కవితలు
13 కరుణ రస పూర్ణ మైన నీ కావ్యములకు
16 భావ కవితా ప్రవాహాన బడిన కవులు
20 అరయ రుక్మిణీ కల్యాణ మందు నాటి
31 నలువ దారేండ్లు తన వెంట నడచి నడచి
నీ చూపులనే
గొడుగగా పట్టి
నా వెంటే నీవున్నపుడు
ఆ గొడుగు నీడలో
నా నడకలు సాగుతున్నపుడు
ఏ భయమూ లేదు
నీవుంటే
నా వెంటే ధైర్యం
నీ తోడుగా…
నాకు తెలియని
లోకాలెన్నో చూసాను
నా రెక్కల గుర్రం నీవే
నా ఎదుగుదలకు
ఉప్పొంగి పోయి
లోకమంతా చాటింపు వేసావు
గర్వంతో..
నా ఉన్నతి
ఉచిత ప్రచారకర్తవు నీవే
మంచి చెడుల మధ్య ఉన్న
చిన్నని గీత ఆనవాలేమిటో
లోకుల తత్వమేమిటో
విశ్లేషించుకొనే
శక్తినిచ్చావు
నీవో మనస్తత్వ నిపుణుడివి గదా..
ఉన్నపుడు పొంగిపోకుండా
లేనినాడు కుంగిపోకుండా
బతకడం నేర్పించావు
బతుకుదారిలో…
నా తోడొచ్చే బాటసారివి నీవే కదా
కఠినంగా… అనిపించినా
నవనీతమువంటి
సున్నితత్వము నీవు
బతుకుబండిని లాగడానికి
ఎన్నెన్ని కష్టాలు పడ్డావో
ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నావో…
చిన్నప్పుడు నీతో ఉన్న ఙ్ఞాపకాలు
అంతగా గుర్తులేదుగానీ
ఊహ తెలిసిన నాటి ఙ్ఞాపకాలు
మదిపుటలలో
పదిలంగానే ఉన్నాయి
నేస్తంగా..
ఎన్నో ముచ్చట్లు చెప్పేవాడివో
గురువుగా ఎంత ఙ్ఞానము
పంచావో
ఏమీ తెలియని అనామకునిలా
అమాయకుడిలా
లోకానికి తెలిసిన నీవు
అన్నీ తెలిసిన
ఓ మహాఙ్ఞానివి
మహాయోగివి
నిరాడంబర నిష్కామ యోగివి
నేనెరిగిన సత్యమిదే
నీవు..
యిప్పుడు నా చెంత లేవు
నా కష్టసుఖాలను చూసే..
వినే
ఆప్తులూ.. లేరు
చింత తీర్చే నేస్తాలూ..లేరు
నా ఆనందాలను ఆస్వాదించేవారూ
నా దుఃఖాలకు
ఓదార్పునిచ్చేవారు కరువు
‘నాన్నా’… మరలి రావూ…
నాకు ధైర్యంగా నిలువు
నా బాధ్యతలు..బంధాలలో
తోడై నడువు
నాన్ననైన నేను
నా బిడ్డల తోడుగా
నడిచే
ధైర్యం యివ్వు
నా బాల్యం గల్లంతైంది
డా|| సరోజన బండ
‘బొమ్మరిల్లు’లో బొమ్మలాటలు
బొమ్మలాటలో కమ్మని వంటలు
పప్పు బెల్లం నువ్వులు చక్కెర
ఏకుడు పేలాలు వేరుశనక్కాయలు
మక్కజొన్న పేలాలు, పాలకంకుల
‘పిసికిల్లు’
పుట్నాలు, అటుకులు, చిట్టిలువలు
కుడుకలు, బత్తిసపేర్లు, చక్కెర గోళీలు
అప్పుడప్పుడు అమ్మ చేసిపెట్టే
చెగోడీలు, సకినాలు, గరిజెలు
