Home పుస్త‌క స‌మీక్ష‌ స్త్రీల జీవన వేదనలు, సంవేదనలు, సంఘర్షణల సమాహారమే “నుమాయిష్”

స్త్రీల జీవన వేదనలు, సంవేదనలు, సంఘర్షణల సమాహారమే “నుమాయిష్”

by mayuukha

ఈ మధ్య కాలంలో  చదివిన మంచి పుస్తకాల్లో, చేతికి అందిన ఒక కమ్మని కథల హారం డా. వాణీ దేవులపల్లి గారి “నుమాయిష్ మరికొన్ని కథలు”. You can’t judge a book by its cover page’ అనే ఆంగ్లమాట మదిలో మెదిలినా, ఎందుకో ‘నుమాయిష్’ నా మనస్సులోని చదువరికి ఒక కొత్త ఉత్సాహాన్నే కల్గించింది. ‘నుమాయిష్’ అనే ఉర్దూ పదప్రయోగం ఒక కారణమైతే,  ఆకర్షణీయమైన ముఖ’చిత్రం’ మరో కారణం కావచ్చు.
గురువర్యులు గిరిజా మనోహర్ గారు, కాత్యాయనీ గారు రాసిన సమీక్షలు, రచయిత్రి వాణి గారి ముందుమాటతో, సమకాలీన సమాజాన్ని అద్దంపట్టిన పద్నాలుగు కథలతో కూడిన ఈ పుస్తకం ప్రతి పాఠకుని మస్తిష్కానికి పదును పెట్టేదిగా వుంది అనడంలో సందేహం లేదు.
కథల్ని నా దృష్టికోణం నుంచి ఒక్కొక్కటిగా ఆస్వాదించాలనుకొని, కథను చదవడం, ఓ పేజీ తిరుగేసి మరో పేజీలోకి దూరేలోపలే ఆ కథకు అతుక్కుపోవడం,ఆ కథ అయిపోయాకే తేరుకోవడం జరిగిందంటే ఆ కథల్లో కథనం, కథాబలం ఎంత మెండుగా వున్నాయో తెలుసుకోవచ్చు. మొట్టమొదటి కథా సంకలనంతోనే గొప్ప రచనా శైలిని ప్రదర్శించి, వైవిధ్యమైన కథా వస్తువులను ఎన్నుకున్న వాణీ దేవులపల్లి గారికి అభినందనలు.

