Home కవితలు రమ్య భావన

రమ్య భావన

by Dr. Ojja SharatBabu

నాదేశ పలుకులు నాదేశ విలువలు
కానరావెచ్చోట గాంచిజూడ
నాదేశ ధైర్యము నాదేశ శౌర్యము
నిలిచిలేవెచ్చోట నిలిచి చూడ
నాదేశ సహనము నాదేశ వినయము
కలిగిలేరెచ్చోట జెలగి చూడ
నాదేశ సంస్కృతీ నాదేశ సంపదల
వెలుగలేదెచ్చోట వెతికి జూడ
తే.గీ.
కలిసి కట్టుక కదులుటె కలిమి బలిమి
భిన్న భాషల వాజ్ఞ్మయ మున్న భూమి
స్వర్గ ధామము భారతీ సాధ్వి జగతి
సర్వ జనులకు సౌభాగ్య శాంత మూర్తి.1.

కం.
పేదలు సుఖము నొందవలెను
వేదనలను పొందరాదు బేలగ నెపుడున్
రోదనలు తొలగాలి భరత
మేదిని యెల్లెడల,జనము మెరుయుచు కదలన్.2.

తే.గీ.
సామరస్యమె పెన్నిధి సౌఖ్యమునకు
మన పథమెల్ల నానంద మయము జూడ
జ్ఞాన నిధిపూరిత బుధ విజ్ఞాన వాక్కు
చీకటిని జీల్చ కదులును జ్యోతియగుచు.3.

సీ.
కన్నీరు లేనట్టి కాలంబు కావాలి
ద్వేషాలు లేనట్టి దేశ మందు
సమరసతన నుండు సమయంబు కావాలి
దీప్తచరితలున్న దేశమందు
స్థైర్యధైర్యములున్న వీర్యమే కావాలి
ధీరపురుషులున్న దేశమందు
నానంద సౌభాగ్య మాచార మవ్వాలి
భక్తిశ్రద్ధలుగల భావ మందు

తే.గీ.

తేజ జాజ్వల్య భాసపు దేశమందు
సాంస్కృతిక కిరీటశిఖర శైల రాజ్ఞి
నిత్యజాగృత శీలియై నిరుపమాన
కీర్తి పూర్ణమై చెలగుట కార్తి యున్న
రమ్యభారత ఘన నవ్య రాజ్యమందు

You may also like

Leave a Comment