అరిసెలు, గారెలు, సత్తుపిండి, సర్వపిండి
పులిహోర, దద్దోజనం, చక్కెర పొంగలి
‘బెల్లం పాశం’
ఒక్కోసారి మా మల్లయ్య పిసికి యిచ్చిన
‘గసిపిండి ముద్దలు’
బుడ్డగిన్నెల్లో భద్రంగా తీసుకుపోయి
వెన్నలాంటి మనసుతో నా చిన్ని చెలికాండ్రకు
పేదరికం లేని నా పెద్దబుద్ధితో
పెళ్ళిభోజనమంటూ ‘మోదుగాకు’లల్లో
ప్రసాదంగా పంచి పరమానందం చెందేదాన్ని
పనికిరాని పాతరాతెండి తలె మాకు
‘పెళ్ళిడప్పు’
చొప్పకర్రలే ‘డప్పుకోలలు’
పీకెలే సన్నాయిలు బాజా భజంత్రీలు
చొప్పకోలలు, పుల్లలు, బెండ్లతో చేసిన ‘బండ్లు’
పల్లకీలో పిల్ల, పిల్లగాని ఊరేగింపు
మేరెసాంబయ్య పారేసిన తుక్కులోని
రంగురంగుల బట్ట పీలికలతో కుట్టిన
చిట్టి బొమ్మల సింగారంతో ‘పెళ్ళితంతు’
ఇవన్నీ మాకు ఆచరణయోగ్యాలు
అనుకరణ సాధ్యాలు ఆటపాటల సంరంభాల
ఆనందానుభూతులు
అగ్గిపెట్టెల టెలిఫోన్లు, తాటికమ్మల గాలిమోటార్లు
కుమ్మరి నర్సయ్య తాత గురుగులు
కమ్మరి రామయ్య తాత కడాయి, జల్లిగంటె
వడ్ల వెంకటయ్య మామ తెడ్లు
బుడ్డ సర్వలు బొడ్డు చెంబులు
గద్దె గిన్నెలు తపేలా పావులు
ఎరుకల ఎల్లమ్మ మొంటె- బిచ్చపు సాలమ్మ ‘సదిరె’
పూసల మల్లయ్య పూసపేర్లు, తరగని అందాల తాటాకు బుట్టలు
అన్నీ అపురూపమైన ఆటవస్తువులు నాకు
చెబ్బీసాబ్ గాజుల మలారంలో
పర్రెవట్టిన ఎర్రగాజులు
పచ్చగాజులు పూలగాజులు
సుతిలితో అల్లిన తుమ్మకాయల గజ్జెలు
సన్నటి సిబ్బి తీగలకు సుతారంగా గుచ్చిన
తుమ్మిపువ్వు ముక్కుపోగులు
నత్తులు, చెవికమ్మలు
మాకు అపూర్వ ఆభరణాలు
మా చేనులో ఏరుకొచ్చిన జిట్టరేగు పండ్లు
మా పెరట్లో కాసిన జామపండ్లు, దానిమ్మపండ్లు
సీతాఫలాలు వనచింతకాయలు, మామిడికాయలు
కాకెంగిలి అంటూ అంగీలోవెట్టి కొరికి
అన్నిటిని అందరం పంచుకొని తినేవాళ్లం
అన్నీకూడా ‘ఇందుల్లో’ మాకు విందుభోజనాలే
అమోఘ ఫలరుచులే!
గిల్లికయ్యాలు పెట్టుకున్నా ‘సోపతి గాల్లందరం’
తెల్లారి మళ్లీ కలిసేవాల్లం
లద్దునూరి తోవలు మావి మద్దూరిబాటలు మావి
కొడవటూరి గుట్ట, కొమిరెల్లి మల్లన్న జాతర
బెక్కల్లు రామలింగేశ్వరస్వామి ఆలయదర్శనం
ముచ్చటగా మూడురోజుల జాతర
ఆషాఢమాసం వనభోజనాలు
అన్నీ మాకు ఆనందస్మృతులే!
