంగా తోచాలి.మీరు- నా జీవితంలో కొన్ని పల్టీలకు కారణం మీరు” అంటూ తను నమ్మిన సిద్ధాంతంలో చర్చించే వాడుగా( శృంగారి కానీ,ఆధ్యాత్మిక మార్గంలో కానీ) తన మనసుకు నచ్చినపుడే,సత్యమని నిశ్చయంగా తెలిసినప్పుడు ఏ మార్గంలోనైనా వాస్తవానికి దగ్గరగా నడుస్తూ తృప్తిగా చరించే మనస్తత్వం చలందని తెలుస్తుంది.చలం పరిపూర్ణ విశ్వాసానికి పట్టం కట్టాడు.

అంత స్వేచ్ఛను కోరి,సంఘాన్ని ఎదిరించి ఇష్టానుసారం చరించి శృంగారంలో మునిగితేలిన చలం స్త్రీ స్వేచ్ఛను కాంక్షించిన చలం ” పశ్చిమ భౌతిక శాస్త్రమూ, ఠాగూరు గారి బ్రహ్మసమాజపు వేదాంతప్రభావం వల్ల చలంలో మత విజ్ఞానం ఏర్పడి ఆధ్యాత్మికతవైపు దారి తీశాయి.” స్త్రీ కాముకుడు,కథకుడు చలం చచ్చిపోబోతున్నాడు.ఈశ్వర సందేహంలో శృంగార తత్వంలో మునిగి బీరుతాగే, మాంసం తినే,ఆడవాళ్ళని ముద్దు పెట్టుకునే జి.వి.జీవిలో ఆత్మవుందని గుర్తించకలిగింది– మీరు,అవును మీరు” అని దీక్షితులకు రాసిన ఉత్తరంలో వివరించాడు.చలంలో పరివర్తన వచ్చిన విషయం లేఖల్లో స్పష్టమవుతుంది.నిరీశ్వరవాది ఈశ్వర వాదిగా మారాడు.భగవాన్ పై విశ్వాసం కుదిరింది.వాస్తవాన్ని నమ్మేవరకు విశ్వసించని చలం ఆత్మానుభవం వాస్తవమని తాను నమ్మిన వాస్తవ ప్రపంచం నుండి మానసిక మార్పుకులోనై వాస్తవమనే నమ్మిన ఆధ్యాత్మిక మార్గం వైపు పయనించాడు. తనను చీదరించుకున్న ఆంధ్ర దేశాన్ని,ప్రజలను వదలి సత్యాన్వేషణలో అరుణాచలానికి దారితీశాడు. శృంగారంలో ఆనందాన్ని అనుభవించి వైరాగ్యంతో ఆధ్యాత్మిక చింతనతో ఆనందాన్ని అనుభవించడానికి పయనమయ్యాడు.
” సంఘసంస్కార విషయంలో,స్త్రీల బాధల విషయంలో బాధననుభవించి ” నా ఆత్మ ఏ కొంచెం,సాక్షాత్కారమైనా నాకు ఆడపిల్లల అవసరం లేదు అంటాను” అంటూ దీక్షితులకు రాసిన ఉత్తరంలో పేర్కొన్నాడు. స్త్రీ సౌందర్యం కోసం కలలు కనే చలం ఈశ్వర సౌందర్యం కోసం పరితపించడం మొదలు పెట్టాడు.
చలం లేఖల్లో సాహిత్య విషయాలు చోటుచేసుకున్నాయి.
చిత్తశాంతి లేదు.ఎప్పుడూ మానసిక ఒంటరితనం,బాధతోనే ఎక్కువ కాలం గడిపాడు చలం.తను రచన చేయడానికి కారణాన్ని వివరిస్తూ చలం జోగారావుకు రాసిన లేఖలో ” బాధ అనేది ప్రపంచంలో ఉన్నన్నాళ్లు పుట్టడమనేది విషాదం నాలుగు మణుగుల ఆనందం వున్నాసరే రెండు తులాల బాధ దాన్నంతా చెరుపుతుంది.” అని రచనా హేతువును వివరించాడు.చలం బాధాతప్తజీవి.బాధలోంచే కవిత్వముద్భవించిదని తేల్చి చెప్పాడు నిజమే ప్రథమ కావ్యం రామాయణం శోకంతోనే శ్లోకం ఉద్భవించిన వాల్మీకి మహర్షి నోటిద్వారానే వెలువడింది.
