మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
ఇంద్రధనుస్సు

సినీ గీతాల సాహిత్య పరామర్శ

by ఏలూరు అశోక్ కుమార్ రావు June 2, 2021
written by ఏలూరు అశోక్ కుమార్ రావు
ఆణిముత్యాల్లాంటి సినీ గీత సాహిత్య సందర్భాన్ని విశ్లేషించుకోవటం ఈ శీర్షిక ఉద్దేశ్యం

మల్లీశ్వరి సినీమా పాట – మనసున మల్లెల మాలలూగెనే…

దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రిగారి వాణికి, సాలూరి రాజేశ్వరరావు గారు బాణీ సమకూర్చిన ఈ గీతం భానుమతిగారి గళంలో వినసొంపుగా ఉంటుంది.
మల్లీశ్వరి చిత్రం 70 సంవత్సరాల క్రితం వచ్చిన సినిమా, ఆ సినిమా పాటలు ఇప్పటికి తెలుగువాళ్ళ హృదయాల్లో తాజాగా కదలాడుతున్నాయి. అందులో

మనసున మల్లెల మాలలూగెనే
కన్నుల వెన్నెల డోలాలూగెనే
ఎంత హాయి ఈ రేయి నిండెనో
ఎన్న నాళ్లకి బ్రతుకు పండెనో

నిజానికి నిరీక్షణ ఎంత మధురమైనదో, అంత బాధాకరమైనది కూడా! అంటే నిరీక్షణ ఒక మధురమైన బాధ. నిరీక్షణ నిజంగా ఫలిస్తే మాత్రం ప్రేమికులకు పెద్ద పండుగ.

కొమ్మల గువ్వలు గుసగుస మనినా
రెమ్మల గాలులు ఉసురుసురనినా
అలలు కొలనులో గలగలమనినా
దవ్వుల వేణువు సవ్వడి వినినా
నీవు వచ్చేవని నీ పిలుపే విని
కన్నుల నీరిడి కలయజూచితిని

ప్రకృతిలోని ప్రతిశబ్దం కూడా తన ప్రేమమూర్తి ప్రతి ధ్వనిలాగే వినిపిస్తుంది. తన ప్రేమమూర్తి కొరకు ఎదురు చూడడమంటే తన జీవితం కొరకు, తన ప్రాణం కొరకు ఎదురు చూడడం. ఒకవేళ ఆ ప్రేమమూర్తి రావడానికి ఆలస్యమే కాదు, ఎడబాటు ఏర్పడితే, కళ్లు కన్నీటిమయమే. నిజంగానే అతడొచ్చి ఎదురుగా నిలబడితే, కన్నీటి పొర కమ్మేసిన కళ్ళతో అతనిని గుర్తించడం కష్టమే.

గడియయేని ఇక విడిచి పోకుమా
ఎగసిన హృదయము పగులనీకుమా
ఎన్ని నాళ్ళకీ బ్రతుకు పండెనో
ఎంత హాయి ఈ రేయి నిండెనో

తన అదృష్టం కొద్ది తన నిరీక్షణ ఫలించి తన ప్రేమమూర్తి తన దగ్గర వాలిపోతే ఈ లోకమంతా తన సొంతమైనట్లుగా ఆనందం, చెంతకు చేరిన ప్రేమమూర్తి ఎప్పటికీ తన దగ్గరే వుంటారనే గ్యారంటీ లేదు. ఏదో కారణంతో వారిద్దరు విడిపోయి, చాలాకాలం దూరదూరాలకు విసిరివేయబడితే ఆ ప్రేమ హృదయాలు మళ్ళీ చేరువ కావడానికి ఎంత పోరాటం చేయాలో?
1951లో విడుదలైన మల్లీశ్వరి ‘‘వాహినీ’’ వారి చిత్రం. బి.ఎన్‌.రెడ్డి నిర్మాత, దర్శకుడు. ఈ చిత్రం ఇండియాలోనే కాకుండా, రాచరికపు ఆడంబరాలను, ఆచారాలను చిత్రించినప్పటికి, కమ్యూనిష్టు దేశమైన చైనాలోను 100 రోజులకు పైగా నడిచింది.నాగరాజు (ఎన్‌టిఆర్‌), మల్లీశ్వరి (భానుమతి) ఇద్దరు బావా మరదళ్లు, వేళా కోళానికి మల్లీశ్వరిని రాయలవారి రాణివాసానికి (మహారాణి తిరుమలుదేవికి ఇష్టసఖిగా) పంపిస్తే బాగుంటుందని నాగరాజు అంటే, రాయలవారు (శ్రీవత్స) తన సైన్యాన్ని పంపించి, మల్లీశ్వరికి తన రాణివాసములో చోటు కల్పిస్తాడు. చిన్న నాటి నుండి అనుబంధాలను పెంచుకున్న బావామరదళ్లు విడిపోయి, బ్రతకజాలకపోతారు. ఆ సమయంలోనే నాగరాజు విజయనగరంలో శిల్పాులు చెక్కుతుంటాడు. తోటలోని దేవాలయం వద్ద నాగరాజు, మల్లీశ్వరి ఇద్దరు రహస్యంగా కలిసికొన్న సందర్భంలో పాడిన యీ పాటను దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి గారు వ్రాయగా, సాలూరి రాజేశ్వరరావుగారు బాణీ కూర్చారు.

దేవులపల్లి కృష్ణశాస్ర్తిగారు సహజంగా భావ కవి. సరళ లాలిత్య పదాలతో ఆయన తన రచనా వ్యాసంగాన్ని కొనసాగించేవారు. ఆంధ్రాషెల్లీగా ప్రసిద్ధులు. ఆయన సాహిత్యం “ఇక్షురసార్ణవం” వంటిదని శ్రీశ్రీ ప్రశంసించారు.ఈ పాటలో నాయిక తన భావోద్వేగాన్ని, హృదయ స్పందనను అందరికి అర్థమయ్యే విధమైన సరళ పదాలతో పాడుతూ, నటిస్తూ సన్నివేశాన్ని రక్తి కట్టిస్తుంది. 70 సంవత్సరాలైనప్పటికి ఈ పాట ప్రజలలో పాతుకుపోవడానికి కారణం కవి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారే కారణం.

-ఏలూరు అశోక్ కుమార్ రావు

ప్లాట్ నెం. 203, ద్వారకా గ్రాండ్ రెసిడెన్సీ,
రోడ్ నెం. 8, యాదవ్ నగర్,
అలకాపురి, హైదరాబాద్ – 500102
+91-9440575028

June 2, 2021 1 comment
1 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

సుగంధ పరిమళం

by డా|| మృదుల నందవరం June 2, 2021
written by డా|| మృదుల నందవరం
సామాజిక అంశాలు ఉన్న ప్రముఖమైన శ్లోకాలను గాని పద్యాలనూ గాని విశ్లేషించుకోవటం ఈ శీర్షిక ఉదేశ్యం

శ్లోకం:
ప్రథమవయసి పీతం తోయమల్పం స్మరంతః
శిరసి నిహితభారా నారికేళా నరాణాం
సలిల మమృతకల్పం దద్యు రాజీవితాంతం
నహి కృత ముపకారం సాధవో విస్మరంతి

(శ్లోకం సేకరణ: సూక్తి ముక్తావళి – సంకలన కర్త మహీధర జగన్మోహన రావు)

భావం: ఎప్పుడో చిన్నప్పుడు పోసిన నీళ్లను తాగి,ఆ మేలు మరచి పోలేక, కొబ్బరి చెట్టు నీటితో నిండిన బరువైన కాయల్ని తలమీద మోస్తూ జీవితపర్యంతమూ మానవులకు తియ్యటి నీటిని అందిస్తూ ఉంటుంది.ఆహా! సజ్జనులు ఎదుటి వారి నుండి ఎంత చిన్న ఉపకారం అందుకున్నా దానిని మరచి పోకుండా పరులకు తిరిగి ఉపకారం చేయాలనే ఆలోచన కలిగి ఉంటారు.

అన్వయం: ప్రకృతి , మనిషి నుండి ఏ కాస్త సహాయం అందుకున్నా ఋణం తీర్చేసుకుంటుంది. మళ్లీ ఇటువంటి స్వభావం సజ్జనులకే ఉంటుంది.ఈ లక్షణం మానవులందరూ అలవరచు కుంటే మనం ప్రకృతిలో మ మేకమైనట్లేకదా!

మనిషికి ఉండవలసిన లక్షణాలలో ప్రథమమూ,ఉత్తమమూ అయినది -కృతజ్ఞత.ఈ స్వభావమే మనిషిని ఉన్నతమైన స్థానం లో నిలబెట్టుతుంది.తల్లిదండ్రులు, గురువులు, స్నేహితులు,బంధువులు వీరందరి పట్ల కృతజ్ఞత కలిగిఉండాలి.ఎందుకంటే , మనం పుట్టిన దగ్గర నుండి మనం ఎదుగుదలకు వీరు మనకు సహాయం చేసిన వారే.వీరందరినీ మనతో పాటు నిలబెడుతూ , మనకొక స్థాయిని కల్పిస్తున్న ఈ సమాజానికి మన మెప్పుడూ ఋణపడి ఉండాలి.

 

Image of Dr. Kalamసమాజ ఋణం తీర్చుకొనేందుకు మనశక్తియుక్తులను … బౌద్ధిక ప్రమాణాలస్థాయిననుసరించి ఏ రంగాలలో మనం వికాసప్రగతిని సాధించినామో ఆ రంగంలోనే ఇతరులకు సహాయసహకారాలు అందించవచ్చును. తరాల అంతరాలను తగినవ విధంగా పూరించటంలో మనవంతు కర్తవ్యాన్ని నిర్వహించటం కృతజ్ఞతా పూర్వకంగా మన పూర్వులనుండి పొందిన స్ఫూర్తిని జాతినిర్మాణపరమైన కృషికి కృతజ్ఞతాసమర్పణమే ఔతుంది. కృతకృత్యుల కృషిని వారి పేరున స్మరించటమే వారి కీర్తిగీతికి మనం సమకూర్చే ఆకర్షణీయ వాద్యసంగీతం.

