మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
వ్యాసాలు

యోగ ప్రాముఖ్యత

by Bandi Usha August 25, 2021
written by Bandi Usha

యోగా అంటే కలయిక, కూడిక, ఏకమగుట. వీటిని సాధించటమే యోగము.

శరీరము, మనసు కలయిక కోసం చేసేసాధనే యోగా. ఆ రెండూ ఏకమవటం యోగము.

“యజ్యతే ఏతదితి యోగః,

యుజ్యతే అనేన ఇతి యోగః”

ఇంద్రియములను వశపరచుకొని ఏకాగ్రత సాధించటానికి అత్యుత్తమమైన మార్గం యోగ.

“యోగా సమత్వ ముచ్చితహః”

“చిత్త వృత్తి నిరోదహః”

అభ్యాస వైరాగ్యాల వలన చిత్తవృత్తులను నిరోధించే సమత్వంతో జీవించటానికి రాచబాట యోగ.

యోగా రెండక్షరాల పథము. ఇందులో శతకోటి శతఘ్నుల బలం ఉంది. ఇది ఒక శాస్త్రము. శాస్త్రము అంటే నిరూపించబడినది. ఆధునిక వైద్యశాస్త్రం, విజ్ఞాన శాస్త్రం రెండూ ముక్తకంఠంతో యోగాకు యోగ్యతా పత్రాన్ని ఇచ్చాయి.

వేదభూమిగా ఖ్యాతిగాంచిన భరతావని సకలశాస్త్రాలకు పుట్టినిల్లు, సర్వశాస్త్రాలకు మూలం వేదాలు. మానవ జీవిత పరిపూర్ణత్వమునకు  శాస్త్రీయపరమైన మూలప్రమాాలు వేదాలే. ఇందు యోగశాస్త్రము కూడా తెలియజేయటం జరిగింది.

5000 సంవత్సరాలకు పూర్వమే భారతదేశంలో ఉన్న జ్ఞానము యొక్క అంతర్భాగము యోగా. మానవునిలోని అనంతమైన మేధోశక్తిని వెలికి తీసి పరిపూర్ణ జీవన విధానానికి తోడ్పడుతుంది. ఇందుకు యోగా, ధ్యానము అవసరము. అప్పుడే ఏకతా స్థితిలో జీవించవచ్చు.

ఈ చరాచర సృష్టిలోని సమస్త జీవరాశుల కన్నా మానవ జన్మ లభించటం అదృష్టమైతే, అది సద్వినియోగపరుచుకున్నప్పుడు వరము అవుతుంది.  ఎందుకంటే జీవితాన్ని యాంత్రికంగా కొనసాగించటానికి, చైతన్య వంతంగా గడపటానికి ఎంతో తేడా ఉంది.

నేటి మానవుడు శాస్త్ర, సాంకేతిక రంగాలలో ఎంతో  అభివృద్ధి చెందినప్పటికీ, ఆరోగ్య విషయంలో మాత్రం నాటి మానవుని కన్నా వెనుకంజలో  ఉన్నాడు.  దీనికి కారణం వారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించినట్లుగా నేటి మానవుడు శ్రద్ధ వహించటం లేదు. భౌతిక వస్తువులకు, ధనము, దుర్వ్యసనాలకు ప్రాముఖ్యత నిస్తూ అనారోగ్యం పాలవుతున్నారు. దీనితో వ్యక్తిగత జీవితంలోను, సామాజిక జీవితంలోను సుఖశాంతులు కరువయ్యి ఆనందమనే సహజ స్థితిని కోల్పోతున్నాడు.

వైద్యరంగం ఎంతో అభివృద్ధి చెందినప్పటికీ, పుట్టగొడుగుల్లా కొత్త వ్యాధులు పుట్టడంతో మనిషి ఆయుఃప్రమాణం తగ్గిపోతుంది. దీనికి పరిష్కారం యోగ విద్యే.

జీవితంలో కొన్ని విషయాలను కనుక్కోవటం వెనుక ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే, అది మానవుని యొక్క జీవనశైలిని సులభతరం చేయటమేకాక జీవిత లక్ష్యాన్ని తెలియచేయటం. అలాంటివాటిలో యోగా ప్రముఖమైనది. మన ప్రాచీనులంతా యోగ విద్య నాచరించి సంపూర్ణ జీవితాన్ని అనుభవించారు. ఇది ఖర్చుతో కూడుకున్నది కాదు. శరీరానికి ఎటువంటి హాని ఉండదు. శాస్త్రీయ పరిశోధనల ద్వారా ఋజువ అవటంతో మన పాశ్చాత్యులు కూడా దీనిని ఆచరిస్తున్నారు.

మనిషి శరీరం చేయకల్గిన అత్యున్నత వ్యాయామాలతో యోగా ప్రథమస్థానంలో ఉంది. అందుకే ప్రస్థుతం ప్రపంచంలో ఎంతో ఆదరణకు నోచుకుంది. ఏ ఇతర వ్యాయామాలతో పోల్చి చూసుకున్నప్పటికి దీనిలో ఉన్న విశిష్టత వలన యోగ విద్య నాచరించే వారిని ప్రత్యేకంగా నిలబెడుతుందని నిస్సహందేహంగా చెప్పవచ్చు.

శరీరంలో రుగ్మత ఉంది అంటే, అది మనసుకు సంబంధించిన లోపమే. క్రమం తప్పకుండా యోగా చేస్తూ, ధ్యానమాచరిస్తూ శారీరక దృఢత్వం, మానసిక పటుత్వాన్ని పెంచుకుంటే మనలోని శక్తులు వికాసము పొంది పరిపూర్ణానందానికి సహకరిస్తాయి. యోగా అవసరం గుర్తించి ఎక్కువ మంది ఆ వైపుకు పరుగులు తీస్తూ ఆరోగ్యాన్ని పొందుతున్నారు. ఇంకా మార్పు రావాలి.

ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి చేర్చే ఆచరణాత్మక, క్రియారూపమైన ఈ విద్యను అందరూ నిరంతర సాధనతో ఆనందంగా, ప్రశాంతంగా, సుదీర్ఘ ఆయువుతో, సంపూర్ణ స్వేచ్ఛతో పరిపూర్ణంగా జీవితాన్ని గడపాలని ఆశిస్తున్నాను. ముందుముందు యోగా, ధ్యానం వాటి ఆచరణ విధానం చిత్రాలతో తెలియచేస్తారు.

ఈ బ్రహ్మవిద్యను ఆదరించి, ఆచరించి, ఆరోగ్యం పొందితే నేను చేసిన కృషి సఫలమవుతుంది.

 

 

August 25, 2021 0 comment
1 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

నాట్యశాస్త్ర కోవిదుడు – ఆధునిక భరతముని – తెలుగు భాషా, సంస్కృతీ వికాసానికి అవిరళ కృషి చేసిన – డాక్టర్ పోణంగి శ్రీ రామ అప్పారావు

by Ponangi BalaBasker August 25, 2021
written by Ponangi BalaBasker

సహృదయులు, సాహితీమూర్తి, అలుపెరుగని నిత్య పరిశోధకులు, సాంస్కృతిక సేవా తత్పరులు, శ్రీ కళాపూర్ణ బిరుదాంకితులు ఆచార్య పోణంగి శ్రీరామ అప్పారావు గారు – పశ్చిమ గోదావరి జిల్లా, కొవ్వూరు తాలూకా, బందపురం అనే గ్రామంలో 1923 జూలై 21వ తేదీన శ్రీయుతులు పోణంగి రామమూర్తి, శ్రీమతి లక్ష్మీ నరసమ్మ దంపతులకు 11వ సంతానంగా జన్మించారు.  అంటే ఈ రోజు వారి 98వ జయంతి సందర్భంగా  ఆ ఆధునిక భరతముని జీవిత విశేషాలను ఒకసారి మననం చేసుకుందాం.

భరతముని సంస్కృతంలో రచించిన ” నాట్యశాస్త్రం ” గ్రంధాన్ని P.S.R. అప్పారావు గారు – గుప్త భావ ప్రకాశిక సహితంగా – తెలుగులోకి అనువదించారు. దీనినే ఆయన ఆంగ్లంలో ” A Monograph on Bharata’s Natya Sastra ” అనే పేరుతో రచించారు.  ” నాట్యశాస్త్రం ” గ్రంథ రచన అప్పారావు  గారి జీవితాన్ని ఒక మలుపు తిప్పింది.  మామూలు అధ్యాపక వృత్తి నుంచి, పరిశోధకునిగా, విమర్శకునిగా, కళా వ్యాఖ్యాతగా రూపాంతరం చెంది – ఆయన విశేషమైన కీర్తి గాంచారు. 1952లో మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో ప్రొఫెసర్ గా ఉన్నప్పుడు – B.A. విద్యార్థులకు ” సాహిత్యం – సౌందర్య శాస్త్రం – తులనాత్మక అధ్యయనం ” బోధించవలసి వచ్చింది. తనకు అంతగా పరిచయం లేని ఈ పాఠ్యఅంశాన్ని బోధించడానికి లోతుగా అధ్యయనం చేయాలని భావించి భరతుని నాట్యశాస్త్రాన్ని కూలంకషంగా చదివారు. భరతుడు సంస్కృతంలో రచించిన నాట్యశాస్త్రంలోని ప్రతి వాక్యం, ప్రతి పదం ప్రస్తుత పరిస్థితులకు సరిపోయేలా ఉన్నాయని గ్రహించి – ఎంతో శ్రమకోర్చి తెలుగులోకి అనువదించారు. 36 అధ్యాయాలలోని 6 వేల శ్లోకాలను తేట తెలుగులోకి అనువదించి ఆంధ్రులకు చక్కటి కళా గ్రంధాన్ని బహూకరించిన ధన్యజీవి ఆచార్య పోణంగి శ్రీరామ అప్పారావుగారు.  సుమారు వెయ్యి పేజీలకు పైన ఉన్న ఈ గ్రంధంలో సంస్కృత మాతృకలోని శ్లోకాలలోని భావాన్ని పాశ్చాత్య తత్వాలతో పోలుస్తూ – సహేతుకమైన వ్యాఖ్యానాన్ని రచించారు. రాజమండ్రి నుండి వెలువడిన ” సంస్కృతి ” పత్రికలో ” నాట్యశాస్త్రం ” ధారావాహికంగా ప్రచురితమైంది.  1961లో ఈ గ్రంధానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది.  ఈ బహుమతి అందుకోడానికి ఢిల్లీ వెళ్ళినప్పుడు – అప్పటి ప్రధానమంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ, ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ తమ మధ్య అప్పారావు గారిని కూర్చోబెట్టుకుని తేనీటి విందు స్వీకరించి – గ్రంథకర్తలు, మేధావుల పట్ల  తమకున్న అభిమానాన్ని, గౌరవాన్ని చాటుకున్నారు.

