మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
కథలు

అంబారవం

by కె. వీణారెడ్డి, June 2, 2021
written by కె. వీణారెడ్డి,
‘‘వరుణ్‌’’ తల్లి పిలుపుతోో… తలుపు తీసుకొని లోపలికొచ్చాడు బయట ఆడుకుంటున్న వరుణ్‌.

‘‘మొన్న రాత్రి మనం ఫంక్షన్‌ నుండొచ్చిన తర్వాత ఈ టేబుల్‌ సొరుగులో పెట్టిన నీ చేతి బ్రాస్‌లెట్‌ కనిపించడం లేదు ఏమైంది నాన్నా?’’
పలుకలేదు వరుణ్‌.
‘‘లాకర్‌లో పెడదామని చూస్తే లేదు. ఎంత వెతికినా దొరకలేదు.. ఒక్క రోజులోనే ఇంత మటుమాయమా?’’
‘‘ఇంకెక్కడో పెట్టి మర్చిపోయుంటావ్‌…. మళ్ళీ జాగ్రత్తగా వెతుకు సంధ్యా’’ అన్నాడు భార్యతో… ఎప్పుడూ బిజినెస్‌తో బిజీగా
వుండే కోటీశ్వరుడు, నగరంలో పేరైన వ్యాపారవేత్త ప్రకాశరావు.
‘‘లేదండీ… ఈ ర్యాక్‌లోనే ఉంచాను’’ నిర్ధారణగా అంది సంధ్య.
‘‘మరోసారి సరిగా వెతుకు’’ అంటూ హాల్లో కెళ్ళాడాయన.
మేడమీది నుండి ఆయన దృష్టి వీధి గేటువైపు మళ్ళింది.
ఎదురింటి రాజయ్య తన కొడుకుతోపాటు గేటుముందు నిలుచుండడం గమనించి లోపలికి పిలిచాడు.
‘‘ఏం రాజయ్యా ఇలా వచ్చావ్‌?’’ అంటూ పకరించాడు.
‘‘ఆయ్యగారూ…’’ మెరుపులా ప్రకాశరావు కాళ్ళమీద పడి భోరున విపించాడు రాజయ్య.
‘‘ఏంటిది రాజయ్యా…’’ కంగారుగా వెనక్కి జరుగుతూ అన్నాడు ప్రకాశరావు.
‘‘మమ్మల్ని మన్నించండయ్యా’’ అంటూ ఓ కవర్‌ తీసి ఆయన చేతిలో వుంచాడు రాజయ్య.
ఆదుర్దాగా అది తీసి చూశాడు ప్రకాశరావు.
అది… అది… గదిలో తన భార్య వెతుకుతున్న రెండు తులాల బంగారు బ్రాస్‌లెట్‌!’’
‘‘ఇది…. ఇది… నీకెలా దొరికింది రాజయ్యా?’’
అదోలా అడిగాడు ప్రకాశరావు.

అందుకు సమాధానంగా, తన కొడుకును ప్రకాశరావు పాదాలమీద పడేశాడు.
‘‘అయ్యగార్ని క్షమించమని అడగరా దౌర్భాగ్యుడా!’’ అన్నాడు బాధగా రాజయ్య.
‘‘నా తప్పు కాయండయ్యగారూ…’’ ఏడుస్తూ అంటున్న శంకర్‌ను లేవనెత్తాడు ప్రకాశరావు.
‘‘ఇంతకూ సంగతేంటి రాజయ్యా?’’
తలొంచుకున్న రాజయ్య పలుకలేదు.
‘‘రాజయ్యా… వరుణ్‌ కోసం మా ఇంటికొచ్చిన వీడు దీన్ని దొంగిలించాడా?’’
కాస్త కఠినంగానే అన్నాడు ప్రకాశరావు. ఉలిక్కిపడ్డాడు రాజయ్య.
‘‘లేదయ్యా… లేదు… అంతమాటనకండి… కూటికి పేదలమైనా గుణానికి మాత్రం కాదయ్యా…. జరిగిందంతా చెప్తాను!’’
అంటూ అంతా పూసగుచ్చినట్టుగా వివరించసాగాడు రాజయ్య.

*****************************************
‘‘ఒరే శంకర్‌… ఏమైందిరా? ఎందుకలా వున్నావ్‌?’’
తోటకూర కాడలా వాడిపోయిన వాడి వదనం, కన్నీటి చారలతో కూడిన శంకర్‌ చెంపలు చూస్తుంటే వరుణ్‌కు చెప్పలేని బాధ కలిగింది.
‘‘చెప్పరా… ఏం జరిగిందిరా?’’
వాళ్ళ చిన్న డాబా ఇంటిముందున్న వేపచెట్టు మొదట్లో దీనంగా కూర్చున్న తన మిత్రుడు శంకర్‌ పక్కనే తాను
కూర్చుంటూ అడిగాడు ఆ ఎదురింటి మేడిoటి అబ్బాయి, శంకర్‌ మిత్రుడు వరుణ్‌.
‘‘మా గౌరిని మా నాన్న అమ్మేస్తడంటరా వరుణ్‌!’’
‘‘ఆ!’’ ఊలికిపాటుగా చూశాడు వరుణ్‌!’’
అవున్రా! ఏడాది నుండి అంటనే వున్నడు మా నాన్న, ఈ కరోనా కరువు కాలం మన బతుకే మనకు బరువైతుంటే ఈ ఆవు
గౌరమ్మనెలా సాకేదిటరా? అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకున్నడురా!’’
అంటు మిత్రుడి భుజంపై తలవాల్చి బావురుమన్నాడు శంకర్‌.
‘‘ప్లీజ్‌రా ఏడవకు!’’ మిత్రుడి కన్నీళ్ళు తుడిచాడు వరుణ్‌.

‘‘వరుణ్‌….గౌరి నాకు ప్రాణంరా! నేను తింటేనే అది తినేది. నిన్న పేరంటం అమ్మ తెచ్చిన అరటిపండు పెడితే…
ఆకలితోటున్నాగాని అది తిన్లేదు. నేను సగం పండు తిన్నంకనే గౌరి తిన్నదిరా!’’
అంటూ వెక్కి వెక్కి ఏడ్చాడు శంకర్‌.
‘‘ప్లీజ్‌ శంకూ ఏడ్వద్దు! ఎప్పుడూ జోక్‌లేస్తూ నవ్వించే నువ్వలా వుంటే నేను చూడలేనురా!’’
అంటూ ప్రేమ నిండిన బాధతో పదేళ్ల వరుణ్‌, తొమ్మిదేళ్ళ శంకర్‌ను కౌగిలించుకున్నాడు…. తోచిన రీతిలో ఓదార్చాడు. ఆపై,
అంతులేని ఆలోచనతో అన్యమనస్కంగానే ఇంటికి చేరుకున్నాడు వరుణ్‌.
‘అవును… గౌరి గంగిగోవులాంటిదంట! శంకర్‌కు అది ప్రాణం వంటిది. అది లేకుంటే వాడుండగలడా? చదవగలడా? తనతో ఆడగలడా?’
అనుకుంటూ ఎంతగానో ఆలోచించాడు… తెల్లారగానే ఓ నిర్ణయానికొచ్చి స్థిమితపడ్డాడు వరుణ్‌.

‘‘శంకూ, ఒరే శంకర్‌’’ అని పిుస్తూ, శంకర్‌ వాళ్ళ ఇంటి గేటు తెరుచుకొని లోపలికొచ్చాడు వరుణ్‌.
స్టూల్‌ పైన నిల్చొని, ఆవు గౌరి వీపును బ్రష్‌తో రుద్దుతున్న శంకర్‌ దగ్గరకు చేరాడు.
‘‘ఒరే వరుణ్‌… గౌరి వెళ్ళిపోవడం తప్పదంట కదరా!’’
ఏడుపు నడుమనే గౌరి గంగడోలును ముద్దాడుతూ వణికే కంఠంతో అన్నాడు శంకర్‌.
‘‘నో… నో… శంకర్‌… నిన్నొదిలి గౌరి వెళ్ళిపోకూడదు… నువ్వు హాపీగా వుండి నాతో ఆడుకోవాలంటే, గౌరి నీతోనే వుండాలి!’’
‘‘అదెట్లా?’’
‘‘అది… అది… ఇట్లా… ఇదిగో ఇది మీ నాన్నకివ్వు! గౌరినమ్మకుండా దీన్నమ్మితే, గౌరి తిండికి సరిపడా డబ్బులొస్తాయి!’’
అంటూ ఉత్సాహంగా ఓ కవరు తీసి శంకర్‌ షర్ట్‌ జేబులో వుంచాడు వరుణ్‌! సంకోచంగా చూశాడు శంకర్‌.
‘‘ఇది నాదేలేరా!’’ అంటూ శంకర్‌ భుజం తట్టాడు వరుణ్‌.
‘‘అయితే వరుణ్‌…. దీంతో నా గౌరమ్మ తల్లి నాతోనే వుంటదా? నాతోనే తింటదా? నాకు జరమొచ్చి పడుకుంటే ప్రేమగా నా ఒళ్ళంతా నాకుతదా?
సంభ్రమంతో కూడిన అపురూప భావంతో, ఆ కవర్‌ను జేబుపై నుండే గుండెకు హత్తుకున్నాడు…. ఆనందంగా గౌరినీ
వరుణ్‌నీ కలిపి కౌగిలించుకొని కోటి సుద్దుతో కూడిన ముద్దులెన్నో పెట్టుకున్నాడు శంకర్‌.

*****************************************రాజయ్య చెప్పిందంతా కళ్ళతో కన్నట్టుగానే చెవులతో విన్నాడు ప్రకాశరావు.
‘‘వరుణ్‌’’ అంటూ కొడుకును కేకేశాడు.
అందరూ భయపడ్డారు కొడుకునేం చేస్తాడోనని! భయం భయంగా తండ్రి దగ్గరకొచ్చాడు వరుణ్‌.
‘‘సారీ నాన్నా!’’ ఏడుస్తూ తండ్రి కాళ్ళకు చుట్టుకు పోయాడు.
‘‘లే…. నాన్నా…లే!’’ అంటూ కొడుకును లేవనెత్తి గుండెకు హత్తుకున్నాడు.
ఆపై అదే సందిటికి శంకర్‌ను కూడా చేరబిలిచాడు ప్రకాశరావు.
‘‘రాజయ్యా… సృష్టిలో తీయనిది స్నేహమని అంటారు. అది నిజమేనని… ఎల్లలులేని తన స్నేహ ధర్మాన్ని నిరూపించాడు
మా పిల్లవాడు! గోమాతను తల్లిలా భావించి, దానికి దూరం కాలేక తల్లడిల్లిపోయిన మీపిల్లవాడెంత జంతు ప్రేమికుడో నా
కళ్లక్కట్టింది రాజయ్యా… దయకు మించిన ధర్మం లేదని మీవాడు, స్నేహానికి మించిన సిరిసంపదల్లేవని మా వాడు…
తమ తమ ధర్మాల మర్మాు విప్పి చెప్పారు!’’
అంటూ చెమరించిన కళ్ళద్దుకున్నాడు ప్రకాశరావు.
‘‘అయ్యగారూ….’’ ఆశ్చర్యంగా చూశాడు రాజయ్య.
‘‘రాజయ్యా… మన సంస్కృతిలో గోవుకున్న విలువను ఈ చిన్న పిల్లలు తెలియజేశారు. గోమాత అణువణువు
అమృతప్రాయమని, గోసంబంధిత ప్రతి అంశం అమూల్యమైనదని… శాస్త్రవేత్తలు సైతం నిరూపించిన నిజం. ఎన్ని అనారోగ్యాల
పాలౌతున్నా కూడా జనం ఆ నిజం గుర్తించడం లేదు.
ఇంతెందుకు… పురిట్లోనే తల్లిపోయిన నేను చిన్న నాటి నుండి… మా పల్లెలోనే గోవు తల్లి పాలతోనే పెరిగానన్న సంగతి
ఇప్పుడీ బాలజ్ఞానుల వల్లనే గ్రహించగలిగాను!’’
సన్నగా కంపించింది ప్రకాశరావు స్వరం.
‘‘అయ్యా…!’’ అయోమయంగా చూశాడు రాజయ్య.
‘‘ఎందుకంటే ప్రస్తుతానికి పదీ పాతిక దాకా దేశవాళీ గోవుల్ని కొందాం ఓ గోశాలను నడిపిద్దాం!’’
‘’అయ్యగారూ…’’ రాజయ్య కళ్ళ నుండి ఆనందబిందువులు రాలిపడ్డాయి.
‘‘అంతేకాదు రాజయ్యా… గోవుల్ని కబేళాకు తరలించే పాపపు పనినాపివేసే పనిలో పాల్గొందాం! కడదాకా కాడీకవ్వాలనాడిoపజేసే మన పాలతల్లిని…. జాతి సౌభాగ్యవల్లిని… మన గోమాతను కాపాడుకుందాం! సేంద్రియ ఎరువు పంటతో దేశ
ఆరోగ్య సంపదను సంరక్షించుకుందాం!’’
దృఢచిత్తంతో అంటూ… గోడుకున్న గోవిందుడి చెంతనున్న గోమాత పటానికి దండం పెట్టాడు ప్రకాశరావు!
అదంతా గమనించిన వరుణ్, శంకర్ ఆనందంతో కేరింతలు కొట్టగా…. ఆ శబ్దం విన్న గోవు గౌరి… అందుకు జవాబుగా
‘‘అంబా’’
అని అరవటంతో, ఆవు ఆశీర్వాదం పలికినట్టనిపించింది అక్కడున్న అందరికీ!

-కె.వీణారెడ్డి,
రచయిత్రి – కవయిత్రి
కథా సంపుటులు: కథావిపంచి-1, జీవన్మణులు,
కథావిపంచి-2, నిశాంత కాంతులు!
బిరుదులు: సాహితీ సామాజిక వేత్త,
మహిళా సేవారత్న!
+91-7337058025

June 2, 2021 0 comment
1 FacebookTwitterPinterestEmail
కథలు

లేత కంకి

by డా.ఎయం. అయోధ్యారెడ్డి June 2, 2021
written by డా.ఎయం. అయోధ్యారెడ్డి
రోజూ ఎక్కడికెళ్లినా, ఎన్ని అనుభవాల్లో దొర్లినా తిరిగి పాత చోటుకు రావడమే నగర జీవితం. ఇక్కడ పొద్దు పొడవటంతోనే బతుకు యంత్రం పనిచేయడం మొదలైతది. సగం విగతుడవై చీకటిపడే వేళ నువు ఇల్లు చేరితే.. బతుకుపట్ల ముక్కలైన నీ భరోసా మర్నాడు ఉదయానికి ఆ ముక్కల్ని అతికించుకొని మళ్లీ ఓ అతుకుల ఆకారమైతది. తిరిగి అదే గొలుసుకట్టు జీవితం. కొత్తగా ఈ రోజేదో అద్భుతం జరుగుతుందన్న ఆశ. మనకు తెలియకుండానే ఏర్పడిన బలహీనత. ఏ అద్భుతమూ జరుగది. మళ్లీ అదే ఎలుక పరుగు. మనం కోల్పోతున్నదేదీ మనకందదు. ఒక స్వచ్ఛమైన నవ్వుకోసం, ప్రేమపూర్వక స్పర్శ కోసం, అనునయ వాక్యం కోసం, ఒంటికాలి మీద నడుస్తున్న మానవతకి శక్తినిచ్చే కాసింత నిజాయితీ కోసం ఆరాటపడే పరిస్థితులు నెలకొన్న వేళ. అదిగో అలాంటి స్వచ్చత.. నిజాయితీ ఒక లేతగుండె నుంచి జాలువారి నా మనసు గోడల్ని తాకిన వైనమిది. ఇది కథ అవుతుందో లేదో తెలియదు. కానీ ఎదుటి హృదయానికి చిల్లుపెట్టి హరిత వనం నాటిన సందర్భం.
*****************************************

సూర్యకిరణంతో పాటు మేలుకుని మొదలయ్యే నా దైనందిన జీవితం ఆ సూర్యకాంతితో పాటే ప్రయాణిస్తుంది. పొద్దున డ్యూటీకి పోతున్నప్పుడు ఉత్సాహంగా… సాయంకాలం ఇంటికి తిరిగిగొస్తూ నీరసంగా. నగరానికి యాభై కిలోమీటర్ల దూరంలోని ఓ గురుకుల పాఠశాలలో టీచర్ని. స్కూల్లో పిల్లలకు చదువు చెప్పటం హాయిగానే ఉంటుంది. కాని స్కూలుకు రానూ పోనూ ప్రయాణమే ప్రాణం మీది కొస్తుంది. ఏంజేస్తాం..! నగరాన్ని వొదిలి శివార్లకో లేక గ్రామాలకో వెళ్లిపోలేం. సిటీలో ఇష్టపడి కష్టపడి కట్టుకున్న ఇల్లు. పిల్లల చదువులు. ఇలా ఎన్నో కమిట్మెంట్స్. ఆరోజు మామూలుగానే స్కూలుకు బయలుదేరిన. మా స్కూలుకు పోవాలంటే ముందు పావుగంట నడిచి బస్టాండ్ చేరాలి. నాకు కావాల్సిన బస్సు రావాలి. ఖాళీగా ఉండాలి. నేను ఎక్కగలగాలి. ఆ తర్వాత బస్సు బయలుదేరిన గంటన్నరకు గానీ నేను స్కూలు మెట్లెక్కే అవకాశం లేదు. బస్సును పాయింట్ మీద ఆపేసి డ్రైవర్ ఎటుపోయిండో పత్తా లేడు. స్కూలుకు లేటైపోతున్న ఫికరు పట్టుకున్నది. బస్సెక్కి కూర్చుండి పది నిముషాలైంది. ఆ బస్సు ఏ టైముకు పోవాలో, అసలు దానికో షెడ్యూల్ ఉన్నదో లేదో కూడా తెలియదు. కింద ప్లాటుఫారం మీద నిలుచున్న కండక్టర్ బేరం కోసం అరిచే చిల్లర వ్యాపారిలా ప్రయాణికుల్ని బస్సు ఎక్కమని పిలుస్తున్నడు. ఆర్టీసీలో ఈ కొత్త పద్ధతి ఎప్పుడు పెట్టారోగానీ బస్సు సీట్ల వరకు నిండితేగాని కదుల్తలేదీ మధ్య. నాకో పక్క విసుగ్గానూ ఆందోళనగానూ ఉన్నది. బస్సులోకి ప్యాసింజర్ల కన్నా ఎక్కువగా తినుబండారాలు అమ్ముకునేటోళ్లు వొచ్చిపోతున్నరు. “ సమోసా.. వేడివేడి సమోసా..” చేతిలో చిన్న గంప పట్టుకొని ఒకతను వొచ్చాడు. అతని రాకతో బస్సు సమోసాల వాసనతో ఘుమఘుమలాడి పోయింది. “వాటర్ బాటిల్.. వాటర్ బాటిలండి” మరొకతను. “పేపర్ సార్.. ఈనాడు..సాక్షి.. జ్యోతి..” కిటికీ అద్దం పక్కకు జరిపి బయటకు చూస్తున్నా. డ్రైవరు వస్తున్న జాడలేదు. “అల్లమురబ్బా.. అల్లమురబ్బా.. పైత్యానికి మంచిది అల్లమురబ్బా..” కొందరు కొనేవాళ్లు తమకు కావాల్సినవి కొంటున్నరు. ఇట్లాంటి చిరుతిండ్లు, బయట పదార్థాలు తినడం అలవాటు లేదు గనుక నేను పట్టించుకోలేదు. బస్టాండు చాలా రద్దీగా ఉన్నది. బతుకమ్మ పండుగ, ఆపైన దసరా పండుగ రోజులు. పట్టణాలు సెలవు తీసుకొని పల్లెలకు తరలిపోతున్న సమయం. ఎక్కడెక్కడి దూరప్రాంతాల నుంచో వచ్చిన ఆడా మగా పండుగల కోసం ఉరుకులాడుతున్న హడావిడి కనిపిస్తున్నది. అప్పుడే డోర్ తెరిచి ఒక్క జంపుచేసి స్టీరింగు ముందు కూర్చున్న డ్రైవరు బస్సు స్టార్టు చేశాడు. “రండి.. ఎక్కండి. బస్సు పోతున్నది” కింద కండక్టరు హడావిడి చేస్తున్నాడు. “ ఏంది సార్.. ఎక్కెక్కుమని తొందర జేస్తవు. లోపల ఒక్క సీటన్న ఖాళీ లేదు. ఊరు చేరేటందుకు రెండు గంటలైతది. అంతసేపు ఎట్ల నిలవడుతం” కండక్టర్ బలవంతం మీద బస్సెక్కినోళ్లు చిరాకు పడుతున్నరు. “ ఎందుకట్ల తొందరపడుతవు.. వెనుక సీట్లున్నయి జర సూడు పెద్దమనిషీ..!” కండక్టరు సముదాయింపు. “ ఒక్కటి సూత లేదు. అన్ని నిండినయి” “ ఫర్వాలేదు ఎక్కన్నా. ఎంత.. అర్ధగంట. ప్రజ్ఞాపూర్ల పదిమంది దిగుతరు” మొత్తానికి బస్సు బయల్దేరింది. ఆ టైములో హఠాత్తుగా ఒక అమ్మాయి బాణంలా లోపలికొచ్చింది. ఆమెకు పదేళ్లకు మించి ఉండవు. సన్నగా, అమాయికంగా ఉన్నది. ఆమె రెండు చేతుల్లో రెండేసి చొప్పున కాల్చిన మక్క కంకులున్నయి. వాటిని పట్టుకొని కదులుతున్న బస్సు ఎట్లా ఎక్కిందో అర్థంకాక ఆశ్చర్యపోయాను. “ లేత కంకులు సార్.. గరం గరం కంకులు. ఒక్కటి పది రూపాయెలు” గట్టిగా అంటూ నావైపు వొచ్చింది. ఆమె చేతుల్లో కంకుల్ని పట్టించుకోకుండా నేను తననే చూస్తుండిపోయిన. “ ఒక్కటి తీసుకో అన్నా.. లేత కంకి. మంచిగుంటది” “ ఓ పోరీ.. ఓపక్క బస్సు నడుస్తుంటె నీ బేరాలేంటిదే. దిగు జల్దిన” టిక్కెట్లిస్తున్న కండక్టర్ కోపంగా అరిచాడు. ఆ పిల్ల కండక్టరు అరుపుల్ని పట్టించుకోకుండా “ అన్నా.. తీస్కో అన్నా. లేత కంకులు..” నా దగ్గరే నిలబడింది. ఆ పాపను చూస్తే జాలేసింది. లేత కంకి మీద పెద్దగా ఇంట్రస్టు లేకపోయినా డబ్బిచ్చి కంకి తీసుకున్నా. కదుల్తూన్న బస్సులోంచే పాప దిగిపోయింది. నిజంగానే కంకి లేతగా రుచిగా ఉన్నది. మక్క కంకి ఆరోగ్యానికి మంచిదని కూడా అంటుంటరు. రోజూ సిటీలో పెద్దపెద్ద హోటళ్లు, ఫుడ్ కోర్టుల్లో వందల్లో డబ్బు తగలేసి ఎగబడి తినే జంక్ ఫుడ్స్ కంటే ఎన్నో రెట్లు మంచిదనిపించింది. లేకలేక ఒక మక్క కంకి తింటూ ఆరోగ్య అంశాలు తలపోస్తున్నందుకు లోపల నవ్వుకున్నా. కిటికీలోంచి కదిలిపోతున్న పరిసరాలు చూస్తూ బస్సు సిటీ లిమిట్స్ దాటేసరికి నా కంకి తినడం కూడా పూర్తయింది.

