“పెండ్యాల రాఘవరావు అంటే ఆ మాదిగల కలిసినాయన “అని పేరు ను, తీర్మానాన్ని చేసి అదేదో తప్పు పని అన్నట్టు మాట్లాడేవారికి ఎదురు నిలిచి
మా బాపు సమానత్వ భావనల సమరశంఖం పూరించి ,సహపంక్తి భోజనాలు నిర్వహించారు.
1935 ప్రాంతం రోజులవి. మహా గడ్డు కాలం,గుడ్డి లోకం. ఆనాడు దళితులను హరిజనులు, మాదిగలు అనే వాళ్ళు. దూరం పెట్టేవాళ్ళు. ఈ అంటరానితనం నిర్మూలనకు కృషి చేయాలని మా బాపు నడుకట్టారు. మేము నాన్న ను బాపు అని అంటాం . మా బాపు చాలా మంచి వారు.
పెండ్యాల రాఘవరావు గారు ( 15. 3.1917 _ 10. 9 . 1987)
వరంగల్ జిల్లా చిన్న పెండ్యాల గ్రామ వాస్తవ్యులు. పెండ్యాల పిరాట్యమ్మ , రామంచందర్ రావు వీరి తల్లిదండ్రులు. భూస్వామ్య, గ్రామ కరణం కుటుంబం. చిన్ననాటి నుండి చదువులో చురుగ్గా ఉండటం తో హన్మకొండ లో చదువు కొరకు పంపించారు. ప్రపంచం, రాజకీయాలు పరిచయమయ్యాయి. గాంధీ స్వాతంత్ర్య పోరాటాలు తెలిసాయి.
నిజాం నిరంకుశ రాజ్యంలో తొలి స్టేట్ కాంగ్రెస్ సత్యాగ్రహి గా ఎన్నో పోరాటాలు చేసారు.
హైదరాబాద్ రాజ్యం లో చైతన్యాన్ని రాజేసిన ఆనాటి ఆంధ్ర మహాసభ లో జాతీయపక్ష కార్యకర్తగా పనిచేస్తున్న కాలంలో తనకు తానే స్వతంత్ర వీరునిగా మలుచుకున్నారు. గ్రామాల్లో విద్య అనేదే లేక అంధకారంలో ఉన్న సమాజానికి తామే స్వయంగా సిలబస్ తయారు చేయించి బళ్ళు పెట్టి చైతన్యవంతులను చేసారు. హాస్టల్ పెట్టారు.
ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించి ఎదిరించినందుకు జైలు పాలయ్యారు. సాంఘిక కట్టుబాట్లను ఖండిస్తూ స్త్రీ ల పక్షాన గొంతెత్తారు. వెట్టిచాకిరి నిర్మూలన కోసం పోరాటాలు చేస్తూ ప్రజల పక్షాన నిలబడ్డారు. తెలంగాణ రైతాంగ పోరాటానికి తమ జీవితాన్నే బలి ఇచ్చేందుకు సిద్ధపడిన విశాల హృదయుడు పెండ్యాల రాఘవరావు. దళ నాయకుడిగా ఎన్నో పోరాటాలు చేసాడీ అజ్ఞాత వీరుడు . శాసనోల్లంఘనం చేసి నిజాం ప్రభుత్వానికి నిద్ర పట్టకుండా చేసిన సాయుధ పోరాట యోధుడు. రజాకార్ల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు రంగం సిద్ధం చేసి ప్రజాస్వామ్య వ్యవస్థ కోసం పాటుపడిన ఘనుడు. ఎన్నో ఏళ్ళు అడవుల్లో క్యాంపులు నిర్వహించి స్వాతంత్ర్య సమరం చేసిన విప్లవ వీరుడు.కమ్యూనిస్ట్ నాయకుడు.
క్రమశిక్షణ ,సత్ప్రవర్తన,మంచితనం , ఉన్నత భావాలు పోతపోసిన రూపు మా బాపు ధృఢకాయానికి మరింత వన్నె తెచ్చినవని ఆనాటి పెద్దల అభిప్రాయం.