భరతముని ” నాట్యశాస్త్రం ” తో పాటు ఆచార్య అప్పారావు గారు నందికేశ్వరుని ” అభినయ దర్పణం ” గ్రంధాన్ని – తెలుగు, ఇంగ్లీషు భాషల్లోకి అనువదించి – అభినవ నదికేశ్వరునిగా ఆంద్ర వాజ్మయ చరిత్రలో నిలిచారు. అలాగే ఆయన రచించిన – సాత్వికాభినయం, ఉత్తమాంగ అభినయం, శారీరాభినయం, చేష్టాకృత అభినయం, హస్తాభినయం వంటి గ్రంధాలు నృత్యాన్ని అభ్యసించే కళాకారులకు పఠనీయ గ్రంథాలుగా – ఆయా కళలను బోధించే అధ్యాపకులకు కరదీపికలుగా విజ్ఞానాన్ని అందిస్తున్నాయి. నాట్య, నాటక, సాహిత్య రంగాలకు ఎంతో ఉపయుక్తంగా ఉన్నాయి. ఆయన రచించిన “విశ్వభారతి” నవల ఉన్నత పాఠశాల విద్యార్థులకు తెలుగు ఉపవాచకంగా ఎంపికయ్యింది.  ఇంకా “తాజ్ మహల్” నాటకం, “వేణువు” వచన కవిత, మంత్రి తిమ్మరుసు, ఉలూపి వంటి రచనలు విశేషంగా సాహిత్యాభిమానుల ప్రశంసలందుకున్నాయి. అప్పారావుగారి సృజనాత్మక సృష్టికి నిదర్శనాలుగా నిలిచాయి.

అప్పారావు గారు తెలుగు భాషా సమితి వారు ప్రచురించిన – విజ్ఞాన సర్వస్వం – తెలుగు సంస్కృతి – విశ్వసాహితి – లలిత కళల సంపుటాల్లో – పలు వ్యాసాలు రచించారు. అదేవిధంగా – భారతి, కిన్నెర, పరిశోధన, జయంతి వంటి పత్రికల్లోనూ – వివిధ అభినందన సంచికల్లోనూ – ఎంతో విలువైన సమాచారంతో వీరు రచించిన వ్యాసాలు ప్రచురితమయ్యాయి. ఇవి ఆయన పరిశోధనా పటిమకూ, సాహిత్య ప్రతిభకు, పాండిత్య వైభవానికీ ప్రతీకలుగా నిలిచాయి.  ఆచార్య అప్పారావు గారు ఆంధ్రప్రదేశ్ లోని నృత్యాలపై రచించిన పుస్తకాన్ని – 1969 లో రాష్ట్ర సంగీత నాటక అకాడమీ ప్రచురించింది. మహా నాటక కర్త ” ధర్మవరం రామకృష్ణమాచార్య ” జీవిత గాధను – అప్పారావు గారు రచించగా – కేంద్ర, రాష్ట్ర సాహిత్య అకాడమీలు – 1974,  1989 సంవత్సరాల్లో ప్రచురించాయి. వీరు రచించిన ” ప్రధమ ఆంద్ర నాటక కర్తలు ” అనే గ్రంధంలో – అనేక మంది నాటక రంగ ప్రముఖుల జీవిత విశేషాలతో పాటు – ను సోదాహరణంగా వివరించారు.

ఇరవయ్యో శతాబ్దంలో జన్మించిన సుప్రసిద్ధ శాస్త్ర-సాహిత్య పరిశోధకులలో డాక్టర్ పోణంగి శ్రీ రామ అప్పారావు  గారిది ఒక ప్రత్యేక స్థానం.  1860 నుండి 1960 వరకు ఉన్న నూరేళ్ళ తెలుగు నాటక వైభవాన్నిసమగ్రంగా సమీక్షించి ” తెలుగు నాటక వికాసం ” అనే పరిశోధనా గ్రంధాన్ని తెలుగు ప్రజలకు, ముఖ్యంగా నాటక రంగ ప్రేమికులకు కానుకగా అందించారు. నాటక సాహిత్యంపై పరిశోధన చేసిన, చేస్తున్న ప్రముఖులందరికీ అప్పారావుగారు అనువదించిన ఈ సిద్ధాంత గ్రంధమే స్ఫూర్తినిస్తోంది.  1956 – 1959 సంవత్సరాల మధ్య – హైదరాబాద్ లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆచార్య ఖండవల్లి లక్ష్మీ రంజనం గారి పర్యవేక్షణలో చేసిన ఈ పరిశోధనకు – 1961 లో పీ హెచ్ డీ పట్టా పొందారు. ఈ పరిశోధనలో భాగంగా అప్పారావుగారు సుమారు 2 వేల నాటకాలు, 4 వేల ఏకాంకిక నాటికలు, వెయ్యి మంది రూపకర్తల వివరాలను సేకరించి సమీక్షించి మనకు అందించారు. ఈ గ్రంధం ఆయనకు మంచి ఖ్యాతినార్జించి పెట్టింది.

B.A. ఆనర్స్ డిగ్రీ పొందిన అనంతరం పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం లోని D.N.R. కళాశాలలో తెలుగు ట్యూటర్ గా ఉద్యోగ జీవితం ప్రారంభించారు. అనంతరం రాజమండ్రి, మద్రాసు, కడప, శ్రీకాకుళం మొదలైన పట్టణాల్లోని ప్రభుత్వ కళాశాలల్లో తెలుగు అధ్యాపకునిగా దాదాపు 10 సంవత్సరాలకు పైగా పనిచేశారు.   రాజమండ్రీ లో అక్కడ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా నాటికలు రచించి వారిచేత ప్రదర్శింపజేశారు. విద్యార్థినుల చేత మగ వేషాలు వేయించి వారిని ప్రోత్సహించారు.

ఆ తర్వాత 1959 లో పాఠ్యపుస్తకాల జాతీయీకరణ ప్రత్యేక అధికారిగా, సాంస్కృతిక వ్యవహారాల ప్రత్యేక అధికారిగా నియమితులయ్యారు. పాఠ్య గ్రంధాల రచన, ముద్రణ విషయంలో అప్పారావు గారు చూపిన శ్రద్దాసక్తులను గమనించి, అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్న P.V. నరసింహారావు గారు 1968లో  ఏర్పాటైన తెలుగు అకాడమీకి మొదటి డైరక్టరుగా అప్పారావు గారిని ఎంపిక చేశారు. తెలుగు అకాడమీ లక్ష్యాలైన తెలుగు భాషా వ్యాప్తి, అభివృద్ధి, ఆధునికీకరణ, అధికార భాషగా అమలులో రాష్ట్రప్రభుత్వానికి సహకరించడంతో పాటు – వివిధ పాఠ్యపుస్తకాలు, పరిభాషక పదకోశాలు, అనువాద గ్రంధాల ప్రచురణ పెద్ద ఎత్తున చేపట్టారు. అతి తక్కువ కాల వ్యవధిలో – దాదాపు 4 వందల పాఠ్య పుస్తకాలు తెలుగు మాధ్యమంలో తీసుకువచ్చిన ఘనత అప్పారావుగారిదే.  తెలుగు అకాడమీ చేపట్టిన అన్ని పాఠ్య, విద్యా విషయక ప్రచురణల్లో – వ్యవహారిక భాషనే ప్రవేశపెట్టారు. తెలుగు అకాడమీ మూడు పువ్వులు, ఆరు కాయలుగా విరాజిల్లేలా పనిచేశారు. తద్వారా తెలుగు భాషకు ఎనలేని కృషి చేశారు.

1974లో నాటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు గారు, విద్యా, సాంస్కృతిక శాఖ మంత్రి మండలి వేంకట కృష్ణారావు గారు, ప్రపంచ తెలుగు మహా సభలు నిర్వహించాలని తలపెట్టినప్పుడు – ఆ కార్యక్రమ నిర్వహణా భారాన్ని అప్పగించడానికి సమర్ధుడైన అధికారి ఎవరా అని అన్వేషించి – చివరికి ఆ బాధ్యతను P.S.R. అప్పారావు గారి భుజస్కంధాలపై పెట్టారు. చేపట్టిన ప్రతి పనినీ కేవలం ఉద్యోగ ధర్మంగా కాకుండా స్వంత పనిగా భావించేవారు. పగలంతా రాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాల శాఖ ప్రత్యేక అధికారిగా సచివాలయంలోనూ, రాత్రంతా ప్రపంచ తెలుగు మహాసభల ఆహ్వాన సంఘం ప్రధాన కార్యదర్శిగా రవీంద్రభారతి మొదటి అంతస్తులోని కార్యాలయంలోనూ – నిద్రాహారాలు మాని పనిచేశారు.  1975 ఏప్రిల్ నెల 12వ తేదీ నుంచి వారం రోజులపాటు – హైదరాబాద్ లాల్ బహదూర్ స్టేడియంలో వైభవోపేతంగా జరిగిన ప్రప్రథమ ప్రపంచ తెలుగు మహా సభలను అనితర సాధ్యంగా నిర్వహించారు. ఇది వారి కీర్తి కిరీటంలో కలికి తురాయిగా భాసిల్లింది.

