ఆమె మళ్ళీ రావడం కనిపించింది .
ఎప్పట్లాగే భుజానికో బ్యాగు తగిలించుకుని , కుడి చేత్తో ఆ పెద్దావిడ చేయి పట్టుకుని నడిపిస్తూ నెమ్మదిగా లోపలికి వచ్చింది .చాలా శ్రద్ధగా, జాగ్రత్తగా ఆ ముసలామెను కస్టమర్స్ లాంజ్ లోని కుర్చీలో కూర్చోబెట్టింది .
ఆవిడ కూర్చున్నాక తన భుజానికున్న బాగ్ లోనించి నీళ్ల సీసా బయటికి తీసి మూత తీసి పదిలంగా ఆమె నోటికి అందించింది . పెద్దావిడ వద్దన్నట్టుగా తల తిప్పింది . అయినా వదలకుండా బుజ్జగిస్తున్నట్టుగా ముసలామెతో కొన్ని మంచినీళ్లు తాగించింది .
ఆ తరువాత స్టాండ్ దగ్గరికి వెళ్లి ఒక విత్ డ్రా ఫామ్ తీసుకుని ఏదో రాసింది . పెద్దావిడ దగ్గరికి వెళ్లి ఏదో చెప్పి ఆవిడతో పెన్ను పట్టించి చిన్న పిల్లలతో అక్షరాలు దిద్దించినట్టుగా జాగ్రత్తగా సంతకం చేయించింది . మళ్ళీ కౌంటర్ దగ్గరికి వెళ్లి పాస్ బుక్ తో బాటు వోచర్ ఇచ్చి పెద్దావిడను చూపిస్తూ ఏదో చెప్పింది .
వాళ్ళూ నవ్వుతూ పలకరించి ఏదో అంటున్నారు . టోకెన్ తీసుకుని కాష్ కౌంటర్ దగ్గరికి వెళ్ళింది . క్యాషియర్ నవ్వుతూ డబ్బులు లెక్కబెట్టి ఇచ్చాడు . ఆమె కూడా చిరునవ్వుతో మాట్లాడుతోంది .
నేను ఈ బ్రాంచ్ కి మేనేజర్ గా వచ్చిన గత అయిదు నెలలుగా చూస్తున్నాను , ప్రతీ నెలా ఆఖరి వారం లోనే ఆమె బ్యాంక్ కి వస్తుంది . అది కూడా ఉదయం బ్యాంకు తెరచిన అయిదు నిముషాల్లోపే వచ్చి పని పూర్తి చేసుకుని వెళ్తుంది . ఆ రోజుల్లో .. అందునా ఆ టైం లో అయితే రష్ ఉండదని కాబోలు !
ఆమెలో ఏదో తెలియని ఆకర్షణ ఉంది . ఎందుకో తెలీదు గానీ ఆమెను చూస్తూంటే ఎంతో ఆత్మీయురాలనిపిస్తుంది . సౌమ్యంగా , నెమ్మదిగా తన పని చేసుకువెళ్తుంది . ఆమె రాగానే మా స్టాఫ్ కూడా ఎంతో బాగా పలకరించడం , గబగబా ఆమెకు పనులు చేసి పెట్టడం నేను గమనించాను .’ నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందంటారు ‘ , ఇదే కాబోలు !
ఇవాళ రిలీజ్ చేయాల్సిన ఒక లోన్ గురించి ఫీల్డ్ ఆఫీసర్ తో చెబుదామని నా కేబిన్ లోంచి బయటికి వస్తూంటే ఆమె తన చేత్తో ఆ ముసలావిడను పట్టుకుని నడిపించుకుని వెళ్తూ కనపడింది .
” నమస్తే మేడమ్ !” చక్కటి చిరునవ్వుతో కుడి అరచేయి ఛాతీకి ఆనించి తల కొద్దిగా వంచి విష్ చేసింది .
” నమస్తే ! మీ అమ్మగారా ?” పెద్దావిడ వైపు చూస్తూ అడిగాను . చిన్న పిల్లను పట్టుకుని నడిపించినట్టు ఆమె ఎంతో అపురూపంగా ఎడమ చేత్తో ఆమెను పొదివి పట్టుకుని తీసుకువెళ్తూంది .
” లేదండీ , మా అత్తగారు !” అంది ఆమె అదే వినయంతో .
ఆశ్చర్యపోవడం నా వంతయింది .
వాళ్ళు నెమ్మదిగా బయటికి వెళ్ళగానే , ఓ ఆటో వచ్చి ఆగింది . ముందే ఆటో అతన్ని పోనూ రానూ మాట్లాడుకున్నట్టున్నారు . ముందు జాగ్రత్తగా అత్తగారిని ఎక్కించి ఆ తరువాత తాను వెనకాల నుండి తిరిగి వచ్చి అటుపక్కనుండి ఎక్కిందామె . ఆటో కదిలింది . ‘ ఎంత జాగ్రత్త !’ అనుకుంటూ అటే చూస్తూ ఉండిపోయాను .
********
ఎట్టకేలకు ఆ ఇల్లు దొరకపట్టగలిగాను . అతని కోసం దాదాపు నెల రోజుల్నించి తిరుగుతున్నాను. కుమార్ అనే అతను వీడియో కెమెరాకు లోన్ తీసుకున్నాడు బ్యాంక్ నుండి . పెళ్లిళ్లకు, పుట్టిన్రోజులకు , ఇతర ఫంక్షన్లకు వెళ్తూ సంపాదించుకుని తక్కువ మొత్తంతో ఎక్కువ ఇన్ స్టాల్ మెంట్స్ లో మూడేళ్ళలో కట్టుకునేలాగా ఏర్పాటు చేశారు మా బ్యాంకు వాళ్ళు .
మొదట్లో ఒకట్రెండు నెలలు సరిగానే కట్టినట్టున్నాడు . ఆ తరువాత నుండీ ఏమీ చెల్లింపులు లేవు . నేను ఈ బ్రాంచ్ లో మేనేజర్ గా చేరిన కొద్ది రోజులకే అతని లోన్ ఖాతా మొండి బకాయిగా సిస్టమ్ లో కనపడుతోంది .
సహజంగా నేను చిన్నదైనా , పెద్దదైనా లోన్ రికవరీ కోసం ఒకట్రెండు సార్లు ఫోన్ చేసినా ఫలితం ఉండకపోతేనే ఇంటికో , పని చేసే చోటికో , షాపుకో వెళ్తాను . పైగా లోన్ ఇచ్చినప్పుడు మధ్య మధ్య యూనిట్ చూడాల్సిన బాధ్యత కూడా ఉంటుంది .
ఈ కుమార్ అనే అతను అస్సలు దొరకలేదు . ఇప్పటికి మూడిళ్లు మార్చాడు . ఎలాగో ఆచూకీ తీసి దొరకపట్టాను . తీరా చూస్తే ఇంట్లో ఘోరమైన పరిస్థితి ! అతడు ఇంట్లో లేడు , ఏ రాత్రికో బాగా తాగి వస్తాడట . మొదట్లో ఎవరో వీడియో గ్రాఫర్స్ దగ్గర పనిచేసినప్పుడు బాగానే డబ్బులు వచ్చేవట . అయితే తాగుడు ఎక్కువై ఇంట్లోకి డబ్బులేమీ ఇవ్వకపోగా రెండు లక్షల విలువైన ఆ వీడియో కెమెరా కూడా కుదువబెట్టి మరీ తాగేవాడట .
ఇప్పుడు ఆ కెమెరా కూడా ఉందో అమ్మేశాడో తెలీదు , ఎక్కడా పెద్దగా షూటింగ్స్ కూడా ఉన్నట్టు లేదని అతని భార్య ఏడుస్తూ చెప్పింది . ఆమె షిఫ్ట్ పద్ధతిలో ఏదో మాల్ లో పని చేసి తెచ్చే డబ్బులే ఇంటికి ఆధారమట . తల్లికి వచ్చే ఓల్డ్ ఏజ్ పెన్షన్ కూడా బెదిరించి తీసుకుంటాడట . లోన్ కట్టమని అతని భార్యని అడగలేక పోయినా , అతను ఇంట్లో ఉండే టైంకు వస్తానని ఆమె మొబైల్ నెంబర్ తీసుకుని బయటికి వచ్చాను .
” నమస్తే మేడమ్ ! ఏంటి ఇలా వచ్చారు ?” పలుకరింపుతో స్కూటీ స్టార్ట్ చేస్తున్న నేను అటు చూసాను . రెగ్యులర్ గా వాళ్ళ అత్తగారిని తీసుకుని బ్యాంక్ కి వచ్చే ఆమె నవ్వుతూ పలుకరిస్తోంది .
” ఓ ! మీ ఇల్లు ఇక్కడేనా ?” అడిగాను . కూరగాయల బండి దగ్గర కూరలు కొన్నట్టుంది , చేతిలోని బుట్టలో కూరగాయలున్నాయి .
” ఆ రెండో ఇల్లే , మీకు ..ఇక్కడ తెలిసినవాళ్లున్నారా ?”
” కస్టమర్లందరూ మా చుట్టాలూ , ఫ్రెండ్సే కదా ! ఒక లోన్ రికవరీ కోసం వచ్చా !” చెప్పాను .
” మీరు కూడా తిరగాల్సిందేనా మేడమ్ ! మీ ఫీల్డ్ ఆఫీసర్ వెళ్ళరా ?” అడిగిందామె .
” వెళ్తారు , నేను కూడా రావాల్సి ఉంటుంది ”
” ఇంత దూరం వచ్చారు కదా , మా ఇంటికి రండి మేడమ్ , ఆ కన్పించేదే ”
” అయ్యయ్యో , వద్దు లెండి ” అన్నానే కానీ .. ఆమె ద్వారా ఈ కుమార్ ఉన్నప్పుడు తెల్సుకుని రావచ్చనీ , ఈమెతో టచ్ లో ఉంటే మంచిదనీ వెళ్లాను .
చిన్న ఇల్లే కానీ శుభ్రంగా బావుంది . ” అత్తయ్యా ‘ ఇదిగో , మనింటికి బాంక్ మేనేజర్ గారొచ్చారు ” అంటూనే ముందు రూమ్ లో ఆగిపోయిన నన్ను చూసి ” లోపలికి రండి !” అంటూ తీసుకెళ్లింది . పెద్దావిడ అప్పటి దాకా టీవీ చూస్తున్నట్టుంది , నన్ను చూడగానే ఆఫ్ చేసింది .
“ మీ కోసం రెండు రకాల ఆకు కూరలు తీసుకున్నాను . మీకిష్టమని మునక్కాయలు కొన్నాను . ” అంటూనే ” అయ్యో , ఇదేంటీ , ఈ పళ్ళ ముక్కల్ని ఇలా వదిలేశారు ?” అంటూ అత్తగారిని అడిగిందామె .
” చాలా ఇచ్చావు , కొన్ని తిన్నానులే .. అవన్నీ నేను తినలేను ” అంది పెద్దావిడ .
” ఈ మాత్రం తినకపోతే ఎలా ? పళ్ళు బాగా తినాలని డాక్టర్ చెప్పలేదూ ! ” అంటూ ప్రేమగా మందలిస్తూనే కాస్త పైకి పోయిన పెద్దామె చీరను కిందికి జరిపి కాళ్ళు కన్పించకుండా సవరించడం నా దృష్టిని దాటి పోలేదు .
” నీ ఆరాటం గానీ , పోయిన వయసూ , ఆరోగ్యం మళ్ళీ వస్తాయా ? సరే గానీ వారికి కాఫీ ఇవ్వు !” అంది అత్తగారు .
” అయ్యయ్యో ! ఇప్పుడేమీ వద్దండీ ! నేను మళ్ళీ బ్యాంక్ కి వెళ్ళాలి ” అన్నాను .
ఆమె అప్పటికే కిచెన్ లోకి వెళ్లనే వెళ్ళింది .
” మీ ఆరోగ్యం బాగుందా ?” అన్నాను నేను ఏం మాట్లాడాలో తెలీక .
” నా కోడలుండగా నాకేం లోటమ్మా ! నన్ను కంటికి రెప్పలా చూసుకుంటుంది . నా కన్న తల్లి కన్నా ఎక్కువ . నా కూతురు కూడా ఇంత బాగా చూసుకునేదో లేదో ! అయినా వయసై పోయాక ఏముందమ్మా , ఆ పై వాడి పిలుపు ఎప్పుడు వస్తే అప్పుడు వెళ్లిపోవడమే !” అంది .
” అదిగో ! హాస్యానికైనా ఆ మాట అనొద్దన్నానా !” ఎప్పుడు వచ్చిందో కోడలు .. కాఫీ తీసుకొచ్చింది .
” మీకు కాఫీ ఇవ్వనా ?” అత్తగారిని అడిగింది .
” ఇప్పుడొద్దు లేమ్మా , ఇందాకేగా తాగాను ” అంది పెద్దావిడ .
కాఫీ బాగుంది , మంచి రిలీఫ్ ఇచ్చింది . దానికన్నా ముందు ఆ అత్తా కోడళ్ల అనుబంధం నచ్చింది .
ఏ మాత్రం తెచ్చిపెట్టుకున్నట్టుగా లేకుండా , చాలా సహజంగా .. నటనేమీ లేకుండా , ప్రేమగా వాళ్లిద్దరూ మాట్లాడుకుంటుంటే చూడ ముచ్చటగా ఉంది .
నేను బయల్దేరి వస్తుంటే ఆమె మర్యాద కోసం బయటి దాకా వచ్చింది .
” నాకు చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని చూస్తూంటే ! నిజంగా ఈ రోజుల్లో ఇంత అన్యోన్యంగా ఉండే అత్తా కోడళ్ళు అరుదు . ముఖ్యంగా ఆవిడ్ని కన్న తల్లిలా చూసుకుంటున్నందుకు మిమ్మల్ని మెచ్చుకోవాలి ” అన్నాను మనస్ఫూర్తిగా .
” చూసుకోవాలి , తప్పదు .. అవసరం !” అందామె అదో రకంగా .
” అదేంటీ ?” అన్నాను నేను ఆశ్చర్యపోతూ .
” అదంతే ! మా మామగారు స్వాతంత్ర్య సమర యోధులు , ఆయన పెన్షన్ ముప్పై వేలు మా అత్తయ్యకు వస్తుంది .”
” అది సహజమే కదా !” అన్నాను అయోమయంగా .
” అదే మాకు ఇల్లు గడవడానికి ఆధారం . ఆ పెన్షన్ ఆవిడ ఉన్నన్నాళ్ళేగా వచ్చేది . అందుకని ఆమె ఆరోగ్యంగా , ఆనందంగా చాలా ఏళ్ల పాటు ఉండడం మాకు తప్పనిసరి .”
” అది సరే ! బెదిరించో , బ్లాక్ మెయిల్ చేసో పెద్దవాళ్ళ పెన్షన్ లాక్కునే వాళ్ళున్న రోజుల్లో మీరు చాలా ప్రేమగా చూసుకోవడం గొప్ప విషయమే కదా !”
” నాకు మొదట్నుంచీ ఆవిడంటే గౌరవమే , ఇష్టమే ! అత్తయ్య కూడా నన్ను చాలా ప్రేమగా చూసుకుంటారు . రానురానూ నాక్కూడా ఆమెను వదిలి ఎటూ వెళ్లాలనిపించదు . నా అమ్మ కన్నా ఆమెనే ఎక్కువ ఇష్టపడ్తాను . కాకపోతే హైదరాబాద్ లో ఉన్న మా ఆడపడుచు అడపా దడపా తీసుకెళ్లి రెండు మూడు నెలలు ఉంచుకుని పంపిస్తూండేది . తను కూడా మా అత్తయ్యను బాగా చూసుకుంటుంది ”
” మరి .. సమస్యేమిటి ?” నాకు అవసరమా కాదా అని ఆలోచించకుండా కుతూహలంతో అడిగాను , మనుషులు ఇంత ప్రేమల్తో ఉన్నా ఇబ్బందేమిటో అనుకుంటూ .
” మధ్య తరగతి మనుషుల సంగతి మీకు తెలియనిదేముంది ? మా అత్తయ్య అక్కడున్నన్నాళ్ళూ పెన్షన్ డ్రా చేయడానికి కుదరదు . మేము వెళ్లి అడగలేము .ఆ డబ్బు లేకపోతే ఇల్లు గడవదు . అందుకే తాను అక్కడికి వెళ్లకుండా ..ఎప్పుడైనా కూతురే వచ్చి నాల్రోజులు ఉండి వెళ్తే సరి .. అని మా అత్తయ్యకే అనిపించేలా చూసుకుంటాను ” శుష్క హాసం ఆమె పెదవులపై !
” మరి మీ వారు ?” ఏం చేస్తారు అని అడగలేక సగం లో వదిలేసాను .
” డిగ్రీ దాకా చదివారు . ఏ పనీ స్థిరంగా చేయరు . కుదురు ఉండదు , బద్ధకం ఎక్కువ . గొప్పలకు పోయి అప్పులు చేస్తారు . ప్రైవేట్ జాబ్స్ ఎన్నో చేసి మానేశారు . దేంట్లోనూ మూడ్నెల్లకు మించి పని చేయరు . అసలు ఎప్పుడు మానేసింది కూడా ఇంట్లో చెప్పరు . పూర్తిగా చెడ్డవాడని కాదు కానీ .. ఆ మనిషి మీద ఆధారపడి బతకలేం ”
“మా మామగారికి ఫ్రీడమ్ ఫైటర్ కోటా లో ఐదెకరాల భూమి ఇచ్చారు . సిటీ శివార్లలో ఉన్న ఆ భూమికి ఇప్పుడైతే మంచి రేటు వచ్చేది . కానీ ఎనిమిదేళ్ల క్రితమే ఆ భూమిని అమ్మి అడ్వాన్స్ తీసుకున్నారు మా ఆయన . ఇక కొడుక్కి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళ దగ్గర పరువు పోతుందని మా అత్తయ్య సంతకం పెట్టారు . నేనూ ఆవిడా కల్సి మిగతా డబ్బులు మేమే తీసుకుని ఆవిడ పేరుతో ఈ ఇల్లు కొన్నాం . మాకు ఒక్కర్తే అమ్మాయి. మిగిలిన డబ్బుల్తో మా అమ్మాయి పెళ్లి చేసాం . ”
” మరి ..మీరు …ఏదైనా చేయొచ్చు కదా !”
ఆమె ఓ క్షణం ఆగింది . ” నేను ఎమ్మే బీ ఎడ్ చేసి జాబ్ వెతుక్కుంటుండగా పెళ్లి అయి ఇక్కడికి వచ్చాను . చాలా ఏళ్ళు ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా చేసాను . మా అమ్మాయి పెళ్లి ముందు నాకు కాన్సర్ వచ్చింది .మాస్ట్రక్టమీ చేశారు . ఆ తరువాత మా అత్తయ్య , మా ఆయనా ..నన్ను జాబ్ చేయనివ్వట్లేదు .”
” మీరు ప్రతి సారీ బ్యాంక్ కి వచ్చే బదులు ఏటీఎం కార్డు తీసుకోవచ్చుగా !”
” అదీ అయింది . మా అత్తయ్య కొచ్చే ముప్పై వేల పెన్షన్ లో పదిహేను వేలతో ఇల్లు గడుపుతాను . ఏవన్నా పండుగలూ , పబ్బాలో , చుట్టాలు రావడమో జరిగితే మరో అయిదు వేలు .అంతే ! మిగతా డబ్బులు అలా ఖాతాలోనే ఉన్నాయనుకునే వాళ్ళం . ఈయన ఏటీఎం కార్డు తో ఎప్పటికప్పుడు మొత్తం డ్రా చేసాడని ఓ సారి లైఫ్ సర్టిఫికెట్ కోసం బ్యాంకు కు వెళితే తెలిసింది .ఇక కార్డ్ సరండర్ చేసి మేమే వెళ్లి తెచ్చుకుంటున్నాం . మిగతా డబ్బులు మూడు , నాలుగు నెలలు కాగానే మా అత్తయ్య పేరు మీద ఫిక్సడ్ డిపాజిట్ చేస్తాం . నామినేషన్ నా పేరిటే ఉంటుంది . ఆవిడ తదనంతరం మాకు కావాలిగా !” గొంతు వణికినట్లనిపించింది .
లోపలికి చూసాను , పెద్దావిడ ఏదో చదువుకుంటోంది . ఆమె ముఖంలో నిశ్చిoత , సంతృప్తి !
” ఏదేమైనా … మీరు ఆవిడ్ని ఇంత అపురూపంగా చూసుకోవడం చాలా సంతోషం ! మిమ్మల్ని మెచ్చుకోవాలి ” మనస్ఫూర్తిగా అన్నాను .
” మీరలా అనకండి . నాకు చాలా గిల్టీగా ఉంటుంది . నేను చేసేది త్యాగమూ కాదు , చూపేది అనురాగమూ కాదు . కేవలం స్వార్థం , అవసరం అనాలి ! ఆవిడ లేని రోజున మేము వీధిలో పడతాం . నా మందులకు కూడా డబ్బులుండవు . ఆవిడ జీవితం చాలా ఏళ్ళు పొడిగించాలి , అందుకోసం ఆవిడ ఆరోగ్యంగా , ఆనందంగా ఉండాలి . మా అత్తయ్యని కాపాడుకోవడమే నా ఉద్యోగం అని అర్థం చేసుకున్నాను గనకే ఆవిడని బాగా చూసుకుంటున్నాను . ప్రేమ , గౌరవం లేవని కాదు . ఈ డబ్బులే లేకపోతే మాకు ఎంత ప్రేముంటే ఏముంది చెప్పండి ?” నీటితో నిండిన ఆమె కళ్ళు మరెన్నో ప్రశ్నలకు జవాబు చెప్పాయి .
“మీ ఆరోగ్యం జాగ్రత్త ! మీ అవసరం ఆవిడకు చాలా ఉంది .” అని వచ్చేసాను .
కథలు
కుర్చీలోంచి విసురుగా లేచాడు రమణ.
