మట్టిలోని సారమో సాగునీటి సదుపాయమో
పెరటి మొక్క లిప్తపాటులో కొమ్మలు రెమ్మలతో పచ్చని పందిరై కనువిందు చేసింది
రెప్పపాటులోనే రెమ్మరెమ్మకో పంచవన్నెల రామచిలుక పువ్వై విరిసింది
ఆకు – పసరై బెరడు – కషాయమై వేరు – చూర్ణమైన ఆమూలాగ్ర ఆరోగ్యప్రదాయిని
మానవాళికి ప్రాణవాయువు నందించే ఊపిరియంత్రం
సాధుజంతుల పాలిటి కల్పవల్లి
నీకు నీడనిచ్చి నిన్ను సేదతీర్చే అమ్మ ఒడి
నీ గుండెకు బలమై నీ శ్వాసకు ఆయువుపట్టైన అపర ధన్వంతరి
ఏ పాడు గాలి సోకిందో
ఏ చీడపీడ తగిలిందో
అడవికి పచ్చని పరదాలు వేసి
నేలకు తివాచీలు పరిచి ఆహ్లాద పరిచిన పత్రహరితం
ఎందుకో వడలిపోతోంది
నేల కొరిగిన వృక్షమాత
అనావృష్టికి సూచిక
రేపటి క్షామానికి హెచ్చరిక
వృక్షో రక్షతి రక్షితః
Padmasri Chennojwala
జానపదులు గ్రామ దేవతకు సమర్పించుకునే నైవేద్యం
పసుపు పూసిన కొత్త కుండలకు
కుంకుమ ముగ్గుపిండి వేపమండలు వెలిగే దివ్వెల శోభల నడుమ అన్న పానీయాలతో అమ్మవారికి సమర్పించే భోజనమే బోనం
సంప్రదాయ వస్త్రధారణలో
సౌభాగ్య చిహ్నాలు ధరించిన
సర్వమంగళ స్వరూపిణులు
కల్లాపి జల్లిన వాకిళ్లు కొలువుదీరిన రంగవల్లులు
పసుపు రాసిన గడపలు వేప కొమ్మలతో అలంకరించబడిన వీధులు జానపద శైలిలో హోరెత్తించే అమ్మవారి కీర్తనలు
ఒంటిపై పసుపు నుదుట కుంకుమ
కాలి గజ్జెలు ఎర్ర వస్త్రం ధరించిన స్ఫురద్రూపి బలశాలి అమ్మవారి సోదరుడే పోతరాజు
కార్యక్రమ ఆరంభకుడు
భక్త సమూహ రక్షకుడు
రౌద్రాంశ ప్రతీకైన కాళీమాతను
శాంతింపజేసే తంత్రమే సాక
కర్ర కాగితంతో కూర్చిన తొట్టెలు ప్రత్యేక ఆకర్షణ
గుగ్గిలం మైసాచి డబ్బు చప్పుళ్ళు పోతరాజు విన్యాసాల నడుమ దుష్టశక్తులను దునుమాడే తతంగమే అమ్మవారి ఊరేగింపు
రంగం గావు ఫలహారపు బళ్ళు
పల్లె పాటలు ప్రాంతీయ నృత్యాల నడుమ ఆషాడంలో అంగరంగ వైభవంగా జరిగే రాష్ట్ర పండుగ
పద్మశ్రీ చెన్నోజ్వ
కొడిగట్టే దీపాన్ని వెలిగించే ధన్వంతరీ ప్రతినిధి
సృష్టికి ప్రతిసృష్టి చేసే అపరబ్రహ్మ
దేహమనే ప్రమిదలో జ్వాలై వెలిగే జీవాత్మకు చమురునందించే శక్తి ప్రదాత
నిస్తేజమయ్యే శక్తి కేంద్రాలను ఉత్తేజపరిచే చైతన్యమూర్తి
తిమిరంతో సమరం చేసే మేని యంత్రాన ఆయువు నింపే ప్రాణదాత
పట్టుతప్పే అంగాలకు ప్రాణవాయువు నందించే జ్ఞానదీపం
ఆరోగ్య పరిరక్షణకే అంకితమైన కారుణ్యమూర్తి
పవిత్ర వృత్తికి తోడైన మహోన్నత ప్రవృత్తితో రోగిని యోగిగా మలిచే విశ్వబ్రహ్మ
వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ప్రపంచంలో అతి కొద్ది దేశాలకు మాత్రమే పరిమితమై , గ్రామీణ జీవనోపాధికి ఆయువు పట్టైన రెండవ అతిపెద్ద పరిశ్రమగా , ప్రత్యక్షంగా , పరోక్షంగా 70 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్న రంగం . ప్రపంచ చేనేత వస్త్రాలలో 90% పైగా భారతదేశంలోనే నే యబడతాయి. ప్రతి సంవత్సరం ఆగస్టు 7న భారత ‘జాతీయ చేనేత దినోత్సవం’ గా జరుపుకుంటాము. నూలు , కాటన్ , సిల్క్ , పట్టు వంటి పలు రకాలుగా ఈ వస్త్రాలు అందుబాటులో ఉంటాయి. పద్మశాలి , పట్టుశాలి, తొగట , దేవాంగ వంటి వారి కులవృత్తి. మగ్గంపై వస్త్రాలను చేతితో నేయడం జీవనోపాధిగా కలిగిన వారిని చేనేతకారులు అంటారు. తెలుగు రాష్ట్రాల జనాభాలో 12 శాతం ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు.
చేనేత వస్త్రం తయారీ విధానం :
మలినాలను తొలగించిన పత్తిని స్థూపాకారంగా చుట్టి రాట్నం సహాయంతో దారాన్ని బయటకు తీసి ఈ దారానికి గంచిని పెట్టి గట్టిదనం వచ్చేలా చేసి ఆ తర్వాత మగ్గంపై వస్త్రాన్ని నేస్తారు. నిలువు వరస దారాలను ‘పడుగు ‘ (వార్పు) అనీ, అడ్డు వరస దారాలను ‘పేక ‘(ఫిల్లింగ్ త్త్రెడ్) అనీ అంటారు.
ఉనికి:
భారతదేశంలో అతి ప్రాచీన కుటీర పరిశ్రమ ఆయన ఈ చేనేత వృత్తి కారణంగా దేశానికి పేరు ప్రఖ్యాతలు , ఆర్థిక బలాన్ని చేకూర్చింది . దేశంలో రెండో అతిపెద్ద ఆర్థిక వనరైన చేనేత 100 ఏళ్ల క్రితం నుంచి విదేశీ మరకద్రవ్యాన్ని ఆర్జించిన ఘనత కలిగినది. శాతవాహనుల కాలంలో మన వస్త్రాలు యూరప్ దేశానికి ఎగుమతి చేయబడ్డాయి

ఆరడుగుల చీరను అగ్గిపెట్టెలో దూర్చి ప్రపంచాన్ని అబ్బురపరచిన ఘనత మన చేనేత రంగానిది. మహాత్మా గాంధీ రాట్నంపై నూలు వడికి దేశ ప్రజలకు స్వదేశీ వస్త్రాలని ధరించాలని ఇచ్చిన పిలుపు ఉద్యమానికి ఊతమిచ్చింది. 1905 ఆగస్టు 7న కలకత్తా టౌన్ హాల్లో నిర్వహించిన భారీ సమావేశంలో నేతలంతా విదేశీ వస్త్రాలను బహిష్కరించి స్వదేశీ వస్త్రాలు ధరించి ఉత్పత్తుల పునరుద్ధరణకు పిలుపునిచ్చారు . ‘బానిసత్వం వద్దు ఆత్మగౌరవం ముద్దు’ అని సాగిన స్వాతంత్రోద్యమంలో నూలు వడికే రాట్నం ప్రధాన భూమిక పోషించి, స్వాతంత్ర్య సముపార్జనకు ఒక సాధనంగా మారింది. ఆ విధంగా స్వాతంత్ర ఉద్యమానికి , చేనేత రంగానికి విడదీయరాని అనుబంధం ఉంది.
