నరసింహపురం అనే గ్రామంలో శరభయ్య అనే ఒక రైతు ఉండేవాడు. ఆ గ్రామం గత మూడు సంవత్సరాలుగా వర్షాలు లేక కరువు కాటకాలతో సతమతమైంది. ఆ సంవత్సరం ఆ శరభయ్య పొలం కూడా వర్షం లేక పైరు ఎండిపోయింది. అతడు దాన్ని చూసి బాధపడుతున్న సమయంలో అక్కడి నుండి ఒక సన్యాసి పోతూ ఆ రైతును పిలిచి ఎందుకు బాధపడుతున్నావని ప్రశ్నించాడు . ఆ రైతు తన పొలం ఎండిపోయిందని,తాను ఎలా బ్రతికేదని బదులిచ్చాడు . అప్పుడు ఆ సన్యాసి ఒక సన్నాయిని తన సంచిలో నుండి తీసి బిగ్గరగా ఊదాడు . వెంటనే ఆ పొలం పచ్చగా నిగనిగలాడింది.
ఆ రైతు ఎంతో సంతోషించి ” మహాత్మా! ఒక్క నా పొలం పచ్చగా ఉంటే సరిపోదు. మా ప్రజలందరి కడుపులు నిండాలంటే మీరు మా గ్రామంలో గల అన్ని పంటచేలను పచ్చగా చేయాలి” అని కోరాడు. ఆ రైతు పరోపకార బుద్ధికి ఆ సన్యాసి ఎంతో సంతోషించి ఆ సన్నాయిని ఇస్తూ ” ఓ. ఉపకారీ! ఈ సన్నాయి నేను ఊదితే ఒక్కసారి మాత్రమే పనిచేస్తుంది. అడిగిన వారి కోరికను తీరుస్తుంది. కానీ ఇప్పుడు అది ఇక నా చేతిలో పనిచేయదు. అందువల్ల దీనిని నీకు ఇస్తున్నాను. తీసుకో! దీనిని నీవు ఊదితే అది మూడు సార్లు నీ కోరికలను తీరుస్తుంది. కానీ ఒక్క షరతు. నీవు ఇప్పుడు కోరినట్లే ఇతరులకు ఉపయోగపడే కోరికలను మాత్రమే కోరాలి. స్వార్థంతో నీవు ఏ కోరిక కోరినా ఇది పనిచేయదు” అని దానిని ఆ రైతుకి ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయాడు.
ఆ రైతు సంతోషంగా దాన్ని తీసుకొని తమ తోటి రైతుల పొలాలన్ని పచ్చగా ఉండాలని, పంట బాగా పండాలని కోరి దానిని ఊదాడు. వెంటనే మిగతా రైతుల పొలాలన్ని పచ్చదనంతో నిగనిగలాడాయి. ఒక కోరిక ఆ విధంగా నెరవేరింది. తర్వాత ఎండాకాలం తమ గ్రామంలోని చెరువులన్నీ ఎండిపోవడం చూసాడు. మూగజీవాలకు నీటి కటకటను గమనించాడు. తమ గ్రామంలోని చెరువులన్నీ నిండాలని తన కోరికగా కోరి తిరిగి ఆ సన్నాయిని ఊదాడు. వెంటనే ఆ గ్రామంలో గల చెరువులన్నీ ఆశ్చర్యంగా నిండిపోయాయి. ఆ తర్వాత మూడవ కోరికగా అడవిలోని, గ్రామంలోని ఎండిపోతున్న చెట్లన్నీ ఆకుపచ్చదనంతో కళకళలాడుతూ ఉండాలని ఆ సన్నాయిని ఊదాడు. వెంటనే ఆ అడవిలో,గ్రామంలో ఉండే చెట్లన్నీ ఆకుపచ్చదనంతో నిగనిగలాడాయి. మూడు కోరికలు పూర్తి కావడంతో ఆ సన్నాయి తన మహిమను కోల్పోయింది. ఆ చెట్ల వల్ల భారీ వర్షాలు పడి ఆ గ్రామంలో పంటలు చాలా పండాయి. దానితో ఆ గ్రామం కరువు కాటకాలు తీరిపోయాయి. తమ గ్రామ కరవుకాటకాలు పోగొట్టిన ఆ రైతును గ్రామస్థులు అందరూ అభినందించారు.
