అస్త్రం ...శస్త్రం... శాస్త్రం...
మన భారతీయ విజ్ఞానం అపూర్వమైనది. ఆధ్యాత్మికతకు సంస్కృతికే పరిమితం కాక,
ప్రాచీన కాలం నుండి అత్యద్భుతమైన శాస్త్ర సాంకేతిక విజ్ఞానానికి పురిటిగడ్డగా విలసిల్లింది.
ఆధునిక విజ్ఞాన శాస్త్రానికి పునాదులుగా నిలిచిన ఎన్నో ఆవిష్కరణలు కొన్ని వేల ఏళ్ళ క్రితమే భారత దేశంలో రూపుదిద్దుకున్నాయి. ఈ ఘనత ప్రాచీన భారతీయ మహర్షులు, శాస్త్రవేత్తలు సాధించిన ప్రగతి. ఈ ప్రగతి ప్రపంచ విజ్ఞాన చరిత్రలోనే భారత దేశ సాంకేతిక విజ్ఞానానికి మకుటాయమానంగా నిలిచింది. మన భారతీయ సనాతన సంస్కృతిలో, మహర్షులు మరియు మునులు కేవలం ఆధ్యాత్మిక గురువులే కాదు ,వారు అసాధారణమైన సైనిక మరియు అస్త్ర శాస్త్ర సాంకేతిక నిపుణులు .ఆధునిక విజ్ఞాన శాస్త్రం నేడు ప్రయోగిస్తున్న క్షిపణులు (missiles),అణు బాంబులు (, nuclear weapons)జీవ రసాయన(bio chemical weapons) ఆయుధాల వంటి సాంకేతికతను వేల సంవత్సరాలకు పూర్వమే మన మహర్షులు మంత్ర ,యంత్ర రూపాలలో ఆవిష్కరించారు.
ముందుగా మనం వారి అద్భుత సృష్టిలో భాగమైన అస్త్రాలను, శస్త్రాలను గురించి తెలుసుకుందాం.
“అస్త్రం” అంటే మంత్రాలను ఉపయోగించి దూరం నుండే శత్రువుల పైన ప్రయోగించే శక్తివంతమైన ఆయుధం.
“శస్త్రం అంటే చేతిలో పట్టుకుని నేరుగా యుద్ధంలో రక్షణ కోసం ఉపయోగించే ఆయుధం. “
ఇతిహాస, పురాణాల ప్రకారం అస్త్రాలు కేవలం భౌతిక ఆయుధాలు కావు అవి మంత్రయుతమైన దైవిక శక్తితో పని చేసే
పరమ పవిత్రమైన, అతి బలీయమైన శక్తులు.
వాటిని ప్రయోగించటానికి నిర్దిష్టమైన మంత్రాలను ఉచ్చరించాల్సిన అవసరం ఉంటుంది. విల్లు నుండి వదిలే ఒక సాధారణ బాణానికి ఈ మంత్ర శక్తిని జోడించినప్పుడు అది అస్త్రం గా మారుతుంది. ప్రతి అస్త్రానికి ఒక అధిష్టాన దేవత ఉంటుంది. ఆ దేవత యొక్క సంపూర్ణ శక్తి ఆ అస్త్రంలో దాగి ఉంటుంది.
అస్త్రాన్ని ప్రయోగించడం మాత్రమే కాకుండా దానిని వెనక్కి తీసుకోవడం కూడా తెలిసి ఉండాలి. అంటే ఉపసంహరించడం కూడా తెలిసి ఉండాలి. అది తెలియకపోతే తీవ్రమైన నష్టం కలుగుతుంది.
ఉదాహరణ: మహాభారతంలో అశ్వద్ధామకు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడం మాత్రమే తెలుసు. ఉపసంహరించడం తెలియదు. అది తెలిసిన వాడు అర్జునుడు. అశ్వద్ధామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రాన్ని అర్జునుడే ఉపసంహరిస్తాడు. ..
ఇప్పుడు మనం కొన్ని ప్రముఖ అస్త్రాల గురించి చెప్పుకుందాం.
బ్రహ్మాస్త్రం ;
సృష్టిలోనే అత్యంత విధ్వంసకరమైన ఆయుధాలలో అతి ముఖ్యమైనది.ఈ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించిన చోటు దశాబ్దాల పాటు కరువు కాటకాలతో నిండిపోతుంది.
పాశుపతాస్త్రం ;
ఈ పాశుపతాస్త్రం అతిశక్తివంతమైనది. దీని అధిష్టాన దేవత సాక్షాత్తు పరమశివుడే. ఈ అస్త్రాన్ని కంటి చూపుతో ,మనసుతో లేదా మాటతో కూడా ప్రయోగించవచ్చు .ఈ విశ్వంలో దేనినైనా సర్వనాశనం చేయగల శక్తి కలది.
నారాయణాస్త్రం ; ఈ అస్త్రం యొక్క అధిష్టాన దేవత శ్రీమన్నారాయణుడు. దీనిని ప్రయోగించినప్పుడు ఆకాశం నుండి లక్షలాది ఆయుధాలు కురుస్తాయి. శత్రువు ఆయుధాలు కింద పడేసి లొంగి పోతేనే ఇది శాంతిస్తుంది.