అంతర్జాతీయ మార్కెట్ అభిరుచులకనుగుణంగా మన చేనేతకారులు తమ కళను, నైపుణ్యాన్ని మెరుగుపరచుకుంటున్నారు. అంతర్జాతీయ ఖ్యాతి గడించిన తెలంగాణ రాష్ట్రంలోని పోచంపల్లి వస్త్రాలు అమెరికా , స్విట్జర్లాండ్ , సింగపూర్ వంటి పలు దేశాలకు ఎగుమతి అవుతున్నాయి . సిరిపురం, వెల్లంకిలలో తయారవుతున్న కాటన్ దుప్పట్లు, డ్రెస్ మెటీరియల్స్ కు అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉంది . రాజాపేట మండలంలోని రఘునాధపురం లో తయారవుతున్న లుంగీలు ముంబై , సూరత్ ల ద్వారా గల్ఫ్ దేశాలకు ఎగుమతి అవుతున్నాయి .భూదాన్ పోచంపల్లి తో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని చౌటుప్పల్, కొయ్యలగూడెం , సంస్థాన్ నారాయణపురం , పుట్టపాక , సిరిపురం , వెల్లంకి ,ఆలేరు ,గుండాల ,నాగారం వంటి వందలాది గ్రామాల్లో వేల సంఖ్యలో చేనేత కుటుంబాలు చేనేత వృత్తిని ఆధారంగా చేసుకొని జీవిస్తున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా భారతీయ చేనేత వస్త్రాలకు ప్రత్యేకించి మన తెలంగాణ పోచంపల్లి చేనేత వస్త్రాలకు విశిష్ట స్థానం ఉండడం భారతీయులుగా మనం గర్వించదగ్గ విషయం. ఇక ఇందులోని లోతుపాతులను తరచి చూస్తే….
సిద్దిపేట గొల్లభామ చీరలు:
ఏ బుర్రలో ఏ ఆలోచన పురుడు పోసుకుంటుందో అది ఏ సరికొత్త ఆవిష్కరణకు దారితీస్తుందో చెప్పలేం . తల మీద పాలకుండ , చేతిలో పెరుగు గురిగి పట్టుకొని , కొప్పున పూలదండను ముడిచి , చేతి గాజులు గలగలలు, కాలి గజ్జల ఘల్లు ఘల్లుల సందడింపులతో తన ఇంటి ముందు నుంచి నడిచి వెళుతున్న గొల్లకాంత నీడను చూసిన నేతన్న మదిలో మెరిసిన ఆలోచన ఏడు పదుల ప్రస్థానాన్ని కొనసాగించి , 2012లో ‘జాగ్రఫీకల్ ఇండికేషన్ ట్యాగ్ ‘ ను సొంతం చేసుకుని ‘జీ 20 శిఖరాగ్ర సదస్సు’ లో స్థానం సంపాదించి యావత్ప్రపంచ దృష్టిని ఆకర్షించిన కళాత్మక వస్త్ర సోయగం సిద్దిపేట గొల్లభామ చీరల అద్భుత ఆవిష్కరణ.
సిద్దిపేటకు చెందిన వీరబత్తిని సోమయ్య, రచ్చ రాం నరసయ్య అనే ఇద్దరు నేత కార్మికులు చాలా శ్రమించి ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు .
చీర అంచులు , పైట చెంగుల్లో వయ్యారంగా హోయలొ లికించే రంగురంగుల గుల్లభామలు సిద్ధిపేట నేతన్నల కళా నైపుణ్యాన్ని ‘ఔరా !’ అనిపించి ఎల్లలు దాటించాయి.
దరీస్:
యావత్ భారత దేశంలో తమకు మాత్రమే స సొంతమైన ‘ దరీస్ ‘ను నేసి 2017లో జాగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ పొంది , లండన్ మ్యూజియంలో ప్రదర్శనా ర్హతను సాధించి , రంగురంగుల తివాచీలను పరిచి ప్రపంచ చేనేత ప్రియులను స్వాగతించిన వరంగల్ జిల్లా కొత్తవాడ నేతన్నల కళాత్మక నైపుణ్యానికి దేశం గర్వపడింది.
హిమ్రూ:
తొలిసారిగా జీన్స్ క్లాత్ తయారు చేయడమే కాకుండా ఒకనాటి రాజ కుటుంబాల స్త్రీలు ధరించే హిమ్రు పట్టు చీరలను మగ్గంపైనే వేసి యునెస్కో విశిష్ట సాంప్రదాయ వస్త్రాలలో చోటు దక్కించుకున్న వరంగల్ జిల్లా కమలాపూర్ నీ తన్నుల కళా నైపుణ్యానికి ప్రపంచం అచ్చె రువొందింది.
దసలి:
పట్టుపురుగుల నుంచి దారం తీసి వస్త్రాన్ని నేయడమే కాకుండా అటవీ ప్రాంతాలలో లభించే సహజ సిద్ధమైన వివిధ రంగులతో వాటిని ఆకర్షణీయంగా రూపుదిద్ది మహాదేవపూర్ నేతన్నలు దసలీ పట్టు నేతలోని మెళకువలతో ప్రపంచ చేనేత పటంపై తమ సత్తా చాటుకున్నారు.
రాజన్న సిరిసిల్ల చీరలు:
సిరిసిల్లకు చెందిన నేత కార్మికుడు నల్ల విజయ్ 27 సుగంధ ద్రవ్యాలతో పరిమళించే పట్టుచీరను తయారుచేసి సరికొత్త రికార్డు సృష్టించడమే కాక వెండి కొంగుతో అరటి , తామర నారుతో పట్టుచీరలు తయారుచేసి అందరిని అబ్బురపరిచి ప్రభుత్వ అవార్డు సైతం అందుకున్నారు.
వందల ఏళ్ల క్రితమే అగ్గిపెట్టలో దూరే చీరలను నేసి ప్రపంచాన్ని అబ్బురపరిచిన ఘన చరిత్ర మన చేనేత రంగానిది.
బతుకమ్మ చీరలు, అగ్గిపెట్టెలో ఇమిడే చీరలు , దబ్బనంలో దూరే చీరలు , భద్రాద్రి సీతారాముల కళ్యాణ మహోత్సవానికి పట్టుపీతాంబరాలు, ప్రధాని మోడీకి ప్రత్యేక శాలువ, సచిన్ పుట్టినరోజు సందర్భంగా ఆయన చిత్రంతో వస్త్రం , తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేసీఆర్ గారి చిత్రంతో వస్త్రం నేసి, దానిపై జాతీయ గీతాన్ని కూర్చడం వంటి పలు అద్భుతాలను ఆవిష్కరించిన రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన చేనేత కళాకారుడు హరిప్రసాద్ మొట్టమొదటిసారిగా ఎలక్ట్రానిక్ మగ్గం కూడా తానే స్వయంగా తయారు చేసుకొని దానిపై బంగారంతో పట్టుచీరలు నేసి సొంత బ్రాండ్ ఇమేజ్ ని సంపాదించుకున్నాడు. ఈతని కళానైపుణ్యానికి ముచ్చటపడిన సునీతా విజయ్ అనే ఎన్నారై ఇతడు తయారు చేసిన వస్త్రాలకు ‘సిరి పట్టు ‘అని నామకరణం చేసి , చాలా ప్రోత్సహించి అన్ని రకాలుగా సహాయసహకారాలందించడం ముదావహం.
రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన నల్ల విజయ్ అనే మరో చేనేతకారుడు అరటి , తామర నారతో పట్టుచీరలు తయారు చేయడమే కాకుండా 27 సుగంధ ద్రవ్యాలతో పరిమళించే పట్టు చీరను తయారుచేసి సరికొత్త రికార్డు సృష్టించాడు. ఈ బృహత్కార్యానికి రాజకీయ , చలనచిత్ర రంగ ప్రముఖులు , ఎన్నారైలు శాయశక్తుల తోడ్పడటం అభినందించదగిన విషయం.
రంగుల సోయగాలను కొంగున ముడేసి, మన ఖ్యాతిని ప్రపంచానికి చాటిన నేతన్న నేడు సరైన ఆదరణ లేక , శ్రమకు తగిన ఫలితం దక్కక శూన్యంలోకి దృక్కులు సారిస్తున్నాడు.
మనదైన ఈ కళను బ్రతికించుకోవడం మనందరి బాధ్యత అని నేననుకుంటాను. ప్రభుత్వాలు ఎంతగా ప్రోత్సాహాన్ని అందించినప్పటికీ మార్పు అనేది మూలం నుంచి వచ్చినప్పుడే సమస్య పరిష్కారం అవుతుందని నా భావన.
అతి సామాన్యులమైన మనవల్ల ఏమవుతుందని అనుకోకుండా ‘బిందువు బిందువు కలిస్తే సింధువు’ అవుతుందని , అందుకు మన వంతు సహకారం అందించాలని, శుభకార్యాలు , ప్రత్యేక సందర్భాలలో స్త్రీలు ఈ వస్త్రాలను కొనుగోలు చేయడం తమ విధిగా భావిస్తే , చేనేత కుటుంబాల్లోని యువకులు ఎన్ని కార్పోరేట్ చదువులు చదివినప్పటికీ వారసత్వ సంపద అయిన ఈ నేత పనిని న్యూనతగా భావించకుండా దాన్ని వారి వారసత్వ హక్కుగా గర్వంగా స్వీకరించగలిగితే మన అద్భుతమైన ఈ కళా నైపుణ్యం కనుమరుగవకుండా కొత్తపుంతలు తొక్కుగలదని అనుకుంటాను.
సంపన్న వర్గాల్లోని ఉన్నతమైన విలువలు కలిగిన స్త్రీలు చాలామంది వస్త్రాలు కొనుగోలు చేసి పేదవారికి వితరణ గావించడం మనం చాలా సార్లు చూస్తూనే ఉంటాం. ఆ సహృదయతకు ఇంకో అడుగును కూడా జోడించి ఈ వస్త్రాలను కొనుగోలు చేసి వితరణ గావిస్తే దానంతో పాటు కళను కూడా బ్రతికించుకున్న వాళ్ళం అవుతాం.
‘సొంత లాభం కొంత మానుక పొరుగు వారికి తోడుపడవోయ్ ‘ అన్న గురజాడ అప్పారావు గారి హితాన్ని అనుసరించి మనం కొనుగోలు చేసే వస్త్రాలలో ఇప్పటినుండి చేనేత వస్త్రాలను కూడా జోడించి మనదైన ఈ అద్భుత కళను బ్రతికించి ముందు తరాలకు ఘనమైన కానుకగా అందిద్దాం.
విధి చేసిన మది గాయం అగాధపు అంచులు తాకింది
పగిలిన అద్దంలో ప్రతిబింబం వికృతంగా వెక్కిరిస్తోంది
కమ్ముకున్న నైరాశ్యపు మేఘాలు నీలాల నింగిని కరిమబ్బును చేశాయి
శృతి తప్పిన కళ్యాణ వీణ ప్రణయరాగం విరిసే వేళ విషాద గీతం పలికిస్తోంది
సగాలు రెండు సమాంతర రేఖలై గమనం సాగిస్తున్నాయి
మృగాల వేటలో సగాల ఘోష మిన్నంటుతోంది
పుట్టలోని కాలనాగులు పడగవిప్పి బుసలు కొడుతున్నాయి
సోలో పయనంలో ముసుగుచాటు వికృతం అంతకంతకూ విజృంభిస్తోంది
ముడివడిన బంధం ద్విదళ బీజమై చీలుతోంది
అంకురచ్ఛదాలు అడకత్తెరలో పోకచెక్కలవుతున్నాయి
ప్రేమ కోసం పిందెలు చెకోరాలై పరితపిస్తున్నాయి
తెగిన దారాలను సవరించుకుంటూ
విరిగిన మనసులను అతికించుకుంటూ
సమాంతర రేఖలు దిశ మార్చుకుని సరళ రేఖలైతే
ఖండన బిందువు అనురాగ సంగమమౌతుంది
బాల్యానికి భద్రతావలయమౌ తుంది
శూన్యం నిండిన ఎదలోయల్లో సుస్వర వీణ మోహనరాగం పలికిస్తుంది
శిశిరం పలాయనం పఠించి మది వసంతమై విరబూస్తుంది
(మే నెల రెండవ ఆదివారం ‘మదర్స్ డే ‘ ని పురస్కరించుకుని)
తాతినేని రామారావు
దర్శకత్వం వహించి, జి . బాబు నిర్మాతలుగా వ్యవహరించి ,1981 లో విడుదలైన ఇల్లాలు చిత్రం లోని పాట ఇది . ఆత్రేయ రచించి , జేసుదాస్ , శైలజ గార్లు గానం చేశారు .ముఖ్య తారాగణం శోభన్ బాబు జయసుధ శ్రీదేవి.
సద్గుణ సంపన్నుడైన భర్త ,ముద్దులొలికే బిడ్డ ,జీవితం సాఫీగా సాగడానికి అవసరమైనంత డబ్బు ఉన్నప్పటికీ ,ఆమె మనసు ఎండమావుల వెంట పరుగులు తీస్తుంది . ఫలితంగా ముగ్గురి జీవితాలు చిన్నాభిన్నం అవుతాయి.
పల్లవి:
ఓ బాటసారి ఇది జీవిత రహదారి
ఎంత దూరమో ఏది అంతమో
ఎవరూ ఎరుగని దారి ఇది ఒకరికి సొంతం కాదు ఇది
ఆది అంతం తెలియని ఈ రహదారి పయనంలో ఎవ్వరికీ ఏది సొంతం కాదు . దీని లోతులు కనుగొనడం ఎవరివల్లా కాదు అని ఒకింత వైరాగ్యాన్ని వ్యక్తపరుస్తుంది (పల్లవి)
చరణం 1.
