Home కవితలు నేటికన్యక

నేటికన్యక

by Damaraju Vishalakshi

పాత పట్టు చీర గట్టి
అంచురంగు రైకతొడిగి
పూజబుట్ట చేతబట్టి
కన్య బడగాన్.

తల్లిదండ్రులు తనను జూచి
తమకు బరువని
బాధపడుతూ
మాటలంటూకన్యమనసును
గాయపరచంగన్.

ఎన్నిపూజలు చేయనేమి?
ఎన్ని మ్రొక్కులు మొక్క నేమి?
పెండ్లిరాత నీకులేదని
తండ్రిగొణగంగన్…

అందచందాలమరిలేవు
పొందుగెన్నో విద్యలును రావు
కాసు లేనిదే కన్య చెల్లదు
ఖర్మమని తల్లనియెన్..

నిత్యమున్నపోరుయనుచు
నిమ్మళముగా బయటికొచ్చి
సూటిగా సాగిపోయె కన్యక
గుడికి పోవంగన్

వెనుకనుండి వెకిలి మాటలు
ముందునుండికాంక్షచూపులు
కనుచు,వినుచుకన్యయంతట
గుడికి పోవంగనన్..

అసుర సంధ్యవేళ దాటెను
అన్ని వైపుల చీకటాయను
గుడిలో జనములేకపోయెను
కన్య చూడంగన్..

గర్భగుడిని చేరికన్యక
అచ్చటున్న అయ్యవారిని
పూజ చేసిన పోదునింటికి
అర్చించమని అడిగెన్.

అందరిళ్లకు మళ్ళీనారు
చివర నీవువచ్చినావు అనుచు అర్చనచేసి వృద్ధుడు
ప్రసాదమీయంగన్

బ్రతుకుచీకటి నుండెస్వామి ఈచీకటి నన్నేమిచేయును?
నాదురాత యిట్లున్నదనుచు
కన్య పలుకంగన్…

పూజచేసిప్రసాదమిచ్చి పూజారిగారుకన్యకనుచూసి
శుభం తల్లీ!వెళ్లి రమ్మని
దీవనలనీయంగన్.

ఏ శుభములు కలుగలేదు
ముందుగతియేతెలియరాదు
ఎటులబ్రతుకు గడుచునో యని
కన్య వగవంగన్.

బ్రతుకుయెప్పుడు ఒక తీరునుండదు
తప్పకుండామార్పువచ్చును
మంచిరోజులుముందుగల
వని
పూజారి బోధించన్

అంతయు ఆ దేవిచిత్తము
అట్లునడచుటమనకుధర్మం
అనుచు గర్భగుడినిమూసి
పూజారి వెళ్ళంగన్.

మండపములో మూలనున్న స్తంభమునకు చేరబడిన
కన్యక
తనదుస్థితినితలుచుకుంటు
కన్నీరు పెట్టంగన్.

అంద చందాలలసలు లేవు ఆర్థికమగు స్థితియు లేదు .
ఆదరించే వారు లేరు నాజన్మ వృధ యనియన్?

పరమేశ్వరా నీకుకూడా!
నా బ్రతుకుపట్లపరిహాసమేనా?
కన్న తల్లి తండ్రి కైనా! నే భారమా?అని ఏడ్చెన్ .

శివయ్యా! నాకుత్రోవ చూపుము
నీవు తప్ప దిక్కు లేదని
వేదనతో ఆకన్యయప్పుడు
వెక్కిళ్లు పెట్టంగన్

నన్నుకూడుము నన్ను జేరుము
నాతోటిబ్రతుకునంత గడుపుము
ఏడ్వకుండా నిన్నుచూచెద ననుచువినపడగాన్

వెనుక తిరిగి చూసికన్యక
వణికిపోయి లేచి నిలబడి
ఎచట నుండి వచ్చినావని?
ఎదురు ప్రశ్నింపన్.

నీపొందుకోరి,వచ్చినాను
నిన్నువెంబడించినాను
గుడిలొ అందుకుజొచ్చినానని?
వాడు పలుకంగన్.

ఉలికిపడి ఒక్కఉదుటున
దూరముగా జరిగి కన్యక
ఎవరుమీరు? ఎరుగనంటూ
కన్య దాన్ అరిచెన్.