“గాయత్రీ..! ఫర్ గాడ్స్ సేక్.. మళ్లీ నీ ఎపిసోడ్ మొదలెట్టకు. వినీవినీ విసుగొచ్చింది. నువు ముందా ఏడుపు మానెయ్యి. ఐ కాంట్ టేక్ ఎనీమోర్ ఆఫ్ దిస్” చిరాకునంతా ముఖంలో ప్రదర్శిస్తూ అన్నాడు.
అతని అనవసర ఇరిటేషన్ నాకూ కోపం తెప్పించింది. కానీ సర్దుకున్నాను.
“నేను చెప్పేది ఎపిసోడ్ లా అనిపిస్తుందా నీకు?”
“కాదామరి, మాట్లాడితే మన పెళ్లి ఎప్పుడంటావు. అసలా బాండింగ్ కోసం ఎందుకంత తొందర?”
“ తొందర కాదు, అవసరం. మనం కలిసుందామని డిసైడైనప్పుడు అది కొద్దిరోజులు మాత్రమే అనుకున్నాం. వీలైనంత త్వరగా పెళ్లి చేసుకోవాలనుకున్నాం. కానీ ఇప్పటికి ఏడాదిన్నర దాటింది. నువ్వుగా ప్రస్తావన తేవు. నేను పెళ్లి మాటెత్తితే దాటేస్తావు. దీనివల్ల మనమధ్య మనస్పర్థలు, దూరం పెరుగుతున్నయి. మన ప్రేమ మీద ఇష్టంతో, భవిష్యత్తు మీద నమ్మకంతో సహజీవనానికి ఒప్పుకున్నా. ఇప్పుడేమో నువు పెళ్ళిని తేలిగ్గా తీసుకుంటున్నావు. అసలు నీ మనసులో ఉన్నదేమిటో స్పష్టం చెయ్యి. ఒక క్లారిటీ వస్తే మంచిది”
“జస్ట్ షటప్ ఐసే.. నీ సోది మళ్ళీమళ్ళీ వినే ఓపిక నాకు లేదని ముందే చెప్పాను. ఇంట్లో ఉంటే ఒక్కక్షణం మనశ్శాంతిగా ఉండనీవు. అందుకే వెళ్లిపోతున్నా” మాట పూర్తిచేస్తూనే విసురుగా బయటికి వెళ్ళిపోయాడు. అతని వెనుకే పెద్దచప్పుడుతో తలుపు మూసుకుంది.
గత కొన్నిరోజులుగా జరుగుతున్నదే మళ్లా ఈరోజూ జరిగింది.
ఒక సందర్భానికి తనకు అనుకూలమైన విధంగా ముగింపు పలికి అతడు తప్పుకున్నాడు. చిక్కని నీడలాంటి మరో సాయంత్రం నాముందు పరుచుకుంది. ఇల్లంతా నిండిన నిశ్శబ్దం… నన్ను కావలించుకునే ఒంటరితనం. నిస్సహాయతతో ఏడుపొస్తుంది. కానీ ఇప్పడేడ్చి లాభమేమిటి?
అనుకోకుండా మొదలైన మా సహజీవనం మరొకలా రూపం మార్చుకుంది. అప్పటికి ఇద్దర ఒకే కంపెనీలో పనిచేస్తున్నాం. అంతకుమించి మంచి స్నేహితులం. మామీద ఆఫీసులో, బయటా ఏవేవో రూమర్స్ పుట్టేంత సన్నిహితులం.
ఒకరోజు లంచ్ టైములో కేంటీన్లో చెప్పాడు రమణ.
“ఇంకో వారంలో నేనుండే ఇల్లు వెకేట్ చేయాలి గాయత్రీ ..! ఎంత ప్రయత్నించినా నాకు సూటయ్యే మరో కొంప దొరకడం లేదు. ఈ నగరంలో సరైన ఇల్లు, అందులోనూ మన స్తోమతకు తగింది దొరకడం కష్టమని తేలిపోయింది”
“ఇల్లు కోసం వెతుకుతున్నావా ఏమిటి..?”
“అవును. ఇల్లు సౌకర్యంగా ఉందనిపిస్తే అద్దెలు ఎక్కువున్నయి. తక్కువలో కావాలనుకుంటే అసౌకర్యంగా, మన ఆఫీసుకు చాలా దూరంగా ట్రాన్స్ పోర్టుకు ఇబ్బంది అయ్యేలా ఉన్నాయి”
“ఇది అందరికీ ఎదురయ్యే సమస్యనే. ప్రత్యేకించి నీకొక్కడికే కాదు” నవ్వాను.
“అందుకే మరెవరినైనా కలుపుకొని షేరింగులో మంచి ఫ్లాట్ తీసుకుంటే బాగుంటుందనే యోచనలో ఉన్నా”
“నాదగ్గరో మంచి ఐడియా వుంది..చెప్పనా?”
“చెప్పు.. సందేహం ఎందుకు?”
“మరి నువు షేర్ చేసుకునే హౌస్ మేట్ నేనే అయితే ఎలా ఉంటుంది..?”
రమణ ఒక్కక్షణం అయోమయంగా నాముఖంలోకి చూసి ఆశ్చర్యపోయాడు. ఇబ్బంది పడినట్టు కనిపించాడు.
“ ఇది మంచి ఐడియా యెలా అవుతుంది? అందరూ ఏమనుకుంటారు? ముఖ్యంగా మీ తల్లితండ్రులకు తెలిస్తే…”
“ఏమీ కాదు. నేనేం చేసినా అది నాయిష్టం. నాకు సొంత నిర్ణయాలు తీసుకునే స్వేచ్చ ఉంది. పైగా మనం ఒకర్నొకరు
బాగా సన్నిహితులం. మన భవిష్యత్తుకూ, పరస్పరం సంపూర్ణంగా అర్థం చేసుకునేందుకూ ఇదో అవకాశంగా భావించు.”
“నీతో కలిసివుండటం ఒక అద్భుతం, కానీ…”
“ఇంకేం ఆలోచించకు. నేను కూడా పీజీ నుంచి ఖాళీ చేయాల్సివుంది. ఇద్దరం కలిసి మంచి ఇల్లు వెతికి ఈ వీకెండుకే చేరిపోదాం”
“నువు నిజంగానే నాతో కలిసుండాలనుకుంటున్నావా?” అతనిలో ఏదో సంశయం.
రమణకు వివరంగా సర్దిచెప్పాను. అట్లా ఎక్కువకాలం ఉండాల్సిన అవసరం లేదన్నాను. త్వరలోనే మనకూ ఒక కుటుంబం ఏర్పడి అంతా సెటిలైపోతుందని చెప్పాను. ఆవిధంగా ఇద్దరం ఒకచోట వుండాలనుకున్నాం. నేనప్పటికే అతన్ని ఇష్టపడి ఉన్నాను. పైకి అనకపోయినా రమణ కూడా అంతేనని నాకు తెలుసు. అయితే ‘మనం వెంటనే పెళ్లి చేసుకుందామని’ మాత్రం చెప్పలేకపోయాను.
మేము కలిసివుండటం మా అమ్మా నాన్నలకు ఇష్టంలేకపోయింది.
“కలిసివుండటం ఎందుకు? ఇద్దరూ ఇష్టపడ్డారు. పెళ్లిచేసుకోవచ్చుగద. మిమ్మల్నెవరు కాదన్నారు?” అమ్మ అన్నది.
“ కొద్దిరోజులే మమ్మీ..! తొందర్లోనే మ్యారేజీ చేసుకుంటాం. రమణ చాలా మంచివాడు”
“ ఏ మాత్రం బెడిసికొట్టినా నష్టపోయేది స్త్రీ మాత్రమే. ఆ సంగతి గుర్తుంచుకో బేబీ”
నాన్న ఎందులోనూ లోతుగా జోక్యం చేసుకోడు. ఈ విషయంలో నన్ను సున్నితంగా హెచ్చరించాడు.
“అతను మంచివాడే కావొచ్చు బేబీ..! కానీ సహజీవనమంటే కాలక్రమంలో అతనికి నీమీద గౌరవం పోవొచ్చు. ఇప్పుడున్న ఆపేక్షలు ముందు ముందు ఉండకపోవచ్చు. నా సలహా ఏమంటే మీరు పెళ్లి చేసుకుంటేనే మంచిది.”
“ అదేం కాదులే నాన్నా. నేను అన్నీ ఆలోచించాను. నా నిర్ణయంలో మార్చులేదు”
“తప్పు చేస్తున్నావు బేబీ..! ఏదోరోజు బాధపడే స్థితి తెచ్చుకోకు. ఎదురుదెబ్బలు తినకుండా చూసుకో” అమ్మ చివరి హెచ్చరికగా అన్నది.
నేను వాళ్ళ జాగ్రత్తలు, హితవచనాలను పట్టించుకోలేదు. అమ్మానాన్న నన్ను సరిగా అర్థం చేసుకోలేదనిపించింది. నాజీవితాన్ని నేనే మలుచుకోవాలని భావించుకున్నాను. నేను రమణని ప్రేమించాను. అతనితో కలిసి నాకిష్టమైనట్టుగా బతకాలనుకున్నా. జీవితం రొటీన్ కావడం నాకు నచ్చదు. రమణతో సహజీవనంలో ఒకరినొకరు అర్థం చేసుకొని, ఆ తర్వాత పెళ్లిచేసుకోవడం, నా సంసారం.. పిల్లలు.. ఇదే నాక్కావలిసింది.
గడియారం వంక చూశాను. పది గంటలు దాటింది. రమణ ఇంటికి రాలేదు. మరునాడు కూడా రాలేదు. ఆవేశమూ ఆవెనుకే నిస్సహాయతా నన్ను కుదిపివేశాయి. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు. అతనిప్పుడు పనిచేసే కంపెనీకి కాల్ చేస్తే సరైన రెస్పాన్స్ లేదు. పెళ్లి విషయంలో అతన్నుంచి పదేపదే తిరస్కార స్థితిని ఎదుర్కోవడం ఓటమిగా అనిపించి ఆవేదన పెరిగింది. మనసులో అలుముకున్న నా గోడు వెళ్లబోసుకుంటే తప్ప బరువు దిగదనిపించింది. నాన్నతో మాట్లాడే ధైర్యంలేక అమ్మకు కాల్ చేశాను. వెంటనే ఫోనెత్తింది.
“హలో మమ్మీ..!”
“హలో బేబీ..! ఎలా ఉన్నావు. బిజీ అనుకుంటా.. మొన్న ఫోన్ చేస్తే లిఫ్టు చేయలేదు”
“నేను బాగానే ఉన్నాను మమ్మీ”
“మరి నీ గొంతు అట్లా ధ్వనించడం లేదే”
అమ్మ మాటకు తెలియకుండానే ఏడుపొచ్చింది. దుఃఖం గొంతులోంచి జారకుండా సర్దుకున్నాను.
“అవును మమ్మీ..! మేము మళ్ళీ గొడవపడ్డాం. మొన్న ఇంట్లోంచి వెళ్ళిన రమణ ఇంకా రాలేదు”
తల్లికి ఏం అర్థమైందో, ఎలా ఫీలయిందో తెలియదు, కొద్దిసేపు మౌనంగా ఉండిపోయింది.
“చాలారోజులుగా నీకు అబద్ధం చెపుతూ వొచ్చాను. నిజానికి రమణ పెళ్ళికి సిద్ధంగా లేడు మమ్మీ. అడిగితే దాటేస్తున్నాడు.
లేదా ఘర్షణపడి బయటికి పోతాడు. అతనితో సహజీవనం విషయంలో మీరొద్దన్నా వినకుండా తొందరపాటు నిర్ణయం
తీసుకున్నాననిపిస్తుంది”
“పెళ్లి గురించి నువు ఖచ్చితంగా అడిగావా?”
“చాలాసార్లు అడిగాను. అతనిలో ఆ ధ్యాసే లేదు. పెళ్లి, పిల్లలు, ఒక కుటుంబం కోసం నేనెంత ఇష్టంగా ఆరాటంగా ఉన్నదీ చెప్పినా అతడు వినిపించుకోవడం లేదు. రమణ నేను ఊహించుకున్న వ్యక్తి కాదు. నన్నతడు వాడుకుంటున్నాడని అనిపిస్తుంది”
“మీరిలా గొడవలకుపోతే సమస్య తీవ్రమవుతుంది. ఇద్దరూ ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకోండి. అతని ఉద్దేశ్యమేమిటో తెలుస్తుంది. అంతేకాదు, నీ పరిస్థితేమిటో.. నువ్వెక్కడున్నావో కూడా నీకు అర్థమవుతుంది” అమ్మ చెప్పింది.
సహజీవనం తొలుత స్వర్గతుల్యం అనిపించింది. ఎంతో అన్యోన్యంగా గడిపాం. ఒకరిమీద ఒకరు ఎంతో ఆపేక్ష కనబరిచాం. రోజులెట్లా గడిచాయో తెలియలేదు. గంటలకొద్ది కబుర్లు, సినిమాలు, షికార్లు, వీకెండ్ విహారాలు, మోహాలు, తాపాలు, సుఖాలు. కానీ కాలక్రమంలో సహజీవన చిత్రం రంగు మారసాగింది. నెలలు గడిచినా రమణ ఏనాడూ పెళ్లి మాటెత్తలేదు. భవిష్యత్ జీవితం, పెళ్లి గురించి ప్రస్తావన తెచ్చినప్పుడల్లా అతడు విషయం దాటేస్తూ వొచ్చాడు. పెళ్లి.. సంసారం.. పిల్లలు అంటే అనాసక్తిగా ఉండేవాడు. నాకు అసహనం పెరగసాగింది. అసలు రమణ నన్ను ఇష్టపడ్డాడా అనే సందేహం చాలా రోజులకుగానీ నాకు కలుగలేదు. అతన్ని గట్టిగా నిలదీసి అడుగలేకపోయాను.
అందుకు అతడు నాకు ద్రోహం చేస్తాడన్న ఊహ నాలో లేకపోవడమే. ఎంత వొత్తిడి చేస్తున్నా అతడు తేలిగ్గా తీసుకున్నాడు.
“పాతకాలపు ఆడపిల్లలా ఏమిటి నీ చాదస్తం..! మనకు పెళ్లి అవసరమేముంది.. ఇప్పుడు బాగానే ఉన్నాముగా”
అతని ధోరణిలో నాకు నిర్లక్ష్యం కనిపించి హృదయం విలవిలాడుతుంది. ఒక అభద్రతా భావన మొలకెత్తి బలపడసాగింది.
అతడు మరో అమ్మాయివేపు మొగ్గుతున్నాడా? వేరే పెళ్లిచేసుకోవాలని చూస్తున్నాడా అనే అనుమానం. ఆ ప్రభావం క్రమేపీ మా సహజీవనం మీద చూపుతున్నది. అతడు అనవసరంగా చిరాకుపడటం, కోపగించుకోవడం సాగించాడు. ఇంట్లో ఉండటం తగ్గించి ఎక్కువగా బయటకు వెళ్లి వొస్తున్నాడు. ఇక ఆలస్యం చేయకూడదనిపించింది. అమ్మ చెప్పిన సలహా ప్రకారం అతన్ని నిలదీసి మనోగతం తెలుసుకోవాలి.
***
నాలో ఒక అభద్రతా భావం పెరుగుతున్నది. దానికితోడు నేనిప్పుడు గర్భవతిని.
“రమణా.. అట్లా కూర్చో. మనం సీరియస్ గా ఒక విషయం మాట్లాడుకోవాలి” అతన్ని నిలదీశాను.
కోపంతో ఇంట్లోంచి వెళ్ళిపోయి రెండ్రోజుల తర్వాత తిరిగొచ్చిన గిల్టీ గానీ, ఇబ్బంది పడుతున్న స్థితిగానీ అతనిలో కనిపించలేదు. రమణ అసహనంగా చూస్తూ “ఏంమాట్లాడాలి? పాత పాటేనా? నువు పెళ్లి.. పిల్లలు.. సంసారం అన్నావంటే సారీ..! నాకు వినే ఓపిక లేదు”
“నేను మళ్ళీమళ్ళీ అనేందుకు ఏముంది? ఈ సమస్య కొత్తది కాదు. ఎన్నోరోజుల ముందే మొదలైంది.”
“ఇందులో సమస్య ఏముంది? మనకేం గొడవలు లేవు. హాయిగా ఉంటున్నాం. సగటు ఆడపిల్లలా ఆలోచించి సమస్యను నువ్వే సృష్టించుకుంటున్నావు”
“అయితే పెళ్లి వద్దంటావు. కలిసి కాపురం చేయగాలేంది పెళ్ళంటే అభ్యంతర మేమిటి? అసలు నీ మనసులో ఎమున్నదీ చెప్పు”
“నాకు ఎలాంటి బాదరబందీలు ఇష్టం లేదు గాయత్రీ ..! జీవితాన్ని ఎంజాయ్ చేయాలన్న మనస్తత్వం నాది. నేను ఇంటరు చదువుతున్నప్పుడే మానాన్న పోయాడు. మా అమ్మే కష్టపడి నన్ను చదివించింది. ఉద్యోగంలో చేరిన తర్వాత కుటుంబం బరువులన్నీ నామీద వేసుకున్నాను. ఇద్దరు చెల్లెళ్లకు పెళ్లిచేశాను. ఇందుకోసం చాలా సర్దుబాటుతో బతికాను. ఇప్పుడు అమ్మ కూడా పోయింది. ఒంటరిని. నాకే బంధనాలు లేకుండా హాయిగా గడపాలని అనుకున్నాను. అందులో భాగంగానే నీతో కలిసి ఉండేందుకు ఒప్పుకున్నా. మనం పరస్పర ఇష్టంతోనే సహజీవనానికి సిద్ధపడ్డాం. ప్రేమ, పెళ్లి, సంసారం, బంధాలు ఇవన్నీ నాకు నచ్చనివి. నువు ఏవేవో ఊహించుకొనివుంటే అందుకు నేను బాధ్యున్ని కాదు. ఇక పిల్లలంటావా.. దానికి ఏనాడూ అంగీకరించను. నాకే జంజాటాలు వొద్దు. జీవితంలో మొదటిసారి స్వేచ్ఛను అనుభవిస్తున్నా. నాకు దీన్ని కోల్పోవడం ఇష్టం లేదు. మళ్లా బరువులెత్తుకోవడం నావల్ల కాదు.”
“ఈ ఆలోచన ఉన్నవాడివి నాతో సహజీవం ఎందుకు? ఎంజాయ్మెంటులో ఇదీ భాగమేనా? పెళ్లి విషయంలో నీకిప్పుడే జ్ఞానోదయమైందా? అంటే… ఇంతకాలం నన్ను ఉద్దేశపూర్వకంగానే వాడుకొని..” మాట్లాడుతుంటే దుఃఖంతో నాకంఠం వొణికింది.
“ నన్ను మాత్రమే దోషిని చెయ్యాలని చూడకు. నీకిష్టం లేకనే నాతో సహజీవనం చేశావా? నాతోపాటు నువ్వూ ఎంజాయ్ చేశావు కదా. కొత్తగా ఈ పెళ్లి.. పిల్లలు అంటూ ఏళ్లతరబడి బాధ్యతలు మోయలేను..సారీ”
“నీ సంసారం, నీకుపుట్టే పిల్లలు భారం ఎట్లా అవుతుంది? నిన్ను ప్రేమించినట్టే ఇల్లు, సంసారం, పిల్లలంటే నాకు ప్రేమ. రమణా.. అర్థం చేసుకో”
“అయాం సారీ..! ఈ విషయంలో నువు ఎప్పటికీ నిరాశచెందక తప్పదు”
ఒకరోజు అతనికి అసలు విషయం వెల్లడించాను.
“అయామ్ ప్రెగ్నెంట్ రమణా..” చిన్నగా చెప్పినా నాగొంతు స్పష్టంగా ఉంది.
విషయం తెలిసి సంతోషిస్తాడనుకున్నా. కానీ ఏదో వినకూడనిది విన్నట్టు నావైపు తీక్షణంగా చూశాడు. సోఫాలో కూర్చొని ఫోనులోకి చూస్తున్నవాడల్లా ఆపేసి పూర్తిగా నావైపు తిరిగాడు. కోపంగా తల విదిలించి “నో..! అలా జరగడానికి వీల్లేదు. ఈ విషయం ఇన్నిరోజులు ఎందుకు దాచావు? నాకెందుకు చెప్పలేదు?”
“ఇందులో రహస్యం ఏముంది.. సంతోషపడే సంగతే కద. నాకిప్పుడు మూడోనెల”
“కాదు, నువు కావాలనే దాచావు. దీన్నడ్డం పెట్టుకొని నువు అనుకున్నది సాధించాలనుకున్నావు. కానీ పెళ్ళీ, పిల్లలూ నాకెంతమాత్రం ఇష్టంలేదు. నేను టాలరేట్ చేయను అంతే..”
“రమణా.. ఏమిటి నీ ధోరణి? వాట్స్ రాంగ్ విత్ యూ?”
“నో.. ఐ కాంట్ డు దిస్. నువ్వెంత చెప్పినా అస్సలు ఒప్పుకోను. నేను ఒక భర్తగా, తండ్రిగా సెటిలయ్యే మనిషిని కాదు. నా కోరికలు వేరు, జీవితం వేరు. ఐనా ఇప్పుడేమైంది? ముందు కడుపు తీయించుకో. వెంటనే ఆస్పత్రికి పోతే అబార్షన్ చేస్తారు”
“ఇడియట్..!” గట్టిగా అరిచాను. “నీకు బుద్ధుందా? అసలు మనిషివేనా? గర్భం తొలగించుకోమంటావా? బిడ్డకు తండ్రిగా ఇదా నీ మాట? కనీస మానవత్వం కూడా లేదా? పుట్టబోయే బిడ్డలను చంపేస్తూ మనం మాత్రం హాయిగా ఎంజాయ్ చేద్దామంటావా? పశువులా బిహేవ్ చేయకు..” మాటలంటుంటే నన్ను నేను కంట్రోలు చేసుకోలేక ఏడిచాను.