బాలసాహిత్యం
అనగనగా ఒక ఊరిలో ముగ్గురు స్నేహితులు ఉండేవారు వారు రాము, గౌతమ్,రాజేష్ ఈ ముగ్గురు మంచి మిత్రులు ఒకరోజు రాజేష్ మిగతా ఇద్దరు మిత్రుల దగ్గరకు వచ్చి వినాయక చవితి దగ్గరకు వచ్చింది. చెందాకు తిరుగుదామా అన్నాడు. వారు సరే రేపటి నుంచి తిరుగుదాం అన్నారు. మరుసటి రోజు పొద్దున్నే లేచి ముగ్గురు స్నేహితులు స్నానాలు చేసి చందా వసూలు చేయడానికి బయలుదేరారు. అలా కొన్ని రోజులు చందా వసూలు చేశారు. వినాయక చవితి ముందు రోజు ముగ్గురు స్నేహితులు పందిరి వేసి డెకరేషన్ చేశారు. గౌతమ్ వాళ్ళ నాన్న ట్రాక్టర్ ని తెచ్చాడు. ట్రాక్టర్లో మట్టి గణపతిని తీసుకొని వచ్చారు. గణపతి బప్పా మోరియా అనుకుంటూ పందిరిలోకి తెచ్చారు. గణపతికి కొబ్బరికాయ కొట్టారు. పూజారిని పిలిచి పూజ చేశారు. ప్రసాదం నైవేద్యం పెట్టారు. అందరినీ పిలిచి ప్రసాదం పెట్టారు. సాయంత్రం అయ్యింది. కాళ్లు చేతులు కడుక్కొని దేవుని పందిరిలోకి వచ్చారు. రాత్రి దేవుని పందిరిలోనే పడుకున్నారు. మరుసటి రోజు రాము వచ్చి మిగతా ఇద్దరి మిత్రులతో మనం అన్నదానం చేద్దామా అన్నాడు. మిత్రులు సరే అన్నారు. మూడు రోజుల తర్వాత రాము రాజేష్ గౌతమ్ ముగ్గురు మిత్రులు కలిసి అన్నదానం చేశారు. తొమ్మిది రాత్రులు గడిచాయి. పదవరోజు పులిహోర తయారు చేశారు. వినాయకున్ని ట్రాక్టర్లో పెట్టి ఎగురుకుంటూ చెరువు దగ్గరకు వచ్చారు. వినాయకున్ని చెరువులో నిమజ్జనం చేశారు.
అంతకుముందు ఎవరో నిమజ్జనం చేసిన వినాయకుడి విగ్రహం కరిగిపోలేదు . అలాగే కనిపిస్తున్నది . అయ్యో అనుకున్నారు . కాసేపట్లో వీళ్ళు నిమజ్జనం చేసిన వినాయకుడి విగ్రహం నీటిలో కరిగి పోతుంటే చూసి ఆనందించారు.
నీతి. చెరువులో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసిన వినాయక విగ్రహాలను చెరువులో వేస్తే నీళ్లు కలుషితం అవుతాయి.నీటిలో ఉండే జీవులు చనిపోతాయి. కాబట్టి మట్టి వినాయకులనే పూజిద్దాం.
యెన్. చక్రి,
6 వ తరగతి,
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,
రేగులపల్లి,
మం.బెజ్జంకి.
సుందరవనం అనే అడవిలో ఒకసారి పక్షుల సమావేశం జరుగుతున్నది. ఆ సమావేశంలో ఒక నెమలి చాలా అద్భుతంగా నాట్యం చేసింది . ఆ నాట్యాన్ని చూసిన పక్షులు అన్నీ దానిని అభినందిస్తూ కరతాళ ధ్వనులను చేశాయి. కానీ ఒక్క కాకి మాత్రం కరతాళ ధ్వనులను చేయలేదు . అది చూసిన దాని ప్రక్కనున్న పక్షులు ” ఓ కాకీ! నీ బుద్ధిని పోనిచ్చుకున్నావు కాదు. ఆ నెమలి అంత అద్భుతంగా నాట్యాన్ని చేస్తే నీవు కరతాళ ధ్వనులను కూడా చేయలేదు. నీకు ఇదేం బుద్ధి? నీకు కళాభిమానం కొంచెం కూడా లేదు. నీకు నాట్యం గురించి ఏం తెలుసు గనుక ? నీవు దానివలే నాట్యాన్ని చేయగలవా !”అని ప్రశ్నించాయి.
అప్పుడు ఆ కాకి” నా దృష్టిలో అది నాట్యాన్ని చక్కగా చేయలేదు. అందుకే నేను దాన్ని అభినందించలేదు . ఆ సంగతి నాకు తెలుసు. అది తను చేసే నాట్యంపై ఈరోజు ఏకాగ్రతను ఉంచలేదు. దానిలో చాలా ప్రతిభా పాటవాలు ఉన్నాయి. కానీ వాటిని ఈరోజు మీకు చూపలేదు. నేను ఎలాంటిదాన్నో దానినే మీరు అడగండి. దానికి లేని కోపం మీకెందుకు ?”అని అంది.
అది విన్న నెమలి ” ఔను. ఆ కాకి అన్నది నిజమే . మీరు తొందరపడ్డారు. దాన్ని ఏమీ అనకండి . నేనే పరధ్యానం వల్ల నాట్యం చేసేటప్పుడు కొంత తడబాటు పడ్డాను. దానిని ఇది గుర్తించింది. ఇది నా శ్రేయోభిలాషి . అదే నన్ను ఇటువంటి ఉన్నత స్థాయికి తెచ్చింది. ఈ కాకి చిన్నప్పుడు నా ఆసక్తి గమనించి నన్ను ఒక గొప్ప గురువు వద్దకు తీసుకుని వెళ్లి నాకు ఈ నాట్యాన్ని నేర్పించింది . దానికి నేను ఏమిచ్చినా దాని రుణం తీరదు. అది పైకి అలా ప్రవర్తించినా నేనంటే దానికి వల్లమాలిన అభిమానం . ఎల్లప్పుడూ అది నా బాగోగులు కోరుకుంటుంది. దానికి నాట్యం చేయరాకున్నా నాట్య రీతులన్నీ బాగా తెలుసు. అది ఎంతో మంది గొప్పవాళ్ల నాట్యాలని చూసి చాలా విషయాలను తెలుసుకుంది. నన్ను కూడా గొప్పదానిగా చేయాలన్నదే దాని ధ్యేయం “అని అంది. ఆ మాటలకు పక్షులు ఆశ్చర్యపోయి కాకిని మన్నించమన్నాయి. అందుకే పిల్లలూ! అసలు విషయం తెలుసుకోకుండా తొందరపాటు తో ఇతరులను నిందించరాదు.
