పాత్రలు
గురువు – ధౌమ్య ముని
శిష్యులు – అరుణి, వేదా, ఉపమన్యు
తెరవెనుక – సూత్రధారి
ద్వాపర యుగాంతంలో ధౌమ్యుడనే ఋషి ఉండేవాడు. అతనివద్ద వేదాభ్యాసము చేస్తూ ముగ్గురు శిష్యులుండేవారు. అందులో ఒకడు అరుణి, రెండవవాడు వేదా. ఇతనిని బైదుడు అని కూడా అంటారు. మూడవవాడు, అందరికన్నా చిన్నవాడు ఉపమన్యు. విద్యాభ్యాసం కోసం వారు ముగ్గురూ గురువును సేవిస్తూ ఉండేవారు. ఆ కాలంలో గురువులు ముందుగా శిష్యుల అంతఃకరణంలో భక్తిని పరీక్షించి వారిపై కృప చూపి, వారికి విద్యనేర్పేవాడు. ఈ గురుశిష్యుల కథనే నాటికగా రూపొందించాను. ఈ కథ మహాభారతం మొదటి పర్వంలోనిది (ఆదిపర్వం).
ఈ నాటికను 5 తరగతి నుండి 8వ,9వ తరగతివరకు వేయవచ్చు. గురువు పాత్ర 9,10వ తరగతి విద్యార్థులు వేస్తే బాగుంటుంది.
మొదటి ఘట్టమం
తెర తోలుతుంది. ముందుగా ఆశ్రమ వాతావరణం కనపడుతూ ఉంటుంది. పర్ణకుటీరము, పచ్చని చెట్లు, లేళ్ళు, కుందేలు, పక్షులు, పూల మొక్కలు ఉంటాయి. రంగస్థలంపైన అయితే తెరద్వారా వాతావరణం చూపించాలి.
T.V.లో అయితే సెట్టింగ్స్ ద్వారా చూపించవచ్చు. రేడియోలో అయితే వాయిదాల సహకారంతో పక్షుల కిలకిల రావాలు మొదలైనవి వినిపించవచ్చును.
ధౌమ్యముని : (పద్మాసనుడై కూర్చొని ఉంటాడు)
నాయనా అరుి ఇలా రా నాయనా
అరుణు: పిలిచారా గురువుగారు (లోపల నుండి రంగస్థలంపైకి పరిగెత్తుకొస్తాడు)
ధౌమ్యముని : ఈ రోజు నీవు మన పొలానికి వెళ్ళి చెరువులోని నీరు పొలానికి మళ్ళించు, వెంటనే వెళ్ళు.
అరుణి : ఆజ్ఞ. గురువుగారు ఇప్పుడే వెళ్తున్నాను (రంగస్థలంపై నుండి లోపలికి వెళ్లిపోతాడు)
(తెర ద్వారా పొలం చూపించాలి. చెరువులో నీరు చూపించాలి. నీటి శబ్ధము వాయిద్యాల సహకారంతో చూపించాలి)
అరుణి పొలం దగ్గరకు వెళ్ళి చూస్తే అక్కడ పొలం మధ్య గుండా ఒక కాలువ ప్రవహిస్తూ ఉంది.
అరుణి: (ఆశ్చర్యముఖంతో – స్వగతం) (సంభాషణ బయటకు వినబడాలి)
ఆ ఇదేమిటి పొలంలో నీరు ఇలా ప్రవహిస్తుందేమిటి? అయ్యో ఇప్పుడేం చెయ్యాలి? (కొంచెంసేపు ఆలోచిస్తూ అటూ, ఇటూ తిరుగుతాడు). ఆ ఇక్కడేదో పెద్ద బండలా ఉఁదే. అవును బండే. ఈ బండను ప్రవాహానికి అడ్డంగా పెడ్తాను.
(బండను వేదికపై ముందే అమర్చి పెట్టుకోవాలి (అట్టతో తయారుచేసినది) )
(అయినా కూడా ఈ బండను నెటే్టసి నీరు ఉధృతంగా ప్రవహిస్తూనే ఉంటుంది)
అయ్యో! నీరు ఆగడం లేదే ఎట్లా?
(కొంచెంసేపు అటూ ఇటూ తిరుగుతూ ఆలోచిస్తాడు)
ఆ ఇక్కడ గడ్డిమోపును అడ్డంగా వేస్తాను.
(అరుణి ముఖం సంతోషంగా ఉంటుంది)
గడ్డి మోపును అడ్డంగా వేస్తాడు.
(అయినా నీరు ప్రవహించడం ఆగలేదు)
భగవంతుడా శ్రీహరీ నీవే ఏదైనా దారి చూపించు. గురువుగారు చెప్పిన పని పూర్తి చేయలేకపోతున్నాను. నీటి ప్రవాహం ఆపలేకపోతున్నాను. పొలం అంతా నీటితో మునిగిపోతుంది.
ఏడుస్తూ ఓ చెట్టుకింద చతికిలబడిపోతాడు)
(మళ్లీ కొంతసేపటికి లేచి కళ్ళ నీల్లు తుడుచుకుని ఇలా తన మనసులో అనుకుంటాడు).
ఏమైనా సరే గురువుగారి ఆజ్ఞను పాటించాల్సిందే. అందుకు నా ప్రాణాలు పోయినా సరే. (నిర్ణయించుకుంటాడు)
(మనసులో గురువుని ఇలా ధ్యానించాడు)
గురుః బ్రహ్మ గురుః విష్ణు
గురుదేవో మహేశ్వరః
గురుసాక్షాత్ పరబ్రహ్మ
తస్మై శ్రీ గురవే నమః
రెండు చేతుల్తో పక్కనున్న తీరాన్ని పట్టుకొని, రెండవవైపు తన పాదాలు పెట్టి నీటికి అడ్డుగా పడుకొన్నాడు.
(ఈ విధంగా చేయగానే పొలం లోనికి ప్రవహించే నీటి ప్రవాహ వేగం కొంత తగ్గింది. అరుణి మాత్రం నీటిలో మునిగిపోయాడు. తల మాత్రం బయట ఉంది).
ఆహా నాదెంత భాగ్యము. ఎలాగైతేనేం గురువుగారు చెప్పిన పని చేయగలిగాను. ఇక నా ప్రాణం పోయినా నాకే బాధ లేదు.
(సెట్టింగ్ మార్చాలి)
(ఆశ్రమ వాతావరణం)
ధౌమ్యముని : (అటూ ఇటూ తిరుగుతూ ఆలోచిస్తాడు.)
పగలు గడచిపోయింది. చీకటి పడ వస్తూంది. అరుణి ఇంకా రాలేదేమిటి? (ఆందోళనగా)
ఎందుకైనా మంచిది. ఒక్కసారి పొలం దగ్గరకు వెళ్ళి చూసొస్తాను.
(పొలానికి వెళ్తాడు అక్కడ శిష్యుడు కనబడడు)
అరుణీ అరుణీ (పిలుస్తాడు)
అయ్యో అరుణి ఏమయ్యాడు? అతన్ని ఏ క్రూరమృగమో తినెయ్యలేదు కదా! (మనసులో)
నాయనా అరుణీ (ఇంకా గట్టిగా పిలుస్తాడు) ఎక్కడున్నావు నాయనా.
అరుణి: గురువుగారూ నేనిక్కడ అంటూ పరుగెత్తుకొని వస్తాడు (బట్టలు తడిచి ఉంటాయి).
ధౌమ్య : (ప్రేమతో అతన్ని ఆలింగనం చేసుకుంటాడు). అరుణీ తడిచిపోయావా నాయనా. ఎంత పని చేశావు నాయనా. గురువు మాట కోసం నీ ప్రాణాలమీదికే తెచ్చుకున్నావా? (గద్గద స్వరంతో)
శిష్య శిఖామణీ నీకు వేదశాస్త్రం, వ్యాకరణాది విషయాలు అన్నీ ధారపోస్తాను. రా నాయనా మన ఆశ్రమానికి వెళదాం.
(ఇద్దరూ ఆశ్రమానికి వచ్చేస్తారు)
(తెర వెనుక : అరుణికి సకల విద్యలూ అబ్బిన తరువాత వివాహ యోగ్యుడైన తరువాత గురువుగారు అతన్ని ఆశీర్వదించి గృహస్థాశ్రమం స్వీకరించమని ఇంటికి పంపిస్తాడు).
…………………
ఇంద్రధనుస్సు
టేక్స్
కేవలం
జీతానికే
టే్క్స్ కదా అని
చంకలెగరెయ్యకు-
జీవితానికి కూడా
టేక్స పడే రోజొకటి
వస్తందున్న
విషయం మరిచిపోకు
ఆస్తి – నాస్తి
ఎయిర్ కండిషన్ గదులూ
త్రీ యేసెస్ బార్ లు
లెక్సెస్ – యన్ – యక్సీ కార్లు
మఖ్ మల్ కుషన్ పరుపులు
బొచ్చుకుక్కలు
ఆస్తికుని ఆస్తికత్వం-
మురికివాడలూ
కూలన గోడలు
పేవ్ మెంట్లు
మెట్లోషల్టర్లు
గజ్జికుక్కలు
నాస్తికుని ఆస్తికత్వం
వ్యక్తిత్వం
నిధి నిక్షేపాలు
ధన కనకాదులు
స్థిరమైన పాలరాతి
సౌధాల కంటే
సుస్థిరమైన ధనం
దృఢమైన సౌధం
తనకు తాను
నిర్మించుకున్న
వ్యక్తిత్వం
సజెషన్
ఆకులు రాలేకాలంలో
ఆమని వచ్చిందని అరవకు
కాకుల అరుపులు విని
కోయిల కూసిందని రాయకు-
ఎండమావులను చూసి
గలగల గోదారి
సెలయేరులా పారిందని
ఊహల్లో విహరించకు-
వేదికలపై నాయకుల
వాగా్దనాలు విని
చైతన్యం వచ్చిందని
చెత్త సాహిత్యాన్ని
గుప్పించకు
ఈ సంచికలో మనం విద్వాంసుల తీరు ఏ విధంగా ఉంటుందో భర్తృహరి నీతి శతకం ద్వారా తెలుసుకుందాం.
