Home వ్యాసాలు దాంపత్య జీవితాన్ని విడదీసేది – విడాకులు

దాంపత్య జీవితాన్ని విడదీసేది – విడాకులు

ఈరోజుల్లో ప్రేమవివాహాలైన, పెద్దలు కుదిర్చిన వివాహాలైన ఆలుమగల మధ్య విభేదాలు ఏర్పడినప్పుడు విడాకులు కోరుకుంటున్నారు. సాధ్యమైనంతవరకు చట్టంకాని, న్యాయమూర్తులు గాని దంపతులను విడదీయా లనుకోకుండా వారిని కలపాలనే చూస్తారు. భార్యాభర్తలు ఎందుకు విడిపోవాలనుకుంటున్నది వారి సమస్యలేమిటి అన్నది పరిశీలించి ఆలుమగలకు తగిన సూచనలు, సలహాలు ఇచ్చి వారి దాంపత్య జీవితాన్ని నిలబెట్టాలను కునే కౌన్సిలర్లు ఉన్నారు.

వారి పొరపాట్లను, లోపాలను తెలియజేస్తూ కలసి ఎలా బ్రతకాలన్నది బోధిస్తూ, వారిలోని వ్యతిరేకత లను, అపోహలను, అపార్థాలను తొలగించి ఆ దంపతులు ఒకరికొకరు చేరువయ్యేలా చేస్తారు. వారికి కౌన్సెలింగ్ నిర్వహించిన తరువాత విడాకులు కోరే జంటల సమస్య లను క్షుణ్ణంగా అధ్యయనం చేసి వారు తెలిపే కోణాల నుంచే సమస్యను అర్ధం చేసుకొని విశ్లేషణ చేస్తారు. విడాకులే తప్పనిసరి అంటున్న ఆలుమగల పట్టుదల, స్థిరనిర్ణయం వల్ల వివాహవ్యవస్థ బీటలువారుతోంది.

నగరాలలో విడాకులకు కారణం ఉద్యోగ ఒత్తిడి, స్త్రీలు స్వంత వ్యక్తిత్వంతో ప్రవర్తించడం, పురుషుల వ్యసనాలు, మేత ఇగో, స్త్రీలకు ఆర్థిక స్వావలంబన, స్త్రీపురుషులలో సర్దుకుపోయేతత్వం లేకపోవడం, రాజీధోరణి కొరవడడం, అనారోగ్యాలు, పిల్లలు పుట్టక పోవడం వంటివి ఎన్నెన్నో కారణాలు. వివాహవ్యవస్థను కించపరుస్తూ శాశ్వత వివాహబంధాన్ని విడాకుల ద్వారా తెంచేస్తున్నారు. ఆలుమగలిద్దరు ఉద్యోగస్తులవడం, ఇద్దరూ అలసటతో ఇంటికి చేరుకోవడం, వృత్తిపరమైన ఒత్తిడి వారిని బాధిస్తుంది. ఉద్యోగం చేసిన ఆడదే ఇంటి పనులు చేయాలన్న పురుషాధిక్యభావన, ఇంటిపనుల్లో భర్త సాయం కోరే భార్యకు నిరాదరణ, వ్యతిరేకత ఏర్పడినపుడు, భర్త తనకు సహకరించడం లేదన్న స్థితిలో ఆమెలో చెలరేగే అసంతృప్తి, అసహనం, అశాంతి, ఆ భార్యాభర్తల మధ్య దూరాన్ని పెంచుతుంది, కలహాలకు కారణమౌతుంది. వారి మధ్య చిటపటలు, ఘర్షలు ఏర్పడి ఆ కలహాల వల్ల మనశ్శాంతి ఉండదు. ఒకరితో మరొకరు కలసి ఉండలేమన్న భావన పెరిగిపోయి తాము విడిపోవా లన్న నిర్ణయానికి వచ్చేస్తారు. అది పరిష్కరించ లేని సమస్యకానప్పటికీ, వ్యతిరేక ఆలోచనలతో వారు దూరమైపోతారు.

స్త్రీలు ఉద్యోగం చేస్తున్నపుడు ఆఫీసులో రకరకాల మనస్తత్వాలు, వ్యక్తిత్వాలున్న పురుషులతో పరిచయాలు కలగడం, వారితో కలిసి పనిచేయటం తప్పనిసరి. అలాగే పురుషులు స్త్రీలతో కలిసి కొన్ని గంటలు పనిచేయవలసి వస్తుంది. పరాయి పురుషులతో తమ జీవిత సహచరుల పరిచయాలను అనుమానించకూడదు, అపోహ చెంద కూడదు. ఉద్యోగం చేసే ఆలుమగలకు ముఖ్యంగా ఉండవలసినది అవతల వారిమీద సదవగాహన, పరి పూర్ణమైన నమ్మకం. వాటిని ఏర్పరచుకోలేకపోతే మానసిక చికాకులు, వేధింపులు, ఘర్షణలతో చినికి చినికి గాలివానగా మారి ఒకరికొకరిని దూరం చేస్తుంది.

తనకంటే ఉన్నత స్థానంలో భార్య ఉన్నా, భార్యకు అధిక సంపాదన ఉన్నా భర్తకు ఆత్మన్యూనత కలుగుతుంది. భార్య తనను చిన్నచూపు చూస్తుందేమో, తన ఆధిపత్యం తగ్గిపోతుందేమో అన్న వ్యతిరేక ఆలోచనలతో భార్య పనులలో, మాటలలో, ప్రవర్తనలలో తప్పులు ఎన్నుతూ భార్యమీద ఆధిపత్యం చలాయిస్తూ తన ఇగోను తృప్తి పరచుకుంటాడే కానీ తాను భార్యను మానసిక హింస పెడుతూ, భార్య మనసులో నుంచి దిగజారిపోతున్నానని ఊహించలేడు. భర్త ఆధిపత్యాన్ని, మానసిక హింసను, వేధింపులను భరించలేక తాను అతనితో కలసి ఉండడం దుర్లభం అని భావించి విడాకులను కోరుకుంటోంది ఆధునిక యువతి.

