ఇంద్రధనుస్సు
రేడియో ఒక వినోద, విజ్ఞాన ప్రసార సాధనం.
ప్రస్తుత కాలము నుండి ఒక 50 సంవత్సరాల వెనకకు వెళితే….ఇంటర్నెట్, టీవీలు, ఓటీటీలు ఇవేవీ లేని ఆ కాలంలో రేడియో ఒక్కటే వార్తలను, వినోదాన్ని అందించిన ఏకైక సాధనంగా ప్రజల మన్ననలు అందుకుంది. . రోజూ నాలుగు పూటలా పలు భాషల్లో వార్తలను ప్రసారం చేస్తూనే, పాటలు, జానపద గీతాలు, శాస్త్రీయ, లలిత సంగీతం వ్యవసాయ కార్యక్రమాలు, క్విజ్, కథానికలు,సినిమా ఆడియోలు ఇలా అన్నింటినీ సమపాళ్లలో ప్రసారం చేసిన రేడియో ప్రజల మనసును ఆకట్టుకుంది.ఓ నాలుగు దశాబ్దాల క్రితం వరకు పెద్దా, చిన్నా అందరికీ అత్యంత ఇష్టమైన వ్యాపకం రేడియో వినటం. అసలు రేడియో ఒక వింత సాధనం …. అందులోకి మనుషులు ఎలావెళ్లి మాట్లాడుతారా! పాటలు ఎలా పాడుతారా? అని ఆశ్చర్యంతో కూడిన అమాయకత్వం చాలా మందికి ఉండేది. ప్రతి ఇంట్లో పెద్దదో,చిన్నదో…. ఏదో ఒక రేడియో తప్పకుండా ఉండేది. వివిధ కంపెనీల రేడియోలు అంటే మర్ఫీ, బుష్ ,ఫిలిప్స్, నేషనల్ పానసానిక్ మొదలగునవి….. మా చిన్నతనంలో మా ఇంట్లో బుష్ రేడియో ఉండేది. దానిలో వచ్చే కార్యక్రమాలు నాకు ఇప్పటికే జ్ఞాపకమే. ఉదయం 6 గంటలకు ఆకాశవాణి, హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు సమయము 6 గంటలు అని చెప్పేవారు. రేడియో వింటున్న ప్రతి ఒక్కరు గడియారంలో సమయాన్ని (టైం ని) సరిచేసుకునేవారు. వందేమాతర గీతంతో రేడియో ప్రసారాలు ప్రారంభమయ్యేవి. 6.10 నిమిషాలకు ప్రసారకర్త (అనౌన్సర్) ఆ రోజు కార్యక్రమాల వివరాలు తెలిపేవారు.6.30 నిమిషాలకు… సంస్కృతం నేర్చుకుందాము అనే కార్యక్రమం ‘బర్తృహరి’ శ్లోకముతో మొదలయ్యేది.
“కేయూరాణి న భూషయంతి పురుషం, హారాణ చంద్రోజ్వలా
న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృత మూర్దజాః
వాణ్యేకా సమలంకరోతి పురుషం, యా సంస్కృత ధార్యతే, క్షీయంతేఖిల భూషణాని సతతం, వాగ్భూషణం భూషణం.” 6.45 నిమిషాలకు సంస్కృతంలో వార్తలు… ‘ఇయం ఆకాశవాణి సంప్రతి వార్తాహః శుయంతాం ప్రవాచకః బలదేవానంద సాగరః’ అని మొదలయ్యేవి. 7.10 నిమిషాలకు ఢిల్లీ నుండి తెలుగులో వార్తలు ‘అద్దంకిమన్నార్’ చదివేవారు. మధ్యాహ్నం ఢిల్లీ నుండి ‘ప్రాంతీయ వార్తలు’ అద్దంకిమన్నారు, కందుకూరి సూర్యనారాయణ ,పార్వతీ ప్రసాద్ వీళ్లలో ఎవరో
ఒకరు చదివేవారు. తర్వాత కార్మికుల కార్యక్రమం… చిన్నక్క ఏకాంబరం, పీతాంబరం నిర్వహించేవారు.ప్రభుత్వ పథకాలు,కార్మికులు-వారి హక్కులు,బాధ్యతలను తెలియజేస్తూ మధ్య మధ్యలో చిత్ర గీతాలు ప్రసారం చేసేవారు.ఆ తర్వాత ప్రాంతీయ వార్తలు ప్రయాగ రామకృష్ణ లేక తిరుమల శెట్టి శ్రీరాములు వారిలో ఎవరైనా ఒకరు చదివేవారు.సరిగ్గా మధ్యాహ్నం ఒంటిగంటకి ‘పాడి-పంటలు’ కార్యక్రమం మొదలయ్యేది. పాడిపంటల కార్యక్రమము తర్వాత ‘మనోరంజని’ మీరు కోరిన పాటలు వింటారు అని మీనాక్షి (లేక )ఏవీఎస్ రామారావు ప్రకటించగానే ఇంట్లో అందరం ఎంతో శ్రద్ధగా ఆ పాటలు చెవులు రిక్కించి వినేవాళ్ళం. అరగంట ఎటువంటి ప్రకటనలు లేకుండా మంచి మంచి పాటలు వేసేవారు. మధ్యాహ్నం 2.00 గంటలకు ఢిల్లీనుండి వార్తలు అని చెప్పేవారు. ఇంగ్లీషులో వార్తలు ఢిల్లీనుండి ప్రసారమయ్యేవి. స్పష్టమైన ఇంగ్లీషులో వార్తల ప్రసారం సాగేది.సాయంత్రం 6 గంటలకు’ఉర్దూలో వార్తలు,ఏడు గంటలకు ‘ఇల్లు- వాకిలి’ కార్యక్రమము,7.30 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు ఢిల్లీ నుంచి ప్రసారమయ్యేవి.ఇక రాత్రిపూట చిత్రలహరి ‘మధురిమ’ అంటూ పాటలు వేస్తుండేవారు. ఆ తర్వాత ఢిల్లీ నుండి శాస్త్రీయ సంగీత కార్యక్రమం వెలువడేది. ఉద్దండులైన కళాకారుల స్వర విన్యాసాన్ని సంగీతాభిలాషులు ఎంతో శ్రద్ధా,భక్తులతో ఈ కార్యక్రమాన్ని ఆలకించేవారు. ఇక రాత్రి 10 గంటలకు హరికథలు, నాజర్ బృందంచే బుర్రకథలు, సాంఘిక నాటకాలు, నాటికలు, ప్రసారమయ్యేవి.
ఇక ‘సిలోను’లో హిందీ పాటలు వచ్చేవి. మధ్యాహ్నం కొన్ని తెలుగు పాటలు, సాయంత్రం 5గంటలకు దక్షిణ భారతదేశపు ప్రాంతీయ భాషలలో పాటలు వచ్చేవి, (కన్నడ, తమిళం, తెలుగు, మలయాళం )వాళ్లు ప్రసారం చేసే ఒక తెలుగు పాట కోసం పడిగాపులు పడి అన్ని భాషల పాటలు వినేవాళ్ళం. సిలోన్ రేడియోలో ప్రసారమయ్యే ‘బినాకా గీతమాల’ అంటే అందరికీ ఇష్టమే. సిలోన్ స్టేషన్ సరిగ్గా వచ్చేది కాదు. చెవి దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా వినే వాళ్ళము. పండగలప్పుడు ప్రత్యేక ‘జనరంజని’ ఉండేది. దానిలో ఆయా పండుగలకు సంబంధించిన పాటలు ప్రసారమయ్యేవి. పండుగలప్పుడు సినిమానటులతో
గాని,గాయకులతో గాని ప్రత్యేక కార్యక్రమం ఉండేది. ఆ కార్యక్రమం మధ్యలో వాళ్లు నటించిన లేక, పాడిన సినిమా పాటలు వేసేవారు. ఇవే కాకుండా ‘పుష్పాంజలి’ భక్తి సంగీత కార్యక్రమం, ప్రతి శనివారం ‘శ్రీవెంకటేశ్వర సుప్రభాతం’, ఉషశ్రీ ‘రామాయణ,మహాభారతాలు’,వినోదవల్లరి,ఇక తెలుగు పాటలలో… ఏకచిత్రా గానమని, మీరు కోరిన పాటలని, చిత్రతరంగిణి అని ప్రసారం చేసేవారు. సైనిక సోదరుల కొరకు ప్రత్యేక ‘జయమాల’ హిందీ సినిమా పాటల కార్యక్రమం వచ్చేది. ఇంట్లో ఆడవాళ్లు రేడియోలో పాటలు ,ఇతర కార్యక్రమాలు వినుకుంటూ ఇంటి పని, వంటలు చేసుకునేవారు.రేడియోలో ఏమైనా ఇష్టమైన సినిమా పాటలు వస్తే పిల్లలు గానీ,పెద్దలు కానీ ఆ పాట తో శృతి కలిపేవారు.వాళ్ళ గొంతు బాగుందా లేదా అనేది తర్వాత సంగతి.అది వారికి సంతోషాన్ని కలిగించేది.రాగ యుక్తంగా పాడటమే కాకుండా కొందరు ఔత్సాహికులు అవి నేర్చుకోవాలనే తాపత్రయంతో రాసుకోవాలని పెన్ను, పుస్తకం తయారుగా పెట్టుకొనేవారు.రేడియో పుణ్యాన మా తరం వారికి మరియు మా కంటే ముందు తరాల వారికి కూడా పాటలన్నీ చాలావరకు నోటికి వచ్చేవి. పిల్లల పరీక్షల టైములో రేడియో వినడానికి పెద్దల ఆంక్షలు కొద్దిగా కఠినంగానే ఉండేవి. పరీక్షలు అయ్యేదాకా రేడియో విననిచ్చేవారు కాదు. ప్రజా ప్రతినిధులు అంటే… రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి,ముఖ్యమంత్రి, గవర్నర్, స్పీకర్లు, మంత్రులు…వీరిలో ఎవరు అస్తమించిన రేడియోకి సంతాపదినాలు ప్రకటించేవారు. వాళ్ళ పదవిని బట్టి సంతాపదినాలు ఉండేవి. మొదటి 2,3 రోజులు విషాదసంగీతము,చివరికి వచ్చేవరకు భక్తిగీతాలు మొదలయ్యేవి. మా అందరికీ సంతాపదినాలలో ఏమి తోచనట్టు, కాలం చాలా భారంగా గడిచేది. ఆదివారం వచ్చిందంటే పిల్లలకు,పెద్దలకు పండుగే. మధ్యాహ్నము 2గంటలకు ఢిల్లీ నుండి ఆంగ్లవార్తల తర్వాత 2.10 నిమిషాల నుండి 3 గంటల వరకు బాలానందము…. అనే కార్యక్రమం ప్రసారమయ్యేది. పిల్లలందరము రేడియో చుట్టూ కూర్చుని ఎంతో శ్రద్ధగా,ఇష్టంగా బాలానందం కార్యక్రమాన్ని వినేవాళ్ళం.ఎంతో సరదాగా అనిపించేది మాకు.1950 నుండి ప్రసారం చేయబడిన బాలానందం వినని వారు ఉండరు. న్యాయపతి రాఘవరావుగారు రూపొందించిన ఈ కార్యక్రమము చాలా ఉత్సాహంగా నిర్వహించ బడేది.బాలానందం కార్యక్రమం మొదట పిల్లల పాటతో మొదలయ్యేది. అది ఈ విధంగా…. ‘రారండోయ్- రారండోయ్ పిల్లల్లారా- రారండోయ్, పిల్లల్లారా- రారండోయ్, బాలబాలికలు -రారండోయ్ బాలవినోదం వినరండోయ్. రారండోయ్-రారండోయ్.
