బాలసాహిత్యం
******
బాల గేయము
********
చిట్టితల్లి పెంచింది
చిన్ని మొక్కను
కబురులెన్నొ చెప్పింది
చిన్నిమొక్కతో.
మొక్కతల్లి నిమిరింది
చిట్టి బుగ్గను.
చిట్టితల్లి నవ్వింది
చిగురు తాకగా.
మొక్కతల్లి నువ్వే
నా ప్రాణమన్నది.
చిన్నిమొక్క, చిట్టితల్లి
నేస్తమయినవి.
చిన్ని కడవతో వచ్చి
చిట్టితల్లి
నీరు పోసి పెంచింది
చిన్ని మొక్కను
మొక్కతల్లి వేసింది
మారాకులు
మొగ్గలేసి నవ్వింది
పూల గుత్తిగా
చిట్టితల్లి అది చూసి
గంతులేసింది.
చిన్ని మొక్క కానుకగా
పువ్వులిచ్చింది.
చిట్టితల్లి సంతోషం
సంద్రమైనది.
చిన్ని మొక్క ఆనందం
ఊపిరయినది.
చిట్టితల్లి ఊపిరైనది.
నిర్వహణ : డా.వై.కృష్ణ కుమారి
తొలిసారిగా తెలుగు రాష్ట్రాలలో బాల బాలిక లకు జరిగిన రామాయణం మీద ఉపన్యాస పోటీలు అత్యంత విలక్షణమైనవి అని సాహిత్య వేత్తలచే కొనియాడబడిన ఈ కార్య క్రమం గురించి ఒక మాట.
చిన్నారులలో భారత దేశం ,సంస్కృతి, చరిత్ర, సంస్కారాలు, పండుగలు, ఉత్సవాలు, దేవాలయాలు, సామాజిక వ్యవస్థ మొదలైన వాటి గురించి అవగాహన కల్పించాలి అన్న సంకల్పంతో ప్రారంభించిన పోటీలు ఇవి. నేటి చదువుల వల్ల చిన్నారులలో అటు చదువు పట్ల గాని, ఇటు దేశం పట్ల గాని ఏ రకమైన ఆసక్తి కల్గడం లేదు. మార్కుల మీద ఉన్న దృష్టి చదువుల లోని మర్మం మీద ఉండడం లేదు. మొక్కుబడిగా మారింది నేటి విద్యా విధానం.
పెద్దలకి క్షణం తీరిక లేని ఉద్యోగాలు.ఉమ్మడి కుటుంబాలు కరవైన ఈ కాలంలో చిన్నారులకు దేశ సంస్కృతి వివరించడం, వాళ్ళను సంస్కారంగల దేశభక్తులుగా చేయగల వాతావరణం ఇంటిలో కల్పించడం దాదాపుగా మృగమై పోయింది. ప్రతీ వారు వారిదైన పరిధిలో ఆగమ్యంగా ముందుకు వెళ్లిపోతున్నారు. చిన్నారుల బాల్యం ఎండకు ఎండి, వానకు తడిసి, చలికి గడ్డ కట్టుకొని పోతున్నది.శారీరిక మానసిక ఎదుగుదల పోషణ రహితమై ప్రకటనలకు పరిమితమైంది . చిన్నారుల జీవితాన్ని తప్పు దారిలో నడిపించడానికి సిద్ధంగా ఉన్నటి. వి లు, సినిమాలు, విచక్షణ రహిత యాంత్రిక మయ ఆటలు మాత్రం తమ పాత్రను ఇతోధికంగా పోషిస్తున్నాయి. ఈ పరిస్థితి నాకు చాలా ఆందోళన కలిగించింది. విజ్ఞానవంతులు, సాహితీ వేత్తలు, పండితులు, అవధానులు , ప్రవచన కారులు మొదలైన ఎందరో మహానుభావులు సాహితీ వ్యవసాయం చేస్తున్నారు భారతంలో ,విదేశంలో కూడా. కానీ, ఆ విజ్ఞానం చిన్నారులకి అందుతున్నదా ? వీరి ఉపన్యాసాలు చిన్నారులను ప్రభావితం చేస్తున్నాయా? ఒకవేళ లేదు అన్న సమాధానం వస్తే మాత్రం దానికి మనమందరం బాధ్యత వహించాలి. మనం ఎటువంటి ప్రయత్నం చేయకుండా పిల్లలకి దేశం పట్ల, సంస్కృతి పట్ల అవగాహన లేదు అని అనే నైతికత మనకు లేదు. ఈ మేధోమధనమే నేటి ఈ పోటీలకు పునాది అయింది. ఉగ్గుపాలతో నేర్పించే వయస్సులో చేయని పనిని కనీసం ఇప్పుడైనా మొదలు పెడదామని చేసిన ప్రయత్నం ఇది. చిన్నారుల భవిష్యత్తు ఆగమ్యంగా మారుతున్న ఈ తరుణంలో వచ్చిన ఒక ఆశాకిరణం ఈ ఆలోచన. మంచికో చెడుకో గాని అనుకోకుండా దొరికిన ఈ మహమ్మారి కాలాన్ని సద్వినియోగ పరుద్దామని , బాలలలో దేశం గురించి,సంస్కృతి గురించి సరియైన కోణంలో ఆలోచింప చేసే ప్రయత్నం చేద్దామని ఈ ఉపన్యాస పోటీలు ఏర్పాటు చేసాను. మొదలు పెట్టినప్పుడు ఇంత స్పందన వస్తుందని ఊహించలేదు.తొలి ప్రయత్నంగా ఉగాది సందర్భంగా వారం రోజుల పాటు బాలలకు కవి సమ్మేళనం నిర్వహించాను.. అనూహ్యంగా వందకు పైగా బాలలు వచ్చారు. ఆ వయస్సు చిన్నారులు కవిత్వం చెప్పగలరని అసలు ఊహించలేదు. ఆ కార్యక్రమం చాలా విజయవంతం అయ్యింది. కొంత వెన్నుదన్నుగా ఉంటే బాలలు అద్భుతాలు చేయగలరు అన్న స్పూర్తి తో రామాయణంలో నాకు నచ్చిన పాత్ర అన్న శీర్షికతో 6-10 తరగతి విద్యార్థుల కి ఉపన్యాస పోటీ పెట్టాను.. దాదాపుగా 400 మంది చిన్నారులు వచ్చారు. కేవలం రావడమే గాదు, వారికి నచ్చిన పాత్ర పై వారి విశ్లేషణను అత్యంత ఆసక్తికరంగా వివరించారు. ఇతిహాసాలలో వారికి గల ప్రవేశానికి చాలా సంతోషమనిపించింది. చిన్నారులకు ప్రస్తుతం కావలసినది చేయూత. దానిని అందిస్తే ఆ చిన్నారులు అడుగు ముందుకు వేయడానికి సిద్ధంగా ఉన్నారని అర్థమై, ఆత్మ విశ్వాసంతో అడుగు ముందుకు వేయవచ్చునని అనిపించింది. మిత్రులు సహకరించారు. సలహాలు ఇచ్చారు. పెద్దలు దిశానిర్దేశం చేశారు.