శ్లో|| దాక్షిణ్యం స్వజనే, దయా పరిజనే, శాఠ్యం సదా దుర్జనే
ప్రీతిః సాధుజనే, నయో నృపజనే, విద్వజ్జనే చార్జవమ్
శౌర్యం శ్రతుజనే, క్షమాగురుజనే, కాన్తాజనే ధృష్టతా
యే చైవం పురుషాః కలాసు కుశలాస్తేష్వేవ లోకస్థితిః
విద్వత్ పద్ధతిలోని ఈ శ్లోకాన్ని ఏనుగు లక్ష్మణకవిగారు ఎలా అనువదించారో చూద్దాం.
చ. వరకృప భత్యులందు, నిజవర్గమునందనుకూలవృత్తి, కా
పురుషులయందు శాఠ్యము, సుబుదు్ధలయందనురక్తి, దాల్మి
ద్గురువులయందు, గౌరవము కోవిదులందు, నయంబురాజుల
దరిజనులందు శౌర్యము, మృగాక్షులయందు బ్రగల్భభావవీ
వరుసగళా ప్రవీణులగు వారలయందు వసించులోకముల్
సేవకాజనము యందు అపారమైన ప్రేమ, బంధువుల యందు అనుకూలమైన ప్రవర్తనము, దుష్టజనుల యందు కాఠిన్యము, సజ్జనులయందు ఇష్టము, పెద్దలయందు సహనభావము, పండితుల పట్ల గౌరవము, రాజుల విషయంలో నిబద్ధతను, శ్రతువులయందు పరాక్రమము, స్త్రీలయందు నిగ్రహశక్తి – మొదలైన గుణములు ప్రదర్శించే కళల్లో ఎవరు నిపుణులో వారివల్లనే లోకము పురోగమిస్తుందని పై పద్యానికి భావము.
మానవుడు సమాజాన్ని విడిచి దూరంగా మనలేడు. జీవనం సాదదు కూడా. అందువల్ల పరిస్థితులనుబట్టి, వ్యక్తులనుబట్టి తన వ్యవహారశైలిని మలుచుకోవలసి ఉంటుంది. తన సేవకాజనము పట్ల దయాగుము కలిగి వారి అవసరములను గుర్తించవలసి ఉంటుంది. బంధువులను తగిన రీతిలో మన్నిస్తూ మసలుకోవాలి. చెడ్డవారితో కఠినంగా వ్యవహరిస్తేనే మరోసారి వారు దుర్మార్గంగా ప్రవర్తించకుండా ఉంటారు. వయసు మీద పడిన వారితో చాలా సమానంగా, వారికి వలసిన విధంగా మసలుకోవలసి ఉంటుంది. పండితుల యందు గౌరవభావాన్ని కలిగి ఉంటేనే మన సంస్కారభావం వెలికి వస్తుంది. అంతేకాక కొద్దొ గొప్పో మనకూ పాండిత్యం అబ్బుతుంది. రాజుల ఆజ్ఞలను శిరసావహిస్తూ, శ్రతువుల యందు పరాక్రమాన్ని ప్రదర్శించాలి. స్ర్తీలయందు ఇంద్రియ నిగ్రహము (పురుషుల యందు స్త్రీల) పురుషులు కలిగి ఉండాలి. ఇటువంటి నేర్పరితనము ఎవరిలో ఉంటుందో వారివల్లనే దేశాలు (లోకాలు) వృద్ధిలోకి వస్తాయి.
కవి మాటల వలన మనకు తెలుస్తున్న విషయాలు ఏమిటంటే – ఏ దేశమైనా విద్వత్తు కలిగిన వారివల్లే వృద్ధిలోకి వస్తుంది. చదవు వేరు విద్వత్తు వేరు. చదువు ఉండి, విద్వత్తు ప్రవర్తించలేనివారివల్ల దేశాభివృద్ధి, నాగరికత ఛిన్నాభిన్నమౌతాయి. కాబట్టి సదసతం వివేక చతురత కలిగినవారివల్లే పరిపాలన సుగమమవుతుంది. క్రింది నుండి ఉన్నత వర్గము వరకు ఎవరివట్ల ఎలా ప్రవర్తించాలో తెలిసినవారే అసలైన విద్వాంసులు. వారితోనే మన సంస్కృతి, మన ప్రగతి ముడిపడి ఉంటుందన్నది వాస్తవం.
గౌతమబుద్ధుడు, స్వామి వివేకానందుని బోధనల్లోనూ అబ్దుల్ కలామ్ గారి ప్రసంగాల్లోనూ పై పద్యం యొక్క భావాలు మనం గుర్తించవచ్చు. సాటివారిపట్ల మిక్కిలిదయ, తమను ఆశ్రయించుకని ఉన్నవారి పట్ల ప్రేమ, దుర్మార్గులపట్ల జాగరూకత, అశక్తులైన పెద్దవారిపట్ల మన చేయూత, గురువులపట్ల గౌరవభావము, బ్మహ్మచర్యము, ఏ సమాజమైతే కలిగి ఉంటుందో, మానవసేవే మాధవసేవగా ఎవరు భావిస్తారో ఆ సమాజమే ముందుకు సాగుతుందని, వారే మహాత్ములుగా కీర్తింపబడతారని, వారు మన దేశానికి ఎంతో అవసరమైన వ్యక్తులని కలామ్ గారు అంటారు. ఆచరించి చూపారు కూడా.
******
ఆధారములు
”””””””””””””””””
అడ్డం
¤¤¤¤
01. పూజలో దేవుడికి ఉపాహారం (7)
05. నోరుమండే కోడికూత (3)
07. పాదాలు వదలి పైన దూకిన నది. (2)
08. చేతి నాలుగువ్రేళ్ళ వెడల్పు కొలత (2)
09. కిలకిల పకపక (2)
11. శివవాద్యం (4)
14. పొలంలోనికి నీటిని చేర్చే నడవ (3)
15. యాగం, షడంగములలో ఒకటి (3)
17. ఆహ్వానం (3)
18. దైత్యులు (5)
21. వేదిక యుద్ధభూమి రంగూన్ (2)
23. మాకు చెందినవి (2)
25. పాడేది (2)
26. తాపసులు చేసేది (2)
28. పుట్టుక సాధ్యం (3)
30. నాయుడుబావ మరదలు (2)
31. పాలకడలి కుండలో మందరగిరి (2)
32. ఒక శూన్యంలేని నమస్కారం మోము (3)
33. ప్రవృత్తిలో బతుకుతెరువు (2)
34. ముక్కుపొడి (2)
36. మట్టి త్రవ్వే పనిముట్టు (3)
38. స్త్రీ (2)
39. నరుని శంఖం (4)
40. హద్దు (2)
42. వేదాంగాలలో ఒకటి చెప్పబడనిది (3)
43. చదువుతోపాటుగా కావలసినది (3)
నిలువు
¤¤¤¤
01. గీతాచార్యుడు ‘అది నేనే’ అన్న నెల (7)
02. రెండు పావులు (2)
03. విరగడలో గొడవ (3)
04. అలసి బాధపడు (3)
05. నవదంపతులు ప్రారంభించేది (5)
06. వాకిట రంగులతో వేసే తీగ (4)
10. సంధ్యాకాలం (2)
12. ప్రతి మనిషిలో వేగంగా పయనించేది (3)
13. వణకుట (4)
16. వృషభవాహనం (2)
19. కాకర రుచి (2)
20. పిట్టలదొర హస్తభూషణం (3)
22. గాంధారి కళ్ళకు కట్టకున్న వాటిలో సగం (2)
24. అరవైలో రెండో ఏడు (3)
27. శివుని తలపించే హర్యక్షం (3)
29. లక్షలో పదోవంతు (5)
31. చేతితోక ఆయుధం (2)
33. చీకటి కొండ (2)
34. నమస్కారం (2)
35. మకరందం (3)
37. నిప్పును కప్పేది (3)
38. మజ్జిగ (3)
41. గిట్ట డెక్క (2)
**************
పద’కిరణ’ కలనం – 6
గడులు నింపుటకు కొన్ని సూచనలు.
1. సున్నను, ముందున్న అక్షరంతో కలిపి ఒకే గడిలో వ్రాయాలి.
2. పొల్లు అక్షరాలు .. న్, క్ ..ల వంటివి అవసరమైతే ముందున్న అక్షరంతో కలిపి ఒకే గడిలో వ్రాయాలి.
3. మీరు గడులు నింపి సరిచూసుకున్న తరువాత..
ఆ సమాధానములను అడ్డం, నిలువు లకు వేరువేరుగా ఆయా సంఖ్యలతో పట్టిక గా వ్రాసి మన ‘మయూఖ’ పత్రికకు మెయిల్ చేయండి.
అన్నీ సరియైన సమాధానములు పంపిన వారందరూ విజేతలే.
రచన :”సాహితీ సేవారత్న అవార్డు గ్రహీత”
శ్రీ. ” కావ్యసుధ”
సూర్యుడు జగత్తుకు కన్ను సూర్యకాంతియే అన్నికాంతులకు మూలం. సూర్యుడు త్రిమూర్త్యాత్మక పరమాత్ముడు. సూర్యకిరణజన్యసంయోగం చేతనే జీవులు పుడుతున్నాయి. పెరుగుతున్నాయి, నశిస్తున్నాయి. సూర్యుడు ఈ విశ్వానికి ఆత్మ అని వేదం. కనుక సూర్యభగవానుని ఆరాధన అత్యంత ప్రాచీనమైంది. రాజవంశాల్లో సూర్యవంశం మొదటిది. శ్రీరామచంద్రుడు సూర్యవంశ సంజాతుడు. నిత్యమూ సూర్యారాధన చేసేవాడు. ఆదిత్యహృదయపఠనం చేతనే రావణసంహారం కూడా చేయగలిగాడు. సూర్యుడు నమస్కార ప్రియుడు. కనుక, సూర్యుడు మనకు చేసే ఉపకారాలకు కృతజ్ఞతాసూచకంగా సూర్యనమస్కారం చేయడం – సనాతన భారతీయ సంప్రదాయం.