హైదరబాదు బాలలము జైహింద్ అంటూ పిలిచాము. జై జై మంటూ రారండోయ్ రేడియో ప్రోగ్రాం వినరండోయ్… రారండోయ్- రారండోయ్’. రేడియో అక్కయ్య, రేడియో అన్నయ్య కార్యక్రమానికి వచ్చిన పిల్లలతో చిన్న పిల్లల పాటలు, శ్లోకాలు, పద్యాలు, సామెతలు, పొడుపు కథలు , క్విజ్, జనరల్ నాలెడ్జ్ విషయాలు ఎన్నో చెప్పించి ఆ కార్యక్రమాన్ని ఎంతో ఆనందంగా నడిపేవారు.మూడు గంటలకు నిమిషం ఉందనగా కార్యక్రమం అయిపోయేది.ముగింపు పాటకూడా ఈవిధంగా ఉండేది.’చాలు ఇంకా ఆటలు, మన పాటలు… మన మాటలు, చక చక చక చక పోదామా…
.ఇండ్లకు మనఇండ్లకు,బిర బిర బిర బిర పోదామా….బిర బిర బిర బిర పోదామా…..
సరిగ్గా 3గంటలకు సంక్షిప్త శబ్దచిత్రం మొదలయ్యేది. మూడుగంటల నిడివి ఉన్న సినిమాని ఒక గంట సినిమాగా కుదించి ప్రసారం చేసేవారు.ఎంతో ఆసక్తికరంగా పిల్లలు, పెద్దలు రేడియో చుట్టు చేరి కూర్చొని ప్రసారమవుతున్న సినిమాని వినేవారు. ప్రతి ఆదివారం మధ్యాహ్నం రెండుగంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు బజారులో రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనపడేవి. అంటే…అందరూ ఆ సమయములో రేడియోకి అతుక్కుపోయేవారు అన్నమాట…. ఇంకేముంది సినిమా అయిపోయిన తర్వాత మళ్లీ ఆదివారం ఎప్పుడొస్తుందా?అని మా లాంటి పిల్లలందరూ ఎదురుచూపులు.ఆదివారం సాయంత్రం నాటికలు, నాటకాలు ప్రసారమయ్యేవి. ఆ నాటకాలలో నండూరి సుబ్బారావు, వీ.వీ. కనకదుర్గ ,పాండురంగ విఠల్, ఏ.వీ.ఎస్. రామారావు వీళ్ళ పేర్లు ఎక్కువగా వినిపించేవి. అచ్చమైన తెలుగు ఉచ్చారణతో నాటకాలు చాలా ఆసక్తికరంగా సాగేవి.రేడియోలో క్రికెట్ కామెంటరీ,వాతావరణ విశేషాలు కూడా ప్రసారమయ్యేవి. రెండు, మూడు రోజులు భారీ వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం వారు సూచిస్తే…. బాగాఎండలు కాస్తాయని, ఒడియాలు ఎండ పెట్టుకోవచ్చని హాస్యంగా మాట్లాడుకునే వాళ్ళు లేకపోలేదు….. ఎందుకంటే వాతావరణ కేంద్రంవాళ్ళు సూచించిన విధంగా వర్షాలు పడేవి కావు. 😀😀
కాలక్రమేణా రేడియో కార్యక్రమాలలో ఎన్నో మార్పులు వచ్చాయి. కొత్త, కొత్త కార్యక్రమాలు వచ్చాయి. మేము హై స్కూల్ చదువులకు వచ్చాక… 1977 నుండి ‘వివిధ భారతి’ వాణిజ్యప్రసార విభాగం మొదలైంది. ప్రతిరోజు ఉదయం 8గంటలకు భక్తి సంగీతాల కార్యక్రమం ‘అర్చన’ తర్వాత, 8:30 కి ‘వివిధ భారతి ‘వాణిజ్య ప్రసార (పాటల) కార్యక్రమం మొదలవుతుంది. మంచి, మంచి సినిమాపాటలు వేస్తూ.. పాటలమధ్యన ప్రకటనలు వేస్తారు. ‘వివిధ భారతి’ ప్రసారం మధ్యలో సమయం 9 గంటలు కాగానే ‘హోటల్ మమత’ విజయవాడ వారి సమయం 9 గంటలు అనే ప్రకటన వచ్చేది. అమ్మో! 9గంటలు అయింది అని మేము పాఠశాలకు వెళ్లేవాళ్ళం. ప్రస్తుతం అనేక ప్రైవేట్ సంస్థలు దేశవ్యాప్తంగా ‘ఎఫ్.ఎం రేడియో’ ఛానళ్ళ ను ప్రారంభించాయి.రేడియో కార్యక్రమాలలో ఎన్ని మార్పులు వచ్చినా… మనకు గుర్తొచ్చేది ఆ నాలుగు దశాబ్దాల కాలం నాటి రేడియో కార్యక్రమాలు మరియు అంకితభావంతో పనిచేసిన ఆకాశవాణి ఉద్యోగులు మాత్రమే.వారికి ధన్యవాదములు తెలుపుకుందాం. నానా విధాలుగా ఆనందాన్ని, వినోదాన్ని అందించిన రేడియో మనకు ఒక అపురూపమైన కానుక. ఎన్ని ప్రసార మాధ్యమాలు ఉన్నప్పటికీ… రేడియోకి ఆదరణ తగ్గలేదు.ఇప్పటికీ రేడియో కార్యక్రమాలు అంటే ఇష్టపడే రేడియో ప్రియులు ఉన్నారంటే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. రేడియో అభిమానులలో నేను కూడా ఒకదాన్ని.ఆ అభిమానమే రేడియో గురించి రాయాలనే ప్రేరణ నాకు కలిగించింది.మనకు, విజ్ఞాన,వినోదాలను అందించిన రేడియోను కనిపెట్టిన ‘మార్కోని’ కి మనం ఎంతో ఋణపడి ఉన్నాము అని చెప్పక తప్పదు.
సాహిత్యం సార్వజనీనమైనది, సాహిత్యం ఓ అంతశ్చేతన, మనః స్పందనల నుండే చక్కటి భావాలు అక్షరీకరించబడతాయి. ప్రతిలేఖనంలో వాస్తవికత,
కళాత్మకత, జన జాగృతి
కలిగిస్తూ,సమాజహితాల్ని నిజ దర్పణంలో చూపేదే సాహిత్యం. సాహితీ సభలు నిర్వహించడం వల్ల ఎన్నో విషయాలు తెలుస్తాయి. సాహితీవేత్తలు తమ అనుభవాల్ని వెల్లడించే క్రమంలో, వర్ధమాన రచయితలు తమ కలాలను పదునెక్కించుకుని స్ఫూర్తి పొంది తమను తాముతెలివిగా మలుచుకునే అవకాశం ఉంటుంది. శ్రీమతి నిహారిణిగారి పుస్తకావిష్కరణ సభలో ప్రసంగిస్తున్న డబ్బీకార్ గారిని చూసాను.
మృదు గంభీర స్వరం, వాక్పటిమ, సందర్భోచిత వాగ్ఝరి ఒక వక్తకు కావలసిన ప్రధాన లక్షణాలని నా భావన .ఆ కోవలోని వారే పెద్దలు శ్రీ రూప్ కుమార్ డబ్బీకార్ గారు.
వారితో నా మొదటి పరిచయం తెలంగాణా రచయితల సంఘం,
జంట నగరాల శాఖ వారు శ్రీ కందుకూరి శ్రీరాములు గారు, శ్రీ బెల్లంకొండ సంపత్ కుమార్ గార్ల ఆధ్వర్యంలో, ప్రతి సోమవారం అంతర్జాలం వేదికగా నిర్వహించే సోమవారం కవి సమ్మేళనంలో.