ఈ పోటీల వలన చిన్నారులకు మన దేశం గురించి, ఇతిహాసాల గురించి, చరిత్ర గురించి తెలిసే అవకాశం ఉంది. అంతే కాదు, వక్తృత్వ కళలో ఆరితేర గలరు కూడా. మాతృ భాషలో చక్కని ,చిక్కని పద సంపద వారి స్వంత మవుతుంది. మే నెలలో ప్రతీ శనివారం ,ఆదివారం ఈ పోటీలు జరిగాయి. పాల్గొన్న చిన్నారులందరికి ప్రశంసా పత్రాలు ఇవ్వడం జరిగింది. విజేతల చేత మరొక్కసారి అదే అంశం చెప్పించి వీడియో తీసి యూ ట్యూబ్ లో పెట్టడం జరిగింది. తరంగిణి ఆనే ఛానల్ లో వీరి చిరు ఉపన్యాసాలు వినవచ్చును. వచ్చేనెల మహాభారతం మీద ఇదే విధంగా పోటీలు జరుగుతాయి. పోటీలు తిలకించిన పలువురు సాహిత్య వేత్తలు ఇదొక ఉద్యమం లాగా ముందుకు వెళ్లాలని ఆశీర్వదించారు.
అమెరికా వాస్తవ్యులు శ్రీ జొన్నలగడ్డ సుబ్రహ్యమణ్యం గారు ఈ కార్యక్రమం గురించి వినగానే వెంటనే తమ తరపున విజేతలైన చిన్నారులకు నగదు బహుమతిని ప్రకటించారు.వారి సూచన మేరకు విజేతలకు నగదు బహుమతులు ఇవ్వడం జరిగింది కూడా. సుబ్రహ్మణ్యం గారి సహృదయానికి వినమ్ర ప్రణమాలు. బాలలను ఉత్సాహ పరచాలన్న ఉద్దేశ్యంతో ప్రధమ, ద్వీతీయ. తృతీయ నగదు బహుమతులే కాక ప్రోత్సాహక నగదు బహుమతులు కూడా చిన్నారులకు ఇవ్వడం జరిగింది. శ్రీ సుబ్రహ్మణ్యం గారి ప్రోత్సాహం చిన్నారులలోనే గాక కార్యకర్తలలో కూడా ఉత్సాహాన్ని నింపింది. వారికి మరొకసారి కృతజ్ఞతలు.
యువభారతి తమ ప్రచురణలలోచిన్నారులకు ఉపయోగపడే కొన్ని పుస్తకాలను విజేతలైన చిన్నారులకు బహుకరించింది. రాబోయే కాలంలో ఆయా పుస్తకాలు వారి వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడుతాయి.
మయూఖ సంపాదకురాలు శ్రీమతి కొండపల్లి నీహారిణి గారు ఈ కార్యక్రమం గురించి వినగానే ఆ చిన్నారులచే వ్యాసాలు రాయించి ఇస్తే తమ పత్రికలో వేసుకుంటామని హామీ ఇచ్చారు. విజేతలచే చిన్న వ్యాసం రాయించి వారికి పంపడం జరిగింది. వినూతన మైన ఈ ఆలోచన మా విద్యార్థులలో చాలాఉత్సాహాన్ని నింపింది. ఈ నూతన వరవడికి శ్రీకారం చుట్టిన కొండపల్లి నీహారిణి గారికి మా సాహిత్య కుటుంబం ఎంతో ఋణ పడి ఉంది. వారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు. మా చిన్నారుల వ్యాసాలు చదివి ,ఆ వయస్సులో వారికి రామాయణం పట్ల గల ఆసక్తిని, అవగాహనను ఆశీర్వదించండి.
మీ ముందు చిన్నారుల వ్యాసాలు ఉన్నాయి . న్యాయ నిర్ణేతలు మీరే.
******************************************************************
పేరు : మౌక్తిక తటపర్తి
తరగతి : 10
పాఠశాల : సారథి స్కూల్
నగరం : హైదరాబాద్
పాత్ర : మంథర
చరిత్రలో కొందరి జీవితాలను నిశితంగా పరిశీలిస్తే పైకి కనిపించే వారి స్వభావ స్వరూపాలు, ఆంతరంగిక ఆలోచనలు విభిన్నమై అర్థంకాని వ్యత్యాసంతో ఉంటాయి. రామాయణంలో అటువంటి గుణగాలు కలిగిన వ్యక్తి మంథర. తాను నిలువెత్తు చెడుకు ప్రతిరూపంగా నిలిచి లోక కళ్యాణానికి ముఖ్య హేతువయ్యింది.
దశరథుని భార్య అయిన కైకేయితో పుట్టింటినించి వచ్చిన అరణపుదాసి మంథర. కైకేయికి మంథర అంటే వల్లమాలిన అభిమానం. మంథర కైకేయిని విడిచి ఒక్క క్షణం కూడా ఉండేది కాదు. వృద్ధురాలయిన మంథర కైకేయితో చనువుగా ఉంటూ, ఆమెకు అవసరమైనప్పుడు సలహాలిస్తూ, తన మాటను నెగ్గించుకునే స్థాయికి ఎదిగింది. దుర్బోధలు చేయడానికి రామాయణంలో మంథర పాత్ర గొప్పగా రాణించింది. ఆమె గూనిదైనా గొప్ప మాటకారి. కాబట్టే తాను ప్రాణప్రదంగా పెంచుకున్న శ్రీరాముణ్ణి అడవులపాలు చేసే విధంగా కైకేయికి నూరిపోసింది.