 

*****************************************

ఒకరోజు సాయంత్రం ఐదు ప్రాంతంలో స్కూలు నుంచి ఇంటికొస్తూ బస్టాండులో దిగాను. పొద్దంతా పనితోనూ, ప్రయాణంతోనూ అలసి ఇంటికి చేరుకొని నాలుగు మెతుకులు మింగి నిద్ర పోవడం తప్ప ఇంకేమీ చెయ్యలేను. రెండు రోజులుగా జోరుగా వానలు కురిసి అప్పుడే పల్చబడుతున్న తుపాను ప్రభావం. ఆకాశంలో దట్టంగా మబ్బులు పట్టి వాతావరణం చలిగా ఉన్నది. అప్పుడప్పుడు కొద్దిగా తెరిపిచ్చినా ముసురుపడుతూనే ఉన్నది. బస్టాండులోంచి బయటికిపోతూ ఆగిపోయిన. రోడ్డుకు ఇరువైపుల వరుసగా కూర్చుని కొందరు కంకులు కాలుస్తున్నరు. చిటపట చప్పుడు. గాలిలో కలుస్తున్న కమ్మని వాసన. ఆ వాతావరణంలో వేడివేడిగా కంకి తినాలన్పించి అటు నడిచాను. జోరతట్టు మీద కూర్చొని దీక్షగా కంకులు కాలుస్తున్న పాపని వెంటనే గుర్తుపట్టిన. నేను రావడాన్ని గమనించి ఆమె ఓమారు చూసి మళ్లా తన పనిలో మునిగింది. మొన్న బస్సులోకి వొచ్చి నాకు కంకి అమ్మిన పాప. ఆమె ముందు ఒక రాతిబండ. దానిమీద ఇనుపతట్ట. అందులో నిప్పుకూ బూడిదకూ నడుమ సన్నటి మంటతో కాలుతున్న బొగ్గులు. విసనకర్రతో విసురుతూ కుడిచేత్తో కంకులు మర్లేస్తున్నది. పక్కన చిన్న ఎలితె బొంగు భూమిలో పాతి దానికి నిలువుగా ఒక పాత చెత్తిరి తాడుతో కట్టింది వాన నుంచి రక్షణగా. ఒక పాత ముక్కాలిపీట మీద చిన్న ఈత తట్టలో అప్పటికే కాల్చిపెట్టిన కొన్ని కంకులు వరుసగా పేర్చి ఉన్నయి. ఆ పిల్ల వయసుకు మించిన బాధ్యతలు మోస్తున్నట్టు బలహీనంగా ఉన్నది. చటుక్కున నాకు బాలకార్మిక చట్టం గుర్తొచ్చింది. ఏం చేస్తున్నయి ఈ చట్టాలన్నీ? ఆ పాప బాల్యంలోనే అంత బరువు ఎత్తుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది. దీనికి ఎవరు బాధ్యులు? ఆ వయసులో బాలికను ఏ స్కూలుకో పంపకుండా ఆమెచేత చాకిరి చేయిస్తున్నదెవరైనా నేరస్థులే. అట్లా కాకుండా తానుగా చేస్తున్నా అదీ నెరమే. నన్ను పట్టించుకోకుండా తలవంచి కాలుతున్న కంకుల్ని పట్టిపట్టి చూస్తున్నది. బొగ్గుమరకలు నిండిన పాత లంగా మీద అసలు రంగేదో తెలియకుండా వున్న బుషట్ తొడుక్కున్నది. “లేత కంకి ఒకటియ్యి బుజ్జీ.. యెంత..?” అడిగిన. ఆ పిల్ల చప్పున తలపైకెత్తి చూసి “పది రూపాయలన్నా” అనిచెప్పి బొగ్గు కణికెల మీద కాలుతున్న కంకుల్లోంచి ఒకటి తీసింది. దాన్ని చేత్తో శుభ్రంగా తుడిచి పక్కన గిన్నెలో ఉన్న ఉప్పుకారం పొడిలో నిమ్మకాయ బద్దను ముంచి కంకిమీద రుద్దింది. సంతృప్తి పడినంక జొన్నబూరులో ఆ కంకిని భద్రంగా మడత చుట్టి నా చేతికి అందించింది. నేనిచ్చిన పది రూపాయల నోటు తీసుకొని జాగ్రత్తగా జోరబొంత మడతల కింద పెట్టుకున్నది. “ నీ పేరేంది బుజ్జీ” అడిగాను. “నాపేరు నీలమ్మ” అనిచెప్పి తన యజ్ఞాన్ని తిరిగి కొనసాగించే మునిలా కుంపట్లో కంకులు మర్లెయ్యసాగింది. నేను ఇంకేం మాట్లాడకుండా ఇంటిదారి పట్టిన.*****************************************వైరల్ జ్వరంతో బాధపడుతూ నాలుగు దినాలు స్కూలుకు పోలేదు. అయిదో రోజు కొంచెం కోలుకున్న. ఇంకా వెళ్లకపోతే ఉన్న కొలువు ఊడుతదని భయపడి ఓపిక చేసుకొని వలసపక్షి మాదిరి డ్యూటీకి బయలుదేరిన. బస్టాండ్ దగ్గరికి రాగానే మక్కకంకి మీదికి మనసు పోయి నీలమ్మ పెట్టుకునే దుకాణం దిక్కు చూసిన. అదే దృశ్యం. నిప్పులమీద కంకులు తిప్పుతున్న లేత చేతులు. బూడిద దుమ్ముతో మసిబారిన అమాయకమైన మొఖం. దగ్గరకువెళ్లి ఆమెను నవ్వుతూ పలకరించి ఓ కంకి కొనుక్కొని చిల్లరలేక వంద రూపాయల నోటిచ్చిన. నీలమ్మ చిల్లర కోసం జోరతట్టు మడతల్లో కొద్దిసేపు వెతికి బాగా నలిగిన ఎనిమిది పది రూపాయల నోట్లు అందించింది. “అన్నా.. ఇంకో పది రూపాయలు లేవన్నా.. మళ్ళొచ్చినప్పుడు ఇస్తలే” అన్నది అర్థింపుగా. నేను మాట్లాడలేదు. మంటల వేడిలో మోటుతనం పూసుకున్న ఆమె లేత చేతుల వంక చూసి బాధ కలిగింది. ఇంత చిన్న వయసులో అంత బరువు బాధ్యతలు. వెనుదిరిగి నేను వెళ్లే బస్సులో ఎక్కి కూర్చున్న. ఆ విధంగా నా ఉద్యోగానికీ, ఇంటికీ రోజూ నేను జరిపే రాకపోకల నడుమ పాప.. ఆమె కాల్చిఇచ్చే మక్కకంకి నాలో ఒక భాగమైనయి. హఠాత్తుగా ఒక రోజు నీలమ్మ కన్పించలేదు. ఆమె కూర్చునే చోట ఆమెకు ఆదిశేషునిలా నీడపట్టే నల్లచెత్తిరి, పక్కన ముక్కాలిపీట కూడా కనిపించలేదు. ఆవేళ ఎందుకో రానట్టున్నది. అక్కడే కొన్ని నిముషాలు ఆగి చూసిన. పక్కన మక్కబుట్టలు అమ్మేవాళ్ళు కూర్చుని ఉన్నరు. వాళ్ళను అడుగుదామనుకొని అప్పటికే స్కూలుకు ఆలస్యమవుతున్న నేను ఇంక ఆగలేక వెళ్లిపోయిన. మళ్ళా సాయంత్రం తిరిగొస్తున్నప్పుడు చూస్తే పాప కనిపించలేదు. మరి కొన్ని రోజులు గడిచినయి. అయినా ఆమె రాలేదు. ఆ తోవలో పోతున్నప్పుడల్లా జ్ఞాపకమొచ్చేది. నిజానికి ఆ పిల్ల నాకేమీ కాదు. ఏ అనుబంధం మా నడుమ లేదు. కానీ ఎందుకో ఆ పాపను మిస్ అవుతున్న ఫీలింగ్. ఇన్ని రోజులుగా రావడం లేదంటే తనకేమన్నా అయిందా అన్న ఆలోచన. ఏదో వెలితి. మనసులో చిన్న మరక. తనకేదన్నా సాయం చెయ్యలేక పోయానన్న భావన నాలో ఉన్నట్టు అనిపించింది.

 

*****************************************

కాలం వర్తమానాన్ని భూతకాలంలోకి నెట్టుతూ పోతుంటే నేను నా యాంత్రిక జీవన సరళిలో కదిలిపోయాను. రెండురోజుల సెలవుల తర్వాత ఆదినం సోమవారం అనుకుంటా. బస్సుస్టాండులోకి నడుస్తుంటే హఠాత్తుగా నా దృష్టికి నీలమ్మ కూర్చునే చోట ముక్కాలిపీట కనిపించింది. దాని పక్కనే ఎలితె బొంగుకు కట్టి నిలబెట్టిన నల్లచెత్తిరి. కింద రాతిబండ మీద ఇనుపతట్ట. నిప్పుకణికెల పైన కాలుతున్న కంకులు. స్కూలు లేటవుతున్న హడావిడిలో ఆమె కోసం చూడకుండా లోపలికిపోయిన. చిన్నగా ముసురు పడుతున్నది. బస్సు కదిలింది. గేటుదాటి బస్సు బయటికి పోతుంటే విండోలోంచి అవుతలికి చూస్తే దారిపక్కన చెత్తిరి కింద ఏకాగ్రతగా కంకులు కాలుస్తున్న పాప కనిపించింది. సాయంత్రం తిరిగొచ్చినప్పుడు బస్సు దిగగానే ఆమె దగ్గరకు నడిచి పలుకరించాను. “ఇన్ని దినాలు ఏమైపోయినవు బుజ్జీ .. కనపడలేదు” అన్నాను. నన్ను చూడగానే గుర్తుపట్టి నీలమ్మ నవ్వింది. “ అన్నా.. బాగున్నవా” అని పలుకరించి ఇంకోమాట లేకుండా వెంటనే జోరతట్టు కింది నుంచి పది రూపాయల నోటు తీసి “అన్నా.. మీ పైసలు. మొన్న మీకు పది తక్కువిచ్చినగద” అన్నది. నిజానికి ఆ సంగతి నాకు గుర్తులేదు. పది రూపాయలు పెద్ద మొత్తం కాదు గనుక మరిచిపోవచ్చు. కానీ ఇన్నిరోజుల తర్వాత కూడా పాప గుర్తుపెట్టుకుంది. ఏదో స్పర్శ మనసును తాకినట్టు అనిపించింది. “ఉండనియ్యిలే పాపా.. మరి కంకి తినిపియ్యవా..” అన్నాను నామాటకు ఆ పిల్ల కండ్లు మెరిసినయి. నోటు మళ్ళా జోరతట్టు కింద పెట్టుకొని జోరసంచిల నుంచి లేత కంకి ఒకటి తీసి జాగ్రత్తగ బూరు తీసి కాల్చసాగింది. సవ్యసాచిలా కదులుతున్న ఆమె లేత చేతుల వంక చూసిన. ఎడమ చెయ్యి విసనకర్ర ఊపుతుంటే కుడిచెయ్యి నిప్పుల్లో కంకిని కదిలిస్తున్నది. “ఇన్ని రోజులు యాడికిపోయినవు బుజ్జీ.. కనిపించలేదు” “మా తాత సచ్చిపోయిండన్నా.. అందుకే రాలే” “ ఏమైంది మీ తాతకు” “ చాన దినాల నుంచి పాణం బాగలేదు” “ చిన్న పిల్లవి.. నువ్వీ పని జేస్తున్నవేంది. స్కూలుకు పోవా..” “ మొన్నటిదాక పోయిన. నాలుగో తరగతిల ఉన్న. ఇప్పుడింక పోను” “ అదేంది ఎందుకు” “ గిప్పుడు ఇంక సదువు కల్వదన్నా.. ఏదన్నా పనిజేసుకోవాలె. అందుకే మక్కకంకులు అమ్ముతన్న” “నువ్వమ్ముడేంది పాపా.. మీ అమ్మా నాయనా లేరా?” ఆమె సప్పుడు జెయ్యలేదు. కానీ ముఖంలో దిగులు కమ్ముకొని బొగ్గుమరకల కన్నా చిక్కగా గూడుకట్టింది. “మా నాయిన లేడు. నా చిన్నతనం నుంచే లేడు. ఏమైండో తెల్వది. ఊర్ల అందరేమో నాయిన నా చిన్నప్పుడే సచ్చిపోయిండని అంటరు. కానీ మా అవ్వనేమో ఆయన పనికోసం మస్కట్ పోయి ఇంక రాలేదంటుంది” “ ఎంత కాలమైంది మీ నాయన పోయి” “ అదికూడ నాకు తెల్వది. నాకు బుద్ధి తెల్వకముందే పోయిండట” “ మరి మీ అమ్మేం జేస్తది” “ కూలికి పోతది. మా ఇంట్ల నేను, అవ్వ, చెల్లె, తాత, నల్గురం ఉంటం. ఇంక గిప్పుడు తాత సూత లేడు. మొన్ననే సచ్చిపోయిండు. ఇంతకుముందు ఈ కంకుల దుకుణం ఆయన్నే నడిపిండు. ఎప్పుడన్నా నా బడికి సెలవున్నప్పుడు తాతకు సాయం జేసేటందుకు వొచ్చేదాన్ని. ఇప్పుడు తాత లేడుగద.. ఇగ ఇప్పటిసంది ఈ పని నేనే జేస్త” ఇనుపతట్టలో కంకిని జాగ్రత్తగ మర్లేసి కాలుస్తూనే అన్ని వివరాలు చెప్పింది. నేనేం మాట్లాడకుండా ఆమెనే చూస్తుండిపోయిన. మనసులోంచి సానుభూతి పొంగుకొచ్చింది. ఆ పిల్ల పరిస్థితి నన్ను బాగా కదిలించింది. ఈలోగా నీలమ్మ కంకి బయటికితీసి దానికి అంటిన బూడిది దులిపింది.“ ఉప్పు కారం రుద్దుమంటవా అన్నా” అని అడిగింది. తలూపాను. నిమ్మకాయ ముక్కతో ఉప్పుకారం రుద్ది జొన్నబూరులో చుట్టి అందించింది. పర్సులోంచి పదినోటు తీసి ఇచ్చిన. నావైపు సాదరంగా చూస్తూ అందుకున్నది. పాపతో ఇంకా మాట్లాడుతూ వుండే టైము లేదు. అందుకే తొందరగా పోయి బస్సెక్కిన. బస్సు కదిలిపోయే సమయంలో నీలమ్మ ఎగపోసుకుంట ఎదురునుంచి పరిగెత్తుకొచ్చింది. డ్రైవరు ఏమూడ్ లో ఉన్నాడోగాని ఆమెను చూసి తిట్టుకోకుండా బస్సాపిండు. హడావిడిగా బస్సెక్కి నేను కూర్చున్న సీటు వద్దకొచ్చింది. “అన్నా.. మొన్న నీకు ఇయ్యాల్సిన పదిరూపాయలు” అని పదినోటు నా చేతిలో పెట్టబోయింది. షాక్ తిన్నాను. ఆమె అమాయకత, నిజాయితీ నన్ను కట్టేసినయి. నోరితెరిచి ఒక్కమాటా మాట్లాడలేక పోయాను. ఆమె తిరిగిచ్చే డబ్బులు తీసుకోవాలా? వొద్దులేమ్మని ఉంచుకోమనాలా? లేక ఆమె నిజాయితీకి మెచ్చి ఆ పదికి మరికొన్ని డబ్బులు కలిపి ఆమెకే ఇచ్చి సంతోషపెట్టాలా? ఇవేవీ చేయకుండా మౌనంగా ఉండిపోవాలా? నా ఆలోచనలు సాగుతుండగనే ఆమె డబ్బు నా చేతిలో పెట్టి బస్సు దిగిపోయింది. వెనుక నుంచి చేష్టలు దక్కి బొమ్మలా చూస్తుండి పోయిన. ఒక్కక్షణం ఆ సందర్భంలో.. సన్నివేశంలో నేను లేకపోయివుంటే బాగుండేదనిపించింది. బస్సు వేగం పుంజుకుంది. ఆరోజుకి నీలమ్మా, నేనూ ఎవరి దారుల్లో వాళ్ళం కదిలిపోయాం. ఆ పాప ఏ భావమూ లేకుండా ఎప్పట్లాగే మామూలుగనే వుండవచ్చు. ఎంత అనుకున్నా నేను మామూలుగా ఉండలేకపోయాను. ఎంత అణుచుకున్నా ఏదో గిల్టీనెస్.

 

*****************************************
మరో రెండురోజుల తర్వాత స్కూలుకు వెళుతున్నప్పుడు చూస్తే నీలమ్మ మళ్ళా కన్పించలేదు. ఈసారి చాలా రోజులు గడిచిపొయినా రాలేదు. ప్రతిరోజూ ఆ దారిన నడుస్తుంటే నల్ల చెత్తిరి కింద ముక్కాలిపీట మీద కూర్చుని పనిలో నిమగ్నమై వుండే నీలమ్మ ఉనికి కోసం నా కళ్ళు అటు తిరిగేవి.
ఆవిధంగా నెలరోజులు గడిచాయి. మక్క కంకుల సీజను కూడా అయిపోవొచ్చింది. ఆ పాప ఎక్కడికి పోయిందో తెలిస్తే బాగుండును అనిపించింది. మనసులో పదేపదే అదే ఆలోచన. ‘ఆ పిల్ల నాకేమవుతదని ఇంత ఆరాటపడుతున్నా?’ అని నన్ను ప్రశ్నించుకున్న. ఆ పసిదాని పరిస్థితి పూర్తిగా తెలుసుకుని కూడా ఆమెకి ఏవిధంగానూ సాయపడనందుకు సిగ్గనిపించింది. బాధ కలిగింది. నేనలా చేసివుంటే ఆమె ఆత్మాభిమానం గాయపడి వుండేదేమో అని అనుకున్నా. కానీ నా చేతకానితనాన్ని అట్లా సర్దిచెప్పుకొని ఊరటచెందానని తెలుసు.
సాకులు చెప్పుకోవడం ఒక విధంగా మాబోటివాళ్ళకు పలాయనవాదానికి తెలివైన దారి కావొచ్చు. కావొచ్చేమిటి.. అదే నిజం. ఎందుకంటే ఎంత సానుభూతి గుమ్మరించినా వాస్తవానికి అందర్లాగే నేను కూడా వ్యవహరించిన. నాకు అనుకూలమైన సాకునే వెతుక్కున్న. పైపెచ్చు సమాజంలో పాదుకున్న వర్గభేదాలను, ఆర్థిక అసమానతల్ని తిట్టుకున్నాను, నీలమ్మ లాంటి నిరుపేద, బడుగువాళ్లకు మేలు చెయ్యనందుకు ప్రభుత్వాన్ని ఆడిపోసుకున్నానే తప్ప నావంతు బాధ్యతగా భావించి ఆమెకు నేనుగా ఏమీ చెయ్యలేదు. పదేళ్ల పసిపిల్ల.. నాకు జీవితంలో అంత విలువైన పాఠం చెబితే, దాని ప్రాముఖ్యత తెలుసుకోలేక ఆమె నిజాయితీకి నేను కట్టిన విలువ పది రూపాయలు. కానీ చివరికి ఆ పది రూపాయలు కూడా నాకు తిరిగిచ్చేసి ఆ పిల్ల తన విలువను మరింత ఉన్నతం చేసుకున్నది. సిగ్గుగా అనిపించింది. నన్ను నేనే ఒక అపరిచితుని మాదిరి చూసుకున్న. నా తలలో సుత్తిదెబ్బలు కొడుతూ ఎవరో పెద్దగా తిడుతూ అరుస్తున్నారు. అదెవరో కాదు..నేనే. అయితేనేం.. అది నేనే అయినందువల్ల కూడా ఏదీ మారబోదు.. ఎవరికీ ప్రయోజనమూ ఉండబోదు.
*****************************************
-డా.ఎయం.అయోధ్యారెడ్డి
ఎంఏ, పిహెచ్.డి
కథా,అనువాద రచయిత, సీనియర్ జర్నలిస్ట్.
రోడ్ నం.4, గ్రీన్ హిల్స్ కాలనీ,
కొత్తపేట, హైదరాబాద్- 500035, తెలంగాణ
సెల్: +91-9399962117
మెయిల్: ayodhya.agu@gmail.com
June 2, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