అందరి కవితలు వింటూ ,తాము సైతం ఓ కవిత చదివి చివరగా తమ అభిప్రాయం చెప్పే కొద్ది మందిలో వీరొకరు. నిక్కచ్చిగా చెప్తారు, ఒక్కోసారి కవితాఛాయలు లేక కేవలం వచనంలా ఉన్నాయంటారు. ఒక సద్విమర్శకుడు దిక్సూచి లాంటివాడని నా అభిప్రాయం. సద్విమర్శ ఎప్పుడూ ఆహ్వానించ తగ్గదే ! తమలోని రచనాపటిమకు మెరుగులద్దుకునే అవకాశానికి ఇది తొలిమెట్టు లాంటిది .
నేను ఈమధ్య చాలా వేదికలమీద డా. రూప్ కుమార్ డబ్బీకార్ గారు
ప్రసంగించడం చూస్తున్నాను. వాగాడంబరం ఉండదు, చెప్పాలనుకున్నదాన్ని సంక్షిప్తంగా, సరైన రీతిలో, ప్రశాంతంగా వెల్లడిస్తారు. సోదరి శ్రీమతి కొండపల్లి నిహారిణి గారి నాలుగు పుస్తకాల ఆవిష్కరణ సభలో వీరు మూడవ సెషన్ కు ఆత్మీయ అతిథిగా విచ్చేసి’ కథామయూఖం’, ‘బాలమయూఖం’ పత్రికల కథా సంకలనాల ఆవిష్కరణ సభలో ప్రసంగిస్తూ, తమ మృదుగంభీర వచనాలతో సోదరి నిహారిణిని విదుషీమణిగా అభివర్ణించారు. వివిధ ప్రక్రియల్లో తన అసామాన్య ప్రతిభాపాటవాలతో ముందుకు దూసుకెళ్తున్న తీరుకు హర్షం వ్యక్తం చేస్తూనే, వేదికలపై సాహితీ దిగ్గజాలు ,ఆమెను గూర్చి ఎన్నో విశేషాలు చెప్పారంటూ ఇంకా తాను ఏది మాట్లాడినా పునరుక్తం ఔతుందనే సందేహాన్ని వ్యక్తం చేస్తూ, పొదుపైన తమ మాటలతో ‘కథామయూఖం’, ‘బాలమయూఖం’ పుస్తకాలకంటే ముందుగా స్త్రీవాద సాహిత్య వ్యాసాల్ని’ అనివార్యం’ పేరుతో వెలువరించడం సముచితమైన నిర్ణయంగా పేర్కొన్నారు.
వక్తలందరూ చెప్పినట్లుగా నిహారిణి గారి కుటుంబనేపథ్యం ప్రేరణత్మకమైనా, పుట్టింటి పోరాట చైతన్యాన్ని ,మెట్టినింటి కళా చైతన్యాన్ని ఒద్దిరాజు సోదరుల సాహితీ చైతన్యాన్ని (సృజన శీలత) తనలో నింపుకొని, ‘సామాజిక చైతన్యం’తో కొత్త ఊపిరి పోసుకొని తనకు తానే దిశా నిర్దేశం చేసుకున్న ఓ ఆశావాది అంటూఅభివర్ణించారు. ‘వర్జినియా వూల్ఫ్’ అనే ఓ స్త్రీవాద రచయిత్రి ,ఉద్యమకారిణి మాటలను ఉటంకిస్తూ – సుప్రసిద్ధ నాటక రచయిత షేక్స్పియర్ సోదరి ‘జుడిత్’ పాత్ర ను సృష్టిస్తూ ఆమె ఇలా అంటారు. అంత గొప్ప రచయితకు సోదరి, ఒకే డి.ఎన్.ఏ . కలిగిన జుడిత్ మామూలు రచయిత్రిగా కూడా ఎందుకు కాలేకపోయిందని ప్రశ్నిస్తూనే, పితృస్వామ్య, పురుషాధిక్య ప్రపంచంలో ఆమెను ఇంటి వరకే పరిమితం చేయడం అంటారు
‘వూల్ఫ్ ‘.
సరైన పరిస్థితులు, అవకాశాలు ఉండి ఉంటే ఆమె కూడా అద్భుత సాహిత్యం సృష్టించేదేమో అంటారామె. “A Room Of One’s Own ” అనే తమ రచనలో స్త్రీకి కొంత ఆర్థిక సౌలభ్యం మరికొంత ఏకాంత వాతావరణం ఉంటే ప్రశాంతంగా సాహితీ సేవ చేసుకునే వెసులుబాటు ఉంటుందనేది ఆమె భావన. అదే రీతిలో నిహారిణిగారు కూడా లౌక్యంగా వాటిని భాగస్వామి సహకారంతో సొంతం చేసుకున్న నేర్పరి అంటూ చమత్కరిస్తూనే ఆమెకు అన్నీతానై వెన్నంటిఉన్న శ్రీ వేణుగోపాలరావు గారిని అభినందిస్తున్నానన్నారు డబ్బీకార్ గారు. తండ్రి ప్రేరణ ,మామగారి స్ఫూర్తి, భర్త సహకారాలతో గట్టి మనోబలంతో దూసుకుపోతున్న ఆమె, మరిన్ని అద్భుతాలు సృష్టించాలని మనసారా ఆకాంక్షిస్తున్నానని పేర్కొన్నారు. తనకిచ్చిన ఆత్మీయ సభాతిథ్యానికి ధన్యవాదాలు అంటూ చక్కని భాషణం చేసారు శ్రీ రూప్ కుమార్ డబ్బీకార్.
నాకు తెలిసి సోదరి శ్రీమతి నిహారిణిగారు పెళ్ళితో చదువుకు స్వస్తి చెప్పకుండా, ఉన్నత చదువులు కొనసాగిస్తూనే వ్యాసంగానికి కూడా అంతే ప్రాధాన్యతనిచ్చి తన జ్ఞానతృష్ణను తీర్చుకునే క్రమంలో సాహితీ ప్రక్రియ లెన్నిటినో స్పృశిస్తూ ,తన కలం ద్వారా సమాజాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నారు.వారి నిరంతర సాధనే నేటి ఈ విజయ సోపానం అని నా భావన. ఇదే విషయాన్ని రూప్ కుమార్ గారూ అనడం గమనిస్తాం. ఎన్ని సౌకర్యాలు ఉన్నా కవిత్వం అంటే మక్కువ, భాష మీద పట్టు సాహిత్య సృజన చేయాలన్న శ్రద్ధాసక్తులు లేకుంటే ఇలా ఇన్ని పుస్తకాలు, గ్రంథాలు నీహారిణి వెలువరించేవారా? అనే అభిప్రాయం వ్యక్తం చేసారు. ఒక రచయితను సరిగ్గా అంచనా వేయగలిగేది మరో రచయితనే అనడానికి నిదర్శనం రూప్ కుమార్ డబ్బీకార్ గారు ఉదాహరణగా నిలుస్తారు. రచనలపై లోతైన విశ్లేషణ చేయడం వల్ల కొత్త రచయితలకు ఎంతో మేలు చేకూరుతుందనేది నిర్వివాదాంశం.
తెలుగు భాషలో వాగ్దేవతల యొక్క వర్ణమాల దాని అంతర్నిర్మాణం :
🌸”అ నుండి అః” వరకు ఉన్న 16 అక్షరాల విభాగాన్ని “చంద్ర ఖండం” అంటారు. ఈ చంద్రఖండంలోని అచ్చులైన 16 వర్ణాలకు అధిదేవత “వశిని” అంటే వశపరచుకొనే శక్తి కలది అర్ధం.
🌺”క” నుండి “భ” వరకు ఉన్న 24 అక్షరాల విభాగాన్ని ” సౌర ఖండం ” అంటారు. “మ” నుండి “క్ష” వరకు ఉన్న 10 వర్ణాల విభాగాన్ని ” అగ్ని ఖండం” అంటారు. ఈ బీజ శబ్దాలన్నీ జన్యు నిర్మాణాన్ని క్రోమౌజోములను ప్రభావితం చేయగలుగుతాయి.
🌺సౌర ఖండంలోని ” క “నుండి “ఙ” వరకు గల ఐదు అక్షరాల అధిదేవత కామేశ్వరి. అంటే కోర్కెలను మేలుకొలిపేది అని అర్ధం.
🌺”చ” నుండి “ఞ” వరకు గల ఐదు వర్ణాలకు అధిదేవత “మోదిని” అంటే సంతోషాన్ని వ్యక్తం చేసేది.
🌺”ట” నుండి “ణ” వరకు గల ఐదు అక్షరాల అధిదేవతా శక్తి “విమల”. అంటే మలినాలను తొలగించే దేవత.
🌺”త” నుండి “న” వరకు గల ఐదు అక్షరాలకు అధిదేవత “అరుణ” కరుణను మేలుకొలిపేదే అరుణ.
🌺”ప” నుండి “మ” అనే ఐదు అక్షరాలకు అధిదేవత “జయని”. జయమును కలుగ చేయునది.
🌺అలాగే అగ్ని ఖండంలోని ” య, ర,ల, వ అనే అక్షరాలకు అధిష్టాన దేవత ” సర్వేశ్వరి”. శాశించే శక్తి కలది సర్వేశ్వరి.
🌺ఆఖరులోని ఐదు అక్షరాలైన “శ, ష, స, హ, క్ష లకు అధిదేవత “కౌలిని”
🙏ఈ అధిదేవతలనందరినీ “వాగ్దేవతలు” అంటారు. అయితే ఈ ఏడుగురే కాకుండా అన్ని వర్ణాలకు ప్రకృతిలో ఒక రూపం, ఒక దేవతాశక్తి ఉంది. ఎందుకంటే శబ్దం బ్రహ్మ నుండి ఉద్భవించింది. అంటే బ్రహ్మమే శబ్దము. ఆ బ్రహ్మమే నాదము.
