కాలం
వాడిపోకుండా దాచుకోవడానికి
అది నా చేతిలో పూసిన పువ్వు కాదు
కాలం
మబ్బుల మునివేళ్ళ సందుల్లోంచి
జారిపడే చినుకుల సమూహం
అలా చూస్తుండగానే చినుకులు
నదిగా మారిపోయే క్షణం
నేనేమో నిన్నటి ఉదయం
ఇప్పటికీ నా కిటికీ దగ్గరే ఉందనుకున్నాను
తిరిగి చూసేసరికి కాలం ఒక జ్ఞాపకమై
గుండె గోడపై వేలాడుతోంది
ఎన్ని ఋతువులు వచ్చి వెళ్లాయో
ఆకాశం లెక్క పెట్టుకోదు
ఎన్ని పక్షులు తన కొమ్మలపై
వాలాయో చెట్టు గుర్తుంచుకోదు
అలాగే
జీవితం కూడా
మనం గడిపిన రోజుల సంఖ్యను కాదు
మనలో వెలిగిన వెలుగును గుర్తుంచుకుంటుంది
నవ్వులు కన్నీళ్లు నా వెంటే వున్నాయి
కొంతమంది తోడుగా నడిచారు
కొంతమందేమో దారిమధ్యలోనే
జ్ఞాపకాలై నిలిచిపోయారు
అయినా
నా ఉదయాలు ఆగలేదు
సూర్యుడు తన ప్రయాణం మానలేదు
నాలో కలలు కూడా
పరాజయాల బూడిదలోంచీ
మళ్లీ మొలకెత్తుతూనే ఉన్నాయి


5 comments
https://shorturl.fm/3ih1b
https://shorturl.fm/i7PSV
https://shorturl.fm/8jfAK
https://shorturl.fm/jX5qo
https://shorturl.fm/hG2tH