ఎవరు ఎవరికి తోడవుతారో ఎప్పుడెందుకు విడిపోతారో మమతను కాదని వెళతారో మనసే చాలని ఉంటారో ఎవ్వరి పయనం ఎందాకో అడగదు ఎవ్వరినీ బదులే దొరకదనీ
కలిసి ఉండటానికైనా , విడిపోవటానికైనా ఒక్క కారణం చాలు. ఆ కారణం వారి వారి ఆలోచనా విధానంపై , వారి వారి మనస్తత్వాలపై ఆధారపడి ఉంటుంది. ప్రేమాభిమానాల విలువ తెలియక ఒకరు వదులుకుంటే , ప్రపంచంలో అన్నిటికన్నా విలువైన సంపద ఏదైనా ఉందంటే అది ఒక్క ప్రేమే అని ఇంకొక స్త్రీ అతని జీవితంలోకి అడుగెట్టి శూన్యమైన అతని జీవితాన్ని సుసంపన్నం చేస్తుంది. ఏ నిర్ణయానికైనా కారణం ఏమిటని ఈ రహదారి ప్రయాణం అడగక పోవడానికి కారణం ఆలోచించే కోణాన్ని బట్టి నిర్ణయాలు ఉంటాయి. దీనికి ప్రయాణమే తప్ప కారణాలతో సంబంధం ఉండదు అని అభిప్రాయపడుతున్నారు.
చరణం 2:
కడుపు తీపికి రుజువేముంది అంతకుమించిన నిజమేముం
ది
కాయే చెట్టుకు బరువైతే చెట్టును భూమి మోస్తుందా ఇప్పుడు తప్పును తెలుసుకుని జరిగేదేమిటనీ క్షమించదెవ్వ రినీ
శుష్కమైన ఆనందాల వేటలో పడి మాతృత్వాన్ని కాలదన్నకున్న నిన్ను భూమాత క్షమిస్తుందా ? చేతులు కాలేక ఆకులు పట్టుకొని ఏం ప్రయోజనం అని ప్రశ్నిస్తున్నారు.
మనిషి పూర్తి సుఖంగా బ్రతకలేక పోవడానికి కారణం తనకున్న దానిపై నిర్లక్ష్యం , లేని దానికోసం ఆరాటం అంటారు ప్రఖ్యాత తత్వవేత్త రియో
కథానాయిక తనకున్న పచ్చని పైరు లాంటి జీవితం విలువ తెలియక జీవితాన్ని చేజేతులా పాడు చేసుకుంటుంది.
పేగు బంధాన్ని బరువు అని తలచిన నిన్ను భూమాత ఎలా మోస్తుంది అనీ,జరగకూడని నష్టమంతా జరిగిపోయాక తప్పును తెలుసుకోవడం వల్ల ఫలితం శూన్యం అని వివరిస్తున్నారు.
చరణం 3:
తెంచుకుంటివి అనుబంధాన్ని పెంచుకున్నదొక హృదయం దాన్ని
అమ్మలిద్దరూ ఉంటారని అనుకోలేని పసివాణ్ణి బలవంతంగా తెచ్చుకుని తల్లివి కాగలవా తనయుడు కాగలడా
నవ మాసాల ఫలాన్ని నువ్వు కర్కశంగా , నిర్దాక్షిణ్యంగా వదులుకొని వెళితే ఆ అనుభూతి పరిమళాలేవీ ఆస్వాదించకపోయినా, కేవలం హృదయౌన్నత్యంతో ఆ పసిబిడ్డను గుండెకు హత్తుకున్న స్త్రీ ఎంతటి ప్రేమ మూర్తో , ఎంతటి అనురాగమూర్తో ఒకే ఒక పదంతో చెబుతున్నారు.
ప్రేమించే మనసు నీటి చెలిమి వంటిది . ఎన్ని నీళ్లు తోడుకున్నా ఇంకా ఇంకా ఊరుతూనే ఉంటాయి. నువ్వు ప్రేమను పంచినప్పుడే అవతలి వైపు నుండి పొందగలవు . అమ్మతనం గుండె లోతుల్లోంచి ఉప్పొంగాలే తప్ప బలవంతంగా తీసుకోవాలనుకుంటే దానివల్ల ప్రయోజనం శూన్యం అని చెబుతున్నారు.
చరణం 4 :
అడ్డదారిలో వచ్చావమ్మా అనుకోకుండా కలిశావమ్మా నెత్తురు పంచి ఇచ్చావు నిప్పును నువ్వే మింగావు ఆడదాని ఐశ్వర్యంమేమిటో ఇప్పుడు తెలిసిందీ కథ ముగిసే పోయింది.
జీవితం విలువ తెలియని నాడు , స్త్రీ యొక్క ఆనందం ఎందులో ఉంటుందనే విషయం అర్థం కాని రోజుల్లో, వదులుకున్న ఆనందాలని తిరిగి సొంతం చేసుకోవాలని ప్రయత్నం చేసే నాటికే సమయం మించిపోయింది అని చెబుతున్నారు.
కథ మొత్తం ఈ ఒక్క పాటలోనే ఆవిష్కరింపబడిందా అన్నంతగా పదం పదం లో ఒదిగిన ఆర్ద్రత , నటీనటుల హావభావ వ్యక్తీకరణ ,శ్రోతలను అలరించగలిగిన అనేకంటే కదిలించగలిగిన గాయనీ గాయకుల ప్రతిభ, కాచి వడబోసిన జీవిత సత్యాలు , కుటుంబ విలువల గూర్చిన వివరణ , వాటిని భద్రంగా కాపాడుకోవాల్సిన అవసరం గూర్చి ఒక చక్కని సందేశాన్ని అందించారు. కథను ఆవిష్కరించడానికి రహదారిని వస్తువుగా ఎంచుకోవడం బస్సు ప్రయాణంలోసాగే నేపథ్యగానం అత్యంత వైవిద్యభరితంగా ఉంది.
చక్కని పాటను మనకందించిన అందరికీ అభినందనలు.
పద్మశ్రీ చెన్నోజ్వల
అన్నమయ్య క్రీస్తుశకం 1408 వ సంవత్సరము మే తొమ్మిదవ తేదీన ,కడప జిల్లాలోని రాజంపేట మండలం, తాళ్లపాక గ్రామంలో, వైశాఖ పౌర్ణమి దినమున నారాయణ సూరి లక్కమాంబ అను దంపతులకు జన్మించిరి. వీరు నందవరీక వంశానికి ,భరద్వాజస గోత్రానికి చెందినవారు . నారాయణ సూరి లక్కమాంబ దంపతులకు చాలా కాలం వరకు సంతానం లేక బాధపడుతూ ఒకసారి తిరుమలకు వెళ్లి స్వామిని దర్శించుకుని , ధ్వజస్తంభం వద్ద ప్రణామాలు సమర్పించుకుంటూ ఉండగా ఒక దివ్యమైన కాంతి లక్కమాంబ గర్భంలో ప్రవేశించిందని , శ్రీనివాసుడు తాను ధరించే బిరుదు గజ్జియల ముప్పిడి కటారాన్ని వారికి అందజేశాడని, అలా పుట్టిన శిశువే అన్నమయ్య అని చాలామంది నమ్మకం . సాక్షాత్తు శ్రీమహావిష్ణువు ఖడ్గమైన నందకం అంశతో జన్మించాడని శ్రీ వైష్ణవ సంప్రదాయంలో కూడా ఇదే నమ్మకం.