పత్రికలలో తననెవరేం తిట్టినా పట్టించుకోలేదని ” నా వైపు కొందరున్నారనే ఇట్లాంటివి సహించరనే తెలిసి వొస్తే కొంత భయపడతారు విమర్శకులు” అని జోగారావుకు రాసిన లేఖలో తెలిపాడు.సినిమా స్టార్ల ఆరాధకులైన పత్రికలవాళ్ళు ( స్వతంత్ర) చలాన్ని వ్రాయమని,అచ్చువేసుకుంటామని బతిమాలి,బలవంతం చేసి వ్రాయించుకుని అచ్చువేయకుండా తనపై ఆవిధంగా కసిని తీర్చుకున్నారని,మోసం చేశారని, ‘ లోకం తీరే అంత- మోసం,దొంగతనం ఉంటేనే గాని మనిషిని ఏ ఫీల్డ్ లోనైనా సరే సక్సెస్ వరించదు” అంటూ జోగారావుకు రాసిన లేఖలో విశదం చేశాడు. లోకంలో అంతా మోసం,దగాయే అని నిక్కచ్చిగా చెప్పాడు.అవును ఇప్పటికైనా పత్రికలవాళ్ళు పేరున్న వాళ్లవి,తెలిసిన వాళ్లవే అచ్చువేస్తారు.బాగా రాసినాసరే వాళ్లకు పరిచయం లేకుంటే,సిఫార్సు లేకుంటే అచ్చు వేసుకోరు ప్రముఖ పత్రికల వాళ్ళు.
బెజవాడ ప్రజలు తనను తరిమేసినట్లుగా, సామాన్లు అన్నిటిని అమ్మేసి,బతికివున్నామనే సంతోషం కూడా లేదని,దేశం ఒదిలితేనే బాగు పడ్తామని జోగారావుకు రాసిన లేఖలో తన మానసికవ్యధను వ్యక్తం చేశాడు.
చలం రచనల్లో వాస్తవికత ఉంటుందని తను నమ్మిన సిద్ధాంతమే రచనలో ప్రతిబింబిస్తుందని చలం దీక్షితులకు రాసిన ఉత్తరం వల్ల తెలుస్తుంది.చలం నిండా ‘సెక్స్’ ఉంటుందని అంటారు.’సెక్స్’ నేరం కింద ఒప్పుకుంటున్నానని కాదు. ఏ విషయంలోనైనా పూర్తిగా మునిగి కాని తార్కిక,మానసిక పర్యవసానాల దాకా తరచిచూచే వాడు త్వరలో సత్యమార్గం అందుకుంటాడని నా నమ్మకం.” సెక్స్ నా ముక్తి మార్గం” అని రాస్తూ దేశంలో ఇంతవరకు లేని కొత్తదనం నాలో ఏమీ లేదని,ఏది ఫీల్ అవుతామో అదే రాస్తామని చెప్తాడు.అయితే తన రచనలో ఫోర్స్ లేదని తానే ఒప్పుకుంటాడు.మంచి సారస్వతం రెండు రకాలని, ఒకటి గోడమీది పటంలాగా మనసుని అందాలతో నింపేదని,రెండవది ఉరిమి ఉరిమి చించి చెండాడి మంచికో చెడ్డకో జీవితాన్ని ఇన్ఫ్లుఎన్స్ చేసేదని చెప్తూ మొదటి రకం సాహిత్యం బళ్ల కొద్ది వస్తుందని,రెండో రకం సారస్వతాన్ని దేశానికి అందించేది నేను ఒక్కణ్ణేనని దీక్షితులకు రాసిన లేఖలో చెప్పుకున్నాడు. అంటే చలం రచనలు జీవితాలపై ప్రభావాన్ని చూపించేవిగా వుంటాయని తెలుస్తుంది.
ఆ విషయం చలమే ఒప్పుకున్నాడు.చలంకు తన రచనల పట్ల అమిత విశ్వాసం,ప్రజలను మార్చగలననే నమ్మకం బలంగా ఉండేదని తెలుస్తుంది. ఉత్తరాలు ఆయన మనసును అద్దం పడుతున్నాయి.
దీక్షితులకు రాసిన ఉత్తరంలో చలం అభిప్రాయం స్పష్టంగా గోచరిస్తుంది.1900వ సంవత్సరం తర్వాత ప్రచురించిన పుస్తకాలలో ఒకటి కూడా కొంతకాలం నిలవదని,” మన సారస్వతంలో, అభిప్రాయాలలో కొత్త కాలువలూ,కళలో కొత్తమార్గాలూ ప్రారంభించిన వాళ్ళు కొద్దిమంది వున్నారు.వాళ్ళల్లో నేనొకణ్ణి”. అని తన టెక్నిక్,ఆలోచనలు పాశ్చాత్య వాతావరణానికి సంబంధించేట్లుగా వుంటాయి కాబట్టే ఈ దేశంలో అట్లాంటి సాహిత్యం అభివృద్ధి చెందిందని ఘంటాపథంగా చెప్పాడు. దీన్నిబట్టి చలం ఎంత ఆత్మవిశ్వాసం గలవాడో తెలుస్తుంది.