ప్రపంచ తెలుగు మహా సభల్లో చేసిన తీర్మానం నేపథ్యంలో ఏర్పాటైన అంతర్జాతీయ తెలుగు సంస్థకు వ్యవస్థాపక డైరెక్టరు గా నియమితులైన అప్పారావుగారు ఇతర రాష్ట్రాలలో, ఇతర దేశాలలో ఉన్న ప్రవాసాంధ్రులతో – విద్యా, సాంస్కృతిక సంబంధాలను పెంపొందించి, తెలుగు భాషా సంస్కృతులకు అంతర్జాతీయ ఖ్యాతి లభించడానికీ – ప్రపంచం నలుమూలలా ఉన్న తెలుగు ప్రముఖులను అందరినీ ఒకే వేదిక పైకి తీసుకురావదానికీ – విశేష కృషి చేశారు. అదేవిధంగా విదేశాలలో జరిగిన తెలుగు మహా సభలలో కూడా – ఆయన – ప్రముఖ పాత్ర పోషించారు.

1981లో ఆనాటి ముఖ్యమంత్రి N.T. రామారావు గారు దానిని తెలుగు విశ్వవిద్యాలయంలో విలీనం చేయడంతో – అప్పారావు గారు తిరిగి ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక వ్యవహారాల శాఖ డైరక్టర్ గా బదిలీ పై వచ్చి, 1983 లో పదవీ విరమణ చేశారు.

తెలుగు అకాడమీ, అంతర్జాతీయ తెలుగు సంస్థలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక శాఖ కు వ్యవస్థాపక డైరక్టర్ గా ఆయన చేసిన కృషి అపర భగీరథ ప్రయత్నంగా పేరుగాంచింది.  అప్పారావు గారు మృదుభాషి. సౌమ్యుడు. విద్వన్మణి.  బంధు మిత్రులతో సైతం ఎట్టి పరిస్థితుల్లోనూ పరుషంగా కానీ, కటువుగా కానీ మాట్లాడేవారు కాదు. సహోద్యోగులు తప్పు చేస్తే మృదువుగా మందలించేవారే తప్ప ఎవరి మనసును నొప్పించేవారు కాదు. తనతో భావ సారూప్యం గల వ్యక్తులతో తన అవసరానికి తగ్గట్టు ఒక జట్టును తయారుచేసుకుని, తనకు అప్పగించిన బాధ్యతను – చడీ చప్పుడూ లేకుండా పూర్తిచేసేవారు.

చివరగా రాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాల శాఖ సంచాలకునిగా ప్రభుత్వ సర్వీసు నుండి పదవీ విరమణ చేసిన ఆచార్య అప్పారావు గారు ఆ తర్వాత సాహితీ, సాంస్కృతిక సేవకు ద్విగుణీకృత ఉత్సాహంతో పునరంకితమయ్యారు. దాదాపు రెండున్నర దశాబ్దాల పాటు రాష్ట్రం లో తెలుగు సాంస్కృతిక రంగ అభివృద్ధికి మార్గనిర్దేశనం చేశారు.  ఆంధ్రప్రదేశ్ లో ఎన్నో సాహితీ, సాంస్కృతిక, విద్య విషయక సంస్థలకు శ్రీకారం చుట్టి, తమ దీక్షా, దక్షతలతో వాటికి గుర్తింపు, రాణింపు తెచ్చారు.  చాలా కాలం హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి చెందిన సరోజినీ నాయుడు స్కూల్ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ సంస్థను వ్యవస్థీకరించి – సమన్వయ కర్తగా, ఆచార్యులుగా పనిచేసి – ఆ సంస్థ ఉన్నతికి ఎంతగానో శ్రమించారు.   ఆ విధంగా పరిపాలన, బోధన, పరిశోధనా రంగాల్లో – అప్పారావు గారు చేసిన కృషి అనిర్వచనీయమైంది. ఈ విషయంలో ఆయనకు ఆయనే సాటి.

* రాష్ట్ర ప్రభుత్వంనుంచి-1980లో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుతో పాటు – పలు అవార్డులు, రివార్డులు, ప్రశంసా పత్రాలు అందుకున్నారు.

* వివిధ సాహితీ, సాంస్కృతిక సంస్థల నుంచి 1987 లో రాష్ట్ర నాట్య సామ్రాట్, 1990లో నాటక రత్న, 1992 లో కళారత్న వంటి బిరుదులు అనేకం అందుకున్నారు.

* మద్రాసు తెలుగు అకాడమీ ఉగాది పురస్కారం, రాజాలక్ష్మీ సాహిత్య పురస్కారం ఆయన్ను వరించాయి.

వీరి తండ్రి గారు  గ్రామ కరణంగా పనిచేసేవారు.  నిత్యం భాగవత పారాయణ చేస్తూ ఉండేవారు. వారు చదివేటప్పుడు దగ్గర కూర్చుని ఆలకించడం వల్ల, చిన్న వయస్సులోనే పోతనామాత్యుని పద్యాలు కొన్ని అప్పారావుగారికి కంఠస్తమయ్యాయి.  తల్లి గారు ఏమీ చదువుకోలేదు. ఎప్పుడూ పిల్లలతో, మనమలతో సతమతమౌతూ ఉండేవారు. అనుబంధాలతో, మమకారాలతో అల్లుకున్న పెద్ద ఉమ్మడి కుటుంబం వారిది. వారి మండువా లోగిలి ఎల్లప్పుడూ బంధుమితృలతో, పరివారంతో, పశుసంపదతో, ధాన్యాదులతో కళకళ లాడుతూ ఉండేది.

వారి చిన్న తనంలో – గ్రామంలో పిచ్చుకుంట భాగవతార్లు ప్రదర్శించే ” ప్రహ్లాద” , “రామ నాటకం” వంటి నృత్య రూపకాలు అప్పారావుగారిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆ కళాకారులను వీరి తండ్రిగారు, ప్రోత్సహించి, పోషించేవారు. అదే వారి కళాతృష్ణకు బీజం నాటింది.  అప్పుడే – ఆయనకు – కళల పట్ల అవ్యాజమైన అనురాగం పుట్టింది. ప్రాధమిక విద్య స్వగ్రామం లో పూర్తి చేసిన అనంతరం అప్పారావు గారు కొవ్వూరులో అన్నగారి ఇంట్లో ఉండి, విద్యాబుద్ధులు నేర్చుకున్నారు. అప్పారావు గారు ఆరవ తరగతి నుండి స్కూల్ ఫైనల్ వరకు కొవ్వూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివారు. రాజమండ్రీ లో ఇంటర్మీడియట్ చదివారు. ఆ రోజుల్లోనే – కవి సామ్రాట్ విశ్వనాధ సత్యనారాయణ గారి ” వేయి పడగలు ” చదివి – ఆ సాహితీమూర్తి పట్ల – ఆరాధన పెంచుకున్నారు. ఆయన వద్దే B.A. చదవాలన్న తలంపుతో – విజయవాడ శ్రీ రాజా రంగయ్య అప్పారావు కళాశాలలో డాక్టర్ పుట్టపర్తి శ్రీనివాసాచార్యులు గారు ప్రిన్సిపాల్ గా ఉన్న కాలంలో డిగ్రీ పూర్తిచేసి – 1944 లో విశాఖపట్నం ఆంద్ర విశ్వవిద్యాలయం నుండి – తెలుగు భాషా, సాహిత్యాలు అభిమాన విషయాలుగా B.A. ఆనర్స్ పట్టా అందుకున్నారు. విశ్వనాథ గారి సాంగత్యంలో తెలుగు సారస్వతంపై విపరీతమైన ఆసక్తి పెరిగింది.  అక్కడ చదువుతుండగానే ” తాజ్ మహల్ ” నాటికను రచించారు.  విద్యార్థి దశ లోనే చిన్న చిన్న నాటికలు వ్రాసి, దర్శకత్వం వహించడంతో పాటు వాటిలో పాత్ర పోషణ కూడా చేసి, తోటి విద్యార్థులతోకలిసి ప్రదర్శించేవారు.  1946 లో M.A. డిగ్రీ తీసుకున్నారు. 1956లో  ఉస్మానియా విశ్వవిద్యాలయంలో PHD చేయడానికి హైదరాబాద్ వచ్చినప్పుడు – అప్పారావు గారికి – సాహితీ స్రష్టలు దేవులపల్లి – రాయప్రోలు – నార్ల వంటి వారితో పరిచయం ఏర్పడింది.

1941 లో S.S.L.C. పరీక్షలో ఉత్తీర్ణులైన అనంతరం వెంకటరమణమ్మ గారితో వీరి వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. అందరూ ఉన్నత విద్యలనభ్యసించి, ఉన్నత స్థాయిలో స్థిరపడి, తండ్రిగారి ఆశయాలకు అనుగుణంగా జీవనం సాగిస్తున్నారు.

ఆధునిక భారతమునిగా నిర్విరామ సాహిత్య, కళా సేవ చేసిన ఆచార్య పోణంగి శ్రీరామ అప్పారావు గారు కొంత కాలం అనారోగ్యంతో బాధపడి 2005 జూలై ఒకటవ తేదీన హైదరాబాద్ లో తుది శ్వాస విడిచి కళా సరస్వతి చెంత చేరారు.