-డా|| మృదుల నందవరం
తెలుగు అసిస్టెంట్ ప్రొఫెసర్,
డిగ్రీ కాలేజీ (విమెన్), బేగంపేట్
+91-9441408393

June 2, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

ఆర్ద్ర చిత్తుడు సాగర్ సర్హదీ

by వారాల ఆనంద్ June 2, 2021
written by వారాల ఆనంద్
హైదరాబాద్ అమ్మాయిల ‘బాజార్’ ను ఆవిష్కరించిన సాగర్ సర్హదీ

 

File picture: Sagar Sarhadi

తెలంగాణా సినిమా అనగానే మనకు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణాకు హైదరాబాద్ కు పేరు తెచ్చిన పలు సినిమాలు, ఆ సినిమాల దర్శకులూ గుర్తొస్తారు. వారిలో గౌతం ఘోష్ ‘మా భూమి’, శ్యాం బెనెగల్ ‘అంకూర్’, ‘నిశాంత్’, ‘మండి’, బి.నరసింగ్ రావు’ దాసీ’ , బి ఎస్. నారాయణ ’నిమజ్జనం’, ‘ఊరుమ్మడి బతుకులు’ ఇట్లా అనేకం గుర్తొస్తాయి. వాటిలోని కళాత్మకతతో కూడిన వాస్తవికత మనల్ని అబ్బురపరుస్తుంది. అవి విశేష ప్రశంసల్నీ అవార్డుల్నీ గెలుచుకుని తెలంగాణా ఉనికిని ప్రపంచానికి చాటాయి. అలాంటి ఇంకో ప్రయత్నం చేసి విజయమ సాధించినవాడు సాగర్ సార్హది. ఆయన తీసిన ‘బాజార్’ కళాత్మకంగానూ వ్యాపారాత్మకంగానూ గొప్ప విజయాన్ని అందుకుంది. ఆ దర్శకుడు సాగర్ సర్హది ఈ నెల 22న తన 87సంవత్సరాల వయసులో ముంబైలో మరణించాడు. హైదరాబాద్ లోని పేద ముస్లిం తల్లిదండ్రులు పదహారేళ్ళ వయసున్న తమ కూతుళ్ళని కేవలం డబ్బు కోసం ముసలి అరబ్ షేఖ్ లకు ఇచ్చి పెళ్ళిళ్ళు చేస్తున్నారని ఇది ఒక రకంగా అమ్మాయిల్ని అమ్మేయడమే నని ఒక ఆంగ్ల పత్రికలో వచ్చిన వ్యాసం చూసి సాగర్ సర్హదీ ఆవేదనచెందాడు ప్రభావితుడయ్యాడు. ఆ అంశం పై తాను రూపొందించిన సినిమా ‘బాజార్’. ఆ వార్త చూసిన సాగర్ సర్హది స్వయంగా హైదరాబాద్ కు వచ్చి అనేక మంది రచయితల్నీ, జర్నలిస్టులనీ కలిసి వాస్తవ వివరాలు సేకరించడంతో పాటు అలాంటి ఒక ముస్లిం కుటుంబం వారి పెళ్లిలో కూడా పాల్గొన్నాడు కూడా. అట్లా రిసర్చ్ చేసి రూపొందించిన స్క్రీన్ ప్లే చూసిన సాగర్ మిత్రులు అది వర్క్ అవుట్ కాదు వదిలేయమని చెప్పినా మొండిగా ‘బాజార్’ సినిమాను నిర్మించాడు. నిర్మాణం పూర్తి అయిం తర్వాత విడుదల చేసేందుకు పంపణీదారులెవరు ముందుకు రాలేదు. కానీ ఒక సారి విడుదలయ్యాక 25 వారాలు ఆడి జుబ్లీ చిత్రంగా నిలబడింది. బజార్ సినిమా మొత్తం హైదరాబాద్ సంస్కృతి, ముఖ్యంగా పేద ముస్లిం కుటుంబాల జీవితాలని అత్యంత వాస్తవికంగా ఆవిష్కరిస్తుంది. నటీ నటులు నసీరుద్దీన్ షా, స్మితా పాటిల్, ఫరూఖ్ షేఖ్, సుప్రియా పాథక్ లు ఆయా పాత్రలకు జీవం పోశారు. ఇక ఖయ్యాం సంగీతం బాజార్ సినిమాకు పెద్ద అలంకారంగా చెప్పాలి.

ఇట్లా హైదరాబాద్ నగరాన్ని ఈ నగరపు పెదజీవితాల్ని వారి నడుమవున్న అనుబంధాల్ని ఆవిష్కరించిన దర్శకుడు సాగర్ సర్హది గొప్ప విజయ వంతమయిన స్క్రీన్ ప్లే రచయిత. హిందీ సినిమాల్లో దశాబ్దాల క్రితం ఒక నూతన ఒరవడినే సృష్టించిన ‘కభీ కభీ’, ’సిల్ సిలా’ లాంటి సినిమాలకు ఆయన రచన చేసారు. అలాంటి సినిమాల్లో నటించిన అమితాబ్ బచ్చన్ ఏ స్థాయికి ఎదిగాడో మనకు తెలుసు. తర్వాత నూరీ, చాందిని, కహో నా ప్యార్ హాయ్ లాంటి సినిమాలకు కూడా సాగర్ సర్హదీ రచన చేసారు. తన ప్రతిభతో అద్భుతమయిన విజయాల్ని సాధిస్తున్న కాలంలో కూడా వ్యాపార సినిమారంగంలో అంతగా ఇమడలేక నిశ్శబ్దంగా ఉండిపోయాడు సాగర్.

వాస్తవానికి సాగర్ సర్హదీ 1933లో అవిభాజ్య భారత దేశంలో అబ్బోతాబాద్ కు దగ్గరలో వున్న బాఫా నగరంలో జన్మించాడు. గంగా సాగర్ తల్వార్ అతని మొదటి పేరు. దేశ విభజన వారి కుటుంబాన్ని అతలాకుతలం చేసింది. స్వంత వూరు నుంచి వలస వెళ్ళాల్సిన స్థితి. ఆరేళ్ళ వయసులోనే తల్లిని కోల్పోయిన సాగర్ తర్వాత తాను దేశ సరిహద్దుకు చెందిన వాడిని అని సూచించేందుకు తన పేరును సాగర్ సర్హదీ గా మార్చుకున్నాడు, తొలుత ఉర్దూ కవిగా తన సృజన జీవితాన్ని ఆరంభించిన సాగర్ ఆనాటి ప్రగతిశీల రచయితలయిన కైఫీ అజ్మీ, సజ్జద్ జహీర్ ల ప్రేరణతో ప్రగతిశీల భావాల పట్ల ఆకర్షితుడయ్యాడు. కాలేజీ రోజుల్లో గుల్జార్ తనకు సీనియర్. ఉర్దూలో ప్రావీణ్యం సాధించి కథలు నాటకాలు రాయడం ఆరంభించాడు. ఒక రోజు తన నాటకం మీర్జా సహేబాన్ ప్రదర్శిస్తూ వుండగా ప్రేక్షకుల్లో వున్న యాష్ చోప్రా తన సినిమాలకు రాయమని అడిగాడు అట్లా రూపొందిందే ‘కభీ కభీ’ అట్లా పెద్ద సినిమాలకు రచన చేసినా సాగర్ మనసంతా వాస్తవిక సినిమా ప్రపంచం వైపే ఉండింది.

అనంతర కాలంలో 1992లో సాగర్ సర్హదీ ‘దీవానా’ సినిమాతో షారుఖ్ ఖాన్ కారీర్ ని, 2000లో ‘కహోనా ప్యార్ హై’ సినిమాతో హ్రితిక్ రోషన్ కారీర్ ని విజయాల బాట పట్టించిన సాగర్ సర్హదీ ఒక పంపిణీ దారుడుచేసిన మోసంతో ఆర్థికంగా నష్టపోయి మౌనంగా ఉండిపోయాడు. ఇవ్వాళ మంచి కథ కథానాలతో కాకుండా కేవలం సాంకేతిక హోరుతో సినిమాలు రావడమే బాధగా వుంది అన్న సాగర్ సర్హదీ చివరంటా కథలూ కవిత్వమూ చదువుతూ కాలం గడిపాడు. తాను అవివాహితుడిగానే జీవితాన్ని ముగించాడు. హైదరాబాద్ జన జీవిత కథను ‘బజార్’ సినిమా గా రూపొందించిన సాగర్ సర్హదీ ని సీరియస్ తెలంగాణా సినిమా అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. తమ హృదయ పూర్వక నివాళి సమర్పించుకుంటున్నారు.

(దర్శకుడు సాగర్ సర్హదీ 22 మార్చ్ 2021 న ముంబైలో మరణించారు)

-వారాల ఆనంద్
కవి, సినీ విమర్షకులు, జాతీయ ఫిల్మ్ సొసైటీల సమాఖ్య కౌన్సిల్ సభ్యులు

8-4-641,
Hanuman Nagar,
KARIMNAGAR -505001 TELANGANA
+91-9440501281

June 2, 2021 1 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

సామాజిక భిన్న పార్శ్వాల కవిత్వం

by జయంతి వాసరచెట్ల June 2, 2021
written by జయంతి వాసరచెట్ల

తెలుగు సాహిత్యంలో తనదైన ప్రత్యేక ముద్ర వేసుకొని రచనలు చేస్తూ తెలుగు సాహితీ వనం ఫేస్ బుక్ సమూహాన్ని క్రమీకరిస్తూ సాహితీ పోటీల ద్వారా యువ కవులను ప్రోత్సహిస్తూ తనవంతు సాహిత్య సేవ చేస్తున్నారు శాంతి కృష్ణ. పచ్చని ప్రకృతిని చూసి తన భావాలన్నీ మునివేళ్ల లోని కలం నుండి జారి అక్షర రూపం పొంది మన కళ్ళముందుకు వచ్చి కనువిందు చేస్తున్నాయి. ఆ అక్షర ప్రవాహపు ఝరి నుండి వెలువడిందే శాంతి కృష్ణగారి మొదటి కవితా సంపుటి “చినుకు తాకిన నేల” సున్నితమైన భావాలతో సమాజంలోని విభిన్న పార్శ్వాలను స్పర్శించి తన అక్షరాలతో సంధించిన 70 కవితల సమాహారం చినుకు తాకిన నేల. మొదటి కవిత గురువంటే నాన్నే, చివరి కవిత తెలుగంటే వెలుగు.

