కన్నులు మూసుకొని
కలత నిదురలో నేనున్నప్పుడు..
ఒక వేగు చుక్క మెరుస్తూ నా కన్నుల ముందు వెలుగులు విరజిమ్ముతూ..
లే!లెమ్మంటూ తట్టి లేపి నన్ను ఉత్తేజ పరిస్తే….
కళ్ళు నులుముకుని మరీ చూసాను..
ఆ కాంతి కిరణాల వెలుగులో కనిపించింది ఒక దివ్య తేజం….
సౌందర్యానికి సొబగులు అద్దినట్లు..
అపురూపమైన లావణ్య లత
నీలి కన్నులు అర్థ నిమీలితమై..
చల్లని వెన్నెల రేకులను వెదజల్లి..
మైమరపించి అచేతనముగ మారిన నాతో…
గులాబీ అధరములు దరహాసం చిందిస్తూ
ముత్యములు తీర్చి కూర్చినట్లున్న పలు వరుసతో…
మృదువుగా పలికింది తేనెలొలుకునట్లు…
తానే కావ్య కన్నియ నట!
ఎన్నాళ్లీ మబ్బు తనం!
కలం పట్టి కవితలలల్లు మంటూ స్మిత వదనియై..
సింగారం ఒలికించి
మలయ మారుతం వీచినట్లు ఒక్క సన్నని తెమ్మెరలా తాకి….
పూలతోట పరిమళాన్ని అందించింది…..
కళ్ళు తెరిచి చూసా!
అది ఒక కమ్మని కలని గుర్తించి
కలం పట్టి సాగుతున్నా నేనా నిదురించే కావ్య తోటలోకి!