అంత శక్తివంతమైనది ఈ నారాయణాస్త్రం.
ఆగ్నేయాస్త్రం ;
ఈ అస్త్రానికి అధిష్టాన దేవత అగ్నిదేవుడు.
ఇది భయంకరమైన మంటలను సృష్టిస్తుంది. శత్రు సైన్యాన్ని బూడిద చేయడానికి దీనిని వాడేవారు.
వరుణాస్త్రం ;
వరుణ దేవుడు ఈ అస్త్రానికి అధిష్టాన దేవత.
ఆగ్నేయాస్త్రం వంటి అస్త్రాల మంటలను ఆర్పడానికి ,వరదలను సృష్టించడానికి దీనిని ప్రయోగించేవారు.
వాయువ్యాస్త్రం ;
దీని అధిష్టాన దేవత వాయుదేవుడు. అతి భయంకరమైన తుఫానులను, సుడిగాలులను సృష్టించి, శత్రువులను చెల్లాచెదురు చేస్తుంది ఈ అస్త్రం.
ఇవి ముఖ్యమైన అస్త్రాలు. ఈ దివ్యాస్త్రాలు అంత సులభంగా పొందలేరు .తీవ్రమైన తపస్సు చేసి దేవతలను ప్రసన్నం చేసుకున్న తర్వాతే, ఈ అస్త్రాలు వారికి చేరుతాయి . గురువుల పట్ల భక్తిశ్రద్ధలు కలిగి ఉండి, వారి అనుగ్రహం తనే
మంత్రోపదేశం ద్వారా ఈ అస్త్రాలను పొందాలి.
మానసిక నిగ్రహం ,ధర్మం తప్పని గుణం ఉన్నవారికి మాత్రమే గురువులు వీటిని రహస్యంగా ఉపదేశించేవారు.
ఈ అస్త్రాల గురించి మనం రామాయణ, మహాభారత కాలంలో వాటి ప్రయోగం జరిగినట్లు విన్నాం.
రాముడు రావణుడి నాభిలో ఉన్న అమృత భాండాన్ని ఛేదించటానికి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు.
అలాగే రావణుడి కుమారుడైన ఇంద్రజిత్తు రామలక్ష్మణులను మరియు వానర సైన్యాన్ని బంధించడానికి నాగాస్త్రాన్ని, వారు మూర్ఛ పోవడానికి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. తరువాత లక్ష్మణుడు ఇంద్రాస్త్రాన్ని ప్రయోగించి ఇంద్రజిత్తును సంహరిస్తాడు.
అలాగే మహాభారతంలో కర్ణుడు నాగాస్త్రాన్ని అర్జునుడి మీదకి ప్రయోగిస్తాడు అయితే శ్రీకృష్ణుడు రథాన్ని భూమిలోకి తొక్కడం వల్ల అది అర్జునుడి తలకి తగలకుండా కేవలం కిరీటాన్ని మాత్రమే ఎగుర గొడుతుంది .
అలాగే అర్జునుడు విరాట రాజు కొలువులో ఉన్నప్పుడు,గోగ్రహణ కాలంలో సమ్మోహనాస్త్రాన్ని ప్రయోగించి ,అందరిని మూర్ఛ పోగొడతాడు.
తరువాత కురుక్షేత్ర యుద్ధ సమయంలో జయద్రధుని అంటే సైంధవుని తల తెగవేసేటప్పుడు పాశుపతాస్త్రాన్ని వాడతాడు.
ఇక శస్త్రాలు అంటే బాణాలే.
ఈ విధంగా అద్భుతమైన శక్తివంతమైన అస్త్ర ప్రయోగాలు ఇతిహాసాల కాలంలో ప్రయోగింపబడినట్లు తెలుస్తున్నది.