నేస్తమా ……/వసివాడిన పువ్వుల్లాంటి/ అనాధ బాలలను ఎపుడైనా చూశారా ……/……/సమాజం ముందు ఖాళీ విస్తరిలా/ జవాబు కోరే ప్రశ్నలుగా/ ఎలా దరినమిస్తారో/…../ కాసింత నీ సాయానికే/చిగురించిన కొమ్మల్లా/ పచ్చదనాన్ని రాసుకొని /పసిడి మొక్కలవుతారు (చినుకు తాకిన నేల )తల్లిదండ్రులు లేక ఆదరణ కరువైన అనాధ చిన్నారులకు వీలైనంత ఆదరువు కమ్మని అదే దేశాన్ని ప్రేమించడం అంటారు కవయిత్రి. ఈ కవిత చదువుతూంటే కవయిత్రి హృదయం ఎంత సున్నితమో తేటతెల్లమైంది. *ఏడబోయిందో నా పల్లె కానరాకుంది /పండువెన్నెల్లో మెరిసేటి ఇసుక తిన్నోలే/ కలనేత చీరలో కులికేటి నాయుడు ఎంకల్లే (నా పల్లె ) పచ్చని ప్రకృతి మధ్య ఆప్యాయతానురాగాలు పంచేటి ఆ నాటి పల్లె ….సంక్రాంతి వేళల్లో రంగుల ముగ్గులతో భోగిమంటలతో సందడిగా ఉండేది. పచ్చదనం మాయమై పంటలు లేక గుండె బరువెక్కిన రైతన్న దీనావస్థ లో నీరసించింది. అంటూ ఆనాటి పల్లె చిత్రాన్ని హృదయం లో ఆవిష్కరించి అది ఎక్కడుంది అని తనను తాను ప్రశ్నించుకుంటుంది. *ఆకలి చేసే పేగుల సంగ్రామంలో /యాచకులమై తిరిగే అనామకులం/ మీరు వేసే ఛీత్కారపు దానాలను ఆశీర్వదిస్తూ తీసుకుంటాం …….(మొగలిరేకులం) అనాధగా మిగిలిన అభాగ్య చిన్నారుల పక్షాన నిలబడి వారి ఆర్తిని తన కవితలో అక్షరీకరించారు.

*చీకటి మరకల్ని /తుడిచే పువ్వొకటి /తూరుపు కొండల్లో /పుష్పించేవేళ/ / గుడ్డి దీపపు వెలుగులో /……/ముడుచుకున్న పసికందులెన్నో (రేపటి పువ్వు )వసివాడని పసిబాలలు దిక్కు లేని వారుగా వీధుల్లో తిరుగుతూ ఆకలి ప్రేగులను చల్లార్చుకునేందుకు ఎన్ని పరుగు లో రేపటి రోజు బాగుంటుందని ఆశతో వారు బతుకీడుస్తున్నారు. అంటూ కవయిత్రి వీధిలోని అనాధ బాలల భవితవ్యాన్ని ప్రశ్నిస్తున్నారు. *……./మంగళకరమై తిరగాల్సిన మా లక్ష్మి/ తాచు పామై బుస కొట్టిన ఏ మగతనానికి/మతి కోల్పోతుందో…../……/…..ఉరికొయ్య కూడా మరణిస్తుందేమో) వాడి దేహాన్ని మోసిన పాపానికి( మృగాడు ) నేటి సమాజంలో స్త్రీల మనుగడ ఎంత కష్టతరంగా ఉందో పసిపిల్లలు మొదలు వయసుతో తారతమ్యం లేకుండా మృగాళ్ళకు ఎలా బలవుతున్నారో హృదయ విదారక మైన పరిస్థితిని ఎండగడుతుంది. ఇంకా, రావణున్నే గొప్పవాడు గా కీర్తిస్తూ…. సీత అనుమతి లేనిదే తాకనైనా తాకలేదు అని అంటుంది. నేటి కొంతమంది పురుషులను మృగాలు అనడానికి అయినా నోరు రావటం లేదని మృగాలు కూడా వాళ్లకు తమ పేరును ఆపాదిస్తే తిరగబడతాయని అంటున్నారు కవయిత్రి . *…….చెక్కుచెదరని ఆత్మవిశ్వాసానికి/ చిరునామా ఆమె …/ చెక్కిన నిలువెత్తు శ్రమజీవి ఆమె /……/ఆరు పదుల వృద్ధ వనిత ఆమె /……./(ఓ అమ్మ) కవితలో రోడ్డు పక్కన తెగిపోయిన చెప్పులు కుట్టి పొట్ట పోసుకునే ఒక దీనస్థితిలో కూర్చుని గిరాకీ కోసం చూస్తున్న ఒక వృద్ద మహిళ స్థితిని తనను ఎవరూ పట్టించుకోక షో రూమ్ వైపు పరుగు తీసే జనాల ఉన్న తనాన్ని తన కవితలో వర్ణించారు. ప్రస్తుతం ఆ స్త్రీ కవయిత్రి కంటికి మేరునగములా కనిపిస్తుందని అబ్బుర పడుతున్నారు . *అక్క పంపే రాఖీలన్నీ / లెక్కకు మించుతున్నాయి/ అవి నీ పక్కన చేరేందుకు/ చుక్కల వుతున్నాయి( రాఖీ)పేగు పంచుకుని పుట్టిన తోడు …ఎన్నో అల్లర్లు రాఖీ పండుగ సంబరాలు ఎన్ని జ్ఞాపకాల దొంతర్లో మిగిల్చి కనిపించకుండా మబ్బుల్లో చందమామ లా మారిపోయి .అక్క పంపే రాఖీల నీ చుక్కలు అయ్యాయని తన వేదనలో తన తమ్ముడిని యాది చేసుకుని మూగగా రోదిస్తోంది. *………/…../నిన్ను మోసే భూమికి/ నిప్పుపెట్టి నిలుచున్నావు/ పరుగెత్తే మేఘానికి /కళ్లెం వేయాలని చూస్తున్నావు( ఆహ్వానం)

ఒక అతీతమైన శక్తి కొత్త ఆవిష్కరణలు ఎన్నో చేస్తూ తన గొప్పతనానికి తానే మురిసి మైమరచిపోతున్నాడు. అభివృద్ధి పేరుతో దాదాపు అదఃపాతాళానికి పోతుంటాడు. సాంప్రదాయ పద్ధతులను విడిచి ఫ్యాషన్ పేరిట నూతన ఆవిష్కరణలు చేస్తుంటారు. ప్లాస్టిక్ కవర్ల వాడకం తో కలుషితం పెరిగిపోతుందని మన పర్యావరణం కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుందని జ్ఞానబోధ చేస్తున్నారు కవయిత్రి . *……./ఆ గోడలకుఎప్పుడూ అలవాటే /ఆ నవ్వుల చప్పుడు మోయడం/ ఆ నవ్వు వాళ్ళది కాదు /పసికూనల్లా మారాం చేస్తున్నాయి ….(పగిలిన మనసుల నవ్వులు ) *పసిపాప లూ, పువ్వుల నవ్వులు ఎంత స్వచ్ఛంగా ఉంటాయి …..!చూసేవారికి మనసు హాయిగా సేద తీరుతుంది.అదే పశుత్వానికి గురైన స్త్రీ అదేపనిగా నవ్వుతుంది. ఇదీ నవ్వే కాని ఇందులో స్వచ్ఛత లేదు విరిగిన గుండె ఘోష పెదాలపై పూస్తుంది విచక్షణ కోల్పోయింది అంటున్నారు కవయిత్రి . ……/మబ్బులన్నీ రేయికి/ మేలి ముసుగుతో ముస్తాబు చేస్తుంటే /చుక్కలన్నీ నింగినెక్కి /చిన్ని వెలుగును /చీకటికి అద్దుతున్నాయి( చీకటి రేయి) చుక్కలు ఆకాశంలోకి వెళ్లి వెలుగును చీకటికి అద్దుతాయట ఎంత చక్కటి భావన …! *……./హృదయమా /నువ్వు పదిలమే కదా…..!./ కాసింత మనసు నలత పడితే /నీ వేగం తగ్గించకు/అవధులు దాటిన ఆనంద క్షణాలలో నీ వేగం పెంచకు ….‌(హృదయమా!) హృదయానికి జాగ్రత్తలు చెప్తున్నారు కవయిత్రి. ఎంత సున్నిత హృదయం తనది అనిపిస్తుంది. *….. /తేనెలూరు కొమ్మకు పూసిన/ తీయనైన పువ్వులా/ మాతృభాష నాతోనే ఎదిగి /నాముందిపుడు ప్రతిబింబమై నిలిచింది /……/నేర్చుకో వేలవేల భాషలు/ కానీ దాచుకో గుండెలో/ నీ తెలుగు భాషపై ప్రేమలు /(తెలుగు సవ్వడి)అన్యభాషలు ఎన్నైనా నేర్చుకోండి మన మాతృభాష ను మాత్రం మరవకండని హితవు చెబుతున్నారు. *నన్ను నేను మరచి పోతుంటా…../ పుస్తకం లో దూరి మమేకమై పోయినప్పుడు/……/ ప్రేమిస్తూ ఉంటా /జారే కన్నీటి చుక్కను /అది స్నేహంగా ఒడిసి పట్టుకున్నప్పుడు (మరో ప్రపంచం) అనే కవితలో పుస్తకం ఎంత మంచి స్నేహితుడు అనుక్షణం మనల్ని కనిపెట్టుకుని ఓదార్పు నిస్తుంది అని చెప్తుంది. * రక్తపాతాలేడున్నాయ్ మా రాయలసీమలో /మీరు సృష్టించిన చిత్రాలలో తప్పా/….. / కన్నీళ్లతో సీమను వదిలి /ఎడారి దేశాలకు గులాము చేయనుపోతున్న/గరీబు నేల మాది (రగిలే హృదయం ) రాయలసీమ అంటేనే రక్తపుటేరులు పారే ప్రాంతమని సినిమాల్లో పాశవికంగా చూపించి జనాలను తప్పుదోవ పట్టిస్తున్నారని తినడానికి తిండి లేక నిరక్షరాస్యతతో పేదరికం అనుభవిస్తున్న ప్రజలపై కనికరించి వారి జీవితాలను ప్రతిబింబించేలా సమాజానికి తెలియజేయాలని ఆ ప్రాంతపు ప్రజలకు చేయూతనివ్వాలని వేడుకుంటున్నారు కవయిత్రి.

