పరంధామయ్య, సుభద్రమ్మ రెండు రోజులు అయింది, కొడుకు దగ్గరకి వచ్చి. స్టేషన్నుంచి ఇంటికి తీసుకొచ్చి, ఆఫీసులో మీటింగ్ ఉందని వెంటనే వెళ్ళిపోయాడు కొడుకు సుధాకరం. ఇద్దరికీ టిఫిన్ పెట్టి, “భోజనం టేబుల్ మీద పెట్టాను. మీ టైముకి మీరు పెట్టుకుని తినండి అత్తయ్య… బాబుని స్కూల్ దగ్గర దింపి, నేనూ ఆఫిస్ కి వెళ్ళొస్తాను ” చెప్పి, హడావిడిగా వెళ్ళిపోయింది కోడలు కమల.
సాయంత్రం వరకూ ఇద్దరూ మాటలు రాని బొమ్మల్లా కూర్చున్నారు.
ఆరుగంటలకి కోడలు మనవడిని తీసుకుని వచ్చింది.
వాడికి పాలు తాగించి,అదే అపార్ట్మెంట్ లో పై ఫ్లోర్ లో ఉన్న ట్యూషన్ కి తీసికెళ్లి దిగబెట్టి వచ్చింది.
బట్టలు మార్చుకుని నైటీ వేసుకుని, సెల్ లో మాట్లాడుతూ సోఫాలో కాలిమీద కాలు వేసుకుని కూర్చుని, ఎదురుగా అత్త మామలున్నారన్న ధ్యాసకూడా లేకుండా కాలు ఊపుతూ మాట్లాడుతూనే ఉంది.
ఎనిమిది అవుతుంటే, “డిన్నర్ టేబుల్ మీదుంది, మీకు ఆకలి అయినప్పుడు తినండి. నేనలా వెళ్ళి బాబుని ట్యూషన్ నుంచి తీసుకొస్తాను ” చెప్పి, తలుపు దగ్గరగా వేసి వెళ్ళిపోయింది.
తొమ్మిది అవుతుంటే వచ్చింది కోడలు కమల.
కొడుక్కి తినిపిస్తూ “మీరు తినలేదేం?” అడిగింది.
‘”అబ్బాయి వచ్చాక తింటాo లేమ్మా ” అంది సుభద్రమ్మ.
“సుధా వచ్చేసరికి లేట్ అవుతుందట. మిమ్మల్ని తినేసి పడుకోమన్నాడు”. హోటల్ నుంచి తెచ్చిన డిన్నర్ పేకెట్స్ విప్పి, ప్లేట్ లో పెట్టి ఇద్దరికీ ఇచ్చింది.
బిర్యానీలో మసాలా, వెల్లుల్లి వాసన అలవాటు లేక పోవడంతో సుభద్రమ్మ “నాకంతగా ఆకలిగా లేదు ఇంతవద్దు తీసేయమ్మా “అని తనే కొద్దిగా ఉంచుకుని మిగిలినది బౌల్లో వేసేసింది. ఆ కాస్త తిన్నాననిపించి చేయి కడుక్కుంది. పరంధామయ్యకి సహించక పోయినా ఆకలికి ఆగలేక ముద్దకి ముంతడు నీళ్లు అన్నట్లు, ముద్ద నోట్లో పెట్టుకుని, నీళ్లు తాగి లోపలికి పంపాడు.
ఇద్దరూపడుకున్నాక కొడుకు ఎప్పుడొచ్చాడో వారికి తెలియదు.
ఉదయం ఇద్దరూ తొందరగానే లేచి, తయారై హాల్లోకి వచ్చి కూర్చున్నారు. కొడుకు లేచి వస్తే మాట్లాడవచ్చు అనుకున్నారు.
సుధాకరం ఎనిమిదిన్నర దాటాక బెడ్ రూమ్ లోనుంచి బయటికి వచ్చాడు. ఆఫీస్ కి వెళ్ళడానికి తయారై ఉన్నాడు.
తల్లిదండ్రుల్ని చూసి, “బ్రేక్‌ఫాస్ట్ చేశారానాన్నా,? ” అడుగుతూనే, తనే డిష్ లో ఉన్న ఇడ్లి ప్లేట్ లో పెట్టుకుని తినడం మొదలు పెట్టాడు.
కొడుకుతో కలిసి తిందామని ఎదురు చూసిన ఆ తల్లిదండ్రులు ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా ఉండిపోయారు.
కొడుకు, కోడలు మనవడిని తీసుకుని వెడుతూ “అత్తయ్యా!సుధా కి ఈ రోజు ఆఫీస్ లో లంచ్ ఉందట.నేనూ కేంటేన్ లో తినేస్తాను. మీరు ఏం కావాలో వoడుకుని తినేయండి.”సమాధానం కోసం చూడకుండా వెళ్లిపోయారిద్దరూ.
పరoధామయ్య, సుభద్రమ్మ ఒకరి మొఖాలు ఒకరు చూసుకుంటూ ఉండిపోయారు.
–
తను ఖమ్మం లో ఉద్యోగం చేసే రోజుల్లో మొదటిసారి అమ్మ నాన్న ఖమ్మం వచ్చినప్పుడు తను స్టేషన్ కి వెళ్ళి,వారిని ఆప్యాయంగా పలకరించి ఇంటికి తీసుకొచ్చాడు.సుభద్ర ఎదురొచ్చి వారిని ప్రేమగా పలకరించి, అత్తగారి చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకొచ్చింది. కుశల ప్రశ్నలు వేసి కాఫీ ఫలహారాలు అందించింది.
ఆ రోజు ఆఫీస్ కి సెలవు పెట్టేశాడు తను.
లోపలికి వెళ్ళి “చూడు. అమ్మకి నాన్నకి ఏం కావాలో కనుక్కుని సమయానికి ఇవ్వు.భోజనంలోకి కూడా ఏం తింటారో కనుక్కుని చెయ్యి. నాన్న కారంకారంగా తింటారు. చూసి చెయ్యి తెలియకపోతే అమ్మని కనుక్కునిచెయ్యి ” చెప్పాడు.
“ఆ విషయo మీరు ప్రత్యేకంగా చెప్పాలా? అదంతా నేనూ చూసుకుంటాను మీరు ఆఫీస్ కి వెళ్ళండి “అంది సుభద్ర.
వాళ్ళు ఉన్న వారం రోజులు ఆఫీస్ కి వెళ్లేటప్పుడు వెళ్ళొస్తానని తల్లిదండ్రులకి చెప్పి, వారిని జాగ్రత్త గా చూసుకోమని, వేళకి భోజనం పెట్టేయమని భార్యకి చెప్పి వెళ్ళేవాడు. సాయంకాలం వచ్చేటప్పుడు వారికి నచ్చిన ఉపాహారాలు, పళ్ళు తీసుకొచ్చి, ప్లేట్స్ లో పెట్టి ఇద్దరికీ ఇచ్చేవాడు
రాత్రి భోజనాలు అయ్యాక నలుగురు కూర్చుని కష్టసుఖాలు మాట్లాడుకునే వారు.
“మీరిద్దరూ ఒంటరిగా అక్కడెoదుకు,?. ఇక్కడే మాతోపాటు ఉండిపోవచ్చుగా ” అంది సుభద్ర.
“లేదులేమ్మా….. ఇంకా మాకు కాస్త ఓపిక ఉందిగా.. ఓపిక తగ్గితే మీ దగ్గరకే వస్తాం. మాకు మాత్రం మీరు తప్ప ఎవరున్నారు? ” అన్నాడు తండ్రి.
“అవునమ్మాయ్! మీకూ మొన్నీ మధ్యనేగా పెళ్లయింది. కొన్నాళ్ళు సరదాగా ఉండండి. పిల్లా పాప బయలుదేరితే మనవడితో ఆడుకోడానికి అప్పుడు వచ్చి ఉంటాములే.”అంది అత్తగారూ కోడలికి బుగ్గలు నిమిరి ముద్దు పెట్టుకుంటూ.
ఇద్దరికీ బట్టలు పెట్టి, కాళ్ళకి దణ్ణం పెట్టి ఆశీసులు తీసుకున్నారు.
పరoధామయ్య కొంత డబ్బు తండ్రి చొక్కా జేబులో పెట్టి, “ఏవైనా ఖర్చులకి ఉంటాయి ” చెప్పాడు.
“ఎందుకురా నాదగ్గర ఉన్నాయిలే “తండ్రి తియ్యబోతుంటే,”మీ దగ్గర లేవని కాదు, ఏదో నాతృప్తి కోసం ” తండ్రి చేతి మీద చెయ్యి వేసి ఆపాడు.
వాళ్లిద్దరూ ప్రయాణమై వెడుతుంటే పరంధామయ్య, సుభద్ర కళ్ళనీళ్ల పర్యంతం అయ్యారు. స్టేషన్ కి వెళ్ళి ట్రైన్ ఎక్కించి, ట్రైన్ కదిలే వరకు ఉండి వచ్చారు…..”తలుపు చప్పుడు అవుతుంటే
ఆలోచనలనుంచి తేరుకొని తలుపు తెరిచింది సుభద్రమ్మ.
కోడలు మనవడుని తీసుకుని వచ్చింది.
ఆమె కాళ్లు కడుక్కుని డ్రెస్ మార్చుకుని వచ్చే వరకూ ఆగి,”అమ్మాయ్! మేము బయలుదేరుతున్నాం అబ్బాయి వచ్చాక చెప్పు.”బేగ్ తీసుకుని చెప్పారు.
” అదేంటీ, పది రోజులు ఉంటారని చెప్పాడు సుధా,…” మనసులో సంతోషంగా ఉన్నా, అయోమయం నటించిందికమల.
“మరోసారి వస్తాం లేమ్మా,అయినా పిల్లాడికి సెలవులిచ్చినప్పుడు మీరే రండి. మేమిక్కడుంటే మీకూ ఇబ్బంది, మేమూ తిని కూర్చోవడం. అక్కడైతే గుడి, గోపురం, తెలిసినా వాళ్ళు రావడం, పోవడం . ఏదో కాలక్షేపం అయిపోతూo టుంది .”అన్నాడు పరoధామయ్య.
కమల సెల్ తీసుకుని “సుధా!మీ అమ్మ, నాన్న వెళ్ళిపోతామంటున్నారు…” చెప్పింది.
” అప్పుడేనా? అదేంటి.. నిన్ననే కదా వచ్చారు, ఉదయం నాతో ఏమి చెప్పలేదు.
ఉండమని చెప్పకపోయావా? ” “
“… చెప్పాను వెళ్లాలట…..”
“సరే! నాకు ఇప్పుడే రావడానికి కుదరదు.. దారిఖర్చులకి డబ్బులున్నాయో లేదో ? వెయ్యో, రెండూవేలో ఇచ్చి పంపించు ” చెప్పాడు.
వెయ్యి రూపాయలు తెచ్చి వారి చేతిలో పెట్టి, వాళ్ళు బయటికి రాగానే తలుపులు మూసుకుంది.
ఇద్దరూ ఆటోలో బస్ స్టాండ్ కి వెళ్ళి తమ ఊరు వెళ్లే బసు ఎక్కి కూర్చున్నాక,మనసు స్థిమిత పడినట్లు అయింది. హాయిగా ఊపిరి పీల్చుకుని వెనక్కి జార్లబడి కూర్చున్నారు.
“గత కాలము మేలు వచ్చుకాలము కంటెన్ ” భారతoలో నన్నయ రాసిన పద్య పాదం గుర్తుకొచ్చింది పరoధామయ్యకి.
కథలు
గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఆ అభినందన సభకు జిల్లా కలెక్టరే కాక జిల్లాలో, మండలంలోని ప్రముఖులందరూ హాజరవడం విశేషం.
ఆ ఊరికి చెందిన ఇద్దరమ్మాయిలు “ఐఏఎస్” పూర్తి చేసి కలెక్టర్లుగా పక్కపక్క జిల్లాలకు అపాయింట్మెంట్ ఆర్డర్లు తీసుకున్న సందర్భం. ఎందరో కలెక్టర్లు అవవచ్చు.. కానీ ఇదొక ప్రత్యేక సందర్భం.
ఈ సభకు ఊరు ఊరంతా హాజరయ్యారు. పెద్ద బహిరంగ సభ అది.
అందరూ మాట్లాడడం ఐపోయింది. జిల్లా కలెక్టరు గారు జానకి, శైలజలకు సన్మానం చేయబోతున్నారు.
వారి గురించి ఆఊరి సర్పంచ్ చెబుతున్నారు ఇలా …
“జానకి, శైలజ మంచి స్నేహితులు. జానకి అతి పేద కుటుంబానికి చెందిన అమ్మాయి, అంతే కాక తనకు చిన్నప్పుడు( కాలికి) పోలీయో వచ్చి సరిగా నడవలేదు. ఐతే చాలా తేలివి గలది జానకి.
ఇంటరు పూర్తిచేశారు జానకి, శైలజ ఇద్దరూ. ఐతే జానకి చదువు ఆపేసింది….”
ఇంతలో కలెక్టరు గారు వాళ్ళనే చెప్పమన్నారు..
జానకి “అలాటి పరిస్థితిలో శైలజ చేసిన గొప్ప సహాయం, మరువరానిది
నా కోసం డబ్బు ఖర్చు పెట్టింది. నాకాలికి వాళ్ళ నాన్నగారిచేత వైద్యానికి సంబంధించి సహాయం చేయించింది.. తాను ఎక్కి చదువుకుందో…నన్నుకూడా తనతో పాటుగా చదివించిన ఆ కుటుంబానికి ఋణం తీర్చుకోలేను. శైలజ నాకు దేవుడిచ్చిన వరం.”
అంటూ కన్నీరు పెట్టుకుంది.
ఇక శైలజ మాట్లాడుతూ” జానకి చదువుకు సహాయం చెయ్యడం గొప్ప కాదు.తను ఏకసంథాగ్రాహి. నేను ఈ పరీక్ష ఉత్తీర్ణత పొందడానికి నాకు తాను నాకు చక్కగా తెలియని అంశాలన్నీ వివరంచడమే ముఖ్య కారణము. కాబట్టి తను ఉన్నత వ్యక్తిత్వం గలది “…. అంటూ ముగించిది.
ఇక కలెక్టరు గారు ఇద్దరికీ వారు పొందిన విజయాన్ని పురస్కారించుకుని చాలా గొప్పగా సన్మానం చేశారు. చివరగా ఆయన చెప్పిన సందేశానికి పెద్ద ఎత్తున చప్పట్లు మారు మ్రోగిపోయాయి… “ఇద్దరికి ఇద్దరూ గొప్పవారే…వారి ఆశరం ఉన్నతం, ఉత్తమం… సమాజం పట్ల వారికున్న అవగాహనను నేను వారి మాటలలో తెలుసుకున్నాను.అంటూ…….
” ఏమతమైనా వివరించేదో మానవత్వమే,” అని వీరిరువురూ నిరూపించారు. “విధాత సృష్టిలో లోపం లేదు, మానవ దృష్టిలోనే శాపం ఉంది.” ఆ శాపాన్ని వీరువురూ బాపారు ఒకరికొకరు. “బాధ్యతల సుడిగుండాల్లో మనిషి జీవితం ముడిపడి ఉంది.” అనేది కూడా చక్కగా ఋజువు చేసి సమాజం పట్ల వారి బాధ్యతను తెలియజేశారు. చివరిగా అతి గొప్ప మాట చెప్పారు…..” స్వచ్ఛమైన స్నేహానికి ఎల్లలు లేవు” అని వీరువురూ నిరూపించారు.
వీరిరువురి వలన ఇంకా మరన్ని మేళ్ళు జరగాలని ఆశిస్తూ చిరంజీవులను ఆశీర్వదిస్థున్నాను.” అంటూ సభను ముగించారు..సభలోని వారంతా కరతాళధ్వనులతో అభినందించారు.
ఆరునెలల నుండి చడీ చప్పుడు లేకుండా మౌనం నిశ్శబ్దం నా జీవితంలో సగానికి పైగా స్థానాన్ని ఆక్రమించుకున్నాయి. ఏదో ఊపిరాడని ఫీలింగ్. ఇప్పుడిలా ఈ మాటల పందిరి క్రింద జరుగుతున్న పెళ్లి సంబరంలో ఆ పని ఈ పని అంటూ హడావుడిగా తిరుగుతూ అందరితో మాటలు కలుపుకుంటూ ఆనందం అంతా నా స్వంతం అన్న భావన ఊపిరి పోసుకోవడంతో పెద్ద బరువు దించుకున్నట్టుగా వుంది. ఇదే మాట వీరితో పంచుకుంటే… మరీ ఎక్కువగా సంబరపడకు ఊరికెళ్ళిన తరువాత మళ్ళీ అదే పరిస్థితిని పేస్ చేయాల్సివుంటుంది విమలా! అన్నారు. ఈ మనిషి ఇంతే! భావనారహితంగానే జీవితం గడిపేస్తూ వుంటారు. పొంగిపోవడాలు కృంగిపోవడాలు ఏవీ పట్టక తన మానాన తాను బ్రతికేస్తూ వుంటారు. కాస్త చిరాకన్పించినా తనలా ఉండడం ఒకందుకు మంచిదే అనిపిస్తుంది.
ఏదో పెళ్లింట్లో కాస్త సంతోషం ఇల్లు కట్టుకుంటే వీరి మాటలతో ఆ స్థానంలో గుబులు గూడు కట్టుకుంది. ఓ క్షణం మనసు చివుక్కుమన్నా నెలల తరబడి మౌన సముద్రంలో మునకలేసిన నాకు ఇప్పుడు ఇక్కడ లభిస్తున్న ఈ సందడి సంభ్రమాలను దూరం చేసుకునే ఉద్దేశ్యం లేక ఆలోచనలను విదిలించి ఆ మాట ఈ మాట కలుపుకుంటూ అందరితో కలిసిపోయాను.
రాత్రి భోజనం చేసి పడుకోడానికి వెళ్ళినపుడు రేపు మధ్యాహ్నం ట్రైన్ కు తిరిగి వెళ్ళాలి అన్న విషయం గుర్తొచ్చి మళ్ళీ దిగులు భూతం ఆవహించింది. అదే విషయం అనబోతే ఈ విషయాలకు అతీతంగా వీరి గురక మంచి నిద్రకు జారుకున్న సూచన ఇచ్చింది. పాపం పడుకోని లేపడంఎందుకని అలా ఇలా దొర్లుతూ చివరకు నిద్రకు జారుకున్నా. ఓ గంట గడిచిందేమో మళ్ళీ మెలకువ నిద్రను కాజేసింది.
నీరవపు రాత్రిలో తలపుల ఊరేగింపు…
అమ్మ నాన్న అక్కలు అన్నలు పెద్ద కుటుంబంలో ఆఖరుదాన్ని నేనవడంతో అతి గారాబంగా పెరిగాను. స్కూల్ కాలేజ్ స్నేహితురాళ్ళు అప్పుడప్పుడూ వచ్చిపోయే బంధువులతో ఇరుగు పొరుగువారి ముచ్చట్లతో ఒంటరితనం నన్నెప్పుడూ భాధించలేదు. గారాబంగా పెరగడంతో ఒకింత బేజారుని సహించే ప్రకృతి నాకబ్బలేదు.
పెళ్లయి చేరిన అత్తగారిల్లు కూడా ఉమ్మడి కుటుంబం కావడంవల్ల అక్కడ కూడా సందడే. కాలం గడుస్తూ పిల్లలు వారి ఆలనా పాలనలో రోజులు నెలలు సంవత్సరాలు దొర్లుకుంటూ వెళ్ళిందే తెలియలేదు. పిల్లలు బాగా చదూకుని మంచి ఉద్యోగాల్లో స్థిరపడుతున్నప్పుడు ఒక్కొక్కరిగా పిన్నలు పెద్దలు కాలం చేసారు. కానయితే ఆ ఎడబాటుని కాస్త మరపించింది పిల్లల పెళ్లి విషయం. ముగ్గురు పిల్లలు వారి కాళ్ళమీద వారు నిలిచే ప్రయత్నంలో సఫలీకృతులవడంతో పెళ్లి చేయాలన్న తపన బలీయమయ్యింది. పిల్లలను మొదటి నుంచి ఎక్కువ ఆంక్షలు విధించక వారి ఇష్టాయిష్టాలకు విలువనిస్తూ స్నేహితులకు మల్లే పెంచాము అన్నది కాస్త గొప్పే. అదే విధంగా వారి పెళ్లి విషయంలోనూ మేము మా అభిప్రాయాలను మోపక ఒకిన్ని విషయాలను వారికి స్పష్టం చేస్తూ ఒక్కొక్కరిగా వారిష్టపడ్డవారితో వారికి పెళ్లి జరిపించాము.