“నువ్వెంత సెంటిమెంటలైనా, నీ ఫీలింగ్స్ ఏవైనా నాకు సంబంధం లేదు. ఏడ్చి గగ్గోలు పెట్టినా లాభంలేదు. నా మనసు మారదు. గుర్తుంచుకో”
దుఃఖం ఆపుకొని నార్మల్ అయ్యేందుకు ప్రయత్నిస్తూ అన్నాను: “ నిజమే.. నువు మారవు. ఇదంతా నీ తప్పుకాదు, నాది. మొదటినుంచీ నీ మనసులో నిర్ణయాలు ఉన్నాయి. నన్ను నువు ప్రేమిస్తున్నావని నేనే తెలివితక్కువగా నమ్మి మోసపోయాను. జీవితంలో మనిద్దరం రెండు వేర్వేరు ఇష్టాలతో భిన్నమైన అంశాలను కోరుకున్నాం. నిజానికి నీకు నేనంటే ఏనాడూ ప్రేమ అనేదే లేదని నాకనిపిస్తుంది”
“అయితే ఏమిటిప్పుడు..? నన్ను వెళ్లిపొమ్మంటావా?”
“ నువ్వెందుకు.. నేనే వెళ్లిపోతాను. మనమిప్పుడు చేయగలిగేది అదొక్కటే. ఇంతజరిగి.. అసలు వాస్తవం తెలిశాక ఇక మనం ఒకే గూట్లో వుండటం అసందర్భం.. అసాధ్యం” కళ్లవెంట నీరు కారుతున్నా నాస్వరం కటువుగా పలికింది.
మరోమాట లేకుండా అతడు బయటికి వెళ్ళిపోయాడు. రెండ్రోజుల తర్వాత ఫోన్ చేసి తనకు బెంగళూరు బదిలీ అయిందని, వెళ్లిపోతున్నానని తెలిపాడు. శాశ్వతంగా గుడ్ బై అనికూడా చెప్పాడు.
నాకర్థమైపోయింది ఇక అతడు తిరిగిరాడని. ఏమీచేయలేని నిస్సహాయురాలిగా దుఃఖమొచ్చింది. కొంతసేపటికి తేరుకొని మామూలయ్యాను. చేయవలసిన దానిగురించి ఆలోచించాను. జీవితాంతం కలిసి బతకాలనుకున్న మనిషి అసలు రూపం బయటికొచ్చింది. ఒక సంకుచిత నిర్ణయాన్ని అతడు తీసుకున్నాడు. నాకు తోడు కాలేకపోయాడు. అతనికోసం దేబిరిస్తూ.. ఎదురుచూస్తూ ఎందుకుండాలి? బంధాలు వద్దనుకున్నవాడు పెళ్ళికి ఒప్పుకుంటాడా? అతన్ని ప్రేమించడం, నమ్ముకోవడం నాదే తప్పిదం. జీవితంలో సవాళ్ళు ఎదుర్కొంటూ నేనుగా ముందుకు సాగాలనుకున్నా. ప్రెగ్నెన్సీ నిలుపుకోవాలని, బిడ్డను కనాలనే నిర్ణయించుకున్నా. ఆఫీసుకి సెలవుపెట్టి పుట్టింటికి వెళ్లిపోయాను.
***
కాలం అన్ని గాయాలను మాన్పుతుంది. నాకిప్పుడు ముద్దులు మూటగట్టే పాప ఉన్నది. రమణ ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో, అతని గురించి గుర్తుచేసుకునే తీరికా.. ఇష్టమూ ఇప్పుడు నాలో లేవు. అతడు వెళ్ళిపోయాడు ఇంట్లోంచి, నా బతుకులోంచి. కొత్తదారిలో చాలాదూరం వొచ్చేశాను. ఆశలు వెతుక్కుంటూ బతుకుబాటలో నాదైన రీతిలో సాగిపోతున్నాను.
కాలింగ్ బెల్ చప్పుడువిని వెళ్లి తలుపు తీశాను. అతడు నన్ను దాటుకొని లోపలికొచ్చాడు.
“బాగున్నావా గాయత్రీ..” అంటూ నా జవాబు కోసం చూడకుండా వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు.
గుర్తుపట్టాను.. రమణ. బాగా మారిపోయాడు. “ఇక్కడికెందుకొచ్చావు? ఎవరు చెప్పారు నేనిక్కడున్నట్టు” చిరాకుపడుతూ అన్నాను.
“మనసుంటే మార్గాలకేం? తెలుసుకోలేననుకున్నావా?”
“మళ్లీ ఎందుకొచ్చావు? ఇంకా ఏంచేద్దామని? నా బతుకేదో బతకనివ్వవా?”
“నీకు కీడు చేద్దామని రాలేదు డియర్. నేనిప్పుడు మారిపోయాను. నీకు మేలుచేద్దామనే వొచ్చాను”
“ఇప్పటివరకు నువు చేసిన మేలు చాలు. నన్నిట్లా వొదిలెయ్యి. బెంగళూరు నుంచి స్టేట్స్ వెళ్ళినట్టు నీ పాత కొలీగ్ అప్పుడెపుడో చెప్పాడు. మళ్లా ఎందుకొచ్చావు?”
“ అవును, నెలరోజుల క్రితమే ఇండియా వొచ్చాను. ఇప్పుడేమో నీకోసం వొచ్చాను”
“ఏం.. ఇంకెవరూ ఆడవాళ్ళు దొరుకలేదా? నేను నీకోసం తయారుగా ఉంటాననుకున్నావా?”
“అంత కటువుగా మాట్లాడకు డియర్ ..! మీ ఊరువెళ్ళి మీ అమ్మ నాన్నను కలిసి నేను చేసిన తప్పు గురించి చెప్పాను. తప్పును
తెలుసుకున్నట్టు కూడా తెలిపాను. సరిదిద్దుకుంటానన్నాను. వాళ్లు నన్ను క్షమించారు. నువు కంపెనీ మారినట్టూ.. ఒంటరిగానే
ఉంటున్నట్టూ చెప్పారు. నీ అడ్రసు తెలుసుకొని నేరుగా వొచ్చాను”
నేను మాట్లాడకుండా అతనివైపు చూశాను. రంగుతేలి బాగా లావయ్యాడు. డాలర్లు వొంటికి పట్టి దర్జా అలవడినట్టుంది. నన్ను వెతుక్కుంటూ వొచ్చిన అతనిపట్ల నాలో ఏమాత్రం స్పందన లేదు.
“ఎట్లా ఉండింది అమెరికా జీవితం..? ముఖ్యంగా నీ స్వేచ్ఛా జీవితం”
నామాటల్లోని వ్యంగ్యానికి అతడేమీ నొచ్చుకున్నట్టు కనిపించలేదు.
“మా పెద్ద చెల్లెలు న్యూజెర్సీలో వుంది. ఆమె దగ్గర కొన్నిరోజులు వున్నాను. తర్వాత మరో ఇద్దరితో కలిసి షేరింగ్ ఫ్లాట్ తీసుకొని వున్నాను. ఎక్కువ సంపాదన, కొత్త స్నేహాలు, అమ్మాయిలు.. బాగానే ఎంజాయ్ చేశాను”
“మరింకేం, అక్కడే హాయిగా ఉండకుండా ఇండియాకు ఎందుకొచ్చావు?”
“డబ్బు, స్వేచ్ఛ, ఇవేవీ జీవితంలో అసలైన ఆనందాలు కావని గ్రహించాను. చుట్టూ ఎంతమంది అమ్మాయిలున్నా వాళ్ళెవరూ నావాళ్ళనిపించలేదు. వారిలో ప్రేమానురాగాలు, కన్సెర్న్ లేవు. పరిచయాలైనా, స్నేహాలైనా అన్నీ అవసరపూర్తివే. కొందరు నావెనుకున్న డబ్బునుచూసి కమిట్ అయ్యేందుకు సిద్ధపడితే, ఇంకొందరు నాకంటే మెరుగైనవాడి కోసం వెతుక్కున్నారు. ఎవరి స్నేహమైనా కొద్దిరోజులకన్నా మిగల్లేదు. ఒక బంధంలో ఇరుక్కోవడం ఎవరికీ ఇష్టంలేక పోయింది. నాకనిపించింది.. అంతపెద్ద దేశంలో మాచెల్లెలు ఒక్కరు తప్ప నాకోసం నిజాయితీగా తలచేవారెవరూ కనిపించలేదు”
“ దాదాపు రెండేళ్లు అమెరికాలో వుండి వొచ్చావు. ఎవరినీ తోడు తెచ్చుకోలేదేం..? బాదరబందీ ఎందుకనుకున్నావా? బంధాలు, బాధ్యతలు నీకు సరిపడవు కదా”
నా ఎగతాళి, ఎత్తిపొడుపు రమణ గ్రహించినా పట్టించుకోనట్టు కనిపించాడు.
“ఈపాటికి నువు పెళ్లిచేసుకొని ఉంటావనుకున్నా. కానీ ఒక్కదానివే ఇలా. నీ తెగువను మెచ్చుకుంటున్నా. అన్నట్టు పాప పుట్టిందటగదా. ఏదీ మన పాప..? నాకు చూపించవా?”
“మన పాప కాదు.. నాపాప” నా మాటల్లో కఠినత్వం.
“అయాం సారీ గాయత్రీ ..! నీపట్ల నేను చేసిన ద్రోహానికి ఎంత చింతించానో నీకు తెలియదు. ఏ అమ్మాయితో వున్నా నువ్వే గుర్తొచ్చేదానివి. నేన్నీకు చేసిన అన్యాయం గుర్తొచ్చేది. నిన్ను తలుచుకోకుండా, నీ ఫోటో చూస్తూ నీతో మాట్లాడకుండా ఒక్కరోజు కూడా లేను. అప్పుడు అర్థమైంది నీ ఉనికి.. నీ విలువ. అంతేకాదు, నిన్ను ఎంత ప్రేమించానో కూడా నాకు తెలిసింది. మనం సంతోషంగా వున్నప్పటి రోజులు పదేపదే జ్ఞాపకమొచ్చి బాధపడ్డాను. దయచేసి నన్ను క్షమించగలవా?”
“క్షమించడానికి నేనేవరు..? నిన్ను ప్రేమించడం, అట్లాగే నీ మనోగతం తెలుసుకోకుండా, నువ్వూ నన్ను ఇష్టపడ్డావని నమ్మడం నాదే తప్పు. మనిద్దరం జీవితంలో వేర్వేరు అంశాలను కోరుకున్నాం. అది తెలుసుకోలేక చాలారోజులు భ్రమలో నీతో కలిసి బతికాను. అసలు వాస్తవం ఆలస్యంగా గ్రహించినందుకు సిగ్గనిపించింది. నువు కొట్టిన ఎదురుదెబ్బ పాఠం నేర్పింది. నీమీద నాకేం కోపం లేదు. నిన్ను మర్చిపోయాను కూడా. ఇక క్షమించడాలెందుకు? ఎవరి దారులు వారివి. ఎవరి జీవితాలు వాళ్లవి.”
“అట్లాఅనకు..! ప్లీజ్.. ఫర్ గివ్ మీ. నేను చేసిన తప్పును ఇప్పటికైనా దిద్దుకోనీ. మనం మళ్లా కలిసివుందాం. కాదు, పెళ్లిచేసుకొని మనకంటూ ఒక ఇల్లు, పిల్లలు, కుటుంబంతో ఆనందంగా ఉందాం”
“ఇందులో తప్పు నీ ఒక్కడిదే కాదు. నేను కోరుకున్నదే నువ్వూ కోరుకుంటావని భావించి దెబ్బతిన్నాను. ఇది తెలుసుకునేసరికే నష్టం జరిగిపోయింది”
“నేను మారిపోయాను గాయత్రీ ..! మనం మళ్ళీ అన్యోన్యంగా ఉండగలం. నాకిప్పుడు భార్యా.. పిల్లలూ.. ఇల్లు అన్ని బంధాలు, బాధ్యతలు కావాలి. అన్నిటికంటే ముఖ్యం.. నాకు నువ్వు కావాలి. ఐ లవ్ యూ సోమచ్. నిన్నెప్పటికీ ప్రేమిస్తూనే వుంటా. నన్ను ప్రేమించగలవా?” అంటూ అతడు నాచేరువగా వొచ్చి రెండు భుజాలపైన చేతులు వేశాడు.
“నువు స్వీకరిస్తావనే నమ్మకం వందశాతం వుంది. అందుకే మళ్లా వొచ్చాను” అన్నాడు.
అతని ధోరణికి దిగ్భ్రాంతి చెందాను. కొద్దిక్షణాలు బొమ్మలా వుండిపోయాను. అది తనకు సానుకూలంగా భావించినట్టున్నాడు రమణ. నా ముఖం మీదుగా వొంగి పెదాలను నోటితో అందుకున్నాడు. నాకు కడుపులో తిప్పినట్టయింది. అతనిమీద ఎంత విముఖత ఉందో నా శరీర ప్రతిస్పందన చెప్పింది. అతన్ని ఉన్నపాటున వెనక్కి తోసేశాను.
“బయటికి వెళ్లిపో రమణా..! ఇంకెప్పుడూ నాకు ముఖం చూపించకు” గట్టిగా అరిచాను.
బాధపడుతూ చూశాడు రమణ. అతని ముఖంలో పశ్చాత్తాపం లాంటిది చూశాను. కానీ ఇప్పుడు నా బతుకును తప్ప దేన్నీ నమ్మలేని స్థితి. నాదారిలో నేను చాలాదూరం వచ్చేశాను.
***
గతమూ, వర్తమానమూ అలలుగా కదిలిపోతూ కళ్లు చెమ్మగిల్లాయి.
చేతుల్లో ముఖం కప్పుకున్నాను. నాకు తెలుసు భవిష్యతు పూలపాన్పు కాదని. దారిలో ఎన్నో ముల్లు.. చిక్కుముడులు. కానీ ఎవరి ఆసరా లేకుండా బతకడం నేర్చుకుంటున్నా. ఇప్పుడు నాకు తోడుగా నా ఏడేళ్ళ పాప. నాబిడ్డ నాకో వరంలా వొచ్చింది. నాకున్న ధైర్యంతో, నా చిన్నారి ప్రేమతో ముందుకు సాగుతాను. కష్టం కావొచ్చు. కానీ సాధిస్తాను.
———————–
ఊరి వెలుపల విసిరేసినట్టుగా కనిపిస్తున్న ఒక పది గుడిసెలు
ఎవరూ లేని నిర్జన ప్రదేశం.
మురికి తుమ్మ చెట్లు పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగి ఆ ప్రదేశమంతా ఇలా కనిపిస్తుంది.
దగ్గరికి వెళ్లి చూస్తే గానీ తెలియదు అక్కడ మనుషులు నివాసం ఉంటున్నారని …..సువర్ణ టీచర్ ఆవాడంతా తిరిగి అక్కడి పిల్లల గురించి ఆరా తీస్తుంది.
స్కూల్స్ తిరిగి మళ్ళీ ప్రారంభం కావడంతో ఊర్లో ఉపాధ్యాయులందరూ
క్యాంపేయిన్ చేస్తున్నారు. ఆ గ్రామంలో ఉన్న దాదాపుగా అందరి ఇళ్ళలో కి వెళ్లి పరామర్శించి వారి తల్లిదండ్రులకు నచ్చజెప్పి కోవిడ్ నిబంధనలు ఏమిటో తెలియజెప్పి అవగాహన కల్పిస్తున్నారు.
2 సంవత్సరాల క్రితం ఉన్న ఆ ఊరికి ఇప్పుడు చూస్తున్న సమయానికి ఊళ్లో చాలా మార్పులు కలిగాయి.
గ్రామమంతా చిందరవందరగా ఎక్కడపడితే అక్కడ చెత్తాచెదారం పేరుకుపోయింది.
పాఠశాల ఆవరణమంతా దుమ్ము కోట్టుకుపోయింది ఇంతకుముందు స్కూల్ ను కోవిడ్ పేషెంట్స్ కోసం ఐసోలేషన్ వార్డుగా ఉపయోగించారేమో శుభ్రం చేయకుండా ఎక్కడికక్కడే మురికి గా ఉంది పాఠశాల మొత్తం .
***********
“ఊరంతా చాలా పాడైపోయింది ఏం చేద్దాం సార్ ….? అన్నాడు హరీష్ అనే ఒక ఉపాధ్యాయుడు.”
“గ్రామ సర్పంచ్ దగ్గరికి వెళ్దాం ఇక్కడ ఉన్న పరిస్థితులు అన్నీ అతనితో చెప్దాం అని మరో ఉపాధ్యాయుడు రఘునాథం అన్నాడు.”
” ఇప్పటికే మధ్యాహ్నం అయిపోయింది
మళ్ళీ మనం తిరిగి మన ఊరికి వెళ్లి పోవాలి కదా సర్ …!!
భోజనాలు చేయడానికి కూడా సౌకర్యంగా లేదు ఏం చేద్దాం అన్నది సువర్ణ టీచర్.”
“మనం నడుస్తూ మాట్లాడుకుందాం పదండి టీచర్ అంటూ బ్యాగులు తీసుకుని సర్పంచ్ ఇంటికి బయలు దేరారు.”
*************
“నమస్కారం సర్పంచ్ గారు అన్నారందరూ ఎదురుగా కనిపిస్తున్న సర్పంచ్ ను చూస్తూ…..!!”
నమస్కారం సర్, మేడం బాగున్నారా అన్నాడు అతను.
భోజనాలు అయ్యాయా పరామర్శించాడు.
విషయం చెప్పారు వాళ్ళు.
“ఇప్పటికైతే మన ఇంట్లోనే భోజనాలు చేయండి రేపు మీరు వచ్చేసరికల్లా క్లీన్ చేయిస్తాను అన్నాడు సర్పంచ్.”
అందరూ భోజనాలు ముగించుకుని పిల్లలు అందరూ ఆరోగ్యంగా ఉన్నారా అని ఆరాతీసారు టీచర్లు.
కొందరు తల్లిదండ్రులు కోవిడ్ బారినపడి మరణించారు.
“కొందరు పిల్లలను కోల్పోయారు. అంటూ ఊరిగురించిన సమాచారం అందించాడు సర్పంచ్.”
” సర్ ఫోటోకు దండవేసారు…అంటూ సాగదీస్తూ ఎదురుగా ఉన్న ఫోటో చూసి అన్నాడు రఘునాథం .”
“మా అమ్మాయి సార్ కోవిడ్ నా బిడ్డ ను మాకు దూరం చేసింది . సంవత్సరం కావొస్తుంది ఉన్న ఒక్కగానొక్క కూతురు మమ్మల్ని అనాథలను చేసి వెళ్ళిపోయింది.అన్నాడు కన్నీళ్ళపర్యంతమై.”
“మన్నించండి సర్ ప్రపంచమంతా అనుభవిస్తున్న బాధ ఇది ఓదార్చలేని బాధ అన్నారు టీచర్లు.”
“మీరు రేపు వచ్చేసరికి స్కూల్ దగ్గర పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టిస్తాను నేనూ వస్తాను అక్కడే తల్లిదండ్రులతో మాట్లాడండి అన్నీ తెలుసుకుని తరువాత ఏంచేయాలో నిర్ణయం తీసుకోవచ్చు అన్నాడు సర్పంచ్.”
అవును సర్ అలాగే అంటూ అందరూ సెలవు తీసుకుని బయలుదేరారు.
*********************
సర్పంచ్ పైన ఉన్న గౌరవం ఏమో తల్లిదండ్రులు అందరూ వచ్చారు.
అందులో పిల్లలను కోల్పోయిన వాళ్ళుకూడా ఉన్నారు.
దీనంగా చూస్తున్న వాళ్ళ ముఖాలు చూస్తే టీచర్ల గుండె తరుక్కుపోయింది.
తీర్చలేని దుఃఖం వాళ్ళది ఎలా ఓదార్చగలం అనుకున్నారు.
ఊరిపైన ఎంత ప్రేమ వాళ్ళకు రామాపురం 700 ఇళ్ళు గల ఒక పల్లెటూరు.
ఆ ఊళ్ళో అప్పర్ ప్రైమరీ స్కూల్ లో విద్యార్థులు 400 వరకూ ఉంటారు.
కోవిడ్ రాకముందు వరకూ చక్కని ప్రవర్థన తో పిల్లలు శ్రద్ధగా చదివేవారు.
ఈ రెండు సంవత్సరాల లాక్ డౌన్ కాలంలో కొంత కాలం స్కూల్ నడవనేలేదు ఓ నెలరోజులుగా నడుస్తున్నా పిల్లలు ఎవరు రావడం లేదు.
ప్రభుత్వం నుండి స్కూల్ లు రెగ్యులర్ గా నడపాలనే ఉత్తర్వులు రావడం తో ఇలా మళ్ళీ అందరూ కనిపిస్తున్నారు.
అందరితో మాట్లాడి మధ్యాహ్నం భోజనం ఏర్పాట్లు నిర్వహణ వ్యవహారాలకోసం ఒక మనిషిని చూసుకుని సర్దుకునే సరికి వారంరోజులు గడిచిపోయాయి.
అప్పుడు గుర్తొచ్చారు రేవంత్ ,లక్ష్మీ , సంధ్య బాగా చదివే పిల్లలు వాళ్ళు ఎందుకు రావడం లేదో నని ఆరాతీసారు టీచర్లు.
రేవంత్ , లక్ష్మీ అన్నా చెల్లెళ్ళు తల్లిదండ్రులను కోల్పోయారు. చూసుకోవడానికి ఎవరూలేరు. వాళ్ళ చిన్నాన్న వాళ్ళు తీసుకుని వెళ్ళి ఎక్కడో పనిలో పెట్టారంట. తెలుసుకుని చెప్పారు. సంధ్య నాన్న చనిపోయాడు తల్లి ఆరోగ్యం అంతంత మాత్రమే అందుకే ఆ అమ్మాయి రావడం లేదు అన్నారు.
ఎలా చేద్దాం సర్ ?అంది సువర్ణ టీచర్ .
మనమేం చేయగలం టీచర్…?
అందరిదీ అదే పరిస్థితి కదా …? అన్నారు.