*ఎన్ని సొబగులో చీరకట్టు లో /ఎంత జాణతనమో ఆకనికట్టులో /ఎంత మాతృత్వమో ఆచీరకొంగులో /ఎన్ని వర్ణాలో ఆ సౌభాగ్యం లో (ఎన్ని సొబగులి) మన భారతీయ సంస్కృతిలో చీరకట్టు కోవడం సంప్రదాయం అందులోనే గౌరవం దైవత్వం కనిపిస్తాయి .అదంతా ఎంత అద్భుతంగా ఉంటుందో కదా అని అంటున్నారు . *ఒక్కోసారి భరించలేని /వర్తమానపు క్షణాల నుండి/ పరుగులు తీస్తుంది మనసెందుకో /బాల్యపు పరదాలు తీసి /బంగారు లోకం లోకి(మరలి రాని స్వప్నం ) *బాల్యపు స్మృతుల వెంట పరుగులు తీస్తుంటే చిన్నతనంలో కి ఒక్కసారైనా వెళ్లి రావాలని అనిపిస్తోంది. పక్షిలా రెక్కలు కట్టుకొని ఎగరాలని అనిపిస్తుంది. అమ్మా నాన్నలతో గారాలు పోవాలనిపిస్తుంది. కానీ అదంతా తిరిగి రాని గతం అనే సత్యం తెలిశాక ఆనందం ఆవిరైపోతుంది. ఉద్యమానికి పరాకాష్ఠ/ ఊపిరి తీసుకోవడమే నా/……/కన్నీటి సంద్రమవదా నీ కుటుంబం …./…../(నీ విజయం ) ఆర్టీసీ కార్మికులు సమ్మె కాలంలో చేసుకున్న ప్రాణ త్యాగాలను చూసి చలించి …..ప్రాణత్యాగం చేసుకున్నంత మాత్రాన సరిపోదు ధైర్యంగా నిలబడి పోరాటం చేస్తే సాధించిన విజయాన్ని కళ్ళతో చూడొచ్చు అంటూ హితవు చెబుతున్నారు. *ఉగ్రవాద చర్యలకు ఊతమివ్వకుంటే/ ఊరికి వచ్చే జలపాతపు/సవ్వడే కదా శాంతి( ప్రపంచ శాంతి ) నాగరికత సమాజంలో ఈ అనాగరిక చేష్టలు మానాలని ప్రతి ఒక్కరూ సోదరభావంతో మెలగాలని కులమతాల భేదభావాలు మరిచిపోయి శాంతి మంత్రం జపించాలని అందువల్ల ప్రపంచ శాంతి చేకూరుతుందని హితవు చెబుతున్నారు కవయిత్రి. వినీల ఆకాశంలో /ఎగిరే విహంగాలు/ విశ్వకవి రవీంద్రుని/ ఎదలోని భావాలు /(అక్షర సుమాంజలి) విశ్వకవి రవీంద్రుని పై రాసిన కవితలో వారిని అద్భుతంగా ఆవిష్కరించారు. *ఇలా చినుకు తాకిన నేల కవితా సంపుటిలోని ప్రతి కవితా పూల సుగంధాలను వెదజల్లినట్లు అలతి పదాలతో చక్కగా ఆవిష్కరించారు.కవిత్వమే కాక గజల్స్ ,రుబాయీలు, బాలలగేయాలు ,మినీకవితలు ,పుస్తక సమీక్షలు ,కథలు మొదలైనవి శాంతి కృష్ణ గారి రచనలు. ఇప్పటి వరకు ఎన్నో పురస్కారాలు పొందారు.” చినుకు తాకిన నేల” కవితా సంపుటికి “గిడుగు రామ్మూర్తి సాహిత్య పురస్కారం 2021 “అందుకోవడం జరిగింది.నిరంతరం సాహితీ సృజన చెయ్యాలని తపించే శాంతి కృష్ణ గారికి మున్ముందు తననుకున్న ఆశయం సిద్ధించాలని కోరుకుంటూ శుభాకాంక్షలు.

-జయంతి వాసరచెట్ల
ఎంఏ.బిఇడి
వృత్తి: తెలుగు ఉపాధ్యాయిని
ప్రవృత్తి: కవిత్వం, కథలు, పుస్తక సమీక్షలు
పుట్టిన స్థలం: మహబూబ్ నగర్ జిల్లా
నివాసం: హైదరాబాద్
తొలి కవితా సంపుటి: నేల విమానం 2020 లో ముద్రితం
+91-9985525355

June 2, 2021 0 comment
1 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

నిత్య జీవితంలో చిత్రలేఖనం

by రూపాదేవి June 2, 2021
written by రూపాదేవి
మానవ అవసరాల నుంచి పుట్టినవి కళలు, జీవుల మనోల్లాసం కలిగించేవి కళలు, సమాజ హితానికి సంధించబడేవి కళలు, జీవన గమనంలో విడదీయరాని అనుబంధం కలిగి ఉన్నవి కళలు.

లలిత కళలుగా ప్రత్యేకంగా చెప్పబడేవి సంగీతం, నాట్యం, శిల్పం, చిత్రం, కవిత్వం. ఈ ఐదింటిలో ఒకటైన చిత్రలేఖనం మనం లేచింది మొదలు నిద్రపోయే దాకా ప్రతి దాంట్లో దాని ఉనికిని చాటుకుంటూనే ఉంటదీ, ముఖ్యంగా మన భారతీయ సంస్కృతిలో మరీ ముఖ్యంగా మన తెలుగు ఇండ్లల్లో. 

చిత్రకళ లేదా చిత్రలేఖనం అనగానే అది పుట్టుకతోనే అబ్బాల్సిన ప్రతిభ, కొందరికి మాత్రమే అది వస్తుందీ అన్నదీ మనందరి అభిప్రాయం. అయితే అది కొంతవరకే నిజం. ఎందుకంటే ప్రతీ వ్యక్తీ పుట్టుకతోనే కొంత చిత్రకారుడు. భావాలకు, ఊహలకు రూపం ఇవ్వడం అలాగే ఉన్నది ఉన్నట్టుగా చిత్రించడం చిత్రలేఖనం లేదా చిత్రకళ. మరి ఇది ప్రతీ ఒక్కరూ ఎంతో కొంత చేస్తూనే వుంటారు. కొన్నిసార్లు మాటలతో వివరించడం వీలుకానపుడు గీసి చూపిస్తుంటాము. ఎప్పుడో రాతి యుగంలో గుహలలో నివసించే రోజుల్లోనే భాషా లిపి లేని నాడే ఆనాటి మానవుడు తన గుహల్లో జంతు, పక్షుల ఆకారాలు, బొమ్మలు, చిత్రాలు, గీసికున్నాడన్నది చరిత్రలో, తవ్వకాలలో బయటపడ్డ నిజం. అంటే భాషకు మునుపే చిత్రలేఖనం ఉందనేగా…  

అనాదిగా చిత్ర కళలో పురుషులతో పాటు స్త్రీలూ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. చిత్రిస్తున్నారు. పూర్వ కాలం నుంచీ కూడా స్త్రీలు తమకుతెలియకుండానే చిత్రలేఖనం తమ దైనందిన జీవితంలో, తమ దినచర్యలో భాగంగా కలిగి ఉన్నారు. పూర్వపు రోజులలో ఇంట్లో వుండే పోయ్యిని అలికి, దానికి అందమైన ముగ్గును పెట్టీ మంటను అంటించే వారు.
ఇల్లు అలికి ఇడుపులు అలికీ నానబెట్టుకున్న బియ్యం రుబ్బుకుని పిండిని బట్టలో కట్టి ముగ్గులు గీసేవారు. ఇక ధాన్యాలు నిలువచేసే గుమ్ములకు పెండతో అలికి ముగ్గులు కొట్టేవారు బొమ్మలు గీసేవారూ. కొత్త ఇళ్ళకు పూతలు పూస్తే లేదా సున్నాలేస్తే ఇంటి ఇడుపులకు బొమ్మలు వేసేవారూ, కడపల మీదా బొమ్మలు వేసేవారూ. ఇది ఇప్పటికీ ఉందీ. వాకిట్లో సానిపి చల్లి ముగ్గు వెయ్యకుండా దినచర్యనే మొదలవదు ఈ నాటికీ కూడా. ఆ రోజుల్లో అందరి ప్రధాన వృత్తి వ్యవసాయం. రైతుకు, వ్యవసాయ దారునికి ఏరువాక పున్నమి పెద్ద పండుగ. ఏరువాక పున్నమి వచ్చిందంటే ఎద్దుల ప్రదర్శన ఉండేది. వాటి శరీరం పై రకరకాల బొమ్మలు వేసీ వాటిని అలంకరించి ప్రదర్శించే వారు. ఇక పెళ్ళీలలో చిత్రలేఖనం లేకుండా పెళ్ళి తంతు అసంపూర్ణం. పందిరి నాడు గుంజల చుట్టూ చిత్రలేఖనం. ఇక పెళ్ళి పందిట్లో మైలపోలప్పుడు( పెండ్లిపిల్ల లేదా పెండ్లిపిల్లగాడికి నలుగు పెట్టే టప్పుడు), తాళి కట్టే తంతు అప్పుడు వేసే శాశ ముగ్గు (పెళ్ళి పీటల కింద మొదటగా గొంగడి లేదా జంపకన వేసీ దానిమీద బియ్యంతో వేసే ముగ్గు) గీయనిదే పెళ్ళి పీటలు వెయ్యరు. అలాగే పూజలూ, శుభకార్యాల్లో ముగ్గు వెయ్యకుండా ఏదీ ఆరంభం చెయ్యరు. వెనకటి రోజుల నుంచీ కూడా ఆడవారికీ మైదాకుకూ (గోరింటాకు) విడదీయరాని బంధం ఉంది.. 
ఈ రోజుల్లో చేతులపై, పాదాలపై, ఇంకా చెప్పాలంటే ఒంటిపై మెహందీ చిత్రాలుగా కూడా వేసున్నారు. వస్త్రాలపై వేసుకునే లతలు, పూలు, ఆకారాలు, డిజైన్ ల ప్రింట్లు చిత్రకళనే..
పూర్వకాలంలో దూతల ద్వారా, పక్షుల ద్వారా పంపే లేఖలు లేదా గుప్త లేఖలలో సందేశం చిత్రాలు గీసి గుర్తులుగా, చిహ్నాలుగా పంపేవారు. అంటే సందేశాన్ని చిత్రాలుగా లిఖించి పంపే వారు. అందుకేనేమో చిత్రలేఖనం అంటారు. ఆ చిత్రలేఖనమే లేదా చిత్రలిపినే నేటి లిపికి దారి తీసింది. అంటే ప్రపంచంలో అన్ని లిపులకూ చిత్రకళనే ఆద్యమన్నమాట. భాష చిత్రాలకు దారితీస్తే, చిత్రాలు లిపికి, లిపి సాహిత్యానికీ, సాహిత్యం ద్వారా తిరిగి చిత్రాలు జీవం పోసుకున్నాయి. దీనిద్వారా చిత్ర కళకూ సాహిత్యానికీ సంబంధం వేరుపరచ రానిది అని చెప్పొచ్చు. సాహిత్యంలో ఊహించిన, వర్ణించిన, ప్రాంతాలూ, వ్యక్తులనూ కళ్లముందు ప్రత్యక్షం చేస్తుంది చిత్రలేఖనం. పండితులను మాత్రమే ప్రభావితం చేసేది సాహిత్యం అయితే, పండిత పామరులను ప్రభావితం చేస్తుంది చిత్రలేఖనం. సాహిత్యానికి చిత్రలేఖనం ఎంత ఊతమిస్తుందో, చిత్రలేఖనం మీదా సాహిత్యం వస్తోంది.