శ్రీరాముని పట్టాభిషేకం జరగబోతున్నదన్న వార్త విని అయోధ్యా నగరమంతా ఆనంద శోభ తాండవిస్తున్నది. ఇది చూసిన మంథర కైకేయి దగ్గరకు వెళ్లి ఆ విషయాన్ని చెప్పింది. ఆ శుభవార్త వింటూనే కైకేయి దగ్గరకు వెళ్ళి ఆ విషయాన్ని చెప్పింది. ఆ శుభవార్త వింటూనే కైకేయి ఎంతో ఆనందించింది. తన మెడలోని ముత్యాలహారాన్ని మంథరకి బహూకరించింది. భరతునికన్నామిన్నగా తాను ఎంతో ప్రేమించే రామయ్యకు పట్టాభిషేకం జరుగుతున్నదన్న వార్తకి ఎంతో మురిసిపోయింది. అప్పుడు మంథర, రాముడు రాజైతే కౌసల్య రాజమాత అవుతుంది. అప్పుడు మాతోపాటు నీవు కూడా ఆమెకు దాసివవుతావు. రామునికి నీ కొడుకు దాస్యం చేయాల్సి వస్తుంది. రాముని సంతానానికే తరువాతి కాలంలో రాజ్యాధికారం వస్తుందికానీ భరతుని సంతానానికి రావడం శూన్యం. కనుక భరతునికి రాజ్యాధికారం దక్కేటట్లు, రాముడు అడవులపాలయ్యేటట్లు చూడమని దుర్బోధ చేసింది. దీనికి మంథర ఒక ఉపాయం చెప్పింది. గతంలో దశరథుడు ఇచ్చిన రెండు వరాలను ఇప్పుడు ఉపయోగించుకొమ్మని సూచించింది మంథర. మొదటివరంగా భరతుని పట్టాభిషేకం, రెండవ వరంగా శ్రీరాముడిని పద్నాలుగు సంవత్సరాలు వనవాసానికి పంపమని కోరమన్నది.
ఇలా మంథర శ్రీరామ వనవాసానికి దోహదకారి అయ్యింది. మంథర దుర్భోదలు రామావతార ప్రయోజనం కలిగించాయి. రావణవధకు ఉపకరించాయి. ఋషులను సేవించడానికి అనేకమంది రాక్షసులను సంహరించడానికి రామునికి తోడ్పడ్డాయి. చాలా సంఘటనల్లో అల్ప పాత్రల సృష్టి ద్వారా అధిక ప్రయోజనాలు ఉంటాయన్న దానికి మంథర వృత్తాంతమే నిదర్శనం. అయోధ్య కాండలో ఒక చిన్న పాత్రలో కనిపించే మంథర, రామాయణ కథను నడిపించే సంపూర్ణ పాత్ర అయ్యింది.
******************************************************************
పేరు : బి. చైతన్య కృష్ణా
తరగతి : 10
పాఠశాల : కేంద్రీయ విద్యాలయ
నగరం : తెనాలి
పాత్ర : విశ్వామిత్ర
విశ్వామిత్రులవారి పేరు తెలియనివారు ఉండరు. రామాయణంలో కూడా వీరు మహత్తరమైన పాత్రను పోషించారు. రామాయణంలో విశ్వామిత్రులవారు అయోధ్యకు రాకుమారులైన రామ – లక్ష్మణులను యజ్ఞరక్షణకై తీసుకని వెళ్ళారు. అక్కడ రాకుమారులకు తమ సంపూర్ణ జ్ఞానాన్ని దేవాస్త్రాలను గురించి చక్కగా వివరించి బల – అతిబల వంటి పవిత్రమైన మంత్రాలను కూడా బోధించారు. అంతేకాక అసురులైన తాటకి మారీచ సుబాహు వంటి రాక్షసులను ఎలా సంహరించాలో కూడా నేర్పారు. అంతేకాకుండా శివ ధనుస్సు గురించి తెలిపి సీతాదేవి స్వయంవరానికి తీసుకొని వెళ్ళి సీతారాముల కళ్యాణం జరగడానికి ప్రధానపాత్ర వహించారు.
అసలు విశ్వామిత్రులవారు మహర్షి కాక ముందు ఒక రాజు అప్పుడు ఆయన పేరు కౌశికుడు. అయితే వశిష్ఠులవారితో జరిగిన చిన్న యుద్ధం వలన అస్త్రబలం కంటే దైవబలం చాలా గొప్పదని తెలుసుకొని అలాంటి దైవానుగ్రహం తపస్సును ఆచరించినప్పుడు లభ్యం అవుతుందని గ్రహించి కొన్ని సంవత్సరాల తరపడి తపస్సు చేసి చివరకు బ్రహ్మర్షిగా మారారు.
ఇంకా చెప్పాలంటే బ్రహ్మర్షి విశ్వామిత్రుల వారికి కోపం చాలా ఎక్కువ, ఎప్పుడూ వారికి ముక్కు మీద కోపం ఉండేది. అందరూ వారి కోపానికి భయపడేవారు. కానీ మహర్షి ఎంత కోమి ఉన్నావారు పేరుకి తగ్గట్లు విశ్వానికి మిత్రునివలే విశ్వ –శాంతి కి ప్రపంచ శ్రేయస్సుకు పరితపించెవారు. అంతేకాకుండా వారు బాగా ఆలోచిఁచి కలియుగంలో మనుష్యులు యజ్ఞ – యాగాలు చేయలేరని తలచి మనందరి శ్రేయస్సు కోసం గాయత్రీ మంత్రాన్ని ఉపదేశించారు.
“ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్”
****************************************************************************************************************
పేరు : గిరి ఋతిక
తరగతి : 10
పాఠశాల : సారథి పాఠశాల
పాత్ర : మహా పతివ్రత అహల్య
పెద్దలందరికీ నా నమస్కారములు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులకు, న్యాయ నిర్ణేతలకు నా నమస్సుమాంజలులు – నా పేరు గిరి ఋతిక. నేను పదవతరగతి సారథి పాఠశాలలో చదువుతున్నాను. రామాయణంలోని ముఖ్యపాత్రల్లో ఒకరైన అహల్యను గురించి చెప్పాను.
అహల్య అనే పేరు వినగానే గౌతమ ముని శాపంతో ఆమె రాయిగా మారి, రాముడి పాద ధూళి సోకగానే తిరిగి స్త్రీగా మారిందనే విషయమే స్ఫూరణకు వస్తుంది. కానీ అహల్య వృత్తాంతం భిన్నమైనది.
