కవితలు
1 — సరిగమ పరిమళము నెరిగి
సరిసరి నటనలకు తగిన
సరసత పెంచెన్
నిరతము సుస్వర మధురిమ
పరిపరి విధముల పంచిన
బాలున్ దలతున్
2 — గళమున మధు స్వరాళిని
గలిగి చిలికి నవరసాల
కమ్మగ నొలికెన్
ఇలలో పాడుత-తీయగ
ఎలమిని నేర్పిన మెలపులు
యేపుగ మెరిసెన్
3 — మరిమరి ముసిముసి నగవుల
సరి జేయుచును దొసగులను
సౌమ్యత దిద్దెన్
అర విరిసిన సరిగమలను
పసి గళముల పరచినట్టి
బాలున్ దలతున్
4 — సరిగమ పదనిస గమ్యము
నెరుగుచు సుగీత నినదము
నిటు నటు తేల్చెన్
సురుచిర మృదుపద సంపద
మెరుపుల రస భావఝరి
దుమికి భువి తరలెన్
5 — సరిసరి పదముల గలగల
ఝరి సరి గతులను గళమున
జలజల రాల్చెన్
పరిపరి విధముల జనములు
మరిమరి మురిసిరి యెదలను
మరతురె బాలున్
———-×——–
ఇప్పుడంతా తవ్వకాలు
జరుగుతున్నాయి
లోలోకి-లోలోతుల్లోకి
యోగం క్షేమం
కనుక్కుంటున్నారు
జ్ఞాపకాల చిత్తర్వులని
మనసు తెరపై వెతికి వెతికి
అతికించుకుంటున్నారు
మారుతున్న ప్రాధాన్యాలు
అవసరార్థ మిత్రుత్వాలు
వెలిసిపోతున్న ప్రేమలు
మనసు నింపని స్నేహాలతో
ఎవరి వలయాల్లో వారు
నిమిషాల ముళ్ళపై పరిగెడుతూ….
ఉప్పెనలై విరుచుకుపడుతున్న విద్వేషాలు
పొగలు గక్కుతున్న ప్రపంచం
మనిషి చుట్టూ హింస
మరెంత రక్తపాతం
ఇంకెంతో నిర్దయ
ఈ భూమి పైని
ఏ పుణ్యజలాలతో శుభ్రపడతాయో
తెలియని ….
ఎడతెగని యుద్ధాలు
కరాళకాలపు కుదుపుకు
ప్రాణాలు క్షణాల్లో వాయులీనమై
బంధాలు అకస్మాత్ నిష్క్రమణలై
సప్తవర్ణాల జీవితం
ఒకే దు:ఖవర్ణంగా మారిపోయి
నిర్వేదపు పెను నిశ్శబ్దం
ఫెటిల్మని పేలిన
ఈ కాలాన….
మరపు మడతల్లో మడిచి
ఉపేక్షించిన అపేక్షలను
ఆర్తిగా తిరగదోడుకుంటున్నారు
మరణం పిదప మనతో
వచ్చేదేమిటన్న ఎరుకతో
దయగా మన్నించి
దరి చేర్చుకోవడంతో
మానవజీవితాల్లో కొంతైనా
కొత్తదారులు వెలుగుతున్నాయి
మనిషి మనిషికి మధ్య
దశాబ్దాలుగా వాడి చుట్టూ వుంటూనే
వాణ్ని తప్పించుకు తిరుగుతున్నాను
నా వోడేనని తెలుస్తున్నా, పోవోయ్ అంటూ
దారి మార్చి తిరుగుతున్నా
అయినా వాడు నాలో
ఎక్కడో తిష్ట వేసుకు కూర్చున్నాడు
అకస్మాత్తుగా ఒక రోజు
నా దేహం పై కత్తి పడింది
శరీరం తో పాటు మనసూ గాయ పడింది
వాడు లేచి గాయాల్ని తడిమాడు
కళ్ళల్లోకి చూసి కన్నీటి పర్యంతమయ్యాడు
హృదయం లోకి దూరి
బాధలకు మలాం రాసాడు
నా చేయందుకుని అక్షరమై
తెల్ల కాగితం పై వాలాడు
వేదనంతా దూదిపింజై
గాల్లోకి ఎగిరింది
ఇన్నేళ్ళూ నేను తప్పించుకు తిరిగినా
ఇవ్వాళ తప్పించుకోలేని స్థితికితెచ్చాడు
అవును
ఈ కవిగాడూ నేనూ కవలలం
అమ్మ గర్భం లోంచి ఒకేసారి పుట్టాం
అక్షరాలమై కలవడానికి ఇన్నేళ్ళు పట్టింది
నేరం నాదా…కవి దా….