వీరు నిద్ర లేవడంతో నా తలపుల గొలుసు తెగింది. బ్రష్ చేసి స్నానాలయ్యాక బట్టలు సర్ది అందరితో కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు ముగించి పెట్టె బేడా సర్దుకుని బయలుదేరాము. ఆ హడావుడిలో రాత్రి తినడానికి ప్యాక్ చేసిన డబ్బా వదిలేసి వచ్చిన విషయం స్టేషనుకెళ్లిన తరువాతగాని తెలియలేదు. పోనీలే కనీసం ఇప్పుడే చూసుకున్నామని సంతోషిస్తూ దగ్గర్లో వున్న హోటల్లో ఇడ్లీలు కట్టించుకురావడానికి వెళ్లారు. చాలా పెద్ద క్యూ. ముప్పావు వంతు దూరం వెళ్లారో లేదో ఇడ్లీలు ఖాళీ అయ్యాయి ఇక ట్రైన్ బయల్దేరే టైం అయ్యిందని తిరిగొచ్చేశారు. ఇద్దరం ట్రైన్ ఎక్కి కూచున్నాము.
మాకు ఎదురుగా ఒక అమ్మాయి అబ్బాయి కూచున్నారు చిన్న పిల్లాడు నిద్రపోతున్నాడు. ట్రైన్ కదిలింది. ఓ పది నిమిషాల తరువాత ఆ అమ్మాయే మాటలు కలిపింది. కాసేపటికి ఆ అమ్మాయితో మాట్లాడుతూ ఉంటే ఎన్నో రోజులుగా పరిచయమున్నట్టు అనిపించసాగింది. మాటల మధ్యలో మావారు “నేను ఇక్కడ దొరికే పలావు తింటాను నీవైతే అది తినవు. ట్రైన్ ఈ స్టేషన్లో కాసేపు ఆగుతుంది నీకు కాసిని అరటిపళ్ళు బిస్కేట్లూ పట్టుకొస్తానుఅని అన్నారు. వారి మాటలు వింటున్న ఆ అమ్మాయి మీరేమీ అనుకోక పోతే బాబుకి తెచ్చిన ఇడ్లీలు వున్నాయి, వాడు నిద్రపోయాడు మీరు తినండి అంది నాతొ ఆత్మీయంగా. నేను ఓ క్షణం కూడా ఆలోచించక అలాగే ఇవ్వమ్మా అంటూ తీసుకున్నాను. మా వారు నాకేసి వింతగా చూసారు. కారణమింతే … అలా ట్రైన్లో కొత్తవారి దగ్గర తినే వస్తువులు తీసుకోకూడదని వాదించే తను ఇలా ప్రవర్తించడం వారికి కాస్త వింతగా అనిపించింది. ఇన్ని రోజుల ఒంటరితనం, మాటలు ఎక్కువగా లేని మౌనం నాపై ఇంత ప్రభావాన్ని చూపుతోందా?! ఆత్మీయతకు అఱ్ఱులుజాస్తోందా?! అని అనిపించకపోలేదు. నెలల తరబడి నా ఒంటరితనం ఆ అమ్మాయి చూపిస్తున్న అక్కరకు ఆవిరవుతున్నట్టనిపించడమే నా ఈ ప్రవర్తనకు కారణమనిపించింది. ఎందుకో తెలియదు మా ఇంట్లో మనిషిలాగా అనిపిస్తోంది. అందుకే ఏ మాత్రం సంకోచ లేకుండా తీసేసుకున్నాను.
నేను ఇడ్లీలు తింటున్నప్పుడు ఆ అమ్మాయి తన గురించి చెప్పుకోసాగింది. అప్పుడు తెలిసొచ్చింది ఆ అమ్మాయి స్టేట్స్ లో వుంటున్నది అబ్బాయి ఇక్కడే జాబ్ చేస్తున్నాడు. పిల్లాడిని అమ్మాయి తల్లి చూసుకుంటోంది. ఇప్పుడు వారి ప్రయాణం అత్తగారింటి వైపు. వాళ్ళ అమ్మగారిని ఒప్పించి అబ్బాయికూడా స్టేట్స్ కు త్వరలోనే వెళ్ళాలి అన్న విషయం తీర్మానించడానికి. మంచిదే ఒకరక్కడ ఒకరిక్కడ ఇలా పిల్లాడికి దూరంగా ఉంటూ అవస్థలు పడేకన్నా ఇది మంచి నిర్ణయం అన్నపుడు మా పెద్దాడు ఇదే కారణానికి ఆరు నెలలక్రితం ఇల్లొదిలిన విషయం గుర్తొచ్చింది. అప్పుడు పైకనకపోయినా ఈ విషయానికి బాగా నొచ్చుకున్న విషయం కూడా గుర్తొచ్చింది. అయితే ఈ అమ్మాయి మాటలు విన్నాక అలా వాడు స్టేట్స్ వెళ్లడం ఆక్షేపించే విషయం కాదేమో అని అనిపిస్తోంది. అలా అనిపించడంతో నాలో దట్టంగా గూడు కట్టుకున్న దిగులు మేఘాలు కాస్త పలచబడ్డట్టనిపించింది. వెంట వెంటనే ఆఫీస్ చాలా దూరం వెళ్లి రావడం అలసటగా వుంది. పిల్లాడికి కూడా అక్కడే దగ్గరగా వున్న స్కూల్లో చేర్పించి అందరం వీకెండ్స్ వస్తామమ్మా అన్న మూడవ అబ్బాయి మాటలు ఇప్పుడు తేలిగ్గా తీసుకోవాలనిపిస్తోంది. ఇక రెండవది అమ్మాయి. తను పెళ్ళయిన వెంటనే దూరదేశానికి వెళ్లడంతో తాను లేని లోటు కూడా బాధించేది. ఇప్పుడు ఈ అమ్మాయితో మాట్లాడుతూ ఉంటే పిల్లల కష్టం కూడా కాస్త కాస్త అర్థమవసాగింది. పిల్లలందరూ ఎలాంటి గొడవలు మనస్థాపాలు లేక కేవలం వారి వారి అవసర కారణాలకు దూరం వెళ్లారు. మూడవ అబ్బాయి కోడలు మనవడు వచ్చీ పోతూ వుంటారు, మంచి చెడూ కనుక్కుంటూ వుంటారు. పెద్దవాడు వీలయినపుడు తప్పక వస్తానమ్మా అంటూ సముదాయించేవాడు. ఎటూ పోయి అందరు కలిసి వున్నపుడు అంత సందడిగా వున్న ఇల్లు అలా ఒక్కసారికి ఖాళీగా అనిపించడం నన్ను ఇంతగా కృంగదీసింది అని అనిపించక పోలేదు.
అపుడు ఇంట్లో పని వంట వార్పూ, పిల్లలతో కాలక్షేపంతో టైం గడిచేదే తెలిసేది కాదు. బుర్రలో అనవసరపు ఆలోచనలకు తావుండేది కాదు. ప్రస్తుతం ఎలాంటి వ్యాపకం లేక చిన్న చితక పనులు చేసుకుంటూ ఎక్కువ శాతం ఖాళీగా వున్న మైండ్ చిన్న విషయాలను బూతద్దంలో చూడడంవల్ల ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చింది. తాను ఈ దైన్య పరిస్థితినుండి బయటపడాలంటే ఒక వ్యాపకాన్ని సృష్టించుకోవాలి. అందులో ఎక్కువ సమయం గడిపితే ఈ మౌనం ఒంటరితనం ఎక్కువగా బాధించదు. చదూకునే రోజుల్లో క్లాసుకు తానే ఫస్ట్. అందులోనూ మాథ్స్ తనకు కొట్టిన పిండి. ఇక హిందీ తాను చక్కగా పాఠం చెప్పగలదు. భోజనం పనులు అయ్యాక నిద్రపట్టక పొర్లుతూ మనసు పాడుచేసుకోవడం కంటే చిన్న పిల్లలకు పాఠాలు చెబితే సమయం వ్యర్థమైన ఆలోచనలకు తావులేక చక్కగా గడిచిపోతుంది. పిల్లలతో గడిపినట్టూ ఉంటుంది. కొడుకులు కోడళ్ళు పిల్లలు అమ్మాయి అల్లుడు అందరితో దొరికిన సమయంలో సంతోషంగా మాట్లాడుతూ మనసుని చక్కగా ఆరోగ్యంగా వుంచుకోవాలన్న నిర్ణయానికొచ్చాను. “ఎందుకు ఉన్నట్టుండి అలా మౌనంగా కూచున్నారు” ఆ అమ్మాయి ప్రశ్నకు తెప్పరిల్లి ” ఆ ఏంలేదమ్మా ఇలా ఏదో విషయం గుర్తొస్తేనూ… అని అన్నాను. మేము వచ్చే స్టేషన్లో దిగుతాము మీ ఫోన్ నెంబరు ఇవ్వండి టచ్ లో ఉందాము అన్న ఆ అమ్మాయిని ముచ్చటగా చూస్తూ అంతర్మధనంతో తేలికపడ్డ మనసుతో మనసారా దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి అని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. దాంతో నాలో అంతవరకూ గూడు కట్టుకున్న దిగులు మేఘాలు ఆవిరైపోయి మనసు నిర్మల ఆకాశంలా ప్రశాతంగా అనిపించసాగింది.
ఆకాశవాణి బెంగళూరు నుండి ప్రసారమైన కథ
“అమ్మా! గేటెడ్ కమ్యూనిటీలో ఇల్లు చూసాను. చాలా బాగుంది.నువ్వు ,నాన్న చూస్తే అడ్వాన్స్ ఇస్తాను.దివికి కూడా నచ్చింది” అన్నాడు విజయ్ తల్లి శాంభవి తో..
“ఏంటి! గేటెడ్ కమ్యూనిటీ లోనా? అస్సలు వద్దు.నేనైతే ఉండలేను.అవి ఊరికి చివర ఎక్కడో ఉంటాయి.నాకు ఇక్కడే బాగుంది” అన్నది శాంభవి.
భర్త భాను ప్రసాద్ కూడా ఎంతో నచ్చ చెప్పాడు.అయినా కూడా ససేమిరా అన్నది శాంభవి.
సాఫ్ట్వేర్ కు సంబంధించిన ఉద్యోగాలన్నీ హైటెక్ సిటీ వైపు ఉన్నాయి.వీళ్ళు ఉండేది తార్నాక లో.
కొడుకు కోడలికి ఇంత దూరం ప్రయాణం చేయడం కష్టంగా ఉంది. ప్రయాణంలో సగం సమయం పోతుంది.
అటు వైపు ఇల్లు తీసుకుని పోదాం అనుకుంటే తల్లి తండ్రులను వదిలి వెళ్ళ బుద్ధి కావడం లేదు.
అప్పటికి తండ్రి చెప్పాడు..
“మీరు అటు వైపు ఇల్లు తీసుకుని ఉండండి.కొన్ని రోజులైతే అమ్మ మారుతుంది” అని సలహా ఇచ్చాడు.అతనికి కూడా కొడుకు కోడలు ముఖ్యంగా మనవడిని వదిలి ఉండాలంటే కష్టంగా ఉంది.
కానీ కొన్నిటికి కాలమే సమాధానం చెప్పాలి. మనవడు స్కూల్ నుండి వచ్చిన తర్వాత ఆడుకోవడానికి చుట్టుపక్కల పిల్లలే కనిపించడం లేదు. అందులో వాడి స్కూల్ కూడా దూరంగానే ఉంది. కొడుకు, కోడలు వచ్చేవరకు రాత్రి అవుతుంది.
ఎప్పటిలాగే విజయ్, దివి ఆఫీస్ కి వెళ్లి వస్తున్నారు. అనుకోకుండా విజయ్ ఫ్రెండ్ అమెరికాకు వెళ్లిపోవడం వల్ల అతని విల్లా అమ్మేస్తున్నానని చెప్పాడు. అంతకుముందే విజయ్ ఆ విల్లాను చూసాడు. చక్కని సౌకర్యాలతో ఎంతో బాగుంది.
ఎలాగైనా సరే అనుకుని తల్లి, తండ్రి కి చెప్పి ఆవిల్లా కొనేసాడు. ఇల్లంతా శుభ్రం చేయించుకొని రంగులు వేయించి గృహప్రవేశం తేదీ నిర్ణయించుకున్నారు. గృహప్రవేశం అయిన తర్వాత మనసు మార్చుకుని తల్లి వస్తుంది అనుకున్నాడు.
బంధువులను పిలుచుకొని చక్కగా గృహప్రవేశం చేసుకున్నారు.
“అమ్మా! మన విల్లాలోకి షిఫ్ట్ అయిపోదామా?”అన్నాడు విజయ్.
“విజయ్! నాకు ఆ కమ్యూనిటీలు నచ్చదని చెప్పాను కదరా! మీరు వెళ్లి రండి. శని ఆదివారాలు ఒకసారి మీరు రండి మరొకసారి మేమిద్దరం వస్తాము నాకు ఇక్కడే అలవాటైపోయింది రా”అంటూ కచ్చితంగా చెప్పింది భవాని.
చేసేదేమీ లేక విజయ్ అన్య మనస్కంగా భార్య, కొడుకుతో కొత్త ఇంటికి వెళ్లి పోయాడు.
వాళ్లు వెళ్లినప్పటి నుండి భవానికి ఏమి తోచడం లేదు. ఇల్లంతా ఖాళీగా అనిపించ సాగింది. చేయడానికి ఏమీ పని కనిపించడం లేదు.
ఇంతకు ముం దులాగా ఇరువు పొరుగు పలకరించడం అసలే లేదు. ఎవరి ఇళ్లల్లో వాళ్ళు టీవీలు చూడటంతో సరిపోతుంది. భవానికి కూడా ఎక్కడికి వెళ్లడం అలవాటు లేదు. ఇన్నాళ్లు పిల్లలు, పనులు వీటితోనే సరిపోయింది. టీవీ సీరియల్లు చూసే అలవాటు అంతకన్నా లేదు. భర్తతో పోరు పెట్టి గుళ్ళకు వెళ్లడం చేస్తుంది. భాను ప్రసాద్‌కు రోజు ఇలా తిరగాలంటే కష్టంగానే ఉంది. హాయిగా పిల్లలతో ఉంటే మనవడినీ స్కూలుకు పంపించవచ్చు. సాయంత్రాలు వాడితో ఆడుకోవచ్చు అని అతని ఆశ.
వారం వారం పిల్లలు వచ్చి పోతూనే ఉన్నారు. ఒక వారం విజయ్ ఫోన్ చేసి..
“అమ్మా! బుజ్జిగాడికి జ్వరం వచ్చింది. ఈ వారం మేము రాలేము. అంత దూరం వస్తే వాడికి జ్వరం ఇంకా ఎక్కువవుతుంది. వీలైతే మీరు నాన్నగారు వచ్చేయండి” అని చెప్పాడు. కోడలు కూడా ఎంతో నెమ్మ దస్తురాలు. తాను కూడా ఫోన్ చేసి రమ్మని మరీ మరీ చెప్పింది.
మనవడికి జ్వరం అనగానే ఆమెకు మనసంతా కలచి వేసింది.
వెంటనే భర్తను అడిగింది..
“బుజ్జిగాడికి జ్వరం వచ్చిందట. ఈవారం మనమే వెళ్దాం అండి”అన్నది భవాని.
ఈ మాట కోసమే ఎదురుచూస్తున్న భాను ప్రసాద్ “తొందరగా బట్టలు సర్దుకో” అని చెప్పి తాను తన బట్టలు ఒక బ్యాగ్ లో పెట్టుకొని తయారయ్యాడు.
ఇద్దరూ కలిసి కొడుకు ఉండే విల్లా కు బయలుదేరారు.
గేటు లోపలికి వెళ్తుంటే వాతావరణం ఆహ్లాదకరంగా అనిపించింది భవానికి. ఎప్పుడో ఒకసారి స్నేహితుల ఇళ్ళకు వెళ్ళింది. కానీ తాను అంతగా గమనించు కోలేదు. ఇంట్లోకి వెళ్ళగానే ఇల్లంతా కూడా విశాలంగా అందంగా కనిపించింది.
మనవడు పరిగెత్తుకుంటూ వచ్చి నానమ్మను పట్టుకున్నాడు. వాడిని ఎత్తుకొని లోపలికి తీసుకొని వెళ్ళింది. రెండు రోజుల్లో మనవడు కోలుకున్నాడు.
అప్పటికే సెలవు మీద ఉన్న కొడుకు, కోడలు తెల్లవారి ఆఫీస్ కి వెళ్తామన్నారు.
“వాడికి ఇంకా నీరసంగా ఉంది. రెండు రోజులు ఇంట్లో ఉంటే కోలు కుంటాడు మీరు ఉండగలరా?”అని తల్లి,తండ్రిని అడిగాడు.
“అదేంట్రా! వీడికి జ్వరంగా ఉంటే మేము వెళ్ళి పోతామా?”అన్నది భవాని.
కొడుకు, కోడలు ఆఫీస్ కి వెళ్ళగానే తాను వంట పనిలో ఉంటే, మనవడితో భాను ప్రసాద్ ఆడుకున్నాడు. వాడికి నచ్చిన వంట చేసి తినిపించింది భవాని.
సాయంత్రం కింద పార్క్ కి తీసుకెళ్లారు. ఎంతోమంది పిల్లలు చక్కగా ఆడుకుంటున్నారు. ఆ పిల్లలతో పాటు ఇలా అమ్మమ్మ, తాతలో నాయనమ్మ తాతలో వెంట ఉన్నారు. వాళ్లంతా ఒక జట్టుగా మాట్లాడుకుంటూ కూర్చున్నారు. తనకు తన చిన్నప్పుడు చూసిన ఊరి వాతావరణంలా అనిపించింది.
సాయంత్రాలు అందరూ ఒక అరుగు మీద చేరి కబుర్లు చెప్పుకునే వాళ్ళు. ఇక్కడ అలాగే పెద్ద వాళ్లంతా మాట్లాడుకుంటూ ఉంటే, పిల్లలు అంతా ఆడుకుంటున్నారు. ఇప్పుడు తాము ఉండే ఇంటిలో అసలు చుట్టుపక్కల మనుషులు ఉన్నారా! లేరా! అన్నట్లు అనిపించ సాగింది.
భవానిని చూడగానే అక్కడ ఉన్నవాళ్లు పలకరించారు.
“విజయ్ తల్లి ,తండ్రి నా మీరు?”అని అడిగారు.
అవునని చెప్పారు ఇద్దరు.
“మరి మీరు ఎక్కడుంటున్నారు”? అని అడిగారు వాళ్ళు.
విషయం అంతా తెలుసుకుని వాళ్ళందరూ అన్నారు..
“పిల్లలను వదిలి అక్కడ ఎక్కడో ఉండటం ఎందుకండీ? ఇక్కడైతే వాళ్లకు ఆఫీసుల దగ్గరగా ఉంటాయి. ఇదిగో ఇలా చూడండి అన్ని కుటుంబాలు కలిసి ఉంటాయి. పండగలన్నీ కూడా మన ఊర్లలో జరుపుకున్నట్లు అందరూ కలిసి హాయిగా జరుపుకుంటాము. ఎన్నో రకాల పోటీలు జరుగుతుంటాయి. ఈ వయసులో కూడా మనం చిన్న పిల్లల లాగా పోటీలలో పాల్గొని మన టాలెంటును మనం చూపించుకోవచ్చు. ఇలా విల్లాలలో ఎన్నో సౌకర్యాలు ఉన్నాయి”అని చెప్పారు.
ఇలా రోజు కిందికి వెళ్లి వస్తూ ఉంటే ఎంతోమంది స్నేహితులయ్యారు భవానీకి. భాను ప్రసాద్ సంగతి చెప్పనవసరం లేదు. ఆయనకు ఒక సమూహమే ఏర్పడింది.
రెండు రోజులు అనుకున్న వాళ్ళు వారం రోజులు ఉండి పోయారు.