**ఇది ఒక సుదీర్ఘమైన వ్యాసం. ఈ వ్యాసంలో అస్త్రాల, శస్త్రాల గురించి చెప్పాను. ఇక ఆధునిక కాలంలో ఆ అస్త్రాలకి ఉన్న పేర్ల గురించి రెండవ పార్ట్ లో వివరిస్తాను. **
- ఈనాడు పాశ్చాత్య నాగరికత మోజులో పడి, మన భారతదేశం విలువ తెలియకుండా ప్రవర్తిస్తున్న వారికి ,మన దేశం ఎంత గొప్పదో చెప్పడానికే నా ప్రయత్నం .అందుకే నా ఈ కథనం
* * *
భారతీయ పురాణాలు కేవలం కథలు లేక కల్పిత గాథలు కావు అవి మహోన్నతమైన శాస్త్రీయ ఖగోళ మరియు తాత్విక సత్యాల సమాహారం ఈరోజు ఆధునిక విజ్ఞాన శాస్త్రం టెలిస్కోప్ గణిత సూత్రాలు ద్వారా ఏ విషయాలనైతే కనుకుంటున్నదో వాటిని మన ఋషులు వేల సంవత్సరాల క్రితమే పురాణాల రూపంలో రూపకాల రూపంలో సామాన్యులకు అర్థమయ్యేలాగా వివరించారు. ఈరోజు.. ఆధునిక సైన్స్ ప్రకారం” బిగ్ బ్యాంగ్” సిద్ధాంతం అనేది ఒక మహా విస్ఫోటనం ద్వారా శూన్యం నుండి ఉద్భవించింది అనే సత్యాన్ని “నాసదీయ సూక్తం” (ఋగ్వేదం) వివరించింది. అంతకుముందు మహా శూన్యం మాత్రమే ఉన్నదని చెప్పబడింది. ఆ విస్ఫుటనం వల్లనే కాలము స్థలము (space _time) ఏర్పడ్డాయని పురాణాలు చెబుతున్నాయి. కాలం గురించి నేను ఇంతకుముందు వ్యాసంలోనే వివరించాను. ఐన్ స్టీన్ ప్రతిపాదించిన టైం డైలేషన్( Time dilation) అంటే ఈ విశ్వంలో కాలం వేరు వేరు చోట్ల వేరు వేరు వేగంతో నడుస్తుంది అనే సిద్ధాంతం. ఈ సిద్ధాంతానికి పురాణాలలో చాలా స్పష్టమైన ఉదాహరణలు కూడా ఉన్నాయి. ఉదాహరణ: రేవతి కకుద్మి కథ…
భాగవతంలో కకుద్మి అనే రాజు తన కుమార్తె రేవతికి వరుడిని వెతకటానికి బ్రహ్మలోకానికి వెళ్తాడు అక్కడ బ్రహ్మ ఒక సంగీత నృత్య కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉంటాడు అది ముగిసే వరకు రాజు కొద్ది నిమిషాల పాటు వేచి ఉంటాడు బ్రహ్మ అతనిని చూసి నవ్వి నువ్వు ఇక్కడికి వచ్చేయ్ కొన్ని నిమిషాలు అయింది. కానీ భూలోకంలో వేలాది సంవత్సరాలు గడిచిపోయాయి .నీ బంధువులు రాజ్యం అనేవి ఏమి ఇప్పుడు లేవు అని చెప్తాడు. ఇది ఒక ఉదాహరణ కాలం గురించి. అలాగే డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతం (Evolution Theory) గురించి మన పురాణాలలో ఎప్పుడో చెప్పబడింది. దశావతారాల క్రమం ఈ విషయానికి అర్థం పడుతున్నది. మత్స్యావతారం: దీని ప్రకారం జీవం మొదట చేపగా ఉద్భవించింది. కూర్మావతారం: నీటిలోనూ నీటి బయట భూమిపైన జీవించగల ఉభయచరం అంటే తాబేలు ఉద్భవించింది.
వరాహవతారం: పూర్తిగా భూమిపైన జీవించే జంతు ‘అడవి పంది’ జన్మించింది.
నరసింహావతారం: జంతువు నుండి మానవుడిగా మారే మద్యంతర దశ …”సగం మనిషి ,సగం సింహం” గా ఉద్భవించింది.
వామనావతారం: ప్రాథమిక మానవ దశ. కురచ అంటే పొట్టి రూపం( Neanderthal) ప్రభవించింది.
పరశురామావతారం: అడవుల్లో నివసిస్తూ, గొడ్డలి పట్టుకుని తిరుగుతూ ఉన్న రాతియుగం మనిషి ఉద్భవించాడు.
రామావతారం: సమాజం నైతికత కుటుంబ వ్యవస్థ తెలిసిన పరిపూర్ణ సామాజిక మానవుడిగా జననం.
కృష్ణావతారం: సామాజిక రాజకీయ శాస్త్రాలు తెలిసిన ఆధునిక ఆలోచన పరుడి ఆవిర్భావం.
ఈ విధంగా డాల్విన్ కంటే ముందే జీవపరిణామ క్రమాన్ని మన పూర్వీకులు వివరించారు కథల రూపంలో భద్రపరిచారు. అంతేకాదు పురాణాలలో, చరిత్రలో మన క్లోనింగ్ టెస్ట్ ట్యూబ్ బేబీ మరియు ప్లాస్టిక్ సర్జరీ వంటి ఆధునిక వైద్య ప్రక్రియల ప్రస్తావనలు కనపడతాయి.
ఉదాహరణలు:
మహాభారతంలో గాంధారి కి జన్మించిన మాంస పిండాన్ని 100 ముక్కలుగా చేసి నూనె కుండలలో భద్రపరిచి 101 మంది కౌరవులు (అంటే వంద మంది కొడుకులు ఒక కుమార్తె) పుట్టటం జరిగింది. ఇది ఆధునిక స్టెమ్ సెల్ రీసెర్చ్ లేదా ఇన్_ విట్రో ఫెర్టిలైజేషన్ విధానాన్ని పోలి ఉంటుంది.
అలాగే దక్షయజ్ఞం తరువాత దక్షుడికి మేక తలపెట్టడం, వినాయకుడికి ఏనుగు తలపెట్టటం
.. ఇవి నేటి ఆధునిక ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంటేషన్ ప్రక్రియలే కదా.
