*” ఏమో ఏమో ఎంక ఎండుక పోతున్నావు
గాసం లేక నువ్వు గుంజుక పోతున్నావు
రోటిలో సజ్జా కంకి దంచితే మెదుగా దెందుకు..
తీటది తిర్లా గిరి
పడిదెల పసునురు
ఏతుల ఎంకటం పెటా
మాటల మల్లాపెల్లి …|| ఏమీరా.. || అంటూ తున్నగా రాగం తీసిండు
” దేహె వుకో తాతా నీ ఇనాం పెల్లి కి నా వారేదు ఊ అంటే సందులురు లో పడతావు ఎతుల బొచ్చు ఏడు గంపలు కింది బొచ్చు మూడు గంపలట గాని జరుపు పులిని జరుపు” పులి జూదం లో పులి కాయ వైపు చూస్తూ అన్నడు
” మనువడా నీ మేక సచ్చింది” అంటూ మేక కాయ రాయి చేత తీసుకుండు
” అబ్బా పులి జూదం ల నన్ను మెసుల నియ్యవే నీ ఎటూగాల”… అన్నడు విరేషా
” తాతా ఓ తాతగారు రాతిరి మా బావగారు కూతురు మీ అత్త గారు కూటికి పిలిచిందోయి అన్నదట ఎట్లనో చెప్పవైతివి మనువడ ” అన్నడు తాత
” ఓ తాత ఏం సాత్రం ఏస్తివే నీ దెబ్బ గాల ” నవ్వుతూ పక్కన నిలబడి పులి జూదం ఆట చూస్తున్న దమయంతి కొడుకు పరశురాముడు పక పక నవ్వసాగిండు
” రారా తమ్ముడ పెండ్లాం కొడకా సక్కగ రారా సన్నిస్తా అన్నదట యట్లనో చెప్పవైతివి ” మళ్ళీ నవ్వు పక పక నవ్వు నవ్వుతూ ” ఓ తాతా ఒక బీడీ ముక్క ఇయ్యవయితివి ” అనె వైరేశ
” దేష వూకోవు లజ్జ కాదోయ్ నన్ను అడుగ అడివిలో తిరిగే వానికి ఆకు కరువా ఊరిలో తిరిగే వానికి బీడీ కరువా ”
” అబ్బా మాటకు మాటేస్తవే ఓ సాత్రమన్న చెప్పు”
” ఓయి ఇంగో అతడు వేసిన కుందేలు యి య్యాల్ల యాట అయ్యింది సచ్చిన మొగడు సండ్ల మీద మని వున్న మొగడు మంచం మీద పడుకున్నారు ఎట్లానో చెప్పవైతీవి ”
” నువ్వే చెప్పు నేర్చుకుంట కానీ గింత పోవాకు అన్న పెట్టు ”
” సుట్ట గుతీ సుక్క గుతి వొకటే నషా ఇంగ పటు” అంటూ పొవాకు పెట్టిండు.
” అబ్బా ఎంత ఘాటు గుంది ఉచ్చుబ్బులకు సుట్ట తాగితే నోరంతా గత్తు వాసన కొడ్తుంది ..”
” అరే గొర్రెకు మండ తినవెట్టు నేను కుడితి తాపుత గాని”
ఇంటిముందు గొరెపిల్ల చెంగు చెంగున గంతులు వేస్తూ ఎగురులాడుతుంది అన్నది దమయంతి నీళ్లు తేస్తు
దాని మెడలో గజ్జె గల్లు గల్లున చప్పుడు చేస్తుంటే ఆమే కొడుకు ఆటాడసాగిండు
” అవునా మనువడ అట దిక్కులు జుస్తవు ఆడవు ”
” దెహి వుకొ తాతా , నువ్వు గింత
మేస్లనిస్తలేవు, నేను నీతోని గెన్నుతన ”
” ఆడవోయి జరంత వొడుపు తోని ఆడితే సరి ”
“ఇదిగో పెద్దమనిషి ఇది ఎంకట లచ్చమ్మ బండే కదా” కొత్త మనిషి అడిగిండు
” అవును ఏవురు మీది కొత్తగ చూస్తున్నా”
” మాది పాటిమీది గూడెం గాని జర గీ పత్త చెపుతావు”
” అరే గి చిట్టి జూడు ఎవరి పేరో ”
” ఏది ఇక్కడ తే ” అంటూ చేతులకు తీసుకుంటూ ” ఇదా ఇది అగ్గో దమయంతి అక్కది , ” తల గికుతూ అయింటి వైపు చూస్తూ వేలెత్తి చూపి ” దమయంతక్కో ఓ దామయంతక్కో” అని కుతేసిండు.