రాజకీయంగా,సాంఘికంగా ముందు ఏ దేశం మారబోతుందో దాన్నిబట్టే తన పుస్తకాలకు విలువుంటుందని ” ఈనాడు వాస్తవజీవితంలో,మాటల్లో చాలామంది చూపుతున్న పోకడలనే నేను కళారూపంలో వ్యక్తం చేశాను” కానీ భాష నాకు ఆటంకమని,ఉద్రేకానికి తగ్గ శైలి లేదని చెప్పాడు.
ఆధునిక రచయితలు వారి కావ్యాలపై స్థాలీపులాక న్యాయంగా విమర్శించాడు. దీక్షితుల రచనపై ( వరూధినీ,చెంచురాణి) పై నిష్పాక్షికంగా విమర్శ చేశాడు.” మీ రచనల్లో ఉప్పు కారం తక్కువగా తోస్తుంది. ఈ అభిప్రాయం నా స్వంతం.కానీ మీ సూనృతమూ, మెత్తని హాస్యం చాలా మంది ఎంత ఇష్టపడతారో ఊహించుకోగలను.కొంచెం కట్లు వొదిలించుకుని,ప్రయత్నిస్తుంటేబహు గొప్పవి రాస్తారని నా నమ్మకం.” అని సూచనలతో కూడిన విమర్శ,,తియ్యని చురకలు వేశాడు.
“మునిమాణిక్యం”వి కులాసాగా చదువుకోవడానికే పనికి వస్తాయని,” విశ్వనాథ” కవిత్వం అర్థం కాదని,” కృష్ణశాస్త్రి” తను నిజంగా ఏమి ఎట్లా అనుభవించాడో అదే రాస్తే అద్భుతమైన గీతాలు వ్రాయగలడని అభిప్రాయాన్ని తెలుపుతూనే హృదయం మీద అతనిచ్చే నాజూకు నొక్కులు అని మెచ్చుకుంటాడు.” వేదం” కలంలో శక్తి వున్నా కవిత్వం కోసమే బతుకుతాడని,” నోరి” కవికింద నాకు తెలీదు అనీ,” నాయని” కవిత్వం నచ్చదు.” బసవరాజు అప్పారావు” ఒక గొప్ప కవిత్వపు పంక్తికోసం నూరుడబ్బాల చత్త రాస్తాడనీ,” రాయప్రోలు” శైలి బాగునప్పటికీ కొత్త అభిప్రాయాలు సున్న అని నిర్మొహమాటంగాను,కుండ బద్దలు కొట్టినట్లుగానూ తన అభిప్రాయాన్ని తెలిపాడు.
ఈ విధంగా చలం మిత్రులకు రాసిన లేఖలను పరిశీలించి నట్లయితే చలం హృదయం విప్పి తను అనుభవించిన ప్రతి విషయాన్ని మిత్రులతో దాపరికం లేకుండా వ్యక్తీకరించినట్లు గమనించవచ్చు.సాంఘిక,
వేదాంత,సాహిత్య విషయాలు,ఆరోగ్య విషయాలు,కుటుంబ విషయాలు ఒకటేమిటి ఎన్నో ఎన్నెన్నో విషయాలు చలం లేఖల్లో చోటు చేసుకున్నాయి.చలం అనుభూతులు,అనుభవాలు,
కష్టసుఖాలు మిత్రులతో లేఖలద్వారా పంచుకున్నాడు.చలం ఔద్యోగిక జీవితంలో తటస్థపడిన వ్యక్తుల మనస్తత్వాలు, జీవిత సిద్ధాంతం, జీవన విధానం మొదలగునవి ఎన్నో విషయాలు లేఖల్లో నిక్షిప్తాలు.
రమణాశ్రమ జీవితంలో చలం భావనా దృక్పథం
(ఉత్తరారుణాచలం)
అరుణాచలం వెళ్ళాక చలం మనస్తత్వంలో మార్పు వచ్చినట్లుగా లేఖలవల్ల స్పష్టంగా తెలుస్తుంది.
బంకుపల్లి రామజోగారావుకు, వీరేశలింగంకు రాసిన లేఖల్లో ఇన్నేళ్లు ప్రపంచానికి సృష్టికి సరైన అర్థం కనబడక,ఏమీ తెలీకపోవడం చేతనే,ఎవ్వరు చెప్పినా నమ్మక అరుణాచలానికి రాక జీవితాన్ని వృధా చేసుకున్నాననే బాధను వ్యక్తం చేశాడు.జీవితంలో ఎంత పోగొట్టుకున్నాడో వెనక్కి తిరిగి చూస్తే తన చేసిన తప్పేంటో తెలుసుకుని పశ్చాత్తాపపడ్డాడు.
