తరిగొండ వెంగమాంబ (20 ఏప్రిల్ 1730 – 21 ఆగష్టు 1817), మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అని కూడా పిలుస్తారు, 18 వ శతాబ్దంలో కవయిత్రి, వెంకటేశ్వరుని అపర భక్తురాలు. ఆమె అనేక పద్యాలు, పాటలు రాసింది.
తరిగొండ వెంగమాంబ క్రీ.శ 1730లోఏప్రెల్ 20నఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా నరసింహ క్షేత్రమైన వాయల్పాడు సమీపంలోని తరిగొండ గ్రామంలో ఒక గొల్ల కుటుంబం కానాల మంగమాంబ, కానాల కృష్ణయామాత్యులు దంపతులకు జన్మించారు. శ్రీ వేంకటేశ్వరుని దయవల్ల కలిగిన సంతానం కావున ఈమెకు ‘వెంగమాంబ’ అని పేరు పెట్టారు. ఆమెబాల్యంలో తనతోటి పిల్లలతో ఆటలాడుకోక ఏకాంతంగా కూర్చొని భక్తి పారవశ్యంలో మునిగి తేలేది. ఆ చిరు ప్రాయంలోనే అనేక భక్తి పాటలను కూర్చి మధురంగా గానం చేసేది. తండ్రి ఆమె భక్తిశ్రద్ధలను గమనించి ఆమె నైపుణ్యంను సానబెట్టుటకు సుబ్రహ్మణ్య దీక్షితులు అనే గురువు వద్దకు శిక్షణకు పంపాడు. దీక్షితులు ఆమె ప్రతిభను గుర్తించి తనకు తెలిసిన పరిజ్ఞానమంతా వెంగమాంబకు బోధించాడు. అనతి కాలంలోనే వెంగమాంబ ప్రశస్తి నలుమూలల పాకడంతో తండ్రి ఆమె విద్యాభ్యాసాన్ని మాన్పించి తగిన వరుని కోసం వెతకడం ప్రారంభించాడు.
ఇంటి పనులలో సహాయం చేయమని తల్లి చెప్పినపుడు తన సేవ భగవంతునికే అర్పణమని వెంగమాంబ తిరస్కరించింది. అనేక మంది వరులు ఆమెను చూచి చాలా అందంగా ఉన్నదనో, చాలా తెలివైనదనో నెపాలతో పెళ్లి చేసుకొనుటకు సమ్మతించలేదు. చివరకు ఇంజేటి వెంకటాచలప్ప వెంగమాంబను చూసి ముగ్ధుడై ప్రేమలో పడి ఆమెను వివాహానికి అంగీకరించాడని చెబుతారు. చిన్నప్పటి నుండి, ఆమె వేంకటేశ్వరునికి అత్యంత భక్తురాలు, ఆయనే తన భర్తగా భావించి వివాహాన్ని నిరాకరించింది. ఆమె భక్తితో గ్రామస్తులు ఆమెకు పిచ్చి అని చెప్పుకోసాగారు. కానీ పదేండ్ల చిన్న వయసులోనే ఆమెకు తల్లితండ్రులు బలవంతంగాఇంజేటి వెంకటాచలపతితోనేబాల్య వివాహం జరిపించారట.వివాహానంతరం వెంకటాచలప్ప ఆమె భక్తి మౌఢ్యాన్ని వదిలించే ప్రయత్నం చేసాడని, కానీ వెంగమాంబ అతనిని దగ్గరికి రానివ్వలేదని అంటారు.
ఆమె కాపురానికి వెళ్ళకుండానే పతిని కోల్పోయి బాల-వితంతువు అయితేశ్రీ వేంకటేశ్వరుడే తప్ప మరెవరినీ భర్తగా అంగీకరించడానికి నిరాకరించి వివాహితగా మంగళసూత్రం, రంగుల దుస్తులు, బొట్టు వంటివి ముత్తయిదువు చిహ్నాలను వీడలేదు. అప్పటి పరిస్తితుల దృష్ట్యా ఆమెకువిధవ సమారాలు చేయించాలని ప్రయత్నించిన సమాజాన్ని వ్యతిరేకించింది. అయినా వినకుండా ఆమెకు బలవంతంగా జుట్టు తీసేస్తే తిరిగి వెంటనే జుట్టు మరల వచ్చేదట. ఒకనాడు నరసింహ స్వామి ఆలయానికి వెళితే ఆలయ అర్చకుడు ఆమె జుట్టు పట్టుకుని మరీ బయటకు తోసి అవమానించటంతో బాధపడి ఆ ఊరే వదిలి తిరుమలకు బయలుదేరింది. కొండదారిలో స్వామి ప్రత్యక్షమై ఆమెను ఊహాలక్షి ఉపాసన చేయమని ఆదేశించారని, తిరుమలలో ఉండటానికి వసతిలేక తినడానికి భోజనం లేకపోయినా భగవంతుడి యందు భక్తి విశ్వాసాలతో ఊహలక్ష్మి ఉపాసన చేసిందని ప్రతీతి.
భగవత్ ప్రేరణతో అప్పటి హతిరాంజీ మఠం ఆమెకు ఉండటానికి ఒక గుడిసెలో ఏర్పాటు చేసి మఠం లో రోజూ ఆహారం ఏర్పాట్లు చేశారు. ఆగుడి పరిసరాల్ని శుభ్రం చేసి తులసి తోటను పెంచి రోజూ ఆలయంలోని స్వామి కైంకర్యానికి తులసిని తీసుకెళ్శేది. ఆమె భక్తి శ్రద్ధలు ఉపాసనా క్రమం చూసి ఆనాటి అన్నమయ్య వారసులు ఇంటికి తీసుకుని వెళ్ళి ఆశ్రయం కల్పించారు. అక్కడే ఆమె తులసి తోట పెంచి ఆలయానికి హారతీ తీసుకెళ్ళేవారు.
ఆలయానికి ఉత్తరాన 15 కి.మీ. దూరాన దట్టమైన అడవులలో తుంబురు కోన వద్ద యోగాభ్యాసం చేస్తూ గడపినట్లు తెలుస్తుంది. ఈమెకు వేంకటేశ్వరుడు కలలో కనిపిస్తూ ఉంటాడని అనేవారు. ఈమె ప్రతిరాత్రి ఊరేగింపుగా తన ఇంటిముంగిటికి వచ్చే భోగ శ్రీనివాసమూర్తికి వెండి పళ్ళెంలో ముత్యాల హారతి ఇస్తూ ఉండేదట. ఇందుకోసం ఒక్కొక్కదినం నగిషీలు చెక్కబడిన వెండిపళ్ళెంలో ఒక్కొక్క దశావతార ఘట్టాన్ని సమర్పించేదట. ఈ విషయం1890లో ఈస్టిండియా కంపెనీ వారు తయారు చేసిన కైంకర్య పట్టీ వలన తెలుస్తుంది.