” ఎంద్రా విరేశా ఏంది అట్లా తొవ్వ తప్పిన దూడ లెక్కా అరుస్తున్నవు ” వారివైపు చూస్తూ అడిగింది
వచ్చిన అతను అమాయకథను నటిస్తూ తెలగండ్లేసి ఆమే వైపు చూస్తూ వుండు
ఆమె దగ్గరికి సమీపించి ” ఎవరు నువ్వు ” అంటూ పైకి కిందకీ ఎగాదిగా చూసి అడిగిందీ.
” మాది మాది. ” అంటూ నీళ్లు నమిలి మింగుతూ తటపటాయించి పాటిమిదిగూడెం నుంచి వస్తున్న కాకి ఎర్రయ్య పంపిండు.” అని అన్నడు
” ఎంపని మీద వచ్చినవు ” అడిగింది.
” ఇయ్యాల పనికి వస్తా అన్నవట గదా కాకి ఎర్రయ్య బాయి కాడికి నిన్ను పిల్చుక రమ్మని పంపిండు ” తమాయించుకుని పలికిండు.
” ఇయ్యాల నాకు తీరదు ఆదివారం మా వోడు ఇంటిపట్టున వుంటడు ఒక్కడే గద్దగాడు రేపు వాడు బడికి పోతడు రేపోస్త ” అంటూ అతనివైపు తీక్షణంగా చూస్తూ పలికింది
” అరే అయన మీ పెనిమిటి ఒక్క సోపతీ అటగదా మీ పెనిమిటి పట్నం ల వుండట కదా గా ముచ్చట సగా తెచ్చిండు ఆయిన అక్కడనే ఉండు ఊరికి ఈ మధ్యనే వచ్చె. నువ్వేమో పనికి రేపు మాపు అనుకుంట వొస్తలేవు అందుకే నన్ను తోలిండు కలుపు అట్ట నే వుంది నెల సంది వెంట బడ్డ కరువు పనిలో పడి కూలీ జనం దోర్కుత లేరు ఆయిన బాయి కాడికి నువ్వు నాట్లకు వచ్చినవు ఒక్క తీరుగ రమ్మన్నడు నీకు దంటగ మా యామె, ఆయన భార్య సగ వున్నరు” ఉరడిస్తు పలికిండు
” సరే వొస్తగాని నువ్వు పో నాకు కొద్దిగా ఆలస్యం అవుతుంది”
అయితేమాయే నువ్వు తయారు గా నువ్వు ఇంట్ల పని ముగించుకొని వొచ్చిందాక ఇక్కడ ఆట చూసుకుంట కుసుంట ” అన్నడు
ఒరే పరశరామ నేను పనికి పోతున్న గొర్రెకు మండ వుంది పగటిలి నీకు ఉట్టిమిద సద్ది పెడుతున్నా తిను ఇగో బుంగల బిందెల సాగరు నీళ్లు వున్నయి తాగు వుల్గ పోయకు అట్లనే గొర్రెకూ నీళ్లు దాపు విరేశోల్ల దొడ్డిలో ఆళ్ళ మేకల మండ వుంది కొంచెం ఎయ్యి. ” అని చెప్పింది దమయంతి.
” నీయమ్మ నేనోస్తనే ” అంటూ అమాయకంగా చూస్తూ అమ్మతో పలికిండు కొడుకు పరశరాముడు.
” వొద్దురా నేను వరి సేల కలుపు తీసే పనిల వుంట నా యెంట తిరిగితే కుదురదు ”
” తీసుక రావమ్మా అక్కడ ఆడుకుంటడు మేము వున్నము కదా” అని పలికిండు వొచ్చిన అతను.