“ఇందరికి నభయంబు లిచ్చు చేయి ” అంటూ వేదములను అందించడానన్ని గురించి తెలియజేసినా, “వలనైన కొనగోళ్ళ వాడి చేయి ” అంటూ కొనగోట హిరణ్యకాశిపుని చీల్చిన విధానాన్ని , అటు స్వామి అభయహస్తాన్ని ఇటు దుష్ట సంహారాన్ని చేయగలిగిన చేతి వైభవాన్ని వర్ణించినా, “అరసి నన్ను గాచిన ఆతనికి శరణు ” అంటూ బ్రహ్మాండాలన్నిటా చైతన్య స్వరూపమై నిండిన స్వామిని శరణు వేడినా , “అమ్మమ్మ ఏమమ్మా అలమేలుమంగా నాంచారమ్మ తమ్మి ఇంట నలరు కొమ్మా ” అంటూ అలివేలు మంగమ్మను అలుక వీడి స్వామిని మురిపించమని వేడుకున్నా , “ఈడగు పెండ్లి ఇద్దరి జేసేము చెడేలాల ఇది చెప్పరుగా” అంటూ అమ్మవారి సౌందర్యానికి మోహితుడై శ్రీనివాసుడు ఆమెను పరిణయమాడిన వైనాన్ని వర్ణించినా అది అన్నమయ్యకే చెల్లింది.
అన్నమయ్య తల్లికి సంగీతంలో మంచి నైపుణ్యం ఉంది .తండ్రి గొప్ప పండితుడు . ఎనిమిదవ ఏట ఘనవిష్ణువు వద్ద వైష్ణవ దీక్ష స్వీకరించిన అనంతరం వీరి విద్యాభ్యాసం తల్లిదండ్రుల పర్యవేక్షణలోని జరిగిందని తెలిస్తోంది. అన్నమయ్యకు 16వ ఏట శ్రీవేంకటేశ్వరుని దర్శనభాగ్యం కలుగడంతో అప్పటినుండి అద్భుతమైన కీర్తనలు రచించడం ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. ఏక సంతాగ్రాహి అవడంవల్ల చాలా చిన్న వయసులోనే సంగీత సాహిత్యాలపై అపార పాండిత్యాన్ని గడించారు . అన్నమయ్య మనవడైన తాళ్లపాక చిన్నన్న రచించిన ‘అన్నమాచార్య చరితము ‘ అనే ద్విపద కావ్యంలో అన్నమయ్య జీవిత చరిత్రను వ్రాశాడు. 1948 లో లభ్యమైన ఈ గ్రంథమే అన్నమయ్య జీవితం గురించిన వివరాలు ప్రజలకు తెలియడానికి ఆధారం అయింది .

ఒకనాడు పశువుల మేతకై గడ్డి కోసేటప్పుడు చిటికెన వేలుకు గాయమవుతుంది. అప్పటినుండి అన్నిటిపై విరక్తి చెంది స్వామి సేవే పరమావధిగా శ్రీ వేంకటేశ్వరుని దర్శనార్థియై తిరుమలకు బయలుదేరి యాత్రలో భాగంగా పలు దైవాలను దర్శిస్తూ , మోకాళ్ల పర్వతానికిచేరి అలసటతో ఒక వెదురు పొదలో నిద్రించగా అలివేలు మంగమ్మ కలలో దర్శనమిచ్చి పరమాన్నాన్ని ప్రసాదంగా పెట్టి, పాదరక్షలు లేకుండా పర్వతాన్ని ఎక్కితే అలసట తెలియదని చెప్పడంతో మెలకువ వచ్చి పరమానందంతో కలలో కనిపించినది సాక్షాత్తు అలివేలు మంగమ్మ అని తెలుసుకొని ఆశువుగా ఒక శతకాన్ని చెప్పిరి . తరువాత సునాయాసంగా కొండనెక్కి తిరుమల గిరులపై ఉన్న అన్ని దేవాలయాలు,పుష్కరిణి, ఆకాశగంగ, కుమారధార, పాపవినాశం, విరజానది , యా గశాల, ఆనంద నిలయం ,కళ్యాణ మండపం , బంగారు గరుడ శేషవాహనం, శ్రీభండారం, బంగారు హుండీని దర్శించి తన పంచె చెంగున ముడి వేసుకున్న బంగారు కాసును సమర్పించాడు. వంట ఇంటిలో వకుళాదేవికి నమస్కరించి , బంగారు వాకిలి చెంతకు చేరి దివ్యపాదాలతో, కటి వరద హస్తాలతో సకలాభరణ భూషితుడైన దివ్యమంగళమూర్తిని దర్శించి ,తీర్థప్రసాదాలు స్వీకరించి , స్వామి ఆశీర్వచనం పొంది ఆ రాత్రి ఒక మండపంలో నిద్రించాడు. ఆదివరాహ స్వామిని దర్శించి , పుష్కరిణిపై ,గరుడకదంబంపై ,విశ్వక్సేనునిపై పలు సంకీర్తనలను ఆశువుగా చెప్పిరి.
శ్రీవేంకటేశ్వరుని దర్శనానికి వెళ్ళగా గుడి ద్వారము యొక్క తలుపులకు తాళం వేసి ఉండుటవలన చింతిస్తూ భక్తితో శ్రీ వేంకటేశ్వరుని స్తుతించగా వాటంతటావే తాళములు , తలుపులు తెరుచుకొనబడినవి . శంఖ చక్రములతో వైభవముగా వెలుగొందే ఆ స్వామిని చూసిన అన్నమయ్య పరమానందముతో ఒక శతకమును చెప్పెను . అంతలో స్వామి మెడలో ఉన్న ముత్యాల హారము పాదములపై పడిందట. ఘన విష్ణువు అని పేరు గల ముని శ్రీ వేంకటేశ్వరుని ఆజ్ఞానుసారంగా అన్నమయ్యను పిలిచి పంచ ముద్రలు వేసి వైష్ణవ దీక్షను ఇచ్చిరి .అప్పటినుండి అన్నమయ్య అన్నమాచార్యుడు అని పిలవబడి , సర్వ విద్యలను , అనగా వైష్ణవ తత్వాలను తెలుసుకుంటూ , ఆళ్వారుల దివ్య ప్రబంధాలను అధ్యయనం చేస్తూ, వేంకటేశ్వరుని కీర్తిస్తూ తిరుమలలోనే జీవితం గడపసాగారు .
వెంకటాచలానికి సమీపంలో ఉన్న ‘మరలుంకు ‘ అనే అగ్రహారంలో నివసించేవారు. ఆ సమయంలో రాజ్యంలో చెలరేగిన కల్లోలాలతో విరక్తి చెందిన అతను హరి సంకీర్తనలే సర్వస్వంగా జీవితం గడపసాగారు .అతని కీర్తనలలోని ఆశీర్వచనానికి ఆకర్షితులైన జనులు తండోపతండాలుగా వచ్చేవారు .
అన్నమయ్య పదకవితాపితామహుడు , సంకీర్తనాచార్యుడు, పంచమాగమ సార్వభౌముడు, ద్రవిడాగమ సార్వభౌముడు అని బిరుదులు పొందిరి .
శ్రీనివాసుని నాయకునిగా తనను తాను నాయికగా భావించుకొని మధుర భక్తితో కూడిన శృంగార కీర్తనలు రచించిరి.అన్నమయ్య కీర్తనలలో విష్ణుభక్తి మాత్రమే కాకుండా సమాజ సంక్షేమానికి , చైతన్యానికి సంబంధించిన పలు అంశాలు ఉన్నాయి .