🌸మనం నిత్యజీవితంలో సంభాషించేటప్పుడు వెలువడే శబ్దాలు మనపై, ప్రకృతి పై ప్రభావం చూపుతాయి. అదే మంత్రాలు, వేదం అయితే ఇంకా లోతుగా ప్రభావం చూపుతుంది. భూమి మీద పుట్టిన ప్రతి జీవి ఈ శబ్దాల్ని ఉచ్ఛరించి అమ్మవార్లును అర్చిస్తున్నాయి.
🌺కాబట్టి మనం స్తోత్రం చదువుతున్నా, వేద మంత్రాలు, సూక్తులు వింటున్నా మనం ఈ విషయం స్ఫురణలో ఉంచుకుంటే అద్భుతాలను చూడవచ్చు. మనం చదివే స్తోత్రం ఎక్కడో వున్న దేవుడిని/దేవతను ఉద్దేశించి కాదు, మనం చదివే స్తోత్రమే ఆ దేవత. మనం చేసే శబ్దమే ఆ దేవత. మన అంతఃచ్ఛేతనలో ఉండి పలికిస్తున్న శక్తియే మన ఉపాస్య దేవత. ఆ శబ్దం వలన పుట్టిన నాదం దేవత. ఎంత అద్భుతం. ఇది మన తెలుగు వైభవం.ఇది సనాతన ధర్మం. ఇది మనకు మాత్రమే పరిమితమైన అపూర్వ సిద్ధాంతం……
సత్యమె మనజాతి, నీతి / సత్యాచరణే
సత్య హరిశ్చంద్రు కథయే
సత్యము గాంధిని మహాత్ము సలిపెన్ భక్తా !
ఆంధ్ర భాగవతపు / టందాల వెన్నుచు
జన్మ ముగియులోన / చదువవలెను
ధన్యుడైతి వోయి / ‘తన’ పోవ(గ) పోతనం
”పోత” ”నా భవాబ్ధి” / నే తరింతు. – ఎం.కె. ప్రభావతి
అది కర్నాటక రాష్ట్రంలోని మధురగిరి తాలూకాలోని తుంకూరు జిల్లాలో ఉన్న దొడ్డధలి గ్రామం. ఆ గ్రామంలో 78-79 సం|| క్రితం జన్మించిన ఒక ‘పాప’, ఎక్కడో తెలుగు రాష్ట్రంలో వృత్తిరీత్యా సైన్సు ఉపాధ్యాయురాలుగా ఆ తర్వాత రైల్వే విద్యాలయం, జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ గా పనిచేసి, మంచిపేరు సంపాదించి, జీవితంలో ఎన్నో ఒడుదుడుకులు, ఎత్తుపల్లాలు దాటి, శ్రీ పొత్తపి శ్రీనివాసరావు గారి అర్ధాంగియై, ముగ్గురు పిల్లలకు తల్లై ఆ తర్వాత, వాగ్ధేవి అద్భుత, అనూహ్య, అఖండ దివ్య కరుణకు పాత్రురాలై, తెలుగు సాహిత్యాన్ని మధించి, తొలి తెలుగు మహిళావధానిగా, దేశ విదేశాలలో తెలుగు కీర్తి చంద్రికలు వ్యాప్తి చేస్తుందని ఎవ్వరూ ఊహించలేదు.
తనను ప్రేమించిన వ్యక్తికి 2 షరతులు పెట్టి, ఇంటి పెద్దకుమార్తెగా, తల్లిని పోషిస్తూ, సోదర, సోదరీమణుల జీవితాలు సరిదిద్దాల్సి ఉంటుందని, వారికి స్వావలంబన వచ్చేవరకు మనమే వారికి అన్నీ చూడాలని పెట్టిన అమ్మాయి, ఆ షరతులను తు.చ. తప్పక పాటించి తీరుతుందని, తనకూ భార్యగా ఏ లోటు రానీయక, ఉద్యోగ ధర్మాలు నెరవేరుస్తూనే, తెలుగు అవధాన గగనంలో సముజ్వల తారగా వెలుగొందుతుందని, ఆ భర్తగాని, వివాహానికి హాజరయిన వారుగాని అస్సలు అనుకోలేదు.
తమకు సైన్సు పాఠాలు చెప్పిన ‘పంతులమ్మ’ తెలుగు అవధానంలో ఒక చరిత్ర సృష్టిస్తుందని 1966 నుండి 2006 వరకూ ఆమె దగ్గర చదువు నేర్చిన ఏ విద్యార్థి భావించలేదు.
అమ్మ తమకు ఏ లోటూ రానీయకుండా పెంచి పెద్దచేస్తూనే తెలుగు ప్రాచీన, ఆధునిక కావ్యాలను ఆపోశన పడుతూ, ఆశువుగా పద్యాలు చెప్పగలిగే స్థాయికి వెళ్ళి అన్ని ఛందస్సులలోనూ రచనలు చేసినదని, ”శ్రీనరసింహ శతకము”, ”రామా! నీ కథ వినుమా!”, ”భవాబ్ది పోతము”, ”భక్తి అంటే?”, ”శ్రీ విద్యాస్తుతి”, ”చదువు”, ”నవ్వు నవ్వించు”, ”చాటువులు”, ”వ్యాస కదంబం”, ”దేవుడొక్కడే” వంటి అద్భుత, అనితర సాధ్య రచనలు చేసి, కన్నవూరికి, తాను ఉద్యోగాలు చేసిన ఊళ్ళకు, నివసించిన ఊరికి ఘనకీర్తి తెచ్చి, ”తాము ఆమె సంతానం” అన్న గౌరవం తమకు దక్కేస్తుందని వారూ అనుకోలేదు.
తానా సభలు (అమెరికా) ఆమెను ఘనంగా సన్మానించి, తద్వారా తాము గౌరవం పొందుతామని ప్రత్యేకంగా ఆలోచించలేదు. తోటి అవధానుల అవధానంతో పృచ్ఛకురాలిగా, ఎన్నో సాహిత్య ఆధ్యాత్మిక సమావేశాలకు, సభలకు ముఖ్యఅతిథిగా పాల్గొన్న శ్రీమతి ప్రభావతి స్నేహశీలి, నిగర్వి, జిజ్ఞాసువు, హాస్యచతురత, సంభాషణా కుశలత, సహృదయ స్పందనతో ఎందరినో ప్రోత్సహించిన మృదుభాషిణి, మధురభాషిణి. ఎందరో వర్ధమాన కవుల, రచయితల రచనలకు (ఈ వ్యాసం వ్రాస్తున్న నాతో సహా) చక్కని, చిక్కని, ప్రోత్సాహకమైన, నిర్మాణాత్మక ‘మున్నుడి’ వ్రాసి, అర్థవంతమైన, నొప్పించని శైలిలో, ఆ రచనలను విమర్శ చేసిన విధుషీమణి. మచ్చుకి –
”పద్యంలో ఏ పాదానికా పాదంలో సంపూర్ణమై, అర్థాన్ని ఇవ్వగలిగితే అది సుందరంగా ఉండటమేకాక పాఠకునికి అర్థాన్వయంలో కాఠిన్యమనిపించదు. ఈ లక్షణాన్ని మీరు పట్టుకున్నారు. ఎటువచ్చీ దాన్ని నాలుగు పాదాలలో ఉపయోగించడం వలన ‘చెవికింపు’ మాత్రమే పొందారుగాని పద్యానికి రాదగిన రావలసిన ”చైతన్యం” కొన్ని పద్యాలలో మీరు అందించలేకపోయారు. (మీరు = డా.లక్ష్మణాచార్యులు)
”నేను వ్రాసిన విమర్శలో మొగమాటానికి, ముఖస్తుతికి తావు లేదు. వ్రాసిన ప్రతి మాటకు విలువ అందులోని సత్యమే సుమా!”
”ఈ కవి మంచి భావుకుడు” (అభినందనలు- (దృశ్యాదృశ్యాలు- (ఈ వ్యాసరచయిత పుస్తకం) ఎం.కె. ప్రభావతి)
అమలాపురంలోని ‘త్రివేణి’ సంస్థ ‘అవధాన భారతి’ అని బిరుదును ఇచ్చింది. ‘తానా’ (అమెరికా) రెండుసార్లు (2002 & 2004) ప్రథమ మహిళా అవధానిగా సన్మానించింది. పో.శ్రీ. తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కారాన్ని ఇచ్చి గౌరవించింది.
భారతీయ సంస్కృతిని, హిందూ సంప్రదాయాన్ని, మానవ విలువల్ని, తెలుగు భాష సాహిత్యాలను ఎంతగానో ప్రేమించిన ప్రభావతి భౌతికంగా లేకున్నా, ఆమె యశస్సనే కాయానికి జరా మరణములు ఉండవు. ఆమె సాహిత్య సేవలు అవిస్మరణీయాలు, అనుస్మరణీయాలు.
ఆ రోజు ఉదయం హైదరాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరి త్రిపుర లోని మహారాజా బీర్ విక్రమ్ విమానాశ్రయం అగర్తలా కి చేరే సమయానికి మమ్మల్ని ఆహ్వానించడానికి అగర్తలోని మిత్రులు మా కోసం బయట నిరీక్షిస్తున్నారు. (Photo 1) మిత్రులందరికీ అగర్తలా లోని మాకు కేటాయించిన అతిథి గృహం కు వెళ్లడానికి చాలా సమయమే పట్టింది. దారికి ఇరువైపులా నేల కనపడనంత వివిధ రకాల మొక్కలు, చెట్లు, పొదలతో పాటు ప్రతి ఇంటి ముందు ఇంటికంటే విశాలమైన ఇంకుడు గుంతలు వాటిలో సమృద్ధిగా నిలిచి ఉన్న నీరు సంబ్రమాశ్చర్యాలకు గురి చేసింది రకరకాల మొక్కలు కొన్ని వందల సంవత్సరాలుగా నిటారుగా పెరుగుతున్న చెట్లు, గుబురుగా సమూహాల్లాగా వెదురు చెట్లతో నిండి ఎటు చూసినా ఆ ప్రాంతమంతా పచ్చదనంతో ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. ప్రకృతిలో మైమరచి పూర్తిగా లీనమై పోవడం వల్ల మా అతిథి గృహం చేరింది కూడా గమనించుకోలేకపోయాము.