ఆమె చేసేది లేక కొడుకువైపు చూస్తు సంచి సర్దింది
ఇంటిముందు గొర్రె ఆమెనే చూస్తూ ఆమెను రాసుకుంటూ పూసుకుంటూ తిరగసాగింది
ఆమె కొడుకు మురిసిపోతూ తల్లివైపు చూసిండు
” అరె మొక్కుర వెంకట లచ్చమ్మ బండ చేతులెత్తి మొక్కురా మీ అయ్య యాడున్నడో గని మన ఆకలి దూప యాల్ల మాల్ల తీర్చే సల్లనితల్లి ” అనగానే కొడుకు పరశరామ ఎంకటలచ్చమ్మ బండ కు మొక్కిండు
ఆమె తన పక్కింటి వారికి ఇల్లు చూడమని చెప్పి తన కొడుకును గొర్రె ను తోలుకొని పనివైపు కదిలింది ఆమెను చూస్తూ గొర్రె నడుస్తుంది. దానిని అదిలిస్తు కొడుకు నడుస్తుండు వారిని అనుసరిస్తూ వచ్చిన అతను నడవ సాగిండు…
” అరే నువ్వు బాయి మోటార పెట్టు నేను మండువా మలుపుత ఇదిగో దమయింతి వరి మడికట్ల నీకు తోడుగా మా ఆడోళ్లు వున్నరు వారిని కలుపుకొని కలుపు తియ్యి ”
” సరేఅన్నా “అంటూ అటువైపు కదల పోయింది
” మీ పెనిమిటి తోనీ మాట్లాడుతవా ” అని ఎర్రయ్య అనగానే “అమ్మో నేను మాట్లాడుతనే నాయిన తొని ” అనె కొడుకు
” అరే షిడం ఆగురా మీ నాయిన ఎటేట్టా వుండో ఆరునెలలు అయితుండే పొయ్యి ఇగవస్తి అగవస్తి అనుడే గాని ఇంత వరకు రాకపాయే అప్పుడప్పుడు సుక్కలెక్క మెరిసి నేనున్నా అంటడు కుదార్థంగా కూసొని మనసు తీరా మాటాడింది లేదు ఎట్టుండో, గాని కలిసిందా అన్నా పోను ఎది ఇటియ్యి” అని అడగగానే అతను పోను చేతికి అందిస్తే పోను తీసుకోని
” అలో… అలో , ఎందిది సడి సప్పుడు లేదు ఎట్టరా మాట్లాడేది” … చిత్రంగా పోను చూస్తూ అన్నది మళ్లీ
” అలో.. అలో ” అని అన్నది అవతల ఎత్తిన గొంతు ” అలో..
అలో ఎవరూ” అని పలికింది
” నేను దమయంతమ్మ ను మా రాజయ్య నేనా మాట్లాడేది”
” అలో రాజు పనిలో వుండు”
” కష ఇయ్యి మా రాజుకు” తడబడుతూ అన్నది
” ఇప్పుడు కుద్రదు లంచ్ టైముకు పోను చెయ్యి ” అంటూ పోను కట్ చేసిండు దూరంగా ఆమె వాలకం గమనించ సాగింది ఎర్రయ్య భార్య ముసిగా నవ్వుతూ పక్కకు తల తిప్పి చూడసాగిండు ఎమెరుగనట్టు ఆమె అమాయకంగా కొడుకు వైపు చూస్తూ
” ఓషే పనిమీద వుండట రా పరుషా మీ నాయిన. పగటీలి బువ్వ తింటప్పుడు మాట్లాడుదాం తియ్యి.”
“ఆర్నియమ్మ నాయినతోని మాట్లాడాలి అనుకుంటే పనిమీద వున్నాడు వుంటెంది పోను వచ్చిందని పిలువాలే”
” ఏదో పనిలో బిజగా వున్నట్టుంది
సరే గాని మధ్యాహ్నం చేద్దాము తియ్యి ” అంటూ తను పనిలో మునిగింది
కొడుకు గెట్టున కుసుండు బిట్ల గొర్రె ను తోలి కావాలి గాసుకుంట ఆమె వరి మడి కట్ల కలుపు తీసే పనిలో మునిగి వుంది ……
…
” అన్న రాజు గాడు మీ చెల్లిని తీసుక పోయిండని అనుమానం తో వానెంట పడితిమి వాడు చిక్కపాయే ఎన్ని రోజులు గాలం వేసి చూసినా దొరక లేదు గాని అతని భార్య ను ఇబ్బందుల పెడితె లెక్క ఓకేనా ”
” అరె వాడు యాడున్నా ఏ బొర్రెలో ఎంత కాలం దాసుకున్నా వానికి తప్పదు కానీ వాని పెండ్లాం పిల్లల ఇరుకు ఇబ్బందుల పెట్టాలి వానికి చుక్కలు చూపించాలి, వాడు శంకర గిరి మాన్యాలు పట్టాలి . ఎంతతోడు అంతనే వుండక మన ఇంటికి కన్నం బెడతడా కొడుకు గివ్వన్ని వానికి తెలుస్తయి తెలువాలే , మనమెంది మన కాందాన్ ఏంది తెలియదా ”
