Home కవితలు ఏకత్వంలో భిన్నత్వం 

ఏకత్వంలో భిన్నత్వం 

by Agora

ఒక్క నిప్పు రవ్వ 
అరణ్య దహనం చేయగలదు!
ఆహార పచనం చేయగలదు!

ఒక్క తప్పు తొవ్వ 
పతనానికి చేర్చే ముప్పు కాగలదు
గుణపాఠం నేర్పే కనువిప్పు కాగలదు! 

ఒక చీత్కారం
మదిని చీల్చే అవమాన శరం కాగలదు!
మనిషిని సరిదిద్దే అసమాన స్వరం కాగలదు!

ఒక్క శ్రీకారం
విధి ప్రారంభానికి దీవన కాగలదు!
కార్యపూరణకు రక్షణ కాగలదు!

ఒక్క బీజం
సఘనారణ్యానికి ఆది జీవ ధనం కావచ్చు!
గొప్ప వంశవృక్షానికి తొలి 
జన్యు కణం కావచ్చు!

ఒక మహా విస్పోటనం
విశ్వ వికాసానికి కారణం కావచ్చును!
ప్రపంచ వినాశనానికి ప్రేరణం
 కావచ్చును!

. ఒక మహా సాగరం
మనో నిగ్రహానికి నిదర్శనం కావచ్చును!
భీకర ఆగ్రహానికి నిరూపణం కావచ్చును!

ఒక చినుకు
ఎడారిలో నిరర్థకం కావచ్చును!
ఆల్చిప్పలో మౌక్తికం కావచ్చును!

ఒక దిటవైన దీక్ష
ఆత్మ శోధనకు నడవ కావచ్చు!
జన్మార్థ సాధనకు సడవ కావచ్చు!
.
ఒక్క ఆలోచన
ఆత్మ త్యాగానికి నిర్ధారణ కాగలదు!
కళ్యాణ యాగానికి అంకురార్పణ కాగలదు!
        ——*——

.

You may also like

Leave a Comment