డా: లింగంనేని మహేష్ కుమార్ ఎం.ఇ.,పిహెచ్.డి., 27-10-1966 న కృష్ణాజిల్లా, గుడివాడ లో జన్మించారు.
తల్లి: లింగంనేని సుజాత. రచయిత్రి.
తండ్రి: డా: లింగంనేని బసవ శంకర రావు ఎం.ఏ.,పిహెచ్.డి., తెలుగు విశ్రాంతాచార్యులు, రాజధాని కళాశాల, చెన్నై.
మహేష్ కుమార్ తండ్రి లింగంనేని బసవ శంకర రావు 1968 జూలై ఒకటవ తేదీన మద్రాసు రాజధాని కళాశాలలో, తెలుగు విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉద్యోగం లో చేరారు. అప్పటికి మహేష్ కుమార్ కి మాటలు రావు.
మహేష్ కుమార్ కి ఇంట్లో అమ్మ నాన్నలు తెలుగు మాట్లాడడం నేర్పించారు. వాళ్లింట్లోనే ఉన్న తమిళ పిల్లలతో ఆడుకుంటూ మహేష్ కుమార్ తమిళం కూడా నేర్చుకున్నాడు.
మహేష్ కుమార్, ఎల్.కె.జి, యు.కె.జి.లలో ఇంగ్లీష్, తమిళం,హిందీ మూడు భాషలు నేర్చుకున్నాడు.

హైస్కూల్లో చదువుకునే రోజుల్లోనే విద్యార్థుల విభాగంలో డైరెక్టర్ అయ్యాడు.
రామ కృష్ణ మఠం వాళ్ళు స్కూలు పిల్లలకు నడిపిన వక్తృత్వపు పోటీలో ఫస్ట్ ప్రైజ్ అందుకున్నాడు.
మహేష్ కుమార్ తండ్రికి స్నేహితుడైన వి.ఏ.కె.రంగారావు గారి సాన్నిహిత్యంలో, ధనంజయన్ దంపతుల వద్ద భరత నాట్యం అభ్యసించాడు.
మహేష్ కుమార్ హిందూ హైయ్యర్ సెకండరీ స్కూల్ లో చదువు ముగించాడు. 1984 లో బెంగళూరు రామయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో మెకానికల్ ఇంజనీరింగ్ లో చేరి, చదివి, 1989 లో పాసయ్యారు.
మెటల్ కాస్టింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ,విశ్వేశ్వరయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, బెంగళూరు యూనివర్సిటీలో 1991 లో పొందారు.

1994 లో గుంటూరు వాస్తవ్యులైన డా: జ్యోతి, డా: చల్లపల్లి కామప్రసాదు గారల కుమార్తె స్రవంతితో వివాహం జరిగింది. స్రవంతి ఎం.ఏ. మాస్ కమ్యూనికేషన్ చదివి,సీనియర్ డిప్యూటీ ఎడిటర్ గా, బిజినెస్ లైన్ చెన్నైలో ఉద్యోగించారు. ప్రస్తుతం రైటర్ & ఎడిటర్ గా ఉన్నారు.
మహేష్ కుమార్ అన్నా యూనివర్సిటీలో మెకానికల్ ఇంజనీరింగ్ లో డీప్ డ్రాయింగ్ లో పిహెచ్.డి. సాధించారు.
మహేష్ కుమార్ బెంగుళూరు, హోసూరులో ఇంజినీరింగ్ కాలేజీలో లెక్చరర్ గా చేసి, సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజీలో 1995 నుండి 2007 వరకు అసిస్టెంట్ ప్రొఫెసరు తర్వాత, ప్రొఫెసరు &,హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ గా ఉద్యోగం చేశారు.
2007 నుండి 2010వరకు మహేష్ కుమార్ FOMRA ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో ప్రిన్సిపాల్ గా పని చేశారు. అన్నా యూనివర్సిటీ లోని మెకానికల్ ఇంజినీరింగ్ విభాగంలో ఒక సెమిస్టర్ విజిటింగ్ ప్రొఫెసరుగా ఉన్నారు.
ప్రస్తుతం మహేష్ కుమార్ సెయింట్ పీటర్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ & రీసెర్చ్ లో 2011 వ సంవత్సరం నుండి డైరెక్టర్ ఆఫ్ అకడమిక్ గా,రిజిస్ట్రార్ గా ఉన్నారు.
మహేష్ కుమార్ రీసెర్చ్ విభాగంలో పని చేస్తూ 25 పేపర్లు సబ్మిట్ చేశారు. ఆయన పిహెచ్.డి. స్కాలర్స్ కు తన సహాయ సహకారాలు అందిస్తున్నారు. మహేష్ కుమార్ దగ్గర ఒకరు పిహెచ్.డి. పట్టా కూడా పొందారు.

మహేష్ కుమార్ ఇండియన్ సొసైటీ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ లో సభ్యులుగా ఉన్నారు.
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రొడక్షన్ ఇంజనీర్స్, తమిళ నాడు సెంటర్ కు సెక్రెటరీగా ఉన్నారు.
F I C C I ఎడ్యుకేషన్ ప్యానెల్ లో సభ్యులుగా ఉన్నారు. వీరు STEP and Business incubator పాలక మండలిలో సభ్యులుగా ఉన్నారు.
మహేష్ కుమార్ కు విద్యతో పాటు ఫైన్ ఆర్ట్స్ లో కూడా ఆసక్తి మెండు. అందులో ముఖ్యంగా భరత నాట్యం అంటే చాలా ఇష్టం. చెన్నై లో జరిగే భరత నాట్యం ప్రోగ్రాంలకు వెళ్ళి, చూసి వాటిని గురించి ఇండియన్ ఎక్స్ ప్రెస్, ఫైనాన్సియల్ ఎక్స్ ప్రెస్ లో రివ్యూలు వ్రాసేవారు.
తిరుపతి పక్కనే ఉన్న శ్రీనివాస మంగాపురంలో, మహేష్ కుమార్, వాళ్ళ మామ వి.ఏ. కె. రంగారావు గారి తో కలిసి గత 21 సంవత్సరాలు, ఆషాఢ శుద్ధ సప్తమి నాడు, నృత్య నివేదన చేశారు. వార్ధక్య కారణంగా వి. ఏ. కె. రంగారావుగారు, నృత్యనివేదన చేయడం నిలిపివేశారు. గత పది సంవత్సరాలుగా
మహేష్ కుమార్ ఒక్కరే నృత్యనివేదన చేస్తున్నారు.
అంతే కాదు. కార్వేటి నగరం వేణు గోపాలస్వామి దేవాలయంలో, మామ వి.ఏ.కె.రంగారావుతో కలిసి కృష్ణ జయంతి నాడు 20 సంవత్సరాలు నృత్య నివేదన చేశారు. గత పది సంవత్సరాలుగా మహేష్ కుమార్ ఒక్కరే నృత్యనివేదన చేస్తున్నారు.
ఈ నెల పదహారో తేదీన జరిగిన నృత్య నివేదన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానెల్ లో రాత్రి ఎనిమిది గంటల నుండి తొమ్మిది గంటల వరకు ప్రసారం చేశారు.


