వేదాల్లోనే సూర్యదేవునికి సంబంధించిన అరుణమంత్రాలున్నాయి. మన మీనాడు చూస్తున్నసూర్యగోళం లాంటివి ఈ విశ్వంతరాళంలో మొత్తం పన్నెండున్నాయి. వాటినే ద్వాదశాదిత్యమండలా లంటారు. శ్రీమన్నా రాయణుడు సూర్యమండలమధ్యవర్తి, దివ్యతేజోవిరాజితుడు. సూర్యగమనం ఉత్తరాయణం – మకర సంక్రాంతితో ప్రారంభమైనా మాఘశుద్ధ సప్తమినుండి పూర్తిగా ఉత్తరదిశగా జరుగుతుంది. ఇది పుణ్యకాలం
ఉత్తర మనే పదానికి జీవులను ఊర్ధ్వముఖుల్ని చేసి, తరింపజేసే దని ఆధ్యాత్మికార్ధం. కనుక రథసప్తమ కంటిముందు కన్పించే ప్రత్యక్షదేవుడైన సూర్యభగవానుని పండుగ. సూర్యుడు జ్యోతిశ్శాస్త్రంరీత్యా నేత్రకారకుడు. అంటే కంటిచూపు, కంటి ఆరోగ్యం మొదలైన వన్నీ సూర్యాసుగ్రహించేశ చక్కగా శోభిస్తాయి. అంతేగాక “ఆరోగ్యం భాస్కరా దిచ్ఛేత్ ” ఆరోగ్యం సూర్యభగవానునిద్వారా పొందా అని శాస్త్రం. కనుక సూర్యుడు మనజీవితశోభకు, మానసికపురోగతికి, అవయవపటిష్టతకు, పాడిపంటలకు, | బుద్ధి వికాసానికి అన్ని విధాలా అనుకూలించే ప్రత్యక్షదైవం!
ఇంత ఉపకారం మనకు సూర్యుడు చేసినప్పుడు మనం చేయగలిగింది కృతజ్ఞతాసూచకంగా “సూర్యదేవ నమస్తుభ్యం!” అంటూ నమస్కరించడమే! కనుకనే నవగ్రహాలలో ఏ గ్రహానికి లేని నమస్కారవిధానం సూర్యగ్రహానికి మాత్రమే ఉండడం సూర్యునివిశిష్టతకు సంకేతం. సృష్టి జరిపేవాడు గనుకనే “సవిత ” అని పేరు. గాయత్రీమంత్రం సూర్యతేజస్సంబంధ మైనదే! ఆ సూర్యుణ్ణి శ్రేష్టతముడుగా తెలుసుకోవడం, మన బుద్ధిని చక్కగా నడిపించ మని అతణ్ణి ప్రార్ధించడం గాయత్రీమంత్రంలోని ఆశయం. కనుక ఉపకారికి ప్రత్యుపకారం చేయడం మన సంప్రదాయం!
అయితే, అంతటి దివ్యతేజోరాశికి మనం చేయగలసేవ కృతజ్ఞతలు తెల్పడం తప్ప, మరొకటి ఏముంటుంది? ఇందుకే మనప్రాచీనులు రథసప్తమిని సూర్యభగవానుని పర్వదినంగా భావించి భౌతిక, ఆధ్యాత్మికపరంగా సూర్యుణ్ణి ఆరాధించి, త్రికరణశుద్ధిగా సూర్యునికి నమస్కరించి, ఆ నమస్కారంద్వారా సూర్యకిరణాలలోని దివ్యతేజస్సునూ, చైతన్యశక్తినీ మనం పొందాలి అనే సంప్రదాయాన్ని నెలకొల్పారు. కనుక సూర్యుడు కేవలగ్రహమే కాదు సాక్షాల్దేవుడు!
నమస్కారం వినయవిధేయతలకూ, కృతజ్ఞతాగుణానికి సూచకం. మనం త్రికాలాల్లో సూర్యుడికి ఒక్క నమస్కారం చేయడంవల్లే ఆయన దయామూర్తి అయి మనఆరోగ్యాన్నీ, ఐశ్వర్యాన్ని సంరక్షిస్తున్నాడు. అల్పసంతోషులైన దేవతలలో సూర్యుడు ప్రథముడు నమస్కారానికే ఇంత విలువ ఉంటే ఇక సూర్యమం పాసన, సూర్యస్తోత్రపారాయణం, అరుణమంత్రపారాయణం మొదలగునవి ఎంతశక్తిమంతాలో, మను జీవితాలపై ఎంత ఉత్తమప్రభావాన్ని రూపుతాయో ఊహించవచ్చు. మయూరుడు సూర్యాసుగ్రహంచేతనే రోగం నుండి ఆరోగ్యవంతుడై కృతజ్ఞతాసూచకంగా ఒక శతకం సూర్యునిపై రచించి, లోకాని కందించాడు. ఇలా ఎందరో మనపురాణాల్లో సూర్యుణ్ణి ఆరాధించి మణులు, అక్షయపాత్రలు, భోగభాగ్యాలు సంపాదించి, తాము తరించడమే గాక, లోకాన్ని కూడా తరింపజేశారు. కనుక ప్రతిమానవుడూ కృతజ్ఞతా గుణాన్ని అలవరచుకుని, తమకు ఉపకారం చేసిన, చేస్తున్న మహాత్ములందరికీ హృదయపూర్వకంగా ప్రతి దినమూ ఉదయం తూర్పుముఖంగా నిలబడి సూర్యుణ్ణి చూస్తూ నమస్కరిస్తే ఆ సమస్కారం అందరికీ చెందుతుంది.
విశ్వ నేత్రుడైన సూర్యుని గతి వల్లే రుతుకాల ధర్మాలు ఏర్పడి కాలం ముందుకు సాగిపోతోంది అందుకే ప్రకృతికి ఆధిదైవంగా భావించి సూర్యుని ఆరాధించు కుంటున్నాము. ఉదయభానుడి లేలేత కిరణాలు మన కనులారా వీక్షిస్తే చాలు మన శరీరంలో రసాయన ప్రక్రియ జరిగి రుగ్మతల్ని దూరమవుతాయని, దేహసంబంధితంగా చేసిన పాపాలు సైతం నాశనమైపోతాయని తెలుస్తోంది. సూర్యారాధన వల్ల ముక్తి పొందిన కథలు ఎన్నో మన పురాణాల్లో ఉన్నాయి.
సూర్యకాంతి ప్రాణుల్లో ప్రాణవాయువు గానూ భూమ్యాకాశాలకు దీప్తిని కలుగజేస్తుంది. ఏక చక్రం కలిగి ఏడు అశ్వాలు పూంచిన మకరధ్వజం అనే రథానికి తొడలు లేని అనూరుని రథసారధిగా పెట్టుకొని రాత్రి పగలు పయనిస్తూ జీవకోటిని కాపాడుతున్నాడు సూర్యుడు.
పుష్య మాసము లో సూర్యునికి “భగుడు ” అని పేరు ఈమాసములో ప్రాణుల శరీరంలో నుండి వారిని రక్షిస్తుంటాడు. మాఘ మాసములో “పూషుడు” అనే పేరుతో ప్రాణులు భుజించే ఆహారములో ఉండి వారికి పుష్టిని కలిగిస్తుంటాడు. పాల్గుణ మాసంలో “క్రతువు” పేరుతో గాలిలో ఉండి ప్రాణులకు అవసరమైన శ్వాసక్రియ కలిగిస్తూవుంటాడు.
సప్తాశ్వరధ మారూఢం
ప్రచండం కశ్యపాత్మజమ్! శ్వేతపద్మధరం దేవంతం సూర్యం ప్రణమామ్యహమ్!
శ్రీ సూర్యనారాయణుడు మనకందరికీ ప్రత్యక్షదైవం సూర్యుడు.ఏకచక్ర
రధారూడుడు.
ఈ చక్రమే కాలచక్రం,ఆ చక్రానికి ఆరు ఆకులు, రథానికి ఏడు అశ్వాలు. చక్రం సంవత్సరానికి ప్రతీక. ఆకులు ఆరు ఋతువులు, ఏడు అశ్వాలు ఏడు కిరణాలు. సుషుమ్నము , హరికేశము, విశ్వకర్మ , విశ్వవ్యచ , సంపద్వసు , స్వర్వడ్వసు అనబడే సహస్ర కిరణాలతో ప్రకాశించే ఈ సప్త కిరణాలు మన శరీరంలోకి ప్రవేశించి అనారోగ్యం లేకుండా కాపాడుతాయి.
“ఉదయమే బ్రహ్మణ్రూపం మధ్యాహ్నేతు మహేశ్వరం సాయంకాలే స్వయం విష్ణుః త్రిమూర్తిశ్చ దివాకరం ”
భగవానుడు ఉదయం బ్రహ్మ స్వరూపంగా, ప్రకృతిలో జీవాన్ని నింపి, మహేశ్వరునిగా మధ్యాహ్నం తన కిరణాల ద్వారా సృష్టి యొక్క దైవిక వికారాలను రూపుమాపి, సాయంకాలం విష్ణురూపంలో బాసిల్లే తన కిరణాల వెలుగును మనోరంజకంగా ప్రసరించజేస్తూ ఆనందాన్ని కలిగించే ద్వాదశ రూపుడైన సూర్యభగవానుని ధాతా, అర్యమా, మిత్ర, వరుణ, ఇంద్ర, వివస్థాన్, పూషా, వర్ణస్య, అంశుమాన్, భగ, త్వష్ణా, విష్ణువు అనే ఈ పన్నెండు మంది సూర్యులు సమస్త జీవజాలానికి, సృష్టి విధానానికి ఆధార భూతులవుతున్నారని, ఇట్టి ఈ పన్నెండు నామాలు స్మరిస్తే దీర్ఘరోగాలు నయమవుతాయని, దారిద్ర్యం పోతుందని భవిష్య పురాణంలో పేర్కొనబడింది.