” ఎక్కడి చలం ఎక్కడి అరుణాచలం దేవుణ్ణికాదు,ఋషిని కాదు,ఓ సమాధిని సేవించుకుని నమ్ముకొనిపడి వున్నాను.” అంటూనే మోక్షం కావాలని లేదు.వస్తుందన్న ఆశలేదు అని చెప్తూనే అంతలోనే అయోమయావస్థలో పడిపోతాడు చలం. పేరుకున్న ఈ సంస్కారాన్ని కాల్చే శక్తి భగవాన్ కి ఉంది.ఎవరు చెప్పినా అర్థం కాదు.ఏదో బాధ చలంను కలచివేసేది.బాధను భగవాన్ కు వదిలేసి బాధపడకుండా ఉండడం నేర్చుకున్నాడు.అప్పటికి భక్తిపై నమ్మకం కుదరలేదు”.అని దీక్షితులుకు రాసిన లేఖలో అంటాడు.
చలం రామజోగారావుకు రాసిన లేఖలో ” పాత జీవితమంతా ఓ కల లాగా అయిపోయింది. ఇట్లా కాలం గడచిపోవడమే ఆశయం.ఇంకా చలం అనే పేరు కూడా మనసులోంచి గుర్తులేకుండా పోవాలని ప్రయత్నం.ఏదో ఎవరో ఆకాశం నించి ఎప్పుడు దిగివస్తారో అన్నట్లు వుంది మనసు.చివరికి అన్ని బాధలూ పడి స్వర్గధామము చేరుకున్నాను.” అనే సంతృప్తిని మానసిక మార్పును వ్యక్తం చేశాడు.
వీరేశలింగంకు రాసిన ఉత్తరంలో చలం తన ఆవేదనను,ఆంధ్రలో తనను ఎంత నీచంగా చూశారో,ఆంధ్ర జనులపై విరక్తి భావం,రమణాశ్రమంలో చలం పొందుతున్న అనుభూతిని కళ్ళకు కట్టినట్లు వివరించాడు. నేను కష్టాల్లో వున్నప్పుడు ఎవరు ఆదుకున్నారు? కుక్కల్లాగు నన్నన్నివిధాలా క్షోభిల్లచేస్తూవుంటే ఎవరు సహాయానికి వొచ్చారు.ఈ ముప్ఫయి ఏళ్ళు డబ్బు తీసుకోకుండా ఇన్నేళ్లు రాసిన నాకు, డబ్బు లేని రోజున ఎవరిచ్చారు ఒక్క రూపాయి? తీరా నేనొచ్చిన తర్వాత అందరూ అడిగేవాళ్లే ఎందుకు వెళ్ళావని? ఎందుకు? నా బాధ ఇంక వుండదని రూఢి గనుక” అంటూ తన మానసిక వేదనను వెళ్లబోసుకున్నాడు.ఆనాడు ఆంధ్రదేశంలో తనపట్ల ప్రజలకున్న అభిప్రాయాన్ని కూడా చెప్పుకున్నాడు.తాను అరుణాచలం రావడానికి కారణం చెప్తూ ” యువతీ యువకులు దొంగ మొహాలు చూసి” వచ్చేశానన్నాడు. చలం మానసిక చిత్రీకరణ ఈ లేఖలో కనిపిస్తుంది బెజవాడ ప్రజలు తనను ఏ విధంగా,ఎంత నీచంగా చూసేవారో వివరించాడు. వీరేశలింగంకు రాసిన లేఖలో ” ఇదివరకు పురుషులు భయపడేవారు,నేను నా పుస్తకాలూ వాళ్ళ ఆడవాళ్ళని వాళ్ళ అధీనంలోంచి యెక్కడ తిరుగుబాటు చేయిస్తానేమోనని. ఇప్పుడు స్త్రీలు భయపడుతున్నారు,( ఇంకా భయపడతారు కూడా ఎక్కువగా ముందు ముందు) తమ పురుషుల్ని ఎక్కడ సన్యాసుల్ని చేస్తానోనని—- నాతో స్నేహమన్నా,మా ఇంటికి రావడమన్నా అంత ఘోరం క్రింద ప్రచారం చేస్తారు బెజవాడ ప్రజలు” అని వాపోయాడు చలం.
అరుణాచలం వచ్చాక చలం మానసికంగా ఎంతో ఎదిగాడు.గత జీవితాన్ని మరచిపోయి తర్వాత జీవితాన్ని,మనసును రమణాశ్రమంలో భగవాన్ కే అర్పించడానికి ప్రయత్నం చేశాడు ఇదే సందర్బంలో చలం మాటలు ” ప్రస్తుతం నా మనసులోకి అట్లాంటివి తీసుకోవడం బాధ సాధనలో వున్నాను ” అన్నాడు.
