మనందరం రకరకాల వ్యక్తులని వివిధ సందర్భాల్లో కలుసుకోవడం జరుగుతూనే ఉంటుంది . కొందరి తో సంభాషణ మల్లెల సౌరభాన్ని వెదజల్లితే మరికొందరితో అదేదో సామెత చెప్పినట్టు ఆ మాటలు మనకు వినే పాటి ఓపిక ,ఉత్సాహము రెండూ ఉండవు ఎలా తప్పించుకోవాలి అని ఆలోచిస్తూ గడుస్తాయి భారంగా .
అధిక ప్రసంగం .అనవసర ప్రసంగం . ఆత్మ స్తుతి -పరనింద ఇవి సంభాషణ ల్లో ని కొన్ని రకాలు .ఈ రకాలని కొందరు తమ సొంతం చేసుకుంటారు సులువుగా .వీరేగాక ఈ మధ్య మరికొన్ని రకాలు తటస్థ పడుతున్నారు .వీరిని ఒక విషయం గురించి అడిగితే ,ఆ సంగతి టూకీగా చెప్పక అదేదో పెద్ద కాశీ మజిలీ కథ లా చెప్పే రకాలు మరి కొందరు . వారికి ఆ విషయం పై ఉన్న ఉత్సాహం చచ్చిపోయినా సరే ,వీళ్ళు మటుకు చెప్పబోయే విషయం వదలరు . చెప్పే విషయం మనకి అంటే ఎవరికి వాళ్లకి చాలా చక్కగా ఇంట్రెస్టింగ్ గా ఉండవచ్చు .కానీ అదే మాదిరి ఎదుటి వారికి కూడా అనిపిస్తుందని అనుకోవడం కొంత తెలివి తక్కువ .సంభాషణలో మనం చెప్పబోయే సంగతి విచిత్రమైనది కొత్తది అయినా సరే సూటిగా క్లుప్తంగా ఉండాలి .అప్పుడే వినేవారికి విసుగ్గా అనిపించదు.
పాడిందే పాట అన్నట్టు కొందరు చెప్పిన ఒక విషయాన్ని తిప్పి తిప్పి ,మళ్ళీ మళ్ళీ కనపడినప్పుడల్లా మన నెత్తిన రుద్దుతూ ఉంటారు . ఇలాంటి వారితో సంభాషణ కొత్తలో తళతళ మెరిసిన ,కొన్నాళ్లు పోయేసరికి వెలవెల పోతున్న రంగులు జ్ఞాపకానికి వస్తాయి . అలవాటు వల్ల మర్యాద వల్ల వీళ్ళ సంభాషణలను భరిస్తామే తప్ప ఇటువంటి వాటిల్లో నేర్చుకోవలసిన విషయాలు ఏమాత్రం ఉండవు .
చక్కగా సంభాషణని కొనసాగించడం కూడా ఒక కళే .అందరికీ అలవడదు . కొందరు ఎన్ని గంటలైనా గమ్మత్తుగా మాట్లాడుతూ గడిపేస్తారు .ఇలా చక్కగా మాట్లాడగలిగిన వారు సాధారణంగా కనబరిచే లో పం ఎదుటివారికి మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం .ఇంతసేపు తా ము జోక్స్ కట్ చేయడం కా క ఎదుటివారికి పెదవి విప్పే అవకాశం ఇవ్వరు . సంభాషణలో మన అభిప్రాయాలకు ఎటువంటి ప్రత్యేకత ఇస్తుంటారో , ఎదుటి వారి మాటలకి కూడా అటువంటి ప్రత్యేకతే ఇవ్వాలి .అప్పుడే ఒకరి మాటలు మరొకరిని విసిగించవు .
మనం మాట్లాడుతున్నప్పుడు భాషిం చేది ఒక వ్యక్తితో కానీయండి లేక ఇద్దరు ముగ్గురు కానీయండి .ఆ మాటల్ని జాగ్రత్తగా ఎదుటివారు వింటారు అనే విషయం మరిచిపోకూడదు .జాగ్రత్తగా వినటమే కాదు విన్న మాటల్లోనే మంచి చెడ్డలను లోపాలని నిమిషంలో కి పట్టేస్తారు .సంభాషణ మార్దవంగా క్లుప్తంగా ఉండడమే కాదు , ఊత పదాలతో ,పిట్ట కథలతో ఎదుటివారిని విసిగించడం వంటి అలంకారాలు అవసరం లేదు ,కాబట్టి మాట్లాడేటప్పుడు ఎదుటి వాళ్లకు కూడా కాస్త సమయం ఇచ్చే లాగా మాట్లాడితేబావుంటుంది .మీ రేమంటారు ?