ఏమో సార్ మనకు చేతనైనంత ఏమైనా చేయగలమేమో అంది.
మళ్ళీ తనే ఆపిల్లలు చాలా బ్రిలియంట్స్ కదా ఈ సంవత్సరం “మనస్కూల్లోనే 10వ తరగతి వరకు అవుతుంది.అప్పుడు టీచర్లు కూడా పెరుగుతారు. కాస్తా శ్రద్ద తీసుకుంటే ట్రిపుల్ ఐటీ లో సీటు వస్తుంది .
వాళ్ళ వల్ల మన స్కూల్ కు మంచిపేరు వస్తుంది ఆలోచించండి అన్నది.”
ఆలోచిద్దాం టీచర్ కానీ మన పరిస్థితే అంతంతమాత్రంగానే ఉంది. చదువు చెప్పగలం కానీ అకామిడేషన్ ఎలా..?
మన ఇళ్ళల్లోకి తీసుకుని వెళ్ళలేము కదా…? అన్నారు వాళ్ళు.
సువర్ణ టీచర్ తల్లి మనసు ఊరుకోలేదు. ఏదో చేయాలనే తపన మొదలైంది ఆమెలో…!
ఆలోచించింది.ఏదో మనసులోనే నిర్ణయం తీసుకుంది.
టీచర్లిద్దరినీ తనకు తోడుగా రమ్మంది. సర్పంచ్ ఇంటికి వెళ్ళారు వాళ్ళు.
వాళ్ళ మనసులోని మాటలకు కన్విన్స్ అయ్యాడు సర్పంచ్.
ఆ ముగ్గురు విద్యార్థులకూ అకామిడేషన్ ఆయన ఏర్పాటు చేసాడు.
పిల్లలను తీసుకుని వచ్చాడు.
రెండు సంవత్సరాల పాటు భోజనం ఏర్పాట్లు కూడా అతనే చేసాడు.
తల్లిదండ్రులు ఉన్నప్పుడు కూడా అన్ని సౌకర్యాలు అనుభవించేవారు కాదేమో….!!
పదవ తరగతి పరీక్షలు అయిపోయాయి. వాళ్ళూహించినట్లే ముగ్గురు విద్యార్థులకూ మంచి జిపీఏ వచ్చింది.
బాసర ట్రిపుల్ ఐటీ లో సీటు వచ్చింది. సర్పంచ్ దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చూసాడు.
” అందరూ కలిసి వాళ్ళను కాలేజీ లో జాయిన్ చేసారు.”
సెలవులకు ఆయన దగ్గరికే రమ్మని చెప్పాడు.
అలా కొన్నేళ్ళు గడిచిపోయాయి.
*****************
సువర్ణ టీచర్ రాజేశం,రఘునాథం ముగ్గురు ట్రాన్స్ ఫర్ లో హైదరాబాద్ కు వెళ్ళారు.ముగ్గురూ ఒకే స్కూల్ లో పనిచేస్తున్నారు.
మేడం మీకోసం ఎవరో వచ్చారండీ…!!
ప్యూన్ పిలుపుతో క్లాస్ లో వర్క్ ఇచ్చి ఆఫీసు రూపంలో కి వచ్చింది సువర్ణ.
ఎస్ చెప్పండి అంటూ…!
అక్కడే మిగతా ఇద్దరు సార్లు ఉన్నారు.
ఒక పెద్దాయన తో పాటు ముగ్గురు యువతీ యువకులు ఉన్నారు.
“మీరు వీరాస్వామి గారు కాదండీ రామాపురం సర్పంచ్ అంది ఆశ్చర్యానందాలతో ”
“అవునమ్మా అన్నాడు అతను.”
ఆ ముగ్గురు వచ్చి సువర్ణ కాళ్ళు గట్టిగా పట్టుకుని మొక్కారు.
ఏంటిది బాబూ ఎవరు మీరు..?
అమ్మాయిలు ..! అంది.
టీచర్ మమ్మల్ని గుర్తు పట్టలేదా మేము టీచర్… రేవంత్ లక్ష్మీ సంధ్య అన్నారు.
సువర్ణ కు మాతృత్వం పెల్లుబికింది.
ఎలా ఉన్నారు
ఏం చేస్తున్నారు…??
ఒకటే ప్రశ్నల వర్షం.
మేమందరం ఐఐటీ మద్రాస్ లో ఫినిష్ చేసాము టీచర్.
రేవంత్ అక్కడే ప్రొఫెసర్ గా చేస్తున్నాడు.
అదే కాలేజీలో చదివే మాక్లాస్ మేట్స్ తో పెళ్ళిళ్ళు ఫిక్స్ అయ్యాయి.
ఈరోజు వరకూ వీరాస్వామి అయ్యగారే మా బాగోగులు చూసుకున్నారు.
ఇంకా ముందుకూడా ఆయనే మాకు పెద్దదిక్కు అంటూ పెళ్ళి కార్డు లు చేతిలో పెట్టారు.
పెళ్ళి పెద్దలు అని ఉన్న దగ్గర రాజేశం,రఘునాథం,సువర్ణ గార్ల ఆశీస్సులతో అని ఉంది.
తల్లిదండ్రులు వీరాస్వామి, కామేశ్వరి గార్ల దత్త పుత్రికలు అని ఉంది.
ఎంత పెద్దమనసు సర్పంచ్ గారు మీలాంటి వాళ్ళు గ్రామానికి ఒకరుంటే చాలు దేశం భవిష్యత్తు బంగారు బాటలో నడుస్తుంది.అన్నారు చేతులెత్తి మొక్కుతూ…!!
సర్పంచ్ చిరునవ్వు తో నాకు ఉన్న ఒక్క కూతురు కరోనా మహమ్మారి మింగింది. ఆశలన్నీ చచ్చిపోయిన సందర్భం లో మీరు నాకు ఒకదారి చూపారు. పిల్లలు అనాథలు కాకుండా తల్లిదండ్రులను సమకూర్చారు. మేం నిరాశతో జీవించకుండా అంత్యకాలంలో మాకు తోడుడడానికి పిల్లలను ఇచ్చారు. మీరు ఉపాధ్యాయులే కాదు జీవన గమ్యాన్ని చూపిన భగవత్సమానులు అన్నాడు రెండు చేతులు జోడించి.
మీరు అంతమాట అనకండి వీరాస్వామి గారు మీలాంటి వారు ఈ సమాజానికి చాలా అవసరం.
మనమంతా చేయిచేయి కలిపితేనే దేశాన్ని ప్రగతిపథంలో నడుపగలం అన్నారు టీచర్లు.
శ్రీ గురుభ్యోనమః విద్యనే కాదు జీవితాన్నిచ్చిన మీకు శథదా వందనం అన్నారు.
********
తేది:22-09-2021
జయంతి వాసరచెట్ల
9985525355
“ఏందే మంగీ ఉరికొత్తాన్నవు, ఏమైంది” అడిగింది పక్కింటి రాజవ్వత్త.
మంగ రాజవ్వ మాటలు వినిపించుకోకుండా ఇంట్లోకి పరుగెత్తింది. రాజవ్వ మంగ వెనుకే వెళ్లింది. మంగ నేల మీద కూర్చొని ముఖాన్ని రెండు మోకాళ్ల సందులో పెట్టుకొని వెక్కి వెక్కి ఏడవ సాగింది.
“ఏమైందే మంగీ ఎందు కేడుత్తాండవు” అంటూ రాజవ్వ మంగ తల నిమురుతూ ప్రక్కనే కూర్చుంది. మంగ అమాంతం రాజవ్వను కౌగిలించుకొని ఏడుపు ఉధృతం చేసింది.
“ఏమైందో చెప్పకుంట ఏడిత్తేం లాభం, పొలం కాడ మీ నాయిన గాని నిన్నేమైన అన్నడా?” అడిగింది రాజవ్వ.
“లేదత్తా మా నాయిన ఏమన్లేదు, పొద్దు మూకుతుందని నన్ను జల్ది ఇంటికి పొమ్మన్నడు, పన్లు చూస్కొని ఎనకెంబడి వస్తనని శెప్పిండు. నేను ఇంటి కాడికి ఒక్క దాన్నే వస్తాంటే నారాయణ మామ చల్క కాడికి రాంగనే మన ఉప సర్పంచు శంకరి గాడు నాకు అడ్డం తిరిగిండు. ‘నాతో పండుకో నిన్ను లగ్గం చేసుకుంట’ అని నా చెయ్యి పట్టుకొని గుంజిండు. నేను ఆన్ని బాగ తిట్టిన. నన్ను తోస్తే నేను కింద పడ్డ. నా మీద పండుకోనికి ప్రయత్నం చేసిండు, నేను ఆన్ని తోసేసి పోలీసులకు చెప్త అని ఉరికొస్తాంటే, ‘ఈ ముచ్చట ఎవల్లకైన చెప్పితే సంపుత’ అని బెదిరించిండు” ఏడుస్తూ చెప్పింది మంగ.
“పోనీలే బిడ్డా ధైర్నం చేసి తప్పించుకొని ఉరికొచ్చినవు. ఆడు ఆని పెండ్లాన్నే తిట్టి కొట్టి ఎల్ల గొట్టిండు, రెండేండ్ల సంది కాపురం శెయ్యట్లేదు. ఆడు మంచోడు కాడని తెలిసీ మనూరూల్లేమో ఓట్లేసి ఆన్ని ఉప సర్పంచ్ జేసిండ్రు. ఆని పాపాన ఆడే పోతడు లే బిడ్డా, అంతా మరిశిపో. మీ నాయినకు గీ ముచ్చట జెప్తే శంకరి గాని తోటి పంచాతీ పెట్టుకుంటడు , రచ్చ రచ్చ అయితది ఊళ్లె, అసలే పెండ్లి కావలసిన పిల్లవి నువ్వు” అంటూ మంగని ఓదార్చి వెళ్లింది రాజవ్వ.
*****
మంగ ఎనిమిదో ఏట తల్లి దీర్ఘ రోగంతో చనిపోయింది. చనిపోయి ఎనిమిది సంవత్సరాలైంది. ఈ ఎనిమిది సంవత్సరాలు తండ్రి నర్సింలు అన్నీ తానై మంగను జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. పక్కింటి రాజవ్వత్త అప్పుడప్పుడు చిన్నా చితకా సహాయం చేస్తుంది. మంగ ఐదవ తరగతితో చదువు ఆపేసింది. ఉన్న ఎకరం పొలం పనులు తండ్రి చూసుకుంటుంటే తను వంట పనులు బాగానే నేర్చుకుంది. పొలం పనుల్లో తండ్రికి సాయం కూడా చేస్తుంది. రైతుబంధు సాయం, వ్యవసాయం మీద వచ్చే కొద్ది పాటు ఆదాయం తోటి రెండు గదుల ఇంట్లో తండ్రీ కూతురు గుట్టుగా జీవనం సాగిస్తున్నారు. మంగను తన చెల్లెలి కొడుకు రవికి ఇచ్చి పెళ్లి చేయాలని నర్సింలు ఎప్పుడో నిర్ణయించుకోవటం, చెల్లె, బావ కూడా అందుకు సుముఖత వ్యక్త పరచటం జరిగింది. మంగ చామన ఛాయతో పొందికగా ఉంటుంది. మేనత్త కొడుకు రవి ఒడ్డు పొడుగు ఉండి తన ఊర్లోనే గ్రామ పంచాయితీ ఆఫీసులో చిన్న పాటి ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడు. ఇద్దరి ఊర్లకు ఇరవై కిలో మీటర్ల దూరమే.
*****
“అమ్మా మంగా అన్నం వండినవా బిడ్డా” చీకటి పడ్డాక పొలం నుండి తిరిగి వచ్చిన నర్సింలు అడిగాడు.
“లేదు నాయినా, పొయ్యి మీన అచ్చరు పెట్టిన, నువ్వు కాళ్లు మొఖం కడుక్కో, అప్పటికి అయిపోద్ది” భరోసా ఇచ్చినట్టుగా చెప్పింది మంగ.
“పొద్దటి కూర ఉందా బిడ్డా”
“లేదు నాయిన, చింతపండు పచ్చడి ఉంది” అంటుండగానే రాజవ్వ స్టీలు గిన్నెతో వచ్చింది.
“అన్నా, టమాటా ఆలుగడ్డ కలిపి కూర చేసి తెచ్చిన, ఇద్దరు తినుండ్రి” అంటూ గిన్నె కింద పెట్టింది.
రాజవ్వ మంగ దగ్గరికి పోయి “మంగీ మీ నాయినకు గాని శెప్పినవా ఏంది ముచ్చట” అని నెమ్మదిగా అడిగింది.
“లేదత్తా నాయిన ఇప్పుడే అచ్చిండు” అని అంటుండగానే అక్కడికి వచ్చిన నర్సింలు “ఏం ముచ్చట బిడ్డా” అన్నాడు.
“ఏం లేదులే అన్నా, నేను పోతున్న, నిమ్మళంగ తినురి” అంటూ వెళ్లి పోయింది రాజవ్వ.
“ఏంది బిడ్డా రాజవ్వత్త ఏందో ముచ్చట అంటాంది”
“ముందగాల నువ్వైతే అన్నం తిను” అన్నది మంగ.
మంగ వడ్డించిన అన్నం రాజవ్వ తెచ్చిన కూరతో తిని నర్సింలు చెయ్యి కడుక్కున్నాడు. మంగ కూడా ప్లేట్లో అన్నం వడ్డించుకొని తినటం ముగించింది.
“మంగీ నువ్వు, రాజవ్వత్త ఏదో ముచ్చట అనుకోబడ్తిరి, ఏంది బిడ్డా గది” అడిగాడు నర్సింలు.
“పొలం కాడి నుండి వస్తాంటే ఉప సర్పంచ్ శంకరి గాడు అడ్డం తిరిగిండు నాయినా , నా చెయ్యి పట్టుకొని గుంజితే నేను కింద పడ్డ, ఆడ్ని వదిలించుకొని వస్తాంటే ఎవళ్లకైన చెప్తే సంపేస్తనని బెదిరించిండు. నాకు మస్తు భయమైంది.” చెప్పింది మంగ.
“ఆనికి పోయే కాలం వచ్చింది, తిరుపతయ్య బిడ్డ రాణిని కూడ గిట్లనే చేసిండంట నెల రోజుల కింద. రేపు సర్పంచి శోభ కాడికి ఆన్ని పిలిపిత్త. పెద్ద మనుషులల్ల పంచాతి పెట్టిత్త” అంటూ నులక మంచం మీద నడుం వాల్చాడు నర్సింలు.
*****
మరుసటి రోజు పదకొండు గంటలకు సర్పంచ్ శోభ ఉప సర్పంచ్ శంకర్ ను పంచాయితీకి పిలిపించింది. వార్డ్ మెంబర్ కనకా చారి, మండల ప్రాదేశిక సభ్యుడు రాములు, నర్సింలు, మంగ, ఇంకా కొంత మంది ఊరి జనం హాజరయ్యారు. మంగ తనపై శంకర్ చేసిన అత్యాచార యత్నం గురించి అందరి సమక్షంలో చెప్పింది. శోభ, కనకాచారి, రాములు తనపై మంగ చేసిన ఆరోపణకు సమాధానం చెప్పాల్సిందిగా శంకర్ ను ప్రశ్నించారు.
ఆవేశంతో రెచ్చిపోయిన శంకర్ కూర్చున్న వాడల్లా అమాంతం లేచి “నేను తప్పు చేయలేదు, నన్ను పంచాతీకి పిలిచి నా మీద జూటా ఆరోపణ చేసినందుకు ఉల్టా నాకే పది లక్షల రూపాయలు నష్ట పరిహారం కింద ఇయ్యాలని కోర్టులో కేసు ఏస్తా” అంటూ విసరుగా బయటకు వెళ్ళిపోయాడు. అతన్ని ఆపడానికి కనకాచారి, రాములు చేసిన ప్రయత్నం ఫలించలేదు.
“తప్పు చేసినోడు ఒప్పుకోకుంట ఎల్లిపోయిండు. పెద్ద మనుషులు మీరేం తీర్మానం శేస్తరో శెప్పండి” అంటూ నర్సింలు సర్పంచ్ శోభ వైపు చూస్తూ అడిగాడు.
“నర్సిములన్నా, అసలు మనిషి లేకుండ ఏమి తీర్మానం అయితది నువ్వే చెప్పు. మేమేదన్న చెప్పాలన్న శంకర్ ఉండాలే కదా.”అన్నాడు రాములు.
“నువ్వన్నది నిజమే రాములు, మంచో చెడో చెప్పాలి మనం. సర్పంచమ్మా నువ్వే ఆలోచన చెయ్యి” పంచాయితీ అయిపోయిందన్నట్టు లేచి నిల బడి అన్నాడు కనకాచారి.
“ఆడపిల్లకు అన్యాయం జరిగితే ఊరుకుంటే మళ్లీ మళ్లీ జరగదని నమ్మకమేంది. నర్సింలూ, నువ్వు, నీ బిడ్డ పోలీసు స్టేషనుకు పొయ్యి దరఖాస్తు ఇయ్యుండ్రి, వాండ్లే తేలుస్తరు” అంటూ శోభ కూడా లేచి నిలబడింది.
“దరఖాస్తు ఇస్తం, కానీ శంకరి సంపుత అని బెదిరించిండు. మా పాణానికి ఆని దిక్కెల్లి ఆపతి ఉంది” నర్సింలు సందేహం వెలిబుచ్చాడు.
“మన జిల్లా కలెక్టరుకు, ఎస్పీకి కూడా ఒక దరఖాస్తు ఇయ్యి” సలహా ఇచ్చింది శోభ.
అదే రోజు నర్సింలు, మంగ పోలీసు స్టేషన్లో రాత పూర్వక ఫిర్యాదు ఇచ్చారు. అదే విధంగా కలెక్టరుకు, ఎస్పీకి సంఘటన వివరాలు తెలియజేస్తూ శంకర్ నుండి ప్రాణభయం ఉందంటూ దరఖాస్తు కూడా ఇచ్చారు. పోలీసు వారు వెంటనే ప్రతి స్పందించి శంకర్ పై అత్యాచార యత్నం కేసు నమోదు చేశారు.
*******
మరుసటి రోజు పొద్దున్నే విషయం తెలిసిన నర్సింలు చెల్లెలు మణి, బావ వెంకటి మోటార్ సైకిల్ మీద నర్సింలు ఇంటికి వచ్చారు. “అన్నా, మేము ఇన్న ముచ్చట నిజమేనా?” అడిగింది మణి.
“అవును, నిన్న పొలం కాడి నుండి మంగ ఒక్కతి వత్తాంటే శంకరిగాడు అడ్డం తిరిగి శెయ్యి పట్టుకొని గుంజి మనువాడత నన్నడంట. ఆన్ని తోసేసి ఏడ్సుకుంట ఇంటికి వచ్చింది” జవాబిచ్చాడు నర్సింలు.
“నా కొడుకు రవి తోటి దాని లగ్గమని మనం దాని శిన్నప్పుడే అనుకుంటిమి. నాలుగొద్దులు ఉండే పదవిని సూస్కొని శంకరి గానికి మాయరోగం పుట్టింది.” రెండు చేతులను నొక్కుకుంటూ అన్నది మణి.
అంతలోనే శంకర్ నర్సింలు ఇంటికి వచ్చి “ఒసేయ్ మంగా, పోలీసోళ్లకు ఫిర్యాదు చేసినవని తెల్సింది. నేను భయపడేటోన్ని కాను. నిన్ను, మీ నాయన్ను లేపేస్త” అంటూ పెద్దగా అరుస్తూ బెదిరించాడు.
“శంకర్, ఇది మంచి పద్దతి కాదు. తప్పు చేస్తవు ఉల్టా మమ్మల్నే బెదిరిస్తవా.” జోక్యం చేసుకున్నాడు నర్సింలు.
“నిన్ను మామ అని పిలుస్త కదా మరి నీ బిడ్డ నాకు వరుస అయితది. నా మీద దరఖాస్తు ఇయ్యనీకి నేను చేసిన దాంట్లో తప్పేముంది” ప్రశ్నించాడు శంకర్.
“శంకర్, నీకు పెండ్లి అయింది. బిడ్డ ఉంది. ఇప్పుడు ఇట్ల మాట్లాడటం నీకు మంచిగుండది, ఎల్లిపో” జవాబిచ్చాడు నర్సింలు.
“పోలీసోళ్లు గాని నా కాడికి రావాలి అప్పుడు మిమ్మల్ని ఎవరినీ వదిలి పెట్టేది లేదు. అయినా ఉపసర్పంచ్ ను నేను, నన్ను అరెస్ట్ చేసే దమ్ము ధైర్యం వాండ్లకు లేదు, అదంతా పోనీ, కేసు వాపసు తీసుకుంటరా లేదా, ఆ ముచ్చట చెప్పు” అన్నాడు శంకర్.
“కేసు వాపసు తీసుకోనీకి నేను గాజులేసుకొని లేను, ఎట్ల అయ్యేదుంటే గట్ల అయితది” అని నర్సింలు అనటంతో “నువ్వన్న మాటకే కట్టుబడి ఉన్నవన్న మాట. నేను చూస్త ఏమైద్దో” అంటూ విసురుగా వెళ్లి పోయాడు శంకర్.
****
నర్సింలు, మంగ ఇచ్చిన దరఖాస్తు నమోదు చేసిన సబ్ ఇన్ స్పెక్టర్ తన సిబ్బందితో గ్రామానికి వచ్చి సాక్షులను విచారించి, నేరస్థల నమూనా గుర్తింపు తీసుకొని, శంకర్ ఇంటికి వెళ్ళాడు. కేసు నమోదు చేసిన విషయం చెప్పి తనను అరెస్ట్ చేయటానికి వచ్చినట్టుగా చెప్పాడు.
“సబ్ ఇన్ స్పెక్టర్ గారూ, జూటా కేసు పెడితే అరెస్ట్ చేస్తర, నేను ఉప సర్పంచ్ ను, నేను లేకుంటే గ్రామంలో పనులు ఆగి పోతయి. నన్ను అరెస్ట్ చెయ్యనీకి కలెక్టరు కాడ మీరు అనుమతి తీసుకున్నరా” మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ ప్రశ్నించాడు శంకర్. అతని మనసులో మాత్రం ఓ పక్క భయం, ఆందోళన కలుగుతుంది.