“నమస్కార ప్రియ
భాను: ” అన్నారు. సూర్యుడు నమస్కార ప్రియుడు ఉదయం పూట నూర్య నమస్కారాల చేయాలన్న సంప్రదాయం ఆరోగ్యరిత్యా ఏర్పాటు చేసినదే ‘ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్’ అన్నారు. సూర్యకిరణాలు ఆరోగ్య ప్రదమైనవి*. శ్రీ సూర్యారాధన వల్ల ఆరోగ్యం చేకూరుతుంది. ‘సకల కార్య సిద్ధి జరుగుతుంది.
సౌర మానం, చాంద్రమానం, బార్హ స్పత్సమానం మొదలైనవి. కాలగమన విధానంలో ప్రసిద్ధమైనవి. సౌరమాన ప్రకారంగా ప్రతి సంవత్సరం మాఘమాస శుద్ద సమస్తమి నాడు వచ్చే ‘రథసప్తమిని సూర్య వ్రతం అని పిలుస్తారు. మాఘమాసంలో శుద్ధసప్తమి”, సూర్యసప్తమి’, ‘అచలా సప్తమి’, ‘మహాసప్తమి’, సప్త సప్త సప్తమి’ కానీ… ఇలా ఎన్నో పేర్లతో పిలువబడడమేగాక, సూర్యారాధనకు సూర్యవ్రతానికి విశిష్టమైన పర్వదినంగా భాసిస్తున్న రోజు ‘రథసప్తమి’ దినంగా, ‘సూర్యజయంతి’గా కూడా జరుపుకోవడం మన సంప్రదాయం.ఈ సప్తమి నాడు సూర్యోదయాన ఆకాశంలోని నక్షత్ర సముదాయం రథాకారాన్ని పోలి ఉండడం చేత ‘రథసప్తమి’అని అంటారు.
సూర్యుడు మాఘ శుక్ల పక్షమి అశ్వనీ నక్షతం భానువారం
(ఆదివారం) సప్తమి తిథిన దక్షప్రజాపతి పుత్రికయైన అదితి, కశ్యప
మహర్షికి ‘వివస్వంతుడు’ అనే పేరున జన్మించాడు. అదితి కశ్యపులకు
పుత్రుడైనందున ఆదిత్యుడని, కశ్యపుడని వ్యవహరిస్తారు.
విశ్వకర్మ కుమార్తె సంజ్ఞ సూర్యునికి భార్య, ఈమె యందు సూర్యునికి వైవస్వత మనువు, యమున, యముడు అనే కవలలు జన్మించారు. సంజ్ఞ తనకు మారుగా ఛాయను సృజించి, కొంతకాలము భర్తగా దూరంగా ఉన్న సమయంలో సూర్యుడు ఆ ఛాయనే సంజ్ఞగా భావించడం ఆమె వల్ల సూర్యునికి శనైశ్చరుడు జన్మించాడు.
రథసప్తమికి ముందు రోజు రాత్రి షష్టిన ఉపవాసము చేసి సూర్యుని పూజించాలి. మరునాడు సప్తమినాటి ప్రాతఃకాలములో స్నానమాచరించి సూర్యుని ధ్యానిస్తూ రాగి, వెండి మట్టి ప్రమిదలలో ఏ దేనిలోనైనా సరే నువ్వుల నూనె పోసి దీపారాధన చేసి, దీప చేతులను తల పై పెట్టుకుని నదీజలాల్లో గాని, పారే జలాల్లో గాని వదిలితే పుణ్యం వృద్ధి చెందుతుందని ఆయురారోగ్య సంపదలు కలుగుతాయని తెలుస్తోంది.
సూర్య ప్రీత్యర్థం పాపహరణం కోసం రథసప్తమి రోజున చేసే స్నానం ఎంతో శుభప్రదమైనందున ఈరోజు ఉషోదయాన్నే నిద్రలేచి శూచియే ఈ సంకల్పం చేసుకోవాలి.
అన్ని జన్మలలో మనోవాక్కాయ కర్మలతో తెలిసీ తెలియక చేసిన ఏడు జన్మల పాపాలు, రోగాలు, శోకం మొదలైనవి ఓ రథసప్తమి నిన్నుస్తుతిస్తూ చేసే స్నానం వల్ల నశించునుగాక అని భావం.
“సప్త సప్తివహాప్రీత ! సప్తలోక ప్రదీపన! సప్తమీ సహితోదేవ గృహాణార్ఘ్యం దివాకర”అని సూర్యభగవానునికి ఆర్ఘ్యం ఇవ్వాలి. ఆర్ఘ్యం ఇస్తే అష్టైశ్వర్యాలను ఆయురారోగ్యాలను ప్రసాదిస్తాడు.
ఇలా చేయలేని వారు మరోపద్ధతిని కూడా చేయవచ్చును..
రథసప్తమి నాడు ప్రాతః కాలంలో స్నానానికి ముందు నువ్వుల పిండిని శరీరానికి రుద్దుకొని, ఏడు జిల్లేడు ( ఆర్క పత్రం) ఆకులుగానీ,రేగు ఆకులుగానీ, చిక్కుడు ఆకులను తలపైన, భుజాలపైన, చేతులపైన పెట్టుకొని స్నానం చేయడం ద్వారా సూర్య శక్తిని స్వీకరించే లక్షణం గల జిల్లేడు, రేగు, చిక్కుడు ఆకులలోని తపశ్శక్తి మన శరీరానికి తగిలి నందు వల్ల ఒంట్లోని రోగాలు తొలగిపోయి ఆరోగ్యం వృద్ధి చెందుతుంది అని అంటారు.
కొన్ని ప్రాంతాల్లో ధనుర్మాసంలో నెలంతా ఇంటి ముంగిట్లో పెట్టిన ఎండిన గొల్బిమ్మలను ఇంటి ఆరుబయట వెలిగించి వాటిపై ఆవును పాలను మరిగించి సూర్యకాంతిలో పాయాసాన్ని వండి సూర్యునికి వివేదన చేస్తే, సూర్య భగవానుని అనుగ్రహం వల్ల ఆరోగ్యం కలుగుతుంది.సత్ సంతానం కావలసిన వారికి సంతానం కూడా కలుగుతుంది.
ఖగోళ శాస్త్రరీత్యా భూగోళ సంచారం వల్ల సూర్యభగవానునికి దక్షిణాయణమనీ, ఉత్తరాయణమనీ రెండు ప్రయాణ మార్గాలు ఏర్పడ్డాయని విజ్ఞాన శాస్త్రం స్పష్టం చేస్తోంది. దక్షిణాయన సంచారం నుండి మకర సంక్రాంతి రోజున సూర్యుడు తన రథాన్ని ఉత్తరం వైపు ప్రయాణం చేయడానికి దిశ మారుస్తాడని , ఈ రథసప్తమి రోజున తన రథాన్ని పూర్తిగా ఉత్తరం దిక్కు తిప్పి ప్రయాణిస్తాడని చెప్పబడుతుంది. సూర్యుడు తన స్వర్ణ రథమును గమత్మంతునికి సోదరుడైన అనూరుని సారథ్యంలో ఉత్తరాయన దిక్కునకు మళ్ళించే పవిత్రదినం ‘రథసప్తమి’ వైవస్వత మన్వంతరం కూడా ‘ “రథసప్తమి ‘ రోజున ప్రారంభమైనట్లుగా పురాణాల ద్వారా తెలుస్తోంది..
శుక్ల సప్తమి ఆదివారం కలసి వస్తే దానిని విజయ సప్తమి అంటారు. ఆరోజున సూర్యుని ఆరాధించి దాన ధర్మాలు చేసినవారికి పుణ్య ఫలం లభిస్తుంది. ఆవునెయ్యితో కాని నువ్వుల నూనెతో గానీ ,దీపం పెట్టి ఆదిత్యుని పూజించి ‘ఆదిత్య హృదయం’ పఠిస్తే నేత్రవ్యాధులు రావు
పవిత్రమైన “రథసప్తమి” పండుగరోజు దేశమంతటా ఆంధ్రప్రదేశ్, ఒరిస్సాలోని కోణార్క్, తమిళనాడులోని మా కోయిల్ ,తిరుమల తిరుపతి క్షేత్రంలో కూడా విశేషంగా సూర్యారాధనలు జరుగుతాయి. ఈ రోజున సూర్యుణ్ణి ఉపాసించితే గ్రహబాధలు పోగొట్టుకుంటారు.
సప్తమినాడు సూర్యుని ఆరాధించినవారికి అశ్వమేధ ఫలం లభిస్తుంది. సుప్రసిద్ధమైన అరసవిల్లి దేవాలయంలో శాస్త్రోక్తముగా సంకల్ప పూర్వకముగా అభిషేకం చేసి, సహస్ర నామ అష్టోత్తర శతనామ పూజ చేసిన కార్యసిద్ధి కలుగుతుంది.
విశ్వేశం విశ్వాధారం !
మహాతేజ ప్రదీపనమ్ తం !! సూర్యం ప్రణమామ్యహమ్ !!
మహా పాపహరం దేవం!!!
భక్తి ముక్తి నిచ్చి పోషించు దైవమై
ఆపదలను బాపి అనుదినమ్ము
బ్రోచు వాడ వనుచు పూనిన భక్తితో
సూర్యదేవుని మదిని స్తుతి నొనర్తు.
లోకానీకావనౌకం సకల భువనభు క్సత్ర సంత్రాణ తంత్రం
కారుణ్యార్ణోధినాధం ఘనరవవిలస న్నూపురాసాదపాదం
తాటంకద్యోత కర్ణం విషగళసుషమా తాండవానంద కందం
వందే యాదక్షమాభృత్ కటక పటుభుజారంహ లక్ష్మీనృసింహమ్ !
