జులై 2026 మయూఖ సంపాదకీయం- డాక్టర్ కొండపల్లి నీహారిణి,ఎడిటర్
ఈరోజు నాది అని అనుకునే ధైర్యం, సాహసం చేయలేని పరిస్థితుల్లో ప్రజలు జీవిస్తున్నారు. బయటికి వెళ్ళిన వాళ్ళు ఇంటికి తిరిగి రావడం ఒక ప్రశ్న .ఉన్నన్ని రోజులు ఇవి ఎవరివి అవి ఎవరివి అని నిలదీయలేని అశక్తత. ఏ పదార్థాలు తినాలన్నా కల్తీ అనే చీడ పట్టుకుని ఉన్న రోజులు.
ఎక్కడ చూడు అవినీతి, అన్యాయాల తాండవమే. ఇటువంటి సందర్భంలో కవులు ఎటువైపు నిలబడాలి?
న్యాయం పక్షాన నిలబడాల్సిన మనుషులే అన్యాయాలు చేస్తున్నారు. శుభ్రమైన వ్యవస్థలో కీడు ప్రవేశించి భయభ్రాంతులను చేస్తున్నది. కవులు ఏం రాయాలి?
ఏ దేశ పరిస్థితులు ఆ దేశానివి .ఏ దేశ భాష, వ్యవహార శైలి ఆదేశానిది. ఏ దేశ సామాజిక నేపథ్యం ఆ దేశానిది . ఇది ఆ భూభాగాన్ని పట్టి ,ఆ ప్రాంతంగా శీతోష్ణస్థితి కారాణాలు . జపనీయులు ఒకలాగా, ఆఫ్రికన్సు ఒకలాగా, అమెరికన్స్ ఒకలాగా, మన
భారతీయులు ఒకలాగా ఉండడానికి ప్రధాన కారణం ఇదే. మళ్లీ మన భారతదేశంలోనే కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఉన్న అన్ని రాష్ట్రాలలో ప్రజల జీవన వ్యవహార శైలి ఒకటి కాదు. కొన్ని ప్రాంతాలలో రూపులు కూడా ఒకటి కావు .భాష, సంస్కృతి, ఆచార వ్యవహారాలు ఇవన్నీ పరిగణంలోకి తీసుకోవాలి. కానీ ఏ విషయం పైన నైనా భాష తత్వావిష్కరణ చేస్తుంది. లోక రహస్యాలు గొప్ప గొప్ప లెక్కలు లెక్కల్లో తేలుస్తుంది. ఇదే సాహిత్యం యొక్క ఛాయ గా చెప్తాం.
సాహిత్యం ఏం చేస్తుంది? కాలానుగుణంగా నడుచుకుంటుంది . భూతకాలంలోని విషయాలను ఎప్పటికప్పుడు మననం చేయిస్తుంది. భవిష్యత్తు ఎలా ఉండాలో బాట వేస్తుంది. వర్తమానంలోని జీవితానికి ఒక అర్ధాన్ని చూపిస్తుంది. ఇటువంటి సాహిత్యం ఇప్పుడు ఎలా వస్తున్నది? ప్రయోజనాలను ఆశించే సాహిత్యం రాయాలా? అనే ప్రశ్న కూడా ఒక్కోచోట ఉదయిస్తుంది. ఆనందానికి, మనశ్శాంతికి రాసుకోవచ్చు కదా ? అనే వాళ్ళు ఉంటారు . ఈ ఆనందము ఈ మనశ్శాంతి దొరకాలి అంటే కంటి తెరపై ఉన్న ప్రపంచంలో సమాజం అనే
బొమ్మలు వివర్ణమై చిత్రాలు చిత్రాలుగా కనిపిస్తున్నప్పుడు, రోదనలు వేదనలు మాత్రమే శబ్దాలు చేస్తున్నప్పుడు సాహిత్యం ఎలా నిలబడాలి? అనే ప్రశ్న కవులలో రచయితల్లో వేసుకున్నప్పుడు ప్రాధాన్యత ఇవ్వాల్సింది ప్రాంతానికి, పరిసరాలకి. ఇక్కడ ఉండి ఎక్కడో జరిగేవి ఊహించి రాయడం ఎక్కడివాటినో తెలుసుకొని రాయడం కంటే ఇక్కడ నీ చుట్టూ ఉన్న ప్రపంచంలో నువ్వు ఉంటావు కాబట్టి నిజాయితీగా అంతర్దృష్టితో పసిగట్టి రాయాలి. ఒకవేళ ఎక్కడి అంశాలనో రాసినా ఇక్కడి సమాజాని ఉపయోగపడేలా రాయాలి . అబద్ధాలను ఖండించి నిజాల నిగ్గు తేల్చాల్సింది సాహిత్యమే, కవులే, రచయితలే!