కవిత్వ కళ – నైపుణ్యాలు

by నందిని సిధారెడ్డి June 2, 2021
written by నందిని సిధారెడ్డి

కవిత్వాన్ని సమాజమెప్పుడూ గౌరవిస్తుంది. అటువంటి కవిత్వం ఎంత విస్తృతంగా వస్తే, ఎంత మంది వ్రాస్తే అంత మంచిది. కానీ, కవిత్వానికి ఉండాల్సిన లక్షణాలు ఉన్నవా అని యోచించాలి. పోటెత్తుతున్న కవిత్వాన్ని కాలం వస్త్రగాలం పట్టినప్పుడు, నిలువగలగాలి కవిత్వం. నిర్దాక్షిణ్యంగా వడబోసే శక్తి కాలానికి ఉంటుంది. అందుకే కవులు కవిత్వాన్ని మెరుగుపరుచుకోవాలి. కవిత్వ నైపుణ్యాలను అలవర్చుకోవడానికి కొన్ని విషయాలను స్పృశించుకోవడం అవసరం. కవిత్వ నిర్వచనాలను, ప్రత్యేకతలను, కవిత్వ కళను, నైపుణ్యాలను చర్చించుకుందాం.
కవులు ఎన్నుకోబడని శాసనకర్తలు, “పోయెట్స్ ఆర్ అన్-ఎక్నాలెడ్జెడ్ లెజిస్లేటర్స్”
అంటాడు షెల్లీ. ఎన్నుకోబడని, కవులు మన చుట్టూ ఉంటారు. దాశరథి లాంటి కవి ‘కవిత్వం అంటే నాకొక వెర్రి’ అన్నాడు. ప్రజాసంఘంలో ఉండే కవికి ఎంతో గౌరవమిస్తూ, “ కవిరేవ ప్రజాపతిః” అన్నారు. కవి అనేవాడు బ్రహ్మతో సమానమన్నారు. ఎప్పుడైతే కవిత్వం పలుచగయినా, హీనమైనప్పుడైనా ఎగతాళి కూడా చేయబడుతుందని ఆనాటినుండి ఈనాటివరకు చూస్తూనే ఉన్నాం. ఒకప్రక్క బలమైన కవిత్వం వస్తుంటే, మరోప్రక్కన పలుచనైన కవిత్వమూ వస్తున్నది. పలుచని కవిత్వాన్ని సమాజం నిరసిస్తూనే ఉన్నది. అందుకే కవిత్వం రాయాలంటే తపస్సు చేసినట్టుచేయాలి. “నానృషిః కురుతే కావ్యమ్” ఋషి కానివాడు కవికాడని అన్నారు పూర్వీకులు. ఋషి అంటే, ఒక సుదీర్ఘకాలం తమ శక్తులన్నీ ఒకే విషయంపైన కేంద్రీకరించడమన్నమాట. బహుశా ఆనాడు అడవుల్లో ఈ విధంగా చేసి ఉండవచ్చు. శక్తులన్నీ అన్నప్పుడు, అవి 1.మానసిక శక్తి 2. బౌద్ధిక శక్తి 3. భౌతిక శక్తి అనే ఈ మూడింటికి శక్తిని కేంద్రీకరించినప్పుడు మాత్రమే కవిత్వాన్ని రాసే ఋుషి అవుతాడు. కవి ఈ మూడు శక్తులకు తోడు వాక్శక్తి కూడా కలిపి ఏకాగ్రతతో ప్రయోగిస్తే రచనా నైపుణ్యం పెరుగుతుంది. సంప్రదాయమైన పదజాలం ఉపయోగిస్తే అది సంప్రదాయవాదమేమీ కాదు. కేంద్రీకరించడం కీలకమైంది. ఆనాడు అడవుల్లో చేసిఉండవచ్చు, ఈ నాడు సమాజంలో ఉండి కూడా చేయవచ్చు. కవిత్వాన్ని నిండుగా, గంభీరంగా, పరిపూర్ణంగా ఉండేలా రాయాలి.
“దర్శనాత్ వర్ణోచ్చాద రూడే లోక కవిశ్రుతిః ” అన్నారు.
దర్శంచినదాన్ని వర్ణించేవాడే కవి. దేన్ని దర్శించాడు కవి? ఆనాడు ఇతిహాసాలు, పురాణాలు దర్శించి ఉంటారు. దర్శించాలంటే జీవితంలోకి వెళ్లాలి. జీవితం వినా మరొక ప్రపంచమేలేదు. ఇవ్వాళ తత్త్వానికిగాని, శాస్త్రానికిగాని, కవిత్వానికిగాని, మూలం ఎక్కడ అంటే జీవితమే భూమిక. ప్రపంచమే భూమిక. కాబట్టి మూలాల్లోకి, జీవితాల్లోకి వెళ్ళాలి. వర్ణించడమంటే ఏమిటి? దర్శించినదాన్ని వర్ణించగలగాలి, సమగ్రంగా రాయాలి. ఏదైతే చూసామో దాన్ని చెప్పడం, ఉన్నది అందమైతే అందంగా చెప్పడం, అందంగా భావించడం. దుఃఖాన్ని ఏడుపొచ్చే విధంగా చెప్పడం! కోపాన్ని అవతలి వాళ్ళకు కోపం వచ్చే విధంగా,ఆశ్చర్యాన్ని మరింత ఆశ్చర్యకరంగా,వికారాన్ని మరింత వికారంగా వర్ణించగలగాలి. అందాన్ని మరింత అందంగా చెప్పగలగాలి. ఉన్నది అందమైతే ఆ అందమంటే ఏమిటి? అని చెప్పడం వర్ణన. వర్ణన చేయగలిగేవాడు కవి అని వాడుక. వర్ణన అంటే ఎక్కువ చేసి చెప్పటం.
వర్ణించడానికి పరికరాలు సమకూర్చుకోవాలి. ప్రాచీన లాక్షణికులు, ఆలంకారికులు కవిత్వాన్ని గురించి నిర్వచిస్తూ “శబ్దార్థౌ సహితౌ కావ్యం” అన్నాడు భామహుడు. శబ్దార్థాలతో కూడుకొని ఉండేదే కవిత్వం అన్నారు. శబ్దాలు,అర్ధాలు రెండూ తప్పనిసరిగా ప్రతిభాషకూ ఉండాలి. అర్ధం లేని మాట అనేది ఉండదు. ఈ రెండు ఉన్నంతమాత్రాన కవిత్వం అంటామా?
అంటే, భామహుడు “కావ్యం అలంకారార్ధం” అన్నాడు. అందంగా, అలంకరించి శబ్దాన్ని చెప్పాలని అన్నాడు. మాట్లాడే మాటలనుండి ఒక అందాన్ని తీసుకురావాలి, ఒక అలంకారాన్ని తీసుకురావాలి. భాషలో ఉండే శబ్దాలను, అర్ధాలను ఉపయోగిస్తూ అలంకారాలను తయారుచేయాలి.
ఉన్నదాన్ని తీర్చిదిద్దాలి, మరింత శోభాయమానంగా అలంకరించగలగాలి. శబ్దాలంకారాలు, అర్ధాలంకారాలు అని ఉన్నవి. వాటిని ప్రత్యేకంగా అధ్యయనం చేసినపుడు చర్చించవచ్చు.
మాట్లాడే మాటలను అలంకరించి చెపితే చాలా? బాగా అలంకరించుకున్నంతమాత్రాన అందంగా ఉన్నట్టా? ఎక్కువ పౌడర్ మేకప్ వేసుకుంటే అందంగా ఉంటారా? అలంకారాలే కవిత్వమా? కాదు.
అలంకారాలు ఎక్కువవేసినా ఎబ్బెట్టుగా ఉంటుంది. ఎంత తగుతుందో అంత ఉండాలి. ఏ వస్తువు ఎక్కువ ఉపయోగించవద్దు. ఉచిత రీతిన ఉండాలి. దానినే ‘ఔచిత్యం’ అంటారు, “ఔచిత్యం రససిద్ధస్య స్థిరం” అన్నాడు క్షేమేంద్రుడు. ఇది కీలకం. ‘ఔచిత్యం’ ఉంటేనే రసం సిద్ధిస్తుంది అన్నాడు. “రీతి ఆత్మ కావ్యస్య” అన్నాడు వామనుడు. అంటే పద్ధతి ఉండాలని అర్థం. అర్థం, రీతి ఉంటె కవిత్వం అయిపోతుందా?
రీతి అంటే ఏమిటి? అని తెలుసుకుంటే, రీతి అంటే,”విశిష్ట పదరచనా రీతిః” అన్నాడు. అంటే మంచి పదాలను, విశేషమైన పదాలను ఏరి కూర్చడమే రీతి. నడవడిక అనేది రీతి, శైలి. అంటే, సరైన పాదాలను ఏర్చి కుర్చాలి అన్నాడు.
శ్రీశ్రీ రీతిని నిర్వచిస్తూ,”సరైనటువంటి మాటల్ని సరైనచోట, సరైనవిధంగా ప్రయోగించడమే కవిత్వరీతి“ అన్నాడు. కాలరిడ్జ్ “బెస్ట్ వర్డ్స్, ఇన్ బెస్ట్ ప్లేస్“ అన్నాడు. మంచి పదాలను మంచి స్థానంలో రచించడమే కవిత్వం. అయితే, మంచి పదాలను మంచిస్థానం దగ్గర రాయడం అనేదాంట్లోనూ సమస్య ఉన్నది. ఏ పదం ఎలాంటి చోట అనే విషయం. మనం ఉపయోగించే పద్ధతిని బట్టి, థాట్ ను బట్టి కూడా మంచిగా రాణించడం కవిత్వం అవుతుంది. చెప్పాల్సిన అంశానికి తగినట్టుగ చెప్పాలి. లేకుంటే అర్థం మారిపోతుంది. ఉదాహరణకు, తప్పుడు ప్రదేశంలో ఉంటె, తాటిచెట్టు క్రింద కూర్చుంటే ఏమంటారో మనకందరికీ తెలిసిందే! మంచి అంటే అర్థం ఏమిటి? లోకం ఒప్పుకునేదే! లోకం సమ్మతించేదే మంచి. లోకం ఒప్పుకునే రీతిలో ఉండాలి. మంచి అనేది నీతికి సంబంధించింది కూడా! గొప్పవైన పదాలను తీసుకొని మంచి స్థలంలో నిర్ణయించి ఉపయోగించి రాయడం అనేది కీలకమైనది. కవిత్వ రచనలో 1. భావాలు, 2. భావోద్రేకాలు (తీవ్రమైన భావాలు), 3. భావోద్వేగాలు (సెంటిమెంట్) అనేవి ముఖ్యమైనవి. అయితే, సాధారణ భావాలు,తీవ్రభావాలు, ఉద్వేగంతో కూడిన భావాలు. ఈ మూడింటిని వరుసగా కూరుస్తే కవిత్వమవుతుందా? అంటే అదికూడా కాదు. ఈ భావాలనూ, భావోద్రేకాలను, భావోద్వేగాలను పేర్చేప్పుడు నైపుణ్యంగా రాస్తూ పోవాలి. ఇక్కడ ముఖ్యవిషయం మరోటున్నది. ప్రాచీనులు ‘రసం’ అన్నారు. “వాక్యమ్ రసాత్మకం కావ్యం” అన్నారు. అంటే రసాత్మకంగా ఉండే రచన మాత్రమే కవిత్వం అవుతుంది. ఇది విశ్వనాథుడు అనే అలంకారికుడు అన్నాడు. ఇది చాలా ప్రాచుర్యం లోకి వచ్చిన మాట. ‘రసం’ అంటే ఏమిటి? అంటే, ఎదుటి వ్యక్తి హృదయాన్ని చ్వలింపచేసేది, ఎదుటి వ్యక్తి హృదయంలో కదలిక కలిగించేది, సంచలనం కలిగించేదిమాత్రమే రసం. ఎదుటి వ్యక్తి హృదయాన్ని కదిలించలేకపోతే ఎంత గొప్ప మాటలు, పదాలు వేసినా అది కవిత్వం కాదు.
కాలాన్నిబట్టి వాళ్ళ హృదయ భావాలూ, స్థాయిలు మారుతుంటాయి. కాబట్టి మారిన హృదయాలకు తగినట్టి భావాలనూ రాయాల్సి ఉంటుంది. కాబట్టి కవికి ఉండవలసిన లక్షణాలలో, కవిత్వానికి ఉండాల్సిన లక్షణాలలో ప్రధానమైనవి నవ్యత, కాలానుగుణ్యత భావాన్ని, భావనాశక్తితో, భావోద్రేకంతో ఇతరుల హృదయాలలో చలనం కలిగింపజేయాలి. శబ్దాలు ఎట్లైతే కవిత్వం కాదో, అట్లే, భావోద్వేగం కలిగించని భావాలు కవిత్వం కాదు. కవి భావాలు ఉద్వేగాన్ని కలిగించేలా ఉండాలి. అందుకే కవిత్వానికి ప్రత్యేక స్థానం ఉన్నది. జీవితంలో ఉద్వేగాలను పట్టుకోగలిగే శక్తి, కదిలించగలిగే శక్తి కవిత్వానికే ఉన్నది. కథ, నవలలకు కూడా ఈ శక్తి ఉన్నది. అవీ గొప్పవే, కానీ శరీరాన్ని, మనసునీ, రెండూ గగుర్పాటు పరిచే విధంగా, రోమాంచితమయ్యే స్థితి లో రాయగలిగే శక్తి కవిత్వానికి ఉంటుంది. అంటే వెంట్రుకలు నిక్కబొడుచుకునేలా ఉండాలి కవిత్వం! కవిత్వాన్ని కళగా భావించగలగే, భావోద్వేగం కలిగించే శక్తి ఎక్కువ ఉన్నది కాబట్టే సాహిత్యంలో మొదటి స్థానం కల్పించారు
సుదీర్ఘంగా రాసే కథ,నవలా రచయితల ప్రయత్నం కంటే కవితలో నాలుగైదు వాక్యాల్లో జీవితాన్ని చెప్పగలిగే భావం ఉంటుంది, నైపుణ్యం ఉంటుంది. అవి ఒక ఎత్తైతే ఇది ఒక ఎత్తు. ఉదాహరణకు, ”కాళ్ళు తడవకుండా సముద్రాలు దాటవచ్చు, కళ్ళు తడవకుండా జీవితాన్ని దాటలేము.”” రెండే వాక్యాలు! విమానాలు, ఓడలూ ఉన్నాయి కాబట్టి కాళ్ళు తడవకుండా సముద్రాన్ని దాటి వెళ్ళి పోవచ్చు. కళ్ళు తడవని వారు, ఎంత ధనవంతులైనా కళ్ళు తడవకుండా జీవితాన్ని దాటలేరు. జీవితంతోనే క‌విత్వం జీవిస్తుంది ! ఇట్లా మనసును కదిలించే భావోద్వేగంతో కవిత్వం రాయాలి.
పాశ్చాత్యకవి, వర్డ్స్ వర్త్ “పొయెట్రీ ఈజ్ స్పాంటేనియస్ ఓవర్ ఫ్లో ఆఫ్ పవర్ ఫుల్ ఫీలింగ్స్” అన్నాడు. ఆశువుగా, అప్పటికప్పుడు నీలోంచి వెల్లువెత్తే బలమైన అనుభవాలను వ్యక్తీకరించేదే కవిత్వం. ఎప్పుడొస్తది కవిత్వం? మనసు పొంగిపొర్లాలి. చెరువులు పొంగిపొర్లినట్లే, మనసులోని భావాలూ పొంగిపొర్లాలి. ఆ పొంగిపొర్లే పవర్ ఫుల్ ఫీలింగ్స్ తో , అంటే మనసు శక్తివంతమైన అనుభవాలతో, అనుభూతులతో అక్షరమై పొంగిపొర్లాలి. మనం తట్టుకోలేనంత ఉద్వేగం కలగాలి. కృతక ప్రయత్నం వేరు, తెచ్చిపెట్టుకున్న ప్రయత్నం వేరు. స్పాంటేనియస్ కవిత్వం వేరు. దాశరథికి కవిత్వం కోసం కాగితం దొరకకపోతే, ఒక పద్యం మనసులో కలిగితే, తన పైజామా నాడాను ఒక్కో భావం రాగానే ఒక్కో ముడి వేసేవాడట. తెల్లవారి జైలు గోడలమీద బొగ్గుతో రాసేవాడట. భావోద్వేగం కవిత్వంలో కీలకం.
కట్టమంచి రామలింగారెడ్డి “భావోద్రేకమే కవిత్వానికి ప్రాణం“. అన్నాడు. అణచుకున్నా, శాంతంగా ఉండాలన్నా ఉండనీయని భావోద్రేకం కలిగి కవి శరీరంలోంచి, కవి మనసులోంచి, తట్టుకోలేని భావాలు పొంగాలి.. పొంగి పొర్లడమనేది ఎప్పుడు జరుగుతుంది? ఆ స్థితి ఏంటి? అంటే దాన్నే ‘మూడ్’ అన్నారు. పోయెట్రీ రాయడానికి మూడ్ ఉండాలి. కానీ మూడ్ రాగానే సరిపోదు. భాష, శబ్దాలు కవి మూడ్ కు సహకరించే ఉపకరణాలు. క్రిస్ట‌ర్ కాడ్వెల్‌ “ పొయెట్రీ ఈజ్ హైటెన్డ్ లాంగ్వేజ్ “అన్నాడు. కవిత్వ‌మంటే ఉన్నతీకరించబడిన భాష. అన్నింటికి భాషే ముడిసరుకు. ఉదాహరణకు వజ్రం, రత్నం ముడిసరుకుగా ఉన్నప్పుడు వాటి కాంతి దేదీప్యమానమవవు. సానబెడితే ధగద్ధగేయమానంగా మెరుస్తాయి. మెరుపును తీసుకురావడం అంటే ఉన్నతీకరించాలి. మన చుట్టూ ఉన్న నిత్యజీవితంలోనూ, కాలప్రవాహంలో దొర్లుతూపోయే ఈ భాషను పట్టుకోవాలి. భరతుడు, “మృదులలిత పదార్థం”అన్నాడు. లలితమైనటువంటి, సుతిమెత్తనైనటువంటి, మృదువైనటువంటి పదాలు నాలుక మీద నడయాడాలి. ఇవి సేకరించుకోవడానికి విస్తృత అధ్యయనం ఒకటే మార్గం.
మార్మికమైన శబ్దాల ప్రయోగం చేస్తే కవిత్వ సోయగం దెబ్బతింటుంది. కవిత్వానికి మూడు శత్రువులు అనీ అన్నారు. 1. పాండిత్యం 2. బౌద్ధికత 3. శాస్త్రం. కవికీ, శాస్త్రకారునికి పొంత‌న కుదురదు. కవి భావుకతతో పని చేస్తే, శాస్త్రవేత్త సత్యంతో పనిచేస్తాడు. ప్రకృతిని వర్ణించేప్పుడు అది నిరూపణ కావాలంటుంది శాస్త్రం.

“వెన్నెల నన్ను ప్రేయసిలా ఆలింగనం చేసుకున్నది” అంటాడు కవి. శాస్త్రకారుడు, వెన్నెలేంటిది? నిన్ను ఎలా పట్టుకుంటుంది? అంటాడు. నండూరి సుబ్బారావు ఎంకిపాటలు రాస్తూ, “ఎన్నెలంతా మేసి యేరు నెమరేసింది” అన్నాడు. అద్భుతమైన పంక్తులు. సెలయేరు మీద వెన్నెల కురిసినప్పుడు మొత్తం ఆ ఏరు వెన్నెలను స్వీకరించి నెమరేసుకున్నట్లున్నది అంటాడు. వెన్నెల గడ్డా? ఏరు గొడ్డా? అంటూ విమర్శిస్తాడు శాస్త్రకారుడు. కవిత్వం భావోద్వేగంతో కూడి ఉంటుంది కాబట్టి లోలోపలినుండి తన్నుకువస్తుంది. కవిత్వం రాసే కవి హృదయావిష్కారమ‌ది. ఇందులో ఉప్పొంగేవి భావాలే! మన హృదయమే, మన మనసే సాక్షి. కవిత రాసాక మనసు తేలికపడితే గొప్ప కవి అన్నట్టు. కవితగా వచ్చేస్తే మానసికమైన ఒత్తిడులు తగ్గి హాయి ఉంటుంది. లేకుంటే అశాంతిగా ఉంటుంది. ఇట్లా భావాన్ని వ్యక్తీకరించే శక్తి కూడా ఉండాలి. కట్టమంచి రామలింగారెడ్డిగారు జ్ఞాపకశక్తి గొప్పదా, మనశ్శక్తి గొప్పదా అని చర్చించినప్పుడు మనశ్శక్తే గొప్పదన్నాడు. ఇప్పుడు వేరుగాని గతంలో కృష్ణశాస్త్రి, రాయప్రోలు అవధానాలను కవిత్వంగా ఒప్పుకోలేదు. అవధానులది అంతా పాండిత్యం. ధారణ అది. అంటే జ్ఞాపకశక్తి. వారు పండితులు. మనశ్శక్తి కొత్తది సృష్టిస్తుంది. జ్ఞాపకశక్తి ఉన్నదాన్ని గుర్తుకుపెట్టుకుంటుంది. కొత్త సృష్టి చేయదు. విలక్షణమైన, లక్షణమైనకవిత్వం ‘మహాప్రస్థానం‘. ‘మరో ప్రపంచం ‘ అన్నాడు శ్రీశ్రీ. మనం నిజంగానే మరోప్రపంచం ఊహించాము. అలా కవిత్వం వర్ణించాలి,అందంగా ఉండాలి,ఔచితీమంతంగా ఉండాలి . కవిత్వంలో నచ్చిన పంక్తులు పదేపదే గుర్తొచ్చే పంక్తులు ఎవరైతే రాస్తారో అదే కవిత్వం.

“నిరంతరం జ్ఞాపకం ఉండేది కవిత్వం “ అన్నారు తిరుపతి వేంకట కవులు. వెంటాడేది,భావోద్వేగాలతో మనసును ఆవహించేలా ఉండాలి కవిత్వం. భాష పట్టుబడాలి. కవిత్వం మీద ఉండే ప్రేమ ఖచ్చితంగా భాష మీద ఉండాలి. వరవర‌రావ్ “నా ఫస్ట్ లవ్ కవిత్వం” అన్నాడు. భాష ద్వారానె కవిత్వ కళ‌ సిద్ధిస్తుంది, ఆకట్టుకుంటుంది. అభ్యాసం తో కళ వస్తుంది. కవిత్వాన్ని ప్రేమించగలిగే అభ్యాసం కావాలి. దండి, ‘ఇష్టార్థ వ్యవచ్ఛిన్న పదావళీ కవిత్వం’ అన్నాడు. ఇష్టముతో కూడిన అర్దాలను ఇష్టం తో నే పట్టుకోగలము. కవిత్వ ఆత్మ‌ను పట్టుకోవాలి. పదాలు, మాటలు, వాక్యాలు మన పక్కనించే పోతుంటవి. మనం గుర్తించకుంటే కవిత్వం రాదు. భాష లో ఉండే సౌందర్యాన్ని ఆవాహన చేసుకోవాలి. ప్రతిభావంతుడు కూడా బాల్యం నుంచి నైపుణ్యాల కోసం కృషిచేయాల్సిందే. ఈ కాలానికి అన్వయించుకుంటే , సెల్ఫోన్ కు సిగ్నల్స్ అందినట్టు ఉండాలి కవిత్వం. అప్పుడే కళ ఆవిష్కారమవుతుంది. కవికీ పాఠకునికీ కనెక్ట్ కావాలి.ఆ సిగ్నల్స్ ద్వారానే కళ ఆవిష్కారమవుతుంది. ఇది ప్రత్యేకమైన కళ. అలవోకగారాదు. నేర్చుకోవాలన్న తపన ఉండాలి. జిజ్ఞాస ఉండాలి. నేర్చుకున్నాక కళగా మారే అవకాశం వుంది.