లగేజ్ తో సహా మాకు కేటాయించిన గదికి వెళ్లి సేద తీరాము అతిధి గృహంలో సైతం వెదురు బొంగులతో తయారుచేసి ప్రదర్శించబడుతున్న వివిధ వస్తువుల్ని చూసి కొనుగోలు చేయవలసిన వస్తువుల జాబితా రాసుకుని ఆరోజు కార్యక్రమాలు ముగించుకొని లోకల్ మార్కెట్ లోని షాపింగ్ కి వెళ్ళాం. ముఖ్యంగా యాత్రలంటే అత్యుత్సాహం ప్రదర్శించే నాకు ఇండియాలోని చాలా చారిత్రక ప్రదేశాలు అయితే దర్శించుకోవడం జరిగింది.కానీ ఎక్కువగా ఇష్టపడి వెళ్లాలనుకున్న ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లడం మాత్రం వీలు కాలేదు. కొద్ది సంవత్సరాల క్రితం అస్సాంలోని కామాఖ్య, పరిసర ప్రాంతాలు చూడడం జరిగింది కానీ ఇంకా చాలా ప్రాంతాలు చూడాల్సిన జాబితాలో మిగిలిపోయాయి.
ఈశాన్య రాష్ట్రాలన్నీ కలిపి వీటిని 7 సిస్టర్స్ గా పరిగణిస్తారు. ఇందులో అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్ మరియు త్రిపుర రాష్ట్రాలు ఉన్నాయి.
ఇటీవల గత నెలలో త్రిపుర రాష్ట్రాన్ని దర్శించాలనే కోరికతో కొంతమంది మిత్రులతో కలిసి ప్రయాణించాం. త్రిపుర నే ఎంచుకోవడానికి ముఖ్య కారణం ప్రపంచ ఏడు వింతల్లో ఒకటైనా మచ్చు పిచ్చు పోలికలతో ఈ ప్రాంతం ఉంటుందని దీన్ని ఇండియా మచుపిచ్చుగా కూడా పరిగణిస్తారని కారణం ఒక్కటైతే ఇంకోకారణం ఈ ప్రాంతాన్ని అమెజాన్ ఆఫ్ ఇండియా గా కూడా వ్యవహరిస్తారని దర్శించిన మిత్రులు చెబితే దీన్ని ఎన్నుకోవడం జరిగింది.
త్రిపుర చరిత్ర పరిశీలిస్తే 14వ శతాబ్దం నుండి 1949 లో త్రిపుర భారతదేశంలో విలీనం అయ్యే సమయం వరకు దీన్ని గిరిజన రాజులు పరిపాలించేవారు. ఈ ప్రాంతంలో దాదాపు 19 తెగలకు సంబంధించిన గిరిజన జాతులు నివసిస్తున్నారని అంచనా ఎక్కువగా అతి సమీపంలో ఉన్న బంగ్లాదేశ్ మరియు మయన్మార్ ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు వలస వచ్చి ఈ ప్రాంతంలో గత కొన్ని దశాబ్దాలుగా నివసిస్తున్నారు.
1897 వ సంవత్సరంలో వచ్చిన అతి పెద్ద భూకంపం త్రిపుర రాష్ట్రానికి అంతులేని నష్టం మిగిల్చింది. ఆ తదుపరి ఇక్కడి పాలకులు యూరోపియన్ పద్ధతుల్లో అనేక నిర్మాణాలు చేపట్టారు. ముఖ్యంగా చెప్పుకోదగ్గ గొప్ప భవనాల్లో త్రిపురలోని గ్రాండ్ ఉజయాంట ప్యాలెస్ మరియు రుద్ర సాగర్ చెరువులో వేసవికాల విడిది గా నిర్మించబడ్డ నీర్ మహల్ ప్యాలెస్ లు ప్రముఖమైనవి. భారతదేశంలో అతి చిన్న మూడవ రాష్ట్రం త్రిపుర.
ఆ మరుసటి రోజు అగర్తలా నుండి 140 కి.మీ ప్రయాణించి ఉనకోటి అనే యాత్రా ప్రదేశానికి వెళ్ళాం. ఈ ప్రాంతం దరిదాపుల్లో యాత్రికులు, యాత్రికులను తీసుకొచ్చే వాహనాలు వారికి తినుబండారాలు సమకూర్చడానికి వచ్చిన ఆ ప్రాంతవాసులు తప్ప ఆ ప్రాంతంలో నివసించే వాళ్ళు ఎవరూ ఉండరు.
మన తెలుగు సినిమా పాట” శిలలపై శిల్పాలు చెక్కినారు ” లాగా ఆ ప్రాంతంలో అనేక గుట్టలపై చదును చేసిన భాగంలో 3 అడుగుల నుండి 30 అడుగుల పైబడి నిడి విగల అనేక శిల్పాలు మనకు కనువిందు చేస్తాయి. ఇలాంటి దేవతా విగ్రహాలను పోలిన శిల్పాలు కాంబోడియాలోని బయాన్ టెంపుల్ లో కనువిందు చేస్తే, అమెరికా అధ్యక్షుల శిల్పాలు మౌంట్ రాస్నోర్ లోని గుట్టల పైన మాత్రమే కనిపిస్తాయి.
ఈ ఊనకోటి ప్రాంతం కైలాస శిఖరం మార్గంలో ఉంటుందంటారు. ఊనకోటి అంటే ఒక్కటి తక్కువ కోటి అంటే 99,99,999 ఈ ప్రాంతంలో మనం ఏ వైపు చూసినా రాళ్లపై చెక్కబడ్డ శిల్పాలే దర్శనం ఇస్తాయి. ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపబడ్డ ఈ ప్రాంతానికి ప్రపంచంలోని అన్ని ప్రాంతాల నుండి యాత్రికులు వస్తుంటారు. ప్రతి సంవత్సరం ఏప్రిల్ మాసంలో ఇక్కడ “అశోకాష్టమి” జాతరలో వేలాదిమంది గిరిజనుల, గిరిజనేతరులతో పాటు వచ్చిన యాత్రికులు కూడా పాల్గొంటారు. (Photo 2)
1897 వ సంవత్సరంలో వచ్చిన పెను భూకంపానికి చాలా శిల్పాలు భూగర్భంలో కలిసిపోగా చెక్కుచెదరకుండా ఉన్న అనేక విగ్రహాలు ఇచ్చట మనకు దర్శనం ఇస్తాయి. చెల్లాచెదురుగా పడి ఉన్న కొన్ని విగ్రహాలను పురాతత్వ శాఖ వారు సేకరించి ఒక పెద్ద గది లో ప్రదర్శనకు పెట్టారు 30 అడుగులపై బడి ఉన్న కోటేశ్వర కాలభైరవ అనే శిల్పం ఇండియాలోనే అతి పెద్ద శిల్పంగా గుర్తింపబడింది. ఇలా చెక్కుచెదరకుండా ఉన్న విగ్రహాలు అనేక రూపాల్లో ఉన్నాయి. విష్ణువు, గణపతి, కార్తికేయుడు, కాలభైరవ శిల్పాలు ఈ ప్రాంతంలో విరివిగా ఉన్నాయి. ఉనకోటి అంటే బెంగాల్ భాషలో కోటికి ఒక్కటి తక్కువ అని. నిర్దిష్ట సమాచారం అందుబాటులో లేనప్పటికీ ఈ ప్రాంతంలో రెండు కథలు మాత్రం బాగా ప్రాచుర్యంలో ఉన్నాయి.
మొదటి కథ ప్రకారం శివుడు తన తోటి దేవి, దేవత, సహచర గణంతో కైలాస శిఖరం నుండి కాశీ వెళ్లే మార్గంలో ప్రయాణిస్తూ సాయంత్రం అవ్వడం చేత సేద తీరడానికి ఈ ప్రాంతం ఎంచుకుంటారు. అందర్నీ సూర్యోదయం పూర్వమే తిరిగి కాశీ ప్రయాణానికి సన్నద్ధంగా ఉండాలని ఆదేశిస్తాడు. సూర్యోదయ సమయం వరకు ఒక్క శివుడు తప్ప మిగతా దేవతా గణాలు ఇంకా నిద్రలో ఉండటం గమనించి వాళ్ళందరినీ శిలారూపాలుగా మారిపొండని శపిస్తాడు. ఈ కారణం చేతనే ఈ ప్రాంతంలో 99,99,999 దేవి, దేవత, గణాలు, వారి వాహనాలు శిల్పాలుగా మారిపోయారనే కథ విస్తృతంగా ప్రచారంలో ఉంది.