మనుషుల జీవితమే దీపం వంటిది . అటువంటిది సాహితీ రంగంలో రచనలు చేసేవాళ్లు ఎన్ని దీపాలుగా ప్రకాశించాలి ? ఎన్ని కాంతిపుంజాలను విరజిమ్మాలి ? ఎంతటి లోకము గమనింపులోకి రావాలి? తరాలు మారుతుంటే ఏది విచక్షణ అనే స్పృహతో ఎడారిలో మంచినీరులా, చీకటిలో దీపాలలా,ప్రవాహంలో తెడ్డులా సాహిత్యం నిలబడాలి.
మంచి ఆహారం తీసుకుంటే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. శరీరం ఆరోగ్యంగా ఉంటే మనసు ఆరోగ్యంగా ఉంటుంది. మనుషుల్లో ఇవి రెండు ఆరోగ్యంగా ఉంటే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది. కుటుంబం ఆరోగ్యంగా ఉంటే సమాజం ఆరోగ్యంగా ఉంటుంది . ఆదర్శవంతమైన కుటుంబాలే శక్తివంతమైన సమాజాన్ని నిర్మించగలదు . సత్సాంగత్యం వల్ల మనసు ఆరోగ్యం తో ఉల్లాసంగా ఉంటుంది ఈ సూత్రాలనే మూలాధారంగా చేసుకొని సాహిత్య సృజన జరగాలి. మంచి సాహిత్యం గొప్పతనం అంతా ఒక తరం వెళ్ళిపోయాక కానీ తెలుస్తుంది అనడం కంటే ఈ తరం వాళ్లు ఉన్నప్పుడే వాళ్ల కు తెలిసేలా రాయాలి. దేశభక్తులను సంస్కర్తలను సాధువులను ఎలా గౌరవిస్తామో సాహితీవేత్తలను కూడా అప్పుడు ప్రజలు గౌరవిస్తారు. అందుకే అంతరాత్మను ఎప్పటికప్పుడు ప్రశ్నించుకోవాలి రచయితలు . అంతరంగ కాలుష్యం తగ్గించుకోవాలి. విచక్షణ, విశ్వాసం యువతకు ఆదర్శం కావాలి. ఏవో సూపర్ నేచురల్ పవర్స్ ఉంటాయట అని వ్యంగంగా చెప్పే వాళ్ళను చూస్తాం. మన ఫిలాసఫీని తెలుసుకోవాలి అంటే
సైన్స్ ఇంకా ఎదగాలి అంటారు.అటువంటి దేశం మన దేశం.
అందుకే ఆదర్శవంతమైన జీవితాలు అందాలంటే మంచి సాహిత్యాన్ని చదవగలే అవకాశాలు రావాలి ఎవరికైనా. అంటే ప్రభుత్వాలు, సంస్థలు మంచి సాహిత్యాన్ని రచించే రచయితలకు ప్రోత్సాహాన్ని ఇచ్చి రాయించి అవి విద్యార్థులకు అందేలా చేయాలి . ఈనాటి బాలలే రేపటి పౌరులు. పిల్లలుగా ఉన్నప్పుడే వాళ్లకి సరైన విద్యా వ్యవస్థను ఎట్లాగైతే అందిస్తామో సాహిత్య విలువలను కూడా అందించాలి.
గున్న మామిడిని అయినా గడ్డి పోచనైనా సమానంగా చూడగలడమే సాహిత్య సౌందర్య తత్వం. ఈ సౌందర్యం సరైన విధానంలో వ్యక్తం కావాలంటే భాషా పట్టుత్వం ఉండాలి. ఉదాహరణగా సంస్కృత శబ్దం తెలుగు శబ్దం రెండింటిని ఉపయోగిస్తున్నవిధానంలో ..కాలము అనేది సంస్కృత పదం . సమయము సంస్కృత పదం. ఇవి తెలుగు పదాలుగా కలిసిపోయాయి ఎంతసేపు అనే మాట టైమ్ ను సూచించే పదం. సేపు అనేది సమయం ఎంత అయిందిఅనడాని వాడుతాము.
