Category:
కవితలు
కాలం
వాడిపోకుండా దాచుకోవడానికి
అది నా చేతిలో పూసిన పువ్వు కాదు
కాలం
మబ్బుల మునివేళ్ళ సందుల్లోంచి
జారిపడే చినుకుల సమూహం
అలా చూస్తుండగానే చినుకులు
నదిగా మారిపోయే క్షణం
నేనేమో నిన్నటి ఉదయం
ఇప్పటికీ నా కిటికీ దగ్గరే ఉందనుకున్నాను
తిరిగి చూసేసరికి కాలం ఒక జ్ఞాపకమై
గుండె గోడపై వేలాడుతోంది
ఎన్ని ఋతువులు వచ్చి వెళ్లాయో
ఆకాశం లెక్క పెట్టుకోదు
ఎన్ని పక్షులు తన కొమ్మలపై
వాలాయో చెట్టు గుర్తుంచుకోదు
అలాగే
జీవితం కూడా
మనం గడిపిన రోజుల సంఖ్యను కాదు
మనలో వెలిగిన వెలుగును గుర్తుంచుకుంటుంది
నవ్వులు కన్నీళ్లు నా వెంటే వున్నాయి
కొంతమంది తోడుగా నడిచారు
కొంతమందేమో దారిమధ్యలోనే
జ్ఞాపకాలై నిలిచిపోయారు
అయినా
నా ఉదయాలు ఆగలేదు
సూర్యుడు తన ప్రయాణం మానలేదు
నాలో కలలు కూడా
పరాజయాల బూడిదలోంచీ
మళ్లీ మొలకెత్తుతూనే ఉన్నాయి

ఇప్పుడు
కాలం ఎంత దూరం వెళ్లిందో కాని
నేను ఎంత దూరం వచ్చానో చూస్తున్నాను
ఎందుకంటే
సంవత్సరాలు గడిచిపోవచ్చు
శరీరం అలసిపోవచ్చు
జ్ఞాపకాల పుస్తకం పసుపురంగులోకి మారొచ్చు
కానీ
ప్రతి ఉదయంలో
కొత్త ఆశను పలకరించే నా చూపు
ప్రతి చీకటిలో
ఒక చిన్న దీపాన్ని వెతికే నా మనసు
ఇప్పటికీ ఇక్కడే ఉన్నాయి
అందుకే
కాలం గెలిచిందని నేను అనుకోను
నేను ఇంకా ఆశ్చర్యపడగలుగుతున్నాను
ప్రేమించగలుగుతున్నాను
కలలు కనగలుగుతున్నాను
అంతే చాలు
ఈ అనంత విశ్వంలో
నేను ఉన్నానని చెప్పడానికి
I Am Still Here
+++++ Varala Anand
Time
it is not a flower
that blossomed in my hand
to be preserved from withering
Time
is a gathering of raindrops
slipping through the misty fingers of clouds
and before one can fully behold them
those drops become a river
and flow away
I thought
yesterday morning
was still waiting by my window
But when I turned around
I found that time had become a memory
hanging upon the wall of my heart
The sky
does not count
how many seasons have come and gone
The tree
does not remember
how many birds have rested upon its branches
In the same way
life does not cherish
the number of days we have lived
it remembers instead
the light that once burned within us
Laughter and tears
have walked beside me
Some people journeyed with me for a while
others
halfway along the road
remained behind as memories
Yet
my mornings never ceased
and the sun
never abandoned its voyage
Within me, too
dreams continue to sprout
rising again
from the ashes of defeat
Now
I do not ask
how far time has travelled
I look instead
at how far I have come
For years may pass
the body may grow weary
and the book of memories
may yellow with age
But
the gaze that greets
each dawn with a new hope
the heart that searches
for a small lamp in every darkness
are still here
That is why
I do not believe
that time has won
I can still be astonished
I can still love
I can still dream
And that is enough
enough to say
in this infinite universe
that I am here.
తెల్లకోటు మాటునున్న అతని గుండెలో మానవత్వపు ఊట
విలువల వలువలు తొడిగిన అతని ఆశయం సామాన్యుని పాలిటి సంజీవని
జేబులో బొమ్మల ధ్యాసేలేని ఔన్నత్యం
అంతరాలెంచని ఔదార్యం
ప్రణాళికాపఠనం సమన్వయమై
రేయీపగలూ శ్రమించిన కార్యశీలి
స్వప్నం సాకారమైన ధన్వంతరీ ప్రతినిధి
ఉదయసంధ్యల నడుమ
పరుగెడుతూ వృత్తిలో తరించిన సేవాతత్పరుడతను
కాలం ఏ గాయం చేసిందో మరి!!