అంతేకాదు రామాయణ కాలంలో సముద్రం పై రాళ్ళను తేలేలా చేస్తూ తక్కువ సమయంలో నలుడు ,నీలుడు పూనుకొని నిర్మించిన” రామసేతు “ప్రాచీన భారతీయ ఇంజనీరింగ్ జ్ఞానానికి మకుటాయిమాన నిదర్శనం. అలాగే మహాభారతంలో మయబ్రహ్మ నిర్మించిన మయసభ (optical illusion) ఒక అద్భుతమైన సాంకేతికతకు తార్కాణం. ఇందులో నీరు ఉన్నచోట నేలలా ,నేల ఉన్నచోట నీరు లా కనిపించేలా చేయటం ఆనాటి నిర్మాణ శాస్త్రాల ప్రయోగాత్మక రూపం. ఈ వ్యాసంలో చివరిగా చెప్పేది ఏమిటంటే మన పురాణాలు కేవలం మత గ్రంథాలు కావు అవి మన భారతీయ సంస్కృతి యొక్క విజ్ఞాన భాండాగారాలు నాటి ఋషులు సైన్స్ ను సామాన్యుడికి దూరం చేయకుండా ధర్మంతో మరియు కథలతో ముడిపెట్టి, సమాజంలో భాగంగా చేసి ,వారికి సులభంగా అర్థమయ్యేటట్లుగా చేశారు .పురాణాలలోని కథనాలను ఆధునిక విజ్ఞాన దృక్పథంతో విశ్లేషణ చేసినప్పుడు మన పూర్వీకుల మేధో సంపత్తి ఎంత ఉన్నతమైనది అని అందరికీ స్పష్టంగా అర్థం అవుతుంది.
* * *
ప్రపంచంలో సృష్టి మీద ఎందరో రకరకాలుగా అర్థం చేసుకున్నారు .అయితే ఒక్క హిందువులకు మాత్రమే
శాస్త్రీయపరమైన సృష్టి అవగాహన ఉన్నది. మత్స్య, కూర్మ ,విష్ణు ,బ్రహ్మ మరియు భాగవత పురాణాలలో ఈ విషయం పొందుపరచబడి ఉన్నది.
సృష్టికి ఆరంభం అంతం ఉండవని ఋషులు కనుగొన్నారు .ఇది ఒక చక్రంలా సాగుతుంది. వారు ఒక అద్భుతమైన శక్తి ఈ విశ్వసృష్టికి మూలం అని, దాన్నే “ఆదిశక్తి” అని పిలిచారు.
బ్రహ్మదేవుని ఒక పగలును కల్పమంటారు ఈ కల్పంలో సృష్టి జరుగుతుంది. బ్రహ్మదేవుని రాత్రి సమయంలో విశ్వం మొత్తం లయమై తిరిగి బ్రహ్మలో కలిసిపోతుంది. దీనినే ప్రళయం అని అంటారు.
ప్రతి కల్పనలోనూ చతుర్యుగాలు కృత, త్రేతా ,ద్వాపర, కలి యుగాలు. ఇవి పునరావృతం అవుతూనే ఉంటాయి.
విశ్వం మొత్తం సృష్టి, స్థితి, లయ అనే మూడు దశలలో కొనసాగుతున్నది. ఆ మూడు దశలను త్రిమూర్తులుగా గుర్తించారు. ఇందులో బ్రహ్మ సృష్టి కారకుడు .విష్ణువు స్థితికారకుడు .శివుడు లయకారకుడు.
బ్రహ్మ: బ్రహ్మ ఆవిర్భావం:
విశ్వసష్టి సిద్ధాంతంలో బ్రహ్మాండం
golden egg అనే భావనకు చాలా ప్రాధాన్యత ఉంది సృష్టికి పూర్వం విశ్వమంతా గాఢాంధకారంతో శూన్యంతో నిండి ఉంది.
అప్పుడు నీరు సృష్టించబడింది అందులో ఒక బీజం బంగారు అండంగా మారింది. దానినే హిరణ్య గర్భం అంటారు. ఆ అండం రెండు భాగాలుగా విభజింపబడి ఒక భాగం ఆకాశంగాను రెండవ భాగం భూమిగాను ఏర్పడ్డాయి ఆ అండం నుండే బ్రహ్మదేవుడు ఆవిర్భవించి సృష్టి కార్యాన్ని ప్రారంభించాడు.
జీవరాశికి మూలమై నాలుగు దిశలుగా వ్యాపించి ఉన్న ప్రకృతినే బ్రహ్మ అంటారు. బ్రహ్మను స్వయంభూ అని కొందరు అంటారు. ప్రళయకాలంలో శ్రీమహావిష్ణువు క్షీరసాగరంపై, శేషతల్పం పై శయనించి ఉన్నప్పుడు ఆయన నాభి నుండి ఒక పద్మం ఉద్భవించిందని ,ఆ పద్మం నుండి బ్రహ్మదేవుడు ఆవిర్భవించాడని కూడా అంటారు. అందుకే ఆయనను పద్మభవుడు అని పిలుస్తారు.