ఆంగ్లభాష అధ్యాపకురాలిగా గత 30 ఏళ్లుగా వారితో పరిచయం ఉన్నప్పటికీ, తమ జ్ఞాపకాల చేదబొక్కెన కవిత్వంతో సాహితీ లోకంలో అడుగుడి, తన వ్యాసాలతో ‘అస్తిత్వ పరిమళాలు’ పంచారని మాత్రమే తెలుసు. కానీ ‘నుమాయిష్’ తో ఇంత లోతైన కథా సంద్రాన్ని సృష్టించగలరని మాత్రం ఊహించలేదు.
భిన్న విభిన్న నేపథ్యాలతో, ఈ పుస్తకంలో వున్న పద్నాల్గు కథల్లో తెలంగాణ అస్తిత్వం, మధ్య తరగతి స్త్రీ అస్తిత్వ పోరాటం చాలా ప్రస్ఫుటంగా గోచరిస్తాయి. మధ్య తరగతి జీవితంలోని సంఘర్షణలు, నిత్యజీవితంలో మహిళలు ఎదుర్కునే పలు ఆర్ధిక, సామాజిక సవాళ్లు, కుటుంబ సమస్యలు, వివిధ సందర్భాలలో పెల్లుబికే రాగద్వేషాలు, వాటిని జయించడానికి మహిళలు ఉపయోగించే శక్తి, యుక్తులు మన కళ్ళముందు ప్రత్యక్షమవుతాయి.
ఏ కథలోకి దిగినా అందులో పచ్చని పల్లెల నేపథ్యం, మన జీవితంలోకి మనమే తొంగి చూసుకున్న భావం తప్పకుండా కల్గుతుంది. బహుశా చదివే ప్రతి పాఠకుడు అలాంటి అనుభూతికే లోనయ్యింటాడని నా భావన.   ఒకటి రెండు కథలు చదివి నేను భావోద్వేగానికి గురవడం, వెంటనే తమా యించుకోవడం కూడా జరిగిపోయింది.
మొట్టమొదటి కథ ‘గురవయ్య సారు కానిగీ బడి’ అమాంతం 50 ఏళ్ల క్రిందటి నా బాల్యాన్ని మోసుకొచ్చి నా ముందుంచిందంటే అతిశయోక్తి కానే కాదు. ఆ కథలోని ‘సాహితీ’ లాగానే నేనూ నా పుట్టి పెరిగిన ఊరికి వెళ్లి, అక్కడి పరిసరాలన్ని  స్పృశించినట్టనిపించింది. 1970-80 కాలంలోని విద్యావిధానం, అప్పటి గురువుల నిబద్ధత, దండించే విధానం, చదువుల పట్ల విద్యార్థులకుండే శ్రద్ధ, భయభక్తులు అన్నీ ఒక్కసారిగా నా కళ్ళముందు ఆవిష్కరింపజేసింది ఈ కథ.ఇక కథ చివర్లో, గురవయ్య సారుని ఇప్పుడెలా వున్నారో చూడాలన్న సాహితీ కుతూహలం, సారు ఈ మధ్యనే గతించారని తెలిసాక ఆమెలోని దుఃఖం, తనవంతుగా ఆ వూరికి ఏదో చెయ్యాలన్న సంకల్పం కథని చదివిన పాఠకుణ్ణి కదిలించక మానవు.
ఇక  పెళ్లయిన తర్వాత మొదటిసారి తన భర్త నుమాయిష్ లో ప్రేమతో కొనిచ్చిన “సిల్క్ చీర”నే ఆర్థికపరమైన ఒడిదొడుకులతో ఒక పేద రైతయిన తన భర్త పాలిటి ఉరితాడు అవుతుందని ఆ స్త్రీ ఊహించివుండదు. కథ ముగింపులోపు పాఠకుడు కన్నీరుకార్చక ఉండలేని కథ.
ఒక స్త్రీపై మగవాడికుండే అపోహ, స్వంత అక్క అనుబంధాన్ని కూడా అర్థంచేసుకోలేని ఒక తమ్ముడి మూర్ఖత్వం, ఆడబిడ్డ ఆప్యాయత, అనురాగాలని జమా ఖర్చులతో బేరీజు వేసుకున్న ఆ తమ్మునికి ఆప్యాయత, అనురాగాలంటే ఇవి అని చూపిన అక్క ప్రేమ. ఇలా అక్క మరియు భార్య తమ నిష్కల్మషమైన ప్రేమలతో గోపాల్ కి జ్ఞానోదయం కల్గించే “రాగబంధాలు” కథ ఆద్యంతం ఆసక్తికరం.
‘తప్యాలచెక్క’ కేవలం ఒక కథ కాదు, ఒక అబల వ్యధ. కోరి ప్రేమించి పెళ్లిచేసుకున్న ఒక వ్యక్తి తన భార్యకు కల్గించిన వేదన. ఆడవాళ్లకు ఆడవాళ్లే శత్రువులు అనే నానుడి నిరూపించబడ్డ క్షణంలో, తల్లడిల్లిన అమ్మ మనసు చూపిన ఒక మంచి పరిష్కారం.