82 సంవత్సరాలు ఎంతో ఫలవంతమైన జీవితాన్ని గడిపిన అప్పారావు గారు  – ఈ రోజు భౌతికంగా మన మధ్య లేకున్నా- తన రచనల ద్వారా మన హృదయాలలో వెలిగించిన విజ్ఞాన జ్యోతి – నిరంతరం కాంతిని ప్రసరిస్తూనే ఉంటుంది. తరతరాలకూ ఉపయోగపడే అపూర్వ సాహితీ సంపదనూ, కీర్తి, ప్రతిష్టలనూ మనకు మిగిల్చిన ఆచార్య పోణంగి శ్రీరామ అప్పారావు గారు నిజంగా ధన్యజీవి.

 

 

 

August 25, 2021 1 comment
0 FacebookTwitterPinterestEmail
కథలు

బన్నూఫ్యాషన్స్

by కోటమర్తి రాధాహిమబిందు August 25, 2021
written by కోటమర్తి రాధాహిమబిందు

లక్ష్మి ఏవెన్యూలో రెండు బ్లాకులు.. ధనలక్ష్మి.. వరలక్ష్మి.. ఒక్కో బ్లాక్లో వంద ఫ్లాట్స్.. రెండు బ్లాక్స్కు కలిపి ఓ లేడీ స్క్లబ్.. భర్త నారాయణ రిటైర్కావడంతో వారం రోజుల క్రితం వరలక్ష్మి బ్లాక్ లోకి అద్దెకి వచ్చింది అలివేలు. అంతకు ముందే భర్త కూతురి ఆలోచనతో ప్రోత్సాహంతో ఇంట్లో వుంటూనే బట్టలు అమ్మే బిజినెస్ చేయాలి అనుకుంది.. ఓ సాయంత్రం లేడీస్ క్లబ్బుకు వెళ్లి తన గురించి తాను పరిచయం చేసుకొని ఫలానా అని చెప్పుకుంది. నాలుగు రోజుల తర్వాత విజయ అనే ఆవిడ అలివేలు ఇంటి తలుపు తట్టింది.. అదృష్టం ఎప్పుడో ఒకసారి తలుపు తడుతుంది కరెక్ట్గా ఆ టైం లోనే తలుపు తీయాలి అన్న వీరలెవెల్లో తలుపు తీసింది అలివేలు.

‘రండి రండి రండి దయ చేయండి.. తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ’ అన్న పాట లెవెల్లో విజయను ఆహ్వానించింది అలివేలు.. ఇద్దరూ చాలాసేపు మాట్లాడుకున్నారు.

“ఇప్పటికి ఎంత మంది వచ్చారు”?

“ఒకరు వచ్చారు.. మీరు సెకండ్.. మీరు నాకు చాలా చాలా నచ్చారు.. నేను ఎప్పటి నుంచో మీకు పరిచయమైన  వ్యక్తి లా మీరు మాట్లాడుతుంటే నాకు భలే హ్యాపీగా ఉంది.. మీకో చీర ఫ్రిగా ఇస్తాను.. దయ చేసి ఎవరితో మాత్రం అస్సలు అనకండి.. నేను ఇలా అందరికీ ఇవ్వలేను కదా” అలివేలు అలా అనేసరికి విజయ తెగ ఆనంద పడిపోయి తాను ఆమెకు నచ్చేలా మాట్లాడి నందుకు తనని తానే గొప్పగా మౌనంగా అభినందించుకుంది.. పైకి మాత్రం చాలా బింకంగా మెయింటెయి న్చేసింది.

“ఏ అవసరం పడినా ధనలక్ష్మి బ్లాక్లో ఉండే ప్రతిమ దగ్గరే బట్టలు కొనాల్సి వచ్చేది.. విపరీతంగా ధరలు పెంచుతుంది.. అందరం కాస్త తగ్గించాం..మీరు  క్లబ్కు వచ్చి చెప్పారు కదా.. చీరెలు మిగతా వెరైటీస్ ఎలా వున్నాయో చూసి పోదామని వచ్చాను” అంది విజయ.

“మెనీమెనీ థాంక్స్అండి.. ఎవరో మంజుల గారు అట.. ఆవిడే మొదట వచ్చారు.. నాలుగు చీరలు కొన్నారు ఈ రోజు ఇద్దరిని తీసుకొస్తామన్నారు కొత్తగా వచ్చాం.. మీరూ పది మందికి చెప్పి సహాయ పడండి.. రేట్స్ కాస్లీ  ఉంటాయి ముందు రెండు వాయిదాల్లో చెల్లించేలా అనుకున్నాను.. కొత్త కాబట్టి  మూడు వాయిదాల్లో ఇద్ధామనుకున్నాను. కాశీ నుండి పట్టు చీరలు తెప్పిస్తాను డిమాండ్ని బట్టి సొంతంగానే యిస్తున్నాం కూడా.. మీరు ఏవైనా కొత్త కొత్త సలహాలు ఇస్తే తప్పక పాటిస్తాను.. మీరు నాకు చాలా మంచిగా అనిపిస్తున్నారు.. మీలాంటి వాళ్ల ప్రోత్సాహమే మాకు అండ..బలం” అలా చాలాసేపు ఆమెను ఆపి ఆపి పోనివ్వకుండా మాట్లాడింది అలివేలు.

అలివేలు మాటల తాకిడికి మూడు వెయ్యి రూపాయల చీరలతోపాటు ఒక ఫ్రి

కూడా  పట్టు కెళ్ళింది  విజయ. అలివేలు ఆ చీరెధర కూడా టోటల్లో కలిపి వేసిందన్న వూహ విజయకు రాలేదు..అలివేలుకు రావాల్సినంత వచ్చింది.

****                         ****

“అక్కడ రేట్లు తక్కువగా ఉన్నాయి అంటున్నారు”

“సరితా మేడం..  మీరు కూడా ఇలా అంటే నేను ఎవరికీ చెప్పుకోవాలి? మీరు ఎన్నిసార్లు ఎన్ని చీరెలు నాదగ్గర కొన్నారు? అయినా  మన బ్లాక్వాళ్ళు నాకు అండగా ఉండరా? మనం మనం ఒకటి కదా.. నా గురించి ఎవరో పుకారు లేపారు.. అందుకే ఇలా కాస్తా డౌన్ అయ్యాను.. అయినా ఏం పర్వా లేదు మేడం మీలాంటి వాళ్ళ అండ నాకు చాలా ఉంది” చెప్పిందే ఇంకోసారి మరోసారి గంటసేపు చెప్పింది ప్రతిమ. సరిత ప్రతిమ మాటల ప్రవాహానికి తల్లడిల్లిపోయింది. ఒక్కో చీర పదిహేను వందల రూపాయల చొప్పున మూడు చీరలు.. వెయ్యి రూపాయల చొప్పున రెండు డ్రెస్సులు మొత్తం ఆరు వాయిదాల్లో చెల్లించేట్లు మాట్లాడుకుని వెళ్ళిపోయింది.. ఆ రోజు క్లబ్లో అలివేలు ప్రతిమల టాపిక్లు మెయిన్గా అయ్యాయి.

****                         ****

పదిహేనురోజులు గడిచాయి.. అలివేలు నోట్చేసుకున్న పేపర్లోని వివరాలు ఏవరో ఇచ్చిన కొత్త డైరీ లోకి  ఎక్కించాడు నారాయణ.

“ఇదిగో.. అన్ని ఇలా నోట్చేసుకో.. విడి పేపర్ల మీద రాయకు..ఇంకో విషయం. వచ్చిన వాళ్ళతో నీకు మాట్లాడడం అంత బాగా రావటం లేదు.. నువ్వు ఏదన్న తప్పుగా మాట్లాడితే నేను ఒక స్పూనో.. ఒకగరిటో.. ఓ ప్లేటో.. క్రింద పడేస్తాను.. నువ్వు అర్థం చేసుకుని లోపలి కన్నారా.. లేదా జాగ్రత్తపడు”

“అలాగే”

“చాలా మంది వాట్సాప్ లో బట్టలు డ్రెస్సులు ఫోటోలు పెట్టమంటున్నారుకదా.. ముందు మనం ఈ బిజినేస్కు ఒక మంచి పేరు పెట్టాలి”

“ఇంట్లోనే కదా అమ్మటం..పేరు ఎందుకు”?

“ఫ్యూచర్లో ఇలాగే ఉంటామా ఏంటి? ఒక మంచి పేరు అయితే ఉండాలి”

“చిన్ను..జున్నూ..గున్నూలాగా మన మనవడి పేరు బన్నూ ఫాషన్స్ అని పెడదామా”?

“బాగుంది బాగుంది.. బిజినెస్ లోకి రాగానే నీబుర్ర కూడా బాగానే పనిచేస్తుంది”

కాలింగ్బెల్మోగింది..”సరే.. నా బుర్ర ఎంత బాగాప నిచేస్తుందో ముందు ముందు మీకే తెలుస్తుంది గాని.. మీరు వంట ప్రయత్నం మొదలు పెట్టండి” నవ్వుకుంటూ ముందు గదిలోకి వెళ్ళింది అలివేలు.

****                             ****

నెల రోజులు గడిచాయి.. వరలక్ష్మి బ్లాకులో అలివేలు బట్టల బిజినెస్  జోరుగా సాగుతుంది.. బట్టల బండిల్ రావటం అయిపోవడం.. రావటం అయిపోవడం.. “నిత్య ఖరీదులు.. పచ్చ నోట్లలా” ఉంది వ్యాపారం.. ఆనందంతో  కూతురికి ఫోన్చేసింది అలివేలు.

“అమ్మా..ఎలా ఉన్నారు”?

“బాగున్నాం”

“అల్లుడు ఊరెళ్తా అన్నారు..వెళ్లారా”?

“వెళ్లారు.. నాన్న ఏం చేస్తున్నారు”?

“నాన్న..కూర చేస్తున్నారు..వచ్చిపోయే వాళ్ళు ఎక్కువయ్యారు”

“అన్నిజాగ్రత్తగారాసుకుంటున్నావా”?

