Home వ్యాసాలు ‘ఆధ్యాత్మిక భాస్కరుడు’ ఆదిశంకరాచార్యులు *

‘ఆధ్యాత్మిక భాస్కరుడు’ ఆదిశంకరాచార్యులు *


పరమశివుని అవతారమైన జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యుల వారి అవిశ్రాంత కృషివలనే ఈనాడు మనం సనాతన ధర్మాన్ని అనుసరిస్తున్నాం ఆ మహానీయ ఆచార్యులు దేశమంతటా పర్యటించి ఉపనిషత్తుల అద్వైత సారాన్ని వ్యాప్తి చేశారు గొప్ప దూర దృష్టితో శ్రీ ఆదిశంకరాచార్యులు భారతదేశంలోని నాలుగు దిక్కులలో నాలుగు ఆమ్నాయ పీఠాలను స్థాపించారు వీటిలో శృంగారిలో స్థాపించబడిన దక్షిణామ్నాయ శ్రీ శారదాపీఠం, శ్రీ ఆదిశంకరాచార్యుల వారి ప్రత్యక్ష శిష్యుడైన శ్రీ సురేశ్వర ఆచార్యుల నుండి మొదలుకొని అవిచ్ఛిన్నమైన ప్రసిద్ధ గురువుల పరంపరతో అలంకరించబడింది. ఆచార్యుల జీవితాలు శ్రీ ఆదిశంకరాచార్యుల వారి ఉద్యమాన్ని కొనసాగించడానికి వారు చేసిన ప్రయత్నాలు అద్భుతమైనవి, విశిష్టమైనవి.హిందూ తత్వ శాస్త్రానికి, ఆధ్యాత్మికతకు ఆదిశంకరాచార్యుల వారు చేసిన సేవలను ,వారి జీవితాన్ని గౌరవించడమే శంకరాచార్య జయంతి యొక్క ప్రాముఖ్యత.

భారత చరిత్రలో ఆది శంకరాచార్య భగవత్పాదులు ఒక అద్భుతమైన శక్తి, భారతీయ జీవన విధానానికి, సాంఘిక వ్యవస్థకు జీవన గడ్డయైన వేదాంతాన్ని ప్రబోధించిన శంకరాచార్యులు భిన్నత్వంలో ఏకత్వాన్ని చూపించే అద్వైత సిద్ధాంతం. పరమాత్మ, జీవాత్మ ఒక్కటే, జీవాత్మ పరమాత్మలకి అభేదం “ఏకమేవా అద్వి తీయం బ్రహ్మ’ ‘జీవో బ్రహ్మైని నా పరః” అనే వ్యాఖ్యల అద్వైత, సిద్ధిని చెబుతాయి. ఈ జ్ఞానాన్ని పొందిన జీవాత్మ మోక్షం పొందగలు గుతుంది. అంటే పరమాత్మలో లీనమౌతుంది. ఇలాంటి జ్ఞానం పొందడానికీ అందరికీ సాధ్యం కాదు. భారతీయ సంస్కృతి వైభవా నికి కృషి సల్పిన మహాత్ములలో శంకరాచార్యులు ఒకరు. సాక్షాత్తు పరమశివుని అవతారంగా చెప్పబడుతున్న ఆదిశంకరుల శక్తి అనన్య సామాన్యమైంది.

భారతీయ సంస్కృతి వైభవానికి కృషి సల్పిన మహాత్ములలో శంకరాచార్యులు ఒకరు, ద్వైత, అద్వైత, విశిష్టాద్వైతాలనే త్రిమతాలు. ఆనాటి ఆర్ష ధర్మానికి వ్యతిరిక్తంగా వున్న మతాలను ఖండించడమే కాకుండా భారతీయ సంస్కృతిలో అద్వైత సిద్ధాంత సమభావాన్ని ఆధారం చేసుకొని శంకరులు శైవం, వైష్ణవం, శాక్తం, శూలం, గానపత్యం, కౌమారం అనే మతాలలోని దోషాలను తొలగించి షణ్ముఖ స్థావనాచార్యులై వివిధ మతాల మధ్య సామరస్య భావన పెంపొందించుటకు, సంప్రదాయాల మధ్య వున్న అంతర్లీన సూత్రాన్ని ప్రచారం చేసి, పంచాయ తన పూజా విధానాన్ని వ్యాపింపజేసి, ఇష్ట దైవాన్ని పూజించేట్లుగా విధి విధానాలను అమలు చేసేవిధంగా పూజా విధానంలోని లోపాలను సవరించిన ఆధ్యాత్మిక సంస్కర్త శంకరాచార్యులు.