చేన్లు చెలకలు మావి – చెట్లు గట్లు మావి
ఎర్రమన్ను పుట్టలు మావి ఒర్రెలు వాగులు మావి
ఇసుకతెప్పలు మావి పిట్టగూళ్లు మావి
చింతచెట్లు మావి మామిడి తోపులు మావి
ఎనుగులు మావి గునుగులు మావి
‘తూరుపు తోట’ మాది తురకోని బావిమాది
జమ్మికుంట మాది
ఎల్లంబావి మాది ఎల్లమ్మ చెరువు మాది
హనుమాండ్ల గుడి మాది చెన్నకేశవ ఆలయం మాది
పాత కచ్చేరిమాది పాడువడ్డ బురుజుమాది
దొరవారి ఇంటి దొడ్డి కన్నాలు మావి
బంజరు దొడ్డిమాది బడి ‘శిథిలాల ఆవరణ’ మాది
నొగలు విరిగిన బండ్లు మావి పొణకలు, బోరాలు మావి
‘ఖాజా’ మామయ్య కాలిపోయిన ఇల్లు మాది
కూలిపోయిన గోడలు మావి
ఇల్లిల్లు మాది ఇంట్లోని ముంతగూళ్లు మావి
ఊరంతా మాది ఊల్లోని వాళ్ళంతా నావాళ్ళే
వరుసలతో పిలిచేవాల్లు మురిపెంగా చూసుకునే వాల్లు
కులాల కుటిలత్వంలేని స్నేహ బంధాలు మావి
ఉన్నోల్లు లేనోల్లు అనే తేడాలేని ఉనికి మాది
ప్రేమాప్యాయతలతో పెనవేసుకున్న
ప్రేమబంధం మాది
మమతానురాగాల మరుల విరులు పూయించిన
మనసు పూదోట మాది
తరాలు మారిన నా ఊరు తనరూపం మార్చుకుంది
అరువదేండ్ల కాలంలో అంతా తారుమారయింది
మహోన్నతమైన మానవ సంబంధాలు
మటుమాయమయ్యాయి
అధునాతన పోకడల్లో ఆధునికీకరణంలో
నా బాల్యం గల్లంతైంది
అలముకొంటున్న సంధ్యారాగంలో
అరుణ కిరణాల నా బాల్యాన్ని
జ్ఞాపకాల తెరల మరుగుల్లో
మళ్లీ వెతుక్కుంటున్నాను
జీవితమంతా గడిపేశా, కానీ నాకు తీరికే దొరక లేదు
ఆత్మీయులు ఆహ్వానిస్తే, నాకు తీరికే దొరకలేదు
ఆప్తుల బాధల్ని పంచుకుందామంటే నాకు తీరికే దొరకలేదు
మనసు పొరల భావాల్ని లిఖిద్దా మంటే, నాకు తీరికే దొరకలేదు
శరీరం విశ్రాంతిని కోరినా, నాకు తీరికే దొరకలేదు
కని పెంచిన వారిని పలకరిద్దామంటే, నాకు తీరకే దొరకలేదు
వడలిన వయసు జారుతున్నప్పుడు, సమయంతీసుకుని వైద్యుడ్ని కలవమని స్నేహితులు సలహా ఇచ్చినా నాకు ఆ తీరికే దొరకలేదు
నా మదిలోని తీరని కొండంత పనుల భారాన్ని దించే లోపే , కొత్త సమస్యలు ఎదురైతే ఏం చేయను నాకు తీరికే దొరకలేదు
జీవితం కాలం వృధా చేసాను ఎలా పరిష్కరించను నాకు తీరికే దొరకలేదు
మరి ఈ సమయ మేమయిందని చూద్దామంటే, నాకు ఆ తీరికే దొరకలేదు.
సమయం కోసం వెతకటం తోనే నా సమయమంతా కడతేరింది, మృత్యువు దరిచేరనుంది అయినా నాకు తీరికే దొరకలేదు
ఎవరో ఉర్దూ కవి గారి వీడియో ఆధారంగా నేను తెలుగులో అనువదించాను. విన్న వెంటనే నన్ను కదిలించిందా ముషాయిరా. రాయకుండా ఉండలేక పోయాను. చివరి నాలుగు పంక్తులు మాత్రం కొత్తగా చేర్చాను. ఆ కవి మహానుభావుడికి నమఃసుమాంజలులు.
వృద్ధాప్యపు గూటిలో ‘అమ్మ’
ఒంటరిపక్షి
దానిది కరకు గుండె కాబోలు
అమ్మ రూపం మార్చేసింది
రంగువెలిసి కళాత్మకత కోల్పోయిన పాతబడిన చిత్తరువులా
అమ్మరూపం వెలవెల బోతోంది
గుండ్రని మోములో
కాసంత బొట్టుతో
కళకళలాడిన ‘అమ్మమోము’
గ్రీష్మంలో ఎండిన మానులా
వాడిపోయింది
తోడుండే ‘నాన్న’
సుదూర తీరాలకు తరలిపోతూ
నుదుటి బొట్టును
ఆమె గుర్తుగా
తాను పట్టుకు పోయాడు
ఆమె ముఖం
వాడిన మల్లెలా
తనువు
ఆకురాల్చి
ఎండిన మానులా
మారిపోయింది
తరువు
పచ్చగా ఉన్నపుడు..
పూలు పండ్లతో
ఎన్నింటికో ఆశ్రయం
ఎందరికో నీడనిచ్చినట్లు
అమ్మ మాకూ …
ఎందరికో
బతుకుదెరువు నేర్పింది
బతుకుదారి చూపింది
ఆమె
కరుణ చిందించే
చూపులతో ప్రేమతో పెంచింది
తన రెక్కలబలంతో
మా భవిష్యత్తుకు రెక్కలు తొడిగింది
ఇప్పుడు….