అన్నమయ్యకు యుక్త వయసు రాగానే తల్లిదండ్రులు అతనికి తిమ్మక్క అక్కమ్మ అనే ఇరువురు స్త్రీలతో వివాహం జరిపించిరి. వీరికి ఇద్దరు కుమారులు కూడా కలిగారు . ఒకసారి అన్నమయ్య తన భార్యలతో తిరుమల సందర్శించి ఆ సమయంలోనే శ్రీ వేంకటేశ్వరునిపై రోజుకు ఒక్క కీర్తన వినిపించాలని సంకల్పించింరి. అప్పటినుండి పుంఖానుపుంఖాలుగా కీర్తనలు రచించడం మొదలుపెట్టారు . అతని శిష్యులు వీటిని గానం చేస్తూ, తాళపత్రాలలో లిఖించడం ప్రారంభించారు . తర్వాత అన్నమయ్య మనవడైన చిన తిరుమలాచార్యుడు వీటిని రాగిరేకులపై చెక్కించడంతో అవి నేడు తిరుమల భాషకారుల సన్నిధిలో భద్రపరచబడి ఉన్నవి.
సాల్వ నరసింహారాయలు అనే రాజు తనపై కీర్తన రచించమని ఆజ్ఞాపించగా , “నరహరి నుతించిన జిహ్వ పరుల నుతింపగా నొప్పదు “అని నిరాకరించిరి. అందులకు కోపించిన రాజు అన్నమయ్యను చెరసాలలో బంధించమని ఆజ్ఞాపించగా , అన్నమయ్య “సంకెలలిడు వేళ” అను కీర్తనను గానం చేయుటతో వెంటనే ఆ సంకెళ్లు విడిపోయినవట. అప్పుడు రాజు ఆశ్చర్యపడి అన్నమయ్యను శరణు వేడుకొనిరట.
వీరి కీర్తనలలో ఆ కాలము నాటి సాంఘిక , సామాజిక ఆచారములు ,సామెతలు ,అలంకారములు అన్నియు గోచరిస్తాయి. వీరి రచనలు ఆధ్యాత్మిక సంకీర్తనలు ,శృంగార సంకీర్తనలు అని రెండు రకములుగా విభజింపబడినవి.
తెలుగు భాషలో మొట్టమొదటగా రచనలు చేసిన వాగ్గేయకారుడు అన్నమయ్య. కీర్తన అను ప్రక్రియను ప్రారంభించినది కూడా అన్నమాచార్యులే. పల్లవి ,అనుపల్లవి ,చరణములు మొదలగు వానికి రూపకర్త కూడా అన్నమాచార్యులే. వీరి రచనలలో ‘శృంగార మంజరి ‘ , ‘వెంకటాచల మహత్యము’ ,’సంకీర్తన లక్షణము’ , ‘ద్విపద రామాయణము’ 12 శతకములు మొదలైనవి. ఇవి వీరు శ్రీవేంకటేశ్వరుని చరణాలకు అంకితమిచ్చిరి .
వీరు సంస్కృతంలో రచించిన ‘సంకీర్తన లక్షణము ‘ ను వీరి మనవడైన చినతిరు మలాచార్యుడు తెలుగులోనికి అనువదించిరి .
15వ శతాబ్దానికి చెందిన కాలంలోనే వీరిలో పలు అభ్యుదయ భావాలు ఉన్నట్లుగా వీరి రచనల ద్వారా మనము కనుగొనవచ్చు .కులమత భేదాలను తూలనాడడం , అంటరానితనాన్ని నిరసించడం , కులవృత్తులను గౌరవించడం వీరి రచనల్లో ఉన్న వైభవం .
“ఉన్నతి పతిపై నొరగి నిలుచు తన సన్నపు నడిమికి చాంగుభళా “అంటూ అలివేలు మంగమ్మ శ్రీనివాసుల అనురాగాన్ని వర్ణించినా , పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు విభపేరు గుచ్చ సిగ్గుపడి పెండ్లి కూతురు “అంటూ అలివేలు మంగమ్మను పెళ్లికూతురుగా , ఆమెలోని బిడియాని అందంగా వర్ణించినా, “మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే చండాలుడుండేటి సరిభూమి ఒకటే ” అంటూ కులమతాల అడ్డుగోడలని ఛేదించినా, ” ఇట్టి ముద్దులాడి బాలుడేడవాడు వాని పట్టి తెచ్చి పొట్టనిండా పాలు పోయరే ” అంటూ బాలకృష్ణుడిని ముద్దుగా ముద్దుమాటలాడినా అది ఆయన కీర్తనలలోని భక్తి భావపు పలు కోణాలగా మనము గమనించవచ్చు .
సంగీత సాహిత్యాలలో ఈతని కుటుంబ సభ్యులు ఆరితేరినట్లుగా మనము గమనించవచ్చు .ఇతని తల్లి చక్కని సంగీతవేత్త .తండ్రి పండితుడు . భార్య అయిన తిమ్మక్క తొలి తెలుగు కవయిత్రి. ఈమె’ సుభద్రా కళ్యాణం ‘ , ‘మంజరి ‘ అనే ద్విపద కావ్యం రచించింది . తిమ్మక్క కుమారుడైన చిన్నన్న సంగీత సాహిత్యాలలో పండితుడు .
శ్రీ వేంకటేశ్వరున్ని కీర్తనల ద్వారా స్తుతించడంలోనే జీవితానందాన్ని పొందిన అన్నమయ్య క్రీస్తు శకము 1503 వ సంవత్సరము ఫిబ్రవరి 23వ తేదీన దుందుభి నామ సంవత్సరం ఫాల్గుణ బహుళ ద్వాదశి దినమున స్వామిలో ఐక్యం అయ్యారు.
” కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు ” అంటూ ఇరుదేవేరుల నడుమ అలరారే స్వామి రూపాన్ని వర్ణించినా , “కట్టెదుర వైకుంఠము కాణాచైన కొండ తెట్టేలాయె మహిమలే తిరుమల కొండ “అంటూ తిరుమలగిరి శిఖరాల సోయగాలను వర్ణించినా, “సకల లోకేశ్వరులు సరస చేకొ నువాడు అకలంకముగ పుష్పయాగంబు ” అంటూ స్వామి పుష్పయాగ సుగంధా లను (వైభవాన్ని) వర్ణించినా, ఉన్నతి పతిపై నొరగి నిలుచు తన సన్నపు నడిమికి చాంగు బలా” అంటూ అమ్మవారికి స్వామివారిపై ఉన్న అనురాగాన్ని వర్ణించినా ” జో అచ్యుతానంద జోజో ముకుందా ” అంటూ స్వామిని నిద్రపుచ్చినా అది అన్నమయ్య కీర్తనలలోని మాధుర్యంగా మనం గమనించాలి . ఒకవైపు శ్రీనివాసునిపై భక్తి ప్రధాన కీర్తనలు అల్లుతూ , మరోవైపు సమాజంలోని దురాచారాలను నిరసిస్తూ రచించిన వీరి కీర్తనలు అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఆబాల గోపాలాన్ని అలరిస్తూనే ఉంటాయి అనడంలో సందేహం లేదు .