కొడుకుకు ఆశ్చర్యంగా అనిపించింది. ‘అదేంటి అమ్మ వెళ్తానంటుంది అనుకున్నాను. సంతోషంగా ఉంది ఇక్కడే!’ అని లోన సంతోష పడ్డాడు. ఇది కూడా చెప్పింది రోజు కిందికి వెళ్తున్నారు చాలామంది స్నేహితులయ్యారని. వాళ్లు ఇక్కడే ఉంటే బాగుంటుంది అని ఎంతగానో అనుకున్నారు.
ఒకరోజు అందరూ భోజనాలు చేసి కూర్చున్న తర్వాత భవాని కొడుకు కోడల్ని పిలిచింది..
“ఇలా కూర్చోండి” అని పిలిచింది.
ఇంటికి వెళతాము అని చెప్తుందేమో అని ఇద్దరు భయపడుతూ వచ్చి కూర్చున్నారు.
కానీ వాళ్లు ఊహించనీ విధంగా భవాని చెప్పిన మాటలు విని ఇద్దరూ ఆశ్చర్యపోయారు.
“ఇన్ని రోజులు నేను విల్లాలు అంటే అపోహ పడ్డాను. ఇక్కడికి వచ్చాక ఇలా అందరూ కలవటం, పిల్లలంతా ఆడుకోవడం నాకు ఎంతో బాగా అనిపించింది. ఇప్పుడు మనమున్న ఇంట్లో ఏ మనిషి కనిపించడం లేదు. ఇక్కడ ఉంటే మా చిన్నప్పుడు ఊళ్ళల్లో ఉన్నట్లుగా నాకు అనిపిస్తుంది. అందులో అన్ని సౌకర్యాలు ఉన్నాయి.
మీ నాన్నకు కూడా చాలా మంది స్నేహితులయ్యారు. అక్కడ ఉంటే బిక్కు బిక్కుమనుకుంటూ గడపాలి. ఎంతసేపటికి సమయం గడవదు. ఇక్కడ అసలు సమయమే తెలియడం లేదు. మేము ఇక్కడికి వచ్చేస్తాం రా”అని చెప్పింది.
విజయ్ ,దివిలకు ఎంతో సంతోషంగా అనిపించింది. బుజ్జిగాడు అయితే రోజు అడుగుతూనే ఉన్నాడు.
‘! వెళ్ళద్దు’ అని.. వీళ్ళు ఇక్కడే ఉంటారని తెలవగానే వాడు నానమ్మను గట్టిగా పట్టుకొని గంతులు వేశాడు.
ఎక్కడో మన ఇల్లు ఉంది. ఎన్నో ఏళ్ల నుండి ఉన్నాము అని భావిస్తూ ఒంటరిగా ఉండే కంటే మన వాళ్ళతో ఉండి సమయానుకూలంగా మారితే అంతకంటే ఆనందం ఇంకేముంటుంది!
అలా ఒక నిర్ణయం తీసుకొని హాయిగా నిద్రపోయారు.
సుహృత్ కన్నా సుచరిత ప్రవర్తన ఎక్కువ బాధని కలిగిస్తోంది. వాస్తవం అంగీకరించడానికి తన మనసు ఎందుకు సిద్దం కావట్లేదో అర్థంకాదు. ఇవాళ మళ్ళీ స్కూల్ కి వెళ్ళింది. అక్కడేం జరుగుతుందో తెలిసిందే. ఇంటికొచ్చి కన్నీరు మున్నీరు అవుతుంది. రెండు రోజులవరకు మాములు మనిషి కాదు. నిద్రాహారాలు ఉండవు. తన వైఖరి సుహృత్ కి ఎంత చేటు చేస్తుందో గ్రహించదు.
ఊరికి వెళ్ళక రెండు సoవత్సారాలు అయింది. అమ్మ నాన్న ముఖ్యంగా నాన్నమ్మ ఎలా ఉందో. చిన్నప్పటి నుండి పనికైనా పరిష్కారానికైన తను చేరేది నాన్నమ్మ ఒడికే. అటువంటిది ఇప్పుడు తన జీవితంలో ఇంత పెద్ద తూఫాను చెలరేగింది. నాన్నమ్మ దగ్గర ఎపుడు ఏది దాచని తాను ఇవాళ సుచరిత వల్ల సుహృత్ విషయం దాచాల్సి వస్తోంది. “నాన్నమ్మ నాకు మార్గం చూపవు.” మనసులోనే అర్థించాను.
*
“నాన్నమ్మ నువ్వు నిజంగా వచ్చావా?” ఆనందo ఉక్కిరిబిక్కిరి చేయగా ఆటో దిగిన నాన్నమ్మని వాటేసుకున్నాను.
“బడుద్దాయి! వదలరా , ముందు ఆటో అబ్బాయ్ కి డబ్బులు ఇచ్చి పంపు.” ప్రేమపూర్వకమైన నవ్వుతో ఇంట్లోకి దారితీసింది. సామానుతో ఆ వెనుకే ఆవిడని అనుసరించాను.
అవ్వడానికి డెబ్బై ఏళ్ళ వృద్ధురాలుఅయినా పడుచు వారికి ధీటుగా ఇప్పటికి ఒంటరిగా ప్రయాణాలు చేస్తుంది. ఒక్కసారి చూసిందో , ఇక అంతే , జన్మలో మర్చిపోదు. అందుకే ఆవిడ ఇక్కడికి వచ్చిమూడేళ్ళు పైన అయినా “ఎలా రాగలిగావు” అన్న ప్రశ్న వేయలేదు.
మంచి నీళ్ళు అందిస్తూ అడిగా “ కాఫీ పెట్టనా? తాగి స్నానం చేస్తావా” .
“అదేంటి నువ్వు పెట్టడం .సుచరిత ఏది”
“సుహృత్ స్కూల్ కి వెళ్ళిందిలే” చెప్పి కాఫీ పెట్టడానికి వంటిట్లోకి వెళ్ళా.
“ఏరా ఇంత విషయం ఉంటే మాకెవరికి చెప్పావు కాదే” “సుచరిత ఇష్టపడలేదు నాన్నమ్మ. అందరు పిల్లాడిని గేలి చేస్తారేమోనని భయపడింది. అలాగే మీ నుండి ఏమ్మాటలు ఎదుర్కోవాల్సి వస్తుందో అని కూడా కొంత భయపడింది. అందుకే రెండేళ్ళ బట్టి రావడానికి ఒప్పుకోలేదు..” సంజాయిషీ ఇచ్చాను. “అందులో తన తప్పేమీ లేదు లేరా. నూటికి నూరుపాళ్ళు ఏ తల్లి అయినా అలాంటి పరిస్థితుల్లో అలాగే చేస్తుంది.” మనుషులని మనసులని అర్థం చేసుకోవడం లో నాన్నమ్మ తర్వాతే ఎవరైనా అనిపించింది.
సుహృత్ కి Intellectual disability ( ఇంటెలెక్చువల్ డిసబిలిటి)ఉందన్న విషయం వాడికి ఐదేళ్ళు వచ్చేవరకు మాకు అర్థం కాలేదు. వాడు పాకడం , నడక , మాటలు అన్నీ ఆలస్యమే. తరగతి గదిలో ఓ చోట కుదురుగా కూర్చోలేకపోవడo, టీచర్ చెప్తోంది అర్థం చేసుకోలేకపోవడo, మిగిలిన పిల్లల మాదిరిగా కాక విషయాలని మర్చిపోతూ ఉండడం, పుస్తకంలో అక్షరాలని కుదురుగా కాక విసిరేసినట్లుగా రాయడం , ఏదైనా చెప్పడంలో , మాట్లాడటంలో పదే పదే తడబడ్డం…… వేటేనీ కూడా Intellectual disability (ఇంటెలెక్చువల్ డిసబిలిటి ) లక్షణాలుగా గుర్తిచడంలో విఫలం అయ్యాం.
“మీ అబ్బాయి ఎన్నిసార్లు చెప్పినా వేరే పిల్లల లంచ్ బాక్స్‌ల్లో వారు తింటుండగా తీసుకుని తింటున్నాడు. కోప్పడ్డా ప్రయోజనం లేదు. కొడితే భయపడాలన్న విషయం కూడా తెలియట్లేదు. ఒకసారి డాక్టర్ ని కలవండి…..” అని వాడి క్లాస్ టీచర్ చెప్పేవరకు , మా పిల్లాడి ప్రవర్తన మిగిలిన పిల్లలకి భిన్నంగా ఉంటోందన్న విషయం అర్థం కాలేదు.
అర్థమయినా సుచరిత అంగీకరించడానికి సిద్దపడలేదు. టీచర్ల సాకులంది. స్కూల్ మార్చాలంది. మార్చిన స్కూల్లోనూ అవే కంప్లైంట్స్ . ఇంక లాభం లేదనుకొని సుచరిత ని బలవంతం గా ఒప్పించి సుహృత్ ని మానసిక వైద్యుడి దగ్గరికి తీసుకొని వెళ్ళా.
ఏ విషయం అయితే సుచరిత మనసు స్వీకరిoచట్లేదో అదే సుహృత్ జీవితo యొక్క కఠన వాస్తవమైంది. ఆ క్షణాన ఒక్కసారిగా కాళ్ళ క్రింద భూమి కంపించినట్లైంది. తండ్రిగా నా పరిస్థితే దుర్భరం . ఇక తల్లిగా సుచరిత……. అర్థం చేసుకోగలిగాను. ఓపిక పట్టాను. మెల్లిగా తనకి తాను సర్దుకుంటుందని , వాస్తవాన్ని జీర్నిoచుకుంటుందని ఆశిoచాను. కాని అలా జరగట్లేదు.
లోకమంతటినీ తప్పు పడుతోంది కాని తన బిద్దలోని లోపాన్ని మాత్రం ఒప్పుకోదు. ఎవరైనా పిల్లాడి గురించి సలహానో సానుభూతో ప్రకటిస్తే వారితో ఎదురు దాడికి దిగుతుంది. రాను రాను వైద్యం వారిద్దరిలో ఎవరికి ఎక్కువ అవసరమో తనకి అర్థం కావట్లేదు. డాక్టర్ , ఇలాంటి పిల్లల పెంపకంలో తల్లి తండ్రులిద్దరూ శిక్షణ పొందాలి అంటారు. ముఖ్యం గా తల్లి .
వాడితో ఓపిగ్గానే ఉంటుంది. వాడిని కొట్టడం కాదుకదా కనీసం విసుక్కోగా కూడా తనెప్పుడూ చూడలేదు.విరాం లేకుండా వాడి వెంటే తిరుగుతూ, వాడి ప్రతీ చర్యను సర్దుకుంటూ , సమర్థించుకుంటూ ఉంటుంది. ఇన్ని చేస్తున్నా బిడ్డకి బుద్దిమాoధ్యత ఉంది అని ఒప్పుకోదు. చర్చ కి తావులేదు. “మీ బిడ్డని మీరే వెర్రివాడని అనుకుంటున్నారా ….” అని ఆవేదన చెందుతుంది. తన దుఖాన్ని చూసి మౌనం వహించడం మినహా చేయగలిగింది లేదు.
***
“ ఏంటి! నాన్నమ్మ సుహృత్ ని ఆడిస్తున్నావా…” వెనక వైపు వసారా లో నాన్నమ్మ సుహృత్ లని అలా చూస్తుంటే తనకి తన బాల్యం గుర్తోచ్చిoది.
“సుహృత్ ! తాతమ్మ ని ఆట పట్టిస్తున్నావా …” అంటూ నా వెనుకే వచ్చిన సుచరిత వెళ్ళి వాళ్ళిద్దరి ప్రక్కగా కూర్చుంది. ఆ ముగ్ద చిత్రంలో నా స్థానానికై నేనూ వెళ్ళి కూర్చున్నాను.
నాన్నమ్మ మమ్మల్ని చూసి చిరునవ్వు తో “ మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి “ అని “అక్కడెక్కడో బౌద్ధ గురువట, యేవో పరీక్షలు జరిపి ప్రపంచంలోనే అందరికన్నా సంతోషవంతుడు అని తేల్చారట. వారి పరిశీలనలు ఏమోగాని , నాకు తెలిసి ఆయన సంతోషం గా ఉండటానికి కారణం తనదైన ప్రపంచంలో హాయిగా ఆనందంగా జీవించడం , రాగద్వేషాలు కలిగి ఉండకపోవడం, ప్రకృతిని ప్రేమించడం, వస్తువులకి విలువ్వివక పోవడం, ముఖ్యంగా ఎవరితోటి దేన్నీ పోల్చుకోకపోవడం… అటువంటి లక్షణాలు ఉన్న వ్యక్తిని మీరు గొప్పవారిగా ఒప్పికుంటారా?” నాన్నమ్మ ప్రశ్న కి సమాధానంగా ఇద్దరం తలూపాం.
“మరి మీ బిడ్డ ఎదుగుదల పట్ల ఎందుకు అనుమానపడుతున్నారు.” నానమ్మ తర్కం అర్థంకాలేదు. నాన్నమ్మే మళ్ళీ “నా మనవడు ఎండగా ఉన్నప్పుడు వాన కావాలి అంటాడు. కుదిరిన ప్రతిమబ్బు కురవలంటాడు. అలా జరగనందుకు నిరుత్సాహ పడతాడు . ఒక్కోసారి విసుగు చెందుతాడు. ఆ ఆలోచనలో నీకు లోపం కనిపిస్తే నీ భార్యకి అది ఆందోళని కలిగిస్తుంది. అసలు ప్రకృతే గమనించడం మానివేసిన మీలాంటి వారికి అదో మానసిక రుగ్మత లా కనిపిస్తుంది.”
నాన్నమ్మ మాట్లాడుతోంది. నాకు అర్థమై కానట్లుగా ఉంది. కాని ఎక్కడో ఏదో నా ఆలోచనల్లోనే లోపం ఉందని అర్థమైంది. వికాసమైన వికలత అయినా మనిషి ఆలోచనల్లోనే ఉందని అర్థమైంది. వాడి గురించి నేనలా ఆలోచించడం నా మనో వైకల్యoలా ఇపుడు అనిపిస్తోంది.
“మనిషి ఎదిగేకొద్దీ వాడిలోని పసిమనసు కనుమరుగవుతుంది. మేధ పెరగడమే దానిక్కారణం అనుకుంటారు మీలాంటి మేథోవంతులు కాని అసలు సిసలు మేథ జిజ్ఞాసని ఎల్లప్పుడు జీవింపచేసి ఉంచటమే. ఆ మేధ వాడిలో ఉంది. మీ అజ్ఞానo వాడి మేధని అడ్డుకుంటోందని ఏనాడైనా ఆలోచించారా..?” సూటిగా ప్రశ్నించింది నాన్నమ్మ.
“నిజమే! అమ్మమ్మగారు. నలుగురిలోనూ ఆఖరికి నా భర్త సమక్షంలో కూడా నేనేనాడు నా బిడ్డకి మనో వైకల్యత ఉందని ఒప్పుకోలేదు. కాని నాకేతెలియకుండా నా అంతరంగాలలో ఎక్కడో ఎప్పుడో అదే అభిప్రాయం స్థిరపడినట్లుంది. అందువల్ల నిత్యం నేను , నాతో ఇతరులతో కూడా ఘర్షణ పడుతూ ఉండేదాన్ని. మీరు స్థిరంగా నా బిడ్డ ఆరోగ్యవంతుడు అని చెప్తున్నారు. నా మనస్సు , వాక్కు , చేత దేనికి పొంతన లేని కారణాన నా బిడ్డ జ్ఞానాన్ని జిజ్ఞాసని గుర్తించలేకపోయాను. సంఘంలో నా బిడ్డ స్థానం గురించిన ఆందోళనే తప్ప నా ఈ రకమైన ప్రవర్తన వాడి ఎదుగుదలకి అవరోధం అవుతోందని తెలుసుకోలేకపోయాను. ఇతరులకి భిన్నంగా ఉండడo ప్రత్యకమే తప్ప పొరపాటు కాదు అని ఆలోచించలేకపోయాను.” కళ్ళు వర్షిస్తుండగా మనసు విప్పి మాట్లాడుతోంది సుచరిత.
ఇన్నాళ్ళూ సుచరిత లో తప్పులు వెదకడమే తానూ చేసాడు తప్ప తన ఆలోచనల్లో దాగి ఉన్న అహంకారాన్ని అజ్ఞానాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. సుహృత్ కూడా ఆ బౌద్ధ గురువులాగే రాగద్వేషాలు లేనివాడు. దేనితోనూ ఏది పోల్చనివాడు. ప్రకృతి ని ప్రేమించేవాడు. అమ్మ అంటే విపరీతమైన అనురాగం, నిష్కల్మషమైన చిరునవ్వుతో అందరిని పలకరించే వాడి అమాయకత్వం… ఆలోచిస్తుంటే తెలుస్తోంది వాడి వ్యక్తిత్వపు పరిమళం.
నాన్నమ్మ పాదాలనoటి చెప్పాను “ఇంకెప్పుడు ఎవరితోనూ పోల్చను. వాడి ప్రపంచాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాను. వాడి మేధ ఎందులో ఉందో వెలికితీస్తాను.”
“ఈయన తిప్పని psychriyatist లేరు. కాని మీలా అర్థం చేయించిన వారెవరూ లేరు. చాలా థాంక్స్ అమ్మమ్మగారు…” ఆనందాశ్రువులు రాలుతుండగా రెండు చేతులూ జోడిచింది సుచరిత. మునుపెన్నడూ లేని సంతోషం సంతృప్తి కనిపించాయ్ ఆ కళ్ళల్లో.
“చాల్లెండర్రా ! మీరు మీ పొగడ్తలూ. వీడు నా మనవడు. వాడు నా మునిమనవాడు. నా కుటుంబంలోని పిల్లలు ఎలా ఆలోచిస్తారో నాకు తెలుస్తుంది కాని మీరు చెప్పే ఆ నాలుగు మాటలు వినే ఆ డాక్టర్ కి ఏం తెలుస్తుంది. యెంత తెలుస్తుంది. సరే!ఇంక మమ్మల్ని విసిగించక వెళ్లండి. మేమిద్దరం ఆడుకోవాలి….” అని నవ్వుతూ నా జీవితంలోని ఉప్పెనని ప్రశాంత నదీ ప్రవహంలా మార్చిన నాన్నమ్మ ఋణo ఏమిచ్చి తీర్చుకోగలను…..
‘హలో…..హలో….దిస్ ఈజ్ తేజ….హూ ఈజ్ దిస్ ..’
‘హలో……బుచ్చన్నా …..’ అటు నుండి ఆదుర్దాతో నిండిన అక్క కంఠం….
అమ్మావాళ్ళకి తప్ప ఎవరికీ తెలియని తన అసలు పేరు …. ఇండియా నుండి …. దెబ్బకు నిద్రమత్తు వదిలింది…. బెడ్ పై నుండే కాల్ లిఫ్ట్ చేసినవాడినల్లా దిగ్గున లేచాను …. ఇంత అర్ద రాత్రి .
‘అక్కా…. ఏమైంది …..’ వద్దనుకున్నా ఎదో భయం తొంగి చూసింది నా కంఠం లో .
‘…. నాన్న కు కొంచెం ఆరోగ్యం బాలేక పొతే హాస్పిటల్ లో జాయిన్ చేసాను… నిన్నే కలవరిస్తున్నాడు …అమ్మ, నాన్న దగ్గర హాస్పిటల్ లో ఉంది … తొందరగా రా…..’ అక్క అంది.
‘నాన్న …నాన్నకు ….ఇప్పుడెలా ఉందక్కా .. ప్రాబ్లం ఏమీ లేదు కదా….అమ్మతో నైనా మాట్లాడించ కూడదూ … నేను వెంటనే బయల్దేరుతాగాని …’
‘బానే ఉంది …హాస్పిటల్ లో సిగ్నల్స్ లేవు గాని …నువ్వు రారా ……’పెట్టేసింది ..
ఇక నిద్ర పట్టలేదు…. ఎంతో అత్యవసర మైతే తప్ప అక్క రమ్మనదు . ఏమైంది నాన్న కి…
మనసెందుకో కీడు శంకించింది.