‘పనిమనిషి’ మన మనస్సులను కదిలించే మరో కథ. ఆ మనిషి ఒక్కటి రెండు రోజులు రాకుంటే ఉంటే ఎలా ఉంటుందో, మన దైనందిన కార్యక్రమాలు ఎలా దెబ్బతింటాయో, మన జీవితం ఎంత అసౌకర్యానికి గురవుతుందో తెలియజేసే చక్కని కథ. అలాగే
ఏళ్లకేళ్ళు మనింట్లో పనిచేసిన పనిమనిషిని తన ఇంటిమనిషిలా చూసుకోవాల్సిన బాధ్యత వైదేహి ద్వారా పలికించింది రచయిత.
ఇక “నుమాయిష్” కథలో ఉన్న కిక్కే వేరు. మిగతా కథలన్ని కలిపి ఒక హారం అనుకుంటే స్వచ్ఛమైన ప్రేమకు దర్పణంగా నిలిచే ఈ చిన్న కథ, ఆ హారానికే వేలాడుతున్న ఒక వజ్రమై మెరిసింది. ఈ కథా సంపుటికి “నుమాయిష్ మరికొన్ని కథలు” అని పేరు పెట్టడంలో ఎంతో ఔచిత్యం వుందనిపించింది.
“ఆడోళ్ళ జీవితమే ఇసుర్రాయసోంటిది బాంచెన్. అడుగుదీశి అడుగేస్తే నలిగిపోవుడే సమస్యలతోటి” అనే కఠోర వాస్తవాన్ని ఇసుర్రాయి కథలో నేటి సమాజంలో ఆడపిల్ల జీవితాన్ని కళ్ళకు కట్టినట్టు చూపారు రచయిత్రి.
జీవితంపై గంపెడు ఆశలు పెట్టుకొని, ప్రేమించి పెళ్లిచేసుకున్న భర్త, పెళ్లి తరువాత అసలు రూపం తెలుసుకునే లోపలే, అనుమానంతో, అసంబద్ధ వేధింపులతో చుక్కలు చూపిస్తుంటే, ధైర్య సాహసాలతో ఒక వినూత్న నిర్ణయం తీసుకుని మహిళలకు ఆదర్శంగా నిలిచిన ఒక నారి కథ “ఉన్నది ఒకటే జీవితం”.
ఇక “సాగు’బడి'” మన పూర్వికుల వ్యవసాయ పద్ధతులకు కట్టిన గుడి. సహజమైన మన వ్యవసాయ పద్ధతుల శాస్త్రీయతను పక్కకు పెట్టి, గ్లోబలైజషన్ కృత్రిమత్వపు చట్రంలో ఇరుక్కుని ఎంతమంది పేద రైతులను కోల్పోయామో తెలియజేసిన ఒక వ్యథ.
ఇలా చెప్పుకుంటూ పోతుంటే ప్రతీ కథలో, కదిలించే మధ్యతరగతి జీవితాల్లోని వాస్తవిక సన్నివేశాలు, పదేపదే దెబ్బతిన్న స్త్రీల మనోభావాలు, పెల్లుబికిన భావోద్వేగాలు. సగటు మానవజీవితం,అందులోంచి బయట పడటానికి మార్గాన్వేషణలు.
మహిళల జీవితం బయటకు అందంగా కనపడే ‘నుమాయిష్’ కాదని ప్రతినిత్యం ఒక సంఘర్షణ అని, ఒక త్యాగమని, ఒక సాహసమని తెలుపే వాస్తవ చిత్రాల సమాహారం ఈ పుస్తకం. దాదాపు అన్ని కథల్లో ప్రత్యేకంగా కనబడేది రచయిత్రి ఎంచుకున్న శైలి. ఏ కథకు, ఏ భావానికి ఏ రకమైన భాషను వాడి పాఠకులను మెప్పించాలో వాణి గారికి బాగా తెలుసు. ఈ కథల్లోని సంభాషణలన్ని నిజ జీవితంలోని సంభాషణలా అన్నంత సహజత్వం ఉట్టిపడుతుంది కథనంలో. ‘సిల్కు చీర, పనిమనిషి’ లాంటి కథల్లో అచ్చమైన గ్రామీణ  భాష,యాస మన తెలంగాణ అస్తిత్వ పతాకను ఎగురవేసినట్టున్నాయి. ఒకటిని మించిన కథ మరొకటి. అన్ని కథలు ప్రముఖ పత్రికల్లో ప్రచురించబడినవే. వాణి గారి కలం నుండి మరిన్ని కథలు రావాల్సిందే, మనం చదవాల్సిందే, చైతన్యం పొందాల్సిందే. వాణి గారికి మరొకసారి అభినందనలు. ధన్యవాదములు.

పుస్తక ప్రతులకు:
డా. దేవులపల్లి వాణి
వాట్సాప్ నెం. +919866962414

You may also like

Leave a Comment