నీదీ నాదన్న భ్రమలూ విభ్రమలూ రావు
విప్పిన రెక్కలు కదలించి ఎగిరినంత మేరా
మనదే కదా , మనసు మెచ్చిన కొమ్మకొమ్మంతా మనదే కదా.
పచ్చని చిలకలతో పరిహాసాలాడుతూ
ఆకుఆకునా అలముకున్న హరితపవనాలు
దారిపొడుగునా రాగఝరులు విసురుతూ
ఇక్కడ నల్లకోయిల అయితేనేం
మరెక్కడో మరో పేరున్న తీపిస్వరం అయితేనేం
స్వర విహాయసాన విహంగాలమే కదా
ఎన్ని సార్లు ఆకాశపు రహదారుల్లో
ఎన్ని మంతనాలు సాగాయి
రంగూ రూపూ ఏ మాత్రం పొంతన కుదరని మన మధ్యన
రెక్కలు మొలుస్తూనే మొదలు కదా దూరాలను కొలవడం
నింగి నీలిమతో ముచ్చట్లు పెట్టడం
కాస్త ముందుకు వంగిన మబ్బులతో మంతనాలూ
తాకాలని తహతహలుపొయే హరివిల్లుతో సరసాలూ
ఏ ఇంటి గుమ్మం ముందు కంకులు వేళ్ళాడినా
చుక్కలు నేలకు దిగివచ్చినట్టు ఎన్ని రంగుల కువకువలు
వేడికీ వెన్నెలకూ మధ్య ఎన్ని యుగాంతర సీమలు
ఆనందాలు కలబోసుకుంటూ ఎగురుతూనే పోతాం కదా
ఆశ్చర్యం ఈ మనిషికి ఒక్కరోజైనా
పక్షి నవుదామనిపించదా
అవునులే
జాతీ మతం కులాలతీగలతో పంజరం పోతపోసుకున్నాక
ఎగిరే రెక్కలు ఎక్కడ రుచిస్తాయి
పక్షి మాంసం రుచిమరిగాక
స్వేచ్చ ఎక్కడ బులిపిస్తుంది.
పాపం పంజరమే అతడి లోకం
చోద్యం ! శిక్షలు ఎంతో సరలమై
నేరస్థుడి దోషాలు మాఘవేసినట్లే ఉంటాయి
ముఖం పై ఏ మాత్రం భయం సెగ ఉండదు
రిమాండులు కోర్టులు చెరసాలలూ
కీచకులకు సేదగా ఒయసిస్సులేనేమో
శిక్షా కాలంలోనూ గుడ్లు మాంసం తింటూ
అత్తవారిల్లు వైభవంగా గోవా ఊటిలాగే జైల్లా !!
శిక్షలు ఎంత సుఖమో !
శిక్షా స్మృతులు రాసేవారికి
ఆడ పడుచులున్నారా ??
శోధనగా మా ఆవేదనా ప్రకరణము
అల్లా ! మీ దేశాలలోని శిక్షలే శిక్షలు
అమ్మాయిల పై చేయి వేయడానికి
మరణ భయంతో వెనుకంజ వేసి
అక్కడికక్కడే పక్షవాతం వచ్చి పడిపోతారు
ఖబరస్తాన్ వాడి అడ్రస్
అసలు న్యాయంగా
వీధి వీధికి ఉరితాడు వేలాడుతూ
మదన కామరాజులకు అనగొండ దృశ్యం కావాలి
తల్లులు తమ కొడుకు పెరుగుతుంటే
గల్లీలోని ఉరితాడును
చూపుడు వేలితో ముక్కు సూటిగా చూపించి
గుణ పాఠాలు చెప్పాలి మరి మరీ
వాడికి భవిష్యత్తు దర్శనంగా !!
పగలైతేనేం అర్ధరాత్రి ఐతేనేం
సిక్కు వీరుల్లా మా అమ్మాయిలు
ఎక్కడైనా ఖడ్గాలు ధరించిన
వైనమే వైభవమే కావాలి మరి
స్వీయ చరిత్రకు స్వీయ రక్షణ
తల్లులూ ! వంటింట్లో రుచికరంగా
పరాటాలు చేయడమే కాదు
చేతి వాటంగా కరాటే చేయాల్సిందే
దెబ్బకు సీసా మత్తు దిగి
శాశ్వతంగా మగ పుట్వడిని మరువాల్సిందే
ఇక అమ్మాయి అంటే ఆయుధ పాణిగా
మనకెంతో నిర్భయం నిమ్మలం
వేలు పట్టుకుని నీతో నేను నడవాలని
నీ గొప్పతనం తెలిసినప్పటి నుంచీ కోరిక
అదేమిటో అసహనమో
ఆధిపత్యమో
ఇలా విదిలించుకుని అలా
గోడకు వేలాడే క్యాలెండర్
చెట్టువై
ఒడిసిపట్టుకుందామనుకున్న
రోజుల ఆకుల్ని విదిలిస్తూ వదిలేస్తూ
నవ్వుతూ
ఏమీ తెలియనట్టుగా వెళ్ళిపోతావు..