అలాగే ఆధ్యాత్మికత విషయంలో చిత్రలేఖనం పాత్ర చాలా ఉన్నది. హిందువులు దేవతా రూపాలను ఆరాధిస్తారు, వారు తమ ఇష్ట దైవ రూపాన్ని తమ కళ్లముందు ఉంచుకుని పూజిస్తారు. ఆ దేవతా మూర్తుల చిత్రపటాలన్నీ చిత్రలేఖనాలే కదా… భారత దేశంలో దేవతా మూర్తుల రూపాలను జనాలకి పరిచయం చేసిన ఘనత రాజా రవివర్మకు దక్కుతుంది. ఆయన పురాణాల లోని గాథల ఆధారంగా దేవతా రూపాలను జీవకళ ఉట్టిపడేలా చిత్రించి, అవి అందరికి అందుబాటులో ఉండేలా చేశారు. 
ఒకవేళ రవివర్మ అనే చిత్రకారుడే లేకపోయి ఉంటే ఈ రోజు హిందువుల ఇళ్ళల్లో పూజా మందిరాలు, భగవంతుని రూపాలు ఇలా ఉండేవి కావేమో వేరే విధంగా ఉండేవేమో… ఇక్కడ ఆధ్యాత్మికత గురించి మాట్లాడే టప్పుడు ప్రాచీన కాలం నుంచీ కూడా శిల్పకళ ముఖ్య పాత్ర వహిస్తుంది. హిందువుల దేవుళ్ళు శిలావిగ్రహల రూపాల్లో పూజలందుకునే వారు. అయితే శిల్పకళ కూడా చిత్రలేఖనం తోనే మొదలవుతుంది. శిల్పి స్వయంగా చిత్రకారుడై ఉండవలెను, చిత్రలేఖనం తెలిసి ఉండవలెను. చిత్రలేఖనం మొదట మైండ్ లో పూర్తి చిత్రం రూపుదిద్దుకున్నాకనే కన్వాస్ పై మొదలవుతుంది.

చిత్రలేఖనం అభిరుచి గానే కాకుండా ఉపాధిగా కూడా చాలా మందికి ఆధారమై ఉన్నది. డ్రెస్ డిజైనింగ్ ఈ రోజుల్లో చాలా పెద్ద ఉపాధి రంగం. ఓ కొత్త మోడల్ డ్రెస్ డిజైన్ చెయ్యాలంటే ఆ డిజైనర్ ముందుగ బొమ్మ గీసుకోవాల్సిందే. 
వివిధ ఉత్పత్తుల అడ్వర్టజ్మెంట్ లో భాగంగా పల్లెల్లో , పట్టణాల్లో ఇంటి గోడలపై , ప్రహరీ గోడలపై బొమ్మలు గీసి ఉత్పత్తి దారులు, చిత్రకారులు సంపాదిస్తున్నారు. ప్రభుత్వం వివిధ రకాలైన సామాజిక అంశాల అవగాహన కోసం చిత్రలేఖనం చాలా మంచి సాధనగా ఉపయోగిస్తుంది. క్రైమ్ విభానికి ఎంతో ఉపయుక్తమైనది చిత్రలేఖనం. సాక్షులు చూసిన ఆనవాళ్లు, గుర్తులు, పోలికలు ఆధారంగా నేరస్తులను గుర్తించడం గానీ , ఇన్వెస్టిగేషన్ ముందుకూ సాగడానికి గానీ సహాయకారిగా ఉంటుంది. నిర్మాణ రంగంలో ముందుగా గీసుకోకుండా ఏ నిర్మాణం నిర్మించబడదు. కొత్త ఇంటిని నిర్మించాలంటే ఇంటి నక్ష గీసుకోవాల్సిందే. ఇంటినిర్మాణంలో నగిషీలు చెక్కేవారు చిత్రలేఖనంతోనే మొదలు పెడతారు. ఇక ఆదునిక కాలంలో నిత్య జీవితంలో వాడే ప్రతీ వస్తువూ దాని డిజైన్ గీసిన తర్వాతనే తాయారు చెయ్యబడుతుంది. అవసరాలు అనుకూలంగా, ఊహలకు అనుగుణంగా మొదట చిత్రం గియ్యబడి. ఆ తర్వాత వివిధ రకాలైన మెటీరియల్స్ తో తయారు చెయ్యబడుతుంది.. ఒక రకంగా చెప్పాలంటే నిత్యావసరాల చాలా వస్తువులు పరికరాలు, సౌకర్యాలు చిత్రకారుని ఊహా శక్తి నుంచి రూపు దిద్దుకున్నవే… ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన యురోపినన్ చిత్రకారుడు మోనాలిసా సృష్టి కర్త లియోనార్డో డావిన్సీ వేసిన చిత్రాలు, ఆయన చిత్తుగా వేసుకున్న రేఖా చిత్రాలు చూసినపుడు అందులో గ్లైడర్, సైకిల్ లాంటి చిత్రాలు, యంత్రాల నిర్మాణాల రేఖా చిత్రాలు కనబడతాయి… ఆయన బహుశా ఆ నాడే గాలిలో ఎగిరే ఒక యంత్రాన్ని ఊహించి రూప కల్పన చేసి గీసి ఉంటాడు. దీనిని బట్టీ చిత్రకారుడు కేవలము ఊహా లోకంలోనే కాదూ శాస్త్రీయ దృక్పథం, తార్కికత కూడా కలిగి ఉంటారనీ అర్థం అవుతుందీ… చిత్రకారులు దార్శనికులు.

బోధనా రంగంలో తరగతి గదిలో ఎలాంటి సబ్జెక్ట్ అయినా సరే బొమ్మలతో, మ్యాపింగ్ తో చెబితే సులభంగా అర్థం అవుతుంది, ఎప్పటికీ లేదా ఎక్కువరోజులు గుర్తుంటుంది. ఈ రోజు సాహిత్య విద్యా రంగాలలో కోసం సేవలందించిన ఎంతో మంది చిత్రకారుల సేవలు గుర్తు చేసుకోదగినవి. ఉదాహరణగా చెప్పాలంటే ఆధునిక కాలంలో తొలితరం తెలంగాణా చిత్రకారులలో ఒకరైన కొండపల్లి శేషగిరిరావు గారు అందించిన పోతన ఊహా చిత్రం సాహిత్యానికే కాదూ పిల్లల పాఠ్యపుస్తకాల్లో కూడా చిరస్థాయిగా నిలిచిపోయింది.

ఇన్ని మాట్లాడి చిత్రలేఖనంలో తప్పకుండా ప్రవేశం కలిగి ఉండే చిన్నారుల గురించి మాట్లాడక పోతే అది వెలితిగా ఉంటుంది. పిల్లలకు అత్యంత ఇష్టమైన, అత్యంత ఉల్లాసాన్ని కలిగించే అంశం చిత్రలేఖనం. ప్రతి వ్యక్తీ బాల్యంలో చిత్రలేఖనాన్ని టచ్ చేసే వస్తాడు. పిల్లలకు భాష ప్రాబ్లం ఉంటుంది, రాయడానికి పదాల కొరత ఎంపిక ప్రాబ్లం ఉంటుంది కాబట్టీ వాళ్ళు తమ భావాన్ని వ్యక్తం చెయ్యడానికి, సృజనను వ్యక్తపరచడానికి చిత్రలేఖనాన్నే ఆశ్రయిస్తారు. మనందరమూ బొమ్మలు గియ్యకుండా బాల్యాన్ని పూర్తి చెయ్యలేదు అన్నది అతిశయోక్తి కాదు.

ఇలా మనిషి జీవితంలో నిద్ర లేచింది మొదలు రాత్రి నిద్ర పోయే వరకూ ప్రతీ అంశంలో చిత్రకళ దాగి ఉంది. అలాగే మనిషి పుట్టింది మొదలు ఏదో ఒక రూపంలో ఏదో ఒక అవసరంగా చిత్రకళతో సంబంధం కలిగి ఉంటాడు. చిన్నప్పుడు ఆటగా మొదలైన చిత్రకళ పెరుగుతూ పోయేకొలది అభిరుచి గానూ, అవగాహనకు గానూ , అవసరం కోసం జీవనయానంలో మనతో పాటే ఉంటుంది.

-రూపాదేవి
PhD scholar (OU),
S.A (హిందీ),
చిత్రకారిణి,
ఉమ్మడి పాలమూరు జిల్లా
+91-7330814596

June 2, 2021 1 comment
3 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

పదకిరణ కలనం

by కాటేపల్లి లక్ష్మీనరసింహ మూర్తి June 2, 2021
written by కాటేపల్లి లక్ష్మీనరసింహ మూర్తి

నియమములు

*************
పద’కిరణ’ కలనం – గడులు నింపుటకు కొన్ని సూచనలు.
1. సున్నను, ముందున్న అక్షరంతో కలిపి ఒకే గడిలో వ్రాయాలి.
2. పొల్లు అక్షరాలు .. న్, క్ ..ల వంటివి అవసరమైతే ముందున్న అక్షరంతో కలిపి ఒకే గడిలో వ్రాయాలి.
3. మీరు గడులు నింపి సరిచూసుకున్న తరువాత..
ఆ సమాధానములను ఏకాక్షరులు, అడ్డం, నిలువు లకు వేరువేరుగా ఆయా సంఖ్యలతో పట్టిక గా వ్రాసి మన ‘మయూఖ’ పత్రికకు మెయిల్ చేయండి.
అన్నీ సరియైన సమాధానములు పంపిన వారందరూ విజేతలే.
ఏకాక్షరులు
*********
10. ప వర్గంలో అనునాసికం.
13. దీన్ని రెండు సార్లు పలికితే పూవు.
16. పప్పు లో ఉన్న హల్లు.
17. మంత్రి చివర మూడు.
33. తెలుగు అక్షరమాల లో మొదటి హల్లు.
34. మడమ లో ముందు వెనుక ఉన్నది.
36. పీయూషం మధ్యాక్షరం.
39. 33 కు మహాప్రాణాక్షరము.అన్నీ ఈ వరుసలో కలిపి చదువుదాం.
””‘””””””””””””””””””””””””””””””””””””””””