” నా కోసమే కాదు,నా నుండి ఏదో తెలుసుకోగలమనే వారందరికోసమూ చేస్తున్నాను ఈ తపస్సు ,ఇది కష్టతరమైనమార్గం ,కానీ నన్ను నడిపేది ఈశ్వరుడైన భగవాన్ రమణ ” అంటూ ధైర్యంగా చెప్పుకుని ఎంతో విశాల హృదయాన్ని ప్రకటించి తన మిత్రులకు ఆధ్యాత్మిక సందేశాలను,సత్యాలను,
జ్ఞానాన్ని లేఖలద్వారా పంచి ప్రచారం చేశాడు వేమన వలె చలం భోగిగా వుండి తర్వాత యోగిగా మారాడు.
చలంలో వచ్చిన మార్పు,జీవితంలో రెండు పార్శ్వాలను లేఖల ద్వారా స్పష్టంగా తెలుసుకోవచ్చును.
జీవితంలో శృంగారమే గొప్పదని భావించిన చలం మెల్లమెల్లగా సత్యమేమిటో తెలుసుకొని, అన్ని బాధలూ పడి చివరికి స్వర్గధామం చేరుకొని,హృదయపరిపక్వత చెంది ఇలా అంటాడు రామజోగారావుకు రాసిన లేఖలో. “శృంగారానికి,ఆధ్యాత్మికానికీ చాలా సన్నిహితమని,జీవితంలో ఎన్ని నిరాశలున్నా లొంగిపోక,నిరాశ పడక బలంతో జయించి ముందుకు సాగాలని హితబోధ చేస్తూ ” క్రమంగా మన చేతులకి విధి నిరాకరించిన సౌందర్యం మన హృదయంలో ప్రజ్వలిస్తుంది వొదలకండి అన్వేషణ. శృంగారాన్ని అన్వేషిస్తో ప్రయాణమై, పోయి పోయి చివరికి ఆ శృంగారం కాంతిగా మారిన సంకేతస్థలానికి చేరుకుంటాము.భగవాన్ ఆనందమయం సర్వశక్తి ” అని తాను తెలుసుకున్న నగ్న సత్యాన్ని ఎంతో చక్కగా వక్కాణించాడు.తాను భగవానుని పూర్తిగా విశ్వసించినట్లు తెలిపాడు మండువ జగ్గారావుకి రాసిన లేఖలో ” శృంగారంలో కన్న మరి దేంట్లోనూ ఎక్కువ ఆనందాన్ని అనుభవించలేదు.మనసుని మించిన ఆనందం ఆధ్యాత్మికం, కామి కాక మోక్షగామి కాడు ఒకటి అసహ్యం,రెండోది మూర్ఖం ” అని వ్రాస్తూనే సాధనమంటే జీవితాన్ని ఈశ్వరునికి అర్పణ చేయడమంటాడు.
ఒక సినిమాకు కథ రాయడానికి మద్రాసుకు వెళ్లినా కూడా చలం ఆలోచనలు భగవాన్ చుట్టూనే తిరుగుతుండేవి.దీక్షితులకు రాసిన లేఖలో ‘ అరుణాచలం పోవాలని ఒకటే పీకుతోంది మనసు. భగవాన్ నాకిట్లా శిక్ష వేశాడు. ఇక్కడ ఈ వాతావరణంలో ఎక్కడా వినపడరు. ఆయన నవ్వుతున్నారు నా బాధల్ని చూసి.ఈ సినిమా కోసం బతకడం కన్నా చచ్చిపోవడం నయం.ఎంతెంత మోసాలు!అసహ్యాలు, డబ్బు…..ఇట్లాంటి మురుగునించి తప్పించారు మీరు నన్ను భగవాన్ని నాకు చూపించి”.అనడం వల్ల చలంలో వచ్చిన మార్పు ,స్త్రీ వ్యామోహం నుండి మనసు భగవాన్ వైపుకు మళ్ళి ఆధ్యాత్మిక స్థితికి చేరుకోవడం ,ఇంతకాలం ఎంతో మురుగులో కొట్టుకుపోతున్న చలం తనను రక్షించినందుకు దీక్షితులకు కృతజ్ఞతలు తెలిపాడు.
రమణ మహర్షి దగ్గర చేరడానికి కావాల్సింది మనలో పట్లు పోయి ” బంధువుల్నీ,మర్యాదల్నీ వొదిలేయడానికి ఓ గొప్ప అర్హత ” అని వీరేశలింగం గారికి సలహా ఇస్తాడు.