ఇరువైపుల అత్తమామల జోక్యం పెరిగి వారి పిల్లల తప్పులను సమర్థిస్తూ ఎదుటివారి పైన నేరాలను మోపుతూ పిల్లల కలహాలలో పెద్దలు జోక్యం చేసుకోవడం వల్ల పెద్దల సమర్థింపులు, పిల్లలలో సర్దుకుపోయే తత్వాన్ని, ఎదుటివారిలో మార్పు కోరుకునే ప్రయత్నాన్ని, రాజీపడే మనస్తత్వాన్ని దూరం చేసేస్తున్నాయి. తన మాటే నెగ్గాలన్న పట్టుదల, తన ప్రవర్తన సరియైనదే అన్న. ఆలోచన విడాకులకు దారితీస్తోంది.

దాంపత్య జీవితం ఆరంభించిన కొత్తలో ఆ నూతన జంట ఒకరినొకరు అర్ధంచేసుకోవటానికి, ఎదుటి వారికి అనుగుణంగా తాను మారటానికి కొంత సమయం పడుతుంది. ఆ ప్రయత్నంలో మూడో మనిషి జోక్యం ఉండకూడదు. ఎదుటివారి మంచి గుణాలతో పాటు వారి లోపాలను స్వీకరించగలగాలి. వారికి మాన సికంగా చేరువవుతూ, వారిలోని లోపాలను మెల్లగా తొలగించే ప్రయత్నం చేయాలి. ఎదుటివారి అభిప్రాయా లను, ఆలోచనలనూ పంచుకుంటూ వారి ఆశలను, ఆశయాలను అర్ధంచేసుకోవాలి. తాము ఎదుటివారికి సహకరించలేకపోయినా, వారిని ప్రోత్సహించలేక పోయినా, వారి అసక్తికి, అలవాట్లకి, కోరికలకు అడ్డుతగల కూడదు. కొంతకాలం సర్దుకు పోతూ కలసి జీవిస్తే అయిష్టాలు ఇష్టాలుగా మారిపోతాయి. జీవితభాగ స్వామితో బంధం బలపడుతుంది. విడాకులు అన్న ఊహే వారికి కలగదు. అయితే ఒకవైపు నుంచి సర్దుకుపోయే నైజం గాక, ఇద్దరిలోను ఆ స్వభావం ఉండాలి. ముఖ్యంగా మార్పురావాల్సింది ఆలుమగల మనసుల్లో ఒకరితో మరొకరు సర్దుకుపోలేక విడాకులు తీసుకుంటే కోరుకున్న కొత్త జీవితం లభిస్తుందన్న గ్యారంటీ ఉండదు. ఒకరితో సర్దుకుపోలేనివారు మరొకరితో సర్దుకుపోగలరా? అలాగని విడాకులు తీసుకొని జీవితకాలం ఒంటరిగా ఉండగలుగు తారా? పిల్లలున్న తల్లిదండ్రులు విడిపోతే పిల్లల భవిష్యత్తు ఏమిటి? ఆలుమగల మధ్య సమస్యలు తలెత్తినపుడు, ఇద్దరూ సామరస్యంగా ఓర్పుతో, సంయమనంతో వాటిని పరిష్కరించు కుంటే విడాకులు పొందాలన్న ప్రసక్తే ఉండదు.

మన వివాహవ్యవస్థ, సమాజం, సంప్రదాయం, సంస్కృతి విడాకులను వ్యతిరేకిస్తున్నాయి. ఆలుమగల బంధం అతి పవిత్రమైనదని అది శాశ్వతమైనదని పెళ్ళి నాడు చేసిన ప్రమాణాలను ఇద్దరూ గౌరవించాలి, మాటని నిలబెట్టుకోవాలి. భారతదేశపు వివాహవ్యవస్థను, వివాహ బంధాన్ని పాశ్చాత్యులు ఎంతగానో గౌరవిస్తారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.

భారతదేశపు ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని కించ పరచకూడదు. దీర్ఘకాలపు అనారోగ్యం, కొన్ని తప్పనిసరి స్థితుల్లో, ప్రత్యేక కారణాల వల్ల ఆ కారణాలు సబబైనవి అయితే వాటిని నిరూపించి విడాకులు పొందటం అన్నది తప్పని చెప్పలేము. ఏ విధంగానూ పరిష్కరించలేని సమస్యలు ఆలుమగల మధ్య ఏర్పడినప్పుడే విడాకుల గురించి ఆలోచించడమన్నది సముచితం.

ఏదిఏమైనప్పటికీ శాశ్వతమైన వివాహబంధాన్ని విడాకులతో విడదీయడమన్నది ఈ సమాజం హర్షించ దనే చెప్పవచ్చు. ఎందుకంటే భార్యాభర్తల బంధం అశాశ్వత మైనది కాదు. ఎంతో మహత్తరమైనది, విలువై నది, పవిత్రమైనది, బలమైనది. కలసి ఉండాల్సిన భార్యాభర్తలు దాంపత్య జీవితాన్ని కూలదోసుకోవడ మన్నది ఎంతో శోచనీయం.

You may also like

Leave a Comment