సాధారణంగా మనం ఎంతోమంది తో మాట్లాడుతూ ఎన్నో విషయాలు తెలుసుకుంటాం కానీ కొందరు చెప్పే మాటలు మనకు ఆనందం తోపాటు ఆదర్శభావాల్ని ఆలోచనలను రేకెత్తిస్తాయి.అదే మనం తెలుసుకోవాలి” శివా మాష్టారు పాఠం చెప్పేముందు ఇలా కొన్ని మాటలు చెప్పి ఆలోచించమని పిల్లలకు చెప్తారు.అప్పుడు ఆసక్తికరంగా ఆయనపాఠంసజావుగా సాగుతుంది.బెల్లు ఐనా ఇంకా ప్రశ్నలు అడుగుతూ ఉంటారు.” కులం అంటే ఏంటి?” ” అదే సర్! క్యాస్ట్!” పొలోమని అరిచారు.
“అసలు అర్థం నివాసం అని.వృత్తులు ఎవరి శక్తి సామర్థ్యాలను బట్టి వారు చేసేవారు.అలా సంఘంలో ఒకరిపై ఒకరు ఆధారపడి సహజీవనం గడిపేవారు.ఒకసారి శ్రీరామానుజులవారు స్నానం ముగించుకుని తిరిగి వస్తూ ధనుర్దాసు అనే శిష్యుడు భుజంపై చేయి వేసి నడిచారు.ఒక చుప్పనాతి శిష్యుడు అడిగేశాడు “వాడు తక్కువ కులంవాడుకదా? మీ మడికి భంగం కలగదా?”అని.
దానికి ఆయన ఇలా జవాబిచ్చారు” పిచ్చివాడా! చదువు డబ్బు గొప్ప వంశం కులంలో పుట్టాను అనేవి అహంకారం మదమాత్సర్యాలకి మూలం.వినయవిధేయతలున్నవాడే మానవత్వంతో సాయపడే వాడే దేవుని దృష్టిలో అసలుసిసలు భక్తుడు.శుచిశుభ్రత ముఖ్యం.” అన్నారట శ్రీ రామానుజులు . అంతెందుకు? మనమిసైల్ మాన్ అబ్దుల్ కలాం ని
బడిలో అయ్యర్ అయ్యవార్లు తమ ఇంటికి పిలిచి వంటింట్లో తమతోపాటు భోజనానికి కూచోబెట్టేవారు.మడి తో ఉన్న మాష్టారు భార్య
మామి కూడా కన్నకొడుకు లా బాల కలాం కి అన్నం కొసరి కొసరి వడ్డిస్తూ వినిపించేది.మీరు కూడా మధ్యాహ్నం లంచ్ అందుకే పక్కపక్కనే కూచుని తినాలి.మీరు తెచ్చినవి ఇతరులతో పంచపకుంటూ,వారివి మీరు పుచ్చుకోవడం లోనే ప్రేమ ఆప్యాయతలు బంధాలు పెరుగు తాయి.” అని శివా మాస్టారు చెప్పారు. అది వింటున్న బడి ఛైర్మన్ మనవడు రాము అన్నాడు”
సార్! ఇవాల్టినుంచి నేను కూడా అందరితో కలిసి తింటాను.ఆగట్టుమీద కూచోను.మానౌకరు దగ్గర కూర్చుని తినిపిస్తాడు.మా అమ్మ మాట ప్రకారం.”
