Home వ్యాసాలు సురవరం ప్రతాపరెడ్డి

సురవరం ప్రతాపరెడ్డి

by Gaddam sulochana

సురవరం ప్రతాపరెడ్డి పేరు వినగానే ఒక మహోన్నతమైన సాహితీ మూర్తి మన ముందు సాక్షాత్కరిస్తాడు. తెలుగుజాతి సంస్కృతిని వెలిగించినవాడు. సాహితీ సేవానురక్తుడు. తెలుగుజాతి అందరిని ప్రభావితం చేసిన తెలంగాణ వైతాళికుడు. బహుముఖ ప్రజ్ఞాశాలి. తెలంగాణ ప్రజలకు మార్గదర్శి. వారి జీవితం మనకు ఆదర్శం.

ప్రతాపరెడ్డి మహబూబ్ నగర్ జిల్లాలోని గద్వాల సంస్థానానికి రాజధానిగా ఉండిన బోరవెల్లి గ్రామంలో 28- 05 -1896 లో జన్మించారు. చిన్నప్పటి నుండి గొప్ప ధారణాశక్తి కలవాడు. తండ్రి దగ్గర ప్రాథమిక విద్యాభ్యాసం, ఆ తర్వాత విద్యాభ్యాసం పినతండి రామకృష్ణారెడ్డి దగ్గర కొనసాగింది. పినతండ్రి వీరికి కచ్చితమైన దినచర్యను పెట్టాడు. తు.చ.తప్పకుండా పాటించిన ప్రతాపరెడ్డి జీవితం ఇక్కడే గొప్ప మలుపు తిరిగింది. 9వ తరగతి చదివేటప్పుడే తాను కవిగా కీర్తి సంపాదించాలని లేకుంటే జీవితం వ్యర్థమని అనుకున్నాడట. అనుకోవడమే కాదు ప్రబంధాలు తెచ్చుకొని నిఘంటువు సాయంతో చదువుకున్నాడు. సంస్కృత గ్రంథాలను అధ్యయనం చేశాడు. చదవడం క్రమంగా ఒక వ్యసనంగా మారింది. కొత్త పుస్తకం వచ్చిందంటే చాలు, కొని చదవాల్సిందే… ఆ చదవడం కూడా పరిశీలనాత్మకంగా, విమర్శనాత్మకంగా చదివేవాడు. అతనికున్న ఈ లక్షణమే అతన్ని గొప్ప పరిశోధకుడిని చేసింది.
పదిమంది మేలుకై పాటుపడే స్వభావం గల ప్రతాపరెడ్డి,
నిజాం పరిపాలనలో స్తబ్దంగా మారిన తెలంగాణ ప్రజలలో చైతన్యం నింపడానికి నడుంబిగించారు.అందుకోసం తన సంపదను, అక్షర సంపదను తెలంగాణ అభ్యుదయానికే వినియోగించాడు.

ప్రతాపరెడ్డి పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చేది గోల్కొండ పత్రిక. ఆనాటి నిజాం రాజ్యంలో రాజభాషగా వ్యవహారిక భాషగా ఉర్దూ మాత్రమే ఉండేది. తెలుగు ప్రజలు అణిచివేతకు గురయ్యారు. తెలుగు వారి అస్తిత్వాన్ని కాపాడడానికి, వారిలో నవ చైతన్యాన్ని నింపడానికి, తెలుగులో పత్రిక అవసరం ఎంతో ఉందని గుర్తించిన ప్రతాపరెడ్డి నిజాం ప్రభుత్వ అనుమతిని పొంది, 10మే 1926న గోల్కొండ పత్రికను ప్రారంభించాడు.

ఇందులోని వార్తలు ప్రజల చైతన్యానికి వికాసానికి ఎంతగానో తోడ్పడ్డాయి. ముఖ్యంగా తెలంగాణ హైదరాబాదు ప్రజలను చైతన్య పరిచిన తొలి పత్రిక గోల్కొండ. తెలంగాణ సాంస్కృతిక దర్పణంగా ప్రజల పక్షాన నిలిచిన పత్రిక. ఇందులోని సంపాదకీయాలు ప్రజలను జాగృత పరిచేవిగా,
స్వాతంత్ర స్ఫూర్తిని రగిలించాయి. నవాబుకు వ్యతిరేకంగా ఉత్తేజపరిచేవిగా ఉండేవి. నిజాం గుండెల్లో అవి రైళ్లు పరిగెత్తించేవి.

నిజాముకు వ్యతిరేకంగా వార్త రాసిన షోయాబుల్లాఖాన్ ను నడివీధిలో అత్యంత కిరాతకంగా నరికి చంపిన రోజులవి. ఆ పరిస్థితుల్లోనూ నిజాం అరాచకాలను దుర్మార్గాలను ఎండగ డుతూ వార్తలు, సంపాదకీయాలు, వ్యాసాలు రాసిన ధైర్యశాలి ప్రతాపరెడ్డి.