అమ్మ వృద్దాప్యపు గూటిలో ఒంటరి
అమ్మ మోముపై వాలిన వార్థక్యపు ఛాయలు ముడతల చారికలు
చూపులు మసకబారి
వెలుగు తగ్గింది
కాళ్ళు చేతులు పట్టుదప్పి
ఆసరాకోసం చూస్తున్నాయి
పండుటాకులు రాలినట్లు
నోటపండ్లు ఊడిపడి
అమ్మరూపమే మారింది
అయినా..
చిన్నప్పడు..చూసిన
అమ్మరూపం
హృదయంలో
అందంగా పదిలంగానే ఉంది
అమ్మ మాట .. పిలుపులో మాత్రం
వృద్ధాప్యం దరిజేరలేదు
అమ్మమాట
ఆ పిలుపు కమ్మగా
మధురంగా
‘నాయినా’ అని
ఎప్పుడూ పిలిచినట్టగానే
వణుకులేక వార్థక్యం జాడ ఇసుమంతలేక
వాత్సల్యంగా పిలుస్తోంది
అమ్మప్రేమ వసి వాడలేదు
సతతహరితమై సజీవంగానే ఉంది
అలల హొయలున్నాయి అలజడి ఉంది
తీరం వెంట పడి లేచే ఉరుకులు పరుగుల్లో ఉత్సాహం ఉంది
ఒడ్డుకు కొట్టుకొని ముందుకు వెళ్లలేని అసహాయత ఉంది
కొండ అడ్డంగా వస్తే చుట్టూ తిరిగి
కదలి వెళ్లే నేర్పరితనం ఉంది
అడ్డంకులు అధిగమించే సాహసం ఉంది
కెరటాల గమకాల్లో శ్రావ్య సంగీతం ఉంది
చెప్పలేని ఏదో బాధల హోరు ఉంది
వెలుగును వెన్నెలను తాగి ఊగుతుంది
వేదనలు దాచుకోలేక
అప్పుడప్పుడు మూలుగుతుంది
భీష్మ గ్రీష్మం చురుకైనప్పుడు వీచికాంతరంగాన్ని మూసుకొని శోషిల్లుతుం ది
వర్ష హర్షం చినుకైనప్పుడు తరంగాల గంతులు వేస్తుంది
హేమంత శిశిరాలు సమీపిస్తే
కాలోర్మికలతో జోకొడుతూ సహిస్తుంది
అన్ని ఋతువుల్లోనూ అదే నడక
ప్రవాహం లయాత్మకం
ప్రయాణం ఆపదు
గమనం ఆగదు
ప్రవాహమే జీవితం
జీవితమే కాల ప్రవాహం
వెలుగు వెంట చీకటి ,చీకటి వెంట వెలుగు
వినోద విషాదాల సమ్మే లనమే జీవనం.
రాత్రి మనసును నిలదీసింది
మొన్నటి కల ఎక్కడని?
ఖాళీ ముఖంతో
నిజం తలదించుకుంది.
ఇష్టం ఒట్టిచేతులతో
అక్షరానికి ఇంకేదో బలం కావాలని
నిజానికి ఇంకెంతో మర్యాద కావాలని
తప్పుపడుతూ పట్టుపట్టింది.
కన్నార్పని కల వాలిన ముఖంతో
రాత్రిని తలుపు కొట్టి
లోపలికి వెళ్ళిన ప్రతిసారీ
చప్పుడు లేని మర్యాదతో గదిది నిరాశే.
కునుకుపై అలిగిన కళ్ళు
రాల్చిన కన్నీటిలో
తొంగిచూసే పొరపాట్లకు
లొంగిన నిజాయితీతో
ఆకలి దప్పిక మానేసిన ఆలోచన
ఒంటరితనంతో ఉరిపోసుకుంది.
అక్షరం మౌనంగా రోధిస్తుంది.
కవిత దిక్కులు పిక్కటిల్లెలా మ్రోగుతుంది.