చలం దీక్షితులను,వీరేశలింగం గారిని రమణ మహర్షి ఆశ్రమానికి రమ్మని పదేపదే కోరుతూ ఎన్నో ఉత్తరాలు రాశాడు.
చలం మండువ జగ్గారావుకు రాసిన లేఖలో నిత్య సత్యాలను, ఆధ్యాత్మిక భావాలను,తన రచనా వైఖరిని ఎంతో చక్కగా వెల్లడించాడు.” ఆధ్యాత్మిక సాధన అంతా ఏకాగ్రతను కుదుర్చడానికే అంటూ” కాలాన్ని,దేశాన్ని బట్టి మారడమేమిటి? మనిషి మనిషికీ మారుతుంది.నీతి మారదు. నీతికి సంబంధించిన పాపపుణ్యాలనే ఆ ఆచారాలు మారతాయి.
ఆ సంగతి అంగీకరించదు సంఘం.అందరికీ ఒకటే నీతిని రుద్దుతుంది.అదే చలం తగాయిదా సంఘంతో.” అని సంఘానికి చలం ఎందుకు వ్యతిరేకమో,చలం భావాలను ప్రజలు ఎందుకు అసహ్యించుకుంటారో వివరిస్తాడు.
చలం ప్రత్యేకత అతను నమ్మినదాన్ని ఆచరించడం,ఇతరుల కోసం త్యాగం చెయ్యడం,కష్టాలలోకి పోవడం కనుక అతనికి ప్రతిష్ట రాలేదు.
ఒక స్త్రీ విషయమో కాదు వీళ్ళ బతుకుల్లోని నీచత్వాన్ని,దొంగతనాన్ని,
బూతుని,మోసాల్ని బైటపెట్టడానికి ప్రజలకి చాలా కసి,ఎన్నడూ అతన్ని క్షమించలేదు.
అందుకే చలం రాతలకి అంత బలం” .అంటూ ఉన్న వాస్తవాన్ని తెలుతుపుతూనే చలాన్ని పట్టిన రొష్టు ఠాగూరుకు పట్టలేదని జగ్గరావుకు రాసిన ఉత్తరంలో పేర్కొంటాడు.
చలం తన కవిత్వంలో గల ప్రత్యేక లక్షణాన్ని ఇంకా ఇలా వివరించాడు జగ్గారావుకు రాసిన ఇంకో లేఖలో.” మన అనుభవానికి మారిన సంగతుల్ని మనం ఒప్పుకోకపోవడం పొరపాటు.ముఖ్యంగా స్త్రీ మనస్తత్వ విషయంలో కానీ,మన అనుభవాల్ని అటుంచి కథలో ఇది అసంభవం అనిపిస్తే చదువరికి, అది రచనలో లోటు.మామూలు తెలుగువాళ్లు అసంభవమనుకునేవి సంభవమనిపించేట్లు రచించడం చలం ప్రత్యేకత” అని తన రచనా వైఖరిని తెల్పాడు.నిజాన్ని నిర్భయంగా చెప్పే చలంను వాస్తవికతవాది అనవచ్చు.
” ఏమైనా ఈశ్వరుడిలో భక్తి విశ్వాసాలు వుంటే ఎటువంటి ఆపదల్లోంచీ బైటికి రాగలడు.” అంటూ భక్తిపట్ల తనకు గల నమ్మకాన్ని వ్యక్తం చేశాడు చలం జగ్గారావుకు రాసిన లేఖలో.ఆ విశ్వాసమనేది హృదయంలోంచి రావాలి .మనం ఏ పని చేసినా సంపూర్ణ ఆత్మ విశ్వాసంతో చేస్తేనే సఫలమవుతుంది అనేది వాస్తవం.
అసలు ఆధ్యాత్మికం అంటే ఏమిటి? సాధనెందుకు చేయాలి? అన్న ప్రశ్నలకు సమాధానాలు వీరేశలింగంకు రాసిన ఉత్తరంలో కనిపిస్తాయి.” అనుభవానికి అతీతమైన అనుభవానికి పోతారు.అదే ఆధ్యాత్మికం ఇంద్రియాల నుంచి తప్పించి దృష్టిని ఏ ఆధారమూలేని ఆనందంలో లయం చేయడానికేగా” సాధన అని అంటారు.మనసు ఏకాగ్రతను ఎలా సాధించాలి అన్న విషయాన్ని అనుభవపూర్వకంగా వివరించాడు.