పక్కన సునీల, పిల్లలిద్దరూ హాయిగా నిద్ర పోతున్నారు. తను ఒక్కడే వెళ్ళాలా …అందరు వెళ్ళాలా… ఇంత హడావుడిగా అంటే…. అయినా ఫర్లేదు… అందరు వెళ్ళడమే మంచిది.. అమ్మ ఎన్నో సార్లు అడిగింది అందరూ రమ్మని… దాదాపు ఆరేళ్ళవుతోంది పిల్లలతో వెళ్లి … పిల్లలతో ఏంటి… చిన్న పాప పుట్టిన దగ్గర నుండి కూడా అమ్మ,నాన్న చూళ్ళేదు…స్కైప్ లో చూడడమే తప్ప …. అందరితో కల్సే వెలితే సరి ..
అర్జెంట్ ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసాను …. ఆఫీస్ కి లీవ్ అరేంజ్ మెంట్స్ చేసుకున్నాను .
విషయం చెప్పి అర్జెంట్ గా సునీలని పిల్లలని బయల్దేరదీసాను … ప్రతీ చోట సమయానికే తప్ప డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వకుండా , ఫ్లైట్ తర్వాత కూడా టాక్సీ , కాబ్ బుక్ చేసుకుని ఫోన్ లో అక్క, బావ లతో టచ్ లో ఉంటూ తమ ఊరిలోకి అడుగు పెట్టాడు.
మట్టి రోడ్డు పోయి సిమెంట్ రోడ్డు వచ్చింది. గుడిసె లలాంటి ఇంటి ముందర ఉండే ఆవులు, గడ్డి వాములు పోయి చిన్న చిన్న డాబా ఇళ్లయ్యాయి… పెంకుటింటి ముందు, డాబా ఇళ్ళ ముందు ఇంతక ముందు అందరూ కూర్చుని మాట్లాడుకునే అరుగులు పోయి , గోడలు గేట్లు వెలిసాయి. గడప పై పసుపు పూసి బొట్లు పెట్టి, గడప చుట్టూ ఎర్రమట్టి తో అలికి , వాకిట్లో పచ్చని పేడతో కల్లాపి చల్లి , తెల్లని ముగ్గు వేసే సంస్కృతి పోయి సిమెంట్ వాకిళ్ళ పై కలర్లతో ముగ్గువేసే సంస్కృతి వచ్చింది. ఇపుడిపుడే నాగరికత సంతరించుకుంటున్న ఊరు … అప్పటి పాత ఆనవాళ్ళు లేకుండా చేసుకోవడానికి వ్యర్ద ప్రయత్నాలు చేస్తోంది.
కారు నెమ్మదిగా పోతోంది… సునీల పిల్లలు దూర ప్రయాణం వల్ల అలసిపోయి నిద్రపోతున్నారు.. పక్కనున్న పచ్చని పోలాలనుంది చాలా స్వచ్చమైన పైరగాలి వస్తోంది. అది ఎంత ఆహ్లాద పరుస్తున్నా, తెలియని ఆందోళన మనస్సును మెలిపెడుతోంది. రాత్రి నుండి నిద్ర లేదు. విమానం లో కూడా ఎంత కళ్ళు మూసుకున్నా ఆలోచనలే తప్ప నిద్ర రాలేదు.. ఎన్నెన్నో జ్ఞాపకాలు, మధుర స్మృతులు …
. నాన్న ఆజంజాహి మిల్ లో కార్మికుడు. ముగ్గురు అన్నయ్యలు , ఒక అక్క తర్వాత తను పుట్టాడు. తను పుట్టక ముందు అనారోగ్యం చేసి అన్నయ్య లిద్దరూ పొద్దున్న ఒకరు, సాయంత్రం ఒకరు చనిపోయారట. అంతకు ముందే ఒక అన్నయ్య చనిపోయాడట. అమ్మ గుండెలవిసేలా ఏడ్చిందట. అందుకే తను బతకాలని పుట్టగానే ముక్కు కుట్టించి బిక్షపతి అని పేరు పెట్టారట. చిన్నప్పటి నుండి ఇంట్లో అమ్మ, నాన్న,అక్క అందరూ బుచ్చన్నా అనే పిలుస్తారు. వాళ్ళు , మేనమామ తప్ప ఎవరైనా ఆ పేరు పెట్టి పిలవరు. తన పెళ్ళికి ముందు ఎంగేజ్ మెంట్ లో సునీల ముందు వాళ్ళు బుచ్చాన్నా అని పిలుస్తుంటే , ఆమె ఎవర్నో అనుకుందట. నాన్న కూడా స్కూల్లో చేర్పించేప్పుడు ప్రత్యక్ష దైవం సూర్యుడు కాబట్టి ,తన ఇంటికి దేవుడిలా పుట్టాడని సూర్య తేజ అని పేరు పెట్టాడు…
మిల్లు సైరన్ పొద్దున్న నాలుగు గంటలకే మోగేది. అప్పుడు నిద్ర లేసి , అరగంట లో
తయారై వెళ్ళిపోయేవాడునాన్న. అమ్మ నాన్నకు టిఫిన్ ఇచ్చి రమ్మని తనను, అక్కను పంపేది. అప్పుడు మూడు నాలుగు గిన్నెలతో ఇంత పొడుగు టిఫిన్ బాక్స్ ఉండేది. అందులో ఒక దాంట్లో గడక (జొన్నన్నం), ఒక దాంట్లో పెరుగు, ఒకదాంట్లో మామిడి కాయ పచ్చడి లేదా కూర , ఒక దాంట్లో పెరుగు ఉండేవి… ఆ టిఫిన్ బాక్స్, చెంబులో నీళ్ళు పట్టుకుని తను ,అక్క అడ్డదారి గుండా మిల్లు లో ఉన్న నాన్నకు సద్ది తీసుకెళ్ళే వాళ్ళు. నీళ్ళు తాగడానికి కాదు. చెప్పులు లేని తమ కాళ్ళకు ఎండలో బొబ్బలు రాకుండా . అక్కా, తనూ పరుగెడుతూ కాళ్ళపై నీళ్ళు పోసుకుంటూ వెళ్ళేవాళ్ళు. స్కూల్ కి కూడా అక్క, తను చెప్పుల్లేని కాళ్ళ తోనే వెళ్ళేవాళ్ళు. మిల్లు లోని కాంటిన్ లో గళ్ళ లకు గళ్ళ ల్లా ఉండే బూంది నాన్నకు పది పైసలకే వచ్చేది. రోజూ నాన్న రాగానే లోపలనుండి పరుగెత్తుకుని వెళ్ళేవాళ్ళు తను, అక్క… నాన్న ఇద్దరికీ బూంది ఇస్తూ చెరో ముద్దు ఇచ్చేవాడు.
నాన్నకు ఆయుర్వేద వైద్యం తో పాటు , ఆధ్యాత్మికత, భజనలు ,పాటలు చాలా ఇష్టం. దాశరధిశతకం లోని ‘ముప్పున కాల కింకరులు ముంగిట నిల్చిన వేళ…. కఫము కుత్తుక జొచ్చిన వేళ..రామా… నీ నామ స్మరణ కలుగునో కలగదో …నాటి కిప్పుడే నేను జేసెద నీ నామ స్మరణ దాశరధీ దయాపయోనిదీ ….’ పద్యం , ‘శ్రీమనోహర సురార్చిత సింధు గంభీర భక్త వత్సల కోటి భానుతేజ …. కంజ నేత్ర హిరణ్య కశ్య నాశక సూర సాధురక్షణ శంఖ చక్రహస్త ….ప్రహ్లాద వరద పాపద్వంస సర్వేశ కృష్ణ సాగర శయన కృష్ణ వర్ణా …పక్షి వాహన లసత్బ్రమర కుంతల జాల పల్లవారుణ పాద పద్మ యుగళా… చారుశ్రీ చందనాగరు చర్చితాంగ కుంద కుట్మల వైకుంట ధామ భూషణ వికాస శ్రీ ధర్మ పుర నివాస …దుష్ట సంహార నరసింహ దురిత దూరా….’ అంటూ నరసింహ శతకం లోని పద్యాలు రాగ యుక్తంగా ఎంత చక్కగా పాడేవారో… తనకూ అందుకే కంఠతా అయిపోయాయి. ఇవి మాత్రమేనా …. ‘జై జై మహాత్మా గాంధీ …. నీదే స్వాతంత్రా దీక్షా ….’ అంటూ గాంధీ గురించిన దేశ భక్తీ గేయాలు, పక్కనే ముస్లిం వాళ్ళు ఉండటాన ఉర్దూ లో గేయాలు పాడేవాడు. దూదేకుల వాళ్ళ ఇల్లు, దర్జీ పని చేసే ఖాజుద్దిన్ వాళ్ళిల్లు అన్నీ పక్క పక్కనే ఉండటం వల్ల హిందీ కూడా తెలుగంత స్పష్టం గా మాట్లాడే వాడు. తనూ వహీదక్క, జునీదన్న అని గోడ పక్కనే ఉన్న వాళ్ళింట్లో ఎప్పటికీ ఆడుకుంటూ ఉండేవాడు. ఇక సాయంత్రం అయితే చాలు ఏడు గంటల వరకే అంతా భోజనాలు చేసి తమ ఇంటి ముందున్న అరుగు మీదకు చేరేవారు..సరిగ్గా వీధి లైట్ తమ ఇంటి ముందే ఉండేసరికి అంతా అక్కడికే చేరే వారు. ఇక అక్కడ నాటకాలు, పద్యాలు, భజనలు, జోకులు, కష్ట సుఖాలు సకలం పంచుకునే వారు. మగవాళ్ళు నాటకాలు వేస్తూ , పద్యాలు పాడుతుంటే ఆడవాళ్ళు అంతా ఒక పక్కన మిగతా అరుగుల పైన కూర్చుని చూసేవారు. పిల్లలు అమ్మా నాన్నలతో పాటు చిరతలు, తబలా లాంటివి వాయిస్తూ తమ తోటి పిల్లలతో ఆడుతూ ఎంజాయ్ చేసేవారు. అసలు ఆ సమావేశం ఎంత లైవ్ లీ గా ఉండేదంటే అందరూ రోజూ పోద్దటి నుండి చేసిన శ్రమ నంతా అక్కడ మర్చి పోయేవారు. ఆ సాయంత్రం కోసం ఎదురు చూసేవారు.
అలా పది వరకు ఆడుతూ పాడుతూ చదివిన తను ఇంటర్ లో తప్పని సరై దగ్గరలోని పట్టణం లో హాస్టల్ లో చేరాడు. అమ్మానాన్నలను వదిలి అలా ఉండడం అదే మొదటి సారి కావడంతో చాలా కష్టమయ్యేది. అమ్మానాన్న లకు కూడా అంతే… వారానికి ఒక్క రోజు ఇంటికి వచ్చే తన కోసం కళ్ళు కాయలు కాస్తూ ఎదురు చూసేవారు.
నాన్నకు తానంటే చాలా ప్రాణం. ఒక సారి అమ్మ ఇంట్లో బోడ కాకరకాయ కూర వండింది.
నాన్న తో పాటు అందరూ శాఖాహారులే. అదే చాలా మంచిది అనేవాడు. తనకు బోడ కాకరకాయ కూరంటే చాలా ఇష్టం. కాబట్టి నాన్న ఆరోజు, ‘ ఆకూర నా కొడుక్కు ఇచ్చి వస్తాను ….బాక్స్ లో పెట్టి ఇవ్వు’ అన్నాట్ట…. దానికి అమ్మ, ‘ బస్ లో వెళితే రాను పోనూ డబ్బులు ఖర్చు అవుతాయి…ఎలాగూ వాడు మరో రెండు రోజుల్లో ఆదివారానికి వస్తాడు కదా… ఏమొద్దు’ అందిట. దానికి నాన్న, ‘ ఈ కూర వాడికి బాగా ఇష్టం ..ఇవ్వాళ ఎలాగైనా వాడిని చూడాల్సిందే … నా చేత్తో వాడికి ఈ కూర పెట్టాల్సిందే…. బస్ కి డబ్బులు అంటున్నావు కాబట్టి నా సైకిల్ పై వెళతాను…’ అన్నాట్ట. అమ్మ , ‘ రాను పోను నలభై కిలో మీటర్లు ఎలా తోక్కుతావయ్యా … వద్దులే..’ అన్నా వినకుండా బాక్స్ లో పెట్టమన్నా డ ట. కొంచెం కూర ఇంట్లో ఉంచి మిగతాది వేసిస్తే, ‘ వద్దు..మనకు లేకున్నా ఫర్వాలేదు…వాడి ఫ్రెండ్స్ కూడా ఉంటారుగా… నీ చేయివంట అందరికీ ఇష్టమే.. మొత్తం వేయి ..అంటూ గిన్నె మొత్తం ఊర్పించి బాక్స్ లో పెట్టి సైకిల్ పై బయల్దేరాడట… అయితే అదే రోజు తనకు నాన్నను చూడాలని పించడం తో , కాలేజీ హాస్టల్ లో పర్మిషన్ తీసుకుని బయల్దేరాడు. అప్పుడు ఫోన్ లు లేవు కాబట్టి నాన్న సైకిల్ పై అటు, తాను బస్ పై ఇటు వచ్చామట… నాన్న తన ఫ్రెండ్స్ కి ఆ కూర ఇచ్చి , ఉసూరు మంటూ మళ్ళీ సైకిల్ పై వచ్చేసరికి చాలా రాత్రయి పోయింది. నాన్న రాగానే తనను దగ్గరకు తీసుకుని ఈ విషయం చెబుతుంటే, అమ్మ, ‘ ఇంట్లో కొంచెం కూడా వాడికి దక్కనియ్యక మొత్తం కూర తీసుకుని, వాడిని తినకుండా చేస్తివి’ అంటూ ముద్దుగా విసుక్కున్నా..అందరం తెగ నవ్వుకున్నాం. ఆ రోజు తన కిష్టమైన కూర తినకున్నా నాన్న కోసం తాము ఎప్పటిలా తినకుండా ఎదురు చూసి వచ్చాక పచ్చడి మెతుకులు తిన్నా , ఆ ఆనందమే వేరు…
అలాగే నాన్నకు చలి అస్సలు పడేది కాదు . చిన్న చిరు చలి కైనా వణికి పోతూ రగ్గు కప్పుకునే వాడు . తల చుట్టూ నల్లని మఫ్లర్ కట్టుకునేవాడు. అమ్మ, అక్క వెక్కిరిస్తుంటే తను నాన్న జట్టుండి నాన్నకు ఇంకా వెచ్చగా కప్పేవాడు. మిల్లుకు చలికాలం చలి లో నాన్న వెళ్ళడానికి చాలా కష్ట పడేవాడు. ఒక్కోసారి షిఫ్ట్ మార్చుకునేవాడు. అయినా అలా అయితే మధ్యాన్నం వెళ్ళినా రాత్రి పది గంటలకు చలి ఉండేది. కాబట్టి తను నాన్నకు తెలీకుండా తమ ఇంటికి వచ్చిన మామయ్యలు , చుట్టాలు ఇచ్చిన డబ్బులు, తన పుట్టిన రోజుకు బట్టలు వద్దు …గల్లాలో దాచుకుంటా అంటే అమ్మానాన్న ఇచ్చిన డబ్బులతో ఒక స్వెట్టర్, మంకీ కాప్ కొన్నాడు నాన్నకి. దానికి నాన్న ఎంత సంతోష పడ్డాడో… ఎంత మందికి చూపించి , నా కొడుకు ఇచ్చాడని గర్వంగా చెప్పాడో…. ఇప్పటికీ తను అమెరికా నుండి పంపించిన మంచి మంచి స్వెట్టర్ లు ఉన్నా నాన్న దాన్నే ఇష్టపడతాడు. అలా చెప్పుకుంటూ పొతే ఎన్నెన్ని జ్ఞాపకాలో….
మొన్న నాన్న మాట్లాడేప్పుడు, ‘ తమ ఇంటికి ముందున్న ఖాళీ స్థలం లో ఒక వేదిక, హాల్ కట్టిస్తే , నాట్యం, సంగీతం , నాటిక ,పెళ్లి, సంబరాలు అలా ఆ ఊరిలోని ఎ వేడుక కైనా అది వేదిక అవుతుంది, కళలను పోషించినట్లు, పేదవాళ్ళని ఆదు కున్నట్లు అవుతుంది రా… అలాగే అమ్మ కి గుడి అంటే ఇష్టం. ఎప్పటికి నేను అన్నివేళలా ఉండను కదా తనను తీసుకెళ్ళడానికి, అందుకే చిన్న గుడి కట్టిస్తే బావుండు… ఖాళీ సమయాల్లో అక్కడ అమ్మ , నేను చిన్న పిల్లలకి, భగవత్గీత , సుమతి, వేమన, నరసింహ శతకాల లోని పద్యాలు చెప్పొచ్చు.’ అన్నాడు. ‘సరే…చూద్దాం నాన్నా.’ అన్నాడు.ఆ విషయం కూడా మాట్లాడాలి.
చిన్న కుదుపుతో కారు ఆగేసరికి ఆలోచనల నుండి బయటకు వచ్చాను. ఆ కుదుపు తో సునీల కూడా లేచి చుట్టూ చూస్తోంది. బయటకు చూసాను. టెంట్ వేసిన ఎదో ఇంటి ముందు కారు ఆగింది. ఇది మా ఇల్లు కాదంటూ కార్ డ్రైవర్ కి చెప్పబోతూ ఆగిపోయా…. ఎందుకంటే ఆ అరుగుల మీద ఉన్న బావ, మామయ్యా, ఇతర బంధువులు కారు ను చూసి లేచి కారు దగ్గరకు వస్తున్నారు. ఉలిక్కి పడి తీక్షణంగా చూసా… మా ఇల్లే… ఇంటి ముందు కాలుతున్న కట్టెలు …
అంటే….. మస్తిష్కం మొద్దు బారింది.. రెండు రోజుల ముందు,’కన్నా… మన ఊళ్ళో గుడో, బడో కట్టించాలని ఉందిరా ….దేశం గాని దేశం లో ఉన్నావ్..జాగ్రత్త .. ‘ అంటూ తనకు జాగ్రత్తలు చెప్పిన నాన్న తన జాగ్రత్త చూసుకోలేక పోయాడు… తను ఇంకా తన కోసం తన కిష్టమైన కూర నాన్న వండించి తన కోసం ఎదురు చూస్తూ ఉంటాడు అనుకున్నాడు… ఇంత హటాత్తుగా…కారు దిగిన తనను బావ, మామయ్య హత్తుకున్నారు విలపిస్తూ… మానసికంగా నిర్వీర్య మైన తన దేహాన్ని ఇద్దరూ అతి కష్టం పైన నడిపిస్తూ లోనకు తీసుకెళ్ళారు. లోపల హాల్లో నాన్న వాలు కుర్చీ పక్కన మంచు ముక్కల పైన నాన్న దేహం నిర్జీవంగా …పూలదండలతో ….
చలికి వణికి పోయే నాన్న దేహం ఇప్పుడు మంచు ముక్కలపై…అన్ని గంటలు… నా కోసం…
ఆ దేహం పై చిన్నప్పుడు నేను కొనిచ్చిన స్వెట్టర్… భరించ లేక పోయా…. నాన్న పాదాల పక్కన రేగిన జుట్టు , ఉబ్బిన కళ్ళతో శోక దేవత లా అమ్మ, పక్కనే నిలువెల్లా నీరైన అక్క.
నన్ను, సునీలను, పిల్లలను చూడగానే ఒక్కసారిగా రోదనలు మిన్నంటాయి… అమ్మ ఒళ్లో వాలుతూ చిన్న పిల్లాడిలా వెక్కి వెక్కి ఏడ్చాను. నాన్న పాదాలను కన్నీటి తో కడిగాను..
ఇక తర్వాత తతంగం అంతా కలలోలా జరిగి పోయింది. చిన్ననాటి నేస్తాలంతా ఎంతో ఆప్యాయంగా హత్తుకుని ఓదార్చారు. చిన్ననాటి ఊసులెన్నో మాట్లాడు కున్నాం..నాన్న బూడిద, అస్తికలు అన్నీ కాశీ, కాళేశ్వరం అన్ని పుణ్య క్షేత్రాలలో కలిపాం.
అయిదవ రోజు అక్క, బావ , ‘అమ్మ ఇక పై ఎక్కడ ఉంటుంది’ అన్న విషయం లేవదీసారు .