“సాక్షులను విచారించి నిర్దారణకు వచ్చాను. ఈ కేసులో నిన్ను అరెస్ట్ చేయటానికి నాకు ఎవరి పర్మిషన్ అక్కర లేదు. అరెస్ట్ చేశాక ఏమైతదో నువ్వే చూద్దుగాని.” సమాధానం చెప్తూనే శంకర్ ను కస్టడీలోకి తీసుకున్నాడు సబ్ ఇన్ స్పెక్టర్. మరుసటి రోజు అతడ్ని కోర్టు ముందు ప్రవేశ పెట్టడంతో పద్నాలుగు రోజుల కస్టడీ విధించింది కోర్టు.
సబ్ ఇన్ స్పెక్టర్ అదే రోజు శంకర్ అరెస్టు, తదుపరి కోర్టు విధించిన కస్టడీ విషయం తెలియపరుస్తూ జిల్లా కలెక్టరుకు, ఎస్పీకి నివేదిక పంపటం జరిగింది. ఆ నివేదిక ఆధారంగా జిల్లా కలెక్టరు సర్పంచ్ శోభ నుండి కేసుకు సంబంధించిన పూర్వా పరాలపై వేరొక నివేదిక తెప్పించుకొని శంకర్ ను ఉప సర్పంచ్ పదవి నుండి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఉత్తర్వులను జైలు అధికారుల ద్వారా శంకర్ కు అందచేయటం కూడా జరిగింది.
******
నెల రోజుల జైలు జీవితం పిదప శంకర్ బెయిలుపై విడుదలయ్యాడు. భార్య లతను పుట్టింటి నుండి తెచ్చుకోవాలన్న అతని ప్రయత్నం ఫలించలేదు. అత్త, మామలు తమ ఇంటి గడప తొక్కనీయలేదు. బయటి నుండే వెళ్ల గొట్టారు. ఎంత బ్రతిమిలాడినా తన మూడు సంవత్సరాల కూతురును చూడటానికి కూడా ఒప్పుకోలేదు. తనను గృహ హింస, శారీరక, మానసిక వేధింపులకు గురి చేయటమే కాకుండా మంగ కూడా అత్యాచార ఆరోపణ చేస్తూ కేసు వేసింది కాబట్టి కాపురానికి రానని భార్య నిక్కచ్చిగా చెప్పింది. ఊర్లో ఈ విషయం అందరికీ తెలిసింది. నెలలు గడుస్తున్నాయి. ఉప సర్పంచ్ గా ఒక వెలుగు వెలిగి భవిష్యత్తులో సర్పంచ్, వీలైతే ఎమ్మెల్యేగా పోటీ చెయ్యాలనే ఆశతో ఉన్న తనను ఇప్పుడు గ్రామస్తులు ఎవరూ లెక్క చేయట్లేదు. ఎవరినైనా పలకరిస్తే మౌనంగా తప్పుకుంటున్నారు. తన పొలం పనులకు కూడా వెళ్లొద్దని కూలి వాండ్లు తీర్మానించు కున్నారు. ఒక విధంగా చెప్పాలంటే తాను సామాజిక బహిష్కరణ చేయబడ్డాడు. పొలంలో పండిన పంట చేతికి అందలేదు. వేరే ఆదాయం లేదు. పైరవీల కొరకు జనం దగ్గర తీసుకున్న డబ్బులు పనులు కాక పోవటంతో ఒత్తిడి పెరిగింది. బాగా బతికిన రోజుల్లో మందు మత్తులో తేలిన తను ఇప్పుడు మందుకు డబ్బులు లేక, అప్పిచ్చే నాథుడు లేక సతమతమై పోతున్నాడు. జీవితం రెంటికీ చెడ్డ రేవడి అయింది. ఒంటరి జీవితం దుర్భర మనిపిస్తుంది. అచ్చోసిన ఆంబోతు లాగా తిరిగిన ఊర్లో ప్రస్తుతం ఎవరినీ ఎదిరించ లేని పరిస్థితి. నర్సింలు, మంగ పెట్టిన కేసులో నెల రోజుల విచారణ ఖైదీగా అనుభవించిన జైలు జీవితం పదే పదే గుర్తొస్తుంది. ఇక శిక్ష పడితే జైలు జీవితం ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా చూడటమే కాకుండా ఇతర ఖైదీల మనో వేదన ద్వారా విన్నాడు.
****
కాలాన్ని ఎవరూ ఆపలేరు. పగలూ రాత్రి గడచి పోతున్నాయి. శంకర్ బాగా బక్క చిక్కి పోయాడు. కోర్టులో కేసు తుది అంకానికి చేరుకుంది. మంగ, నర్సింలు, రాజవ్వ, శోభ, కనకా చారి, రాములు, మణి, వెంకటి ఇంకా కొంత మంది సాక్షులను విచారించారు. ప్రతి ఒక్కరూ శంకర్ కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ సుందర్ కనీసం ఐదేళ్లకు తగ్గకుండా శిక్ష విధించాలన్న వాదన ముందు శంకర్ నియమించుకున్న న్యాయవాది వెల వెల పోయాడు. తీర్పు వెలువరించే తేదీ ప్రకటించింది కోర్టు. తీర్పు తెలుసుకోవాలనే ఆసక్తితో కోర్టుకు నర్సింలు, మంగ మాత్రమే కాకుండా శంకర్ భార్య లత కూడా వచ్చింది. పలకరిస్తే బాగానే మాట్లాడింది. శంకర్ మనసంతా ఉద్విగ్నంగా, ఆందోళనతో ఉంది. కొన్నాళ్లుగా అతని హృదయం పశ్చాత్తాప పడుతుంది. అదే విషయం భార్యకు చెప్పాడు. కూతుర్ని ఎత్తుకున్నాడు. అతడు వేసుకున్న మాసిన దుస్తుల తీరు, మాటల్లోని ఆవేదనకు లత హృదయం ద్రవించింది. కళ్ళల్లో నీళ్ళు సుడులు తిరిగాయి. ఎంతైనా హిందూ ధర్మ పత్ని కదా. ఇన్నాళ్ల విడతీత ఆమెను కూడా కుంగ దీసింది.
“లతా నాకు శిక్ష పడి జైలుకు పోతే మన బిడ్డను జాగ్రత్తగా చూసుకో” అనునయంగా చెప్పాడు భార్యతో. లత ఏమి సమాధానం చెప్పకుండా కళ్ళు తుడుచుకుంటూ తల అడ్డంగా తిప్పింది. కేసు పిలుస్తున్న కోర్టు అటెండర్ కూత వినిపించింది. శంకర్, అతని న్యాయవాది కోర్టు హాలులోకి వెళ్లారు. వెనుకే లత తన కూతురుతో లోనకు వెళ్లింది. ఆ వెనుకే మంగ, నర్సింలు కూడా వెళ్లారు. న్యాయమూర్తి కేసు రుజువైనట్లు తీర్పు సారాంశం చెప్పి, విధించబోయే శిక్ష గురించి ఏమైనా చెప్పుకుంటావా అని ప్రశ్నించాడు. బోరుమని ఏడ్చాడు శంకర్. నోటి నుండి మాట పెగల్లేదు. అవకాశం తీసుకున్న అతని భార్య మాత్రం శంకర్ లో పశ్చాత్తాపం ఉందని, క్షమించమని వణకుతున్న గొంతుతో న్యాయమూర్తికి చెప్పింది. లతను చూసిన మంగ ధైర్యం తెచ్చుకొని శంకర్ లో బాగా మార్పు వచ్చిందని, గత కొంత కాలంగా భార్యాబిడ్డలు ఎడ బాటుగా ఉంటున్నారని, మారిన మనస్తత్వాన్ని దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకొమ్మని ప్రాధేయ పడుతూ భయం భయంగా తనదైన ధోరణిలో చెప్పింది. మంగ ఉదారతను న్యాయమూర్తి ప్రశంసించారు. పశ్చాత్తాపాన్ని మించిన శిక్ష లేదని, లత, మంగల విజ్ఞాపనలు, శంకర్ కూతురు భవిష్యత్తు దృష్ట్యా ఐదు సంవత్సరాలు వేయాల్సిన శిక్షకు బదులుగా ఆరు నెలల సాధారణ శిక్ష మాత్రమే విధిస్తున్నట్లు న్యాయమూర్తి తీర్పు చెప్పారు. అడుగకున్నా కల్పించుకొని మంగ కోర్టుకు చేసిన విన్నపం శంకర్ గుండెల్లో బాగా నాటుకుంది. కోర్టు హాలు నుండి బయటకు వచ్చిన శంకర్ అమాంతం మంగ కాళ్ల మీద పడ బోయాడు. “వద్దన్నా, నువు పెద్దోనివి, నా కాళ్ల మీద పడితే నాకు ఆయుస్సు తగ్గుద్ది” అంటూ పక్కకు జరిగింది. పోలీసు అధికారులు కళ్ల నీళ్ల పర్యంతమైన శంకర్ ను జీపు ఎక్కించుకొని ఆరు నెలల శిక్ష అమలుకు తీసుక పోయారు.
మెల్లగా అడుగులో అడుగేసుకుంటూ గణేష్ అయ్యర్ గారి క్యాబిన్ లోకి అడుగు పెట్టాడు సురేంద్ర.
ఇరవై ఏడు సంవత్సరాలకే పి.హెచ్ డి పూర్తి చేసి జి.ఎం గా కొత్తగా జాయిన్ అయిన గణేష్ అయ్యర్ కూల్ గా సీట్లో కూర్చుని ఫైల్ ఏదో పరిశీలించే పనిలో ఉండగా..
“Come in ..Surendra..” అంటూ కూర్చోమన్నట్లుగా చేయి చూపాడు.
అతడు ఆ ఫ్యాక్టరీలో సూపర్వైజర్ గా జాయిన్ అయ్యాడు.
చేరిన నాటి నుండి గణేష్ అయ్యర్ గారి దగ్గరే వర్క్ చేస్తున్నాడు.
మనస్సులో తన ఇష్ట దైవాన్ని ప్రార్థిస్తూ కూర్చున్నాడు సురేంద్ర.
సి.ఎన్.సి మిషనింగ్ (Computer numerical control machining ) డిపార్ట్మెంట్ లో సూపర్వైజర్ గా పనిచేస్తున్న సురేంద్ర అంటే గణేష్ అయ్యర్ కి ఎంతో ఇష్టం.
పని ఎంతో నిబద్ధతగా ,దీక్షగా చేసే సురేంద్ర ని అందరూ అభిమానిస్తారు.
జీవితం లో కొన్ని సందర్భాల్లో ఎవరమైనా అంతే !
పెద్దవాళ్ల ముందు వినయంగా వుంటాం.
వాళ్లు మాట్లాడే వరకు మనమేమీ మాట్లాడకుండా వారి స్పందన కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుంటాం.
మనకంటే వయసులో పెద్దవారు..పదవిలో ఉన్నతస్థాయిలో ఉన్నప్పుడు
వారు మన పట్ల చూపే ఆప్యాయత అణువంతైనా అదే కొండంత గా భావిస్తూ ..
వారు మన కి అండగా వున్నారన్న ధైర్యంతో జీవితంలో సంబరంగా సాగిపోతుంటాము.
తడబడుతూనే అడిగాడు సురేంద్ర..
కొద్ది సమయం నిశ్శబ్దంగా వున్న అయ్యర్..
“”అరే ! రెండు నెలల వరకు అయితే నా దగ్గర ఉన్నాయి!
సారీ సురేంద్ర !
మారు మాట్లాడకుండా మౌనంగా వచ్చి తన సీట్లో కూర్చున్నాడు సురేంద్ర .
అతను అలా సీట్లో కూచున్నాడో లేదో..
అతడి రాక కోసం నిరీక్షిస్తున్న శ్రవణ్ వచ్చి ..
“సార్! మిషన్ టూల్ బ్రేక్ అయ్యింది. మీరు వస్తే ఇద్దరం కలిసి టూల్ మారుద్దాం!” అన్నాడు.
టూల్ విరిగింది అన్న మాట వినడంతోనే కోపం వచ్చింది సురేంద్రకి .
మిషన్ టూల్ విరిగింది అంటూ ఆపరేటర్ శ్రవణ్ రావడం అతడికి విపరీతమైన కోపం రావడానికి కారణం అయ్యింది.
ఎందుకో తమాయించుకున్నాడు.
ఏమనుకున్నాడో శ్రవణ్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు.
సురేంద్ర మనసంతా ఆందోళనగా ఉంది.
“సురేంద్ర సార్! మిమ్మల్నోసారి గణేష్ అయ్యర్ సార్ రమ్మంటున్నారు..” అన్నాడు అటెండర్ మస్తానయ్య.
“లంచ్ చేశాక సార్ ని కలుస్తాను లే !” అన్నాడు.
ఇరవై రెండేళ్ల సురేంద్ర డిప్లమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ చదువు కున్నాడు.
ఇంటర్మీడియట్ చేశాక..
అప్పటికి ఇంకా సెల్ ఫోన్లు మార్కెట్లోకి విరివిగా రాలేదు.
తండ్రి వెంటనే బయలుదేరి రమ్మంటూ ఫ్యాక్టరీ ల్యాండ్ లైన్ కి ఫోన్ చేసి చెప్పడంతో రెండు రోజుల క్రితం ఇంటికి హుటాహుటిన బయలుదేరి వెళ్ళాడు.
లంచ్ రూమ్ లో ఒంటరిగా కూర్చున్న అతడి కళ్ళ ముందు రెండు రోజుల క్రితం జరిగిన సంఘటనలు ఒక్కోటిగా గుర్తుకు రాసాగాయి .
నటరాజ్ థియేటర్ కి దగ్గరలో వున్న “ఆదిత్య హాస్పిటల్” కి చేరుకున్నాడు.
నల్గొండ లో పాలిటెక్నిక్ చదువుకున్న అతడికి ఆ ఊరిలోని ప్రతి గల్లీ సుపరిచితమే.
సురేంద్ర కి ఒక తమ్ముడు,చెల్లి ఉన్నారు.
తమ్ముడు ఇంటర్మీడియట్ పూర్తిచేసి డిగ్రీ లో ఇటీవలే చేరాడు.
చెల్లి ఇప్పుడు పదో తరగతి.
నువ్వు ఉద్యోగం చేస్తున్నావు కదా.. ఇంత కాలం నువ్వు దాచింది ఇదేనా..
ఆయన ఫేస్ ఫీలింగ్ అది అన్నట్టుగా అర్థం అయ్యింది అతడికి .
ఉద్యోగంలో చేరాక వస్తున్న జీతం..అతడి జల్సాలకు ,సినిమాలు ,షికార్ల కి ఖర్చవసాగాయి.
తన ఫ్రెండ్స్ ని సాయం చేయమని అడిగాడు.
వాళ్ళు తమ వద్ద అంత డబ్బులు లేవని చేతులు ఎత్తేశారు.
ఆదాయం నామమాత్రంగానే వుంది.” అన్నాడు రాఘవరావు కొడుకు ని ఉద్దేశించి.
మరుసటి రోజు ఉదయం నల్గొండ బస్ స్టాప్ కి తెల్లవారుజామున నాలుగున్నరకు చేరుకున్నారు తండ్రి కొడుకులు.
తన నిస్సహాయ స్థితి ని తలచుకుని తనలో తనే బాధ పడ్డాడు.
కానీ జీవితం పరీక్ష లు పెట్టి పాఠాలు నేర్పుతుంది.”
తగిన సూచనలు,సలహాలు ఇచ్చి సందేహ నివృత్తి చేస్తారు.
మనం ఎదుర్కున్న కష్టం..
మనం అనుభవించే బాధ ..
మనని వెంటాడుతున్న అవమానం
మన స్థితి మన కే ఇబ్బందికరంగా అనిపించినా ..
వెనకడుగు వేయొద్దు ..సవాళ్లను ఎదుర్కోవడమే జీవితం అనిపించేలా చేస్తాయి !
లంచ్ రూం దగ్గర వున్న అద్దం ముందు నిలబడ్డాడు.
కళ్ళని కమ్మేసిన సన్నని కన్నీటి పొర ని కర్చీఫ్ పెట్టి తుడిచాడు.
చల్లని నీరు మొహాన్ని తాకగానే హాయిగా అనిపించింది.
భోజనం చేయాలని అనిపించకపోయినా ..ఏదో కాస్త తిన్నాడు.
దూరంగా ఉన్న ఆంజనేయ స్వామి పటం ఏదో సందేశాన్ని అందిస్తున్నట్లు గా అనిపించడంతో పెదవులపై చిరునవ్వు కదిలింది.
ఆ కష్టాన్ని చేదించి గెలిచే మార్గాన్ని సూచించమని !
“చెప్పండి సార్”
“నువ్వు మన ఆఫీస్ లో చేరి సంవత్సరం పూర్తయింది.
అంటే నీకు ముప్పై వేల వరకు లోన్ వస్తుంది.వెంటనే అప్లై చేయి రేపే మనీ ఇస్తారు.
రెండు చేతులెత్తి తననే మొక్కుతున్న భక్తుడు సురేంద్ర వైపు !
రచన : గొర్రెపాటి శ్రీను ( హైదరాబాద్) 9652832290
“ ఏంటి అను ? ఎంత చెప్పినా వినవు. నీ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నావు. “ ఎంతో అనునయంగా చెప్పాడు ఛార్లెస్.
“ ఏంటి భవిష్యత్తు, భవిష్యత్తు అంటున్నావు? నీ భవిష్యత్తు నా భవిష్యత్తు ఒక్కటే. పదేపదే ఎందుకు అలా మాట్లాడుతున్నావు చారు ? “ అంది అనసూయ ఛార్లెస్ నోటిలో నుంచి కారుతున్న సొంగను
గుడ్డతో తుడుస్తూ.
“ లేదు అను. నా మాట విను. నీ వయస్సు నిండా పాతిక కూడా లేదు. మనం కలిసివుంది కేవలం మూడు సంవత్సరాలు. మన అదృష్టం కొద్ది పిల్లలు కూడా లేరు. ఇక సంవత్సరం కంటే ఎక్కువ కాలం నేను బ్రతకనని , బ్రతికినా పసి పిల్లాడిలా బ్రతకాలని డాక్టర్లందరూ కరాఖండిగా చెప్పేశారు కదా. ఇంకా నాకు ఊడిగం చేస్తూ నీ జీవితాన్ని పాడు చేసుకోమాకు. నేను చెప్పేది విను. “ ఆయాసంగా ముద్దముద్దగా మాట్లాడు తున్నాడు ఛార్లెస్.
“ చాల్లే చారు. ఇంకా మాట్లాడాకు. నీకు ఏమీ కాదు. నా ప్రేమతో నిన్ను బ్రతికించుకుంటాను. వైద్యం చేయలేని పనులెన్నో ప్రేమ చేస్తుంది. నువ్వు నాకు ఈ మూడు సంవత్సరాలలో ఇచ్చిన ప్రేమ నాకీ జన్మకు చాలు. నిన్ను నా బిడ్డలా జీవితాంతం సాకుతాను. నా గత జీవితం గురించి నీకు తెలుసు కదా! అనవసరంగా మనస్సు పాడు చేసుకోమాకు. ఏమీ కాదు. నీకు నేనున్నాను. నాకు నువ్వు తోడుంటావు. కాసేపు నిద్రపో !“
ఛార్లెసి అయిష్టంగానే కళ్ళు మూసుకున్నాడు. ఇంతలో నర్స్ వచ్చి డాక్టర్ గారు రమ్మంటున్నారని చెప్పింది. అనసూయ ఛార్లెస్ కు దుప్పటి కప్పి, డాక్టరును కలవటానికి వెళ్ళింది.
“ సర్ ! మే ఐ కమిన్? “ డాక్టర్ ఛాంబర్ డోర్ తట్టి అడిగింది.
“ ఎస్ . ప్లీజ్ కమిన్. కూర్చోండి. చూడండి అనసూయగారు ! మీరు ఇక్కడకొచ్చి రెండు నెలలై పోయింది. మీ కంపెనీ వారు ఇక ఇన్స్యూరెన్స్ ఇవ్వురట. అంతే కాదు. ఇంకా కొత్తగా ఛార్లెస్ కు చేయవలసిన ట్రీట్ మెంట్ కూడా ఏమీ లేదు. ప్రముఖ న్యూరాజిస్ట్ డాక్టర్ పరమేశ్వరన్ గారి అభిప్రాయం కూడా తీసు కున్నాము. వారు చెప్పిందేమంటే, ఛార్లెస్ వెన్నెముకలో లింక్ పోయింది. ఆపరేషన్ ద్వారా సరిచేసే ప్రయత్నం చేస్తే, అసలు ప్రాణానికే ముప్పు. ప్రపంచంలో ఎక్కడా ఇప్పుడు దీనికి చికిత్స లేదు. అందుకని మీరు ఇంటికి తీసుకు వెళ్ళండి. మేము రాసిచ్చే మందులు జీవితాంతం వాడాలి. ఒక మనిషి నిరంతర కనిపెట్టుకొని వుండాలి. ఏదైనా అత్యసరం అనిపిస్తే ఇదిగో ఈ నెంబరుకు ఫోన్ చేయండి. ఓ.కే. ఈ రోజు డిచార్జ్ చేస్తారు.” అని ఆ కేసుకు సంబంధించిన ఫైల్ ఆమె చేతికి ఇచ్చి, “ ఓకే. ఇక మీరు వెళ్ళ వచ్చు “ అని కాలింగ్ బెల్ కొట్టాడు. వచ్చిన సిస్టరుకు వివరాలు చెప్పి పంపించాడు డాక్టర్.