పూరిగుడిసె ముంగిటి పుష్పగుఛ్చం
అద్దాలమేడకు అలంకారమైంది
ఆకాశాన విహరించే అందాల చిలుక
బంగారు పంజరాన బందీ అయింది
కొమ్మ వేదికపైని మధుర గాయని కోయిలమ్మ
గొంతుకు పసుపు తాడేదో బిగుసుకున్నట్టుంది
గడప దాటిన కౌమార్యం గంపెడు బరువును తలకెత్తింది
కొంగుముడిలో కొత్త జీవితం కత్తుల బోనులో కాలు మోపింది
విరిసీవిరియని కుసుమం నిప్పుల కుంపటి పాలయింది
ఏటిలోని చేపపిల్ల ఒడ్డున పడి విలవిల్లాడింది
గాండ్రించే పులుల నడుమ లేడికూన గిలగిల్లాడింది
కాలచక్రం కఠిన వేగంతో గిర్రున తిరిగింది
అంతలోనే తలుపు తట్టిన అమ్మతనం
అదనపు బాధ్యతల్ని అప్పగించింది
అగ్ని కీలలకు అంతరంగం ఆహుతి అయింది
నిరసన జ్వాలలకు ఆత్మగౌరవం మాడి మసయింది
దిక్కుతోచని దీనావస్థ సారస్వత సాగరాన సేద తీరింది అనుభవాలే
పాఠాలు అయినవి పరిస్థితులు పాండిత్యాన్ని అలదినవి
తల్లి ప్రేమ అగ్ర పీఠాన నిలిచింది ఆణిముత్యాలని జాతికి అంకిత మిచ్చింది
‘మానవజాతి మనుగడకే ప్రాణం పోసింది మగువ’ అనే పాట భావం ఎంత గొప్ప గా ఉందో చూద్దాం:-
1969 వ సంవత్సరంలో మహానటి సావిత్రి గారి దర్శకత్వంలో విడుదలైన ‘మాతృదేవత ‘అనే చిత్రంలో ని పాట ఇది.
సి .నారాయణ రెడ్డి గారు రచించి కె.వి.మహదేవన్ గారు స్వరపరిచి, పి. సుశీల , వి. వసంత గార్లు గానం చేసిన పాట. ‘మానవజాతి మనుగడకే ప్రాణం పోసింది మగువ ‘ అనే ఈ సినీ గీతం స్త్రీ ను మనిషి జీవితంలో పరిణామక్రమంలోని భిన్న దశలను ఆవిష్కరింపజేస్తుంది.
‘మానవజాతి మనుగడకే ప్రాణం పోసింది మగువ త్యాగంలో అనురాగంలో తరగని పెన్నిధి మగువ ‘
జాతికి ప్రాణం పోసింది అనకుండా జాతి మనుగడకే ప్రాణం పోసింది అనడంలోనే నిత్యజీవితంలోనూ, జీవన గమనంలోని వివిధ అధ్యాయాల్లోనూ ఆమె పోషిస్తున్న పాత్ర ఎంత శక్తివంతమైందో , తన వారి ఆనందం కోసం అవసరమైతే ఎటువంటి త్యాగానికైనా వెనుకాడని అనురాగమూర్తి అని చెబుతున్నారు .
‘ఒక అన్నకు ముద్దుల చెల్లి ఒక ప్రియునికి వలపుల మల్లి ఒక రామయ్యకే కన్న తల్లి సకలావనికే కల్పవల్లి ‘
చెల్లిగా , ప్రేయసిగా , తల్లిగా జీవితంలోని వివిధ మలుపుల్లో బాధ్యతనెరిగిన ఆమె తీరును చక్కగా ఉటంకిస్తూ , సమయానికి అందరికీ అన్నీ సమకూర్చే ఆమె భువిపై వెలసిన కల్పవృక్షం వంటిదని అంటున్నారు . ఈ చరణంలో జీవితంలోని వివిధ బంధాల పట్ల ఆమె వ్యవహార శైలిని చక్కగా వర్ణించారు . ‘
‘సీతగా ధరణి జాతగా సహనశీలం చాటినది ‘
సహనంలో ఆమె భూమాత పుత్రిక అయిన సీతమ్మ వంటిది అంటున్నారు . అయితే అయి ఉండవచ్చు . సహనం ఉన్నతమైన లక్షణమే . దాన్ని ఎవ్వరూ కాదన లేరు . కానీ ఎదుటి వ్యక్తి దాన్ని అలుసుగా తీసుకుంటే మాత్రం సహనానికి కూడా ఒక హద్దు ఉంటుందనీ , అది ఒక్కసారి హద్దు దాటితే గనుక ఎదురయ్యే పరిస్థితులను తక్కువగా అంచనా వేయకూడదనే విషయాన్ని గమనించాల్సి ఉంటుంది . ఇక్కడ మనం ఇంకాస్త లోతైన విశ్లేషణలోనికి వెళితే ఏ తిరుగుబాటైనా అణచివేత నుండే పుడుతుందనీ, ఏ తిరుగుబాటుకైనా పురిటిగడ్డ అణచివేతేననీ ఎన్నో పురాణాలు , చారిత్రక ఆధారాల ద్వారా ఇది నిరూపితమైందనే విషయాన్ని మనం మరువకూడదు.
‘రాధగా మధుర బాధగా ప్రణయ గాధల మీటినది ‘
యమునా తీరాన కృష్ణుని రాకకై ఎదురుచూసే రాధమ్మ గుండెలోని తీయని వేదనను వ్యక్తపరచడంలో అంటే మధుర భక్తిని , శృంగార రసాన్ని పలికించే స్వాధీనపతిక (జయదేవ కవి తన గీతగోవిందం కావ్యం లో రాధమ్మను స్వాధీన పతికగా అభివర్ణించారు ) కూడా ఈమెలో దాగుంటుందని చెబుతున్నారు .
‘మొల్లగా కవితలల్లగా తేనె జల్లు కురిసినది’
కలం అనే దారంతో అక్షర కుసుమాలను హారంగా అల్లగలిగే కుసుమ కోమలి అనీ, శరత్కాల పున్నమి వెలుగులు ఆ కవనవనంపై తేనెజల్లుగా కురిపించగల ప్రజ్ఞాశాలి అని అంటున్నారు .
‘లక్ష్మిగా ఝాన్సిలక్ష్మిగా సమర రంగాన దూకినది ‘
స్నేహాన్నీ, అనురాగాన్ని పంచితే ఎంత సుతిమెత్తగా మసులుకుంటుందో, పరిస్థితులు వేడెక్కితే అపరదుర్గలా తిరగబడుతుందనీ , ఈమెలో భిన్న పార్శ్వాలు దాగుంటాయనీ, పరిస్థితులను బట్టి, సందర్భాన్ని బట్టి ఎప్పుడు ఏది అవసరమైతే అది ఆమెలోంచి బయటకు వెలువడుతుందనీ, ఎదుటి వ్యక్తి జాగరూకుడై మెలగాలని హెచ్చరిస్తున్నారు. ఈ చరణం లో రచయిత స్త్రీలోని భావోద్వేగాలను గూర్చి , ఆమెలోని మానసిక సంఘర్షణను , ప్రజ్ఞాపాటవాలను అందంగా విశదీకరించారు .