‘నాన్న లేని ఈ ఇంట్లో ఇక అమ్మ ఉండదు.ఉంటె పదే పదే నాన్న జ్ఞాపకాలతో ఆరోగ్యం ఖరాబవుతుంది… కాబట్టి నేను తీసుకెలతాను… లేదంటే నేను అక్కడ రిజైన్ చేసి ఇక్కడికే వచ్చేయమన్నా వస్తాను… అమ్మకు ఏది ఇష్టమైతే అలాగే చేద్దాం..’ అన్నాను.
‘అమ్మ గురించి నువ్వు నీ సెటిల్ అయిన జీవితాన్ని ఈ వయసులో వదిలి ఎందుకు బాధ పడటం.. అమ్మ నే తీసుకెళ్ళు.. అమ్మకీ స్థల మార్పిడి అయి కొంచెం ఆరోగ్యం కుదుట పడుతుంది’ అన్నారు బావ.
‘అలా అయితే ఈ ఇళ్లెం చేసేది… తాళం వేస్తె వట్టిగా బూజులతో పాడు పడి పోతుంది….
ఆ తర్వాత అయినా నువ్వేమయినా ఇక్కడికి వచ్చి ఉండేది ఉందా….. ఈ ఊరు సర్పంచ్, ఇల్లు అమ్మితే కొంటా నంటున్నాడు… ఈ సమయం లో ఇది అడగడం తప్పే అయినా నువ్వు మళ్ళీ అమెరికా వెళితే కష్టం కాబట్టి అడగమన్నాడు ‘ అన్నాడు మామయ్యా…
‘మీ ఇష్టం మీరెలా అంటే అలాగే…..’ అన్నాను.
ఆ సాయంత్రం మల్లె చెట్టు పందిరి కింద మంచం లో అమ్మ పక్కనే కూర్చున్నా…. జాజి, మల్లె , మరువం,లిల్లి రకరకాల పూల చెట్ల నుండి పరిమళం హాయిగా ఉన్నా మనస్సంతా ఎదో ఆందోళన… ఇదమిద్దంగా ఇది అని చెప్పలేని బాధ…. అమ్మానాన్న ఈ ఇంటి కోసంఎన్నో కష్టాలు పడ్డారు … నాన్నకు చలి పడదని , తను గోడలకు నీళ్ళు పట్టేవాడు.పుస్తకాల అర, బట్టలు పెట్టుకునే అరలు అక్క, తను కొట్లాడి తమ కిలా ఉండాలని ఎదో రారాజుల్లా తమ కిష్ట మైనట్లు కట్టించు కున్నారు. వాటిలో పుస్తకాలే కాదు ,,వాటి మధ్యలో వెలుతురు చూడని నెమలీకలు, అమ్మ రాత్రితన వంతుకు ఇచ్చే సర్వ పిండి చెక్కలను, చింతగింజలను , డబ్బులు దాచుకునే గల్లాను ఇలా సకలం పెట్టుకునేవాడు. ఆ అర పక్క గోడ పై దేవుడి బొమ్మలు, రోజు వారి టైం టేబుల్ అంటించు కునేవాడు. అమ్మ కూడా స్టౌ పెట్టడానికి గట్టు, పక్క గిన్నెలు పెట్టడానికి, అటక పైన తమకు అందకుండా పిండి వంటలు పెట్టడానికి అరలు అలా చేయించింది. ఇక దేవుడి గది అయితే దీపావళికి నోము కుండ లకు అమ్మ పెట్టె బొట్లతో, దీపాలతో వెలిగి పోయేది . ఆ ఇంట్లోని ప్రతీ వస్తువుతో, ప్రతీ చోటుతో తనకెంతో మధురమైన మరపురాని అనుబంధం ఉంది. తనకే ఇలా ఉంటె తన కన్నా ఎక్కువ ఏళ్ళు నాన్నతో ఇదే ఇంట్లో గడిపిన అమ్మకెన్ని ఉండాలి. అసలు అమ్మను ఒక్క మాట అడక్కుండా అమ్మేద్దాం అనేసాడు…
‘అమ్మా… ఇల్లు అమ్మేయడం నీకు ఇష్టమేనా….’ అన్నాను… మాటివ్వడం, ఒప్పందం అన్నీ అయిపోయాక అడుగుతున్నందుకు గిల్టీగా ఫీలవుతూ… అమ్మ మాట్లాడ లేదు. కాని అమ్మ కంటి నుండి వచ్చిన నీళ్ళు ఎన్నో అర్దాలు చెప్పాయి.
తెల్లవారి పదవ రోజు .. ‘ఇప్పటి వరకేప్పుడూ ఎ పక్షీ తొందరగా ముట్టడం లేదు… నాన్న కోరికేదైనా ఉందేమో … సరిగ్గా మొక్కుకో రా బుచ్చన్నా..’ అక్క గద్గద కంఠం తో అంది. ఇవన్నీ నమ్మక పోయినా నాన్నను తల్చుకుని , ఒక కోరిక చెప్పుకున్నా… అంతే….
‘అరె..ఏమనుకున్నావురా, ఇప్పటివరకూ లేనిది ..అదిగో రకరకాల పక్షులన్నీ ఎలా గుంపుగా వచ్చి ముడుతున్నాయో’ సంభామాశ్చర్యాలతో అక్క, బావ అంటున్నారు. కళ్ళు తెరిచాను. నిజమే…
ఇంటి కొచ్చాక అందరి ముందు ,’ అక్కా… అమ్మా…. అందరికీ చెబుతున్నాను… నేను ఇంతకూ ముందు కోరుకున్న కోరిక, నాన్నకు నచ్చిన కోరిక చెబుతున్నాను. ఈ ఇల్లు అమ్మ బోవడం లేదు. ఇక్కడి మనుషులతో, ఈ నేలతో నాకున్న అనుబంధం మరపురానిది, మరవలేనిది. ఏనాటికైనా ఇక్కడికి వచ్చినప్పుడు నాకూ ఈ ఊరితో గానీ, ఈ ఇంటి తోగాని, ఇక్కడి ఆత్మీయులతో గాని ఎ సంబంధం లేదన్నది నేను ఊహామాత్రంగా నైనా భరించలేను. అందుకే ఇంటి ముందున్న విశాలమైన ఖాళీ ప్రదేశం లో చిన్న గుడి, దాని పక్కనే లైబ్రరీ ని, సకల కళలు ప్రదర్శించడానికి వేదిక, హాలు ఏర్పాటు చేయాలనుకుంటున్నాను. అలాగే అమ్మ నుదుటి సింధూరం లో నాన్న కనపడతాడు. గాజుల గలగలల్లో నాన్న వినపడతాడు. చిన్నప్పటి నుండే వచ్చిన కుంకుమ,పసుపు, పూలు తీసే హక్కు ఎవరికీ లేదు . ఒక్క అమ్మ విషయం లోనే కాదు , మహిళలను ఏంతో మానసిక వేదనలకు గురి చేసే ఆ తంతు, భర్త పోయిన ఎ మహిళ కూ జరగకుండా చూస్తానన్నది ’ నాన్న కిచ్చిన మాట …’ నామాటలింకా ముగిసాయో లేదో, అందరి చప్పట్ల మధ్య అమ్మ నుదుటి పై ముద్దిచ్చి , అమాంతం నన్ను అక్కున చేర్చుకుంది. అది నాన్న భరోసాలా, అమ్మ అనురాగంలా హాయిగా ఉంది .
మా మేనత్త చావుని దగ్గరనుండి చూశాను. మంచం మీద తీసుకొని, తీసుకొని ఈ మధ్యనే చనిపోయింది. చనిపోయేముందు చాలా బాధపడింది. ఒక రకంగా చెప్పాలంటే, చుట్టూ ఉన్నవాళ్లు, ఆమె ఎప్పుడు చనిపోతుందోనని ఎదురు చూశారు. భగవంతుడా! అలాంటి మరణం మా అమ్మకు రాకుండా చూడు దేవుడా! అని నేనెప్పుడూ మనసులో కోరుకునే వాడిని.
అమ్మ చాలా తేలిగ్గా “యిన్నాళ్లూ అత్త వాళ్లకు చేసింది కదా! మరి వాళ్ళు ఆ రుణం తీర్చుకోవాలి కదా! అందుకే మీ అత్త మంచాన పడితే వాళ్ళందరూ మీ అత్త కింద చేశారు.” అని అంది. కానీ నాకు అర్థం కాని ప్రశ్న… “మనం వాళ్ళందరికీ సాయం చేస్తే, మరలా వాళ్లు మన రుణం తీర్చుకునే లాగ… మనకి చేసేలాగా…. మనం మంచానపడి చనిపోతామా అనేది?” నాకు పెద్ద ప్రశ్న.
“అలాంటి చావు ఎవరికీ రాకూడదు” అనే వాడిని అమ్మతో. దానికి బదులుగా “మరి వాళ్ళు మీ అత్త రుణం తీర్చుకోవాలి కదా నాయనా! లేకపోతే ఆ రుణం కోసం మరో జన్మ ఎత్తవలసి ఉంటుంది. ఈ జన్మలో ఆ భవబంధాలన్నీ తీర్చుకుని వెళ్లి పోయింది మీ అత్త. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, తెలిసో, తెలియకో మనం చేసిన తప్పులు కొన్ని ఉంటాయి. వాటి కర్మను ఈ జన్మలోనే అనుభవించేస్తే, అంత్య సమయంలో నిష్పూచీగా ఈ కట్టెను వదిలేయవచ్చు. లేకపోతే ఈ పాప కర్మను వచ్చే జన్మలో కూడా మోయాల్సి వస్తుంది.” అనేది అమ్మ చాలా ప్రశాంతంగా.
మా అమ్మ కూడా అందరి క్రింద చేసింది కదా! వాళ్ళు అమ్మ రుణం తీర్చుకోవాలంటే, అమ్మ కూడా అత్తలాగే మంచాన పడి, అందరి చేత సేవలు చేయించుకుంటూ, మరణం ఎప్పుడు వస్తుందోనని ఎదురుచూస్తూ…. ఇంకా ఎక్కువ కాలం మంచం మీద ఉంటే ఈవిడ ఎప్పుడు పైకి వెళ్లిపోతుందా అని అందరి చేత అనిపించుకుంటూ…. అమ్మ కూడా అత్తలాగే బాధపడి, బాధపడి ప్రాణం ఒదులుతుందా అనేది నాకెప్పుడూ విపరీతమైన భయాన్ని కలిగించేది. అందుకే అమ్మ ఆఖరి ఘడియలు ఎలా ఉంటాయోనని నాకెప్పుడూ బెంగగా ఉండేది.
ఎందుకంటే అమ్మ అందరి కిందా చేసింది. మరుదులు, ఆడపడుచులు, అత్తమామలు…. అందరినీ, తను పెద్దకోడలుగా బాధ్యతలు నెత్తిన వేసుకొని వాళ్ళందరి పెళ్లిళ్లు, పురుళ్లు అన్నీ అమ్మే చూసింది. ముందు, అంటే మా చిన్నప్పుడు అమ్మను వాళ్ళందరూ ఎలా చూసేవారో తెలియదుగానీ, ఇప్పుడు మాత్రం అందరు కూడా “వదిన లేకపోతే మేమిప్పుడు యిలా ఉండేవాళ్ళం కాదు. మా అమ్మకన్నా మా వదినే మాకు ఎక్కువ చేసింది” అని నా మేనత్తలందరూ అనేవారు. నా వదినల విషయానికొస్తే నేనే దగ్గరుండి చూసేవాడిని అమ్మ వాళ్లకు ఎంత బాగా అన్నీ చేసిపెట్టేదో! ఏ రోజు కూడా వాళ్ళనొక్క మాట కూడా అనకుండా అమ్మలాగే లాలించేది. వాళ్ళు మా అమ్మని వాళ్ళ అమ్మలాగ చూసుకున్నారా అంటే లేదనే చెప్పొచ్చు. అమ్మకా విషయం మీద ఏ రోజూ కంప్లైంట్ అనేదే లేదు. వాళ్లు మా అమ్మని ఎలా చూస్తున్నారనే విషయం, అమ్మ ఎప్పుడూ పట్టించుకునేది కాదు.
ఇంటికి నేను చిన్న కొడుకునవడం చేత అమ్మ దగ్గర చనువెక్కువ. నా పెళ్లి అయ్యేటప్పటికి అన్నీ తానే దగ్గరుండి అందరికీ చేసి పెట్టేది. కానీ నా పెళ్లి అవ్వగానే వదినలందరూ, ఇంతవరకు మేమే చూసాము కదా! ఇంకా ఎన్నాళ్ళు మేము చూస్తాము అని అమ్మ బాధ్యత నాకు అప్పచెప్పారు. నా భార్య ప్రేమగా కాకపోయినా బాధ్యతగా చూస్తుంది. కానీ నా భయాలను అబద్ధాలు చేస్తూ, అమ్మ తులసి మొక్కకు పూజ చేస్తూ, అలా కూర్చొని ప్రాణాలు వదిలేసింది.
“ఎవరి రుణమూ ఉంచుకోకూడదు నాయనా! ఉంచుకుంటే అది తీరేవరకూ మనం ఈ లోకంలోనే ఉండాల్సి వస్తుంది.” అనేది అమ్మ. అమ్మ ఎవరి రుణమూ ఉంచుకోలేదు. కానీ అమ్మకు చాలామంది రుణపడి ఉన్నారు. మరి వాళ్ళందరూ అమ్మ రుణం తీర్చుకోకుండా అమ్మ ఈ లోకం నుండి ఎలా వెళ్ళిపోయింది? తన మరణం తాను కోరుకున్నట్లు ఎలా జరిగిందనేది, నాకు ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్న? ఈ పన్నెండు రోజుల కార్యక్రమాలు అన్నీ అయిపోయాక, అమ్మ ఎంతో గౌరవించే రామాలయం పూజారిగారి ముందు నా ప్రశ్నను ఉంచాను.
“ఏమీ లేదు నాయనా! మీ అమ్మ నిష్కామకర్మురాలు. ఏ రోజూ ఎవరికీ సహాయం చేశానని అనుకోలేదు. అది తన బాధ్యత కాబట్టే, ఇతరులకు సాయం చేయడానికి భగవంతుడు తనకా అవకాశం ఇచ్చాడు అనుకునేది. ఇంకా కాకపోతే ఏ జన్మలో వారికి రుణపడి ఉన్నానో? ఈ రకంగా వాళ్లకి సాయం చేసి ఆ రుణం యిప్పుడు తీర్చుకుంటున్నాను, అనుకునేదే తప్ప, తనేదో వాళ్లకు ఉపకారం చేశానని ఏ రోజూ అనుకోలేదు. ఎవరికి ఏ పనిచేసినా, అది భగవంతునికి చేశాను అనుకునే చేసేది. దేవుడు తనకా శక్తి ఇచ్చాడు, కాబట్టి చేయగలిగానని భగవంతునికి కృతజ్ఞతలు చెప్పుకునేది మీ అమ్మ. అందుకని ఆమెకు ఎవరూ రుణపడి లేరు. అందుకే మీ అమ్మ చాలా సులువుగా ఈ భవబంధాలను తెంచుకుని వెళ్ళిపోగలిగింది.”
“ఇంకొకరికి చేసాము, చేసాము అనుకుంటే, వాళ్లు మన రుణం తీర్చుకునే దాకా మనమిక్కడ బాధలు పడాలి. ఎవరికీ మనమేమీ చెయ్యలేదనుకుంటే, మనకు ఎవరి రుణమూ ఉండదు. నాటకంలో తమ పాత్ర అయిపోగానే నిష్క్రమించిన పాత్రధారిలా, ఆమెకు ఈ లోకంలో భగవంతుడు చెప్పిన పని చేసి, ఈ లోకం నుండి నిష్క్రమించింది. ఆమె నిష్కామకర్మురాలు. ఇలాంటి మరణం ఎంతో పుణ్యం చేసుకుంటే గాని రాదు. మీ అమ్మ అదృష్టవంతురాలు నాయనా! అదీ విషయం” అని చాలా తేలిగ్గా తేల్చి చెప్పేశారు పూజారిగారు.
ఆయన చెప్పిన మాటలు విన్నాక నా అనుమానం తీరిపోయింది. అమ్మ ఎప్పుడూ చెప్పే నిష్కామకర్మ అంటే ఏమిటో యిప్పుడు నాకు అర్థమైంది. “మనం ఎవరి రుణమూ ఉంచుకోకూడదు నాయనా! అనేది అమ్మ. మనకు సాయం చేసిన వాళ్ళను మర్చిపోకుండా, వాళ్లు మనకు చేసిన సహాయం మనమెప్పుడూ మర్చిపోకుండా కృతజ్ఞులమై ఉండాలి. మనం ఎవరికైనా చేసిన సాయం, చేసిన వెంటనే మర్చిపోవాలి. వాళ్లకు సాయం చేసాం అనే భావం మనసులో ఎప్పుడూ ఉండకూడదు. భగవంతుడు మనకు అవకాశం ఇచ్చాడు కాబట్టి చేయగలిగాం అనే భావం ఉండాలి. ఇది అమ్మ చెప్పిన నిష్కామ కర్మ అనేది ఇప్పుడు నాకు బాగా అర్థమైంది. అమ్మలా ఆలోచించే శక్తిని నాకు ప్రసాదించు భగవంతుడా! అనుకుంటూ, నా భయాలేవీ నిజాలు కానందుకు మనసులోనే అమ్మకు ధన్యవాదాలు చెప్పుకున్నాను.
“అమ్మా అమ్మా” అంటూ రుసరుసలాడుతూ వచ్చింది రుక్కమ్మ.
“అదేంటి, ఈ రోజు హాట్ హాట్‌గా ఉన్నావు. ఏమైందేమిటి?” అన్నది కనకదుర్గ.
“అది కాదమ్మా, రోజురోజుకీ ఎండలు ముదురుతున్నాయి కదా. ఆ వసంతమ్మ పొద్దున్నుంచీ చాకిరీ చేస్తున్నాననైనా లేకుండా, పోనీ అన్నం పెట్టకపోతే మానే, ఇంత మజ్జిగ నీళ్లైనా పోయవచ్చు కదా… అదీ లేదమ్మా. మీ పెద్దోళ్లు హాయిగా నీడపట్టున కడుపులో చల్ల కదలకుండా కూర్చుంటారు కదా. ఎండలో పడి నాలుగిళ్లల్లో కష్టం చేసుకు బ్రతికేటోళ్లం మా మీద కాసింత జాలి చూపించకపోతే ఎట్టాగమ్మా, నాకు తెలవక అడుగుతున్నా…!” అన్నది.
దాని ముఖంలో నిజంగానే ఉదయం నుంచి గొడ్డు చాకిరీ చేసిన అలసట ఉట్టిపడుతోంది. ఉన్న మాట చెప్పొద్దూ, దుర్గ కడుపు తరుక్కుపోయింది జాలితో!
వెంటనే “పోనీలే రుక్కమ్మా, మజ్జిగకేం భాగ్యం చెప్పు. నేనిస్తా” అంటూ అప్పటికప్పుడు పెరుగు కవ్వంతో చిలికి అందులో చిటికెడు ఉప్పు వేసి కలిపి ఇచ్చింది కనకదుర్గ. మజ్జిగ తాగిన రుక్కమ్మ కళ్లల్లో ఎనలేని ఆనందం, కృతజ్ఞత కనిపించాయి.
అప్పుడు ఆమె అన్నది కదా, “అమ్మా, ఇయ్యాలయితే నువ్వు ఇచ్చినావు. ఈ ఎండాకాలం ఇంకా రెండు నెలలుంటది, రోజూ ఎవురిస్తారమ్మా గిట్ల…!” అన్నది.
ఆ మాటలకు దాని మీద ప్రేమాభిమానాలు పొంగుకురాగా, “ఫరవాలేదు, ఈ రెండు నెలలూ నేను పోస్తాగా మజ్జిగ. నీకెందుకు, నువ్వు నిశ్చింతగా ఉండు” అన్నది భరోసా ఇస్తూ.
అది కూడా “నీ కడుపు చల్లగుండ, చాలా థాంక్స్ అమ్మా” అని సంతోషంగా వెళ్లిపోయింది.
ఆ తరువాత కనకదుర్గ కూడా భోజనం చేసి పడుకుంది రోజూలానే. పిల్లలు స్కూల్ నుంచి రావటానికి ఇంకా టైం ఉంది అనుకుంటూ నిద్రపోవడానికి ట్రై చేసింది. కానీ ఆలోచనలు రుక్కమ్మ చుట్టూ తిరగడం మొదలుపెట్టాయి.
