మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
పుస్త‌క స‌మీక్ష‌

బి.సి.వాద సాహిత్య స్తబ్దతను బద్దలుకొట్టిన గ్రంథం

by Laxminarayana August 25, 2021
written by Laxminarayana

సాహిత్యం యొక్క ప్రధాన భూమిక సమాజ‌ హితాన్ని కాంక్షించడం. రాయబడే ప్రతీ విషయం సాహిత్యం లో భాగం అవుతుందా అనే ప్రశ్నకు సమాజ శ్రేయస్సును కోరుతూ, సమాజాన్ని ప్రభావితం చేయగలిగినదైతే అది సాహిత్యంగా పరిగణించడం ఏ మాత్రం తప్పు కాదు. సాహిత్యం యొక్క పరిధిని, సాహిత్యంలోని రీతులను పనికట్టుకొని హాద్దులు నిర్ణయించడం సాధ్యం కాని పని. ఒకనాడు మౌఖిక సాహిత్యం ఆ తర్వాతి కాలంలో 11వ శతాబ్దం నాటి నన్నయ  నుండి నేటి ఆధునిక కవుల దాకా, నాటి వేదాలు, పురాణాలు, ఇతిహాసాల నుండి నేటి నానీలు, హైకూలవంటి ప్రక్రియలదాకా దేనికీ కొలమానాలు రూపొందించలేం. కాబట్టే

సాహిత్యం యొక్క పరిధి విస్తృతమైంది. సామాజిక స్పృహతో పాటు, వ్యక్తిని సంకుచితత్వం నుండి విశాల భావాలోచన వికాసం వైపు పయనించేలా చేయగలిగిన శక్తి సాహిత్యానిది.

తెలుగు సాహితీ ప్రపంచాన ఎందరో గొప్ప కవుల ఉదయాస్తమానాలు జరిగినా వారు నాటిన ఆలోచనాంకురాలు సమాజాన్ని కాలానుగుణంగా ప్రభావితం చేస్తూ వున్నాయి. కొన్నిసార్లు ఆ ప్రభావం విప్లవాలకు దారితీయొచ్చు కాని అది విప్లవాత్మక వేగంతో జరుగుతుందా అనేది ఎవ్వరం నిర్ణయించలేం. తెలుగు సాహిత్యంలో సాహితీ కలాలు ఎన్నో వాదనలను, ఎన్నెన్నో వేదనలను కాగితపు కాన్వాస్ పై పుటలు, పుటలుగా చిత్రించాయి.  కాల, స్థల, పాలనా పరిస్థితులకు అనుగుణంగా  పేదల, పీడితుల కష్టాల, కన్నీటి కథలను ఎందరో కవులు సిరాచుక్కలతో వ్యవస్థపై కుమ్మరించారు. సాహితీ కలానికుండే శక్తి ప్రశాంతంగా కనిపించే అగ్ని పర్వతం లాంటిది. ర

చనాభిరుచి అనేది వ్యక్తి, వ్యక్తిని బట్టి మారుతుంది. అది పూర్తిగా స్వనిర్ణయ సాధికారతను కల్గి వుంటుంది. ఒకనాడు శిష్ట కులాలకు మాత్రమే అనే చందాన సాగేది పాండిత్య, రచనా ప్రస్థానం కాని నేడు  అన్ని వర్గాలకు వ్యాపించడం శుభపరిణామం. దాని వల్ల జరిగిన లాభం ఏమిటంటే? ఇతరుల భాదను చూస్తూ రాస్తున్న వ్యక్తి కంటే అనుభవించిన వాడు చేసే వ్యక్తీకరణ మరింత సహజంగా, ప్రభావవంతంగా వుంటుంది.  కుటుంబ ప్రాతిపాదికన వ్యక్తుల సమూహం చేత భాషా, ప్రాంత, కుల, మత వైరుధ్యాలచే నిర్మితమయ్యే సంక్లిష్ట వ్యవస్థ సమాజం. సాహిత్యమెప్పుడూ సాధారణ ప్రజల పక్షాన నిలిచి వారి నిత్యజీవితంలో నిక్షిప్తమై వున్న ఘోషను, గోసను వినిపించే స్వరం అవుతుంది. ఈ క్రమంలో దళిత వాదం, స్త్రీ వాదం, మైనార్టీ వాదం, బహుజనవాదం మొదలైన సాహితీ వాదాలు ఉనికిలోకి వచ్చాయి.

ఏ వాదమైనా వ్యక్తి, వ్యవస్థ యొక్క అస్థిత్వాన్ని, జీవికను ఉనికిలో ఉంచే లక్ష్యంతో కొనసాగుతూ సమాజపు విపరీత పోకడలను నిరసించడంలో కీలక పాత్ర వహిస్తుంది. ప్రపంచీకరణ, పారిశ్రామికీకరణ మూలంగా మన సమాజాల్లో ఏర్పడిన సంఘర్షణలు, సంపీడిత పరిస్థితులను బహిష్కృతం చేసే స్వభావాన్ని కల్గి వుంటాయి. అక్కడి నుండి ఉద్భవించినవే దళిత, స్త్రీ, మైనార్టీ, బహుజన వాదాలు. ఈ క్రమంలో బిసీ వాదం అనే ప్రత్యేక వాదం ఉందా లేదా అనే ప్రశ్న తలెత్తక తప్పదు. ఈ ప్రశ్నకు సమాధానంగా నిలిచే దానికి సంబంధించిన అంశాలను చర్చించే వివిధ బీసీ వాద గ్రంథాల క్రమంలో నిలిచిన మరొక గ్రంథం “తెలంగాణ బి.సి. వాద సాహిత్యం”. ఈ పుస్తక రచయిత అట్టెం దత్తయ్య. అట్టెం దత్తయ్య నేటి కామారెడ్డి జిల్లాలోని షెట్పల్లి గ్రామ వాస్తవ్యులు. ఈయన ఇటీవలే “మహభారతంలో సంవాదాలు- సమగ్ర పరిశీలన” అనే అంశంపై పరిశోధనను పూర్తి గావించారు. ఇంతకుముందు ఈ రచయిత ఆధ్వర్యంలో ‘కళ్ళం’(సాహిత్య వ్యాస రాశి) 2018 అనే గ్రంథం వెలువడింది.

‘ఆకాశంలో సగం’ అనే నినాదంతో పురుషుల్లో సగభాగంగా వున్న స్త్రీలు వారి పట్ల కొనసాగుతున్న వివక్షకు వ్యతిరేకంగా స్త్రీ వాదం అనే పేరుతో పోరాడుతున్నారు. సమాజంలో సగ భాగంగా వున్న బిసీలు అనేక ఉద్యమాలలో క్రియాశీలంగా వుంటున్నప్పటికీ అటు రాజ్యాధికారమూ, ఇటు అస్తిత్వమూ లేని పరిస్థితుల్లోకి నెట్టి వేయబడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో బిసిలు అస్తిత్వ, రాజ్యాధికారం వైపుగా ఆలోచించడం అవసరం. దానికై సాహిత్య, సాంస్కృతిక పునరుజ్జీవనం తథ్యంగా రావాలి. బిసీలకు చెందిన సాహిత్య, సాంస్కృతిక అంశాలు బహుజన సాహిత్యం ముసుగులో అసౌష్ఠవ రీతిలో విసిరివేసినట్లుగా వున్న సందర్భంలో వాటినంతటినీ ఒక చోటకు చేర్చడం అనివార్యమైంది. ఈ అనివార్యతను తొలగించి బిసీ సాహిత్యం యొక్క స్థాయి, వ్యాప్తిలను తెలిపిన నిర్మాణాత్మక రచన ఈ “తెలంగాణ బిసీ వాద సాహిత్యం” అంటూ ఈ పుస్తకానికి ‘బహుజనుల వీలునామా’ పేరుతో పీఠిక రాశారు ఎస్.రఘు గారు.

ప్రస్తుత పరిస్థితుల్లో వైశ్వీకరణం(గ్లోబలైజేషన్), వైశ్యీకరణం( వాణిజ్యీకరణం) మూలంగా చేతి వృత్తులు, కుల వృత్తులతో పాటు అన్ని వర్గాలు అస్తిత్వాన్ని కోల్పోయి వృత్తి, విషయ నైపుణ్యాలకు విలువ లేకుండా పోయింది. వాటి పర్యవసానంగా సంపద కేంద్రీకరణ, అధికార కేంద్రీకరణ పెరిగిపోయి అన్ని వర్గాలు ఆర్థికంగా, సామాజికంగా వెనుకబాటుకు గురవుతున్నాయి. వారి సామాజిక, ఆర్థిక స్థితిగతులను ఏకరువు పెట్టే క్రమంలో కొందరు స్వానుభవం చేత, మరికొందరు పరిశీలన అనుభవం చేత సాహిత్యాన్ని సృష్టించారు. ఆ సాహిత్యాన్ని సంకలనం చేస్తూ విమర్శించిన పుస్తకం ఈ ” తెలంగాణ బిసీ వాద సాహిత్యం” అంటూ పుస్తక పీఠిక రాశారు సాగి కమలాకర శర్మ గారు.

“బహుజనులు దళితులు ఒక్కరే, ఇవి రెండు సమానార్థక పదాలు. ఈ విషయం గుర్తించకుండా ఎస్సీలను దళితులుగా, బిసీ లను బహుజనులుగా పేర్కొని వారి మధ్య దూరం పెంచకూడదు” (తెలంగాణ బిసీ వాద సాహిత్యం-పేజీ  24) అంటూ కాలువ మల్లయ్య స్పష్టం చేశారు. లక్ష్మీనర్సయ్య ‘చిక్కనవుతున్న పాట’ లో ఎస్సీ, ఎస్టీ, బిసీ కవులందరూ తమ స్వానుభావాల్ని కూర్చుతూ రాసిన కవిత్వమే దళిత కవిత్వం అన్నాడు. పరాయి పల్లవి వ్యాసంలో సతీష్ చందర్ దళిత వాడలు అగ్రహారనికి ఎంతదూరమో బిసీ పేటలకూ అంతే దూరం. హరిజనోద్దరణ‌ కవిత్వం పేరుతో పులుపు చావని బిసీ కవులు మళ్ళీ రాయనవసరం లేదంటూ ఘాటుగా స్పందించాడు. బిసీ సాహిత్యకారులు తమ కోణాల్లో సాహితీ సృజన చేస్తున్నప్పటికీ వారి సాహిత్యం బిసీ అస్తిత్వవాద సాహిత్యంగా ఎందుకు గుర్తించబడలేదు అనే ప్రశ్నను బాణాల శ్రీనివాస్ లేవనెత్తాడు. ఇదే విషయంపై ఎస్.రఘు “కొన్ని గాయాలు మానవు కాని మానినట్టుగా వుంటాయి. అస్తిత్వ ఉద్యమాలు కూడా గాయాల్లాంటివే కొన్నిసార్లు అవి ఉవ్వెత్తున ఎగసి పడలేక పోవచ్చు, కాని అంతర్గత స్రావాలు జరుగుతూనే వుంటాయి అని చెప్తూనే బిసీల కన్నా పై తరగతి వారి చేతుల్లో మూల్గిన సాహిత్యం ఇప్పుడిప్పుడే వారికి సాన్నిహిత్యంగా ముందుకు సాగుతుండడం వల్ల బిసీలు తమ అస్తిత్వవాదాన్ని బలపర్చడానికి కొంత తెగింపును ప్రదర్శించడం లేదు” అనే కారణాన్ని తెలియపరిచాడు. ఇలాంటి సమయంలో 2001లో పూర్తి బిసీ వాద కవిత్వంగా జూలూరి గౌరీశంకర్ సంపాదకత్వంలో ‘వెంటాడే కలాలు- వెనుకబడిన కులాలు’ అనే సంకలన గ్రంథం వెలువడింది. ఆయన అగ్రకుల అధిపత్య, భూస్వామ్య వర్గాల అణచివేతను ఎదిరించడానికి దళిత, బిసీ, మైనార్టీలందరూ కలిసికట్టుగా ఉద్యమించాలని కోరుకున్నారు. కాని ఈ విషయాన్ని దళితులు మరో కోణంలో అర్థం చేసుకున్నారంటూ ‘కొత్త తొవ్వలు తీస్తున్న బిసీ కవిత్వం’ అనే వ్యాసంలో పగడాల నాగేందర్ తెలుగు సాహిత్యంలో దళితవాద కవిత్వం ఒక పాయలాగ మొదలై 1995-2000 మధ్య పూర్తి పాయలాగా చీలిపోయింది. దానికి కారణం “అనాది కాలం నుండి అగ్రకులాల చేతిలో అవమానాలకు గురికావడం వల్ల వారికి వారే అన్నట్లుగా భావించడం, దాంతోపాటు బిసీలను మీరు మాతో సమానమైన పీడితులు కాదు అంటూ వారిలో నిక్షిప్తమైన ఎత్తిపొడుపు భావన” అంటూ వివరించారు. శతాబ్దాలుగా సమాజంలో, చరిత్రలో కీలక పాత్ర పోషిస్తున్న సమాజ నిర్మాతలు, సంపద సృష్టికర్తలు బిసీలు అంటూ బి.ఎస్. రాములు ఒక వ్యాసంలో తెలియపర్చారు. దళిత సాహిత్యం, మాదిగ సాహిత్యం, మైనార్టీ సాహిత్యం, గిరిజన సాహిత్యం, క్రైస్తవ సాహిత్యం అంటూ అన్నింటికీ ఒక అస్తిత్వం వుంది. కాని బిసీ సాహిత్యం మాత్రం దళిత, బహుజన సాహిత్యంలో అంతర్భాగమైన నేపథ్యంలో బిసీ సాహిత్యం ‘సబ్బండ సాహిత్యం’ గా బలపడాలి అంటూ కాలువ మల్లయ్య తన వాదనను తెలియపర్చారు. ఇలా పలువురు రచయితల నిర్వచన, అభిప్రాయాలతో ఈ పుస్తకంలో  బి.సి.వాదం ఎందుకు ప్రత్యేకంగా ప్రారంభమైంది, ఇది కావడానికి ప్రేరణలు, కారణాలు ఏమిటి, బి.సి.ల గురించి వచ్చిన మొదటి గ్రంథాలు ఏవి, వెలువరించిన గ్రంథాల మీద వచ్చిన కుట్రపూరిత విమర్శ, విస్మరణ, అట్లాగే బి.సి.పదాన్ని మరో పదంగా మార్చుకోవాలనే సాహితీకారులు సమావేశాల ద్వార నిర్ణయించిన పదాలు,  బి.సి.వాదం గురించి రాస్తున్న వారిలో కనిపిస్తున్న రెండు ధోరణులు వంటి విషయాలను సోపపత్తికంగా “తెలంగాణ బిసి వాద సాహిత్యం- పరిచయం”  అనే విభాగంలో చర్చించారు.

ఈ పుస్తకంలోని ప్రధాన శీర్షికల్లో మొదటి అంశం “తెలంగాణ పద్య కవిత్వం – బిసీ వాదం”. పురాణం, ప్రబంధం, శతకం, ఉదాహరణం ప్రక్రియ ఏదైనా విషయాన్ని ఉద్ఘాటించడానికి పద్యం వారధిగా నిలిచింది. తెలంగాణ సాహిత్యంలో మొదటిసారిగా బిసి కులాలకు తన బసవపురాణంలో పాల్కురికి సోమనాథుడు స్థానమివ్వడంతో ప్రారంభం అయింది. పాత జ్ఞాపకాల వెలికితీత, బాధలు, వివక్షల ఇతివృత్తంతో,  వృత్తి ఆధారంగా కులం ఏర్పడిందా? కులం ఆధారంగా వృత్తి ఏర్పడిందా? అనే ప్రశ్న వస్తుంది. కొన్నిసార్లు అవసరం నిమిత్తం తప్పనిసరి పరిస్థితుల్లో ఇతర కుల వృత్తులు చేపట్టిన వారున్నారు. అంత మాత్రాన వారి కులం మారుతుందా? అనేది ప్రశ్న. ఇక వృత్తి పనిని నమ్ముకొని కాలం వెళ్ళదీస్తున్న వారికి, సమాజంలో కనీస ఆదరణ లేక వారి జీవన ఉపాధి పరిస్థితులు ఏవిధంగా మారాయి అనే తాత్వికతతో వివిధ రచయితలు రాసిన పద్యాలను ఈ పుస్తకంలో పొందుపరిచారు. వాటిలో వృషాధిప శతకంలో పాల్కురికి ” గొల్ల స్త్రీ లు వీధుల్లో చల్లను అమ్మేవారని” రాసిన విషయాన్ని, అలాగే బసవ పురాణంలో ” వీధిలో చల్లనమ్ముచు ఒక గొల్లకాంత జారి పడబోయి బసవరో అని కేక పెట్టగా బసవన కాపాడినాడు” లాంటి విషయాలు కలవు. వీటి ద్వారా బిసి కులాలకు చెందిన గొల్లల ప్రస్తావన నాటి కాలంలోనే రాయబడింది అనే విషయం ధ్రువీకరించాడు రచయిత దత్తయ్య. గొల్లడా! అనే శీర్షికతో కేశపంతుల వేంకట నర్సింహశాస్తి రాసిన ఐదు పద్యాలు చేర్చాడు. దోరవేటి ఒక పద్యంలో ఉప్పరుల గూర్చి ‘కట్టడముల ధాత! కరము మోడ్తు’ అని పల్కిన సందర్భాన్ని తెలియజేశాడు. దానితోపాటు దోరవేటి అన్ని కులాలను గురించి పద్యాల్లో ప్రస్తావించిన విషయం తెలియ పర్చాడు. గంగుల శాయి రెడ్డి ‘కాపుబిడ్డ'(1937) లో మున్నూరు కాపులు మొదటి రోజుల్లో పడ్డ కష్టాలను తెలుపుతూ రాసిన పద్యం అయిన ” కుడిమూపుపై కాడి యెడమ భుజంబున,,,,,,,,,,,” ను గూర్చి రాశారు. “తెలంగాణ పద్య కవిత్వం- బిసీ వాదం” శీర్షికలో 14 కులాల ప్రస్తావనతో వివిధ రచయితలు వారి రచనలలోని పద్య పంక్తులను సహ వాటి నేపథ్యంతో కూడిన విషయ వివరణ తెలియజేశారు.