శరీరమే పట్టు తప్పిందో
మనసే మాట విననందో
కర్తవ్యం శూన్యంలోకి జారుకుంది
దండెంపై దీనంగా వేలాడుతూ తెల్లకోటు!
చిలక్కొయ్యకు వేలాడుతూ
స్టెతస్కోప్!
లబ్ డబ్ ల నడుమ పేదగుండె పెనుగులాడుతోంది
కుంచించుకు పోయిన కవాటాల నడుమ గావుకేకలు పెడుతోంది
వైద్యం వ్యాపారమై సిరల్లో రక్తం చిక్కబడుతోంది
బతుకు పలుచనై ఔషధం అందనంటూ దౌడు తీస్తోంది
లే!!
జూలు విదిల్చిన సింహానివై
సంధించిన బాణానివై
కర్తవ్యానికి సమాయత్తమవ్వు
పేరుకుపోయిన నైరాశ్యాన్ని తరిమికొట్టు
రంగు మాసిన తెల్లకోటు మకిలి వదిలించు
కొడిగట్టే దీపంలో ఏ వీరుడు దాగున్నాడో!
దేశ రక్షణకు నువ్వో పరోక్ష కంచెవి
ఆరిపోయే జ్యోతిలో ఏ శాస్త్రజ్ఞుడు నక్కి ఉన్నాడో!
సరికొత్త ఆవిష్కరణలకు నువ్వో చక్కని ఔషధ మిశ్రమానివి
ఔన్నత్యంతో నిండిన నీ గుండె అమృత కలశమై రోగుల పాలిటి జీవగంగ కావాలి
ధన్వంతరీ ప్రతినిధివై సుశ్రుతుని వారసునివై పీడితుల నడుమ బొంగరమై తిరుగు
చికిత్సాలయంలో వైద్య నారాయణడివై అవతరించు
వైద్యుడు ప్రపంచాని కవసరం
మనసున్న వైద్యుడు పేదవాడి కత్యంత అవసరం
లే!!!
ఉదయించే సూర్యుడివై
తూర్పు తలుపు తెరువు
ఆశలుడిగిన కళ్ళలో
వెలుగువై ప్రసరించు
పచ్చి కట్టెలతో
ప్రాణం విడిచిన ఒక మనిషి కోసం
నన్ను ప్రేమగా పలకరిస్తారు
ప్రాణం లేని కాగితపు పూలతో
అందంగా అలంకరిస్తారు
కానీ ఆ అందం వెనుక
ఒక ఇంటి అంతులేని దుఃఖం దాగి ఉంది
మనుషుల మధ్యకు నన్ను తీసుకెళ్లిన క్షణం
నాకు వినిపించెవి ఏడుపులు కావు
పగిలిపోయిన హృదయాల ప్రతిధ్వనులు.
ఎందుకంటే…
ఇంకెప్పటికీ తిరిగి రాని
ఒక మనిషిని మోసుకెళ్లే అదృష్టం.
నాకే దక్కింది.
పాలు తాగే పసిపాప
నా అలంకరణను చూసి
ఏమీ తెలియక బోసినవ్వు నవ్వుతుంది.
అదే వేళ…
చంకలో బిడ్డను ఎత్తుకున్న తల్లి
గుండె పగిలేలా రోదిస్తుంది.
ఇల్లంతా అల్లకల్లోలం…
అర్థనాదాలతో గోడలే వణుకుతున్నాయి.
బంధుమిత్రుల కళ్లలో
కన్నీటి సముద్రం ఉప్పొంగుతోంది.
“ఇంకోసారి కనిపించడా?” అనే ప్రశ్నే
ప్రతి గుండెను చీల్చేస్తోంది.
డప్పుల మోతల మధ్య
నిశ్శబ్దంగా అతన్ని తీసుకొచ్చి
నా ఒడిలో పడుకోబెడతారు
అతను ప్రశాంతంగా నిద్రపోతున్నాడు…
కానీ అతని కోసం
ప్రాణంగా బతికినవాళ్లు
గుండెలు బాదుకుంటూ,
కడుపులు కొట్టుకుంటూ విలపిస్తున్నారు.
ఆ రోదనలు వింటుంటే…
నాకు కూడా కన్నీళ్లు వస్తున్నాయి
నలుగురు భుజాలపై నన్ను ఎత్తుకున్న క్షణం…
కన్నతల్లి నన్ను పట్టుకుని
“ఒక్కసారి కళ్లు తెరువు బిడ్డా…” అంటూ
కూలిపోతుంది.