ఈ బడుగు వర్గాలు ఎంత అల్ప సంతోషులో కదా… పిచ్చిది, నేను రోజూ మజ్జిగ పోస్తాననే టప్పటికీ ఎంత సంతోషించింది…! ఒక్క మనిషికి మజ్జిగ పోయంగానే అయిపోయిందా? ఇలా ఎండలో పడి కాయకష్టం చేసుకునే పేదలు ఎంతోమంది ఉన్నారు… వారందరికీ కూడా చేయగలిగితేనే మానవ జన్మకి సార్థకత! అందుకేగా ఎండాకాలంలో దారిన పోయే బాటసారుల కోసం చలివేంద్రాలూ అవీ వెలిసింది అనుకుంటుండగానే దుర్గకి మెరుపు లాంటి ఆలోచన తట్టింది.
అంతెందుకు, మన సొసైటీలోనే ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఎండనక వాననక కాలనీ అంతా ఎప్పటికప్పుడు ఊడుస్తూ పరిసరాలను శుభ్రంగా స్పిక్ అండ్ స్పాన్‌గా ఉంచే ఊడ్చే ఆడవాళ్లు, సెక్యూరిటీ సిబ్బంది… వీళ్లందరికీ రోజూ 12 గంటలకు మజ్జిగ పోస్తేనో అన్న ఐడియా వచ్చింది.
వెంటనే దాన్ని అమల్లో పెట్టింది. పాలవాడికి రేపటి నుంచి ఓ రెండు లీటర్ల పాలు ఎక్స్ట్రా పోయమని చెప్పింది. అంతే కాదు, సొసైటీలో ఊడ్చేవాళ్లకీ, సెక్యూరిటీ సిబ్బందికీ ఫోన్ చేసి చెప్పింది, రేపట్నుంచి 12 గంటలకు వచ్చి మజ్జిగ తీసుకుని వెళ్లమని.
ఇలా ఆ మజ్జిగ కార్యక్రమం విజయవంతంగా సాగుతుండగా ఆదివారం వచ్చింది.
ఆ రోజు కనకదుర్గ, కాలనీ పనివాళ్లకి మజ్జిగ ఇవ్వడం పిల్లలు ప్రశాంత్, ప్రత్యూష చూశారు. వాళ్ల లేత మనసులో ఓ చిన్న డౌట్… పదేళ్ల బాబు ప్రశాంత్ అడిగాడు తల్లిని.
“అమ్మా, పనివాళ్లకి రోజూ మజ్జిగ ఎందుకిస్తున్నావమ్మా?” అని అడిగాడు.
“ఎందుకంటే వాళ్లు కష్టపడి ఎండల్లో పనిచేస్తున్నారు కదా నాన్నా, అందుకని మనలాంటి వాళ్లం సహాయం చేయాలి నాన్నా” అన్నది.
“మరైతే వాళ్లు ఏమైనా మనకు పని చేస్తారా? మనం వాళ్లకి ఊరికే ఎందుకు చేయాలి… మనకీ డబ్బవుతుంది కదా” అని ఈ సారి ఏడేళ్ల పాప ప్రత్యూష అందుకుంది.
వాళ్లిద్దరి సునిశిత పరిశీలనా దృష్టికి అబ్బురపడి వాళ్లని అక్కున చేర్చుకుంటూ ఇలా అన్నది. “ఛ, తప్పు నాన్నా అలా అనకూడదు. మనం చేతనైనంత సాయం, అదే హెల్ప్, ఇతరులకి చేయాలి. మనకన్నా బీదవాళ్లకీ, పూర్ పీపుల్‌కి చేస్తే దేవుడు సంతోషిస్తాడు. అప్పుడు మనకి కూడా హెల్ప్ చేస్తాడు దేవుడు. తరువాత, మనం చేసే మంచి పనులకి ప్రతిఫలం అంటే ఎక్స్పెక్ట్ చేయకూడదు. అప్పుడే దేవుడు మనకి సహాయం చేస్తాడు. ఈ విషయమే భగవద్గీతలో శ్రీ కృష్ణ పరమాత్మ మనకి ఒక శ్లోకం ద్వారా చెప్పారు” అన్నది.
“అదేం శ్లోకం అమ్మా, నాకు కూడా చెప్పవూ…?” అడిగాడు ప్రశాంత్.
ఆ శ్లోకం ఇదే నాన్నా –
*“కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన, మా కర్మ ఫలహేతుర్భూః మా తే సంగోఽస్త్వకర్మణి.”_
అంటే, కర్మలు చేయడం వరకే నీకు అధికారం ఉంది, ఫలం మీద కాదు అని చెప్పారు. కాబట్టి ప్రతిఫలాపేక్ష లేకుండా మనం కర్మలు చేయాలి అని శ్రీ కృష్ణుడు మనకు బోధించాడు” అని చెప్పింది దుర్గ.
అప్పుడు బాబు అన్న మాటలు విన్న దుర్గ ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయింది. ఇంతకీ ప్రశాంత్ ఏమన్నాడంటే, “అయితే అమ్మా, బీదవాళ్లకు అన్నం పెట్టడం కూడా మంచిపనే కదమ్మా?”
“ఓ యస్, తప్పకుండా నాన్నా” అన్నది.
“అయితే మనం ఈ పనివాళ్లకి రోజూ అన్నం కూడా పెడదామా?” అన్నాడు సందేహిస్తూ.
దానికి బాబుని దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టుకుని ఇలా అంది, “శభాష్ నాన్నా, ఇప్పుడు నువ్వు నా కొడుకువి అనిపించుకున్నావు… ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ యూ! అలాగే తప్పకుండా పెడదాం నాన్నా. కాకపోతే, రోజూ అందరికీ అన్నం పెట్టాలంటే ఖర్చు, సమయం రెండూ ఎక్కువ కావాలి కదా. అందుకే ఆదివారం ఆదివారం పెడదాం ఏం…!” అనంగానే పిల్లలిద్దరూ ‘యే’ అంటూ చప్పట్లు కొట్టారు ఆనందంగా!!!
నా చిట్టి తల్లీ! ఇంకో వారంలో నువ్వు వచ్చేస్తున్నావంటే నాకెంత సంతోషంగా ఉందో మాటల్లో చెప్పలేను. మరి నాతో నేరుగానే మాట్లాడొచ్చుగా ఈ ఉత్తరం ఎందుకంటావా?నిజమే తల్లీ! కానీ నీతో నేరుగా మాట్లాడే మాటలు వేరుగా ఉంటాయి. నీకు తెలుసా బంగారూ.. కొన్ని విషయాలు ముఖాముఖి మాట్లాడలేమని? అవున్నిజం! ఆ సంగతులు మనసులో ఘనీభవించిన దుఃఖపు పొరలో, విషాదాలో, విస్మయాలో, విచారాలో, అనుభూతులో, అనుభవాలో,ఆనందాలో, అద్భుతాలో.. ఏవైనా కావచ్చు. గుండె తడి గొంతులో కొట్టుకులాడి పెదవి అంచుల్లో పొడిబారి పోవచ్చు లేదా కళ్ళల్లోకి ఎగిసిపడే కన్నీటి కెరటాలూ కావచ్చు. వేదనా.. వేడుకా .. చెమ్మగిల్లేవి మాటలే కదా! అందుకే మాట్లాడలేని మాటలు మర్చిపోకుండా తడబడకుండా అక్షరాలై.. పదాలై.. వాక్యాలు సాగే వెల్లువే ఉత్తరం! రాసిన మనిషి మన ఎదురుగా కూర్చుని మనతో మాట్లాడిన అనుభూతినిచ్చేది.. మళ్లీ మళ్లీ అనుభవానికి వచ్చేది ఉత్తరమే కదా!?!
నా చిన్నారీ! నువ్వు చదవగలిగే సమయం వచ్చేవరకు… ఉహు..చదివి అర్థం చేసుకునే విజ్ఞత నీకు కలిగే వరకూ ఈ లేఖను పదిలంగా దాచుకుంటాను. భవిష్యత్తులో నేను నిన్ను ప్రశ్నించాల్సిన సమయమో.. నువ్వు నన్ను నిలదీసే సందర్భమో వచ్చినప్పుడు ఈ ఉత్తరమే మాట్లాడుతుంది. మరి మాట్లాడే ఉత్తరానికి నా గురించి నివేదిస్తేనే కదా నీకు చెప్పగలదు!?!
నా జాబిల్లీ! మా అమ్మానాన్నలకు నేను ఒక్కతినే సంతానం. పాపం మా అమ్మ నలుగురు పిల్లల్నయితే కన్నది కానీ నాకన్నా ముందు పుట్టిన ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగ బిడ్డ ..పుట్టిన కొద్ది గంటలకే చనిపోయారట. నవ మాసాలు మోసి పురిటి నొప్పులు భరించి ప్రసవించిన బిడ్డలు అలా
చనిపోతుంటే తల్లిదండ్రుల వేదన హృదయ విదారకం కదా! బిడ్డల్ని బతికించుకోవాలని వారు పడ్డ తపన చెప్పనలివి కానిది. ఆ అలివి కాని బాధే నాకు “కుప్పమ్మ” అని పేరు పెట్టడానికీ వెనుకాడ లేదు. అవును. నేను పుట్టింది పల్లెటూరు కాదు. ఓ మోస్తారు పట్టణమే అయినా బిడ్డ బతకాలన్న ఆశ ..మూఢనమ్మకాలను జయించింది. పక్కింటి అవ్వ చెప్పిందని పుట్టగానే నన్ను తీసుకెళ్లి చెత్త దిబ్బ మీద పెట్టి పూజ చేసి “ఈ బిడ్డను నాకు ప్రసాదించమ్మా. నీ పేరే పెట్టుకుంటాను” అని ప్రార్థించి ఇంటికి తెచ్చారట. వారి నమ్మకమో, ప్రార్థన ఫలించిందో, నా ఆయువు గట్టిదో.. కానీ నేను బతికి బట్ట కట్టాను. అందుకే నాకు కుప్పమ్మ అని పేరు పెట్టారు. ముగ్గురు దక్కని బిడ్డల తర్వాత బతికిన నేను అమ్మానాన్నల గారాల బిడ్డను కాక మరేం అవుతాను? కింద పెడితే చీమ కొరుకుతుందేమో పైన పెడితే గద్ద తంతుందేమో అన్నట్లు కళ్ళల్లో పెట్టుకొని అపురూపంగా పెంచారు నన్ను. అయితే ఎంత ప్రేమ ఉన్నా అమ్మ క్రమశిక్షణ, కట్టుబాట్ల మధ్య నేను సగటు ఆడపిల్లగా అంటే ఆచార వ్యవహారాలు, భయభక్తులు, వినయ విధేయతలు కలిగిన ఆడపిల్లగా ఎదిగాను. ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ చదవాలని ఉన్నా బయట ఊర్లకు పంపడానికి అమ్మానాన్నలు ఇష్టపడలేదు. పెళ్లి చేద్దామని అమ్మ.. అప్పుడే ఎందుకని నాన్న వాదులాటలో మూడేళ్లు గడిచాయి. దానికి ముగింపుగా నా పెళ్లి ఘడియలు దూసుకు వచ్చాయి. బంధువుల పెళ్ళిలో నన్ను చూసిన నా అత్తమామలు అక్కడే పెళ్లి మాటలు మొదలు పెట్టేశారు. నా అమాయకత్వం వారికి, నా అందం వాళ్ళ అబ్బాయికి నచ్చేశాయి. ఇక నేను నచ్చాల్సింది వాళ్ళ అయిదు మంది కూతుళ్లకు.
” ఐదు మంది ఆడబిడ్డలా? మన బిడ్డ నోట్లో నాలుక లేనిది. వాళ్లతో ఎలా వేగుతుంది? ఈ సంబంధం వద్దు” అనేసింది అమ్మ భయంగా.
“అందరికీ పెళ్లిళ్లు అయిపోయాయి. ఎవరి సంసారాలు, కుటుంబాలు వాళ్ళవి. ఎప్పుడో.. ఏదో పండగ పబ్బాలకు వస్తారు అంతే కదా!అయినా వాళ్ళని చూసుకోవడానికి వాళ్ళ అమ్మానాన్నలు దిట్టంగా ఉన్నారు. అబ్బాయికి, మన పాపకు అంత బరువు బాధ్యతలు ఉండవు. ఒక్కడే కొడుకు కదా కోడల్ని బాగా చూసుకుంటారు. ఊర్లో పొలాలు కూడా ఉన్నాయట” అని పెళ్లి పెద్దగా ఉన్న శివయ్య గారు హామీ ఇచ్చినా అమ్మ అంతగా ఇష్టపడలేదు.
“ఒంటికాయ సొంటి కొమ్ములా మన పాప అన్నదమ్ములు ..అక్క చెల్లెళ్ళు లేకుండా ఒంటరిగా పెరిగింది. పెద్ద కుటుంబంలోకి పాప పోతే రేపు మనం లేకపోయినా వాళ్లే బాగా చూసుకుంటారు” అని నాన్న ఇంకా కొందరు బంధువులు నచ్చ చెప్పడంతో అమ్మకు ఒప్పుకోక తప్పలేదు.
అత్తమామలు, అయిదు మంది ఆడపడుచులు, వాళ్ల భర్తలు.. పిల్లలు ..వామ్మో.. అంత పెద్ద కుటుంబంలో నేను ఇమడగలనా అన్న భయం నాకూ మొదలైంది. అయితే అత్తగారింట్లో అందరూ నన్ను బాగానే చూసుకున్నారు. ఎవరితోనూ పొరపచ్చాలు లేకపోవడానికి కారణం వారందరి మంచితనం, ప్రేమ కారణమని నేను భావించేదాన్ని. అమ్మకూ చెప్పేదాన్ని.
“వాళ్ళు చెప్పినట్లు నడుచుకోవడమే తప్ప వాళ్ల కోసం తాను ఎంత శ్రమ పడుతుందో పాపకు తెలియడం లేదు. ఇద్దరు ఆడబిడ్డల బిడ్డలు నలుగురు.. వీళ్ళ ఇంట్లోనే ఉంటారట. పొద్దున్నే లేచి వాళ్ళను రెడీ చేయటం, అత్తగారికి వంట పనిలో సాయం చేయటం, ఆ పిల్లలకి టిఫిన్లు తినిపించి.. క్యారేజీలు సర్ది స్కూల్ బస్సు వచ్చే వేళకు పంపాలంటే ఎంత హైరానా? ఎంత అలసిపోతుందో నా బిడ్డ. అయినా ఇంకా ఇంటి పనులు ఎన్నుంటాయి?” అమ్మ కన్నీళ్లు పెట్టుకుంటే నాన్న ఓదార్చటం నేను విని విననట్లు ఉండిపోవటం జరిగేది. ఏ పండుగకో తప్ప నేను అమ్మగారి ఇంటికి వెళ్ళింది లేదు.
” పండగలకు ఆడబిడ్డలు వస్తారు. అందరితో సందడిగా, సరదాగా ఉంటుంది. మీ అమ్మగారింట్లో లింగు.. లిటుకూమంటూ మీ అమ్మానాన్న ..నువ్వు.. ఏం బాగుంటుంది? తర్వాత ఎప్పుడన్నా వెళ్లొచ్చులే. చిన్నోడికి కూడా అక్కలతో గడపడమే ఇష్టం” అనేసేది అత్త. నిజమే కదా అనుకునే నా మట్టిబుర్రలో కొంచెం మట్టి తవ్వి తీసేది అమ్మ.
” అదేంటి ఆవిడకు ఉన్నట్లు మాకు ఉండదా పండుగకు కూతురు అల్లుడు ఇంటికి రావాలని? సరదాగా గడపాలని? అయినా ఆ మందకు గొడ్డు చాకిరి చేయటమే నీకు అక్కడ దొరికే సరదా కదా?” అక్కసుగా అనేది అమ్మ.
“లేదమ్మా !వంటలన్నీ ఆవిడే చేస్తుంది. నేనేదో సాయం చేయటం
..వడ్డించటము.. పిల్లలకు తినిపించడం అంతే. అయినా కూతుర్లతో సమానంగా నాకూ పట్టుచీర కొంటుంది, అందరూ మొదట నన్నే సెలెక్ట్ చేసుకోమంటారు తెలుసా?” నా మాటలు విని అమ్మ కన్నీళ్లు పెట్టుకుంటూ నా తలను గుండెకు హత్తుకొని
“నిన్ను లోకజ్ఞానం లేకుండా పెంచిన నాదే తప్పు.” అని గొణుక్కొనేది.
అంతకన్నా పెద్ద తప్పు నాకు కుప్పమ్మ అని పేరు పెట్టడం అని అమ్మకు చెప్పలేకపోయే దాన్ని. ఇంట్లో అందరూ చేరి కబుర్లు చెప్పుకుంటూ, జోకులు వేసుకుంటూ నవ్వుకుంటున్న వేళ హఠాత్తుగా ఎవరికో ఒకరికి నా పేరు గుర్తొస్తుంది. కావాలని “కుప్పమ్మా” అని పిలుస్తారు.
“అయినా అదేం పేరు ? చెత్తకుప్ప పేరు పెడతారా ఎవరైనా? తనూ అలాగే ఉందిలే జిడ్డు మొహం వేసుకుని ఎప్పుడూ” మొహాలు చిట్లిస్తారు. హేళనగా నవ్వుతారు.
” ఆ పేరు ఎందుకు గుర్తు చేసుకుంటారు ఇప్పుడు? పెళ్లిలోనే పేరు మార్చుకున్నాం కదా “కుముద” అని లక్షణంగా” ఓసారి పెద్దాడబిడ్డ కోప్పడింది. ” కుముద అంటే తామర పువ్వు”
“ఆ! అది కూడా బురదలో నుంచే కదా పుట్టింది” ఒక ఆడబిడ్డ అంటుంది వెటకారంగా.
“బురదను ఎందుకు చూస్తావు పువ్వును చూడకుండా? అయినా సమస్త జీవకోటి ఆహారం ఆ మట్టిలో నుండే కదా వచ్చేది, అలా గేలి చేయకూడదు. మనమంటే స్నానాలు చేసి తయారై కూర్చున్నాము ఒక్క పని చేయకుండా. కుముద పాపం ..పొద్దున్నుండి వంటగదిలోనే ఉంది. జిడ్డు కారకుండా ఇంతెత్తు పౌడర్లు రాలుతాయా మొహం నుండి?”
పెద్దాడబిడ్డ కొంచెం కోపంగా అంటుందా ..ఇహ మిగతా నలుగురూ తమ మొహాలు తడుముకుంటూ.. ముడుచుకుంటారు.
” పండగ పూట బిడ్డలను ఎందుకు బాధపెడతావు? నువ్వు ఊరుకో పెద్ద పాపా” అని అత్త పెద్ద కూతురుని మందలిస్తుంది.
“అవునవును. అందరూ కలిసి ఆ బిడ్డను బాధపెట్టేది నీకు కనపడదామా?” అంటూ పెద్దాడబిడ్డ నా వైపు జాలిగా చూస్తుంది. ఆమె ఒకరే కొంచెమన్నా నాకోసం మాట్లాడేది ఆ ఇంట్లో
“ఆ బిడ్డకు ఏం బాధ? ఆయమ్మ పేరు అదే కదా?” అనే తల్లిని ఇంకేం
అనలేక తన నుదుటిపై సన్నగా కొట్టుకుంటుంది పెద్దాడబిడ్డ అసహనంగా.
ఇంత ప్రహసనం జరుగుతున్నా ఏ ఒక్కరి భర్త కూడా.. నా భర్తతో సహా ఒక్క మాట మాట్లాడరు, ఖండించరు తప్పని.
తప్పు కాయమని.. బాధపడవద్దని నా భర్త ఏనాడూ వాళ్ళ ముందు.. వెనకా కూడా నన్ను ఓదార్చనే లేదు. లేని దానికోసం బాధపడడం ఎందుకని నేను పట్టించుకోవడమే మానేశాను. నేను వదిలేసిన బాధ అమ్మకు చెప్పి బాధ పెట్టడం ఎందుకు? అందులోనూ తన పెంపకం వల్లనే నాకు ధైర్యం లేదని అమ్మ పడుతున్న నొప్పిని మరింత నొక్కడం సమంజసం కాదు కదా?