ఇంకో కథ ప్రకారం విశ్వకర్మ కుమారుడైన కల్హ కుమార్ అనే శిల్పి బొందితో కైలాసం చేరాలని పార్వతీ- పరమేశ్వరుల కోసం తపస్సు చేయగా పార్వతి అతన్ని వారించి బొందితో కైలాసం చేరడం అసంభవం అని చెప్పినా పట్టు విడవకపోవడంతో అతన్ని ఒకే రాత్రి సూర్యోదయం లోపు ఒక కోటి శిలా ప్రతిమలు చెక్కమని ఆదేశించడం మూలాన ఆ శిల్పి 99,99,999 శిల్పాలు చెక్కి చివరిది చెక్కే సమయంలో సూర్యోదయం అవ్వడం చేత ఆ ప్రాంతంలో ఒకటి తక్కువ కోటి శిల్పాలు ఉన్నట్లు ప్రతీతి. నిర్దిష్టంగా ఆధారాలు లేనప్పటికీ చరిత్రకారులు ఈ శిల్పాలు 6 నుండి 9 దశాబ్దంలోపు చెక్కబడి ఉండొచ్చని అంచనా వేశారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు ఈ ప్రాంతం అంతా కలియతిరిగి అందుబాటులో ఉన్న అన్ని శిల్పాల వద్ద ఫోటోలు దిగి ఈ ఒక్క ఊనకోటి కోసం అయినా మళ్లీ ఈ ప్రాంతం రావాలనే కోరికతో అగర్తలా చేరడానికి ప్రయాణం మొదలెట్టాం. నాలుగు గంటలు దట్టమైన అడవుల గుండా చిన్నచిన్న లోయల గుండా ప్రయాణించి అగర్తలా చేరుకొని ప్రయాణ బడలికతో ఉనకోటి శిల్పాలు స్మరించుకుంటూ నిద్రలోకి జారుకున్నాం. లోయల గుండా ప్రయాణించి అగర్తలా చేరుకొని ప్రయాణ బడలికతో ఉనకోటి శిల్పాలు స్మరించుకుంటూ నిద్రలోకి జారుకున్నాం.
ఆ మరుసటి రోజు ఉదయం త్రిపుర పర్యాటక రాజధాని అయిన ఉదయపూర్ చేరుకున్నాం ఇక్కడ చాలా దేవాలయాలు ఉన్నప్పటికీ 51వ శక్తి పీఠాలలో ఒక్కటైన మాతాబరి త్రిపుర సుందరి ఆలయానికి చేరుకొని దర్శించుకున్నాం. 1501 వ సంవత్సరంలో ఈ ప్రాంతంలో పరిశీలిస్తున్న మాణిక్య డేబర్మ అనే రాజు ఈ ఆలయాన్ని నిర్మించాడని చెప్తారు. ఈ ఆలయం ప్రక్కనే కళ్యాణ్ సాగర్ అనే ఒక పెద్ద సరస్సు ఉంది. ఈ ప్రాంతంలో అనేక సరస్సులు ఉండటం చేత ఈ నగరాన్ని సరస్సుల నగరంగా కూడా వ్యవహరిస్తారు. ఇక్కడ ఇంకా చాలా ఆలయాలు ఉన్నప్పటికీ సమయం లేకపోవడంతో తదుపరి పర్యాటక ప్రాంతమైన చాభిమురా కి వెళ్లిపోయాం.
ఆ తదుపరి మేము చూడాల్సిన ఎంతో ప్రాముఖ్యమైన ప్రాంతం చాభిముర. ఈ చాభిముర మాత్రం మా జీవితాల్లో ఎప్పుడూ మర్చిపోకుండా గుర్తుంచుకునేలా నిలిచిపోయింది. ప్రఖ్యాతి వహించిన జలపాతాల్లోకి వెళ్తున్నా, నదుల్లో విహారయాత్రకు వెళ్తున్నా, సముద్ర ప్రాంతంలోని బీచ్‌లకు వెళ్తున్నా ఇక్కడి నదిలోని విహారయాత్రనుభవం మరి మరి గుర్తుకు వస్తుంటుంది.
చాభిమురా ను అమెజాన్ ఫారెస్ట్ ఆఫ్ ఇండియా గా కూడా పరిగణిస్తారు యాత్రికులు. ఎందుకంటే బ్రెజిల్ లోని అమెజాన్ ఫారెస్ట్ గురించి సాహస యాత్రికులకు అందరికీ సుపరిచితం. నది రెండు వైపులా ఆకాశం హద్దుగా sand స్టోన్ తో తయారైన గుట్టలు, వాటి పైన గల పెద్ద నిడివి గల శిల్పాలు, ఎంతో ఎత్తైన చెట్లు, మధ్యలో నిరంతరంగా ప్రవహించే 95 కిలోమీటర్ల గోమతి నది అందమైన ప్రకృతి దృశ్యాలు, యాత్రికుల మనసులను కట్టిపడేసేలా ఉంటాయి. అందువల్లనే ఈ ప్రాంతం గురించి తెలిసిన ప్రతి యాత్రికుడికి ఇది గమ్యస్థానం.(photo 3)
మా టూర్ షెడ్యూల్ ప్రకారం చాభిముర చేరవలసిన నిర్ణీత సమయం కంటే ఆలస్యం అవ్వడం మూలాన, దట్టమైన అడవి ప్రాంతం వల్ల అనుకోని వర్షం కారణంగా ఇంకా కొంత సమయం ఆలస్యం అయ్యింది. ఆలస్యం అవ్వడం మూలాన ఇంకా పెరిగిన ప్రయాణికుల వల్ల ఇంకా కొంత ఆలస్యంగా మా యాత్రికులతో మర పడవల ప్రయాణం కేరింతలతో ఆరంభమైంది.
దట్టమైన అడవి, ఇరువైపులా ఎత్తైన చెట్లు, పక్షుల కిలకిలా రావాలతో ఆ పడవ ప్రయాణం ఎంతో ఆహ్లాదకరంగా సాగింది. కొంత దూరం ప్రయాణించాక నదికి ఒక వైపు ఉన్న గుట్టపైన అరుదైన శిల్పాలు రాతితో చక్కబడటం చూసి మేమంతా సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాం. శివ కళ్యాణం కు సంబంధించిన భరాత్ పోలికలతో కొన్ని శిల్పాలు ఒకచోట, ఇంకో ప్రాంతంలో వైష్ణవి మాత, మధ్య భాగంలో ఇరువైపులా గణపతి, కార్తికేయుడు పైన శివుడు, కింద భాగంలో విష్ణు పోలిన ఆకారంలో రాతిపై చెక్కిన శిల్పాలు మమ్మల్ని అబ్బురపరిచాయి. నిర్దిష్టంగా వీటి ఆధారాలు ఎప్పుడు చెక్కబడ్డావో అనే విషయం మాత్రం తెలవదు. కానీ ఈ శిల్పాలను బట్టి పంచ దేవతల ఉపాసన అనేది అప్పటికే ప్రాచుర్యంలో ఉన్నట్టు తెలుస్తుంది. (Photo 4)
ఇంకా అలానే కొంత దూరం ప్రయాణించాక దాదాపు 2 అడుగుల నిడివి గల మహిషాసుర మర్దిని రూపంలో పెద్ద రాతిపై చెక్కబడ్డ శిల్పం అబ్బుర పరుస్తుంది. వీటికి సంబంధించిన చిత్రాలను కెమెరాల్లో బంధించి ఇంకా అలానే ముందుకు సాగాం.
ఇంకా కొన్ని కిలోమీటర్ల ప్రయాణం తర్వాత మేం వెళ్లాల్సిన గమ్యం రానే వచ్చింది. తీర ప్రాంతంలో బోటుకు లంగర్ వేసాక మెల్ల మెల్లగా ఒకరి తర్వాత ఒకరం బోటు దిగి ఇరుకైన ప్రదేశం గుండా ముందుకు సాగాం. సూర్యకిరణాలు కూడా సోకనంతగా దట్టమైన అడవి, గుట్టల పైనుండి జాలువారి జలపాతాలు, వాటి తుంపర్లు మా మీద పడుతుంటే అనిర్వచనీయమైన అనుభూతితో ఇంకా ముందుకు సాగాం. జలపాతాల ద్వారా వచ్చే నీటిని మళ్లించేందుకు మెట్ల రూపంలో నిర్మించిన ప్రాంతం ద్వారా నీరు జలజలా పారుతుంటే మధ్యనుండి నీరు ప్రవాహంలో ముందుకు వచ్చి గోమతి నదిలో కలుస్తుంది. రెండు వైపులా కేవలం ఒక్కరు మాత్రమే నడవగలిగేలా అవకాశం ఉన్న స్థలం గుండా ఒకరి తర్వాత ఒకరం అతి కష్టంగా గుట్ట పైన ఉన్న గుహల్లోకి వెళ్ళాం.
ఎంతో ఇరుకుగా ఉండి స్వర్గానికి రహదారి గా పరిగణిస్తున్న ఈ రెండు గుహలు చూడడానికి, ప్రకృతిలో మమేకమై పరవశించడానికి నిర్దేశించబడిందే ఈ సాహస యాత్ర.
గుహలోకి ఒక్కొక్కరు వెళ్లడం, సరిపోను గాలి లేకపోవడం మూలాన కొన్ని క్షణాల్లో బయటకు రావడం యాంత్రికంగా జరిగిపోయాయి. ( Photo 5)
స్థానికంగా వీటికి స్వర్గలోకంలోకి ప్రవేశ ద్వారాలైన దేవతా గుహలుగా వర్ణిస్తారు.
అందమైన ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మనం ఆ ప్రాంతంలో ఎక్కువగా ఉండటానికి ఇష్టపడతాం. ప్రకృతిలో పరవశిస్తూ ఉండటం మూలాన కేటాయించిన నిర్దిష్ట సమయం కంటే ఇంకా ఎక్కువ సమయం ఆ ప్రాంతంలో గడపటం జరిగింది. మెల్లమెల్లగా చుట్టూ చీకట్లు అలుముకోవడం, అడవి ప్రాంతం అవ్వడం మూలాన ఇంకా తొందరగా ఆ ప్రాంతమంతా సూర్యాస్తమయ ఛాయలు అలుముకున్నాయి.
సెల్ ఫోన్ టార్చ్ ద్వారా గుహలోకి ప్రవేశించి, కెమెరాల్లో గుహల చిత్రాలను బంధించి సెల్ఫీలు తీసుకొని ఒక్కొక్కరం వచ్చి బోటులో మా స్థానాల్లో కూర్చున్నాం.