ఈ పుస్తకంలో మరొక శీర్షిక “తెలంగాణ పాట- బిసి వాదం”. ఆట- పాట, పని- పాట, ఆడుతు పాడుతు పనిచేస్తుంటే ఇలాంటి మాటలను బట్టి చూస్తే మనిషి జీవితంలో పాటకున్న ప్రాముఖ్యత ఏపాటిదో అర్థం అవుతుంది. పండితులకూ, పామరులకు అందరికీ ఆమోదయోగ్యమైనది, ఆదరపూరకమైనది పాట. “జర్మన్ భాషా సుభాషితం ప్రకారం ప్రతి వస్తువులోనూ ఒక  పాట నిద్రిస్తూ వుంటుంది, ప్రతి వస్తువూ ఆ పాటను స్వప్నిస్తూ వుంటుంది(అదే, పుట :73)” అన్నట్టుగా ఈ శీర్షికలో పాటల ద్వారా బిసీ కులాలు, వారి జీవన విధానం, సంఘర్షణలు, వారి పాటలో వృత్తికి సంబంధించిన పంక్తులు మొదలైన అంశాల పరిశీలన కలదు. అలాంటి కొన్ని ఉదాహరణలు: గూడ అంజయ్య చేతివృత్తుల వారి కష్టాలను తెలుపుతూ రాసిన పాట ‘బావయ్యో…బావయ్యో’, గోరటి వెంకన్న సబ్బండ వర్ణాల కష్టాలను తెలిపిన పాట ‘పల్లే కన్నీరు’ ఇందులో కుమ్మరి, కమ్మరి, మంగలి, కంసాలి, సాకలి, గౌడ, కురుమ కులాల బతుకు చిత్రం ఎలా ఛిద్రం అవుతుందో తెలియపరిచాడు. బిసీ కులాలను గూర్చి ఒకే పాటలో పలికిన మరో రచయిత జయరాజ్ పంక్తులు: ‘గడ్డాలు మీసాలు గీసి/గుడ్డల్ని శుభ్రంగ ఉతికి/ వండె గుండిల్ని చేసి/ వంటా వార్పుల నేర్పి/మనిషిని మనిషిగ చేసి ,,,,,,,,,,బహుజనులే మన ప్రేమ పావురాలు/బహుజనులే మన శాంతి కపోతాలు’ అంటూ బహుజన కులాల ప్రాముఖ్యాన్ని తెలిపాడు. అదే విధంగా కందికొండ రాసిన యూట్యూబ్ పాటలో: ‘చలో చలో చలో చలో బిసి/ నీవే నీ తలరాతను రాసుకోలేసి/60శాతం ఉండి అడుక్కునుడు ఏంది’ అంటూ బిసిల్లో ఐక్యత నింపేలా వారు రాజ్యాధికారం వైపు అడుగులు కల్పించాలంటూ స్ఫూర్తిని నింపే మరో పాటను నొక్కిచెప్పాడు. ఈ శీర్షికలో వివిధ రచయితలు పాటల రూపంలో బిసి కులాలకు సంబంధించి ప్రత్యేకంగా స్పృశిస్తూ రాసిన పాటలను, బహుజన, సబ్బండ వర్ణాల నేపథ్యంగా రాయబడిన పాటల ప్రస్తావనను గూర్చి అట్టెం దత్తయ్య విశ్లేషించారు. ఈ విభాగంలో సూచించిన ప్రధానమైన అంశం బి.సి.ల ఆశ్రితగాయకుల మౌఖిక సాహిత్యం అంతా గ్రంథస్థం అయిననాడు బి.సి.ల నిజమైన అస్తిత్వం తెలుసుకునే అవకాశం ఉంది అనే అంశం తెలిపాడు.

“తెలంగాణ వచన కవిత్వం- బిసీ వాదం” అనేది మరొక శీర్షిక. నిజానికి బిసీ వాద సాహిత్యం ఎక్కువ మొత్తంలో వచన కవిత్వంలో వచ్చిందని చెప్పొచ్చు. దానికి కారణం పీ.వీ.నరసింహ రావు గారి నూతన ఆర్థిక సంస్కరణల వల్ల జరిగిన పారిశ్రామికీకరణ, ప్రపంచీకరణల ఫలితంగా చేతి, కులవృత్తుల ప్రాభవం తగ్గిపోయింది.  బిసీల జీవన స్థితిగతులు దైన్యంలోకి నెట్టబడ్డాయి. వాటిని ఏకరువు పెట్టేందుకు 2000 సంవత్సరం తర్వాత చాలా మంది రచయితలు తమ కలాల గలాలను వచన రూపంలోనే ఎక్కువ  మొత్తంలో వినిపించారు. అలాంటి వచన కవితా సంకలనాలలో కొన్ని ‘ బహువచనం’, ‘మేమే‘, ‘మొగి‘,  ‘వెంటాడే కలాలు- వెనుకబడిన కులాలు’, ‘ఇరుసు’, ‘సమూహం’, ‘బి.సి.కవితా సంకలనం’ వంటి వచన కవితా సంపుటాలలో వారి అస్తిత్వాన్ని, జీవన సంఘర్షణలను, వృత్తుల విలువ తగ్గడం వల్ల ఎదుర్కొంటున్న కష్టాలను ప్రతిబింబించే రీతిలో వచ్చిన వచన కవితా సంకలనాలను పూర్తిస్థాయిలో విశ్లేషించే ప్రయత్నం కనిపిస్తుంది. వీటితో పాటు కొన్ని కులాల మీద వచ్చిన దీర్ఘ కవిత అయిన‘బువ్వకుండ’ వంటి వాటిని విశ్లేషిండం వల్ల రచయిత దత్తయ్య పాఠకులకు బిసీ సాహిత్యంలో రూపొందిన వచన కవిత్వ సాంద్రతను తెలిపే ప్రయత్నం చేశాడు. ఉదాహరణకు యువ రచయిత, పరిశోధకుడైన వడ్కాపురం క్రిష్ణ కుమ్మరి కులం వారి వ్యధలను తెలుపుతూ రాసిన ‘మట్టి చిత్రం’ కవితలో కొన్ని పంక్తులు:

“జీవితమంతా మట్టిమయం

అంతెందుకు!?

అసలు మట్టి అంటేనే జీవితం

జీవితమే మట్టి కదా

అదే మట్టికుండ నాడు

రాగి, ఇత్తడి,వెండి

ఆఖరుకు ఇనుమును కూడా తట్టుకుని నిలబడింది

నేడు ప్లాస్టిక్

చెరలో బందీగా కనుమరగవగా

ఉత్పత్తి కులం నేడు ఉత్తి చేతులతో నిలబడిపోతున్నది…”

ఇలా వచన కవిత్వంలో బిసీలకు సంబంధించిన వివిధ కులాలపై వచ్చిన కవిత సంపుటాలను, అందులోని వాదాన్ని, వర్ణనలను పాఠకులకు పరిచయం చేశారు.

తెలంగాణ కథ- బి.సి వాదం, తెలంగాణ నవల బి.సి వాదం అనే పేర్లతో మరో రెండు శీర్షికలు కలవు. ఇక కథ, నవలల్లో బిసిల ప్రస్తావన అస్తిత్వ ఉద్యమానికి ముందు నుంచే వారి కులాలకు చెందిన, వారి జీవనశైలికి సంబంధించిన అంశాలతో కథలు, నవలలు కలవు. సమాజంలో ఉత్పత్తి, సేవా, చేతివృత్తుల పాత్ర గణనీయమైనది అవ్వడం మూలంగా వారి జీవన ముఖచిత్రాల గూర్చి ప్రత్యేకంగా  బిసీ వాదం పేరుతో కాకుండా ఒక కథ, నవలకు కథా వస్తువును ఎంచుకొనే క్రమంలో సహజంగానే కథా సంవిధానాల్లో వారి జీవిత చిత్రాలు అల్లబడినాయి. కథ, నవల ఎప్పుడూ ప్రజల పక్షం వహిస్తూ అన్ని వర్గాల వారి శ్రామిక, పీడిత, సమస్యాత్మక అంశాలను, భూస్వామ్య, పెట్టుబడిదారీ, పారిశ్రామికీకరణల పర్యవసానంగా ఉత్పన్నమైన సమస్యలను, వివాదాలను చిత్రీకరించే విధంగా వుంటాయి. దానికి తోడు సమకాలీన, చారిత్రక కల్పిత అంశాలచేత మనిషిని ఒక కొత్త ప్రపంచంలో లీనమయ్యేలా చేయగల్గి, సగటు మనిషిని వాటిలో ప్రతిబింబించే స్వభావాన్ని  కల్గి వుంటాయి. సమాజంలో, కుటుంబంలో అంతర్గతంగా ఇనుమడింపబడిన విభిన్నత కల్గిన కథావస్తువుతో సమాజాన్ని పెద్ద కాన్వాస్ లో దర్శించడానికి కథలు, నవలలు తోడ్పడ్తాయి.  బహుజనులను ఆధారంగా చేసుకొని వచ్చిన కథలు, నవలలకు సంబంధించిన వివరాలను రచయిత ఈ “తెలంగాణ బిసీ వాద సాహిత్యం” పుస్తకంలో ఎక్కువ మొత్తంలో నమోదు చేశారు. అందులో కొన్ని: చేనేత జీవిత సాధకబాధకాలను చెప్పే ‘పడుగు పేకలు’, గొల్ల- కురుమల కథల సంకలనం ‘వేపకాయంత నిజం’, నేరెల్ల శ్రీనివాస్ గౌడ్  ‘ మా బతుకులు’, తుమ్మల రామకృష్ణ సంపాదకత్వంలో నాయీ బ్రాహ్మణుల జీవితాలను చిత్రించిన ‘అడపం’, ఉప్పల నరసింహం ‘సబ్బండ వర్ణాల సారస్వతం’ మొదలైన కథల సంపుటాలు ప్రధానంగా కనిపిస్తాయి. ఇక నవలల విషయానికి వస్తే గుడెళ్ళగుమ్మి మారెమ్మ, పట్నమొచ్చిన పల్లె- భూపాల్, సాంబయ్య సదువు, చీకట్లో చిరుదీపం, భూమిపుత్రుడు- కాలువ మల్లయ్య, సంకెళ్లు తెగాయి- ముదిగంటి సుజాతా రెడ్డి, ఊరువాడబ్రతుకు- దేవులపల్లి కృష్ణమూర్తి, పరంపర- శిరంశెట్టి కాంతారావు, సుషుప్తి- మాదిరెడ్డి సులోచన, బతుకు తాడు, కల్తీ బతుకులు- నేరెళ్ళ శ్రీనివాస్ గౌడ్ మొదలైన నవలలు ఇవన్నీ కూడా కేవలం మచ్చుకు కొన్ని మాత్రమే. దత్తయ్య ఈ పుస్తకంలో బహుజన, సబ్బండ కులాలపై వివిధ కవులు రాసిన కథలు, నవలలను చాలా మొత్తంలో తెలియపరిచారు. ముఖ్యంగా కథలను గురించి రాస్తూ బి.సి.ల జీవితాలకు సంబంధించి కథకులు విస్తృతంగా రాసినప్పటికి వాటిలో కులాల ప్రస్తావనలు మరుమరుగుగా చేయడం వెనుకున్న భయమేమిటో సందిగ్ధత ను రేకెత్తించే విషయం అని కథా రచయితలను ప్రశ్నిస్తాడు.

ఇక ఈ శీర్షికల తర్వాత చివరగా ‘తెలంగాణ బి.సి.వాద సాహిత్య విమర్శ’ పేరుతో ఒక శీర్షిక కలదు. విమర్శ అనగా సమీక్షించడం, పర్యాలోచించడం అనే అర్థాలు కలవు. బహుశా వెనుకబడిన వర్గాలపై వచ్చిన సాహిత్యం గురించి విమర్శ చేయడం పై స్థాయి వర్గాల వారికి ఆసక్తి వుండకపోవచ్చు. అందుచేత బిసీల, బహుజనుల సాహిత్యం పెద్దగా విమర్శకు నోచుకోలేదు. కవిత్వం, నవల, నాటకం, కథ ఇలా ప్రక్రియ ఏదైనా రచయిత దానిని ఏ పరిస్థితుల్లో రాశాడు, ఏ కోణంలో రాశాడు, ఏ ఆశయం చేత రాశాడు, తదుపరి దాని ప్రభావం ఎలా వుండబోతుంది అనే విషయాలన్నింటికీ విమర్శ దారి చూపుతుంది. బిసి సాహిత్య విమర్శలో ప్రధానంగా చెప్పబడే నాలుగు పుస్తకాలను తెలిపారు. అవి ‘బి.సి కథలు ఒక విశ్లేషణ 2000-2010’- కథా సాహిత్యం పై బి.ఎస్.రాములు 2011 లో వెలువరించారు. ‘కవిత్వంలో బిసి సూర్యోదయం’ 2015 లో జూలూరి గౌరీశంకర్, ఈయన ఆధ్వర్యంలోనే బిసీ వాద కవిత్వం పై ‘ఒక కవిత ఇరవై కోణాలు’. మరొక విమర్శ గ్రంథం ‘ప్రవాహం’ ఇది బిసి అస్తిత్వవాద యువ కవిత్వం పై వెలువడిన సంకలనం దీనికి చింత ప్రవీణ్ సంపాదకత్వం వహించారు.  ఇలాంటి ఎన్నో విషయాలను ప్రస్తావించిన దత్తయ్య ’వినతి‘ అనే శీర్షకలో ఇదొక చిన్న ప్రయంత్నమని వినయంగా చెప్పుకుంటాడు. ఇంకా కొన్ని కులాల గురించి, కొన్ని ప్రక్రియలలో వచ్చిన బి.సి.ల జీవితాలను గురించి ముందు ముందు రాసే ప్రయత్నం చేస్తానని చెప్పుకోవడం సమగ్రతకోసం ప్రామిస్ చేసినట్లుగా కనిపిస్తుంది.

అట్టెం దత్తయ్య రూపొందించిన “ఈ తెలంగాణ బిసీ వాద సాహిత్యం” పుస్తకంలో పద్యం,పాట, వచన, కథ, నవలా ప్రక్రియల్లో బిసిలకు సంబంధించి కవులు వివిధ కోణాల్లో బహుజన, బిసీ కులాలను గూర్చి వ్యక్తం చేసిన అంశాలను విస్తృత పరిశీలనతో సంక్షిప్తంగా పొందుపరిచారు.  దత్తయ్య చేసిన ఈ ప్రయత్నం మాటల్లో, వాక్యాల్లో మాట్లాడినంత సులభం కాదనే విషయం పుస్తకాన్ని చదివే  ప్రతీ పాఠకుడికి అర్థం అవుతుంది. ఈ పుస్తకం బిసీలు, వారి అస్తిత్వవాదానికి సంబంధించిన కోణంలోనూ, పరిశోధన చేస్తున్న, చేయబోయే వారికి మార్గదర్శనం చేయడంలో ఎంతో కొంత పాత్ర పోషిస్తుందనడంలో సందేహం లేదు. బిసీ వాదం పై వచ్చిన పుస్తకాల వరుసలో అట్టెం దత్తయ్య పుస్తకం కూడా విలువైనదిగా మారబోతుందనేది సత్యం. ఏదేమైనా అట్టెం దత్తయ్య  సలిపిన ఈ కృషి ఒక చారిత్రక సందర్భాన్ని గుర్తుచేస్తుంది. అదేమిటంటే నాడు తెలంగాణ ప్రాంతంలో సాహితీవేత్తలు, సాహిత్యమే లేదన్న ఆంధ్ర సాహితీ మేధావులకు తెలంగాణ సాహిత్య విస్త్రృతిని, సాహిత్యకారులను పరిచయం చేస్తూ సురవరం వారు రూపొందించిన  ‘ఆంధ్ర కవుల సంచిక’ లాగానే,  నేడు దళిత, మైనార్టీ, బహుజన వాద సాహిత్యాల ముసుగులో బిసీ వాద సాహిత్యం విస్తృతి, కవులు తెరచాటైన  స్థితి ఏర్పడింది. ఇలాంటి స్థితిలో రచయిత దత్తయ్య రాసిన ఈ “తెలంగాణ బిసీ వాద సాహిత్య గ్రంథం” బీసీ వాద సాహిత్యం యొక్క విస్తృతిని, కవులను సాహితీ ప్రపంచానికి తెలియజేసి నాటి  సందర్భాన్ని పునరావృతం చేసిందని చెప్పొచ్చు. ఏదేమైనా బీసీ వాదాన్ని వ్యక్తీకరించే  ప్రయత్నం లో ఈ “తెలంగాణ బిసీ వాద సాహిత్యం” గ్రంథం ఒక అడుగు ముందుకు వేసిందని చెప్పవచ్చు.