తాత్పర్యం: సమ్తలోకాలను సంరక్షించే ఆశ్రయముÑ సకల భువనా(లోకా)లను లయమొందించేవాడు, నిరంతరము పోషించి రక్షించేవాడుÑ కరుణ అనే సముద్రానికి ప్రభువైన (అధిపతిjైున) వాడుÑ విశేషమైన శబ్దాలను వెలువరించే ప్రకాశిస్తూన్న అందెలను అలంకరించుకున్న పాదము(లు) కలవాడుÑ తాటంకముల (చెవికమ్మల) చేత అందమును సంతరించుకుని ప్రకాశిస్తున్న చెవులు కలవాడుÑ శ్రీకంఠుని పరమశోభాకరమైన తాండవనాట్య సమయంలో కలిగే ఆనందానికి మూల(కారణ)మైనవాడు అయిన శ్రీ యాదగిరి లక్ష్మీనరసింహస్వామివారిని నమస్కరిస్తున్నాను.
విశేషాలు: లోకం అంటే ఇంద్రియగోచరమైన ఈ సమస్త చరాచర స్థావర జంగ మాత్మకమైన, ఎనభై నాలుగు లక్షల జీవరాశికి నిలయమైన, సంపూర్ణ సృష్టి అని చెప్పవచ్చు. సాధారణ మానవుడికి ఇంద్రియ గోచరమైన ఈ లోకం అంతా కలిసి ఒక బ్రహ్మాండంగా పిలవబడుతున్నది. ఋషివరేణ్యుల జ్ఞానచక్షువులకు ఎన్నో కోట్ల బ్రహ్మాండాలు కనిపిస్తుంటాయి. వాటినే అనేక కోటి బ్రహ్మాండాలని జ్ఞానులు చెప్తుంటారు. (లోకGఅనీకGఅవనGఓకంR) అటువంటి లోకానీకములను, అనేక కోటి బ్రహ్మాండాలను (అవనR) రక్షించటానికి (ఓకంR) చక్కని, ఏకైక ఆశ్రమైనవాడుÑ (సకలGభువనR) సమస్త లోకాలను (భుక్R) భుజించటం అంటే మహాప్రళయకాలంలో తనలో లీనం చేసుకునేవాడు విష్ణుమూర్తి! అంతేనా? (సత్రR) ఆ లోకాలన్నిటినీ పోషించి, శరణమిచ్చి, రక్షణ కల్పించి, వాటికి తానే ఆశ్రయంగా నిలిచినవాడు. సత్రం అంటే తగిన దక్షిణ లిచ్చి సతతము అన్నదానం చేయటం అని కూడ అర్థం! పూర్వం ఋషులు సత్రయాగం చేశారని పురాణాల్లో పేర్కొన్న దీ యాగాన్నే!, ఇంకా (సంత్రాణR) చక్కగా రక్షించటం అనే (తంత్రంR) కుటుంబ భరణ వ్యాపారాన్ని, పనిని, చేసేవాడు శ్రీలక్ష్మీనరసింహస్వామివారు.
సృష్టి, స్థితి, లయ కార్యాలకు మూలమైనవాడు విష్ణుమూర్తియే కదా!Ñ తనను ఆశ్రయించిన, ఆపన్నులైన భక్తజనులను, విపత్తుల నుండి కాపాడి (కారుణ్యGఅర్ణోధినాధంR) దయతో బ్రోచే కరుణాసముద్రానికి అధినాథుడుÑ (ఘనGరవGవిలసత్G నూపురGఆసాదGపాదంR) విశేషంగా మంజులనాదాన్ని వెలువరిస్తూ, మిక్కిలి సౌందర్యవంతములైన అందెలచేత (మంజీరాలచేత) అలంకరింపబడిన పాదాలు కలిగినవాడుÑ (తాటంకGద్యోతGకర్ణంR) శోభాయమానములైన చెవికమ్మలచేత ప్రకాశిస్తూన్న చెవులు కలిగినవాడుÑ (విషగళGసుషమాGతాండవGఆనందGకందంR) విషగళుడు శంకరుడు. సకలలోక శుభంకరుడైన శంకరుడు దివసావనాన సమయంలో అంటే సాయంసంధ్యా సమయంలో తాండవ నృత్యం చేస్తూ
ఉంటాడంటారు. (విషగళR) హాలాహల విషాన్ని తన కంఠసీమలో నిలుపుకుని శ్రీకంఠుడనే నామధేయాన్ని సార్థక పరచుకున్నవాడు శివుడు! అందుకే ఆయన శివుడు R మంగళకరుడైనాడు. శివుడు మనోజ్ఞమైన తాండవ నృత్యాన్ని చేస్తూంటే కలిగే ఆనందం ఇంతటిదని చెప్పడానికి వీలు కాదు! దాన్ని ఆనంద తాండవమంటారు. అదే బ్రహ్మానందం కంటే అతీతమైనది. అటువంటి ఆనందం కలగటానికీ, కలిగించటానికీ మూలమైనవాడు శ్రీలక్ష్మీ నరసింహస్వామివారు. శ్రీ యాదగిరిపై నెలకొని తన పటుభుజబలంతో విక్రమిస్తున్న శ్రీలక్ష్మీనరసింహస్వామిని కవి తన సుధామధుర కవితారస ధారాపూరంతో నమస్కరిస్తున్నాడు.
శ్రీ యాదాద్రీశ వైభవమ్`12
మాకందామంద సానంద మృదుమధు సుధాగాధ మాధుర్యసూక్తిం
అస్తోకాభ్యస్త కస్తూరిక మలయజ సంలిప్త దీప్త స్వరూపం
దేహత్విడ్ధూత మిత్రం స్ఫురదురు స్రగ్ధారణం ముక్తకాయం
వందే యాదక్షమాభృత్కటక పటుభుజారంహ లక్ష్మీనృసింహమ్ !
తాత్పర్యం: మామిడి పండ్ల (రసం) వలె అత్యధికమై, ఆనందభరితమై, మృదువుగానూ మధురంగానూ ఉండే అమృతాయమానములైన ` అగాధములై, మధురములైన సూక్తుల చేత అలరారేవాడుÑ విశేషముగా కలుపబడిన కస్తూరి మరియు గంధములను శరీరముపై లేపనము చేయడము వలన ప్రకాశిస్తున్న స్వరూపం కలవాడుÑ తన దేహకాంతి చేత తిరస్కరింపబడిన సూర్యుడు కలవాడుÑ ప్రకాశవంతమైన గొప్ప మాలికను ధరించినవాడుÑ శరీరబంధము లేనటువంటివాడు యాదాద్రిపై నెలకొని తన బలిష్ఠములైన భుజముల బలపరాక్రమాలను ప్రదర్శిస్తున్న శ్రీలక్ష్మీ నరసింహ స్వామివారిని నమస్కరిస్తున్నాను.
విశేషాలు: పండ్లల్లో మామిడి పండు చాలా విశిష్టమైనది. దాని రంగు`రుచి`వాసన అంటే ఇష్టపడని వాళ్ళెవ్వరూ
ఉండరు. అటువంటి మామిడి పండ్ల రసంతో శ్రీలక్ష్మీనరసింహస్వామి (విష్ణుమూర్తి) అవతారగాథల్ని ఉపమిస్తున్నాడు కవి. (మాకందR) మామిడిచెట్టు, దీనినే రసాలము అని కూడా అంటారు. మామిడి పండ్ల రసం వలె (అమందR) అత్యధికమైన ఆనందంతో కూడినవీ ` అంటే మిక్కిలి ఆనందాన్ని కలిగించేవీ (Rసానంద), (మృదు మధుR) మృదుత్వాన్ని కలిగి ఉండటమే కాకుండా అత్యంత మధురంగానూ ఉండేవీ, (సుధాGఅగాధR) అమృతపానం వలె గాఢమైన పరమానందాన్ని కలిగించేవి విష్ణుమూర్తి కథలు! ఆ కథలలో హరి చరిత్రను వర్ణించిన (మాధుర్యR) మధురరసభరితమైన (సుGఉక్తింR) మంచి మాటలు కలవాడు! అంటే అంతటి మృదు మధురమైన సూక్తుల చేత (మంచి మాటల చేత) హరిగాథలు వర్ణింపబడినవి. విష్ణుమూర్తి యొక్క (సూక్తిR) మాటలు కూడా అంతటి మాధుర్యం కలిగినవి అని కూడా చెప్పవచ్చు!
(అస్తోకGఅభ్యస్తR) విశేషముగా శ్రేష్ఠములైన అంగరాగాలను (సుగంధభరితములైన పూతలను దేవతలు, రాజులు మొదలైనవారు అనాదిగా వాడటం మన సంప్రదాయం. ప్రత్యేకంగా విష్ణుమూర్తి అలంకార ప్రియుడు! ‘‘కస్తూరీ తిలకం లలాటఫలకే…. సర్వాంగే హరిచందనం చ కలయన్…..’’ అంటూ శ్రీకృష్ణపరమాత్మను వర్ణించారు కదా! (కస్తూరికG మలయజR) కస్తూరి మృగం నాభి నుండి ‘కస్తూరి’ అనే సుగంధ ద్రవ్యం లభిస్తుంది. ఇది పరిమళభరితమైనదే కాకుండా ఎన్నో రకాల రోగాలను దూరం చేయగల ఔషధ ద్రవ్యం కూడా! మలయజం అంటే మలయపర్వతంపై విశేషంగా పెరిగే శ్రీగంధపు చెట్టు. అందుకే మలయపర్వతం వైపు నుండి శ్రీగంధ వృక్షాల మీదుగా వీచే గాలిని ‘మలయపవనా’ లని సుగంధ భరితమైన గాలిగా వర్ణిస్తారు. అటువంటి శ్రేష్ఠములైన కస్తూరినీ, శ్రీగంధాన్నీ కలిపి (సంలిప్తR) చక్కగా శరీరానికి లేపనంగా వాడటం వలన (దీప్తGస్వరూపంR) దేదీప్యమానంగా వెలిగే శరీరం కలిగినవాడు శ్రీలక్ష్మీనరసింహ స్వామి.