” ప్రపంచంలో నలిగి,కాగి,దిక్కులేని వాళ్ళకే ఈ ఆధ్యాత్మిక ప్రపంచం” అంటూ చక్కని నిర్వచనాన్ని వీరేశలింగం గారికి రాస్తూ శాంతి,కాంతి ఇచ్చేవాడు ఒక్క ఈశ్వరుడే అని కుండబద్దలు కొట్టినట్లు తను నమ్మిన సత్యాన్ని ధైర్యంగా చెప్పాడు.” ఎవరి కర్మకి వారే కారణం.ఈ కర్మ పరంపర అనే ఎడతెగని వలనుంచి బైటపడడానికి ఈశ్వరుడొక్కడే సాధ్యం.” అని పచ్చి నిజాన్ని చెప్తూ తన అనుభవాన్ని తేల్చి చెప్పాడు. ఎంత శత్రువునైనా ప్రేమ వల్ల జయించవచ్చునన్న ఆత్మవిశ్వాసం కలవాడు చలం.
ఒకప్పుడు భావోద్రేకంతో ఉండడం వల్ల జీవితంలో ఉపద్రవాలు వచ్చాయన్న సత్యాన్ని తెలుసుకుని వీరేశలింగంకు రాసిన ఉత్తరంలో చలం ఇలా వివరించాడు. ” మనకి అందమైన స్త్రీని చూడగానే కలిగే భావోద్రేకం వల్ల మన జీవితాన్ని ఆమె జీవితాన్ని నడపలేము. బాధనే వాంఛాగ్ని మీలో ఇముడ్చుకోగల లోతును సంపాయించండి… ఆ లోతును ఎంత ప్రయత్నించీ సంపాయించుకోలేకే చాలా ఉపద్రవాలు తెచ్చుకున్నాను…అంత కన్న విషాదం నన్ను నమ్మిన వారికి తెచ్చాను.ఇట్లాంటివి మనలో చాలా వరకు సమసిపోతేనేగాని అరుణాచలానికి పిలుచుకోరు ఈశ్వరుడు.” అంటూ అనుభవాన్ని వివరిస్తూ పశ్చాత్తాపాన్ని తెలుపుతూ వీరేశలింగానికి మార్గాన్ని సూచించాడు.అనుభవంలో చేదును చవిచూసి నలుగురికి ఆ చేదు నిజాన్ని తెలిపి సత్యాన్ని ప్రచారం చేశాడు చలం.ముందు మానసికంగా మార్పు రావాలని సలహా ఇచ్చాడు.
జీవన్ముక్తిని కోరి తన ఆశయం జీవించాను,జీవిస్తున్నాను అనే మరుపు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడటమేనంటాడు చలం.
శివంకు రాసిన లేఖలో అరుణాచలం వచ్చాక ఇదివరకు లేని హాయి ఇప్పుడున్నదంటాడు.
” శాంతి,ఆనందం ఇట్లాంటి పదాలకి అర్థం అనుభవిస్తేనే గాని తెలీదు” అంటూ బంకుపల్లి రామజోగారావుకు రాసిన ఉత్తరంలో రాస్తూ సంతోషం,ఉత్సాహం ఏమీ లేకుండా పూర్తిగా అంధకారంలో పడితేనేగాని కాంతి దొరకదంటాడు చలం.
ఎంతో మందికి తన జ్ఞానామృతాన్ని పంచిపెట్టిన చలం ఆధ్యాత్మికతలోను తీవ్రవాదే. ఉన్నతమైన స్వేచ్చకోసం కలలుకని, తపించి,బాధపడి,ఆధ్యాత్మికంలోకి దిగి ఎదిగాక తను నమ్మిన సత్యాన్ని నలుగురికీ లేఖలద్వారా ప్రచారం చేసి అందరూ అసహ్యించుకున్న చలం, ఎవరికి ఏమీ కాని చలం తన జీవితంలోనూ,సాహిత్యం తోనూ అందరికీ తానే అయి ఎంతో గొప్పవాడుగా గోచరిస్తాడు. ఆనాటి సమాజ పరిస్థితుల్లో చలం ఎదుర్కొన్న సమస్యలు,చలం సాధించిన విజయాలు,మానసిక విశ్లేషణ,ఆయన అనుభవాలు ఒకటేమిటి ఎన్నో విషయాలు లేఖల ద్వారా వెల్లడించాడు.చలం మానసిక మార్పుకు అద్దం పడతాయి ఈ లేఖలు.అరమరికలేకుండా చేదు నిజాల్ని అందరికి పంచిపెట్టిన ధీశాలి చలం.
సమకాలికులకు మిత్రులకు రాసిన లేఖల్లో ఈయన ఆలోచనా సరళి,సాహిత్య విమర్శ,సునిశిత పరిశీలన,కష్టసుఖాలు మొదలగునవి తెలుసుకోవచ్చు.ఆవకాయ పచ్చడి మొదలు బుజ్జిగాడి కబుర్లు అన్ని విషయాలు లేఖల్లో చోటు చేసుకున్నాయి.