“సెభాష్ రాము! మీనౌకరుకి చెప్తానులే లంచ్ బాక్స్ ఆయాకిచ్చి
వెళ్లిపొమ్మని.నీవుకూడా మీక్లాసుపిల్లలతో కల్సికూచుని తిను.అందరూ తమ ఇంట్లోంచి రకరకాల వెరైటీవంటకాలు తెస్తారు. అవి పక్కవారితో పంచుకొని తింటారు.వంకాయని రకరకాలుగా వండవచ్చు.కొందరుఅల్లంపచ్చిమిర్చి కొబ్బరివేసి గుత్తికూర చేస్తారు, కొందరు ఉల్లిగడ్డ వేసి ముద్దగా కూర చేసుకుంటారు, కొందరు వేపుడు గా చేసుకుని తింటారు. మరికొందరు వంకాయ పులుసు వండుతారు, కొందరు చట్నీ లా చేసుకుని తింటారు. వాటిలాగానే మనుషుల స్వభావాలుకూడా. చూడండి …. మన రాము ఎంత బాగా సరేనన్నాడో చూడండి.” శివాసార్ మాటల్తో పిల్లలంతా పొలోమని అరిచారు” హాయ్! రేపట్నించి రాముకూడా మనతోకల్సి చెట్టుకింద కూచునే తింటాడు.వాడి లంచ్ బాక్స్ లోని వెరైటీలు మనం కూడా రుచి చూడొచ్చు” .చప్పట్లతో రాముని పిల్లల అభినందించారు
ఓ ముసలి వాసిల్ తన వలలో ఏమి పడిందో చూద్దామని సముద్ర ఒడ్డుకు వెళ్ళాడు. ఎప్పుడైతే అతను తన వలను పరిచిండో, దాంట్ల ఒక బంగారు చేపను చూసాడు, దాన్ని పట్టుకున్న వెంటనే ఆ చేప అంది, ఒకవేళ నీవు నన్ను మరల సముద్రములో వదిలిపెడితే నీ కోరికలన్ని తీరుస్తాను అని. ముసలి వాసిల్ కొద్దిసేపు ఆలోచించి అన్నాడు, చాలా మంచిది, నీవు సముద్రములోకి వెళ్ళు. కాని ఏమి వరం కోరుకోవాలో నాకు తెలియడం లేదు. అందుకు నేను ఇంటికి వెళ్ళి నా భార్యను అడగాలి. అతను ఇంటికి వెళ్లి భార్యతో జరిగినదంతా చెప్పిండు. ఆ ముసలి ఆడది అతడ్ని బాగా తిట్టింది. వెంటనే వెళ్ళి నేను వేసుకోవడానికి మంచి కొత్త బట్టలు అడుగమంది. నా వద్ద కేవలం చిరిగిపోయిన పాత బ్లౌజు మాత్రమే ఉంది. ఆ ముసలతను కొత్త బట్టలతో ఇల్లు చేరాడో వెంటనే తిరిగి పంపిస్తూ తనను బంగారు బండిలో ఎక్కించి తిప్పు, ఎందుకనగా ఇంతకుముందు ఎన్నడూ బండిలో ఎక్కలేదు. కాని అది కూడా ఆమెకు తృప్తినివ్వలేదు.
ఇప్పుడు ఆమె సముద్రపు ఒడ్డున ఒక అందమైన మేడ కావాలని కోరింది, దాని చుట్టు విశాలమైన అందమైన తోటలు, చాలామంది నౌకర్లు ఉండాలని అంది. కాని అది కూడా ఆమెకు తృప్తినివ్వలేదు. చివరకు ఆమెకు విచిత్రమైన భావన కలిగింది. ఆ బంగారు చేప వచ్చి ఆమెకు సేవ చేయాలని తలచింది. ఆ చేప ఇది విని వెంటనే ఆగ్రహించి ఇచ్చిన బహుమతులన్ని తిరిగి తీసేసుకుంది. ఆ ముసలామె తన పాడుబడిన గుడిసె ముందు, తన పాత చిరిగిపోయిన బ్లౌజు వేసుకొని వలను బాగు చేసుకుంటూ మరల నిలబడింది. ఇప్పుడు నీవు మొదట ఎక్కడ ఉన్నావో అక్కడనే ఉన్నావు.
ఒకవేళ నీవు అతిగా కోరాలని ప్రయత్నిస్తే, చివరకు నీవు ఏమి లేకుండా మిగిలిపోతావు.
”అతి ఆశ కొంపకు చేటు”
సాయికి పన్నెండేళ్ళు.
తన చక్రాల కుర్చీలో కూర్చుని కలలు కంటూ ఉంటాడు. తన కలలను నిజం చేసుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు.
ఎనిమిదేళ్ల వయసులో సాయికి జబ్బు చేసింది. ఆ జబ్బు వల్ల సాయి కాళ్లు రెండూ చచ్చుబడిపోయాయి. లేచి నడవలేకపోతున్నాడు. ఇక ఎప్పటికీ నడవలేడని వైద్యులు చెప్పారు.
అమ్మా నాన్న చాలా దుఃఖించారు. మొదట్లో సాయి కూడా బాధపడ్డాడు.
సాయితో కలిసి బడికి వెళ్లిన, ఆడుకున్న మిత్రులు అవిటివాడని వెక్కిరించారు. దూరమయ్యారు. సాయి ఒంటరి అయ్యాడు.
మిత్రుల ప్రవర్తనకు ఆశ్చర్యపోయాడు.
తన మిత్రులతో తిరగ లేనందుకు, ఆటలు ఆడలేక పోతున్నందుకు దిగులు పడ్డాడు.
చక్రాల కుర్చీలో కూర్చుని కిటికీలోంచి బయటికి చూస్తూ సాయి కలలు కంటున్నాడు. రకరకాల కలలు కంటున్నాడు.
సాయికి బొమ్మలు వేయడం చాలా ఇష్టం. ఆ బొమ్మల ద్వారా తన కలలు, ఆశలు వ్యక్తం చేస్తున్నాడు.
సాయి గదిలో కిటికీ దగ్గర కూర్చుంటే పచ్చని మైదానం కనిపిస్తుంది.
ఆ మైదానం సాయి బొమ్మల్లో రంగుల మైదానంగా మారింది. ఆ మైదానంలో అతను పరుగులు తీస్తున్నాడు. ఎగురుతున్నాడు.