భార్య గుండె పగిలిపోతుంది.
కన్నా పిల్లలు కన్నీళ్లు పెట్టి కదలి వస్తుంటే
కాలం ఆగిపోతే బాగుండు అనిపించింది.
ఆ దృశ్యం…
మాటల్లో చెప్పలేనిది.
కాలమే నిలిచిపోయిన క్షణం.
ధింపుడు గల్లం దగ్గర
నన్ను మెల్లగా నేలపై దించారు.
ఒక్కొక్కరు ముందుకు వచ్చి
అతని చెవిలో
తమ బంధాన్ని చివరిసారి పిలిచారు.
“నాన్నా…”
“అన్నయ్యా…”
“బాబాయ్…”
“తాతయ్యా…”
ఆ పిలుపుల్లో
ప్రేమ ఉంది…
బాధ ఉంది…
శాశ్వతమైన వీడ్కోలు ఉంది.
మళ్లీ నన్ను భుజాన మోసుకుని
బొంద చుట్టూ ఐదు సార్లు తిరిగారు
చివరకు…
నా ఎద మీద ఉన్న అతన్ని
భూతల్లీ ఒడిలోకి చేర్చారు
ఆ క్షణంలో వినిపించిన ఏడుపులకు
ఆకాశం కూడా కన్నీళ్లు పెట్టుకున్నట్టే అనిపించింది.
కొద్దిసేపటికి
బొంద మూసి…
నన్ను దాని పైనే వదిలేశారు.
అందరూ ఒక్కొక్కరుగా వెళ్లిపోయారు.
నేను మాత్రం
ఆ నిశ్శబ్దాన్ని చూస్తూ నిలిచిపోయాను.
“శవం శివం” అంటారు…
అయితే…
ఆ శివుని చివరి యాత్రలో
ఆయనకు ఆసరాగా నిలిచే భాగ్యం
నాకే దక్కింది.
ఎన్నో కన్నీళ్లను మోసిన నేను…
ఎన్నో విడిపోవుళ్లకు సాక్షినైన నేను…
ప్రతి రోజూ ఒకే నిజాన్ని చెబుతూనే ఉంటాను
పుట్టుక మన చేతుల్లో ఉండదు
చావు మన మాట వినదు
కానీ బతికున్నంత కాలం
మనిషిగా మనిషి హృదయాల్లో బతకడమే
ఈ జీవితానికి అసలైన అర్ధం
పాడేగా పలకరిస్తూ
ప్రేమగా మోసుకెళ్తా!
వైరుధ్యాల మధ్య నలిగిన బానిస భావజాలాన్ని చీల్చుకుంటూ
స్వేచ్ఛను నేర్పే కలాలే
రేపటి పంటకు నాగళ్లు కావాలి.
గాయకుడి గొంతు
గాలిని మాత్రమే కదిలించకూడదు,
గుండెల్లో గడ్డకట్టిన భయాన్ని కరిగించి
మానవ ఐక్యతకు
కొత్త స్వరాలను మొలిపించాలి.
యాంత్రిక యుగం
మనుషులను దగ్గర చేసినంతగా
మనసులను దూరం చేసింది
పలకరింపుల స్థానంలో
తెరలు పెరిగాయి
ఆత్మీయత స్థానంలో
ఇనుప కచ్చడాలు నిలిచాయి.
పుట్టుకలోనూ చావులోనూ మనిషి ఒంటరివాడే అయినా
ఆలోచన ఎప్పుడూ ఒంటరిది కాదు
కలం అనే హలంతో దున్నిన మనసు నేలలో
మానవత్వం విత్తనం పడితేనే
సమసమాజం పంట పండుతుంది.
చుక్క పొద్దున లేచి
చకచకా పనులన్నీ చక్కబెట్టి
ఇంతన్నం డబ్బాలేసుకొని
నిన్నెత్తుకొని హత్తుకొని
వెళ్లిపోతుందమ్మా
కాలు బయట పెడితే
వీధిలో పరాధీన పనిలో ధీర
కానీ దిగులు దిగులుగా
గుండె గుబులు గుబులుగా
రోజంతా అలజడిలో బంధీ
తీరాన్ని తాకే సముద్ర తరంగాల్లా
ఎగిసిపడే ప్రేమను
లోలోనే అణచుకోవడం ఎంత కష్టం!
ఆ ఆరాటం ముందు సముద్ర ఘోష ఏపాటి?
అప్పుడప్పుడు మరీ
సునామీలా ఉప్పొంగే ప్రేమ
ఏం చేయలేక, ఏమనలేక
సుడియై, జడియై, వడియై
మనసు చెలియలికట్ట లోపలే
సర్దుకోవడం ఎంత కష్టం!