పోయెట్రీ ఈస్ ఆర్ట్ అఫ్ ఎక్స్ప్రెషన్. జీవితం లో ముంచి తీయాలి. రగులుతున్న భావం లో కాలినటువంటి భాష కావాలి. జీవితం తో ఉండే గాఢమైన అనుబంధంతో పరిశీలనతో కవిత్వం వస్తుంది. ఏ కళ అయినా భావోద్వేగం తో నే ముడిపడింది ఉంటుంది. మొండివారిపోయిన యాంత్రికమైన మనసుకు కవిత్వం అంటదు. భావాలని స్వీకరించ గలగాలి.

ఆర్ట్ ఆఫ్ పోయెట్రీ , అనేది లైఫ్ లాంగ్ క్రాఫ్ట్ . అంటే చెక్కడమే! ఇది క్రాఫ్టే! నిపుణత్వం ! జీవితకాలం నేర్చుకోవాల్సిన నైపుణ్యం . కవిత్వం జీవితకాలం అభ్యసించాల్సిన క‌ళ కవిత్వకళ . హృదయంతో ఆస్వాదన చేసుకోవాల్సింది . దాశరథి “ అన్ని ఇజాల వాళ్ళు చాపకూడు కుడువడానికి సరిపోయే అద్భుతమైన వేదిక కవిత్వం” అన్నాడు. అన్ని ఇజాలు, భావకవిత్వం, రివెల్యూషనరీ పోయెట్రీ , ప్రోగ్రెసివ్ పోయెట్రీ , దళిత, వుమెన్ , మైనారిటీ పోయెట్రీ, అనుభూతి వాద , సర్రియలిస్టిక్ పోయెట్రీ -అన్ని,అన్నీ ఉంటాయి. ఇన్ని ఇజాలవారు ఎక్కడ కలుస్తారూ అంటే కవిత్వం దగ్గర కలుస్తారు. ఒక కవికి మరో కవి అంటే అభిమానం ఉంటుంది ఉండాలి. ఇదే కవిత్వ శక్తి, ఇదే కవిత్వ కళ!

కవిత్వం మరింత గొప్పగా రాయడానికి మనశ్శక్తి, బౌద్ధిక శక్తి,శరీర శక్తి అన్నీ కలిసి, కలిపి రాస్తే ప్రాణ‌శ‌క్తి వ‌స్తుంది. పరవశాన్ని కలిగించే కవిత్వం వస్తుంది. వర్తమానానికి అనుగుణంగా కవిత్వాన్ని మలుచుకుంటూ రాయాలి. నిన్న కోత కోసిన కొడవలి ఇవ్వాళ తెగదు. మళ్ళీ సాన పెట్టుకోవాలి. అట్లాగే కవి తనను తాను సాన పెట్టుకోవాలి. సీతాకోక చిలుకనో, దువ్వెననో తూనీగనో పట్టుకోవాలంటే చిన్నతనంలో ఎట్లైతే ఎంత నిశ్శబ్దంగా , జాగ్రత్త పడేదో ఒదిగి, ఒడిసి ప‌ట్టుకునేదో అట్లా! అట్లా జాగ్రత్తవహిస్తే దొరుకుతుంది. మనల్ని మనం అంతగా ఒదిగించుకోవాలి. పట్టుకోవాలి. నేర్పుగా కవిత్వ రెక్కల్ని పట్టుకోవాలి. క‌విత్వాన్ని అందుకుందాం. కవిత్వ కళలు లోకం కోసం వినియోగిద్దాం!!

-నందిని సిధారెడ్డి
తెలంగాణ సాహిత్య అకాడమీ పూర్వ అధ్యక్షులు
+91-94403 81148

June 2, 2021 0 comment
2 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

విదేశాల్లో రామకథ

by డా॥ వెలుదండ నిత్యానంద రావు June 2, 2021
written by డా॥ వెలుదండ నిత్యానంద రావు
ప్రపంచ సారస్వతానికి భారతదేశం అందించిన అద్భుతమైన కానుక శ్రీమద్రామాయణం. గిరులు, ఝరులు, తరులు, విరులు ఉన్నంతకాలం రామకథ ఈ నేల మీద గుబాళిస్తుంది. గిరిజనులు, పురజనులు అనే తేడా లేకుండా కులం, ప్రాంతం అనే వివక్ష లేకుండా రామాయణంలోని ప్రధాన పాత్రలైన రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు, ఆంజనేయుడు, సీత, కౌసల్య, సుమిత్ర పేర్లను ప్రజలు పెట్టుకొన్నారు. రావణ, కుంభకర్ణ, శూర్పణఖ, మంధర, కైకేయిలాంటి దుష్టపాత్రల పేర్లను పెట్టుకోకుండా బహిష్కరించారు. తెలివితేటలు, ఎక్కువైన నేటి కాలంలోను రాముని తిట్టిపోసేవారు కూడా రామస్వాములే అయ్యారు. కాని రావణ స్వాములుగా తమ పేరు మార్చుకోలేకపోయారు. వారి పిల్లలకైనా ఆ పేర్లు పెట్టుకోలేకపోవడం గమనార్హం.
ప్రజలు, వారి వారి మానసిక భౌతిక స్థాయిననుసరించి, అభిరుచుల కొద్ది రామకథను పాటలుగా, యక్షగానాలుగా, భజన కీర్తనలుగా, జానపద గీతికలుగా, ఇతిహాసాలుగా, ప్రబంధాలుగా, నాటకాలుగా భిన్న భిన్న ప్రక్రియల్లో పాడి, రచించి తరించారు. తెలుగునేలపై వ్యాపించిన కథకు మనకు తెలిసిన రామకథకు ఎన్నో తేడాలు కనిపించి ఆశ్చర్యమగ్నులని చేస్తాయి. ప్రాంతీయమైన హద్దులను ఛేదించుకొని రామకథ విశ్వవ్యాప్తమై వెలుగొందింది.రామాయణంలో ప్రతిఫలించిన కుటుంబ సంబంధాల్లో ఆత్మీయతలు, ఒకరి కోసం ఒకరు ఆరాటపడడం, కష్టాలు పడడం, నిందలు పడడం లాంటి సహజ మానవ అనుభూతుల మూలంగా ప్రపంచ ప్రజలందరూ తమ కుటుంబాలలో తమవారిలో రామాయణాన్ని దర్శించుకున్నారు. టిబెట్‌, భూటాన్‌, నేపాల్‌, జపాన్‌, బర్మా, చైనా, ఇండోనేషియా, పిలిప్పీన్స్‌, మారిషస్‌, బెల్జియం, కాంబోడియాలాంటి దేశాల్లో రామకథ వ్యాపించింది. అయితే ప్రధాన సంఘటనకు భంగం లేకుండా స్థానిక భాషా సంప్రదాయాలకు, మత సంస్కృతులకు, ఆచార వ్యవహారాలకు అనుగుణంగా పాత్రలు, సంఘటనలు మారిపోతాయి.

భారత ఉపఖండంలో ఒకప్పటి భాగం బర్మా దేశం. బాలగంగాధర తిక్‌ లాంటి దేశభక్తులు బర్మాలోని మాండలే జైల్లో కారాగారవాస శిక్ష అనుభవించారు. తమిళ కంబ రామాయణం 1800లో బర్మాలోకి అనువాదమైంది. 1874లో యూట్‌ అనే కవి రాసిన ‘రామయోగిన్‌’కు బర్మా దేశంలో ఎంతో పేరు వచ్చింది. బర్మా రామాయణంలో దశరథుడు పుత్రకామేష్ఠి చేయడు. త్రిశూలుడు అనే మహర్షి ఇచ్చిన మంత్రపూరితమైన ఫలాల వలన సంతానం కలుగుతుంది. మారీచునకు బదులుు ‘బంబి’ అనబడే శూర్పణఖ మాయామృగంగా మారుతుంది. అవాల్మీకంగా తెలుగునేలపై ప్రసిద్ధమైనట్లే పర్ణశాల చుట్టూ మూడు గీతలు గీసి సీతాదేవిని దాటి రావద్దని ఆదేశించి లక్ష్మణుడు రాముని కోసం వెళ్తాడు.

బర్మా రామాయణంలో రావణుడు తనను క్షమించమని రాముని ప్రార్థించడం విశేషం. రాముడు అంగీకరించకుండా ‘నీ దుష్టకర్మ ఫలితమే నిన్ను చంపుతుంది’ అని సంహరిస్తాడు. భూటాన్‌ రామాయణంపై బౌద్ధమత ప్రభావం అధికంగా గోచరిస్తుంది. కార్తవీర్యార్జునుని కథ దశరథుని కథ కలగాపులగమై చిక్కు విడదీయరానంతగా కలిసిపోయాయి. దశరథుని కుమారుడు సహస్ర బాహువు. అడవిలో పరశురాముని తండ్రి ఆతిథ్యాన్ని స్వీకరించి అతనే కామధేనువుని లాక్కోబోతాడు. అతడు తిరస్కరించేసరికి సహస్రబాహువు అతన్ని చంపేస్తాడు. పరశురాముడు ప్రతీకారంతో సహస్రబాహుని చంపేస్తాడు. సహస్ర బాహువు కొడుకులే రామలక్ష్మణులు. రాముడు పెరిగి పెద్దవాడై తండ్రిని చంపిన పరశురాముని సంహరిస్తాడు. ఇది కథ. ఈ భూటాన్‌ రామాయణంలో దశరథుని మనుమలుు రామలక్ష్మణులన్నమాట. రాముడు చిన్నవాడు. లక్ష్మణుడు పెద్దవాడు. రామక్ష్మణుల్లో సీతాదేవిని ఎవరు పెళ్ళాడుతారో స్పష్టంగా లేదు. కథాంతంలో బుద్దుడే రాముడని చెప్తారు.

కాంబోడియాలో 17వ శతాబ్దం నుంచి రామాయణం వ్యాప్తిలో ఉన్నట్లు తోస్తుంది. కాంబోడియా రాజధానిలో వున్న బౌద్ధారామంలో రెండువేల తాళపత్ర గ్రంథాలున్నట్లు అందులో ఎన్నో రామాయణ సంబంధమైన పుస్తకాలున్నట్లు వినికిడి. కాంబోడియా రామాయణంలో విశ్వామిత్రుని యాగాన్ని తాటక మారీచులకు బదులు కాకాసురుడు ధ్వంసం చేస్తాడు. సంజీవని కోసం వెళ్ళిన ఆంజనేయుడు సంజీవనితోపాటు నంది మూత్రం, దేవగంగా జలాలను కూడా తెస్తాడు.

చైనాలో ప్రధానమైన మతం బౌద్ధం. రామునకు మారుగా బోధిసత్వుడు కనిపిస్తాడు. బోధిసత్వుడు ప్రజారంజకుడైన పాలకుడు. ఆయన భార్య అపురూప సౌందర్యవతి. ‘నాగుడు’ అనే వ్యక్తి బోధిసత్వుని రాణిని వశపరచుకోవాలనే దురూహతో బోధిసత్వుని సేవించి విశ్వాసాన్ని చూరగొంటాడు. ఒకనాడు బోధిసత్వుడు అడవికి వెళ్ళగా మహారాణిని ఎత్తుకొని పోతాడు. తర్వాత జటాయువుతో యుద్ధం `వానర సాయం` బోధిసత్వుడు యుద్ధంలో మూర్ఛపోతే సంజీవనితో బతికిస్తారు. తర్వాత బోధిసత్వుడు నాగుడిని సంహరించి మహారాణిని తెచ్చుకుంటాడు. వాల్మీకి కథకు ప్రతిధ్వనిలా బోధిసత్వుని పరంగా చైనా రామాయణం మలచబడిందిి.

టిబెట్‌ రామాయణంలో కైకేయి భరత శత్రుఘ్నుల పాత్రలు వుండవు. ఒకసారి దశరథుడు రాక్షసునితో యుద్ధంలో గాయపడి మంచం పాలై రాజ్యాన్ని పాలించలేని స్థితిలో వుండి రామునకు పట్టాభిషేకం చేయాని నిర్ణయించుకుంటాడు. రాముడు తన తండ్రి మాత్రమే రాజ్యమేలాలని వాదించి అడవికి వెళ్ళిపోతాడు. రాముని పాదుకలను వుంచి ప్రతినిధిగా లక్ష్మణుడే పాలిస్తాడు. ఈ రామాయణంలో రాముని భార్య పేరు సీత కాదు లీలావతి. రావణుడు లీలావతిని ఎత్తుకుపోతాడు. విభీషణునితోపాటు కుంభకర్ణుడు కూడా రావణుని తిరస్కరించి రాముని శరణు కోరుతాడు.

వియత్నాంలో ఎన్నో సంస్కృత శాసనాలు బయటపడ్డాయి. రాముని వంశం వారమని రామునిలాగా పరిపాలిస్తామని రాజులు తమ శాసనాల్లో చెప్పుకొన్నారు. వాల్మీకికి ఒక దేవాలయం కట్టిస్తున్నట్లు ఒక శాసనంలో పేర్కొనబడిరది.

రామాయణంలోని లంక నేటి శ్రీలంక అనీ కాదనీ వాదోపవాదాలున్నాయి. 7వ శతాబ్దిలో వాల్మీకి రామాయణాన్ని అనుసరించి శ్రీలంక రాజవంశానికి చెందిన కుమార దాసుడు ‘జానకీహరణం’ అనే సంస్కృత కావ్యాన్ని రాశాడు. భారవి కాళిదాసు స్థాయిలో రాయబడిన ఈ కావ్యం 12వ శతాబ్దిలోనే సింహళ భాషలోకి అనువాదమైంది. శ్రీలంకలోని సువార ఏలియా అనే జిల్లాలో ఒక ప్రదేశాన్ని రావణుని అంతఃపురమని చెప్తారు. వాలి కలలో ప్రవేశించి అశోకవనాన్ని, లంకను దహించి సీతాదేవిని తన వీపుమీద కూర్చోబెట్టుకుని శ్రీరామునకప్పగిస్తాడు. కొంత కాలమయ్యాక పార్వతీదేవి సీతాదేవిని చూడడానికి వస్తుంది. ఆమె మాటల సందర్భంగా రావణుడెలా వుంటాడని అడుగుతుంది. సీతాదేవి రావణుని బొమ్మ గీసి చూపెడుతుంది. ఆ సమయంలో రాముడు మందిరానికి రావడంతో హడావుడిగా సీత తన పరుపు కింద బొమ్మను దాచిపెడుతుంది. రామునకు పాన్పు కదులుతున్నట్లు తన నెవరో పడదోస్తున్నట్లు అనిపించడంతో పాన్పును పక్కకు జరిపి చూస్తాడు. రావణుని చిత్రపటం కనిపిస్తుంది. దానితో గర్భవతి అని కూడా దయ దల్చకుండా సీతాదేవిని అడవిలో వదిలిపెడ్తాడు. సీతాదేవి వాల్మీకి ఆశ్రమంలో ఒక కుమారుని కంటుంది.
ఒకరోజు సీతాదేవి స్నానానికి వెళ్ళగా కుమారుడు దోగాడుతూ పక్కనున్న పొదల్లోకి వెళ్తాడు. వాల్మీకి సీతాదేవి వచ్చేలోగా మరో శిశువును మంత్రశక్తితో సృష్టిస్తాడు. తాను కన్న శిశువు ఇతడే అని ఎత్తుకుంటున్నప్పుడు దోగాడుతూ బయటికి వెళ్ళిన అసలు శిశువు వస్తాడు. సీతాదేవి ఆశ్చర్యపోగా వాల్మీకి జరిగిన సంగతి చెప్తాడు. అప్పుడు సీతాదేవి నీకు అంత శక్తి నిజంగా ఉంటే నా ముందు ప్రదర్శించమంటుంది. అప్పుడు వాల్మీకి మరో శిశువును మంత్రశక్తితో సృష్టిస్తాడు. సీతాదేవి సంతోషంతో ముగ్గురు పిల్లలను పెంచుతుంది.

పిలిప్పైన్స్‌లో ఇస్లాం మత సంస్కృతి ప్రాచీన భారతీయ సంస్కృతీ కలిసి వారిదైన ఒక సంస్కృతి ఏర్పడింది. ఈ దేశంలో రామాయణాన్ని ‘మహారాజ రావణ’ అని వ్యవహరిస్తారు. రామలక్ష్మణులు సీత స్వయంవర వార్త విని స్వయంవరం జరిగే ప్రాంతానికి సముద్ర మార్గాల గుండా వెళ్ళి మధ్యలో ఆపద పాలవుతారు. ‘కబైమాన్‌’ అనే ఒక స్త్రీ చూసి సముద్రంలోకి దూకి రామక్ష్మణులను రక్షించి స్వయంవరం జరిగే చోటికి చేరుస్తుంది. శివధనుర్బంగానికి బదులు ఒక పెద్ద బంతిని కాలితో తంతే అది వెళ్ళి సీత వున్న గది ముందు పడాలన్నది నియమం. శ్రీరాముడు నెగ్గుతాడు. మరికొన్ని పరీక్షలు వుంటాయి. కావ్యమంతటా దశరథుని సుల్తాన్‌ అని సంబోధిస్తారు. రావణుని పడగ్గదిలో ఉన్న ఒక వజ్ర పాషాణంమీద ఖడ్గాన్ని పదునుపెట్టి ఆ ఖడ్గంతో రావణుని చంపితే చస్తాడు.

థాయ్‌లాండ్‌ దేశ రాజధాని అయోధ్య. 420 సంవత్సరాలు 37మంది రాజులు ఆ దేశాన్ని పాలించారు. రాజు పేర్లు అన్నీ రామనామంతో ముడిపడి వున్నవే. 1737లో థాయ్‌లాండ్‌ను పాలించిన రామచక్రవర్తి ‘రామకీన్‌’ పేరుతో రాసిన రామాయణానికి ఎంతో పేరు ప్రఖ్యాతులు కలిగాయి. థాయ్‌లాండ్‌లో రామాయణ పాత్రలు ఎలా రూపాంతరం చెందాయో చూడండి. తోనరట్‌ – దశరథుడు, కౌసూర్య – కౌస్య, కయకశి – కైకేయి, రామ – రాముడు, లక్‌ – లక్ష్మణుడు, బ్రోత్‌ – భరతుడు, శత్రూట్‌ – శత్రుఘ్నుడు, సీదా – సీత, సుక్రీవ్‌ – సుగ్రీవుడు, రావన – రావణుడు, సమ్మనక్క – శూర్పణఖ.
థాయ్‌లాండ్‌ రామాయణంలో సీతారాములిరువురు వివాహానికి ముందే పరస్పరం ఆకర్షితులవుతారు. అంతఃపుర గవాక్షం దగ్గర సీతను చూసి రాముడు రహస్యంగా మాట్లాడుతాడు. సీత కలలో వున్నప్పుడు ఆంజనేయునకు ఆ మధుర సంభాషణను తన గుర్తుగా సీతకు చెప్పమంటాడు. చిన్నప్పుడు మంధర కాలు లాగి పడవేసినందుకు ప్రతీకారంగా రాముని పట్టాభిషేకం చెడగొడుతుంది. థాయ్‌లాండ్‌ రామాయణంలో మూలానుసారంగా వుంటూనే మైరావణుని కథలాంటి విశేషాలున్నాయి. రావణుడు విభీషణుని కూతురును ‘సీత రూపంలో వెళ్ళి రాముని సైన్యమున్న చోట నదిలో చనిపోయినట్లు శవంలాగ తేలియాడుతున్నట్లు వుండు. నిన్ను చూసి రాముడు సీత చనిపోయిందన్న దుఃఖంతో అయోధ్యకు వెళ్లిపోతాడు’ అని ఆదేశిస్తాడు. కాని విభీషణుడు రాక్షస మాయగా గుర్తుపట్టి తన కూతురు అని కూడా దయదల్చకుండా రామునితో చెప్పి మరణశిక్ష విధించమని చెప్తాడు. ఇలా వాల్మీకి కవికోకిల గానం భారతదేశం దాటి దిగంతాల దాకా వ్యాపించింది. ఇంకా ఆ గానం నిరంతరం సాగుతుంటుంది.

(మాన్య శ్రీ జె.వి.సుబ్బారాయుడి విదేశాల్లో రామకథ ఆధారంగా ఆకాశవాణి ప్రసారం) – ఆంధ్రభూమి (దినపత్రిక) 30-3-2004

-డా॥ వెలుదండ నిత్యానంద రావు
ప్రొఫెసర్ , ఉస్మానియా విశ్వవిద్యాలయం, తెలుగు శాఖ.
+91-9441666881

June 2, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

అభ్యుదయ శక్తులకు నిరంతర స్ఫూర్తి

by మోతుకూరి నరహరి June 2, 2021
written by మోతుకూరి నరహరి
అభ్యుదయ శక్తులకు నిరంతర స్ఫూర్తి/కష్టజీవులకు కొండంత అండ శ్రీశ్రీ. -మోతుకూరు నరహరి.