బ్రహ్మదేవునికి నాలుగు ముఖాలు ఉంటాయి ఇవి నాలుగు వేదాలు అనగా ఋగ్వేదం ,యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం మరియు నాలుగు దిక్కులకు ప్రతీకలు.
ఆయన నాలుగు చేతులు మనసు, బుద్ధి ,అహంకారం, చిత్తం అనే నాలుగు అంతఃకరణాలను సూచిస్తాయి.అంతఃకరణాలు అనగా మనస్తత్వాలు అని అర్థం.
బ్రహ్మ చేతిలోని వస్తువులు…. ఒక చేతిలో సృష్టి జ్ఞానాన్ని తెలిపే వేద గ్రంథం, మరొక చేతిలో కాలానికి ప్రతీకైన జపమాల ,మరొక చేతిలో సృష్టికి కారణమైన నీరు ఉండే కమండలం ,నాలుగోచేతిలో యజ్ఞాన్ని సూచించే స్రుక్కు( కుశధార) ఉంటాయి.స్రుక్కు అంటే యజ్ఞం సమయంలో వాడే గరిట. అది బ్రహ్మ చేతిలో ఎందుకు ఉంటుందంటే సృష్టిలో బ్రహ్మయే మొదటి యజ్ఞకర్త.
సృష్టిని సృష్టించే క్రమంలో బ్రహ్మ తన సంకల్పం ద్వారా మరీచి, అత్రి ,అంగీరసుడు, నారదుడు, దక్షుడు వశిష్ఠుడు, భృగువు, పులస్త్యుడు , పులహుడు, క్రతువు, వంటి ప్రజాపతులను, సనత్కుమారులను మరియు సమస్త జీవకోటిని సృష్టించాడు. వీరిని బ్రహ్మ మానస పుత్రులు అని అంటారు.
తరువాత మానవ సృష్టి కోసం ఆయన తన శరీరాన్ని రెండు భాగాలుగా చేసి స్వాయంభువ మనువు (మొదటి పురుషుడు) శతరూప (మొదటి స్త్రీ) లను సృష్టించాడు. వీరి నుండి మానవ వంశం ప్రారంభమైంది అంటారు.
* * *
వేద కాలం నాటి .. అంతరిక్ష విహారాలు… విమానాలు..
ఈ ఆధునిక యుగంలో విమానాలు, ఆకాశ విహారాలు, రాకెట్లు ఇవన్నీ సర్వసాధారణము అయి ఉండవచ్చు. కానీ మన పురాణాలలో ఆకాశ, అంతరిక్ష విహారాలు ఉన్నాయని, విమానాలు కూడా ఉన్నాయని ఎంతమందికి తెలుసు??
విమానం కనిపెట్టింది ఎవరు అని అడిగితే వెంటనే తడుముకోకుండా రైట్ బ్రదర్స్ అని చెప్తారు. కానీ వారి కంటే వేల సంవత్సరాలకు పూర్వమే మన పూర్వీకులకు విమానాలు తెలుసు.
ఋగ్వేదంలో యజుర్వేదంలో విమానాల ప్రసక్తి ఉన్నది. వాటి గురించి ‘ఋక్సంహిత’ కూడా వివరించింది.
పురాణ కాలంలో దేవతలు మానవులు కూడా విమానాలు వాడేవారని ప్రాచీన గ్రంథాల వల్ల తెలుస్తుంది. భరద్వాజుడు వ్రాసిన “యంత్ర సర్వస్వం” లో వైమానిక శాస్త్రం గురించి విశేషాలు ఉన్నాయి.
ఈ వైమానిక శాస్త్రం గురించిన అంశాలు సంస్కృతంలో రాయబడ్డాయి. వాటి గురించిన కొన్ని వివరాలు బరోడా మహారాజు గారి గ్రంథాలయంలో ఉన్నాయి.
నారాయణ ముని ,శౌనక మహర్షి ,గర్గుడు ,వాచస్పతి, దండి నాథుడు ,విశ్వనాథుడు ,గౌతముడు, విశ్వంభరుడు ,అగస్యుడు, అత్రి మొదలైన 36 మంది శాస్త్రజ్ఞులను గురించి తన వైమానిక శాస్త్రంలో భరద్వాజ మహర్షి ప్రస్తావించాడు. అంతేకాదు విమాన చంద్రిక , మణి భద్ర కారిక, లోహ ప్రకరణము, వంటి 97 గ్రంథాలను గురించి కూడా భరద్వాజుడు తన శాస్త్రంలో ఉదాహరించాడు.
విమానాలను నడిపే వారిని విమాన చోదకులు అంటారు. వీటికి సంబంధించిన రహస్యాలను లల్లాచార్యుడు అనే విమాన శాస్త్రవేత్త తన రహస్యలహరి అనే గ్రంథంలో వివరించాడు.
ఆ విమానాలలో ప్రయాణం చేసేటప్పుడు చోదకుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి కూడా భరద్వాజుడు వివరించాడు .ఋతువులను బట్టి, వాతావరణాలను బట్టి తీసుకొనవలసిన జాగ్రత్తల గురించి కూడా వివరించాడు.