అడ్డం
*****
01. భక్తులు నుదుట దిద్దుకునేది. (4)
04. వేలకువేలు ఇలా కూడా అనవచ్చు. (4)
07. సేన, గుంపు. (2)
08. ఆడ తోడు. (2)
11. తావి. (3)
14. కథ పోయే క్షేత్రం. (2)
18. రాజగోపాలాచార్యుల వారి ముద్దుపేరులో ముందు వెనుక. సర్దుబాటే. (2)
19. వేదమంత్రం, పెద్దపండు. (3)
21. వధూవరులకు నుదుట కట్టేది. (3)
23. హిందుస్తానీ సంగీతంలో పద్ధతి. గొప్ప . (3)
24. తుప్పు, మురికి. (3)
25. వెంటనే. (3)
26. మకరందాన్ని ఇచ్చే ఎర్రనిపూవు. (3)
28. బంగారం. (3)
30. కూతురు. (3)
32. మాగాణి, సమయం. (2)
35. వైణికులు వాయించేది. (2)
37. శ్రీ శ్రీ గారి ఇంటిపేరు. (3)
40. మూర కన్న చాల పెద్ద కొలత. (2)
41. పాట తిరగబడింది కట్టారంటే పరలోకానికి పోయినట్లే. (2)
43. బాలవైయాకరణి, తెనుగులో పంచతంత్ర కర్త. (9)

నిలువు
******
02. శ్రుతిలయల శబ్దం. (2)
03. ఇంట్లో ఒక వైపు గోడలేని కప్పు, లోగిలి. (3)
04. యోగి వేమారెడ్డి. (3)
05. మునగ లో మెరిసేది. (2)
06. దయ. (4)
09. నిజాంపాలనను ఎదిరించి రచనలు చేసిన తెలంగాణ ప్రజాకవి. (9)
12. సంసారమును విడిచిన వాడు. (3)
15. తేలికైన చిన్న. (2)
18. చేమకూర వారి తుమ్మెద, దీర్ఘాంత ద్విరేఫం. (2)
20. ఒకనాడు విజయవాడలో ఒక ప్రఖ్యాత వైద్యుడు, యుద్ధం. (3)
21. కరుణశ్రీ గారి కుంతీకుమారి, పదునయిదేండ్ల యీడు గల ………(3)
22. ఎటునుంచైనా కుచ్చుకునేదే. (3)
23. గొప్పతనం. (3)
26. ముచ్చట్లు, చర్చలు. (4)
27. బాట, తొవ్వ. (2)
29. ఆభరణంతో మొదలై చివర విషం కక్కే పట్నం. (3)
31. నవీన ను ముద్దుగా పిలవండి. (2)
37. శుభమస్తు! కు ముందు చెప్పే దీవెన. (3)
38. మల్లు దొర – మల్లన్న, గంటం దొర – … (3)
40. నండూరి వారి ఎంకికి, నాయుడు వరుస. (2)
42. జడలో ఏరులో చీలిక. (2)

క్రింద ఉన్న నెంబర్ కు మీ జవాబులను పంపించగలరు

-కాటేపల్లి లక్ష్మీనరసింహ మూర్తి
విశ్రాంత ఆంగ్లోపాధ్యాయులు
+91-9849082669

June 2, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

వ్యంగ్య చిత్రాలు (కార్టూన్స్!)

by మూటుపూరు విఠల్ చందర్ రావు June 2, 2021
written by మూటుపూరు విఠల్ చందర్ రావు


-మూటుపూరు విఠల్ చందర్ రావు
Tech Arch Delivery Manager, Accenture
+91-9908817120
June 2, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

చురకలు!

by కొరుప్రోలు హరనాథ్ June 2, 2021
written by కొరుప్రోలు హరనాథ్
ఉన్నమాట!

నీ హృదయం
నీ మనస్సు స్వచ్ఛందమైతే —
నీవు తప్పకుండా
ప్రపంచ
సాహస శిఖరాల్ని
అధిరోహించే
వీరుడివి శక్తిసంపన్నుడివి
అన్నమాట!

-కొరుప్రోలు హరనాథ్
ఫ్రీలాన్సర్ పోయెట్ కాలమిస్ట్
+91-9703542598
June 2, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

మన యాదాద్రి

by శ్రీ పెరంబుదూరు రాఘ‌వాచార్యులు June 2, 2021
written by శ్రీ పెరంబుదూరు రాఘ‌వాచార్యులు
శ్రీ పెరంబుదూరు రాఘవాచార్యులు గారు సుప్రసిద్ధ సాహిత్యవేత్తలయిన డా|| ఎస్. లక్ష్మణ మూర్తి

డా|| శ్రీ రంగాచార్య సోదరులయొక్క తండ్రిగారు.

శ్రీమచ్ఛ్రీ రత్నగర్భా హృదయ సరసిజాత ప్రభా భాను బింబం
కంపా కంపానుకంపా మృత రసభరితాహ్లాద ప్రహ్లాద డింభం
శుంభ త్సంరంభ గంభీర తనురుచి ప్రాప్ప డంభోదకాండం
వందే యాదక్షమాభృత్కటక పటు భుజారంహ లక్ష్మీనృసింహమ్!

– శ్రీ పెరంబుదూరు రాఘవాచార్యులు

కనువిందు చేయబోయే యాదాద్రి చిత్రం

తాత్పర్యం : శ్రీ మంతురాలైన లక్ష్మీదేవి (రత్నగర్భ) యొక్క హృదయ కమలాన్ని వికసింపజేయగల కాంతిమంతమైన భాను బింబమైనవాడు ; అతివేగంగా కదలగలవాడు – స్థిరమైనవాడు – తన అనుకంపా (కరుణా) మృతరసాన్ని పరిపూర్ణంగా నింపడఁచేత ఆహ్లాదాన్ని (సంతోషాన్ని) కలిగిన ప్రహ్లాదుడనే శిశువు కలవాడు ; ప్రకాశవంతమూ – పరాక్రమశీలమూ అయి గంభీరమైన తన శరీరకాంతి అనే వర్షాకాల మందలి మేఘ సమూహం వంటివాడు; యాదాద్రిపై నెలకొన్న తన పటుతరమైన భుజబలాన్నీ, వేగాన్నీ చూపుతున్న శ్రీ లక్ష్మీనృసింహస్వామిని నమస్కరిస్తున్నాను.

విశేషాలు : శ్రీ లక్ష్మీ నృసింహస్వామి దుష్ట (రాక్షస) సంహారం కోసం అవతరించినవాడు. లక్ష్మీదేవిని శ్రీమన్నారాయుడే తన హృదయస్థానంలో నిలుపుకున్నాడు. అటువంటి త్రైలోక్య సామ్రాజ్యలక్ష్మిని దైత్యులు తమ పాదాక్రాంతను చేసి అవమానిస్తే హరి ఊరుకుంటాడా? నృసింహావతారం ఎత్తాడు. రాక్షస సంహారం చేశాడు!
రత్నగర్భా అంటే భూమి. పర్వత, వనాదులతో కూడిన భూమి, రత్నగర్భం అంటే సముద్రం, నదీనదాలు, సరస్సులు కూడా రత్నగర్భాలే! సమస్త సృష్టి స్వరూపిణి అయిన శ్రీ లక్ష్మీదేవి యొక్క హృదయ పద్మాన్ని వికసింపచేసే కిరణాలను ప్రసరింపజేసే భాను బింబం శ్రీ లక్ష్మీ నారసింహుడు! శత్రు సంహార సమయంలో మెరుపు వలె వేగంగా కదిలే లక్షణం (కంపా) ఆయనకుంది. అట్లాగే శ్రతువు ఎంత బలవంతుడైనా చలించకుండా స్థిరంగా నిలబడే (అకంపా) లక్షణం కూడా ఆయనదే! కాని భక్తుల్ని చూస్తే ద్రవించి కరిగిపోయే కరుణాపూరిత హృదయం (అనుకంపా) ఆయన స్వంతమే1 అటువంటి కరుణా, దయా అనే అమృతరసాన్ని కురిపించడంవల్ల పరిపూర్ణమైన ఆహ్లాదాన్నీ, ఆనందాన్నీ పొందిన ప్రహ్లాదుడనే శిశువు కలవాడు శ్రీ లక్ష్మీ నరసింహమూర్తి!

చైతన్యవంతమైన (శుంభత్) పరాక్రమంతో శత్రువులపై విజృంభించిన గంభీరమైన ఆకారం ఆయనది! ఆ శరీర కాంతి వర్షాకాల మందలి నల్లని దట్టమైన మబ్బుల గుంపు (ప్రావృడం భోద కాండం)వలె ఉన్నదట! శత్రు సంహార సమయంలో తన పటుతర భుజబలవేగాన్ని (పటు భుజారంహ) చూపించిన యాదగిరిపై నెలకొన్న లక్ష్మీనృసింహ స్వామిని నమస్కరిస్తున్నాను అంటాడు కవి. ఈ చివరి పాదంలో “కొండ” అనే అర్థంలో “క్షమాభృత్” శబ్దాన్ని కవి వాడడంలో శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ఎంత క్షమామూర్తియో కూడా ధ్వనింపజేయడం కవి హృదయం! చక్కని అర్థవంతమైన పదాలతో సుందర సమాసాలను సృష్టించి కవి కవితానిర్మాణ దక్షత అనన్య సామాన్యమైనది! అటువంటి సత్కవిని కన్న తెలంగాణ నిజంగా కోట రత్నాల వీణ!