అమ్మలంతా బిడ్డలు బాగుండాలనుకున్నట్లే పిల్లలు కూడా అమ్మల్ని బాధ పెట్టకూడదు కదా?
పెళ్లయిన ఆరు నెలల నుండి మొదలైన ఆరాలు, ఆరాటాలు, మూతి విరుపులు, సలహాలు.. ” విశేషమేమీ లేదా ఇంకా?” అన్న ప్రశ్నకు మూలం. ఆ విశేషానికి అర్థం ఆరు నెలల తర్వాత ఆనందాన్ని మోసుకొచ్చింది. అత్త ఇంట్లో కన్నా అమ్మానాన్నలు చాలా ఆనందపడ్డారు తాము అవ్వా తాతలు అవుతున్నామని. సంబరంతో కాసిన్ని కన్నీళ్లు, బోలెడు నవ్వులు కురిపించారు. మిఠాయిలు పంచారట ఇంటి చుట్టుపక్కలా.
బోలెడు ఫలహారాలు, స్వీట్లు, పండ్లు, పచ్చళ్ళు, ఊరగాయలు మోసుకొచ్చారు అత్తింటికి.
” భలేవారే! మూడో నెలకే సీమంతం చేసేటట్లున్నారే?” అని హాస్యమాడారు అత్త ఆడపడుచులు.
అమ్మ చిన్నబోయిన మొహానికి నవ్వు అతికించుకుంది “మాకు ఉన్నది ఒకే బిడ్డ. తన కడుపులో నాలుగు కాయలు కాస్తే మాకు అంతకన్నా కావాల్సిందేముంది?”
” ఆ,..మా కాలంలో ఏదో కనేసాం..సాకేసాం కానీ ఈ కాలంలో నలుగురిని కనీ..సాకి సంతరించడం అంటే మాటలా? ఇంటిపేరు నిలబెట్టే ఒక మగబిడ్డ చాల్లే” అనేసింది అత్త
“అదేమిటావిడ అలా అనేసింది? కూతుర్లకేమో ఇద్దరు ముగ్గురు కావాలి. కొడుక్కేమో ఒకే బిడ్డా?” అమ్మ బోలెడు ఆశ్చర్యపోయింది నాన్నతో. “అలా కాదు పాపా? నువ్వు కనీసం ఇద్దరినన్నా కనాల్సిందే. ఒకరికొకరు
తోడుంటారు. నువ్వు చూడు ఒంటరివైపోలా?” అమ్మ మాటలకు “ఇకమీద నా బిడ్డే నాకు తోడు. ఒంటరితనమేమీ ఉండదులే” అనుకున్నా ఆనందంగా మనసులోనే.
నా భర్త నాతో ఏకాంతంగా గడిపేది ఏ అర్ధరాత్రో, అపరాత్రో ..పది నిమిషాలు మాత్రమే! పొద్దున ఆఫీసుకు పోతే పొద్దు పోయాకే ఇంటికి వచ్చేది. వచ్చాక అమ్మానాన్నలతో మాటలు, అక్కల పిల్లల హోంవర్కులు, భోజనాలు. పనంతా అయ్యాక నేను గదిలోకి వెళ్ళేసరికే తను నిద్రపోతుంటాడు. మేమిద్దరమే కలిసి ఏ ఊరికో, ఏ గుడికో, ఏ ఫంక్షనుకో వెళ్లిందే లేదు. ఎక్కడికి వెళ్ళినా అందరూ కలిసి వెళ్లడమే. ఇక తను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిందీ తక్కువే.
నాలుగో నెల అయ్యాక ఫ్యామిలీ డాక్టర్ వద్దకు చెకప్ కు తీసుకెళ్లారు మా అత్త, భర్త. స్కానింగ్ లో బిడ్డ గుండె కొట్టుకోవడం చూపించింది డాక్టర్. నా లోపల మరో గుండె నా రక్తంతో కొట్టుకోవడం చూసి ఏడ్చేశాను.
“అయ్యో! ఎందుకు ఏడుస్తున్నావు? బిడ్డ బాగుంది.” అంది డాక్టరు కంగారుగా.
అది ఏడుపు కాదు ఒక బిడ్డకు తల్లి నవుతున్నానన్న ఆనందం ! చిరునవ్వు నవ్వాను. ఆ చిరునవ్వు నిజంగా ఏడుపుగా మారుతుందని నాకు అప్పుడు తెలియదు.
వారం తర్వాత నాకు అబార్షన్ అయిపోయింది. బాగా ఏడ్చాను. విషయం తెలిసి అమ్మానాన్న ఉరుకులు పరుగులతో వచ్చారు. నాన్నే నన్ను అమ్మను ఓదార్చారు తన కన్నీళ్లు ఉగ్గబెట్టుకొని.
” పాప నీరసంగా ఉంది. నాల్రోజులు మా ఇంటికి తీసుకెళ్తాం” అమ్మ అభ్యర్థనగా అడిగింది అత్తను. విపరీతమైన రక్తస్రావంతో తోటకూర కాడలా వేలాడిపోతున్నాను. ఏదో అనబోయి మామగారి కనుసైగతో ఆగి తలూపింది అత్త,
నెల రోజులు ఉన్నాను అమ్మ వాళ్ళ ఇంట్లో. అమ్మ నాకిష్టమైనవి వండి బలవంతంగా తినిపిస్తూ.. పాలు పండ్ల రసాలు తాగిస్తూ.. నన్ను బలంగా తయారు చేసింది, అత్త, ఆడపడుచులు ఫోన్ చేసి పరామర్శించారు గాని ఒక్కరూ ఇంటికి రాలేదు నన్ను చూడడానికి నా భర్తతో సహా. నాకు బాధ అనిపించింది. అమ్మానాన్నలు మనసులోనే బాధపడ్డారని నాకు తెలుసు
కానీ ఇరుగు పొరుగు వారి బాధ మా కన్నా ఎక్కువ.
” అదేంటి ఎవరూ రారు చూడ్డానికి? వాళ్లేం మనుషులూ?”
వెనకా…ముందు గుసగుసలు, ఆరాలు! కందకు లేని దురద కత్తికే ఎక్కువ.
” అల్లుడికి తీరికలేని ఉద్యోగం. అత్తగారు, మామగారు, ఆడుపడుచులు .. అందరూ రోజూ ఫోన్లు చేస్తూనే ఉన్నారు. ఎప్పుడు పంపిస్తారని అడుగుతూనే ఉన్నారు. నేనే.. పాప ఒళ్ళు కుదుటపడనీ.. పచ్చి ఒళ్ళు కదా అని దాటేస్తున్నా” అమ్మ సంజాయిషీలో నిజాయితీ మాకే కాదు అందరికీ తెలుసని అడిగే వాళ్ళ చూపులు, నవ్వులు చెబుతూనే ఉన్నాయి. నాకు కోపం, బాధ, ఉక్రోషం! మింగనూలేను కక్కనూ లేను. నాకు నేనే సర్ది చెప్పుకొని బయలుదేరాను.
” మరో నాలుగు రోజులుండరాదా?” అమ్మ దీనంగా చూసింది.
“తర్వాతయినా వెళ్లాలి కదా!” అన్నాను బలవంతంగా నవ్వుతూ.
“నేను ఇక వెళ్ళను. ఇక్కడే ఉంటాను” అని చెప్పే రోజు ఒకటి వస్తుందని నాకు అప్పుడు తెలియదు.
మరో ఏడాది రోజులు కాలం కరి మింగిన వెలగయింది. ఈ ఏడాదిలో రెండు అబార్షన్లు. నేను అమ్మా ఏడ్చే వాళ్ళం. మా అత్తగారే మమ్మల్ని ఓదార్చేది.
“ఏం వయసయిపోయిందని ? పుడతారులే!” అని.
” నాకు పుట్టాక పోతే.. నీకు పుట్టక ముందే పోతున్నారేమిటి?” అంటూ అమ్మ కుమిలిపోయేది. గుళ్ళు గోపురాలు, చెట్లు, పుట్టలు తిరగటాలు, ముడుపులు నోములు వ్రతాలు.. ఆమెకు తెలిసిందంతా చేసేది. నా చేత చేయించేది.
” మీకేమన్నా పిచ్చా? తన ఆరోగ్యం గురించి ఆలోచించరా?” డాక్టరమ్మ గొంతు తీవ్రంగా వినిపించింది అత్త, మామ, భర్తలతో. ఆస్పత్రిలో నేను గది బయట కూర్చుని ఉన్నాను. కొద్దిసేపు తర్జనభర్జనల తర్వాత వాళ్ళు బయటకు వచ్చి నన్ను లోపలికి వెళ్ళమన్నారు.
బెడ్ పై నన్ను పడుకోమని డాక్టరు ఇంజక్షన్ వేయబోయింది. నేను ఆమె చేతిని రెండు చేతులతో గట్టిగా పట్టుకొని కన్నీళ్ళతో అన్నాను
“ప్లీజ్ మా! మంచి మందులు ఇవ్వండి. ఈసారన్నా నాకు బిడ్డ పుట్టాలి. నేను అమ్మను అవ్వాలి”
డాక్టర్ కళ్ళల్లో సన్నటి నీటి పొర. నా వేపు జాలిగా చూసింది. కాసేపు నన్ను
ఇంజక్షన్ ను మార్చి మార్చి చూసింది. మరి కాసేపు కుర్చీలో కూర్చుని సాలోచనగా నా వేపు చూస్తూండిపోయింది. నేను ఆమె వేపే చూస్తూ ఏడుస్తూనే ఉన్నాను నా పొట్టను రెండు చేతులతో నిమురుకుంటూ.
” అయితే నేను చెప్పినట్లు చేస్తావా?” అడిగింది డాక్టరు లేచి తలుపు గడియ వేసేసి.
” బిడ్డ కోసం…”
” బిడ్డ కోసం ..నీ కోసం కూడా!” డాక్టర్ చెప్పిందంతా విన్నాను కానీ అర్థమవడానికి చాలా సేపే పట్టింది. భయంతో వణికిపోయాను. తడారి పోయిన నా నోట్లో తన నీళ్ల బాటిల్ తెరిచి నీళ్లు పోసింది.
“ధైర్యం తెచ్చుకో. నీ ధైర్యమే నీ బిడ్డకు నీకు బతుకునిస్తుంది. నేను ఒకటే డాక్టర్ కాదు ఈ ఊర్లో.. కానీ నీకు నువ్వే. నువ్వే నీ బిడ్డకు!”
దగా పడ్డ మనసు విలవిల్లాడుతోంది. వంచన సెగతో రక్తం కుతకుతలాడుతోంది. పరిస్థితిని చేతుల్లోకి తీసుకొని చక్కదిద్దుకోమని బుద్ధి హెచ్చరిస్తోంది.
“అమ్మా! మీరు చెప్పినట్లే చేస్తాను” దృఢ నిశ్చయంతో ఆమె ఫోన్ తీసుకొని అమ్మకు ఫోన్ చేశాను వెంటనే రమ్మని.
మేము ఇంటికి వెళ్లిన కొద్దిసేపటికే అమ్మానాన్న వచ్చేశారు. ఈలోపు నేను మా గది తలుపులు వేసుకొని నా బట్టలు, నగలు, పెద్ద సూట్ కేసులో సర్దేసుకున్నాను.
“మళ్ళీ ఇలా జరిగిందేమిటి?” అమ్మ రాగానే మొదలెట్టిన ఏడుపుకు ఈసారి అత్త వంత పాడింది.. “ఇదంతా మా ఖర్మ” అంటూ.
నాకు నవ్వు వచ్చింది. ఖర్మకు… కర్మకూ తేడా నాకిప్పుడు తెలుసు కదా ? వచ్చేస్తుంటే అందరి చూపులూ సూట్ కేసు వేపే. నేను ఎవరి వైపూ చూడలేదు. కనీసం వెళ్ళొస్తానని కూడా చెప్పలేదు. అమ్మానాన్నలతో వచ్చేసాను.
నేను వచ్చి ఐదు నెలలు అవుతుంది. ఫోను పని చేయడం లేదని రెండు మూడుసార్లు అత్త, భర్తా వచ్చారు చూడాలని. నేను నా గది తలుపు తీయనే లేదు.
“పాప ఆరోగ్య పరిస్థితి బాగాలేదు. మానసికంగా చాలా దెబ్బతిందని డాక్టర్ అన్నారు. బాగయ్యాక మాట్లాడుకుందాం లేండి. మేము కూడా మంచి
డాక్టర్లకే చూపిస్తున్నాం”
నాన్న కరుకుగా అనడంతో వాళ్లేమీ మాట్లాడలేక వెళ్లిపోయారు
నా చిన్నారి యోధా! ఎవరైనా గట్టిగా మాట్లాడితేనే భయంతో కుందేలు పిల్లలా వణికి పోయే నేను ఇంత ధైర్యంగా ఇంతటి నిర్ణయం తీసుకోవడమే కాదు మా అమ్మా నాన్నల్ని కూడా ఒప్పించానంటే కారణం నాలోని నువ్వే!కడుపులో నుండే నాకింత ధైర్యం ఇచ్చిన నా బంగారు తల్లీ! నువ్వు పుట్టాక నేను ఇంకా ఎంత నిర్భయంగా ఉంటానో కదా? అందుకే నీకు అనుకోకుండానే “యోధ” అని పేరు పెట్టేశాను.
కడుపులో ఉన్నది ఆడపిల్ల అని తెలియగానే నాకు ఒక్క మాటా చెప్పకుండానే అబార్షన్లు చేయించిన ఆ నరరూప రాక్షసులను.. నిజం చెప్పాలంటే హంతకులను.. నీకు నాన్న అని, అవ్వాతాతలని, మేనత్తలని పరిచయం చేయలేను. నీకసలు వాళ్ళను చూపించను కూడా.
ఆ కుటుంబంతో తెగదెంపులు చేసుకుందాం. మనకు మన ధైర్యమే తోడు నీడ గా బతుకుదాం. చెప్పాను కదా ఏ బలహీన క్షణమో మన ధైర్యాన్ని ప్రశ్నించే సమయం వచ్చినప్పుడు ఈ ఉత్తరమే మనకు భగవద్గీత!
యోధ రాక కోసం ఎదురు చూస్తూ
“ఆనందాల కుప్పమ్మ”
ఎర్ర కోటలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సంరంభంగా జరుగుతున్నాయి. ఇంట్లో సోఫాలో కాళ్ళు చాపుక్కూర్చుని టీవీలో ఆ కార్యక్రమం చూస్తున్న ప్రసాద్ “మన వాళ్ళు ఒట్టి సన్నాసులు. ఏ అంతర్జాతీయ ఆటల పోటీల్లోనైనా ఎక్కడో వెనక బెంచీల్లో తప్ప ఉండరు. 130 కోట్ల జనాభా ఉన్న దేశానికి రావల్సిన పతకాలు ఇన్నేనా? ఆ చైనా వాళ్ళు, కొరియా వాళ్ళు, ఆఫ్రికా వాళ్ళు డజన్లల్లో పతకాలు కొట్టుకు పోతుంటే, మన వాళ్ళు చచ్చీ చెడి ఓ కాంస్యమో, ఓ రజతమో తెచ్చుకునేసరికి కాళ్ళు లాగుతాయి” అన్నాడు ఈసడింపుగా.
“మన చదువుల్లో అసలు ఆటలకి స్థానమే లేదాయే! అదివరకు మధ్యతరగతి వాళ్ళంతా పిల్లలని ప్రభుత్వ స్కూళ్ళల్లోనే, చదివించేవారు. అక్కడ చదువుతో పాటు కనీస ఆటలు, వ్యాయామాలు ఉండేవి. పాఠాలు లేనప్పుడు…టీచర్ రానప్పుడు గ్రౌండ్ లో కాలికొద్దీ పరుగెత్తేవారు. ఆడపిల్లలు రింగాట, ఫ్రిస్బీ ఆడేవారు. తొక్కుడు బిళ్ళలు, కుంటికాలితో ముట్టించుకునే ఆటలు ఆడేవారు. పిల్లలంతా కలిసి ఏ వాలీబాల్ లాంటివి ప్రాక్టీస్ చెయ్యటమో, ఖోఖో..చెయిన్ కట్ లాంటి ఆటలో, దాగుడు మూతలో ఆడుకునే వారు. ఒంటికి వ్యాయామం ఉండేది. గెలుపుని -ఓటమిని ఆస్వాదించటం తెలిసేది. సమూహ తత్వం (టీం స్పిరిట్) ఉండేది.”
“ఇంకా క్రీడలంటే ఎక్కువ ఆసక్తి ఉన్నవాళ్ళు ప్రత్యేక తర్ఫీదు తీసుకోవటానికి ఏ “వై ఎం సి ఏ” లకో ఇతర ప్రైవేట్ కోచింగ్ సెంటర్లకో వెళ్ళేవారు.”
“ఇప్పుడు అందరూ పిల్లలని ప్రైవేట్ కాన్వెంట్ స్కూళ్ళల్లోనే చదివిస్తున్నారు. ఆ స్కూళ్ళు అపార్ట్ మెంటుల్లో నడుపుతున్నారు. ప్లే గ్రౌండే ఉండట్లేదు.”
“కార్పొరేట్ స్కూళ్ళ నాగరికత వచ్చాక చదువులు అంటే బందిల దొడ్లో కట్టేసే గొడ్ల చందాన నాలుగు గోడల మధ్యన బంధించి అయిన కాడికి రాత్రింబవళ్ళు రుబ్బెయ్యటమేగా” అన్నది చందన..అంతకంటే నిరసనగా.
అన్ని వేలమంది సమక్షంలో పతకాలు అందుకుంటున్న క్రీడాకారులని, వారిని అత్యంత గౌరవప్రదంగా చూస్తున్న ప్రభుత్వ పెద్దలని…ఎర్రకోటలో జండా వందనంలో దేశ ప్రధాని తో పాటు ప్రత్యక్షంగా పాల్గొంటున్న వారి అదృష్టాన్ని..ఆ అదృష్టాన్ని ప్రసాదించిన వారి క్రీడా నేపధ్యాన్ని కళ్ళార్పకుండా చూస్తున్నాడు వినీత్, తల్లిదండ్రుల మాటలు వింటూ!
***
ఉద్యోగరీత్యా హైదరాబాద్ లో ఉంటున్న ప్రసాద్ రెణ్ణెల్లకోసారి విజయవాడ వెళ్ళి తల్లిదండ్రులని చూసొస్తూ ఉంటాడు.
అలా వస్తూ ఈ సారి కొడుకు వినీత్ ని వెంటపెట్టుకొచ్చాడు. “ఏరా తాతా చదువెలా సాగుతున్నది?” అన్నాడు మనవడిని దగ్గరకి తీసుకుంటూ తాత వెంకట్రామయ్య గారు.”
“బానే ఉంది తాతయ్యా. నాకేమో బాడ్మింటన్, టేబుల్ టెన్నిస్ ఆటలు ఇష్టం. నాన్నేమో ‘ఎప్పుడు ఆటలు ఆటలు అని టైం వేస్ట్ చేస్తే, చదువు చంక నాకిపోతుంది. ఇప్పటి నించి ఫోకస్ చెయ్యకపోతే ర్యాంక్ రాదు’ అని కేకలేస్తారు. నాన్నే కదా..నాకు ఆటల్లో ప్రత్యేక కోచింగ్ కోసం డబ్బు కట్టాల్సింది! రోజూ అక్కడికి నన్ను స్కూటర్ మీద తెలుసుకెళ్ళాల్సింది. నువ్వైనా చెప్పు తాతయ్యా” అని తాతయ్య దగ్గర దూరిపోయి ఆ అండతో ధైర్యంగా తండ్రి మీద ఆరోపణ చేశాడు వినీత్.
“చూడండి నాన్నా మీ మనవడు చెప్పిన మాట వినకుండా ఆటల పేరు చెప్పి చదువుని అశ్రద్ధ చేస్తున్నాడు. మన బోటి వాళ్ళకి ఆటల పేరు చెప్పి చదువుని నిర్లక్ష్యం చేసే అవకాశం లేదురా అంటే అర్ధం చేసుకోవట్లేదు. చదువు లేకపోతే రేపు అడుక్కు తినాలి. ఆటలు అనేవి ఖరీదైన విషయమనీ, బోలెడంత ఏకాగ్రత ఉండాలనీ, నిరంతర సాధన ఉండాలనీ తెలియట్లేదు వాడికి.”