“డైరీలోనోట్చేశారు నాన్న..నేను కూడా అలవాటు చేసుకుంటున్నాను.. అయినా ఇంకా కొత్తక దానాకు.. ఈ వ్యాపారం పుణ్యమా అని నాన్నకు బోర్కొట్టకుండా ఉంది.. నాకు కూడా చాలా సహాయ సహకారాలు అందిస్తున్నారు.. ముఖ్యంగా నాన్నకు వంట పని కూడా అలవాటు అయింది.. నేను వంటజోలికే వెళ్లటం లేదు.. సరే ఉంటానమ్మా.. మళ్లీ మాట్లాడుతానులే.. ఎవరో వచ్చారు” కాల్కట్చేసింది అలివేలు.

****                             ****

రెండు రోజులు గడిచాయి.. అలివేలు లేచి తలుపు తీసేసరికి నాలుగు పెద్దపెద్ద కార్టన్స్ కనిపించాయి. భర్తను కేకేసి వాటిని లోపలికి జరిపించింది. సంవత్సర కాలం గడిచింది.. అలివేలు వ్యాపారం ముప్పయి పువ్వులు అరవై కాయల్లా అయింది. ఫ్లాట్స్లో వాళ్లంతా వాళ్లు కొనుక్కోవడమే కాకుండా బంధు వర్గాలు స్నేహితులతో కూడా కొన్నికొన్ని కొనిపించసాగారు.. అలివేలు మాటకారి తనం అంతగా వాళ్ళను ప్రభావితం చేసింది. మొబైల్మ్రోగింది.

“అమ్మా..చెప్పు” అంది అలివేలు.

“అమ్మా..నీకు మెనీమెనీ థాంక్స్ అమ్మా”

“నాకా? ఎందుకే”

“అమ్మా..నేను పడిపోకుండా నన్ను నిలబెట్టినందుకు”

“నీమొహం.. చాల్లే.. అయినా ఇందులో నేను చేసింది ఏముందే.. అన్ని ఆలోచనలు మీనాన్న గారి వినీవి. .దేనికైనా పోటీ ఉంటేనే కదా లాభం. నాన్న రిటైరయ్యారు.. పెన్షన్ ఫర్వాలేదు.. ఇద్దరం హాయిగా బ్రతకవచ్చు.. నీ పరిస్థితి తెల్సుకుని నీకు పోటీగా నన్ను నిలబెట్టారు.. వచ్చాం..వ్యాపారం వృద్ధిచెందటానికి అల్లుడుగారు సరుకుతెస్తున్నారు. ఎన్నెన్ని వూర్లు తిరుగు తున్నారు? ఎంతెంత సరుకు ఇద్దరికీ తెస్తున్నారు.. అంతా వాళ్లిద్దరి సహకారమే కదా.. డల్ గా ఉన్న నీ వ్యాపారం మళ్లీ పుంజుకుంది. . తల్లి తండ్రిగా మాకు ఇంతకంటే ఇంకేం ఆనందం కావాలి”?

“అమ్మా”

“వ్యాపార మెళకువలు.. మాట్లాడే విధానం నువ్వు నాన్న నాకు నేర్పించారు.. నీతోపాటు మాకు లాభాలు వస్తున్నాయి.. ఖాళీగా వుండకుండా చేదోడు వాదోడు అన్నట్లు ఎంత హాయిగా రోజులు వెళ్ల దీస్తున్నాం.. సరదాగా  ఒక మాట చెప్పనా? నేను నాన్నలా ఉద్యోగం చేస్తున్నట్లు నాన్న నాలా వంట చేస్తున్నట్లుగా వుంది. మళ్ళీ నాన్నతో అనకు ఫీల్ అవుతారు.. నేను అందరికీ తెలిసిపోయాను.. అంతా పెళ్లిళ్లకు కూడా మన దగ్గర కొంటున్నారు. ఇంకేంకావాలి? కానీ ఓ విషయం”

“నేను చెప్తాను నువ్వు ఉండు.. మనం తల్లి బిడ్డలమని బయట చెప్పేద్దాం”

“అదే చెప్పబోతున్నాను.. అప్పుడే వద్దే పిచ్చిమొహమా.. ఇలాగే కొంతకాలం గడవనీ.. ఇప్పటి వరకు ఈ విషయం ఎవరికీ తెలియదు.. ఇదో బిజినె స్టాక్టిక్స్.. పోటీ ఉంటే లాభం ఎక్కువ.. ఈ మాట ఇదివరకే అనుకున్నాం.. అయినా ఏ ప్లాట్స్లో ఉండేవాళ్ళు అయినా ఎక్కువగా తలుపులు మూసుకునే ఉంటారు.. ఎవరి బిజీ వాళ్ళది.. మన విషయంలో ఎందుకు ఇంట్రెస్ట్చూ పిస్తారు? ఏదో కనుక్కోవాలనే తీరిక ఎవరికి ఉంది”?

“ఎప్పుడన్నా బయటపడితే”

“అయ్యో.. మీకు తెలియదా.. చాలామందికి తెలుసు.. అని  నవ్వుకుంటూఅంటాం.. అదే మన సమాధానం”

“అమ్మా”

“అంతగా ఆశ్చర్యపోకు.. ఇది వ్యాపారం.. మనవడు బన్నుఎలా వున్నాడే? నన్ను అడుగు తున్నాడా”?  అలలు అలలుగా నవ్వింది అలివేలు.

“పేరు పెట్టావుగా.. బన్నూ ఫాషన్స్ అని..రేపటిరోజున  వాడి పేరు పెట్టుకున్నందుకు నీ బిజినెస్లో నిన్ను ఎంత పర్సంటేజ్ అడుగుతాడో.. వాడు నీకంటే తెలివికలవాడు.. ఉంటానమ్మా” ఆనందంగా అంది  అలివేలు  కూతురు  ప్రతిమ.

“మంచిదమ్మా.. ఆల్దబెస్ట్.. గుడ్లక్” అంది ప్రతిమ తల్లి అలివేలు.

 

****        సమాప్తం         ****

August 25, 2021 7 comments
1 FacebookTwitterPinterestEmail
కథలు

కాని కాలం

by Butam Mutyalu August 25, 2021
written by Butam Mutyalu

నాలుగు అన్నం పొట్లాలను వారి చేతికిచ్చి ”ఇగ నడవుండ్రి” అన్నడు. అవి దీస్కున్న జోగమ్మ, పుల్లయ్య, సామి, సాయమ్మలు
వారికి చేతులెత్తి నిండ సలామ్‌లు పెట్టిర్రు అలా పెట్టి వారు వడివడిగా ముందాుకు కదిలారు.
అటువైపునుంచి ఓ కాళీ ట్రాలీ ఆటో రయ్యిమంటు దాూసుకొచ్చింది. ఆ పెద్దాసారు దాన్ని ఆపి ”ఎటువైపు
ఎల్తున్నవ్‌రా” అని అడిగాడు. ”సారు మా ఇంటికెళ్తున్న” అని ఆటో అతననగానే ”అచ్చ మూటముళ్లెత్తుకుని పోతున్న
గాళ్లను, వారు వెళ్లే చివరి బస్టాప్‌లో దింపు.” అని తన మానవతను చాటుకున్నాడు. డ్యూటీలో లాటిపట్టి కఠినంగా
వ్యవహరించే అతను తనలోను సాటిమనుషులపట్ల దాయాజాలికరుణ ఉందాన్నడనికినిదార్శనంగా నిలిచాడు అతను.
”అలాగే సార్‌” అంటు ట్రాలీ ఆటో ముందాుకు పోనిచ్చి వారి ముందాపిండు, ఆటో దిక్కు కంగారుపడుతూ
చూసింది సాయమ్మ ”ఇగో సూడండి ఆ పెద్దా సారు చెప్పిండు బస్టాపుల దింపుత జల్ది ఎక్కుర్రి” అని ఆటో అతననగానే
”అమ్మయ్య కశ పాణం తావున పడ్డది సారు దాయళ్లోడేరో ఎక్కుర్రా” అని శిడంల ఎక్కి కూకుండ్రు అందారు. ఆటో
రయ్యిమంటు ముందాుకు దాూస్కపోతుంది.
”ఏంది పుల్లయ్య బావ మనబతుకు ఇట్టైపోయే బతికిచెడ్డోని భాగ్యం చూడల్నట చెడిబతికినోని చెంపలు చూడలట,
చెంపలు ఉబ్బిందిలేదాు, బాగుపడ్డది లేదాు” అని సాయమ్మ అనగానే ”ఏం చేస్తం పిల్ల లోకం మీదా పాపం పెర్గింది ఇది
దాుర్గాలం అందాుకే కాలం ఇట్టైంది. ఇది ఎన్కటి కాలమా మనిషిని మనిషి పీక్కతినే కాలం, మనకు ఇగ గతిలేని పానాన్కి
గంజినీల్లె పాన్కం అదే ఆసరైతది గనిపా” అని నిరాష వదానంతో అన్నడు పుల్లయ్య.
ఆటో రైయిమంటు ముందాుకు సాగింది వారు చెప్పిన చోట ఆగింది. వారు దిగి వీస్తూపోయి అటిటు దిక్కులు
చూడసాగారు. ఎటు చూసినా పిల్లపీసులేదాు పట్నం కరోన మహమ్మారి చింతల చిన్నబోయింది. పోలీసుల గస్తీ కొన
సాగుతుంది. ఆక్కడక్కడ కాళ్లకు బుద్దిచెప్పి వారికి మల్లె ఊరిబాట పట్టినవారు పెట్టెబేడతో నడుస్తూ ముందాుకు సాగుతుండ్రు
”వారిని చూస్తూ మనము నడుద్దాం పదాండి” అంటు కదిలిండు పుల్లయ్య. అతని వెనకాల వారు కదిలారు.
”అన్నం పొట్టం బద్రాంగ సంచిల బెట్ననా” అని అడిగిండు పుల్లయ్య భార్యవైపు చూస్తూ.
”ఆ… పెట్టిన గని అన్యాల్కం పాడుగాను మన బత్కు చచ్చిచెడి కుడ్తిల పడ్డ ఎల్కయిపాయె” అని దీనంగ పలికింది
జోగమ్మ.
”దేవుడు మనిషి పాపాలకు కోపాలు దెచ్చుకొని కండ్లెర్రజెత్తే మన బత్కులు కానికాలం కాటున బడ్తున్నయ్‌ు
ఎన్కట్కి గత్తరొస్తె ఊర్లకు ఊర్లె ఇడ్సిరని పెద్దాలు చెప్తుంటె ఇనలేదా. ఇప్పుడు పేరుకు తిధాులు అయ్యె, నచ్చత్రాలు,
రాశులు, ఋతువులు గయ్యెగని మన్సి బుద్ది మారింది. అవినీతి, బందాుప్రీతి, దోస్కతినుడు, లొప్కతాగుడు గిదేగిప్పుడు
మనిషినైజం. నమ్మితిర సిద్దా అంటె ముంచితిరా బిడ్డ అంటుండు అంటుండు దాుర్భుద్దితో” అంటు వారగా చూస్తూ
నడుస్తునే ఆయిసులేని మొముతో పల్కిండు పుల్లయ్య
”అయితే మంచి గింతన్న లేదాంటవా” అన్నడు స్వామి.
”లేకం ఉండబట్టె గాయినకు బుద్దిబుట్టి బువ్వ పొట్లమిచ్చె, కాని ఎన్కట వీరబ్రహ్మం చెప్పినట్లు జర్గుతుంది”
అన్నడు పుల్లయ్య.
”అవునవును ఏడుదొడ్లకు ఒకదొడ్డి మిగులుద్దాని అన్నడట, తాత అంటుంటె ఇన్న” అని పలికిండు స్వామి.