(దేహ త్విట్GధూతGమిత్రంR) తన దివ్యదేహం నుండి వెలువడే కాంతి (ప్రకాశం) సూర్యకాంతిని కూడ తిరస్కరించే విధంగా ఉన్నదట! చక్కగా సౌందర్యవంతమైన గొప్ప మాల (వనమాల) ధరించాడు స్వామి.
శ్రీ లక్ష్మీనరసింహస్వామి ముక్తకాయుడు. శరీరం అశాశ్వతమైనది. శరీరధారులెవ్వరూ స్థిరంగా ఉండరు. ఏదో ఒకనాడు శరీరత్యాగం చేయక తప్పదు. అవతారమూర్తి అయిన లక్ష్మీ నరసింహుడు అటువంటి అస్థిరమైన శరీరాన్ని (కాయాన్ని) ధరించినవాడు కాదు. శరీరాకృతితో కనిపించేది అతని అపరిమిత తేజోమూర్తి మాత్రమే! అందుకే ఆయన ముక్తకాయుడు! శ్రీ యాదగిరిపై నెలకొని తన అవక్ర పరాక్రమంతో భుజబల ప్రదర్శన చేస్తున్న శ్రీలక్ష్మీనరసింహ స్వామి వారిని తన అజరామరమైన కవితా పుష్పాలచేత అర్చించి నమస్కరిస్తున్నాడు కవి.
శ్రీ యాదాద్రీశ వైభవమ్`13
శ్రీదం మోదం దవాదం నతజనవిహితం చిత్స్రవంతీనగాహం
దారిద్య్రార్తి ప్రవిచ్ఛేదన ఘనకరుణాధీన చేతోంబుజాతం
మేశం కాశప్రకాశం మితవచన మఘక్లేశనాశావకాశం
వందే యాదక్షమాభృత్కటక పటుభుజారంహ లక్ష్మీనృసింహమ్ !
తాత్పర్యం: సంపదలను ఇచ్చేవాడు, తన భక్తులకు సంతోషాన్నీ ` ఆనందాన్ని ప్రసాదించేవాడు, దావాగ్నిని మ్రింగినవాడు, తనను ఆశ్రయించిన భక్తజనులకు విశేషమైన హితాన్ని (మేలును) చేకూర్చేవాడు, తన భక్తులైన సాధకులకు కలిగిన జ్ఞాన (చైతన్య) ప్రవాహాన్ని అడ్డుకునే అజ్ఞానం అనే పర్వతాలను సంహరించేవాడు, దారిద్య్రం వలన కలిగే బాధలను ఛేదించగల గొప్ప కరుణ అనే గుణానికి లొంగిన హృదయపద్మం కలవాడు, లక్ష్మీదేవికి భర్త, రెల్లుపూవువలె తెల్లనైన విశేష ప్రకాశం కలవాడు, మితంగా మాట్లాడేవాడు, పాపం అనే దుఃఖాన్ని నాశనం చేయగలవాడు అయిన యాదగిరిపై నెలకొని తన బలిష్ఠములైన భుజముల బలాన్ని ప్రదర్శిస్తున్న శ్రీలక్ష్మీనరసింహ స్వామివారిని నమస్కరిస్తున్నాను.
విశేషాలు: లక్ష్మీనాథుడైన విష్ణుమూర్తి స్థితి కారకుడు. సమస్త సృష్టికీ అవసరమైనవాటిని అన్నిటినీ సమకూర్చి రక్షించేది ఆయనే! అందుకే విష్ణువు (శ్రీదంR) శ్రీని ` ఐశ్వర్యాన్ని ప్రసాదించేవాడు. అంతేకాదు! (మోదంR) ఆయన అన్నిటికంటే మిక్కిలి గొప్పవైన సంతోషాన్నీ ` ఆనందాన్ని కూడా అనుగ్రహిస్తాడు. ఆనందమే మోక్షం కదా! శ్రీహరి మోక్షస్వరూపి! ముక్తి కంటే భక్తులకు కోరుకోవలసింది ఇంకేముంటుంది? (దవాదంR) దవం అన్నా దావం అన్నా కార్చిచ్చు అని అర్థం. శ్రీకృష్ణావతారంలో ఒక రాక్షసుడు కార్చిచ్చు రూపంలో తనను సంహరించటానికి వస్తుంటే ఆ దావాగ్నిని మ్రింగివేశాడు బాలకృష్ణుడు. అందుకే విష్ణువు దవాదుడు అయినాడు!
విష్ణుమూర్తి భక్తజన పరాధీనుడు! అందుకే (నతజనGవిహితంR) తనను ఆశ్రయించిన భక్తులకు మిక్కిలి హితకరమైన వాటిని మాత్రమే ఆచరిస్తాడాయన! భక్తులు, సాధకులు శ్రీహరి సేవకోసం, ఆయన సాన్నిధ్యం కోసం, ఆయన దర్శనం కోసం నిరంతరం పరితపిస్తూ ఉంటారు. ‘‘జ్ఞానా దేవ హి కైవల్యం’’ అని వేదాంతులు సిద్ధాంతీకరించారు. జ్ఞానసాధనా మార్గంలో ఎన్నో ఆటంకాల్నీ, సమస్యల్నీ నిరంతరం ఎదుర్కొంటూనే ఉంటారు సాధకులు. కాని వారి ప్రయత్నాల్ని విరమించరు. వారికి భగవత్తత్త్వాన్ని తెలుసుకునే ‘జ్ఞానం’ ఉదయించి (చిత్Gస్రవంతీR) జ్ఞాన ప్రవాహంగా మారి భగవంతుని వైపు ప్రవహిస్తుంటే మధ్యలో ఆ ప్రవాహాన్ని అడ్డుకోవటానికి (నగR) విఘ్నాల (అజ్ఞానం, మోహం, అరిషడ్వర్గాలు) మొదలైన రూపాలలో (నగాR) పర్వతాల వలె ఎదురుపడి నిరోధిస్తుంటాయి. ఆ విఘ్న పర్వతాల్ని (హంR) నిర్మూలించేవాడు, రాకుండా ఆజ్ఞాపించేవాడు విష్ణుమూర్తి.
‘‘యస్యానుగ్రహ మిచ్ఛామి తస్య విత్తం హరా మ్యహం’’ అన్నాడు శ్రీకృష్ణపరమాత్మ. భక్తుల హృదయాలను పరీక్షించటం కోసం కష్టాలను కల్పించి, వాటిని ఎదిరించి నిలువగల శక్తిని ఇచ్చి, వారికి కావలసిన బుద్ధి పరిపక్వతను కలిగించేవాడూ విష్ణుమూర్తే కదా! చివరికి అడుగడుగునా తన భక్తులకు కలిగిన (దారిద్య్రGఆర్తిR) ఎన్నో రకాల దారిద్య్ర బాధలను, కష్టాలను (ప్రవిచ్ఛేదనR) నాశం చేసి రక్షిస్తాడు. అంతటి (ఘనGకరుణాధీనR) గొప్ప కరుణకు వశమైన (చేతఃGఅంబుజాతంR) హృదయ కమలం కలిగినవాడు శ్రీలక్ష్మీనరసింహుడు! ఆయన (మాGఈశంR) శ్రీలక్ష్మికి ప్రభువు, ప్రాణవల్లభుడు! (కాశGప్రకాశంR) రెల్లుపూవు తెల్లగా, నిర్మలంగా ఉంటుంది. ఆవిధంగానే స్వామి కూడా స్వచ్ఛమైన గొప్ప కాంతితో ప్రకాశిస్తూ ఉంటాడు. ఆయన (మితGవచనంR) చాలా పరిమితంగా మాట్లాడేవాడు. చేయవలసిన పనిని నిరాఘాటంగా సకాలంలో చేసేవాడు. భక్తజనులకు కలిగే (అఘR) తెలిసికాని, తెలియక కాని చేసిన పాపాల వలన కలిగే (క్లేశR) దుఃఖాలను, కష్టాలను (నాశR) నశింపజేయటంలో (అవకాశంR) చొరవను తీసుకునేవాడు. యాదాద్రిపై నెలకొని తన బలీయములైన భుజబలపరాక్రమాల్ని ప్రదర్శించే అటువంటి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని కవిగారు తన మృదుమధుర మంజుల వచః ప్రసూన మాలికతో అర్చించి, నమస్కరిస్తున్నారు.
శ్రీ యాదాద్రీశ వైభవమ్`14
బ్రహ్మాండోత్తేజమూర్తిం త్రిభువన జనన త్రాణ సంహారమూర్తిం
దేవేంద్రాగణ్యమూర్తిం దివిజ గరుడ గంధర్వ దుర్భేద్యమూర్తిం
శ్రేయ స్సంధానమూర్తిం భృశ విశద యశోవ్యాప్త దిక్చక్రమూర్తిం
వందే యాదక్షమాభృత్కటక పటుభుజారంహ లక్ష్మీనృసింహమ్ !
తాత్పర్యం: ఈ భూగోళానికంతటికీ తన కాంతిచేత వెలుగును అందించే దివ్యమూర్తీÑ మూడు లోకములను (సమస్త సృష్టినీ) పుట్టించి, పెంచి, చివరికి తనలో లయం చేసుకునే మూర్తీÑ దేవేంద్రాదుల చేత కూడ లెక్కించడానికి అశక్యమైన మూర్తీÑ దేవతలు, గరుడగంధర్వాదుల చేత కూడ భేదింపనలవి కాని మూర్తీÑ సకల చరాచర సృష్టికీ శ్రేయస్సు (మేలు)ను కలిగించే మూర్తీÑ తన మేర మీరిన, నిర్మలమైన యశస్సును (కీర్తిని) దశదిశలా వ్యాపింపజేసిన మూర్తీ అయిన ` యాదాద్రిపై వెలసి తన పటుతరమైన భుజబలాన్నీ, విక్రమాన్నీ ప్రదర్శిస్తున్న ` శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారిని నమస్కరిస్తున్నాను.