“స్కూల్ కి ప్రాతినిధ్యం వహించటం దగ్గరనించీ, రాష్ట్ర ప్రతినిధిగా ఆడే స్థాయి వరకు…ఎవరో ఒకరి సహాయం అవసరం. మళ్ళీ అందులో బోలెడు రాజకీయాలు అని చెబితే అర్ధం చేసుకునే వయసులేదు. మీరైనా చెప్పండి”అన్నాడు అమ్మ చేతి కాఫీ అందుకుంటూ.
“మొన్న నాన్న టీవీ చూస్తూ… ఇంత పెద్ద దేశంలో పుట్టి మనం అంతర్జాతీయ క్రీడల్లో ఎంత వెనకపడ్డాం! సిగ్గుచేటు అన్నారు. మరి నేను ఆటలు ఆడతానంటే ఎందుకు తాతయ్యా ఇలా అంటున్నారు” అన్నాడు వినీత్
“నువ్వన్నట్టు చదువు ముఖ్యమే! దాని గురించిన నీ ఆరాటమూ నిజమేరా” అన్నాడు కొడుకు వీపు నిమురుతూ.
“కానీ ఆటలూ ముఖ్యమే. మానసిక వికాసానికి..శారీరక దారుఢ్యానికి ఆటలు ఎంతో అవసరం! అందుకే చైనా వారు మూడు నాలుగేళ్ళ వయసు నించే పిల్లలందరికీ ఆటల్లో తర్ఫీదు ఇస్తారుట. అక్కడ అది తప్పనిసరిట. అందుకే వాళ్ళు శారీరకంగా ఫిట్ గా ఉండి చురుకుగా ఉంటారు. చదువులోను, సాంకేతిక విషయాల్లోను కూడా బాగా రాణిస్తారు. విశ్వ క్రీడల్లో వారివే పతకాలన్నీను..మనం చూస్తూనే ఉన్నాంగా!”
“మన దగ్గర ఇప్పుడున్న విద్యా విధానం లో శారీరక వ్యాయామం, ఆటలు అనేదానికి అవకాశమే లేదు. చరిత్రలోకి వెళితే…. మన సనాతన భారతీయ విద్యా విధానంలో పిల్లలందరూ గురుకులవాసం చేసి చదువుకునేవారు. రొడ్డుకొట్టుడు చదువు కాకుండా… పిల్లల తెలివితేటలని బట్టి, శరీర దార్ఢ్యాన్ని బట్టి ఎవరికి ఏది హితవో గురువుగారు ఆ చదువే నేర్పేవారు.”
“మహారాజులు కూడా తమ పిల్లలని ఆ గురుకులాలకి పంపించేవారు. రాజకుమారులతో పాటు కులాలతో సంబంధం లేకుండా వారి వారి ఆసక్తులని బట్టి మిగిలిన పిల్లలు కూడా అన్ని రకాల క్రీడలు, యుద్ధ విద్యలు, సాము గరిడీలు, కర్ర సాము, సంగీతం, హస్త కళలు, సాంకేతిక విద్యలు నేర్చుకునేవారు. అసలు విద్యాభ్యాసం అంటే ఇవన్నీ కలిసిన సమాహారమే. జన్మతః బ్రాహ్మణుడై ఉండి కూడా, ద్రోణుడు రాజకుమారుడైన దృపదునితో సమానంగా తన తండ్రి నించి అలాగే కదా యుద్ధవిద్యలన్నీ నేర్చుకున్నది!”
“అనేక రకాల విదేశీ దాడులతో దెబ్బతిని మన సంప్రదాయ విద్యా విధానం భ్రష్టు పట్టిపోయింది. అది చాలనట్టు..ఇప్పుడు చదువు ఒక పాడికుండ లాంటి వ్యాపారం అయిపోయింది.”
“హోరెత్తించే వ్యాపార ప్రకటనల ద్వారా కార్పొరేట్ విద్యా సంస్థలు….మనుషులు తమ బుర్రతో తమని ఆలోచించుకోనివ్వకుండా ‘మా దగ్గర చేరితే ఫస్ట్ ర్యాంక్ గ్యారంటీ, ఒకటి నించి పదిలోపు ర్యాంకులన్నీ మావే ‘ అంటూ ఊదరకొట్టేస్తూ ఆకర్షిస్తున్నాయి. మనమూ ఆ వ్యవస్థలో చిక్కుకున్న శలభాలమే!”
“ఇక నువ్వన్నట్టు ఆటలకి కావలసిన ఆర్ధిక స్థోమతు విషయానికొస్తే…. పూర్వం రాజులే క్రీడలని, వ్యాయామాలని, కళలని, సంగీత సాహిత్యాలని పోషించేవారు. ఇప్పుడు రాజులు లేరు. కానీ ఆ బాధ్యత వహించవలసిన మన ప్రభుత్వాలు తమ బాధ్యతలు ఎలా వదిలించుకుందామా అని చూస్తున్నారే కానీ ప్రణాళికా బద్ధంగా ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించటం తమ కర్తవ్యం అనుకోవట్లేదు. విత్తనం నాటే రోజులనించి బడ్జెట్ కేటాయింపుల ద్వారా శ్రద్ధ పెడితేనే అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్ళు కానీ, సాంకేతిక నిపుణులు కానీ, శాస్త్రవేత్తలు కానీ తయారవుతారు. అంత చిత్తశుద్ధి ఏది? అన్ని రాజకీయాలే!.”
“నీ చిన్నప్పుడు నీకు ఇష్టమని నాకు వీలైనప్పుడల్లా క్యారం బోర్డ్ టార్నమెంట్స్ కి తీసుకెళ్ళేవాడిని కదా! కొంచెం పెద్దయ్యాక సైకిల్ మీద నువ్వే వెళ్ళేవాడివి. మరిప్పుడు జనాభా పెరిగింది. వారి అవసరాల కొరకు వాహనాలు పెరిగాయి. రోడ్ల మీద ట్రాఫిక్ పెరిగింది. పిల్లలని ఒంటరిగా పంపలేము కాబట్టి మనమే తీసుకెళ్ళాలి. ఆటల మీద ఆసక్తి నీకున్నట్టే వాడికీ ఉన్నది. కాకపోతే ఇప్పుడు నీ చిన్నప్పటికంటే చదువుల మీద అనారోగ్యకర పోటీ పెరిగి మిమ్మల్ని సరిగా ఆలోచించనివ్వట్లేదు” అన్నారు వెంకట్రామయ్యగారు.
“సరిలే.. శేషాచలం మామయ్య రమ్మని కబురు పెట్టాడు. అలా మాట్లాడుకుంటూ వెళ్ళొద్దాం పద” అని కొడుకు భుజం మీద చెయ్యేసి బయలుదేర దీశాడు.
వెంకట్రామయ్యగారు దారిలో తన సంభాషణని కొనసాగిస్తూ “ఇప్పుడు అదివరకు లాగా ఒక ఇంట్లో నలుగురైదుగురు పిల్లలుండట్లేదు. ఉన్న ఒక్కరినో ఇద్దరినో బాగా చదివిస్తే వాళ్ళ జీవితాలు బాగు పడతాయని శక్తికి మించి కోచింగులు ఇప్పించి చదివించాలనుకుంటున్నారే కానీ, ఆటలని ప్రోత్సహించలేకపోతున్నారు. ఒకళ్ళని చూసి ఒకళ్ళు పిల్లల చదువుల విషయంలో పోటీలు పడుతున్నార్రా మీ తరం వాళ్ళు! వాళ్ళకి ఆసక్తి లేని ఇంజనీరింగు చదువులో బలవంతానా చేర్చాలని తాపత్రయ పడుతున్నారు. పూర్వం ఆర్ట్స్, కామర్స్, సైన్స్, లిటరేచర్, మ్యాత్స్…ఇలా అనేక కోర్సులు చదివే వారు. ఆ కోర్సులకి చదువు భారం తక్కువగా ఉండటంతో ఆటలమీద కూడా శ్రద్ధ పెట్టేవారు. ఇప్పుడు గొర్రెల మంద లాగా అందరూ ఇంజనీరింగేనాయే! కానీ, సరైన మార్కులతో పాస్ అవకపోతే ఆ చదువుకి మాత్రం మంచి ఉద్యోగాలు ఏం వస్తాయని ఆలోచించట్లేదు.”
ఇలా మాట్లాడుకుంటూ నడుస్తూ ఉండగా శేషాచలం గారి ఇల్లు వచ్చేసింది. బయట వరండాలో ఉన్న శేషాచలం “ఓరి ప్రసాదు..నువ్వు కూడా వచ్చావా? రండి రండి” అని ఇంట్లోకి తొంగి చూసి “ఏమోయ్ మీ వెంకట్రామయ్య అన్నయ్య వచ్చాడు. ప్రసాద్ కూడా వచ్చాడు. ముగ్గురికీ కాఫీ పట్రా” అన్నాడు.
“ఏదో పనుంది రమ్మన్నావని వీడిని కూడా తీసుకొచ్చానోయ్” అన్నారు వెంకట్రామయ్యగారు.
“ఆ:( పెద్ద విషయం ఏమీ కాదు. మా మనవడు స్విమ్మింగ్ నేర్చుకుని, జాతీయ పోటీల్లో పాల్గొంటాను అని ఒకటే గొడవ చేస్తున్నాడుట. మొన్న మా అమ్మాయి ఫోన్ చేసి మాటల్లో ఈ విషయం చెప్పి, ఈ “ఒలింపిక్ క్రీడలు” టీవీలో చూసి నేను కూడా పతకం సాధిస్తా అని పట్టుపడుతున్నాడని చెప్పింది. వాడు ఈత బాగానే కొడతాడు. కానీ మన దేశంలో క్రీడలకి ప్రభుత్వం తరఫున పెద్దగా సౌకర్యాలు కానీ, ప్రోత్సాహం కానీ లేవు కద నాన్నా!”
“మనం స్వంతంగా కష్టపడి రాణించి ఏ పతకాలో గెలుచుకొస్తే మాత్రం ఆకాశానికెత్తేస్తారు. అప్పుడు పెద్ద పెద్ద కంపెనీల వాళ్ళు ఉద్యోగాలిస్తామని, క్యాష్ ప్రైజులిస్తామని ప్రకటనలిచ్చేస్తారు. అవన్నీ నిజంగా క్రీడాకారులని ప్రోత్సహించే ఉద్దేశ్యం తో కాదు, వాళ్ళ ట్యాక్స్ బరువులు తగ్గించుకోవటానికే అనిపిస్తుంది నా మటుకు నాకు. మరీ ఒలింపిక్స్, కామన్వెల్త్, వింబుల్డన్ స్థాయి అయితే ఇస్తారేమో కానీ..మన దేశంలోనే ఏ జాతీయ స్థాయిలోనో పతకాలు గెలిస్తే ప్రకటనలకి పరిమితం కాకుండా నిజంగా ఇస్తారంటావా?” అని మా సరస్వతి తన సందేహం తను వెలిబుచ్చింది.
“పాపం వాళ్ళు నిజంగా ఆ స్థాయికి రావాలంటే ఎంత పౌష్టికాహారం తీసుకోవాలి? కుటుంబ సభ్యులు ఎంత త్యాగం చేస్తే వాళ్ళని పోషించగలరు? క్రీడల పట్ల ఆసక్తి, ఆడగల సమర్ధత..ఆర్ధిక స్థోమత ఒకదానికి ఒకటి సంబంధంలేని విషయాలు! ఆటల మీదే దృష్టి పెట్టాల్సిన క్రీడాకారులకి నికర ఆదాయ వనరులు ఉండాలి. క్రీడాకారులు సరైన గుర్తింపు, తీరైన ఉద్యోగము లేక కుటుంబ పోషణ కొరకు రోజు కూలీలకి వెళుతున్నారని మనం ఎన్నోసార్లు పేపర్లల్లో చదువుతున్నాం.”
“నిన్న పేపర్లో చదివాను..ఒలింపిక్స్ లో పతకాలు సాధించే స్థాయి అథ్లెట్స్ ని అందిస్తున్న ఆఫ్రికాలో చాలా దేశాలు ఆకలి చావులకి నిలయాలు. అక్కడ వనరులు తక్కువ. అయినా కెన్యా, జమైకా లాంటి దేశాలు ప్రపంచ స్థాయి ‘అథ్లెట్స్ ‘ని అందిస్తున్నాయి. అంటే ఆర్ధిక స్థితి గతులతో సంబంధం లేకుండా విశ్వక్రీడల్లో మనం కూడా భాగస్వాములమవ్వాలి అనే స్పృహ దేశ ప్రభుత్వాలకి తప్పనిసరిగా ఉండాలి.”
“క్రీడలపై పరిశోధనలు, క్రీడాకారులకి వసతులు కల్పించటంలో ఆస్ట్రేలియా దేశం ప్రపంచంలోనే ప్రధమ స్థానంలో ఉన్నదిట. అలాగే జపాన్, స్విట్జర్లాండ్, డెన్మార్క్ పతకాల పట్టికలో ప్రధమ స్థానాల్లో ఉంటున్నారు. అసలు చైనా వారయితే పిల్లలని ఐదో సంవత్సరం నించే నిర్బంధంగా క్రీడల్లో తర్ఫీదు ఇస్తారుట. వారికి ఆసక్తి ఉన్న క్రీడలో ప్రోత్సహిస్తారుట. అందుకే ఎక్కువ సంఖ్యలో పతకాలు కూడా వాళ్ళే గెలుచుకుంటారు. దక్షిణ కొరియా ప్రపంచంలో అన్ని దేశాల కంటే క్రీడల అభివృద్ధికి ఎక్కువగా నిధులు కేటాయిస్తుందిట. మన దేశంలో క్రీడల గురించిన కనీస అవగాహన లేకుండానే కాలేజి స్థాయి చదువులు అయిపోతున్నాయి.”
“క్రీడల అభివృద్ధికి బడ్జెట్ కేటాయింపులతో పాటు ప్రభుత్వాలకి సమగ్ర క్రీడా విధానం ఉండాలి. అప్పుడే మన మనవలు కోరుకున్నట్టు, క్రీడల్లో వారిని మనం ప్రోత్సహించగలము. వారికి కూడా భవిష్యత్తుకి ఒక భరోసా ఉంటుంది అని నమ్మగలము. అదే నీతో మాట్లాడదామని రమ్మన్నాను” అన్నారు శేషాచలం గారు తన సుదీర్ఘ ఉపన్యాసాన్ని ముగించి ఊపిరి తీసుకుంటూ!
“సరిపోయింది..నీ మనవడే కాదు, నా మనవడూ వాళ్ళ నాన్న తనని ఆటల్లో ప్రోత్సహించట్లేదని బిక్క మొహం వేశాడు. ఏవయినా అంతర్జాతీయ ఈవెంట్స్ జరిగినప్పుడు జనాలు హాట్ హాట్ గా ఆ విషయం చర్చించుకుంటారు. రొటీన్ లో పడితే మళ్ళీ మన గొర్రెల మంద ఆలోచనలు మనవే! కనీసం మన మనవలు మనకంటే భిన్నంగా ఆలోచిస్తున్నారని సంతోషంగా ఉంది.”
“అవును నాన్నా..పోయిన సారి ఒలింపిక్ గేంస్ తరువాత మా కొలీగ్ వాళ్ళబ్బాయిని బలవంతంగా ఆటల్లో చేర్పించాడు. “వాడికి ఆటల పట్ల ఏ ఆసక్తి లేదు కదా, ఎందుకు చేర్చావ్” అని అడిగా! ‘ఇంజనీరింగ్ కాలేజిలో స్పోర్ట్స్ కోటా ఉంటుంది..అలా అయినా మా వాడికి సీట్ గ్యారంటీ ఉంటుందని ‘ సిగ్గులేని సమాధానం చెప్పాడు.
“అటు ప్రభుత్వాలు కానీ, ఇటు ప్రజలు కానీ స్పోర్ట్స్ గురించి చిత్త శుద్ధితో సరైన పంధాలో ఆలోచించట్లేదు. ఉద్యోగాల్లో, కాలేజిల్లో స్పోర్ట్స్ కోటాలుంటాయని ఆలోచించే జనాలు కొందరైతే, ప్రభుత్వ ప్రోత్సాహం లేక నిజమైన క్రీడాసక్తిని చంపేసుకుంటున్న జనాలు కొందరు!”
“వ్యక్తిగతంగా మనం ఈ మూస పద్ధతి నించి బయటపడాలి. పిల్లలకి చదువుతో పాటు క్రీడలకి ప్రాధాన్యం ఇచ్చి ప్రోత్సహించే స్కూళ్ళల్లో చేర్చాలి. అందరూ జాతీయ చాంపియన్స్ అవుతారని కాదు. అవ్వాలని అత్యాశ కూడా పనికి రాదు. అంతమాత్రాన చదువు పేరు చెప్పి మొగ్గలోనే వారి ఆశలని, ఆసక్తిని తుంచే ప్రయత్నం చెయ్యకూడదు. కాలేజి స్థాయి వరకు క్రీడానుభవం ఉన్నవారు, పెద్దయ్యాక తాము పనిచేసే కంపెనీలో యాజమాన్యం తో సంప్రదించి ప్రతి సంవత్సరం “స్పోర్ట్స్ స్పాన్సర్షిప్” ప్రారంభింప చెయ్యచ్చు. అలా పెద్ద కంపెనీలు కొన్ని కలిసి ప్రభుత్వ పెద్దలతో విశ్వక్రీడల ప్రోత్సాహానికి కావలసిన ప్రణాళికలు తయారు చెయ్యచ్చు. లేదా తామే స్వంత కంపెనీ పెట్టే స్థాయికి వస్తే తమ సామాజిక బాధ్యతగా తమ వార్షిక ఆదాయంలో కొంత బడ్జెట్ తప్పక క్రీడలకి కేటాయించచ్చు. ఇలా అన్ని కోణాల్లోను ప్రయత్నిస్తే క్రమేణా మార్పు రావచ్చు” అన్నారు వెంకట్రామయ్య గారు.
“ముందుగా మన వినీత్ ని, శేషాచలం మామయ్య మనవడు అరుణ్ ని క్రీడల్లో చేర్పించే నిర్ణయం తీసుకుందాం. ప్రసాదు నువ్వు ఇంకొక ఖర్చు తగ్గించుకుని వాడిని కోచింగుకి పంపే పని చెయ్యి. నేను నా వంతు సహాయంగా పక్క పోర్షన్ అద్దె డబ్బు నెల నెలా నీకు పంపిస్తాను. నా పెన్షన్ నాకు, మీ అమ్మకి సరిపోతుందిలే! వాడు కాస్త నిలదొక్కుకోగలిగితే, అప్పుడు టార్నమెంట్స్ కి తయారవటానికి మీ ఫ్రెండ్స్ బృందంలో స్పాన్సరర్ల కోసం ప్రయత్నించచ్చు” అన్నారు.
అలా ఒక నిర్ణయానికి రాగలిగినందుకూ..తన కొడుకు లాగే ఇంకొకరు కూడా క్రీడల్లోకి వెళ్ళటానికి ఆసక్తిగా ఉన్నారని తెలిసినందుకూ సంతోషించిన ప్రసాద్ గుండెల నిండా తృప్తిగా గాల్క్ పీల్చుకుని, తన ఈ ట్రిప్ విజయవంతమైనట్లు భావించాడు.
“ఇటీవల ఆసియా క్రీడల్లో భారత దేశపు క్రీడాకారులు అనేక పతకాలని గెలుచుకుని..ప్రపంచ పటంలో ఒక్క జనాభా సంఖ్యలోనే కాక క్రీడా పతకాల సంఖ్యలో కూడా మా సంఖ్య ఎక్కువే” అని నిరూపించటం..నిజంగా మంచి మార్పు అనే చెప్పుకోవాలి.
“ఇటీవల ఆసియా క్రీడల్లో భారత దేశపు క్రీడాకారులు అనేక పతకాలని గెలుచుకుని..ప్రపంచ పటంలో ఒక్క జనాభా సంఖ్యలోనే కాక క్రీడా పతకాల సంఖ్యలో కూడా మా సంఖ్య ఎక్కువే” అని నిరూపించటం..నిజంగా మంచి మార్పు అనే చెప్పుకోవాలి.