”అయ్యల మన చిన్నతనాన ఊరినిండ పసులు, ఇంటికో దొడ్డి మరి గియ్యాల ఊల్య పసురం సూద్దామన్న వాటి
జాడ లేదాు ఒకవేళ అయిదెచ్చిన ఆట్కి మేత కర్వు గడ్డిగాసం కర్వు యంత్రాలదెచ్చి ఎవుసాలుజేస్తుండు అందాుకే ఊల్య
కూలి కర్వు. బస్తిల స్తే తలపైకెత్తిసూసె బంగ్లాలు, నడ్మంత్రపు సిరితో సుఖానికి మరిగి తూగుటుయ్యాల గట్కొని
ఊగుతుండు” అని పల్కుతూనే సరసర ముందాుకు సాగుతుండు పుల్లయ్య.
అబ్బబ్బా అట సర్రసర్ర నడుస్తరు! నడ్సినడ్సి కాళ్లు పీక్కపోతున్నాయ్‌ు. ఇంత దాూరం నడ్సినం పిల్లల కాళ్లు సుత
గుంజపట్టె ఇంక నడ్వ మన వశమైతాదా” నీరసంగ పలికింది సాయమ్మ.
”ముంతెడు నీళ్లకే ముడ్డివొర్గల బెడ్తెఎట్ల, జపజపనడుర్రి”. అన్నడు పుల్లయ్య.
”ఇగనావల్లగాదాు కాసేపు కూలపడి దాూపతీర్చుకొని పోదాం” అన్నది జోగమ్మ. సరె అంటూ అందారూ కాసెపు సేదా
తీరీ దాూపతీర్చుకున్నారు.
”ఏమయ్య ఏదాన్న కాళీగొచ్చె లారిని ఆపయ్య” అన్నది పెనిమిటిని దిగులుపడుతు సాయమ్మ.
”నేను అదే సూస్తున్న” అంటునే ఎదాురుగా వచ్చే లారికి చెయ్‌ు అడ్డం పెట్టి ఆపిండు. వీరి అవతారం చూసిన లారి
డ్రైవర్‌ పిసరంత జాలితో వారిముందాు లారీ ఆపిండు. ఆకలి దాూపతో అగుడుపట్టినట్టు గబగబ లారీ ఎక్కిండ్రు.
”ఎక్కడి వరకు పోవాలి” అని అడిగాడు వారివైపు చూస్తూ లారీ డ్రైవర్‌.
”అన్నన్న నువ్వు ఏడిదాంక పొయినా సాలు ఆడ దింపు అదే మాకు పదివేలు, మీ మేలు మరువం” అని అతనివైపు
చూస్తూ ఊపిరి పీల్చుకుండు పుల్లయ్య. డ్రైవర్‌ లారీ స్పీడ్‌ పెంచాడు. లారీ రయ్యిన ముందాుకు దాూసుకుపోతుంది వారు
అందాులో కూలపడ్డరు మనసున రుక్మతితో కుదార్థంగా మనాదిల పడ్డరు. లారీ అద్దాంకి బైపాస్‌ వద్దా వారిని దింపి
మిర్యాలగూడ వైపు సాగిపోయింది.
లారీ దిగిన వారు కాసింత సేదా దీరుదాం అంటు చెట్టు నీడన కూలపడ్డరు. సంచిలో ఉన్న పొట్లం బైటికి తీసింది
జోగమ్మ ఆకలిగొన్న పోరడు కండ్లు పెద్దావి చేసి తల్లివైపు తహతహలాడుతూ చూస్తున్నాడు. పోరనిక గింత తిన్పంచి
తనుగింత తిన్నది. అంతా ఆకలి దాూప తీర్చుకొని కూలపడ్డరు. వారు నడ్సినదాన్కి ఇంకా కాళ్లు గుంజుతున్నయ్‌ు. వాడిన
మొఖంతో ”కాళ్లు గుంజినా కడ్పునొచ్చినా మనకీ తిప్పలు తప్పయి అంటు చెట్టు దాప్కు ఒరిగిండ్రు అతని బట్టలు
సోరుపుతో మురికిపట్నయ్‌ు, సెమట ఒంటికి అట్టుకట్టింది. వారు ఒకరిని ఒకరు చూసుకుంటు పరేషాన్‌లో పడ్డరు,
”ఏంది జోగా సింత చేస్తున్నవా” అని బార్యవైపు వారగా చూస్తూ అడిగాడు.
”ఏంలేదాు బావ” అని అంటూనే ”నాకు మనం ఊరికి పోవడం సుతారం ఇష్టం లేదాు” అని నేల చూపులు చూస్తూ
పలికింది, వారివైపు కొడుకు శివ అమాయకంగా చూడసాగాడు.
”ఎందాుకిష్టం లేదాు” అని అతననగానే ”నీకు తెల్వదా మా నాయిన పచ్చి తాగుబోతోడు ఇంటిగురించి చింతలేనోడు.
మాయమ్మ, నేను కూలినాలి చేసి ఇల్లెల్లదీస్తుంటే అయ్య మా ర్కెలకాశపడి ఉంటడు. ఆడదాని రెక్కలకాశపడ్డ మొగడుంటేంది
లేకుంటేంది. మా అమ్మేం సుఖపడ్డది మేమేం బాగుపడ్డం. నేను పెళ్లీడుకు వచ్చినని కట్నాలు ఇచ్చి పెళ్ళి చేయలేక పెళ్లాం
సచ్చినోన్కి మారుమనుం ఇచ్చి చేతులు దాుల్పాలనుకుండు అయ్య. అది తల్సుకుంటే నా ఒళ్ళు కంపరంపుడ్తది. అది
ఇష్టం లేకే నీదాంట చేర్తి ఇంట్ల చెప్పాపెట్టకుంట కాలు గడపదాటి నీతోని పట్నంలో పడ్తి. ఇగ నా బతుకు నువ్‌ సూడన్ద