ఆకాశంలో ఎగిరే పక్షులు అతని బొమ్మల్లో అతని స్నేహితులుగా మారాయి.
సాయి ఆ రోజు రాత్రి చాలా సంతోషంగా నిద్రపోయాడు.
అతని కలల్లో అతను ఒక గొప్ప చిత్రకారుడు. అతని బొమ్మలు ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శించబడుతున్నాయి. ప్రజలు అతని బొమ్మలను చూసి ఆనందిస్తున్నారు.
ప్రశంసిస్తున్నారు.
సాయి ఉదయం లేస్తూనే ఆ విషయం అమ్మతో చెప్పాడు. ఆ తర్వాత “అమ్మా, నేను పెద్దయ్యాక చిత్రకారుడు అవుతాను. నేను చాలా బొమ్మలు వేస్తాను. నా బొమ్మలు చూసిన ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉంటారు” అని చెప్పాడు.
అమ్మ సాయిని దగ్గరకు తీసుకుని “నా చిట్టి తండ్రీ.., నీ కలలు నిజమవుతాయి. నీవు చాలా తెలివైనవాడివి. నీవు ఏమి అనుకుంటావో అది చేయగలవు” అని ముద్దిచ్చి ప్రోత్సహించింది.
పెద్ద రంగుల పెట్టె, కుంచె, కాన్వాసు తెచ్చి “నీ కలలు నిజం చేసుకో ” అన్నాడు నాన్న.
“అన్నా నీకేది కావాలన్నా నన్నడుగు, నీకు నేనున్నా” చెప్పింది చెల్లి.
కిటికీలోంచి వచ్చే వెలుతురులో సాయి ముఖం ఆనందంతో మెరిసింది.
సాయి చక్రాల కుర్చీలో కూర్చుని ఉన్నాడు కానీ, అతని మనసు మాత్రం ఎల్లప్పుడూ ఎగురుతూనే ఉంటుంది. కొత్త కొత్త కలలు కంటూనే ఉంది. కొత్త లోకాల్లోకి తీసుకుపోతూనే ఉంది.
తన కలల్లో చూసినవన్నీ సాయి బొమ్మలుగా గీస్తున్నాడు. వాటికి రంగులు అద్దుతున్నాడు. అవి అతనికి గొప్ప గుర్తింపుని ఇచ్చాయి. ఎన్నెన్నో బహుమతులు తెచ్చిపెట్టాయి.
సాయి కన్న కలలు అతనికి కఠిన పరిస్థితుల నుంచి బయటపడే శక్తిని ఇచ్చాయి.
చిత్రకారుడిగా లోకానికి పరిచయం చేశాయి.
కలలు కనడానికి ఎవరికీ పరిమితులు లేవు. ఆ కలలు నిజం చేసుకోవడానికి మాత్రం కృషి చాలా అవసరం.
మరి, సాయి ఆ కృషి చేస్తాడా?
భవిష్యత్ లో గొప్ప చిత్రకారుడిగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటాడా? .
ప్రపంచం అతన్ని గుర్తిస్తుందా?
మీరు చెప్పండి.
వి. శాంతి ప్రబోధ
ఒక బీద విధవరాలు, ఒక పినాసి జమీందారు ప్రక్క ప్రక్క ఇండ్లలో వుండేవారు. జమీందారు దురాశా పరుడు. కాబట్టి ప్రక్క ఆమె సేబు పండ్లను తనకు సరిపోను లేని వాడివలె తెంపుకునేవాడు. ప్రక్క వారి చెట్టు కొమ్మ తన గోడను తగులుతున్నది కావున అది తనదేనని గట్టిగా వాదించేవాడు. తనకు ఒక మంచిరోజు వస్తుందని నమ్మకంగా అనుకుంది ఆ ఆడమనిషి, ఆ పీనాసి ముసలతనికి వచ్చేది వస్తుంది.
ఒకరోజు ఆమె పొయ్యిల కట్టెల కొరకు అడవికి పోయింది. వెంట ఆమె ఒక రొట్టె ముక్కను తీసుక వెళ్ళింది. దారిలో ఆమె ఒక బిచ్చగాడిని చూచింది. అతను ఆ రోజు అప్పటివరకు ఏమి తిన లేదని గ్రహించి, తన రొట్టె మాడిన భాగం తప్ప మిగతా మొత్తం రొట్టె ఆ బిచ్చగాడికి ఇచ్చింది. ఆమె దానికి బదులు అతని నుండి ఏమి ఆశించలేదు. కాని ఆ ముసలతను ఆమెకు దగ్గరిలోని ఒక చెలుకను చూపించాడు. ఒక క్షణం ముందు అక్కడ ఏమి లేని చోట రెండు ఆలుగడ్డలను చూసింది. ఒక చిన్న మాడు ముక్క తను వుంచుకొని మొత్తం రొట్టె తనకు ఇచ్చినందుకు బదులు వాటిని తీసుకొమ్మని అతడు చెప్పాడు. అవి తీసుకొని, కొన్ని పొయ్యిల కట్టెలు తీసుకొని ఇల్లు చేరింది.