* * *

‘కష్టజీవికి ఇరువైపులా నిలబడే వాడే కవి’ (క ష్టజీ వి)అని అల్పాక్షరాలలో అనల్పమైన సత్యాన్ని చెప్పిన మహాకవి, ప్రజాకవి శ్రీశ్రీ. శ్రీశ్రీ జన్మించింది 1910లో విశాఖపట్టణంలో. అస్తమించింది 1983లో చెన్నైలో. ఆయన ఈ లోకం నుంచి నిష్క్రమించి 38 ఏళ్ళు కావస్తున్నా ఇప్పటికీ జనాన్ని -ముఖ్యంగా కార్మికులకు, కర్షకులకు,అనేకానేకులైన చేతివృత్తులవారికి, వారిపట్ల సానుభూతి గల, వారితో తాదాత్మ్యం చెందే మేధావులకు, కవులకు, కళాకారులకు తన కవితలతో నిరంతరం ఉత్తేజాన్ని ఇస్తూనే ఉన్నాడు. కవితలను అల్లడం ప్రారంభించిన కాలంలో కవితా లోకంలో ఆనాటి దిగ్గజాలు అయిన విశ్వనాథ సత్య నారాయణ, దేవులపల్లి కృష్ణ శాస్త్రిగారల ప్రభావంతో ప్రకృతి, ప్రేమ, తాత్వికత వంటి అంశాలపై ‘ప్రభవ’ మొదలైన శీర్షికలతో చక్కని పద్యాలు రచించిన శ్రీశ్రీ త్వరలోనే వారి ప్రభావం నుండి బైటపడి, సామాజిక సమస్యల పరిష్కారానికి 1934లో సాహితీరంగంలో సుదీర్ఘ యాత్ర(లాంగ్ మార్చ్)ను ‘మహా ప్రస్థానం’ కవితతో ప్రారంభించాడు. ఈ గీతంలో ‘ఎర్రబావుటా నిగనిగల’ను, ఒక మనిషిని వేరొక మనిషీ- ఒక జాతిని వేరొక జాతీ- పీడించే సాంఘిక ధర్మం చెల్లని ‘మరో ప్రపంచా’న్ని ప్రస్తావించాడు. ఈ మహాప్రస్థానానికి ప్రారంభ సూచనగా 1933లోనే ‘జయభేరి’ని మోగించాడు. ”నేను సైతం ప్రపంచాగ్నికి- సమిధనొక్కటి ఆహుతిచ్చాను” అని ప్రారంభమైన ‘జయభేరి’ కవిత ”నేను సైతం భువన భవనపు- బావుటాన్నై పైకి లేస్తాను” అనే ఉన్నత ఆశయ వ్యక్తీకరణతో ముగుస్తుంది. ‘మహాప్రస్థానం’ కవితల సంపుటిని అకాలమరణం పాలైన తన సన్నిహిత మిత్రుడు కొంపెల్ల జనార్దన రావుకు ‘అంకితం’ ఇస్తూ ”నిరుత్సాహాన్ని జయించడం- నీవల్లనే నేర్చుకుంటున్నాము” అన్న వాక్యం ప్రజా ఉద్యమాలలో ఉన్న మనం అందరం నిరంతరం జ్ఞాపకం ఉంచుకోవలసిన మాట. సమాజంలోని అనేకానేక సమస్యలను‌ ప్రస్తావించి, వాటికి గల కారణాలను విశ్లేషించి, పరిష్కారాలను సూచించిన శ్రీశ్రీ ‘బాటసారి’ లో వలస బతుకును,’భిక్షవర్షీయసి’ లో అనాథ వృద్ధ స్త్రీల పరిస్థితిని, ‘ఆకాశదీపం’ లో నిరాశోపహతుడైన నిరుద్యోగ యువకుడినీ చిత్రించాడు.

తన కవితలను “కార్మికలోకపు కల్యాణానికి- శ్రామికలోకపు సౌభాగ్యానికి- సమర్పణంగా,సమర్చనంగా” విరచించిన శ్రీశ్రీ ‘పొలాల్లో బంగారం పండుతుంది’ అనే సామెతను “పొలాలనన్నీ హలాల దున్నీ-ఇలాతలంలో హేమం పండగ-జగానికంతా సౌఖ్యం నిండగ..” అని కవితగా మలిచి తన ఆకాంక్షను వ్యక్తీకరించాడు. “కమ్మరి కొలిమీ,కుమ్మరిచక్రం” వంటి అనేకానేకాలైన చేతివృత్తుల వారి సాధనాలను ప్రస్తావించి, అవే “నా వినుతించే- నా విరుతించే-నా వినిపించే- నవీనగీతికి భావం,భాగ్యం- ప్రాణం,ప్రణవం..”అన్న శ్రీశ్రీ నిస్సందేహంగా శ్రామిక జన పక్షపాతి. వారికి నిరంతర స్ఫూర్తి ప్రదాత. స్వయం ప్రకటితమేధావులు కొందరు మెట్టవేదాంతాన్ని వల్లిస్తూ దోపిడీ వర్గాలకు వత్తాసు పలకడాన్ని ‘మిథ్యావాది’ కవితలో చీల్చి చెండాడాడు శ్రీశ్రీ. “జమీందారు రోల్సు కారు- మాయంటావూ? బాబూ!ఏమంటావు?.. మహారాజు మనీపర్సు- మాయంటావూ?- స్వామీ! ఏమంటావు?- పాలికాపు నుదుటి చెమట- కూలివాని గుండె చెరువు- బిచ్చగాడి కడుపు కరువు- మాయంటావూ?.. ఏయ్!ఏమంటావు?” అని మిథ్యావాదులను గద్దించి, నిలదీసి, వారికి చెమటలు పట్టించాడు. అభివృద్ధి కాముకులను , అవకాశ వాదులను/తిరోగమన వాదులను స్పష్టంగా విడదీసి చెప్తూ “అలజడి మా జీవితం- ఆందోళన మా ఊపిరి- తిరుగుబాటు మా వేదాంతం- ముళ్ళూ రాళ్ళూ అవాంతరాలెన్ని ఉన్నా- ముందు దారిమాది… ముందుకు పోతాం మేము- ప్రపంచం మావెంట వస్తుంది- అభిప్రాయాల కోసం- బాధలు లక్ష్యపెట్టని వాళ్ళు- మాలోకి వస్తారు- అభిప్రాయాలు మార్చుకొని- సుఖాలు కామించే వాళ్ళు- మీలోకి పోతారు..” అనగలగడమే శ్రీశ్రీ విశిష్టత. “కొంతమంది కుర్రవాళ్ళు- పుట్టుకతో వృద్ధులు- తాతగారి నాన్నగారి- భావాలకి దాసులు- ఉత్తమొద్దు రాచ్చిప్పలు- నూతిలోని కప్పలు- నేటి నిజం చూడలేని- కీటక సన్యాసులు” అంటూ పక్కదారి పడుతున్న యువతపై కొరడా ఝళిపించిన శ్రీశ్రీ భగత్ సింగ్ వంటి దేశభక్తియుత యువ కిశోరాల వారసులైన వారిని- “మరికొంతమంది యువకులు రా- రాబోవు యుగం దూతలు- పావన నవజీవన బృం దావన నిర్మాతలు- బానిసభావాలను తల- వంచి అనుకరించరు- పోనీ అని అన్యాయపు- పోకడలను సహించరు- వారికి నా ఆహ్వానం- వారికి నా సాల్యూట్”- అని అభినందించాడు,వీపు తట్టాడు.
సహజంగా అభ్యుదయ,విప్లవ కవి అయిన శ్రీశ్రీ ‘శైశవగీతి’ ని ఎంతో మార్దవంగా రాయడం ఆశ్చర్యం అనిపించినా ఆయన దృష్టి ఎంతమాత్రమూ పాక్షికం కాదు-అది బహుముఖీనం- అని చెప్పడానికి ఉదాహరణగా నిలుస్తుంది. “వాన కురిస్తే- మెరుపు మెరిస్తే- ఆకసమున హరివిల్లు విరిస్తే- ఇవి మాకే అని ఆనందించే పాపల్లారా!” అనడంలో శ్రీశ్రీ బాల బాలికలలో తానూ ఓ బాలుడై పోయినట్టుగా అనిపిస్తుంది. శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’తోపాటు ‘ఖడ్గసృష్టి’, ‘మూడు యాభయిలు’ , ‘మరో మూడు యాభయిలు’ వంటి కవితా సంపుటాలతోపాటు అనేక వ్యాసాలను,నాటికలను,’నా చైనా యానం’అనే యాత్రా చరిత్రనూ రచించాడు. ‘ఖడ్గసృష్టి’ ని ప్రారంభిస్తూ “రెండు రెళ్ళు నాలుగన్నందుకు- గూండాలు గుండ్రాళ్ళు విసిరే సీమలో- క్షేమం అవిభాజ్యం అంటే- జైళ్ళు నోళ్ళు తెరిచే భూమిలో- …ఆశయం ఉండడం మంచిదే కాని- అన్ని ఆశయాలూ మంచివి కావు- ఆశయాలు సంఘర్షించేవేళ- ఆయుధం అలీనం కాదు-.. అందుకే సృష్టిస్తున్నాను- అధర్మ నిధనం చేసే ఈ ఖడ్గాన్ని- కలంతో సృష్టిస్తున్న ఖడ్గం ఇది- జనంతో నిర్మిస్తున్న స్వర్గం ఇది- ఇది సమాన ధర్మాన్ని స్థాపిస్తుంది- నవీనమార్గాన్ని చూపిస్తుంది- ఇది నిజం- నవధర్మం మానవధర్మం- ఆణుశక్తి కన్న- మానవశక్తి మిన్న….” అన్న శ్రీశ్రీ ధర్మాగ్రహాన్ని అర్థం చేసుకోవాలి, అన్వయించుకోవాలి, ఆచరణలో పెట్టాలి. అప్పుడప్పుడు సందర్భాన్ని బట్టి శ్రీశ్రీ చెప్పిన చిరుకవితలు అనేకం నినాదాలుగా మారి, గోడలపైకికూడా ఎక్కాయి. “న్యాయం గెలుస్తుందన్నమాట నిజమే.కాని గెలిచేదంతా న్యాయం కాదు”. “దొంగనోట్ల దొంగ ఓట్ల- రాజ్యం ఒక రాజ్యమా? లంచగొండి సాక్షులిచ్చు- సాక్ష్యం ఒక సాక్ష్యమా?” జీవికను వెతుక్కుంటూ మదరాసుకు చేరిన శ్రీశ్రీ చలన చిత్రం రంగంలోనూ తన ప్రత్యేక ముద్రను నిలుపుకున్నాడు. ఎంతగా?అంటే “కారులో షికారుకెళ్ళే- పాలబుగ్గల పసిడీదానా- బుగ్గమీది గులాబిరంగు- ఎలా వచ్చెనో చెప్పగలవా..?” అనే ఆత్రేయగారి గీతాన్ని ‘అది శ్రీశ్రీదే’ అని అత్యధికులు భావించేంతగా. 60 ఏళ్ళ నాటి శ్రీశ్రీ గీతం ”పాడవోయి భారతీయుడా..” లోని పరిస్థితులే దేశంలో నేడూ ఉన్నాయి-ఇంకా తీవ్రంగా. “ఆకాశం అందుకొనే- ధరలొక వైపు- అదుపు లేని నిరుద్యోగ- మింకొక వైపు- అవినీతి బంధు ప్రీతి- చీకటి బజారు- అలముకొన్న నీ దేశం- ఎటు దిగజారు? కాంచవోయి నేటి దుస్థితి- ఎదిరించవోయి ఈ పరిస్థితి..” ఎదిరిస్తున్నాం.మరింత బలాన్ని పుంజుకొని పాలకుల దుర్మార్గాలను‌ ఎదిరించక తప్పదు. “కల కానిది-విలువైనది..’ గీతంలో ఓదార్చి, ధైర్యం చెప్పిన శ్రీశ్రీ “తెలుగువీర లేవరా- దీక్షబూని సాగరా- దేశమాత స్వేచ్ఛ కోరి- తిరుగుబాటు సేయరా” అని జనాన్ని ఉత్తేజపరిచిన శ్రీశ్రీ “తెల్లవారి గుండెల్లో- నిదురించినవాడా- మా నిదురించిన పౌరుషాగ్ని- రగిలించినవాడా..” అని చమత్కరించి, మన్యం వీరుడు అల్లూరిని మన కళ్ళ ఎదుట సాక్షాత్కరింపజేసి, మనలో దేశభక్తిని రగుల్కొల్పాడు. ఈ గీతం జాతీయస్థాయిలో ఉత్తమ గీతంగా పురస్కారం పొందగా శ్రీశ్రీ ‘జయభేరి’ లోని “నేను సైతం” చరణాలతో ప్రారంభమైన సుద్దాల అశోక్ తేజ గీతం కూడా జాతీయ స్థాయిలో ఉత్తమ గీతంగా పురస్కారాన్ని పొందగలగడం శ్రీశ్రీ వేసిన దారి రహదారిగా మారిందని చూపుతున్నది. పాలకులు మతం, కులం, ప్రాంతం, భాష, తినే ఆహారం, ధరించే వస్త్రాల పేరుతో ప్రజలలో-ముఖ్యంగా యువతలో పరస్పర విద్వేషాలను రెచ్చగొడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో “మనుష్యుడే నా సందేశం- మానవుడే నా సంగీతం” అన్న శ్రీశ్రీ కవితల ప్రాసంగికత (రెలవెన్స్) ఇంతకు ముందుకన్నా ఇప్పుడు మరింత ఎక్కువగా ఉంది. శ్రీశ్రీ కలలుగన్న, ప్రయత్నించిన సమసమాజ స్థాపనకోసం దీక్షతో అలుపు లేకుండా కృషి చేయడమే ఆ మహాకవికి మనం అర్పించే నిజమైన నివాళి.

ఏప్రిల్ 30, 1910
మహాకవి శ్రీశ్రీ జయంతి సందర్భంగా

-మోతుకూరి నరహరి

విశ్రాంత ప్రధానాచార్యులు (రిటైర్డ్ ప్రిన్సిపాల్),
సారస్వత పరిషత్తు ప్రాచ్య (ఓరియంటల్ పిజి)కళాశాల,
హైదరాబాదు.
+91-8464980540

June 2, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

రాజకీయాలను నలుపు తెలుపులో నిలిపిన పీవీ

by డా. ఏనుగు నరసింహారెడ్డి June 2, 2021
written by డా. ఏనుగు నరసింహారెడ్డి
నేరుగా రాజకీయాలతో సంబంధంలేని వాళ్ళు కూడా ఎంతో జాగ్రత్తగా రాజకీయాల్ని పరిశీలిస్తుంటారు. ఆ రాజకీయాల మీద రచయితలైనవాళ్ళు తమ అభిప్రాయాలను, నిరసనను కొన్ని పాత్రల ద్వారా వ్యక్తం చేస్తూ ఉంటారు. కొన్ని రాజకీయ నిర్ణయాలు పుట్టించిన ప్రకంపనల ప్రభావాలు అందులో ప్రతిబింబిస్తూ ఉంటాయి. ప్రధానంగా రాజకీయ నాయకులకు ఉండే లక్షణాలు ఏవీ లేని నాయకుడు పీ.వీ. నరసింహారావు. అగ్రశ్రేణి నాయకుడు కావలసిన చారిత్రక సందర్భాలు వచ్చినప్పుడు ఒక మేధావిగా ప్రధాని పదవిని నిర్వహించాడు. తన యవ్వనకాలం నుండి వృద్ధాప్యం వరకు, చిన్న రాజకీయ నాయకుడి నుండి భారత ప్రధాన మంత్రి స్థాయి వరకు ఆయనకు రాజకీయాలకు ఉన్నది తామరాకు నీటిబొట్టు సంబంధమే. తన జీవితకాలపు రాజకీయాలను ఒక రచయితగానే ఆయన చూసాడు. రచయితకుండాల్సిన మూడవ నేత్రాన్ని ఆయన ఎన్నడూ కోల్పోలేదు. ఆ మూడవ నేత్రంతో ప్రభావితమైన ఆయన లోపలి మనిషిని చాలా తక్కువ సందర్భాలలో మాత్రమే రాజకీయాలు భరించాయి. వాటి కథా కమామిషు పీ.వీ. తన The Insiderలో చిత్రించాడు.

ఇతివృత్తం

The Insider 1998లో విడుదలయింది. ఇందులోని విషయమంతా రాజకీయమే. సంధికాలపు విషయాలను లక్ష్యంగా రాయకపోయినప్పటికీ స్వాతంత్ర్యానంతరపు తొలి, మలి దశల రాజకీయాల్ని చిత్రించిన రాజకీయ నవల ఇది. కుష్వంత్ సింగ్ A Train to Pakistanలో, సల్మాన్ రష్దీ Midnight Childrenలా చిరకాలం గుర్తుంచుకోదగిన రచన. అయితే ఇది పూర్తి వాస్తవిక సంఘటనలతో రాసిన నవల అని చెప్పలేం. కానీ పాఠకుడికి ఆ కాలపు రాజకీయ వాస్తవాలు అర్థం అవుతూ ఉంటాయి. శాతాల్లో చెప్పలేం కానీ పాత్రలు, ప్రదేశాలు పేర్లు మార్చుకోబడ్డ వాస్తవం ఇందులో ఉంటుంది. దీన్ని స్వయంగా పీ.వీ. ఇట్లా చెప్పాడు. ‘ఇది కల్పనాయదార్థాల సమ్మిశ్రణ సమన్వయాలతో రూపొందింది. భాగస్వామి, సాక్షి, కథాకారుడు, విమర్శకుడు, రచయిత ఈ నాలుగు పాత్రలను ఒకే సమయంలో పోషించే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ పాత్రలు నూటికి నూరుపాళ్ళు కాల్పనికం కాదు, నూటికి నూరుపాళ్ళు వస్తుతః శల్య మాంసయుక్తులైన వ్యక్తులూ కాదు. రకరకాల మనుషులు, రచయితకు కానవచ్చిన రకరకాల ప్రవృత్తుల సమ్మిశ్ర (సింథటిక్) సృష్టిజనితులు. ఒక్క ప్రధాన మంత్రులలో కాల్పనికత లేదు.’ దీన్నిబట్టి ఈ నవలేతివృత్తం పేర్లకు పరిమితం కాని వాస్తవం. ప్రధానమంత్రి విషయంలో పేర్లు కూడా వాస్తవమే. నవలలో ప్రధానంగా నాలుగు భాగాల ఇతివృత్తం ఉంది. ఆనంద్ బాల్యం యవ్వనారంభంలో భాగంగా నడిచిన భారత స్వాతంత్ర్యోద్యమం, అఫ్రోజాబాద్ విలీనోద్యమం ఒక భాగం. తొలి స్వాతంత్ర్యపు ప్రజాస్వామ్య పోకడలలో భాగంగా ఎన్నికల అపసవ్యత; మహేంద్రనాథ్-చౌదరిల మధ్య అసమ్మతి, కుర్చీ పోరాటంలో కుట్రలు, కుతంత్రాలు రెండవ భాగం. నెహ్రూ, ఇందిరల స్పూర్తితో, గట్టిపట్టుదలతో ఆనంద్ ముఖ్యమంత్రి కాగానే చేపట్టిన భూసంస్కరణలు, భూస్వామ్య వర్గం కక్ష, ముఖ్యమంత్రి పదవి ఊడిపోవడం మూడవ భాగం. ఢిల్లీలో అధిష్టానం అభిప్రాయాన్ని ప్రభావితం చేసే బ్రోకర్లు, అసమ్మతి శిబిరాలు, వాళ్లకు ఉండే పరస్పర సంబంధాలు, వాటి పర్యవసానాలు ఈ నవలలోని ప్రధానమైన మరొక భాగం. 750పేజీలకు పైబడిన, విస్తారమైన నిడివి గలిగిన ఈ నవలను కల్లూరి భాస్కరం నవల ఇతివృత్తాన్ని ఇట్లా చెప్పారు. “ఆనంద్ తలపడింది ఒక త్రికోణ నిర్మిత స్థితిలో. దాని అట్టడుగున ఉన్నది, ఎన్నికల్లో ఓటర్లుగా తప్ప ఇంకెలాంటి గుర్తింపూలేని, నోరూవాయీ లేని అసంఖ్యాక ప్రజానీకం. మధ్యలో ఉన్నదీ సిద్ధాంత జ్ఞానం కానీ, నిబద్ధత కానీ, ప్రజాహిత దృష్టి కానీ లేని రాజకీయ దళారుల ప్రపంచం. ఆ త్రికోణ స్థితి పైన ఏకాకిగా నిలబడిన ఒక స్వాప్నికుడు, ఒక తాత్వికుడు, ఒక ప్రజాహితైషి ఆనంద్. అట్టడుగువైపుకు రాజకీయ, శాసనగతిని మళ్ళించడానికి అతడు చేసిన నిర్విరామ, విఫల యత్నాల విషాద గాథే లోపలి మనిషి”. కల్లూరి భాస్కరం అనువాదం తెలుగులో ఆంధ్రప్రభలో సీరియల్ గా వచ్చింది. 2002లో అక్టోబర్ లో ‘లోపలి మనిషి’ పేరుతో ప్రింటయింది. ఎమ్మెస్కో ప్రచురించిన ఈ నవలకు స్వయంగా పీ.వీ. ఎడిటింగ్ కూడా ఉండడంతో ఇది ఒక రకంగా స్వతంత్ర రచన కిందే లెక్క.

కథాగమనం
నవల 60 అధ్యాయాలుగా నడుస్తుంది. ఇందులో వచ్చే పేర్లను అవగాహన చేసుకోవడం కోసం ఈ కింది సంకేతనామాలను తెలుసుకోవాలి. అఫ్రోజాబాద్-హైదరాబాద్ నాసిర్ జాషీ-అసఫ్ జాహీ ఖాదీమాన్-రాజాకార్ హషీం అలీ-లాయక్ అలీ రహీం అల్వీ-రాజ్వా ఖాసీం ఆనంద్-పీవీ 10వ నాసిర్ జా పాలిస్తున్న అఫ్రోజాబాద్ లోని అనంతగిరి గ్రామాధికారి కొడుకు ఆనంద్. చదువుకోసం ఆనంద్ ను షెగావ్ లో ఉంటున్న చిన్నాన్న మారుతి ఇంటికి పంపిస్తారు. చిన్నాన్న, చిన్నమ్మ మనోరమాదేవి, వాళ్ళ పిల్లలు రాజు, కమలలతో కలిసి గుల్షన్ పూర్ లో పెళ్ళికి వెళ్ళినప్పుడు ఆనంద్ మొదటిసారి బస్సు ఎక్కి ఆశ్చర్యానికి గురవుతాడు. పాఠశాలలో చురుకైన విద్యార్థిగా రాణిస్తాడు. ఆనంద్ కు పెళ్ళవుతుంది. అనల్ మాలిక్ ఉద్యమం ప్రారంభమవడం వల్ల ఆనంద్ పాఠశాలలో కృష్ణుడి వేషం వేసినా చూడడానికి కరీం రాడు. హఫీజ్, సుదర్శన్ లు ఆనంద్ కు స్వాతంత్ర్యోద్యమ సాహిత్యాన్నిచ్చి ప్రేరేపిస్తారు. క్విట్ ఇండియా కాలంలో ఆనంద్ బ్రిటీష్ ఇండియా భూభాగాలలోకి వెళ్లి ప్రేరణ పొందుతాడు. వీరాపురంలో ఖాదీమాన్ (రజాకార్) మూకలు, పోలీసులు చేసే దాడుల్నుండి రక్షించే వాలంటీర్లలో ఆనంద్ పాల్గొంటాడు. భారత్ లో అఫ్రోజాబాద్ విలీనం జరిగిపోతుంది.