అనసూయ తల్లిదండ్రిలిద్దరూ సివిల్ సర్వెంట్స్. అమ్మ ఐపిఎస్., నాన్న ఐఏఎస్. ఒకరు ఆంధ్రాలో మరొకరు ఝార్ఖండులో. నెలకు ఒకటి రెండు సార్లు కలుసుకుంటారు. కలుసుకున్నప్పుడు కూడా మనస్సు విప్పి మాట్లాడుకోరు. ఎవరు ఎంత సంపాదించారో ఎలా పొదుపు చేసుకుంటున్నారో, ఏమేమి కొంటున్నారో ఇంకా ఎలా సంపాదించ వచ్చో , ఎలా దాచుకోవచ్చో మాట్లాడుకుంటారు నిసిగ్గుగా, నిర్భయంగా. ఆలు మగలు కాబట్టి శారీరకంగా శరీర వాంఛలు తీర్చుకోటానికి కలుసుకుంటారు. తత్ఫలితంగా అనసూయ పుట్టింది. పాలిచ్చి పెంచింది ఆయ. అమ్మ నాన్నల ప్రేమ అంటే ఏమిటో తెలియదు పాపం. స్కూల్ కు వెళ్ళే వయస్సు రాగానే ఒక మంచి ఇంటర్నేషనల్ స్కూల్లో చేర్పించారు. పొద్దున్నే జిమ్ము, సాయత్రం స్కూల్ అయుపోయాక స్విమ్మింగ్. రోజంతా బిజీబిజి. అమ్మ దగ్గర స్కూల్ రోజుల్లో. స్కూల్ సెలవుల్లో నాన్న దగ్గరకు. ఎక్కడవున్నా ఒక్కటే. ఊరకే గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ లు చెప్పటానికే అమ్మ నాన్నలు. అన్ని పనులు ఆయానే చేసి పెడుతుంది. తనకు ఏది కావాలన్నా ఆయాతో వెళ్ళి కొనుక్కో వచ్చు. ‘ఎందుకు ? ఏమిటి?’ అని అడిగే వాళ్ళు లేరు. గౌహతి ఐఐటీలో ఇంజనీరింగ్ చేసేటప్పుడు ఛార్లెస్ పరిచయమయ్యాడు. క్లాసులో ఇద్దరూ మొదటి రెండు ర్యాంకుల్లో ఉండేవారు. పోటీబడి ఒకరిని మించి ఒకరు మార్కులు తెచ్చుకోవాలనే ప్రయత్నంలో ఒకరికొకరు దగ్గరయ్యారు. మానవ సంబంధాలకు మొఖం వాసిపోయివున్న అనసూయ ఛార్లెస్ కుటుంబాన్ని చూసి మరీ దగ్గరయ్యింది. ఆ కుటుంబంలో డబ్బుకోసం కాక ఒకరి బాగోగులు కోసం మరొకరు చేసే త్యాగాలు అనసూయకు బాగా నచ్చాయి. ఛార్లెస్ స్నేహం అనసూయకు మరో నూతన ప్రపంచాన్ని చూపించింది. జీవితాంతం ఛార్లెస్ తో కలసి బ్రతకాలని నిర్ణయించుకుంది.
అమ్మ నాన్నలకు తన ప్రేమ విషయం చెప్పింది. అందరి తల్లిదండ్రుల్లాగానే కాదుకూడదు అన్నారు. డిగ్రీ పూర్తికాగానే యుఎస్ వెళ్ళి ఎమ్మెస్ చేయాలన్నారు.
“ లేదు. నాకు మైక్రోసాప్ట్ లో మంచి ఆఫర్ వచ్చింది. సెప్టెంబర్ లో నేను జాయినవుతాను. ఛార్లెస్ కూడా జాయినవుతాడు. నెక్స్ట్ మార్చ్ లో పెళ్ళి చేసుకుంటాము. “ తన అభిప్రాయాన్ని చెప్పేసింది. కలెక్టర్ ఎస్పీలిద్దరు ఒకరి మొఖాలొకరు చూసుకున్నారు.
“నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాము?”
“నేను కూడా మీ మీద ఎన్నో ప్రేమలు పెట్టుకున్నాను. మీరెప్పుడైనా నా గురించి ఒక్కటంటే ఒక్క గంట మీ సమయాన్ని ఉపయోగించారా? “
“ అనూ ! ఏమిటా మాటలు? నువ్వింకా చిన్న పిల్లవు కాదు కదా ? నీకు మా ఉద్యోగాలు ఎలాంటివో తెలీదా ? “
“ అవును ఈ దేశంలో మీరిద్దరే గొప్ప ఉద్యోగాలు చేస్తున్నారు. ఉన్న ఒక్కగానొక్క కూతురు ఏం చేస్తుంది? ఏం చదువుతుంది? తనకు అసలేం కావాలి? అని ఎప్పుడైనా తెలుసుకున్నారా?” అనేక సంవత్సరాలుగా తన మనస్సులో రగిలిపోతున్న ప్రశ్నలను సంధించింది.
“ అవన్ని తెలుసుకున్నాం కాబట్టే, మంచి స్కూల్లో, మంచి కాలేజీల్లో చేర్పించాము. “
“ ఔనౌను. మంచి స్కూళ్ళు, మంచి కాలేజీలు. అంతే గానీ, అసలు నా మనస్సులో ఏముందో ఎప్పుడైనా తెలుసుకున్నారా? “ కోపంతో రగిలిపోతూ అడిగింది.
“ నువ్వెప్పుడైనా నా కిది వద్దు, ఇది కావాలి. అని అడిగావా? నువ్వు అడిగింది మేమెప్పుడైనా కాదన్నామా? “ అంతే కోపంగా ప్రశ్నించింది.
“అసలు నేను చెప్పుకోటానికీ, మీరు వినటానికి నాకెప్పుడైనా టైమిచ్చారా? మీరు ఆయాకు చెప్పటం. ఆయ నాకు చెప్పటం. నేను ఆయకు చెప్పిన మాటలు మీదాకా రావు. వచ్చినా పట్టించుకోరు. ఇంట్లో వాళ్ళు ప్రేమించక పోతే, ఆ ప్రేమ బయట దొరికితే, చిన్న పిల్లలైనా, నా లాంటి పెద్ద పిల్లైనా అల్లుకు పోరా ! అతుక్కు పోరా? “
“ ఏంటీ, కవిత్వం చెపుతున్నావా? “
“ నాకు అనిపించింది చెపుతున్నా. ఇది మీకు కవిత్వంలా అనిపించిందా? “
“ ఏ సినిమాలోది ?”
“ నేను సినిమాలు కూడా చూస్తానా ? ఇదేగా నేను అంటున్నది. అసలు నాకేది ఇష్టమో, నేనేమి చేస్తున్నానో మీకు పడితే కదా ?”
ఇంతలో అమ్మ ఫోను మోగింది. అమ్మ తన గదిలోకి వెళ్ళి పోయింది. ఈ సంభాషణంతా విన్నాడో లేదో నాన్న. మౌనంగా ఏదో ఆలోచిస్తూవుండి పోయాడే గానీ, ఒక్క మాటా మాట్లాడ లేదు.
“ అనూ ! “ అంటూ దగ్గరకొచ్చి అను భుజంమీద చెయ్యి వేశాడు. ఇంతలో.. ఈయన గారి ఫోను రింగైంది. తను మరో రూంలో దూరాడు. ఇదే అనుకు ఊహ వచ్చిన దగ్గరనుంచి జరుగుతున్నది, చూస్తున్నది. మరో పది నిమిషల్లో ఎవరి పని మీద వాళ్ళు వెళ్ళి పోయారు. అనసూయ ఏమాత్రం ఆశ్చర్య పోలేదు. తనకిది అలవాటేగా.
డాక్టర్ చెప్పినట్టుగానే ఛార్లెస్ ను డిచార్జ్ చేశారు. ఇంటికి వచ్చారు. అనసూయ మరో మూడు నెలలు తల సెలవు పొడిగించింది. అత్తగారు కోడలికి ఒక కన్న తల్లిలా చెప్పింది.
“ చూడమ్మా ! మా ఛార్లెస్ సంగతి మాకందరికీ బాగా అర్థమైంది. ప్రభువు వాడియందు లేడు. మేమందరం రక్త సంబంధికులము. ఎవరిమో ఒకరము నిరంతరం వాడి బాగోగులు చూచుకుంటాము. నువ్వు చిన్న పిల్లవు. ఛార్లెస్ చెప్పినట్టు చెయ్. ఆ ప్రభువు నిన్ను చల్లగా చూడాలి “, అంటూ అనునయించే ప్రయత్నం చేసింది.
“ అదేంటత్తయ్య మీరు కూడా అలా అంటారు? నా జీవితమంతా ఛార్లెస్సే. మీ కుటుంబంలో నా కెంతో ప్రేమ దొరికింది. ఈ మూడు సంవత్సరాలలో నాకేమైనా పని చెప్పారా మీరు ? ఏదో ఉద్యోగం చేస్తున్నా నని, నా పనులూ మీరే చేసి పెట్టారు. ఇకనైనా నా పనులు ఛార్లెస్ పనులు నన్ను చేసుకోనివ్వండి” , తన నిశ్చితాభిప్రాయం చెప్పింది అనసూయ.
“ చూడు అను. ఛార్లెస్ గానీ, నేను గాని ఎందుకు చెపుతున్నామో అర్థం చేసుకో. నీ మంచి….”
ఇంకా ఏదో చెప్పబోతుండగ,
“ చూడండి అత్తయ్య . ఇక మీరు ఏమీ చెప్పవద్దు. ఛార్లెస్ మీకెంతో నాకూ అంతే. నా కన్న బిడ్డా సాకుకుంటా. ఈ జన్మకిది చాలు. దయచేసి ఇంకెప్పుడూ ఇలాంటి మాటలు మాట్లాడకండి. “
ఈ సంభాషణ తరువాత ఆ కుటుంబంలో ఎవరూ అనుసూయను అనునయించే ప్రయత్నం చేయలేదు. ఛార్లెస్ ఒకటి రెండు సార్లు చెప్పబోయే ప్రయత్నం చేసినా, కాస్తా కటువుగానే తిరస్కరించి హెచ్చరించింది. అంతటితో ఆ కథ ముగిసింది.
మూడు నెలల్లో ఛార్లెస్ కొంత కోలుకున్నాడు. అంటే భార్యా సహాయంతో బాత్ రూంకు వెళ్ళడం, మొఖం కడుక్కోవటం, వాలు కుర్చీలో కూర్చోని తినటం, టీవీ చూడటం.
సెలవులు అయిపోగానే ఉద్యోగంలో చేరింది. అది కూడా ఛార్లెస్ బలవంతం చేస్తే. కుటుంబంలో అందరూ ఉద్యోగస్తులే. ఆర్థిక సమస్యలేమీ లేవు. కానీ తామిద్దరూ కూర్చుని తినటం బాగుండదని, అన్నదమ్ములు, వదిన మరదళ్ళు ఎంత చెప్పినా వినకుండా అనుసూయను ఉద్యోగానికి పంపించాడు. ఇక పగలంతా బోరు కొట్టకుండావుండటానికి తనెప్పుడో వదిలేసిన రచనా వ్యాసంగాన్ని ప్రారంభించాడు. తానా వారికి ఒక కథానికను పోటికి పంపించాడు ‘అనుశ్రీ’ అనే కలం పేరుతో. ఆ కథకు ప్రథమ బహుమతి వచ్చింది, పాతిక వేలు డబ్బూ వచ్చింది. ఆ ఉత్సాహంతో అనేక పత్రికలకు కథలు పంపించాడు. ఆరు నెలల్లో ఇరవై కథలు రాశాడు. ఐదింటికి ప్రథమ బహుమతులు, మరో నాలుగు కథలకు ద్వితీయ బహుమతులు వచ్చాయి. ఉభయ తెలుగు రాష్ట్రాలలోనే కాదు, అమెరికా వరకు అనుశ్రీ పేరు మారుమ్రోగింది. వర్థమాన కథా రచయితగా విమర్శకులు ఆయన శైలిని , కథాకథనాన్ని మెచ్చుకుంటూ పత్రికల్లో అనేక వ్యాసాలు రాశారు.
బహుమతులు అందుకోటానికి ప్రత్యక్షంగా తను వెళ్ళక పోవటం కూడా అతనికి మంచిదే అయింది. అనేక మంది విమర్శకులు ‘ అనుశ్రీ బహుమతులకోసం, పేరు కోసం తన కలాన్ని తాకట్టు పెట్టడ’ని పొగిడారు.
కరోనా మహమ్మారి ఫలితంగా ఛిద్రమైన వలస బ్రతుకుల మీద రాసిన మొదటి నవల ‘చతుర ‘ మాస పత్రికలో ప్రచురించబడింది. అదో సంచలనం సృష్టించింది. తెలుగు రాష్ట్రలలోని అనేక సాహితీ సంస్థలు ఆ నవలకు బహుమతులు ప్రకటించాయి. తెలుగు విశ్వవిద్యాలయం వారు నవలా విభాగంలో ఉత్తమ రచనగా గుర్తించి, అవార్డు ప్రకటించారు. ఆ అవార్డు తీసుకోటానికి హైదరాబాద్ రావలసిందిగా ఆహ్వానం అందింది. ఛార్లెస్ ఆరోగ్య పరిస్థితి గురించి యూనిర్సీటీ వారికి అనసూయ వివరించింది. ఇది మరో సంచలనమైంది. ‘మడత కుర్చీకే పరిమితమైన మహా రచయిత అనుశ్రీ స్టీఫెన్ విలియం హాకింగ్’ అంటూ పత్రికలు, టీవీలు కథనాల్ని ప్రచురించాయి, ప్రసారం చేశాయి. కొన్ని ఛానల్స్ ఇంటర్వ్యూలు చేశాయి.
సమకాలీన సామాజిక సమస్యలపై తన పరిశీలన, పరిష్కారాలు సూచిస్తూ చేసిన రచనలు పాఠకుల్ని చైతన్య పరిచాయి. కథైనా, నవలైనా, వ్యాసమైనా , కవితైనా, పాటైనా అనుశ్రీ కలం నుండి అక్షరాలు చైతన్యమై ఆబాలగోపాలాన్ని మేల్కొలుపుతాయి. రెండు నవలల సినిమాలుగా వచ్చాయి. అందులో ఒక సినిమా కథకు ఉత్తమ సినీరచనా పురస్కారం లభించింది.
అనుశ్రీ రచయిత ప్రతి విజయం వెనక అనసూయ పాత్రవుందని తెలుగు సమాజం మొత్తానికి తెలిసిపోయింది. అనసూయ , ఛార్లెస్ జీవితమే ఒక కథగా సినిమా తీయటానికి ఎంతో మంది నిర్మాతలు ముందుకు వచ్చారు. అనసూయ ఆత్మ కథ ఆధునిక సమాజానికి ఒక దిక్సూచి అయింది.
పచ్చని ప్రకృతి పులకించి నాట్యమాడినట్టుగా కనిపిస్తున్న పాఠశాల ఆవరణంతా శోభాయమానంగా కనపడుతుంది. ఆరేళ్ళుగా శ్రమించి పెంచిన పూలవనంపై రంగు రంగుల సీతాకోకచిలుకలు సయ్యాటలాడుతున్నాయి.,తాను వచ్చేనాటికి పదుల సంఖ్యలో ఉన్న మొక్కలు నాలుగు వందలకు చేరి చిట్టడవిని తలపిస్తుంటే,ఆ చెట్టుకొమ్మలపై వాలి కిలకిల రావాలను వినిపిస్తున్న రకరకాల పక్షులను చూస్తుంటే, ప్రధానోపాధ్యాయులు భరత్ మనసు పరవశించి పోతున్నది.పర్యవేక్షణలో భాగంగా ప్రతి గదిని పరికిస్తూ,విద్యార్థుల అభ్యున్నతిని పరిశీలిస్తూ,ఉపాధ్యాయులకు తగిన సూచనలిస్తూ ముందుకు కదులుతున్న భరత్ దృష్టి ఒకచోట ఆగిపోయింది.
డిజిటల్ తరగతిగదిలో అందరూ శ్రద్ధగా పాఠం వింటుండగా ,రమ్య అనే అమ్మాయి కళ్ళు మాత్రం ఆపకుండా కన్నీరు కారుస్తున్నాయి.ఆ అమ్మాయిని హృదయానికి హత్తుకొని ఓదారుస్తున్న ఉపాధ్యాయిని కనపడింది. వెంటనే హెచ్.ఎమ్.భరత్ మిగతా పిల్లల దృష్టి మళ్ళకుండా ఉండడానికి నెమ్మదిగా వెనుకనుండి వెళ్ళి,రమ్యను ఉపాధ్యాయుల గదికి తీసుకురమ్మని మల్లిక టీచర్ కి చెప్పారు.అలాగే నంటూ మల్లిక రమ్యను తీసుకుని వెళ్ళింది.
మల్లికగారూ,ఏమైందండి?.రమ్య ఎందుకు ఏడుస్తున్నది అని అడిగారు.వెంటనే మల్లిక టీచర్ ,సార్,ఈ అమ్మాయి వాళ్ళింట్లో చాలా కష్టాలున్నాయి సర్.తండ్రి చనిపోయాడు.తల్లి మగ్గం నేస్తూ,వచ్చిన నాలుగు రాళ్ళతో ఈ అమ్మాయిని,వాళ్ళ అన్నయ్యని చదివిస్తున్నది .ఇవాళ ఇంట్లో సరుకులు నిండుకోవడం వల్ల, ఉదయం ఏమీ తినలేదట.వాళ్ళ అమ్మ ఖాళీ కడుపుతో తన బిడ్డను బడికి పంపిస్తున్నానని చాలా ఏడ్చిందట.ఏడుస్తున్న వాళ్ళ అమ్మ మొఖం మదిలో మెదిలి మన రమ్య తన దుఃఖాన్ని ఆపుకోలేకపోతున్నానని చెబుతోంది సర్.
ఓ.అలాగా.మల్లిక టీచర్ ,రమ్య ఎలా చదువుతుంది?అని అడుగుతూనే హెచ్.ఎమ్.భరత్ రమ్యని ఊరడిస్తున్నారు.హెచ్.ఎమ్.అడిగిన ప్రశ్నకి సమాధానంగా మల్లిక టీచర్ తన ప్రియతమ శిష్యురాలు రమ్య గురించి చెబుతున్నది.సర్, రమ్య చాలా మంచి అమ్మాయి. మన బడి మొత్తంలో ఎక్కువ మార్కులు వచ్చేది ఈ అమ్మాయికే .చదువొక్కటే కాదు.ఎంతో సంస్కారవంతురాలు కూడా. మొన్నామధ్యన మనం పిల్లలందరినీ అనాధాశ్రమానికి,వృద్ధాశ్రమానికి తీసుకువెళ్ళాం కదా!అప్పుడు రమ్యయితే సెలవు రోజు కూలికి వెళ్ళి మరీ డబ్బులు సంపాదించి వృద్ధాశ్రమంలో ఉన్న వాళ్ళందరికీ పండ్లు,అనాధాశ్రమంలో పిల్లలకి గాజులు కొనిచ్చింది సర్.వద్దమ్మా.నువ్వే ఇబ్బంది పడుతున్నావు.నీవు మళ్లీ డబ్బు ఖర్చు పెట్టడం ఎందుకన్నా వినలేదు.లేదు టీచర్.మనం ఒక పూట తినకపోయినా ఫరవాలేదు. మరొకరికి సాయం చేయమని చెప్పారు కదా.ఆ మాటలే నా మనసులో మెదలుతున్నాయి అంటూ మరీ వృద్ధులకు,అనాధలకు సాయం అందించింది సర్.అంతేనా మన బడికి ఎంతో మంది ప్రముఖులను మీరు ఆహ్వానిస్తుంటారు కదా.వాళ్ళ సందేశాలన్ని ఒక పుస్తకంలో రాసుకొని,జీవితంలో గొప్పగా ఎదగుతానని సంతోషంగా చెబుతుంది.మీకు తెలుసు కదా.మన రమ్య చదువులోనే కాదు.ఆటపాటల్లోను ప్రథమ స్థానంలోనే నిలుస్తుంది.మొన్నీ మధ్యన లయన్స్ క్లబ్ వాళ్ళ సహకారంతో మీరు నియమించిన శిక్షకుడి సాయంతో నేర్చుకున్న కరాటే పోటీలోనూ,రాష్ట్ర స్థాయి డాన్స్ పోటీల్లోను మన రమ్య విజేతగా నిలిచింది. ఆ బహుమతులు మొన్న మీరు ప్రార్థనలో అందించి,అభినందించారు కదా.
మల్లిక టీచర్ రమ్య గురించి ఆపకుండా తనలోని మంచిని చెబుతున్న తీరును చూసి హెచ్.ఎమ్.భరత్ మనసు ఉప్పొంగిపోయింది.చదువొక్కటే కాకుండా, విద్యార్థుల కుటుంబ పరిస్థితులను తెలుసుకొని వారికి అండగా నిలిచే ఉపాధ్యాయ వర్గము తన పాఠశాలలో ఉన్నందుకు ఎంతో సంతోషం కలిగింది.అటువైపు తిరిగి ఉబికి వస్తున్న కన్నీటిని అదిమిపడుతున్న రమ్యను ఓదారుస్తున్నారు హెచ్.ఎమ్.భరత్.ఈలోగా అటుపక్కనే ఉన్న మురళి సార్ వచ్చి,సార్ రమ్య ఉదయాన్నే ప్రార్థనలో రోజొక చక్కటి నీతి పద్యం,సూక్తి వినిపిస్తుంది.ఏకపాత్రాభినయమయితే బ్రహ్మాండంగా చేస్తుంది.అని చెబుతుండగానే తరగతిగదిలోనుండి వచ్చిన మరొక ఉపాధ్యాయుడు అయ్యో రమ్యా?ఏమైందిరా ఎందుకు ఏడుస్తున్నావు?నువు చాలా క్రమశిక్షణ కలిగిన విద్యార్థివని అందరికీ చెబుతుంటాను.ధైర్యవంతురాలివని చెబుతుంటాను.అలాంటిది నువ్వు ఏడవడమేమిటి?అని అంటుండగానే మల్లిక తన బ్యాగ్ లో నుండి బిస్కెట్లు తీసుకువచ్చి, రమ్యకి అందించింది.రమ్యా!వద్దురా.ఏడవద్దు.మేమందరం నీవెంటే ఉన్నాము కదా.మేమంతా నీ భవిష్యత్తు కోసం ఒక ఆలోచన చేస్తాము.అని అంటుండగానే హెచ్.ఎమ్.భరత్,మల్లికతో ,టీచర్,రమ్యని తన గదిలోకి పంపించి మిగతా విద్యార్థులకు బాగా చూసుకోమని చెప్పిరండి.మనం ఒక సమావేశం ఏర్పాటు చేసుకొందాం అని చెప్పగానే,మల్లిక రమ్యను తీసుకొని వెళ్ళింది.