ఈ ఉద్వేగాన్ని ఏ ప్రవాహాలు మోయగలవు?

బువ్వ తినే వేళ సరాన పడితే
పాలకుతితో ఏడ్చే
నీ ఏడుపే వినిపిస్తుంది
“నీ యాదేనేమో” అని తోటి వారంటుంటే
సగం ఏడుపు, సగం నవ్వును
నంజుకుంటున్న బువ్వముద్దల్లో
ఉప్పు ఎక్కువై ఇక సహించదు
కడుపులో నలుసుగా మోసిన వేవిళ్ల కష్టం
పురిటి నొప్పుల బాధ
ఈ ఎద సలపరింతల ముందెంత?
అమ్మతనపు పాలపొంగులు వృథా అవుతుంటే
మనసుకు ఎంత కష్టం!
ఈ గుండె బండైనా బాగుండునేమో!
పల్లెలో కూలితల్లి పాలియ్యవోతది
పిట్టతల్లి గూడు చుట్టే తిరుగుతుంటది
కొలువుసంకెళ దూరభారం
నిట్టూర్పులన్నీ ఒంపుకున్న గాలి
నా చుట్టే తిరుగుతుంటది
“బిడ్డా!నేనెట్లా రానురా”
కష్టపడేది నీకోసమేనని
నష్టపోతూ,నష్టపరుస్తూ
ఓర్చుకుంటూ,ఓదార్చుకుంటూ
అమ్మగా ఓడిపోతూ…
నిన్నెంత కష్టపెడుతున్నానో!
రోజంతా పనిచేసి
కందిపోయిన సూర్యుడు
హడావిడిగా కొండలు దిగుతుంటే
రసం తీసిన పిప్పిలా
ఇల్లు చేరే నన్ను చూసి
అమాయక ఇరుగుపొరుగు
చూపుల బెకబెకల మధ్య
కిలకిల మంటూ నువ్వు పలకరిస్తే
చెలిమి చిరునవ్వులే పూస్తవి
ఇక అన్నీ మరిచి
ఆత్రంగా నిన్నెత్తుకుని హత్తుకుని
మురిసిపోతుందమ్మా.
నడిచే దారిలో పరిచి ఉన్న
నింగిలో తేజంలా
పరవశాల నడుమ
పరితపించే కథ వారిది!
వసంతాల పరిమళంలా ఓ వైపు..
శిశిరాల కలవరంలా ఇంకో వైపు..
*
*
పడమరంకి కూర్చొని
ఎప్పటిలానే అతను వింటున్నాడు
కొన్ని కబుర్లని.. కొన్ని కోపాల్ని..
కొన్ని అలకల్ని.. కొన్ని మెలికల్ని..
వింటూ వింటూనే
ఆమె కురులతో
పడుగు పేకల్ని పేర్వడం
అవి పెనవేసుకుని
చీకట్లను పరవడం
తరచూ అలవాటు అలా..
సాయంత్రం నుండి
సంధ్యాంతం వరకు
వాళ్ళిద్దరే అనంతాన్వేషకులిలా..

ఆమె తిరిగే ఈ కక్ష్యలెప్పుడూ
అతడ్ని చేరుకోలేవని తెలిసినా
వారిద్దరూ జగతి గర్భంలో
వెలుగు నీడలై
ఉష్ణసలిలాలై
ప్రేమను పెంచుకుంటూ
దూరాన్ని పంచుకుంటున్నారు
*
*
విశ్వంలో మర్మాన్ని పులుముకుంది ఆమె
అందులో గరళాన్ని మోస్తున్నాడు అతను
*
*
అనంతాలు శూన్యాల మధ్య ప్రయాణిస్తూ
జీవితాన్నే మళ్ళీ మళ్ళీ జీవిస్తూ
లోకంలోని విశాలత్వాన్ని పులుముకుంది ఆమె
విశ్వాంతరాల అగాధాలను అలుముకున్నాడతను
*
*
అతనెప్పుడు మెండుగా నిండి ఉన్న విభావళి
ఆమెప్పుడు అందనంత ఎత్తులో ఉండే ఆరావళి
*
*
గుప్పిట్లో బంధింపబడిన గాలి ఆమె
పిడికిలి ఏమోనని భ్రమ పడ్డాడతను
*
*
అతను నీలిపొరల వెనుక
ఆమె గాలి తెరల మధ్య
సమాంతరంగా సంయమనంతో
వాళ్ళిద్దరూ సుప్రేమల వలయాల్లో ఈదుతూ
బాష్పాలను పంచుకుంటూనే ఉంటారెప్పుడూ..