మొదటి సార్వత్రిక ఎన్నికల్లో టిక్కెట్ల పంపిణీ కమిటీ చైర్మెన్ రాఘవ్, అరుణ టిక్కెట్ ఆడిగితే పక్కలోకి రమ్మంటాడు. ఆమె ఆనంద్ ను ఆశ్రయించడంతో ఆనంద్ కు గెలవలేని నియోజకవర్గం ఇస్తాడు. అయినా శ్రీరాంపూర్ నుండి ఆనంద్ గెలుస్తాడు. మహేంద్రనాథ్ ముఖ్యమంత్రి అయితే, చౌదరి మంత్రిగా అసమ్మతి పాత్ర పోషిస్తాడు. చౌదరి శిబిరం మనిషి శేఖర్ మహేంద్రనాథ్ పక్షం చేరి కథ రక్తికట్టిస్తాడు. మహేంద్రనాథ్ చేత జన్మదిన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా చేయించి చెడ్డపేరు వచ్చేట్లు చేసి ముఖ్యమంత్రి పదవి ఊడిపోవడానికి కారణమవుతాడు. చౌదరి ముఖ్యమంత్రి అవుతాడు. తటస్తుడైన ఆనంద్ కు మంత్రి వర్గంలో చోటు లభిస్తుంది. అరుణతో ఆనంద్ ప్రేమాయణం నడుస్తుంది.

నెహ్రూ భూసంస్కరణలు చేపట్టమని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాస్తాడు. ఇది ఇష్టంలేని చౌదరి తలపట్టుకుంటాడు. మరో మంత్రి శేఖర్ ఆ శాఖను ఆనంద్ కిమ్మని ఓ పాచిక వేస్తాడు. ఆనంద్ భూసంస్కరణల మంత్రి అవుతాడు. నెహ్రూ మరణానంతరం మొరార్జీ-ఇందిరల మధ్య నాయకత్వ యుద్ధంలో భాగంగా లాల్ బహదూర్ శాస్త్రి మరణానంతరం ఇందిర ప్రధాని అవుతుంది. అనేక అంతర్జాతీయ, జాతీయ రాజకీయ ఉద్రిక్తతల మధ్య చౌదరిని దించేస్తుంది ఆధిష్టానం. ఆనంద్ ముఖ్యమంత్రి అవుతాడు. ఆనంద్ సీ.ఎం. గా భూసంస్కరణలను చర్చకు పెడతాడు. భూసంస్కరణలు చర్చల దశలోనే ఉండగానే కమ్యూనిస్టులు భూ ఆక్రమణలకు పాల్పడతారు. భూ సంస్కరణల చట్టం ఆమోదించబడుతుంది. ఇందుకు పర్యవసానంగా ఇందిరను అశ్లీలంగా చిత్రిస్తూ గోడరాతలు వెలుస్తాయి. అవి ఇందిర దాకా వెళ్తాయి. ఆనంద్ రాజీనామా సమర్పిస్తాడు. ముఖ్యమంత్రి పదవి పోతుంది. కథా గమనంలో మరొక ప్రధానమైన అంశం ఢిల్లీలోని అధిష్టానం. రంజన్ బాబు, లాలా గోపీ కిషన్ లాంటి పవర్ బ్రోకర్లు, జాతీయ పత్రికల కరస్పాండెంట్ల ప్రభావాలతోనే రాష్ట్రంలో నరేంద్రనాథ్, చౌదరి, ఆనంద్ ముగ్గురూ పదవులు కోల్పోతారు. పవర్ బ్రోకర్లను, పత్రికలను ప్రభావితం చేసేది అసమ్మతి. మాధ్యమం-డబ్బు, విలాసాలు.

సామాజిక చిత్రణ
కేవలం 2 శాతం మాత్రమే అక్షరాస్యులున్న 1948కి పూర్వపు హైదరాబాద్ సంస్థానపు స్థితిగతులు మొదటి పది అధ్యాయాలలో వివరంగా పీ.వీ. వివరించాడు. భూ పరిపాలనతో సంబంధమున్న కుటుంబం నుండి వచ్చాడు కాబట్టి రాజకీయాలకు భూమికి సంబంధాలను సరిగ్గా అంచనా వేయగలిగాడు, సజీవంగా చిత్రించగలిగాడు. ఆనంద్ వాళ్ళ ఊరికే కాకుండా మిగితా గ్రామాలకు కూడా నిర్నీతమైన సరిహద్దులేవీ లేని సంగతి చెబుతాడు. రచయితకు సైకిల్ కూడా అపురూపమే. సినిమా ఆ కాలంలో అరుదుగా దొరికే అవకాశం. హైద్రాబాద్ లో సినిమా ఉందేది కాని, పల్లెటూరి వాళ్ళు సినిమా చూడడం అనేది జీవితకాలపు వింత. ఆనంద్ బండి, గిర్దావర్ బండికి ఎదురైతే ఆనంద్ వెనక్కి వెళ్ళిపోవాలని ఊరంతా హితబోధ చేయడం ద్వారా సర్కారు ఊద్యోగులంటే ఉండే భయభక్తులను తెలియజేస్తుంది. పసిపాపకు పాలివ్వడానికి మధ్యాహ్నం ఇంటికి వెళ్ళొస్తానన్న ఒక కూలీ స్త్రీని జాగీర్దార్ గుమస్తా అత్యంత దారుణంగా హింసించే సంఘటన చూసి ఆనంద్ చలించిపోతాడు, అడ్డుకుంటాడు. ఆ సందర్భంలో రచయిత చిత్రించిన సన్నివేషాలు ఆనాటి తెలంగాణలో ఊరూరా జరుగుతూనే ఉండేవి. చదువుల కోసం బంధువుల ఇండ్లలో పిల్లల్ని సంవత్సరాల తరబడి ఉంచడం అప్పటి మధ్యతరగతి కుటుంబంలో సాధారణమైన విషయం. ఎడ్లబండి ప్రయాణంలోని దర్పం, ఆనందం నవలా నాయకుడి జ్ఞాపకాలుగా ఇందులో చిత్రించబడ్డాయి. పట్నంలో అప్పటికే అమ్మాయిల స్కూళ్ళుండేవి. అబ్బాయిలు అమ్మాయిల్ని బనాయించడం, వెంటబడడం కూడా ఉన్న వాస్తవాల్ని ఇందులో పీ.వీ. చిత్రించాడు. ఇంకో హాస్యస్ఫోరకమైన విషయాన్ని కూడా పీ.వీ. ఇందులో చిత్రించాడు. రాజుకు కొడుకు పుట్టినప్పుడల్లా స్కూలుకు సెలవిచ్చేవారట. అందువల్ల రాజుకు తరచూ కొడుకులు పుడితే బాగుండేదని అందరూ జోక్స్ వేసుకునే వారట, ఎందుకంటే రాజుకు అనేకమంది భార్యలుండేవారని.

మత పరిస్థితులు
ఆనంద్, కరీం సన్నిహిత మిత్రులు. వారి వారి కుటుంబాలు కూడా ఎలాంటి వైషమ్యాలు లేకుండా ఉండేవి. ఆనంద్ పాఠశాల విద్య చదువుతున్న రోజుల్లో కృష్ణాష్టమి, మొహర్రం రెండు మతాల వాళ్ళు కలిపి చేసుకునేవారు. సరిగ్గా అప్పుడే ముస్లిం పెద్దలు ‘అనల్ మాలిక్’ (మనం రాజులం) అనే నినాదం పుట్టించారు. అప్పటిదాకా కలిసి ఉండే ప్రజలు హిందూ, ముస్లిం మతస్తులుగా విడిపోయారు. స్కూల్లో కృష్ణాష్టమి రోజున ఆనంద్ శ్రీకృష్ణుడి వేషం వేసాడు. వేషం టైంకి వస్తానన్న కరీం రాడు. ఎందుకు మాట తప్పాడో కనుక్కుందామని ఆనంద్ కరీం వాళ్ళింటికి వెళ్తాడు. తీరా వెళ్ళే సరికి కరీం ఇంట్లో లేడు. నగరం నుండి వచ్చిన అఫ్జల్ చాచా కనిపించాడు. ‘కరీం ఎక్కడికెళ్ళాడో నాకు తెలియదు. అయినా వాడితో మీకేంపని. అది మీ పండుగ. హిందువులే ఆ పండుగ జరుపుకోవాలి’ అన్నాడు. అలా వచ్చిన మత విభజనకు వెనక రాజకీయ కారణాలే ఉంటాయి. రాజకీయ కారణాలు లేనంతవరకు మతం ఒక అడ్డుగోడగా ఎప్పుడూ నిలవలేదనడానికి కూడా ఈ నవలలో సాక్ష్యాలు చూపించాడు పీ.వీ. కూలీ మహిళను పాలివ్వడానికి పోనివ్వకుండా హింసించిన జాగీర్దార్ గుమస్తా గొప్ప సంప్రదాయం ఉట్టిపడేలా మూడు నిలువుబొట్లు పెట్టిన హిందువే. సంస్థానంలో మతం అనేది భారతదేశానికి స్వాతంత్ర్యం రానుందనే ప్రచారం తర్వాత మాత్రమే ప్రారంభించబడింది. స్వాతంత్ర్యం, వెనువెంటనే విలీనం అనే స్టేట్ కాంగ్రెస్, ఆర్యసమాజ్ ప్రచారానికి మరో ప్రతిఫలనంగా అనల్ మాలిక్, అంజుమన్ తబ్లిగిస్లాం తెరమీదికొచ్చాయి. అయితే పురోగామి వాదులు దీనికి అతీతంగా ఆలోచించడం కూడా ఈ నవలలో చిత్రించబడింది. ఆనంద్ కు ఖవ్వాలి బాక్స్ నెపంతో భగత్ సింగ్ లేఖనూ, దేశభక్తి గీతాలను ఇచ్చిన విప్లవకారుడు హఫీజ్ అనే ముస్లిం. ఆనంద్ లోని పురోగామి భావాలను ప్రోత్సహించే ప్రిన్సిపల్ కూడా ముస్లిం.

ఎన్నికలు, రాజకీయాలు
స్వాతంత్ర్యం వచ్చాక ఎన్నికలు రాజకీయాలు విడదీయరానివిగా మారిపోయాయి. అప్పటిదాకా ఉన్న త్యాగశీలత, ప్రజలపట్ల ప్రేమ మచ్చుకైనా కనిపించకుండా పోయిందనే అభిప్రాయాన్ని పీవీ అనేక సంఘటనల ద్వారా చిత్రించాడు. మొదటి ఎన్నికల్లోనే టిక్కట్ల పంపిణీలో వర్గాలు ఏర్పడతాయి. గెలిచే సీట్లను తన మనుషులకు ఇప్పించుకోవడం, ఓడే సీట్లు పార్టీలో వ్యతిరేకులకు ఇచ్చుకోవడం మొదలయింది. రాజకీయాల్లో స్త్రీలను ఎలా వాడుకోవచ్చో రాఘవ్ పాత్ర కళ్ళకు కడుతుంది. అరుణ అనైతిక సంబంధానికి ఒప్పుకోకపోవడంతో ఓడిపోయే సీటిస్తాడు రాఘవ. ఆమెకు అండగా ఉండే ఆనంద్ కూ ఓడిపోయే సీటు ఇస్తాడు. డబ్బులు ఖర్చుపెట్టనిదే, సారా పంపిణీ చేయనిదే ఎన్నికల్లో గెలవలేమని మొదటి సాధారణ ఎన్నికల్లోనే నిరూపించబడిందని ఆనంద్ గ్రహిస్తాడు. సిన్హా, రాం కుమార్, అజిత్ సింగ్ లు ఆనంద్ ద్వారా పని మంజూరీ చేయించుకుందామని పైరవీ చేస్తే ఆనంద్ అందుకు ఒప్పుకోడు. అందువల్ల వాళ్ళు ధర్మకార్యం నెపంతో అరుణ ద్వారా పైరవీ సాధించుకుంటారు. ఆమె నిజాన్ని గ్రహించి దూరం పెట్టడంతో అరుణను బండ బూతులు తిట్టడానికి కూడా తెగిస్తారు. అధిష్టానం దూతగా రంజన్ బాబు అఫ్రోజాబాద్ వస్తాడు. ఆయన పర్యటనలో ఆయనను ప్రభావితం చేయడానికి రకరకాల ఎత్తులు వేస్తారు. ఆ ఎత్తులన్నీ అనైతికమైనవే. కానీ పవర్ బ్రోకర్లకు అవే కావాలి. నరేంద్రనాథ్ అన్ని మర్యాదలూ చేసాక కూడా ‘సూట్ కేసు’ ఇవ్వకపోతే లాభం లేదనుకొని తెలుసుకుంటాడు. ఎక్కడ సూట్ కేసు ఇచ్చినా బహిరంగం అవుతుందని భయపడి విమానంలో బోర్డ్ అవుతుండగా ఒక సహాయకుడి ద్వారా ‘సర్! మీరు సూట్ కేసు మర్చిపోయారు’ అంటూ అందజేయిస్తాడు. ఢిల్లీకి వెళ్తే ముఖ్యమంత్రికి ఏం విలువ ఉండదు. పవర్ బ్రోకర్లను, జాతీయ దినపత్రికల విలేఖరులను ‘మేనేజ్’ చేసుకుంటేనే ఢిల్లీ వర్గాల్లో మంచి పేరుంటుంది.

అదే అధిష్టానం దగ్గర ప్రతిఫలిస్తుంది. ఇలాంటి అభిప్రాయాలను బలపరిచే అనేక సంఘటనలు ఇందులో ఉన్నాయి. ఆనంద్ కు ముఖ్యమంత్రి పదవి ఎంత నాటకీయంగా వచ్చిందో అంతే నాటకీయంగా పోతుంది. ఈ రెండు సందర్భాలలోనూ రాజకీయ వివేచనతో కాకుండా ఢిల్లీ మేనేజ్ మెంట్లతోనేనని చెప్పవచ్చు. ఆనంద్ కు ముఖ్యమంత్రి పోస్టు ఇచ్చిందీ, తొలగించినదీ ఇందిరా గాంధే కనుక ఈ నవల ద్వారా ఇందిరను బ్లాక్ అండ్ వైట్ లో పెట్టాడని, కొందరంటారు కానీ నవల మొత్తం ఇలాంటి సంఘటనలే ఉన్నాయన్న సంగతి గమనించినప్పుడు ఆ విమర్శలో పసలేదు. లోపలి మనిషి విపులమైన నవల. ఇందులో కేవలం అఫ్రోజాబాద్, ఢిల్లీ ముచ్చట్లే కాకుండా తమిళ, అసోం తదితర భాషా ఉద్యమాలు; ఇతర రాష్ట్రాల రాజకీయాలు, ముఖ్యమంత్రుల వ్యవహారాలూ చర్చించబడ్డాయి. బంగ్లా భాషోద్యమం దేశం ఏర్పాటుగా పరిణమించిన వైనాన్ని, పాక్, చైనా యుద్ధాలను సందర్భానుసారంగా చెబుతూ వచ్చారు. పాటలను, ఒప్పందాలను, నిబంధనలను చాలా చోట్ల చరిత్ర గ్రంథంలో ఉటంకించినట్లు రాసాడు పీ.వీ. ఇంత విపులంగా రాసిన లోపలి మనిషి పీవీ జీవిత గమనంలో అర్థభాగం మాత్రమే. తర్వాత కాలంలో ప్రధానిగా, ఆర్ధిక సంస్కరణల ఆద్యుడుగా ఎదుర్కొన్న ఆటుపోట్లు చిత్రిస్తే తన ఆత్మకథాత్మక నవల సంపూర్ణమయ్యేది.

స్వతహాగా ఇది ఇంగ్లీషు నవలకు తెలుగు అనువాదం అయినప్పటికీ కల్లూరి భాస్కరం అనువాదం సూటిగా, ఒరిజినల్ రచనలాగానే ఉండడం విశేషం.

-డా. ఏనుగు నరసింహారెడ్డి
ప్రముఖ కవి, రచయిత
అదనపు కలెక్టర్, కరీంనగర్
+91-8978869183

June 2, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

భద్రాద్రి, రామశబ్ద విశిష్టత

by కావ్యసుధ (ఆర్. హరిశంకర్) June 2, 2021
written by కావ్యసుధ (ఆర్. హరిశంకర్)
శ్రీరాముడు పరమానంద స్వరూపుడు. ఆద్యంత రహితుడు, అద్వితీయుడు. అసలు శ్రీరాముడు ప్రకృతి కంటే విలక్షణుడైన సాక్షాత్ పరమాత్మ! దైవభక్తి, మాతృ, పితృభక్తి,సోదర ప్రేమ, గురుభక్తి దర్శపరాయణత్వం. ఏకపత్నివ్రత, త్యాగ, వీరత్వ, నీతిజ్ఞత, సత్య సౌహార్ద, ధర్మజ్ఞత్వం వంటి అనేకానేక సకల సద్గుణ సంపన్నత్వం శ్రీరామచంద్రునిలో పరిపూర్ణంగా ప్రతిఫలిస్తాయి.

శ్రీరామనామ మహిమ:- ఆ నామానికి గల శక్తి అమోఘమైనది, మన దేశంలో నూతన సంవత్సరాది పండుగల తర్వాత ఘనంగా జరుపుకునే పండుగ శ్రీరామనవమి.భారతీయ సంస్కృతిలో భగవంతుని సేవలను అనేక రూపాల్లో ఆరాధిస్తూ వైభవంగా పండుగలను జరుపుకోవడం మన సంప్రదాయం. శ్రీరాముణ్ణి సేవించడం, పూజించడం సర్వ సంపత్తులను ఇస్తుంది. శ్రీరామనామము మానవునికి ముక్తిని ప్రసాదిస్తుంది. “శ్రీరామ రామ రామేతి రమేరామే మనోరమే” అని మూడుసార్లు స్మరించినంతనే ఒక్క విష్ణు సహస్రనామ పారాయణ ఫలితమే కాదు, అబేధ స్వరూపులైన మీ వల్ల భక్తులకు శివ సహస్రనామ ఫలితం కూడా లభిస్తుందని సాక్షాత్తు పార్వతిదేవికి మంత్రోపాసన చేశాడట ఆ పరమశివుడు.

‘రమ్’ అనే ధాతువు నుండి ‘రామ’ శబ్దం ఉద్భవించింది. ‘రమ్’ అంటే ఆనందపెట్టుట , సంతోషపెట్టుట అని అర్ధం. “రమయతి సర్వాన్ గుణైరితి రామ” అంటే సద్గుణాలతో అందర్ని రమింపచేయు వాడు కనుక రాముడని, “రమంతే ఆస్మిన్ సర్వే జనాః గుణైరితి రామ” సర్వజనులను సద్గుణాలచేత రామునియందు రమించుచున్నందుకు శ్రీరాముడని తెలుస్తున్నది.

‘రామ’ శబ్దం మహోన్నతమైందీ. రమణీయమైన దీనూ, సకల ప్రజానీకానికి నిత్య జీవితంలో ఆహ్లానందాన్ని, మోక్షాన్ని కలిగించే పవిత్రనామం. ‘రామ’ అనే పలుకు అఖండ దివ్యతారక మంత్రం. శ్రీరామనామం మహాసారవంతమై మధురమైనది. యుగయుగాల నుండి తపోనిరతులైన మహర్షులకు దర్శనం కలుగజేయుట శ్రీరామావతార రహస్యాలలో ఒకటి. శ్రీరాముని చరిత్ర ఎంత ఉదాత్తమైందో,’రామనామము’ అంతటి దివ్యమైంది. శ్రీరాముని నమ్ముకున్నవారికి భయం పరాభవం ఉండదని రామాయణం ఉద్భోదిస్తుంది.

మానవుడు తమ వ్యక్తిగత జీవితాన్ని సమాజ సమగ్రాభివృద్ధికి అనుగుణంగా ఏవిధంగా మలచుకోవాలో చాటి చెప్పే ప్రవర్తనా నియమావళియే రామ చరితము. శ్రీరాముడు ధర్మాన్ని ఎరిగినవాడు దానిని అనుష్టించినవాడు శ్రీరాముడు ధర్మస్వరూపుడే. శ్రీరాముని యొక్క జీవితంమొత్తం ధర్మ ప్రతిష్టాపనకే వినియోగింపబడింది. తన ధర్మాన్ని తన వారి ధర్మాలను జీవులందరి ధర్మాలను కాపాడిన వాడు శ్రీరాముడు. “వ్యసనేషు మనుష్యాణాం భృశం భవతి దుఃఖతః ఉత్సవేఘచ సర్వేషు పితేవ పరితుష్యతి” ప్రజలలో ఎవరికైనా ఆపదలు కలిగినపుడు తనకే కలిగినట్లు దు:ఖించేవాడు. ఒకరికి ఆనందం కలిగితే తండ్రివలె సంతోషించేవాడు సర్వకాల సర్వదేశ సర్వప్రజలు ఆచరించదగిన నీతి, ధర్మం, సత్యం జీవిత విధానం రామాయణంలో నిక్షిప్తమై ఉన్నాయి. శ్రీరామచరిత ఆదికవి వాల్మీకి మహర్షి హృదయాంతరాళం నుండి పెల్లుబికి వచ్చిన రసరమ్య కావ్యం. రామాయణం ధర్మసూక్ష్మాలు జీవిత సత్యాలతో నిబిడీకృతమై ఉన్నది. సత్యధర్మాలను పాటించటం మానవుల కర్తవ్యమని ధర్మ రహితమైన కామ సేవనం, ధర్మ సహితమైన అర్ధకామ సేవనం మానవత్వంగా ఉంటుందని రామాయణం మనకు సందేశమిస్తుంది.

భద్రాచల విశిష్ఠతః శ్రీరామావతార తత్త్వం సకల జనామోదమైనది. ఆచరణ యోగ్యమైనది.

ఎక్కడ భక్తి ప్రపత్తులు వెల్లివిరుస్తాయో, ఎక్కడ పవిత్రతతో భగవంతుని నామధ్యానం – స్మరించబడుతుందో, ఎక్కడ భక్తుల హృదయాలలో దైవ భక్తి నెలకొని ఉంటుందో అక్కడ భగవంతుడు కొలువై ఉంటాడు. అటువంటి స్థలమే పుణ్య స్థలం శ్రీరామచంద్రుని క్షేత్రాలలో అత్యంత వైశిష్ట్యం గల క్షేత్రం ‘భద్రాచలం’. భద్రుడు (రాములు) అచలుడు(కొండ) రాముడు కొండపై నెలవున్నాడు. కాబట్టి ఈ క్షేత్రం ‘భద్రాచలం’గా ప్రసిద్ధి చెందింది. శ్రీరామచంద్రుడు తన వనవాస జీవితం ఇక్కడ గడపడమే ఈ క్షేత్రం యొక్క విశిష్టత.