ఏ వయసు ముచ్చట ఆ వయసులో తీరాలి నేను మనిషినే నాకు మనస్సుంది అంగట్ల బెట్టి బేరం జెయ్య నేను పసురాన్ని
కాదాు కదా” ఎగదాన్నుకొచ్చే దాుక్కాణ్ణి అదాునుకొని ఒణుకుతున్న స్వరంతో ముక్కుని చీదాుకుంట పలికింది.
”జోగ నువ్వన్నది నిజమే కాని నిన్ను ఏంసుఖపెడ్తి యాడికిపోయినా మన బతుకు గింతేగని నివ్వేంపికరుచేయకు”
అని ఓదార్పు మాట పలికిండు.
”అబ్బ కాళ్ళు గుంజుతున్నయ్‌ు అమ్మో” అని శివగాడు తల్లి ఒడిలో వాలిండు.
”లేత అరికాళ్ళకు బొగ్గలొచ్చినయ్‌ు ఒర్సుకో నాయన మా అయ్యగని కాసేపయితే ఇంట్లపడ్తం” అని కొడుకును
చూస్తూ పలికిండు అప్పుడమెకు కొడుకును చూస్తాలికి పాణం దేవినట్టయింది. ఒడిలో అలాగే కొడుకు కాళ్ళు నిమురుతూ
నిద్రాపూచ్చింది. తనకాళ్లు చూస్కుంది కాయాగాశ్న కాళ్ళు నడ్సినడ్సి పచ్చి పుండ్ల్షెనట్టున్నయ్‌ు ఒళ్లంతా అలిసి పులిసిపోయింది.
ఆమెకు కాసింత ధైర్యం చెప్తు ”అట్ట ఆయాసపడితే ఎట్ల ఓర్సుకో ఓర్సుకున్నోనికి ఓరుగల్లంత పట్నం దాక్కుతుందాట”
అని అన్నడు. ”నన్ను ఓపిక ఓపిక పట్టు అంటున్నవ్‌ నీకుమటుకు లేదా ఒళ్లు నొప్పి, మనకా ఊరిలో తినే తిండి కరువు,
కట్టే బట్ట కరువు పుట్టి బుద్దెరిగిన సంది ఈతంగ తిన్నది లేదాు సుఖంగ పన్నెది లేదాు. కష్టాలకాడి ఎత్తుకుని రెక్కలు
అలువంగ చేస్తిమి” అంటు లోలోన మదానపడసాగింది.
”మనకీ ఈ ఊరికి రావాలని కుషాలా గతిలేని సంసారానికి మతిలేని మొగుడన్నట్టు అయిపాయ్‌ు నా బత్కు”
అన్నడు పుల్లయ్య.
”అదేమో మాయదారి కరోనా భీమారి తుఫాను లెక్క దాూసుకొచ్చే. ఉరుముల్లేవ్‌ మెరుపులేక బతుకులపై పిడుగులు
కురిపిస్తుండే, దానిదెబ్బకి గుండెళ్ల ఒకటే దాడదాడ మొదాలైంది. కుదాురులేని దాడదాడతో జనం దాంచికొడ్తున్న తుఫానుకు
చెట్టుకొకరు పుట్టకొకరైర్రూ. అదేమో అలిపిరిడువక జనం అంతు సూస్తుండే” అన్నడు స్వామి.
”అవునవును అన్ని బందాు పెట్టి జనం ఇంటికే అంటిలయ్యిర్రు. యాడ సూసినా ఏ నోట విన్న గొంతు పెగలక
భయంతో ఒణుకుతుర్రు పీనిగె ముట్టని రోజులకొచ్చింది. సచ్చినోడు ఆకరి చూపులకు నోచుకోకుంటయిపాయె. అదేమో
గుండెలమీదా కుంపటి రాజేసి పేదా, ధానిక తేడ లేక అందార్ని కాల్చుకతింటుంది. దీని ముదానష్టం గాను ఎందార్ని
మింగుదో, ఎందారి ఉసురు తీస్తదో, కూలీ జనం బతుకుల్ల మిన్ను విరిగి మీదా పడట్టాయే” అన్నది సాయమ్మ.
”ఎల్లకాలం ఉంటాది దీనికి పాడే గట్టి ఉప్పుపాత్రేశే రోజొస్తది”
”అగో ఆ రోజెప్పుడోస్తదో గాని డక్టర్లు, నర్సులు, పాణాలు లెక్క, జెయ్యక ఇళ్ళు పిల్లలిడ్సి రోగులకు సేవ
జేస్తుండ్రి కంటికి కనిపించని కాని రోగం బారిన పడి సస్తుర్రి ఏం లాభం అది నిజమేగని ప్రైవటు దావఖానలల్ల గీ
రోగానికి లక్షలకు లక్షల ఫీజులు గుంజుతుండ్రట, అగో చచ్చిన శవాలను ఒక చిథిపేర్సి కాష్టం పెడ్తుండ్రు ఆ చావు
పగోనికి రావద్దాు తల్లి. ఆ నలుగురు ఎవనికి ఎవ్వరు ఏమికారు, ఒక వూరు అసలే కాదాు. ఒక చితిమీదా తగులపడ్తుండ్రి
గిదేంగోసనే తల్లి” అని జోగమ్మ అనగానే
”నిజంగానానే” అని మిడిగుడ్లతో చూస్తూ సాయమ్మ అన్నది.
”అవునే అమ్మ రాత్రి టి.వి.ల చూస్నా కొన్ని తావులల్ల డోజర్‌తోటి మాయబొందాలు దోడి సచ్చిన పీనుగలను
కుప్పకుప్పకే అళ్ళేసి పూడ్సుండ్రు ఏం కాలంవచ్చే భగవంత” అని నిట్టురుస్తూ అనగానే ”అయ్యో పాపం మందాులేని

రోగాలను చూసినం గని గిసోంటి రోగాన్ని మనుండంగ ఎన్నడు చూడలే తల్లి, తల్చుకుంటే పాణం గడగడవనుకుపుడ్తుంది.
అది జాదిలకొస్తేనే ముద్దా మింగుడుపడ్తలేదాు. టి.వి. లచూస్తే వాంతికి అయితట్లయిందే అని దీనంగా పలికింది జోగమ్మ.
”గాజోలి ఎందాుకు దాలుస్తవు, మాయరోగం కట్టడికి నిద్రాహారాలు మాని పాపం పోలీసులు సుత రాత్రిపగలు
డ్యూటీ చేస్తుండ్రి. అదేందో గని విచిత్రంగ ఆళ్ళకు సోకుతుంది దీనమ్మ దెష్ట ముండ ఎన్ని రోజులిట్ల గోస దీపిస్తదో,
ఫోన్లల్ల పలకరింపులు, ఫోన్లల్లనే ఏడ్పులు, తూడ్పులు అరిగోసె దీపిస్తుంది దీనిగత్తర తగల” అని జోగమ్మ అన్నది.
”అమ్మా గాళ్లు సుత మూతికి ముస్కులేకుండ తిరిగేటోళ్ళను కసరెళ్ళదీస్తుండ్రు అని స్వామి అనగానే అది మనకోసమేగా
అనే పుల్లయ్య.”మరి గంతగనమా ఎవ్వరిదైన ప్రాణమేచచ్చెదాంక కొడ్తరే యముని లెక్క”
”అదే గత్తరై కుసుంటే దానికేడ తాక్తది గత్తర. ప్రపంచం సాంతిమి సాపలెక్క సుట్టుకొనొస్తుంది. ఏమో పోవయ్య
మన బతుకు శివడు చీదాకుంటాయో, మశడు వొల్లకుంటయ్‌ుపాయె” అన్నది సాయమ్మ.
”ఎందాుకు తియ్‌ు గంజో గట్కో తాగి పాణాలు నిలుపుకుందాం వాన రాకడ పాణం పోకడ తెల్సినోడెవడు, పొయ్యే
జీవిని ఆపేటోడెవడు, ఎట్టయ్యే దాుంటే అట్టయ్‌ుతది సరే గాని చిన్నగ బట్టదాుల్పుకొని బాటపడదాం” అని పలికిండు
పుల్లయ్య.
”ఔనానే ఇంతకు మనల ఊళ్యకు రానిస్తరా పరీక్ష చేశ్నంకనే రానిస్తరట” అని పలికిండు స్వామి.
”ఇన్ని అనుమానాలెందాుకురా నీకు, అనుమానం పాత రోగం. మనకు ఇళ్ళే దావఖాన అయిన ఊళ్యకు పోయ్యేటోనికే
ఒస్తున్నాది ఊళ్య ఉన్నోళ్లకి రోగం సోక్తలేదా పొయ్యేటోడు ఏడంగనైనా పోతడుగాని ఏమే జోగి శివగాన్ని నాకియ్యి నే
నేెత్తుకుంట, సంచి నీవు సేతపట్టు” అని లేసిండు పుల్లయ్య. పిలగాన్ని పెనిమిటిచ్చి ఆమె సంచి చేతబట్టి అతనెనకాల
బాట పట్టింది. వారు వాళ్ళ ఊరివైపు సాగుతుండ్రు. బతుకుపై ఆశతో రేపటి తరాన్ని బతికించాలన్న తపనతో……

August 25, 2021 1 comment
11 FacebookTwitterPinterestEmail
కవితలు

ఇన్‌ల్యాండ్ లెటర్

by ఆచార్య ఎన్. గోపి August 25, 2021
written by ఆచార్య ఎన్. గోపి

చాలా కాలం తర్వాత
ఉత్తర మొచ్చింది.
అదీ ఒక ఇన్‌ల్యాండ్ లెటర్.
ఎంత అందంగా ఉందిది!
ఇది కార్డు ముక్కకు అక్క
లిఫాఫాకు చెల్లెలు.

అందుకోగానే చిరగ కుండా
అపురూపంగా విప్పడం అలవాటు నాకు.
దానిని మడత పెట్టే టప్పుడు కూడా
అంతే జాగ్రత్త!
ఒక వైపు గ్రహీత చిరునామా
ఇటు వైపు మన అడ్రసు
అంటించిన తర్వాత
లోపల ముత్యాల్లాంటి గరగరలు
నాస్టాల్జియా అని
కొట్టి పారెయ్యకండి!
ఇది పోస్టాల్జియా.

మడతలే
ఇన్‌ల్యాండ్ లెటర్ ప్రత్యేకత,
కాని
ఓ మిత్రుడు మరణించిన వార్తను
తెచ్చి నప్పుడు మాత్రం
అది అతనికి కప్పిన
కఫన్‌లా అనిపించింది.

విప్పితే చిన్నదే కావచ్చు
కాని
500 చ. సెంటీ మీటర్ల విస్తీర్ణంలో
అక్షరాల పంట లెన్నో పండించ వచ్చు.
భావుకులకైతే
అదొక కావ్య ఖండికల వేదిక
రాయక ముందూ
రాసిన తర్వాతా
దానిని తూకం వేస్తే
ఎడమ వైపే ఎక్కువ బరువు తూగుతుంది.

అనుబంధాలూ దుఃఖాలూ
అరోపణలూ వాగ్దానాలూ
రోగాలూ రొష్టులూ
అన్నింటినీ భద్రంగా
ఉద్దిష్ట వ్యక్తికి అందించే
ఉత్తమ విశ్వాస ధూతిక.

ఎన్నడూ నేను
శ్రీమంతుణ్ని కాదు
కాని పెళ్లికి ముందు నా అర్ధాంగి రాసిన ప్రేమలేఖలూ
మహా కవి సినారె ఓ కుర్ర కవికి రాసిన
ఆశీః పూర్వక ప్రత్యుత్తరాలూ
ఇప్పటికీ నా పెట్టె అడుగున
ధగధగ లాడుతున్నాయి.

ఎర్రని పోస్టు డబ్బా
అడవిలో కనపడ్డా
ఒక ఆత్మీయుణ్ని కలిసినంత
సంబర పడి పోతాను
ఒక చోట కదల కుండా వుంటూనే
సమస్త విశ్వాన్ని కదిలించే
అద్భుత వ్యవస్థకు ప్రతీక అది.