మరునాడు ఉదయం ఆమె ఒక అసమాన్యమైన మెరుపుతో లేచింది. ఆమె స్టౌ ప్రక్కన కట్టెల మోపు సూర్యరశ్మిలో చుట్టబడినట్లు చూచింది. ఆమె దానిలోనికి చూసింది. అక్కడ ఆమెకు ఒక్కొక్క ఆలుగడ్డ బంగారంగా మారింది, కనిపించింది.
ఆ పిసినారి భూస్వామి అటు పోవుకుంటూ బెల్ కొట్టకుండా ఆ బీదామె ఇంట్లోకి వెళ్ళాడు. ఆ బీదామె జరిగినదంతా దాపురం లేకుండా చెప్పింది. వెంటనే ఆ భూస్వామి గీరల బండి, ఐదు రొట్టెలతో అడవికి వెళ్ళాడు. అక్కడ అతను ముసలతనితో కలిశాడు. అప్పుడు అక్కడ జరిగినదంతా ఏమైందో మీకు తెలిసే ఉంటుంది. ఆ ముసలతను ఈ భూస్వామికి ప్రక్కన ఉన్న చెలుక చూపించాడు. ఆ చెలుకలని ఆలుగడ్డలను భూస్వామి బస్తానిండా నింపుకొని ఇల్లు చేరాడు. తన జొన్నల గదిలో ఆలుగ్డలను పోశాడు. కానీ మరునాడు తను లేచి చూసి బహు చెడ్డ షాక్ తిన్నాడు. ఒక్కొక్క ఆలుగడ్డ నుండి డజన్ డజన్ ఎలుకలు తయారై కొట్టంలో వున్న మొత్తం జొన్నలను తినేశాయి. అతనికి బంగారం రాలేదు, ఉన్న జొన్నలు ఎలుకల పాలయినాయి. అందుకే అంటారు, అతి ఆశ కొంపకు చేటు అని.
ఎర్నీ అనబడే ఒక బాలుడు పరిశోధన కథలు (డిటెక్టివ్ స్టోరీలు) చదవడం ఇష్టపడేవాడు. కాని మీరు అతను డిటెక్టివ్ కావాలని ఊహిస్తున్నారా? ఆ అవకాశం లేదు. అతను ఒక దొంగ కావాలని నిశ్చయించుకున్నాడు. ప్రపంచంలో ఇది తప్ప అతడిని వేరే ఏ వృత్తి ఆకర్షించలేదు. ఆయన ఎదిగిన వెంటనే ఒక పయతాప ముఖానికి పెట్టుకొని, జేబులో ఒక బొమ్మ పిస్టల్ దూర్చుకొని ఒక బ్యాంకుని దోచుకుందామని బయలు దేరాడు. ఒక బ్యాంక్ లోకి వెళ్ళి క్లర్కును నత్తి వలన హ, హ, హాండ్స్ అప్ అని అరిచాడు, పిస్టల్ చూసిస్తూ. కానీ వెంటనే అలారం మోగటం మొదలయింది.
ఎర్నీ ఏం జరుగుతున్నదో తెలుసుకోక ముందే, పోలీసులు అతడిని అరెస్టు చేశారు. బ్యాంకు దోపిడీ ప్రయత్నం చేసినందుకు జైల్లో వేశారు. వాస్తవంగా బ్యాంక్ దోయడం తన వంటి అనుభవం లేనివాడు మొదలుపెట్టడం కష్ట కార్యమే. నేను చాలా సామాన్యమైన ప్రయత్నాలే చేయాలి అనుకున్నాడు కాబట్టి ఆయన జైలు నుండి విడుదల అయినాక ఒక పెద్ద షాపు బంగ్లా కిటికీ పగులగొట్టి లోనికి దూరాడు. అక్కడ అతనికి ఏది చేతికందితే అది తన బస్తాలో వేసుకున్నాడు. కానీ అతను కిటికీ గుండా బయటకు వెళుతున్నపుడు పట్టుబడి రెండవసారి జైలులో వేయబడినాడు. అక్కడ విడుదలయ్యాక ఒక ఖాళీ ఇంట్లోకి దూరాడు. అక్కడ అతను బీరువాలు వగైరా వెతికాడు, కాని అక్కడ ఏమీ దొరకలేదు.
కానీ దారిలో దొంగల ముఠాకు పట్టుబడి బాగా దెబ్బలు తిన్నాడు. తను తెచ్చుకున్నది కూడా వాళ్ళు తీసేసుకున్నారు. కారణం ఆ ఇల్లు వాళ్ళ ప్రాంతం.
ఎప్పటివలనే నేర పరిశోధకులు తన వేలి ముద్రలు ఖాళీ ఇంట్లో బీరువాలపై ఏర్పడిన వాటిని గమనించి మరల జైల్లో వేయబడ్డాడు.
ఎప్పుడూ ఇదే తంతుగా జరుగుతున్నందుకు జైలుశిక్ష ఎక్కువ కాలం పడుతుండేది.
చివరకు దొంగతనాల కన్నా వేరే మంచి వృత్తులు ఉంటాయని గ్రహించి, స్థానిక జంతు ప్రదర్శన శాలలో ధృవ ప్రాంత ఎలుగుబంట్లకు మేత వేసే ఉద్యోగం సంపాదించాడు. అప్పుడప్పుడు వాటికి తను నేరాలు చేస్తున్నపుడు జరిగిన విషయాలు చెప్పేవాడు.