” అవుననుకో మనకు అనుమానమే కానీ కాని ఏంది కండ్ల చూస్తే ఏది లేదుకదా మన పిల్లకు తప్పులో పాలుంది కాదా”
” అరె మనం ఏమయినా చేస్తం వాడు బండమీద బతికే వాడు కుర్సిల కుకుంటాడు
మన పిల్లకు తప్పులో పాలుంది కాదాని వుకుంటమా
కుక్క ను సముద్రం దగ్గరికి తీసుకెళ్లినా గతుకుడే గాని మనలెక్క తాగుతదా ”
” నిజమే ననుకో మనకు ఏమన్నా ఇబ్బందులు వస్తయ”
” ఎందుకట్ల భయపడతవు మన మీద ఈగ వాలకుంట చేసినా టౌన్ లో ఎస్సై, సి ఐ, డిఎస్పీ అంతా మనోళ్లే వాడు చిక్కెనా ఏకీలు కా కీలు విరిచి పెడతరు నువ్వేం పరేషాన్ చెయ్యకు”
” నాకు ఇల్లు పొల్లు వుండే నాకేమన్నా వస్తదేమొనని నీ మాట విని నేను గింత పాపం మూట కట్టుకుంటి, నీకేంది బాగానే ఉంటవ్ ఎన్నిమాటలయిన చెబుతవు. నాకేం చుట్టుకుంటదొ పిల్లల గల్లోన్ని ” లోలోన అనుకుంటూ నీళ్లు నమిలి మింగసాగిండు దమయంతి వారివైపు చూస్తూ ” ఏమయివుంటది అబ్బా వాళ్లు ఏదో తేడాగా మాట్లాడుతున్నారు” అని లోలోన అనుకుంటూ తిన్నగా లేసి వాల్చిన నడుము ఎత్తి కొట్టంలో కి కాడి మోకు కోసం వెళ్ళింది. అదే అదునుగా ఎర్రయ్య ఆమె వెనుకాల నాసి పెట్టుకోనీ అగంతకునిలా కొట్టంలోకి జొరబడి ఊపిరి ఆడకుండా ఆమెను గట్టిగా వాటేసుకున్నాడు అతని చేతి లో ఆమె ఉక్కిరి బిక్కిరయ్యింది ఆ క్షణం జీవితం లో మొదటిసారి ఆమె నరకం అనుభవించింది అనుకొని హఠాత్ పరిణామానికి ఆమెకు ఏం చేయాలి తోచలేదు ఎవరికి చెప్పాలో తెలియదు గుండెల్లో ఒకటే దడ మొదలైంది ఉలికి పడిపోయింది ఒళ్లంతా చెమటలు పట్టింది గుండె వేగం పెరిగినకొద్దీ లోలోన ఆందోళన పడుతూనే వుంది రెప్పపాటులో అంతా జరిగిపోయింది కలా నిజమా తేల్చుకోలేని అయోమయం లో ఆమె ఎందుకు ఇలా జరిగింది బుర్రను తొలిచి వేస్తున్న ప్రశ్న అతను ఇలా చేయడం ఏమిటి ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదొ తెలియకుండా వుంది ఏమిటి ఈ విపత్కర పరిస్థితి. తలిస్తే కంపరం పుడుతోంది. వాడిని అక్కడికక్కడే ఉప్పు పాతర వేయాలన్నంత కసి…. కాని మౌనం పాటించి మిన్నకుండి పోయింది అంతా కర్మ పళ్లు పటపట కొరుకుతూ నిష్చేస్తురాలైంది తనకు తెలియకుండానే పళ్ళతో కిందిపెదవిని అదిమి పెట్టింది పేదుం చిట్లి ధారలుగా రగుతం కారింది తిన్నగా దుల్పాయించుకొని బయటికి వచ్చి అటిటు చూసింది కొడుకు ఏటో పరుగు తిస్తుండు గొర్రె కనిపిస్తలేదు అంతా అయోమయం. …దిగులుతో చడి చప్పుడు చేయకుండా ఇల్లు చేరింది. కొడుకు గొర్రె కోసం తిరిగి తిరిగి అలసిపోయిండు. ఎనకాల తిన్నగా ఇల్లు చేరిండు కండ్లు కంతలకు పొయినయి మొకం పిర్చుక పోయింది గొర్రె జాడ లేదు. వుత్త చేతులు పిసుకుతూ అటుగా చూసాడు సాయమాను గుంజ చిన్నబోయింది అమ్మ మంచం లో నిద్ర పోయినట్టు వోరిగింది. ఏమీ తెలియని పరశురామ అమ్మ పక్కేంట మంచం మీద కూర్చుండు.