సమయపాలనను నిర్దిష్టంగా పాటించకపోవడం మూలాన వచ్చే ఇబ్బందులు మాకు తప్పలేదు. చుట్టూ దట్టమైన అడవి మూలాన ఆ ప్రాంతం అంతా త్వరత్వరగా చీకట్లు అలుముకుంటున్నాయి. బోటులోని ప్రయాణికులందరూ ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఆ ప్రాంతం నుండి నిష్క్రమించి తిరిగి గమ్యం చేరాలనే ఆత్రుత ప్రతి ఒక్కరి ముఖంలో ప్రస్ఫుటంగా కనిపించ సాగింది. మా మర పడవ సారంగి బోటు లంగర్ విప్పి తిరుగు ప్రయాణానికి కోసం నది మధ్యకు బోటును తీసుకువచ్చాడు. అప్పటికే మా బోటుతో పాటు వచ్చిన ఇతర పడవలన్నీ వెళ్ళిపోయాయి మాదే చివరిది. నది మధ్యలోకి తీసుకువచ్చిన మా మర పడవ సెల్ఫ్ మోటార్ పనిచేయకపోవడం మూలాన ఎంతకీ స్టార్ట్ అవ్వడం లేదు. యాంత్రిక లోపమో, మరి ఏ ఇతర కారణమో తెలియదు.
ఎంత ప్రయత్నించిన పడవ స్టార్ట్ అవ్వకపోవడం మూలాన అందరి మనస్సు లోనూ ఒకింత భయం, ఉద్విజ్ఞత మొదలైంది. ఎంతో ఉత్సాహంగా, నవ్వులతో, కేరింతలతో ఆహ్లాదకరంగా గడిచిన సమయం కొద్ది నిమిషాల్లోనే ఏదో తెలియని భయం, అభద్రత మనసుల్లో మెదలడం మొదలయింది. శరీరం అలసిపోవడం, తెచ్చుకున్న తినుబండారాలు, నీళ్లు పూర్తిగా అయి పోవడం, సెల్ ఫోన్స్ కూడా చార్జ్ పూర్తిగా అయిపోవడం మూలాన సెల్ ఫోన్ లైట్స్ కూడా రావడం లేదు. ఆ ప్రాంతంలో సెల్ ఫోన్ టవర్స్ లేకపోవడం మూలాన సిగ్నల్స్ కూడా లేవు. మర పడవల్లో ఉండాల్సిన వాకి టాకీ కూడా లేకపోవడంతో ప్రతి ఒక్కరూ పైకి గంభీరంగా ఉన్నా అంతర్లీనంగా అభద్రతలో క్షణం ఒక యుగంగా అనిపించి ఎంత తొందరగా ఈ ప్రాంతం వదిలి వెళ్లామా అనే ఆత్రుత అందరిలోను మొదలైంది. దీనికి తోడు గోమతి నదీ ప్రవాహం మూలాన మా మర పడవ మెల్లమెల్లగా తిరోగమన దిశలో వెనుకకు ప్రయాణిస్తున్న విషయం గమనించాం. ఇదే సమయంలో లైఫ్ జాకెట్స్ విప్పి నింపాదిగా వున్నా ప్రయాణికులు ఒక్కొక్కరు లైఫ్ జాకెట్ బటన్స్ టైట్ చేసుకోవడం కూడా యాంత్రికంగా జరిగిపోయింది. అందరం నిస్సహాయ స్థితిలో ఉండిపోయాం. మనసుల్లో మాత్రం అందరం దేవుని ప్రార్థిస్తూ ఎంత తొందరగా ఈ ప్రాంతం వదిలి భద్రత గల ప్రాంతానికి వెళ్లిపోవాలనే సంకల్పంతో నిమిష నిమిషానికి అందరిలోను ఉచ్చుకథ, ఉత్కంఠ మనసులో పరిపరి విధాల ఆలోచనలతో ఎంత సమయం గడిపామో మాకే గుర్తులేదు.
ఆ సమయంలో కొద్ది దూరంలో మా కోసం ఒక కాళీ మర బోటు రావడం గమనించి అందరం మా ప్రార్థనలు ఫలించాయని సంతోషపడ్డాం. గుహ గమ్యస్థానంగా వెళ్లే ప్రతి బోటు నిర్దిష్ట సమయానికంటే రెండు గంటల వరకు తిరిగి గమ్యం చేరకపోతే దానికి ఏదో ఆపద సంభవించిందని ఒక రెస్క్యూ బోట్ ని పంపించే నియమం ఉందట ఆ బోట్లు నడిపే యాజమాన్యానికి ఆ రెస్క్యూ బోటు లో తెచ్చినా తాళ్లతో మా మర పడవకి తాళ్లతో కట్టి మమ్మల్ని కొంత సమయానికి గమ్యస్థానానికి చేర్చింది. రెస్క్యూ బోటు రాకపోతే మా పడవ అలానే వెనక్కి ప్రయాణించి బంగ్లాదేశ్ జల్లాలోకి ప్రయాణించి, అలాగే బంగ్లాదేశ్ కూడా చూసి వచ్చేవాళ్ళం అంటు అందరం తెలికైనా హృదయాలతో కబుర్ల లోకి వెళ్లిపోయాం.
చాభిమురా నుండి మా ప్రయాణం మా తదుపరి గమ్యస్థానం అయినా డంబుర్ లేక్ కి బయలుదేరాం. డంబుర్ చెరువు అతి పెద్ద చెరువు దీని వైశాల్యం 41 స్క్వేర్ కిలోమీటర్ వుండి చుట్టుపక్కల ఎత్తైన గుట్టలతో ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. చుట్టూ చెరువు మధ్యలో నారల్ కుంజ్ అనే ఒక ద్వీపకల్పం అందులో నూతనంగా నిర్మించాబడ్డ అధునాతనమైనా కుటీరాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయి. (photo 6)
ఆ ప్రాంతం అంతా కొబ్బరి తోటల తో నిండి ఉండి సూర్యోదయ, సూర్యాస్తమయాలు ఎంతో ఆకర్షవంతంగా ఉండి . అనేక వాటర్ క్రీడాలకి ముఖ్య కేంద్రంగా యాత్రికులను ఆకర్షిస్తున్నది.
గోమతి నదీ ప్రాంతంలో ఈ హైడల్ ప్రాజెక్టు నిర్మించడం చేత క్రిందికి దుమికే జలపాతం చాలా అద్భుతంగా ఉంటుంది. సరైన దారి లేకపోవడం, సమయం లేకపోవడం వల్ల ఆకర్షణీయమైన జలపాతం వైపు వెళ్లలేకపోయాం.
సాటిలైట్ ఇమేజ్ లో డంబుర్ లేక్ డమరుకం ఆకారంలో ఉండటం చేత దీనికి డంబుర్ లేక్ అనే పేరు స్థిరపడిందని చెప్పుకుంటారు. ఆరోజు జరిగిన యాత్ర విశేషాలను చర్చించుకుంటూ బాగా అలసిపోవడం చేత నిద్రలోకి జారుకున్నాం.
ఆ మరుసటి రోజు ఉదయం సూర్యోదయం పూర్వమే లేచి అందరం ఆ లేక్ పరిసరాల్లోకి వెళ్లి సూర్యోదయ సమయాన్ని మా కెమెరాల్లో బంధించి ఆ లేక్ పరిసరాల్లో జరుగుతున్న వాటర్ స్పోర్ట్స్ ఎంజాయ్ చేసాం. ఇంకా కొంతమంది స్కూబా డైవింగ్, బోటింగ్, పెడ్లింగ్ కార్యక్రమాల్లో పాల్గొని అక్కడి నుండి ఆ
తదుపరి విహార ప్రాంతమైన మేలాఘర్ ప్రాంతానికి చేరాం. మేలాఘర్ నే నీర్ మహల్ అని కూడా అంటారు.
నీర్ మహల్ ఈశాన్య భారతదేశంలోనే ఒక గొప్ప నీటిపై తేలియాడుతూ ఉండే నీటి ప్యాలెస్. రుద్ర సాగర్ చెరువు మధ్య భాగంలో నిర్మింపబడ్డ ఈ లేక్ లో దాదాపు 24 పెద్ద పెద్ద గదులతో నిర్మించబడిన అందమైన ప్యాలెస్ లాంటి గృహం దీన్ని 1930 ప్రాంతంలో రాజా బీర్ విక్రమ్ కిషోర్ మాణిక్య చేత నిర్మింపబడిన ఈ ప్యాలెస్ నిర్మాణానికి దాదాపు తొమ్మిది సంవత్సరాలు పట్టింది. మేళాఘార్ ప్రాంతం నుండి రుద్ర సాగర్ లేక్ లో పడవలో ప్రయాణించి ఈ నీర్ మహల్ ప్యాలెస్ కి చేరుకొని ఆ ప్రాంతంలో అన్ని ప్రదేశాల్లో ఫోటోలు తీసుకున్నాం. దాదాపు 5.3 sq కిలోమీటర్లు ఉన్న ఈ రుద్ర సాగర్ చెరువులోకి రకరకాల పక్షులు వచ్చి సందడి చేస్తుంటాయి. ఈ ప్రాంతమంతా తామర పూలతో నిండి ఉన్నప్పటికీ సరైన పోషణ లేకపోవడం వల్ల గుర్రపు డెక్క తో పాటు వివిధ పిచ్చి మొక్కలు పెరిగి కొంత అసౌకర్యం కల్పించినప్పటికీ ఒక అద్భుత యాత్ర ప్రదేశంగా ఎంతో మంది యాత్రికులను ఆకర్షిస్తున్నది.