దశావతారాలలో శ్రీరామావతారానికున్న విశిష్టత ప్రత్యేకమైంది. వేద వేద్యుడైన శ్రీ మహావిష్ణువు దశరథ కుమారుడై అవతరించినందుకు, వేదాలే రామాయణంగా ఉద్భవించాయని ప్రతీతి. శ్రీరాముని చరితము మహిమాన్వితం అమృత తుల్యము.

శ్రీరాముడు సత్యపాలకుడు ధర్మాచరణం తప్పనివాడు అతని సద్గుణాలన్నీ మానవులందరూ నిత్యజీవితంలో అలవర్చుకోవాలి. సత్యధర్మాన్ని, మానవ జీవిత లక్ష్యాన్ని, ఆదర్శజీవితం మానవ లక్ష్యమన్న సత్యాన్ని, ధర్మాన్ని ప్రబోధించేదే శ్రీరామావతారం. శ్రీరామ కథ యుగాలు మారినా, తరాలు మారినా సూర్యచంద్రులీభూమ్మీద ఉన్నంతకాలం నిలిచి ఉంటుందని ఆదికవి వాల్మీకి ప్రవచించాడు.

శ్రీరామ నామాన్ని ఉచ్ఛరించేటపుడు ‘రా’ అనగానే మన నోరు తెరుచుకొని మనలోపలి పాపాలన్నీ బయటకు వచ్చి ఆ రామనామ అగ్నిజ్వాలలో పడి దహించుకుపోతాయని, ‘మ’ అనే అక్షరం ఉచ్ఛరణలో మన నోరు మూసుకోవడం వల్ల పాపాలేవీ మనలో ప్రవేశించవని పండితుల వచనం.కలియుగంలో శ్రీరామనామం పరమోత్కృష్టమైనది. రామ నామ స్మరణ సకల పాపాలను పోగొట్టుతుందని సకల శాస్త్రాలు ఘోషిస్తున్నాయి.

చైత్రశుద్ధ నవమినాడు పునర్వసు నక్షత్రంలో కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం పన్నెండు గంటలకు ‘అభిజిన్ము’ హుర్తంలో శ్రీరాముడు దశరథ మహరాజు-కౌసల్యలకు జగత్కల్యాణానికై జన్మించాడు. శ్రీరాముని లగ్నం భ చక్రంలో నాల్గవది, సహజ మాతృస్థానం, పదహారు కళలతో ప్రకాశిస్తూ మనసుకు ప్రాధాన్యత వహించే చంద్రుని రాశియైన కర్కాటకం. చంద్రుడు ఇటు కేంద్రంగా అటు కోణంగా పిలువబడుతున్న లగ్నంలో భాగ్యాధిపతియైన ఉచ్ఛదశ గురువుతో కూడి ఉండడం వల్ల సర్వలోకారాధ్యునిగా చక్రవర్తిత్వం ప్రసాదించింది. పురుషుని వైవాహిక జీవన సౌఖ్య ప్రదాత శుక్రుడని జ్యోతిష శాస్త్ర వివరణ కాగా, శుక్రుని ఉచ్ఛస్థితి కలగడంతో శ్రీమహాలక్ష్మి అంశతో జన్మించిన వైదేహి శ్రీరామచంద్రుని సహధర్మచారిణి అయ్యింది.

శ్రీరాముని జన్మకుండలిలో ఐదు గ్రహాలు ఉచ్ఛదశలో ఉండడం విశేషమైన విషయం. రవి గ్రహానికి మేషం ఉచ్ఛరాశో ఆ రాశిలో జన్మించడం అట్లాగే కర్కాటకంలో బృహస్పతి, తులలో శని, మీనంలో శుక్రుడు, మకరంలో కుజుడు ఉచ్ఛస్థితి ఉండగా శ్రీరామ జననం జరిగింది. పంచమ గ్రహాలు ఉచ్ఛస్థితిలో ఉన్నట్లయితే అతడు సర్వలోకాలకు పరిపాలకుడైన అధినాయకుడు లోకనాయకుడైన శ్రీ మహా విష్ణువు అవుతాడని జ్యోతిషశాస్త్రం తెలుపుతుంది

మానవుడు ఈ భవ సాగరాన్ని తరించడానికి శుభదాయకమైన శ్రీరామ నామం పలుకని జిహ్వ-జిహ్వ కాదు. తరతరాలుగా యుగయుగాలుగా భక్తుల హృదయాల్లో కొలువై కోట్ల కొలది భక్తుల పూజలందుకొంటున్నాడు శ్రీరామచంద్రుడు.శ్రీరామ నవమి పండుగ భారతీయులందరూ పరమ పవిత్రమైన దినంగా భావించి, శ్రీ సీతారాముల కళ్యాణ మహేోత్సవాన్ని అతివైభవంగా ప్రతి పట్టణంలో, పల్లెపల్లెల్లోనూ రమణీయంగా జరుపుకుంటూ శ్రీరాముని సేవలో తరించి ముక్తిని పొందుతారు.

సీతారామ కళ్యాణంలోనే జీవన హేతుకం, సకల దోష నివారణం ఉన్నది, సర్వసంపదలకు నిలయం, సకల జనలోక సంరక్షణమే శ్రీరామనవమి పండుగ పరమార్థం.

అదిగో! భద్రాద్రిలోని శ్రీరామచంద్రమూర్తి దివ్యసుందర విగ్రహం – భక్తజనులకు అలౌకికానంద పరవశులను చేస్తుంది. శ్రీరామ నామ సుధారూపమును గ్రోలి మన జన్మలను సార్థకం చేసుకుదాం పదండి.

‘రామా’ అని తలచినంతనే ముక్తినిచ్చే దివ్యధామము. అదిగో – అల్లదిగో.. గోదావరి తీరాన… భద్రాద్రి శ్రీరామచంద్రుని క్షేత్రాలలో అత్యంత వైశిష్ట్య ప్రాధాన్యత ప్రాశస్త్యము గల భద్రాచల దివ్యక్షేత్రం.

భక్త రామదాసు చెరసాలలో ఉండిపోయిన కారణంగా పూర్వం సీతారాముల కళ్యాణం మార్గశిర శుద్ధ పంచమినాడు జరిగినట్లుగా, అయితే తాను చెరసాల నుండి తిరిగి వచ్చాక చైత్రశుద్ధ నవమినాడు శ్రీరామ చంద్రుని పుట్టిన రోజు వేడుకలు, కళ్యాణ వేడుకలు ఒకేసారి జరిపించారు. అదే ఈనాటికీ ఆనవాయితీగా వస్తోంది. శ్రీ సీతారామ కళ్యాణము, రాముడు రావణున్ని సంహరించి అయోధ్యకు తిరిగి వచ్చింది ‘శ్రీరామనవమి’ నాడే. ఆ మరునాడు దశమి శ్రీరామ పట్టాభిషేకం జరిగింది.

మన రాష్ట్రంలోని భద్రాచల క్షేత్రంలో సీతారామ కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. శ్రీరామనవమి నాడు భద్రాచలంలో జరిగే రామ కళ్యాణము చూచి తరించాలేకాని వర్ణించతరముకాదు. లక్షలాది భక్తులు నయనమనోహరంగా జరిగే కళ్యాణ ఉత్సవంలో పాల్గొని తరిస్తారు. సకల లోకాల దేవతలకు శ్రీరామచంద్రుని దివ్యదర్శనం మహనీయంగా, నేత్ర పర్వంగా పట్టాభిషేక సమయాన తిలకించి పులకితులవుతారట.

శ్రీరామనవమి రోజున సీతారాముని, లక్ష్మణ, భరత, శతృష్ను,ఆంజనేయ సమేతంగా ఆరాధించి, వడపప్పు, పానకము నైవేద్యాలుగా సమర్పించాలి. శ్రీరామ పట్టాభిషేక సర్గమును పారాయణం చేస్తే సర్వ శుభాలు కలుగుతాయని, ఆరోజు రాత్రి జాగరణ చేసి, రామ నామ జపం చేస్తే రామ అనుగ్రహం కలిగి సర్వ గ్రహదోషాలు తొలగుతాయని శాస్త్రోక్తి. భద్రాద్రిలో సీతారామ కళ్యాణము చూచి తరించిన మానవ జన్మే జన్మ. త్యాగయ్య భక్త పోతన, కబీరుదాసు, అన్నమయ్య వంటి ఎందరో మహాపురుషులు, వాగ్గేయకారులు శ్రీరామసుధను తనివితీర గ్రోలి జన్మసార్థకం చేసుకొన్నవారే.

భద్రాద్రిలో ఏరోజు కళ్యాణం చేస్తారో అదేరోజు దేశమంతా సీతారామ కళ్యాణం జరుపుకుంటారు. రాముడు పుట్టిన రోజు సీతాకళ్యాణం చెయ్యటం మొదటి నుంచి ఆచారంగా వస్తున్నది. భగవంతుడు మానవుడయిన శ్రీరాముడిగా అవతరించాడు. సాక్షాద్విష్ణుస్వరూపుడైన శ్రీరామచంద్రుడు మూర్తీభవించిన కారుణ్యం. అటువంటి శ్రీరామచంద్రుని కరుణాసాగరంలో పునీతుల మవుదాం. శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణ సమేతుడై మనకి సకల సౌఖ్యాల్ని, మనశ్శాంతినీ ఇవ్వాలని మనసారా ప్రార్ధిద్దాం!

“మాంగళ్యంతంతునానేనా లోక రక్షణ హేతునా! కంఠేబద్నామి సుభగే సా జీవ శరదాం శతమ్! లోక రక్షణం కోసం మాంగల్య సూత్రాన్ని ముడివేస్తున్నానంటాడు. కాబట్టి, సీతారాముల కళ్యాణమనేది వాళ్ల ఆనందం కోసం కాక ప్రపంచ సౌఖ్యం కోసం మాత్రమే జరిగేదని భావం.

మంగళం కోసలేంద్రాయ / మహనీయ గుణాత్మనే.
చక్రవర్తి తనూజాయ / సార్వభౌమాయ మంగళమ్

-కావ్యసుధ (ఆర్. హరిశంకర్)
ప్రముఖ కవి, రచయిత
+91-9247313488

June 2, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

శ్రీ సీతా రామకళ్యాణం

by mayuukha June 2, 2021
written by mayuukha

ప్రఖ్యాత చిత్రకారులు డా|| కొండపల్లి శేషగిరి రావు గారు చిత్రించిన సీతారామ కల్యాణ చిత్రం


డా|| కొండపల్లి శేషగిరి రావు

కొండపల్లికులాంభోధి
రాకాశ్రీకరచంద్రమమ్
చిత్రకారగణేశానమ్
భజే శేషగిరిం బుధమ్.

తాత్పర్యం: – కొండపల్లి వంశ మనే పాలసముద్రానికి పూర్ణిమ అనే లక్ష్మీకళను కలిగించిన చంద్రుడు, చిత్రకారులసమూహాలకు ప్రభువు, (చిత్రలేఖన కళలో)పండితుడు అయిన శ్రీశేషగిరిరావును భజస్తున్నాను.

(“సీతారామ కళ్యాణం” చిత్రించిన కొండపల్లి శేషగిరి రావు గారిని కీర్తిస్తూ వ్రాసిన శ్లోకం – సం)


‘రంగనాథ రామాయణం’ లోని వర్ణన

శ్రీ సీతా రామకళ్యాణము
ఖచితోరునవరత్న కల్యాణవేది, నుచితపీఠంబున నున్న చో బ్రీతి
దనపురోహితునితో దడయక జనకు, డనలు బ్రతిష్ఠించి హైమ వేదికను
వేదోక్తగతి హోమవిధు లాచరించి, యాదేవకన్యక లన నొప్పు తనదు
కన్యకామణుల నగణ్యలావణ్య, మాన్యల నలుపుర మైత్రి రావించి
జనకుండు మధుపర్కసమయంబు దీర్చి, తన కూర్మిపుత్రి సౌదామనీగాత్రి
గామినీజనమణి గమలాక్షి సీత, గోమలి దెరమఱుంగున వేడ్క నిలిపి
రామాభిరాము డారామచంద్రునకు, గామిత సిద్ధి సంకల్ప పూర్వముగ
శ్రీ రామ నా పుత్త్రి సీత సద్ధర్మ, చారిణి గొను మగ్ని సాక్షిగా ననుచు
దారవోసెను దేవతాపుష్పవృష్టి, ధారతో దివ్యవాద్యధ్వనుల్ మీఱ
బ్రమదంబుతోడ దీపముల పళ్ళెములు, సమదయానలు మహాసంభ్రమంబునను
దలంబ్రాలు బంగరు తబుకుల నునిచి, కెలంకుల రమణులు కెరలుచు బట్ట
గుడముతో జిిల్కఱ గూర్చి యిద్దఱకు, వడి శిరస్సులమీద వలనొప్ప నుంచి
రంతట సుముహూర్తమని తెరదీయ, గాంతనెమ్మోము మున్గనుంగొని యలరె
రామునికను గన రాకాసుధాంశు, గోమున నలరెడు కుముదంబు లనగ
భామచూపులు నిల్చె బతిపాదయుగళి, దామరపై తేటి తండంబపోలె
నింతిలావణ్యాబ్ధి కెదురెక్కుమీన, సంతానమై రామచంద్రుచూపడరె
వరుదేహకాంతి ప్రవాహ మధ్యమున, దరుణిచూపులు పద్మదళములై గ్రాలె
సతిచూపు బతిచూపు సరసత జూపు, రతి రూపు రతిమనోహరమణుని రూపు

-గోన బుద్ధారెడ్డి

June 2, 2021 1 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

తెలంగాణ ప్రబంధాలు – పరిచయ మాలిక

by -గురిజాల రామశేషయ్య -డా॥ సంగనభట్ల నరసయ్య June 2, 2021
written by -గురిజాల రామశేషయ్య -డా॥ సంగనభట్ల నరసయ్య

నిర్వహణ:

– గురిజాల రామశేషయ్య రిటైర్డ్ అసోసియేట్ ప్రొఫెసర్ (తెలుగు)ఈ శీర్షిక క్రింద పరిచయం చేయబోతున్న తెలంగాణ ప్రబంధాలు:
1. చిత్ర భారతము- చరిగొండ ధర్మన్న
2. తపతీ సంవరణోపాఖ్యానము- అద్దంకి గంగాధరుడు
3. షట్చక్రవర్తి చరిత్ర – కామినేని మల్లారెడ్డి
4. యయాతి చరిత్రము – పొన్నిగంటి తెలగన్న
5. ముకుంద విలాసము – కాణాదం పెద్దన సోమయాజి

ఇవి ఈ శీర్షిక క్రింద పరిచయం చేయబోతున్న తెలంగాణ పంచ కావ్యాలు అనదగిన ఐదు ప్రబంధాలు

పరిచయ కర్తలు:
1. డా॥ సంగనభట్ల నరసయ్య, రిటైర్డ్ ప్రిన్సిపాల్.
2. డా॥బ్రాహ్మణపల్లి జయరాములు, రిటైర్డ్ ప్రిన్సిపాల్.
3. డా॥ మృదుల నందవరం, అసిస్టెంట్ ప్రొఫెసర్ (తెలుగు)
4. డా॥ సి.హెచ్ . లక్ష్మణ చక్రవర్తి, అసిస్టెంట్ ప్రొఫెసర్ (తెలుగు)
5. డా॥ గండ్ర లక్ష్మణరావు, రిటైర్డ్ అసోసియేట్ ప్రొఫెసర్.

ఈ రచయితల వ్యాసాలు తెలంగాణ ప్రబంధ మాలిక శీర్షిక లో వరుసగా ధారావాహికంగా వస్తాయి


ప్రవేశిక
భారతీయ భాషలలో తెలుగు ప్రాచీన భాషగా గుర్తింపు పొందిన ప్రసిద్ధమైన భాష. అనేకానేక విషయబాహుళ్యము వలన విస్తృతమైన సాహిత్య సంపదగలిగిన మధురమైన భాష. స్వరములు అంటే అచ్చులు .ఇవి నాద మాధుర్యానికి పుట్టినిండ్లు .అ,ఇ,ఉ కారాది స్వరాలతో ఆదిమధ్యాంతము సర్వవిధముల అలరారు మెలపులు గల పదాలతో కూడిన తెలుగు భాష పలుకు తీపికి తేనె పెర. మృదువైన పలుకుబడి పదములతో నవనీత సదృశ ‘రుచి’ర . ఈ కారణాలవల్లనే స్వభాషాభిమానానికి పరాకోటి ప్రాధాన్యతను పాటించే తమిళభాషా కవులలో సుప్రసిద్ధులైన సుబ్రహ్మణ్య భారతి వంటి ప్రామాణికులైన మాన్య సాహిత్యవేత్తలు సైతము “సుందర తెలుగు” అని వక్కాణించినారు. అంతకు’ముందెన్నడో “ఆంధ్రత్వమాంధ్రభాషా చ బహుజన్మ తపః ఫలమ”ని తెలుగును వేనోళ్ళ పొగిడిన అప్పయ్య దీక్షితులకు తెలుగు వారందరు కూడా కృతజ్ఞతాబద్ధులే! సుమారు రెండు వందల సంవత్సరాల కాలం భారతదేశంలో తిష్ఠ వేసిన బ్రిటీష్ , తదితర భాషా పండితులు మన తెలుగు భాషను “ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ “ అని ముచ్చటపడి మెచ్చుకున్నారు. ఇక్కడొక విషయం చింతనీయం -అంతకు ముందు వాళ్ళకు ఇటాలియన్ తెలిసి దానితో మన తెలుగును పోల్చుకొని మెచ్చుకున్నారు . కాని , వాళ్ళు రావడానికి వేల సంవత్సరాలకు ముందే మాధుర్యాన్ని పండించుకొటున్న తెలుగు భాషను ఇటాలియన్ తో పోల్చుకొని ఇటాలియన్ గురించి ” తెలుగు ఆఫ్ ద వెస్ట్”అని మార్చుకొనదగినంత మధురాతి మధుర మృదు మాధ్వీక రసనిష్యంద తుందిలమైన మన తెలుగు నిజంగా ప్రపంచ భాషలలోనే మధురమైన భాష.

ఇక దక్షిణ భారతదేశంలో అక్షీణ యశస్సును పండించుకొని, స్వయంగా కవియై , ఆముక్తమాల్యాది కావ్యరచయితయై, స్వర్ణయుగ కర్తగా పేరుపొందిన శ్రీకృష్ణదేవరాయలు కర్ణాటాది భాషాప్రాంతాలకు ఏలికయై ఉండి కూడా ‘“దేశభాషలందు తెలుగు లెస్స “అని ప్రశంసించటం సర్వజన సువిదితమే! అంతకుముందే శ్రీనాథ మహాకవి ఈ అభిప్రాయాన్నే ప్రకటించిన తీరు కూడా గమనార్హం.

మధ్యయుగాల వైభవమును ప్రతిబింబించిన 16 వ శతాబ్దపు ‘ ప్రబంధ పద్యము ’ పద్యరచనకు పరాకాష్ఠ స్థితి (climax) . ప్రబంధ పద్యం అంటే ప్రబంధం లోని పద్యం. ఇతిహాస,పురాణ , నాటకాది వివిధ ప్రక్రియలకు చెందిన గ్రంథాలన్నీ ప్రబంధ శబ్ద వాచ్యాలే అయినా కావ్యాలకే ప్రబంధము మారు పేరుగా, మరోపేరుగా ధ్రువపడింది. రూఢి అయింది .

వాస్తవానికి “సర్గబంధో మహాకావ్యమ్” అంటూ దండి అనే సంస్కృత లాక్షణికుడు చెప్పిన లక్షణాలే తెలుగు లాక్షణికులైన విన్నకోట పెద్దనాదులు కావ్య ప్రబంధ లక్షణాలుగా స్వీకరించారు.
క్రీ.శ. 16వశతాబ్దమునందలి కావ్యములను ముఖ్యంగా మనుచరిత్రము ను పురస్కరించుకొని ప్రత్యేకంగా రూఢమైన “ప్రబంధ లక్షణముల”ను ప్రకటించినవారు 20 వ శతాబ్దపు తెలుగు విమర్శకులే కాని ప్రాచీన లాక్షణికులుకారు. ( తెలుగు అకాడమీ పత్రిక ‘తెలుగు’ మే 1995 సంచికలోని ప్రొఫెసర్ జి.వి.సుబ్రహ్మణ్యం గారి ప్రత్యేక వ్యాసం చూడండి.

పైన పేర్కొన్న కేంద్రసాహిత్య అకాడమీ విమర్శ పురస్కార స్వీకర్త గారి మాటలను అనుసరించి పర్యాలోచిస్తే ౼ కేవలం 16 వ శతాబ్దంలో క్రీ.శ. 1522 తదనంతరం శ్రీకృష్ణదేవరాయల కోరికపై అల్లసాని పెద్దన రచించిన మనుచరిత్ర ను మాత్రమే దృష్టిలో ఉంచుకొని “……మనుచరిత్రమే ప్రబంధ లతకు పూచిన తొలి పువ్వు“ అని తీర్మానించిన మాట వాస్తవమని ఆంధ్రసాహిత్య అభిజ్ఞ పండితవర్గము గుర్తించగలదు. ఈ విధంగా ప్రబంధ లక్షణాలివి అని , తమకు నచ్చిన కావ్యగతాంశాలను కొన్నిటిని ప్రామాణీకరించుకొని , అష్టాదశ వర్ణనలు ప్రధానంగా ఉండే స్వతంత్ర కథోచిత మనోహర పద్యగద్యాలున్న కావ్యాన్నే “ప్రబంధమ”ని నిర్వచించినారు. కాని, మనుచరిత్ర కంటే సుమారు దశాబ్దం పైబడిన కాలం ముందటిదైన , 16 వ శతాబ్దపు ప్రారంభాన ఓరుగల్లు ను పాలించిన చిత్తాపుఖానుని మంత్రియైన పెద్దనామాత్యునికి అంకితమైన చరిగొండ ధర్మన్న కవియొక్క ‘చిత్ర భారతం ‘ ను గుర్తించదలచరైరి.