…
” అమ్మా అమ్మో మన గొర్రె ఎక్కడ పోయిందే నేను దాని పక్కనే ఉన్న చిత్రంగా మాయమైంది” ఆమె గునుస్తు తిన్నగా కళ్లు తెరచి ” ఎవరో దొంగలు ఎత్తుక పోయినట్టుంది లేకుంటే ఎవరి దొడ్డిలోకన్న పోయిందేమో పొద్దుగాల లచ్చమ్మ బండకు మొక్కి చూద్దాము రా” తిన్నగా అన్నది
” అమ్మా మన దేవునికి మొక్కితే దొరుకుతదా ” ఆమె వైపు అమాయకంగా చూస్తూ అన్నడు
” మన సొమ్ము మనకు రుడముంటే తప్ప క తిరిగొస్తది, మనది కాకుంటే మంది పాలు అయితది అంతా దేవుడు చూస్తడు తియ్యి రా ఎందుకు విసిగిస్తవు ” పాలిపోయిన మొముతో అన్నది
దారెంట వెళ్తున్న తాత వారి మాటలు విని ” ఏంది దమాయమ్మ పిలగాడు సతాయిస్తుండా ” అడిగిండు
” గోరెపిల్ల కాటు వడ్డది మామ ” తిన్నగా అన్నది
” అరే అట్లనా ఎర్కలి బువ్వమ్మ తానికిపొయ్యి సాట సకినం చుపియి యాడవుందో ఆనవాలు చెప్తది ” తీక్షణంగా చూస్తూ పలికిండు
” దోర్కేన మామా దొంగలు దోస్క పోయినట్టుంది” బేలగా చూస్తూ పలికింది
” ఇగ్గో ఆమె చెప్పినట్టు చెయ్యి ముందు పసుపు బియ్యం లో పావుల నేములు వేసి దేవునికి మొక్కి ముడుపు కట్టు ” అన్నడు
” మర్సే పొయిన వుండే సారయ్య మావ కాళ్ళు చేతులు కడుక్కొని ముడుపన్న కడుత కానీ నీకు ఎరుకేనాయే సాట సకినమ్ సుడరాదే ” లేచి నెత్తి జడ ముడివేసి మొకాన నీళ్లు చల్లుకుంది.
” అది నాకే పెడుతున్నావు ఏది గిన్ని బియ్యం సాట్ల పోసుకొని తీసుక రా ” అని అన్నడు తాత. ఆమె పైట కొంగుతో మొకం తుడుస్తూ సోలతో బియ్యం తీసింది.
అతను దోసెడు బియ్యం సాటలో పోసి సాట ను బొటన వేలు చూపుడు వేలితో మధ్యలో పట్టుకొని
సాటను తిన్నగా ఊపసాగిండు కనురెప్పలు ఆడిస్తూ గుడ్లు మిటకరించి సాట వైపు చూస్తూ
” సొమ్ము ఎక్కడ ఉంది తొవ్వ చూపు, వొస్తదా, వొస్తదా , రాదా రాదా, తూరుపా, ఉత్తరాన, వోయిములా పడమరా, డచ్చినాదా ఎక్కడా ఎక్కడా పెడమర్ల చూపు చూపు ” అంటూ సరాయిస్తు శకునం చూడ సాగిండు ఆమె ఆమె కొడుకు ఇద్దరూ గుడ్లప్పగించి అతడిని చూడ సాగిండ్రు.
అతడు సాట చేతితో పట్టుకొని దానిని పరిచ్చగా చూస్తూ ” ఇవురెనా. ఇరుగపొరుగు లో వుందా ఎటుపక్క ? దొరుకుతదా.. దొరకదా.. చిక్కదా.. అంతేనా.. ” సరాయిస్తు ఆవలిస్తూ డేపులు తీస్తూ దమయంతి వైపు చూస్తూ “వొమ్మా దొరకదు రా ఆశ వదులుకో పెద్ద గద్ద చూపు పడ్డది రా మనది కాదనుకో బిడ్డా ” ఆశ వదులుకో అన్నట్టుగా చేత సైగ చేసాడు.