ప్రాంగణం ప్రవేశించేసరికి
విద్యార్థులు చిన్న చిన్న
కోడి పిల్లల లాగా ఇంగ్లీషులో
కిచ కిచ అంటారు
తెల్లబాతుల్లాంటి ఉపాధ్యాయులు
పాఠశాల సరసులో
చిరునవ్వు లేత గాలితో
పిల్లలని స్పృశిస్తారు
పిల్లలను చూస్తే వచ్చి
పోయే వాహనాలు ట్రాఫిక్
సిగ్నల్ లో ఎర్రలైట్లు అవుతాయి
పిల్లల్ని బడిలో దిగబెడుతున్న
తల్లి కోడి లాంటి మమ్మీలు డాడీలు
ముక్కుతో కోడి పిల్లలస్పర్శిస్తారు
ఎక్కడనుంచో ఒక మ్యాక్ ఫై
ఎగురుతూ వచ్చి నన్నో బలిని చేస్తుంది
బుజ్జి గాంధీలు సీట్ డౌన్ సీట్ డౌన్
అంటూ ప్రబోధిస్తారు
జీవన సమరంలో నిరంతరం జ్వలించే
ఇండియా బుద్ధి
ఈ పూల తోటలో
ఆకుల పైన మంచు
బిందువు అవుతుంది
అక్షర సేద్యాలు ఆకుపచ్చగా
మొలకెత్తే పని మెదడు బీడు
భూమిలో మొదలైపోతుంది
మైకులో వినబడుతున్న
సంగీతం లాంటి అనౌన్స్మెంట్
గువ్వ గువ్వల చిరు గొంతుల పైన
నిశ్శబ్దం ముసుగు కప్పేస్తుంది
జీవితం ఎన్ని లలిత క్షణాలను
ఆవాహన చేసుకుంటుందో
ఆస్ట్రేలియా బడిలో మనవరాలితో
అడుగుపెట్టిన క్షణాలలో
అర్థం చేసు కొంటూ
శుభ్ర స్నానం చేసిన
నగ్న మూర్తిగా బయటికి వస్తాను
రాత్రయింది అంటే
ఓ రోజు బతుకు ఖాతాలో
జమైనట్లే…
రెండు జతల
గాజుకళ్ళు, ఓటికాళ్ళు
వయసును భుజానవేసుకుని
మంచం కొండనెక్కుతూ
రేపు ఉదయం ఇద్దరిదో?
ఇద్దరిలో ఏ ఒక్కరిదో?
అన్న నడుము వంగిన ప్రశ్న
దిగులు భయంతో
బిక్కు బిక్కుమంటూ
అవకాశం దొరికనప్పుడల్లా
దేహాన్ని తట్టే బాధకు
చులకనయ్యే ఓపికతో
పండిన అనుభవంలో
ఒకరి ఆకలికి
మరోకరి ఇష్టమే ఆహారంగా
బతుకులో
ఒంటరితనం లేకుండా
ఏకాంతానందం సొంతమైనా
వృద్దాప్యంలో ఏదో ఒక రోజు
ఒకరి మరణం
మరొకరికి నరకమనే
సత్యానికి రెపరెపలాడే జీవులు
ఆఖరిరోజుకూ
ప్రేమతో ప్రాణంపోసే ధన్యులు.
( తొంభై ఏళ్లకు దగ్గరౌతున్న ప్రేమ అనే ఔషధంతో ఉత్తమదంపతులైన
నా వృద్ధ తల్లిదండ్రుల జీవితాన్ని చూస్తూ, వారి పాదాలకు కవితను అంకితం చేస్తూ…..)
ఆ బ్రహ్మ పోసినా ప్రాణమా
విధి వెక్కిరింపుకు సాక్ష్యమా
లేక….
సమాజంలోని కుటిలత్వానికి
శాపంగా మిగిలిన దేహమా
నీ తలరాతను మార్చేస్తున్న ఆ గీతలు
చావుపుట్టుకులే చెప్పలేని రాతలు
బతుకు భారాలను తెలిపే ఒట్టి శరీరపు ముడతలు
శాస్త్రనికి సైన్స్‌కి మధ్య ఊగిసలాడే విధిలిఖితాలు
తప్పొప్పులు తేల్చలేని ధర్మసందేహాలు
నిగూఢంగా నిలిచిపోయిన వాస్తవ రేఖలు
మనిషి విజ్ఞానానికి అంతుపట్టని రహస్యాలు
సృష్టికి ప్రతిసృష్టి చేయాలనే ఆలోచనలు
పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న మేధావులు
సహజ గుణాన్ని కోల్పోతున్నా దేహాలు
ప్రాణం పోయటానికి పనికిరాని విజ్ఞతలు
ప్రాణాలను తీసేందుకు మాత్రం ఎన్నో తంత్రాలు
మనిషికి మనిషే శత్రువై మార్చేస్తున్నారు
నోసటి మీద గీతలు… మీ తలరాతలు…!!