నేటి సమాజములో మానవతా విలువలను పెంపొందించుటకు,సామాజిక ప్రగతి సాధించుటకు,సమాజము లోని లోటుపాట్లను ఎత్తి చూపి,వాటికి పరిష్కార మార్గాలను సూచించుటకు,గొప్పనైన సంస్కృతి,సంప్రదాయాలను గురించి తెలియజేయుటకు,సన్మార్గానికి దారిదీపాలైన మహనీయుల చరిత్రను భవిష్యత్తు తరాల వారికి అందించుటకు సాహిత్యము ఏకైక మార్గమని తన కవిత్వము ద్వారా పాఠకులకు తెలియజేసేందుకు మన ముందుకు వచ్చారు డా.పోలా సాయి జ్యోతి గారు.
వీరు తెలుగు భాషా అధ్యాపకురాలిగా విద్యార్థులకు తెలుగు భాషా,సంస్కృతులను గురించి తెలియజేస్తూనే,సమాజము లోని ప్రతి ఒక్కరికీ తన కవిత్వం ద్వారా హితబోధ చేస్తున్నారు.”హితేన సహితం సాహిత్యం ” అన్నారు కదా పెద్దలు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో సాహిత్యములో రాణిస్తున్న అతి కొద్దిమంది మహిళల్లో శ్రీమతి సాయి జ్యోతి ఒకరు.వీరి ప్రస్తుత రచన “చైతన్య జ్యోతి”.ఇందులో ఉన్న కవితలన్నీ వివిధ సందర్భాలలో రాసినవి.అనేక కవితా సంకలనాలలో ప్రచురించబడినవి,వివిధ కవి సమ్మేళనాలలో చదివినవి.ఆయా కార్యక్రమాల నిర్వాహకులు విధించిన నిబంధనల మేరకు ఇవి రాయబడినవి కాబట్టి రాసిలో చిన్నవైన వాసిలో గొప్పవి.కవితలను చదువుతూ వెళ్తుంటే అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది.వారు చెప్పిన విధముగా కొన్ని వాక్యాలలోనే విషయాన్ని చెప్పడం కత్తి మీద సాము వంటిది.పాఠకులను ఆకట్టుకునేలా,పరిధి లోపల రాయడం అనేది ఎంతో చాకచక్యంతో కూడిన పని.అయితే ఆ పరిధిని దాటకుండా ఆయా అంశాల గురించి తనదైన శైలిలో అద్భుతమైన కవిత్వాన్ని రాసి సాహిత్యజ్యోతిగా పలువురి చేత ప్రసంశలు అందుకున్నారు ఈ కవయిత్రి.
ఈ పుస్తకములో శ్రీమతి సాయి జ్యోతి మొదటగా తన ఇష్ట దేవతలైన శ్రీ గణేశుడు,శ్రీ వేంకటేశ్వరుడు మొదలైన వారికి ప్రాణామములు అర్పించి,పూర్వకవులైన పోతన,సురవరం,యశోదా రెడ్డి,పి. వి,సినారె,కపిలవాయి తదితర సాహితీ మూర్తుల భాషా సేవలను స్మరించుకోవడం అనేది మంచి సంప్రదాయం.
తర్వాత వీరు అనేక సామాజికాంశాలు అయిన తెలంగాణ,శిల్పి,ఓటువిలువ, జలం,శ్రమైక జీవనం,వృద్ధాప్యం,వరకట్నం,కాలు ష్యం,పాలమూరు,కందనూలు ఘనత మొదలైన వాటిని స్పృశించారు.
వీరు ఇంకా మన సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే పండగ లైన ఉగాది,బతుకమ్మ,బోనాలు,రాఖీ ల గురించి తన కవిత్వములో చక్కగా తెలియజేసారు.
మాతృభాషా గొప్పతనాన్ని వీరు సాహిత్యం,అక్షరామాలిక,జ్ఞానదీపం ,తెలుగు భాష,జ్ఞానకోవెల,మాతృ భాషా వంటి కవితల్లో తనదైన శైలిలో చిత్రించారు.
అంతేకాకుండా భారతదేశ రక్షణ కొరకు తమ కుటుంబం,భార్యా పిల్లలను వదలి,ప్రాణాలను సైతం లెక్క చేయక,విపత్కర పరిస్థితులలో సరిహద్దుల్లో పహారా కాస్తున్న వీర సైనికుల ప్రాణ త్యాగాలను స్మరించుకుని తన కవిత్వము ద్వారా శ్రద్ధాంజలి ఘటించారు.
నేడు ప్రపంచం మొత్తాన్ని కంటిమీద కు నుకు లేకుండా చేసి,తన ప్రతాపంతో ఎన్నో లక్షల మంది ప్రాణాలను బలి గొంటున్న కరోనా మహమ్మారి గురించి,దాని ప్రతాపం గురించి దాదాపు 10 కవితల్లో తెలియజేసింది.దీన్ని నిలువరించుటకు ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ సందర్బంగా చేయడానికి పనిలేక,తినడానికి తిండిలేక సొంత వూరికి వెళ్లి, కలో గంజో తాగుదమని బయలుదేరిన వలస కార్మికుల కు సరైన రవాణా సౌకర్యాలు లేక కాలినడకన మైళ్ళ కొద్దీ ప్రయాణిస్తున్న వారి కష్టాలను గురించి చక్కగా వివరించింది సాయి జ్యోతి.
అంతే కాకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ బంగారు తెలంగాణ,మిషన్ భగీరథ,కెసియార్ వంటి కవితల ద్వారా తన కృతజ్ఞతను చాటుకున్నారు.
ఇంకా తనకు జన్మ నిచ్చిన అమ్మ నాన్నల గురించి,భార్య గొప్పతనం గురించి,మానవీయ విలువల గురించి,మాన సంవేదనలు అయిన సంతోషము,ఆనందం, మొదలైన వాటి గురించి గొప్పగా తన కవితల్లో చిత్రించారు.
ఈ విధంగా వైవిధ్యభరితమైన అంశాలను కవిత్వీకరించి ఒక్క చోట రాసిపోసినట్లుగా ఉన్న డా.పోలా సాయి జ్యోతి గారి ఈ పుస్తకం ఒక పూల సింగిడిగా పేర్కొనవచ్చు.వీరు భవిష్యత్తులో మరిన్ని రచనలు చేసి గొప్ప సాహితీ వేత్తగా ఎదగాలని కోరుకుందాం.