తెలంగాణ బి.సి.వాద సాహిత్యం   రచయిత: అట్టెం దత్తయ్య

ప్రచురణ సం: 2021   పుటలు : 259

వెల : 23

ప్రచురణ : ప్రణవం పబ్లికేషన్స్

రచయిత పరిచయం

పేరు                         :         అట్టెం దత్తయ్య

చదువులు               :         బి.ఏ (ఎల్), టి.పిటి, ఎం.ఏ. తెలుగు (ఓ.యు) ఎం.ఏ (జర్నలిజం), ఎం.ఏ(సంస్కృతం)

రచనలు:    1. కళ్ళం (సాహిత్య వ్యాసరాశి) (2018) 2. తెలంగాణ బి.సి.వాద సాహిత్యం (2021)

సంపాదకత్వం:   1. నిత్యాన్వేషణం (సాహిత్య దీర్ఘవ్యాసాల సమాహారం) 2018, 2. శిలాక్షరం (బి.ఎన్.శాస్త్రి సాహిత్యం – సమాలోచనం) 2019

సహాయ సంపాదకత్వం

  1. ఆలోకనం (31 తెలంగాణ జిల్లాల సాహిత్యం – చరిత్ర, సంస్కృతీ సమాలోచనం) 2017, మూసీ ప్రచురణ
  2. శతవాసంతిక (ఉస్మానియా వందేళ్ళ సంబరాల ప్రత్యేక జ్ఞాపిక 1917-2017) 2019 ఓ.యు. తెలుగుశాఖ ప్రచురణ.
  3. తెలంగాణ సాహిత్యం – సమాలోచన (పరిశోధక విద్యార్థుల సాహిత్య వ్యాసాలు) 2019 ఓ.యు. తెలుగుశాఖ ప్రచురణ.

ఇంకా

జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో 25కు పైగా పత్రసమర్పణలు, వివిధ ప్రతికలలో 70కి పైగా వ్యాసాల ప్రచురణ.

చిరునామా : ఇం.నెం. 3-9/3, గ్రా.శట్పల్లి, మం.లింగంపేట్, జిల్లా, కామారెడ్డి, తెలంగాణ

ఫోన్ : 9494715445

 

 

 

August 25, 2021 0 comment
2 FacebookTwitterPinterestEmail
పుస్త‌క స‌మీక్ష‌

స్త్రీ అస్తిత్వపు సంవేదన ‘నీల’ సమీక్ష

by vanaparti padma August 25, 2021
written by vanaparti padma

ఆనాటి కాలంలోనే చలం తన రచనల్లో స్త్రీకి స్వేచ్ఛ కావాలని కోరుకున్నాడు. ఆమెకు మనసుంది, దాని స్పందన ఉంటుంది. ఆ స్పందనకు స్వేచ్ఛ కావాలని ఆమె ఆలోచనకు రూపం ఉండాలని స్త్రీని గౌరవిస్తూ ఆమెకు మాట్లాడే హక్కుతోపాటు జీవన స్వేచ్ఛ కావాలని చాలా సందర్భాల్లో చెప్పారు.

నేటి కాలంలో స్త్రీ చదువుకుంది. ఎన్నోరకాల ఉద్యోగాలు చేస్తూ రాజకీయాల్లోను తన ప్రతిభ చాటుకుంటుంది. కాని మానసికంగా స్వాతంత్రాన్ని కుటుంబపరంగా స్వేచ్ఛను పొందలేక పోతున్నది. ఎ.కె.మల్లీశ్వరిగారు రాసిన ‘నీల’ నవల ద్వారా మహిళ స్వాతంత్రాన్ని మరింత నిశితంగానూ నిర్ధిష్టంగాను తెలుసుకునె అవకాశం లభించింది. స్త్రీ పురుషుల మధ్య సహచర్యం ఆర్థిక రాజకీయ స్వాతంత్రాల వల్ల వచ్చేది కాదు. కేవలం మానసిక స్వాతంత్ర్యం వల్ల మాత్రమే సాధ్యం అంటారు స్త్రీ వాద రచయితలు. మన చుట్టూ ఉన్న పదిమంది మనకు అండగా ఉంటారనుకోవడం మానవ సహజం. అయితే ఒకరు లేకపోతే జీవితమే శూన్యం అనుకోవడం బేలతనం అవుతుంది. అలాంటి బేలతనం నుండి తన జీవన ప్రయాణం నుండి తెలుసుకున్న పాఠాలే నేడు సామాజిక ఉద్యమాలు రాజకీయ సమానత్వపు పోరాటాలను తెలుసుకున్నపాఠాలే నేడు సామాజిక ఉద్యమాలు రాజకీయ సమానత్వపు పోరాటాలను తెలుసుకున్న ఆమె జీన పోరాటము అందులోని సామాజిక అసమానతుల, స్త్రీ పురుషుల సమానత్వం అంటూనే స్త్రీని అణచివేస్తున్న పరిస్థితులకు నిలువెత్తు రూపం ‘నీలం’ నవల సముత్ర చెలియలి కట్ట దాని అలలే దాన్ని నియంత్రించినట్లుగా స్వేచ్ఛ లేనపుడు పెళ్ళి, ప్రేమ, సహజీవనం ఒంటరి జీవితం బరువే అంటారు. అలాంటి సందర్భాల్లో వ్యక్తికీ – వ్యక్తికీ స్వేచ్ఛ నిర్వచనాలు మారుతాయి. ఒకరికి స్వేచ్ఛ అనుకున్నది. మరొకరికి విశృంఖలత్వం అనిపించవచ్చు. ఇవి అన్ని కూడా వ్యక్తులు మనస్తత్వాలు, సంస్కారాలను వాటి పరిమితిల్లో నుంచి అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అలాంటి ఓ మహిళ జీవితంలో జరిగిన సంఘటనలే ‘నీల’ నవలగా చెప్పవచ్చును.

 

నీల బాల్యం నుండి కష్టాల కొలిమిలో రాటు తేలింది. తన తల్లిని చంపిన తండ్రి జైలుకెళ్ళగా అనాథగా జీవనం సాగించింది. మానసిక పరిపక్వత చెందని వయస్సులోనే పెంచినవాళ్ళు పెళ్ళి చేయగా తనకు ఓ తోడు దొరకదని ఆనందపడింది. ఓ బిడ్డకు తల్లిగా మారింది. అంతలోనే తన భర్తకు మరో స్త్రీతో సంబంధం ఉందని తెలుసుకొని ‘స్వచ్ఛమైన, నిష్కలషమైన ప్రేమకోసం పరితపించింది. ఋతువులు మారుతున్నాయీ కాని నీల జీవితంలో ఏ వర్ణము ఆమెను దరిచేరలేదు. కుటుంబ జీవితంలో హింసను చూసింది తనను హింసిస్తున్న మగవాడి పట్ల ద్వేషాన్ని పెంచుకోలేదు. పైగా అతను పడుతున్న హింస నుంచి విముక్తి కల్గించాలనుకుంది. అంటే తను విముక్తమవ్వాలి అనుకుంది. అందుకే పెళ్ళి పేరున ఏర్పడిన సాహచర్యాన్ని తెంచుకుంది. సహజీవనంలో భద్రత కోరుకుంది. స్వచ్ఛతని, సమానత్వాన్ని కోరుకుంది. స్త్రీ పురుషుల సాహచర్యంలో ప్రేమ, స్వేచ్ఛలతో కూడిన దృఢమైన బంధం కోసం వెతికింది. అతి హింసాత్మక నేపథ్యం నుంచి దుర్భర దారిద్ర్యం నుంచి భవిష్యత్తు సందేహంగా మారగా ‘నీల సుదీర్ఘ ప్రయాణంలోని అనుభవాల నుంచి మరియు చుట్టూ వున్న తనలాంటి మరికొందరి జీవితాల నుంచి ఎన్నో పాఠాలను నేర్చుకుంది. తనలాంటి నీలవేణులకు జీవితపు అస్తిత్వము సులుపు చేయాలనుకుంది. మళ్ళీ కథలోకి వస్తే పెళ్ళి బంధం నుండి విముక్తి అయిన తరువాత నీల తొలి ప్రేమ పరదేశిపై కల్గింది. కాని అప్పటికే పరదేశి మరో స్త్రీతో రిలేషన్లో వున్నట్లు తెలుసుకుని తన ప్రేమను విరమించుకుంది. ఎవరి వ్యక్తిగత జీవనం వాళ్ళదే దానివల్ల కలిగే మంచి చెడ్డల ఫలితం అనుభవించేది కూడ వాళ్ళే అందులోకి తొంగి చూసె అవసరంకాని ప్రమేయం లేదు. స్త్రీ పురుషుల సహజీవనానికి ప్రేమ అవసరం కాని సమాజం, కుటుంబ విధించిన నియమాల సంకెళ్ళ, చిక్కుదారులు అనేకం వాటిని తెంచుకొని స్వేచ్ఛ కోసం వెతుకులాడే వాళ్ళంతా నీలగాను, నీల తల్లిగాను, నీల నేస్తం సంపూర్ణం, పరదేశిలాగా, ఆపన్న హస్తం అందించిన అజితలాగ సంఘర్షణకు గురికావల్సిందే. స్త్రీ ఆర్థిక స్వాతంత్ర్యానికి, లైంగిక స్వేచ్ఛకి వున్న కనిపించని సంబంధాలు గూర్చి వెలువడిన ఎన్నో ప్రశ్నలకు రచయిత ఈ నవలలో సమాధానాల కోసం అన్వేషణ చేశారు. కొన్నిటికి సూచనప్రాయంగా జవాబులు ఉన్నట్లు కన్పిస్తుంది. ఈ నవలలోని ‘నీల’ వేసుకున్న అనేక ప్రశ్నలకు సమాధానాలు జీవితానుభవం ద్వారా తనకు తానే రాబట్టుకుంది. ఆమెకు తెలియకుండానే జారిపోయిన వాటిని వొడిసి పట్టుకుని తనకు నచ్చిన రీతిలో సరిదిద్దుకునే క్రమంలో తనను తాను తెల్సుకుంది. చదువుకుని సొంత కాళ్ళమీద నిలబడింది. తనని బాధించే హక్కు ఎవరికీ లేదు. తాను ఎవరి బాధకీ కారణం కాకూడదు అనే జీవన తత్త్వంగా మార్చుకుంది. ‘నీల’ స్వీయ అస్తిత్వం కోసం ఆత్మగౌరవం కోసం స్వేచ్ఛ కోసం చేసిన పెనుగులాటే ఆమె గమనంగా మారింది. దాతృత్వం కాన్సెప్ట్ తో పనిచేసే స్వచ్ఛంద సంస్థలో లోపిస్తున్న దీర్ఘకాలిక ప్రయోజనాల్ని తెలుసుకుంది. అభివృద్ధి నీడ కింద సమాజం అనుభవించే వేదనని అర్థం చేసుకని జీవించే హక్కు కోసం పోరుసల్పె జనంతో కలిసి రాజ్యం చేస్తున్నఅమానవీయం హింసకు వ్యతిరేకంగా నిలవాలని నిర్ణయించుకుంది.

‘నీల’ అనే వ్యక్తి జీవిత చిత్రణలో సామాజిక చరిత్రను చేర్చారు. వ్యక్తి జీవితాన్ని ప్రభావితం చేసే రాజకీయ సామాజిక సంఘటనల్ని ప్రస్తావిస్తూ ‘నీల’కి సొంత జీవితము, సామాజిక జీవితము వేర్వేరుగా లేవు అనే స్పృహతోనే రచయిత ‘నీల’ని ‘ఒక పిరియడ్’ ‘నవల’ తీర్చిదిద్దారు. ఒక నిర్దిష్ట కాలంలో గ్రామీణ పట్టణ నగర నేపథ్యాలు స్త్రీల స్వేచ్ఛపై లైంగికతపై చూపే ప్రభావాల్ని వాటిలోని భిన్న పార్శ్వాల్ని కూడా ఇక్కడ చర్చకు వచ్చాయి. స్వశక్తి డ్వాక్రా గ్రూపుల ద్వారా స్త్రీలకు కొత్తగా ఆర్థిక వెసులుబాటు వల్ల దాంపత్య సంబంధాల్లో వచ్చిన మార్పుల వల్ల కుటుంబ వ్యవస్థపై అధిక ప్రభావము లేకున్న స్త్రీ పురుష లైంగికతపై బలమైన ప్రభావాన్ని చూపాయని సూచనప్రాయంగా తెలిపారు. గ్రామాల్లో సైతం కమ్యూనిజం కోరలు చాచింది. మార్కెట్ గద్ద రెక్కలు విప్పుకోగా దేశీయకళాకారులకీ కొత్త మార్కెట్ లభించింది. చాలా సందర్భాల్లో పురుషులు కుటుంబ భారాన్ని ఆడవాళ్లకి వొదిలేశారు. ఊర్లు ఆత్మహత్యలకి, అత్యాచారాలకి నిలయంగా మారాయి.  స్వశక్తి గ్రూపులు స్త్రీ వోటు బ్యాంక్ రాజకీయాలకు దారులు వేశాయి. మహిళలు కొత్త సవాళ్ళు ఎదుర్కొన్నారు. అధికారుల కోసం ఆధిపత్యపు కులాల ఎత్తుగడలకు వీళ్ళు పావులుగా బలైనారు. నవల్లో రచయిత్రి ఈ విషయాన్ని విస్తృతంగానే వివరించారు. సమకాలీన స్థానీక రాజకీయాల్తో పాటు పలాస అడవుల్లో ‘నీలధార’ సాక్షిగా నడిచిన గిరిజన ఉద్యమాల ఊసులు, స్టాలిన్ సూర్యం పాల్గొన్న ఉత్తర తెలంగాణ రైతాంగ ఉద్యమాలపై అమలైన అణచివేత జాడలు నవల్లో సందర్భానుసారంగా ప్రస్తావనకి వచ్చాయి.

ప్రకృతి వనరుల్ని మల్టీ నేషనల్స్ కి అప్పజెప్పడానికి సముద్ర మైదానం అడవి తేడా లేకుండా మానవ విధ్వంసానికి ప్రకృతి వినాశనానికి తెగబడ్డ భీభత్స సందర్భంలో మల్లీశ్వరి నీల గురించి నీల లాంటి మరికొందరి నీల చేయబోయే నూతన ప్రస్థానం గురించి మనం మాట్లాడటం అనివార్యమే కాని ఆ అనివార్యములోంచే ఈ నవల పుట్టి వుండవచ్చు. ‘సముద్రం కార్పోరేట్ల నీటి తొట్టి’ అవడానికి కారణాలు అనేకం. వాటిని తెలుసుకునే దిశగా ‘నీల’ ప్రస్థానం మొదలైంది. ‘జీవితమంతా పోరాటమైన స్థితి నుంచి పోరాటాన్నే జీవితంగా’ మార్చుకునే కొత్త ప్రణాళికల్ని రచించుకుంటుంది. నాలుగు పదులు కూడ  నిండని ‘నీల’ మరింత సంఘర్షణాత్మకమైన దారిలో నీల తనలాంటి మరెందరినో కలుపుకుని అడవుల వేడి నిట్టూర్పుల్ని సాగరాల గంభీర శ్వాసని వింటు నడుస్తుంది. స్వతంత్ర జీవనం గడపాలి అనుకునేవాళ్ళు, జాలరి పైడమ్మ లాంటి పీడితుల కోసం పరదేశిలా భుజంకాయారి అనుకునేవాళ్లు సదాశివలా స్వేచ్ఛని గౌరవించగల వాళ్ళు అందరూ నీలకు హితులే, సన్నిహితులే.

మానవ సంబంధాల్లో బలీయమైనది ప్రేమ, స్వేచ్ఛకి సంకెళ్ళుగా పరిణమించిన సంఘర్షనాత్మక సందర్భాల్లో క్లేశాన్ని అధిగమిస్తూ చిక్కుముడులు నిప్పుకుంటూ ప్రేమ – స్వేచ్ఛల మధ్య సమన్వయం సాధించటానికి ఓ స్త్రీ జీవన పోరాటమే ‘నీల’ నవల.

Writer: A. K. Malleswari

ఈ నవలని రచయిత్రి దృష్టిలోంచి చూసినపుడు అశాంతిని కాక జీవశక్తిని ఆవిష్కరిస్తుంది. అది వ్యక్తిలో అపార జీవశక్తి ఉంది. ఆమె వైరిలో ఉద్వేగముంది. సన్నివేశ కల్పనలోను, మనోభావాల్ని పట్టుకొని వివరించడంలో కౌశల్యముంది. కె.ఎఫం.మల్లీశ్వరిగారు రచించిన ‘నీల నవల’ ‘తానా’ బహుమతి పొందినది. మన ధర్మశాస్త్రం ప్రకారం స్త్రీ అన్ని దశల్లో పురుషుడి మాటునే ఉండాలనే నియమాలకు విరుద్ధంగా స్త్రీ స్వేచ్ఛ కోసం ‘నీల’ పాత్ర ద్వారా మనకు అనేక విషయాలను సమా కోణంలో చూపిస్తూనే స్త్రీలకు స్వేచ్ఛ, స్వాతంత్ర్యము ఎంత అవసరమో చెప్పడంలోనను కొన్ని మెళుకువలతోపాటు ఆధిపత్యపు సంస్థ ద్వారా స్త్రీ జీవన సంఘర్షణని చూసారు. ఈ నవల ప్రతి ఒక్కరిని చదివించేదిలా ఉంది.