నేననుకుంటాను..
నీతో నేను ఆగకుండా నడిచి
జయించిన విజయాలేవో గతం సంచిలో
అపురూపంగా దాచుకుని
మురుద్దామనీ..
చేయి ఎప్పుడు వదుల్తావో తెలీదు
ఓ బద్దక నేస్తం నాతో ముచ్చటించినప్పుడో
ఓ నిర్లక్ష్యం నన్ను నీడలా వెంటాడి లోబరుచుకున్నప్పుడో…
కనీసం ఓ హెచ్చరిక అలారమైనా మోగించకుండా
నన్ను మోసగించి వెళుతూ ఉంటావని ఉక్రోషంతో..
అంతరంగం ముందు నిన్ను నిలదీయిస్తే
ప్రభాత కిరణాల సాక్షిగా
నిశీధి వెలిగే చుక్కల ముందు
చిత్రంగా నన్నే దోషిని చేస్తావు…
నాకంటూ ఓ రోజు రాకపోతుందా
ఏకాగ్రతతో నిన్నే ధ్యానిస్తే
ఏమరుపాటుగా నైనా నిన్ను వదలకుండా ఉంటే…
ఏదో ఒకటి సాధించి
రాలిపోయే రోజుపై చెరగని సంతకమొకటి చేయకపోతానా
నీవిచ్చిన ఈ తరపు కానుకనై మిగలక పోతానా..
కాలమా!…అప్పుడు నువ్వే
నా జయంతినో వర్ధంతినో
కొందరికైనా గుర్తొచ్చేలా చేస్తావు..
నీపై నాకా నమ్మకం ఉంది
పేరుకు ఇల్లే గానీ
పగిలిపోయిన పెంకులు పేర్చినట్టు
రెండు గదుల పెంకుటిల్లు.
దాని ముందరొక వేప చెట్టు!
బుడి బుడి అడుగుల బుడ్డోడిగా,
వేప మండకు వేలాడిన ఉయ్యాలలో
ఊగుతూ కేరింతలు కొట్టాడు.
వేప చెట్టు కింద!
పదేళ్ల పడుచు పిల్లోడిగా
పక్కింటి పిల్లోళ్లతో
గుండాలు గీసి, గుంతలు జేసి
గోళీలు గురిచూసికొడుతూ గెంతులేసాడు.
వేప చెట్టు కింద!
ఇరవైయేళ్ళ పరువంలో
ఉదయాన్నే వేపపుల్ల వేసి నములుతూ
పక్కింటి ఆసామి పేపరు పట్టుకొచ్చి
అక్షరాలనన్ని అరిగించుకున్నాడు.
వేప చెట్టు కింద!
ఊరి యువకులను పిలిచి
నడిరేయి దాకా
సమసమాజ మంటూ
సామ్యవాదమంటూ
ఉపన్యాసాలతో ఉర్రూతలూపాడు.
వేప చెట్టు కింద!
ఇపుడు తనకొక ఇల్లాలు
బోసినవ్వుల ఓ బుడ్డోడు.
పనికి పోయి వచ్చి
మధ్యాహ్నమంతా మంచంపైనే కునుకు.
వేప చెట్టు కింద!
కొడుకు పెండ్లికి
ఊరంతటిని పిలిచాడు
ఉడుకు ఉడుకు భోజనాలు పెట్టించాడు
ఊరంతా ఆరగించారు.
వేపచెట్టు కింద !
ముసలివాడై పోయాడు.
రోజూ భగవన్నామ స్మరణ
మనవడితో కాసేపు
ముసలోళ్లతో కాసేపు కాలక్షేపం.
వేప చెట్టు కింద!
ఓ రోజు పొద్దున
లేపబోతే లేవలేదు
ఊరంతా వచ్చి చేరారు.
చితి పేర్చటం కోసం
చెట్టు మండనొకటి నరకాలన్నారు.
వేప చెట్టు కింద !
దినాలు గడిచాయి .
మరొక మండపై
మనవడు ఉయ్యాలూగుతున్నాడు
మరో జీవితమారంభమైంది
వేప చెట్టు కింద !
