Manjula Pathipati
Manjula Pathipati
మంజుల పత్తిపాటి (కవయిత్రి). మాజీ డైరెక్టర్, ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ యాదాద్రి భువనగిరి జిల్లా తెలంగాణ రాష్ట్రం చరవాణి 9347042218.
పిడికిలి బిగించి ఎదిగే ప్రతి క్షణం
శ్రమ జెండా ఎగరే ప్రతి వేళ..
హృదయం పలుకుతోంది
కార్మికుడే నిజమైన వీరుడు అని..!
కడుపు నింపే అన్నం వెనుక దాగిన కష్టాలను
ప్రతి ఇంటి నిర్మాణం వెనుక ఉన్న వారి
శ్రమ గాథలను పదాలుగా మలిచే
కలం చెబుతోంది..
కార్మికుడే సూర్యుడు ఈ భూమికి అని..!
వారి చెమట చుక్క పడిన నేలపై
మన జీవితం మొలకెత్తింది అని గుర్తుంచుకో..!
వారి అలసిన చేతులు ఆగిన క్షణంలో
ప్రపంచం నిలిచిపోతుంది అని గుర్తుంచుకో..!
ఖాళీ కుండతో అన్నం వండే మంటల్లో..
కడుపు ఆకలిగా ఉన్న రాత్రుల్లో..
వారి పేగుల చప్పుడు వినిపించిన ప్రతిసారి
హృదయం బద్దలవుతుంది
వారి చెమటతోనే నిలుస్తుంది సమాజం
వారి శక్తితోనే ముందుకు సాగుతుంది ప్రపంచం
కానీ…. ఏమీ ఆశించక
కుటుంబం నవ్వులే తనకు పండుగ అని
భావించే నిజమైన శ్రామికురాలు మహిళ..!
పొయ్యి వెలిగించే ప్రతి మంటలో
తన కన్నీళ్లను గుండెల్లో దాచుకుని
తన కలలు గిన్నెల్లో మరిగిపోతున్నా కూడా…
చిరునవ్వు మాత్రం తగ్గని నిజమైన
శ్రామికురాలు మహిళ..!
చెమట చుక్కలతో స్వప్నాలు నిర్మించే శ్రామికులకు
వందనాలు తెలియజేస్తూ అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు
వసంత విభావరిలో విరిసిన వెలుగుల వేళ,
పచ్చని ప్రకృతి పులకించి నవ్విన వేళ,
గడపల గర్భగృహమున మంగళ స్వరమై
తెలుగు తల్లి పండుగగా ఉగాది అవతరించె.
మామిడి తొరణాల పచ్చని తంతువులలో
ఆశల అలలు అలరిస్తూ ఊగుచుండగా,
వేప పుష్పాల చేదు గర్భిత గంధములో
జీవన సత్యాల గూఢార్థం మౌనమై నిలిచె.
కోకిల కూయు కంఠమున కలకల రాగములు
ప్రకృతి మంగళ ధ్వనులై పరిమళించగా,
వసంత సమీర మృదుస్పర్శ సన్నిధిలో
నూతన సంవత్సర స్వప్నాలు సుస్వాగతించె.
మామిడి–వేపల మేళన రసమూర్తిగా
ఉగాది పచ్చడి రూపమై వెలిసిన వేళ,
చేడు–తీపి–పులుపు–కారం–ఉప్పుల రుచులలో
జీవిత చక్రం సత్యమై ప్రతిధ్వనించె.
సంస్కృతి సుమములు వికసించు వేళ,
సంప్రదాయ దీపములు ప్రకాశించు వేళ,
ప్రకృతి–మనుజ బంధమది పావనమై
భూమి ఒడిలో నిత్యమై నిలిచియుండె.
అందుకే ప్రతి ఉగాది ప్రబోధమై,
పచ్చని మామిడి పుటల పలుకులలో,
వేప పుష్ప సుగంధ విరిసిన వేళ,
కోకిల గానామృత తరంగములలో,
ప్రకృతి సాక్షిగా మన జీవన గాథకు
కొత్త ఆది – కొత్త ఆశ – కొత్త మార్గమై నిలిచె.
గుంట నక్కలు ముసుగేసుకుని మన
చుట్టు తిరుగుతు మాయ మాటలు
చెప్పి నిన్ను మాయం చేస్తారు జాగ్రత్త
మహిళా..!
మహిళ చిరునవ్వుల చాటున
కన్నీటిచుక్కలు ఎవరికి తెలుసు…!
బడికి వెళ్లే ఆడ పిల్లపై నీ వెయ్యి
కన్నులు వేసి ఉంచు మహిళా..!
రెప్పపాటు ఆదమరచినావో
డేగ లాగా తన్నుకొని పోతారు జాగ్రత్త
మహిళా..!
మహిళ చిరునవ్వుల చాటున
కన్నీటిచుక్కలు ఎవరికి తెలుసు…!
పొలం పనుల కోసం పొయ్యేటప్పుడు
బుడ్డదాన్ని వెంట తీసుకునిపో…
మరచి పోయినావో కామాంధుల
కాటుకు బలై పోతుంది జాగ్రత్త
మహిళా..!
మహిళ చిరునవ్వుల చాటున
కన్నీటిచుక్కలు ఎవరికి తెలుసు…!
కూలి నాలికి పొయ్యేటప్పుడు చీడ
పురుగుల బారిన పడకుండా
నిండు వస్త్రధారణతో వెళ్లు…
మరచి పోయినావో చుట్టు ముట్టి
చిత్రవధ చేస్తారు జాగ్రత్త మహిళా..!
మహిళ చిరునవ్వుల చాటున
కన్నీటి చుక్కలు ఎవరికి తెలుసు…!
అంతా నావాళ్ళే అని గుడ్డిగా నమ్మకు
మహిళా..!
నీ వెనక గోతులు తీసేది నీ వాళ్ళే అని
తెలుసుకో మహిళా..!
మహిళ చిరునవ్వుల చాటున
కన్నీటి చుక్కలు ఎవరికి తెలుసు…!
సమాజంలో ఉన్న కొంత మంది
గురించి మాత్రమే వారు మంచిగా
మారుతారు అని ఆశిస్తు…
తరలిపో తరలిపో.. చీకటి నుంచి
వెలుగుకు తరలిపో.. కుందేలువి కావు..
పులిలా మారిపో.. వెంటాడే ఒడిదుడుకుల
మృగాలతో యుద్ధానికి తరలిపో…’’
ఓ మహిళా మీకివే మా వందనాలు.
కంటిపాపలా కాపాడే ‘స్త్రీమూర్తి’కి వందనాలు