 

August 25, 2021 1 comment
0 FacebookTwitterPinterestEmail
పుస్త‌క స‌మీక్ష‌

పడమటి గాలుల్లో తెలుగు పరిమళాలు

by శాంతిక్రిష్ణ August 25, 2021
written by శాంతిక్రిష్ణ

భాష పుట్టుకకు ప్రాంతముంటుంది కానీ దాని పరిమళాలు నిండిన గాలులు ఏ ప్రాంతంలో వీస్తాయో ఎవరూ చెప్పలేము…

భాష వైభవం సాహిత్యంలోనే కనిపిస్తుంది…

భాష మనుగడ సాహిత్యంతోనే ముడిపడి ఉంటుంది…

సరిహద్దులు దాటి స్వేచ్ఛగా విహరించేదే కదా సాహిత్యమంటే…

కమ్మనైన అమ్మభాషకు కవుల కలాలే కప్పురపు హారతులు…

కాదంటారా…!?

అనేక ప్రక్రియల్లో తనదైన ప్రత్యేక శైలితో పడమటి గాలుల్లో తెలుగు పరిమళాలను నింపుతున్న కవి , రచయిత శ్రీధర్ బిల్లా…వీరి స్వస్థలం వరంగల్ జిల్లాలోని మల్లక్కపల్లి గ్రామం. ప్రస్తుతం ఉంటున్నది కాలిఫోర్నియా(అమెరికా). దాదాపు పది సంవత్సరాలుగా సాఫ్ట్వేర్  ఇంజనీర్ గా అమెరికాలోనే ఉంటున్న శ్రీధర్ కు తెలుగుభాషన్నా , భారతీయ సంప్రదాయమన్నా ఎంతో అభిమానం. తన చుట్టూ సమాజంలో జరుగుతున్న అనేక సంఘటనలను , తన బాల్యాన్ని , తన వృత్తిని ఇలా అనేక అంశాలను వస్తువులుగా తీసుకుని వాటిని వివిధ ప్రక్రియలలో అక్షరీకరించారు.

ఒక్కో ప్రక్రియకు ఒక్కో పుస్తకాన్ని విడిగా వేసుకుంటున్న ఈ రోజుల్లో అన్ని ప్రక్రియలను కలిపి ఒకే సంపుటిగా తీసుకు రావడం కాస్త సాహసమనే అంటాను…ఏదైనా కవిత్వమే కదా అంటారు శ్రీధర్…

కవి మనసుకు ప్రతిబింబమే అతని సాహిత్యం…బహుశా అందుకే తన ఈ సంపుటికి “ప్రతిబింబం” అని పేరు పెట్టారని అనుకుంటాను.

ఇందులో వచన కవిత్వం, నానీలు, రుబాయీలు, పద్య ఖండికలు ఉన్నాయి.

వచన కవిత్వం ఎక్కువగా దీర్ఘ కవితలుగా ఉన్నాయి. అందుకే తీసుకున్న ప్రతి వస్తువుకు పూర్తి న్యాయం చేశారనిపిస్తుంది.

ఇప్పుడు కూడా కొన్ని ప్రాంతాలలో జరుగుతున్న బాల్య వివాహాల గురించి ”ఒంటరీ బందీ” అనే కవితలో హృద్యంగా తెలియజేశారు. ఇది తన బాల్యంలో జరిగిన ఓ సంఘటన…తన సోదరిలాంటి బాల్య మిత్రురాలికి జరిగిన బాల్య వివాహం గురించి ఆవేదనతో రాసుకున్న అక్షర నివాళి ఇది…

// హృదయాంతరాళం ప్రళయ ఘోష చేస్తున్న,

అధరం దాటని మూగ ఆర్తనాదం తాను! మౌన శిఖరం తాను!

గర్భమంతా మంచుకాసారం నిండియున్నా ,

మంచుగప్పి మలయమారుతం వీస్తున్న మహాగ్ని పర్వతం తాను! // అంటూ ఆవేదనతో రాశారు…

//పెంచిన తల్లివి గావు!   తండ్రివీ గావు!

తోడబుట్టిన దానవు కావు! కానీ, తోడై నిల్చిన దానవు!// అంటూ ”ఎర్ర బర్రె” కవితలో తన బాల్యంలోని ఆత్మబంధువైన ఎర్ర బర్రెను ఆత్మీయంగా తలచుకొన్నారు.

అకాల వర్షాల వల్ల రైతు ఆశలు ఎలా కొట్టుకు పోతాయో “చినుకుల మాటున” కవితలో మన కళ్ళ ముందుంచారు.

రెక్కలొచ్చిన పిల్లలు సుదూర తీరాలకు ఎగిరెళ్ళిపోతే…రెక్కలుడిగిన ముసలి ప్రాణం ఎంత తల్లడిల్లి పోతుందో ”ముసలోడు” కవితలో ఇలా రాశారు…

//ఏ జ్ఞాపకం హఠాత్తుగా ఏ కలవరాన్ని మోసుకొచ్చిందో

పక్కనున్న మంచాన్ని ఒక్కసారి తడిమి చూశాడు

ముసల్ది మరణించిందని ఓ క్షణం పాటు మరచాడేమో

ఖాళీ మంచం వేళాకోళమాడుతూ వెక్కిరించింది//

//తాను విలపిస్తూ చితికి శిధిలమై పోతుంటే

ఆ విలాప శిధిలాలతో పేరుస్తున్న విలాస సౌధాలు

కళకళలాడుతున్నాయి//అంటూ వేశ్యల జీవితాలలోని ఆక్రందనలను ”ఆక్రందన” కవితలో అక్షరీకరించిన తీరు కవికి సమాజం పట్ల ఉన్న బాధ్యతను మనకు తెలియజేస్తుంది.

//అందమైన ఒకనాటి ఆంధ్రదేశానికి

జాతీయ భాషను నేను

జాతీయ భాషగా వేరొకటి రుద్దగా

‘ప్రాంతీయ భాషనయ్యాను’ నేడు!//

అంటూ ”తెలుగు అనే నేను” కవితలో నేడు తెలుగు భాష ఎదుర్కొంటున్న అనేక సమస్యలను తెలియజేస్తూ విదేశాలలో మన భాష ఎంత గొప్పగా వెలుగొందుతోందో

//ప్రాంతీయ భాషగా

భారతావనిలో భారంగా బతుకీడుస్తున్నా,

ప్రవాస సంఘాల కృషితో

ప్రపంచ భాషగా గుర్తింపు పొందుతున్నా!// అంటూ ఈవిధంగా తెలియజేశారు. ఇలా వేటికవే ప్రత్యేకతను సంతరించుకున్న వచన కవితలు 38 శీర్షికలతో ఉన్నాయి.

ఈ కవికి అంత్యానుప్రాసలు బాగా ఇష్టమనుకుంటాను. అందుకే అతని కలం ప్రాసలను అందంగా జాలువార్చింది.

ఇంక నానీలు , రుబాయీలు, పద్య ఖండికలు కూడా ఈ సంపుటిలో ఉన్నాయి.

శ్రీధర్ రాసిన కొన్ని నానీలను చూద్దాం…

//నాలుగు మెతుకులు

ఆకలి మంటల్లో

బాలల హక్కులు

కాలిపోయాయి//

//ఆటలాడి

రాటుతేలాల్సిన దేహం

రాళ్ళు కొడుతూ

రాటుదేలుతోంది!// అంటూ ‘బాల కార్మికులు’ అనే శీర్షికలో సందేశాత్మక నానీలను రాశారు. ఇంతే కాకుండా మామగారు , కొడుకులు, బడి , చెత్తకుండీ, పందెం కోడి , రోడ్డు గుంత అనే శీర్షికలతో కూడా నానీలు ఉన్నాయి.

ఇంకా ఈ సంపుటిలో “అన్వేషణ”, “దిన దినం” శీర్షికలతో రుబాయీలు కూడా ఉన్నాయి…

చివరగా 14 శీర్షికలతో పద్యఖండికలు కూడా ఉన్నాయి.

తే.గీ. నీదు ఇంటిలోన, కటిక పేదరికపు

కాళరాత్రుల చీకట్లు కప్పియుండె!

నీవు జెక్కిన శిల్పము, దేవళమున

దీపములలో వెలుగుచుండె, తేజమలర!

అంటూ రాసిన ఈ తేటగీతి “శిల్పి” అను శీర్షికలోనిది.

పద్యఖండికలోని పద్యాలన్నీ సులభ శైలితో పాఠకులకు సులభంగా అర్ధమయ్యే విధంగా ఉన్నాయి.

ఇందులోని సాహిత్యం చదువుతుంటే ఈ కవికి సామాజిక బాధ్యతే కాకుండా భాషాభిమానం కూడా చాలా ఉందని మనకు తెలుస్తుంది.

ప్రచురింపబడిన మొదటి పుస్తకం ఇదే అయినా మరెన్నో గ్రంథాలను త్వరలో ఆవిష్కరించాలని కోరుకుంటూ…

“ప్రతిబింబం” రచయిత  శ్రీధర్ గారికి ఆత్మీయ అభినందనలు తెలియజేస్తున్నాను.

 

August 25, 2021 1 comment
0 FacebookTwitterPinterestEmail
పుస్త‌క స‌మీక్ష‌

“స్థితస్యగతిః చింతనయా”

by Kura Chidambaram August 25, 2021
written by Kura Chidambaram

అవును! ఎంతటి చింతనీయమైన ‘దుర్గతి’ ఇది!

భూమి, నీరు, వెలుగు, సమీరాకాశాలను కేవలం తన కడకంటి చూపుతో, 4 అంగుళాల అరచేతిలో ఇమిడపోయిన ‘రిమోట్’ ఒకచోట వ్రేలి కొస నొక్కుతో శాసించగల్గిన మానవుడికేనా – ఈ చింతనీయ గతి!

త్రివిక్రముడులా అపరపరాక్రమంతో ఒక కాలు భూమిపై నుంచి, మరోకాలు చంద్రమండలాన్ని తాకి విర్రవీగిన మానవుడికేనా – త్వరలో అంగారక సదృశ గ్రహాన్ని ఆవాసంగా మార్చుకోబతోన్న మానవుడికేనా ఈ దుస్థితి!

‘సర్వాంతర్యామి’ అనే వాడెవడో, ఎక్కడో లేడని, భూలోకంతో సహా 14 భువనాలు తనవేనని, తనే సర్వవ్యాపి, సర్వంతర్యామి, సర్వంతనేనంటూ విర్ర వీగుతూ తనే మాన్యుడనీ మరెవరినీ కొలువొద్దని విర్రవీగుతోన్న అసురసంధ్యవేళ పుచ్చిపోయిన మొగురం (స్థంభం)లోంచి, అటు మనిషి కాక ఇటు జంతువుకాని ప్రాణి ఉద్భవించి తన ఇనపగోళ్ళతో గర్వాంధుడు మదాంధుడు అయిన హిరణ్యకశిపుడిని సంహరించినట్లు, అటు సురల్నీ ఇటు అసురుల్నీ, తన ఉనికి, స్థితి, చింతనకు తెచ్చినట్లు –

ఎక్కడో వేల కిలోమీటర్ల దూరంలో ఊహించను కూడా వీలుకాని ‘ఊహాన్’ నగరంలో, బొగ్గురామిత్రవ్వే చీకటి గనుల్లో, అటు జంతువుకాక ఇటు పక్షీ కాక, నోరు, విసర్జక అవయవం ఒక్కటే అయి, పరమ రోత కలిగించే గబ్బిలం కడుపులో పుట్టి, మానవ హిరణ్యకశిపుల్ని నిర్దయగా, నిర్దాక్షిణ్యంగా అన్ని జాగ్రత్తలకు అతీతంగా, పేద ధనిక ఆడ, మగ, ఇక్కడ అక్కడ, అనే తేడా చూపకుండా ఈ మానవ హిరణ్యాక్షులను తన వాడిగోళ్లతో, కళ్లకు కనిపించక, దును మాడటం ఏమిటి?

అంతటి అసమాన పరాక్రమశాలి, అతులితబలుడు అస్త్ర, శస్త్ర సంపన్నుడూ అయిన మానవుడు ఈ కంటికి కనిపించని శ్రతువు ఖడ్గ ప్రహారాలకు బెంబేలెత్తి, కకావికలై ‘తాను శాసిస్తున్నాను’ అనుకున్నా ఉచితంగా ప్రకృతిలో అనాయాసంగా, ఆయాచితంగా దొరికే వాయువు; ప్రాణవాయువు, ప్రాణాధార సమీరాన్ని లీటర్ల చొప్పున లక్షలు వెచ్చించి కొనుక్కోవటం ఏమిటి? ఇంతా చేసినా, లక్షలు ధారపోసినా, ప్రాణాలు దక్కక విలవిలలాడటం ఏమిటి?

ఇంత చేసినా, బ్రహ్మ కలంపోటుతో కసువుగా మారి అసువులు బాస్తే – పూడ్చటానికో, కాల్చటానికో ఆలుబిడ్డలకు దూరమై ‘అనాధ’ చావు చస్తే, ఎవరూ భయంతో రాకపోతే, మ్యునిసిపాలిటీ వాడి కుక్కల బండే, వైకుంఠరథమై ప్రయాణం కట్టటం ఏమిటి? విలయం కాకపోతే, ఇది ఏమిటి?

సర్వాంతర్యామి మానవాతీత శక్తి మహాదేవుడు – ఎవరూ లేరని అన్నీ తానేనంటు, అన్ని వనరుల్ని అప్పనంగా అనుభవించాల్సింది తానేనని విర్రవీగిన ఈ మానవ హిరణ్యాక్షుడిని కరోనా – అవును- కరోనా ఎక్కడి నుండి ఎక్కడకు దిగజార్చింది!

ఇలాంటి గతిలో, దుర్గతిలో నరజాతి సమస్తం విలవిల్లాడుతోంటే – చీకటి కుహరంలోకి త్రోయబడి చివరకు గాలి కూడా ఆడని గతిలో, 68 కళలు సాహిత్య సౌరభాలు గానసభలు, కళారంగ భారతిలు ఎవరడిగేను? ఎవరికి గుర్తు వచ్చేను?! సన్మాన పంచాంగాలు కాదు: ప్రాణాంగ దక్కితే చాలు; గండం గడిస్తే చాలు; బలుసాకు తినగలిగే స్థితిలో ఉన్నా చాలు.

మనల్ని ఈ కష్టకాలంలోంచి పైకి చేదుకునే ప్లహ్లాదుడు – అదుగో వస్తున్నాడు. సూది మొనయై మన భుజకండాల్లోకి, సున్నితంగా దిగబడి మనలో ఎదురిచే అస్త్రశ్రస్తాలను నింపటానికి వస్తున్నాడు. చిక్కగా క్రమ్ముకుని మసకేసిన మబ్బులు ప్రపంచాన్ని చెదరగొడుతూ చెదిరిన మబ్బు పూలదండ ఆయన గళహారంగా ప్రకాశిస్తోంటే , మనల్ని ఆదుకోవటానికి, చేదుకోవటానికి వాక్సీనై వస్తున్నాడు.

మనల్ని ఈ సమస్య వలయంలోంచి పైకి లాక్కుని అలిసిన మన ‘పాల’ బంధువుల్ని తుడిచి స్వాంతన చేకూర్చుతాడు. సకల కళాభారతిని గంధర్వగాన సభల్ని మళ్ళీ వింటాము. చింతవద్దు. తొందరవద్దు.

(బుర్రా లక్ష్మీనారాయణగారి మబ్బుదండ (పాలపిట్ట మే 21) చదివాక.