విశేషాలు: స్థావర ` జంగమాత్మకమైన ఈ సమస్త సృష్టిలోను (బ్రహ్మాండమంతటా) చైతన్య స్వరూపిjైు ఉండేవాడు పరమాత్మ. ముఖ్యంగా సూర్యుడు, చంద్రుడు, అగ్ని తేజ స్స్వరూపులై సమస్త సృష్టినీ వెలిగిస్తున్నారు. అటువంటి సూర్య చంద్రాదులకు శక్తిదాతjైు, వారిని కర్తవ్యోన్ముఖులుగా చేసేవాడు పరమాత్మ. తైత్తిరీయోపనిషత్తు`ఆనందవల్లిలో ఇదే విషయం ఈవిధంగా ప్రస్తావించబడిరది. ‘‘భీషాస్మా ద్వాతః పవతే, భీషోదేతి సూర్యః, భీషాస్మా దగ్ని శ్చేంద్రశ్చ, మృత్యు ర్ధావతి పంచమ ఇతి’’. ఈ బ్రహ్మము యొక్క భయము వలననే వాయువు వీచుచున్నది. సూర్యుడు ఉదయించుచున్నాడు. ఇతని భయము వలననే అగ్నియు, ఇంద్రుడును తమ తమ విధులను నిర్వర్తించుచున్నారు. ఐదవవాడగు మృత్యువు (యముడు) కూడ ఈ పరమాత్మ భయము వలననే స్వకార్యమును నిర్వర్తించుచున్నాడు. సృష్టిలోని సమస్త శక్తులకు చైతన్య ప్రదాత పరమాత్మ (విష్ణువు) కాబట్టి అతనికి ఆ నియామక శక్తి లభించింది. (బ్రహ్మాండGఉత్తేజGమూర్తి(ం)R) ఈ బ్రహ్మాండానికంతకూ ప్రేరేపక శక్తిగా, ఉద్దీపక మూర్తిగా నిలుస్తున్నాడు శ్రీలక్ష్మీనరసింహస్వామి.
శ్రీలక్ష్మీనరసింహ స్వామి (త్రిభువనGజననGత్రాణGసంహారGమూర్తి(ం)R) ఈ మూడు లోకాలనూ తన సంకల్ప బలంతో సృష్టిస్తాడు. వాటిని పోషించి, రక్షించి, పుష్టిని చేకూరుస్తాడు. కాలం తీరి, శరీరం త్యాగం చేయవలసిన సమయంలో వాటిని సంహరించి తనలో లీనం చేసుకుంటాడు. సృష్టి`స్థితి`లయ కార్యాలను చేసే దివ్యమూర్తి లక్ష్మీనృసింహుడు!
శత్రు సంహారం కోసం అవతరించిన స్వామి (దేవేంద్రGఅగణ్యGమూర్తి(ం)R) దేవతలకందరికీ ప్రభువైన ఇంద్రుడికి కూడ గణింపశక్యం కానటువంటి సర్వశక్త్యతీత శక్తి మూర్తి! అందుకే (దివిజGగరుడGగంధర్వGదుర్భేద్యGమూర్తి(ం)R) దేవతలకు, గరుడ గంధర్వాదులకు కూడ ఎదిరించి, భేదింపశక్యం కానటువంటి శరీరము (స్వరూపము) కలిగిన వాడాయన! తనను శరణుపొంది, ఆశ్రయించిన భక్తజనులకు నిరంతరమూ ఆయన (శ్రేయస్GసంధానGమూర్తి(ం)R) సకలవిధ శ్రేయస్సులనూ, శుభాలనూ కలిగించగల కరుణామయమూర్తి! (భృశGవిశదGయశోGవ్యాప్తGదిక్Gచక్రG మూర్తి(ం)R) మేరమీరిన, అత్యంత నిర్మలమైన ఆయన కీర్తి దశదిశలా వ్యాపించింది. అటువంటి నిర్మల యశశ్శరీరము కలిగినవాడు శ్రీలక్ష్మీనరసింహస్వామి.
సర్వాతీతమైన, అనంత శక్తిమంతమైన శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మాండానికి ఉత్తేజాన్ని కలిగిస్తూ, సృష్టి`స్థితి` లయకారకుడై, దేవేంద్రాది సమస్త దేవగణాలకు కూడా దుర్భేద్యమూర్తిjైు`అందరికీ సేవింపబడుతూ, అందరిచే సకల శ్రేయస్సులనూ కలిగిస్తూ, తన నిర్మలకీర్తి దశదిశలా వ్యాపించగా ‘‘శ్రీలక్ష్మీ నరసింహుని’’గా యాదాద్రిపై వెలసి, తన బలిష్ఠ భుజబల పరాక్రమాలను ప్రదర్శిస్తూ, భక్తుల మ్రొక్కులందుకుంటున్నాడు. అటువంటి స్వామిని సుందర పద బంధ పాదారవిందాలచే అర్చించి, నమస్కరిస్తున్నాడు కవి.
శ్రీ యాదాద్రీశ వైభవమ్`15
శోచిష్కేశ ప్రతాప ప్రశమిత మహిమాహస్కరం విష్కిరాశ్వం
భిన్నాభిన్న ప్రసన్నాఖిల కలుషచయం స్విన్న సంఛన్న గండం
ప్రాశస్త్య స్తుత్య వస్త్వంబరమణి కనక ప్రీణిత క్షోణిదేవం
వందే యాదక్షమాభృత్కటక పటుభుజారంహ లక్ష్మీనృసింహమ్ !
తాత్పర్యం: అగ్నిహోత్రుని వలె భరింపరాని తన గొప్ప ప్రతాపము చేత కిరణములనే గుఱ్ఱాలను చెదరగొట్టి సూర్యుని కాంతి మహిమ (గొప్పదనము)ను చల్లార్చిన (తగ్గించిన) వాడు, భిన్నాభిన్నములైన (భేదింపదగిన మరియు భేదింపరాని) సమస్తపాప సమూహములను తన దయచేత అణచినవాడు, చెమటచేత కప్పబడిన చెక్కిళ్ళు కలవాడు, శ్రేష్ఠములైన మరియు మెచ్చుకోదగిన వస్తువులు, వస్త్రములు, మణులు, బంగారము మొదలైన వానిచేత సంతోషపెట్టబడిన బ్రాహ్మణు(డు)లు కలవాడు, శ్రీ యాదాద్రిపై వెలసి తన బలిష్ఠములైన భుజముల పరాక్రమము చేత ప్రకాశించుచున్న శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని నమస్కరిస్తున్నాను.
విశేషాలు: శోచిస్ అంటే వెలుగు, ప్రకాశము, కాంతి, జ్వాల మొదలైన అర్థాలున్నాయి. అగ్నికి తన కాంతిమంతములైన జ్వాలలే కేశము (శిరస్సుపై పెరిగే వెంట్రుక) లని చెప్పబడ్డాయి. అందుకే అగ్నికి ‘శోచిష్కేశుడు’ అన్న పేరు కలిగింది. అగ్నికి సర్వభక్షకుడు అన్న పేరు కూడ ఉంది. అగ్నిహోత్రుడు దహింపలేనటువంటి వస్తువు సృష్టిలో లేదు. అతని కాంతి (వేడి) ని ఎవరూ భరించలేరు. కాని జీవులు చేసిన పాపాల సమూహాలను కాని, భక్తజనుల బాధల్ని కాని దహించగల శక్తి మాత్రం ఆ అగ్నిహోత్రుడికి కూడ లేదు. సృష్టిలో సర్వశక్తిమంతుడు శ్రీహరి మాత్రమే! ‘హరి ర్హరతి పాపాని’ అని కదా ఋషివచనం! అంతటి గొప్ప శక్తిశాలి అయిన శ్రీహరి తన అఖండమైన (శోచిష్కేశGప్రతాపR) (ప్రళయకాల) అగ్నిహోత్రముతో సమానమైన తన ప్రతాపము చేత (ప్రశమితGమహిమాGఅహస్కరంR) లోకాలకన్నిటికీ వెలుగునిచ్చే సూర్యుని గొప్పదనాన్ని (అత్యంత ప్రకాశాన్ని) తగ్గింపజేశాడు. సూర్యుని కిరణాలనే అశ్వాలుగా పేర్కొంటారు. అందుకే సప్తాశ్వుడు (సప్తసప్తి ర్మరీచిమాన్) అన్నపేరు సూర్యుడికి కలిగింది. సూర్యకిరణంలో (కాంతిలో) ఏడు రంగులున్నాయని విజ్ఞానశాస్త్రవేత్తలు నిరూపించారు. (విష్కిరGఅశ్వంR) అటువంటి సూర్యకిరణాలను (గుఱ్ఱాలను) తన ప్రతాపం చేత చెదరగొట్టినవాడు విష్ణుమూర్తి!
జీవులకు పాప`పుణ్యాలను కలుగజేసేవి వారు చేసే కర్మలే. జీవులు చేసే పాపాలు అనేకాలు. కొన్ని పరిహారం చేసుకోదగినవి (భిన్నాలు), కొన్ని (అభిన్నాలు) పరిహారం లేనివి. సాధారణ పాపాలు పరిహరించగలిగినవి. మహా (పంచమహా) పాతకాలు పరిహారం లేనివి. (భిన్నGఅభిన్నGప్రసన్నGఅఖిలGకలుషGచయంR) పంచమహాపాతకాలతో సహా సమస్తములైన భిన్నాభిన్న పాపసమూహాలను కూడ శమింప (పరిహరింప) జేయగల దయాళువు విష్ణుమూర్తి!
పరమభక్తుడు, బాలుడు అయిన ప్రహ్లాదుణ్ణి రక్షించటం కోసం నరసింహాకారంతో స్తంభం నుండి ఆవిర్భవించాడు విష్ణుమూర్తి. దానవ రాజైన హిరణ్యకశిపువును వధించిన సందర్భంలో ఆ స్వామివారు (స్విన్నGసంఛన్నGగండంR) చెమటచేత కప్పబడిన చెక్కిళ్ళు కలవారిగా దర్శనమిచ్చారు. స్వేదం శ్రమకు చిహ్నం! భక్త రక్షణ దీక్షాదక్షుడైన స్వామి ఎంతటి శ్రమనైన భరించటానికి వెనుకాడడని తన చెమర్చిన చెక్కిళ్ళ చేత లోకానికి తెలియజేస్తున్నాడు.
