అమ్మ
ఎంతో కమ్మని పిలుపు మమతల పిలుపు
వినగానే ఆ పిలుపు ఉవ్వెత్తున లేస్తుంటాయి నాలో కోట్లాది ప్రేమ తరంగాలు
అమ్మ
తన రక్తంతో మూడేసి
పొరల మాటున
నవ మాసాలు నిలుపుకుంది కడుపులో నేను భారమైనా కొద్దీ సంబరపడేది
అమ్మ
నన్ను కనేటప్పుడు వేసిన కేకకు
జీవితాంతం సేవ చేసిన తీరని రుణకేక అది
అమ్మ
రెండు సంవత్సరాలు తన రక్తాన్ని పాలుగా చేసి తాపింది ఆ పాలబలమే ఈనాటికి నన్ను నడుపుతోంది
అమ్మ
నా బోసి నవ్వులు
నా తప్పటడుగులు
తన గుండెల్లో నిలుపుకున్న దృశ్యాలు
అమ్మలో ప్రేమ లేకపోతే నాన్నలో దయ లేకపోతే
ఏ చెత్తా కుండీలోనో
విసిరి వేయబడే వాణ్ణి
అమ్మ
అమ్మ హృదయం అమృతం ఆమె తినకుండా తినిపించింది
ఆమె నిద్రపోకుండా
నిద్దుర పుచ్చింది
నేను కష్టాల్లో ఉంటే ఓదార్చేది నేను నష్టాల్లో ఉంటే పూడ్చేది
నాకు ఏడు పదులు దాటినా ఏడేళ్ల వానిగానే తలుస్తుంది తన కోడలు తన మనుమలను చూసి ఉప్పొంగుతుంది
కానీ
నేనే…
నేనే…
ఆమెను ఓల్డ్ ఏజ్ హౌస్ లో విడిచి వచ్చాను
ఓ మనిషీ!
తల్లి పాదాల కింద స్వర్గం ఉందన్న ప్రవక్తను మార్చావా పో నరకానికి పో

1 comment
I’ve tried a few platforms but this one is really smooth. The interface is intuitive and the payouts are fast. Definitely recommend phjiliapp to anyone looking for a reliable spot.