తరువాత కొద్ది సేపటికే హెచ్.ఎమ్.భరత్ ఉపాధ్యాయులందరితో సమావేశం ఏర్పాటు చేసి,ఏం చేద్దాం అని అడిగారు.ఉపాధ్యాయులందరూ సర్.రమ్యలాంటి ఉత్తమ విద్యార్థి చదువుకు ఎలాంటి ఆటంకము కలుగకుండా ఉండాలంటే మనమంతా కలిసి, కొంత డబ్బు వేసుకుందాము.ఒక్క రమ్యనే కాదు.రమ్యలాగా వివిధ కారణాలతో ఇబ్బంది పడుతున్న విద్యార్థులందరికీ మన పాఠశాల ఒక భరోసా కావాలి.చదువే కాదు బంగారు భవితకు బడి గుడిలాగ నిలుస్తుందన్న నమ్మకాన్ని కల్పించాలి.అందుకోసం మన గ్రామంలో ఉన్న కొందరు పెద్దల సహకారంతో కొంత నిధిని ఏర్పాటు చేసి,ఆ నిధినుండి ఇలాంటి పిల్లలకు సహకారమందిద్దాం అని ముక్తకంఠంతో చెప్పారు.మల్లిక టీచరయితే సార్,మాకు తెలిసిన బంధువునడుగుతాను.తను ఇలాంటి ఉత్తమ విద్యార్థులకు తప్పకుండా పెద్ద మొత్తంలో సహకారమందిస్తారు అని చెబుతుండగానే,హెచ్.ఎమ్.భరత్ మాట్లాడుతూ చాలా మంచి ఆలోచన.మన బడి గుడికన్నా పవిత్రమయినదని నిరూపిద్దాం.పిల్లల ఉజ్వల భవిష్యత్ కోసం మన శక్తినంతా కూడదీసుకొని ఉత్తమ బోధనతో పాటు,ఉన్నత భవిష్యత్ ను అందిద్దాం అని చెబుతూనే కార్యాచరణకు పూనుకొన్నారు.
పద్మ త్రిపురారి(ఆర్)
తెలుగు ఉపాధ్యాయిని.
జి.ప.ఉ.పాఠశాల. నీర్మాల.
మం::దేవరుప్పుల.
జిల్లా::జనగామ.
పక్కింటిఅంకుల్కిజ్వరంగాఉందిటమందులుకావాలి ,ఒకసారిమెడికల్షాప్కివెళ్లిరాఅంటూకొడుకుసూర్యనినిద్రలేపిందివాళ్ళఅమ్మ . అంకుల్కిబాగాలేకపోతేనన్నెదుకులేపుతావుఒక్కనిముషముకూడానన్నునిద్రపోనివ్వవుకదాఅంటూమళ్ళీనిద్రలోజారుకున్నాడుసూర్య. అర్జెంటురాఅందుకేచెప్పాను , అయినాటైంచూడుఎనిమిదిదాటిందిఇంకానిద్రఏంటిరామంచందిగుఅంటూమళ్ళీకుదిపింది.
ఏమండీసూర్యవెళ్లాడా , డాక్టర్అరగంటలోమందువెయ్యాలిఅనిచెప్పాడుఅనిలోపలికివచ్చిందిపక్కింటిఆంటీ . సూర్యవెళ్తాడుమీరుకంగారుపడకండిఅంటూసర్దిచెప్పింది.
సూర్యమళ్ళీనిద్రలోజారుకున్నాడు. కొన్నినెలలక్రితంసూర్యకివిపరీతమయినజ్వరంవచ్చినపుడు , రాత్రిమందులులేవు ,పక్కింటిఆంటీసూర్యదగ్గరేకూర్చుంది .ఐస్వాటర్తోవొళ్ళుతుడుస్తూఅంకుల్నిమందులుతీసుకురమ్మంది. ఆటోలోవెళ్లిరాత్రిఅంకుల్మందులుతీసుకువచ్చిసూర్యకితానేదగ్గరఉందిటెంపరేచర్చూస్తూఆరాత్రిఎంతోధైర్యాన్నిఇచ్చారు.
ఇవాళఆఅంకుల్జ్వరంతోఉంటెనేనుఎంచెయ్యలేకపోతున్నాఅన్నభావననాలోకలిగింది. సిటీలోఉన్నఅన్నయ్యకిఫోన్చేసిందిఅర్జెంటుగామందులుకావాలిఅని. సూర్యఇంకానిద్రలోనేఉన్నాడు. ఆంటీమళ్ళీవచ్చింది. మాఅన్నయ్యతీసుకువస్తున్నాడుమీరుకంగారుపడకండిఅనిచెప్పిఅంకుల్వాళ్ళఇంట్లోకివెళ్ళాను. అంకుల్చాలధైర్యంగాఉన్నారు , ఏమీలేదమ్మామందుపడితేరెండురోజుల్లోతగ్గుతుంది, మీఆంటీఅనవసరంగాకంగారుపడుతోందిఅన్నారు. సూర్యరాత్రిచాలాలేట్గాపడుకున్నాడు , లేవలేదు , మాఅన్నయ్యకిచెప్పాను , మందులువస్తాయిఅంకుల్కొంచంవెయిట్చేయండిఅన్నాను. ఒకఅరగంటలోఅన్నయ్యమందులుతెచ్చిఇచ్చాడు. అంకుల్దగ్గరకూర్చునితానేమందులువేసాడు. నీకుశ్రమఇచ్ఛానయ్యానేనుఅన్నారు , అదేంటిఅంకుల్నేనువూరులోలేనప్పుడుమాచెల్లెలిని , సూర్యనిమీరుతల్లితండ్రుల్లాగాచూసుకుంటున్నారు . ఇందులోశ్రమఏంటి. మీరుకొంచంసేపునిద్రపోండిఅంటూఅన్నయ్యమాఇంట్లోకిదారితీసాడు. సూర్యఅప్పుడేలేచాడు, హాయ్మామయ్యాఏంటిఇంటపొద్దున్నేవచ్చావుఅంటూఅన్నయ్యపక్కనకూర్చున్నాడు.
సూర్యా, ఇదేమీబాగాలేదు ,పక్కనఇంటిఅంకుల్కిఅంతఫీవర్గాఉంటె , నువ్వువెళ్లిసహాయంచెయ్యాలికదా. మీకుఎప్పుడుఏఅవసరంవచ్చినావాళ్ళేకదాచూస్తున్నారు. బాధ్యతనేర్చుకోవాలి. చిన్నపిల్లాడివికావునువ్వు. మీనాన్నకూడాలేడు, అమ్మనిఎంతోబాధ్యతగాచూసుకోవాలి. ఎప్పుడుఎవరికీఏఅవసరంవచ్చినవెంటనేసహాయంచెయ్యాలి. ఒకసారిగుర్తుచేసుకో, హాల్టికెట్మరిచిపోయిఎక్సమ్కివెళ్ళావు. అంకుల్నీవెనకాలఆటోలోవచ్చినీకుస్కూల్లోహాల్టికెట్ఇచ్చారు. లేకపోతేపరీక్షతప్పేవాడివి. అలాగేఒకసారినీకుజ్వరంవచ్చినప్పుడునేనుఊరులోలేను , రాత్రిపరిగెత్తుకునివెళ్లినీకుమందులుతెచ్చిరాత్రిఅంతానీపక్కనేకూర్చునిఅమ్మకిధైర్యంచెప్పారుఅంకుల్వాళ్ళు .
నువ్వుఇలాప్రవర్తిస్తావనినేనుఅనుకోలేదు. సాటిమనిషికిమనంచెయ్యగలిగినసహాయంఎప్పుడూచెయ్యాలిఎందుకంటేఎప్పుడుమనకిఏఅవసరంవస్తుందోతెలీదు . ఒకబాధ్యతఉన్నమనిషిగాఎదగాలినువ్వు. కొంచంసేపయ్యాకవెళ్లిఅంకుల్నిచూడు. అక్కడకూర్చునిమందులుఇవ్వు. ఆంటీకిధైర్యంచెప్పు . తెలిసిందాఅనిమందలించాడుఅన్నయ్య.
సిగ్గుతోతలాదించుకున్నసూర్య , నువ్వుచెప్పిందినిజంమామయ్యా , పక్కింటివాళ్ళుఎంతోమంచివారు. నేనునువ్వుచెప్పినట్టేచేస్తాఅంటూఅంకుల్వాళ్ళఇంట్లోకిదారితీసాడు.
లక్ష్మి ఏవెన్యూలో రెండు బ్లాకులు.. ధనలక్ష్మి.. వరలక్ష్మి.. ఒక్కో బ్లాక్‌లో వంద ఫ్లాట్స్.. రెండు బ్లాక్స్‌కు కలిపి ఓ లేడీ స్క్లబ్.. భర్త నారాయణ రిటైర్కావడంతో వారం రోజుల క్రితం వరలక్ష్మి బ్లాక్ లోకి అద్దెకి వచ్చింది అలివేలు. అంతకు ముందే భర్త కూతురి ఆలోచనతో ప్రోత్సాహంతో ఇంట్లో వుంటూనే బట్టలు అమ్మే బిజినెస్ చేయాలి అనుకుంది.. ఓ సాయంత్రం లేడీస్ క్లబ్బుకు వెళ్లి తన గురించి తాను పరిచయం చేసుకొని ఫలానా అని చెప్పుకుంది. నాలుగు రోజుల తర్వాత విజయ అనే ఆవిడ అలివేలు ఇంటి తలుపు తట్టింది.. అదృష్టం ఎప్పుడో ఒకసారి తలుపు తడుతుంది కరెక్ట్‌గా ఆ టైం లోనే తలుపు తీయాలి అన్న వీరలెవెల్లో తలుపు తీసింది అలివేలు.
‘రండి రండి రండి దయ చేయండి.. తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ’ అన్న పాట లెవెల్లో విజయను ఆహ్వానించింది అలివేలు.. ఇద్దరూ చాలాసేపు మాట్లాడుకున్నారు.
“ఇప్పటికి ఎంత మంది వచ్చారు”?
“ఒకరు వచ్చారు.. మీరు సెకండ్.. మీరు నాకు చాలా చాలా నచ్చారు.. నేను ఎప్పటి నుంచో మీకు పరిచయమైన వ్యక్తి లా మీరు మాట్లాడుతుంటే నాకు భలే హ్యాపీగా ఉంది.. మీకో చీర ఫ్రిగా ఇస్తాను.. దయ చేసి ఎవరితో మాత్రం అస్సలు అనకండి.. నేను ఇలా అందరికీ ఇవ్వలేను కదా” అలివేలు అలా అనేసరికి విజయ తెగ ఆనంద పడిపోయి తాను ఆమెకు నచ్చేలా మాట్లాడి నందుకు తనని తానే గొప్పగా మౌనంగా అభినందించుకుంది.. పైకి మాత్రం చాలా బింకంగా మెయింటెయి న్చేసింది.
“ఏ అవసరం పడినా ధనలక్ష్మి బ్లాక్‌లో ఉండే ప్రతిమ దగ్గరే బట్టలు కొనాల్సి వచ్చేది.. విపరీతంగా ధరలు పెంచుతుంది.. అందరం కాస్త తగ్గించాం..మీరు క్లబ్‌కు వచ్చి చెప్పారు కదా.. చీరెలు మిగతా వెరైటీస్ ఎలా వున్నాయో చూసి పోదామని వచ్చాను” అంది విజయ.
“మెనీమెనీ థాంక్స్అండి.. ఎవరో మంజుల గారు అట.. ఆవిడే మొదట వచ్చారు.. నాలుగు చీరలు కొన్నారు ఈ రోజు ఇద్దరిని తీసుకొస్తామన్నారు కొత్తగా వచ్చాం.. మీరూ పది మందికి చెప్పి సహాయ పడండి.. రేట్స్ కాస్లీ ఉంటాయి ముందు రెండు వాయిదాల్లో చెల్లించేలా అనుకున్నాను.. కొత్త కాబట్టి మూడు వాయిదాల్లో ఇద్ధామనుకున్నాను. కాశీ నుండి పట్టు చీరలు తెప్పిస్తాను డిమాండ్‌ని బట్టి సొంతంగానే యిస్తున్నాం కూడా.. మీరు ఏవైనా కొత్త కొత్త సలహాలు ఇస్తే తప్పక పాటిస్తాను.. మీరు నాకు చాలా మంచిగా అనిపిస్తున్నారు.. మీలాంటి వాళ్ల ప్రోత్సాహమే మాకు అండ..బలం” అలా చాలాసేపు ఆమెను ఆపి ఆపి పోనివ్వకుండా మాట్లాడింది అలివేలు.
అలివేలు మాటల తాకిడికి మూడు వెయ్యి రూపాయల చీరలతోపాటు ఒక ఫ్రి
కూడా పట్టు కెళ్ళింది విజయ. అలివేలు ఆ చీరెధర కూడా టోటల్లో కలిపి వేసిందన్న వూహ విజయకు రాలేదు..అలివేలుకు రావాల్సినంత వచ్చింది.
**** ****
“అక్కడ రేట్లు తక్కువగా ఉన్నాయి అంటున్నారు”
“సరితా మేడం.. మీరు కూడా ఇలా అంటే నేను ఎవరికీ చెప్పుకోవాలి? మీరు ఎన్నిసార్లు ఎన్ని చీరెలు నాదగ్గర కొన్నారు? అయినా మన బ్లాక్వాళ్ళు నాకు అండగా ఉండరా? మనం మనం ఒకటి కదా.. నా గురించి ఎవరో పుకారు లేపారు.. అందుకే ఇలా కాస్తా డౌన్ అయ్యాను.. అయినా ఏం పర్వా లేదు మేడం మీలాంటి వాళ్ళ అండ నాకు చాలా ఉంది” చెప్పిందే ఇంకోసారి మరోసారి గంటసేపు చెప్పింది ప్రతిమ. సరిత ప్రతిమ మాటల ప్రవాహానికి తల్లడిల్లిపోయింది. ఒక్కో చీర పదిహేను వందల రూపాయల చొప్పున మూడు చీరలు.. వెయ్యి రూపాయల చొప్పున రెండు డ్రెస్సులు మొత్తం ఆరు వాయిదాల్లో చెల్లించేట్లు మాట్లాడుకుని వెళ్ళిపోయింది.. ఆ రోజు క్లబ్లో అలివేలు ప్రతిమల టాపిక్‌లు మెయిన్‌గా అయ్యాయి.
**** ****
పదిహేనురోజులు గడిచాయి.. అలివేలు నోట్చేసుకున్న పేపర్లోని వివరాలు ఏవరో ఇచ్చిన కొత్త డైరీ లోకి ఎక్కించాడు నారాయణ.
“ఇదిగో.. అన్ని ఇలా నోట్చేసుకో.. విడి పేపర్ల మీద రాయకు..ఇంకో విషయం. వచ్చిన వాళ్ళతో నీకు మాట్లాడడం అంత బాగా రావటం లేదు.. నువ్వు ఏదన్న తప్పుగా మాట్లాడితే నేను ఒక స్పూనో.. ఒకగరిటో.. ఓ ప్లేటో.. క్రింద పడేస్తాను.. నువ్వు అర్థం చేసుకుని లోపలి కన్నారా.. లేదా జాగ్రత్తపడు”
“అలాగే”
“చాలా మంది వాట్సాప్ లో బట్టలు డ్రెస్సులు ఫోటోలు పెట్టమంటున్నారుకదా.. ముందు మనం ఈ బిజినేస్కు ఒక మంచి పేరు పెట్టాలి”
“ఇంట్లోనే కదా అమ్మటం..పేరు ఎందుకు”?
“ఫ్యూచర్లో ఇలాగే ఉంటామా ఏంటి? ఒక మంచి పేరు అయితే ఉండాలి”
“చిన్ను..జున్నూ..గున్నూలాగా మన మనవడి పేరు బన్నూ ఫాషన్స్ అని పెడదామా”?
“బాగుంది బాగుంది.. బిజినెస్ లోకి రాగానే నీబుర్ర కూడా బాగానే పనిచేస్తుంది”
కాలింగ్బెల్మోగింది..”సరే.. నా బుర్ర ఎంత బాగాప నిచేస్తుందో ముందు ముందు మీకే తెలుస్తుంది గాని.. మీరు వంట ప్రయత్నం మొదలు పెట్టండి” నవ్వుకుంటూ ముందు గదిలోకి వెళ్ళింది అలివేలు.
**** ****
నెల రోజులు గడిచాయి.. వరలక్ష్మి బ్లాకులో అలివేలు బట్టల బిజినెస్ జోరుగా సాగుతుంది.. బట్టల బండిల్ రావటం అయిపోవడం.. రావటం అయిపోవడం.. “నిత్య ఖరీదులు.. పచ్చ నోట్లలా” ఉంది వ్యాపారం.. ఆనందంతో కూతురికి ఫోన్‌చేసింది అలివేలు.
“అమ్మా..ఎలా ఉన్నారు”?
“బాగున్నాం”
“అల్లుడు ఊరెళ్తా అన్నారు..వెళ్లారా”?
“వెళ్లారు.. నాన్న ఏం చేస్తున్నారు”?
“నాన్న..కూర చేస్తున్నారు..వచ్చిపోయే వాళ్ళు ఎక్కువయ్యారు”
“అన్నిజాగ్రత్తగారాసుకుంటున్నావా”?
“డైరీలోనోట్చేశారు నాన్న..నేను కూడా అలవాటు చేసుకుంటున్నాను.. అయినా ఇంకా కొత్తక దానాకు.. ఈ వ్యాపారం పుణ్యమా అని నాన్నకు బోర్‌కొట్టకుండా ఉంది.. నాకు కూడా చాలా సహాయ సహకారాలు అందిస్తున్నారు.. ముఖ్యంగా నాన్నకు వంట పని కూడా అలవాటు అయింది.. నేను వంటజోలికే వెళ్లటం లేదు.. సరే ఉంటానమ్మా.. మళ్లీ మాట్లాడుతానులే.. ఎవరో వచ్చారు” కాల్కట్చేసింది అలివేలు.
**** ****
రెండు రోజులు గడిచాయి.. అలివేలు లేచి తలుపు తీసేసరికి నాలుగు పెద్దపెద్ద కార్టన్స్ కనిపించాయి. భర్తను కేకేసి వాటిని లోపలికి జరిపించింది. సంవత్సర కాలం గడిచింది.. అలివేలు వ్యాపారం ముప్పయి పువ్వులు అరవై కాయల్లా అయింది. ఫ్లాట్స్‌లో వాళ్లంతా వాళ్లు కొనుక్కోవడమే కాకుండా బంధు వర్గాలు స్నేహితులతో కూడా కొన్నికొన్ని కొనిపించసాగారు.. అలివేలు మాటకారి తనం అంతగా వాళ్ళను ప్రభావితం చేసింది. మొబైల్మ్రోగింది.
“అమ్మా..చెప్పు” అంది అలివేలు.
“అమ్మా..నీకు మెనీమెనీ థాంక్స్ అమ్మా”
“నాకా? ఎందుకే”
“అమ్మా..నేను పడిపోకుండా నన్ను నిలబెట్టినందుకు”
“నీమొహం.. చాల్లే.. అయినా ఇందులో నేను చేసింది ఏముందే.. అన్ని ఆలోచనలు మీనాన్న గారి వినీవి. .దేనికైనా పోటీ ఉంటేనే కదా లాభం. నాన్న రిటైరయ్యారు.. పెన్షన్ ఫర్వాలేదు.. ఇద్దరం హాయిగా బ్రతకవచ్చు.. నీ పరిస్థితి తెల్సుకుని నీకు పోటీగా నన్ను నిలబెట్టారు.. వచ్చాం..వ్యాపారం వృద్ధిచెందటానికి అల్లుడుగారు సరుకుతెస్తున్నారు. ఎన్నెన్ని వూర్లు తిరుగు తున్నారు? ఎంతెంత సరుకు ఇద్దరికీ తెస్తున్నారు.. అంతా వాళ్లిద్దరి సహకారమే కదా.. డల్ గా ఉన్న నీ వ్యాపారం మళ్లీ పుంజుకుంది. . తల్లి తండ్రిగా మాకు ఇంతకంటే ఇంకేం ఆనందం కావాలి”?
“అమ్మా”
“వ్యాపార మెళకువలు.. మాట్లాడే విధానం నువ్వు నాన్న నాకు నేర్పించారు.. నీతోపాటు మాకు లాభాలు వస్తున్నాయి.. ఖాళీగా వుండకుండా చేదోడు వాదోడు అన్నట్లు ఎంత హాయిగా రోజులు వెళ్ల దీస్తున్నాం.. సరదాగా ఒక మాట చెప్పనా? నేను నాన్నలా ఉద్యోగం చేస్తున్నట్లు నాన్న నాలా వంట చేస్తున్నట్లుగా వుంది. మళ్ళీ నాన్నతో అనకు ఫీల్ అవుతారు.. నేను అందరికీ తెలిసిపోయాను.. అంతా పెళ్లిళ్లకు కూడా మన దగ్గర కొంటున్నారు. ఇంకేంకావాలి? కానీ ఓ విషయం”
“నేను చెప్తాను నువ్వు ఉండు.. మనం తల్లి బిడ్డలమని బయట చెప్పేద్దాం”
“అదే చెప్పబోతున్నాను.. అప్పుడే వద్దే పిచ్చిమొహమా.. ఇలాగే కొంతకాలం గడవనీ.. ఇప్పటి వరకు ఈ విషయం ఎవరికీ తెలియదు.. ఇదో బిజినె స్టాక్టిక్స్.. పోటీ ఉంటే లాభం ఎక్కువ.. ఈ మాట ఇదివరకే అనుకున్నాం.. అయినా ఏ ప్లాట్స్‌లో ఉండేవాళ్ళు అయినా ఎక్కువగా తలుపులు మూసుకునే ఉంటారు.. ఎవరి బిజీ వాళ్ళది.. మన విషయంలో ఎందుకు ఇంట్రెస్ట్చూ పిస్తారు? ఏదో కనుక్కోవాలనే తీరిక ఎవరికి ఉంది”?
