Home కవితలు కవి చివరి చరణం !!

కవి చివరి చరణం !!

by Ananthaacharaya K.S.

పుట్టడం సహజం
చావడమూ అంతే
మధ్యకాలo అర్ధయ్యేసరికి
కళ్ళముందు పొద్దువాలి పోతుంది!!

ఈ మధ్యలో
ఎన్ని అక్షరాలు చెక్కాడో
అవే చరిత్రలో నిలబడే సూచీ స్తంభాలు!!

పూలదండలు
పురస్కారాలు పొగడ్తలు
కవికి కొత్త ఊపిరియే కానీ
ఊనిక కాదు కొలమానాలు కావు
దినపత్రిక మీద మురిపించే
ఒక రోజు బాక్స్ ఐటమ్ !!

కవి అంతిమయాత్ర లో
అతని పద్యాలలోని
పాదాలు గులాబీ రెక్కలై వీధుల గుండా చల్లబడుతాయి!

సిరచుక్కలు ఇకపై
గడ్డ కట్టుకుని పోతాయి
జీవితం శూన్యమా అన్నట్టు
కవి గారి డైరీ చివరి పేజీ అసంపూర్తి
గా బిగుసుకు పోతుంది!

ఆయన పుస్తకాలు పార్థివ దేహం దగ్గర
తలగడయై, కృతజ్ఞతగా ఒదిగి ఉంటాయి!
ఎవరో ఒకరు, పుటలు తెరిస్తే, బావురుమంటాయేమో ?

అంజలి ఘటిస్తూఎవరో అస్పష్టంగా చెప్పిన అమర్ రహే
పదాలు
డోలాయమానమై గాల్లో
ఊగిసలాడుతూనే ఉంటాయి !
ఒంటరిగా..
జై కొట్టే లోగొంతుకలయినా లేక!

కవీ!! బతికి ఉన్నన్ని నాళ్ళు
పుస్తకాల్లో తల ఇముడ్చుకుని
కూర్చున్నావు
ఇప్పుడు నీ గేయం మీద
జ్ఞాపకానివై నిలబడ్డావు!

ప్రజాస్వామ్యం కొరకు
శిర మెత్తి అన్యాయం మీది అరిచిన అరుపులు
నిరసన చెణుకులు క్రమంగా కవి కులం నుండి వెలివేయబడతాయి!

అయినా కవీ
నీ కలం లో పుట్టిన
పదాలు మౌన
విస్పోటనాలు!
దాని
అణుధార్మికత
మెదళ్ళలో
మెల్లిగా మొదలౌతుంది!
కవీ!

You may also like

Leave a Comment