భక్తపాలనం వరదుని నిత్యకృత్యం! అనన్యచిత్తులైన తన భక్తులు తనను అడిగినా అడుగకున్నా వారి కోరికలన్నిటినీ తీరుస్తాడు స్వామి! కుచేలుడు శ్రీకృష్ణుని భక్తుడు, మిత్రడు. ఆయన తన బాల్యమిత్రుడైన శ్రీకృష్ణపరమాత్మను దర్శించాలని ద్వారకకు వచ్చాడు. శ్రీకృష్ణుని చేత సన్మానింపబడ్డాడు. కుచేలుడు అడగకపోయినా సరే శ్రీకృష్ణుడు అతనికి సమస్తమూ అనుగ్రహించాడు. (ప్రాశస్త్యGస్తుత్యGవస్తుGఅంబరGమణిGకనకR) ప్రశస్తములైన అందరిచేత స్తుతింపదగిన వస్తువుల్ని, విలువైన వస్త్రాలను, మణి మాణిక్యాలను, స్వర్ణరాశులు మొదలైన వాటిని అనుగ్రహించి, (ప్రీణితGక్షోణిదేవంR) భూసురుడైన కుచేలుణ్ణి, సంతోషింపజేశాడు. అదీ భక్తపరతంత్రుడైన విష్ణుమూర్తి గొప్పదనం, కరుణాపూరిత హృదయం! అటువంటి శ్రీలక్ష్మీ నృసింహస్వామి శ్రీ యాదాద్రిపై నెలకొని తన ప్రచండ భుజ పరాక్రమం చేత ప్రకాశిస్తూ అందరి పూజలు అందుకుంటున్నాడు. అటువంటి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారికి తన అక్షర ప్రసూనార్చన చేత నమస్కరిస్తున్నాడు కవి.
శ్రీమతికి శ్రీనాథుని ప్రే(క్షేమ) లేఖ
ఉ. శ్రీమదసత్యమధ్యకును, చిన్ని వయారికి, ముద్దులాడికిన్
సామజయానకున్, మిగుల చక్కని ఇంతికి, మేలు కావలెన్
మేమిట క్షేమమీవరకు, మీ శుభవార్తలు వ్రాసి పంపుమా,
నామది నీదు మోహము క్షణంబును దీరదు, స్నేహబాంధవీ !
శ్రీనాథుని పద్యాలనేకం స్త్రీ అంగాంగ వర్ణనలతో కావ్యాల్లోనూ, చాటువుల్లోనూ ఉన్నాయి. చాటు పద్యాల్లో అధికంగా ఆయన శృంగారాసక్తిని, భోగ లాలసను సూచిస్తాయి. అందుకే ఆయనకు శృంగార శ్రీనాథుడని పేరు. ఆహార, ఆహార్య, విహారాల్లో ఆయన భోగజీవితేచ్ఛ అడుగడుగునా కనిపిస్తుంది. ఆయన సంచార జీవనం, నానారాజ సందర్శనం, అంకితోత్సవాలు, వాగ్విజయ సభలు, రాజ సన్మానాలు, శృంగార జీవనం చాటువుల నిండా పరచుకొన్నాయి. స్త్రీ శృంగారాన్ని వర్ణించే ఇతర కవులవి కూడా శ్రీనాథునికి అంటగట్టినవి ఉన్నాయి. కాని శ్రీనాథుని రచనలు అతని ఒడుపు, ఎత్తుగడ, పదబంధాలు, సంస్కృత సమాసాలు ఆయన శైలితో మెరుస్తూ అతనివిగానే ఋజువు చేస్తాయి.
పై పద్యం శ్రీనాథుని ఇతర పద్యాలవలె అన్యకాంతా మోహం, పర స్త్రీ సౌందర్య వర్ణనతో గాక, సభ్యవర్ణనతో భార్యను ఉద్దేశించి రాసిన వర్ణన లేదా లేఖగా కనబడుతుంది. చూద్దాం.
శ్రీమత్ = సంపదలతో లేదా సౌభాగ్యముతో కూడినది. ఈ సంబోధన పుణ్య / గౌరవ స్త్రీలకు వేసే విశేషణం. పైగా లేఖా సంప్రదాయంలో తొలిపదం. ఈ ప్రారంభపదమే ‘లేక’ అనడానికి గుర్తు.
అసత్య మధ్యకు సన్నని నడుము కలదని, చిన్ని వయారికి = చిన్న వయసులోనిదని, ముద్దులాడికిన్ = ముద్దుమురిపాలిస్తున్న నూత్న వధువు అని ఇది పెళ్లి అయిన కొత్తలోనే రాసిన పద్యంలా ఉంది. అసత్యమధ్య అంటేనే నడుం పెరగలేదని మధ్యవయస్కు ప్రౌఢ కాదని తెలుస్తోంది. దీంట్లో (ఈ విశేషణాల్లో) సభ్యత వల్ల భార్యకు వేసిన విశేషణాలుగా భావించవచ్చు. మేలు కావలెన్ = ఆశీస్సులందిస్తున్నాడు. తొలిపదం లేఖ ప్రారంభంగా, తొలి వాక్యాంత క్రియ ఆశీస్సుగా లేఖగా ధృవీకరిస్తు లేదూ? ఇది లేఖే అనడానికి ఇంకా కింద చూడండి.
మేమిట క్షేమము = తన క్షేమం తెలుపుతున్నాడు. ‘ఇట’ అంటే తన ఊరి నుండి భార్యను వదిలి బయల్దేరి, చాలా దూరం వచ్చిన ఈ పద్యం రాసిన ఊరికి (ప్రస్తుతం ఉన్నది) వచ్చేవరకు క్షేమంగా ఉన్నానంటున్నాడు. ఇది లేఖ అనడానికి మరీ కింద చూడండి.
మీ శుభవార్తలు = మీరంటే తన భార్య ఒక్కతే ఐతే ఏకవచనం ఉండేది. భార్యతో బాటు శిశువైన తన సంతానమో లేక తన ‘మదేకపుత్ర’ తల్లి లేదా తండ్రి (జీవితులుగా ఉంటే), అంటే కుటుంబం అంతా అని బహువచనం వాడినాడు. వ్రాసి పంపుమీ = ఈ లేఖ తెస్తున్న శిష్యుడు తన వద్దకు తిరిగి వచ్చేటపుడు తిరుగులేఖ ద్వారా రాసి పంపమంటున్నాడు. అయ్యా! ఇప్పటికైనా ఈ పద్యం ఉత్తరం అని ఒప్పుకుంటారుగా!
నీదు మోహము = నీపై అనురాగం, నా మది క్షణంబును దీరదు = ఎంత పనుల ఒత్తిడిలో ఉన్నా నువ్వే గుర్తు వస్తున్నావని, స్నేహ బాంధవీ! = స్నేహం (అనురాగం)తో బాంధవ్యం (తాళి గట్టిన బంధుత్వం)తో (తాకి కట్టడం బంధనం, బంధనంతో బంధుత్వం కదా లోకంలో) – పై రెంటిలో స్నేహ బాంధవ్యాలు (అనురాగం, భార్యాత్వం) కల్గిన దానా?
ఇది శ్రీనాథుని రచనే అని చెప్పడానికి పై విశేషణాలే సాక్ష్యమిస్తున్నాయి. అసత్యమధ్య, వయారి, ముద్దులాడ, సామజయాన వంటివి ఆయన తరచూ వాడే పదాలే. ప్రతి కవికీ కొన్ని పద బంధాలు పడికట్టుగా ఉంటాయి. శ్రీనాథుడు “దూరటంకాల…” పద్యంలో రావు సింగమహీ పాటని రాచకొండ రాజ్యసభలో ఎటుల మెప్పించెదో అంటూ “సరససద్గుణ నికురుంబ శారదాంబ” అని సంబోధించినాడు. తానే తిరిగి ఫిరంగిపుర శాసనాన్ని రాస్తూ “సరస సద్గుణ నికురంబ సూరమాంబ” అని శాసనకర్తిని (దాత) పేరును అదే పదబంధాలతో సూచించినాడు. “శ్రీనాథో విద్యాధికారీ శ్రీ వీరవేమభూపతేః” అని శాసనాంతంలో తన పేరును తన ‘విద్యాధికారి’ హోదాను సూచించినాడు.
శ్రీనాథుడు భార్యకు లేఖ రాయడానికి వచనం వాడాలి, కాని పద్యం (ఛందస్సు)లో రాస్తాడా? అని మెడ మీద తలకాయ ఉన్నవాడెవడూ అడుగడు. ఆయన జీవితంలో ప్రతి సంఘటనను ఛందోబద్ధం చేసినాడు. ఆఖరుకు తన ఆత్మహత్యను కూడా “అరగుచున్నాడు శ్రీనాథుడమర పురికి”అని పద్యంలో రాసుకున్న జీవకవి. ఆయనవి దొరికినన్ని చాటువులు మరే కవివి దొరకలేదు.
భార్యకు పద్య లేఖ రాయడంలో తప్పేం లేదు. ఆవిడా కవయిత్రి కావచ్చు. లేదా పద్య సౌగంధ్యానికి పరవశించే పడతి కావచ్చు. శ్రీనాథుని శ్రీమతా? మజాకా? తెలుగు కవులు తమ భార్యల గూర్చి వారి వైదుష్యం సంగతి (వారిజ భవుడెరుగు) పేరైనా చెప్పరైరి (ఒక్క కృష్ణరాయని కావ్యాల్లో తప్ప)
-డా. సంగనభట్ల నరసయ్య
9440073124
విశ్రాంత ప్రాంశుపాలుడు, ప్రాచ్య కళాశాల, ధర్మపురి
(ఈ పద్యం డా. కోడూరి ప్రభాకరరెడ్డి సంకలనం “శ్రీనాథుని చాటువులు” నుండి స్వీకరించాను.)

పెదవులపై నవ్వు