అహల్య బ్రహ్మ మానస పుత్రిక – అహల్య అంటే అత్యంత సౌందర్యవతి, ఎలాంటి వంకరలేని స్త్రీ అని అర్థం. దేవతలందరూ ఆమెను పరియమాడాలనుకుంటారు. అప్పుడు బ్మహ్మ, త్రిలోకాలను ఎవరైతే ముందుగా చుట్టి వస్తారో వారే అహల్యను వివాహం చేసుకోవడానికి అర్హులని ప్రకటించాడు. దీంతో తన శక్తులన్నీ ఉపయోగించి ముల్లోకాలను తిరిగి వచ్చిన ఇంద్రుడు అహల్యను తనకు ఇచ్చి వివాహం చెయ్యమని కోరుతాడు. అదే సమయంలో నారుదుడు వచ్చి, ఇంద్రుడికంటే ముందుగా గౌతముడు ముల్లోకాలను చుట్టివచ్చాడని చెబుతాడు. అదెలాగా అని ఆశ్చర్యపోతున్న ఇంద్రుడితో – గౌతముడు తన దైనందిన పూజలో బాగముగా గోవుచుట్టూ మూడు ప్రదక్షిణలు చేస్తాడని అలా ఒకరోజు ప్రదక్షిణలు చేస్తుండగా ఆవు లేగ దూడకు జన్మనిచ్చిందనీ, శాస్త్రాల ప్రకారం ఆ సమయంలో గోప్రదక్షిణ చేయడం ముల్లోకాలను చుట్టడంతో సమానమని అందుకే అతనికి ఆ ఫలితం దక్కిందని చెబుతాడు. కాబట్టి అహల్యను గౌతమ మహర్షికి ఇచ్చి బ్రహ్మ వివాహం చేసాడు.
అపార తపశ్శక్తి, మేధాశక్తితో ఇంద్రపదవికి కావాల్సిన సర్వవిజ్ఞానం గౌతముడు పొందాక, ఆయన్ని పరీక్షించడానికి ఇంద్రుడు ఒక పథకం వేసాడు. అందుకు గౌతమ మహర్షి రూపంలో ఇంద్రుడు అహల్య చెందకు వస్తాడు. అలా వచ్చింది ఇంద్రుడేనని తన పాతివ్రత్య బలంతో అహల్య గ్రహించింది. అప్పుడు సత్యం బోధపడిన మునిపత్ని ఇంద్రుణ్ణి వెంటనే అక్కడ నుండి వెళ్ళి పొమ్మని వేడుకుంటుంది. కానీ ఈ లోగ అక్కడకు వచ్చిన గౌతముడు పొరబడి, ఆవేశంలో ఇద్దరినీ శపించాడు. ఇంద్రుడికి దూరం చేశాడు మరియు శరీరమంతా కళ్ళు మొలుచునట్లుగా శపించాడు. “వేలాది సంవత్సరాలు నీవు అన్న పానాదులు లేకుండా వాయుభక్షణతో తపిస్తూ ఈ ఆశ్రమం నందే ఉంటావు. భస్మశాయినిపై ఎవరికీ కనపడకుండా నీలో నీవు కుమిలిపోతూ ఉంటావు. దశరథ నందనుడైన శ్రీరాముడు ఇక్కడకు వచ్చినప్పుడు ఆయన పవిత్రమైన పాదధూళి సోకినంతనే నీవు పవిత్రురాలివవుతావు. ఆయనకు అతిథి మర్యాదలు చేసిన తరువాత తిరిగి నీవు నన్ను చేరుకుంటావు” అని అహల్యను గౌతముడు శపించి హిమాలయాలకు వెళ్ళపోతాడు. గౌతముడు చెప్పినట్లుగానే త్రేతాయుగంలో శ్రీరాముడు తమ గురువైన విశ్వామిత్రుడు, తమ్ముడు లక్ష్మణుడితో కలిసి తాటకను సంహరించిన తరువాత మిథిలా నాగరాధీశుడైన జనక మహారాజుని సందర్శించడానికి వెళ్ళే సందర్భంలో, మిథిలకు సమీపంలో ఉన్న ఒక పురాతన ఆశ్రమాన్ని చూస్తాడు రాముడు. ఈ ఆశ్రమం ఎవరిదీ ఇక్కడ ఎవరుంటారు? అని విశ్వామిత్రుణ్ణి ఆసక్తిగా అడిగాడు రాముడు. అప్పుడు విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు అహల్య ఉదంతాన్ని చెపుతాడు. అప్పుడు శ్రీరాముడు లక్ష్మణుడితో కలిసి గౌతమముని ఆ్రశమంలోకి ప్రవేశిస్తాడు. శ్రీరాముని పాదదర్శనమైనంతేనే అహల్యకు శాపవిముక్తి కలిగింది. ఆమె తన భర్త చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకుంటూ రామలక్ష్మణుల పాదాలకు నమస్కరిస్తుంది. అతిథి మర్యాదలు అయినా తరువాత రాముడి రాకను గ్రహించిన గౌతముడు అక్కడకు చేరుకొని అహల్యా సమేతుడై శ్రీరాముణ్ణి సేవిస్తాడు. “అహల్యా , ద్రౌపదీ సీతా తారా మండోదరి తథా పంచకన్యా స్మరేన్నిత్యం మహా పాతక నాశనం”. అంటే అహల్య, ద్రౌపదీ, సీత, తార మరియు మండోదరి జీవితంలో ఎన్నో కష్టాల కోర్చి పంచకన్యలుగా మారారని మరియు ఈ అయిదు మహాపాతి వ్రతులను రోజూ తలుచుకుంటే మన పాపాలు తొలగిపోతాయని అర్థం. ఈ శ్లోకంలో ద్రౌపది తప్ప తక్కిన నలుగురు రామాయంకు చెందినవారే! అహల్య తన పాతివ్రత్యంతో, పవిత్రతతో పంచకన్యల్లో మూడవ స్థానం సంపాదించుకోగలిగింది. వాల్మీకీ రామాయణం, రంగనాథ రామాయణం మరియు అనేక రామాయణాలలో అహల్య వృత్తాంతం వేరుగా ఉన్నప్పటికీ, వాటి సారాంశం అహల్య పాతివ్రత్యం గురించి, పవిత్రతను గురించే చెపుతాయి.
******************************************************************************************************************
పేరు : సుధాత్రి వాల్మీకం
తరగతి : 10
పాఠశాల : గీతాంజలి దేవాశ్రయ్ పాఠశాల
పాత్ర : సుమిత్ర
నా పేరు సుధాత్రి వాల్మీకం. నేను గీతాంజలి దేవాశ్రయ్ పాఠశాల, సికింద్రాబాదంలో పదవ తరగతి చదువుతున్నాను. మా నాన్నగారి పేరు వి.సునీల్ కుమార్ మరియు మా అమ్మగారి పేరు వి.స్రవంతి.