“ఎప్పుడన్నా బయటపడితే”
“అయ్యో.. మీకు తెలియదా.. చాలామందికి తెలుసు.. అని నవ్వుకుంటూఅంటాం.. అదే మన సమాధానం”
“అమ్మా”
“అంతగా ఆశ్చర్యపోకు.. ఇది వ్యాపారం.. మనవడు బన్నుఎలా వున్నాడే? నన్ను అడుగు తున్నాడా”? అలలు అలలుగా నవ్వింది అలివేలు.
“పేరు పెట్టావుగా.. బన్నూ ఫాషన్స్ అని..రేపటిరోజున వాడి పేరు పెట్టుకున్నందుకు నీ బిజినెస్‌లో నిన్ను ఎంత పర్సంటేజ్ అడుగుతాడో.. వాడు నీకంటే తెలివికలవాడు.. ఉంటానమ్మా” ఆనందంగా అంది అలివేలు కూతురు ప్రతిమ.
“మంచిదమ్మా.. ఆల్దబెస్ట్.. గుడ్‌లక్” అంది ప్రతిమ తల్లి అలివేలు.
**** సమాప్తం ****
నాలుగు అన్నం పొట్లాలను వారి చేతికిచ్చి ”ఇగ నడవుండ్రి” అన్నడు. అవి దీస్కున్న జోగమ్మ, పుల్లయ్య, సామి, సాయమ్మలు
వారికి చేతులెత్తి నిండ సలామ్‌లు పెట్టిర్రు అలా పెట్టి వారు వడివడిగా ముందాుకు కదిలారు.
అటువైపునుంచి ఓ కాళీ ట్రాలీ ఆటో రయ్యిమంటు దాూసుకొచ్చింది. ఆ పెద్దాసారు దాన్ని ఆపి ”ఎటువైపు
ఎల్తున్నవ్రా” అని అడిగాడు. ”సారు మా ఇంటికెళ్తున్న” అని ఆటో అతననగానే ”అచ్చ మూటముళ్లెత్తుకుని పోతున్న
గాళ్లను, వారు వెళ్లే చివరి బస్టాప్‌లో దింపు.” అని తన మానవతను చాటుకున్నాడు. డ్యూటీలో లాటిపట్టి కఠినంగా
వ్యవహరించే అతను తనలోను సాటిమనుషులపట్ల దాయాజాలికరుణ ఉందాన్నడనికినిదార్శనంగా నిలిచాడు అతను.
”అలాగే సార్” అంటు ట్రాలీ ఆటో ముందాుకు పోనిచ్చి వారి ముందాపిండు, ఆటో దిక్కు కంగారుపడుతూ
చూసింది సాయమ్మ ”ఇగో సూడండి ఆ పెద్దా సారు చెప్పిండు బస్టాపుల దింపుత జల్ది ఎక్కుర్రి” అని ఆటో అతననగానే
”అమ్మయ్య కశ పాణం తావున పడ్డది సారు దాయళ్లోడేరో ఎక్కుర్రా” అని శిడంల ఎక్కి కూకుండ్రు అందారు. ఆటో
రయ్యిమంటు ముందాుకు దాూస్కపోతుంది.
”ఏంది పుల్లయ్య బావ మనబతుకు ఇట్టైపోయే బతికిచెడ్డోని భాగ్యం చూడల్నట చెడిబతికినోని చెంపలు చూడలట,
చెంపలు ఉబ్బిందిలేదాు, బాగుపడ్డది లేదాు” అని సాయమ్మ అనగానే ”ఏం చేస్తం పిల్ల లోకం మీదా పాపం పెర్గింది ఇది
దాుర్గాలం అందాుకే కాలం ఇట్టైంది. ఇది ఎన్కటి కాలమా మనిషిని మనిషి పీక్కతినే కాలం, మనకు ఇగ గతిలేని పానాన్కి
గంజినీల్లె పాన్కం అదే ఆసరైతది గనిపా” అని నిరాష వదానంతో అన్నడు పుల్లయ్య.
ఆటో రైయిమంటు ముందాుకు సాగింది వారు చెప్పిన చోట ఆగింది. వారు దిగి వీస్తూపోయి అటిటు దిక్కులు
చూడసాగారు. ఎటు చూసినా పిల్లపీసులేదాు పట్నం కరోన మహమ్మారి చింతల చిన్నబోయింది. పోలీసుల గస్తీ కొన
సాగుతుంది. ఆక్కడక్కడ కాళ్లకు బుద్దిచెప్పి వారికి మల్లె ఊరిబాట పట్టినవారు పెట్టెబేడతో నడుస్తూ ముందాుకు సాగుతుండ్రు
”వారిని చూస్తూ మనము నడుద్దాం పదాండి” అంటు కదిలిండు పుల్లయ్య. అతని వెనకాల వారు కదిలారు.
”అన్నం పొట్టం బద్రాంగ సంచిల బెట్ననా” అని అడిగిండు పుల్లయ్య భార్యవైపు చూస్తూ.
”ఆ… పెట్టిన గని అన్యాల్కం పాడుగాను మన బత్కు చచ్చిచెడి కుడ్తిల పడ్డ ఎల్కయిపాయె” అని దీనంగ పలికింది
జోగమ్మ.
”దేవుడు మనిషి పాపాలకు కోపాలు దెచ్చుకొని కండ్లెర్రజెత్తే మన బత్కులు కానికాలం కాటున బడ్తున్నయ్ు
ఎన్కట్కి గత్తరొస్తె ఊర్లకు ఊర్లె ఇడ్సిరని పెద్దాలు చెప్తుంటె ఇనలేదా. ఇప్పుడు పేరుకు తిధాులు అయ్యె, నచ్చత్రాలు,
రాశులు, ఋతువులు గయ్యెగని మన్సి బుద్ది మారింది. అవినీతి, బందాుప్రీతి, దోస్కతినుడు, లొప్కతాగుడు గిదేగిప్పుడు
మనిషినైజం. నమ్మితిర సిద్దా అంటె ముంచితిరా బిడ్డ అంటుండు అంటుండు దాుర్భుద్దితో” అంటు వారగా చూస్తూ
నడుస్తునే ఆయిసులేని మొముతో పల్కిండు పుల్లయ్య
”అయితే మంచి గింతన్న లేదాంటవా” అన్నడు స్వామి.
”లేకం ఉండబట్టె గాయినకు బుద్దిబుట్టి బువ్వ పొట్లమిచ్చె, కాని ఎన్కట వీరబ్రహ్మం చెప్పినట్లు జర్గుతుంది”
అన్నడు పుల్లయ్య.
”అవునవును ఏడుదొడ్లకు ఒకదొడ్డి మిగులుద్దాని అన్నడట, తాత అంటుంటె ఇన్న” అని పలికిండు స్వామి.
”అయ్యల మన చిన్నతనాన ఊరినిండ పసులు, ఇంటికో దొడ్డి మరి గియ్యాల ఊల్య పసురం సూద్దామన్న వాటి
జాడ లేదాు ఒకవేళ అయిదెచ్చిన ఆట్కి మేత కర్వు గడ్డిగాసం కర్వు యంత్రాలదెచ్చి ఎవుసాలుజేస్తుండు అందాుకే ఊల్య
కూలి కర్వు. బస్తిల స్తే తలపైకెత్తిసూసె బంగ్లాలు, నడ్మంత్రపు సిరితో సుఖానికి మరిగి తూగుటుయ్యాల గట్కొని
ఊగుతుండు” అని పల్కుతూనే సరసర ముందాుకు సాగుతుండు పుల్లయ్య.
అబ్బబ్బా అట సర్రసర్ర నడుస్తరు! నడ్సినడ్సి కాళ్లు పీక్కపోతున్నాయ్ు. ఇంత దాూరం నడ్సినం పిల్లల కాళ్లు సుత
గుంజపట్టె ఇంక నడ్వ మన వశమైతాదా” నీరసంగ పలికింది సాయమ్మ.
”ముంతెడు నీళ్లకే ముడ్డివొర్గల బెడ్తెఎట్ల, జపజపనడుర్రి”. అన్నడు పుల్లయ్య.
”ఇగనావల్లగాదాు కాసేపు కూలపడి దాూపతీర్చుకొని పోదాం” అన్నది జోగమ్మ. సరె అంటూ అందారూ కాసెపు సేదా
తీరీ దాూపతీర్చుకున్నారు.
”ఏమయ్య ఏదాన్న కాళీగొచ్చె లారిని ఆపయ్య” అన్నది పెనిమిటిని దిగులుపడుతు సాయమ్మ.
”నేను అదే సూస్తున్న” అంటునే ఎదాురుగా వచ్చే లారికి చెయ్ు అడ్డం పెట్టి ఆపిండు. వీరి అవతారం చూసిన లారి
డ్రైవర్ పిసరంత జాలితో వారిముందాు లారీ ఆపిండు. ఆకలి దాూపతో అగుడుపట్టినట్టు గబగబ లారీ ఎక్కిండ్రు.
”ఎక్కడి వరకు పోవాలి” అని అడిగాడు వారివైపు చూస్తూ లారీ డ్రైవర్.
”అన్నన్న నువ్వు ఏడిదాంక పొయినా సాలు ఆడ దింపు అదే మాకు పదివేలు, మీ మేలు మరువం” అని అతనివైపు
చూస్తూ ఊపిరి పీల్చుకుండు పుల్లయ్య. డ్రైవర్ లారీ స్పీడ్ పెంచాడు. లారీ రయ్యిన ముందాుకు దాూసుకుపోతుంది వారు
అందాులో కూలపడ్డరు మనసున రుక్మతితో కుదార్థంగా మనాదిల పడ్డరు. లారీ అద్దాంకి బైపాస్ వద్దా వారిని దింపి
మిర్యాలగూడ వైపు సాగిపోయింది.
లారీ దిగిన వారు కాసింత సేదా దీరుదాం అంటు చెట్టు నీడన కూలపడ్డరు. సంచిలో ఉన్న పొట్లం బైటికి తీసింది
జోగమ్మ ఆకలిగొన్న పోరడు కండ్లు పెద్దావి చేసి తల్లివైపు తహతహలాడుతూ చూస్తున్నాడు. పోరనిక గింత తిన్పంచి
తనుగింత తిన్నది. అంతా ఆకలి దాూప తీర్చుకొని కూలపడ్డరు. వారు నడ్సినదాన్కి ఇంకా కాళ్లు గుంజుతున్నయ్ు. వాడిన
మొఖంతో ”కాళ్లు గుంజినా కడ్పునొచ్చినా మనకీ తిప్పలు తప్పయి అంటు చెట్టు దాప్కు ఒరిగిండ్రు అతని బట్టలు
సోరుపుతో మురికిపట్నయ్ు, సెమట ఒంటికి అట్టుకట్టింది. వారు ఒకరిని ఒకరు చూసుకుంటు పరేషాన్లో పడ్డరు,
”ఏంది జోగా సింత చేస్తున్నవా” అని బార్యవైపు వారగా చూస్తూ అడిగాడు.
”ఏంలేదాు బావ” అని అంటూనే ”నాకు మనం ఊరికి పోవడం సుతారం ఇష్టం లేదాు” అని నేల చూపులు చూస్తూ
పలికింది, వారివైపు కొడుకు శివ అమాయకంగా చూడసాగాడు.
”ఎందాుకిష్టం లేదాు” అని అతననగానే ”నీకు తెల్వదా మా నాయిన పచ్చి తాగుబోతోడు ఇంటిగురించి చింతలేనోడు.
మాయమ్మ, నేను కూలినాలి చేసి ఇల్లెల్లదీస్తుంటే అయ్య మా ర్కెలకాశపడి ఉంటడు. ఆడదాని రెక్కలకాశపడ్డ మొగడుంటేంది
లేకుంటేంది. మా అమ్మేం సుఖపడ్డది మేమేం బాగుపడ్డం. నేను పెళ్లీడుకు వచ్చినని కట్నాలు ఇచ్చి పెళ్ళి చేయలేక పెళ్లాం
సచ్చినోన్కి మారుమనుం ఇచ్చి చేతులు దాుల్పాలనుకుండు అయ్య. అది తల్సుకుంటే నా ఒళ్ళు కంపరంపుడ్తది. అది
ఇష్టం లేకే నీదాంట చేర్తి ఇంట్ల చెప్పాపెట్టకుంట కాలు గడపదాటి నీతోని పట్నంలో పడ్తి. ఇగ నా బతుకు నువ్ సూడన్ద
ఏ వయసు ముచ్చట ఆ వయసులో తీరాలి నేను మనిషినే నాకు మనస్సుంది అంగట్ల బెట్టి బేరం జెయ్య నేను పసురాన్ని
కాదాు కదా” ఎగదాన్నుకొచ్చే దాుక్కాణ్ణి అదాునుకొని ఒణుకుతున్న స్వరంతో ముక్కుని చీదాుకుంట పలికింది.
”జోగ నువ్వన్నది నిజమే కాని నిన్ను ఏంసుఖపెడ్తి యాడికిపోయినా మన బతుకు గింతేగని నివ్వేంపికరుచేయకు”
అని ఓదార్పు మాట పలికిండు.
”అబ్బ కాళ్ళు గుంజుతున్నయ్ు అమ్మో” అని శివగాడు తల్లి ఒడిలో వాలిండు.
”లేత అరికాళ్ళకు బొగ్గలొచ్చినయ్ు ఒర్సుకో నాయన మా అయ్యగని కాసేపయితే ఇంట్లపడ్తం” అని కొడుకును
చూస్తూ పలికిండు అప్పుడమెకు కొడుకును చూస్తాలికి పాణం దేవినట్టయింది. ఒడిలో అలాగే కొడుకు కాళ్ళు నిమురుతూ
నిద్రాపూచ్చింది. తనకాళ్లు చూస్కుంది కాయాగాశ్న కాళ్ళు నడ్సినడ్సి పచ్చి పుండ్ల్షెనట్టున్నయ్ు ఒళ్లంతా అలిసి పులిసిపోయింది.
ఆమెకు కాసింత ధైర్యం చెప్తు ”అట్ట ఆయాసపడితే ఎట్ల ఓర్సుకో ఓర్సుకున్నోనికి ఓరుగల్లంత పట్నం దాక్కుతుందాట”
అని అన్నడు. ”నన్ను ఓపిక ఓపిక పట్టు అంటున్నవ్ నీకుమటుకు లేదా ఒళ్లు నొప్పి, మనకా ఊరిలో తినే తిండి కరువు,
కట్టే బట్ట కరువు పుట్టి బుద్దెరిగిన సంది ఈతంగ తిన్నది లేదాు సుఖంగ పన్నెది లేదాు. కష్టాలకాడి ఎత్తుకుని రెక్కలు
అలువంగ చేస్తిమి” అంటు లోలోన మదానపడసాగింది.
”మనకీ ఈ ఊరికి రావాలని కుషాలా గతిలేని సంసారానికి మతిలేని మొగుడన్నట్టు అయిపాయ్ు నా బత్కు”
అన్నడు పుల్లయ్య.
”అదేమో మాయదారి కరోనా భీమారి తుఫాను లెక్క దాూసుకొచ్చే. ఉరుముల్లేవ్ మెరుపులేక బతుకులపై పిడుగులు
కురిపిస్తుండే, దానిదెబ్బకి గుండెళ్ల ఒకటే దాడదాడ మొదాలైంది. కుదాురులేని దాడదాడతో జనం దాంచికొడ్తున్న తుఫానుకు
చెట్టుకొకరు పుట్టకొకరైర్రూ. అదేమో అలిపిరిడువక జనం అంతు సూస్తుండే” అన్నడు స్వామి.
”అవునవును అన్ని బందాు పెట్టి జనం ఇంటికే అంటిలయ్యిర్రు. యాడ సూసినా ఏ నోట విన్న గొంతు పెగలక
భయంతో ఒణుకుతుర్రు పీనిగె ముట్టని రోజులకొచ్చింది. సచ్చినోడు ఆకరి చూపులకు నోచుకోకుంటయిపాయె. అదేమో
గుండెలమీదా కుంపటి రాజేసి పేదా, ధానిక తేడ లేక అందార్ని కాల్చుకతింటుంది. దీని ముదానష్టం గాను ఎందార్ని
మింగుదో, ఎందారి ఉసురు తీస్తదో, కూలీ జనం బతుకుల్ల మిన్ను విరిగి మీదా పడట్టాయే” అన్నది సాయమ్మ.
”ఎల్లకాలం ఉంటాది దీనికి పాడే గట్టి ఉప్పుపాత్రేశే రోజొస్తది”
”అగో ఆ రోజెప్పుడోస్తదో గాని డక్టర్లు, నర్సులు, పాణాలు లెక్క, జెయ్యక ఇళ్ళు పిల్లలిడ్సి రోగులకు సేవ
జేస్తుండ్రి కంటికి కనిపించని కాని రోగం బారిన పడి సస్తుర్రి ఏం లాభం అది నిజమేగని ప్రైవటు దావఖానలల్ల గీ
రోగానికి లక్షలకు లక్షల ఫీజులు గుంజుతుండ్రట, అగో చచ్చిన శవాలను ఒక చిథిపేర్సి కాష్టం పెడ్తుండ్రు ఆ చావు
పగోనికి రావద్దాు తల్లి. ఆ నలుగురు ఎవనికి ఎవ్వరు ఏమికారు, ఒక వూరు అసలే కాదాు. ఒక చితిమీదా తగులపడ్తుండ్రి
గిదేంగోసనే తల్లి” అని జోగమ్మ అనగానే
”నిజంగానానే” అని మిడిగుడ్లతో చూస్తూ సాయమ్మ అన్నది.
”అవునే అమ్మ రాత్రి టి.వి.ల చూస్నా కొన్ని తావులల్ల డోజర్తోటి మాయబొందాలు దోడి సచ్చిన పీనుగలను
కుప్పకుప్పకే అళ్ళేసి పూడ్సుండ్రు ఏం కాలంవచ్చే భగవంత” అని నిట్టురుస్తూ అనగానే ”అయ్యో పాపం మందాులేని
రోగాలను చూసినం గని గిసోంటి రోగాన్ని మనుండంగ ఎన్నడు చూడలే తల్లి, తల్చుకుంటే పాణం గడగడవనుకుపుడ్తుంది.
అది జాదిలకొస్తేనే ముద్దా మింగుడుపడ్తలేదాు. టి.వి. లచూస్తే వాంతికి అయితట్లయిందే అని దీనంగా పలికింది జోగమ్మ.
”గాజోలి ఎందాుకు దాలుస్తవు, మాయరోగం కట్టడికి నిద్రాహారాలు మాని పాపం పోలీసులు సుత రాత్రిపగలు
డ్యూటీ చేస్తుండ్రి. అదేందో గని విచిత్రంగ ఆళ్ళకు సోకుతుంది దీనమ్మ దెష్ట ముండ ఎన్ని రోజులిట్ల గోస దీపిస్తదో,
ఫోన్లల్ల పలకరింపులు, ఫోన్లల్లనే ఏడ్పులు, తూడ్పులు అరిగోసె దీపిస్తుంది దీనిగత్తర తగల” అని జోగమ్మ అన్నది.
”అమ్మా గాళ్లు సుత మూతికి ముస్కులేకుండ తిరిగేటోళ్ళను కసరెళ్ళదీస్తుండ్రు అని స్వామి అనగానే అది మనకోసమేగా
అనే పుల్లయ్య.”మరి గంతగనమా ఎవ్వరిదైన ప్రాణమేచచ్చెదాంక కొడ్తరే యముని లెక్క”
”అదే గత్తరై కుసుంటే దానికేడ తాక్తది గత్తర. ప్రపంచం సాంతిమి సాపలెక్క సుట్టుకొనొస్తుంది. ఏమో పోవయ్య
మన బతుకు శివడు చీదాకుంటాయో, మశడు వొల్లకుంటయ్ుపాయె” అన్నది సాయమ్మ.
”ఎందాుకు తియ్ు గంజో గట్కో తాగి పాణాలు నిలుపుకుందాం వాన రాకడ పాణం పోకడ తెల్సినోడెవడు, పొయ్యే
జీవిని ఆపేటోడెవడు, ఎట్టయ్యే దాుంటే అట్టయ్ుతది సరే గాని చిన్నగ బట్టదాుల్పుకొని బాటపడదాం” అని పలికిండు
పుల్లయ్య.
”ఔనానే ఇంతకు మనల ఊళ్యకు రానిస్తరా పరీక్ష చేశ్నంకనే రానిస్తరట” అని పలికిండు స్వామి.
”ఇన్ని అనుమానాలెందాుకురా నీకు, అనుమానం పాత రోగం. మనకు ఇళ్ళే దావఖాన అయిన ఊళ్యకు పోయ్యేటోనికే
ఒస్తున్నాది ఊళ్య ఉన్నోళ్లకి రోగం సోక్తలేదా పొయ్యేటోడు ఏడంగనైనా పోతడుగాని ఏమే జోగి శివగాన్ని నాకియ్యి నే
నేెత్తుకుంట, సంచి నీవు సేతపట్టు” అని లేసిండు పుల్లయ్య. పిలగాన్ని పెనిమిటిచ్చి ఆమె సంచి చేతబట్టి అతనెనకాల
బాట పట్టింది. వారు వాళ్ళ ఊరివైపు సాగుతుండ్రు. బతుకుపై ఆశతో రేపటి తరాన్ని బతికించాలన్న తపనతో……