రవాణా తపాలా వ్యవస్థలు, సాంకేతిక సౌకర్యాలు అంతగా లేని కాలమది. అలాంటి పరిస్థితుల్లో ఒక పత్రిక నడపడం సామాన్యమైన విషయం కాదు. సంకల్పదీక్ష కలిగిన కార్యశూరులకు అసాధ్యమేముంటుంది. సంపాదకుడిగా, ప్రూఫ్ రీడర్ గా, గుమస్తాగా మారాడు. జాతి కుల వివక్ష లేకుండా నిష్పక్షపాతంగా పత్రిక నడిపాడు. 23 సంవత్సరాలు గోల్కొండ పత్రిక సంపాదకుడిగా ఆయన చేసిన సేవ చిరస్మరణీయం. ఈ పత్రిక తర్వాత ప్రజావాణి పత్రికగా కొంతకాలం నడిచింది.

తెలంగాణలో కవులు లేరు అన్న వార్తను చూసిన ప్రతాపరెడ్డి ఎంతో బాధపడ్డారు. దీనికి
దీటుగా జవాబు చెప్పాలనుకున్నాడు. తెలంగాణ కవుల వివరాలను, రచనలను, జీవిత విశేషాలను ఎంతో శ్రమకోర్చి సేకరించాడు. 183 మంది పూర్వకవులు, 354 మంది ఆధునిక కవులను పరిచయిస్తూ గోల్కొండ కవుల సంచికను 1935లో వెలువరించారు. ప్రతాపరెడ్డి దీక్షా దక్షతలకు స్వాభిమానానికి ఇదొక ఉదాహరణ.

ప్రతాపరెడ్డి కవిత్వం, కథ, నవల, వ్యాసం, జీవిత చరిత్ర పరిశోధనా గ్రంథాలు వంటి అనేక ప్రక్రియలో రచనలు చేశారు. వీరి ఆంధ్రుల సాంఘిక చరిత్ర, హిందువుల పండుగలు, రామాయణ విశేషములు ఆయన కీర్తి కిరీటంలో కలిపితురాయిలై మెరిసిన గ్రంథాలు.
ఆంధ్రుల సాంఘిక చరిత్ర
తెలుగువారి వెయ్యేళ్ల సాంఘిక సాంస్కృతిక జీవనాన్ని సమగ్రంగా పరిశోధించి, పరిశీలించి రాసిన గ్రంథం. రాజుల చరిత్రనే చరిత్రగా చెలామణి అయ్యే కాలంలో ప్రజల చరిత్రనే అసలైన చరిత్రగా ఆవిష్కరించిన అత్యుత్తమ రచన ఇది. అందుకే ‘కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు’ గౌరవాన్ని పొందిన మొదటి తెలుగు గ్రంథం గా చరిత్ర సృష్టించింది. హిందువుల పండుగలు వాటి వెనుక ఉన్న నేపథ్యాలు, ఆచార సాంప్రదాయాలు, పండుగల విశేషాలను పురాణ శాస్త్ర ప్రామాణికంగా తెలిపాడు. అప్పటి సామాజిక జీవితాన్ని కళ్ళకు కట్టే ఎన్నో కథలు కూడా రచించారు. అందులో 11 మొగలాయి కథలు. నిజాం కాలం నాటి స్త్రీల బాధలను సమాజంలో వారి స్థితిగతులను తెలియజేస్తున్నాయి. ఇవి తెలుగు సాహిత్యంలో అద్భుతమైన కథానికలుగా నిలిచాయి. వీరి గ్రంథాలయం, హైందవ ధర్మ వీరులు, ఉచ్చల విషాదం వంటి నవలలు బహుళ జనాదరణ పొందాయి.

నిరంతరంగా చదివే అలవాటున్న ప్రతాపరెడ్డి తెలుగు సంస్కృతం ఆంగ్లం ఉర్దూ పార్సి కన్నడ భాషలో పట్టు సాధించాడు వేదం వెంకటరాయ శాస్త్రి దగ్గర సంస్కృతం నేర్చుకున్నారు వివిధ భాషలపై పట్టు సాధించిన ప్రతాపరెడ్డికి తెలుగు భాష అంటే ఎనలేని అభిమానం. ఎవరైనా తెలుగును చిన్నచూపు చూస్తే మాత్రం సహించేవాడు కాదు. నిఘంటువులలో రాయబడని చాలా పదాలకు అర్ధాలు కూడా రాసి పెట్టారు. తెలుగు లిపి సంస్కరణ జరగాలని ఆశించాడు. 28 అక్షరాలతోనే వర్ణమాలను రూపొందించి పరిశోధకుడిగా తన ప్రతిభను చాటుకున్నారు. గ్రాంథికం వ్యవహారికం రెండింటిని తన రచనల్లోనూ ప్రసంగాల్లోనూ సమయానుకూలంగా అక్షయ అక్షరాలుగా వాడగల సవ్యసాచి ప్రతాపరెడ్డి.