జాతీయ సాహితీ పరిషత్తు నిర్వహించిన వక్తృత్వ కార్యక్రమంలో “రామాయణం – వ్యక్తుల పాత్రలు” అనే అంశంపై రామాయణములో నేను ఎంచుకున్న పాత్ర సుమిత్ర మాత….
సుమిత్ర చలించని దీపకాంతి లాంటిది. తను కాశీ రాజ్య రాకుమారి… దశరథుని రెండవ భార్య. లక్ష్మణ, శతృఘ్నల తల్లిగారు.
విన్రమత, శ్రద్ధ, దృఢత్వం, నిష్టత, ఓర్పు, నిశ్చల స్వభావం ఇవన్నీ సుమిత్ర మాత సుగుణాలు… ఇంకా చెప్పాలంటే తన పేరులోనే వ్యక్తిత్వం అంతా మనకు అవగతం అవుతుంది. సు + మిత్ర అంటే మంచి స్వభావం కలది. తను అందరికీ మంచి బోధించేది తోడికోడళ్ళ పట్ల సమభావంతో మెలగి ఎల్లవేళలా మౌనంగా ఉండేది. కౌసల్య చెప్పిన మాట తనకు వేదం…. లా భావించేది. బాల్యం నుంచే అలవరచుకున్న మంచి గుణములు, మౌనంగా ఉండి చురుగ్గా ఉండటం. తన పిల్లల మీదే కాకుండా రాముడు, భరతునిపై కూడా సమ వాత్సల్యం చూపేది. ఆ కుటుంబంలో అందరినీ కలుపుకుంటూ, చక్రాల మధ్య ఇరుసు లాగా ఒక ముఖ్యపాత్ర వహించేది. దశరథుడు ఎంత కిష్టమైన సమస్య వచ్చినా సుమిత్రను సంప్రదించేవారు. సుమిత్ర మంచి గ్రహణశీలి ఇంకనూ చాలాముందు చూపు గలది. రామలక్ష్మణ భరత శతృఘ్నలు లోక కల్యాణం కొరకై జన్మించారని ముందే గ్రహించింది. నొప్పించక తానొవ్వక ఉండే మనస్తత్వం ఆమె వ్యక్తిత్వానికి పూర్తి భిన్నంగా ఉండేది. రాముడు వనవాసానికి వెళ్తున్నాడని తెలిసి కౌసల్యా దేవి బాధలో ఉన్నప్పుడు ఓదార్చి ధైర్యం చెప్పింది. లక్ష్మణుడు తాను కూడా రాముని వెంట వనవాసానికి వెళ్తాను అన్నప్పుడు, సౌమిత్రిని ఆశీర్వదిస్తూ ఇలా అన్నది.
‘రామ మశరథం విది, మామ్ విది జనకాత్మజా
అయోధ్య అటవిం విద్ధి, గచ్చ తాత యధా సుఖం’
అంటే రాముడిని తండ్రిలా, సీతమ్మను తల్లి లా, అడవిని అయోధ్య లా భావించి అన్నా వదినలకు సేవ చేయాలని చెప్పింది. ఇంతటి సుగుణవతి, త్యాగనిరతి కలిగిన సుమిత్ర మాతకు నా వందనములు. ఇన్ని మంచి గుణములు ఉండి, సౌమ్యానికి మారుపేరుగా ఉండే సుమిత్ర ఆదర్శ మాతగా, పత్నిగా నిలిచింది.
చివరిగా సుమిత్ర జీవితం నుంచి మనం నేర్చుకోవలసింది చాలా ఉంది. మొదటిది సాధ్యమైనంత మౌనంగా ఉండడం… ఇది మనకు తెలిసిందే. అవసరమైనంత వరకే మాట్లాడటం, మిగతాది చేతల్లో చూపించడం అనే లక్షణం చాలా మంచిది. అదే అవసరం కూడాను. రెండవది ఓర్పు కలిగి ఉండటం. ఓపిక అనేది ప్రతి మనిషికి ఉండవలసిన లక్షణం. ఓపికతో చేసే ప్రతి పనిలో కార్యసిద్ధి కలుగుతుంది. ఇదే కాకుండా రామాయణంలోని ప్రతి ఒక్కరి పాత్ర మన జీవితంలో ఏ విధంగా నడుచుకోవాలో నేర్పుతుంది. రామాయణంలో సుమిత్రదేవి వంటి పుణ్యమూర్తి గురించి మాట్లాడేందుకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదములు… శుభం భూయాత్…!!!
******************************************************************************************************************
పేరు : రొంపిచర్ల ఖ్యాతి శ్రీ
తరగతి : పదవతరగతి
పాఠశాల : ఏ.ఏ.ఎన్.ఎం.అండ్ వి.వి.ఆర్.ఎస్.ఇంగ్లీష్, మీడియం, హైస్కూల్, గుడ్లవల్లేరు, కృష్ణాజిల్లా, ఆంధ్రప్రదేశ్
పాత్ర పేరు : తార
శ్రీ గురుభ్యోన్నమః సభకు నమస్కారం. నా పేరు రొంపిచర్ల ఖ్యాతిశ్రీ. నేను ఏ.ఏ.ఎం. అండ్ వి.వి.ఆర్.ఎస్.ఆర్.స్కూల్ గుడ్లవలేరు. విన్నకోట గ్రామం కృష్ణాజిల్లా ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చాను. నేనిప్పుడు రామాయణంలోని తార పాత్రను గురించి చెప్పదలుచుకున్నాను.
మనిషి ఎక్కడ ఎలా ప్రవర్తిఁచాలో, ధర్మాన్ని ఎలా అనుసరించాలో ధర్మాన్ని పట్టుకున్నవారు ఎంత గొప్పవారు అవుతారో యుగాలు మారినా శ్రీరామచంద్రమూర్తి జీవిత వృత్తాంతం నేటికి పసిపిల్లలు కూడా తమ తల్లుల చేత రామాయణ కథగా వినిపించబడుతోంది. అందులోని పాత్రలు స్వభావాలు నేటి మానవాళికి మచ్చుతునకలు. రామో విగ్రహవాన్ ధర్మః సత్యధర్మ పరాక్రమః అనగా రాముని వంటి ఆదర్శమూర్తి రామాయణం వంటి ఆదర్శ కావ్యం నభూతో న భవిష్యత్.