(సశేషం)

-శ్రీ పెరంబుదూరు రాఘ‌వాచార్యులు
(వ్యాఖ్యానం : బ్రహ్మశ్రీ సూలూరి శివసుబ్రహ్మణ్యం)

June 2, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
కథలు

లొట్టలు

by కస్తూరి గౌతమ్ చంద్ర June 2, 2021
written by కస్తూరి గౌతమ్ చంద్ర
“నేన్జెప్పేది చెప్పిన; ఇంగ మీ ఇష్టం”!మా నాన్న ఇట్లన్నడంటె అర్తం ఏందంటె – “ఇది నాకిష్టం లేదు; ఐనా మీరు చేస్తున్నరు – ఖబడ్దార్” అన్నట్టు! మా అమ్మ మా చిన్న మావయ్య దిక్కు పరేషాన్ గ చూశింది! అది పంతొమ్మిది వందల ఎనభై నాలుగో ఏడు. నా ఆరో తరగతి అయినంక బడికి ఎండకాలం చుట్టీలు. అప్పుడు మా అమ్మ ఒక మంచి నిర్ణయం తీస్కుంది. పంతొమ్మిది వందల డెబ్బై ఒకట్ల మా అమ్మనాన్న పెళ్ళైంది. అప్పట్ల “వివాహం విద్య నాశ్నం” అన్నట్టు మా అమ్మను బడి మాన్పించిన్రంట! ఇప్పుడు మా అమ్మ మళ్ళ పదో తరగతి పరీక్షలు “ప్రైవేట్” ల రాస్త అన్నది. దానికి మా నాన్నగూడ మద్దత్తు చూయించిండు! ఐతె నడిమిట్ల ఇన్నేళ్ళ సందు తర్వాత చదువుడు అంటె పుస్తకాల తోని మస్తు కుస్తి పట్టాలె! కాబట్టి, ఇష్టం లేకున్న గాని నన్ను చుట్టీలకి తన పుట్టింటికి పంపాల్నని మా అమ్మ అనుకుంది. మా నాన్నకి కూడ అమ్మ చదువుకోవాల్ననే ఉండె! కాని, నా మీద పాశం తోని బేచైన్ బేచైన్ ఐతుండు! “అరే…, మీరు ఫికర్ పడకుండి, బావయ్య! ఇంతమందిమి ఉన్నం గద; మంచిగ చూస్కుంటం!” అని చిన్న మావయ్య మాట ఇచ్చిండు. “ఏం చూస్కుంటరో నాకు తెల్వదుగాని, పిల్లగానికి ఒక్క ముల్లు కుచ్చుకున్నా, ఒక్క చెటాక్ బరువు తగ్గినా…, ఇంగ చూస్కో” అని మా నాన్న అన్నడు! “అట్లనే బావయ్య…, పువ్వుల్లల్ల పెట్టి చూస్కుంటం! అక్కయ్య, బట్టలు సదురు…” అని చిన్న మావయ్య అన్నడు! నేనైతె పట్టలేక ఎగిరి దుంకిన! నాకు అమ్మమ్మ ఊరికి పోవుడు చాన ఇష్టం! అది గాక అమ్మ నాన్న ఎంట ఉండరు; అంటె ఆజాద్ అన్నట్టు!
మర్నాడు చీకట్లనే లేచి, జెల్ది జెల్ది తయారై, గౌలిగూడ బస్స్టాండ్ కి పోయి, జనగాం బస్సెక్కినం. బస్సు ప్రయాణంల నాకు ఒక పరేషాని ఉండేది – అదేందంటే సిగిరెట్ కంపుకి నాకు కడుపుల తిప్పుతది; ఆగమాగమైతది! అందుకే బస్సేక్కినప్పట్నుంచి చిన్న మావయ్యదకి ఒకటే పని – ఎవ్వడన్న సిగిరెట్టు, బీడీ, చుట్ట గిట్ల బైటికి తీస్తె చాలు – లొల్లి వెట్టి డిల్లికి పంపుడే…!! బస్సు ఊపుకి ఎప్పుడు నిద్ర పట్టిందో తెల్వదు గాని, ఊరు బస్స్టాండ్ ఒచ్చిందని చిన్న మావయ్య లేపిండు. తాతయ్య కచ్చడం బండి పంపిండు. బండిల ఊరు చర్చి దాటి, వాగు కట్ట దాటి, కమ్యూనిస్టోళ్ళ కంబం దాటి, బోరు పంపు గొట్టం రాంగనె ఇల్లు ఒచ్చిందని ఎడ్లు ఒక్కటే ఉర్కుడు! చేదబాయి దెగ్గర గంగాళం ల నీళ్ళ తోని కాళ్ళు కడుక్కొన్న. ఇంటి ముందర పందిటి కిందు తాతయ్య ఉన్నడు. పోయి కాళ్ళకి దండం పెట్టిన. “దీర్ఘాయుష్మాన్ భవ! ప్రయాణం నిమ్మళంగ ఐందా కొడుకా?” అని తాతయ్య దెగ్గరికి తీస్కున్నడు. పక్కన్నుంచి పోలీస్ పటేల్ రాంచంద్రా రెడ్డి అంటుండు “పంతులు, ఈన రమమ్మ గారి పిల్లగాడా? ఎంత పెద్దోడైన్డు?” అని. షేక్ సిందు పకీర్ అమ్మద్ గూడ అక్కడ్నే ఉన్నడు. నాతోని ఉర్దుల మాట్లాడుడు ఆయినకు ఇష్టం “క్యా చోటే పంతులు! అమ్మా బావా ఖైరియత్ సె హై?” అంటె, నేను “హౌ జీ! సబ్ అచ్చే హై! హమ్ చుట్టియో కే లియే ఆయే” అన్న! బండి తోలిన ఐలయ్య మా మాటలు ఇని హైరాన్ అయిండు: “వామ్మో, గీ పంతుల్కి బాసొచ్చు గదా…” అని. రాంచంద్రా రెడ్డి అన్నడు “మరేమనుకున్నౌ…; పట్నం పిల్లలంటె మనోతు గాదు; చాకుల్లెక్క ఉంటరు”!! నేను దబ్బున ఇంటెన్కకి పోయి, “అమ్మమ్మా!!” అని గట్టిగ పట్టుకున్న! ఒంటలొండే పెరాట్టి అమ్మగారు కత్తిపీట మీద పోట్లకాయలు కోస్తున్నది; “ఏం పాపమమ్మ?! మడి, మన్ను, మశానం ఏం లేదా ఏంది?” అని ముక్కుమీద ఎలేస్కున్నది! మా అమ్మమ్మ నన్ను దెగ్గర్కి తీస్కోని… “ఆ…, ఈ కాలం పిల్లలకి గివన్ని ఏం ఎర్క లే గానీ…” అనుకుంట నన్ను గార్వం తోని ఎన్కేస్కొచ్చింది. మీద జెరిన్ని మడి నీళ్ళు జల్లుకోని, నాకు గుసగుసల చెప్పింది “లోపల అల్మారిల అప్పాలున్నై తిను పో; వొంట గాంగనె అన్నం పెడ్త”! అన్నది. నేను దుంకుకుంట ఇంట్లకు పోయి, అల్మారిల అప్పాలకోసం ఎతుకుతున్న. ఇంతల పెద్ద మావయ్య ఒచ్చిండు. “ఉన్నట్టుండి ఇంట్ల గబ్బిలాల వాసన ఒస్తుందేందా అనుకున్న! ఇప్పుడు సమజైంది.., కస్తూరోళ్ళు ఒచ్చిన్రన్నమాట…!” అన్నడు! నేను బిగ్గిత ఒర్లిన “అమ్మమ్మ చూడవే…, పెద్ద మావయ్య ఎక్కిరిస్తుండు!” అని. మా అమ్మమ్మ పెరట్లనుండి అన్నది “ఏ…, వాడు హౌల గాడు; అట్లనే అంటడు. నువ్వు ఇనకు” అని. పెద్ద మావయ్య ఎకిలిగ నవ్వుకుంట నన్ను కావలించుకున్నడు! నేనంటె ఇష్టం; కాని ఇట్లనే పరాష్కాలు ఆడుతుంటడు!ఎండకాలం సెలవులు సుకూన్ గ నడుస్తున్నై ! పొద్దెక్కినంక లేచుడు. యాప పుల్ల తోని పండ్లు తోం కొనుడు. లోటెడు చాయ్ తాగుడు. తర్వాత ఆవు దుడ్డెలకి కుడితి పోసుడు. కట్టె పుల్లల తోని విల్లు, బాణాలు చేస్కోని, యీపు మీద తువాల కట్టుకోని రాజులాట ఆడుకొనుడు. గడ్డి వాముల మక్కబెట్టిన మామిడి పండ్లు తినుడు. పగటి పూట అన్నం తిన్నంక అమ్మమ్మ తాతయ్య తోని పేకలు, వన గుంటల పీట, పచ్చీసు ఆడుడు. చందమామ, బొమ్మరిల్లు చదువుడు. సాయింత్రం కాంగనె ఉప్పుడు పిండి, బొంగు పేలాలు, అప్పలు తినుడు. మళ్ళీ లోటెడు చాయ్ తాగుడు. పొద్దుగూకే లోపల జీతగాళ్ళు పనులు చేస్తుంటె మనం గూడ ఓ చెయ్యేసుడు – అంటె ఎక్కా బుడ్డీలు ముట్టించుడు, బర్రెల్ని కొట్టంలకి తోల్కొచ్చి కట్టేసుడు, మంచాలేసి పక్కలు పర్చుడు ఇస్వంటివి. అన్నం తిన్నంక చీకట్ల పక్కలెక్కి, పాటలు పద్యాలు పాడుకునుడు. మా తాతయ్య కంచు గొంతు తోని శ్రీ కృష్ణ రాయబారం పద్యాలు పాడితె అచ్చం ఘంటసాల లెక్కనే ఉండేది! ఆఖర్న కథలు చెప్పుకుంట, చుక్కలు చూస్కుంట నిద్ర పోవుడు – ఇది నా పని! అప్పట్ల ఊరికి కరెంటే లేదాయె, ఇంగ బల్బులు, TV లు, ఫోన్లు ఐతె ముచ్చట్నే లేదు! మా దెగ్గర ఒక బ్యాటరీ రేడియో ఉండె – దాంట్లనే వార్తలు, పాటలు ఇనేది! ఏమైన బైటనే తుమ్మల్లల్ల, కొమ్మల్లల్ల తిరిగేది. అప్పుడప్పుడు ముల్లు కుచ్చుకున్నా, ఏదైన పురుగు బూచి కుట్టినా, ఎండకి ఒంట్ల వేడి జేశినా మా అమ్మమ్మ చూస్కునేది. కాని చెప్పేది “జెర్ర పైలం కొడ్కా…! నీకేమన్న ఐతె మాత్రం మీ నాయిన ఇంగ ఏం లే…, మా అందరికి గుండు గొట్టిస్తడు!” అని నవ్వుకుంట అనేది!

ఓనాడు చిన్న మావయ్య దోస్తుల యెంట తోట బాయికి ఈతకి పోతుండు. నన్ను గూడ రమ్మన్నడు. ఎంటనే అమ్మమ్మ అన్నది “ఒద్దురా, వాణ్ణి తీస్కపోకు, వానికి ఈత రాదు!” అని. పక్కన్నుంచి పెద్ద మావయ్య సర్రున అన్నడు “ఏ… మా ఊళ్ళ లత్కోర్ పోరగాళ్ళకి గూడ ఈతొచ్చు; పట్నమోళ్ళకి రాదంటె ఇజ్జత్ కా సవాల్! చల్, నీకు ఒక్క దినంల ఈత నేర్పిస్త… నడు!” అన్నడు. నాక్కొంచం రేషం పుట్టుకొచ్చింది! “ఓ…, నాకు భయమనుకున్నవా? ఇట్ల నేర్చుకుంట, చూస్కో!” అని అన్న. ఇజ్జత్ కోసం ఏదో అన్నగాని, లోపల మాత్రం మస్తు గుబులైతుండె! అమ్మమ్మ అన్నది “వారీ, నీకసలే మోటుతనం ఎక్కువ. వాన్కి ఈతొద్దు గీతొద్దు! నా మాట ఇను” అంటె, పెద్ద మావయ్యన్నడు “ఏ…, బద్రంగనే ఉంట లేవే అమ్మా! ఉట్టిగ గాదు లే – లొట్టలు కడ్త!” అని నచ్చజెప్పిండు. “లొట్టలంటె ఏంది మావయ్య?” అన్న. “బాయి దెగ్గర చూపిస్త తీ రాదు? నువ్వైతె నడు” అని తోట బాయికి తోల్కపోయిండు.