కొంత సమయం ఇక్కడ గడిపి అక్కడికి సమీపంలోనే బంగ్లాదేశ్ బోర్డర్ ప్రాంతంలోని ప్రఖ్యాత కాళీమాత ఆలయం దర్శించుకుని అక్కడి నుండి ప్రముఖ పర్యాటక ప్రాంతమైన సెఫహిజాల వన్యమృగాల ప్రాంతంలోకి వెళ్లి వివిధ వన్యమృగాలు దర్శించి తిరిగి రాత్రి 12 గంటల ప్రాంతంలో అగర్తలా చేరడం జరిగింది. తిరుగు ప్రయాణంలో మాతోపాటు ప్రయాణిస్తున్న ఒక ఇన్నోవా కి యాక్సిడెంట్ అవ్వడం మూలాన ప్రయాణికులకు కొంత అసౌకర్యం కలిగినప్పటికీ నిర్ణీత సమయం కంటే చాలా ఆలస్యంగా అగర్తలా తిరిగి చేరుకోవడం జరిగింది.
ఆ తదుపరి రోజు చివరి రోజు అయిన ఆ రోజు అగర్తలాలోని లోకల్ మ్యూజియం మరియు ఉజంతా ప్యాలెస్ మరియు చాతుర్ దశ దేవత టెంపుల్ దర్శించుకుని అక్కడకి సమీపంలోని బంగ్లాదేశ్ బార్డర్ వరకు వెళ్లి బంగ్లాదేశ్ నుండి ఇండియాకు వచ్చే యాత్రికులను, ఇండియా నుండి బంగ్లాదేశ్ వెళ్లే ప్రయాణికులతో కాసేపు ముచ్చటించి ఆ తదుపరి లోకల్ మార్కెట్ లో షాపింగ్ చేసి మా విశ్రాంతి గృహాలకు వచ్చి ఆ మరుసటి రోజు ప్రయాణించి హైదరాబాద్ చేరాం. (photo 7)
త్రిపుర ప్రాంతం లో ముఖ్యంగా ఉనకోటి, చాభిమురా, మరియు డంబుర్ చూడ్డానికి కోసం ఇంకో మారైన వెళ్లాలని అనిపిస్తుంది. ఇదే కాకుండా ఈ ప్రాంతం 100 అడుగుల ఎత్తు నుండి 3 వేల అడుగుల ఎత్తు వరకు ఉండే ఈ ప్రాంతాలను చూస్తే ప్రపంచ వింతల్లో ఒకటైన మచుపిచు లోని ప్రాంతాలు గుర్తుకు వస్తాయి. త్రిపురను ఇండియా మచ్చుపిచ్చు అని పిలవడానికి సరైన పోలికలు ఉన్నట్టుగా అనిపిస్తాయి.
చాభిమురా ప్రాంతం కూడా దాదాపు అమెజాన్ నదిని పోలి రెండు వైపులా ఆకాశాన్ని అంటే చెట్లతో నిండి ఉండటం వల్ల ఇండియన్ అమెజాన్ అనే పేర్లు పోలికకు సరితూగేలాగే ఉంది. ఈ ప్రాంతం అనేకమంది యాత్రికులను ఆకర్షిస్తుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
మా జీవితంలో ఈ త్రిపుర విహారయాత్ర ఒక అద్భుతమైన సాహస యాత్రగా మరచిపోలేని అనుభూతిని మిగిల్చింది.
తెలంగాణలో దోమకొండ సంస్థానం చేస్తున్న సాహితీసేవ అమూల్యమైందని పొట్టిశ్రీరాములు తెలుగువిశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య తంగెడు కిషన్ రావు అన్నారు. ఈ నెల 6 వ తేదీన కామారెడ్డి జిల్లా దోమకొండ గడి కోటలో జరిగిన ‘తెలంగాణ సంస్థానాల సాహిత్య సేవ’ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విశిష్ట అతిథిగా శ్రీవేంకటేశ్వరవిశ్వవిద్యాలయ పూర్వ ఉపకులపతి ఆచార్య ఎన్.జయరామరెడ్డి పాల్గొని ప్రసంగిస్తూ తెలుగు సాహిత్యంలో సంస్థానాల పాత్ర విశిష్టమైందని అన్నారు.మరొక విశిష్ట అతిథి కామారెడ్డి జిల్లా పూర్వ పాలనాధికారి డాక్టర్ ఎస్.సత్యనారాయణ ప్రసంగిస్తూ దోమకొండకోటలో పలు సామాజికాభివృద్ధి కార్యక్రమాలు జరగడం హర్షణీయం అన్నారు. సభకు స్వాగతం పలికిన సంస్థాన పాలకుల వారసులు అనిల్ కామినేని మాట్లాడుతూ తమ పూర్వికులు నడచిన మార్గంలో సాహిత్యసేవను కొనసాగించడానికే ఈ సదస్సును ఏర్పాటు చేశామన్నారు. ప్రముఖ కవి డా.ఏనుగు నరసింహారెడ్డి సంస్థాన సాహిత్య వికాసంపై విపులంగా ప్రసంగించారు. ప్రముఖ చరిత్రకారులు డా.ఈమని శివనాగిరెడ్డి, తెలంగాణ విశ్వవిద్యాలయ సహాయ ఆచార్యులు డా.లక్ష్మణ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.
ప్రముఖ నృత్య దర్శకురాలు మధుమతి కులకర్ణి శిక్షణలో పలువురు నృత్యవిద్యార్థినులు చేసిన స్వాగత నృత్యం అందరినీ ఆకట్టుకొన్నది. అనంతరం ప్రారంభమైన తొలి సదస్సుకు డాక్టర్ లక్ష్మణచక్రవర్తి, బాబ్జీ జాలాది సమన్వయకర్తలుగా వ్యవహరించారు.ప్రముఖ పరిశోధక పండితుడు వైద్యం వేంకటేశ్వరాచార్యుల అధ్యక్షతన పలు సంస్థానాలలోని సాహిత్యసేవలపై వక్తలు ప్రసంగించారు. ప్రముఖ పరిశోధకులు, రచయితలు డాక్టర్ రాయారావు సూర్యప్రకాశ్ రావు, డాక్టర్ అంబటి భానుప్రకాశ్,అబ్దుల్ అజీజ్, డాక్టర్ జి.శ్యామసుందర్, డాక్టర్ నాయకంటి నరసింహశర్మ, డాక్టర్ ఎం.అనంతకుమారశర్మ, డాక్టర్ తాడేపల్లి పతంజలి, డాక్టర్ బోచ్కర్ ఓంప్రకాశ్, డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్, శాస్త్రుల రఘురామశర్మ, బైరోజు చంద్రశేఖర్, డాక్టర్ వడ్ల శంకరయ్య తదితరులు వివిధ సంస్థానాల పరిధిలో జరిగిన సాహిత కృషిపై పత్ర సమర్పణలు చేశారు. వేదార్థంమధుసూదనశర్మ అనుసంధానకర్తగా వ్యవహరించారు. సదస్సులో పత్ర సమర్పణలు చేసిన పరిశోధకులను దోమకొండ సంస్థానాధీశులు అనిల్ కామినేని ఘనంగా సత్కరించారు.
ఈ సదస్సుకు ఆత్మీయ అతిథులుగా అమరచింత, ఆత్మకూరు, ఆలంపూరు, ఆనెగొంది, గద్వాల, గోపాలపేట, జటప్రోలు, కొల్లాపూరు, సిర్నాపల్లి, నారాయణపేట, పాపన్నపేట, పాల్వంచ, మునగాల, బేతవోలు, రాజాపేట, సురపురం సంస్థానాల వారసులు హాజరయ్యారు.
అనంతరం జరిగిన కవిసమ్మేళనానికి ప్రముఖ విద్వత్కవి, దాశరథి సాహితీ పురస్కార గ్రహీత డాక్టర్ అయాచితం నటేశ్వరశర్మ అధ్యక్షత వహించారు. డాక్టర్ బోచ్కర్ ఓంప్రకాశ్ సమన్వయకర్తగా వ్యవహరించారు.ఈ కవిసమ్మేళనంలో డాక్టర్ వెలుదండ సత్యనారాయణ, గుమ్మన్నగారి బాలసరస్వతి, బండకాడి అంజయ్యగౌడ్, డాక్టర్ శాస్త్రుల రఘుపతి, సాయిప్రసాద్, మంచినీళ్ల సరస్వతీరామశర్మ, కొరిడె విశ్వనాథశర్మ, ప్రసాదం స్వాతి, చింతా రామకృష్ణారావు, పబ్బా విజయశ్రీ తదితరులు కవితాగానం చేశారు.
సదస్సు ముగింపులో సాయంకాలం ఆరుగంటలకు ‘ప్రతాపరుద్రవిజయం’ సాహితీరూపకప్రదర్శన జరిగింది.డాక్టర్ సంగనభట్ల నరసయ్య రచించి, దర్శకత్వం వహించిన ఈ రూపకానికి మరుమాముల దత్తాత్రేయశర్మ నిర్వాహకులుగా వ్యవహరించారు. హైదరాబాదులోని అభ్యుదయకళావికాస్ సంస్థ నిర్వహణలో కొనసాగిన ఈ రూపకానికి ప్రముఖసంగీతదర్శకులు దేశపతి శ్రీనివాస్ శర్మ సంగీతాన్ని సమకూర్చారు.ఎం.ఆనంద్ వ్యాఖ్యాతగా వ్యవహరించి రక్తి కట్టించారు.
దోమకొండసంస్థానవారసుల నిర్వహణలో ఒకరోజు సాహితీసదస్సు ఎన్నో మధురానుభూతులను పంచింది.ఈ సదస్సులో పాల్గొన్న అందరికీ సంస్థానం పక్షాన అనిల్ కామినేని సత్కారాలు చేసి, కృతజ్ఞతలను చెప్పగా ఈ సదస్సు అద్వితీయంగా ముగిసింది.