 

August 25, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంట‌ర్వ్యూలు

2021 దాశరథి పురస్కార గ్రహీత ఆచార్య ఎల్లూరి శివారెడ్డిగారితో ముఖాముఖి

by madishetti gopal August 25, 2021
written by madishetti gopal
ప్రముఖ సాహితీ వేత్త గా, కవిగా, తెలుగు విశ్వ విద్యాలయం ఉప కులపతి గా, ఉత్తమ పరిశోధకుడిగా, ప్రామాణిక విమర్శకుడిగా, ఆచార్యుడిగా, రచయితగా, పేరు గాంచిన వారు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి గారు. ప్రస్తుతం తెలంగాణ సారస్వత పరిషత్తు అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం వారు అందజేస్తున్న దాశరథి పురస్కారం స్వీకరించిన సందర్భంగా ఆయనతో మయూఖ అంతర్జాల పత్రిక పక్షాన మాడిశెట్టి గోపాల్ చేసిన ప్రత్యేక ఇంటర్వ్యూ..
ప్ర. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న తెలంగాణ మహాకవి 
దాశరథి జన్మదిన సందర్భాన్ని పురస్కారించుకొని ప్రతిష్టాత్మక పురస్కారం ఇటీవల  స్వీకరించిన సందర్భంగా  మీ అనుభూతి లేదా స్పందన తెలియజేస్తారా?
• ప్రభుత్వం ఇచ్చే ఏ అవార్డ్ ఐనా ప్రతిష్టాత్మకమైనదే. నన్ను గుర్తించి పురస్కారం అందించిన సందర్భంగా ప్రభుత్వానికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. సాధారణంగా దాశరథి పైన కృషి చేసిన వారికే దాశరథి పురస్కారం ఇస్తారని అనుకుంటారు. సాహిత్యం లో కృషి చేసిన వారికి దాశరథి పేరిట పురస్కారం ఇస్తారు. మూడు కారణాల వలన నాకు ఈ పురస్కారం వచ్చిందని అనుకుంటున్న. సురవరం ప్రతాప రెడ్డి  గారి పైన చాలా కృషి చేయడం, ఆయన జీవిత చరిత్ర రాయడం అలాగే ఆయన శత జయంతి సందర్భంగా వైజయంతీ సంస్థ నుండి దేవులపల్లి రామానుజ రావు గారి సూచన తో సురవరం ప్రతాప రెడ్డి గారి పైన 1988 నుండి 1996 వరకు 12 పుస్తకాలు అచ్చు వేశాము. నేను తెలుగు శాఖ కు అధ్యక్షునిగా ఉన్నప్పుడు 1996 లో ఉస్మానియా విశ్వ విద్యాలయం లో ప్రతాప రెడ్డి గారిపైన నా ఆధ్వర్యం లో సెమినార్ చేయడం తో పాటు పుస్తకం కూడా వేశాము.  రెండవ కారణం నేను తెలంగాణ సారస్వత పరిషత్ కు 16 సంవత్సరాలు కార్యదర్శిగా ఉన్నాను. 20 సంవత్సరాలు ఆ సంస్థ తో అనుబంధం ఉంది. ఈ విషయం ముఖ్యమంత్రి గారికి కూడా తెలుసు. ఇక మూడవ కారణం నాదీ వనపర్తి సంస్థాన పరిధికి చెందిన సుదీర్ఘ సాహిత్య జీవితం.  ఈ ప్రాంతం నుండి సీనియర్ వ్యక్తికి పురస్కారం ఇస్తే బాగుంటుంది అని అనుకున్నారేమో. ఈ మూడు కారణాల వలన నాకు పురస్కారం వచ్చిందని అనుకుంటున్నాను. ఈ పురస్కారం నాకు వ్యక్తి గతంగా వచ్చిందని అనుకోకుండా సంస్థలకే చెందుతుందని అనుకుంటున్నాను.
ప్ర. దాశరథిగారితో మీకున్న పరిచయ విశేషాలు, సాన్నిహిత్యం గురించి చెప్తారా?
• దాశరథి గారితో పరిచయం ఉంది కానీ పెద్ద పరిచయం కాదు. నేనూ ఆయన కలిసి పది సభల్లో పాల్గొన్నాము. దాశరథి గారి కవిత్వం గురించి నేను చాలా చోట్ల మాట్లాడాను. కొన్ని వ్యాసాలు కూడా రాశాను. దాశరథి గారి లో నేను గమనించిన గొప్ప గుణం ఏమిటంటే ఆయన ప్రసంగించేటప్పుడు మనిషి ఎత్తు తక్కువైనా, ఆ భావావేశంలో ఏడడుగుల మనిషి లాగా కనిపించే వారు.  టీచర్స్ అందరికీ ఆ లక్షణం ఉంటే బాగుండు అనిపిస్తుంది. దాశరథి గారు మహంధ్రోదయం అనే పుస్తకాన్ని సురవరం ప్రతాప రెడ్డి గారికి అంకితం ఇచ్చారు. నాకు నచ్చిన అంశాలలో అది మొదటిది.  ఆయన పట్ల నాకు అమిత గౌరవం.
ప్ర. మీ విద్యాభ్యాసం వివరాలు తెలుపుతారా ?
• నేను ప్రాథమిక విద్యభాసం మా వూరి లోనే చేశాను. మా వూరు తాళ్ళూరు వనపర్తి జిల్లా లో ఉంది. మా వంశం లో ఎవరు కూడా 4 వ తరగతి చదువుకున్న వారు లేరు. వ్యవసాయం ప్రధానంగా ఉన్న కుటుంబం మాది. తర్వాత కొల్లాపురం లో 5 వ తరగతి నుండి హెచ్.ఎస్సీ వరకు చదువుకున్నాను. హైదరాబాద్ న్యూ సైన్స్ కళాశాలలో పి.యు.సి. బి.యస్సీ చదివాను. పి.జి చెయ్యాలనుకున్నప్పుడు మిత్రులు అంతా ఏం.ఏ. తెలుగు చేయమన్నారు. నాకు ఏం.ఎస్సీ జియాలోజీ లో ఆసక్తి. నాకు తెలియకుండానే మిత్రులు అప్లికేషన్ ఇవ్వడం తో ఏం.ఏ తెలుగు చేశాను. అక్కడి ప్రముఖులు దివాకర్ల వేంకటావధాని, సినారె గారు, తాటిబండ్ల మాధవ శర్మా గారు,పల్లా దుర్గయ్య గారు లాంటి వారు నన్ను అభిమానించే వారు. ఏం.ఏ లో నాకు బంగారు పథకం వచ్చింది. దివాకర్ల వేంకటావధాని గారు మహా భారతం పైన పి.హెచ్.డి చెయ్యమని సూచన చేశారు. ఆయన రిటైర్ అవబోతుండడం తో నారాయణ రెడ్డి గారి కింద నన్ను పి.హెచ్.డి విద్యార్థిగా వేశారు. విద్యార్థి గా నన్ను సినారె గారు బాగా అభిమానించే వారు.. అలా పి.జి. పి.హెచ్.డి పూర్తయ్యింది. 1970 లో తెలంగాణ ఉద్యమ సమయం లో తెలుగు అకాడమీ లోఉద్యోగం వచ్చింది. నాకు బొధన చాలా ఇష్టం. అందుకే ఏ.వి కళాశాలలో లెక్చరర్ గా చేశాను. ఆ సమయం లో ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడెమీ సురవరం ప్రతాప రెడ్డి గారి రచనలు, సాహిత్యం మీద గ్రంథాలు రాయమని ఒక పోటీ పెట్టింది. అప్పుడు నేను సురవరం ప్రతాప రెడ్డి గారి జీవితం సాహిత్యం అనే పుస్తకానికి నాకు అకాడెమీ అవార్డ్ వచ్చింది. ఈ లోగా ఉస్మానియా విశ్వవిద్యాలయ తెలుగు శాఖ లో లెక్చరర్ పోస్ట్ కు అప్లికేషన్ లు కోరడం తో నేను అప్లై చేశాను. 1973 లో నాకు ఆ పోస్ట్ వచ్చింది. ఆ విశ్వవిద్యాలయం లో లెక్చరర్ గా, ప్రొఫెసర్ గా, రీడర్ గా, బోర్డు ఆఫ్ స్టడీస్ ఛైర్మన్ గా, హెడ్ గా 34 సంవత్సరాలు పని చేశాను. 2005 లో ఉద్యోగ విరమణ చేశాను.
ప్ర. మీ పరిశోధన గురించి తెలుపండి.
• ఆంధ్ర మహా భారతం లో రస పోషణ విరాట్ ఉద్యోగ పర్వాలు అంశం పైన పరిశోధన చేశాను. నేను ముఖ్యంగా సైన్స్ విద్యార్థి ని కావడం, అందులో మహా భారతం గురించి పరిశోధన చేయడం తో చాలా కష్టపడాల్సి వచ్చింది. సినారె గారు మధ్య మధ్యలో తొందరగా చేయమని అడిగేవారు. నేను ఆసక్తి తో సంస్కృతం కూడా కొంత నేర్చుకున్నాను. మహా భారతం ప్రౌడ రచనా కావడంతో సంస్కృతం తెలుగు టెక్స్ట్ చదివి అవగాహన చేసుకున్నాను. నా అనుభూతిని ఆసరాగా చేసుకొని థీసిస్ పూర్తి చేశాను. అది కొంత విలక్షణమైన అంశం అయినప్పటికీ అందరూ నన్ను ప్రసించారు.
ప్ర. పరిషత్తు తో మీ అనుబంధం గురించి చెప్పండి?
• నా పైన దేవులపల్లి రామానుజ రావు గారికి మంచి అభిమానం ఉండేది. అందుకే పరిషత్తు కార్యక్రమాల లో నన్ను ఇన్వాల్వ్ చేసే వారు. సురవరం గారి రచనల పైన పుస్తకాలు తేవాలని వేసిన కమిటీ కి నేనే ఛైర్మన్ ను. దాదాపు 12 పుస్తకాలు అచ్చు వేశాము. మొదట కార్యదర్శిగా చేశాను. సినారె గారి అస్తమయంతో కమిటీ నన్ను అధ్యక్షునిగా ఎన్నుకుంది. అలా అకాడమీ కి ప్రస్తుతం అధ్యక్షునిగా సేవలు అందిస్తున్నాను. సినారె గారి పలుకుబడి గొప్పది. ఆయన పేరు చెప్పితే ఎవరైనా సహకరించే వారు. అంతా క్రితం పరిషత్తు స్థలం ప్రభుత్వం లీజ్ కు ఇచ్చింది. సినారె గారు అధ్యక్షులుగా, నేను సెక్రెటరీ గా ఉన్న సమయం లో అప్పుడు చంద్రబాబు నాయుడు  ప్రభుత్వం వారు ఆ స్థలాన్ని  పరిషత్తుకు ఇచ్చి 14 లక్షలు డబ్బు కట్టమని అడిగారు. కానీ అప్పుడు పరిషత్తు దగ్గర అంత డబ్బు లేదు. కాని  సినారె గారు రెడ్డి లాబ్స్ అంజిరెడ్డి గారిని అప్పుగా అడిగితే వారు ఉచితంగానే సమకూర్చారు. అలా స్థలం పరిషత్తు కు స్వంతమయ్యింది. పరిషత్తుకు ఆదాయం కోసం వెనుక బిల్డింగ్ మరియు షాప్ లు వేశాము. సినారె గారి పీరియడ్ లో అద్భుతమైన పని జరిగింది. వారు కీర్తి శేషులయ్యాక ఒకటే సారి పైనుండి క్రిందికి పడ్డట్టు అయ్యింది. శాంత బయోటెక్ అధినేత వరప్రసాద్ రెడ్డి గారు ఒకసారి పరిషత్తు కు వచ్చినప్పుడు ఆడిటోరియం పునరుద్ధరణ పనుల కోసం కొంత సహకారం గురించి అడగగానే అందుకు అంగీకరించి సంపూర్ణ సహకారం అందించారు.తద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహించ గలుగుతున్నాము.  గ్రంథ ప్రచురణ, సదస్సులు, గ్రంథావిష్కరణలు , పురస్కారాలు తదితర కార్యక్రమాలతో సారస్వత పరిషత్తు అమోఘమైన సేవలు అందిస్తున్నది.  ఈ మధ్య పురస్కారాలు అందించాలనుకున్న వారు లక్ష యాభై వేలు ఇస్తే వారి పేరిట సంవత్సరానికి ఒకసారి 5 వేల రూపాయల పురస్కారం అందిస్తున్నాము. పరిషత్తు ఎప్పుడు పైరవీ లకు, పక్షపాతానికి లొంగదు. ఇటీవల పురస్కారాల ప్రదానం జరిగింది.  7 మందిని ఎంపిక కోసం 24 మంది న్యాయ నిర్ణేతలను పెట్టాము. అలా పారదర్శకంగా పురస్కారాల ఎంపిక కొనసాగుతుంది. వరప్రసాద్ రెడ్డి గారు లక్ష రూపాయలు ఇచ్చి ఒక పురస్కారం ఇవ్వమన్నప్పుడు తిరుమల శ్రీనివాసా చార్య గారికి ప్రదానం చేశాము. భవిష్యత్తు లో వనరులను చూసుకొని ముఖ్యంగా యువ కవులకు, యువ రచయితలకు ప్రోత్సాహం అందిద్దామని అనుకుంటున్నాము. తెలుగు భాషను అభిమానించే అందరికీ పరిషత్తు ఒక కేంద్రంగా ఉండాలని మా ఆశయం. ఇటీవల ఒక పుస్తకాన్ని పది మంది తో వ్యాసాలు రాయించి అచ్చు వేశాము. కవిత్వం రాయడం ఎలా అనేది ఆ పుస్తకం. అది చాలా మంచి పుస్తకం. ఆ పుస్తకం చివర దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి ఇంటర్వ్యూ వేశాము. ఏదైనా ప్రయోజన కరమైనది ఉంటే గాని , అణగారిన వర్గాల గురించి కవిత్వం రాస్తే గాని అవి వేస్తున్నాము. సమాజానికి ప్రయోజనం లేని అంశం తీసుకుంటే మనం నిలువలేము. సమాజం ముఖ్యం. అలాగే సాంప్రదాయాన్ని విస్మరించ కూడదు. సంప్రదాయం తల్లి వంటిది. ఆధునిక సాహిత్యం అర్థాంగి లాంటిది. భార్యతో జీవించాలి. తల్లిని గౌరవించాలి.
ప్ర. తెలుగు సాహిత్యం పట్ల మీరు ఎలా ఆకర్షితులు అయ్యారు?
• మా చేను  లో కూర్చుంటే కృష్ణ తుంగభద్రా నది సంగమం, సంగమేశ్వర దేవాలయం కనిపించేవి. అలా నది నాకు బాల్యం నుండే ఒక ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించే లక్షణాన్ని ఇచ్చింది. బహుశా నాన్న గారు సంగమేశ్వరం లో శివుణ్ణి చూసే నాకు ఆయన పేరు పెట్టారని అనిపిస్తుంది. తెలుగు చెప్పే ఉపాధ్యాయులు కూడా ఆసక్తి కలిగించేలా చెప్పే వారు. చంద్రమౌళి శర్మ గారు నాకు చక్కగా పాఠం చెప్పే వారు. ఆ ప్రభావం నాపైన చాలా ఉంది. సహజంగా చిన్నప్పటి నుండి ఎందుకో తెలియదు కానీ తెలుగు భాషపైన అభిమానం కలిగింది. విద్యార్థి గా కూడా కొన్ని రచనలు చేశాను. హైదరాబాద్ లో రెడ్డి హాస్టల్ లో ఉండేవాడిని. దాని పక్కనే అప్పటి ఆంధ్ర సారస్వత పరిషత్ ఉండేది. మరో పక్కన శ్రీకృష్ణ దేవరాయ భాష నిలయం ఉండేది. విద్యార్థి గా ఉన్నప్పుడే పరిషత్తుకు, భాష నిలయం లో జరిగే అనేక సభలకు వెళ్ళి వినే వాడిని. సినారె గారిని మొదట చూసింది భాషా నిలయం లోనే 1963 లో అలా నాకు సాహిత్యం పట్ల ఆసక్తి కలిగింది. భగవంతుడి దయ, గురువుల ఆశీర్వాదం నాకు అన్నీ అవకాశాలు వచ్చాయి. అంతకంటే నేను కోరుకునేది ఏమీ లేదు.
ప్ర. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థి గా, గురువుగా మీ అనుబంధం తెలుపండి.
• నా జీవితం లో ఆ విశ్వ విద్యాలయాన్ని తలుచుకోని రోజు ఉండదు. నాకు ఎన్ని ఆస్తులైన ఉండవచ్చు కాక, కానీ  నాకు అన్నం పెట్టిన యునివర్సిటి అది. చాలా గొప్ప విశ్వవిద్యాలయం అది. తెలుగు శాఖ లో సినారె, దివాకర్ల వారి పేరు చెప్పితే ఆరోజులలో చాలా గౌరవంగా చూసేవారు. సినారె గారు పాఠం చెప్పితే గోడలు విన్నాయి, మేడలు విన్నాయి,వాడలు విన్నాయి  అనే కవిత్వం రాశాను ఇటీవల. నేను ఉద్యోగం లో చేరే సమయం లో వి.సి. గా నూకల నరోత్తమ రెడ్డి గారు ఉండేవారు. ఆయన ఒకప్పుడు గోల్కొండ పత్రిక సంపాదకులు. ఎంతో మంది ప్రతిభావంతులు ఉన్నప్పటికీ నాకు పరిస్థితులు అనుకూలించడం తో ఆ విశ్వవిద్యాలయంలో ఉద్యోగం లభించడం నా అదృష్టం గా భావిస్తున్నాను.
ప్ర. మీ రచనా వ్యాసంగం గురించి తెలియజేస్తారా ?
‘పూల కారు’ అని కవిత్వం 1984 లో అచ్చయ్యింది. విచిత్రం ఏమిటంటే కె.సి.ఆర్‌ గారు ఆ పుస్తకాన్ని సిద్దిపేట లో ఆవిష్కరించారు. ఆ సమావేశం లో కసిరెడ్డి గారు ఉన్నారు. జాతీయ సాహిత్య పరిషత్తు నుండి అక్కడ ప్రస్తుత సి.ఎం గారి చేతుల మీదుగా ఆవిష్కరించారు. యువభారతి వారు కోరితే ఒక చిన్న పుస్తకం రాశాను. తిక్కన రసభారతి విమర్శగ్రంథము, ముసలమ్మ మరణం వంటి పుస్తకాలను ప్రచురించాను.  ఆకాశవాణి భావన ప్రసంగాల సంపుటి ‘భావ దీపాలు’, సురవరం ప్రతాపరెడ్డిగారి జీవితం, సాహిత్యం, సిద్ధాంత గ్రంథమైన ఆంధ్రమహాభారతంలో రసపోషణం గ్రంథాలను వెలువరించాను.
ప్ర. తెలుగుసాహిత్య అధ్యాపకునిగా, తెలుగు సాహిత్య భాషా సాహిత్యసేవకునిగా మీ అనుభవ, అనుభూతి విశేషాలను తెలుపుతారా?
దాశరథి గారి కవితావేశం, సినారె గారి బోధనా కౌశలం, దివాకర్ల గారి పాండిత్యం ..ఇవన్నీ చూసిన తర్వాత కొన్నైనా అలవరచుకుంటే విద్యార్థులకు మేలు కలుగుతుందని అనుకోని నేను కృషి చేశాను. నాకు బోధన ప్రాణం. నా ఉద్యోగ విరమణ రోజున నేను చెప్పాను..డబ్బులు ఇవ్వకున్న ఫరావా లేదు ఉచితంగా పాఠాలు చెపుతాను అని. మళ్ళీ జన్మ అంటూ ఉంటే నేను తెలుగు లెక్చరర్ గానే జన్మిస్తాను.
ప్ర. మీ ఇతర పురస్కారాల వివరాలు తెలుపండి.
• చాలా ఉన్నాయి కానీ పురస్కారాలకు పొంగిపోయే మనస్తత్వం కాదు నాది. ఇచ్చేవారు గౌరవం తో ఇస్తారు మనం తీసుకుంటాం అంతే. నాకు 1972 లో సాహిత్య అకాడమీ అవార్డ్ వచ్చింది. వివిధ ప్రైవేట్ సంస్థల పురస్కారాలు దాదాపు ఇరవై దాకా ఉన్నాయి.
ప్ర. మీ గురించి చెప్పాల్సి వస్తే ఒక సాహితీ వేత్త గా, కవిగా, ఉప కులపతి గా, పరిశోధకులు గా, విమర్శకులు గా ఆచార్యులుగా ఉన్నారు. మీకు సంతృప్తి నిచ్చిన అంశం ఏది?
• మంచి ప్రశ్న అడిగారు. నేను ఉస్మానియా బోర్డు ఆఫ్ స్టడీస్ ఛైర్మన్ గా ఉన్నప్పుడు నాకు అందరూ బాగా సహకరించారు. నా జీవితం లో ఇప్పటివరకూ ఎప్పుడు రాజకీయాలు చేయలేదు. రాజకీయాలు చేయడం, సాటి వారి మీద కుట్రలు చేయడం నా జీవితం లో లేదు. అందుకే విద్యార్థులు, అధ్యాపక వర్గం నాకు సహకరించారు. నా పదవీ కాలం లో నా పైన చిన్న గొడవ కూడా లేదు. పూర్వ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారికి టీచర్ గా నా మీద గౌరవం. తెలుగు విశ్వవిద్యాలయం ఉప కులపతి గా నాకు అవకాశం ఇచ్చారు. నాకు అక్కడ అందరి సహకారం అమోఘం గా లభించింది. మొదటి సమావేశం లోనే దేన్నైనా సహిస్తాను కానీ, క్రమశిక్షణ రాహిత్యాన్ని సహించను అని చెప్పాను. అప్పటి వరకు తెలుగు విశ్వవిద్యాయంకు, నాక్ గుర్తింపు లేదు.  నేను నాక్ కమిటీ గుర్తింపు వచ్చేలా చేశాను. దాని కోసం నేను కష్టపడ్డాను, అందరూ సహకరించారు. యునివర్సిటి కి సున్నం వేయించి అందంగా కనపడెలా చేశాను. అక్కడ గార్డెన్ కూడా డెవలప్ చేశాను. పరిసరాల అందం మారిపోతే విద్యార్థులు కూడా ఆనందం గా చదువుతారనే భావన తో  ఆ పనులు చేశాను. తెలుగు విశ్వవిద్యాలయం  రూపు రేఖలు మారాయని అందరూ ప్రశంసించారు. ప్రపంచ తెలుగు సభల సందర్భంగా నన్ను 30 రోజుల వ్యవధి లో ఒక పెద్ద సావనీర్ తీసుకురావాలని కోరారు. దాన్ని ఛాలెంజ్ గా తీసుకొని కొందరు అధ్యాపకుల సహకారం తో నాలుగు రోజులలో 1100 పేజీల రాయల్ సైజ్ లో ప్రింట్ చేయించాను. మేము స్టాల్ పెడితే కొన్ని వేల కాపీలు అమ్ముడయ్యాయి అవి. సుమారు 60 లఘు పుస్తకాలు కూడా వేశాము. సరియైన అంశం పైన, నాణ్యమైన పేజీ లతో వేశాము అవి.  అది తెలుగు విశ్వవిద్యాలయానికి దక్కిన ఘనత.
ప్ర. ప్రస్తుతం వస్తున్న సాహిత్యం పట్ల మీ అభిప్రాయం చెప్తూ వర్థమాన రచయితలకు సూచనలు ఏవైనా ఇస్తారా..
• సాహిత్యం లో అనేక ప్రక్రియల లో రాస్తున్న ఎవరినీ నిరాకరించకూడదు. కానీ ఒక ప్రయోజనం ఉండాలి. ఒక సందేశం ఉండాలి. భాషా చాతుర్యం ఉండాలి. అవి లేకుండా అంతగా రచన రాణించదు. సినారె గారి భావన లో  ఎవరైనా ఒక రచనా బాగా లేదని అంటే కాలం ఒక ప్రవాహం. కాలం ప్రవహిస్తూ ఉంటుంది. అది మంచిని తీసుకెళ్లి, చేత్తను ఒడ్డు పైన పడేసి పోతుంది. సాహిత్యం కూడా అలాంటి ఒక ప్రవాహం అని అనేవారు.  ఇప్పుడు చాలా మంది చదవడం కు దూరంగా ఉంటున్నారు. సమయం చాలా అమూల్యమైనది. రచయితలు సమాజనికి ఉపయోగపడే రచనలు చేస్తే మంచిది. ఎవరు రాసిన ఒక ప్రామాణికతతో రాయాలి. భాష పట్ల గౌరవం ఉండాలి. భాష జ్ఞానం ఉండాలి. సంస్కృతి పైన, భాష పైన గౌరవం లేక పోతే ఆ జాతి ఎక్కువ కాలం నిలువదు. దేశాభిమానానికి భాషాభిమానమే మూలం అని కొమర్రాజు లక్ష్మణ రావు అన్నారు. ఇప్పుడు వస్తున్న భాష తీరు కొంచెం మారి తెలుగుదనం ఎక్కువ అయితే బాగుంటుంది.
August 25, 2021 1 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంట‌ర్వ్యూలు