వేదమాత పునరుద్ధరణ కోసం తొలుత వ్యాసులుగా పిమ్మటశంకరులుగా అవతరించారు.వ్యాసులు నారాయణ స్వరూపం. శంకరులు ఈశ్వర స్వరూపం.ఈశ్వరనామ సంవత్సర, ఉత్తరాయణం, వైశాఖమాసం, వసంత ఋతువు, శుద్ధ పంచమి, సోమవారం, కర్కాటక లగ్నంలో, ఆరుద్ర నక్షత్ర యుక్త ప్రథమ పాదంలో, నవగ్రహాలలో ఐదు గ్రహాలు ఉచ్ఛలో ఉండగా కేరళ రాష్ట్రంలోని పూర్ణానది తీరానగల వృషభా చల వృషాదీశ్వర స్వామి అంతచే ‘కాలడి’ అనే గ్రామంలో శివగురు, ఆర్యాంబ పుణ్యదంపతుల తపః ఫలంగా శంకరులు జన్మించారు.
లౌకిక విషయాలు దుఃఖ మిశ్రితాలు, పారమార్ధికాలు, సుఖ రూపాలు దుఃఖ రహిత సుఖస్వరూపాలు “శంకరోతీత శంకరః” అని దివ్యమైన సుఖాలను ప్రస్తావించువాడు ‘శంకరుడు కనుక ఆ బాలునికి ‘శంకరుడు’ అని నామకరణం చేశారు. ‘శం’ అనే అక్షరం ‘ఐదు’ అంకెకు సంకేతం. ‘క’ అనే అక్షరము ‘ఒకటి’ అనే అంకెకు పర్యాయము. ‘ర’ అనే అక్షరం, ‘రెండు’ అంకెకు సంకేతం. శంకరులు జన్మించిన తిథి, వార, పక్ష, మాస, నక్షత్రాలను అనుసరించి చూచినవారు జ్ఞానం ద్వార ప్రపంచానికి నిత్య సుఖము ప్రసాదించేవాడని స్పష్టం చేశారు.
శంకరులు మూడవ ఏటనే చదవడం, వ్రాయడం ఐదవ సంవత్సరం వచ్చేసరికి సంస్కృత భాషలో వైదుష్యం సంపాదించి, మూడు వత్సరాల కాలంలోనే సమస్త విద్యలను అభ్యసించి సర్వ శాస్త్ర కోవిదుడయ్యాడు. శంకరుని వైదుష్య వైదగ్ధ్యాలను చూసి విద్వాంసులు విస్మయం చెందారు.
శంకరులకు ఏడవ ఏట ఉపనయం చేశారు. ఎనిమిదవ ఏటకే వేద విజ్ఞానాన్నంతటిని ఔపోసనం పట్టారు. ఈ మధ్య ‘కాలంలోనే తండ్రి శివగురువు మరణించాడు. కారణ జన్ములైన శంకరులు నర్మదా నదీతీరంలో శ్రీగౌడ నాదాచార్యుల శిష్యులైన శ్రీగోవింద భగవత్పాదుల నాశ్రయించి సన్యాస దీక్షను స్వీకరించారు. నాలుగు వేదాలను తర్మవిద్యల సభ్యసించి బ్రహ్మ విద్యోపదేశం పొందాడు. తర్క వితర్కాల శాస్త్ర చర్చలలో భారతీయులకు తిరుగులేదని ఋజువు చేసి ఆరాధ్య గురువయ్యాడు.