కాలక్రమానుగుణంగా “చిత్రభారతము” (చరిగొండ ధర్మన్న) క్రీ.శ. 1503-12 మధ్యకాలములోనిది. “మనుచరిత్రము” క్రీ.శ.1522లో భువన’విజయము లో కొలువుండి శ్రీకృష్ణదేవరాయలు అల్లసాని పెద్దనను అడిగి వ్రాయించుకున్న ప్రబంధము. ఈ విధంగా కాల సన్నివేశాలను పోల్చిచూసినట్లైతే “చిత్రభారతము”తొలి తెలుగు ప్రబంధమగుట వాస్తవము.న్యాయము. ఈ ప్రామాణిక , చారిత్రక శాసనాధారాలుగల విషయాలను 2013 లో తెలుగు విశ్వవిద్యాలయంలో విజిటింగ్ ప్రొఫెసర్ గా పనిచేసిన డా॥సంగనభట్ల నరసయ్య గారు : ఉపకులపతి డా॥ ఎల్లూరి శివారెడ్డిగారి కోరికమేరకు పరిష్కరించి, విపులమైన పీఠికను చేర్చి వెలువరింప’చేసినారు.

ప్రస్తుతము 2014 నుండి తెలుగు భాషకు చెందిన రాష్ట్రాలు రెండు . ఒకటి తెలంగాణ , రెండు ఆంధ్రప్రదేశ్. తెలంగాణ ఆవిర్భవించిన తరువాత 2017 డిసెంబరు నెలలో రాష్ట్ర ముఖ్యమంత్రి మాన్యశ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ప్రపంచ తెలుగు మహాసభలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన నిర్వహించుటకు సంకల్పించిరి. అంతకు కొద్ది నెలల ముందుగా డా॥నందిని సిధారెడ్డిగారు తొలి అధ్యక్షులుగా “తెలంగాణ సాహిత్య అకాడమీ” ప్రారంభించబడినది. ఈ క్రమంలో ప్రపంచ తెలుగుమహాసభలు డా౹౹నందిని సిధారెడ్డి గారి అధ్వర్యంలోనే మూడు రోజులు వివిధ ప్రసిద్ధ సాహితీవేత్తల పేరిట ఏర్పాటు చేయబడిన వేదికలపై నిర్వహింపబడినవి. అందులో భాగంగ “తెలంగాణ ప్రబంధాలు” శీర్షికన గతంలో ప్రచుర పఠన పాఠన పరంగా విస్తృత ప్రచారం లోకి రాని ప్రబంధములకు చెందిన ప్రత్యేక, విశిష్ట లక్షణములను గురించి నాకు : గురిజాల రామశేషయ్య కు ప్రసంగించుటకు అవకాశము లభించినది. ప్రముఖులైన తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ పండితుల సమక్షంలో తెలంగాణ ప్రక్రియా ప్రాదుర్భావ వికాస విశేషాంశములు పునర్మూల్యాంకన గణనం లోనికి రావలెనని నివేదింపబడినది . ఆ క్రమంలోనే నేను తదుపరి సంవత్సరములలో తెలంగాణ సాహితీ వేత్తలను సంప్రదించి ఒక్కొక్కరికి ఒక్కో ప్రబంధం చొప్పున అప్పగించి కవిపరిచయము–స్థల కాలాది’విశేష–కథాసంగ్రహ–ప్రబంధ నిర్మాణ విశేషాదిక పద్య’శిల్ప వైభవ విశేషములను వివరిస్తూ విషయవిస్తృతి గల వ్యాసములను వ్రాసి ఇవ్వవలసినదిగా కోరితిని .

కోరినవెంటనే సమ్మతించి ఆయా ప్రబంధములను కూలంకషముగా అధ్యయనము చేసి తత్ ప్రబంధ సంబంధిత చర్చనీయాంశాలకు చెందిన వివిధ సాహిత్య చరిత్రాది గ్రంథములను సంప్రదించి రచించి విద్వన్మిత్రులు వ్యాసములను పంపినారు . అయితే ఇంతలోనే వచ్చిపడిన కరోనా గండ సమయములో ప్రచురణ -ఆవిష్కరణాదులకు చెందిన సమయసందర్భ అవకాశాలు కుంటు పడుటచే ఏదైన పత్రిక ద్వారా మొదటి విడతగా ఈ ఐదు వ్యాసాలను వెలువరించ దలిచితిని. ఇంతలో దైవికముగా అమెరికాలో తమ పిల్లల దగ్గర ఉన్న ప్రసిద్ధ తెలంగాణ స్త్రీవాద రచయిత్రి,కవయిత్రి, ఒద్దిరాజు సోదరులపై విశేష శ్రమకోర్చి పరిశోధన చేసిన విద్వాంసురాలు డా॥ కొండపల్లి నీహారిణి ఒక రోజు ఫోన్ ద్వారా సంభాషిస్తూ , తాను ఒక ద్వైమాసిక అంతర్జాల పత్రికను ప్లవ ఉగాది నుండి ప్రథమ సంచికను వసంత సంచికగా ప్రకటించ’దలచినానని చెప్తూ , మీరు ఏదైనా ఒక ప్రత్యేక అంశానికి చెందిన తెలంగాణ సాహిత్య శీర్షికను నిర్వహింపవలెనని కోరినారు. వెదుకబోయిన రత్నము చేతికి దొరికినట్లు భావించి : వెంటనే నేను సేకరించిన తెలంగాణ ప్రబంధాలకు చెందిన విషయ విస్తృతిగల వ్యాసములను తమ ‘ మయూఖ ’ అంతర్జాల పత్రికలో ధారావాహికముగా ప్రచురించుకొన’వచ్చునని చెప్పినాను. అందుకు సంపాదకులు డాక్టర్ నీహారిణిగారు అంగీకారము తెలిపినారు .

తెలంగాణ ప్రబంధాలు శీర్షికతో తొలివిడతగా _తెలంగాణ పంచకావ్యాలు_ అనదగిన తెలంగాణ సాహిత్య వికాసరూపాలనదగిన ఐదు ప్రబంధాల పరిచయమాలికను సహృదయులకు అందించగలుగుతున్నందుకు ఎంతో సంతోషిస్తున్నాను.

ఈ పరిచయ మాలికను తమ మయూఖ తెలంగాణ సాహిత్య ద్వైమాసిక అంతర్జాల పత్రిక లో ప్రచురించుకొనుటకు అంగీకరించిన మయూఖ సంపాదకులకు తదితర నిర్వాహక కుటుంబ సభ్యులకు : హృదయపూర్వకంగా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. జయంతి తే సుకృతినో రససిద్ధాః కవీశ్వరాః

గురిజాల రామశేషయ్య రిటైర్డ్ అసోసియేట్ ప్రొఫెసర్ తెలుగు హైదరాబాద్ +91 70326 79471

రచయిత పరిచయముడా॥ సంగనభట్ల నరసయ్యగారు ఆధునిక తెలుగు ప్రముఖ సాహితీ వేత్తలలో డా॥ సంగనభట్ల నరసయ్య గారు ఒకరు.సంస్కృతాంధ్ర భాషా పండితులు.శాసన పరిశోధకులు.స్థల– వ్యక్తి — సాహిత్య చారిత్రక రచయితలు. శాసన పాఠములను సులువుగా అర్థం చేసికొని అందులోని విశేషాంశాలను చరిత్రకు అన్వయించి, ప్రశస్తమైన వ్యాసాలను అందించినారు. వీరి పరిశోధనా ప్రవణతకు” తెలుగులో దేశిచ్ఛందస్సులు” గ్రంథమే ప్రబల సాక్ష్యము. తెలివాహ గోదావరి – వీరి కలమునుండి వెలువడిన విలువైన సమాచార కరదీపిక.సమకాలిక పండితులందరి మెప్పును పొందిన ప్రామాణిక వ్యాస సంపుటి. ధర్మపురి క్షేత్ర మహాత్మ్యము, భోగినీ దండకము సవ్యాఖ్యానము, కాకతీయ ప్రతాపరుద్ర చరిత్ర సంబంధమైన నాటకము మరియు ప్రతాపరుద్రీయము : కవిపండిత సభాగోష్ఠి ప్రదర్శనలు , తెలంగాణ మహానగరాల చరిత్ర మొదలైనవి వీరి బహుముఖ సృజన-పాండిత్య ప్రతిభావ్యుత్పన్నతలకు నిదర్శనములు. వీరు తమ విపులమైన పీఠికను చేర్చి తె.వి.వి.వారి “రంగనాథ రామాయణం”గ్రంథ పరిష్కర్తగా విశేష ఖ్యాతిని పొందినారు. అట్లే “చిత్రభారతం” పరిష్కరించినారు. ఈ గ్రంథ పీఠికలో ” చిత్రభారతం : తెలంగాణ నుండి వెలువడిన తొలి తెలుగు ప్రబంధం” అనే ప్రాముఖ్యాంశాన్ని శాసనపాఠ–చారిత్రక సందర్భ సూచనలతో పాటు కా వ్యాంతర్గతమైన పారిజాతాపహరణాది అంశముల అంతస్సాక్ష్యములతో నిరూపించినారు. సంగనభట్ల నరసయ్య గారి ప్రతిపాదన — సమర్థనాంశ క్రోడీకరణ — సిద్ధాంత ఉపపత్తి నైపుణ్య క్రమవిధానము తిరుగులేనివని,అప్రవితర్క్యములని చెప్పకతప్పదు.
ఇక ప్రస్తుత వ్యాసమైన ‘చిత్రభారతము -తొలి ప్రబంధము’ ఈ విశేషములను ప్రస్తావించిన విషయ విస్తృతిగల వ్యాసము. ఇటువంటి సాహిత్య అంశములతో పాటు నాటకరంగానికి చెందిన రచయితగా, నటునిగా,ప్రయోక్తగా కూడా వివిధ భూమికలను పోషించే సంగనభట్ల నరసయ్యగారు నా దృష్టిలో ప్రధానంగా లోతైన విమర్శకులు. గాఢమైన రస భావుకులు.సాహితీమిత్రులకు విమర్శనమిత్ర౼హ్లాదైక సంభాషణ చంద్ర శబ్దవాచ్యులు. తెలంగాణము నుండి మారిషస్ ,సింగపూర్ దేశాలను సందర్శించిన సాహిత్యవేత్త. భారత దేశములోని పలురాష్ట్రాలలోని చారిత్రక , సాహిత్య , విశ్వవిద్యాలయ తదితర ప్రశస్త వేదికల పై నుండి అసాధారణ విషయ పరిశోధనాంశాలను ధారాళముగా ప్రకటించిన వాగ్మి. నా కోరికపై ఈ ప్రస్తుత వ్యాసమును తదితర కార్యవ్యగ్రులై ఉండినను : అత్యల్పవ్యవధిలో అందజేసిన వారికి నా ప్రత్యేక ధన్యవాదములు.

 

— గురిజాల రామశేషయ్య
రిటైర్డ్ అసోసియేట్ ప్రొఫెసర్ తెలుగు.
+91-7032679471


తొలిప్రబంధ కర్త చరిగొండ ధర్మన
చిత్రభారత ప్రబంధ కవితా కళా వైశిష్ట్యం

– డా॥ సంగనభట్ల నరసయ్య

 

వెయ్యేళ్ళ తెలుగు సాహిత్యం లోని పద్య కృతులలో ప్రబంధమన్న శాఖ అతి విశిష్టమైనది. ఈ శాఖలోని కావ్యాలు కవి ప్రతిభా దీధితులచేత కల్పనలతో, పద్య రచనా శిల్పంతో, కథా వైచిత్రులతో అలరారి, పురాణ కావ్యములను తోసిరాజన్నది. ఈ శాఖ పురాణ కావ్యములనుండి ప్రబంధ శాఖకు మారుటకు 4 దశాబ్దులు పట్టినవని, 16 వ శకం నుండి అనగా శ్రీకృష్ణదేవరాయల కాలం నుండి విస్తరించినవని, తత్పూర్వం కొంత కొంత లక్షణాలతో క్రమ పరిణామం పొందినాయని సాహిత్య విమర్శకులు అనుశీలించినారు. కాని, ఈ లక్షణాలు తత్పూర్వం లేకున్నా తొలిసారిగా ప్రవేశపెట్టి, ఉదాత్త ప్రబంధరాజంగా తొలికావ్యంగానే మలచి, తరువాతి ప్రబంధ కవులకు మార్గదర్శయైన ఒక కవి మూర్థన్యుడు తెలంగాణములో వెలసినాడు. ఆయన చరిగొండ ధర్మన, శ్రీకృష్ణదేవరాయల కాలానికి మూడు దశాబ్దులు ముందువాడు. 15 వ శతాబ్ది మధ్యకాలం వాడైన చరిగొండ ధర్మన కవితా ధర్మం, అలంకార శాస్త్ర సమ్మతమైన వైచిత్రి ప్రాణంగా కావ్యరచన చేసినాడు. అప్పటికే విశ్వేశ్వరకవి తెలుగునాట ‘చమత్కార చంద్రిక ‘ అనే సంస్కృతాలంకార గ్రంథం రాసి, చమత్కారం కావ్యప్రాణంగా స్థిరపరచినాడు. ఆతనికి అర శతాబ్ధి తరువాత ధర్మన ‘చిత్రభారతమ’నే చమత్కార కథా కావ్యం తొలి ప్రబంధంగా రాసినాడు. ఈతడు కవిమాత్రమే కాదు, శతావధాని! నాటి శతావధానులలో సుల్తాన్నని “శతలేఖిన్యవధాన సంధి సంధాసురత్రాగాచిహ్నిత నాముడ“నని పేర్కొన్నాడు.

చరిగొండ గ్రామం మహబూబ్ నగర్ జిల్లా లోనిది. ఒక గ్రామానికి చెందినవారు ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళినప్పుడు, వారిని గుర్తించడానికి ఆ గ్రామం వారని చెబుతూండడంతో ప్రజల వాడుకలో ఆ గ్రామ నామం గృహ నామంగా ఏర్పడుతుంది. ధర్మన పూర్వీకులు చరిగొండ వారై ఉంటారు. ఈయన కుటుంబం ఈ కావ్యం రాసేనాటికి ముందే కరీంనగర్ జిల్లాలోని గోదావరి తీరాన ఉన్న ధర్మపురి గ్రామంలో స్థిరపడి ఉండి ఉంటారు. ధర్మన ధర్మపురి వాడు. ఆయన పేరులో కూడా గ్రామ నామం ఉంది. ఆయన పితరులు ధర్మపురి గ్రామనామం ఆయనకు పెట్టినారు. యాదగిరి, ధర్మపురి, తిరుపతి వంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు వ్యక్తినామాలుగా నిలుస్తాయి. మాచర్ల ధర్మపురి తన ఇనుగుర్తి శాసనంలో (క్రీ.శ.13వ శతాబ్దిలో) ఈ ధర్మపురిని వ్యక్తిగత నామంగా రికార్డు చేసికొన్నాడు. ఈ గ్రామ నామం ఇంటిపేరుగలవారు, వ్యక్తి నామంగా గలవారు సమీప జిల్లాల్లో ఉన్నారు.

ధర్మనకు తన పుట్టిన గ్రామం ధర్మపురి గూర్చి అభిమానం మెండు. ఆ విషయం కూడా చిత్రభారతంలో కనబడుతుంది. తన ఇలవేల్పు ధర్మపురి నరసింహస్వామిని కావ్య కృత్యాది పద్యంలో ప్రార్థనాపూర్వకంగా పేర్కొన్నాడు.

శ్రీలక్ష్మీ కుచ పారిజాత కవికాశ్లిష్టోరుదక్షుడు, డే
వాళీమౌళి మణి ప్రభారుచిర పాదాంభోజుడుద్యర్దయా
వీలన్ ధర్మపురీశ్వరుండు గుణశాలిన్ నూతనాంబోనిధి
ప్రాలేయద్యుతి పెద్దన ప్రభు సమగ్ర శ్రీయుతుంజేయుతన్

( చి. భా. 11) అంతేకాదు తరువాతి కొద్ది ఆశ్వాసాల తొలి పద్యాలు ధర్మపురి నారసింహునివే (ఆశ్వాసాదిపద్యాలలో కృతిభర్తవి ఉండాలి, కాని కృతిభర్త నారసింహుడు కాడు)(చూ. ద్వితీయ, చతుర్ధాశ్వాసాది పద్యాలు).

ధర్మన తన కథలో, పాతళం లోని ఓ నదికి భోగవతి అని పేరు పెట్టినాడు. ధర్మపురిలోని గోదావరి లోని ఓ మడుగుకు సత్యవతి గుండమని పేరు. ఈమెకు మరో పేరు భోగావతి. ఆమె ఈ మడుగు దేవత.

సత్యవతమ్మా ! భోగావతమ్మా!
సత్యమును నమ్మి స్నానమాడితిమి
కన్నులతో కన్నవి , చెవులతో విన్నవి,
ఎరిగిచేసినవి, ఎరుగక చేసినవి
సర్వ పాపములు తొలగించుమమ్మా!

అంటూ స్నానం చేస్తారు భక్తులు. ఈ సత్యవతికి దేవాలయం ఉంది ధర్మపురి లో! ఈమె బతుకమ్మ! ఈమె మహాత్మ్యాన్ని ‘పాము పాట’ పేరుతో చాత్తాడ జగ్గయ్య, కూర నారాయణ రాజు, మల్లంపల్ల మల్లికారాధ్యులు, విశ్వనాథ సత్యనారాయణ మొదలగువారు రాసినారు.

పాతాళ నది పురాణ ప్రసిద్ధ భోగావతిని స్థానికతతో సార్థకం చేసినాడు.
కృతిభర్త ఎనుమలపల్లి పెద్దనామాత్యుడూ ధర్మపురి వాడే. అంతేకాదు వీరిద్దరు సమవయస్కులు. పెద్దన కుటుంబమంతా ధర్మనకు తెలుసు. ధర్మన వారి వంశ ప్రతిష్టను అతి విస్తృతంగా వర్ణించినాడు. పెద్దన వంశంలోనివారు స్థానిక దైవం నరసింహుని పేర్లతో నరహరి, సింగన్న, సింగమ్మ, లక్కాయి, నారాయణ, నరసింహ, సింగసాని అనే పేర్లు కలిగి ఉన్నారు. పెద్దన భార్యపేరు సింగసాని. పెద్దనామాత్యుని తండ్రి మాదన్న కందాళప్ప గురును శిష్యుడు. ఈ కందాళప్ప వంశం ధర్మపురి గ్రామం లోనిదే. వీరి వంశం నేటికీ ధర్మపురి నారసింహుకునికి పురోహితులు, యాజ్ఞికులు. ఈ కందాళప్ప వంశీకులకు ఇతర ప్రాంతాలలో దానాల శాసనాలున్నాయి. శ్రీ ధర్మపురి కందాళై నరసింహ అయ్యవార్లకు వెల్దిపాడు సర్వాగ్రహారాన్ని ఫసలీ 1111, అనగా క్రీ.శ. 1702 లో శ్రీ రాజా నరసింహ అప్పారావు, నూజివీడు సంస్థానాధీశుడు దానం చేసాడు. అప్ప శబ్దం ధర్మపురిలో కొత్తేమీ కాదు. కన్నడ ప్రభావం. శేషప్ప (నరసింహ శతక కర్త) ధర్మపురి వాడే! ఈ ధర్మపురి క్రీ.శ. 936 ప్రాంతంలో వేములవాడ చాళుక్య ప్రభువు అరికేసరి (రెండవ) ద్వారా కన్నడ ఆదికవి పంప మహాకవికి ధారాదత్తమైన గ్రామం. కన్నడ ప్రభావం అందుకే అధికం!

పెద్దనకు అడుగడుగునా ధర్మపురి నారసింహుని ఆశీస్సులు వర్ణింపబడ్జాయి. పెద్దతాత నరహరి భార్య లక్కాయి ‘ఆయి’ పదం మరాఠీది. ధర్మపురిపై మరాఠి ప్రభావం ఉంది. పెద్దతల్లిని పెద్దాయి అనీ, పినతల్లిని చిన్నాయి అని ధర్మపురిలో(రచయిత కూడా) ఇప్పటికీ పిలుస్తారు.

ధర్మపురి గ్రామంలో హరిహరులకు పశ్చిమ చాళుక్యులు నరసింహ శివాలయాలు నిర్మంచారు. క్రీ.శ. 1018 లో నిర్మించిన నరసింహాలయాన్ని బహుమనీ సుల్తాన్ అహ్మద్ షా సేనాని అజింఖాన్ దోచుకొని, క్రీ.శ. 1425 దాడిలో ధ్వంసం చేసాడు. ఈ ఆలయం నేడు మసీదుగా ఉంది. ధ్వంసం నాటికి యువకుడైన పెద్దన ఖడ్గం పట్టిన యోధుడు గనుక ప్రతీకారంతో అతణ్ణి(అజీంఖాన్ ను) చంపివేసాడు. ఈ విషయం చరిగొండ ధర్మన చిత్రభారతం కావ్యంలో రికార్డు చేసినాడు.

కం॥ బాహాని తీష్ణధారా
రాహుముఖగ్రస్త విమలరాజి “మహాల
క్ష్మీ హరి మందిర“ స్వామి
ద్రోహర గండాంక !

అని చిత్రభారతం 3 వ ఆశ్వాసంలో 170 వ పద్యంలో రాసాడు. నరసింహుని మందిరానికి ద్రోహం చేసిన వాణ్ణి గండరించిన వాడు (తల నరికిన వాడు) అని ప్రతిష్టాత్మకంగా పేర్కొన్నాడు. ఎన్నో ఆలయాలు మసీదులుగా మార్చిన చరిత్ర మనకు ఉంది. ఆలయ ఘాతకుడైన ఒక ముస్లీం సర్దార్ ను ఒక హిందువు తిరిగి ప్రతీకారంతో చంపడం అరుదే!
ధర్మన భాషలో “నేటికీ నిలిచిన “ ధర్మపురి భాష ఉంది. పాతులాడు,ఇవం(ఇగం),అప్పసం, కుసుల్లోకి విరగదన్ను, కోరు వెట్టు(కౌలు) వంటివి పేర్కొనవచ్చు. పై సాక్ష్యాలతో చరిగొండ ధర్మనను (కృతి కర్తను), ఎనుములపల్లి పెద్దనామాత్యుని (కృతి భర్తను) ధర్మపురి వారిగా గుర్తించవచ్చు.

(సశేషం)

-డా॥ సంగనభట్ల నరసయ్య
రిటైర్డ్ ప్రిన్సిపాల్.
+91-9440073124

June 2, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • విజ్ఞానదాయకం – కె.బి.సి.
  • ఎంతగా చదివితే అంత భాషా సౌందర్యాన్ని సృష్టించుకోగలం – వి.ఆర్ విద్యార్థి
  • 12, , 14
  • క్విజ్ -3
  • ‘ఆమె’

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us