అతను తిన్నగా అక్కడి నుంచి లేచి బైటికి వచ్చి అటిటు చూసి ” భద్రం రా ” అంటూ ముందుకు కదిలిండు అతని మాట అమెకు బోద పడలె
” అమ్మా మన గొర్రె దొరుకాదా ”
” ఇంకెక్కడి గొర్రె రా ఎవని కన్నో మన ఇంటిమీద పడ్డది మనమూ ఈ ఊరు విడిచి పోవాలె ”
” ఎందుకమ్మా మనది ఈ ఊరు కాదా ” కండ్లు నలుస్తు అన్నడు
” నీకు ఎట్లా చెప్పరా మీ అయ్య జాడల పట్నం పోదాం పండుకో కోడి కుయంగలేచి బాట పడుదాం ” అని కొడుకుకు చెప్పింది కాని రెప్ప మూయలేక కన్నీరు కారుస్తూ కొడుకు పక్కన వొరిగింది. ఆ రాత్రి వారికి కాల రాత్రి
” మన ఇంటి సూట్టు కొలిమి దెయ్యాలు పడ్డయి
బట్ట కాల్చి మిదేసి బదనాం చేస్తరు పొద్దు పొడువక ముందె పోదాం గాని పండుకో రా ” అని తీన్నగా గొనిగింది.
కొడుకు నిద్రలోకి జారుకుండు
ఆమె పరి పరి గా ఆలోచిస్తూ వుంది నడి రాతిరి తలుపు టకటకా చప్పుడు ఉలికి పడి లేచింది ” దమయమ్మో ఓ దమయమ్మా ” పిలిచినట్టు వినపడింది చిన్నగా లేచి గొళ్ళెం తీసింది ఎదురుగా పక్కింటి అతను ఆమెని చూస్తు పిందారా” చేస్తున్నారు రావమ్మా అని పిలిచిండు అలాగే అన్నట్టు తల వూపి తలుపు గడియ పెట్టి నిద్రలోకి జారుకుంది
మునిమాపుజామునలేచి సాటసకినం చూసిన, మిత్తి దీసిన పసుపు కలిపిన బియ్యం పైసలు ఉతికిన గుడ్డలో మూట కట్టి దేవుని పటము దగ్గర వుంచింది
” అమ్మా ఎంకట లచ్చమ్మ నీ బండకు మొక్కుత్తున్న నేనా ఒంటి దాన్ని నేను ఏ పాపం ఎరుగ అన్నెం పున్నెం నీ కెరుకా తప్పు చేసిన వాడు ఏం ఇగురు పెట్టడు , గాని సప్పుడ చేయకుండా నిన్ను తలుస్తున్నా నీదే భారం. తప్పు చేశామన్న వాడు చెంపలు వేసుకొని ముక్కు పట్టుకొని నేల రాయాలే వానికి క్షమాపణ లేదు నేను నిన్ను మల్ల చుస్తనా ఇదే ఆకరా నీదే మాయ ఎలేడు పిలగాని తోడుకొని ఊరు విడిచి ఊరు కానీ ఊరుకు పయనం అయితున్న సెలవు తల్లి ” అంటూ మనసులో దీనంగా కుమిలి కుమిలి విలపిస్తూ ముందుకు బాట సాగబోయి ఆగి అటు ఇటూ చూసింది అక్కడ అందరూ తిరుగుతున్నారు కొందరు వారివారి పనులకోసం పోతున్నారు ఇంటిలో దీపం వెలిగించి బయటికి తొంగి చూసింది దూరంగా దీపపు వెలుగు లో తల తల మెరిసింది ఏమిటది మెరుస్తుంది అని అటుగా నడిచింది తాకి చూసింది గల్లుమని చప్పుడు వినిపించింది దానిని చేతికి తీసుకోని చూసింది అది ఆమె గొర్రె మేడలో తాను ప్రేమగా కట్టిన గజ్జె ఇక్కడకి ఎలా వచ్చింది. ఆమెకు లక్ష చిక్కు ముడుల చిక్కు ప్రశ్న ఆమె పుర్రెను తోలిచింది సమాధానం దొరకని ఆమె అలా తన కొడుకును వెంట తీసుకోని ముందుకు కదిలింది…