కిష్కింధకు వానర రాజైన మహాబలవంతుని వాలి భార్య తార. బృహస్పతి కుమారుడైన తారూడి కుమార్తె తార. రామాయణంలో అన్నదమ్ముల అనబంధం గురించి రాముని గొప్పతనం గురించి ఎంత గొప్పగా మాట్లాడుతుందో ఎందుకు పెట్టారో మహర్షి ఆ పేరు తార అంటే నక్షత్రం. తళుక్కుమంటుంది. రామాయణంలో నిజంగానే తళుక్కుమంటుంది.
తారపాత్రలో నాకు నచ్చిన అంశాలు :
- వెలుగులాంటి తార, గ్రహణం నాడు సూర్యుడు తన కాంతిని ఎలాగైతే కోల్పోతాడో అలా కోల్పోబడుతున్న కాంతిని తన ఎదురుగా నిలబడి ఉన్న తన భర్తయందు చూస్తుంది.
- సుగ్రీవుడు తొందరపడి ఏ తప్పు నిర్ణయం తీసుకోడని గమనించకుండా ఎవరితోనూ స్నేహం చేయడనీ దృఢసంకల్పం కలిగి ఉంది.
- నినాదస్య నసం బ్రహ్మోనైవదలపం వికారణం. ఏ కారణం లేకుండా తన తమ్ముడు యుద్ధానికి మళ్ళీ రాడని నెత్తురోడుతు వచ్చిన సుగ్రీవుడు తన భర్త అయిన వాలిని యుద్ధానికి ఆహ్వానించినప్పుడు అతని కంఠం నండి వచ్చిన సింహనాదాన్ని, అతని ముఖంలోని ఉత్సహాన్ని ఉద్యమం లాంటి తొందరని ముందుగానే గ్రహించి తన భర్త వాలిని ఇప్పుడు యుద్ధానికి వెళ్ళవద్దని హెచ్చరించింది.
- తము్మడితో యుద్ధం వద్దని హితబోధ చేసింది.
లాలనియోహితే భ్రాత అదియాయసనవనరహ అనగా తమ్ముడు నీ కంటే చిన్నవాడు నీకు కొడుకులాంటివాడు పైగా వానరుడు తప్పు చేస్తే చేసాడో అనుకో మందలించు, లాలించు అయినా వినకుండా నీ నుండి దూరంగా వెళితే అది వాడి కర్మ.
- తన మెరుపులాంటి బుద్ధిబలంతో శ్రీరామచంద్రుని ఆశ్రయించిన వారిని నిగ్రహించే శక్తి తన భర్తకు లేదని ముందే గ్రహించిన ప్రజ్ఞావంతురాలు.
- గత జన్మలో ఎంతో పుణ్యం చేసి ఈశ్వరుని అనుగ్రహం పొందినవారికే ఈశ్వరుని స్వరూప జ్ఞానం భాసిస్తుంది. రాముని గొప్పతనం గురించి ఒక్క శ్లోకం చెప్పడంవల్ల తార రామాయణంలోని కిష్కింద కాండలో జాజ్వల్యమానమైన స్థానాన్ని పొందింది. నివాస వృక్ష సాధూనాం ఆపన్నా నం పరాగతి హే ఆర్ తానం సముశ్రేచెయ్ వా ఎస్ సై క భాజనం. ఆహా! ఎంత గొప్పగా చెప్పింది. ఆ తల్లి! శ్రీరామచంద్రుడు నమ్మకున్నవారి పాలిట మహావృక్షం వంటివాడు. ఎవరైతే ఆ మహావృక్షం మూలాలను చేరుకుంటారో అనగా శ్రీరామచంద్రుని పాదాలను ఎవరైతే ఆశ్రయిస్తారో వారు ఉత్తమ కీర్తులను పొందుతారు. ఒక మహావృక్షం అది నీడనిచ్చేటప్పుడు నువ్వు నేను, ధనిక పేద, మంచి చెడు, స్త్రీ పురుష, తారతమ్యాలను చూపకుండా నీడనిస్తుంది. అలాంటి మహావృక్షం ఈ లోకంలో మరొకటి ఉంది అని అనుకుంటున్నావ్ ఏమో! లేదు . నీ తమ్ముడైన సుగ్రీవుడు శ్రీరామచంద్రుడు అనే కీర్తిని పెంపొదిస్తుంది అని చెప్పిన హితబోధ నాకు బాగా నచ్చింది. తార జీవితం నుండి మనం నేర్చుకున్న సందేశం : ప్రతి పురుషుని విజయం వెనుక స్త్రీ పాత్ర ఉంటుందనన్న విషయం మనందరికీ ఇనుమడించబడుతుంది. ఇలా చెయ్యని వారి కీర్తి నశించి పతనం అవుతారు.