నీకునచ్చిననీదుప్రియుడను నచ్చకున్ననునిన్నువదలను
నీకొరకే వచ్చినానని వాడు
పై పైకి రాబోవన్ .

పాపాత్ముడా! పవిత్రమ్మగు ప్రాంగణములో నిలిచినావు
ప్రలాపింపకు ప్రాణములు నీకు దక్కవని పలికెన్.

అందచందాలసలు లేవు ఆస్తిపాస్తులు లేనేలేవు
నాకంటే గొప్పవాడు దొరకడని నవ్వేన్ .

కట్నమీయగ గతియులేదు కాసులిచ్చే దారిలేదు. నీ బ్రతుకుకునియమమేలని?
వాడునవ్వంగన్ .

పెద్దవాడివిబుద్ధిలేక,
ఎట్లుపలికెదవిట్టి తీరున?
దూర్తుడా! నా త్రోవనుండి తొలగిపొమ్మనియెన్.

కోర్కెతీర్చి వెడలిపొమ్ము,
కోరి నీకైవచ్చినాను కాదనన్నావదలననివాడు కామముతో మాట్లాడన్

తండ్రివంటి వాడవీవు,
తగదు యిట్లుమాట్లాడుట అనుచు కన్యక కోపగించగ
ఆవేశమొద్దనియన్.

నీకునచ్చినధనమునిచ్చెద నీవుమెచ్చినబ్రతుకునిచ్చెద లోకములో తెలియనివ్వను కోర్కె తీర్చనియన్ .

కాదుకాదని వాదులాడిన, కన్యకకు నచ్చజెప్పగ
పాప,పుణ్యం నేటి రోజున పనికిరావనియన్.

కట్నకానుకలియ్యలేవు
కాసులొచ్చే దారి లేదు
కన్యవైనా నీకు ఇంక
పెండ్లి కాదనియన్

కాదు కాదని కన్య ఏడ్చిన
అడ్డగించి అతడు ఆపి
పమిటచెంగు పట్టిలాగి
పళ్ళు ఇకిలించెన్.

పెండ్లిఅయిన బ్రహ్మచారిని
పేరుపొందినపెద్దవాడిని
పిల్ల జెల్లాలేనివాడిని భయముఏలనియన్?

మారుమూలగుడికినీవు
ఈ వేళలో వచ్చినావు
శిలగమారిన శివుడునిన్ను కాపాడలేడనియెన్

ఎవరు నిన్ను కాపాడుతారు? ఎరుకలేదని ఎగిరిపడుచూ! ఎదురునిలిచి వాడ పైబడ
ప్రయత్నమే జేసెన్ .

మెట్లక్రిందకు పరుగు తీసి
కామాంధుని చూచి వణికి
కాపాడమని వేడుకుంటూ
కన్య పరిగెత్తెన్

పాశవికమగుప్రవృత్తితోడ
పశువు వలె మీద పడిన
కామాంధుడా! నీపాలినేను
కాళికను, అని అరిచెన్ .

ఆడపిల్లలు అంటే అలుసా?
అసలురూపం నీకుతెలుసా?
ఆగ్రహిస్తేబ్రతకగలవా? అనుచు పెనుగాడెన్.

ఒక్క ఉదుటన వానితోసి
శివుని పక్కకు వెళ్లి దాగి
భయము తోడ కన్యక
శివుడా కాపాడమని వేడెన్.

చెట్టు చాటున నక్కి కన్యక
చెట్టుకిందన లింగము ముందర
అమర్చిన శూలము దిక్కని ఆలోచనలు చేసెన్..

గుప్పుమంటూ వాసనలు రుప్పగ
గుర్రు గుర్రుగా చూచి వాడు
గర్వముతోవిర్రవీగుచు
గబగబా వచ్చెన్

దొంగతనముకు వచ్చినాను
దొరగా నిన్ను చూచినాను
కోరి వలలో చిక్కినావు
విడువనిన్ననియెన్.