“తరుణి పెదవిపై చిరునగవొలికిన మెరయును ముత్యాలసరులు”
ఆమె పెదవిపై మెరిసిన చిరునవ్వును ముత్యాల సరులతో పోల్చుతున్నారు . ఇక్కడ మనం ఇంకాస్త ముందుకెళ్లి ఉత్ప్రేక్షను అన్వయిస్తే గనుక ఆమె నోటిని నగల పెట్టగా , ఆమె రెండు పెదవులను ఆ పెట్టయొక్క రెండు భాగాలుగా , ఆ పెట్టెను తెరవగానే మెరిసే ముత్యాల హారాలు అంటే ఇక్కడ ముత్యాల దండలాంటి ఆమె పలువరస ఏం తెలుపుతుంది అంటే, ఆమె గుండె లోతుల్లోంచి పెల్లుబికే భావాలు ఆమె ఎంత ఆనందకరమైన జీవితాన్ని గడుపుతోంది ,అవి నవ్వులుగా విరబూయిస్తుంది అనే విషయాన్ని తెలుపుతున్నాయి .ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమె మనసుకు కష్టం కలిగించకూడదని హితాన్ని బోధిస్తున్నారు . “
“కలకంఠి కంట కన్నీరొలికిన తొలగిపోవురా సిరులు “
స్త్రీ హృదయంలో తుఫానులు, సునామీలు సృష్టిస్తే ఆమె కన్నీరు కార్చే చోట సిరి క్షణం కూడా నిలబడదని హెచ్చరిస్తున్నారు. సిరి తొలగిన చోటు ఎంత దుర్భరంగా ఉంటుందో , ఎంత వేదన తాండవిస్తుందో అందరికీ తెలిసిన విషయమే అయినప్పటికీ నిర్లక్ష్యం వహిస్తే ఏం లాభం? ఆమె కన్నీటిని తేలికగా తీసుకోకూడదని , ఆ కళ్ళలోంచి రాలిన ఒక్కొక్క కన్నీటి చుక్క సప్త సముద్రాలై ఉప్పొంగి వాటికి కారణమైన వారిని ముంచేస్తుందని హెచ్చరిస్తున్నారు .
“కన్న కడుపున చిచ్చు రగిలెనా కరువుల పాలవును దేశం “
కరువు అంటే ఏమిటి? వర్షాలు కురవక పంటలు పండక, తాగునీటి కీ, సాగునీటి కీ తట్టుకోలేని ఇబ్బందులు ఎదుర్కోవటం. సరిగ్గా ఈ భావాలను మనుషుల నిత్య జీవితానికి అన్వయించుకుని పాటలోని ఈ భావాన్ని విశ్లేషించుకోవాలి. ఇక్కడ,
కరువు అంటే అమ్మాయి ల ను అంటే ఆడపిల్ల లను కనవద్దని బెదిరిస్తాడు ఆంక్షలు పెడతారు. దొంగచాటుగా పరీక్ష లు చేయించి భ్రూణ హత్యలకు పాల్పడతారు. ‘ఆమె ల‘ హృదయం లలో అగ్ని పర్వతాలు బ్రద్దలయ్యి అసలు పిల్లలను కనడానికే నిరాకరించారంటే ఇక జనాభా ఉండదు. కొన్ని దశాబ్దాల తర్వాత ఎండిన బీడులా, పచ్చదనం మొలకెత్తని ఎడారి లా ఈ భూమి మనుషులు లేక మొత్తం కరువుల పాలవుతుంది అని హెచ్చరించారు . అంతే కాదు ,
ఇక్కడ స్త్రీ ని దేవతగా , ఆమె కడుపును
గర్భగుడిగా భావిస్తే , గర్భగుడిలో దీపం వెలిగిస్తే అందులో కొలువై ఉన్న దేవతామూర్తి రక్షణ కవచమై మనల్ని కాపాడుతుంది . అదే చిచ్చు పెడితే కార్చిచ్చై దహించి వేస్తుంది . అంటే కడుపు రగిలిన స్త్రీ శాపం పెడితే ఎంత శక్తిమంతంగా ఉంటుందో , ఆమెలో రగిలిన ఆ చిచ్చుకు కారణమైన జీవితాలను అది ఎంతగా తుత్తునియలు చేయగలదో , అత్యంత బరువైన బాధను చాలా చక్కని పదాలతో చెప్పగలిగిన రచయిత రచనాకౌశలానికి వేనవేల వందనాలు .
“తల్లిని మించిన దైవం లేదని తరతరాల సందేశం ” కనిపెంచిన తల్లిని (తల్లిదండ్రులను ) దైవ సమానులుగా పూజించాలని, వృద్ధాప్యంలో వారిని నిర్దాక్షిణ్యంగా వదిలి వేయకూడదనీ, వారికి ఊతమై కంటికి రెప్పలా కాపాడాలని హితాన్ని బోధిస్తున్నారు. ఈ చరణంలో రచయిత స్త్రీ తో మెలగాల్సిన తీరును సూచించారు. ఆ స్త్రీ తల్లి అయినా , సోదరైనా భార్య అయినా ఇంకెవరైనా అది బంధమైనా లేక స్నేహమైనా ఆమె మానవ కళ్యాణానికి జీవగర్ర అని తెలుసుకోవాలి.
మూడు చరణాలుగా సాగిన ఈ గీతంలోని మొదటి చరణంలో ఆమె వ్యవహార శైలిని , రెండవ చరణంలో ఆమెలోని భావోద్వేగాలను , మూడవ చరణంలో ఆమె పట్ల ఇతరులు మెలగాల్సిన తీరును రచయిత చక్కగా వర్ణించారు .
ఈ గీతం ప్రబోధాత్మకమైనదా లేక సందేశాత్మకమైనదా అనే ప్రశ్న నాలో తలెత్తినప్పుడు రెండింటి కలయిక అనే నిశ్చయానికి రాగలిగాను . ఇంత చక్కని గీతాన్ని రచించిన రచయిత గారికి , సంగీతాన్ని సమకూర్చిన స్వరకర్తల వారికి , తమ గాత్ర సౌందర్యంతో శ్రోతలను గాన సుధా స్రవంతిలో ఓలలాడించిన గాయనీమణులకు అందరికీ అభివందనాలు . స్త్రీ ఉనికిని అన్ని కోణాలలో ఆవిష్కరింపజేసిన ఈ గీతాన్ని అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్ఫురించుకోవడం ఆ గీతానికి మనం అందించే చక్కని గౌరవం.
పద్మశ్రీ చెన్నోజ్వల
రెక్కలొచ్చిన పక్షి ఏదో రంగుల లోకాన విహరిస్తోంది
రేకు విప్పని పువ్వు చుట్టూ చంచరీకం పరిభ్రమిస్తోంది
పక్షి ఎరుగదు రంగులలో రాక్షసం దాగుంటుందని
పువ్వు ఎరుగదు పుప్పడిలో ముప్పు పొంచుంటుందని
పరిణతిలేని ప్రాయం పద్మవ్యూహాన చిక్కింది
ఛేదించే శక్తి లేని నిస్సహాయత నిర్దాక్షిణ్యంగా నులిమేసింది
మర్మమెరుగని హరిణమేదో పులినోటికి కబళమయింది
అంకురించిన బీజమేదో భవితకు భారమయింది
మొగ్గ తొడిగిన రూపమేదో మనుగడకు శాపమయింది
ఆవిరైన అమ్మతనం చెత్త కుప్పను ఆశ్రయించింది
మంటగలిసిన మానవత్వం చేతులు కడిగేసుకుంది
పాప మెరుగని పురిటి గొంతుక గుక్కపట్టి ఏడుస్తోంది
వినగలిగిన శక్తి ఉంటే ప్రశ్నల శరపరంపర –
అది తన అస్తిత్వాన్ని ప్రశ్నిస్తోంది హక్కుల కోసం పోరాడుతోంది
బంధాలను నిలదీస్తోంది బాధ్యతలను గుర్తు చేస్తోంది
నడతను హెచ్చరిస్తోంది విలువలను బేరీజు వేస్తోంది
ఈ పాపం వ్యక్తిదా? వ్యవస్థదా? అని సవాలు విసురుతోంది.