________________________________________

తోట బాయి అంటె అదొక పెద్ద దిగుడు బాయి. చిన్న మావయ్య, దోస్తులు లంగోటీలు కట్టుకోని, బాయి గట్టు మీద నిలబడి అంతెత్తు మీంచి దుంకుతున్నరు. నీళ్ళల్ల ఈదుకుంట మస్తు ఆటలు ఆడుతున్రు: ముట్టిచ్చుకునే ఆట, నీళ్ళకింద ఊపిరి బట్టే ఆట, నీళ్ళకింద మట్టి తెచ్చే ఆట…; ఇట్ల దూం మచాయిస్తున్రు. నేను బాయి గట్టున నిలవడి వాళ్ళ ఆటలు చూసి ఒకటే దుంకుడు, అర్చుడు! పెద్ద మావయ్య నా ఎచ్చులు చూసి, నేను తయార్ ఉన్న అని అర్తమైంది! “ఆ…, ఇంకేంది, దుంకు!” అన్నడు. నాగ్గూడ వాళ్ళతోని ఆడాలని ఉంది గాని, గుబుల్ తోని గుండె గుడ్ గుడ్ ఐతుంది! “ఆ, నువ్వు ఏందో లొట్టలు కడ్త అని అమ్మమ్మకు చెప్పినవు, ఏవి?” అన్న. లొట్టలంటె ఏందో తెల్వదు గాని, అవి లేకుంటె బాగుండు, మెల్లగ పిస్లాయించొచ్చు అని లోపల అనుకున్న! పెద్ద మావయ్య అన్నడు “లొట్టలంటె గివి. నడుంకి కట్టుకోని ఈత నేర్చుకుంటరు” అని చూయిన్చిండు. అవి బొంగు కట్టెల్లెక్క ఉన్నై. వాట్ని ఒక కట్ట కట్టి, ఓ చాంతాడు తోని నడుముకి కట్టుకోవాల్నట!
“ఇది కట్టుకుంటె మునిగిపోరా?” అని ఒణుకుడు కుతికె తోని అడిగిన!
“నీకు నమ్మకం లేకపోతె చూడు” అని ఒక బండరాయిని లొట్టల మీద ఉంచి కట్టి, నీళ్ళల్ల ఏసిండు. రాయి లొట్టల తోనే బుడుంగున మునిగి, దన్నుమని ఎంటనే తేలింది! పెద్ద మావయ్య అన్నడు “చూశ్నవా! ఇట్లనే నీ నడుం కి లొట్టలు కడ్త. నువ్వు అట్లనే తేల్తవు! కాల్జేతులు మాత్రం గిట్ల గిట్ల కొట్టాలె” అని గట్టిగ చేతులు, కాళ్ళు ఊపి చూయిన్చిండు! “బస్ గంతే, నీకు ఈత ఒచ్చినట్టే పో!” అన్నడు.
నా మొహం జెర్ర ఇచ్చుకుంది గాని కొంచం గుబుల్ ఇంక ఉండె! “నేను పైనుండి ఐతె దుంక!” అన్న. “ఐతె కిందికి పోదాం పటు!” అన్నడు. బాయి గోడ పొంటి మెల్లంగ మెట్లు దిగి నీళ్ళ పక్కకి ఒచ్చినం. రాంగనె పెద్ద మావయ్య నా నడుంకి చాంతాడు కట్టిండు. కట్టంగనె ఏమైందో గాని “లేడికి లేచిందే పరుగు” అన్నట్టు మస్తు జోష్ లకు ఒచ్చిన! “రెడీ స్టడీ వన్ టూ త్రీ!” అని, ఊపిరి మొత్తం బిగవట్టి, ఉరికి, నీళ్ళల్ల దుంకిన! ఖతం! ఆ మొదటి సారి ఒళ్ళు నీళ్ళల్ల మునుగుడు ఇప్పటికి యాదికున్నది! నోట్ల, ముక్కుల, కళ్ళల్ల, చెవులల్ల ఒక్కటే సారి నీళ్ళు పోయి పై ప్రాణాలు పైన్నే ఎగిరి పోయినట్టైంది! కాళ్ళు చేతులు ఆడలే…, దిమాక్ పనిజెయ్యలే! అంత నల్లగై పోయింది! దగ్గొస్తున్నది గాని అంతట్లనే మొహం నీళ్ళ కిందికి పోతుంది! అరుద్దామని నోరు దెరిస్తె జెరిన్ని నీళ్ళు లోపలి పోయి ఆగమాగమైతుంది! “ఇంగ ఐపోయింది రా దేవుడా” అనుకున్న! అమ్మా నాన్న యాదికోచ్చిన్రు! ఏడ్పొచ్చింది !! ఇంతల, గట్టు వైపు చూస్తె పెద్ద మావయ్య, చిన్న మావయ్య, ఆయిన దోస్తులు అందరు గట్టిగట్టిగ నవ్వుతున్రు. పక్కకు జూస్తె లొట్టలు అక్కడ్నే ఉన్నై! అంటె? నన్ను చిన్న పోరగాన్ని చేశి, లొట్టలు కట్టినట్టే జాదు జేసి, మొత్తం మీద లొట్టల్లేకుండనే బాయిలకు నూకిన్రన్నట్టు! ఇంగ నాకు రేషం పట్టలే! ఎట్లొచ్చిన్నో ఏమో గాని బైటికొచ్చి, గలీజ్ గలీజ్ శాపనార్దాలు ఒర్లుకుంట, పెద్ద మావయ్య పొట్టల గిప్ప గిప్ప గుద్దిన! పెద్దమావయ్యకేమో చీమ కుట్టినట్టు గూడ కాలే గాని, అందరు ఇంకా లాశిగ నవ్విన్రు ! అది చూశి నాకు ఏం జెయ్యాల్నో సమజ్ గాలే! ఏడ్చుదు శురూ చేశ్న!
అప్పుడు పెద్ద మావయ్యకు పాపం అనిపించింది! నన్ను దెగ్గరికి తీస్కున్నడు! “లే లే లే…, ఊర్కో ఊర్కో…, ఇప్పుడేమైంది? బానే ఉన్నవు గద? చిన్న పిల్లల్లెక్క ఏడుస్తరా?” అని బుజ్జగించిండు. నేను ఎక్కెక్కి ఏడ్చుకుంట “నన్ను లొట్టల్లేకుండ బాయిలకి దొబ్బినవు లే? ఉండుండు, మా నాన్నకి చెప్త! నీ లగ్గమైతది తీ!” అని అన్న!
పెద్ద మావయ్య మళ్ళ గట్టిగ నవ్విండు “ఓ…, మీ నాయిన పెద్ద తీస్ మార్ ఖాన్ తీ గాని…! ఒక ముచ్చట చెప్పు! నీకు లొట్టలు కట్టలే గద, బైటికి ఎట్లొచ్చినవు ర?” అన్నడు. నాకు షాగ్గోట్టినట్టైంది! ఆలోచించేంతల్నే మళ్ళీ అందరు నవ్విన్రు! ఈ సారి మాత్రం పెద్దమావయ్య నా తరఫ్ దారీ తీస్కోని, తత్తిమ్మా ఓళ్ళతోని అన్నడు: “ఏం రో?! పండ్లు జోర్ గ ఇకిలిస్తున్రు ! మీరందరు మొదట్ల ఇట్లనే చెయ్యలే?” అని! అప్పుడు వాళ్ళు జెర్ర గప్ చుప్ ఐన్రు! చిన్న మావయ్య దోస్తుల్ల ప్రసాదు అని ఒకడున్నడు. వాడు “మా అందరికి ఈ పంతులు గిట్లనే ఈత నేర్పిండు! ఇట్లైతెనే జెల్ది ఒస్తది, జెబర్దస్త్ గ ఒస్తది” అని అన్నడు. పెద్ద మావయ్య మస్తు షాన్ గ నవ్విండు “నేన్జెప్పలే!! ఒక్క దినంల ఈత నేర్పిస్త అనలే?!” అని అన్నడు. అప్పుడు ఇంగ నేను ఖుష్ “నాకు ఈతొచ్చిందోచ్…!!” అని అమ్మమ్మకి, తాతయ్యకి, అమ్మకి, నాన్నకి, దునియ మొత్తానికి అర్చి చెప్ప బుద్ది ఐంది !
పెద్ద మావయ్య తోని ఎదో అనాలె, కాని ఏమనాలె? షుక్రియ చెప్పుడు గూడ తక్కువ! దెగ్గరికి పొయ్యి, గట్టిగ పట్టుకున్న! మావయ్య నా నెత్తిమీద చెయ్యేసిండు!
మళ్ళ అంతల్నే పరాష్కం లకి దిగిండు. “ఇదంత ఉట్టిగ గాదు బిడ్డా! మీ నాయినకి చెప్పు, దావత్ ఇయ్యాల్నని!” అన్నడు! నేను తగ్గుతనా?! కళ్ళు తూడ్చుకుంట, నవ్వుకుంట, అదే షాన్ తనం తోని అన్న “ఇస్తం ఇస్తం…, మా హైద్రాబాద్ రా! జోర్దార్ దావత్ ఇస్తం!” అన్న! ఎంబడే, నేను చిన్న మావయ్య దెగ్గరికి పొయ్యి, చెయ్యి పట్కోని, గుంజుకుంట అన్న: “చల్, మనం నీళ్ళల్ల ముట్టిచ్చుకునే ఆట ఆడుకుందాం! నాకు ఈత ఒచ్చింది గద? ఇంగ లొట్టలొద్దు కట్టెలొద్దు…”!!

-కస్తూరి గౌతమ్ చంద్ర
Edication: MS (Syracuse University), MBA (UT Austin)
Occupation: Director of Operations at Sentient Energy (Electric Utilities Industry)
+1-972-998-7791

June 2, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • విజ్ఞానదాయకం – కె.బి.సి.
  • ఎంతగా చదివితే అంత భాషా సౌందర్యాన్ని సృష్టించుకోగలం – వి.ఆర్ విద్యార్థి
  • 12, , 14
  • క్విజ్ -3
  • ‘ఆమె’

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us