ఆనాటి విమానాలలో ప్రసిద్ధమైనవి మాంత్రిక, తాంత్రిక, యాంత్రిక విమానాలు .
ఇవి త్రేతా యుగం ,ద్వాపర యుగంలో వాడబడ్డాయి.
ఆనాటి విమానాలు భూమి మీద, నీటి మీద, ఆకాశంలో ప్రయాణం చేసేవట .
ఋగ్వేదంలో తుగ్రుడు అనే రాజర్షి తన శత్రువులను జయించడం కోసం తన కుమారుడైన భుజ్యుడిని, పెద్ద సైన్యంతో సముద్ర మార్గం నుండి పంపిస్తాడు. కానీ మార్గ మధ్యలో పెద్ద తుఫాను రావడం వల్ల వారి నౌకలు సముద్రంలో మునిగిపోయినప్పుడు అశ్వినీ దేవతల సాయంతో దివ్య నౌకలను పంపిస్తాడు. ఇవి నీటిపైనే కాకుండా ఆకాశమార్గంలో కూడా ప్రయాణించగలవు
మయుడు ,భరద్వాజుడు కూడా దేవ, గంధర్వ, గరుడ, సిద్ధ ,సాధ్య ,చారుణ వంటి అనేక విమానాల గురించి ప్రస్తావించారు.
ఇక మనందరికీ తెలిసిన పుష్పక విమానం. ఇది రామాయణ కాలంలో వాడబడినట్లు మనందరికీ తెలుసు. ఇది యక్షుల రాజైన కుబేరుని సొంత విమానం. దీనిని రావణబ్రహ్మ బలవంతంగా తెచ్చుకొని తన అధీనంలో ఉంచుకున్నాడు. రావణ వధ అనంతరం శ్రీరామచంద్రుడు సీత, లక్ష్మణుడు, విభీషణుడు ,వానర సేన అందరితో కలిసి ఈ పుష్పక విమానంలోనే అయోధ్యకు చేరుకున్నాడని రామాయణం గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ పుష్పక విమానాన్ని విశ్వకర్మ బ్రహ్మ దేవుని కోసం తయారు చేశాడని, బ్రహ్మ దానిని, సంపదకు దేవుడైన కుబేరునికి తపః ఫలంగా ఇచ్చాడని వివరణ కూడా పురాణాలలో ఉంది. దీని ప్రత్యేకత ఏమిటంటే ఎంతమంది ఎక్కినా అందరికీ సరిపడా చోటు ఉండేదట. ఇది అందులో కూర్చున్న వారి మనసులోని ఆలోచనలకు అనుగుణంగా, వారు తలచిన వేగంతో వారు కోరుకున్న దిశలో ప్రయాణించగలదట. దీనిని మణులు, వజ్రాలు, బంగారు కిటికీలు మరియు సుందరమైన నిర్మాణాలతో తయారు చేశారట. రావణుని లంకలో ఉన్న ఈ విమానాన్ని హనుమంతుడు సుందరకాండలో వర్ణించాడట.
“ఈ విధంగా మన పూర్వీకులు కేవలం ఆధ్యాత్మికంగానే కాకుండా సైన్స్ మరియు టెక్నాలజీలో కూడా ఎంతో ముందంజలో ఉన్నారని స్పష్టమవుతోంది”
* * *
వేదకాలం నాటి ఇంజనీర్లు, డాక్టర్లు
భారతీయ సంస్కృతికి, విజ్ఞానానికి మూలస్తంభాలు వేదాలు. వేదకాలం అంటే కేవలం ఆధ్యాత్మికత, మంత్రాలు, యజ్ఞయాగాలు మాత్రమే కాదు; అది అపారమైన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాల సమాహారం. ఆధునిక ప్రపంచం నేడు గర్విస్తున్న ఇంజనీరింగ్, వైద్య శాస్త్రాలకు వేల సంవత్సరాల క్రితమే మన వేదకాలపు మహర్షులు, శిల్పులు, వైద్యులు గట్టి పునాదులు వేశారు. సృష్టి రహస్యాలను శోధించి, మానవ కల్యాణం కోసం సాంకేతికతను, వైద్యాన్ని మేళవించిన నాటి మేధావుల ప్రతిభ, వారి విజ్ఞాన సంపద అపూర్వం, అనునిత్యం స్మరణీయం.
యజ్ఞశాలల నిర్మాణంలో రేఖాగణితాన్ని (Geometry) ఉపయోగించిన నాటి శిల్పకారులు (ఇంజనీర్లు), ప్రకృతి సిద్ధమైన మూలికలతో శస్త్రచికిత్సలు చేసిన ఆయుర్వేద నిపుణులు (డాక్టర్లు) భారతదేశ సాంకేతిక వైభవానికి నిదర్శనాలు. విశ్వకర్మ, మయాసురుడు వంటి ఇంజనీర్లు; ధన్వంతరి, అశ్వినీ దేవతలు, సుశ్రుతుడు వంటి డాక్టర్లు ఆనాడు ఎంతో ప్రసిద్ధి పొందారు.