ఔను! అనర్ఘళంగా ఉపన్యాసాలు ఇచ్చేవారనీ, బాపు మీటింగ్ ఎక్కడున్నా ప్రజల సద్దులు గట్టుకొని బండ్లల్లో వచ్చేవారు అని ఎందరో గుర్తుచేసుకున్న మాటలు నాకు స్ఫూర్తినిస్తాయి . మా బాపు జీవిత చరిత్ర రాయాలని చుట్టుపక్కల గ్రామాల్లో బాపుతో పనిచేసిన కొందరు దళ సభ్యుల్ని,ఇతర ప్రముఖ లీడర్ల ఇంటర్వ్యూచేస్తే ఇలాంటి విషయాలెన్నో చెప్పారు- “ఆయన మాటలే తూటాలు”,”ప్రజలను చూరగొనే వాగ్ధాటి”, ” ఉత్తమ నిర్మాత”,”ప్రజల మనిషి”, “రాఘవ రావే మూమెంట్”, “ప్రజలను అంటిపెట్టుకున్న వీరుడు “, “పట్టుదలగల మనిషి “,” హృదయంలో సాయుధ పోరాటం”, “ధన్యమైన జీవితం “,” మంచి స్నేహితుడు “,”ఆయనే పోరాటం “,”మడమతిప్పని మరో స్వాతంత్ర్య సమరసేనాని”,”ఆదర్శప్రాయమైన జీవితం “,”ఆయన త్యాగధనుడు”,”మెస్మరైజ్ చేసే ఉపన్యాసం”,”సామాజిక విప్లవ వైతాళికుడు””ఆత్మీయుడు”, “సైన్యాధిపతి” అంటూ వారి వారి అభిప్రాయాలను వ్యాసాలలో రాసిచ్చినవీ మా బాపు రాసుకున్న ” నా ప్రజా జీవితం” పుస్తక రూపంలోకి తెచ్చినప్పుడు అవన్నీ వేసి ముద్రించాము. అదొక గొప్ప అనుభూతి. అవును మరి మా బాపు నూనూగు మీసాల నూత్న యవ్వనం లో ఊళ్ళో ‘ఓం జెండా ‘ఎగురవేసి సర్కార్ ను, త్రివర్ణ పతాకాన్ని వరంగల్ కోటపై ఎగురవేసి నైజాం రాజుకు ఎదురొడ్డిన పోరాటాలన్నీ కథలు కథలుగా విన్నదాన్ని ఎలా ఊరుకుంటాను? ” మావి రికార్డు లు లేవు, ఉన్న రికార్డులను తగులబెట్టడమే మా కార్యక్రమాలాయె” అనీ
“మేము ఏదో ఆశించి చేయలేదు ఆ పోరాటాలు . అసలు మేం బతుకుతామని అనుకున్నామా?”అని ప్రముఖ వారు చెప్పిన మాటలు ఇంకా నా చెవుల్లో మారుమ్రోగుతుంటాయి.ఇప్పుడు ఈ స్వాతంత్ర్య వజ్రోత్సవ సందర్భంగా ఇలా తమ ప్రాణాలను ఫణంగా పెట్టిన ఆనాటి వీరుల గురించి అక్షరాలలో నిక్షిప్తం చేస్తుంటే ఎంత సముచితమైన కార్యం తలపెట్టారని అభినందనలు చెప్పడం తప్ప ఏం చేస్తాం? స్వాతంత్ర్యం వడ్డించిన విస్తరి అయింది నేటి విచ్చలవిడి సమాజానికి. నిర్లక్ష్యం వహిస్తే గ్రద్ద లా తన్నుకుపోతారీ స్వాతంత్ర్య శాంతి కపోతాన్ని. అప్రమత్తం చేయాలనే నిర్వాహకులు భుజాన వేసుకున్నారనకతప్పదు. ఈ మహా కార్యక్రమం లో ఓ అక్షర మౌతున్నందుకు నాకైతే సంతోషంగా ఉంది. ఈ వీరుని బిడ్డ ను అని చెప్పుకోవడం గర్వం గా నూ ఉంది.
భారత భూమి మనదే కానీ ఫలితము మనకేది ॥2॥
భారతదేశము భాగ్యమదేశం
పై గనగా మనదే
ఆకలితోడ మలమల మాడి
అలమటించుట మనదేగా
పరదేశీయుల్ పాలన చేయగా స్వరాజ్యంబదియేది
ఫలితము మనకేది॥2॥
రత్నగర్భయని నామమొంది
దేశ దేశముల కీర్తి పొంది
ఘనవిఖ్యాత ఖ్యాతి నొందె ఘనతర స్వాతంత్ర్యము లేక ఫలితము మనకేది ॥భారత॥
అంటూ పాటలు రాసి పాడిన మా బాపు ఆనాటి ఆర్య సమాజం లో పనిచేసారు.
“తల్లిని మించిన దైవము వేరే
ధారుణి లేదోయూ ॥2॥
స్వారాజ్యంబె స్వరాజ్యమాయే
మా సేవా బలమాయే
ఈ ధరణీ మాతోయీ ॥ 2॥
అని గేయాన్ని రాసిన మాబాపు ఎంత గొప్ప కవి కదా!