దుర్మార్గుడా!
నీకు దక్కను
నీదు ఆటలు సాగనివ్వను
ధైర్యముంటే ముందుకు రమ్మని
కన్య పలుకంగన్

ఒక్క ఉదుటున ఉరికివాడు
కన్య పమిటను పట్టబోయి తూలిపోయి శూలము పైబడి
పెద్దగా తానరచెన్

గావుకేక పెట్టి వాడు
గిలగిలలంటూ కొట్టుకొనగా
శివుడు శిక్ష ను వేసినాడని
కన్య తా తలచెన్

గుండెలోన శూలమ్ము దిగగా
కొట్టు కొని ప్రాణాలు విడిచిన
వాని చావు చూచి కన్యక విస్మయము చెందన్

ఇచ్చటన్న ముప్పు వచ్చును పోలీసు కేసు వచ్చును
అనుచు నిశ్చయించి కన్యక
పుష్కరిణి దిశ నడిచెన్.

లోకబంధూ,మహా
దేవా !
నీవే నాకిక శరణ మనుచు
నిశ్చయానికి వచ్చి కన్యక
పుష్కరిణిలో మునగన్.

పరమశివుడే త్రోవ చూపి,
బ్రతుకు అర్థం తెలియచెప్పగ,
బ్రతుకు గడపగ కన్యమదికి
ముందుగతిదోచన్.

స్నానమాడి చుట్టూర వెదికి
దీక్ష వస్త్రాలు కొన్ని చూచి
శివ ప్రసాదమని ధరించివాటిని
చరచరా గుడి దాటెన్ .

శివయ్య తోవచూపినావు
బ్రతుకు మార్గం చెప్పినావు
చాలు స్వామి జన్మకంతా
దిక్కు నీవనియన్ ..

ఈ ఊరిలో ఉండ నాకు
ఏ విధంగా అండ లేదు
తల్లిదండ్రుల ప్రేమ లేదు
బ్రతుకు బరువననియెన్..

ఇంటికెళ్లిన ఏమి ఒరుగును ?
నిజముతెలిసిన నిందలేయగు
అని తలచుచు
ఆ కన్యక
చీకటిలో తాకలిసెన్..

కనిపించిన రైలు ఎక్కి
కాశివరకు సాగిపోయి
గంగ లోపల స్నానమాడి
గతము తావదిలెన్..

అమ్మ గుడిలో అర్చకులు
అనాధవా?యని అడిగి కన్యను,
ఆశ్రమంలో వృద్ధ సేవకు
ఆహ్వానించంగన్.

తల్లి తండ్రికి చేసినాను
నాయనమ్మను చూసినాను
ఈ వృద్ధులకు ప్రేమ పంచుట
సులభమని పలికెన్

ఆశ్రమములో చేరి కన్యక
అందరినీఆదరించుచు
తలలోననాలుకగుచు
సేవలో తరించెన్

చీకటంతా తొలగిపోయెను
కాంతి రేఖల పున్నమొచ్చెను
ఆ సమాజంలో కన్య చేరి
ఆనందమే పొందెన్.

అనాధలకు వండి పెడుతూ
అమ్మ వోలేఆదరిస్తూ
విశ్వనాధుని సేవ చేస్తూ
విధి వ్రాత తనె మార్చెన్..

కన్యకున్న ధైర్ర్యము వలన
కచ్చితమగు శక్తి వలన
ఓర్చుకున్న తత్వము వలన
యిప్పుడు
మేలాయన్

గతమంతా చెరిగిపోయెను
గందరగోళం మరచిపోయెను
ప్రశాంతంగా జీవనౌకను
గడుపుచూ ఆ కన్య తా బతికెన్

అతివలలో ఆత్మ స్థైర్యం
అంచలంచలు గెదిగినప్పుడు
ఆకాశం అందుకుందురు
అవరోధాలధిగ మింతురు

ఆధునిక స్త్రీ అబల కాదు ఆదిపరాశక్తి రూపు అనుచు తెలిసిన అతివలందరు ఆనంద మందెదరు

ఆడపిల్లలు శక్తి తెలుసుకు
ఆత్మవిశ్వాసమును గల్గి మెలగుచు అడుగులు
దృఢముగా వేసినప్పుడు
అవని శోబిల్లున్..

You may also like

Leave a Comment