*
*
ఆమె మొదలవ్వని సంశయం
అతను అంతమవ్వని సందేహం
*
*
వెలుగు నీడలమనుకున్నాడు అతను
చీకటి వైపు చూస్తూ ఉండిపోయిందామె
*
*
ఆమెకు సాయంత్రాలెప్పుడూ
ఓ ఓదార్పునిస్తాయి
దాంతో మమేకమై
అనంతంలో లీనమై
పరిభ్రమిస్తూ ఉంటుందీ పరిధి వెంబడి
ఉదయాలకై.. అతని వదనానికై..
*
*
జ్ఞాపకాలెప్పుడు ఓదార్పు ఆమెకి
స్మతులెప్పుడు గతాలు అతనికి
*
*
ఆమె అతనికి బలమవ్వాలని
తనని తాను మార్చుకుంది
అతను ఆమెలోని మార్పుల్లో
బలహీనతల్ని వెతుకుతున్నాడు
కల్పిత కలలతో నిండిన కథ అతను
ఆ కథల్లో పడి నిజాన్ని కలగనడం మానేసిందామె!
మా బడి గుడిగంటల మోత గుర్తొచ్చినప్పుడల్లా తెలియని భావమేదో మదిలో మెదులుతూనే ఉంటుంది
తలుపులు తెరిచి కొత్త తరగతిలోకి రారమ్మంటున్న భావమేదో లీలగా
కదలాడుతూనే ఉంటుంది
నాన్న తెచ్చిన కొత్త పుస్తకాలు తెరిచినప్పుడు ముక్కుపుట్టల్ని తాకిన వింత వాసనలు …
అట్టలేసే సమయంలో జాగ్రత్తల చిరు హెచ్చరికలు ఇంకా చెవుల్లో మెల్లగా వినిపిస్తూనే ఉన్నాయి
బుజ్జిమేక పూల తోటలో తిరుగాడే చిత్తరవు కళ్ళముందు వింతగా ఇంకా సజీవంగా!
అమ్మ చెప్పిన ‘పాపాయి స్నానం’ కథలోని ఆరోగ్య రహస్యాలు బిబ్బీలడబ్బీ మతలబేంటని అమాయకత్వం నటిస్తూ అడిగిన
అక్క నటనాచాతుర్యానికి
అమ్మ మురిపెంతో చెప్పిన సమాధానం చెవులలో
ఇంకా పదిలంగానే!
కొత్త పుస్తకాల సంచితో
బడికి వెళ్ళినప్పుడు
నెచ్చెలుల మనోగతం
కాసింత అవగతమై …
ఒకింత విజయగర్వంతో
చేసిన అవివేకపు తప్పిదానికి అపరాధభావం ఇంకా
ఎక్కడో తడితడిగా అలాగే
టీచరమ్మల బెత్తపురుచుల్ని చవి చూడకున్నా
ఆటల సారు కోపానికి అరచేతులు బలైన
సందర్భాలు బోలెడన్ని
నాన్న బదిలీల మజిలీలో
కొత్త స్నేహాలు సంబరాన్నిచ్చినా దండించే గురువులు మదిలో మెదిలి కలవరపడ్డ
క్షణాలు చాలానే!
హెచ్చుతగ్గుల తేడాలు
ఎంచరాదంటూ నాన్న చేసిన నీతిబోధలు …
పెద్దలు కనబడగానే రెండు చేతులు పట్టుకుని జోడించడం నేర్పిన నాన్న సంస్కారానికి …
చదువుతో పాటు సాహిత్యంలో ఓనమాలు నేర్పిన తెలుగు మాస్టారుకు వందనాలు
తల నెరుస్తున్నా చదువులమ్మ గుడి తలుపుల మాటున దాగిన తలపులు ఇంకా కొత్తగానే!
-రాక్షసుల చేతుల్లో నలిగిన బాల్యాలు,
చిన్నారి కళ్లలో చెదిరిన స్వప్నాల జాల్యాలు;
పుట్టకముందే పూడిపోయిన ఆశల గాల్యాలు,
నిశ్శబ్ద రాత్రుల్లో రోదించే మానవ బాల్యాలు.
బాల్యం అనే పువ్వులు వికసించకముందే వాడిపోయె..!
రక్కసుల స్పర్శలో పవిత్రత అంతా రాలిపోయెను;
నిర్దయ నేలపై కన్నీటి బిందువులు నిలిచిపోయెను,
మనసుల గాయాల్లో కాలం నిశ్శబ్దంగా నిలిచిపోయె..!