వెల్లంకి సాహితీ పాలకంకి

by Ananthaacharaya K.S. August 25, 2021
written by Ananthaacharaya K.S.

“పల్లియలోనే పుట్టితిని పల్లియయె నను పెంచె, పల్లియె ఇల్లును వాకిలిన్ కలిమినిచ్చె బతుకు మెరుంగుపెట్టె’, ఆ పల్లియ ‘అమ్మ’, ‘ఆవనుచు’ పల్కులు పలుకగ నేరిపించె, నా పల్లియ నాకు దైవతము ప్రాణము ఓ ప్రభు విఠలేశ్వరా !

పల్లె వాసనల మట్టి పరిమళం అద్దుకొని, మల్లెలంత తెల్లని మనసుతో, చేను చెల్కల మీద పశువుల గిట్టల శబ్దాల నడుమ ఉదయించిన వెల్లంకి సాహితీ పాలకంకి డా|| కూరెళ్ళ విఠ్ఠలాచార్య గారు. తండ్రి ఛాయలు తెల్వదు ఆయన అనుపాలను నోచుకోలేదు. అమ్మ చేతుల పెరిగి అమ్మ తాతల గారాలపట్టిగా, మేనమామ మురిపాల అల్లుడై పల్లె పెరిగిన ఆచార్యుల వారు తన జీవితాన్ని పల్లెతోనే ముడివేసుకొని వెల్లంకిలోనే స్థిరపడినారు. ఆధునిక భావాలు, తిరుగుబాటు చిన్నప్పుడే అలవాటు చేసుకొని అన్ని కులాల పిల్లలను ఒకచోట చేర్చి సహపంక్తి భోజనం చేయించిన సాహసి. తదుపరి అనేక పరిణామాలకు బాధ్యుడిగా నిలిచి సమానత్వపు ఊపిరు లూదిన విఠలుని విరాట్ స్వరూపం. కష్టం వారి చిరునామ, కన్నీళ్ళు వారి దాహం తీర్చాయి. ఉపవాసాలు, పెద తండ్రి చిన్నచూపు అన్నీ కలిసి కూరెళ్ళ వారిలో చదువువైపు అడుగులు వేయించింది. ఒక ఆశయం, ధ్యేయంవైపుకు సాగే నిరంతర శ్రామికులై విద్యాసాధన చేసిన వినమ్రశీలి.

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని నీరునెముల గ్రామంలో కూరెళ్ళ లక్ష్మమ్మ వేంకటరాజం దంపతులకు జన్మించినారు. ఉర్దూ మాద్యమంలో ప్రారంభమైన చదువులోఎక్కడా వెనకబడలేదు. ఏడవ తరగతిలోనే తెలుగులో ఉత్తమ మార్కులు పొంది బేతోజు లక్ష్మీనారాయణ ఈశ్వరమ్మ ల పురస్కారం పొందిన పట్టుదల వీరిది. వీరి ఊరి కరణం కుమారుడు శ్రీహరిరావుగారిచ్చిన ప్రోత్సాహమే వీరి ఉన్నత విద్యకు కారణం. 7వ తరగతిలోనే వీరి తాతగారు బేతోజులక్ష్మీనారాయణ గారు మరణించినపుడు ‘స్మృతి కావ్యం’ రచించారు. 9వ తరగతిలో గోవిలాపంరాసారు. ఇది పాఠశాల కుడ్య పత్రిక ఉదయంలో ప్రచురించబడింది.

1954లో వెల్లంకి గ్రామంలో మిత్రులతో కలిసి శ్రీశంభు లింగేశ్వర స్వామి పేర గ్రంథాలయంస్థాపించారు. పెదనాయిన ఆధిపత్య ధోరణి కూరెల్ల వారిని వామపక్ష భావాల వైపు వెళ్ళేటట్లు చేసికమ్యూనిస్టుల పత్రిక విశాలాంధ్ర చదివేవారు. ఆ పత్రిక చదువద్దని ఆనాటి ప్రభుత్వం పోలీసు నిఘాపెట్టింది. నాటి కమ్యూనిస్టు నాయకుడు రావి నారాయణరెడ్డి పక్క గ్రామానికి వస్తే గొంగడి కప్పుకొనివెళ్ళి రహస్యంగా చూసి వచ్చిన సాహసి. రెవెన్యూ, కో-ఆపరేటివ్, విద్యుత్, న్యాయస్థానం, సేల్ టాక్స్ఆఫీసులలో ఉద్యోగం చేసినా నచ్చక ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకొన్న కర్మశీలి.

దేవుడొక్కడే నివసించు దేశమొక్కటే

జాతి ఒక్కటి చేయు భోజనమునొకటే

అయిన నెందుకో? కులముల పైన శ్రద్ధ

ఎవరో తలలేనివారు సృష్టించినారు

అని రాసిన అపర వేమన. తన అభిప్రాయాన్ని సూటిగా అలతి పదాలతో అద్భుతంగా రాసిఆదరణ పొందినారీ కవివరేణ్యులు. ఒకవైపు ఉద్యోగం మరొకవైపు రచనా వ్యాసంగంతో పాటుఉన్నత విద్య ఆర్జించాలనే తపనతో 1972లో ఎం.ఏ. పరీక్ష రాసి ఉత్తీర్ణులై ఉపాధ్యాయుని పదవినుండి ఉపన్యాసకులుగా ఎదిగారు. ఇంటి గేదెకు వైద్యం చేయించుచుండగా అది మీదపడటంమూలాన కూరెళ్ళ వారి కాలు విరిగింది. మూడు నెలలు బెడ్ మీద ఉండి కూతుర్లతో తను చెప్తూ’విఠలేశ్వర శతకం’ పూర్తిచేసిన ఘనత వీరిది.

తన విలువైన ఆస్తి ఆరెకరాల సారవంతమైన పంట భూమిని పేదల ఇళ్ళ నిర్మాణానికి అందించినఘనత వీరిది. నిరాడంబరత, నిర్భీతి, నిగర్వం, నిబద్ధత, నిజాయితీలతో కూడిన జీవితం విఠలాచార్యగారిది. నిండైన తెలుగు వేషధారణతో కన్పిస్తారు. క్రమశిక్షణ, సమయపాలన వీరికి రెండు కళ్ళలాంటివి. కార్యసాధన, వినమ్రత, కృతజ్ఞత, ఆదరణా ఆప్యాయతతో పూర్ణ

స్వర్ణభాండ మూర్తిమత్వంవీరిది. వీరి ప్రోత్సాహంతో ఎదిగిన వారిలో డా|| ఏనుగు నర్సింహారెడ్డి గారు, డా|| పోరెడ్డి రంగయ్య,కూరెళ్ళ శ్రీనివాస్, ఏలె లక్ష్మణ్, డా|| వాసా భూపాల్, సాగర్ల సత్తయ్యలాంటి వారు ఎందరో.

“నాకు కవిత్వమె బ్రతుకు, నాకు శ్రమియించెడివాడు ఇష్టుడున్” అని వీరు రాసిన త్రిపదలుదొందు దొందే రిక్షా కార్మికునికి అంకితం చేసిన ఆదర్శవంతులు.

పద్యాన్ని ప్రాణప్రదంగా ప్రేమించినా కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ అనే గద్య రచనను శక్తివంతంగాఅందించిన ధీశాలురు. జీవచైతన్యపు రచన ఇది. శ్రీ శ్రీ మహాప్రస్థానమ్ లాగా సాగిందీ రచన. మరొకఅద్భుత రచన శిల్పాచార్యులు. ఇందులో మనకు తెలుగు

గొప్పతనం, కవుల పరిచయాలు, కళాకారులుసకలం కల్పి వడ్డించిన విస్తరిది.

నానీల నేత్రాలు రాసి ప్రజలకు మరింత చేరువయినారు. మహాకవి దాశరథి పురస్కారాలతోపాటు అనేక పురస్కారాలు అందుకొన్న వీరు అన్నీ సాహితీ ప్రక్రియలను సుసంపన్నం చేశారు.ఇంకా 12 అముద్రిత గ్రంథాలున్నాయి. అయితే! సాహితీ బ్రహ్మ కూరెల్ల విగ్ధలాచార్య గారి సమగ్రసాహిత్యం ఒకే చోటికి రావాలని ఆశిస్తున్నాం. పదండి వారి ఇంటర్వ్యూలోకి వెళదాం…..

 1. ప్ర. బాల్యంలో కష్టపడిన ఉన్నత విద్యను అభ్యసించిన మీ విద్యా ప్రస్థానం గురించి తెల్పండి?

మా తండ్రిగారు నేను ఐదు నెలలపుడే ఈ లోకాన్ని వదిలి వెళ్ళారు. అమ్మ లక్ష్మమ్మకుఅప్పుడు 15 సం||లు మాత్రమే. మా మాతామహులు బేతోజు లక్ష్మీనారాయణ, ఈశ్వరమ్మ గారిగ్రామం నీరునెములలో విద్యాభ్యాసం ప్రారంభమైంది. మసూల్ దార్ అనే ముస్లిం ప్రయివేటు టీచర్  వద్ద పీర్ల కొట్టంలో అక్షరాభ్యాసం జరిగింది. ఉర్దూ మాధ్యమంగా విద్య కొనసాగింది. తిరిగి వెల్లంకికి వచ్చి షేక్ అహ్మద్ అనే ప్రైవేటు ముస్లీం టీచర్ వద్ద చేరి ఫీజు కట్టలేక బడి ఊడ్చి చదివాను. మా ఊరి కరణం కొడుకు బసవరాజు శ్రీహరిరావు గారి ప్రోద్బలం వలన రామన్నపేటలో 7వ తరగతి వరకు చదివాను. పన్నెండేళ్ళ వయసులోనే తాతగారి మరణం ‘స్మృతి కావ్యాన్ని’ రాయించింది. 1954- 55లో విశ్వకర్మ హాస్టల్ లో చేరి చదువు ప్రారంభించినా కష్టాల కడలిలోనే తేలియాడి, ప్రతి ఇంటిని ఆశ్రయించాను. హైస్కూలులో సుప్రసిద్ధ పండితులు కోవలె సంపత్కుమారాచార్యులు గారు సంస్కృతం బోధించినారు. 9వ తరగతిలో పాఠశాల కుడ్య పత్రిక ‘ఉదయ’కు సంపాదకుడని అయ్యాను. జనగామ రైలు ప్రమాదం పేరిట ‘అధిక వృష్టి’ కవిత వ్రాసి కరుణశ్రీ జంధ్యాల వారి పుస్తకం బహుమతిగా పొందాను. అందులోని పుష్పవిలాప ఘట్టం చూసి ‘గో విలాపం’ రాసాను. 1957లో హెచ్.ఎస్సీ. పూర్తి చేసాను. అనేక చిన్నాచితక ఉద్యోగాలనంతరం మేడ్చల్ ఉపాధ్యాయ కళాశాలలో శిక్షణ పూర్తి చేసుకొని నాటి గవర్నరు చేత షీల్డు అందుకున్నాను.

2. ప్ర. పాఠశాల ఉపాధ్యాయుడి నుండి ఉపన్యాసకుల వరకు మీరున్న ప్రతిచోట సాహిత్య వాతావరణం, సాంస్కృతిక వైభవం తీసుకొని వచ్చారు. ఇది ఎలా సాధ్యమైంది?