గురజాడపై చలం అభిప్రాయాన్ని జగ్గారావు తన లేఖల ద్వారా ఇలా తెలియచేశాడు. ” గురజాడ తిరుగుబాటంతా రచనల్లోనే కానీ జీవితంలో ఏమీ కనబడదు.ఆనాడు ఎవరూ చేయని సాహసం చేసి ఇరుకున పెట్టి సంకెళ్ళ నుండి భాషా, భావాల్ని ఒక్క దెబ్బతో ముక్కలు చేశాడంటాడు చలం”.
శరత్ రచనలను గూర్చి చెపుతూ చలం ” శరత్ నాయికా నాయకులకు వెన్నెముక లేదు.వాళ్ళ వొళ్ళంతా మెత్తని హృదయమే. ఎముకలు లేవు విధికి వెన్నవలె లొంగిపోతారు” అని విమర్శించాడు.
శ్రీ శ్రీ కోరింది ఆర్థిక విధానాన్నే గాక సామాజికంగా మార్పు కోరితే చలం హృదయంలో మార్పు కోరాడు అని జగ్గారావుకు రాసిన లేఖలో అంటాడు.శ్రీ శ్రీ” కవిత్వానికి గొప్పతనం పట్టింది.చలం లోకవిరోధిగానే వుండిపోతాడు” అని రాశాడు.
చలం మనసును అర్థం చేసుకోవడానికి లేఖలెంతో పనికివస్తాయి.సాహిత్యంలో చలం లేఖలకు చాలా ప్రాధాన్యముంది.ఆయన జీవన విధానానికి అక్షర సత్యాలైన లేఖలు అందించిన
చలం జీవన పరిణామక్రమం,ఆలోచనా వైవిధ్యం,ఆలోచనావిధానం,
సమకాలీనాధునిక కవులపై దృక్పథం,ఆధ్యాత్మిక భావసంపద ఎన్నో విషయాలు లేఖల్లో నిక్షిప్తాలు.
లేఖలన్నింటిని పరిశీలించినట్లయితే చలం రమణాశ్రమానికి వెళ్లక ముందు,వెళ్లిన తర్వాత రెండు జీవితాలను,రెండు ఆలోచనా రీతుల్లో మార్పులను రెండు కోణాల్లో గమనించవచ్చు.జీవితంలో నన్ను కదిలించే శక్తి ఒక స్త్రీకి తప్ప ఎవ్వరికి లేదన్న చలం తర్వాత జీవితాన్ని,మనసును రమణ భగవాన్ కే అంకితం చేసి సాధన చేయడమే కాక జీవితంలో ఇప్పుడు ఎంతో హాయిని పొందుతున్నానని తాను నమ్మిన నగ్న సత్యాన్ని,సిద్ధాంతాన్ని ఎంతో ఘాటుగా,ఉన్నదున్నట్లు తన మిత్రులకు రాసిన ఉత్తరాలే నిదర్శనం.
సాహిత్యంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించిన గుడిపాటి వెంకటచలం మే నెల 19 వ తేదీ 1894 వ సంవత్సరంలో మద్రాసులో కొమ్మూరి సాంబశివరావు కొమ్మూరి వెంకట సుబ్బమ్మలకు జన్మించాడు.తాత గుడిపాటి వెంకట రామయ్య తనను దత్తత తీసుకున్నందుకు గాను ఇంటిపేరు గుడిపాటిగా మారింది.చిన్నప్పటి నుండే అభ్యుదయ భావాలు కలిగి స్త్రీలకు స్వేచ్ఛ ఉండాలని ఆశించి స్త్రీ వాదిగా ఎన్నో రచనలు చేసి తెలుగు సాహిత్యంలో తనదంటూ ప్రత్యేక ముద్రను వేసుకున్న చలం మే నెల 4 వ తేదీ 1979వ సంవత్సరం అరుణాచలంలో కన్నుమూశాడు.
చిన్నప్పుడే తండ్రి తన తల్లిని వేధించే తీరును చూసి చలించిన బాల చలం హృదయం మీద తీవ్ర ముద్రపడి స్త్రీ ఔన్నత్యం,స్త్రీ స్వాతంత్య్రం కోసం రచనలు చేసి స్త్రీ పక్షపాతిగా పేరు పొంది జీవితంలో ఎన్నో కష్టనష్టాలను అనుభవించి తాను నమ్మిన సిద్ధాంతం కోసం పరితపించిన ఆదర్శవంతుడు చలం తెలుగు సాహిత్యంలో ఉత్తమోత్తముడు,ఉన్నత మహాకవి.