“భారతమాత వందనం
కన్నా తల్లి వందనం
మా కన్నా తల్లీ వందనం ॥భారత॥
మన భూమి హితమే కోరి
మానరా మధుపానమూ
మాని సుఖియించరా॥భారత॥
అని సామాజిక గేయాలు రాసినా,
“త్యాగశీలురకు దేశ సేవకులకు జోహారులిడగా కదలిరారే దేశభక్తులకు దీన బంధువులకు జోహార్లీడగా కదలిరారే ॥ జోహారు॥సత్యమహింసా సర్వభూత దయ మూర్తిభవించి సాక్షాత్కరించిన దేశభక్తులకు దీనబంధువులకు జోహారులిడగా ॥
ధరా సుతులను వర్జించి
ధన ధాన్యంబులు త్యజియించి మాతృభూమిని సేవించుటయే పరమార్ధమని యెంచి
పాటుపడిన భవ్యమూర్తులకు జోహారులిడగా కదలిరారే”
అంటూ ఉత్తేజకరమైన గేయాలు ప్రజలముందు పాడినా మా బాపు స్వాతంత్ర్య కాంక్ష , సాహిత్య అభిలాష తెలిసిపోతుంది.
ఏడవ తరగతి వరకే చదువుకున్నా తెలుగు,ఉర్దూ,హిందీ, ఇంగ్లీష్ భాష లలో పటుత్వాన్ని సాధించుకున్నారు .
అందుకేనేమో ఎం.పి. పదవి తీసుకొమ్మని కమ్యూనిస్ట్ పార్టీ కేంద్ర నాయకత్వం ఒత్తిడి చేసి శాసనసభ సీట్లు వదులుకొమ్మని ఉంటుంది. పార్లమెంట్ లో గళాన్ని వినిపించాలంటే హిందీ బాగా మాట్లాడగలగాలనే , భాషా నైపుణ్యం ఉన్నవారు కావాలనే కావచ్చు. మా బాపు ఆనాటి హైదరాబాద్ రాష్ట్ర పోలీసు ఆక్షన్ సమయం లో మూడు ఏళ్లు జైలు జీవితం గడిపారు. 1952 లో జరిగిన మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికల లో పోటీ కి జైలు నుండే నామినేషన్ వేసి, పి.డి.ఎఫ్ తరపున పోటీ చేసారు. రెండు ఎం .ఎల్.ఏ. సీట్లు ఒక ఎంపీ సీటు కైవసం చేసుకున్నారు. అత్యధిక సీట్లు ఏక కాలంలో గెలుచుకున్నందుకు మా బాపును , అత్యధిక మెజారిటీతో గెలుపొందిన రావి నారాయణరెడ్డి గారిని నెహ్రూ గారు పార్లమెంట్ లో అభినందించారు.
1952 నుంచి 57 దాకా తొలి లోక్ సభ లో ఎన్నో సమస్యలపై ప్రజాగళం వినిపించిన వక్త మా బాపు.
“ఆయన ఎవరనుకున్నావ్? ” ,”హి ఈజ్ అవర్ మాన్” అని హృదయపూర్వకంగా తోటి పోరాట వీరులతో ఆనాటి నాయకులతో అనిపించుకున్న పెండ్యాల రాఘవరావు గారు వారు జైలు లో ఉన్నప్పుడు 1949-50 లలో కంట్రోళ్ళ పై
‘‘ నా దేశం- నా భారత దేశం
నా దేశం నా భారత దేశం
మన్ను బంగరౌ మాన్యాలున్నా
సాలెల్ల పారే సెలయేరులున్నా
మడిలో మొక్కకు తడిలేదన్నా”॥ నా దేశం రా॥
అంటూ రాసిన గేయం లో పేద బ్రతుకులను స్పృశిస్తూ, దళారుల మోసాలను , రాజకీయాలను ఎండగట్టారు. ” వలస విధానపు వరమేరయిది/ తెల్లోడు పెట్టిన తెగులేరయిది/
నల్లోడు నేడు నడుపుతున్నాడు/ దోపిడి వర్గాల దాపునున్నాడు” ॥ నా దేశం నా భారత దేశం”
అని రాసినారు.
మా బాపు ధైర్యసాహసాల గురించి ఎన్నైనా చెప్పవచ్చు.ఆయన జీవిత చరిత్ర అంటే ఆనాటి తెలంగాణ రైతాంగ పోరాట చరిత్ర, సాయుధ పోరాట చరిత్ర