అచ్చమైన తెలుగువాడిగా, నిండైన తెలుగుతనం ఉట్టిపడే వేషధారణతో నిజాయితీగా జీవించాడు. ఎంతో మంది కవులకు రచయితలకు పరిశోధకులకు ప్రోత్సాహాన్ని అందించి, ఎన్నో రచనలు రావడానికి ప్రేరణగా నిలిచాడు. ఆవేశపూరితమైన స్వభావమైనప్పటికీ అతనిది ధర్మావేశం మాత్రమే! ఆత్మీయమైన హృదయమున్నవాడు. మంచి ఎక్కడున్నా గ్రహించే అహంకారం లేని మనస్తత్వం. మహాభారతాన్ని నడిపించిన ధీరుడైన కృష్ణుడికి మీసాలు ఎందుకు లేవు అని ప్రశ్నించుకొని,
మార్చాల రామాచార్యులగారితో ‘మీసాల కృష్ణుడు’ చిత్రాన్ని గీయించి గోల్కొండ పత్రిక కార్యాలయంలో పెట్టుకున్నారట. ఇలా వీరి ఆలోచనలు కూడా విభిన్నంగా ఉండేవి.

తెలంగాణలో ఉన్న ఎన్నో సంస్థలతో వీరికి క్రియాశీల అనుబంధం ఉండేది. 1930లో మెదక్ జిల్లా జోగిపేట లో జరిగిన మొదటి ఆంధ్ర మహాసభకు అధ్యక్షుడు.మహబూబ్ నగర్ జిల్లా బోర్డు అధ్యక్షుడిగా పనిచేశారు. విజ్ఞాన వర్ధినీ పరిషత్తు (1941) ఆంధ్ర సారస్వత పరిషత్తు (1943)
అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహించారు. హైదరాబాదులోని శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయం అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. 1952లో మొదటి సార్వత్రిక ఎన్నికల్లో వనపర్తి నియోజకవర్గం నుండి శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. ఆనాడు తెలంగాణలో ఉన్న సాహిత్య సాంస్కృతిక సంస్థలతో వీరికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను అనుబంధం ఉండేది. అందుకే “ఇతడు లేని తెలంగాణ అలంకరణ లేని జాణ”అన్నాడు దాశరధి. ప్రతాపరెడ్డి తెలంగాణ ప్రజల భాష సాంస్కృతిక సామాజిక రాజకీయ సమస్యలను ప్రపంచానికి చాటారు.
“మూర్చ పోయినట్టి తెలుగుజాతి సంస్కృతికి టీకాలు తీసిన మళ్లీనాథుడు సురవరం” అని సినారే గారు అన్నారు.
ఈ విధంగా తెలుగు సాహిత్యానికి ముఖ్యంగా తెలంగాణ ప్రాంత సాహిత్య పునరుజ్జీవనానికి ఆయన చేసిన సేవ,
సామాజికంగా సాగించిన ఉద్యమాలు,
పత్రికారంగా నిర్వహణ,విభిన్న రంగాలలో చేసిన కృషి
తెలంగాణ సమాజాన్ని అన్ని కోణాలలో ప్రభావితం చేసింది.ఆయన ప్రతిభ అనన్య సామాన్యం. ప్రతాపరెడ్డి అంటే విశిష్ట రచనల విజ్ఞాన గని. ఆయన గురించి తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి తెలుగు వాడిపై ఉన్నది.
తెలుగు జాతికి, భాషకు చేసిన వీరి సేవలకు గుర్తింపుగా ట్యాంకు బాండ్ పై వీరి విగ్రహం కూడా ప్రతిష్టించారు. వీరి పేరుతో ‘సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీ’ హైదరాబాదులో ఉంది.

You may also like

4 comments

thm4vip May 26, 2026 - 9:16 pm

Just tried out thm4vip and I’m liking it so far. A solid choice if you’re looking for what it offers. Give it a look here: thm4vip

Reply
kerangwinlogin May 26, 2026 - 9:16 pm

Just tried kerangwinlogin, seems legit! Fast access, no fuss. Anyone else had good luck with kerangwinlogin?

Reply
singha25login May 26, 2026 - 9:16 pm

Singha25login got me hooked. Easy to log in, great selection of games. Definitely worth a try. Get your game on at singha25login!

Reply
Josephine2184 May 27, 2026 - 1:35 pm Reply

Leave a Comment