కీర్తిశేషులు గుండవరం చంద్రశేఖర రావు గారు రచించిన పద్య కావ్యం ప్రబోధ నిర్వచనం నీతి చంద్రిక, మిత్ర లాభం. ఆయన పుత్రులు, కవి, గుండవరం ప్రభాకరరావు ,రెండవ కుమారుడు కొండల్ రావు ,కూతురు శారదాదేవి ఈ పుస్తకాన్ని పునర్ ముద్రించారు. భవానీ సాహిత్య వేదిక నిర్వాహకులు వైరాగ్యం ప్రభాకర్ ప్రచురణ కర్తగా వ్యవహరించారు.
బుద్ధి కుశలత లేని రాజకుమారులను తీర్చిదిద్దడం లక్ష్యం. విష్ణుశర్మ అనే గురువు ద్వారా ఇది జరిగింది. ఒకప్పుడు సంస్కృత సాహిత్యంలో భానుని కాదంబరి, దండి దశకుమార చరిత్ర గొప్ప వచన గ్రంథాలు. తెలుగులో చిన్నయ్య సూరి బాల వ్యాకరణం, వ్యాకరణం అభ్యసించే వాళ్ళకి అనుకూలంగా తీర్చారు. అదే క్రమంలో రచించిన నీతి కథల వెన్నెల ఈ నీతి చంద్రిక. అందులోని మిత్ర లాభాన్ని గుండవరం వారు చాలా చక్కని పద్యాలలో రచించారు.
పీఠికలో గండ్ర లక్ష్మణరావు గారు చెప్పినట్టు వచనాన్ని పద్యంలో రాయడం చాలా కష్టం. ఈ కష్టమైన కృతి నిర్వహణ చంద్రశేఖర రావు గారి చేతిలో ఆలవోకగా కొనసాగింది.

గుండవరం చంద్రశేఖర రావు ఈ రచనను పూర్తిస్థాయి ప్రాచీన కావ్య రచనా పద్ధతిలోనే రచించారు. ఇష్ట దేవతా స్తుతి, మాతృ స్తుతి, పండిత స్తుతి. మొదలైన కావ్య సంప్రదాయాలను పాటించారు. పద్యాలను ఎత్తుకోవడం, నడిపించడం, సమస్తము నాటి ప్రబంధ పద్ధతే. ఆయన మిత్ర లాభము కథను ఈ పద్య శిల్పంతో చెప్పడం ఆధునిక సాహితీ రంగంలో ఒక నూతన ప్రయోగం.
చిన్నయ్య సూరి నీతిచంద్రికలో వివిధ జంతువులు మాట్లాడుతాయి. మానవుల వలె ఆలోచిస్తాయి. ఇట్లాంటి anthropomorphism ఆనాడే చిన్నయ్య ప్రయోగించాడు. ఇది గుండవరం చేతిలో మరింత రసవంతమైంది.
ఆయన మిత్ర లాభం కథా ప్రారంభం చిన్నయ్య సూరి పద్ధతిలోనే మొదలుపెట్టినా నాటి ప్రబంధాలనే స్తురింపజేస్తుంది. “గంగ కనతి దండ గలదొక్క నగరంబు, అఖిల సంపదగల్గి అలరుచుండు”
అంటూ మొదలవుతుంది. పావురములు వలలో చిక్కుకోవడం, బ్రాహ్మణుడు పులి కథ, లఘు పతనకుడు హిరణ్యకుని స్నేహమాశించడం, పిల్లి చేసిన మోసం వల్ల ముసలిగద్ద బలి కావడం, హిరణ్యకుడు పూర్వకథ చెప్పడం,బ్రాహ్మణుడు_ నువ్వుల కథ, మందరుడునక్క_విల్లు కథ చెప్పడం, చిత్రాంగుడు తన పూర్వ కథ చెప్పడం, ఇలాంటి కథలూ , ఉపకథలతో సాగిపోతుంది కథాకథనం.
గుండవరం వారి శైలి ప్రసాద మాధుర్యంతో ఉంటుంది. ఆయన పద్యాలు పాంచాలి రీతిలో కొనసాగుతాయి. ఆయన వాడిన అలంకారాలు ఆధునిక కవి మార్గదర్శకాలు.
చింతలు గ్రమ్మె చందురుని చీకటి మబ్బులు ముంచునా విధం, (28 పేజీలో 5వ పద్యం) కాల ప్రవాహము నాపశక్యమే ( 47వ పేజీలో 108వ పద్యం ) భీరుని కైవడి భూరుహంబునన్ (136 పద్యం 52 పేజీ ) గణనౌనగు వన ప్రకృతి, వనితామణి నీల గగన వర్ణము తోడన్, ( 88వ పేజీ 339 పద్యం )
ఈయన పద్యాలలో లోక సహజ రీతి సామెతలుగా నిలబడిపోగలిగే పాదాలు ఎన్నో కనబడతాయి.
బుద్ధిబలుండబలుడై నభూషణుడవనిన్. (56వ పద్యం ) ఆశింపకు కపట కుఠిల మానస మైత్రిన్ ( 43 వ పద్యం )
ఈయన రాసిన పద్యాలు ప్రసిద్ధ కవుల ఒరవడిలో సాగినవి. 43 వ పద్యం కొరవి గోపరాజును, 47 వ పద్యం బలిజేపల్లి లక్ష్మికాంతమును, 68, 82, పద్యాలు కరుణశ్రీని, 72వ పద్యం పోతనని,76వ పద్యం పెద్దనను, 113 వ పద్యం ముక్కు తిమ్మనను, స్పురింపజేస్తాయి. 161 పద్యంలో కవి ప్రయోగించిన దుష్కరప్రాస ఈయన పద్య రచనా కౌశలాన్ని తెలియజేస్తుంది.
పావురాలన్నీ వలలో చిక్కుకున్న తర్వాత తమను అందుకు ప్రోత్సహించిన వృద్ధకపోతాన్ని మిగతా పావురాలు చిన్నయ్య సూరి కథనంలో ఈ విధంగా నిందిస్తాయి. “నీవు వృద్ధుడవు, తెలిసిన వాడివి అని భ్రాంతిపడి నీ మాటలను విని, ఈ విపత్తు తెచ్చుకుంటిమి. ఎవ్వడు బుద్ధిమంతుడో వాడు వృద్ధుడు కాని, ఏండ్లు మీరిన వాడా వృద్ధుడు..
ఈ మాటలకు చంద్రశేఖర రావు పద్యానువాదం చూడండి,
వృద్ధులిట లక్షలున్నను
బుద్ధికి బలుడైనవాడె,వృద్ధుండిల సద్,
బుద్దికి వృద్ధుడె బద్దుడ
బుద్దిబలుండబలుడైన భూషణు డవనిన్
ఇంత చక్కని ఈ పద్య కావ్యం లో అక్కడక్కడ యతిభంగి పద్యాలు చేరాయి. ఇది డిటిపి చేసిన వాళ్ల దోషం అయి ఉంటుంది.
మరొక ముద్రణలో దీన్ని సవరించుకోవాలి.