ధన్యవాదాలు
******************************************************************************************************************
పేరు: S.Rimi chaturya
తరగతి : పదవతరగతి
పాఠశాల : Pioneer Concept School
పాత్ర పేరు : మేఘనాథుడు
ఎవ్వరికీ తెలియని ఒక వీరుడి కథను నేను మీకు తెలియజేయబోతున్నాను. ఇక కథలోకి వెళితే రావణాసురుడు”మేఘనాథుడు దేవతలను ఓడించాలంటే సర్వశక్తి సంపన్నుడవ్వాలి. ఒంటిచేతితో లక్షలాది సైన్యాన్ని మట్టికర్పించాలి.” దానికి తగిన సమయం ఇదేనని భావించి మేఘనాథుడిని పంనెండేళ్ళ వయసులో శుక్రాచార్యుడి వద్దకు శిష్యుడిగా పంపుతాడు. మేఘనాథుడు ఇరవై ఐదేళ్ళ వయసొచ్చేసరికి ఎవ్వరికీ సాధ్యంకాని అస్త్ర విద్యలను, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అవతారామైన పరశురామ ప్రభుకే సాధ్యం కాని ఆయుధాలను, ఎవ్వరికీ కనబడకుండా యుద్ధం చేయగలిగే మాయా విద్యలను అవలీలగా సాధించి ఎప్పుడేప్పుడు దేవతల మీదికి యుద్ధానికి వెళ్ళదామా అన్నట్టు ఎదురుచూస్తున్నాడు. సరిగ్గా అదే సమయంలో రావణుడు దేవతల మీద యుద్ధం ప్రకటిస్తాడు. ముందుగా ఎవరైనా శత్రువులు దేవలోకంలోకి ప్రవేశించాలంటే నాలుగు దశాలను దాటవలసి ఉంటుంది. మొదటగా “కోటచుట్టూ ఏడు కిలోమీటర్ల మేర భయంకరమైన మొసళ్ళతో నిండిన నీళ్ళు ఉంటాయి.” రెండవది “ఎనిమిది వందల అడుగుల ఎతైన గోడలు ఉంటాయి”. తృతీయది” మూడు వందల అడుగుల గోడలకి అక్కడక్కడ నూనె పోసి నిప్పు పెట్టి ఉంచుతారు.” మూడు దశలను దాటితే “ఇక అప్పుడు దేవతలతో యుద్ధం చేయవచ్చు.”ఇంతటి చిక్కుదట్టమైన భద్రతలను అసురులు ఎన్నటికి శ్చేధించలేరని ఇంద్రుడు కాలుమీద కాలు వేసుకొని కూర్చున్నాడు.అప్పుడు మహేంద్రుడి సేనాధిపతి వచ్చి “ప్రభు! అసురులు మనపైకి దండెత్తి వస్తున్నారు. వాళ్ళు ఇప్పటికే రెండు దేశలను దాటేసారు.” అని చెప్పగానే ఇంద్రుడు ఆశ్చర్యానికి లోనవుతాడు. ఆ! ఇది అసంభవం. వాళ్ళు ఎలా వచ్చారు? అయినా వాళ్ళు రెండు దేశలను చాటేస్తుంటే మన సైన్యం అంతా ఏం చేస్తున్నారు.అని బయటికి వచ్చి చూస్తాడు. అసురులు త్రిపుర విమానంపై వస్తుంటారు. అది చూసిన ఇంద్రుడు మళ్ళీ ఆశ్చర్యానికి లోనవుతాడు. ఇక చేసెదేమీ లేక యుద్ధాన్ని కొనసాగించమని ఆజ్ఞాపిస్తాడు. ఇక ఇంద్రుడి ఆజ్ఞ మేరకు ఇంద్రుడి సేన కనిపించిన అసురులందరిని క్షణాల్లో మట్టికర్పిస్తారు.కొందరు ఎతైన గోడల మీది నుండి అసురులపైకి బాణాల వర్షం కుర్పిస్తారు. మరికొందరు మూడవ దశను దాటనివ్వరు. కొద్ది క్షణాలలో లక్షలాది సైన్యాన్ని మట్టికర్పిస్తారు.ఏం చేయాలో దిక్కుతోచక అసురులు మలమలా మాడిపోతారు.అప్పుడు అసురులు లంకేశునితో ఇలా అంటారు.”ప్రభూ!మా కోసమే జన్మించిన వీరుడెక్కడ? మమ్మల్ని రక్షించే మా దేవుడెక్కడ?”అని అడుగుతారు. అప్పుడు దశకంఠుడితో సహా అసురులందరి నోట ఒకే మాట “మేఘనాథా” అని. మేఘనాథుడు వచ్చీ రాగానే ఎతైన గోడల మీద అసురులపైకి బాణాల వర్షం కురిపిస్తున్న సైనికులను చంపేస్తాడు.దేవతలపై ఒకేసారి పంనెండు బాణాలను సంధిస్తూ దేవతలకు ముచ్చెమటలు పట్టిస్తాడు.రెప్పపాటు సమయంలో ఇంద్రుడి సేనను ముక్కలుముక్కలుగా చీల్చిచెండాడుతాడు.ఇంద్రుడు ” మేఘనాథా! పిరికివానిలా దాక్కోని నా సేనను దెబ్బతీయడం కాదు.నీకు దుమ్ముంటే నా ముందుకు వచ్చి నాతో యుద్ధంచేయి” అని అంటాడు. అప్పుడు మేఘనాథుడు “ఇంద్రా! నేను నీ ముందే ఉన్నాను. పైకి చూడు అని బాణంతో ఇంద్రుడి కిరీటాన్ని కొడతాడు.అది సరిగ్గా మేఘనాథుడి కాలి కింద పడుతుంది.మేఘనాథుడు”ఇంద్రా! బుక్కెడునువ్వింకా నా మొఖం కూడా చూడలేదు. కానీ, అప్పుడే నీ మకుటం నా కాళ్ళ కింద కొట్టువిట్టాడుతుంది.ఇక నువ్వేంనాతో యుద్ధం చేయగలవ్. సరే, నువ్వు నీ మకుటాన్ని నీ సిరస్సుపై పెట్టుకుంటే నేను ఈ అమరావతినే వదిలి వేళ్ళిపోతా” అని సవాల్ విసురుతాడు. కొపంతో ఇంద్రుడు వజ్రాయుధాన్ని ప్రయొగిస్తాడు. అది రావణుడికి తగులుతుంది. రావణుడు స్ప్రూహ కోల్పోతాడు.మేఘనాథుడు కోపంతో ఇంద్రుడిని ఒక్క దెబ్బ కొట్టగా ఇంద్రుడు ఎనిమిది కీలోమీటర్ల దూరంలో పోయి పడతాడు. యుద్ధం ముగిసిన తర్వాత ఇంద్రుడిని బంధించి లంకకు తీసుకుని వెళ్తడు. బ్రహ్మ వచ్చి ఇంద్రుడిని విడిచి పెట్టు, దానికి బదులుగా నువ్వు ఎదైన వరం కోరుకో.అప్పుడు మేఘనాథుడు తనకు ఛావులేని వరం కోరతాడు. అప్పుడు బ్రహ్మదేవుడు మేఘనాథా ఇది సృష్టి విరుద్ధం. ఈ భూమి పై జన్మించిన ప్రతి ఒక్కరూ మరనించక తప్పదు. కాని నీవు అడుగుతున్నావు కాబట్టి నీకు ఒక వారాన్ని ప్రసాదిస్తున్నాను. “నీవు ఏ రోజైతే యుద్ధానికి వెళ్తావో ఆ రోజు సూర్యోదయానికి ముందే నీకు ప్రీతిబద్దమైన నికుంబలాదేవికి యాగం చేసి వేళితే ఆ రోజు నీవు అమరుడవు. నిన్ను ఎవరు ఓడించలేరు.కాని యాగం భజ్ఞం కాకూడదు. అని చెప్పి బ్రహ్మాస్త్రాన్ని భహుకరించి , నీవు ఇంద్రుడిని ఓడించావు కాబట్టి నీవు ఇకనుండి ఇంద్రజిత్తుగా ప్రసిద్ధి చెందుతావు.అని చెప్పి బ్రహ్మ వెళ్ళిపోతాడు. ఇక ఈ కాథను బట్టి మనం అర్థం చేసుకోవాలి మేఘనాథుడు ఎంతటి వీరుడని. యుద్ధరంగంలోకి దిగిన ఒక నిమిషం ముపైఏడు క్షణాల్లో యుద్ధాన్ని ముగించాడంటే ఎంతటి శూరుడో అని.