1960 లోనే భువనగిరి సమితిలోని వడాయిగూడెంలో అక్షరాస్యతా ఉద్యమం ప్రారంభించి “చచ్చేముందు సంతకమైనా చేయాలని” వయోధికులకు చదువు నేర్పించాను. నాకు మొదటి నుండి సాహిత్యం కళలు అంటే ఎక్కువ మక్కువ. గూడెం ప్రజలందరినీ చైతన్యపరిచి నాటకం వేయించి బహుమతులు ఇప్పించాను. సాహితీ సాంస్కృతిక వాతావరణం ద్వారా పిల్లల్లో సృజనాత్మకత పెంచవచ్చుననే ఉద్దేశ్యంతోనే ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళాను. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధియే లక్ష్యం పెట్టుకొని పాఠశాల నుండి జూనియర్ కళాశాల స్థాయినకు ఎన్నో సాహితీ పత్రికలు ప్రారంభించి తోటివారి ప్రోత్సాహం కరువైనా నా లక్ష్యం పూర్తి చేసాను. నాకు ఇష్టమైన ఈ కృషికి ఎందరో సహకరించారు.

౩. ప్ర. ఉపాధ్యాయ ఉద్యమనేతగా, సాహితీ విస్తరణ, గ్రంథాలయం ఉద్యమం ఇలా బహుముఖీనంగా జీవనంలో పోరు అలవాటుగా సాగి విజయం పొందారు విశేషాలు తెల్పండి?

సాహిత్యం నా శ్వాస నా రచనలను ఎప్పటికప్పుడు కొనసాగిస్తూనే, ఇవి నాతో ఆగకుండా వుండటానికి నా విద్యార్థులను రచనలవైపు ప్రోత్సహించాను. అలా అప్పటి నా విద్యార్థులు సాహితీవేత్తలుగా ఎదిగినారు. పరిశోధన చేసి, డాక్టరేటును పొందడం సంతోషకరమైన అంశం.

స్టేట్ టీచర్స్ యూనియన్ బాధ్యునిగా ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేశాను. ఉపాధ్యాయులు ప్రశాంతంగా ఉంటే పాఠశాల విద్య ప్రశాంతంగా కొనసాగుతుందని అభిప్రాయంతో వారికి అండగా నిలిచాను.

4.ప్ర. మీ సాహితీ ప్రస్థానానికి బీజాలు వేసి మిమ్మల్ని ప్రభావితం చేసిన గురవరేణ్యులు ఎవరు?

శ్రీ డోకూరి బాలబ్రహ్మచారి గారి వారు పుట్టు అధులు, అష్టావధాని. వారి అష్టావధానం విని ప్రభావితుణై వారికి చేరువయినాను. వారికి దృష్టిలోపం వలన నేనే అనేక గ్రంథాలు చదివి వినిపించాను. వారి ప్రభావం నాపై ఉంది. పద్యరచనలో నాకు వారు మార్గదర్శకమయినారు. కోవెల సంపత్కుమార గారి సంస్కృత బోధన నాకు బలాన్నిచ్చింది. బి.ఎన్.శాస్త్రి గారి లాంటి వారెందరో నా రచనలకు ప్రోత్సాహాన్ని అందించినారు.

5.ప్ర. మీరు చాలా సాహిత్య పత్రికలు నడిపారు కదా, వాటి వివరాలు తెల్పండి?

1961లో బాపూభారతీ అనే పత్రికను గోకారం పాఠశాలలో ప్రారంభించి విద్యార్థుల రచనలు పొందుపరిచాను. 1963లో మా ఊరు వెల్లంకి పాఠశాలకు ఉపాధ్యాయునిగా వచ్చి ‘మా తెలుగు తల్లి’ కుడ్య పత్రికను, 1967లో వలిగొండ ఉన్నత పాఠశాలలో ‘వలివెలుగు’ను ప్రారంభించి విద్యార్థులను కలం తట్టి ప్రోత్సహించాను. 1977లో సిరిపురం ఉన్నత పాఠశాలలో ‘చిరంజీవి’ పత్రికను ఏర్పాటు చేశాను. 1979లో నల్లగొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉపన్యాసకునిగా పదోన్నతి పొందాను. 1980లో ‘ప్రియంవద’ పత్రికను కళాశాల విద్యార్థులకు కొరకు వెలువరించాను. రామన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ‘ముచికుంద’ అనే వార్షిక సంచికను 1987లో తీసాం. రాష్టోపాధ్యాయ సంఘం పక్షాన, రామన్నపేట నుండి ‘మన పురోగమనం’ అనే పత్రిక తీసుకొచ్చి నడిపాం.

6.ప్ర. మీ పద్యాలు సులభశైలిలో ఉంటాయి. సమాజాన్ని ఆలోచింప చేస్తాయి, వీటి గురించి చెప్పండి?

‘విఠలేశ్వర శతకం’ సామాజిక స్పృహతో నిండిన శతకం అనేక అంశాలతో సాగింది. ‘శిల్పాచార్యులు’ పద్య సంకలనం సాహితీవేత్తలను, తెలుగు భాషను ఉగాది లాంటి సందర్భాలనో అక్షరబద్ధం చేశాను. ఇవన్నీ శ్రోతలకు ఆనందాన్ని, ఆలోచనలను కలిగిస్తాయి. కవితా చందనం, తెలంగాణా కాగడాలు, స్మృత్యంజలి లాంటి పద్య శైలిలో తీసుకొచ్చాను. నా పద్యాలు సులభశైలిలో నడుస్తాయి.

7.ప్ర. మీరు డాక్టరేటు పట్టా కోసం చేసిన పరిశోధన విశిష్టమైందీ విలక్షణమైంది వివరాలు చెప్పండి?

1977లో ఎం.ఫిల్ పరిశోధనకు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చేరాను. అప్పటివరకు ఎవరూ సృష్టించని ‘తెలుగులో గొలుసుకట్టు నవల’ ప్రక్రియను పరిశోధనాంశంగా తీసుకొని పరిశోధన కొనసాగించాను. ఆచార్య ఇరివెంటి కృష్ణమూర్తి గారి పర్యవేక్షణలో ఇరువది నాలుగు రచయితలు, రచయిత్రులను ఇంటర్వ్యూ చేసి వారి కొత్త అంశాలను వివరించాను. 1988లో ఆచార్య ముదిగొండ శివప్రసాద్ గారి మార్గదర్శకత్వంలో ‘తెలుగు నవలల్లో స్వాతంత్ర్యోద్యమ చిత్రణ’ అనే అంశంపై పరిశోధన చేసి డాక్టరేటు పట్టాను పొందటం మరిచిపోరాని అనుభవం.

8.ప్ర. చాలా సాహితీ సంస్థలను, విద్యా సంస్థలను ప్రోత్సహించి ముందుకు నడిచేలా వెన్నుదన్నుగా నిలిచి మార్గదర్శకత్వం చేశారు. వీటి గురించి చెప్పండి?

నేను ఎక్కడ పని చేసానో, ఆ కార్యక్షేత్రం నాకు మక్కువయింది. అందువల్ల ప్రతీచోట సాహితీ సంస్థను స్థాపించి కవులను, కవయిత్రులను ప్రోత్సహించాను. నృత్యభారతి, ప్రజాభారతి, మల్లెల భారతి, జనభారతి, మహిళాభారతి, భువనభారతి, అక్షరభారతి వేరువేరు ప్రదేశాల్లో ఎన్నో సంస్థలను స్థాపించినాను. కొన్ని సంస్థలు ఇప్పటికీ చాలా చక్కగా పనిచేస్తున్నాయి. ఎన్నో మంచి కార్యక్రమాలు నిర్వహించటం జరిగింది. అలాగే సాంస్కృతిక ఆధ్యాత్మిక సంస్థలను కూడా స్థాపించాను. సత్యగాయత్రీ ఆశ్రమం, వెల్లంకి, చైతన్య కళాస్రవంతి, సాహితీ స్నేహితులు, స్పందన- రామన్నపేట, స్ఫూర్తి సిరిపురం, పూర్వ విద్యార్థుల సమిది-వెల్లంకిలో ప్రారంభించాను. గీతాజయంతి ఉత్సవ సమితి- ఇంద్రపాల నగరం, సీనియర్ సిటిజన్ సమాఖ్య, బతుకమ్మతల్లి కళాబృందం లాంటి 25 సంస్థల వరకు స్థాపించి, ప్రోత్సహించాను. 11 విద్యాసంస్థల స్థాపనలో ముందున్నాను. అందులో మైత్రీ విద్యాలయం – సంతోష్ విద్యామందిర్ వెల్లంకి, 5 స్కూల్లు రామన్నపేటలో చందన ప్లే స్కూలు, చౌటుప్పల్ లో స్థాపనకు ముందున్నాను. శ్రీ శ్రీ విద్యాలయం చిట్యాలలో ఆ సంస్థలు చక్కగా కొనసాగుతున్నాయి.

9.ప్ర. మీ ఇంటినే గ్రంథాలయంగా మార్చి అనేక సాహిత్య గ్రంథాలను పరిశోధకులకు, సాహితీ పిపాసకులకు అందుబాటులోకి తెచ్చారు. ఈ ప్రాజెక్టు రూపకల్పన ఎలా జరిగింది?

అందరినీ చదివించాలన్నదే నా ధ్యేయం. ముఖ్యంగా సాహితీ సృజన జరుగటానికి చదవటం సోపానం. మా అమ్మాయిలను ఒప్పించి రెండు కోట్ల విలువగల మా ఊరు వెల్లంకిలో ఉన్న మా ఇంటిని గ్రంథాలయంగా మార్చి వేసాను. 2 లక్షల రూపాయల విలువ గల పుస్తకాలను సేకరించి ఉంచాను. చదువరులకు ఈ గ్రంథాలయం తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. ముఖ్యంగా నేను చదువుకొనేప్పుడు పడిన ఇబ్బంది ఇప్పటివారు పడకూడదనే ఈ గ్రంథాలయం స్థాపించాను. నా ఇంటిని గ్రంథాలయంగా మార్చినాక దాని ప్రక్కన చిన్న స్థలంలో రెండు గదులను నిర్మించుకొని అందులోనే ఉంటున్నాను. నా సర్వస్వం గ్రంథాలయం మాత్రమే.

10.ప్ర. మీ రచనల పైన ఎం.ఫిలు, డాక్టరేట్లు వచ్చాయి కదా వీటి గురించి చెప్పండి సార్?

నా ‘వ్యక్తిత్వం – సాహిత్యం’పై పరిశోధన చేసి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి నాగపురి శ్రీనివాసులు పిహెచ్.డి. పట్టాను అందుకొన్నారు. ‘విఠలేశ్వర శతకం’పై రెబ్బల మల్లికార్జున్ ఎం.ఫిల్ చేశారు. నా ‘శిల్పాచార్యులు’ గ్రంథంపై గంజి కళావతి ఎం.ఫిల్ చేశారు. ఇంకా అనేక పరిశోధనలు వివిధ విశ్వ విద్యాలయాల ద్వారా జరుగుతున్నాయి.

11.ప్ర. మీరు చాలా పురస్కారాలు, బిరుదులు పొందినారు కదా, పురస్కారాల మీద మీ అభిప్రాయం ఏమిటి?

దాశరథి పురస్కారం, రాధేయ, తేజా ఆర్ట్స్ జీవన సాఫల్య పురస్కారం లాంటివి ఎన్నో పొందాను. అభినవ పోతన, తెలంగాణ వేమన లాంటి బిరుదులు అందుకున్నాను. పురస్కారాలు, బిరుదులు వాటంతటవే మన సాహిత్య సృజనకు వెతుక్కుంటూ రావాలి. కాని మనం వాటికోసం పెంపర్లాడరాదు. పురస్కారాలు మనల్ని ప్రోత్సహిస్తాయి. అవి మనను ఇవి ముందుకు నడిపిస్తాయి.

12. ప్ర. మీరు సృజియించిన సాహితీ ప్రక్రియ ‘త్రిపద’ ప్రత్యేకత ఏమిటి?

త్రిపద నేను సృజియించిన ప్రక్రియ. అనుకోకుండా భావాత్మకంగా నేను రాసిన మూడు పాదాల రచనయే త్రిపదగా రూపుదిద్దుకుంది. జీవితంలోని అనేక సంఘటనలు సన్నివేశాలు, సంభాషణలు నా మనసుకు చిక్కి నన్ను కలిచివేసినప్పుడు పుట్టినవి ఈ త్రిపదలు. ఇందులో మొదటి రెండు పాదాలు భావ స్వామ్యం గలవిగా ఉంటూ మూడవ పాదం దాన్ని సమర్థిస్తూ మకుటంగా మలచబడింది.

“దేవుడు లేని గుడి / దేశికుడు లేని బడి / దొందూ దొందే” ఇలా సాగినాయి. ఈ ప్రక్రియ కవులందరు కొనసాగిస్తే బావుంటుంది.

13. ప్ర. వర్ధమాన కవులు మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు?

నేటి కవులలో అధ్యయనం చాలా తగ్గిపోయింది. తమ రచనలను మాత్రమే చదువుతారు. అలా కాకుండా ఇతర కవులను, సాహిత్యాన్ని, ఇతర భాషల సాహిత్యాన్ని పరిశీలించాలి. అధ్యయనం బాగా జరుగాలి. అప్పుడే సృజన బయటికొస్తుంది. కవి వాదసిద్ధాంతిగా మిగులకూడదు. ఆచరణావాదిగా మిగలాలి. ఈ సిద్ధాంతంపైన నేను నడిచాను. ఇదే ప్రబోధిస్తాను.

14. ప్ర. తెలంగాణా ఉద్యమంలో మీరు పాలుపంచుకున్న విధానం ఏమిటి?

నల్లగొండకు మంజూరైన విశ్వవిద్యాలయానికి ‘పోతన’ విశ్వవిద్యాలయంగా నామసాధనోద్యమం ప్రారంభించి నాయకత్వం వహించాను. ‘బతుకమ్మ’ కళాబృందం స్థాపించి ఉద్యమానికి స్ఫూర్తిని రగిలించాను. 1952లో విద్యార్థిగా తొలి ఉద్యమంలో 1969 మలి ఉద్యమంలో 2001 నుండి తుది ఉద్యమంలో కవి, రచయిత, సీనియర్ సిటిజన్ గా పాలుపంచుకున్నాను. అందరు నగరాలలో స్థిరపడ్డా మా వెల్లంకిలో స్వంత ఇంటిని ‘సాయీ సాహితీ’ కుటీరంగా ఏర్పరుచుకొని, ఇక్కడినుండే సాహితీ, సాంస్కృతిక, సామాజిక, విద్య, ఆధ్యాత్మిక కార్యకలాపాలు కొనసాగిస్తున్నాను. ఏ కవియైనా నన్ను వారి పుస్తకానికి ముందుమాట రాయమంటే, పల్లెటూరిలో ఆవిష్కరణ చేసుకుంటే తప్ప రాయను అని నిష్కర్షగా తెలిపి, దాని మీదనే, ఆ మాట మీదనే ఇప్పటివరకు నిలబడి ఉన్నాను.

15. ప్ర. వచన పద్యగేయ వ్యాస ప్రక్రియలను అన్నింటినీ నిర్వహించారు కదా మీకు ఏది చాలాఇష్టం?

కాన్ఫిడెన్షియల్ రిపోర్టు (గద్య కవితా సంకలనం) రాసినా, పంచమి సాహిత్య సంపుటి వేసినా ఏం రాసినా నా ఆయువుపట్టు పద్యం నాకిష్టమైనది పద్యం. అందుకే నా సాహిత్యంలో సింహ భాగం పద్యాలు ఆక్రమించాయి. అన్ని ప్రక్రియలు ప్రత్యేకమైనవే వేటికవి గొప్పవే.

16. ప్ర. మీ ఈ సాహితీ యానంలో మీ కుటుంబ పాత్రను తెల్పండి ?

నాకు 1963లో యమునతో వివాహం జరిగింది. ముగ్గురు కుమార్తెలు నర్మద, తపతి, సరస్వతి. అందరికీ వివాహాలు జరిగాయి. తపతి ఉపన్యాసకులుగా పని చేస్తుంది. అందరూ సత్సంతానం పొందినారు. నా భార్య యమున పక్షవాతంతో మరణించింది. తాను ఎప్పుడూ నా సాహితీ సృజనను ప్రోత్సహించిందే తప్ప నిరుత్సాహ పరుచలేదు. అలాగే మా అమ్మాయిలు మా ఇంటిని గ్రంథాలయంగా మార్చడానికి ఇవ్వడం సంపూర్ణంగా సహకరించినారు.

17.ప్ర. మీరు ఇంకా సాధించలేనివి ఏమైనా ఉన్నాయని అనుకుంటున్నారా?

పుస్తకాలతో ఒక వాహనం ఏర్పాటుచేసి, ఇంటింటికి పంపి అందరినీ చదువరులుగా మార్చాలి అన్నదే నా ధ్యేయం. గ్లకోమా వలన ఏర్పడిన అంధత్వాని అధిగమించి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నా. నా ఈ కోరిక నెరవేరాలని ఆశిస్తున్నా. చదువరులను తయారుచేసే ప్రణాళికలు రూపొందిస్తున్నా.

18. ప్ర. సాహితీ సంస్థలకు మీరందించే సందేశం ఏమిటి?

సాహితీ సంస్థలు ప్రణాళికాబద్ధంగా నడపాలి. వైవిధ్యభరిత కార్యక్రమాలు రూపొందించాలి. వ్యక్తి కేంద్రంగా కాకుండా సమిష్టిగా సాహితీ కార్యక్రమ నిర్వహణ జరిగితే మంచిది.