దేవశిల్పి విశ్వకర్మ ఇంద్రుని కోసం అత్యంత అద్భుతంగా నవరత్న ఖచితమైన స్వర్గలోకాన్ని, త్రేతాయుగంలో లంకా నగరాన్ని, ద్వాపరయుగంలో ద్వారకా నగరాన్ని, పూరి జగన్నాథ ఆలయ విగ్రహాలను నిర్మించాడని పురాణాలు చెబుతున్నాయి. అంతేకాదు దేవతల ఆయుధాలైన శివుని త్రిశూలం, విష్ణువు సుదర్శన చక్రాన్ని కూడా ఈయనే తయారు చేశాడు.
మరోవైపు, మయ బ్రహ్మ నిర్మించిన ‘మయసభ’ పురాణ ప్రసిద్ధి చెందింది. ఆ మయసభ నిర్మాణంలో ఆ రోజుల్లోనే అద్భుతమైన సాంకేతికత వాడబడింది. చిత్రవిచిత్రమైన జల యంత్రాల ఏర్పాట్లు, కళ్ళు చెదిరే భ్రమలను కలిగించే వాస్తు నైపుణ్యం మయసభ సొంతం.
రామాయణ కాలంలో ‘నలుడు’ అనే గొప్ప ఇంజనీర్ ఉన్నాడు. ఇతను విశ్వకర్మ కుమారుడే. లంకా నగరానికి చేరడానికి సముద్రాన్ని దాటేందుకు రామసేతు వారధిని నిర్మించిన అద్భుతమైన మేధావి ఇతనే.
అలాగే, త్రేతాయుగంలో పార్వతీ పరమేశ్వరుల కోసం విశ్వకర్మ అద్భుతమైన బంగారు లంకను నిర్మించాడు. అయితే గృహప్రవేశానికి పూజారిగా వచ్చిన రావణాసురుడు దక్షిణగా ఆ బంగారు లంకనే కోరడంతో శివుడు దాన్ని ఇచ్చేశాడు. ద్వాపరయుగంలో జరాసంధుడి దాడుల నుండి యాదవులను రక్షించడానికి శ్రీకృష్ణుడు ఒక సురక్షితమైన నగరాన్ని నిర్మించమని కోరాడు. దానికి విశ్వకర్మ సముద్రం మధ్యలో ఒకే ఒక్క రాత్రిలో అభేద్యమైన ద్వారకా నగరాన్ని నిర్మించాడు.
హృషీకేశ్లో గంగా నదిపై ఉన్న ‘లక్ష్మణ్ ఝూలా’ వంతెనను త్రేతాయుగంలో లక్ష్మణుడు జనపనార తాళ్లతో నిర్మించాడని కథనం ఉంది (అయితే ఇప్పుడు ఉన్నది ఆధునిక కాలంలో నిర్మించిన వంతెన).
అంతేకాదు, ఆనాడు భగీరథుడు, దిలీపుడు, అంశుమంతుడు వంటి గొప్ప జలవనరుల ఇంజనీర్లు వర్షపు నీరు వృథాగా పోకుండా నదులను దారి మళ్లించి గంగా ప్రవాహాన్ని భూమిపైకి తెచ్చారు. పడమటి కనుమల్లో కురిసిన వర్షపు నీరు వృథాగా పోతుందని గమనించిన గౌతమ మహర్షి దాన్ని ఒకే ప్రవాహంగా మలిచి గోదావరి నదిగా ప్రవహింపజేశాడు. ద్రాక్షారామ భీమేశ్వర స్వామి ఆలయ అభిషేకం కోసం సప్తర్షులు గోదావరి నదిని ఏడు పాయలుగా (సప్త గోదావరి) విభజించి తీసుకువెళ్లారని భీమేశ్వర పురాణం చెబుతోంది. సప్తర్షులు ఆనాటి గొప్ప ఇంజనీర్లు అనడానికి ఇవే నిదర్శనాలు.
ఈరోజు ఆనాటి ఇంజనీర్ల గురించి చెప్పుకున్నాం… రేపు ఆనాటి డాక్టర్ల (వైద్యుల) అద్భుతాల గురించి తెలుసుకుందాం!
వేద కాలం నాటి ఇంజనీర్లు, డాక్టర్లు
“వైద్యో నారాయణో హరి”. వైద్యుడు సాక్షాత్తు నారాయణుడే.
నేడు గర్విస్తున్న వైద్య శస్త్రాలకు వేల సంవత్సరాలకు పూర్వమే, మన వేదకాలపు మహర్షులు, వైద్యులు గట్టి పునాదులు వేశారు.
సృష్టి రహస్యాలను శోధించి మానవ కల్యాణం కోసం సాంకేతికతను వైద్యాన్ని మేళవించిన నాటి మేధావుల ప్రతిభ అనన్య సామాన్యం.