దొంగతనాలు చేయడం కన్నా, చిన్న ఉద్యోగమే మేలు అనుకున్నాడు, కష్టమైనా.
అన్నదమ్ముల ఆదర్శం
అది నరసింహపురం లోని ఒక పాఠశాల. అక్కడికి రంగయ్య తాత వచ్చి రాఘవయ్య మాస్టారుతో “మాస్టారూ! మీ తరగతిలో అందరికన్నా ఎక్కువ మార్కులు సాధించిన ఒకే ఒక్క ఉత్తమ విద్యార్థికి నేను బహుమతిని ఇవ్వదలుచుకున్నాను. వారెవరో మీరు నిర్ణయించండి “అని అన్నాడు. రాఘవయ్య మాస్టారు ఆలోచనలో పడి సరేనన్నాడు .
ఆయన తరగతి మాస్టారుగా ఉన్న ఐదవ తరగతిలో రాము ,సోము అనే ఇద్దరు విద్యార్థులు ఉండేవారు. వారు అన్నదమ్ములు మరియు కవలలు కూడా! వారిద్దరూ పోటీపడి చదివే వారు. వారితో పాటు ఆనంద్ అనే విద్యార్థి కూడా వీరికి పోటీగా నిలిచేవాడు. రాఘవయ్య మాస్టారు రంగయ్యతో “సరేనండీ! వారెవరో నిర్ణయించిన తర్వాత మీకు కబురు చేస్తాను “అని అన్నాడు. రంగయ్య తాత అక్కడి నుండి వెళ్ళిపోయాడు .
రాఘవయ్య మాస్టారు పిల్లలకు ఎన్నో రకాల పరీక్షలు పెట్టాడు. అన్నింటిలో రాము ,సోము ప్రథములుగా నిలిచారు. వారిలో ఎవర్ని ప్రథములుగా నిర్ణయించాలో మాస్టారుకు అంతుపట్టలేదు. చివరికి ఆయన ఒక గదిలో ఒంటరిగా కూర్చుండి రామును పిలిపించాడు. ” ఒరేయ్ ! నేను ఒక బహుమతిని నీకు ఇప్పించాలని అనుకుంటున్నాను . అది నీకు ఇప్పించాలా! మీ తమ్మునికి ఇప్పించాలా!” అని అడిగాడు. అప్పుడు రాము ” మాస్టారూ! ఆ బహుమతిని మా తమ్మునికే ఇప్పించండి”అని అన్నాడు. అప్పుడు రాఘవయ్య మాస్టారు ” అది నీకు ఎందుకు వద్దురా!” అని ప్రశ్నించాడు. అప్పుడు రాము ” మాస్టారూ! మా తమ్ముడు చాలా మంచివాడు. నేను చెప్పింది వింటాడు. అందువల్ల అతనికే ఇప్పించండి ” అని అన్నాడు.
ఆ తర్వాత మాస్టారు సోమును తన గదికి పిలిపించి అతనిని ఇదే ప్రశ్న అడిగాడు. అప్పుడు సోము “మాస్టారూ! ఈ బహుమతి నాకు వద్దు. మా అన్నయ్యకే ఈ బహుమతిని ఇప్పించండి. ఎందుకంటే మా అన్నయ్య నాకు తాను తినకుండా చాక్లెట్లు, ఐస్ క్రీములు నాకోసం దాచిపెట్టి ఇస్తాడు . తాను డబ్బుతో ఏమి కొనుక్కున్నా లేదా ఎవరైనా అతనికి తినుబండారాలు ఇచ్చినా వాటిలో ఎక్కువ భాగం నాకే ఇస్తాడు” అని అన్నాడు. మాస్టారుకు ఏమి చేయాలో పాలు పోలేదు.
వెంటనే మాస్టారుకు ఒక ఆలోచన వచ్చింది . అతడు వెంటనే రంగయ్య తాతను పిలిపించి తాతతో ” తాతా! వారిద్దరూ సమానస్కందులే. వారిద్దరిలో ఈ బహుమతిని ఎవ్వరికీ ఇవ్వాలో నాకు అర్థం కావడం లేదు. మీరే నిర్ణయించండి . ఎందుకంటే వారిద్దరికీ మార్కులు సమానంగా వచ్చాయి. దానితోపాటు వారిద్దరి స్వభావం కూడా ఇతరులకు ఆదర్శంగా ఉంది . వారిద్దరిలో ఒక్కరిని నిర్ణయించడం నాకు చాలా కష్టంగా ఉంది “అని అన్నాడు. అప్పుడు రంగయ్య తాత ” అయ్యో మాస్టారూ! ఈమాత్రం దానికి నన్ను అడగడం దేనికి? ఆ ఇద్దరికీ బహుమతులను ఇవ్వండి. నేను నాకు తెలియక ముందు ఒక్కరికే అన్నాను. ఎలాగూ ఆర్థిక సాయం చేసెందుకు నేను ఉన్నాను కదా! పిల్లలను అలా నిరాశపరచకండి . వారిద్దరూ చాలా ఉత్తములైన విద్యార్థులు. అంతేకాదు. ఇతరులకు ఆదర్శంగా ఉండే అన్నదమ్ములు. అన్నదమ్ములంటే అలా ఉండాలి “అని ఆ ఇద్దరికీ బహుమతుల కొరకు డబ్బును ఇచ్చి వెళ్ళాడు . మరునాడు మాస్టారు ఆ బహుమతులను రాము ,సోములకు ఇస్తూ ” వీరిద్దరూ అన్నదమ్ములందరికీ ఆదర్శం ” అని అన్నాడు. అప్పుడు తరగతి పిల్లలు వారిద్దరిని కరతాళ ధ్వనులతో మిక్కిలి అభినందించారు.