 

 

 

August 25, 2021 0 comment
1 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

రామప్ప – ఉలి కళ దర్భశయనం శ్రీనివాసాచార్యుల కవిత

by Dharba Shyayanam Srinivasacharyulu August 25, 2021
written by Dharba Shyayanam Srinivasacharyulu

దర్భశయనం శ్రీనివాసాచార్యులు గారు ఈ కవితను 6.1. 2012 వ తేదీన రంచించారు . 27.2.2012 ఆంధ్రప్రభ దినపత్రిక లో మొదటిసారి అచ్చయింది. శ్రీనివాసాచార్యులు గారు ఈ కవితను , వారు రామప్పను స్వయంగా దర్శించినప్పుడు అక్కడ వీరికి రామప్పను గురించిన విశేషాల్ని గోరెంట్ల విజయ్ కుమార్ అనే గైడ్ కు అంకితం చేసానని చెప్పారు . వరంగల్ జిల్లా లోని అద్భుత శిల్పసౌందర్యం , శిల్పి నైపుణ్యం రామప్ప విశేషాలను ప్రపంచానికి తమ ‘ఉలికళ’ కవితద్వారా తెలియజేయాలని ఎన్నో వేదికలపైన చదివాను అని అన్నారు . మయూఖ లో మీకోసం.

August 25, 2021 2 comments
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

రామప్ప శిల్పబంధం

by mayuukha August 25, 2021
written by mayuukha

రామప్ప శిల్పబంధం ఎన్నో విషయాలు చెప్పిన కొండపల్లి శేషగిరిరావుగారు ప్రపంచం మెచ్చిన ప్రఖ్యాత చిత్రకారులు . ఆయన కుంచె దించిన రంగుల్లో ఒదిగిన ప్రకృతి అందాలు గాని, ప్రబంధ నాయికానాయకులుగాని మనను ముగ్ధులను చేసినవే. ఆయన గీసిన రేఖాచిత్రాలలో దాగిన భారతీయ శిల్పసంపద మన చూపులను కట్టిపడేసేవే.
1940 దశకంలో కొండపల్లివారు విద్యార్థిగా ఉన్నప్పుడే కాకతీయ శిల్ప సంపద వైభవాన్ని , ప్రత్యేకంగా రామప్ప శిల్పకళను రేఖాచిత్రాలుగా చిత్రించి సభ్యసమాజానికందించారు. మారుమూల అడవి ప్రాంతం . జనసమ్మర్ధమైన స్థలకాదు. అంతగొప్ప దేవాలయం అక్కడ ఉన్నదని ఆనాడు ఎవరికీ ఎక్కువ తెలియదు. ఫోటో కెమెరాలు ఇంకా తెలంగాణ లో అడుగుపెట్టని ఆ కాలంలో హైదరాబాద్ లో ఉన్న ఆనాటి సాహితీవేత్తలకూ, సాధారణ ప్రజలకు కొండపల్లి శేషగిరిరావు గారి చిత్రలే రామప్ప శిల్ప సౌందర్యం పరిచయం చేసాయి. వారి రేఖాచిత్రాలు మచ్చుకు కొన్ని మయూఖ పాఠకులకు – మన తెలంగాణ ప్రతికలోని కొండపల్లి శేషగిరిరావు రామప్ప గురించిన వ్యాసం ప్రచురితమైంది.

August 25, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

సినీగేయాల పరామర్శ

by ఏలూరు అశోక్ కుమార్ రావు August 25, 2021
written by ఏలూరు అశోక్ కుమార్ రావు

పాటల పల్లకీలో ఊరేగించిన సముద్రాల రాఘవాచార్యులు

సముద్రాలగా పేరు తెచ్చుకున్న రాఘవాచార్యులుగారు సినీ గీత రచయితే కాకుండ, సిని మాటలకు, కథ, సంభాషణలు మాత్రమే కాదు వినాయక చవితి, బబ్రువాహన సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు.  1958వ సంవత్సరంలో విడుదలైన “భూకైలాస్” సినిమాలో పాటలన్నీ సముద్రాల వారే వ్రాశారు. ఇందులో ఒక పాట.

“జయ జయ మహాదేవా, శంభో సదాశివా, ఆశ్రిత మందారా, శృతి శిఖర సంచారా” తో మొదలయ్యే ఈ పాట  ఘంటసాలగారి భక్తి గీతాలలో ఎన్నదగినది, మిన్నయైనది.

శృతులనబడే వేదాల శిఖరమందు ఉండేవి ఉపనిషత్తులు. జీవాత్మను పరమాత్మను సన్నిధికి సమీపంగా (ఉప), నియమబద్ధంగా (ని), ఉంచునది (షత్). కనుక ఆ ఉపనిషత్తులలో సంచరించే వాడా అనే అర్థంలో వాడిన ‘శృతి శిఖర సంచారా’ వాక్యాన్ని మన కందించిన సముద్రాల వారి పాండిత్య వైభవానికి నమో వాక్కాలు.

నీలకంధరాదేవా, దీనబాంధవారావా, నన్ను గావరా ||నీలకంధరా||

సత్యసుందరాస్వామి, నిత్య నిర్మలాపాహి,

అన్యదైవమూ కొలువా, నీదు పాదమూ విడువా,

దర్శనమ్మునీరా, మంగళాంగా గంగాధరా ||నీలకంధరా||

ఈ పాట పల్లవి ‘నీలకంధరా’ నుండి ‘గంగాధరా’ వరకు ‘తిలంగ్’ రాగాన్ని ఉపయోగించారు.

‘దేహియన వరములిడు దానగుణ సీమా, పాహియన్నను ముక్తినిడు పరంధామా’, నీమమున నీ దివ్య నామ సంస్మరణా, ఏ మరకసేయుదును భవతాపహరణా, నీ దయా మయ దృష్టి దురితమ్ములారా, వరసుధా వృష్టి నా వాంఛలీడేరా, కరుణించు పరమేశ దరహాస భాసా, హరహర మహాదేవ కైలాసవాసా’

ఇంతవరకు శుద్ధసావేరి రాగాన్ని ఉపయోగించారు.

“ చరణం నుండి పాట పూర్తి అయ్యేవరకు హృదయమున్న ప్రతి మనిషి, స్పందనకు లోను కావలసిందే. లేకుంటే

దానిని పాషాణంగా అనుకోవాలి.

“అన్య దైవమూ కొలువా’ చరణం ద్వారా రావణ బ్రహ్మ వ్యక్తిత్వాన్ని సముద్రాలవారు ఆవిష్కరించారు.

‘ఫాల లోచన నాదు మొరవిని జాలిని పూనవయా,

నాగభూషణ నన్నుగావక జాగును సేయకయా, 

కన్నుల విందుగ భక్తవత్సల కావగ రావయ్యా ||కన్నుల||

ప్రేమీ మీర నీదు భక్తుని మాటను నిల్పవయా ||ప్రేమ||

శంకరా శివశంకరా, అభయంకరా, విజయంకరా

ఈ చరణంలో సముద్రాలవారు ‘నాద నామక క్రియ’ రాగాన్ని ఉపయోగించారు.

నందమూరి తారాకరామారావు, రావణబ్రహ్మగా అభినయించిన ఈ పాటలో నాగభూషణం (పరమశివునిగా), బి.సరోజాదేవి (పార్వతీదేవిగా) కనిపిస్తారు.

సుదర్శనం, గోవర్ధనం, సంగీతం కూర్చిన ఈ పాటను పాటల పోటీలలో పాడే ఏ గాయకుడైనా ప్రత్యేకంగా ప్రశంసించబడతాడు.

సముద్రాలవారు పండిత కుటుంబం నుండి వచ్చినవారు. వారికి విషయ పరిజ్ఞానం, గ్రంథపఠనా బలం, భాషా పటిమ మెండుగా వున్నాయి.

ఈ పాటలో సముద్రాలవారు విశేషణాలు బాగా వాడారు.

భూ కైలాస్ సినిమా ఎ.వి.యం సంస్థ నిర్మించినది. దర్శకుడు కె.శంకర్. 1958 సంవత్సరంలో విడుదలైన ఈ చిత్రం  తమిళ, కన్నడ భాషల్లో కూడా నిర్మాణం జరిగి, 3 భాషల్లోనూ విజయవంతమైనది.

రావణబ్రహ్మ తన తల్లి అయిన కైకసి కోరిక మేరకు పరమశివుని ఆత్మలింగం తేవడానికి తపస్సు చేస్తాడు. మహావిష్ణువు మాయ ప్రభావంతో ఆత్మలింగానికి బదులు పార్వతీదేవిని ఇవ్వమని శివుని కోరతాడు రావణుడు. తిరిగి రెండవసారి తపస్సు చేయగా పరమశివుడు తన ఆత్మలింగాన్ని ఇస్తు ఎట్టి పరిస్థితుల్లోనూ లింగాన్ని నేలపై పెట్టవద్దని చెప్తాడు. నారద మహర్షి సలహామేరకు గణేషుడు బాల బ్రాహ్మణుని రూపంలో రాగా, రావణుడు, సంధ్యావందనం చేయడానికి, ఆత్మలింగాన్ని గణేషునికి ఇచ్చి తాను వచ్చేవరకు, లింగాన్ని పట్టుకోవాలని కోరతాడు. తాను 3 సార్లు పిలుస్తానని, ఆలోగా రాకపోతే నేలపై పెట్టేస్తానని గణేషుడు షరతు విధిస్తాడు. రావణుడు సంధ్యావందనం చేస్తున్న సమయంలో గణేషుడు 3 సార్లు పిలువగా రానందున ఆత్మలింగాన్ని గణేషుడు నేలపై పెడతాడు. రావణుడు వచ్చి లింగాన్ని తీయడానికి ప్రయత్నించగా, భూమిలో నుండి లింగం రాలేదు. ఆ ప్రదేశమే గోకర్ణ క్షేత్రం (భూకైలాస్)గా ప్రసిద్ధి చెందినది.

సముద్రాల సీనియర్ వి మరికొన్ని పాటలు

జగదభి రాముడు శ్రీరాముడే, రఘుకుల సోముడు ఆ రాముడే పాట లవకుశ (1963)
జననీ శివకామినీ నర్తనశాల (1963)
రాజశేఖరా నీపై మోజు తీరలేదురా అనార్కలి (1955) చిత్రం
శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా పాట లవకుశ (1963)
సీతారాముల కల్యాణం చూతము రారండీ పాట సీతారామ కళ్యాణం (1961) సినిమా
జయహే కృష్ణావతారా పాట శ్రీకృష్ణావతారం (1967) చిత్రం

పిలువకురా అలుగకురా నలుగురిలో నను ఓ – పి. సుశీల బృందం – రచన: సముద్రాల సీనియర్
కరణా చూడవయా వరముజూపవయా మురళీ మోహనా వినీల మేఘశ్యామా – ఘంటసాల బృందం
పలుకరాదటే చిలుకా సముఖములో రాయభారమెందులకే – ఘంటసాల
ఓ తారకా నవ్వులేలా నను గని అందాలు చిందెడి – ఘంటసాల, పి.భానుమతి
ఓ చిగురాకులలో చిలకమ్మా … చిన్నమాట వినరావమ్మా

ఇది మంచి సమయము రారా తెలుగు చలనచిత్ర చరిత్రలో ఒక మహిళ ఇతరులకు పాడిన తొలి నేపథ్యగీతం. ఈ పాటను అలనాటి నటి, గాయని అయిన బెజవాడ రాజరత్నం భక్త పోతన (1942) చిత్రంలో రాజనర్తకి భోగిని పాత్రధారిణి అయిన సామ్రాజ్యం అనే నటీమణికి పాడారు. ఈ పాటను అలనాటి ప్రముఖ రచయిత సముద్రాల రాఘవాచార్య  రచించారు.

సముద్రాల జూనియర్

సముద్రాల సీనియర్ కుమారుడే సముద్రాల వెంకట రామానుజాచార్యులు, తన తండ్రికి ఇష్టం లేకపోయినా, ఇతరుల ఆకాంక్షమేరకు సినీరంగంలోకి అడుగుపెట్టి, మాటలు, పాటలు వ్రాశాడు.

బ్రుతుకు తెరువు సినిమాలోని ‘అందామె ఆనందం’ పాట సముద్రాల జూనియర్ కలం నుండి జాలు వారినదే.

తండ్రి, కొడుకు ఇద్దరు కూడా సినీరంగంలో ఉండడంతో, తండ్రిని సీనియర్, కొడుకుకు జూనియర్ గా టైటిల్స్ లో వ్రాసేవారు.

బ్రతుకు తెరువు సినిమా వచ్చింది. తనకు బతుకు తెరువునిచ్చింది అని సముద్రాల (జూనియర్) చెప్పేవారు.

‘అందమె ఆనందం’ వ్రాశానని తన తండ్రి రాఘవాచార్యులగారితో  చెప్పబోతే , కీట్స్ ‘A thing of beauty is joy for ever’ను తెలుగు భాషలోకి తిప్పివ్రాశావా ఏమిటి? అని ఆయన సణిగారట.

అందమె ఆనందం, అందమె ఆనందం

ఆనందమె జీవిత మకరందం

కేవలం బాహ్య సౌందర్యమే కాకుండ, ప్రకృతిలో ఉన్న ప్రతి వస్తువులోను మన అందాన్ని ఆస్వాదించవచ్చని, ఆ ఆస్వాదనే మనకు ఆనందం కలిగిస్తుందని, మన జీవితంలో తేనెను కురిపిస్తందని సముద్రాల (జూనియర్)గారి భావన.

పడమట సంధ్యారాగం, కుడి ఎడమల కుసుమపరాగం

ఒడిలో చెలి మోహనరాగం, జీవితమే మధురాను రాగం

సాయంకాలవేళ సూర్యుడు అస్తమిస్తున్న సమయంలో కిరణాలు అరుణవర్ణంతో ప్రకాశిస్తుంటాయి. ఆ సాయంకాలవేళ ఆ అందాన్ని ఆస్వాదించడం ఒక అదృష్టంగా భావిస్తారు సముద్రాల. ఆ కిరణాలు పూలమొక్కలపై పడి, ఆ మొక్కలకున్న పూలపుప్పొడిని ద్విగుణీకృతం చేస్తే, మన మనస్సు మధురానురాగంలోకి వెళుతుంది. తన ఇష్టమైన ప్రేయసి తన ఒడిలో పడుకొని మోహనరాగాన్ని ఆలపిస్తే, ఇంకేం కావాలి మానవ జీవితానికి.

పడిలేచే కడలి తరంగం, ఒడిలో జడిసిన సారంగం

సుడిగాలిలో ఎగిరే పతంగం, జీవితమే ఒక నాటక రంగం

సముద్రం ఒడ్డుకు కూర్చొని, అలలు ఒడ్డుకు చేరే సమయంలో ఆ సవ్వడిని ఆస్వాదించునపుడు మన జీవితం పులకిస్తుంది. జింక భయపడి, రక్షణకొరకు మనలను చేరినపుడు దానిని మనం మన ఒడిలో పెట్టుకొని, దాని శరీరాన్ని, నిమురుతంటే ఆ కోమలత్వంతో మన మనస్సుకు కూడా హాయి అనిపిస్తుంది. గాలిపటం (పతంగం) ఆకాశంలో ఎగరవేస్తుంటే, సుడిగాలి వచ్చినపుడు అది గింగిరీలు కొడుతూ, కొద్దిసేపు క్రిందికి వచ్చి, మళ్ళీ పైకి ఎగురుతున్నప్పుడు, మన జీవితం కూడ పతంగంలాగే ఉన్నత స్థితికి, నీచస్థితికి అనగా ఒడిదుడుకలకు లోనై, ఒక నాటక రంగంలా వుంటుందని రచయిత భావన. నాటక రంగంలో కొంతసేపు శోకరసం,కొంతసేపు శాంతరసం ప్రదర్శించబడతాయో, పతంగం లాగే మన జీవితాలు కూడ అనుభవాలకు లోనవుతాయని రామానుజాచార్యుల వారి భావన.

జూనియర్ గారు వ్రాసిన మరికొన్ని పాటల పల్లవులు

  1. పాండురంగ మహత్మ్యం సినిమాలో “జయకృష్ణా ముకుందా మురారి”
  2. శాంతినివాసం సినిమాలో “తుషార శీతల సరోవరాన”
  3. మంచి మనసుకు మంచి రోజులు సినిమాలో “ధరణికి గిరిభారమా”
  4. కులదైవం సినిమాలో “పయనించే ఓ చిలుకా”
  5. బొబ్బిలి యుద్ధం సినిమాలో “శ్రీకర కరుణాలవాల”

పాటలు జూనియర్ గా ప్రతిభకు తార్కాణాలు. వారు లేకున్నా వారి పాటలు మన తెలుగు నేలలో “ఊగేములే తులతూగేములే ఇక తొలిప్రేమ భోగాలా” అంటూ అందరినీ ఊసులాడుతున్నాయి.

August 25, 2021 1 comment
2 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

వ్యంగ్య చిత్రాలు కార్టూన్లు

by మూటుపూరు విఠల్ చందర్ రావు August 25, 2021
written by మూటుపూరు విఠల్ చందర్ రావు

-మూటుపూరు విఠల్ చందర్ రావు
Tech Arch Delivery Manager, Accenture
+91-9908817120

August 25, 2021 1 comment
4 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • విజ్ఞానదాయకం – కె.బి.సి.
  • ఎంతగా చదివితే అంత భాషా సౌందర్యాన్ని సృష్టించుకోగలం – వి.ఆర్ విద్యార్థి
  • 12, , 14
  • క్విజ్ -3
  • ‘ఆమె’

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us