అశ్విని దేవతలు, ధన్వంతరి ,సుశ్రుతుడు, చరకుడు వంటి మహానుభావులు ప్రాణదాతలైన డాక్టర్లు మన వేద కాలంలో ఉన్నారు. ధన్వంతరిని వైద్య దేవుడిగా ,సాక్షాత్తు మహావిష్ణువు యొక్క 12వ అవతారంగా భావిస్తారు ,పూజిస్తారు.
దేవతలు దానవులు అమృతం కోసం క్షీరసాగరాన్ని మదిస్తున్నప్పుడు ఒక చేతిలో అమృత కలశాన్ని మరొక చేతిలో ఆయుర్వేద గ్రంధాన్ని శంఖ, చక్రాలను ధరించి ధన్వంతరి సముద్రం నుండి ఆవిర్భవించాడు. ఈయన దివోదాసు అనే పేరుతో కాశి రాజుగా భూలోకంలో జన్మించి, మానవాళికి ఆయుర్వేద వైద్య విధానాన్ని బోధించాడని పురాణాలు చెబుతున్నాయి.
ఆనాటి ఆయుర్వేద శాస్త్రం 8 భాగాలుగా ఉండేది. దీన్ని అష్టాంగ ఆయుర్వేదం అని అనేవారు. ఇందులో శస్త్ర చికిత్స, (surgery), అంతర్గత వైద్యం (internal medicine), కంటి ,ముక్కు ,గొంతు వైద్యం ( ENT) చిన్నపిల్లల వైద్యం(pediatrics) వంటి విభాగాలు ఉన్నాయి.
అశ్వినీ దేవతలు నాసత్య, దస్ర అనువారు సంజ్ఞా దేవి, సూర్య భగవానుల కుమారులు. వారు ఎప్పుడూ ఆపదలో ఉన్న వారిని రక్షిస్తూ ఉంటారు.
అత్యంత ముసలివాడై కదలని స్థితిలో ఉన్న చ్యవన మహర్షికి మూలికా వైద్యం ద్వారా యవ్వనాన్ని, అందాన్ని ప్రసాదించారు. సుశ్రుతుడు శరీరం నుండి చర్మాన్ని తీసి కట్ అయిన ముక్కు భాగంలో అమర్చి పునర్నిర్మాణం చేశాడు. అందుకే ఆయనను ఫాదర్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జరీ అని ప్రపంచవ్యాప్తంగా అంగీకరించారు. చరకుడు రాసిన చరక సంహిత ఆయుర్వేద వైద్యానికి బైబిల్ లాంటిది.
మానవ శరీరం వాత ,పిత్త, కఫ అనే మూడు దోషాలపై ఆధారపడి ఉంటుందని అవి సరిగా లేకుంటే రోగాలు వస్తాయని నిరూపించారు.
సుశ్రుతుడు 121 రకాల సర్జికల్ పరికరాలను వాడాడు.
భారతీయ వైద్య చరిత్రలో భరద్వాజ మహర్షి ఆయుర్వేద శాస్త్రాన్ని దేవలోకం నుండి భూలోకానికి తీసుకువచ్చిన తొలి ఆచార్యుడిగా ప్రసిద్ధి చెందారు.భూమిపై మనుషులు అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు, హిమాలయ ప్రాంతంలో సమావేశమైన ఋషుల తరపున భరద్వాజ మహర్షి స్వర్గానికి వెళ్లి ఇంద్రుని నుండి ఆయుర్వేద జ్ఞానాన్ని పొందారు.
త్రిసూత్రాల బోధన. ఇంద్రుడు భరద్వాజునికి ఆయుర్వేదంలోని మూడు ప్రధాన సూత్రాలైన హేతు (వ్యాధి కారణాలు), లింగ (వ్యాధి లక్షణాలు), మరియు ఔషధ (చికిత్సా విధానాలు) గురించి ఉపదేశించారు.
శిష్య పరంపర. భరద్వాజుడు తాను నేర్చుకున్న వైద్య విజ్ఞానాన్ని పునర్వసు ఆత్రేయుడు వంటి మహర్షులకు బోధించారు. ఆత్రేయుని శిష్యుడైన అగ్నివేశుడు రచించిన గ్రంథమే తర్వాతి కాలంలో ప్రఖ్యాత చరక సంహితగా రూపొందింది.
వైద్య సిద్ధాంతాలు. గర్భధారణ, మరియు పిండం ఏర్పడే విధానం వంటి అంశాలపై కేవలం మంత్రతంత్రాలు కాకుండా, స్త్రీ పురుషుల శారీరక కలయిక మరియు సరైన సమయం వంటి శాస్త్రీయ కారణాలను ఆయన వివరించినట్లు చరక సంహిత పేర్కొంటోంది.
ప్రాచీన కాలానికి చెందిన ఈ ఇంజనీర్లు ,డాక్టర్లు కేవలం కల్పిత పాత్రలు కావు. ఆనాడు భారత దేశంలో విలసిల్లిన అద్భుత సాంకేతికతకు ,శస్త్ర చికిత్స నైపుణ్యాలకు, వారు ప్రతిరూపాలు. నేటి ఆధునిక సైన్స్ కు వారు వేసిన పునాదులు అపూర్వమైనవి ,అద్భుతమైనవి.