పేరు : శ్రీ కౌస్తుభ
తరగతి : 9
పాఠశాల : KT.School, Pargi
నగరం : Vikarbad Dist.
పాత్ర : కవికోకిల వాల్మీకి
కవిత్వమనే అరణ్యంలో వాల్మీకి అనే సింహం సంచరిస్తుంది. ఆ సింహం రామగాథను గర్జిస్తుంది. ఆ సింహంలో కోకిల సుస్వరం కూడా వుంది. వాల్మీకికి సింహంలాగా గాంభీరంగ చెప్పడమే కాకా కోకిలలా మధురంగా చెప్పడం కూడా అలవడింది. శారద కల పండింది, మన జన్మతరించింది.
బ్రహ్మశాపంవలన వాల్మీకి ప్రాచేతసుని కుమారుడైన బోయగా జన్మించారు. రామనామ స్మరణవలన శాపవిమోచనం కలుగుతుందని చెప్పారు బ్రహ్మ. ఆ బోయ పేరు “రత్నాకరుడు”. ఎన్నో పాపాలు చేస్తూ ఒక బోయ స్త్రీని వివాహం చేసుకున్నాడు. వచ్చే ప్రయాణీకులని అడ్డగించి వారిని హింసిస్తూ వారి ధనాన్నిఅపహరిస్తూ తన కుటుంబాన్ని పోషించేవాడు. ఒకరోజు రత్నాకరుడు సప్తఋషులను కూడా ఆపటానికి వెళ్ళాడు. అంతలో వారు అతణ్ణి ఆపి ఇలా అన్నారు, ‘ఓ బోయవాడా నీవు నీ కుటుంబం కోసం ఇన్ని పాపాలు చేస్తున్నవే మరి వారు నీ పాపాలలో భాగాన్ని తీసుకుంటారా? నీవు కనుక్కుని రా మేము నీ కోసం ప్రతిక్షిస్తాము’ అనగానే రత్నాకరుడు తన యింటికి బయలుదేరాడు.
ఇంటికి చేరుకున్నాక అతని భార్యతో ఇలా అన్నాడు ‘నేను నా పాప రాశులను పంచదలచాను నీవు భాగాన్ని తీసుకుంటావా?’ అని అడిగాడు. వెంటనే అతని భార్య ‘మమ్మల్ని పోషించడం మీ కర్తవ్యం, కనుక నేను ఎలాంటి భాగాన్నీ తీసుకోలేను’ అని నిర్మొహమాటంగా చెప్పడంతో విరక్తి చెందిన రత్నాకరుడు సప్తఋషులను తరుణోపాయం అడిగాడు.
సప్తఋషులు అతనికి రామతారక మంత్రాన్ని బోధించారు. రత్నాకరుడు ఎన్నో సంవత్సరాలు రామనామాన్ని స్మరిస్తూ తపస్సులో లీనమై ఉన్నాడు. అతనిపై వృక్షాలు, పుట్టలు మొలిచాయి.
ఒకరోజు నారాయణుడు అతని భక్తుడైన నారదునికి రామావతరం గురించి చెప్పారు. ఆ వార్తని గుప్తంగా ఉంచమని ఆదేశించారు. కానీ వార్తను పట్టలేకపోయాడు నారదుడు. దారిలో వెళ్తూ ఉండగా అక్కడ కనిపించే పుట్టపక్కన ఉన్న వృక్షాలకు రామకథను వివరించాడు. ఆ కథ పుట్టలో ఉన్న రత్నాకరుని మనసులోకి ప్రవేశించింది. “వాల్మీకం” అనగా పుట్ట అని అర్థం అలా పుట్టలో ఉండి రామగాథని హృదయంలో స్థాపించుకున్నందుకు రత్నాకరుడు “వాల్మీకి మహర్షి”గా మారిపోయాడు.
శ్రీరాముని పాత్రను లోకోత్తర పురుషునిగా, ధర్మమూర్తిగా వాల్మీకి మహర్షి తీర్చిదిద్దారు. లోకంలో ధర్మస్థపానకై రామాయణాన్ని మాధ్యమంగా ఉపయోగించేవారు. రాముని మహోన్నత గుణాలను కళ్ళకు కట్టినట్టు రచించి ఎన్నో ఆదర్శాలను స్థాపించారు. భారత సంస్కృతిలో భాగమైన ఉమ్మడి కుటుంబ వ్యవస్థ.
పితృవాఖ్యా పరిపాలన, రాజధర్మాలు, ధర్మరక్షణ, దుష్టశిక్షణ, సాధురక్షణ లాంటి ధర్మాలన్ని రామాయణం ద్వారా మనకి వాల్మీకి ప్రసాదించినవే. అంతేకాక స్వయంగా వాల్మీకి రామాయణంలో ఒక భాగం. సీతమాత తన వనవాస సమయంలో వాల్మీకి ఆశ్రమంలో నివసించేది. వాల్మీకి సీతమ్మను కూతురిలా చూసుకున్నాడు. ఒక పుత్రునిలా సేవించాడు.
సత్వగుణ ప్రవృద్ధి కోసం వాల్మీకి రామాయణాన్ని రచించాడు. ఈనాటికి రామరాజ్యం అనే మాట ఒక ఆదర్శ రాజ్యంలా నిలిచిపోయింది. హనుమంతుడు, శబరి, జాంబవంతుడు, జటాయు, సుగ్రీవుడు వంటి పాత్రలను అద్భుతంగా చిత్రీకరించి వాటికి శాశ్వతత్వాన్ని అందించారు. ఇలాంటి ఆదర్శ కావ్యానికి కారణం క్రూర రత్నాకరుడి నుండి పరివర్తన చెందిన ఆదికవి వాల్మీకి మహర్షి మాత్రమే.
“బోయవాని కులం నుండి జాలువారిన రామకథ ఈనాటికి భారతీయుల హృదయాలో ఆరని జ్యోతిలా వెలుగుతూనే ఉంది”. రామాయణాన్ని రచించి నిజమైన ధర్మాన్ని చూయించిన వాల్మీకి నీకు వేవేల వందనాలు. ఆ గాథను ఆదరించి పూజించిన భారతీయులందరికీ వందన శ్రీ చందనాలు.
జై శ్రీరామ్.