అనగ గనగా ఒక ఊరు ఉండేది.ఆ ఊరి పేరు ఇబ్రహీంనగర్ అక్కడ తేదీ 4-4-2024 న రాత్రి 7.30.ని.షా.లకు ఎల్లమ్మ జాతర మొదలైంది.
ఎల్ల-అమ్మ అంటే ప్రపంచానికి తల్లి కాబట్టి. ఆమె బిడ్డలుగా అన్నం పెట్టే బాధ్యత ఆమె పిల్లలుగా మనందరి బాధ్యత అని బోనం పట్టుకుని…పోతారు. అలా
అప్పుడు మేము ఆ ఊరికి వెళ్లాము. మేము ఉదయమే లేచి తయారై బోనం తలపైన పెట్టుకొని హారతులు పట్టుకొని డప్పులు చాటింపులతో ఎల్లమ్మ గూడికి పోయినం. ఎందుకంటే ? నీటినుండి-ధూళి నుండి పుట్టిన ఎల్లమ్మ ఆరెండింటి తోనే పంటలు పండి మన ఆకలి తీరుస్తుందని, అంటురోగాలు రాకుండా కాపాడు తుందని,కృతజ్ఞతగా బోనాల పండగ చేస్తాము.
అక్కడ చాలా జనాలు ఉన్నారు. మేము గుడికి పోగానే కొద్దిసేపు నిలుచున్నాం. ఆ తర్వాత మాకు కూర్చోవడానికి స్థలం దొరికింది. అప్పటికే అయ్యగారు అక్కడ పూజ మొదలు పెట్టారు అక్కడ తిరునాళ్లు కదా చాలా బొమ్మలు అమ్మడానికి వచ్చినవి, మా తమ్ముడు చూచి బొమ్మలు కావాలని ఏడ్చినాడు. అప్పుడు మా అమ్మ వెళ్లి వాడికి కావలసిన బొమ్మలు కొనిచ్చింది. ఆ తరువాత కొద్దిసేపు కూర్చున్నాం. కొద్దిసేపటికి పోతరాజు వచ్చాడు ఆయన మేకను కొరికి ఆ మేక యొక్క రక్తం తాగాడు. ఎందుకలా చేస్తారంటే ఇంటి పనులలో ఏవో కొన్ని చేయలేదనే కోపంలో ఎల్లమ్మ భర్త అయిన జమదగ్ని కొడుకు పరుశురాముడి తో అమ్మ ను చంపేయమని అంటాడు. పరుశురాముడు తండ్రి మాటతో ( ఎల్లమ్మ) నరికేస్తాడు. ఆ కథ అందరికీ తెలిసేందుకు ఈనాటికీ దాన్ని ఒక ఆచారంగా చేస్తున్నారు.
ఆ తర్వాత గుడి చుట్టూ తిరిగి ఇంకా అక్కడ ఉన్న భక్తుల మీదికి ఉరికాడు.అప్పుడు నాకు చాలా భయమేసింది.బాధ కూడా కలిగింది. అలా ఆచారాల పేరుతో మూగ జీవాలను హింసించడం నాకు నచ్చలేదు.ఈ ఆచారాలను ఆపితే బాగుండనిపించింది.ఆ గుడి పక్కనే ఒక పెద్ద ఫంక్షన్ హాల్ ఉంది మేము ఆ హాల్లోకి పోయి అక్కడి నుంచి పోతరాజును చూసినం కానీ కొంతమంది అదే ఫంక్షన్ హాల్ లో కూర్చున్నారు. ఆ తర్వాత మా అక్క పెద్దమ్మ అన్న పెద్ద బాపు అక్కడే ఉన్నారు మేము ఇంటికి వచ్చి అన్నం తిని పడుకున్నాము. అప్పటికే సమయం ఒకటి అయింది. కొద్దిసేపటి తరువాత మా వాళ్లు కూడా ఇంటికి వచ్చి తిని పడుకున్నారు. మళ్లీ పొద్దున లేచి ఆటో కి ఫోన్ చేసి మా ఇంటి పక్కన ఉన్న పెద్దమ్మ వాళ్లతో కలిసి ఇంటికి వచ్చాము.
నీతి:- ఏ కుటుంబంలోనైనా వెనుకటి నుండి వచ్చిన ఆచారాలు సంతోషకరమైనవైతే పాటించాలి…అలా కాకుండా ప్రాణులను హింసించేవైతే కొంచెం మార్పులు చేసుకొని పండగను ఆనందంగా జరుపుకోవాలి.