కాలం నడిచి పోతున్నది
చరిత్ర గడిచి పోతున్నది
సంఘటనలకు సాక్షీభూతంగా నిలవడం తప్ప
ఏమీ చేయలేని కలం నిలిచి పోతున్నది.
భూగోళానికి అవతలి పక్కన బాంబుల పేలుళ్లు
ఆకాశానికి చిల్లులు పొడిచి నల్లని పొగ మేఘాలతో నింపుతుంటే
ఉగాది ప్రభాత వేళ తెరలు తెరలుగా కొండలపై అడవులపై
దిగుతున్న తెలిమంచు తెరలను దర్శించి మది పులకించలేకపోతున్నది
పేగుల మంటను చల్లార్చే రెండు రొట్టె ముక్కల కోసం
స్త్రీలు పిల్లలు లైన్లలో నిలబడి దేబిరిస్తున్న వేళ
పండుగ పూట పాక ప్రావీణ్యం బొబ్బట్ల పిండివంటలు
రుచులు రుచులుగా వండి వడ్డించలేకపోతున్నది
కూలిన గోడల ఇటుక రాళ్ల శిథిలాల నడుమ
కొసప్రాణాలేవైనా కొట్టుమిట్టాడుతున్నాయేమోనని
అయినవాళ్ళ ఆశల లాంతర్లు అగ్గగ్గలాడి వెతుకుతుంటే
గుమ్మానికి మామిడి తోరణం కట్టే చేయి వణుకుతున్నది
కుప్పలు కుప్పలుగా శవాల గుట్టలు
తెల్లని బట్టల్లో చుట్టబెట్టి ఖననం కోసం
ఎదురు చూస్తున్న దృశ్యాలు కళ్ళకు గాయాలు చేస్తుంటే
కొత్త ఉడుపులు తొడుక్కోవడాన్ని మనశ్శరీరాలు తిరస్కరిస్తున్నాయి
గంధకపు గాలి గగన తలమంతా నిండి
దేహాలు కాలి కమిలిన కమరు వాసన ఖండాంతరాలు దాటి వస్తుంటే
వేపపూలతో కలిసిన మల్లెల పరిమళపు గాలిని
నాసిక ఇష్టంగా ఆస్వాదించ వెనుకాడుతున్నది
నిస్సహాయుల కనుల గూళ్ళలో నిద్రను చెదరగొట్టి
పీడకలలు స్థావరం ఏర్పరచుకున్నప్పుడు
సుఖనిద్రకు స్వాగతం పలుకలేక
కనురెప్పలు మూతపడనంటున్నాయి
భూమండలపు నలుదిక్కులా
అహంకారం, అభిజాత్యం అతిశయిస్తున్న వేళ
దురాశ, దురాక్రమణలు విచ్చలవిడిగా నర్తిస్తున్న వేళ
మానవత్వాన్ని మరిచిన వారి మదమణచి
దుశ్చర్యల దుఃఖ కారకుల దునుమాడి
యుద్ధకాంక్షల చెలరేగే పగల సెగలను పరాభవించి
మనిషి మనుగడే అంతిమ ధ్యేయమనీ
ప్రకృతి పరిరక్షణే పరమ ధర్మమనీ
చాటి చెప్పమ్మా నవ వసంతమా!
_**