ఇవాళంతా ఇన్‌ల్యాండ్ లెటర్‌ను
జేబులో పెట్టు కొని తిరుగుతాను
కరెన్సీ నోట్లు
చిన్న బుచ్చు కున్నా సరే.

August 25, 2021 5 comments
4 FacebookTwitterPinterestEmail
కవితలు

ఫినామినల్ పెయింటర్ (విలక్షణ చిత్రకారుడు)

by Atla VenkataRamireddy August 25, 2021
written by Atla VenkataRamireddy

సూర్యుని మించిన చిత్రకారుడు
ఎవరైనా ఉన్నారా !
కనిపించిన ప్రతిదానికీ
రంగుల భంగులు దిద్దీ దిద్దీ
చివరికి తానే
రంగుల్లో మునిగి పోతాడు
రోజురోజూ !

August 25, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

*ఎంతో గొప్ప*

by గురిజాల రామశేషయ్య August 25, 2021
written by గురిజాల రామశేషయ్య

భావాలు ఆవహిస్తే చాలు !
అక్షరాలు నీటి బిందువులై
అక్షరాలు పదబంధువులై
పదాలు వాక్యపథ రసాస్పదలై
వాక్యాలు వాంఛితార్థప్రదాలై
*_కవిత్వం_* రూపుగడుతుంది.
ధరించే సంఘటనల’దుస్తులను
మనఃకాసారంలో చక్కగా ఉతుక్కొని
తేట విమర్శనలో ఝాడించుకొని శ్రద్ధగా శుభ్రపరచుకొని పిండుకొని
గౌరవ’భద్రంగా నీరెండకు ఆరవేసుకొని
జాగ్రత్తగా తీసుకొని తొడుక్కుంటూ
పై కండువా సవరించుకుంటూ
అక్షర వీథుల్లో మందహాస వదనంతో
గంభీరంగా కవిగా’నడవటం ఎంత గొప్ప !!
( “కవి కావటమే గొప్పసంఘటన” ౼ సినారె__నా ‘అక్షర పతాక’ కవితా సంపుటిని అంకితంగా స్వీకరిస్తూ ఆవిష్కరణ సభ లో సినారె గారు పలికిన మాటలు గుర్తుకు వచ్చి ..)

August 25, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

జీవితపు సరిహద్దుల దగ్గర

by ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్ August 25, 2021
written by ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్

మనిషి ఎదురుపడితే
పులి ఎదురుపడ్డట్టే
ఆత్మీయ ఆలింగనాలు
సోదర కరచాలనాలు కాదు
‘ఆత్మకు శాంతి కలుగుగాక ‘
సానుభూతుల వెల్లువ –

కడప దాటితే
అమావాస్య అడవిలో ఆగమయినట్టే
ఏ ముట్టడి నుండి
ఏ స్ట్రైన్ కమ్ముకుంటుందో (స్ట్రెయిన్)
భయపడినట్టే ఇల్లు ఇల్లంత వేడెక్కి
ఎవరికి వారు ఒంటరై
అంబులెన్సుల్లో ఆసుపత్రుల్లో
వింత వింత శబ్దాల మధ్య
నల్ల బజార్లో, ప్రార్థనా స్థలాల్లో
ప్రాధేయపు చూపుల ఆశల మిధ్య –

చివరికి శ్వాసకూ శ్వాసకూ మధ్య
ఊపిరాడని పెనుగులాట
చావుకీ బతుక్కీ మధ్య
సమయం దోబూచులాడుతుంది
అది విముక్తో
ఈ నేలను విడిచి పోతున్న విషాదమో –

జీవితమంతా ‘క్యూ’ ల్లో నిలబడీ నిలబడీ
చితి మంటల సాక్షిగా
చివరి యాత్ర ‘క్యూ’ల్లో చిక్కుకుంది
ఇప్పుడు ఏ ఓదార్పులు లేవు
ఓటికుండలు లేవు
ప్రభుత్వాలకు మనం ఒక అంకె మాత్రమే
ఇంతకూ మన ఊపిరితిత్తుల మీద
మృత్యు సంతకం చే‌స్తున్నది ఎవరు !?
అంతిమ సంస్కారాలకు అడ్డు పడుతున్నది ఎవరు !??

August 25, 2021 8 comments
2 FacebookTwitterPinterestEmail
కవితలు

బరిగీసి ఇంకోసారి

by Sunkara Ramesh August 25, 2021
written by Sunkara Ramesh

బరిగీసి యుద్ధం చెయ్యు ఇంకో సారి

చైతన్యం నీ ఇంటి పేరు కదా

చుట్టు పక్కల

పది ఊళ్లకు నీవే పెద్ద దిక్కు

గడప గడప లో

సరస్వతి కొలువు దీరిన నెలవు కదా

ఎర్రని నీ నుదుటి బొట్టు తో

నిత్య ప్రకాశినివి కదా

నీ వెలుగు పడమటి కొండలకు

వాలుతుంటే

ఈ కళ్ళు చూడలేవు తల్లీ

ధీమంతులకు

శ్రీమంతులకు నీవు ఇష్టసఖివి కదా

స్నిగ్ద ,స్వచ్ఛ  కిరీటం తో

ధగ, ధగా మెరిసిపోతుంటే

అమ్మ వారిని చూసినట్టే ఉండేది

స్వర్గం లో దేవతలు నిన్ను చూసి

పూల వర్షం కురిపించారే

ఈరోజు వాడిన పువ్వులా

నీవు కనిపిస్తే హృదయం

విల ,విల లాడుతున్న కొమ్మలా ఉన్నది

అందరూ నిన్ను

వేలెత్తి చూపిస్తుంటే

ఆదిత్య హృదయం

అల్లాడుతుంది.

సూర్యుణ్ణి చుట్టూ భూమి

తిరుగు తున్నట్టు

పొద్దు పొడవక ముందే

నీ చుట్టు జన సందోహం తో

పక్షులు వాలే మహా వృక్షం లా

భాసిల్లే దానివి

నేడు బారెడు పొద్దెక్కినా

నిన్ను చూడాలంటేనే

లక్ష సందేహాలు

ఎన్నెన్ని పోరాటాలలో

పదును తేలావో

ఇప్పుడు కనిపించని

క్రిమి ముందు తేలి పోయావు

ఎత్తిన పోరు కొడవలి

పదునేమాయే

ధాన్యలక్ష్మీ రాకతో

పూర్ణకుంభంలా ఉండే దానివి

ఇంతటి ఖాళీ తనాన్ని చూసి

మనసు కకావికలం అవుతున్నది

రాశులు పోసిన కూరగాయలు

రత్నపు రాశులు

ఆకు పచ్చని

కూరలతో పచ్చని

పట్టు చీర కట్టినట్టు కనిపించే దానివి

నేడు కనిపించని క్రిమికి కంపించి పోతున్నవా

మాతా

బజార్లన్నీ జనం లేక

బోసి పోయిన మెడ లాగున్నది

నీళ్లు లేని బావిలాగున్నది

ఏ ఊరు మీదంటే

పది ఊళ్ళ వాళ్ళు కూడా

కాసింత పొగరుగా

మాది పేట అనేవారే

ఇపుడు ఏ పెదాలు కూడా

నీ పేరు పలకవు

మీసాలు మెలేసే రొయ్యల

వీధేక్కడ

బొమ్మడి మచ్చీ బుట్టలెక్కడ

బొడ్రాయి బజారు

బట్టల బజారు జాడెక్కడ

మిరపకాయల ఘాటు

కొత్త మామిడి పులుపు లెటు పోయే

భజన మందిరంలో పాట

బ్రోచేవారెవురా పాట గుండెను

పిండుతుంది

భానుపురి నీ బాధను చూసి

బావురుమంటుున్నది మనసు

నా ప్రేమ పురి

నీ వాడి కిరణాల

కరవాలంతో

క్రిమిని వేటాడు

ముప్పేట ముంచేస్తున్న

మహమ్మారిని మట్టు బెట్టు

సూర్యగ్రహణం

ఎంతోకాలం ఉండదు

కారుమబ్బుల్ని చీల్చుకుంటూ

ప్రకాశించవే పేట

బస్తీ మే సవాల్ అని

బరిగీసి యుద్ధం చెయ్యవా

ఇంకో సారి

 

August 25, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

నరుడు

by Chandu Pendyala August 25, 2021
written by Chandu Pendyala

పుట్టినపుడు పురుడు

పెరుగుతాడు ఈ చందురుడు

చిన్నతనాన నాన్నను చూస్తూ ఎదుగు

బాల్య యౌవనాల దరువు

తరగుదలలేని వెలుగుల సూరీడు

పెరిగి అవుతాడు పౌరుడు

పెరుగుతుంటే బెదరడు

చదువు తనకు  అవదు బరువు

ఉద్యోగం తనదైన ఆదరువు

జోడు కోసం వెతుకు యువకుడు

పెళ్లికి  సిద్ధమయ్యే  వరుడు

పెళ్లికి ముందు పొగరు

పెళ్లి అయినాక  తగ్గును వగరు

పెళ్లికి ముందు సోమరుడు

పెళ్ళయినాక పామరుడు.

సంసార యుద్ధానికి సిద్ధమయే వీరుడు

నిత్యపోరాటాల యోధుడు

అలసినా విడువని శ్రామికుడు

చివరకు గెలిచే విజయుడు…

August 25, 2021 2 comments
1 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • క్విజ్ పోటీ-
  • వంటిల్లు – వొడవని ముచ్చట (కిచెన్ కాలమ్)
  • తరిగొండ వెంగమాంబ
  • నడిచే విజ్ఞాన సర్వస్వం- శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల రఘునాథ ఆచార్య స్వామి
  • ఇప్పటికీ ఇక్కడే ఉన్నాను

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us