మనం కొన్ని పదాలను ఎరువు తెచ్చుకుంటున్నాం. ఇవి జనజీవన స్రవంతిలో కలిసిపోయిన మాటలు అలాగే ప్రేమ అనే పదం….ఇది సంస్కృత పదం.. తెలుగులో వలపు అంటాము . స్నేహితులపై చూపే ప్రేమను నెనరు అని అంటాం. ఇఇట్లా పదాల శక్తిని తెలుసుకోవాలి. అలాగే పౌరుషం అనే మాటకు పటిమ అని అర్థం. కడిమి అనే పదానికి పరాక్రమం అని అర్థం. పంచె అనేది మరాఠీ పదం కోక తెలుగు పదం ఇది ఒక వస్త్ర విశేషం కానీ పంచకట్టు అనేది వాడుకలోకి తెచ్చారు మన తెలుగు వాళ్ళు. ఇలా పదాల అర్థాలను పర్యాయపదాలను నానార్థాలను కవుల గమనింపులోకి రావాలి, అలా ప్రయోగించగలగాలి. అన్ని భాషలను తనలో కలుపుకునే సౌందర్యమే తెలుగు భాష ది.
తమిళ భాషను మణి ప్రవాళ భాష అంటారు. మణులు అంటే వజ్రాలు, ప్రవాళాలు అంటే ముత్యాలు. వజ్రాలు ముత్యాలు కలగల్సిన భాషగా చెప్తారు . తెలుగు అజంత భాష. సంస్కృతము, ఉర్దూ పదాలను ఇంగ్లీష్ పదాలను హిందీ పదాలను తనలో కలుపుకుని వినసొంపుగా చేసేటువంటి తెలుగు భాష గొప్పతనాన్ని కవులు విస్తృతంగా
అభ్యసించి వంటబట్టించుకుని కవిత్వంలో రాయగలిగాలి. ఇటువంటి కవిత్వాన్ని కథలను ఈనాటి వాళ్లు చదివి నేర్చుకుంటారు, ఉపయోగిస్తారు. అలా ముందు తరానికి ప్రవహింప చేస్తారు. భాష ఒక ప్రవాహ సందోహంతో ఉంటుంది. మనిషికి వెన్నెముక ఎలాగో సాహిత్యానికి భాష అటువంటిది. ఎన్నో వ్యాకరణ అంశాలు భాషను పటిష్టం చేస్తాయి. తెలుగు భాష సంస్కృత భాష తో కలిసి పోయింది . సంస్కృత భాష కర్మణి రూపంతో ఉంటుంది. తెలుగు సహజ సుందరమైన భాష. సంస్కృత భాషలో నామవాచక గుణవాచకాలకు ఒకే లింగ విభక్తులు ఉంటాయి. తెలుగులో లింగ వాచకాలు అని అనం. పురుష వాచకాలు, స్త్రీ వాచకాలు, నపుంసక వాచకాలు అనేవి అర్ధాన్ని బట్టి మారుతూ ఉంటాయి . సంస్కృతంలో లింగ భేదాలు అర్ధాన్ని బట్టి గాక శబ్దాన్ని బట్టి ఉంటాయి. సంస్కృత సంప్రదాయంలో శబ్దం దేన్నీ ప్రతిపాదిస్తుందో అదే లింగం. కానీ తెలుగులో అలా కాదు. ఇక వచనం విషయానికొస్తే తెలుగులో ఏక వచనం బహువచనం ఉంటాయి. సంస్కృతంలో బహువచనం, ఏక వచనం, ద్వివచనం ఉంటాయి.
ఛందస్సు కొంతైనా తెలియాలి. అలంకారాల ప్రయోగాలు తెలియాలి. కవిత్వ లక్షణాలు, కథా రచానా శైలి తోబాటు ఇటువంటి సామాన్య వ్యాకరణ విశేషాలను రచయితలే తెలుసుకోకుండా ఉంటే వాళ్ల రచనలలో ఏం ప్రతిబింబిస్తారు?
ఇక భాష మీద పట్టు సాధించిన తర్వాత కవులకు రచయితలకు కావలసింది సామాజిక విచక్షణ. రవిగాంచని చోట కవిగాంచును అంటారు. దృష్టకు దృష్టి కోణం కొత్తగా ఉంటుంది. ద్రష్టలుగా ఆలోచించాలి కదా!
ఆధునిక నాగరికత పల్లెల్లో చేరని కాలం నుండి అరచేతిలోకి ప్రపంచం వచ్చిన కాలానికి మధ్య ఉన్న తేడాను పసిగట్టి రచనలలో చూపాలి. అది మంచిగా చెడుగా ఎందుకు అనుసరిస్తున్నాము ఎందుకు అనుసరించకూడదు చెప్పాలి. ఈ బడి చదువులలో పనికొచ్చేలా లేవన్నట్లు చేతిలో ఫోన్ తో ఆడుతున్నారు పిల్లలు. ఊహాత్మకమైన వ్యవస్థ నుంచి తన నుంచి తన వరకు చెప్పగలిగే కవులు కొత్త దృష్టితో అక్షరాలను సాధనాలుగా చేసుకోవాలి. అక్షరము అబద్ధం కావొద్దు.