అద్వైత మనునది అద్భుతమైన, అనిర్వచనీయమైన ఆనందానుభూతి. అద్వైత మనేది ఆచారము కాదు, మతమూ కాదు. జ్ఞాన మార్గంద్వారా పొందేది. తర్కయుక్తులతో సాధించబడేది కాదు. అద్వైతము శంకరులతో ఆరంభమైనది కాదు. అద్వైత ప్రమాణమును శంకరులకు పూర్వీకులైన ఆచార్యులైన, వశిష్ఠ, గౌడ పాద, బ్రహ్మదత్తాదులు ప్రవచించారు.
శంకరులు తమ అసమాన ప్రతిభా పాటవాలతో ఉపనిష త్తులలో వివరించబడిన సనాతన ధర్మము, ఆచారములు విశిదపరిచి వైదిక ధర్మాచరణము సుష్టుపరిచాడు. ఈనాడు భారతీయ వైదిక సంస్కృతి అవిచ్చిన్నంగా పరిఢవిల్లుతున్నదంటే అందుకు కారణం శ్రీశంకరాచార్య భగవత్పాదులే! పతనావస్థలో ఉన్న భారతీయ సంస్కృత సనాతన ధర్మాన్ని పరిరక్షించారు.

వామాచార ధోరణులతో నరులు, పశువుల బలులతో కూడిన అవైదిక పద్ధతులను, పూజాదికాలను, వైదిక ధర్మానికి విఘాతం కలిగించే విధానాలను రూపుమాపాడు. రుద్రమూర్తులైన ఎన్నో దేవతామూర్తులలోని రౌద్రాత్మకమైన బీజాక్షరాలను తొలగించి శాంతపరిచి, సాత్వికరూపంలో భక్తులకు దర్శన భాగ్యం కలిగించాడు.

32 సంవత్సరాలు తన జీవిత కాలంలో 24 గ్రంథాలకు భాష్యాలు రచించడం జరిగింది. ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీతపై భాష్యాలు, అమరోక్షానుభూతి, భజగోవిందం, వివేక చూడామణి, శతశ్లోకి, శివానందలహరి, సౌందర్యలహరి, ఆనంద లహరి, భవానీ భుజంగ, గణేశ పంచరత్న, దక్షిణామూర్తి, లక్ష్మీనరసింహ, మీనాక్షి, పంచరత్నాలను ఇంకా బ్రహ్మ మీమాంస, ఉత్తర మీమాంస, బ్రహ్మసూత్రాలను, కనకధారా స్తోత్రాన్ని, మనీష పంచకం, ఇలా ఆదిశంకరాచార్యులు వ్రాసినన్ని విషయాలు ఈ ప్రపంచం మొత్తం మీద మరెవరూ వ్రాసి ఉండరు. అందుకే ఆయన కృతయుగంలో ఆదిశంకరులు అని పండితుల వచనం.
మానవులకు భక్తి, జ్ఞానం, ధర్మాల ద్వారా మానవ జీవిత లక్ష్యమైన మోక్షప్రాప్తికి మార్గం చూపిన మార్గదర్శకులు జగద్గురువు ఆదిశంకర భగవత్పాదులు కేవలం 32 సంవత్సరాలు జీవించారు.

శంకరాచార్యను స్మరించడం ఆధ్యాత్మిక ఎదుగుదలను పెంపొందిస్తుంది, అద్వైత వేదాంతంపై అవగాహనను పెంచుతుంది మరియు హిందూ తత్వశాస్త్ర సంప్రదాయంతో అనుబంధాన్ని బలపరుస్తుంది.అంతే కాకుండా, భక్తులు ఆది శంకరాచార్యుల వారి కాలాతీత జ్ఞానాన్ని మననం చేసుకోవడానికి మరియు ఆయన బోధనలను తమ దైనందిన జీవితంలో అన్వయించుకోవడానికి ఇది ఒక అవకాశంగా కూడా ఉపయోగపడుతుంది.

సనాతన ధర్మ వృక్షాన్ని చిగురింపజేసి, ద్వైత చీకట్లను తొలగించిన అద్వైత ఆనందమూర్తి ఆదిశంకరులు.

You may also like

1 comment

br23bet42 September 29, 2026 - 11:47 am

Solid platform with great customer support. They helped me out with my account issue in minutes. Trustworthy service at br23bet42.

Reply

Leave a Comment