Home కవితలు కవి పుష్కరాలు!

కవి పుష్కరాలు!

by Patlolla Bakka Reddy

ఏటికి పన్నెండేళ్లకు పుష్కరాలు
కవి ఉప్పొంగి పులకరిస్తే పుష్కరమే!

కవి స్వాప్నికుడు
కలల సాగరంలో మునిగి తేలుతుంటాడు
నదిలా కవి కలం – నడక ఆగక సాగుతుంది
ఎక్కడా ఆగదు – ఎప్పుడూ ఎండదు!

కవుల కలలు కోయిల గళాలై
నది పాయల్లాంటి
కవిత్వ చెట్టు శాఖలపై వాలి
కవిత్వాన్ని ఆరాధించి
కవితా మధుర గానం చేస్తాయి!

ఇది త్రివేణి సంగమాన్ని మించిన సంగమం!
కవుల అంతరంగ భావ సాగర సంగమం!

అందులో మునిగి దేవులాడితే
వజ్రాల చేనులో వెతుకులాడితే
అదృష్టం కొద్దీ వజ్రాలు దొరికినట్లు
ముత్యాల కవిత్వ పదాలు అందిపుచ్చుకోవచ్చు!

ఇక్కడ అక్షరాలు ముత్యాల హారాలవుతాయి
స్వరాలు సుస్వరాలవుతాయి
భావనలు భావ ప్రవాహాలవుతాయి.
మనసులు మౌనం వీడి
కవిత్వ తరంగాలవుతాయి!

ఆహా! దొరుకునా ఇటువంటి తరుణం!
అక్షరంతో రణం చేసే మంచి తరుణం!

ఇది కవుల హృదయ స్పందనల సంగమం
అక్షర లక్ష లక్షల అక్షరార్చనల పుష్కరం!

రండి కవులారా రండి
ఈ అక్షర పుష్కర సంగమంలో
మనందరం మునుగులాడి,మన
కలాలకు,,గళాలకు కొత్త ఒరవడి అద్దుదాం!

అక్షర తీర్థాన్ని మధించి
కవిత్వామృతాన్ని పండిద్దాం !
కవిత్వ మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ
అక్షర సరస్వతిని ధ్యానిస్తూ
మన కలలను సాకారం చేసుకుందాం!



You may also like

Leave a Comment